ఈ మొత్తం కథకి బిగినింగ్ విభాగం ముగిసి, ప్లాట్ పాయింట్ 1 ఎప్పుడో ఇంటర్వెల్లో గంటా 20 నిమిషాలకి గానీ తీరిగ్గా రాదు. షార్ట్స్ ని/ రీల్స్ ని స్క్రోలింగ్ చేసే నేటి మైక్రో కంటెంట్ ప్రపంచంలో ఇంత తీరిక ఎవరికుంది? మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రీన్ ప్లే రాశారా? కథ కోసం ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టాలా? ప్లాట్ పాయింట్ 1 ఇంటర్వెల్ వరకూ రాక పోవడంతో ఫస్టాఫ్ అంతా విషయం లేనట్టుగా తయారైంది. ఇలా ఫస్టాఫ్ లో చూపించిందంతా కథే అవుతుందా, లేక ప్లాట్ పాయింట్ 1 దగ్గర (ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర) ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతమవుతుందా అన్నది ఆలోచించాలి. ఇలా కథ చెప్పడానికి ఫస్టాఫ్ అంతా ఉపోద్ఘాతమే (బిగినింగ్) సాగదీస్తే ఎంత బడ్జెట్ దుబారా అవుతుంది? స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ స్ట్రక్చర్ కి లోబడి లేకపోవడంతో అసలుకే ఎసరొచ్చింది. కథని ఎంత క్రియేటివ్ గా ఆలోచించినా అది స్ట్రక్చర్లో లేకపోతే 300 కోట్ల రూపాయల ‘కంగువా’ కూడా బాక్సాఫీసులో కంగు తినాల్సిందే!
ఇక్కడొక ప్రశ్న వస్తుంది. కథ ప్రకారం అతను ఆర్ధికంగా స్ట్రగుల్ చేస్తున్న మెకానిక్ అయివుండాలి. అప్పుడే ఆ గ్యారేజీ వున్న ల్యాండ్ ని కబ్జా చేస్తున్న శక్తులతో పోరాడలేక డబ్బు చెల్లించేందుకు సిద్ధపడగలడు. అప్పుడు దీన్ని మిలియనీర్ మెకానిక్ సెటప్ కి మార్చేస్తే, మార్కెట్ లో టాప్ పొజిషన్లో వున్న ఈ గ్యారేజీని టేకోవర్ చేయాలని చూస్తున్న ఇంకో కంపెనీ కుట్రగా వుండొచ్చు. ఐటీ, ఈడీ దాడుల ద్వారా అతడ్ని బెదిరించి టేకోవర్ చేసుకునే కుట్ర. దీంతో ల్యాండ్ కబ్జా అనే పాత వాసన, టెంప్లెట్ కథనం వదిలిపోతుంది. పాత వాసనతో, టెంప్లెట్ తో కథనంలో థ్రిల్లేమీ వుండదు!
3.
మాస్ ఉపోద్ఘాతం ఇలా!
ఇంత ట్రాజడీతో వున్న ప్రియా ఓ బిల్డర్ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ తల్లిని, చెల్లెల్నీ పోషించుకుంటూ, డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆ గ్యారేజీ రాకీదని తెలియక వస్తే, రాకీకి మళ్ళీ ఈమెతో లైను కలిసింది. అయితే రాకీ దీనికి ముందే మాయా (శ్రద్ధా శ్రీనాథ్) అనే ఇన్సూరెన్స్ ఏజెంటుకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు.
ఇలావుంటే మరోవైపు, రంకిరెడ్డి (సునీల్) అనే గ్యాంగ్ స్టర్, రాకీ గ్యారేజీ వున్న స్థలం మీద కన్నేసి వేధిస్తున్నాడు. రాకీ తండ్రి రామకృష్ణకి తీర్ధయాత్రలకి వెళ్ళాలని కోరిక వుంది. ఈ కోరిక తీర్చేస్తూ తీర్ధయాత్ర ప్లాన్ చేశాడు రాకీ. అయితే రామకృష్ణ ఇక్కడే చనిపోయాడు. ఈ విషయం మాయాకి చెప్పాడు రాకీ. రంకి రెడ్డికి కట్టాల్సిన 50 లక్షల గురించి కూడా చెప్పా డు. మాయా ఇన్సూరెన్స్ పాలసీలు చెక్ చేసి, రాకీ తండ్రికి రెండు కోట్ల మేరకు పాలసీ వున్న సంగతి చెప్పింది. రాకీకి ఆశ్చర్యమేసింది. అయితే నామినీగా తన పేరుగాక రాజేష్ అనే వేరే పేరుందని ఆమె చెప్పేసరికి షాకయ్యాడు...
ఇక దీని తర్వాత వచ్చే రెండో సీను డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయా రాకీ గ్యారేజీకి వచ్చే సీను. ఈ సీను కూడా ఓ మంచి క్రియేషనే. ఎందుకంటే ఈ సీనులో నాలుగు విషయాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి- 1. మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం వెనుక ఆమె పన్నిన ఒక కుట్ర వుంది. ఇది సెకండాఫ్ లో రివీలవుతుంది, 2. అప్పుడే గ్యారేజీకి ఒకతను వచ్చి గ్యారేజీ మూసేస్తారటగా అంటాడు. శుభమా అని గ్యారేజీ సీనుతో ప్రారంభిస్తూ అప్పుడే గ్యారేజీ మూసేసే మాటేమిటి? ఆలోచింపజేసే సీను. ఈ మాట అప్పటికే రంకిరెడ్డితో నలుగుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకుని అన్నది. ఇది కూడా తర్వాత రివీలవుతుంది. అయితే ఈ మాట అనడంతో ఈ గ్యారేజీకి ఏదో ప్రాబ్లం వుందని ప్రేక్షకులకి ఆసక్తి పుడుతుంది,
అసలు మాయా ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం ఆమె పన్నిన కుట్రలో భాగంగానే జరిగినప్పటికీ, అసలామెని ఇక్కడికి తన స్కెచ్ ప్రకారమే వచ్చేటట్టు చేశాడు రాకీ. అంటే రాకీని ట్రాప్ చేసే పనిపెట్టుకుని వచ్చిన మాయాకి, రాకీ వేసిన స్కెచ్ ప్రకారమే వచ్చి తనే ఇరుక్కుందని తెలీదన్న మాట1
మరొకటేమిటంటే, మొదటి సీనులో చూపించిన ఆత్మహత్యకి కారకురాలు ఈ మాయే. ఇది కూడా సెకెండాఫ్ లో బయటపడుతుంది. అంటే మాయా ఆల్రెడీ ఒక బకరాని బలితీసుకుని, రెండో బకరాగా బలి చేద్దామని రాకీ దగ్గరికి వచ్చిందన్న మాట. ఒక దాని తర్వాత ఒకటి ఆమెకి కనెక్ట్ అవుతున్న ఈ రెండు సీన్లూ కథనానికి మంచి డైనమిక్స్ ని క్రియేట్ చేశాయి. ఇలా సెకండాఫ్ లో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పనికొచ్చే ఈ ఇద్దరి గేములూ నిగూఢంగా ఇలా ఈ రెండు సీన్లలో ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. ఇందుకే ఇది మంచి క్రియేషన్ అన్నాం.
‘మాది రాయలసీమ, మా తాత కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు...’ అంటూ చెప్పుకొస్తాడు. ఆ తాత కామెడీగా ఫ్యాక్షన్ దాడిలో గాయపడి హైదరాబాద్ వచ్చేయడం, ఇక్కడ గ్యారేజీ తెరిచి బ్రతికెయ్యడం, చనిపోతూ కొడుకు రామకృష్ణకి గ్యారేజీ అప్పగించడం పూర్తయ్యాక, రామకృష్ణకి రాకీ పుట్టడం దగ్గర్నుంచీ చిన్నప్పటి విశేషాలూ మొదలుకొని కాలేజీ చదువు వరకూ చెప్పుకుంటూ వస్తాడు. ఈ కాలేజీలోనే ప్రియాతో ప్రేమ, ఆమె అన్నతో బాండింగ్ వుంటాయి. ఈ అన్న శేఖర్ తో రాకీ స్నేహం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది.
అంటే ఇక్కడ రాకీ ఆమెకి ఏ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలో అది చెప్పకుండా తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడంటే, ఇవి అతను చెప్తున్న ఫ్లాష్ బ్యాక్స్ కావు. తన స్కెచ్ లో భాగంగా ఆమెకి చెప్పేది వుంటే రంకిరెడ్డి ఎపిసోడ్ మాత్రమే చెప్పేవాడు రాకీ. కానీ తన పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పుకొస్తున్నాడు. అంటే కథకుడు జోక్యం చేసుకుని, రాకీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం ప్రేక్షకుల కవసరమని ఇలా రాకీ చేత ప్రేక్షకులకి చెప్పిస్తున్నాడు, మాయాకి కాదు. పాత్రల మధ్య కథకుడు జోక్యం చేసుకుంటే ఇంతే- కథ చెడిపోవడమే! ఇందుకే గంట పాటు ఆమెకి అవసరం లేని ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించాడు రాకీ చేత. ఇదెంత రాంగ్ కథనం! దీని వల్ల ఎంత బడ్జెట్ వృధా అయింది?
6.
ఇంకా పెద్ద డ్యామేజీ!
ఇంతవరకూ రాకీ ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాక- ప్రియా ఏమైందని మాయా అడుగుతుంది. ఇక్కడే రాకీచేత మహా తప్పులో కాలేయిస్తాడు కథకుడు! ఈ ఫ్లాష్ బ్యాక్స్ ప్రేక్షకులకి చెప్పాలన్న అత్యుత్సాహంతో మళ్ళీ పాత్రల మధ్య జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నాడు కథకుడు! ప్రియా గురించి కూడా ఫ్లాష్ బ్యాక్స్ చెప్పించేశాడు కథకుడు!!
ప్రియా జీవితం, కుటుంబం, బిల్డర్ దగ్గర ఆమె జాబ్ చేయడం జరిగి డ్రైవింగ్ నేర్చుకోవడానికి తన గ్యారేజీకే రావడంతో తిరిగి కనెక్ట్ అయినట్టు, ప్రేమ కుదిరినట్టు, ఓ డ్యూయెట్ కూడా వేసుకున్నట్టూ చెప్పించేశాడు!
ఈ ఉపోద్ఘాతంలో ప్రియా గురించి రాకీ మాయాకి ఇలా చెప్పేస్తూంటే కథ వుండాలా, కర్సై పోవాలా? ప్రియా తండ్రి మరణించాక, ఆమె అన్న శేఖర్ తో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేసి అతడి ఆత్మహత్యకి కారకురాలైన మాయకే ఇది చెప్పేస్తాడా?
కథకుడి అత్యుత్సాహం ఇక్కడితో ఆగలేదు- ఒక రోజు ప్రియా అన్న గురించి అడగాలని ఆమె ఇంటికెళ్ళాడు రాకీ. ఆమె లేదు. ఆమె చెల్లెల్ని అడిగితే ఆమె ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళింది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించాడు. అన్న శేఖర్ కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో, ప్రియా చిన్న ఉద్యోగంలో జాయినైంది. పని చేయకుండా తిరుగుతున్న శేఖర్ ఆమె డబ్బులు దొంగిలించాడు. తర్వాత నగలు దొంగిలించాడు. ఆమె నిలదీసి కొట్టేందుకు చెయ్యెత్తితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఈ సినిమాకి హుక్ గా వాడుకున్న ఓపెనింగ్ సీను.
ఇలా శేఖర్ చావుకి కారకురాలై, ఇంకో ఎజెండాతో రాకీని ట్రాప్ చేయడానికి వచ్చిన తన ప్రత్యర్ధి- కిల్లర్ మాయకే శేఖర్ ఆత్మహత్యగురించి చెప్పేశాడు రాకీ! ప్రేక్షకులకి కథ తెలియాలని మధ్యలో జోక్యం చేసుకుని కథని పూర్తిగా డ్యామేజీ చేసేసిన కథకుడి అత్యుత్సాహం ఈ నిర్వాకంతో గానీ తీరలేదు!
ఫ్లాష్ బ్యాక్ కొనసాగిస్తూ, తండ్రిని తీర్ధయాత్రలకి పంపినట్టు కూడా చెప్పిన రాకీ, ఫ్లాష్ బ్యాక్స్ ముగించి - ఆ తండ్రి చనిపోయాడని చెప్తాడు. ఇలా ఉపోద్ఘాతం పూర్తవుతుంది.
ఇప్పుడు ప్రెజెంట్ లో కొస్తే, ఇది స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమే. ఇప్పుడు రాకీ తండ్రి చనిపోయాడని తెలుసుకున్న మాయా ఎలర్ట్ అవుతుంది. ఆమెకి కావాల్సిందిదే. అతడితో ఇన్సూరెన్స్ గేమ్ ఆడుకోవడానికి. ఇలా ఆమెని తన ట్రాప్ లో బిగించాడు రాకీ.
ఇప్పుడు గ్యారేజీ గొడవలు పెరిగిపోయి రంకిరెడ్డికి 50 లక్షలిస్తానని రాకీ చెప్పడంతో, ఆ 50 లక్షలు ఎక్కడ్నించి తెస్తాడో తెలియని రాకీకి- తండ్రి చేసిన రెండు కోట్ల పాలసీ గురించి చెప్తుంది మాయ. కానీ నామినీగా రాకీ పేరు గాక ఎవరో రాజేష్ అని వుందని చెప్తుంది మాయా. దీంతో గంటా 20 నిమిషాల ఫస్టాఫ్ ముగిసి ఇంటర్వెల్ పడుతుంది.
ముందుగా బిగినింగ్ లో, ఓపెనింగ్ ఆత్మహత్య సీను అలాగే వుంటుంది. తర్వాత గ్యారేజీలో మాయా ఎంట్రీ సీను, కంటెంట్ అలాగే వుంటాయి. తర్వాత మారుతుంది- మాయాకి డ్రైవింగ్ నేర్పుతూ, బ్యాంకు పని గురించి ఆమె అడిగితే, రంకిరెడ్డితో గొడవ గురించి మాత్రమే చెప్తాడు. ఆ పూట ఆమెకి నేర్పడం ముగిస్తాడు. డైనమిక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రియా పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో వుంటాడు. డ్రైవింగ్ నేర్పుతూ వుంటాడు. ఇక గ్యారేజీలో తండ్రి రామకృష్ణ పరిచయమవుతాడు. రాకీ ఎలా మెకానిక్ అయ్యాడో క్లుప్తంగా సంభాషణ. రంకిరెడ్డితో గొడవ గురించి సీన్లు. రాకీ డ్రైవింగ్ నేర్పుతూ మాయాతో కూడా రోమాన్స్ ప్రారంభిస్తాడు. దీంతో ప్రియాతో గొడవ. ఈ గొడవ, రంకిరెడ్డితో గొడవ ముదిరి పోతాయి- ఇంతలో రాకీ తండ్రి చనిపోతాడు. ఇప్పుడు గ్యారేజీని కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితిలో రంకిరెడ్డికి 50 లక్షలు కట్టాల్సి వచ్చేసరికి- ప్రేమలో పై చేయి కోసం - రాకీ కి హెల్ప్ చేస్తూ అతడి తండ్రి తీసుకున్న రెండు కోట్ల పాలసీ విషయం బయట పెడుతుంది మాయా. అయితే నామినీగా అతడి పేరు లేదంటుంది. దీంతో ఓ 30 నిమిషాల్లో బిగినింగ్ విభాగం (యాక్ట్ 1) ముగుస్తూ ప్లాట్ పాయింట్ 1 వస్తుందన్న మాట.
పైన బిగినింగ్ విభాగం బిజినెస్ నియమాల ప్రకారం చూస్తే -1. కథా నేపథ్యం ఏర్పాటు - ఇది సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యపు కథ అని తెలుస్తూనే వుంది, 2. పాత్రల పరిచయం- ముఖ్య పాత్రలు రాకీ, అతడి తండ్రి, ప్రియా, మాయా, రంకిరెడ్డి పాత్రలు పరిచయమయ్యాయి, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన- గ్యారేజీ స్థలం కోసం రంకిరెడ్డితో గొడవలు, రాకీ తండ్రి మరణం, 4. సమస్య ఏర్పాటు - గొడవలు పరాకాష్టకి కి చేరి 50 లక్షలు కట్టాల్సి వస్తే, రెండు కోట్ల పాలసీ బయటపెట్టి మాయా హెల్ప్ చేయడం. కానీ అందులో నామినీ రాకీ కాకపోవడం.
ప్లాట్
పాయింట్ 1 దగ్గర పై సమస్యా ఏర్పాటులో ఆటోమేటిగ్గా రాకీకి గోల్ ఏర్పాటయ్యింది.
ఎలాగైనా ఈ రెండు కోట్ల పాలసీ మొత్తాన్ని సాధించి, రంకిరెడ్డి పీడా
విరగడ చేసుకునే గోల్. ఇలా ఇక్కడే ఫస్టాఫ్ అరగంటలో బిగినింగ్ విభాగం ముగిసిపోయి, ప్రేక్షకులు ఎదురు చూసే కథ ప్రారంభమై పోయిందన్న మాట.
అతను వెళ్ళిపోయాక, మాయా- హర్షవర్ధన్-రోడీస్ రఘూ ముగ్గురూ ఇన్సూరెన్స్ స్కామ్ ముఠా అని రివీలవుతుంది. ఇదీ ఇంటర్వెల్. అంటే సినిమాలో సెకండాఫ్ లో 20 నిమిషాలకి వచ్చే ఈ ట్విస్టు వెనక్కి జరిపి ఇంటర్వెల్లో ఇచ్చామన్న మాట.
ఇప్పుడు
రాకీ ప్రేమిస్తున్న మాయా ఒక మాయలాడి అని ప్రేక్షకులకి తెలిసింది,
రాకీకి తెలీదు. రాకీ ఎప్పుడు తెలుసుకుంటాడా అన్న ఉత్కంఠ ఏర్పడుతోంది. ఇంకా పై
కథనంలో ప్రియా, మాయాలతో రోమాంటిక్ టెన్షన్ కూడా రాకీకి
పెంచితే అతడికి రోమాన్స్ తో ఎమోషనల్ స్ట్రగుల్, పాలసీ
డబ్బులతో ఫిజికల్ స్ట్రగుల్ కూడా ఏర్పడి పాత్రకి ఒక సమగ్రత వస్తుంది.
ఈ మాంటేజెస్ తర్వాత కథలోకి వస్తే, సినిమాలో వున్నట్టుగానే రోడీస్ రఘు డబ్బు కోసం వొత్తిడి పెంచడం, ఈ నకిలీ ఇన్స్ పెక్టర్ని ఇంకో ఇన్స్ పెక్టర్ అనుమానించడం జరిగి, ఎందుకైనా మంచిది మ్యాటర్ క్లోజ్ చేద్దామని దుష్టత్రయం అనుకోవడం జరుగుతాయి. దీనికి రాకీ ప్రియాని పూర్తిగా మర్చిపోయి, మాయాకి కమిటై పోవడమనే రోమాంటిక్ స్టోరీ ని కలపవచ్చు.
ఇప్పుడు సినిమాలో ఉన్నట్టుగానే తీర్ధ యాత్రలకెళ్ళి చచ్చిపోయాడనుకున్న రాకీ తండ్రి బ్రతికి రావడమనే ట్విస్టు వుంటుంది. పాలసీ డబ్బుల కోసం తనని చంపేసిన రాకీ మీద అతను ఫైర్ అవడం, ఒక స్కెచ్ కోసమే ఇదంతా చేశానని రాకీ చెప్పడం వగైరా డ్రామా అంతా సినిమాలో ఉన్నట్టుగానే వుంటుంది. ఏమిటా స్కెచ్ అంటే, సినిమాలో వున్నట్టుగానే రాకీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం-
ఇందులో తన ప్రాణమిత్రుడు శేఖర్ ని మాయా ఎలా ట్రాప్ చేసిందీ వుంది. శేఖర్ తండ్రి చనిపోయాక కుటుంబాన్ని పట్టించుకోకుండా శేఖర్ తిరుగుతూంటే, ప్రియా ఉద్యోగం చేయడం, తండ్రి చనిపోయిన శేఖర్ ని ఇన్సూరెన్స్ పేరుతో మాయా ట్రాప్ చేయడం, తండ్రి తీసుకున్న పాలసీలో నామినీగా అతడి తల్లి బదులు వేరొక ఆవిడ పేరుందని చెప్పడం, పేరు మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడం, శేఖర్ ప్రియా దాచుకున్న డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వడం, ఇప్పుడు ఇన్స్ పెక్టర్ గా రోడీస్ రఘు ఎంట్రీ ఇచ్చి ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేస్తున్నందుకు బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం,శేఖర్ ప్రియా నగలు కూడా పట్టుకెళ్ళి ఇవ్వడం, నగల గురించి ప్రియా మందలించేసరికి శేఖర్ ఆత్మ హత్య చేసుకోవడం వగైరా వున్నాయి.
ఇలా ఇప్పుడు ఓపెనింగ్ హుక్ సీనుకి అర్ధం తెలిసింది. అంటే మాయా గురించి రాకీకి ఎప్పుడో తెలుసనీ, వాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం కోసమే స్కెచ్ వేసి మాయాని తన మీదికి తనే ప్రయోగించుకున్నాడనీ, ఇంటర్వెల్లో చెప్పిన అర్ధానికి వ్యతిరేకంగా రాకీ ఇలా అన్నీ ముందే తెలిసిన వాడిలా రివీలై ఇంకో ట్విస్ట్ ఇస్తే క్యారక్టర్ ఎలివేట్ అవుతుంది.
అంటే బిగినింగ్ ప్లాట్ పాయింట్ -1 లో అతడికేర్పడిన గోల్ నిజమైన గోల్ కాదన్న మాట. అదసలు నిజమైన కథ కూడా కాదన్న మాట. అదంతా - ఇంకా ఇంటర్వెల్ వరకూ కూడా- మాయాని ట్రాప్ చేయడం కోసం అతను అల్లిన కల్పిత కథే అన్న మాట. గ్రేట్ క్యారక్టర్! అసలు నిజ కథ శేఖర్ గురించిన ఈ ఫ్లాష్ బ్యాక్ తోనే. ప్రాణమిత్రుడు శేఖర్ ఆత్మహత్యకి కారణమైన మాయాని పట్టుకోవడమే అసలు గోల్! మాయాతో ప్రేమ కూడా నిజం కాదు. ఆమెని నమ్మించే ఎత్తుగడలో భాగమే అది.
సినిమా కథ రాయడం చాలా సులభం. ఎందుకింత గందరగోళం చేసుకుంటారో గానీ, సినిమా కథ స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్. అందుకనే ఈజీ. ఇది గుర్తిస్తే ‘మెకానిక్ రాకీ’ లాంటి ఆశాభంగాలు కలగవు. ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో ఎవరికైనా సందేహాలుంటే, లేదా సూచనలు చేయదలిస్తే, ఈ క్రింద కామెంట్ బాక్స్ వుంది, వినియోగించుకోగలరు.
—సికిందర్