రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 15, 2025

1366 : స్క్రీన్ ప్లే సంగతులు


 

రచన- దర్శకత్వం : చందూ మొండేటి
తారాగణం : నాగచైతన్య, సాయి పల్లవి, ప్రకాష్ బెలవాడి, కరుణాకరన్, మహేష్ అచంట
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : షామ్ దత్ సయీనుద్దీన్
బ్యానర్ :  గీతా ఆర్ట్స్
నిర్మాత :  బన్నీ వాసు
విడుదల : ఫిబ్రవరి 7, 2025   
***
        ఫిబ్రవరి 7 శుక్రవారం విడుదలైన తండేల్ తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 20.5 కోట్లు రాబట్టి  హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజు శనివారం 16 కోట్లు, మూడో రోజు ఆదివారం 14 కోట్లుగా డ్రాప్ అవుతూ వచ్చి, సోమవారం నుంచి వసూళ్ళ పతనం పెరుగుతూ  పోయింది. సోమవారం (నాల్గవ రోజు) 6.15 కోట్లు, మంగళవారం (ఐదవ రోజు) 5.5 కోట్లు, బుధవారం (ఆరవ రోజు) 3.6 కోట్లు, నిన్న గురువారం (ఏడవ రోజు) 3 కోట్లకి పడిపోయి ప్రశ్నార్ధకంగా నిల్చింది. హిందీ రాష్ట్రాల్లో కేవలం 40 లక్షలు వసూలు చేసింది. ఈ ఏడు రోజుల్లో (అంటే తొలి వారం) మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ 65.65 కోట్లు. బడ్జెట్ 75 కోట్లు. 100 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని ఆశిస్తున్నారు. కాకపోయినా నష్టం లేదు, ఓటీటీ హక్కులు 45 కోట్లు రానే వస్తాయి. ఇలా ఓటీటీ సపోర్టుతో లాభాల్లో పడితే సేఫ్ ప్రాజెక్టు అన్నట్టేనా? వుందిగా ఓటీటీ అని క్వాలిటీ మీద దృష్టి పెట్టకుండా సినిమాలు తీసేసి హిట్ అని చెప్పుకోవచ్చా?

    యితే ప్రతీరోజూ కలెక్షన్లు డ్రాప్ అవడానికి కారణాలు కొన్ని చెప్తున్నారు. మొదటి రోజే పైరసీ కాపీ వచ్చేసిందని  ఒక కారణం. అన్ని  సినిమాలూ మొదటి రోజే పైరసీలు వచ్చేస్తాయి. వాటి లింకులు మర్నాడు పెడతారు. అసలు పైరసీతో సంబంధం లేకుండా పెద్ద సినిమాలు హిట్టవుతూనే వున్నాయి. సంక్రాంతికి బాలకృష్ణ డాకూ మహరాజ్’,  వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం పైరసీలు వచ్చేసినా హిట్టయ్యాయి. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాపయ్యింది. ఎందుకు ఫ్లాపయ్యింది- కంటెంట్ ప్రాబ్లం. ఇక తండేల్ డ్రాపవుతూ వుండడానికి మార్చి ఫస్ట్ నుంచి పరీక్షల సీజన్ అనీ, మరొకటనీ ఇతర కారణాలు చెప్తున్నారు. కానీ కంటెంట్ తో వున్న పెద్ద బ్లాక్ హోల్ గురించి మాట్లాడ్డం లేదు. ఏమిటా బ్లాక్ హోల్? కమర్షియల్  సినిమాలకి కాస్త కథలు చూసుకుని తీయాలనీ, గాథలు తీసి గల్లంతు అవకూడదనీ గత కొన్నేళ్ళుగా బ్లాగులో హెచ్చరించుకుంటూనే వున్నాం. అయినా తండేల్ ని గాథగా చేసి తీయనే తీశారు! ఫలితమే పైన కనిపిస్తున్న అంకెలు!

        తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలే శాపాలనుకుంటే, కథలు గాక గాథలు చూపిస్తూ ఇంకో శాపం కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు.  గాథ అంటే ఏమిటో మరోసారి గుర్తు చేసుకుందామా? గాథఅనేది కథ కిందికి రాదు. కథకీ గాథకీ తేడా వుంది. గాథ లో వుండే కంటెంట్ ఒక సాదా స్టేట్ మెంట్ మాత్రంగానే వుంటుంది. అంటే పాత్ర- నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా ముగిసిందీ బాబో- అంటూ విధికి తలవంచిన పరాజిత లక్షణాలతో వాపోతుంది. విధి అంటే ఏమిటి? తన ప్రారబ్ద కర్మే!

         ఇలాకాక కథఅనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. అంటే పాత్ర- నేననుకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నానూ- అని విజేత అయి ప్రకటిస్తుంది. ఈ  సినిమాలో నాగచైతన్య పాత్రగానీ, సాయి పల్లవి పాత్రగానీ  మొదటి సిద్ధాంతానికే న్యాయం చేయడానికి కృషి చేశాయి. అంటే గాథని సృష్టించడానికి జత కట్టాయి. ఇది వివరంగా తెలుసుకోవడానికి స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళాలి. ముందుగా కంటెంట్ ఏమిటో చూద్దాం...

సీమాంతర కాన్సెప్ట్ ఇది 

    శ్రీకాకుళం తీరంలో మత్స్యకారుల్లో ఒకడైన రాజు (నాగ చైతన్య) చేపల వేటకి వెళ్తూంటాడు. తన బృందం తో కలిసి  ప్రతి సంవత్సరం  గుజరాత్‌ దాకా సముద్రంలో ప్రయాణించి అక్కడ ఒక కాంట్రాక్టర్‌ కి తాము పట్టిన చేపలు అమ్మి వస్తూంటాడు. ఇంటి దగ్గర వాళ్ళ భార్యలు, తల్లులు, ఇతర బంధువులు వీళ్ళు తిరిగి వచ్చేదాకా ఎదురు చూపులతో గడుపుతూంటారు. రాజు కూడా తాను ప్రేమిస్తున్న సత్య (సాయి పల్లవి) ని  వదిలి వెళ్తూంటాడు. తొమ్మిది నెలలు సముద్రం మీద, 3 నెలలు ఇంటి దగ్గర వుండే రాజు ఈ సమయంలోనే సత్యతో  ప్రత్యక్ష ప్రేమలో వుంటాడు. మిగిలిన కాలం ఫోన్ల మీద మాట్లాడుకోవడమే. అందుకని సత్యకి అతను చేస్తున్న ఈ వృత్తి నచ్చదు. ఈ నేపథ్యంలో ఒక రౌడీ ముఠాని ఎదుర్కొన్న రాజుని తమ తండేల్ (నాయకుడు) గా ఎన్నుకుంటారు మత్స్యకారులు. ఇక తండేల్ గా రాజు తిరిగి గుజరాత్ కి ప్రయాణం కట్టడంతో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సత్య. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బృందంతో వెళ్ళిపోయిన అతను- తుఫాను చెలరేగడంతో సముద్రంలో ఒక పాకిస్తానీని కాపాడుతూ పాక్ సముద్రజలాల్లోకి ప్రవేశిస్తాడు. దీంతో బోటులో వున్న 21 మంది బృందం సహా పాక్ దళాలకి పట్టుబడతాడు. జైల్లో బందీ అయి పోతాడు.
       
ఈ వార్త సత్యకీ
, మిగతా అందరికీ షాకులా తగులుతుంది. ఇప్పుడు పాక్ జైల్లో బృందంతో ఖైదు అయిన రాజు ఎదుర్కొన్న అనుభవాలేమిటి? అతను బృందంతో అక్కడ్నుంచి ఎలా బయటపడ్డాడు? రాజు మీద కోపంతో వున్న సత్య ఏం చేసింది? వీళ్ళిద్దరి ప్రేమ ఏ తీరానికి చేరింది చివరికి? ఇదీ మిగతా కంటెంట్. కంటెంట్ అనడమెందుకంటే, ఇది కథో గాథో తేలేదాకా కంటెంట్ అనే అనుకుందాం.

2. ఎలావుంది కంటెంట్

    శ్రీకాకుళంలో జరిగిన సంఘటనని  ఆధారంగా తీసుకుని ఈ కంటెంట్ ని రూపొందించారు. ఆ నిజ సంఘటన పాక్ జైల్లో బందీలైన శ్రీకాకుళం మత్స్యకారుల గురించే. మిగతా ప్రేమకి సంబంధించిన కంటెంట్ ని కల్పన చేసి జోడించారు. 2018 లో కరాచీ జైల్లో ఏడాదికి పైగా నిర్బంధంలో గడిపిన తర్వాత,  పాకిస్తాన్ విదేశాంగ శాఖ వీళ్ళని తిరిగి భారత్ కి పంపేసింది. ఐతే జైల్లో పెట్టిన హింస, తిండికి మాడ్చిన తీరు మాత్రం హేయమైనవి. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈ జాలర్లని  పాకిస్తాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నవంబర్ 2018 లో గుజరాత్ తీరంలో అదుపులోకి తీసుకుంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణపై అదుపులోకి తీసుకున్నారు. కోస్తాంద్ర నుంచి మత్స్యకారులు అంత దూరం గుజరాత్ వెళ్ళడానికి కారణం అక్కడ జెల్లీ ఫిష్ అనే చేపలు భారీగా పడతాయి. వాటిని  అక్కడే కాంట్రాక్టర్లకి అమ్మి తిరిగి వస్తారు.
        
అయితే ఈ జాలర్ల నిజ జీవితపు అనుభవానికి ఓ జంటతో కలిపి కల్పిత ప్రేమని జోడించినప్పుడు, ఈ మొత్తం కంటెంట్ అసలు కథే అవుతోందా లేక గాథ అవుతోందా చూసుకోలేదు. కమర్షియల్ సినిమాతో కథకీ, గాథకీ తేడా తెలియకపోతే ప్రమాదకర జోన్లోకి అడుగుపెడుతున్నట్టే. కమర్షియల్ సినిమాకి కథే కావాలి. ఆర్ట్ సినిమాకి గాథ చెప్పుకోవచ్చు. కథ అన్నప్పుడు అందులో యాక్టివ్ క్యారక్టర్లుంటే, గాథలో పాసివ్ క్యారక్టర్లుంటాయి. కథకి  కాన్ఫ్లిక్ట్ వుంటే, గాథకి కాన్ఫ్లిక్ట్ వుండదు. కథలో పాత్రకి గోల్ వుంటే, గాథలో పాత్రకి గోల్ వుండదు. కథని పాత్ర నడిపిస్తే, గాథలో గాథ పాత్రని నడిపిస్తుంది. కథలో పరిష్కారాన్ని పాత్ర సాధిస్తే, గాథలో పాత్ర కోసం పరిష్కారాన్ని ఇతర పాత్రలు సాధించి పెట్టి ఒడ్డున పడేస్తాయి. ఇలా కథలో పక్కా యాక్టివ్ పాత్ర వుంటే, గాథలో పూర్తి పాసివ్ పాత్ర వుంటుంది. ఇలాటి గాథల ద్వారా కమర్షియల్ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నట్టు? మీకు సమస్యలొస్తే కుమిలిపోతూ పాసివ్ గా కూర్చోండి, ఎవరో ఒకరు దేవుడులా వచ్చి ఆదుకుంటారనేనా? చేతకాని పాసివ్ క్యారక్టర్ తో  చాలా బ్యాడ్ మెసేజి ఇది.
        
పాక్ లో చూపించిన మత్స్యకారుల అనుభవాల్ని డాక్యుమెంటరీలా తీశారు. దీంతో ఫీలింగ్ లేకుండా పోయింది. డాక్యుమెంటరీ అన్నాక చూపించడాని కేముంటుంది సమాచారం తప్ప. కంటెంట్ డాక్యుమెంటరీలా వున్న విషయం నాగచైతన్య కనిపెట్టి, సరి చేసుకుంటే నటిస్తానని చెప్పేశాడు. ఏం సరిచేశారో తెలీదుగానీ ఒకటి కాదు రెండు గాథలు తీసినట్టు తయారైంది మొత్తం కంటెంట్. స్ట్రక్చర్ స్కూలుని అవతల పడేసి క్రియేటివ్ స్కూలునే అనుసరిస్తే ఇంతే జరుగుతుంది. క్రియేటివ్ స్కూల్లో స్ట్రక్చర్ తో పని వుండదు, స్ట్రక్చర్ స్కూల్లో క్రియేటివిటీతో కూడా పని వుంటుంది.
        
ఈ కంటెంట్ లో క్రియేటివ్ స్కూలుతో జరిగిందేమిటంటే, ఫస్టాఫ్ లో కాన్ఫ్లిక్ట్ అంటూ లేని ప్రేమతో కూడిన గాథ నుంచి సెకండాఫ్ తెగిపోయి, పాక్ లో జాలర్ల స్ట్రగుల్ తో కూడిన గాథకింద పడి నలిగిపోయింది. ఇలా మొత్తం కలిపి చూస్తే సినిమాలో వున్నది  గాథే అయినా, అదీ ఒక పాయింటుతో గాక,  ఫస్టాఫ్ ప్రేమ పాయింటు, సెకండాఫ్ జాలర్ల స్ట్రగుల్ అనే పాయింటు అంటూ రెండు ముక్కలుగా తెగిపోయి-  సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడిందన్న మాట!

3. ప్రేమలో ఏమిటి కాన్ఫ్లిక్ట్?

    కథ అనుకుని తయారు చేసిన ఈ కంటెంట్ లో, ప్రేమలో కాన్ఫ్లిక్ట్ పూర్తిగా లేదని కాదు, కాన్ఫ్లిక్ట్ సరీగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకని కాన్ఫ్లిక్ట్ వున్నా లేనట్టే వుంది. స్క్రీన్ ప్లేలో కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) ప్రాముఖ్యమేమిటంటే, అది కథనానికి డ్రైవింగ్ ఫోర్స్ గా పనిచేస్తుంది. టెన్షన్ ని సృష్టిస్తుంది. కాన్సెప్ట్ ని ముందుకి నడిపిస్తుంది. పాత్రల్ని డెవలప్ చేస్తుంది. పాత్రలు అధిగమించాల్సిన సవాళ్ళని ఎత్తి చూపుతూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది.  కాన్ఫ్లిక్ట్ లేని కంటెంట్ లో డైనమిజం (చైతన్యం) కూడా వుండదు, స్తబ్దుగా వుండిపోతుంది. ఇవన్నీ ఈ స్క్రీన్ ప్లేలో కొట్టొచ్చినట్టుండే లోపాలు.
       
అందుకని ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎలా వుందో చూద్దాం. సినిమా ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఓ కాన్ఫ్లిక్ట్ సృష్టించిన ఘట్టంతోనే ప్రారంభమవుతుంది. అంటే రవిబాబు తీసిన  
అదుగో లోలాగా,  లేదా టీనేజి నోయర్ బ్రిక్ లోలాగా అన్నమాట. ఇలా ప్లాట్ పాయింట్ 1 ఘట్టంతో రైల్వే స్టేషన్లో  ప్రారంభమవుతుంది సినిమా. ఓపెనింగ్ షాట్ లో రైలు వెళ్ళిపోయాక చూస్తే అక్కడ బెంచీ మీద కూర్చుని తీవ్రంగా దుఖిస్తున్న సత్య కనిపిస్తుంది (ఈ ఓపెనింగ్ షాట్ గా వేసిన దృశ్యంలో రైలు లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది- కానీ ఈ ప్లాట్ పాయింట్ 1 ఘట్టం ఫ్లాష్ బ్యాక్ ముగించుకుని తిరిగి ఇదే స్పాట్ కొచ్చినపుడు- రైలు రైట్ కి వెళ్తూ కనిపిస్తుంది!). 
       
ఈ ఘట్టం ఫ్లాష్ బ్యాక్ ఏమిటి
? స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగంగా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. రాజు, సత్య ఇతర పాత్రల పరిచయమూ, రాజూ సత్యల ప్రేమాయణమూ  మొదలైన బిగినింగ్ బిజినెస్ మొదటి రెండు టూల్స్ తో నేపథ్యం ఏర్పాటవుతుంది. ప్రేమించుకుంటున్నారు, కానీ రాజు వేటకి సముద్రం మీదికెళ్ళి నెలలకి నెలలు కనపడకుండా పోతూంటే సత్యకి తీవ్ర అసంతృప్తి. ఒక రోజు వేటకెళ్ళిన జాలరి ఒకతను శవమై తిరిగి రావడంతో సత్యకి భయం పట్టుకుంటుంది- రాజుకి కూడా ఇలా జరిగితే? (బిగినింగ్ బిజినెస్ లో మూడవ టూల్- సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన అన్నమాట).
       
తర్వాత తండ్రిని అడుగుతుంది- నువ్వెందుకు వేట కెళ్ళవని. ఒకసారి అతను కొన్ని నెలలు వేట కెళ్ళి వచ్చేసరికి భార్య గుండెపోటుతో చనిపోయిందని తెలుస్తుంది. దీంతో చివరి చూపులు కూడా దక్కని భార్య సమాధి దగ్గరకెళ్ళి ఏడ్చాడు. కూతుర్నీ ఇలాగే దూరం చేసుకోకూడదని ఆమెని చూసుకునేందుకు వేట మానేశాడు. మరి ఈ పని మానెయ్యమని రాజుకి ఎందుకు చెప్పలేదని అడిగితే
, రాజు విషయం నీకే వదిలేస్తున్నానని అంటాడు.
        
సత్య ఇప్పుడు వేట మానెయ్యమని రాజుకి చెప్పేస్తుంది. జాలరి మరణం ఆమెని భయపెడ్తోంది. రాజు కొట్టి పారేస్తాడు. చావొచ్చేదుంటే ఎక్కడున్నావస్తుందంటాడు. పైగా తాను నేల మీద కన్నా సముద్రం మీద స్ట్రాంగ్ అంటాడు. ఆమె అస్సలు వినిపించుకోదు.  ఒట్టేయించుకుంటుంది. ఇంతలో ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది- రేపుదయం స్టేషన్ కొచ్చేయమని.
       
ఉదయం చూస్తే రాజు వుండకపోయేసరికి స్టేషన్ కి పరిగెడుతుంది. రైలు వచ్చి వుంటుంది. రాజు సహా బృందం ప్లాట్ ఫామ్ మీద వుంటారు. రాజుని పట్టుకుని నిలదీస్తుంది. ఆమె భయపడుతున్నట్టు జరగదని అదే సమాధానం చెప్తాడు. ఈసారి రాగానే పెళ్ళి చేసేసుకుందామంటాడు. ఇంకేదో అంటాడు. ఏదీ విన్పించుకోదు. తండేల్ గా ఇప్పుడు తన మీద వాళ్ళందరి కుటుంబాల బాధ్యత వుందంటాడు. నేనా- తండేలా చెప్పమంటుంది. చెప్పలేక పోతాడు. రైలు బయల్దేరుతూంటే ఏడ్వ వద్దని
, నవ్వమనీ బ్రతిలాడుకుని రైలెక్కేస్తాడు. ఆమె ఏడుస్తూనే వుంటుంది. రైలు వెళ్ళిపోతుంది. ఇదీ బిగినింగ్ బిజినెస్ నాల్గవ టూల్ గా సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) సృష్టించిన ప్లాట్ పాయింట్ 1 ఘట్టం.
       
చూస్తే క్యారక్టర్ పరంగా రాజు బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించే పాసివ్ క్యారక్టర్ లా వున్నాడు. నమ్మదగ్గ ప్రేమికుడిలా లేడు. ఎక్కడా అతను ఆమె పక్షాన నిలబడ్డం లేదు. ఆమె కంటే వేట
, వేటగాళ్ళ బృందమే ముఖ్యమనే మైండ్ సెట్ తో వున్నాడు. ఆమె ముందే ఫ్రెండ్ నుంచి స్టేషన్ కి రమ్మని కాల్ వస్తే, రానని చెప్పలేదు. అప్పటికి వెళ్ళనని ఒట్టేశాడు. అయినా రానని చెప్పకుండా, ఆమెకి తెలియకుండా జంపయ్యాడు. దొంగబుద్ధితో ఇతనేం ప్రేమికుడన్నది ప్రశ్న!
        
స్టేషన్ లో -ఈసారి రాగానే పెళ్ళి చేసుకుందామని అంటాడు. ఏదో తప్పించుకోవడానికి అన్నట్టు అనేస్తాడు. ఇక్కడా ఆమెకి నమ్మకం కల్గించడు. ఏడుస్తున్న ఆమెని నవ్వమని బ్రతిలాడుకుంటాడు. తను ఏం ప్రూవ్ చేసుకున్నాడని ఆమె నవ్వుతుంది. తండేల్ గా సొంత మనిషితో పెద్ద మనిషి తరహా కనిపించదు. అందుకని ఏడుస్తున్న ఆమెని అలాగే వదిలేసి రైలెక్కేసి వెళ్ళి పోయాడు!

సినిమా కథకి లాజిక్ అవసరం లేదేమో, కానీ క్యారక్టరైజేషన్ కి లాజిక్కే కావాలి. ఎందుకంటే నిత్యజీవితంలో మనందరికీ మానవ సంబంధాలు అనుభవమవుతాయి- దాంతో మనుషుల తత్వాలు తెలిసిపోతాయి. సినిమా పాత్రల మధ్య దీన్నే చదువుతారు ప్రేక్షకులు. ఏ పాత్ర అసహజమో, ఏ పాత్ర సహజమో తెలిసిపోతుంది. అసహజ పాత్రని వాళ్ళ అంతరంగం అంగీకరించదు. నాగచైతన్య రాజు పాత్ర అసహజమని ఇట్టే తెలుసుకున్నాక ఫాలో అవడానికి ఇబ్బంది పడతారు. ముందు పాత్ర హిట్టవ్వాలి. అప్పుడు సినిమా దానికదే హిట్టవుతుంది. 
       
ప్లాట్ పాయింట్ వన్ ఘట్టమంటే బిగినింగ్ (ఫస్ట్ యాక్ట్) ముగిసి
, మిడిల్ (సెకండ్ యాక్ట్) ప్రారంభమయ్యే మలుపు. అంటే పాత్రకి ఆ కాన్ఫ్లిక్ట్ లొంచీ గోల్ ని సృష్టించే టర్నింగ్ పాయింటు. అంటే కథా ప్రారంభం. ఇంతదాకా బిగినింగ్ లో చూపించిందంతా కథ కాదు. మిడిల్లో ప్రారంభమయ్యే కథకి ఉపోద్ఘాతం మాత్రమే. మరి మిడిల్లో కథ ప్రారంభవమవడానికి ఇక్కడ రాజుకి గోల్ ఏది? సత్యతో తలెత్తిన కాన్ఫ్లిక్ట్ కి తనదంటూ గోల్ ఏర్పాటు చేసుకోకుండా జంపయ్యాడు. మరి సెకండాఫ్ మిడిల్ ఎలా నడవాలి కథ. కాబట్టి ఈ కంటెంట్ కథ కాదు. పాసివ్ పాత్రల గోల్ లేని గాథ అని ప్రూవ్ అవుతోంది!

4. సత్య సంగతీ డిటో
    ఇక సత్య కూడా రాజు కేం తీసిపోలేదు. రాజు ఏడాదిలో 9 నెలలు వేట కెళ్ళి తనకి దూరంగా వున్నా ఆమెకి అభ్యంతరం లేదు. వేట కెళ్ళిన ఒక జాలరి చనిపోతే మాత్రం ఆమెకి భయం పట్టుంకుంది రాజు గురించి. ఇదిలా వుంటే, వేట కెందుకు వెళ్ళడం లేదని  తండ్రిని అడిగినప్పుడు, అతను నెలల తరబడి వేట కెళ్తే ఇంటిదగ్గర భార్య చనిపోయిన విషయం కూడా తెలియలేదనీ, అందుకని సత్యని కూడా దూరం చేసుకోకూడదని వేట మానేసినట్టు చెప్పాడు. మరి రాజు చేత వేట ఎందుకు మాన్పించలేదంటే, రాజు విషయంలో నువ్వే నిర్ణయం తీసుకోవాలని చెప్పేశాడు.
        
ఇతడి వాదం కూడా విచిత్రంగా వుంది. కూతురికోసం తను వేట మానేసినప్పుడు, అదే కూతుర్ని వేటకెళ్ళే రాజుకెలా కట్టబెడతాడు? నీ నిర్ణయమని ఎలా అంటాడు? సత్య కి ఏ పరిస్థితుల్లో తన తల్లి చనిపోయిందో దాని గురించి బాధ భయం లేవు. ఇదే పరిస్థితి రేపు రాజుతో తనకూ ఎదురవ్వచ్చన్న స్పృహ కూడా లేదు. తల్లి మరణం, తన కోసం తండ్రి చేసిన త్యాగం ఇవేవీ ఆమెని రాజుని ప్రేమించడానికి అడ్డుకాలేదు- ఒక జాలరి చనిపోతే మాత్రం భయం పట్టుకుంది!
        
ఇలా పరస్పర విరుద్ధ పాయింట్లు సత్య పాత్రకి కల్పించడంతో పాత్ర కన్ఫ్యూజన్ లో   పడి, ఆ రకంగా పాత్ర చిత్రణని కథకుడి నుంచి అంగీకరించింది...ఈ మరణాలు, త్యాగాలూ లేకుండా సింపుల్ గా ప్రేమలో సమస్యలు తెచ్చి పెట్టే పాయింటు ఒకటి అంత స్పష్టంగా వుండగా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేసుకున్నట్టు కథకుడు?
        
వేట కెళ్ళి తొమ్మిది  నెలలు కనిపించకుండా పోయే రిలవెంట్ సమస్యకన్నా వేరే కారణం ఏం కావాలి సత్యకి గొడవ పడడానికి? తొమ్మిది నెలలు దూరంగా వుండే ప్రేమ నాకొద్దు - అంటే ఎవరైనా ఆమె పక్షానే సమర్ధించడాని కొస్తారు. సింపుల్. దీని గురించి అనవసరంగా తండ్రి ఫ్లాష్ బ్యాక్ సీన్లు, జాలరి మరణం సీన్లు వేసి కథని గజిబిజి చేసి, బోలెడు బడ్జెట్ ని వృధా చేసినట్టే కదా?
        
ఇక రాజు వెళ్ళిపోయాక సత్యని తండ్రి స్టేషన్ నుంచి ఇంటికి తీసికెళ్తాడు. వెంటనే తనకి పెళ్ళి సంబంధం చూడమని అనేస్తుంది. రాజు మీద  కోపంతో ఈ మాటనేస్తుంది. చంద్ర (కరుణాకరన్) అనే అతను పెళ్ళి చూపుల కొస్తాడు. సినిమా చివరి దాకా ఇతను సస్పెన్స్ లోనే వుంటాడు పెళ్ళి చేసుకుంటుందా లేదాని. అంటే దాదాపు రెండేళ్ళ కథాకాలం! సత్యకే స్పష్లత లేదు ఏం చేయాలో. తండేల్ గా ఎదిగిన రాజుపట్ల గౌరవాభిమానాలు లేకపోవడమే గాక, అలాటి తండేల్ గా హోదా పెరిగిన రాజుకి కాబోయే జీవిత భాగస్వామినిగా తాను హూందాగా ప్రవర్తించాలన్న ఆలోచనే కూడా  లేదు!

5. కాన్ఫ్లిక్ట్ నిర్మాణం

    కాన్ఫ్లిక్ట్ లోంచి రాజుకి గోల్ పుట్టాలంటే 4 గోల్ ఎలిమెంట్లు కావాలి. కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. కాన్ఫ్లిక్ట్ పుట్టాలంటే సత్యతో భేదాభిప్రాయం రావాలి. ఆమె 9 నెలలు కనిపించకుండా పోయే ప్రేమా పెళ్ళీ నాకొద్దంటుందనుకుందాం. అప్పుడు తప్పదంటాడు. సరే, నీది చిన్నప్పట్నుంచీ వేట కెళ్తున్న అలవాటు కదా, ఎకాఎకీన మానుకోమని నేనూ అనను- ఇదిగో ఇది కడుతున్నాను, టైమ్ తీసుకుని ఆలోచించుకో, అప్పుడు కూడా వేటే ముఖ్యమనిపిస్తే దీన్ని తెంచి సముద్రంలో పారేయ్- అని అతడి చేతికి దారం కట్టిందనుకుందాం...

ఇరుక్కుపోతాడు. ఆడది గుర్తుగా ఏదైనా ఇచ్చిందంటే  ఇక పీక్కోలేడు మగాడు. రాజు మాటలు త్రుంచి వేయవచ్చు-ఆమె కట్టిన దారం మాత్రం తెంచి పారెయ్యలేడు. సెంటిమెంటు. సక్సెస్ ఫుల్ బాక్సాఫీసు ఫార్ములా కూడా. మొత్తం ఈ దారం అనే ప్లాట్ డివైస్ మీదే ఆధారపడి ఇక ప్రేమ కథ!
       
కాన్ఫ్లిక్ట్ లో కథ ఓ నిర్ణీత పాయింటుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తూ పాత్రలకి ఛాలెంజీ విసరకపోతే అది ఆర్గ్యుమెంట్ తో కూడిన కథగా మారదు. ఇదేలాస్ట్ వేట
, మళ్ళీ వెళ్ళను-నిన్ను పెళ్ళి చేసుకుని వేరే పని చేసుకుంటానని అతను కన్విన్సింగ్ గా ప్రామీజ్ చేయడమో, లేదా అతను వేటే ముఖ్యమనుకుంటే ఆమె దారం కట్టో, ఇంకేదో పెట్టో చాలెంజీ విసరడం చేయకుండా- రైల్వే స్టేషన్ సీన్లో రాజూ సత్యలు అసలు పాయింటుకి రాకుండా ఎంత గొడవపడి విడిపోయినా - అది గాథకి పనికొచ్చే నస అనిపిస్తుందే తప్ప- కథని పుట్టించి ముందుకి నడిపించే యాక్షనబుల్ కాన్ఫ్లిక్ట్ అవదు.
       
ఇప్పుడు సత్య కట్టిన దారాన్నే తీసుకుని రాజు గురించి ఆలోచిద్దాం. ఇప్పుడేం చేస్తాడు- అన్న హుక్ తో
, సస్పెన్స్ తో సెకెండ్ యాక్ట్ లో కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతోంది. ఇప్పుడు సత్యతో ఇలా పుట్టిన కాన్ఫ్లిక్ట్ ని ఎలా పరిష్కరించాలన్నదే అతడి గోల్. ఈ గోల్ ఎలిమెంట్స్ లో పరిష్కారం అతడి కోరిక’, దీనికి తండేల్ గా (నాయకుడిగా) తన పదవీ పరువూ పణం గా పెడుతున్నాడు (వేట కెళ్ళక పోతే నీ పదవీ పరువూ పోతాయా అని సత్యే అన్నది). పరిణామాల హెచ్చరిక కోసం బిగినింగ్ లో రాజు తల్లితోనో, మరొక బంధువుతోనో లీడ్ ని క్రియేట్ చేయాలి- శివ లో నాగార్జున అన్న కూతురిలాగా. ఇక ఈ మూడు టూల్స్ ని డ్రైవ్ చేస్తూ వాటిలోంచి ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తే గోల్ – దాంతో కథా కథనాలూ బలంగా వస్తాయి. కథలో భావోద్వేగాలనేవి గోల్ వున్న  కాన్ఫ్లిక్ట్ లొంచే పుట్టాలి తప్ప- గోల్ వున్న కాన్ఫ్లిక్ట్ ని వదిలేసి వేరే సన్నివేశాలతో క్రియేట్ చేస్తే అవి కథకి సంబంధించిన భావోద్వేగాలనిపించుకోవు. తండేల్ గా రాజు తోటి జాలర్లకి నాయకుడే గానీ, కాన్ఫ్లిక్ట్ లో నాయకుడుగా అతడికే గోలూ లేదు! ఇదీ మౌలిక సమస్య.

6. ఏది కాన్ఫ్లిక్ట్?

    పైన చెప్పిన కాన్ఫ్లిక్ట్ తర్వాత, ఇంటర్వెల్లో రాజు బృందం సహా సముద్రంలో పాక్ దళాలకి చిక్కుతాడు. ఇంటర్వెల్ సీను కాబట్టి కథకి ఇదే కాన్ఫ్లిక్ట్ అవుతుందా? కాదు, ఈ కాన్సెప్ట్ రాజూ సత్యల ప్రేమ గురించే తప్ప పాక్ లో బందీలైన జాలర్ల గురించి కాదు. కాబట్టి ఈ ఇంటర్వెల్ సీను దీనికి ముందు చూపించిన  రాజూ సత్యల మధ్య ప్రేమలో పుట్టిన కాన్ఫ్లిక్ట్ దుష్పరిణామమే అవుతుంది తప్ప కాన్ఫ్లిక్ట్ కాదు! ఇది తెలుసుకోకపోవడం వల్ల ఇదే కాన్ఫ్లిక్ట్ అనుకుని సెకండాఫ్ నడపడంతో- ప్రేమ కథ చెదిరిపోయి- పాక్ జైలునుంచి బయటపడేందుకు జాలర్లు చేసే స్ట్రగుల్ గా మారిపోయింది సెకెండాఫ్.

7. సెకెండాఫ్ సంగతులు

    సెకండాఫ్  పూర్తిగా పాకిస్తాన్ జైల్లో జాలర్ల గాథ. ఇక రొటీన్ గా పాక్ ఖైదీలతో పోరాటాలు, దేశభక్తి ప్రదర్శనలు వగైరా. అసలు రాజు సముద్రంలో ఒక పాకిస్తానీని కాపాడే ప్రయత్నంలో సరిహద్దుని దాటడం వల్ల పట్టుబడ్డాడు. ఈ విషయం ఎక్కడా చర్చకి రాదు. రాజు దీన్ని రుజువు చేసుకుంటే కేసే లేదు. కానీ కేసు గురించి ఏ ప్రయత్నాలు చేయకుండా, బృందంతో కష్టాలు అనుభవిస్తూ వుండి పోతాడు. సత్యని ఆ పరిస్థితుల్లో వదిలేసి వచ్చిన తనకి ఆమె గురించి ఆలోచనే వుండదు. ఆమె అందమైన ఉత్తరాలు రాస్తుంది. రాజు వద్దనుకుని చంద్రని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న తను ఇంకా రాజుకి ఉత్తరాలు రాయడమేమిటో. సెకండాఫ్ లో ఇంటిదగ్గర ఒక సీన్లో అంటుంది- వాడి మీద ప్రేమ చచ్చిపోయింది, నామాట ఆ వినకుండా వెళ్ళి పోయాడని. ప్రేమ చచ్చిపోయాక ఇంకేం ప్రేమ గాథ.. ఈ క్యారక్టర్లేమిటో అస్సలర్ధం గావు!
       
అయినా రాజునీ అతడి బృందాన్నీ విడిపించేందుకు అరకొర ప్రయత్నాలు చేస్తుంది. అవేమీ ఫలించవు. ఇంతలో పాక్ ప్రభుత్వం జాలర్లని ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయిస్తుంది. ఆగస్టు 15 న భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు అదేదో గిఫ్టు గా అన్నట్టు విడుదల చేయడమేమిటి
- గర్వంగా వాళ్ళ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 న విడుదల చేయకుండా?
       
ఇంతలో ఆగస్టు 5 న కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఈ విడుదల ఆగిపోతుంది. ఫర్వాలేదు
, కానీ ఆర్టికల్ 370 రద్దయితే పాక్ ప్రజలు భారీ యెత్తున హింసకి పాల్పడమేమిటి? ఇలాటి చాలా అవాస్తవిక చిత్రణలతో అనుకున్న దేశభక్తి ఫార్ములాతో బాక్సాఫీసుని జయించాలన్న ప్రయత్నం ఫలించలేదు. దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ 2 లో మతభక్తితో నార్త్ ప్రేక్షకుల్ని విజయవంతంగా  ఆకట్టుకున్నట్టు -ఈ సారి దేశభక్తితో ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం లాభించ లేదనడానికి ఏడు రోజుల నార్త్ కలెక్షన్స్ 40 లక్షలే సాక్ష్యం.

8. చివరికేమిటి

    'తండేల్ లాంటి సీమాతర కాన్సెప్ట్ ని దేని మీద ఫోకస్ చేయాలో తెలిపే పాకిస్థానీ మూవీ ఒకటి వుంది. 2008లో బాధిత హిందువు గురించి ఒక పాకిస్థానీ మూవీ తీశారు. మెహరీన్ జబ్బార్ దర్శకురాలు. పేరు రామ్ చంద్ పాకిస్థానీ’. అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించిన బాలుడి నిజ కథే ఇది. ఏడేళ్ళ రామ్ చంద్ సరిహద్దులో ఒక పాక్ గ్రామంలో నివసించే దళిత హిందూ కుటుంబానికి చెందిన వాడు. ఒకరోజు తండ్రితో కలిసి అనుకోకుండా సరిహద్దు దాటి భారత్ వైపు వచ్చేస్తాడు. వీళ్ళు గూఢచర్యం ఛేస్తున్నారని భద్రతా దళాలు పట్టుకుని గుజరాత్ జైల్లో వేస్తారు.
       
ఇప్పుడు ఈ కాన్సెప్ట్ దేని గురించి వుండాలి
? అంతర్జాతీయ సంబంధాల కోవకి చెందే ఈ కాన్సెప్ట్
రాజకీయంగా సరైన వైఖరితో, లౌకిక దృక్పథంతో చొరబాట్లకి సంబంధించిన చట్టాలతో న్యాయ ప్రక్రియ/పోరాటం గురించే వుండాలి. ఇలాగే వుంది. వేరే ఏ దేశభక్తి, కులం, కులంలో అంటరానితనం, మతం, ప్రాంతం మొదలైన భావోద్వేగాల, మనోభావాల జోలికి పోకుండా, న్యాయ ప్రక్రియ/ పోరాటం మీదే ఫోకస్ చేసి వుంది.       

అయితే
పాక్ దళిత తండ్రీ కొడుకుల మీద ఇండియన్ పోలీసుల దౌర్జన్యం కూడా వుంది. ఇలా చూపిస్తే ముందు నీ దేశంలో దళితుల పరిస్థితి తెలుసుకో అంటారేమోనన్నట్టు, ముందే ఇలా కౌంటర్ ఇచ్చేసినట్టుంది. 9 అంతర్జాతీయ అవార్డులు పొందిన ఈ మూవీ తండేల్ ని పూర్తిగా దాని సీమాంతర ప్రేమ కథ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి తీసి వుంటే - బాక్సాఫీసు ఫలితాలు ఇంకింత బలీయంగా వుండేవని తెలియజేస్తోంది.
        
సెకండాఫ్ లో జైల్లో వేస్తున్నప్పుడు సోదా చేసి సెల్ ఫోన్లు సహా అన్ని వస్తువులూ తీసేసుకుంటారు. ఈ సెల్ ఫోన్ల దగ్గర -ప్రేమ కథ తెగిపోయిన ఈ గాథని పూర్తి స్థాయి ప్రేమ కథగా మార్చే లవ్ ట్రయాంగిల్ ఎలిమెంట్ వుంది. అదేమిటంటే- జైలు అధికారులు సెల్ ఫోన్లు చెక్ చేయకుండా వుండరు. అప్పుడా రాజు సెల్ లో సత్యతో ఫోటోలు, వీడియోలు చూస్తే? ఇదొక్కటి చాలు జైలు అధికారి ప్రేమ కథలో దుష్టపన్నాగం పన్నడానికి. ఇంతేకాదు, రాజు చేతికి సత్య దారం కట్టి వుంటే అది కూడా తీసేయమంటారు జైలు అధికారులు. రాజుకి సత్యతో రియల్ టెస్టు ఇక్కడే. అతను దారం తీయడు, జైలు నిబంధనల ప్రకారం దారం తీయకపోతే వాళ్ళూ ఊరుకోరు. ఈ దారం కథే ప్రేమ కథని లా క్కెళ్తుంది. ఇలాకాదనీ జైలు అధికారి సత్యనే మాయోపాయంతో వాఘా బోర్డర్ కి రప్పిస్తే...??
        జస్ట్ ఇదొక పిచ్చి వూహ. టేకిటీజీ, ఆల్ ది బెస్ట్.

—సికిందర్

 

Thursday, January 23, 2025

1365 : రివ్యూ!


  

దర్శకత్వం : ఎం.సి. జితిన్
తారాగణం : నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్, అఖిలా భార్గవన్, మెరీన్ ఫిలిప్, పూజా మోహన్రాజ్, మనోహన్ జాయ్, జననీ రామ్, సరస్వతీ మీనన్, హెజ్జా మెహెక్, దీపక్ పెరంబోల్, కొట్టాయం రమేష్, సిద్ధార్థ్ భరతన్ తదితరులు.
స్క్రీన్ ప్లే :  అతుల్ రామచంద్రన్, లిబిన్ టి.బి.
సంగీతం : క్రిస్టో జేవియర్, చాయాగ్రహణం : శరణ్ వేలాయుధన్ నాయర్, కూర్పు : చమన్ చాక్కో
బ్యానర్స్ : ఏవీఏ ప్రొడక్షన్స్, హేపీ అవర్స్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ఏవీ అనూప్,షైజూ ఖలీద్, సమీర్ తాహిర్
స్ట్రీమింగ్ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
***
      లయాళ దర్శకుడు ఎం. సి. జితిన్ 2018 లో నాన్సెన్స్ అనే నాన్సెన్సికల్ సినిమా తీసి మళ్ళీ అవకాశం కోసం ఆరేళ్ళూ నిరీక్షించి, 2024 లో సూక్ష్మదర్శిని తీసి వార్తల కెక్కాడు. సినిమా తీయగల క్రియేటివిటీ ఎవరి స్థాయిలో వాళ్ళకి అందరికీ వుంటుంది. క్రాఫ్ట్ ఎందరి కుంటుంది? క్రాఫ్ తో ఇంటలిజెంట్ రైటింగ్, ఇంటలిజెంట్ మేకింగ్ అన్నవి ఎందరికి తెలుసు? సినిమా తీస్తే ఎవరైనా కొత్తగా వచ్చే మేకర్లు అందులోంచి  నేర్చుకునేలా వుండాలా వద్దా? ప్రేక్షకులకి కొత్త అనుభూతినివ్వాలా వద్దా? మరెందుకు తీయడం? ఇలాటి ఆలోచనల్ని రేకెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళం నుంచి వచ్చి హిట్టయ్యింది. ఇది ఎన్ని విధాలా ప్రత్యేకమో చూస్తే, వచ్చీ రావడంతోనే డొనాల్డ్ ట్రంప్ వంద ఆర్డర్ల మీద సంతకాలు పెట్టేసి సంచలనం రేపినంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రతీ ఆర్డరు మీద ట్రంప్ సంతకంలాగే, ప్రతీ సీను మీదా బల్లగుద్ది దర్శకుడు పెట్టిన సంతకమే. సీన్లని ఆమోదిస్తూ చూసుకుంటూ పోవడమే.  పోతున్న కొద్దీ ఈ కింది కథ ద్వారా బయటపడే షాకింగ్ నిజాలెన్నో... బ్రేకింగ్ న్యూసు లెన్నో... ఈ సారి దర్శకుడి నాన్సెన్స్ మాత్రం కాకుండా!

కథ

    కేరళలోని ఓ పట్టణానికి దూరంగా సబర్బన్ ఏరియాలో ప్రియదర్శిని అలియాస్ ప్రియా (నజ్రియా నజీమ్) ఉద్యోగి అయిన భర్త ఆంథోనీ (దీపక్ పెరంబోల్) తో, కూతురు (హెజ్జా మెహక్) తో వుంటుంది. ఇంటి దగ్గర బోరు కొట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటుంది. పొరుగున స్టెఫీ (మెరీన్ ఫిలిప్) అనే ఫ్రెండ్ వుంటుంది. ప్రశాంత వాతావరణంలో జీవితం గడుస్తూంటుంది. ఇంతలో బేకరీ నడుపుతున్న మాన్యూయేల్ (బాసిల్ జోసెఫ్) అనే అతను తల్లి గ్రేస్ (మనోహరీ జాయ్ గ్రేసీ) తో వచ్చి ఎదురింట్లో దిగుతాడు. అతడి ప్రవర్తన విచిత్రంగా వుండడంతో ప్రియా కనిపెడుతూంటుంది. అతను ఉడుంని పట్టి తీసికెళ్ళి బీఫ్ అని చెప్పి ఫ్రెండ్స్ కి వండి పెడితే ప్రియాకి అతడి మీద అనుమానాలు పెరిగిపోతాయి. కిచెన్ లో కిటికీ లోంచి అతడింటి వైపు చూస్తూ అన్నీ కనిపెడుతూంటుంది.

మాన్యూయేల్ తల్లి గ్రేస్ ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడు చూసినా ఎటో చూస్తూ కూర్చుని వుంటుంది. ఒకరోజామె ఇంట్లో కనపడదు. ఎటెళ్ళిపోయిందో నని కంగారుపడి వెతికి తీసుకొస్తాడు మాన్యూయేల్. ఇతడి మామ రాయ్ (కొట్టాయం రమేష్), మరో బంధువు న్యూరో సర్జన్ డాక్టర్ జాన్‌ (సిద్ధార్థ్ భరతన్) ఇందుకు తోడ్పడతారు. ఆమెకి అల్జీమర్స్ (మతిమరుపు) వుందని నిర్ధారణ అవుతుంది. అయితే ఆమె తన రోజువారీ పనులు సమర్ధవంతంగా నిర్వర్తించడం, ఇరుగుపొరుగుతో కలిసి మెలసి వుండడం చూస్తూంటే, ఆమె అల్జీమర్స్ వ్యాధి పీడితురాలని నమ్మకం కలగదు ప్రియాకి. ఇంతలో మళ్ళీ కనిపించకుండా పోతుంది గ్రేస్.
        
ఇది తెలుసుకుని న్యూజీలాండ్ లో వుంటున్న మాన్యూయేల్ సోదరి డయానా (జననీ రామ్) వచ్చేస్తుంది. పోలీసు సెర్చింగ్ లో గ్రేస్ ఎక్కడా దొరకదు. తల్లి కనిపించడం లేదన్న ఆందోళన ఏ కోశానా లేని మాన్యూయేల్, డయానాల ప్రవర్తన ప్రియాకి మరిన్ని అనుమానాలని పెంచుతుంది. ఇంతలో వున్నట్టుండి డయానా తిరిగి న్యూజీలాండ్ కి బయల్దేరుతూంటే, ప్రియా తనని పరిచయం చేసుకుని డయానా ఫోన్ నంబర్ అడిగి తీసుకుంటుంది.
        
డయానా వెళ్ళిపోయాక పోలీసులకి గ్రేస్ దొరుకుతుంది. ప్రియా డయానాకి కాల్ చేస్తే అవుటాఫ్ రీచ్ మెసేజ్ మలయాళంలో విన్పించేసరికి ప్రియా ఆలోచనలో పడుతుంది. డయానా న్యూజీలాండ్ వెళ్ళిపోతే మెసేజ్ మలయాళంలో విన్పించడమేమిటి? మళ్ళీ తర్వాత ఎసెమ్మెస్ వస్తుంది. దీంతో డయానా సెల్ ఫోన్ డయానా దగ్గర లేదని, మాన్యూయేల్ దగ్గర వుందనీ, అతనే డయానాలాగా మెసేజులిస్తున్నాడనీ అర్ధమవుతుంది ప్రియాకి.
        
ఏమిటీ దీనర్ధం? డయానా ఏమైంది? డయానాలాగా మాన్యూయేల్ ఎందుకు నటిస్తున్నాడు? ఆసలతను ఏం చేయబోతున్నాడు? లేదా ఈ పాటికి చేసేశాడా? ఈ వేధించే అనుమానాలతో ప్రియా కనుక్కున్న అసలు నిజాలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

    ఆనర్ కిల్లింగ్స్ బయటి ప్రపంచంలో కత్తులు కటార్లతో, నడిబజార్లో బరితెగించి భీకరంగా జరుగుతూంటాయి. నార్త్ లో ఖాఫ్ పంచాయత్ లలో నైతే  తుపాకీ గుళ్ళతో ఠపీమని జరుగుతాయి. సినిమాలో గుట్టుగా, నీటుగా జరుగుతాయి. ఇదే షాకింగ్ గా వుంటుంది.  'మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్' లో లాంటి పెద్దావిడ (మిషెల్ ఫీఫర్)  మలయాళ సినిమాలోకి దిగి వస్తే?ఆనర్ కిల్లింగ్ ప్లానింగ్ ఎంత ఇంటలిజెంట్ గా, ఇంటలెక్చువల్ గా వుంటుంది?  దీనికి ఈ 'సూక్ష్మదర్శిని' యే సమాధానం.
       
ఈ కథకి ప్రధానంగా కావాల్సింది సస్పెన్స్ థ్రిల్లర్ వాతావరణం పెల్లుబికే మార్మికమైన లొకేషన్. ఈ మార్మికమైన లొకేషన్ బాగా కుదిరి కథకి డెప్త్ ని తీసుకు వచ్చింది. లొకేషన్ లో సింక్ అవని కథ పైపైనే చప్పగా వుండిపోతుంది. లొకేషనే కాదు
, కెమెరా, బీజీఎం, ఎడిటింగ్ మొదలైన సాంకేతికాలు కూడా పరస్పరం సింక్ అయి ఒక అత్యుత్తమ క్రాఫ్ట్ ని ప్రదర్శించాయి. చాలా సినిమాల్లో కనిపించనిది ఈ క్రాఫ్టే. పట్టణానికి దూరంగా వుండే సెమీ రూరల్ పరిసరాలు, అక్కడ తక్కువ జనాభాతో, దాదాపు నిర్మానుష్యంగా వుండే వీధులు, నిశ్శబ్దంగా వుండే ఇళ్ళూ... ఇళ్ళ మధ్య ఎత్తు తక్కువ గల కాంపౌండ్ గోడలు, ఇలా వొక సన్నిహిత సమాజాన్ని తెలియజేసే లొకేషన్.  
       
కాంట్రాస్ట్ గా ఈ సన్నిహిత సమాజంలో ఒక కుటుంబం చాప కింద నీరులా పారించే కుట్ర.
ఇది తెలుసుకోవాలన్న కుతూహలంతో కొన్ని సాహసాలు చేసే హీరోయిన్ పాత్ర ప్రియా. ప్రియమణి నటించిన భామాకలాపం అనే ఓటీటీ మూవీలో ఆమెది ఇతరుల ఇళ్ళల్లో, వ్యవహారాల్లో తలదూర్చి విషయాలు తెలుసుకోనిదే నిద్రపట్టని బలహీనత. ప్రియాది ఈ వోయూరిజం కాదు గానీ, ఎదురింట్లో దిగిన మాన్యూయేల్ వింత ప్రవర్తనే ఆమెని అతడింట్లోకి తొంగి చూసే అలవాటుని కల్పించింది. ఇందుకు కిచెన్ కిటికీలోంచి కనిపెడుతున్నా, ఈ కిటికీ లోంచి కనిపెట్టడమన్నది ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ రేర్ విండో మూవీని తలపించినా,రేర్ విండో లో లాగా ఆ కిటికీయే అన్ని విషయాలకీ సాక్ష్యం కాదు. అప్పుడప్పుడు ప్రియా మాన్యూయేల్ ఇంట్లోకి జొరబడి కూడా విషయాలు తెలుసుకుంటూ వుంటుంది. చాలా సూక్ష్మ విషయాలు కనిపెడుతూ వాటి అర్ధాలు తీస్తూంటుంది. అవసరమైతే యాక్షన్లోకి సైతం దిగి రహస్యాల్ని చేదించేందుకు సాహసాలు చేస్తూంటుంది.
        
మాన్యూయేల్ ఏం చేస్తూంటాడో దొరక్కుండా చేస్తూంటాడు. ఇదంతా ఎలుకా పిల్లి చెలగాటంలా వుంటుంది. సింబాలిక్ గా, ప్రారంభంలో ఏం చేస్తున్నాడా అని ఆమె చూస్తూంటే, పిల్లిలా వచ్చి అక్కడున్న  పిల్లిని ఫెడీమని కొట్టి వెళ్ళగొడతాడు. ఆ పిల్లి ప్రియా అయితే, ఎలుక తాను అన్నమాట.
       
సస్పెన్స్ థ్రిల్లర్ల ఇంకా వదలని జాడ్యమేమిటంటే
, ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యకి వివిధ అనుమానితుల్ని చూపిస్తూ, ఎవరు హంతకుడనేది హీరో లేదా హీరోయిన్ తేల్చే ఎండ్ సస్పెన్స్  మూసలో పడే, కాలం చెల్లిన, ఫ్లాపు గ్యారంటీ కథలు. ఈ కథ ఇలా కాదు.
మాన్యూయేల్ అతడి బంధువులూ ఏదో ప్లాను మాట్లాడుకుంటూ వుంటారు. ఆ ప్లాను ప్రకారం ఏం చేస్తూంటారో మాత్రం  చూపించరు. ప్రేక్షకుల్లాగే ఏం చేస్తున్నారో తెలుసుకునే కుతూహలంతో ప్రియా ప్రవర్తన. అసలేం జరుగుతోందీ తెలుసుకోవాలన్న కుతూహలమే సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూంటుంది. అంటే నేరమే జరగినట్టు లేదు  కాబట్టి ఆ నేరం తాలూకు చివర్లో రివీల్ చేసే రొటీన్ ఎండ్ సస్పెన్స్ కథని ఏ మాత్రం ఫీల్ కాం.
       
కేవలం అసలేం జరుగుతోందీ
, ఎందుకు జరుగుతోందీ  కుతూహలం రేకెత్తించే సీన్ టు సీన్ సస్పెన్స్ మాత్రమే విజయవంతంగా ప్లే అయిందిక్కడ. చివరికి షాకింగ్ గా కుట్రదారులూ, వాళ్ళు తెలివిగా చేసిన అనర్ కిల్లింగ్ తాలూకు హత్యా షాకింగ్ గా బయటపడి పోతాయి. అంటే ఫ్లాపయ్యే ఎండ్ సస్పెన్స్ కథలకి విరుగుడు అన్న మాట ఈ సీన్ టు సీన్ సస్పెన్స్ కథనం. ఈ విధానం హాలీవుడ్ లో 1958 లోనే ప్రారంభమయ్యింది. కానీ మన సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎండ్ సస్పెన్స్ కథలేనన్న సుడిగుండంలోనే వుంటున్నాయింకా.
       
ఈ అనర్ కిల్లింగ్ కథలో హింస కూడా కనపడదు.
గ్రాఫిక్ హింస లేదా రక్తపాతం మీద ఆధారపడకుండా సస్పెన్స్ ని, ఎమోషనల్ టెన్షన్ నీ ప్రధానాంశంగా చేసుకుని తెరకెక్కించారీ కథ. క్రూరత్వం కంటే. మాన్యుయేల్ వింత ప్రవర్తన ద్వారా, అతడి మైండ్ గేముల ద్వారా ప్రేక్షకులు  టెన్షన్ నీ, భయాన్నీ అనుభవించాలన్న ప్రణాళికతో చేసిన మైక్రో లెవెల్ మేకింగ్ ఇది. మైక్రో లెవెల్ మేకింగ్ ఎప్పుడూ హిట్టే.

దర్శకుడు జితిన్, రచయితలు అతుల్ రామచంద్రన్, లిబిన్ లు  సస్పెన్స్ థ్రిల్లర్ లంటే లో- బడ్జెట్ చవకబారు సినిమాలు కాదనీ, ఉత్తమ చిత్రాల ప్రమాణాలతో 14 కోట్లు వెచ్చించి, 50 కోట్లు ఆర్జించే కళా రూపాలుగానూ తీర్చి దిద్దవచ్చనీ దీంతో నిరూపించారు. 

నటనలు- సాంకేతికాలు

    ప్రియదర్శిని పాత్రలో నజ్రియాకి పూర్తి  క్రెడిట్ ఇవ్వాలి. ఆమెది పొరలు పొరలుగా బయల్పడే క్యారెక్టర్. సగటు యువతి జిజ్ఞాస, నిజాన్ని వెలికి తీయాలన్న ప్రబల కాంక్ష ఆమె పాత్రకి చోదక శక్తులు. ఇలాటి పాత్రని అర్ధం జేసుకుని, అందులో ఒదిగి కనబర్చిన నటనకి ఆమెకి టాప్ మార్కులు పడతాయి. మాన్యూయేల్ గా నటించిన బాసిల్ విషయానికొస్తే, హాస్య పాత్రలేస్తూ వుండిన ఇతను సీరియస్ కిల్లర్ పాత్ర నీటుగా నటించి ప్రధానాకర్షణగా నిలబడ్డాడు. ఇతడి తల్లిగా నటించిన మనోహరీ జాయ్ గ్రేసీ పాత్రకున్న షేడ్స్ తో గుబులు పుట్టిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అఖిలా భార్గవన్, మెరీన్ ఫిలిప్, పూజా మోహన్రాజ్, మనోహన్ జాయ్, జననీ రామ్, సరస్వతీ మీనన్, హెజ్జా మెహెక్ లు నటించిన ఆడ పాత్రలే ఎక్కువ. ఒక విధంగా ఇది లేడీస్ స్పెషల్ థ్రిల్లర్. ఈ యూఎస్పీతో మన దేశంలో ఇంకే సినిమా రాలేదు.

పాటలు లేని ఈ సినిమాకి  క్రిస్టో జేవియర్ బిజీఎం బలం చెప్పుకోదగ్గది. అలాగే తక్కువ లైటింగ్ తో శరణ్ వేలాయుధన్ నాయర్ ఛాయాగ్రహణం, కథని చెక్కడంలో (క్రాఫ్ట్) పూర్తిగా తోడ్పడిన చమన్ చాక్కో కూర్పు, ఇతర ప్రొడక్షన్ విలువలూ మూవీని ఎన్ని సార్లైనా చూసేలా పనితనం చూపించాయి.

—సికిందర్