జానర్ మర్యాదల గురించి కొనసాగింపు వ్యాసంగా
మొదట ప్రస్తుత ట్రెండ్ మీద దృష్టి పెడితే, మొత్తానికి ఇటీవల రోమాంటిక్ కామెడీ (?)
ల తాకిడి తగ్గి, సస్పెన్స్ థ్రిల్లర్ల (?) హవా నడుస్తోంది. వీటి జానర్ మర్యాదలు
తెలియజేయాలని కొందరు రాస్తున్నారు. ఒక సహకార దర్శకుడు డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్
(?) జానర్ ఎనాలిసిస్ రాయాలని కోరారు. ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అని అనెయ్యడం అనాలోచితంగా
జరిగిపోయి వుండొచ్చు. జానర్ సంబంధ సాంకేతిక పదాలు ఇష్టానుసారం వాడేస్తే ఇక జానర్
మర్యాదలు ఎంత చెప్పినా అర్ధంగావు. ప్రేమ కథలన్నిటినీ కలిపి రోమాంటిక్ కామెడీలని ఒకే
పదం వాడెయ్యడం, నేర కథలన్నిటినీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనుకోవడం చేస్తే ఇక జానర్ మర్యాదల
గురించి చెప్పుకోవడం అసాధ్యమైపోతుంది. ఒక జానర్ లో ఎన్నో సబ్ జానర్లు వుంటాయి. నిజంగా
జానర్ మర్యాదల్ని అమలుచేసి, ఒక వైవిధ్యాన్నిచాటుకోవాలనుంటే, ముందు తెలుసుకుని
మాట్లాడాల్సింది ఏ సబ్ జానర్ కింద చేస్తున్న కథ వస్తుందన్నదే. ఇది ఐడియా దశలోనే
నిర్ణయమవాలి. ఐడియా దగ్గరే కట్టుబడక పోతే ఇక కథతో ఏ కట్టుబాట్లూ వుండవు. ఏ జానర్
మర్యాదలూ వుండవు. లవ్ జానర్లో రోమాంటిక్ కామెడీలు మాత్రమే వుండవు. రోమాంటిక్
డ్రామాలుంటాయి, రోమాంటిక్ సస్పెన్సులుంటాయి. అడల్ట్ రోమాన్సులుంటాయి, ఎరోటిక్ రోమాన్సులుంటాయి.
ఇలా అనేక సబ్ జానర్లుగా వర్గీకరణ చెంది వుంటుంది లవ్ జానర్. ఇది తెలుసుకోక రోమాంటిక్
కామెడీ లంటూ తీస్తూ వచ్చిన సినిమాలు దాదాపూ అన్నీ ఒకే మూసలో రోమాంటిక్ డ్రామాలే.
ఇలా వుంటే ఇక జానర్ మర్యాదల గురించి తెలుసుకుని ప్రయోజనమేముంటుంది.
ఇలాగే నేర కథలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్స్
కావు. నేర కథలు ప్రధానంగా క్రైం జానర్. దీనికింద సబ్ జానర్స్ గా మిస్టరీ, క్రైం
థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్, ఎరోటిక్ థ్రిల్లర్, లీగల్ థ్రిల్లర్, మెడికల్
థ్రిల్లర్, మిలిటరీ థ్రిల్లర్... ఇలా ఎన్నో వుంటాయి. దేని జానర్ మర్యాద దానిదే.
సస్పెన్స్ థ్రిల్లర్ అనే సబ్ జానర్ కూడా లేదు. కారణం, సస్పెన్స్ నేది అన్ని జానర్ల
కథల్లోనూ వుండేదే. ఇది కథలకి సస్పెన్స్ ని కల్పించే టూల్ తప్ప, టైపు కాదు. జానర్
కాదు. పైన చెప్పుకున్న క్రైం సబ్ జానర్ లో కథలు ఒక నేరం చుట్టూ వుంటాయి. ఈ కథలు
స్టార్స్ తో తీసినప్పుడు హాలీవుడ్ సినిమాల్లోలాగా వాటివైన జానర్ మర్యాదలతో వుండక
పోవచ్చు. అన్ని మసాలాలూ కలిపేసి వుండొచ్చు. స్టార్స్ కుండే ఇమేజి అలా డిమాండ్
చేస్తుంది కాబట్టి. వీటికి జానర్ మర్యాదల గురించి కంగారుపడ నవసరం లేదు.
స్టారేతర సినిమాలకి మనసుంటే
మర్యాదలు, బంధుత్వాలు కలుపుకోవచ్చు. మనసే లేకపోతే కొత్త హీరోల, చిన్న హీరోల క్రైం జానర్ ని కూడా
స్టార్స్ సినిమాల్లాగా సర్వ కళా సమ్మేళనం చేసుకోవచ్చు. తీసేది కోటి రూపాయల క్రైం
జానరైనా, పదుల కోట్ల స్టార్ సినిమాల్లా వుండాలని కలలుగంటే, స్టార్ సినిమాలకి చీప్
నకళ్ళు తయారవుతాయి తప్ప, జానర్ స్పెసిఫిక్ సినిమాలు రావు. అదే టిక్కెట్ కి వైభవోపేతంగా స్టార్
సినిమాలు లభిస్తోంటే, చీప్ నకళ్ళతో ఆడియెన్స్ కేంపని? ఇదీ పాయింటు.
డిటెక్టివ్- పోలీస్ డిటెక్టివ్
కాబట్టి
క్రైం జానర్ తో చీప్ నకళ్ళే కావాలో, ఒరిజినాలిటీ కావాలో ఎవరికి వారే నిర్ణయించుకుని
బరిలోకి దిగాలి. ముందుగా ఐడియాతో ఈ స్పష్టత కొస్తే దానికి తగ్గ వ్యాపారం
తెలుస్తుంది. వ్యాపార రేంజి తెలుస్తుంది. ఈ రేంజి చాలనుకుంటే అదే రేంజిలో
తీసుకోవచ్చు. గొడవుండదు. దానికి తగ్గ ఫలితం ముందే తెలుస్తుంది కాబట్టి సమస్య
వుండదు. ముందుగా క్రైం జానర్లో పైన అడిగిన ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ చూద్దాం.
‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అనడం జానర్ ని పిలవడంలో అస్పష్టతే అయినా, ఇందులో
ప్రధానంగా ‘డిటెక్టివ్’ అనే పదం వుంది. అంటే నేర కథ. నేర కథల్లో డిటెక్టివ్ అంటే
నేర పరిశోధన, దర్యాప్తు వగైరా. అంటే మిస్టరీ సబ్ జానర్. నేరాల్ని శోధించే నేర కథలు
మిస్టరీ సబ్ జానర్ కింది కొస్తాయి. మిస్టరీ అంటే రహస్యంతో ముడిపడి వున్నది. అంటే
ఒక నేరం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే రహస్యం డిటెక్టివ్
తెలుసుకునే కథనంతో కూడిన కథావస్తువు.
దీని
జానర్ మర్యాదలేమిటో చూద్దాం: డిటెక్టివ్ సాహిత్యానికి ఆద్యుడు షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త
అర్ధర్ కానన్ డాయల్ కాదు. ఎడ్గార్ అలెన్ పో. 1841 లో ఈయన రాసిన ‘మర్డర్స్ ఇన్ ది
రూ మార్గ్’ చరిత్రలో మొదటి డిటెక్టివ్ కథ. ఈయన సృష్టించిన ఆగస్ట్ పైన్ మొదటి
డిటెక్టివ్. ఈ ప్రసిద్ధ డిటెక్టివ్ కథా క్రమంలో ‘పో’ కల్పించిన ఎనిమిది దశల్ని తీసుకుని,
షెర్లాక్ హోమ్స్ పాత్రని సృష్టించి, ‘ఏ స్టడీ ఇన్ స్కార్లెట్’ అని మొదటి
డిటెక్టివ్ కథ 1887 లో రాశాడు డాయల్. డాయల్ తో సరిసమానమైన అగథా క్రిస్టీ కూడా
ఆగస్ట్ పైన్ తోనే స్ఫూర్తి పొంది, హెర్క్యూల్ పైరట్ పాత్రని సృష్టిస్తూ, ‘ది
మిస్టీరియస్ ఎఫైర్ ఇన్ స్టైల్స్’ అనే తన తొలి
డిటెక్టివ్ కథ 1920 లో రాసింది.
‘పో’ రాసిన కథని హోమ్స్ పరిశీలించి
ఫాలో అయిన ఎనిమిది కథన దశలేమిటో చూద్దాం. ఈ
దశలే ఆయన రాసిన చిన్న కథలతో బాటు నవలల్లో వుంటాయి. నవలల ఆధారంగా తీసిన
సినిమాల్లోనూ వుంటాయి. 1. ముందుగా అనుచరుడు డాక్టర్ వాట్సన్ తో షెర్లాక్ హోమ్స్ పూర్వపు
కేసులు చర్చిస్తూ కథా ప్రారంభం, 2. కొత్త క్లయంట్ వచ్చి సమస్య చెప్పుకోవడం, హోమ్స్
ఆ కేసు స్వీకరించడం, 3. క్లయంట్ ఇచ్చిన
ఆధారాలతో దర్యాప్తు మొదలెట్టడం, ఒక కీలక ఆధారం దొరకడం, ఇది అంత ప్రధానం
కాదన్నట్టుగా పాఠకులకి అన్పించేలా చేయడం, 4. వాట్సన్ ఆ ఆధారంతో పొరపాటు విశ్లేషణ
చేయడం, 5. ప్రభుత్వ డిటెక్టివ్ ఇంకో ఫాల్స్ క్లూ ఇవ్వడం, ప్రభుత్వ డిటెక్టివ్
కాకపోతే దినపత్రికో, క్లయంటో, లేక కేసులో బాధితుడు లేదా బాధితురాలో, ఇంకో సాక్షియో
ఆ ఫాల్స్ క్లూ నివ్వడం, 6. తర్జనభర్జనలతో కేసు అంతు చిక్కక వాట్సన్ అయోమయంలో
పడ్డం, హోమ్స్ క్లూస్ అన్నిటినీ
కలిపి ఊహాగానం చేస్తూ, నిర్ణయం చెప్పకపోవడం, 7. అనూహ్యంగా హోమ్స్ కేసుని బద్దలు కొట్టి
దోషిని పట్టుకోవడం, 8. తను కనుగొన్న వాస్తవాలన్నిటినీ కలిపి హేతుబద్ధ వివరణ నిస్తూ
ముగించడం.
ఏ షెర్లాక్ హోమ్స్ కథైనా నవలైనా ఈ ఎనిమిది దశలతో
టెంప్లెట్ గా వుంటుంది. కొమ్మూరి సాంబశివరావు రాసిన తెలుగు డిటెక్టివ్ నవలలు కూడా
ఇదే టెంప్లెట్ లో వుంటాయి. అగథా క్రిస్టీ ‘పో’ నే ఫాలో అయినా కొంత తేడా చూపిస్తూ
ముందడుగేసింది. 1. ఒక హత్య జరుగుతుంది, హెర్క్యూల్ పైరట్ ప్రవేశిస్తాడు, 2. తన
చుట్టూ కొందరు అనుమా నితులుంటారు, ప్రశ్నించడం మొదలెడతాడు, 3. ఒకరొకరుగా
అనుమానితుల్ని ప్రశ్నిస్తూంటే ఆసక్తికర విషయాలు బయటపడుతూంటాయి, 4. ఎనాలిసిస్
చేసుకోవడం మొదలెడతాడు, 5. అనుమానితుల్లో కొందరి ప్రవర్తన, చర్యలు దృష్టి నాకర్షిస్తాయి,
6. ఇక ఫలానా అనుమానితుడు లేదా అనుమానితురాలు దోషి అని పట్టేసుకుంటాడు, 7. ఆ దోషి
ఒక్కరే కావచ్చు, లేదా అనుమానితులందరూ దోషులు కావచ్చు, అసలు హత్య జరిగిందో లేదో కూడా
తేలక పోవచ్చు, దోషిని పట్టుకోబోతే
హత్యకి గురైన వ్యక్తే సజీవంగా దొరకవచ్చు!
కానన్
డాయల్ క్లూస్ తో కేసుల్ని పరిష్కరిస్తే,
అగథా క్రిస్టీ అనుమానితులతో ఆట చూపిస్తూ సర్ప్రైజ్ ముగింపుల్నిస్తుంది. ఈ తేడా
గమనించాలి ఈ జానర్లో. డిటెక్టివ్ సాహిత్యానికి ‘పో’ సహా వీరిద్దరూ స్థిరీ కరించిన ఓవరాల్
జానర్ మర్యాద - రహస్యాన్ని దర్యాప్తు చేసేదే, ఛేదించేదే. ఇందువల్ల నేర కథల్లో (క్రైం జానర్లో) ఇవి మిస్టరీ సబ్
జానర్లవుతున్నాయి. ఇందులో చివరి వరకూ దోషి ఎవరో తేలదు. దోషిని పట్టుకున్నాక అతడి
మీద నేర నిరూపణ చేస్తూ డిటెక్టివ్ అనే వాడు మొత్తం మొదట్నుంచీ కేసు పూర్వాపరాలు
పారాయణం చేస్తూ, దోషికాపాదించి తీర్పు చెప్తాడు. అంటే ఏది ఎందుకు జరిగిందో, ఎవరు ఎలా
చేశారో చివరి వరకూ కథ పట్టుబడని ప్రక్రియ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ తెలిస్తేనే కదా కథేమిటో
తెలిసేది. కాన్ఫ్లిక్ట్ ని చివరికి వరకూ తోసేసి డిటెక్టివ్ విప్పి చెప్పినప్పుడు, ఆ సస్పెన్స్ కథని ఎండ్ సస్పెన్స్ కథ అంటారు. అప్పారావు
సుబ్బారావు దగ్గరి కొచ్చి, వచ్చిన పని చెప్పకుండా రెండు గంటలు సోది చెప్పి, చల్లగా
ఫిఫ్టీ అప్పడగడాని కొచ్చానని అసలు విషయం చెప్తే, ఈడ్చి కొట్టాలన్పిస్తుంది
సుబ్బారావ్ కి. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా?
ఇలా
ఎండ్ సస్పెన్స్ కూడా సుబ్బారావ్ సిండ్రోమే. కథేమిటో ముందే కాన్ఫ్లిక్ట్
చూపించకుండా, మూసి పెట్టిన కథ తాలూకు ఏవేవో కథనాలు చూపిస్తే ఎలా అర్ధమయ్యేది.
స్క్రీన్ మీద రియల్ టైం స్టోరీ ప్రత్యక్షంగా నడవాలి. ఎండ్ సస్పెన్స్ అప్పటి నవలల్లో కాబట్టి సరిపోయింది. సినిమాల్లో
సరిపోవడం లేదని హాలీవుడ్ ఆలస్యంగా గ్రహించింది. చదవడం వేరు, సినిమాగా చూడ్డం వేరు.
పైగా సుమారు 1980 ల తర్వాత డిటెక్టివ్ సాహిత్యానికి కాలం చెల్లింది తెలుగు సహా. తరం
మారిన నవ పాఠకులకి, నవీన ప్రేక్షకులకి చివరివరకూ కథ తెలియని వాదోపవాదాలేమిటో, ఆ
క్లూక్లూ కూడబలుక్కుని ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సాగే, పడక్కుర్చీ మేధావి డిటెక్టివ్
కథలేమిటో నచ్చలేదు. యాక్షన్ తక్కువ, లెక్చర్ లెక్కువ. దీని బదులుగా యాక్షన్ తో
కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెడ్ గా కథ తెలిసిపోయి, సీన్ టు సీన్ సస్పెన్స్ నే
కోరుకున్నారు. దీంతో పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్
డిటెక్టివ్ పాత్రలు కేవలం కాల్పనిక సాహిత్యంలో కన్పించేవే. విదేశాల్లో ప్రైవేట్
డిటెక్టివులు సమాజంలో తెలిసిన వ్యక్తులే అయినా, కాల్పనిక కథల్లో అంత పాపులర్
డిటెక్టివులు నిజ జీవితంలో ఎవరూ లేరు. ఇంకా నిజ జీవితంలో మెలిటా నార్వుడ్,
వర్జీనియా హాల్, సిడ్నీ రీల్లీ మొదలైన పాపులర్ గూఢచారులున్నారు. ప్రైవేట్
డిటెక్టివులకి దర్యాప్తుల్లో పోలీస్ డిటెక్టివులకున్నంత యాక్సెస్ వుండదు. క్రైం
సీన్లోకి కూడా వెళ్ళలేరు. పోలీస్ డిటెక్టివులకి ఫోరెన్సిక్ సైన్స్ కూడా అందుబాటులో వుంటుంది. డిటెక్టివ్
కథలకంటే పోలీస్ డిటెక్టివ్ కథలు నేటి
పాఠకులకి, ప్రేక్షకులకి వాస్తవికంగా అన్పించి వెంటనే కనెక్ట్ అవుతారు కూడా.
మిస్టరీ కావాలా, థ్రిల్లర్ కావాలా?
బ్రిటన్నుంచి
రచయిత్రి రూత్ రెండెల్ ‘చీఫ్ ఇన్స్
పెక్టర్ రెగ్ వెక్స్ ఫర్డ్’ అనే పోలీస్ డిటెక్టివ్ పాత్రని సృష్టించి బాగా పాపులర్
చేసింది. ఆమెకెప్పుడూ అవార్డులే. 25 అవార్డులు పొందింది. ఈ పోలీస్ డిటెక్టివ్
పాత్రతో 24 నవలలు రాసింది. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటారు. ఒక కూతురితో
సమస్యలే వుంటాయి. ఈ ఫ్యామిలీ సబ్ ప్లాట్ ప్రతీ నవల్లో క్యారీ అవుతూంటుంది. పోలీస్
డిటెక్టివ్ ని ఫ్యామిలీ మ్యాన్ గా చిత్రించవచ్చు. మామూలు డిటెక్టివ్ కి ఫ్యామిలీ, పెళ్ళాం పిల్లలూ, పిల్లీ మేకా అంటే కుదరదు. జానర్
మర్యాద కాదు. అతను ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ గా తిరుగుతూ వుండాల్సిందే, ఇలాగే స్పై
పాత్ర కూడా. తెలుగులో వచ్చిన ఏ డిటెక్టివ్ పాత్రకి కూడా ఫ్యామిలీ వుండదు. రూత్
రెండల్ రాసిన ‘ఎండ్ ఇన్ టియర్స్’ (2005) నవల్లో ఒక యాక్సిడెంట్ కేసు కథ, ఫ్యామిలీ
ఉపకథ ఉత్తమంగా వుంటాయి.
డిటెక్టివ్
నవలలు పోయి పోలీస్ డిటెక్టివ్ నవలలు రాజ్యమేలుతున్నాయి ఇప్పటికీ కూడా. ఎడ్ మెక్
బెయిన్ ‘87 వ ఏరియా పోలీస్ స్టేషన్’ అని క్రియేట్ చేసి అందులో పోలీస్ డిటెక్టివ్
పాత్రలతో ఎన్నో నవలలు రాశాడు. స్టీవ్ కరెల్లా, అలివర్ వీక్స్, మేయర్ మేయర్ వంటి
పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పాఠకుల అభిమాన పాత్రలయ్యాయి. స్టీవ్ కరెల్లా చెవిటి
మూగని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సినిమాల విషయానికొస్తే ‘ఎల్ ఏ కాన్ఫిడెన్షియల్’,
‘హీట్’, ‘ఇన్ ది హీట్ ఆఫ్ ది నైట్’, ‘ది ఫ్రెంచ్ కనెక్షన్’, ‘డర్టీహేరీ’ సిరీస్, ‘బేవర్లీ
హిల్స్ కాప్’ సిరీస్ వంటివెన్నో వచ్చాయి, వస్తున్నాయి.
ప్రైవేట్
డిటెక్టివ్ నవలలకీ పోలీస్ డిటెక్టివ్ సినిమాలకీ తేడా ఏమిటంటే, పోలీస్ డిటెక్టివ్
సినిమాలు ఎండ్ సస్పెన్స్ కథల్ని తీసి పక్కన పెట్టాయి, సీన్ టు సీన్ సస్పెన్స్ ని
కనిపెట్టాయి. అంటే మిస్టరీ సబ్ జానర్ నుంచి విడిపోయి, క్రైం థ్రిల్లర్ అనే సబ్
జానర్ కి తెర తీశాయి. అంటే పోలీస్ డిటెక్టివ్ కథలు, సినిమాలు క్రైం థ్రిల్లర్సే
తప్ప మిస్టరీలు కావన్న మాట. మాస్ మార్కెట్
అయిన సినిమాల మీద గౌరవముంటే పనికొచ్చే ఈ తేడా గుర్తించాలి. ఈ తేడాతో ఈ క్రైం
థ్రిల్లర్ అనే సబ్ జానర్ కి ఎండ్ సస్పెన్స్ కాకుండా, సీన్ టుసీన్ సస్పెన్స్ అనే
కథన ప్రక్రియని చేపట్టారు. ఇదెలా వుంటుంది? ఎవరు చంపారో ప్రేక్షకులకి
చూపించేస్తారు. పోలీస్ డిటెక్టివులకి తెలియకుండా దర్యాప్తు ప్రారంభిస్తారు. ప్లాట్
పాయింట్ వన్ లేదా ఇంటర్వెల్ కొచ్చేసరికల్లా ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్
పోలీసులకి హంతకుడెవరో రివీల్ చేసేస్తారు. ఇక వాణ్ణి పట్టుకోవడానికి యాక్షన్
ప్రారంభిస్తారు. వాడెలా దొరుకుతాడనేది సీను సీనుకీ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ,
రియల్ టైంలో లైవ్ కథనం చేస్తారు. ఇందువల్లే ఇది చప్పటి ఎండ్ సస్పెన్స్ కథనం కాకుండా,
వేడి పుట్టిస్తూ వుండే సీన్ టు సీన్
సస్పెన్స్ అయింది.
అంటే,
మిస్టరీలు కాకుండా వచ్చే అన్ని ఇతర సినిమాల్లో లాగే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరో,
ఇంటర్వెల్లోనో కాన్ఫ్లిక్ట్ చూపించేసి కథేమిటో తేలిసేలా చేసేస్తారు. హీరోకి గోల్
ని ఏర్పాటు చేసి, గోల్ కోసం మిడిల్ సంఘర్షణ ప్రారంభిస్తారు. దీనివల్ల మిస్టరీలు
తప్ప అన్ని జానర్ల సినిమాల్లో వుండే - కథేమిటో అర్ధమై, ఈ కథెలా ముగుస్తుందన్న
ఇన్వాల్వ్ మెంట్ ని క్రియేట్ చేస్తారు. మిస్టరీ లొక్కటే అన్ని జానర్లు, సబ్
జానర్లూ కాదని సినిమాలకి నష్టాన్ని తెచ్చే ఎండ్ సస్పెన్స్ అనే ప్రింట్ మీడియా
వ్యాపకంతో వుంటున్నాయి.
స్థూలంగా
ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ తేడా ఏమిటంటే, ప్రైవేట్
డిటెక్టివ్ కథలు నేరాన్ని పరిశోధించడం గురించి, పోలీస్ డిటెక్టివ్ కథలు
నేరస్థుణ్ణి పట్టుకోవడం గురించి. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్
కథలు చివరి వరకూ నేరస్థుడెవరో (విలన్) తెలియని ఎండ్ సస్పెన్స్ పాసివ్ కథలు, పోలీస్
డిటెక్టివ్ కథలు నేరస్థుడెవరో (విలన్) తెలిసిపోయి వాణ్ణి పట్టుకునే యాక్టివ్ -
యాక్షన్ కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చివరి వరకూ
విలనే లేని, ‘నాకో విలన్ కావాలీ’ అని విలన్ ని వెతుక్కుంటున్నట్టు సాగే ఏకపక్ష
కథలు, పోలీస్ డిటెక్టివ్ కథలు విలన్ తెరపైకొచ్చి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేకి
తెరతీసే ద్వైపాక్షిక కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు
చిట్ట చివరికి డిటెక్టివ్ నేరస్థుణ్ణి కనుగొని, వాడిపై నేరాభియోగం చేసే కేసు
పూర్వపరాల పారాయణంతో వుంటాయి, పోలీస్ డిటెక్టివ్ కథలు కేసు పూర్వాపరాలు
ప్రేక్షకులకి తెలిసిపోయిన నేపథ్యంలో పారాయణం, ప్రసంగం, పచ్చి పులుసూ లేని పోలీస్
బ్యాంగ్ తో వుంటాయి. మాస్ మార్కెట్ అయిన సినిమాలకి ఏది బావుంటుంది?
చిట్టచివరికి
సస్పెన్స్ విప్పి మొత్తం కథంతా ఎనాలిస్ చేస్తూ (రివ్యూ రైటర్ రివ్యూ రాసినట్టు),
ముందు జరిగిన దృశ్యాల తాలూకు మాంటేజెస్, కట్ షాట్స్ వేస్తూ, ప్రేక్షకులకి గుర్తు
చేస్తూ - చూశారా నా టాలెంట్ - అని దర్శకుడు థ్రిల్లానందం పొందవచ్చు, ప్రేక్షకులకది
నిద్రానందాం. ఇంతసేపూ విలనెవరో దాచింది గాక, వాడి గురించి కతలు.
షెర్లాక్ తాతతో సినిమాలు?
తెలుగుకి
వద్దాం. తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం 1980 లలోనే అంతరించి పోయింది. మధు బాబు యాక్షన్
ఓరియెంటెడ్ అడ్వెంచరస్ షాడో వచ్చేశాడు. కాబట్టి ఇప్పటి తరానికి డిటెక్టివులు తెలియరు.
పైగా ఆ డిటెక్టివులు మనకి సాంఘిక మూలాలు లేని, సమాజంలో కన్పించని, కేవలం అప్పట్లో నవలల్లో
కన్పించిన కాల్పనిక పాత్రలే. ఇప్పటి మేకర్లు షెర్లాక్ హోమ్స్ కి ఉత్తేజితులై తెలుగులోకి
దింపేస్తున్నారు. ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ సినిమాల కొచ్చేసరికి
తేడా లెలా వుంటాయో పైన తెలుసుకున్నాం. హాలీవుడ్ లో ప్రైవేట్ డిటెక్టివ్ సినిమాలొస్తున్నాయి
కదా అంటే, వస్తున్నాయి. 2007 లో తీసిన ‘జోడియాక్’ కథని 1960-70 లలో స్థాపించి చూపెట్టారు.
అందులో కార్టూనిస్టు అవసరార్ధం డిటెక్టివ్ అవతార మెత్తుతాడు. ఈ పరిశీలనలన్నిటి దృష్ట్యా,
తెలుగు సినిమాలకి ఇంకా ప్రైవేట్ డిటెక్టివులే అవసరమో, లేక పోలీస్ డిటెక్టివులు కావాలో
ఎవరికివారే నిర్ణయించుకోవాలి.
తెలుగు
సినిమాల్లో పోలీస్ అనగానే ఇంకా అదే మూసలో ఎస్సై పాత్రనే చూపిస్తున్నారు. ఏ కథకైనా ఎస్సైనే.
మామూలు పోలీస్ స్టేషన్నుంచి పోలీస్ శాఖలో ఇంకో విభాగమైన క్రైం బ్రాంచ్ ని తెరపైకి తేవడం లేదు. ఆనాటి
డిటెక్టివ్ నవలల్లో డిటెక్టివ్ కి సాయంగా పోలీస్ డిటెక్టివ్ పాత్ర వుండేది. కొమ్మూరి
నవలల్లో డిటెక్టివ్ యుగంధర్ పాత్రకి పోలీస్ డిటెక్టివ్ పాత్ర - డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్
స్వరాజ్య రావు పాత్ర. సినిమాల్లోకి మాత్రం ఈ సాంఘిక మూలలున్న, ప్రేక్షకులు గుర్తించగల్గే,
పోలీస్ డిటెక్టివ్ పాత్రలు దిగిరాలేదు. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ అనే పాత్ర సినిమాల్లో
ఎక్కడా చూడం. ప్రభుత్వ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లని వదిలేసి, ఎవరో ప్రైవేట్ డిటెక్టివ్
లంటూ తాతల కాలం నాటి షెర్లాక్ హోమ్స్ ని కాపీ కొడుతూ కృతకంగా తీస్తారట.
ఈ
వ్యాసంలో క్రైం జానర్లో సబ్ జానరైన మిస్టరీ (డిటెక్టివ్) తో, క్రైం జానర్లోనే ఇంకో
సబ్ జానరైన క్రైం థ్రిల్లర్ (పోలీస్ డిటెక్టివ్) తోనూ వున్న లాభ నష్టాలు తెలుసుకున్నాం.
వచ్చే వ్యాసంలో మిస్టరీని వదిలేసి, క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల్ని విపులంగా చూద్దాం.
―సికిందర్
(బయట ఇంకా ఎసైన్ మెంట్స్ పూర్తికానందున
పోస్టులు రెగ్యులర్ గా రావడానికి ఓవర్ టైం చేద్దాం)
(సమయాభావం చేత ఈ వ్యాసం పేజీ మేకప్ కుదరలేదు.
రాత్రికి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేద్దాం)