2023
లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన
గుజరాతీ చలన చిత్రం ‘చెల్లో షో’ (చివరి షో) అక్టోబర్ 14 న గుజరాత్ లో విడుదలైంది.
దీనికి పూర్వం 2021 లో వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో హల్చల్ చేసింది.
ఆస్కార్స్ కి ఎంట్రీ పొందడంతో ఈ సినిమా
చూడాలన్న ఆసక్తి పెరిగింది. అయితే ఆన్ లైన్ లో అందుబాటులో లేకపోవడంతో
నిరుత్సాహానికి గురైన ప్రేక్షకుల్ని నెట్ ఫ్లిక్స్ ఆదుకుంది. నవంబర్ 25 నుంచి
దీన్ని స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఇతర భాషల్లో డబ్
చేయకుండా ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో విడుదల చేయడంతో ఇంగ్లీషు రాని ప్రేక్షకులకి
దూరంగానే వుండిపోతోంది. పేద పిల్లల జ్ఞాన తృష్ణ గురించి తీసిన ఈ
కళాఖండం ఆ వర్గాల ప్రేక్షకుల్లోకి స్ఫూర్తిగా వెళ్ళాలంటే వివిధ భాషల్లో డబ్
చేయాల్సిందే. మనమే తీసిన ఒక అంతర్జాతీయ సినిమా దేశీయ భాషల్లో ప్రదర్శనలకి
నోచుకోకపోతే ఏం లాభం.
గుజరాతీ సమాంతర సినిమా
దర్శకుడు పాన్ నళిన్ వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 23 సార్లు ఉత్తమ చలన
చిత్ర్రాల అవార్డులందుకుని మేటి దర్శకుడుగా పేరుపొందాడు. ‘చెల్లో షో’ కి మూడు అంతర్జాతీయ చలన
చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డులతో బాటు, మరో ఏడు అంతర్జాతీయ చలన
చిత్రోత్సవాల్లో నామినేషన్లు పొందాడు.
అలాగే జపాన్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఇజ్రాయెల్ దేశాలు థియేట్రికల్ రిలీజ్ కి కొనుగోలు చేశాయి. ‘చెల్లో షో’ ఫిల్మ్స్-ఫుడ్-ఫ్రెండ్స్-ఫ్యామిలీ
సెలబ్రేషన్ గా రూపకల్పన చేశానని చెప్తున్న నళిన్, సినిమా కళకి నివాళిగా
ఇటలీ తీసిన ‘సినిమా పారడిసో’ (1988) తర్వాత - ‘చెల్లో షో’ ని అంతరించిపోయిన సినిమా
రీళ్ళ కి బాధాతప్త వీడ్కోలుగా అందించాడు. నిజంగా ఈ కళాఖండం చూస్తే కదిలిపోని, కళ్ళు చెమర్చని సినిమా అభిమానులుండరు.
పిల్లల సృజనాత్మక విజయం
సమయ్ తొమ్మిదేళ్ళ పేద బ్రాహ్మణ విద్యార్థి.
గుజరాత్ లోని సౌరాష్ట్రలో చలాలా అనే కుగ్రామం రైల్వే స్టేషన్ పక్కన టీలమ్మే
తండ్రికి సాయపడుతూ, స్కూలుకెళ్ళి చదువుకుంటూ వుంటాడు. కొందరు నేస్తాలుంటారు. అతడి
దృష్టి ఒక్కటే- కాంతిని పట్టుకోవాలని. కాంతి నుంచి కథలు, కథలనుంచి సినిమాలూ పుడతాయని
భావిస్తూంటాడు. స్కూలు ఎగ్గొట్టి సినిమాలకి పోతూంటే తండ్రి బాపూజీ కొట్టి- ‘సినిమాలనేవి కుళ్ళు. మన సాంప్రదాయం కాదు. బ్రాహ్మణులు ఇలాటి పనులు చేయడం చూశావా?’ అని కొడతాడు. ‘బ్రాహ్మణ బ్రాహ్మణ అంటూ
నువ్వెక్కడున్నావో చూడు- రోజంతా చాయ్ లమ్ముకుంటూ కప్పులు కడుగుతున్నావ్. చాయ్ చాయ్
అని అరుస్తు
న్నావ్’ అనేస్తాడు కొడుకు.
ఒక రోజు టికెట్ లేకుండా దూరాడని
సినిమా హాల్లోంచి బయటికి విసిరేస్తారు. ప్రొజెక్టర్ ఆపరేటర్ ఫజల్ చేరదీసి, చపాతీలు తింటూ- మా ఇంటిదానికి
చపాతీలు చేయడం రాదంటాడు. మా అమ్మ బాగా చేస్తుందంటాడు సమయ్. అప్పట్నుంచి తల్లి
స్కూలుకి కట్టిచ్చే భోజనాన్ని తెచ్చి ఫజల్ కిచ్చి, ప్రొజెక్షన్ రూంలో
కూర్చుని రోజూ ‘జోధా అక్బర్’ ఫ్రీగా చూస్తూంటాడు. కాంతి ఎలా ప్రసరిస్తోంది, ప్రొజెక్టర్ ఎలా
పనిచేస్తోందీ నిశితంగా గమనిస్తాడు.
సినిమాలు ఎలా తీస్తారని అడిగితే, ‘సినిమాలు కథల గురించి
తీస్తారు. కథలతో సినిమాలకి పాత సంబంధముంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం కథలు చెప్పడం
లాగా, వ్యాపారులు సరుకులు అమ్ముకోవడానికి కథలు చెప్పడం లాగా, డబ్బున్న వాళ్ళు డబ్బులు
దాచెయ్యడానికి కథలు చెప్పడం లాగా...భవిష్యత్తు కథలు చెప్పే వాళ్ళదే!’ అని జ్ఞాన భోద చేస్తాడు
ఫజల్.
ఇక నేస్తాలతో కలిసి సైకిలు చక్రాలు, పెడల్, కుట్టు మిషను, ఫ్యాను రెక్కలు, అద్దాలు, బల్బులు మొదలైనవి పోగేసి, దూరంగా ఒక పాడుబడ్డ
ఇంట్లో ప్రొజెక్టర్ తయారు చేసేస్తాడు. రైల్వే స్టేషన్ కొచ్చే సినిమా రీళ్ళని
ఎత్తుకొచ్చి, తాన్ తయారు చేసిన చేత్తో తిప్పే ప్రొజెక్టర్లో ఆడించి, తెర మీద బొమ్మవేసి
కేరింతలు కొడతాడు.
ఇలా సినిమాలు
ప్రదర్శించుకుని, శబ్దాలు సృష్టించుకుని ఆనందిస్తూండగా, ఒక రోజు ఫజల్ నుంచి
దుర్వార్త వస్తుంది. సమయ్ పరుగెత్తుకుని
వెళ్ళి చూస్తే, సినిమా హాల్లో ప్రొజెక్టర్, రీళ్ళూ తీసి బయట పారేస్తూంటారు. ఫజల్ ఉద్యోగం
పోతుంది. కొత్త టెక్నాలజీతో ఆధునికంగా డిజిటల్ ప్రొజెక్టర్ బిగిస్తూంటారు... ఈ
మార్పుని సమయ్ తట్టుకోలేకపోతాడు.
సినిమా అంటే ఫిలిమ్ రీళ్ళు అనే
శతాబ్దకాలపు చరిత్ర ఇక పరిసమాప్తమవుతున్న పరిణామాలు చూసి సమయ్ కలలన్నీ
చెదిరిపోతాయి. ఈ మార్పుని ఎలా స్వీకరించాలి? ఇప్పుడేం చేయాలి? ఇక్కడ్నుంచి అతడి ఆలోచనలు
ఏ దిశగా పయనించాయి? ఇంకే
ముగింపుకి స్వాగతం పలికాడు?... ఇవన్నీ ఎంతో హృద్యంగా తెర మీద ఆవిష్కరించాడు
దర్శకుడు.
దర్శకుడు డిజిటల్
సినిమాల చరిత్రకి అంకురార్పణ మాత్రమే చేసి వూరుకోలేదు. పాత ప్రొజెక్టర్లు, రీళ్ళూ ఏమయ్యాయీ ఇవీ
చూపించాడు. వివిధ పరిశ్రమల్లో తుక్కుకింద ముద్దయి చెంచాలుగా, ప్లాసిక్ పైపులుగా, చేతి గాజులుగా ఉత్పత్తి
అవడాన్ని సమయ్ సాక్షిగా చూపించాడు. అసలు సమయ్ తయారు చేసిన ప్రొజెక్టరు కూడా ఏదో
సినిమాటిక్ గా చూపించలేదు. దానికి వాడిన వస్తువుల ఉపయోగాన్ని సాంకేతికంగా సాధ్యమే
అన్నట్టు ఇంజనీరింగ్ చేసి చూపించాడు. ప్రపంచంలో తొట్ట తొలి ప్రొజెక్టర్ తయారు చేసినప్పుడు
ఏం చేసి వుంటారో, ఏ రూపంలో వుండేదో అదొక చారిత్రక ఘట్టం. సమయ్ సినిమా
హాల్లో ప్రొజెక్టర్ని పరిశీలించి, పారేసిన వస్తువులతో ఒక చేత్తో తిప్పే ప్రొజెక్టర్నే
తయారు చేయడం పిల్లల్లో దాగివుండే అద్భుత శాస్త్రీయ దృష్టికి తార్కాణమన్నట్టుగా
చూపించాడు!
గ్రామీణ పిల్లలంతా కలిసి సాధించిన ఈ
విజయాన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే, చెప్పుకుంటే సినిమా
రీళ్ళ దొంగతనం బయటపడుతుంది. ప్రతీ సన్నివేశం చాలా ఫన్నీగా, హాస్యంగా, వినోదపరుస్తూ వుంటుంది.
ఈ వినోదం కూడా కళ్ళు చెమర్చేలా వుంటుంది. సమాంతర సినిమా అయినా ఆర్ట్ సినిమాలాగా
సీరియస్ గా, నెమ్మదిగా సాగకుండా, సరదాగా వేగంగా పరిగెడుతూంటుంది. ఫిల్ముతో పిల్లల
సెలబ్రేషన్, ఫ్రెండ్ షిప్ తో పిల్లల సెలెబ్రేషన్, తల్లి తయారు చేసే
వంటకాలతో ఫుడ్ సెలబ్రేషన్, సమయ్ కుటుంబంతో ఫ్యామిలీ సెలెబ్రేషన్ ... ఇలా ఈ
సినిమాయే ఒక సెలెబ్రేషన్.
స్కూలుకి తల్లి కట్టిచ్చే భోజనాన్ని
సమయ్ ఫజల్ కి తినబెట్టడంతో వాళ్ళిద్దరి ఫ్రెండ్ షిప్ ఇంకో సెలెబ్రేషన్. తల్లి కింద
పొయ్యి మీద ఎలా వండుతుందో వివరంగా చూపిస్తాడు దర్శకుడు. గుత్తి వంకాయ కూర, బెండకాయ మసాలా, మిర్చీ మసాలా, కొత్తిమీర చింతపండు
చట్నీ...ఇలా మనకే నోరూరేలా రోజుకో వంట వండుతుంది. ఈమెకి తెలియకుండా తీసికెళ్ళి
ఫజల్ కి తినిపిస్తూంటాడు. ఫజల్ సెలబ్రేట్ చేసుకుంటాడు.
ప్రతీ దృశ్యం విలువైనదే, విషయం చెప్పేదే. సినిమా
హాల్లో చాలా రోజులు జోధా అక్బరే ఆడుతుంది. తర్వాత దాన్ని తీసేసి అమితాబ్బచ్చన్
ఖుదా గవా ఆడిస్తారు. ఆ తర్వాత ఇంకో సినిమా అడిస్తూంటే మధ్యలో ఆగిపోయి గొడవ గొడవ
అవుతుంది. ఆ రీలు సమయ్ ఎత్తుకుపోవడంతో ఈ గొడవ.
రీళ్ళతో చరిత్ర పరిసమాప్తమయ్యాక, తిరిగి సమయ్
రైళ్ళాగినప్పుడు చాయ్ లమ్మే పరిస్థితికే వచ్చాక, తండ్రితో కదిలించే
దృశ్యాలుంటాయి. మొదట్లో అగ్గిపెట్టెలు సేకరించి, వాటిమీద వుండే వివిధ
బొమ్మల్ని వరుస క్రమంలో పేర్చి, బొమ్మల కథలు చెప్పే నేర్పుతో ప్రారంభమయిన కొడుకు
సృజనాత్మకతని ఇక తండ్రి గుర్తించి- తీసుకునే నిర్ణయం విజయం వైపుగా వుంటుంది.
వీడ్కోలు భావోద్వేగ పూరితంగా, ఒక జ్ఞాపకంగా వుండిపోతుంది.
పేద పిల్లవాడి పాత్రలో భవిన్ రబరీ
ఒక అద్భుత చైల్డ్ ఆర్టిస్టు. సినిమా చూశాక కలకాలం గుర్తుండి పోతాడు. భవిన్ వన్
బాయ్ షో అనొచ్చు దీన్ని. మిగతా పాత్రల్లో బాలనటులు కూడా అంతే సహజత్వంతో నటిస్తారు.
తండ్రిగా దీపెన్ రావల్, తల్లిగా రిచా మీనా, బక్క ప్రాణి ఫజల్ గా
భవేష్ శ్రీమాలీ.... ఇలా ప్రతీ వొక్కరూ నిజజీవితంలో చూస్తున్నట్టే వుంటారు. తక్కువ
మాటలతో ఎక్కువ భావాల్ని ప్రదర్శిస్తారు. సినిమా నడక ఒక లయగా వుంటుంది. సినిమా
సాగిపోతున్నట్టు అస్సలు గుర్తించలేనంతగా ప్రతీదృశ్యంలో గాఢంగా సంలీనం చేస్తుంది.
ఒక సెకను కూడా కళ్ళు తిప్పుకోలేం. ఆపి ఆపి వాయిదాలుగా చూడకుండా- ఏకబిగిన చూసేసేంత
సృజనాత్మక, సాంకేతిక ఔన్నత్యాలతో వుంటుంది గంటా 50 నిమిషాల సేపూ.
స్వప్నిల్ సోనావనే ఛాయాగ్రహణం, మైకేల్ బారీ శబ్దగ్రహణం, పంకజ్ పాండ్యా కళా
దర్శకత్వం, సిరిల్ మోరిన్ సంగీత దర్శకత్వం, శ్రేయాస్ కూర్పు... ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నవే.
అసలు పరీక్ష ఏమిటంటే, పాలిన్ నళిన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్
లు నిర్మాతలుగా వ్యవహరించిన ‘చేల్లో షో’ ఆస్కార్స్ లో 95 దేశాలతో పోటీపడాల్సి రావడం.
—సికిందర్