(వెనుక సీనులో
జరిగింది : పల్లెటూళ్ళో పేడ పురుగులు పడుతున్న జూన్ హా దగ్గరకి హీరోయిన్ వచ్చి, తనని
నది అవతలున్న భూత్ బంగ్లాకి తీసికెళ్ళ మనీ, రేపు పన్నెండింటికి వస్తాననీ చెప్పి వెళ్ళిపోతుంది)
సీన్ : పడవలో
కూర్చుని ఎదురు చూస్తూంటాడు జూన్ హా. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. దూరంగానే ఆగిపోతుంది.
చెయ్యూపుతాడు. తనూ చెయ్యూపుతూ వచ్చి పడవెక్కి కూర్చుంటుంది. భూత్ బంగ్లా గురించి
తాతగారు చాలా చెప్తారనీ, కానీ అక్కడికి వెళ్ళనీయరనీ అంటుంది. అతను తెడ్డు
వేస్తూంటాడు. తను బయట తిరిగే విషయంలో తాతగారు స్ట్రిక్టుగా వుంటారని అంటుంది. వూళ్ళో
ఎవరితోనైనా వెళ్దామంటే వాళ్ళు తాతగారికి
చెప్పేస్తారనీ అంటుంది. ఎందుకో అనుమానం వచ్చి చూస్తుంది. చూస్తే, అతను తెడ్డు
వేస్తున్నా పడవ వున్నచోటే వుంటుంది. అతను ఇబ్బందిగా చూసి, నిజం చెప్పాలంటే తనకి
పడవ నడపడం రాదంటాడు. ఎలాగో తిప్పలు పడి నడుపుతూంటే, తన పేరు జూహీ అని చెప్తుంది. తన
పేరు జూన్ హా అంటాడు. తామిద్దరూ సువాంగ్ నుంచే వచ్చారని తెలుసుకుని, ఇది గమ్మత్తుగా
వుందంటుంది. గమ్మత్తు కాదూ, ఫేట్ అంటాడు. అర్ధంగాక, ‘అంటే?’ అని ఆమె అంటే, ఏమీ
లేదంటాడు.
పాయింట్ :
మన దగ్గర సున్నిత ప్రేమ కథలని అంటారు. దానికి సంగీత దర్శకుడు ధడాధడా వాయిస్తాడు. ఆ సున్నితత్వమేంటో అనుభవించే వీలే వుండదు. దృష్టిని చెదరగొట్టే సాధనం సౌండ్. అన్నిరకాల సౌండ్స్, డైలాగుల మోత సహా. కానీ ఈ కొరియన్ సీనులో ఇలా లేదు. జూన్ హా పడవలో కూర్చుని ఎదురు చూస్తూంటే, నిశ్శబ్దంగా వుంటుంది వాతావరణం. నదీ, దాని పరిసరాలూ, ప్రకృతీ అన్నీ ప్రశాంతంగా వుంటాయి. మన దృష్టి ఈ పరిసరాల్ని పరికిస్తూ ఒక అనుభవంలోకి తీసికెళ్ళి పోతుంది. ఇలాకాక, ఇలాంటప్పుడు ఎప్పుడైతే సౌండ్ వేస్తారో, అప్పుడు దృశ్య విశేషాల్ని అనుభవించనీయకుండా మన దృష్టి నటుల మీదికెళ్ళి పోతుంది. సౌండ్ లేనప్పుడే ఏకాగ్రతతో పూర్తిగా దృశ్యంలోకి లీనమవగల్గుతాం. కథలోకి ఎవరైనా తీసికెళ్ళ గలరు, ‘కథా లోకం’ లోకి తీసికెళ్ళ గల్గినప్పుడే దర్శకుడు నిజమైన దర్శకుడవుతాడు. కథంటే నటుల మీద వుండేది కాబట్టి వాళ్ళ వరకూ డైలాగులతో, రియాక్షన్స్ తో చూపించి వదిలేస్తే అది సినిమాలా కాకుండా స్టేజి నాటకంలా వుంటుంది. సినిమా అన్నాక, ఆ నటీనటులున్న కథాలోకపు ఆవిష్కరణ కూడా జరగాలి. కథాలోకం లేక సినిమా కథే లేదు. కథా లోకమంటే కథకి సోల్ ని ఏర్పాటు చేసేది.
మన
దగ్గర టీనేజి ప్రేమ కథల్లో కూడా ముప్ఫై ఏళ్ల హీరో, పాతికేళ్ళ హీరోయిన్ నటిస్తారు.
వీళ్ళతో టీనేజి బిహేవియర్ చూపిస్తే ఎబ్బెట్టుగా వుంటుంది. కాబట్టి దాటవేసి ఎటూ
కాని బిహేవియర్లు చూపిస్తారు. ఈ కొరియన్ మూవీలో టీనేజీకి సరిపడా వయస్సు లోనే హీరో
హీరోయిన్లు కన్పిస్తారు. కనుక తొలి పరిచయపు బిహేవియర్లని సహజంగా చూపడం వీలైంది.
వెనుక
హీరోహీరోయిన్లు తొలిసారి ఎదురుపడే సీన్లో హీరో చెయ్యూపితే, హీరోయిన్ కూడా
చెయ్యూపుతుంది. అక్కడ అమాయకపు ముసిముసి నవ్వులే తప్ప మాటలుండవు. ఇప్పుడు కూడా ఇంతే. అతను పడవలో కూర్చుని వుంటే, ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి
ఆగిపోతూ, ఇప్పుడూ ముసిముసి నవ్వులతోనే చెయ్యూపుతుంది.
అతనూ అలాగే చెయ్యూపుతాడు. వీళ్ళు నిష్కలంక
మనస్కులని యిట్టే అర్ధమై పోతుంది, సున్నిత మనస్కులు సరే.
ఇలాటి
దృశ్యాలు బహుశా యువ ప్రేక్షకులు ఇప్పుడు
చూస్తున్నది చూస్తున్నట్టుగా ఈ క్షణమే అనుభవిస్తారు. కానీ వయసు మళ్ళిన ప్రేక్షకులు
రెండు సార్లూ అనుభవిస్తారు - ఒకటి తమ టీనేజిలో అనుభవించివుంటారు, ఇప్పుడు తిరిగి
తెర మీద దర్శిస్తారు. సినిమాల్లో యూత్ అప్పీల్ అంటే, వయసు మళ్ళిన వాళ్ళల్లో కూడా టీనేజీని
నిద్రలేపడమేనేమో.
తెలుగు థాట్ కొస్తే, ‘హాయ్!’ అంటూ హీరోయిన్ చిల్లరగా పరుగెత్తుకొస్తుంది,
‘వావ్!’ అని హీరో ఓవరాక్షన్ కామెడీ చేస్తాడు – రాస్తున్న జానర్ రోమాంటిక్ డ్రామా అయినా సరే. ఇప్పటి యువ డైలాగ్
రైటర్ కి ఇంతకంటే దృశ్యం రాయడం రాదు. జానర్ తేడాలు తెలిస్తేగా తెడాగల రాతలు
రాయడానికి.
ఈ సీన్లో కొన్ని విశేషాలున్నాయి. ఆమె
తన తాతగారు చాలా స్ట్రిక్టు అంటుంది. అంటే ఇప్పుడాయన కన్నుగప్పి వచ్చిందన్నమాట. తాతగారి
గురించి ఆమె చేత దర్శకుడు కొంచెం ఎక్కువే మాట్లాడించాడంటే, ఇప్పుడెక్కడో తాత గారు
ఎంట్రీ ఇస్తాడన్న మాట. ఇలా ఈ మామూలు సీన్లో,
కథని ముందుకు నడిపించే ఒక ఫోర్
షాడోయింగ్ ని క్రియేట్ చేశాడు సస్పెన్సు తో.
రెండోది,
వీళ్ళిద్దరూ గత సీన్లలో రెండు సార్లు కలుసుకున్నా పరస్పరం పేర్లు వెల్లడించుకోలేదు.
హీరో ఫ్రెండ్స్ కూడా ఆమె ఫలానా తాతగారి మనవరాలని చెప్పారే గానీ ఆమె పేరు
చెప్పలేదు. పేర్లు ఎక్కడ వెల్లడించుకుంటే సన్నివేశం రక్తి కడుతుందో, రోమాంటిక్ గా
వుంటుందో, అక్కడే వెల్లడించాడు దర్శకుడు. ఇది
గమనించాలి. స్ట్రక్చర్, క్రియేటివిటీ ఇవే సరిపోవు. అంతకి మించిన క్రాఫ్ట్ కూడా అవసరం.
క్రాఫ్ట్ అంటే ఇలా సమయస్ఫూర్తితో చెక్కడ మన్నమాట. హీరో పేరు జూన్ హా అని మనకి ముందే
తెల్సు. కానీ ఈ సీను దాకా హీరోయిన్ పేరే మనకి తెలీదు. ఇంతవరకూ హీరోయిన్ అనే
రాసుకుంటూ వచ్చాం.
గమనించాల్సిన
మరొక విషయమిటంటే, వెనుక రెండు సీన్లలో కూడా హీరోతో వున్న ఫ్రెండ్స్ ఇద్దరి పేర్లూ చెప్పలేదు దర్శకుడు. ఒరే శీనూ, ఆఁ ఏంట్రా
రాజూగా... అని అత్యుత్సాహంతో రాసుకుపోవచ్చు - అదేదో ఎంటర్
టైన్మెంట్ అనుకుని డైలాగ్ రైటర్ మురిసిపోయి. ప్రయోజనం? ఆ రెండు సీన్లు తప్పితే
మళ్ళీ ఎక్కడా కన్పించని ఫ్రెండ్స్ పేర్లు తెలుసుకుంటే ఏమిటి ప్రేక్షకుల కొచ్చే
లాభం, అనవసర సమాచారంతో మెదడు బరువెక్కించుకోవడం తప్ప? థియేటర్లో సౌండ్
పొల్యూషన్ తప్ప? నిగ్రహంతో ఇలాటివి కట్ చేసుకుంటే, ఇట్ విల్ బి కాల్డ్ సెల్ఫ్
ఎడిటింగ్.
ఇప్పుడు
పడవలో వాళ్ళ మధ్య సెటిల్డ్ వాతావరణ మేర్పడ్డాక సంభాషణ ఇంకొంచెం ముందుకు పోతుంది
సహజంగానే. తాత గారి గురించి ఆమె పర్సనల్ విషయాలు చెప్పుకుంటోంది. ఇక్కడే, ఆఁ మర్చిపోయానంటూ
తన పేరు కూడా చెప్పుకుంది. అతనూ చెప్పుకున్నాడు. ఇద్దరూ ఒకే సవాంగ్ పట్టణం నుంచి
వచ్చారని తెలిసి, ఇది గమ్మత్తుగా వుందని ఆమె అంటే, ఇది ఫేట్ అని అతనన్నాడు. ఈ చివరి మాటలతో పాత్రలు ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆమె
పైపైన ఆలోచిస్తుందనీ, అతను లోతుగా ఆలోచిస్తాడనీ.
ఈ
సీన్లో, నది రూపంలో వాటర్ థీమ్ నేపధ్యం కొనసాగి, హీరోయిన్ పేరు, హీరోహీరోయిన్ల
వ్యక్తిత్వాలూ కొత్తగా మనకి తెలిశాయి. సీన్
స్ట్రక్చర్ అంటే, పాత్రల గురించి కొత్త విషయాలు చెప్పేది, లేదా కథని ముందుకు
నడిపించేదని తెలిసిందే కాబట్టి.
సీన్ :
ఇద్దరూ
చెట్ల మధ్యకి నడుస్తూంటారు. భూత్ బంగ్లాలోకి వెళ్తారు. చీకటిగా వున్న ఒక గదిలోకి తొంగి
చూస్తారు. బయటికి వచ్చి ఇంకో గదిని చూస్తారు. అప్పుడు జూహీ అంటుంది, ‘నువ్వెప్పుడైనా
దెయ్యాల్ని చూశావా?’ అని. రోజూ చూస్తానంటాడు.
ఆమె అర్ధంగాక అడిగితే, అద్దంలో
చూస్తానంటాడు. నిజానికి తనే వొక దెయ్యాన్నని
నవ్వుతాడు. ఆ నవ్వు చూడలేక ఆపమంటుంది. డిసప్పాయింటైనట్టు చూస్తూ వుంటుంది అతడికేసే.
అక్కడ్నించి
వరండాలోకొచ్చి ఇద్దరూ కింద పడిపోతారు. ఆమె
ఇటు ముందు, అతను అటు వెనుకాల. అతను వచ్చేసి ఆమెని లేపుతాడు. వెనక వారగా ఎవరో వెళ్లినట్టన్పించి గిరుక్కున తిరిగి
చూస్తారు. ఎవరూ వుండరు. మెల్లిగా ఆ గది దగ్గరికి వెళ్తారు. ఆమె దూరంగా వుంటుంది.
అతను తలుపు తోసి లోపలికి చూసి, భయంకరంగా
కేకలు పెడుతూ పరిగెడతాడు. అర్ధంగాక ఆమె కూడా
మెల్లిగా ఆ గది దగ్గరికి వెళ్తుంది. గదిలోంచి పిచ్చోడు వచ్చేస్తాడు.
ఆర్తనాదాలు చేస్తూ పరుగు లంకించుకుంటుంది. ఇది విని వెనక్కి పరిగెత్తు కొస్తాడు
జూన్ హా.
ఇద్దరూ
ఆగిపోయి ఒకర్నొకరు చూసుకుని గట్టిగా కేకలు
పెట్టుకుంటారు. భూత్ బంగ్లాలో వున్నది పిచ్చోడు కావడంతో గట్టిగా నవ్వుకుని, మళ్ళీ
కేకలు పెట్టుకుంటారు. మళ్ళీ నవ్వుకుని
మళ్ళీ కేకలు పెట్టుకుంటారు. వీళ్ళని తోసుకుంటూ మధ్యలోంచి మందు బాటిల్ పట్టుకున్న పిచ్చోడెళ్ళిపోతాడు.
మళ్ళీ కేకలు పెట్టుకుని మళ్ళీ నవ్వుకుంటారు. మళ్ళీ కేకలు పెట్టుకుంటారు...అవతల
పచ్చటి ప్రకృతి మీద ఈ కేకలు ఎండ్ అవుతాయి.
పాయింట్ :
ఈ సీను పడవ దిగి వెళ్తున్న అర్ధంలో
వాళ్ళిద్దరి అడుగులమీద ఫోకస్ చేసి హాఫ్ వేలో ఓపెన్ చేశాడు. ఓపెనింగ్ ఇలాగే రాసి
ఇలాగే తీశారా, లేక ఇంకా వేరే తీసి ఎడిటింగ్ లో ఇక్కడ్నుంచి తీసుకున్నారా మనకి
తెలీదు. కానీ ఇది చాలా అర్ధవంతమైన ఓపెనింగ్, కథా గమనం మీద ఫోకస్ చేస్తూ.
ఇద్దరి
అడుగులు దగ్గర దగ్గరగా పడుతూంటాయి. దర్శకుడు అడుగుల మీద అలా ఫోకస్ చేశాడంటే రోమాంటిక్
బంధాన్ని వేస్తున్నట్టే. ఇది వాళ్ళకి తెలియకపోయినప్పటికీ దర్శకుడే అందుకు బీజాలేస్తున్నాడు. ఇప్పటి వరకూ నడిచిన వీళ్ళిద్దరి సీన్లలో, ఎక్కడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే టచ్ లేదు. ఇప్పటికామెకి పెళ్లి సంబంధం కూడా కుదరలేదు టీసూతో. పెళ్లి సంబంధానికి
పూర్వపు అనుభవాలివి.
విధి
లేదా కాలంతో కూడిన రోమాంటిక్ డ్రామాల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు వుండవా? కలపడం విధి
లేదా కాలమే చూసుకుంటాయా? కాస్త సమయం
తీసుకుని ఆలోచించాల్సిన విషయమిది. విధి, లేక కాలం కథ నడుపుతోందంటే పాత్రలు
చేయడానికేమీ వుండదు. అంతా విధి లేదా కాలం చూసుకుంటాయి. అందుకే ఇక్కడ తొలి చూపు
ప్రేమలు కన్పించడం లేదు. ఎక్కడా ఇద్దరూ అలాటి భావంతో చూసుకోవడం లేదు. విధి నడపని
కథల్లోనైతే హీరో హీరోయిన్లు తాముగా ప్రేమలో
పడ్డం వుంటుందేమో. ఇక్కడ జుహీ ఇందాక పడవలో గమ్మత్తు అన్నా, జూన్ హా ఫేట్
అన్నా, కాలానికి సంబంధించినవే. కాబట్టి కాలానికి
లోబడి నడుచుకుంటున్నారు.
అసలు
భూత్ బంగ్లా సీనుని ఈ కథలో ఎందుకు కల్పించాడు? కాలం కథని నడపడం కోసం. కాలం దానికది
తెచ్చిపెట్టే మెటఫర్స్ (రూపకాలంకారాలు) ని చూపెట్టడం కోసం. అలా భూత్ బంగ్లాయే ఒక
మెటఫర్. దేనికి మెటఫర్? వీళ్ళు చేయబోయే ప్రేమ ప్రయాణంలో ఎదురయ్యే పరీక్షలకి మెటఫర్.
ఈ భూత్ బంగ్లా అలా వొక ప్రయోగశాల. ఈ ప్రయోగ శాలలో ఒక పిచ్చోడున్నాడు, రెండు పావురాలున్నాయి,
మరో రెండు వీళ్ళు తెలుసుకోక జరిగిపోయిన ఒక సంఘటనా, ఇంకో బాడీ లాంగ్వేజ్ వున్నాయి.
దేని
తర్వాత దేన్ని, ఈ క్రమాన్ని వరసగా ఎస్టాబ్లిష్
చేశాడో చూద్దాం – ముందుగా చీకటి గదిలోకి ఎంటరైనప్పుడు ఆమె ముందుంటుంది. అతను వెనుక
వుంటాడు. భూత్ బంగ్లా చూడాలన్న కుతూహలం ఆమెదే కాబట్టి ఆమె ముందుండడం ఈ ఓపెనింగ్ కి న్యాయం.
అతను చూపిస్తానని ఎస్కార్ట్ లాగా వచ్చాడు కాబట్టి ఆమె వెనకుండడం న్యాయం.
ఇలా
ఆమె కుతూహలాన్ని బేస్ గా చేసుకుని సీను ఓపెన్ చేసి, తర్వాత ఇద్దర్నీ పక్కపక్కనే
చూపించుకుంటూ పోతాడు దర్శకుడు. చిత్రీకరణలో చాలా నిశిత పరిశీలన కలవాడుగా
కన్పిస్తున్నాడు దర్శకుడు. తెలుగులో విడుదలయ్యే ప్రేమ సినిమాలు ఒక్క పూట కూడా ఎవరూ
చూడ్డం లేదంటే, ఏముంటుందని చూడ్డానికి -
ప్రేక్షకుల అంతరంగాల్ని కట్టి పడేసి కథానుగుణ చిత్రీకరణా విధానాలు ఏ ప్రేమ సినిమాల్లో వుంటున్నాయని. మానవ
ప్రవర్తన తెలియకుండా హీరోయిన్ ని బిక్కుబిక్కు మంటూ వెనుక వుంచి, హీరోగార్ని
హీరోయిజంతో ముందుకు నడిపిస్తే ఈ సీను కనెక్ట్ అవుతుందా? కుతూహలమున్న హీరోయిన్
బిక్కుబిక్కు మంటూ వెనుక వుంటుందా? మొన్నొక కొత్త దర్శకుడు కరెక్ట్ మాట చెప్పాడు –
సీనుని వెనుక సీన్లో పాత్రల లక్ష్యాల ఆధారంగా నడిపిస్తే కరెక్టుగా వస్తాయని.
తర్వాత,
ఆ గది దాటుకుని బయటి కొచ్చాక, ‘నువ్వెప్పుడైనా దెయ్యాల్ని చూశావా?’ అంటుంది.
కుతూహలంతో వచ్చింది. దెయ్యం కనపడ్డం లేదు. అందువల్ల దీని కొనసాగింపుగా, నోట్లోంచి
ఈ మాటే వచ్చింది. అతను రోజూ అద్దంలో చూస్తానంటాడు. నిజానికి తానే వొక దెయ్యాన్నని నవ్వుతాడు. ఇది తన మీద తానేసుకున్న
జోకు తప్ప మరేమీ కాదు నిజానికి. కాలం పలికించిన జోకు. ఈ జోకే నిజమవుతుంది చివరికి.
ఈ జోకువేసి ఆమెని భయపెడుతూ చేతులు తిప్పుతాడు. ఆమె బాధగా చూసి ఆపమని సున్నితంగా
అంటుంది.
అతనిలా
తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడ్డం తనకిష్టం
లేదన్న భావం ఆమె మొహంలో స్పష్టంగా పలుకుతుంది. అతడి జోకుతో ఆమె లోపలున్న ఫీలింగ్స్ బయట
పడినట్టయ్యింది. దీంతో ఆమె అతడికి కనెక్ట్ అవుతోందని మనకి తెలుస్తోంది.
ఫీలింగ్స్
తో ఈ కనెక్షన్ ఏర్పడ్డాక, ఇప్పుడు ఈ కనెక్షన్ ని తీసికెళ్లి ఏం చెయ్యాలి?
ఫీలింగ్స్ లో వుండి పోయిన కనెక్షన్ ని ఫిజికల్ గా కనెక్టు చేసి విజువల్ గా రక్తి కట్టించాలి.
ఎన్ని ఫీలింగ్స్ వున్నా ఏమీ లాభం వుండదు, ఎవరూ వాటిని నమ్మరు, అవి కార్యరూపం
దాల్చకపోతే. కథంటే విజువల్ గా వుండే సంఘటనలే. ఎంత కూర్చుని గంటలు గంటలు
మాట్లాడుకున్నా సంఘటనలు జరక్కపోతే ఆ మాటల కర్ధముండదు.
వరండాలో
కొచ్చి అటొకరు, ఇటొకరు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు, అటు కింద మెట్టు మీద కాలుపడి ధడాల్న పడిపోతుంది జూహీ. ఈ శబ్దానికి అటు జూన్ హా కూడా తూలి ధడాల్న పడిపోతాడు.
పూర్తయ్యింది ఫిజికల్ కనెక్షన్. ఇటు ఈమె పడిపోతే, ఈమెకున్న ఫీలింగ్స్ అటు అతడికి
తాకి అతనూ పడిపోయాడన్న మాట. ఈ మెలోడ్రామా అవధులు దాటిన మెలో డ్రామాయే. కానీ దర్శకుడు ముందే హెచ్చరించాడు - మేం కంట నీరు పెట్టుకునే సెంటిమెంటల్ కథలు
చేసుకుంటామని.
ఫిజికల్
కనెక్షన్ ఏర్పాటయి పోయింది. వెంటనే వచ్చి లేపుతాడు. కానీ ఇద్దరూ అలా
పడిపోయినప్పుడు, రెండు పావురాలు
ఎగిరిపోతాయి. ఇదొక మెటఫర్. దేనికి మెటఫర్?
వాళ్ళిద్దరి ప్రేమకి. అవి ప్రేమ
పావురాలు. అవెందుకు ఎగిరిపోయాయి? వీళ్ళిద్దరే జరుగుతున్న కథ. మిగతావన్నీ జరగబోయే
కథలన్న మాట. కాలం లో ఇలాగే జరుగుతూంటాయి.
మన చుట్టూ అనేకం జరుగుతూంటాయి. వాటిలో కొన్ని మనకి తెలియకుండానే వర్తిస్తూంటాయి.
వీళ్ళు
అలా కింద పడిపోయి ఫిజికల్ కనెక్షన్
ఏర్పడ్డమూ, అదే క్షణంలో పావురా లెగిరి పోవడమంటే, ప్రేమలో వీళ్ళు పడ్డా, ఆ ప్రేమ
చెదిరి పోయేదే అని కవి హృదయమన్న మాట. రెండు పావురాలు ఎడం వైపు ఎగిరిపోయాక, అదే
లాంగ్ షాట్ లో, ఒక పావురమే దూరంగా ఫ్రేములోకి
వచ్చి, కుడి వైపు మాయమవుతుంది. బహుశా ఆ పావురం జూన్ హై సింబాలిజం. ఎందుకంటే, ఈ
హీరోయిన్ ఓరియెంటెడ్ కథ జూహీది. ఆమె జీవితంలోంచే ఎగిరిపోవాలి ఏదైనా, ఆమె ఎగిరిపోదు
కథా నియమాల ప్రకారం.
ఇలా
కాలమే ఒకవైపు వీళ్ళని కలుపుతూ, ఇంకో వైపు విడదీసే బీజాలు నాటేస్తోందప్పుడే. మీరు విడిపోతారని
హెచ్చరిస్తోంది. కాలమింతే, ఎవ్వరికీ అర్ధంగాదు. అలా ఇద్దర్నీ లేపాక, ఇప్పుడేం
చేయాలి? దేంతో కనెక్ట్ చేయాలి? మొత్తం
సీను హార్రర్ యాంగిల్ లో ఓపెనై, రోమాంటిక్స్ కెళ్ళి, దాని జాతకం కూడా చెప్పేశాక,
ఇప్పుడేమిటి?
హార్రర్
మీది కెళ్ళాలి. అదింకా బ్యాలెన్సుంది కాబట్టి. ఇలా కాక ముందుగానే హార్రర్ అంతా చూపించి ముగించేసి, అందులోంచి రోమాంటిక్
ఫీలింగ్స్ తీసి ముగిస్తే ఎలా వుంటుంది? డైనమిక్స్ లేక ఫ్లాట్ గా వుంటుంది. ఒక బంచ్
లో హార్రర్, ఇంకో బంచ్ లో రోమాంటిక్స్ చూపిస్తే, రెండు ముక్కలుగా వుంటుంది సీను. డైనమిక్స్
వుండవు. ఇలాకాక కొంచెం హార్రర్, కొంచెం రోమాంటిక్స్, మళ్ళీ కొంచెం హార్రర్...ఇలా
చూపిస్తూ పోతే, ఆ డైనమిక్స్ మెట్ల వరసతో భిన్న
అనుభూతుల రసపోషణకి లోనవుతారు ప్రేక్షకులు.
సీను రెండు విడి విడి ముక్కలైపోయి వెలితిగా వుండదు.
రోమాంటిక్స్
ని కొలిక్కి తెచ్చాక, అలా ఆమెని లేపి
పట్టుకున్నప్పుడే వెనక వారగా, ఎవరో పోతున్నట్టు అన్పించి వెనక్కి తిరిగి చూస్తారు. అంటే
సీన్ల ట్రాన్సి షన్స్ ఎలా వుంటున్నాయంటే, నడుస్తున్న సీను చివర్నించే తర్వాతి సీను
విశేషం ఫ్లో అవుతోంది. అంతేగానీ, ఈ సీను కట్ చేసి, ఆ సీను విడిగా ఎత్తుకునే బ్యాడ్
షాట్ కంపోజిషన్ కాదు.
ఇప్పుడు
జాగ్రత్తగా గమనిస్తే ఏమిటంటే, ఎవరా అని ఆ గదిని సమీపిస్తారిద్దరూ. ఈ సమీపించడంలో
భయం వుండదు. భయపడితే ఈ బంగ్లాకే రారు. కుతూహలంతో దెయ్యాన్ని చూడాలనే వచ్చారు. కాబట్టి
భయపడరు. చూశాక భయపడొచ్చు. ఇది సరైన డైనమిక్స్. భయంతోనే వచ్చి, చూశాకానూ భయపడితే - రెండూ భయాలే కాబట్టి ద్వంద్వాల పోషణ జరగదు, డైనమిక్స్
ఏర్పడవు. కుతూహలం, దాని పర్యవసానంగా భయం –
అనే భిన్న భావోద్వేగాలు - వీటితోనే ఇలా
ద్వంద్వాలూ డైనమిక్సూ.
ఇప్పుడు
వీళ్ళు కుతూహలంతో ఆ గదిని
సమీపిస్తున్నప్పుడు తీసిన షాట్ ని గమనించాలి. రైట్ నుంచి ఫ్రేములోకి వంగి నడుస్తూ
ఎంటరవుతాడు జూన్ హా. అతడి వెనకాలే అదే ఏటవాలుగా అతడి వీపు మీద వాలిపోతున్నట్టూ ఎంటరవుతుంది
జూహీ.
ఎందుకిలా
తీశాడు? ఈ మొత్తం సీన్లో ఐదు మెటఫర్
లున్నాయని చెప్పుకున్నాం ముందే. భూత్ బంగ్లాతో బాటు, ఒక పిచ్చోడు, రెండు పావురాలు,
మరో వీళ్ళు తెలుసుకోక జరిగిపోయిన ఒక
సంఘటనా, ఇంకో బాడీ లాంగ్వేజ్.
భూత్
బంగ్లా, పావురాలూ అనే మెటఫర్స్ ని దేనికి వాడుకున్నాడో చూశాం. అలాగే వీళ్ళు
తెలుసుకోక జరిగిపోయిన ఒక సంఘటనగా కిందపడిపోవడాన్నీ- దాన్నుంచీ ఫిజికల్ కనెక్షన్ నీ చూశాం. ఇక పిచ్చోడు మిగిలాడు,
బాడీ లాంగ్వేజీ మిగిలింది. ఈ బాడీ
లాంగ్వేజీ అనే మెటఫర్ నే ఇప్పుడు చూస్తున్నాం.
అతను వంగి నడవడం, అతడి వీపు మీద వాలిపోతున్నట్టూ ఆమె
వెళ్ళడం – అనే ఈ బాడీ లాంగ్వేజ్ తర్వాతి సీన్లో నిజమవుతుంది. కొన్ని తెలియకుండా మన
చేతిలో జరిగిపోతాయి. తర్వాతెప్పుడో అవే ఇంకేదో రూపంలో మన అనుభవంలోకి వస్తాయి. ఈ
బాడీ లాంగ్వేజ్ ఇలాటి అర్ధమేమిటో కూడా వచ్చే సీన్లో చూద్దాం.
ఇలా
కుతూహలంతో ఆ పాడుబడ్డ గది తలుపు నెట్టి లోపలికి చూసి, గావుకేక లేస్తూ పరిగెడతాడు
జూన్ హా. ఇది చూసి ఆమెకూడా భయపడి పరుగెత్తదు. ఆమె కుతూహలం కొద్దీ వచ్చిందనే మర్చిపోకూడదు.
ఏంటా అని అలా పారిపోతున్నజూన్ హా వైపే అర్ధంగానట్టు
చూసి, కుతూహలంగా తనుకూడా ఆ గది దగ్గరికే వెళ్తుంది. వెంటనే డోర్ గట్టిగా మూసుకోవడంతో ఠక్కున ఆగిపోతుంది. డోర్ తీసుకుని పిచ్చోడు
రావడంతో ఆర్తనాదాలు చేస్తూ పారిపోతుంది.
ఈ
ఆర్తనాదాలకి తను ఆమెని వదిలేసి వచ్చాడని
గుర్తొచ్చి, వెనక్కి పరిగెడతాడతను. ఇద్దరూ కలుసుకుని భయంలో కేకలు పెట్టుకుంటారు,
నవ్వుకుంటారు, కేకలు పెట్టుకుంటారు, నవ్వుకుంటారు...ఈ నవ్వుకోవడాలు భయం
పోగొట్టుకోవడానికి కావొచ్చు, లేదా ఇంతా చేసి పిచ్చోణ్ణి చూసినందుకూ కావొచ్చు.
వీళ్ళిలా
చేస్తూంటే, వెనుకనుంచి పిచ్చోడొస్తాడు. వీళ్ళని తోసుకుంటూ మధ్యలోంచి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు పిచ్చోడి గెటప్ పూర్తిగా చూస్తే, తలకి కోటు చుట్టుకుని వుంటాడు. కుడి
చేతిలో మందు బాటిల్ వుంటుంది. ఎడమ చంకలో చుట్టి పెట్టుకున్న కోటో ప్యాంటో వుంటుంది. అందులోంచి గడ్డి పరకలు వేలాడుతూంటాయి...
ఇతను
దేనికి మెటఫర్ అంటే, రాబోయే సీనులో మీరిలాటి ఫలానా పరిస్థితిలో వుంటారని కాలం విన్పిస్తున్న వాణికి
మెటఫర్. ఏమిటా పరిస్థితి? వచ్చే సీన్లో చూద్దాం...
ఈ
మొత్తం సీను ఆగిఆగి నడుస్తూంటుంది. ఆగడం ఆయా సిట్యుయేషన్స్ ని మనం అనుభవించేందుకే.
ఆగడం, అంటే స్లో అవడం, ఆ మూడ్ లోకి మనం వెళ్లేందుకే. ఇది చూసి మూవీ స్లోగా వుందని అనుకుంటే
కాదు. స్పీడు మెదడుని ఆకర్షిస్తుంది, స్లో మనస్సుని ఆకట్టుకుంటుంది. చాలావరకూ మెదడుని
ఆకర్షించే స్పీడు చిత్రీకరణలు రావడంతో, స్లో బోరు కొట్టవచ్చు. కానీ మెదడుతోనూ మనసుతోనూ
సినిమాని ఎంజాయ్ చేయాలంటే ఆయా సన్నివేశాలు డిమాండ్ చేసే దాన్ని బట్టి స్లో స్పీడూ రెండూ
సమపాళ్ళల్లో వుండాల్సిందే - ప్రత్యేకించి రోమాంటిక్ డ్రామాల్లో. విషమున్నప్పుడు ఆ స్లో
బలాన్నిస్తుంది. విషయం లేకపోతేనే స్లో సీన్లు నీరసంగా వుండి బోరుకొడతాయి.
మెటఫర్స్
వాడకం ప్రేక్షకుల సబ్ కాన్షస్ మైండ్ కి గాలం వేయడానికి. తద్వారా వాటి నాటకీయతనీ, కళాత్మకతనీ అనుభవించడానికి. మన కాన్షస్
మైండ్ కివి ఎక్కకపోయినా, సబ్ కాన్షస్ మైండ్ కి అన్నీ ఎక్కుతూంటాయి...దానికి ఏదేమిటో
అన్నీ తెలుస్తూనే వుంటాయి....
―సికిందర్