రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, నవంబర్ 2017, శుక్రవారం

540 : రివ్యూ!


రచన - దర్శత్వం :  ప్రభాకర్
తారాగణం :
 ఆది, వైభవి, రశ్మి, హిమజ, బ్రహ్మాజీ, ఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ప్రకాష్ రెడ్డి దితరులు
థః డి.కె సంగీతం:  సాయి కార్తీక్, ఛాయాగ్రహణం :  కార్తీక్ ని
బ్యానర్ :
వీ4 మూవీస్, నిర్మాత : బన్నీ వాసు
విడుద :  వంబర్ 3, 2017
***
            దో సామెత చెప్పినట్టు అదే పనిగా దెయ్యాల జుట్టు గొరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు హాంటెడ్ ప్లేసెస్ గా మారిపోతున్నాయి. వారానికో కొత్త తెలుగు దెయ్యం ప్రేక్షకుల్ని వెతుక్కుంటూ దిగుతోంది.  తెలుగు దెయ్యపు కేకలు, తెగులుతో వున్న నటుల పకపకలూ బయట దెయ్యాలు తిరిగే సెకండ్ షో వేళల్లో కూడా గోల చేస్తున్నాయి. హార్రర్ కామెడీ చార్మినార్ సిగరెట్టంత చీపుగా మారిపోయింది. దెయ్యాలకి కమెడియన్లు తోడై థియేటర్లలో కామెడీ షోలని నిర్వహిస్తున్నారు – వాళ్ళతో వున్న టీవీ షోలు  చాలవనట్టు. జిఎస్టీ కీ ఘోస్ట్ కీ సంబంధం లేదని కూడా అనుకుంటున్నారు. జీఎస్టీ తో టికెట్ల రేట్లు అమాంతం పెరిగిపోయి ప్రేక్షకుడు సెలెక్టివ్ గా సినిమాలు చూస్తున్న పరిణామం కన్పిస్తున్నా, మళ్ళీ కొత్తగా ప్రేక్షకులని ఆకర్షించే ప్రయత్నమే లేకుండా, అదే అరిగిపోయిన దెయ్యపు సరుకు లేజీగా అందిస్తున్నారు. ఈ పనీపాటాలేని ఘోస్టుల సంగతి ఇక జీఎస్టీ యే చూసుకోవాలి.

          కొత్త వాళ్లకి అవకాశాలిచ్చి,  చిన్న బడ్జెట్ సినిమాలు తీయాలని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు చేతులు కలిపి వీ4 మూవీస్ గా ఏర్పడ్డాయి. టీవీ రంగం నుంచి వచ్చిన ప్రభాకర్ కి దర్శకుడిగా అవకాశమిస్తూ తొలి సినిమా ప్రారంభించారు. కానీ కొత్తవాళ్ళతో ఇంకా  అరిగిపోయిన పాత మూస ఫ్లాపులు తీయడానికి ఈ మూడు పెద్ద సంస్థలే ముందుకు రానక్కరలేదు, ఈ పని చిన్న చిన్న సంస్థలు వారం వారం ఎప్పటినుంచో చేసుకుంటున్నాయి. పెద్ద సంస్థలు చిన్న బడ్జెట్లతో కొత్తని అందిస్తేనే మర్యాద.

          నెక్స్ట్ నువ్వే అంటూ దెయ్యపు కామెడీలో నటించే వంతు హీరో ఆదికి కూడా వచ్చి, ఓ పని  పూర్తయిపోయింది. ఏం మిగిలింది?  తను గనుక దీని తమిళ కాపీని చూపించమని అడిగి, దాని కొరియన్ ఒరిజినల్ నీ, ఆ కొరియన్ కి జపనీస్ అధికారిక రీమేకునీ కూడా చూపించమని అడిగి చూసి, తమిళ కాపీని పక్కన బెట్టి, ఆ  కొరియన్ – జపనీస్ లని ఉన్నదున్నట్టూ కాపీ కొట్టమని చెప్పి వుంటే, కొంత బెటరయ్యేది. ఇలాకాక తమిళ కాపీలాగే, మళ్ళీ దీన్ని అనుసరించి తీసిన కన్నడ కాపీలాగే తెలుగులో ‘రీమేక్’ చేస్తే, మిగిలిందేమిటి?

          1998 లో విడుదలైన ‘క్వయిట్ ఫ్యామిలీ’ అనే కొరియన్ దెయ్యం కామెడీలో దెయ్యం చంపుతూండగా, పులిమీద పుట్రలా ఓ కిరాయి హంతకుడు చంపడాని కొస్తాడు. ఆస్తిని కాజెయ్యడానికి బంధువొకడు పంపిన కిరాయి హంతకుడు- వాడి టార్గెట్ గా ఒకమ్మాయి. ఈ సీరియస్ సబ్ ప్లాట్ తో కథకి డెప్త్ వస్తుంది. కానీ మనకి కథకి ఇలాటి లోతుపాతులు అక్కర్లేకుండా,  ఏదో పైపైన రాసేసి, పైపైన తీసేస్తే,  చూసే వాళ్ళు పైపైన చూసేసి వెళ్ళిపోతారు. ఇంతే చాలు. 

          ‘రాజు గారి గది- 2” అనే మలయాళ రీమేకు గత నెలే వచ్చింది. అందులో  మిత్రులు ఓ రిసార్ట్స్ తీసుకుని నడుపుతూంటే, అందులో వున్న ఆడ దెయ్యం గొడవ చేస్తూంటుంది (ఆడవాళ్లే దెయ్యాలై చీకటి కూపాల్లోవుంటారా? మగవాళ్ళు స్వర్గంలో జల్సా చేస్తారా? ఎప్పుడో తిరుగుబాటు వస్తుంది ). సరీగ్గా ఇలాగే ఇప్పుడు ఈ తాజా దెయ్యంలో హీరో తెరచిన రిసార్ట్స్ లో దెయ్యం చంపు
తూంటుంది. కిరణ్ (ఆది) ఒక సీరియల్ డైరెక్టర్. సీరియల్ ఫ్లాపవడంతో ఫైనాన్సర్ (జయప్రకాష్ రెడ్డి) వెంటబడతాడు. కిరణ్ కి ఆస్తి కలిసి వస్తుంది. తన తండ్రి (పోసాని) ఓ పెద్దభవనం తనకివదిలిపో
యా
డని తెలిసి అక్కడికి వెళ్తాడు. వెంట ప్రేమిస్తున్న సీరియల్ హీరోయిన్ (వైభవి) వస్తుంది. పాడు
బడి వున్న ఆ భవనానికి కాపలాగా శరత్ (బ్రహ్మాజీ) వుంటాడు. దాన్ని బాగు చేసి రిసార్ట్స్ తెరుస్తారు (అది రిసార్స్ట్ లా వుండదు). అక్కడే శరత్ చెల్లెలు (రశ్మి) వుంటుంది. అక్కడ దిగే కస్టమర్లు చనిపోతూంటారు. భయపడి వీళ్ళు ఆ శవాల్ని పూడ్చేస్తూంటారు. దెయ్యం తమ జోలికి రాకుండా కస్టమర్లని ఎందుకు చంపుతోందంటే, వాళ్ళు పూర్వపు యజమానులు. ఇక ఇప్పటి యజమాని కిరణ్ వంతు కూడా వస్తుంది. ఈ దెయ్యం యజమానుల్ని ఎందుకు చంపుతోంది? దీన్నుంచి కిరణ్ ఎలా బయటపడ్డాడు? ... అన్నవి  తెలుసుకుని తలబాదుకోవాలంటే దీనికి  తప్పక అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. 

          పాత సినిమాల్లో డ్రామా లుంటాయి. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు. ఇక్కడ దెయ్యంకంటే కూడా హీరోకోసం హీరోయిన్ల కయ్యాలే గయ్యీ మంటూంటాయి. వీళ్ళే దెయ్యాల్లాగా కయ్యాలు పెట్టుకుంటారు. ఫస్టాఫ్ అంతా దెయ్యం కన్పించదు, వీళ్ళే దెయ్యా ల్లాగా వుంటారు. ఇతర దృశ్యాలు కూడా ఇంకా అరవైల నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్నామా అన్నంత పాతబడి వుంటాయి. పూర్ రైటింగ్,  పూర్ డైరెక్షన్ దెయ్యంతో పోటీపడి  మన ప్రాణాలు తీస్తాయి. ఇంటర్వెల్ కల్లా కాలికి బుద్ధి చెప్పిన ప్రేక్షకులే  ఎక్కువ. 

          సెకండాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్. అందులో దెయ్యం కథ చాలా సిల్లీగా వుంటుంది. కనిపించని దెయ్యంతో భయమే లేదు, కన్పించే నటులు చేసే కామెడీచూసి నవ్వుకోవాలని దర్శకుడి ఉద్దేశం. ఏం కామెడీ అది? అది కామెడీయా?  

           దర్శకుడవాలనుకుని  సొంతంగా కథ ఆలోచించలేని ప్రభాకర్, తమిళం నుంచి తెచ్చుకుని, అది కూడా అరిగిపోయిన దెయ్యం కామెడీని తెచ్చుకుని  చేసినట్టు, ఇంకెవరైనా కొత్త వాళ్ళు ప్రయత్నిస్తే కుదురుతుందా? కథనీ తమిళ వెర్షన్ లోనే చూసి, దర్శకత్వాన్నీ తమిళ వెర్షన్ లోనే చూసి, తెలుగులోకి కాపీ పేస్ట్ చేసే సదవకాశం ఎందరు కొత్త దర్శకులకి లభిస్తుంది?  షార్ట్ కట్స్ తో ఫలితం షార్ట్ సర్క్యూటే అవుతుంది.


-సికిందర్ 


539 : రివ్యూ!


రచన – దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
తారాగణం  :
 రాజశేఖర్, పూజా కుమార్, శ్రద్ధాదాస్, సన్నీ లియోన్, అదిత్ అరుణ్, వివర్మకిషోర్, నాజర్, షాయాజీ షిండే,  పోసాని కృష్ణమురళి, అవరాల శ్రీనివాస్, అలీ, పృథ్వీ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో , నేపథ్య సంగీతం:  శ్రీచణ్ పాకాల , ఛాయాగ్రహణం : అంజి, సురేష్ ఆర్, శ్యామ్ ప్రసాద్, గీకా, బాకుర్ 
బ్యానర్ :   శివాని శివాత్మిక ఫిలింస్, జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్
నిర్మాత : ఎం.కోటేశ్వర్ రాజు 
విడుద: నవంబర్ 3, 2017 
***
        విజయాలు లేక రెండేళ్ళు విరామం తీసుకున్న రాజశేఖర్ అత్యంత భారీ యెత్తునపునరాగమన సన్నాహం చేశారు. ఒకప్పుడు మగాడుగా బాక్సాఫీసుని ఏలితే, ఇప్పుడు  సామాన్యుడుగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికొచ్చారు. చందమామ కథలు, గుంటూరు టాకీస్ వంటి నాల్గు చిన్న తరహా సినిమాలు తీస్తూ వచ్చిన  దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా బాణీమార్చి ఏకంగా బిగ్ బడ్జెట్  యాక్షన్ హంగామాకి పాల్పడ్డారు, అది కూడా రాజశేఖర్ తో.  ఇప్పుడు ఈ ఇద్దరి పరిస్థితేమిటి? వుంటారా, పోతారా? ఇది తెలుసుకోవడానికి సినిమాలోకి వెళదాం...

కథ
 
       శేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ లో అసిస్టెంట్ కమిషనర్. తన బృందంతో కలిసి నగరంలో ఆయుధాల, మాదకద్రవ్యాల ముఠాలని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో వుంటాడు. ఈ ముఠాల దగ్గర ఒక ఎన్ క్రిప్ట్ చేసిన కోడ్ దొరుకుతుంది. దాన్ని హ్యాక్ చేస్తే, మూడు గంటల వ్యవధిలో బాంబు దాడి జరగబోతోందని తెలుస్తుంది. కష్టపడి  ఆప్రాంతాన్ని కనుక్కుంటే, అక్కడ ర్యాలీ జరుపుకోవడాని కొస్తున్న ప్రతాపరెడ్డి (పోసాని) అనే రాజకీయ నాయకుణ్ణి టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ దాడి నుంచి ప్రతాపరెడ్డిని కాపాడిన శేఖర్ కి,  నిరంజన్ అనే అనుమానితుడు దొరుకుతాడు. ఈ నిరంజన్ దగ్గరే అసలు రహస్యమంతా వుంటుంది. 

          రాష్ట్రంలో బయటపడిన  ప్లుటోనియం నిల్వల్ని మైనింగ్ చేసి ఉత్తరకొరియాకి తరలించే కుట్ర చేస్తున్న మంత్రులు, అధికారులు, బ్రోకర్లూ అందరి గుట్టూ తెలుస్తుంది శేఖర్ కి. దీంతో నిరంజన్ సహా శేఖర్ ని చంపేసేందుకు వేటాడతుంది  మైనింగ్ మాఫియా. శేఖర్ కి ఇంటిదగ్గర భార్యతో సఖ్యత వుండదు. ఇటు భార్యతో సమస్య, అటు ప్రాణాల సమస్య నెదుర్కొంటూ శేఖర్,  మైనింగ్ మఫియాని ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 

        అంతర్జాతీయ కుట్రకి సంబంధించిన  హై కాన్సెప్ట్ కథ. ఆమధ్య ‘ఘాజీ’ అనే ఇలాటిదే అంతర్జాతీయ హై కాన్సెప్ట్ కథ తెలుగులోనే వచ్చి విజయం సాధించింది. అది ఇండో - పాక్ యుద్ధనేపధ్యంలో వుంటే, ఇది అమెరికా -  ఉత్తర కొరియాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంగా వుంది. ఉత్తర కొరియాకి ఇండియా నుంచి అణుపదార్ధాన్ని సరఫరా చేస్తున్న మాఫియా ఒక మాట అంటాడు – ఈ భారీ స్మగ్లింగ్ తెలిస్తే ఐక్యరాజ్య సమితిలో ఇండియా పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోమంటాడు. ఇరాక్, ఇరాన్ లకి పట్టిన గతే ఇండియాకీ పడుతుందని బెదిరిస్తాడు. కానీ అప్పటి దాకా ఉత్తర కొరియా చేతిలో ఈ అణుపదార్ధంతో అమెరికా వుంటుందా? అణుస్మగ్లింగ్ అనే ఐడియాతో  ఈ తెలుగుకథ కొత్తగా వున్నా, దీని నిర్వహణ ద్వితీయార్ధంలో మళ్ళీ మూస వాసనేస్తుంది. మూస వాసనని అధిగమించి విజువల్ అప్పీల్ తో కొత్తగా మారిపోయిన ‘గోల్ మాల్ ఎగైన్’ ఇటీవలే చూశాం. దీన్ని ఈ కథ సాధించలేక పోయింది, ఎంతైనా తెలుగు కథే  కదా అన్నట్టు.

ఎవరెలా చేశారు 

        రాజశేఖర్ పునరాగమన నటన పాతని వదిలించుకుంది. చొక్కాచేతులు పైకి మడిచి కళ్ళెర్రజేసి, సాయికుమార్ గళంతో భీకర రావాలు చేసే మ్యాననరిజమ్స్ దేవుడి దయవల్ల ఇకలేవు. చాలా సింపుల్ గా, అంతే శక్తివంతంగా, క్యాజువల్ డైలాగులతో సహజంగా నటించారు. ఇప్పుడు ఫేసులో తాజాదనం వుట్టిపడుతూ, చూసినకొద్దీ చూడాలనిపించేలా మారిపోయి వచ్చారు. తనెప్పుడో పోలీసు పాత్రల్లో ఆరితేరిపోయారు. ఇప్పుడు విలన్ నోట ‘నువ్వొక సామాన్యుడివేరా’  అని తిట్టించుకుని సామాన్యుడి పవరేంటో స్టయిలిష్ గా చూపించారు. ఇంటి దగ్గర భార్యతో గొడవలు కథలో కావాలని జొప్పించినట్టు వుండడంతో ఆ దృశ్యాల్లో రాజశేఖర్ నటన పెద్దగా ఆకట్టుకోదు. మిగతా సన్నివేశాల్లో, యాక్షన్ దృశ్యాల్లో ఇది తనకి గుర్తుండి పోయే పునరాగమనమే తప్ప విఫలయత్నం కాదు. ఇలాగే రియలిస్టిక్ గా విభిన్న తరహా పాత్రలు పోషిస్తే మళ్ళీ తన సినిమాలు బావుంటాయి. ఒకనాడు ఇలాటిదే టెక్నికల్ థ్రిల్లర్ ‘మగాడు’ తనకెంతో ఇప్పుడు ‘గరుడవేగ’ అంత. 


       హీరోయిన్ పూజా కుమార్ భర్త తనకి సమయం  కేటాయించడం
లేదని విడాకుల దాకాపోయే చాదస్తపు పాత్ర. బిజీ పోలీస్ ఏజెంట్లకి ఇంటి దగ్గర ఇలాటి భార్యల్ని కేటాయించడం ఒక ఫార్ములాగా మారింది. ఇలాటి కథలకి హాలీవుడ్ ప్రకారం బయట ఫిజికల్ యాక్షన్ తో హీరోవుంటే,ఇంట్లో భార్యతో ఎమోషనల్ యాక్షన్ వుండాలి. ఈ ఫిజికల్ - ఎమోషనల్ యాక్షన్ల ద్వంద్వాల ఉద్దేశం అర్ధం జేసుకోకుండా పెడితే ఇదిగో ఇలాగే జానరేతరంగా పానకంలో పుడకల్లా వుంటాయి సీన్లు. క్లయిమాక్స్ యాక్షన్ సీన్ల మధ్య  ఈ సంసార గొడవల సరిత్సాగరం మరీ దెబ్బ తీసింది జానర్ మర్యాదని. 

          విలన్ గా కిషోర్ ఎఫెక్టివ్ గానే వున్నాడు గానీ, కథలోకి ద్వితీయార్ధంలో ఎప్పుడోగానీ రాడు. ఈ యాక్షన్ కథ మిస్టరీతోకూడి వుండడం వల్ల ఈ పరిస్థితి. సన్నీలియోన్ ఒక డాబా పాటలో కవ్వించి పోతుంది. హీరో హీరోయిన్ల మధ్య సమస్యకి సైకియాట్రిస్టుగా అలీకి ఒకే దృశ్యముంది. ఇంకో డాక్టర్ గా పృథ్వీ కన్పిస్తాడు. పెద్దగా హస్యమాడే పాత్రలు కావివి.  రాజకీయ నాయకుడి పాత్రలో పోసాని అర్ధాంతరంగా అంతర్ధానమవుతాడు. ఎన్ ఐ ఏ ఏజెంటుగా రవివర్మ, హ్యాకర్ గా అదిత్ అరుణ్, ఎన్ ఐ ఏ బాస్ గా నాజర్ కన్పిస్తారు. ఇక టీవీ రిపోర్టర్ గా శ్రద్ధాదాస్ కి ఏమంత పాత్రలేదు. 



      సాంకేతికంగా బాగా ఖర్చుపెట్టి తీశారు. ఇప్పుడు రాజశేఖర్ మీద పదుల కోట్ల బడ్జెట్ అంటే రిస్కే. అనుకున్న బడ్జెట్ దాటి పెరుగుతూ పోయిందని చెప్పుకుంటున్నారు. పెరిగింది వృధా కాలేదు గానీ, వసూళ్ళకి ఏటికి ఎదురీదాలి. టికెట్టు కొన్న ప్రేక్షకుడు మాత్రం ఏడ్చుకుంటూ పోడు. పైపెచ్చు రొడ్డ కొట్టుడు సినిమాల మధ్య చాలా బెటరని తలవంచుకుని పోతాడు.

      బీమ్స్ సంగీతంలో రెండే పాటలున్నాయి.
శ్రీచణ్ పాకాల  నేపధ్య సంగీతం  చాలా హైలైట్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి. ఇక ఎందరో ఛాయాగ్రాహకులు కలిసికట్టుగా ఈ యాక్షన్ హంగామాని సమున్న
తంగా దృశ్యమానం చేశారు. ఇంతవరకూ చిన్న బడ్జెట్ సినిమాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఉన్నట్టుండి బిగ్ కాన్వాస్ తో, హై కాన్సెప్ట్ ని కూడా ఒంటి చేత్తో తీసి అవతల పడెయ్యగలనని ఆశ్చర్యకరంగా నిరూపించుకున్నారు.

(స్క్రీన్ ప్లే సంగతులు రేపు)

సికిందర్  
www.cinemabazaar.in
(edited typos)

         

           




2, నవంబర్ 2017, గురువారం

538 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు






ఎండ్ విభాగమనేది బిగినింగ్ విభాగంతో దాదాపు సమాన నిడివితో, సమాన సీన్లతో వుంటుంది. అయితే వుండాలని ఖచ్చితంగా నియమం అయితే లేదు. కథని బట్టి తేలుతుంది. ఒకే ఒక్క సీనుతో బిగినింగ్ ముగిసే సినిమాలుండవు. కొత్తగా ఎవరైనా చేయగలిగితే అదొక అద్భుతమే అవుతుంది. కోయెన్ బ్రదర్స్ ఒకే ఒక్క సీనుతో ఎండ్ ని ముగించారు ‘బ్లడ్ సింపుల్’ లో. దీని నిడివి సుమారు పది నిమిషాలు. వెనుక 35 వ సీనులో ప్లాట్ పాయింట్  టూ రావడాన్ని గమనించాం. అంటే ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం దొరకడమన్న మన్న మాట. కథ మొదలెడుతూ ప్రధాన పాత్రగా వున్న విస్సర్ తనే కథ ముగించాలి. ఈ కథ ముగించడానికి రే తోడ్పడ్డాడు. అతను బార్ కెళ్ళి తమ మీద (రే – ఎబ్బీ) విస్సర్ సృష్టించిన నకిలీ ఫోటో చూసేశాడు. ఇప్పుడు రే ని చంపి ఆ ఫోటో చేజిక్కించుకోవడం మినహా పరిష్కారమార్గం లేదు విస్సర్ కి.

       అలా అతనిప్పుడు ఈ 35 వ సీన్లో వచ్చి దాడి చేస్తాడు. వూహించని విధంగా ఒకే ఒక్క గుండు దెబ్బకి నేలకూలుతాడు రే. ఇద్దరి మధ్య సంఘర్షణేమీ వుండదు. పరస్పరం ఎదుట పడరు, చూసుకోరు. ఈ కథ మొత్తానికీ కారకుడైన తన శత్రువెవరో కూడా తెలీకుండా చనిపోతాడు రే. అలాగే ఆ శత్రువెవరో కూడా చూడకుండానే చంపేస్తుంది ఎబ్బీ. ఇదీ డైనమిక్స్ (ఈ వ్యాసం కింద ఇచ్చిన లింకుని క్లిక్ చేసి క్లిప్పింగ్ చూడండి).

      మొత్తం స్క్రీన్ ప్లేలో మార్టీ, ఆతర్వాత రే చనిపోబోతున్నారనీ, ఆ చావు ఫలానా ఈ విధంగా వుంటుందనీ ఏర్పాటు చేసిన  నిగూఢార్ధాల ద్వారా మనకి తెలిసిపోతుంది. సేఫ్ దగ్గర మార్టీ వంగినప్పుడు టిల్ట్ అప్ షాట్ లో సీలింగ్ కన్పించే విధంతో అతను నరకయాతన ననుభవించి మరణిస్తాడనీ, అలాగే సేఫ్ దగ్గర రే కూర్చున్నప్పుడు టిల్ట్ అప్ షాట్ లో సీలింగ్ కన్పించే తీరుతో ఇతను ఆకస్మికంగా చనిపోతాడనీ తెలుసుకుంటాం. అదే జరిగిందిక్కడ. ఒక్క గుండు దెబ్బకి చంపింది ఎవరో ఏమిటో కూడా తెలీకుండా చనిపోతాడు రే.

        ఈ ముగింపు కథకి న్యాయం చేసిందా? తప్పకుండా చేసింది. నియో నోయర్ డార్క్ మూవీస్  కథలు నీతిని స్థాపించే ఉద్దేశంతోనే వుంటాయి. ఈ కథలో మార్టీ, విస్సర్, రే, ఎబ్బీ అందరూ నీతి తప్పిన వాళ్ళే. ఈ అవినీతి కథాసుధ ఎబ్బీ నీతి తప్పడంతో ప్రారంభమ
య్యింది. ఆమె నీతి  తప్పడానికి మార్టీతో ఆమె వైవాహిక జీవితంలోని అసంతృప్తే కారణం. ఈ కారణంతో ఆమె పట్ల సానుభూతి కల్గేలానే వుంది పాత్రచిత్రణ. ఆమెకి తగిన శాస్తి జరగాలన్పించదు. పైగా ఆమె దారి తప్పినా కూడా భర్త మార్టీయే పూర్తిగా ద్వేషించలేక పోతున్నాడు. లవ్ – హేట్ రిలేషన్ షిప్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. 

      కానీ మార్టీ దగ్గర ఉద్యోగిగా రే అతడి భార్యతో సంబంధం పెట్టుకోడం విశ్వాసఘాతు
కమే అవుతుంది. ఇతడికి శాస్తి జరగాల్సిందే. జరిగింది కూడా. నీతి తప్పిన ఎబ్బీ,  రే లని చంపెయ్యాలనుకోవడం మార్టీ కూడా పాల్పడిన అవినీతి. ఇందుకు మూల్యం చెల్లించు కున్నాడు. ఇక ఎబ్బీ, రే లని చంపి రమ్మంటే నీతితప్పి విస్సర్ మార్టీ మీదికి తుపాకీ ప్రయోగించాడు. అందుకు అనుభవించాడు చివరికి. ఇలా కథకి న్యాయం జరిగి, నీతిని స్థాపించడమనే  కథా ప్రయోజనం నెరవేరింది.

        మరి ఎబ్బీ? ఈ చావులన్నీ చూశాక తనెంత తప్పు చేసిందో తెలిసే వుండాలి. తను అబల. మగవాడి నీడ లేకపోతే బతకలేనితనం. ఈ పిరికితనంతో ఇద్దరు మగాళ్ళ నీడన బతకాలనుకుంది. ఇది చట్టం ఒప్పుకోదు. భర్త నుంచి విడాకులు తీసుకునే ధైర్యం కూడా ఆమెకి లేదు. విడాకులు తీసుకుని ఆమె రే తో వెళ్ళడాన్నే చట్టం ఒప్పుకుంటుంది. కనుక సమస్య వస్తే అబల లాగా ఆలోచించ వద్దనే ఈ పాత్ర ద్వారా తెలుస్తుంది. బేలతనంతో అవ్వాకావాలి, బువ్వాకావాలీ అనుకున్నప్పుడే అక్రమ మార్గం పట్టి పోతారు. అల్లకల్లోలం సృష్టిస్తారు.

     నియో నోయర్ కథలు విధి ఆడే ఆటని – లేదా కర్మ ఫలాల్ని చూపించుకొస్తూ  చివర్లో చట్టం చేతిలో పెట్టేస్తాయి. విస్సర్, మార్టీ, రేల విషయం విధి చూసుకుంది. ఎబ్బీ సంగతి ఇక చట్టం చూసుకుంటుంది. ఈ ముగింపులో ఇంట్లో రెండు శవాలు పడున్నాయి. భర్త కూడా లేడు. వీటన్నిటికీ ఏం సంజాయిషీ ఇచ్చుకుంటుంది చట్టానికి? మొత్తం వ్యవహారం ఆమె ద్వారా చట్టం తెలుసుకుంటుంది. బోనెక్కించి ఏం చేయాలలో ఆలోచిస్తుంది. ఇది ముగింపు అనంతరం మన వూహకొదిలేసిన జరగబోయే అసలు ముగింపు.


       నియో నోయర్ కథలు విధి ఆడే ఆటని – లేదా కర్మ ఫలాల్ని చూపించుకొస్తూ  చివర్లో చట్టం చేతిలో పెట్టేస్తాయి. విస్సర్, మార్టీ, రేల విషయం విధి చూసుకుంది. ఎబ్బీ సంగతి ఇక చట్టం చూసుకుంటుంది. ఈ ముగింపులో ఇంట్లో రెండు శవాలు పడున్నాయి. భర్త కూడా లేడు. వీటన్నిటికీ ఏం సంజాయిషీ ఇచ్చుకుంటుంది చట్టానికి? మొత్తం వ్యవహారం ఆమె ద్వారా చట్టం తెలుసుకుంటుంది. బోనెక్కించి ఏం చేయాలలో ఆలోచిస్తుంది. ఇది ముగింపు అనంతరం మన వూహకొదిలేసిన జరగబోయే అసలు ముగింపు.

        ‘బ్లడ్ సింపుల్’ స్క్రీన్ ప్లే సంగతులు చాలా సుదీర్ఘంగా సాగాయి. తెలుగు సినిమాలంటే ప్రేమలు, ప్రేతాలు తప్ప ఇంకో లోకం తెలీకుండా పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వున్న ఇంకో లోకాన్ని – జానర్ ని చూపించడానికే ఈ వ్యాసాలు. కొందరు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. మంచిదే. ఉంటే ఈ పని మీదే వుండాలి. ఆ జానర్ ఒకటి, ఈ జానర్ ఒకటి రకరకాల పడవల మీద ప్రయాణించాలనుకుంటే మాత్రం ఎన్నటికీ నియో నోయర్ తీసి పేరు గడించలేరు.

        ‘బ్లడ్ సింపుల్’ 1980 లలో ఒక తరం నాటి సృష్టి. ఇది అడల్ట్ పాత్రల కథ. 2005 లో టీనేజీ పాత్రలతో తీసిన నియోనోయర్ ‘బ్రిక్’ కూడా వుంది. ఇది కూడా ‘బ్లడ్ సింపుల్’ అంత ప్రసిద్ధమైనది. నేటికాలపు ఈ టీనేజి కథని కూడా 1930 లనాటి డషెల్ హెమెట్ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలు అందించిన విషయ వ్యక్తీకరణతోనే తీశారు. వచ్చే వారం దీని స్క్రీన్ ప్లే సంగతులు మొదలెడదాం.


-సికిందర్




         


        


          










28, అక్టోబర్ 2017, శనివారం

536 : రివ్యూ!

కథ - దర్శకత్వం :  రోహిత్ శెట్టి
తారాగణం : అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పడే, కుణాల్ ఖేమూ, పరిణీతీ చోప్రా, టబు, ప్రకాష్ రాజ్, నీల్ నితిన్ ముఖేష్, జానీ లివర్, సంజయ్ మిశ్రా, ముకేష్ తివారీ, మురళీ శర్మ తదితరులు
స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : సాజిద్ - ఫర్హాద్, సంగీతం : ఆమాల్ మాలిక్, తమన్ తదితరులు, ఛాయాగ్రహణం : జోమన్ టి. జాన్
బ్యానర్ : రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్, మంగళ్ మూర్తి ఫిలిమ్స్
నిర్మాతలు : రోహిత్ శెట్టి, సంగీతా ఆహిర్
విడుదల : అక్టోబర్ 20, 2017
***
          మైండ్ లెస్ కామెడీల ‘గోల్ మాల్’ సిరీస్ లో నాల్గోది ‘గోల్ మాల్ ఎగైన్’ ఏడేళ్ళకి ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేసింది. మొదటి మూడు సిరీస్ కామెడీలు రెండేళ్ళ గ్యాప్ తో వస్తే, ఈ నాల్గోది చాలా సమయం తీసుకుంది.  సిరీస్ లో కొనసాగుతున్న హీరోల్లో ఒకరిద్దరి మార్పులు తప్ప మిగిలిన హీరోలంతా  ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ హీరోలలాగే ఒక కుటుంబంగా పాపులరైపోయారు. హిందీలో ఐదుగురు హీరోలతో  ఒక సిరీస్ గా మల్టీ స్టారర్ సినిమాలు రావడం ఇదే ప్రథమం. పైగా ఇవన్నీ హిట్టవుతూ రావడం అలవాటుగా మారిపోయింది. పక్కా కమర్షియల్ దర్శకుడు రోహిత్ శెట్టి ఎప్పటి కప్పుడు సిరీస్ ని అప్ డేట్ చేస్తూ  ఒకదాన్ని మించి ఒకటిగా  తీసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుత మైండ్ లెస్ కామెడీని డిజైనర్ లుక్ తో ప్రెజెంట్ చేయడంతో అంతా కొత్త కొత్తగా, కన్నుల పండువగా మారిపోయింది. పాత కథలకే  డిజైనర్ లుక్ అద్దినప్పుడే అవి  వొక ఫాంటసీ లాగా మారిపోయి హిట్టవగలవని  దీంతో రుజువు చేశాడు. 

          చివరంటా ప్రేక్షకుల్ని కుదురుగా కూర్చోనివ్వని ‘గోల్ మాల్ ఎగైన్’ మైండ్ లెస్ కామెడీలకి వొక పరాకాష్ఠ. కామెడీ కోసం అశ్లీలాన్ని ఆశ్రయిస్తున్న రోజుల్లో, ఇబ్బంది పెట్టకుండా ఇంతకంటే ఎక్కువ డోసుతో ప్రేక్షకుల్ని సీట్లలో ఎగిరెగిరి పడేలా చేసే  మైండ్ లెస్ కామెడీలే చాలా బెటరని కూడా దీంతో రుజువవుతోంది. కాకపోతే ఇది చాలా క్రియేటివిటీని  డిమాండ్ చేస్తుంది  అశ్లీల – ద్వంద్వార్ధాల కామెడీల కంటే. ఈ నేపధ్యంలో ఈ నాల్గో ప్రాంచైజ్ కథాకమామిషేమిటో ఓసారి  చూద్దాం...

కథ
     గోపాల్ (అజయ్ దేవగణ్), మాధవ్ (అర్షద్ వార్సీ), లక్కీ (తుషార్ కపూర్), లక్ష్మణ్ వన్ (శ్రేయాస్ తల్పడే),  లక్ష్మణ్ టూ (కుణాల్ ఖేమూ) ఐదుగురూ ఊటీలో జమునాదాస్ (ఉదయ్ టికేకర్) నడిపే రాజభవనం లాంటి అత్యంత విలాసవంతమైన అనాధాశ్రమంలో పెరుగుతారు. పెరుగుతున్నప్పుడు పసిపాపగా వున్న ఖుషీ (పరిణీతీ చోప్రా) ని ఎవరో గేటుముందు వదిలేసి పోతారు. ఆ ఖుషీని ఆడిస్తూ పాడిస్తూ పెంచుతారు. ఈ ఐదుగురూ కుదురుగా వుండే శాల్తీలు కావు. ఒక వెధవ పని చేసి గోపాల్, లక్ష్మణ్ టూ లు అనాధాశ్రమం నుంచి అవుటయి పోతే, మిగతా ముగ్గురూ అలాగే గెటవుటై పోతారు. అలా మొదటి ఇద్దరూ ఎక్కడో, తర్వాతి ముగ్గురూ ఇంకెక్కడో పదేళ్ళ తర్వాత పెద్దవాళ్ళయి తేల్తారు. ముగ్గురు వసూలీ భాయ్ (ముఖేష్ తివారీ) అనే రియల్ ఎస్టేట్ దొంగ వెంట వుంటే, ఇద్దరు ఖాళీగా తిరుగుతూంటారు. ఈ ఇద్దర్లో గోపాల్ చీకటిపడితే దెయ్యాలుంటాయని భయపడి చచ్చేరకం. ఇతణ్ణి  జోలపాడి నిద్రపుచ్చుతూంటాడు లక్ష్మణ్ టూ. ఈ దెయ్యం భయాన్నే ఉపయోగించుకుని మిగతా ముగ్గురూ టెక్నికల్ గా దెయ్యపు చేష్టల్ని సృష్టించి,  వాళ్లిద్దర్నీ ఫ్లాట్ ఖాళీ చేయిం చేస్తారు వసూలీ భాయ్ కోసం. 

          అప్పుడు ఆ ఇద్దరికీ తమని పెంచిన జమునాదాస్ చనిపోయాడని తెలిసి ఊటీ వెళ్లి అనాధాశ్రమంలో మకాం పెడతారు. అప్పటికే రియల్ ఎస్టేట్ కోసం అనాధాశ్రమం ఆస్తులపైన కన్నేసిన బిగ్ షాట్ వాసూ రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ఈ ఇద్దరి మకాం నచ్చక, ఖాళీ చేయించేందుకు వసూలీ భాయ్ కి ఆర్డరేస్తాడు. వసూలీ భాయ్ మళ్ళీ ఆ ముగ్గురికీ ఎసైన్ మెంటిచ్చి  పంపుతాడు. అనాధాశ్రమం వచ్చిన  మాధవ్, లక్కీ, లక్ష్మణ్ టూ ముగ్గురూ మళ్ళీ గోపాల్, లక్ష్మణ్ వన్ ల పనిబట్టడం మొదలెడతారు. అక్కడే ఇప్పుడు అందమైన యువతిగా ఎదిగిన ఖుషీని చూస్తారు. ఖుషీని ప్రేమిస్తున్న గోపాల్ నీ చూస్తారు. చిన్నప్పుడు తాము చూసిన ఆశ్రమ ఇంఛార్జి, లైబ్రేరియన్  ఆనా (టబు)నీ చూస్తారు. ఇంతలో ఖుషీ అమ్మాయి కాదనీ, ఆత్మ అనీ తెలిసి మొత్తమంతా ఠారెత్తి పోతారు. 

          ఖుషీ ఆత్మ ఎలా అయింది? జమునాదాస్ ఎలా చనిపోయాడు? నిఖిల్ (నీల్ నితిన్ ముఖేష్) అనే ఎన్నారైతో కలిసి  వాసూరెడ్డి ఏ ఘాతుకానికి పాల్పడ్డాడు? ఈ పరిస్థితికి ఐదుగురూ ఒకటై ఏం చేశారు? ... ఇవన్నీ మిగతా కథలో తేలే విషయాలు. 

ఎలావుంది కథ
     ఇది తెలుగులో పైశాచిక ఎమర్జెన్సీ విధించుకుని యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్న,  అరిగిపోయిన మూస దెయ్యాల కామెడీ కాదు. దెయ్యాల కామెడీలనే సులభమైన పని పెట్టుకున్నాక, ఫాంటసీ అనే జానర్ నే మర్చిపోయారు. ‘గోల్ మాల్ ఎగైన్’ ఆత్మతో ఒక అందమైన ఫాంటసీ. ఈ ఆత్మ తెలుగు దెయ్యంలా భయపెట్టే దుకాణం పెట్టుకోదు. భయపడే పాత్రలు కామెడీలు  చేసే వ్యాపారం పెట్టుకోవు. బరితెగించిన కామెడీ ఐదుగురు హీరోల కజ్జాలతోనే వుంటుంది. ఆత్మని ఫాంటసీ చేసి, డిజైనర్ లుక్ తో కొత్తదనం తీసుకొచ్చిన వినోదాత్మక కథ ఇది.  

ఎవరెలా చేశారు 
      ఐదుగురూ టాప్ రేంజిలో తమతమ బఫూనరీలని ప్రదర్శిస్తారు. ఎక్కువ కామిక్ టైమింగ్ వున్న వాడు శ్రేయాస్ తల్పడే. సమయస్ఫూర్తితోనే హాస్యం పండుతుంది. అజయ్ కి జోల పాడేటప్పుడు, అజయ్ కి పరిణీతి కోసం హెల్ప్ చేసేటప్పుడు, శత్రుత్రయం ముగ్గురి తాటతీసే సన్నివేశాల్లో, తల్పడే పాల్పడే మైండ్ లెస్ కామెడీ కి అంతుండదు. అజయ్ దేవగణ్ ప్రేమించే పరిణీతీ  చోప్రా చిన్నప్పుడు ఎత్తుకున్న పాప అని తెలిశాక తల్పడే ఒక డైలాగు కొడతాడు – ప్రతీ ఆడపిల్లా తనక్కాబోయే వాడిలో ఫాదర్ ఫిగర్ని చూస్తుంది. ఆమెకి ఫిగరుంది, నువ్వు ఫాదర్ వి - అని! ఐయాం నాటే ఘోస్ట్, ఐయాం యువర్ దోస్త్ అంటాడు. నెక్స్ట్ స్టెప్, బెస్ట్ స్టెప్,  ఫినిష్ స్టెప్ అంటూ హడావిడి చేస్తూంటాడు. 

 ఇలాగే ఒక సమోసా కోసం తినే బల్ల దగ్గర కామెడీని ఎక్కడికో తీసికెళ్ళి పోయే కుణాల్ ఖేమూ. ఒకచోట డైలాగు – వీడికి సాయం చేయడమంటే, యాక్స్ (గొడ్డలి) తో కాళ్ళు నరుక్కోవడమే, బ్లాక్ మనీ మీద టాక్స్ వేయడమే, ఇంటర్వెల్ కే క్లయిమాక్స్ రావడమే!

          గోల్ మాల్ సిరీస్ లో మూగవాడి పాత్ర వేస్తున్న తుషార్ కపూర్ ఒక బిగ్ ఎట్రాక్షన్. నోటితో ఏదేదో అరుస్తాడు కానీ ఎక్స్ ప్రెషన్స్ తో విషయం చెప్తాడు. మూగ పాత్రని  ఒక కల్ట్ క్యారక్టర్ లా తయారు చేసిపెట్టాడు తను. 

          అజయ్ దేవగణ్ ది సీరియస్ కామెడీ. ఎవరైనా తన వైపు వేలు చూపిస్తూ  మాట్లాడితే వేలు విరిచేస్తాడు. పది వేళ్ళతో తుషార్ కపూర్ ఓవర్ యాక్షన్ చూసి,  పది వేళ్ళూ వెనక్కి వంచేస్తాడు. వెనక్కి వంగిన వేళ్ళతో తిరుగుతూంటాడు తుషార్. అజయ్ ఎవర్నయినా కొడితే,  దెబ్బ తగిలిన వాడు రెండు మూడు సార్లు కట్ షాట్స్ లో బంతి కొట్టుకున్నట్టు ఎగిరెగిరి నేలకి కొట్టుకోవాల్సిందే. 

అర్షద్ వార్సీ ది పైకి నవ్వుతూనే వాతలు పెట్టే కామెడీ. పరిణీతీ చోప్రా ఆత్మ అని ఎవరూ అనుకోరు. ఒకమ్మాయి లాగానే కలిసిమెలిసి వుంటుంది. ఈమె పాత్ర ఆశ్రమంలో పనిమనిషి. ఆత్మగా రివీలయ్యాక కొత్త విషాదం తోడవుతుంది పాత్రకి. చివర్లో పగ  దీర్చుకుంటుంది. ఈ పగదీర్చుకోవడంలో కూడా దెయ్యంలా భీకరంగా మారదు. ఒకమ్మా యిలాగే వుంటుంది. ఈ పాత్రని తీర్చిదిద్దడంలో ఫాంటసీ జానర్ దెబ్బతినకుండా చూశారు. 

          ఆనా పాత్రలో టబుకి ఆత్మలు కన్పిస్తాయి, వాటితో మాట్లాడుతుంది. ఈమె పెద్దదిక్కుగా తిరుగుతూంటుంది. టబూ మీద కోల్డ్ క్రీం అంటూ మంత్రాలు చదివే సీను పెద్ద కామెడీ.  హీరోలందరూ తన కళ్ళ ముందు పెరిగిన బచ్చాగాళ్ళు. ఇక చాలా కాలానికి జానీ లివర్ కన్పిస్తాడు. పప్పీ భాయ్ పాత్రలో ఒక సన్నివేశంలో హైదరాబాదీ ఉర్దూతో అల్లకల్లోలం రేపుతాడు. 

          విచిత్రమైన కౌబాయ్ డ్రెస్సులో బాబ్లీ భాయ్ గా సంజయ్ మిశ్రా ది  ఇంకో సందడి. సినిమాలతో కలిపి మాట్లాడి పరువు తీస్తూంటాడు- ఏం బ్యాండ్ వాయించావురా నా అపస్వరాల జస్టిన్ బీబర్ అంటాడు. రేయ్ కుందేలులా అరవకు అంటాడు. ఇక్కడ భూతముంటే వెళ్లి భూతానికి చెప్పు గెస్ట్ అప్పీరియన్సుగా బబ్లీ వచ్చాడని అని అర్డరేస్తాడు. ఘోస్ట్ - జి ఎస్ టి ఘోస్ట్ అని స్పెల్లింగ్ చెప్తాడు. షో హిమ్  యువర్ మూవ్స్ ఖుషీ బేటీ ఎంటీవీ మూవ్స్ అని ఆత్మని ఎంకరేజి చేస్తాడు. క్యాకరే క్యా నాకరే డూ వాట్ విల్ డూ స్కూబీ డూ అంటూ చిత్రవిచిత్రంగా మాట్లాడే క్యారక్టర్ ఇది. కామిక్ విలన్ ప్రకాష్ రాజ్, సీరియస్ విలన్ నీల్ నితిన్ ముఖేష్.

రోహిత్ శెట్టి రెగ్యులర్ రైటర్స్ సాజిద్ – ఫర్హాద్, యూనస్ సజావల్ లు మరోసారి మైండ్ లెస్ కామెడీని ఆద్యంతం వినోదభరితం చేశారు కొత్త పద ప్రయోగాలతో. సంగీతం, ఛాయాగ్రహణం, గ్రాఫిక్స్, నృత్యాలు, పోరాటాలు టికెట్టు కొన్న ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి నిస్తాయి.

చివరికేమిటి 
      రీ సైక్లింగ్ కథల రోహిత్ శెట్టి ఈసారి డిజైనర్ లుక్ సమర్పిం
చడంతోపాతకథేచూస్తున్నామన్పించదు. గతంలో అవే ఫ్యామిలీ డ్రామాలు తీస్తున్న సూరజ్ బర్జాత్యా పంథా మార్చి ‘మై ప్రేమ్ కీ దీవానీ హూఁ’  కి డిజైనర్ లుక్ ఇస్తే రాణించలేదు. అప్పట్లో ఆ కొత్తకి ప్రేక్షకులు అలవాటు పడలేదు. ఇతరులు ‘అశోకా’ లాంటి చరిత్రకాల్ని డిజైనర్ చరిత్రలుగా తీసినా హిట్టవలేదు. చరిత్రల్ని వాటి పురాతన తత్వ్తంతోనే తీయాలి. కానీ ఒక రెగ్యులర్ మూస కమర్షియల్ కథని చిత్రీకరణ పరంగా అదే మూసలో ఇంకా తీస్తున్నప్పుడు పాత వాసనేసి పై స్థాయికి తీసికెళ్ళదు. సినిమాల్లో ఇంకా అనాధాశ్రమం అనే సెటప్ అరిగిపోయిన ఫార్ములా. దీన్ని ఎప్పటిలాగే ఓ పాత బిల్డింగులో చింపిరి పిల్లలతో ఈసురోమని తీస్తూపోతే విజువల్ అప్పీల్ వుండదు. అన్ని అప్పీల్స్ తో బాటు విజువల్ అప్పీల్ కూడా చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యమో ప్రొడక్షన్ డిజైనర్ పీటర్ లార్కిన్ చెప్తాడు – మూడు కారణాలు : 1. సినిమాలు పలాయనవాద వినోదాలుగా మారడం, 2. టీవీ, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ల వంటి బహువిధ స్క్రీన్స్ తో పోటీ  నెదుర్కోవడం, 3. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులతో పోటీ పడాల్సి రావడం. 

            భావోద్వేగాలు ఎప్పుడూ ఒకలాగే వుంటాయి, భావోద్వేగాల కారణాలు కాలంతో బాటు మారిపోతూంటాయి. ఉమ్మడి కుటుంబంగా కలిసి వుండాలనుకోవడం ఒకప్పటి భావోద్వేగం, ఇప్పుడు కాదు. మగ కుర్రాళ్ళు చేయి చేయి పట్టుకుని తిరగడం ఒకప్పటి స్నేహాన్ని ప్రకటించుకునే భావోద్వేగం, ఇప్పుడు కాదు. అలాగే ఫార్ములా సెటప్స్  పైన చెప్పుకున్న మూడు కారణాల వల్ల మారాల్సిందే. కథలూ అదే మూస, వాటి సెటప్సూ అదే మూసలో వుంటే ఆధునిక ప్రేక్షకులు అఫెండ్ అవుతారు. ఇండియాలో ప్రేక్షకులిప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడే స్థితిలో లేరు. ఉన్నత వర్గాలని చూసి మధ్య తరగతి వర్గాలు, మధ్యతరగతి వర్గాలని చూసి కింది వర్గాలూ పోటీలుపడి అనుకరిస్తున్నారు. అనుకరణల మోజులో లేమి లేనట్టే ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి బిగ్ బడ్జెట్ సినిమా అందమైన ప్రపంచాల్ని చూపించాల్సిందే. డిజైనర్ లుక్ అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపించడమే. చిన్న బడ్జెట్ సినిమాలకి సెటప్స్ మూసలో వుండక తప్పదు. కానీ పెద్ద బడ్జెట్ సినిమాలకీ అవే వుంటే వాటి విజువల్ అప్పీల్ లో తేడా ఏమీ వుండదు.  

          కనుక   ‘గోల్ మాల్ ఎగైన్’  లో ఎక్కువభాగం అనాధాశ్రమంలో నడిచే కథ కావడంతో, ఆ అనాధాశ్రమాన్ని ఊటీలాంటి అందమైన ప్రదేశంలో అత్యంత రిచ్ భవనాల్లో చూపించడంతో మొత్తం కథే పాత  మూసని మరిపించేట్టు తయారయ్యింది. పైగా రెగ్యులర్ దెయ్యం కామెడీ చేయకుండా ఫాంటసీకి మార్చడంతో విజువల్ అప్పీల్ మరింతగా పెరిగింది. ఇంతే గాకుండా, కామెడీని  ఈ సిరీస్ మెయింటెయిన్ చేస్తున్న మైండ్ లెస్ కామెడీనే కంటిన్యూ చేయడంతో ఫాంటసీ విభిన్నంగా తయారయ్యింది. ఇక ఈ సిరీస్ లో ఎప్పుడో పాపులరైన హీరోలని చూపించిన విధానాన్ని హాలీవుడ్ హై కాన్సెప్ట్ పద్ధతిలో చూపించడం వల్ల కూడా ఫాంటసీ మరింత ఎంటర్ టైనర్ గా  మారింది.
          ఇలా డిజైనర్ లుక్, ఫాంటసీ, మైండ్ లెస్ కామెడీ, హై కాన్సెప్ట్ స్టార్ ప్రెజెంటేషన్ అనే నాల్గు ప్రత్యేక హంగులతో మార్కెట్ యాస్పెక్ట్ ఉట్టి పడేలా ప్రొడక్షన్ ని డిజైన్ చేశారు.

                                                  ***
   ఒకప్పుడు మల్టీ స్టారర్ లు కథాబలంతో బరువుగా వుండేవి. పాత్రచిత్రణలూ, సంఘర్షణలూ సంక్లిష్టంగా వుండేవి. కాలం మారింది. హాలీవుడ్ లో బిగ్ బడ్జెట్స్ కి హై కాన్సెప్ట్ కథే వుంటుంది. దాన్ని సింపుల్ గా చెప్పేస్తున్నారు. విజువల్ యాక్షన్ భారీగా వున్నప్పుడు కథకూడా భారంగా వుండకూడదనే బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రదర్శిస్తున్నారు. అదే చిన్న బడ్జెట్స్  లో- కాన్సెప్ట్ కథల్ని సంక్షుభితం చేసి చూపిస్తున్నారు. వీటికి విజువల్ యాక్షన్ వుండదు కాబట్టి పాత్రలూ వాటి సంఘర్షణలూ అనేక పొరలు కమ్మి వుంటాయి. మూల సూత్రం : ప్రేక్షకుల మీద ఏదో వొక భారాన్ని మాత్రమే వేయాలి.

           పై  సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు,  అలరించడానికి మల్టీ స్టారర్ గా భారీ విజువల్ ఎరీనా వున్న ప్రస్తుత ‘గోల్ మాల్ ఎగైన్’ కి కథని నామమాత్రం చేశారు. పైగా  పాత రొటీన్ కథ. ప్రేక్షకులకి ఈ లోటు తెలీదు. ఇక్కడ స్టార్స్ కోసం కథ లేదు, స్టార్స్ చేసే మెదడు తక్కువ టక్కుట మారాలకోసం కథ వుండాలి కాబట్టి ఏదో వుంది. ఐతే నామ మాత్రపు కథకి తెగ నవ్వించి ఎంత ఎంటర్ టైన్ చేసినా,  చివరికొచ్చేసరికి ‘సో వాట్?’ అనుకుంటాడు ప్రేక్షకుడు. అప్పుడు కాస్త ఫీల్ లోకి దింపుతారు సన్నివేశాల్ని. క్లయిమాక్స్ లో హీరోయిన్ పగదీర్చుకునే సన్నివేశాలు ఇవే. 

          ఒక లైనుగా చెప్పుకుంటే, తాము పెరిగిన అనాధాశ్రమం యజమానినీ, తాము పెంచిన అమ్మాయినీ శత్రువులు చంపేస్తే,  వాళ్ళని రప్పించి అమ్మాయి ఆత్మకి అప్పజెప్పడం మాత్రమే కథ. ఈ సింపుల్ లైనుని మల్టీ స్టారర్ ని దృష్టిలో పెట్టుకుని, ఘోరమైన ఏడ్పులతో, ఆత్మ ప్రతీకారాలతో, అరుపులతో, భయపెట్టడాలతో, అది చెప్పుకునే భయంకర ఫ్లాష్ బ్యాకులతో సంక్షుభితం చేసి తలబొప్పి కట్టించకుండా, అంతే సింపుల్ గా, ఫన్నీగా లైట్ రీడింగ్ మెటీరియల్ లాగా అందించేశారు. 

          ఎంత మైండ్ లెస్ కామెడీ అయినా  లాజిక్ పునాదిగానే వుండాలి. లేకపోతే నవ్వలేం. పరిస్థితి లాజికల్ గా వుండాలి, ఆ పరిస్థితికి రియాక్టయ్యే పధ్ధతి ఎంత ఇల్లాజికల్ గా వున్నా ఫర్వాలేదు. సిగరెట్లు కొనాలనుకోవడం లాజికల్ పరిస్థితి. దానికోసం విమానమెక్కి వెళ్ళడం ఇల్లాజికల్ ప్రవర్తన. ఈ ఇల్లాజికల్ ప్రవర్తనే మైండ్ లెస్ కామెడీ,  లేదా అసంబద్ధ కామెడీ అవుతుంది. ఇది అరిస్టాటిల్ సూత్రం. ప్రస్తుత కథలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ లో లోపమిదే. ఎత్తుకుని లాలించిన పిల్లనే హీరో ప్రేమించడం, దాన్ని కామెడీ చేయడం ఇబ్బంది కల్గించేదే. ఎంత మెదడు లేని వాడు కూడా ఈ పనిచెయ్యలేడు. ఆమెకి అన్నగానో, తండ్రిగానో  ఫీలవుతాడు. ఇది చూసి శ్రేయాస్ తల్పడే – బీవీసే బేటీ బన్ గయీ, బేటీ సే భూత్నీ బన్ గయీ – అని జోకులేసినా  ఎంజాయ్ చేయలేం. బచ్పన్ ( పసితనం) – పచ్పన్ (ముసలితనం) అని హీరోహీరోయిన్ల నుద్దేశించి కామెంట్లు చేసినా బలవంతపు కామెడీగానే వుంది. చీకటి పడితే దెయ్యాలుంటాయని భయపడేవాడు తెలీక ఆత్మనే ప్రేమించడం మంచి డైనమిక్కే గానీ,  ఇందులో రోమాన్సుకీ,  తద్వారా మైండ్ లెస్  కామెడీ కీ  లాజిక్కే అడ్డుపడుతుంది. మానవసంబంధాలని లాజికల్ గాచూపించాలనేది ఇందుకే.

          ‘గోల్ మాల్ ఒన్స్ ఎగైన్’  అని మళ్ళీ తీస్తే అదెలా వుంటుందనేది ఆసక్తి రేపే ప్రశ్న. ఈ గోల్ మాల్ గ్యాంగ్ అంతా ఇక ఫారిన్లో అల్లరి చేస్తారేమో.


-సికిందర్ 
www.cinemabazaar.in