రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts sorted by date for query పుష్ప. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query పుష్ప. Sort by relevance Show all posts

Saturday, June 15, 2024

1439 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
తారాగణం : సుధీర్ బాబు
, మాళవికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడ తదితరులు
సంగీతం :
చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : అరవింద్ విశ్వనాథన్  
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత:
 సుమంత్ జి నాయుడు
విడుదల :
 జూన్ 14, 202

***

        వ దళపతి (టైటిల్స్ లో ఇలాగే వేశారు) సుధీర్ బాబు ఒక పూర్తి స్థాయి మాస్ యాక్షన్ కి దిగాడు. చాలా ఇంటర్వ్యూలిచ్చి, ప్రమోట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం బాధ్యత తీసుకున్నాడు. అయితే వరస పరాజయాలతో సతమతమవుతున్న సుధీర్ బాబుకి ఈ కొత్త నేపథ్యపు మాస్ యాక్షన్ ప్రేక్షకుల్లోకి ఎంతవరకు వెళ్తుంది? ఈ సారైనా పాస్ మార్కులు పడతాయా? ఇందులో ప్లస్ మైనస్ లేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

చిత్తూరు జిల్లా  కుప్పంలో తిమ్మారెడ్డి(లక్కీ లక్ష్మణ్ ), అతడి తమ్ముడు బసవ (రవి కాలే), కుమారుడు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) అరాచకాలు చేస్తూంటారు. ప్రజల భూములు లాక్కుని చంపడం కూడా చేస్తూంటారు. ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ లాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరతాడు. ఈ కాలేజీలోనే టీచర్ (మాళవికా శర్మ) ని ప్రేమిస్తాడు. ఇక్కడే సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ పళని స్వామి (సునీల్) తో స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవపడి కొట్టడంతో సస్పెండ్ అవుతాడు సుబ్రహ్మణ్యం. ఉద్యోగం పోయి, ఇంటిదగ్గర తండ్రి (జయప్రకాష్) చేసిన అప్పులు మీద పడి ఏం చేయాలా అని ఆలోచిస్తూంటే, పళని స్వామి దగ్గర ఒక పిస్తోలు కనిపిస్తుంది. దాని డిజైన్ కూడా చూపిస్తాడు పళని స్వామి. ఇక వాటి సాయంతో సుబ్రహ్మణ్యం డబ్బు సంపాదనకి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం మొదలెడతాడు. వాటిని శరత్ రెడ్డికే అమ్ముతాడు. దీంతో అటు తమిళనాడు నుంచి గన్స్ సప్లై చేసే రాజ మాణిక్యంతో  గొడవలొస్తాయి. ఈ గొడవల్లో సుబ్రహ్మణ్యం తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రహ్మణ్యం కొట్టడంతో అతను కోమాలోకి పోతాడు. దీంతో తిమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం మీద పగబడతాడు.
       
ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఏం చేశాడు
? తిమ్మారెడ్డినీ, అతడి తమ్ముడ్నీ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రజలంతా సుబ్రహ్మణ్యంని దేవుడుగా ఎందుకు కొలిచారు? ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వూళ్ళో  అరాచక శక్తుల్ని అణిచే, ప్రజలంతా ఆ అరాచక శక్తుల్ని అణిచిన కథానాయకుడ్ని కొలిచే, వందల సార్లు వచ్చిన రొటీన్ కథకి గన్ కల్చర్ /స్మగ్లింగ్ ని జోడించి కొత్త కథగా తయారు చేశారు. ఈ అరాచక శక్తుల పాత్రల్ని కేజీఎఫ్ సినిమాల్లోంచి దిగుమతి చేసుకున్నారు. గన్ కల్చర్ నార్త్ ఇండియాకి చెందినదైనా, దీన్ని తెలుగు నేటివిటీలోకి  తీసుకురావడానికి కేజీఎఫ్, పుష్ప  సినిమాల ఛాయల్ని అద్దారు. ఫలితంగా ఇది ఈ మధ్య వచ్చి ఫ్లాపయిన రూరల్ యాక్షన్ సినిమాలకి భిన్నంగా తయారయ్యింది. రెండున్నర గంటలు సాగినా బోరుకొట్టకుండా పకడ్బందీ చిత్రీకరణతో రూపొందింది. బలమైన సన్నివేశాలు, డైలాగులూ ఆద్యంతం కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అయితే కరువయ్యిందేమిటంటే ఆ సన్నివేశాల్లో భావోద్వేగాలు. డ్రామాలో భావోద్వేగాలు, యాక్షన్ లో భావోద్వేగాలూ లోపించాయి. అలాగే సస్పెన్స్, టెన్షన్, థ్రిల్స్, కథలో మలుపులూ లేక- కేవలం ఒక నాన్ స్టాప్ యాక్షన్ సినిమాగా తయారయ్యింది. ఒక రొటీన్ ప్రతీకార కథకి గన్ కల్చర్, కేజీఎఫ్, పుష్పల హంగులు కూర్చి, భావోద్వేగాల పరమైన లోపాల్ని కవర్ చేస్తూ, అనుభవజ్ఞుడిలా తీర్చిదిద్దాడు దర్శకుడు.
       
ఫస్టాఫ్ పూర్తిగా కథని సెటప్ చేయడంతో సరిపోతుంది. పోలీస్ స్టేషన్లో సునీల్ పాత్ర చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. వూళ్ళో అరాచకాలు
, ఆ అరాచకాల మధ్య సుధీర్ బాబు పాత్ర దిగడం, పాలి టెక్నిక్ లాబ్ లో పనిచేస్తూ టీచర్ ని ప్రేమించడం, ఒకడ్ని కొట్టడం, దాంతో ఉద్యోగం పోవడం, ఇంటికెళ్ళి  పోయి అప్పులపాయిన తండ్రిని ఓదార్చి తిరిగి రావడం,  సునీల్ పాత్ర దగ్గర పిస్తోలు చూసి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం వగైరా జరుగుతూ, అరాచక శక్తులతో గన్ బిజినెస్, దీంతో తమిళనాడు గన్ స్మగ్లర్ తో గొడవలు, తండ్రి మీద హత్యా ప్రయత్నం, ఆ తర్వాత విలన్ తమ్ముడ్ని కొట్టి కోమాలోకి పంపడం - ఇదంతా ఫస్టాఫ్ కథ.
       
ఈ ఫస్టాఫ్ కథలో లోపాలేమిటంటే
, గన్స్ తయారు చేసి వూళ్ళో అరాచక శక్తులకే అమ్మడం, దాంతో ఇంకింత రెచ్చిపోయి ఆ అరాచక శక్తులు అక్కడి జనాల్నే  కాల్చి చంపడం. ఇది సుధీర్ బాబు పాత్రని దెబ్బతీసే కథనం. అప్పుడైనా తప్పు తెలుసుకుని,  గన్స్ తయారీ ఆపేసి, అరాచక శక్తుల మీద పోరాటం ప్రకటించడు. డబ్బు కోసం ఇంకా భారీ యెత్తున గన్స్ తయారు చేసి ఇతరప్రాంతాలకి స్మగ్లింగ్ చేస్తూంటాడు. ఇక తమిళనాడు గన్ స్మగ్లర్ వచ్చి గొడవ పడడం దేనికో అర్ధం కాదు. సుధీర్ బాబు పాత్ర వూళ్ళోకి రాకముందు ఈ గన్ స్మగ్లర్ అరాచక శక్తులకి గన్స్ అమ్మకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడెందుకొచ్చి గొడవ పడుతున్నాడు?
        
ఇక సెకండాఫ్ పూర్తిగా పగబట్టిన విలన్ కథ. ఈ కథలో సుధీర్ బాబు వూరికి విలన్ పీడా తొలగించి దేవుడవుతాడు. పాత కథే కాబట్టి సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసిపోయే కథ. కాకపోతే పక్కదోవ  పట్టకుండా కథ చెప్పిన విధానం -దీని వేగం - హై ఓల్టేజ్ యాక్షన్ కూర్చోబెడుతాయి. సుధీర్ బాబు అన్ని  రకాల ఆయుధాలు ఎలా తయారు చేశాడో లాజిక్ అడగకూడదు. మిలిటరీ ఆయుధాలు కూడా అతడి చేతిలో వుంటాయి. క్లయిమాక్స్ యాక్షన్ సీన్లో ఇంకో భారీ ఆయుధం తీస్తాడు. ముగింపు మాస్ ప్రేక్షకులకి మాంచి కిక్.

నటనలు- సాంకేతికాలు

కొత్త లుక్ తో, చిత్తూరు భాషతో సాధారణ యువకుడి పాత్రని సుధీర్ బాబు బాగానే పోషించాడు. ఆ ఉగ్ర సుబ్రహ్మణ్యం పాత్ర పోరాటానికి తగిన భావోద్వేగాలు కూడా వుంటే నటన ఆకట్టుకునేది. ఇంటర్వెల్లో విలన్ తమ్ముడ్ని కొట్టి కాన్ఫ్లిక్ట్ ప్రారంభించినప్పుడు అది డొల్లగా వుంది. అప్పటికి ఒక లక్ష్యం, దేన్నైనా పణంగా పెట్టి తీసుకున్న రిస్క్ వంటి గోల్ ఎలిమెంట్స్ కాన్ఫ్లిక్ట్ లో లేకపోవడం వల్ల భావోద్వేగాలు పుట్టకుండా పోయాయి.
        
శివ లో స్టూడెంటైన నాగార్జున మాఫియా రఘువరన్ అనుచరుడు జేడీని కొట్టి కాన్ఫ్లిక్ట్ ని ప్రారంభించినప్పుడు- అందులో ఒక సామాన్య స్టూడెంట్  గా నేరుగా ఓ పెద్ద మాఫియాతో పెట్టుకుంటూ క్రియేట్ చేసిన ఆందోళన, దీంతో అన్న కుటుంబాన్ని పణంగా పెడుతున్న రిస్కు వగైరా వర్కౌటై భావోద్వేగాలు బలంగా పుట్టుకొచ్చాయి.
        
సుధీర్ బాబు విలన్ తమ్ముడ్ని కొట్టడంవల్ల తనకెదురవబోయే ఏ అపాయాల జాడా లేదు. అందువల్ల తర్వాత కథకి ఏ భావోద్వేగాలూ పుట్టకుండా కాన్ఫ్లిక్ట్ డొల్లగా తయార
య్యింది. కష్టపడి బాగా నటించాడు. అయితే జీవంకూడా వుండాలి.
       
హీరోయిన్ మాళవికా శర్మ టెంప్లెట్ పాత్ర నటించింది. ఫస్టాఫ్ లో హీరో ప్రేమకి పనికొచ్చేట్టు
, క్లయిమాక్స్ లో విలన్ కి పనికొచ్చేట్టు కన్పించింది.  సుధీర్ నేస్తం గా సునీల్ గుంభనంగా కన్పించే పాత్ర పోషించాడు సీరియస్ గా. సుధీర్ తండ్రి పాత్రలో జయప్రకాష్ బాధిత పాత్ర హింసాత్మక దృశ్యాలతో నటించాడు.  ఇక విలన్ పాత్రధారులు ముగ్గురూ కేజీఎఫ్ తరహా క్రౌర్యాన్ని ప్రదర్శించారు.
       
సినిమాకి ప్రధాన బలం సాంకేతికాలు.
చైతన్ భరద్వాజ్ సంగీతంగానీ, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణంగానీ టాప్ క్లాస్ గా వున్నాయి. ఆంజనేయులు సమకూర్చిన యాక్షన్ సీన్స్ ఇంకో ఆకర్షణ. జ్ఞాన సాగర్ దర్శకత్వం వీటికి తీసిపోకుండా వుంది. అయితే ఓపెనింగ్స్ చూశాక సినిమాని ఇంకా బలంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం కనపడుతోంది.

—సికిందర్ 


Tuesday, January 2, 2024

1395 : 2023 రౌండప్

 

2023 లో కూడా తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ పానిండియా కలలతోప్రయాణించింది. కానీ ప్రయాణపు బడలిక స్పష్టంగా కనిపించింది. ఏ స్టార్లు’, బీ స్టార్లు కలిసికట్టుగా పానిండియా మీద దండయాత్ర చేశారు. కానీ పల్లెకు పోదాం పారును చూద్దాం ఛలో ఛలో అని తిరిగొచ్చేశారు, ఒకరు తప్ప. మిగిలిన 8 మందీ బయల్దేరిన చోటుకే తిరిగొచ్చి, టౌను పక్కకెళ్ళొద్దురా  డింగరీ డాంబికాలు పోవద్దురా అని లోకల్ గా సెటిలై పనులు చూసుకోసాగారు. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్, రామ్ పోతినేని, నిఖిల్ సిద్ధార్థ, సమంతా ... నటించిన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పానిండియా సినిమాలు తెలుగులోనే సక్సెస్ కి దూరంగా వుండిపోయాయి- ఒక్క నాని దసరా తప్ప. తెలుగులో అదే పాత మూసని ఉత్పత్తిచేస్తూ దాన్ని పానిండియాలో విక్రయించాలనుకోవడం అత్యాశే అయింది. ఈ ప్రయాణంలో ఒక్క ప్రభాస్ కే సాలార్ తో పానిండియా పతకం దక్కింది.

        వితేజ టైగర్ నాగేశ్వరరావు’, నాని దసరా’, విజయ్ దేవరకొండ ఖుషీ’, కళ్యాణ్ రామ్ డెవిల్’, రామ్ పోతినేని స్కంద’, నిఖిల్ సిద్ధార్థ స్పై’, సమంత శాకుంతలం పానిండియా సినిమా స్థాయిని అందుకోలేక పోయాయి. పానిండియాకి బాహుబలి’, ట్రిపులార్’, కేజీఎఫ్’, విక్రమ్’, పుష్ప’, సాలార్’, కల్కి 2898 ఏడీ లాంటి బిగ్ కాన్వాస్ మీద హై కాన్సెప్ట్ మాస్ యాక్షన్ కథలు కావాలి. హాలీవుడ్ లో హై కాన్సెప్ట్ సినిమాలు ఎలా తీస్తారో ఆ తీరుతెన్నుల్లో వుండాలి. లేదా తక్కువ రేంజిలో జనసామాన్యం సామూహిక చైతన్యాన్ని పట్టుకునే కాంతారా’, విరూపాక్ష లాంటి తాంత్రిక- జానపద కథాంశాలు కావాలి. 2022లో  కాంతారా’, 2023 లో విరూపాక్ష అనే మీడియం బడ్జెట్లు పానిండియా స్థాయిలో ఇందుకే నిలబడ్డాయి.
       
ఇక పానిండియా + లోకల్ సినిమాలన్నీ కలిపి చూస్తే 2023 లో మొత్తం
ఏ స్టార్లు నటించినవి 17 పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏడే హిట్టయ్యాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ వీర సింహా రెడ్డి’, భగవంత్ కేసరి’, నాని హాయ్ నాన్నా’, దసరా’, ధనుష్ సార్’, ప్రభాస్ సాలార్ 7 మాత్రమే హిట్టయి- చిరంజీవి నటించిన మరొకటి  భోళాశంకర్’, పవన్ కళ్యాణ్ బ్రో ఒకటి నటిస్తే ఈ ఒకటీ, రవితేజ నటించిన రావణాసుర’, టైగర్ నాగేశ్వరరావు రెండూ, విజయ్ దేవరకొండ ఖుషీ ఒకటి నటిస్తే ఆ ఒకటీ, రామ్ పోతినేని స్కంద ఒకటి నటిస్తే ఇదీ, కళ్యాణ్ రామ్ అమిగోస్’, డెవిల్ రెండు నటిస్తే రెండూ, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ ఒకటి నటిస్తే ఈ ఒకటీ, సమంత శాకుంతలం ఒకటి నటిస్తే ఇదీ, మొత్తం కలిపి 10 ఫ్లాపయ్యాయి. అంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్, రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, నితిన్, సమంతా ఏ స్టార్లు ఏడు గురూ సక్సెస్ ని పట్టుకోలేకపోయారు. 7 హిట్లు, 10 ఫ్లాపులతో ఏస్టార్లు 41 శాతం సక్సెస్ నిచ్చారు.

బీ స్టార్లు 40/6  
        ఇక బీ స్టార్లు పదండి ముందుకు పదండి తోసుకు అంటూ 40 సినిమాలూ నటించి, 6 దాటి పైకి పోలేక 34 సినిమాల్నీ ఢామ్మనిపించారు. వీళ్ళల్లో ఈ సంవత్సరం కూడా మోస్ట్ వాంటెడ్ ఫ్లాప్ హీరోగా సంతోష్ శోభన్ నమోదయ్యాడు. నటించిన నాలుగూ (కళ్యాణం కమనీయం, శ్రీదేవీ శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్) ఫ్లాపయ్యాయి. రెండో స్థానాన్ని కిరణ్ అబ్బవరమే ఆక్రమించాడు. నటించిన మూడూ (వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్) ఫ్లాప్స్ తో.
       
మెగా క్యాంపు స్టార్లు సాయి ధరమ్ తేజ్ (పవన్ తో కలిసి
బ్రో), వైష్ణవ్ తేజ్ (ఆది కేశవ) వరుణ్ తేజ్ (గాండీవ ధారి అర్జున) లు మూడు నటిస్తే మూడూ ఫ్లాపయ్యాయి. నాగార్జున వారసులు నాగచైతన్య (కస్టడీ), అఖిల్ (ఏజెంట్) రెండు నటిస్తే రెండూ ఫ్లాపయ్యాయి. సుధీర్ బాబు నటించిన (హంట్, మామా మశ్చీంద్ర) రెండూ ఫ్లాపయ్యాయి. విశ్వక్ సేన్ నటించిన (దాస్ కా ధమ్కీ, బూ) రెండూ ప్లాపయ్యాయి. శ్రీసింహా కోడూరి రెండు నటిస్తే (భాగ్ సాలే, ఉస్తాద్ ) రెండూ ఫ్లాపయ్యాయి.
       
ఇక ఒక్కొక్కటి నటిస్తే  ఫ్లాపయిన హీరోలు : నాగశౌర్య (రంగబలి)
, జగపతిబాబు (రుద్రాంగి), కార్తికేయ (బెదుర్లంక), నిఖిల్ సిద్ధార్ధ (స్పై), సందీప్ కిషన్ (మైకేల్), గోపీచంద్ (రామబాణం), అల్లరి నరేష్ (ఉగ్రం), సునీల్ (భువన విజయం), నరేష్ (మళ్ళీ పెళ్ళి), ఆది (సి ఎస్ ఐ సనాతన్), అజయ్ (చక్రవ్యూహం), బెల్లంకొండ గణేష్ (నేను స్టూడెంట్ ని సార్), తిరువీర్ (పారేషాన్), రాహుల్ రామకృష్ణ (ఇంటింటి రామాయణం), నవీన్ చంద్ర (మంత్ ఆఫ్ మధు), హన్సిక (మై నేమ్ ఈజ్ శృతి).
       
ఇలా 26 మంది
బీ స్టార్లు 34 ఫ్లాపులిస్తే, ఒకటి నటించి ఆ ఒకటి హిట్టిచ్చిన బీ స్టార్లు ఆరుగురు - శ్రీవిష్ణు (సామజవర గమన), నవీన్ పోలిశెట్టి -అనూష్కా శెట్టి (మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి), సాయి ధరమ్ తేజ్ (విరూపాక్ష), శ్రీకాంత్ (కోట బొమ్మాళి),  తరుణ్ భాస్కర్ (కీడా కోలా), పాయల్ రాజ్పుత్ (మంగళవారం). అంటే 6 హిట్లు, 34  ఫ్లాపులతో 32 మంది బీ స్టార్లు 15 శాతం సక్సెస్ నిచ్చారు.
       
ఇక చిన్న సినిమాలు 113 విదుదలయ్యాయి.  వీటిలో 95 శాతం కొత్త వాళ్ళతో వూరూ పేరూ లేనివే. మొత్తం 113 చిన్న సినిమాల్లో 
బలగం’, బేబీ’, మ్యాడ్’, మావూరి పొలిమేర 2 అనే 4 మాత్రమే హిట్టయ్యాయి. సక్సెస్  రేటు 3.5 శాతమే.  మొత్తం అన్ని సినిమాలూ కలిపి 160  విడుదలైతే, 7 ఏ స్టార్ హిట్లు, 6 బీ స్టార్ హిట్లు, 4 చిన్న హిట్లు తేలాయి. మొత్తం 17. సక్సెస్ రేటు 10 శాతం.
       
ఈ పది శాతం సక్సెస్ దశాబ్దాలుగా మెయింటైన్ అవుతున్నదే టాలీవుడ్ లో. ఇంతకి  మించి ఎదగడానికి ప్రయత్నించడం లేదు. అనూహ్యంగా అందివచ్చిన పానిండియా అవకాశాలతో కూడా.
ఏ సినిమాలు పానిండియా వైపు చూస్తూంటే, బీ సినిమాలు ఆ ఖాళీలో ఏ సినిమాలు గా ఎదగాలి. బీ సినిమాల ఖాళీలోకి సి సినిమాలు చేరుకోవాలి. ఈ అభివృద్ధి ప్రణాళిక ఎవరి దగ్గరా లేదు. ఎందుకు లేదో ఆగి ఆలోచించుకోవాలి.
-సికిందర్


Wednesday, November 1, 2023

1373 : రివ్యూ

రచన- దర్శకత్వం : విధూ వినోద్ చోప్రా
తారాగణం : విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, ప్రియాంశూ ఛటర్జీ, సంజయ్ బిష్నోయి, హరీష్ ఖన్నా తదితరులు
కథ : అనురాగ్ పాఠక్, సంగీతం :  శంతనూ మోయిత్రా, ఛాయాగ్రహణం : రంగరాజన్ రామభద్రన్
బ్యానర్ : వినోద్ చోప్రా ఫిలిమ్స్, జీ స్టూడియోస్
నిర్మాతలు : విధూ వినోద్ చోప్రా, యోగేశ్ ఈశ్వర్
విడుదల : అక్టోబర్ 27, 2023
***

        మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే, త్రీ ఇడియెట్స్ వంటి ప్రసిద్ధ సినిమాల నిర్మాత, 1942-ఏ లవ్ స్టోరీ, పరిందా, మిషన్ కాశ్మీర్ ల వంటి హిట్ సినిమాల దర్శకుడూ విధూ వినోద్ చోప్రా, తాజాగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ‘12th ఫెయిల్ - విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ తీసిన రియలిస్టిక్ సినిమా. ఇందులో ఇటీవల పేరు తెచ్చుకుంటున్న చిన్న సినిమాల హీరో విక్రాంత్ మాస్సే హీరో. మేధా శంకర్ కొత్త హీరోయిన్. ఇలా విద్యపై విద్యార్థులకి ఈ రియలిస్టిక్ సినిమా ద్వారా చూపించిన చదువుల ప్రపంచం ఎలా వుందో చూద్దాం...

కథ

    1997 లో మనోజ్ శర్మ (విక్రాంత్ మాస్సే) మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయ ప్రాంతంలో నివసిస్తూంటాడు. నిజాయితీగల తండ్రి రామ్‌వీర్ శర్మ (హరీష్ ఖన్నా), ప్రేమగల తల్లి పుష్ప (గీతా అగర్వాల్), సోదరుడు కమలేష్ (రాహుల్ కుమార్), సోదరి రజని (పెర్రీ ఛబ్రా), అమ్మమ్మ (సరితా జోషి) లతో కూడిన దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అతడిది.
       
మనోజ్ కి ఐపీఎస్ అధికారి అవ్వాలని కలలుంటాయి. కానీ
12వ తరగతి పరీక్షల్లో ఫెయిలవుతాడు. ఎందుకంటే బోర్డ్ పరీక్షల్లో ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ చేయించకుండా డీఎస్పీ దుష్యంత్ సింగ్ (ప్రియాంశూ ఛటర్జీ) అడ్డుకున్నాడు. నువ్వు ఐపీఎస్ కావాలంటే ఇలాటి అడ్డమార్గాలు  తొక్కకూడదని డీఎస్పీ మందలించాడు కూడా. తర్వాతి సంవత్సరం థర్డ్ క్లాసులో పాసవుతాడు. ఇక అమ్మమ్మ పొదుపు చేసిన పెన్షన్ డబ్బులు తీసుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షలకి ప్రిపేర్ కావడానికి ఢిల్లీకి చేరుకుంటాడు. అతడికి పట్టుదల వుంటుందిగానీ, అందుకు తగ్గ అధ్యయన నైపుణ్యాలు వుండవు. పైగా హిందీ మీడియం చదివాడు. ఉన్నత చదువులపై సరైన అవగాహన  కూడా లేదు. యూపీఎస్సీ, ఐపీఎస్ ప్రొఫైల్ లాంటివి వుంటాయని కూడా తెలియదు. పైగా ఆర్ధిక అసమానతలు, కులతత్వం పొటమరించి వున్నాయి. ఈ నేపథ్యంలో గురువు (అంశుమాన్ పుష్కర్), స్నేహితులతో బాటు, స్నేహితురాలు శ్రద్ధా జోషి (మేధా శంకర్) సహాయంతో సంఘర్షించి తన ఐపీఎస్ కలని ఎలా సాకారం చేసుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ  

    ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్  అధికారి శ్రద్ధా జోషి నిజ జీవిత వృత్తాంతంతో ప్రేరణ పొంది రాసిన ‘12th ఫెయిల్ అన్న నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. నవలా రచయిత అనురాగ్ పాఠక్. బందిపోట్లకి పేరు బడ్డ చాలా వెనుకబడిన చంబల్ గ్రామంనుంచి ఒక హిందీ మీడియం సగటు విద్యార్థి పోలీసు శాఖలోని ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం ఈ కథ చెప్తుంది. 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన మనోజ్‌పై జీవితం, సమాజం, ప్రేమ, స్నేహం విసిరే సవాళ్ళ కథ ఇది.
       
ఇందులో నీతి ఏమిటంటే- ఆర్ధిక అసమానతలు
, అవినీతి, కుల రాజకీయాలున్నప్పటికీ, ఇప్పటికీ మెరిటోక్రాటిక్ (ప్రతిభా స్వామ్యం) మార్గాల ద్వారా యూపీఎస్సీలో విజయం సాధించవచ్చనీ చెప్పడం. ఇంకో సందేశం ఏమిటంటే, మోసగాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చెందరని - ఈ వ్యవస్థలో ఇప్పటికీ చాలా పక్షపాతాలు అలా పాతుకుపోయి వున్నాయనీ- ఇవి మనోజ్ లాంటి కుర్రాళ్ళ జీవితాల్ని కష్టతరం చేస్తున్నాయనీ స్పష్టం చేయడం.  
        
చదువుకోండి, ఆందోళన చేయండి, సంఘటితం కండి, అవినీతి రాజకీయ నాయకులు సమాజంలోని యువత మూర్ఖులుగా వుండాలని, వాళ్ళని అణచివేసి పాలించవచ్చని భావిస్తున్నారనీ కూడా ఈ కథ వెలుగులోకి తెస్తుంది.

ఇదంతా వాస్తవిక కథా చిత్రం శైలిలో చాలా సాఫీగా, సాదాసీదాగా సాగుతుంది. మనోజ్ కి కఠోరంగా పరిశ్రమించడం తెలుసు. కానీ కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్ని ఎలా క్రాక్ చేయాలో తెలీదు. తెలియక పరీక్షతప్పిన ప్రతీసారీ బాధ పడుతూ కూర్చోక, వెంటనే  రీస్టార్ట్ బటన్ నొక్కి, మళ్ళీ పరీక్షకి సిద్ధమయ్యే అరుదైన పట్టుదలతో వుంటాడు. ఇలా నాలుగుసార్లు జరిగిన తర్వాత, అంతిమంగా ఉత్తీర్ణత సాధించే రహస్యాన్ని తెలుసుకుని, కేటాయించిన సమయంలో డజను 200-పదాల వ్యాసాలు ఎలా రాయాలో నేర్చుకుని పరీక్షని క్రాక్ చేస్తాడు!
       
నిజానికి విద్య గురించి ఇది స్పోర్ట్స్ సినిమా లాంటి థ్రిల్లింగ్ కథ. స్పోర్ట్స్ సినిమాల్లో మెడల్ కొట్టడానికి గెలుపోటముల థ్రిల్
, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కథ ఎలా సాగుతుందో, ఇదే మొదటిసారిగా ఎడ్యుకేషన్ సినిమాకి వర్తింపజేసి రూపకల్పన చేయడం ఇక్కడ ప్రత్యేకత.
        
ఇది ప్రేక్షకుల హృదయాల్ని మెలిదిప్పుతుంది. అదే సమయంలో మధ్యమధ్యలో తేలికపాటి సన్నివేశాలతో అలరిస్తుంది. కథలోని ఎమోషనల్ అండర్ కరెంట్ ఎంత బలంగా వుంటుందో, సరదా సన్నివేశాలతో డ్రామా అంత రంజింపజేస్తుంది. ప్రతీసీనూ ఒక కొత్త విషయంతో వుంటుంది- కథ గురించి గాని, పాత్ర గురించి గాని. డైలాగులు చాలా రియలిస్టిక్‌గా వున్నాయి. అనేక చోట్ల హృదయాల్ని హత్తుకునేలా వున్నాయి.

నటనలు – సాంకేతికాలు

    మనోజ్ శర్మ పాత్ర పోషణలో విక్రాంత్ మాస్సే దాదాపు నూరు శాతం మార్కులు కొట్టేశాడు. అతడి నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ – ఇవన్నీఉన్నతంగా వున్నాయి. అనుభవజ్ఞుడైన విధూ వినోద్ చోప్రా ఇలా నటింపజేశాడు. సినిమా చూసిన తర్వాత చాలా కాలం పాటు ఇది వెంటాడుతుంది. ప్రేమిక శ్రద్ధా జోషిగా మేధా శంకర్‌ కూడా అద్భుతంగా నటించింది.  యూట్యూబ్ లో ఐఏఎస్ క్లాసులు చెప్పే పాపులర్ కోచ్ డాక్టర్ వికాస్ దివ్యకీర్తి కూడా ఇందులో పాఠాలు చెప్తాడు. ఈయన ఇజ్రాయెల్- పాలస్తీనా చరిత్రమీద చేసిన ఆమూలాగ్ర ప్రసంగం యూట్యూబ్ లో ఒక రికార్డు. ఇది నాలుగున్నర గంటలపాటు ఏక బిగిన సాగే ప్రసంగం.
       
ఇందులో సహాయ పాత్రలు లెక్కలేనన్ని వున్నాయి. ఈ నటీనటులందరూ సినిమా మూడ్ ని నిలబెట్టారు.
శంతనూ మోయిత్రా సంగీతం కమర్షియల్ సినిమా సంగీతం కాదు. హిట్ కుర్ర పాటలు ఆశించకూడదు. రంగరాజన్ రామద్రన్ ఛాయాగ్రహణం, హేమంత్ వామ్ కళా దర్శకత్వం రియలిస్టిక్ సినిమా అవసరాల్ని అనుసరించి వున్నాయి.
       
మొత్తం మీద
‘12th ఫెయిల్ హృదయాల్ని హత్తుకునే ఒక సున్నిత కథా చిత్రం. అయితే సరైన ప్రమోషన్ లేకపోవడంతో, పైగా యువతని ఆకర్షించే కమర్షియల్ అప్పీల్ లేకపోవడంతో హిందీలో ఓ మోస్తరు కలెక్షన్ల దగ్గర స్ట్రగుల్ చేస్తోంది. తలుగులో నవంబర్ 4న విడుదలవుతోంది.
—సికిందర్

 

Saturday, October 21, 2023

1371 : రివ్యూ


 

రచన -దర్శకత్వం : వంశీ
తారాగణం : రవితేజ, నుపుర్ సానన్, గాయత్రీ భరద్వాజ్, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జిషు సేన్‌గుప్తా తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : ఆర్. మధి
బ్యానర్ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, నిర్మాత: అభిషేక్ అగర్వాల్
విడుదల : అక్టోబర్ 20, 2023
***

మాస్ మహారాజా రవితేజ ఒక వ్యక్తి జీవిత చరిత్రతో బయోపిక్ నటిస్తే ఎలా వుంటుంది? రవితేజ సినిమాలా వుంటుందా, లేక ఆ వ్యక్తి బయోపిక్ లానే వుంటుందా? మొదటిదే అవుతుందని నిరూపించే తరహాలో టైగర్ నాగేశ్వర రావు కి రూపకల్పన చేశాడు దర్శకుడు వంశీ. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్రని తెరకెక్కించే ప్రయత్నంలో, రవితేజకే హాని జరిగే తీరు తెన్నులతో కూడా తయారైంది సినిమా. రవితేజ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పానిండియా స్థాయిలో సినిమాని విడుదల చేయించడం వల్ల ఆ లెవెల్లో ప్రతిష్ట కూడా దెబ్బ తింది. ఈ బయోపిక్ ఎలాగో గట్టెక్కడానికి వివాదాస్పదమై ప్రేక్షకుల్ని ఆకర్షించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కరుడుగట్టిన దొంగని సమర్ధించే వర్గాలు వుండవు కాబట్టి.
        
ఇంతకీ ఏమిటీ సినిమా/బయోపిక్? భగవంత్ కేసరి’, లియో ల తర్వాత ఎంతో హడావిడీ చేస్తూ పండక్కి విడుదలైన ఇది మొదటి రెండు సినిమాల పక్కన ఎక్కడ నిలబడుతుంది? దీని కొచ్చే రెస్పాన్స్ ఎంత? ఇవి తెలుసుకుందాం...

కథ

    1970 లలో ఢిల్లీలో ఐబీ చీఫ్ రాఘవేంద్ర రాజ్పుత్ (అనుపమ్ ఖేర్) నుంచి బాపట్ల డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి (మురళీ శర్మ) కి అర్జెంట్ కాల్ వస్తుంది. విశ్వనాధ శాస్త్రి ఢిల్లీ చేరుకుంటే, ఐబీ చీఫ్ ప్రధానమంత్రి భద్రతాదళానికి టైగర్ నాగేశ్వరరావు నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని, ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరని అడుగుతాడు.
        
విశ్వనాథ శాస్త్రి చెప్పడం మొదలు పెడతాడు... నాగేశ్వరరావు స్టూవర్ట్ పురం దొంగ. అతను పోలీసులకి ఛాలెంజి విసిరి మరీ దోపిడీలు చేస్తాడు. దొరక్కుండా తప్పించుకుంటాడు....అంటూ పూర్తి వివరాలు అందిస్తాడు. టైగర్ నాగేశ్వరరావు ప్రధాని భద్రతా దళాన్ని ఏమని బెదిరించాడు? ఆ బెదిరింపు ప్రకారం ఏ నేరానికి పాల్పడ్డాడు? అప్పుడేం జరిగింది? ప్రధాని రియాక్షన్ ఏమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    రవితేజ సినిమా కథలా వుంటూ, రవితేజకే అడ్డుపడే సన్నివేశాలతో వుంది. ఒక క్రిమినల్ ని గ్లోరిఫై చేయడానికి కొన్ని జాగ్రత్తలుంటాయి. పుష్ప లో కాల్పనిక స్మగ్లర్ క్యారక్టర్ ని గ్లోరిఫై చేయడానికి వ్యక్తిగత జీవితంతో ఆ జాగ్రత్తలు పాటించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా నిజ వ్యక్తి కథ. ఈ నిజ వ్యక్తి కథ బయోపిక్ గా తీసి గ్లోరిఫై చేయడానికి, రవితేజని ఇంకో స్థాయికి తీసికెళ్ళడానికీ పనికి రాని కథ. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం మీద ఎక్కడా ఒక పుస్తకం వెలువడ లేదు. వాళ్ళూ వీళ్ళూ  చెప్పుకునే కథలూ, కొన్ని పోలీస్ రికార్డులూ ఇవే వున్నాయి. సినిమాకి సరిపోను మెటీరీయల్ లేకపోవడం చేత, భారీగా కల్పన చేసిన సన్నివేశాలతో సినిమాని నింపక తప్పలేదు. అడిగే వారెవరుంటారు.
       
ఈ కల్పితాలు చేయడానికి ఏ పాయింటుని ప్రధానంగా తీసుకుని కథ నడపాలో కూడా తెలుసుకోనట్టుంది. నాగేశ్వరరావు గురించి ప్రచారంలో వున్నవి రెండే అంశాలు- పోలీసులకి దొరక్కుండా చెప్పి మరీ దోపిడీలు చేయడం
, దోచుకుంది పేదలకి పంచి పెట్టడం. అంటే పోలీసులకీ నాగేశ్వరరావుకీ మధ్య ఎలుకా పిల్లీ చెలగాటంతో- ప్రధాన కథని యాక్షన్ కథగా మార్చి  థ్రిల్లింగ్ గా నడుపుతూ, ఉపకథగా పేదలకి డబ్బు పంచే మానవీయ కోణాన్ని ఆవిష్కరించ వచ్చు.
         
ఇందులో మొదటిది చూపించకుండా
, రెండోదే చూపించడంతో ప్రధాన కథ గల్లంతైన సినిమా అయింది. ఏవో కొన్ని దోపిడీలు చూపించారు- కానీ పోలీసులతో వుండాల్సిన ఎలుకా పిల్లీ చెలగాటం యాక్షన్ పార్టు మర్చిపోయారు. ఇంకేం సినిమా ఆడుతుంది?
       
చరిత్రలో నాగేశ్వరరావు లాంటి నేరస్థుడే వున్నాడు. అతను ఉన్నత స్థానాల్లో చిటికెలో ఆర్ధిక నేరాలు చేసి తప్పించుకునే ఫ్రాంక్ అబిగ్నేల్. పోలీసులకి దొరక్కుండా ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతడి మీద
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని సినిమా తీశాడు స్టీవెన్ స్పీల్ బెర్గ్. దొంగగా లియోనార్డో డీకాప్రియో, పోలీసుగా టామ్ హాంక్స్. ఫ్రాంక్ అబిగ్నేల్ దేనికి ప్రసిద్ధో ఆ ఎలుకా పిల్లీ చెలగాటాన్నే కథగా చేసి, టైటిల్ కూడా అలాగే పెట్టి  తీశాడు స్పీల్ బెర్గ్. టైగర్ నాగేశ్వరరావు లో ఈ పాయింటునే పక్కన బెట్టి పానిండియా తీశారు.
       
డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి చెప్పుకొచ్చే కథ- రైలు దోపిడీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టి పెరిగి దొంగగా మారిన కథ వస్తుంది. ఆ తర్వాత రవితేజ రెగ్యులర్ సినిమా టెంప్లెట్ ప్రారంభమైపోతుంది. బాపట్లలో ఓ కాలేజీ
, కాలేజీలో చదివే హిందీ అమ్మాయి- ఆమెని ఆకలిగా చూస్తూ వెంటపడి వేధించి, డిజైనర్ డ్రెస్సుల్లో   స్టెప్పులేస్తూ పాటలు పాడి, ఆమె పెళ్ళి చెడగొట్టి తనవైపు తిప్పుకునే కామెడీ లవ్ ట్రాకు! కనీసం 15 మంది ఇక్కడే లేచిపోయారు థియేటర్లోంచి.
       
తిరిగి ఓ రెండు దోపిడీలు
, ఆ తర్వాత సెకండాఫ్ లో సుదీర్ఘంగా సాగే పేదలకి డబ్బులు పంచే రాబిన్ హుడ్ ఎపిసోడ్. టెంప్లెట్ ప్రకారం ఫస్ట్ హీరోయిన్ ఫస్టాఫ్ లోనే దూరమవగా, సెకండాఫ్ లో సెకండ్ హీరోయిన్! పోలీసులతో పోరాటం. చివరికి ఢిల్లీలో ప్రధాని ఇంట్లో దొంగతనం! చాలా సిల్లీగా రాసి తీశాడు సినిమాని. ఎక్కడా థ్రిల్, సస్పెన్స్, మలుపులు అనేవి లేకపోగా, సన్నివేశాలు, డైలాగులు నీరసంగా వుంటాయి. యాక్షన్ పార్టులో తప్ప టాకీ పార్టులో స్పీడు అనేదే వుండదు.
       
ఇంకోటేమిటంటే
, ఫస్టాఫ్ కథని విశ్వనాధ శాస్త్రి చెప్తే- సెకండాఫ్ కథని స్టూవర్ట్ పురం పెద్ద (నాజర్) చెప్తాడు. దీని వల్ల ఫస్టాఫ్ లో చచ్చిపోయిన దుష్ట పాత్రలు సెకండాఫ్ లో మళ్ళీ వస్తాయి. రెండు దృక్కోణాల్లో కథ చెప్తే, కథ ముందు కెళ్ళక అక్కడక్కడే తిరుగుతున్నట్టే గాక, పాత్రలు మళ్ళీ కనిపిస్తూ కన్ఫ్యూజింగ్ గా కూడా వుంటుంది. ఇది కన్ఫ్యూజన్ అనుకోలేదు దర్శకుడు, చాలా క్రియేటివ్ గా కథ చెప్తున్నా ననుకున్నాడు.

నటనలు - సాంకేతికాలు

    రవితేజ నాగేశ్వర రావు పాత్రకంటే రవితేజ టైపు టెంప్లెట్ పాత్రే నటించాడు. రక్తంతో రాసే చరిత్రలు వుంటాయి, కన్నీటితో రాసే చరిత్రలు వుంటాయి, ఇది రెండూ కలిపి రాసిన చరిత్ర అని మొదట్లో కొటేషన్ పడుతుంది. రక్తమే తప్ప కన్నీరు లేదు. రక్తాలు పారిస్తూ క్రూరంగా యాక్షన్ సీన్సు నటించి, లియో విజయ్ నే మించిపోయాడు రవితేజ. డబ్బులు పంచే మానవీయ కోణం అలా చేయడానికి పురిగొల్పిన సంఘటనేదో చెప్పకపోవడంతో, ఆ ఎపిసోడ్ ఎంత నటించినా, నాయకుడు లో కమలహాసన్ ని టచ్ చేయలేక పోయాడు. గ్రాఫిక్స్ తో యంగ్ రవితేజతో వచ్చే సీన్లలో మాత్రం ఆ ఏజిని బాగా నటించాడు.
       
బాపట్లలో హిందీ అమ్మాయిగా నుపుర్ సానన్ ది ఫస్టాఫ్ లో ఫార్ములా హీరోయిన్ సంక్షిప్త పాత్ర. సెకండాఫ్ లో లోకల్ అమ్మాయిగా గాయత్రీ భరద్వాజ్ కి నిడివి వున్న పాత్ర
, దాంతో నటించే అవకాశం.  
        
ఢిల్లీలో ఐబీ చీఫ్ గా నటించిన అనుపమ్ ఖేర్ అయితే కామెడీ పాత్ర అయిపోయాడు. హిందీ వాడైన తను మారువేషంలో బాపట్లలో తిరుగుతూ దంచి కొట్టి తెలుగు మాట్లాడేస్తూంటాడు. ఇక డీఎస్పీగా మురళీ శర్మ పోలీసు విధులు సరే,
       
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలు అలా వచ్చి వెళ్ళిపోతూంటాయి. 1970 ల కాలపు పీరియడ్ లుక్ కోసం నిర్వహించిన కళాదర్శకత్వం కోసం
, పోరాటాల కోసం బాగా ఖర్చు పెట్టారు. కానీ మాధి ఛాయాగ్రహణం సాధారణంగా వుంది. యాక్షన్ సీన్సు లో- ముఖ్యంగా రైలు దోపిడీ సీన్లో గ్రాఫిక్స్ నాసి రకంగా వున్నాయి. 1970 లలో సినిమా తీస్తే ట్రిక్ ఫోటోగ్రఫీ ఇలాగే వుండేది. ఈ సినిమా కథ కూడా 1970 ల నాటిదే కాబట్టి ఇలాగే వుంది.
       
చివరిగా
, వేశ్యావాటికల్లో తిరిగే వాడు, రమ్మంటే రాలేదని వేశ్య కడుపులో తన్నే వాడు, సొంత తండ్రిని తలనరికి చంపేవాడు- హీరోతో తీయాల్సిన సినిమా కాదు. విలన్ పాత్రలేసే ఆర్టిస్టుతో తీసుకోవచ్చు. అసలు ఇది సినిమాగా తీయడానికి పనికిరాని బయోపిక్!
—సికిందర్