సినిమాల్లోని సంఘటనలు ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్రించుకోవాలంటే
రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించాల్సిందే...మూడు అనేది ఒక మ్యాజికల్ నంబర్.
ఏదైనా విషయం మూడుగా వుండడం మానసికావసరం. సినిమాల్లో,
టీవీ షోలలో సంఘటనలు మూడుగా జరిగి పూర్తవుతాయి. మెదడు మూడుగా
జరిగే పాటర్న్ ని గుర్తుంచుకుంటుంది. సంఘటనల్లో ఈ పాటర్న్ ని
వెతుక్కుంటుంది. పాటర్న్ కనిపించలేదో ఆ సంఘటన
లేదా సీను సినిమాటిక్ గా విఫలమైనట్టే...
సినిమా స్క్రిప్టుల్లో సీన్లు రాసేటప్పుడు, డైలాగులు రాసేటప్పుడు ఎంత ప్రామాణికంగా రాస్తున్నామన్న ప్రశ్న వస్తుంది. సీనంటే ఏమిటనే అర్ధం తెలుసుకోవడం దగ్గర్నుంచీ సీనుని ఎలా నడపాలన్న క్రమం వరకూ కొన్ని టూల్స్ లేదా సూత్రాలున్నాయి. ఒక సీను ప్రొడక్షన్ కాస్టు కొన్ని లక్షల రూపాయల వరకూ వుండొచ్చు. మరి ఇంత పెట్టుబడికి తగ్గ విషయం నిర్మాణాత్మకంగా సీన్లలో వుంటోందా అన్నది ఎవరికివారు ప్రశ్నించుకోవాల్సిన అంశం. అసలు స్క్రీన్ ప్లే అనేదే ఒక త్రి విధ అవస్థలతో కూడిన త్రయం. అంటే బిగినింగ్ మిడిల్ ఎండ్ లు కలిసి త్రయంగా ఏర్పడే అవస్థ. ఇవే అవస్థలు ఒక్కో సీనులోనూ వుంటాయి. ప్రతీ సీనూ దాని లోపల బిగింగ్ మిడిల్ ఎండ్ అనే త్రివిధ అవస్థల్ని అనుభవిస్తూ వుంటుంది. దీనికి ఉదాహరణగా ఇక్కడ క్లిక్ చేసి, 1982 నాటి ‘జస్టిస్ చౌదరి’ సీను పోస్ట్ మార్టం చూడండి. అంటే స్క్రీన్ ప్లేకి లాగే సీన్లు కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనే వుంటాయన్న మాట. ఇంకా చెప్పాలంటే ఒక కథకి ఐడియా పుట్టడంలోనూ ఈ త్రివిధ అవస్థలుంటాయి. అంటే మూడు వాక్యాల ఐడియా నిర్మాణంలోనూ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుంటుందన్న మాట. ఐడియా స్ట్రక్చర్ ప్రకారం లేకపోతే ఇక స్క్రీన్ ప్లే, అందులోని సీన్లు, సీన్లలోని డైలాగులూ దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఇదంతా స్ట్రక్చర్ లో త్రివిధ అవస్థల అవశ్యకత గురించి. మరి కంటెంట్ కూడా కొన్ని కీలక దశల్లో త్రివిధ అవస్థల్ని అనుభవిస్తూ వుంటుందని తెలుసా? దీన్ని రూల్ ఆఫ్ త్రీస్ అన్నారు. ఇదేమిటో ఈ క్రింద తెలుసుకుందాం...
Lock, Stock and Two Smoking Barrels
Stop, Look and Listen
గొప్పవాళ్లు కూడా తమ ప్రసంగాల్లో ఈ రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించడం వల్లే అవి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి అంత ప్రఖ్యాత ప్రసంగాలయ్యాయి- "I came, I saw, I conquered” (Julius Caesar), “Government of the people, by the people, for the people" (Abraham Lincoln), Life, liberty, and the pursuit of happiness” (Thomas Jefferson)...మొదటి దానిలో I ని మూడు సార్లు వల్లె వేశాడు. అలా I తో మూడు అవస్థల్ని పేర్కొన్నాడు (came, saw, conquered). ఇలా కాకుండా డైరెక్టుగా I conquered అని ఒకే అవస్థ అనేస్తే, రసోత్పత్తి వుండేది కాదు, ప్రసంగం ఆకట్టుకునేది కాదు. సర్లే వయ్యా, నీకు మాటాడ్డమే రాదు, రాయడం రాని తెలుగు నలుగు సినిమా డైలాగులా వుందనేసి వెళ్ళి పోయేవాళ్ళు జనాలు.
అలాగే రెండో దానిలో people ని మూడు సార్లు వల్లె వేశాడు. people తో మూడు అవస్థల్ని నొక్కి చెప్పాడు. మూడో ప్రసంగంలో Life, liberty, and the pursuit of happiness మూడూ పరస్పర సంబంధమున్న అవస్థలతో కూడిన త్రయం. త్రివిధ అవస్థలతో కూడిన పద త్రయం.
ఈ పద త్రయాన్ని సినిమాల్లో చూస్తే- “నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికి వచ్చా”, “మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డపై కనుంటే, మీ అబ్బ మొలతాడు కట్టి వుంటే, నీ మూతి మీద వున్నది మొలిచిన మీసమే అయితే నన్ను చంపరా రా!”, “నాకు ఎమోషన్స్ వుండవ్, ఫీలింగ్స్ వుండవ్, కాలిక్యులేషన్స్ వుండవ్, మానిప్యులేషన్స్ వుండవ్'
“కొందరు కొడితే ఎక్స్ రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది!”, “ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా!”
ఇలా రూల్ ఆఫ్ త్రీస్ అనేది డైలాగుల్లో ఒక లయని, ఎఫెక్ట్ కోసం పునరుధ్ఘాటనని (వల్లె వేయడాన్ని) సృష్టిస్తుంది. పై డైలాగుల్లో దీన్ని గమనించ వచ్చు. ఎఫెక్ట్ కోసం పరస్పర సంబంధమున్న మూడు పాయింట్లతో మూడు అవస్థల్ని యాక్షన్ ఓరియెంటెడ్ గా క్రియేట్ చేసినప్పుడు, చప్పట్లు పడే పంచ్ లైనుగా ఆ డైలాగు హైలైటవచ్చు.
"నీతో మాటాడాలంటే భయపడ్డాను, నెర్వస్ అయ్యాను, బట్ నిన్ను చూసి చాలా ఎక్సైట్ అయ్యాను” (రెండు నెగెటివ్ ఎమోషన్స్ దాటుకుని, బట్ చాలా ఎక్సైట్ అయ్యాను అన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్ కొచ్చాడన్నమాట ఆమె మెచ్చుకునేలా. మూడోది కూడా నెగెటివే అనొచ్చు- “బట్ నిన్ను చూశాక చచ్చూరుకున్నాను” అని- ఇది కామెడీ కథ అయినప్పుడు).
“ప్లీజ్ ఆగుతావా? రిక్వెస్ట్ చేస్తున్నా! నే చెప్పేది వింటావా?” అని ఆమె అడ్డుపడినప్పుడు మూడో మాట తీవ్రత పెంచుతూ అనాల్సి వుంటుంది.
ఆమె అతడికి తలంటు పోస్తూ ఇలా అన్నప్పుడు- “ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత నీకు తగ్గదాన్ని చూసి ప్రేమించుకో, ఆ తర్వాత హేపీగా ఆమెతో గడపడం నేర్చుకో, గుడ్ బై!” ఇందులో చివరి మాటల్లో సలహా పాజిటివ్ స్వరంలో అనాల్సి వుంటుంది.
ప్రేమ సంభాషణలు త్రివిధా వస్థలతో ఒక సీక్వెన్సు లో సూటిగా, పాయింటుకొస్తూ, సంక్షిప్తంగా వున్నప్పుడే రూల్ ఆఫ్ త్రీస్ రాణిస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. తోచిందల్లా రాయడం, రాసి ఆనందించడం కాదు. సీక్వెన్సులో వున్న ఒక్కో అవస్థని స్ట్రాంగ్ యాక్షన్ తో, వర్ణనతో చెప్పినప్పుడు ఆ సీక్వెన్స్ బాగా హైలైటయ్యే అవకాశముంటుంది. ప్రేమ సంభాషణాల్లో రూల్ ఆఫ్ త్రీస్ ని ఆచి తూచి వాడాలి- ఎక్కడ పడితే అక్కడ వాడితే రిపీటీషన్ అన్పించుకుంటుంది.
ముందుగా హేరీ, సాలీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యూయార్క్ కి కారులో వెళ్తూ కలుస్తారు. ఈ మొదటి కలయిక స్క్రీన్ టైమ్ 14 వ నిమిషంలో వస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరి విభిన్న వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, నమ్మకాలూ ప్రేక్షకులకి పరిచయం చేస్తుంది రచయిత్రి.
తర్వాత రెండేళ్ళకి అనుకోకుండా ఫ్లయిట్ లో కలుస్తారు. ఈ సీనులో హేరీతో ఫ్రెండ్ షిప్ సాలీ కిష్టం లేదని ఎస్టాబ్లిష్ చేస్తుంది రచయిత్రి. ఫైనల్ గా మూడోసారి బుక్ స్టోర్ లో కలుస్తారు. ఇక్కడ్నుంచే కథ టేకాఫ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు.
ఇలాటి దృశ్యాలకి సంబంధించి రూల్ ఆఫ్ త్రీస్ ఒకటే ప్రతిపాదిస్తుంది- మొదటి సారి ఓ సంఘటనే కావొచ్చు, రెండోసారి కాకతాళీయమే కావచ్చు, కానీ మూడోసారి కూడా ఇలాగే అనుకుని కొట్టి వేయలేం, మీనింగ్ వుంటుంది- అది ఆడ మగ అయినా, ఇద్దరు ఆడవాళ్ళయినా, ఇద్దరు మగవాళ్ళయినా, మున్ముందు తెలిసే ఏదో అర్ధం కోసమే కలిసి ట్రావెల్ చేయాలని యూనివర్స్ తీసుకున్న డెసిషన్ అయివుంటుందది. మనకిలాటివి జరుగుతూంటాయి.
పై మూడు సందర్భాలతో కూడిన ఈ త్రివిధ అవస్థల రేంజి మేనేజి మెంటు ఒకదాన్ని మించొకటి ఎలా పెరిగిందో గమనించొచ్చు. మూడోది షాకింగ్ సంఘటన! అంటే రూల్ ఆఫ్ త్రీస్ కూడా మొత్తం స్క్రీన్ ప్లే లో వుండే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల లక్షణాలతోనే త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ కి లోబడి వుంటుందన్న మాట.
సినిమాల్లో పాత్రచిత్రణ పరంగా చూస్తే- ప్రధాన పాత్ర మూడు దశల డెవలప్ మెంటుకి నోచుకోవాల్సిందే. లేదా దాని జీవితంలో మూడు విశిష్ట మార్పులు సంభవించాల్సిందే. అప్పుడే పరిపూర్ణ పాత్రగా నిలబడుతుంది. జోసెఫ్ క్యాంప్ బెల్ మిథికల్ (పౌరాణిక) స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగంలో ప్రధాన పాత్ర మూడు మార్పులకి లోనవుతుంది : గోల్ ని తిరస్కరించడం, అప్పుడు గాడ్ ఫాదర్ పాత్ర వచ్చి మోటివేట్ చేయడం, ప్రధాన పాత్ర గోల్ ని స్వీకరించడం.
ఇలా రూల్ ఆఫ్ త్రీస్ తో దృశ్యాల్లో మంచి డ్రామానీ, డైలాగుల్లో డెప్తునీ సృష్టించ వచ్చు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి -రాయడం మొదలెడితే ప్రతీ ఛోటా, ప్రతి అణువులోనూ త్రీ యాక్ట్ స్ట్రక్చరే వుంటుందని, అదే స్క్రీన్ ప్లే అనే విశ్వాన్ని నడిపిస్తుందనీ. ఈ ఆర్టికల్ నచ్చితే, సినిమాల్లో ‘మెటా కామెంటరీ’ అనే మరో స్క్రీన్ ప్లే అప్డేట్ ని గురించి తెలుసుకుందాం.