రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, నవంబర్ 2017, గురువారం

556 :రివ్యూ!

రచన –దర్శకత్వం : జి. శ్రీనివాసన్
తారాగ
ణం: విజయ్ ఆంథోనీ, డయానా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీవెంకట్ తదితరులు
మాటలు- పాటలు : భాష్యశ్రీ
సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రణం: కె.దిల్ రాజ్
బ్యానర్స్
: ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్, ఆర్‌.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్
నిర్మాతలు: రాధిక త్కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి
విడుదల : నవంబర్ 30, 2017
***
          టుడు - సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ‘బిచ్చగాడు’ హిట్ తర్వాత చేసిన రెండూ - యమన్, బేతాళుడు – అనే సైకలాజికల్ లు వర్కౌట్ కాకపోవడంతో, తిరిగి ‘బిచ్చగాడు’ టైపు సెంటిమెంట్ల పంట వైపు యూ టర్న్ తీసుకుని ‘ఇంద్రసేనుడు’ నటించాడు. ‘బిచ్చగాడు’ మదర్ సెంటి మెంటయితే, ఇది ఫ్యామిలీ సెంటిమెంటు. పైగా ద్విపాత్రాభినయం. జి. శ్రీనివాసన్ అనే దర్శకుడు. తమిళంలో ‘అన్నదురై’ గా విడుదలైన ఇది ఏమాత్రం తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వుందో చూద్దాం...

కథ 
      నూజివీడులో ఇంద్రసేన, రుద్రసేన కవల సోదరులు. ఇంద్రసేన  ప్రియురాలు చనిపోయిన బాధతో తాగుతూంటాడు. రుద్రసేన స్కూల్లో  పీఈటీగా పనిచేస్తూంటాడు. తండ్రికి బట్టల షాపు వుంటుంది. అతను స్థానిక వర్తక సంఘం అధ్యక్షుడు. తల్లి ఇంద్రసేనని పెళ్లి చేసుకోమని పోరుతూంటుంది. రుద్రసేన కి ఓ వ్యాపారి కూతురి సంబంధం వస్తుంది. ఇంద్రసేనకి కూడా సంబంధం చూడాలని తమ్ముడి కూతుర్ని అడిగి అవమాన పడుతుంది తల్లి. పెళ్లి ఇష్టం లేని ఇంద్రసేన తల్లి బాధ పట్టించుకోడు. వూళ్ళో అతడికి మంచి పేరుంటుంది. ఒక స్నేహితుడికి అప్పు కావాల్సి వస్తే హామీగా వుండి వడ్డీ వ్యాపారి దగ్గర  ఆరు లక్షలు ఇప్పిస్తాడు. తీరా తనే ఇరుక్కుంటాడు. ఓ రోజు తాగుడు మానేసి పెళ్లి చేసుకుంటానని తల్లికి మాటిచ్చి, చివరిసారిగా బార్ కి వెళ్తాడు. అక్కడ తాగిన మత్తులో ప్రమాదవశాత్తూ ఒకడు తన చేతిలో చనిపోతాడు. శిక్షపడి ఏడేళ్ళు జైలుకి పోతాడు. 

          విడుదలై వచ్చి చూస్తే, కుటుంబం చెల్లా చెదురై పోయి వుంటుంది. తండ్రి షాపు వడ్డీ వ్యాపారి లాగేసుకున్నాడు. తమ్ముడు రుద్రసేన చైర్మన్ కోటయ్య తరపున  హత్యలు చేసే గూండా లీడర్ గా కనిపిస్తాడు. తల్లిదండ్రులు తలెత్తుకోలేక బతుకుతూంటారు. దీనికంతటికీ కారకుడు తనే అని గ్రహిస్తాడు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పూనుకుంటాడు...

ఎలావుంది కథ 
      ఎక్కడా రాజీపడకుండా వాస్తవిక ధోరణిలో సాగే కథ. సరైన బాధ్యతతో ప్రవర్తించకపోతే,  ఒక్కడి వల్ల మొత్తం కుటుంబమెలా అధోగతి పాలవుతుందో తెలిపే కథ. ఇంట్లో మంచి – బయట మంచి రెండూ బ్యాలెన్స్ అవకపోతే బయటి మంచి కొంప ముంచేస్తుందని చెప్పే కథ. సొంత బాధ సాకు చూపి తనపట్ల తనకే బాధ్యత లేనట్టు తిరిగితే, అది మొత్తం కుటుంబానికే శని పట్టేలా చేస్తుంది. దీనికి ఎలాటి మూస ఫార్ములా చిత్రణల జోలికిపోకుండా, టౌను వాతావరణంలో కల్పించిన రాజకీయ, పోలీసు యంత్రాంగ వాస్తవిక నేపధ్యం బలమైన నిర్ణాయక శక్తిగా అమరింది. సొంత బాధ్యతలు మర్చిపోతే ఇతర శకట్లు నిర్ణయిస్తాయి జీవితాల్ని. 

ఎవరెలా చేశారు 
       అన్న దమ్ముల రెండు పాత్రల్లో విజయ్ ఆంథోనీ రూపంలో కాస్త మార్పు తప్ప, ఆలో చనల్లో తేడా తప్ప - మాట, చూపు, ముఖభావాలు ఒక్కటే. ఇదంతా సీరియెస్సే. అన్న అనుకోకుండా ఒకడి చావుకి కారణమై జైలుకి పోయాడు, దాని పరిణామాల్లో తమ్ముడు నేరస్థుడయ్యాడు. ఐతే ఈ పరిస్థితిని చక్క దిద్దే అన్న ప్రయత్నం ఏకపక్షమై పోయింది. దీంతో తమ్ముడికే సంబధం లేకుండా,  ఇద్దరి మధ్య వైరుధ్యాల సమరం లేక, అమితాబ్ బచ్చన్ – శశి కపూర్ ల మధ్య  వున్నట్టు  ఒక ‘దీవార్’  మూమెంట్ లాంటిది లేకుండా, చప్పగా సాగిపోతుంది.  తమ్ముడికి తెలియకుండా అతడి కోసం అన్న చేసి పోయే త్యాగంతో ఆ పాత్ర ముగుస్తుంది. పాత్ర చిత్రణ లెలా వున్నా, ఫార్ములా కమర్షియల్ పాత్రల్లాగా కృత్రిమ, పైపై భావోద్వేగాలతో కాకుండా, పాత్రల లోతుల్లోంచి  సహజ నటనతో,  బలమైన ముద్ర వేస్తాడు ఆంథోనీ. అతడి బలం ఇలాటి పాత్రలే, మూస కమర్షియల్ పాత్రలు కాదు. 


          హీరోయిన్లు వున్నారు గానీ బాగా లావై పోయారు. మళ్ళీ నమితని చూస్తున్నామా అన్నట్టున్నారు. విలన్ ఎమ్మెల్యేగా రాధారవి ఇలాటి రియలిస్టిక్ సినిమాలకి ఒక ఎసెట్  గా మారాడు. మిగిలిన అన్ని  పాత్రల్లో అందరూ మూస నటననల పాలవకుండా తమ ప్రతిభల్ని కాపాడుకున్నారు. ఇందులో రియలిస్టిక్ యాక్షన్ దృశ్యాలు అత్యంత బలంగా –షాకింగ్ గా వున్నాయి. పాటల్ని ఒక డ్రీం సాంగ్ కి, ఒక థీమ్ సాంగ్ కి పరిమితం చేశారు. కెమెరా వర్క్ డార్క్ షేడ్స్ తో డెప్త్ ని తీసుకొచ్చింది. 

చివరికేమిటి 
      రియలిస్టిక్ అంటే అన్నీ రియలిస్టిక్ గా వుండాలని కాదు. ఒక్క ఫైట్స్ లలో మాత్రమే పంచ్ వుండి,  ఇతర సన్నివేశాల్లో  పంచ్ మిస్ అయి, పాత ఆర్ట్ సినిమాల చిత్రీకరణలా  వుండాలని కాదు. కథ మాత్రమే పవర్ఫుల్ అన్పిస్తూ, కథనంలో సన్నివేశాలు పవర్ పంచ్ తో లేకపోతే  టీవీ సీరియల్ అవచ్చు. ఇదేమీ మతిమాలిన ‘లైటర్ వీన్’ ప్రేమకథ కాదు. బార్ లో హీరో చేతిలో ఒకడు అనుకోకుండా చనిపోయే దృశ్యం,  సరైన ఎఫెక్టివ్ షాట్స్ తో లేక – ఓ క్లోజప్ వేసి తీసేస్తే, పేలవంగా తయారయ్యింది. ఇంత ‘లైటర్ వీన్’ ప్లాట్ పాయింట్ వన్ తో  కథనానికి ఏం బలం వస్తుంది. సన్నివేశాల్లో పంచ్ లేకపోవడం వల్ల ఇంకో నష్టమేమిటంటే,  కథనం స్పీడు తగ్గి,  చాలా నిదానంగా ఒక్కో సన్నివేశం కదలడం. రియలిస్టిక్ కథకైనా స్పీడుగా సాగే డైనమిక్సే  అవసరం. 

          ఇది పూర్తిగా ఆలోచనాత్మక కథ, ఎలాటి వినోదాన్నీ ఆశించకూడదు. కుటుంబ దృశ్యాల్లో శోకమైనా, అందరి జీవితాల్లో విషాదమైనా యాక్షన్ అనే కమర్షియల్ ఎలిమెంట్ తోనే చూపించారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్ధం లేని పాత్ర చిత్రణలు, కథనం లేవు. స్ట్రక్చర్ ని, జానర్ మర్యాదని గౌరవించారు. ముఖ్యంగా  ద్వితీయార్ధం కథ సాంద్రత పెరుగుతుంది. ముగింపూ గుర్తుండేలా వుంటుంది.

-సికిందర్
https://www.cinemabazaar.in









555 : రివ్యూ!


దర్శకత్వం : ఎం జ్యోతికృష్ణ.
తారాగణం :
గోపీచంద్, రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, ఆశీష్ విద్యార్థి, సాయాజీ షిండే, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, అలీ, బ్రహ్మాజీ తదితరులు
కథ : జ్యోతి కృష్ణ, స్క్రీన్ ప్లే : ఎం రత్నం, సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : ఛోటా కె నాయుడు, వెట్రి
బ్యానర్ : శ్రీ సాయి రాం క్రియేషన్స్
నిర్మాతలు :
ఎస్ ఐశ్వర్య, ఎం రత్నం
విడుదల : నవంబర్ 30, 2017
***
      ‘ఆక్సిజన్ గురించి దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చెప్పింది చూస్తే  నిజంగానే ఇదేదో డిఫరెంట్ మూవీ అని సంబరపడతాం. తీరా డిఫరెంట్ కీ ఫార్ములాకీ తేడా  లేకపోవడమే తన దృష్టిలో డిఫరెంటేమో అని తెలిసి కంగుతింటాం. ప్రేక్షకులు ఫార్ములాతో విసిగిపోయి డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారని చెబుతూ, ‘ఆక్సిజన్’ అలాటి తేడాగల మర్చిపోలేని అనుభవాన్నిచ్చే కమర్షియల్ అని సెలవిచ్చాడు. ఫార్ములా మర్చిపోలేని అనుభవాన్నిస్తుందా?

         
పజయాలతో వూపిరి సలపని  గోపీచంద్ కాస్త ఆక్సిజన్ ని ఆశించడంలో తప్పులేదు. ఆ ఆక్సిజన్ ప్రేక్షకుల పాలిట కాలుష్యం ఆవకుండా తను చూసుకోవాలి. చాలాకాలం నిర్మాణంలో వుండి, విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చి, ఇప్పుడు విడుదలైతే దానర్ధం సిగరెట్లకి ఎక్స్ పైరీ డేట్ వుండదనా? చూద్దాం ఈ ఆక్సిజన్ సంగతులేమిటో...

కథ 

      రాజమండ్రిలో రఘుపతి (జగపతి బాబు) కి ముగ్గురు తమ్ముళ్ళు (బ్రహ్మాజీ, శ్యామ్, ప్రద్యుమ్న సింగ్), వాళ్ళ కుటుంబాలు, తనకో కుమార్తె  శృతీ (రాశీ ఖన్నా) వుంటారు. ఈ కుటుంబం మీద వీరభద్రం (సాయాజీ షిండే) పాత కక్షలతో  చంపుతూంటాడు. రఘుపతి తమ్ముడు, అతగాడి కొడుకూ అలా బలై పోతారు. వీరభద్రం నుంచి కుటుంబానికి రక్షణ  లేదని రఘుపతి కూతురికి అమెరికా సంబంధం చేసి పంపించేయాలనుకుంటాడు. సంబంధం చూడ్డానికి అమెరికా నుంచి  కృష్ణ ప్రసాద్ (గోపీ చంద్) వస్తాడు. శృతికి అమెరికా వెళ్ళడం ఇష్టంలేక, కృష్ణప్రసాద్ కి రకరకాల పరీక్షలు పెడుతూంటుంది మేనమామ (అలీ) తో కలిసి. వీరభద్రం మరోసారి దాడి చేసేసరికి, కృష్ణప్రసాద్ వీరోచితంగా పోరాడి ఆమె మనసు గెల్చుకుంటాడు. గెల్చుకున్నాక, అసలు తను కృష్ణప్రసాద్ కాదని ఆమెకి షాకిస్తాడు. 

          కృష్ణప్రసాద్ ఎవరు? ఏ ఉద్దేశం పెట్టుకుని ఈ వూరొచ్చాడు? అతడి ప్రతీకారం ఎవరి మీద? ఎందుకు? ...ఇవన్నీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ

   
       పాత మూస ఫార్ములా డ్రామా అని తెలిసిపోతూనే వుందిగా - ఇంకా డిఫరెంట్ ఏమిటి? డిఫరెంట్ ఏమిటంటే,  నకిలీ సిగరెట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయనే విషయం ఈ పాత మూస ఫార్ములాలో కలిపి చెబుతున్నారు  కాబట్టి, ఇదే డిఫరెంట్ అనుకోవాలని ఉద్దేశం. రేపు అల్లూరి సీతారామరాజు కథ తీయాలన్నా దాన్నిలాగే పాత మూస ఫార్ములాలో బిగించి డిఫరెంట్ చేస్తారు. కాకపోతే ఇంటర్వెల్లో నేను క్లీన్ షేవ్డ్  రాజ్ కుమార్ని కాదు, అల్లూరి సీతా రామరాజునని బ్యాంగ్ ఇస్తాడు గడ్డం పెట్టుకుని. అప్పుడు బాషా లాగానో, ఫ్యాక్షన్ లాగానో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చి, శత్రు సంహారం గావిస్తాడు. మహాత్మా గాంధీ కథ తీసినా ఇదే – తెలిసిన ఇదొక్కటే ఫార్ములా పంజరంలో వుంటుంది. ఇది మర్చిపోలేని అనుభవాన్నిస్తుంది. 



ఎవరెలా చేశారు 
        నిజానికి గోపీచంద్ పోషించింది ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర. సైన్యంలో వుండే హీరో,  సెలవు మీద ఇంటికి వచ్చినప్పుడే సమాజంలో ఏదో చెడు తన కుటుంబాన్ని బలి తీసుకున్నప్పుడు,  తిరగబడే మూస ఫార్ములాలో వుండే పురాతన టెంప్లెట్ పాత్ర. సైనికుడు సరిహద్దులో వున్నప్పుడే  సమాజ సమస్యలకి స్పందించి సెలవు పెట్టి వచ్చి సంగతి చూసుకోకూడదా? అసలు సెలవు పెట్టి ఇంటికి రాకపోతేనే ఇల్లూ సమాజమూ బావుంటాయేమో?  కుటుంబానికి హాని జరిగినప్పుడే తిరగబడి – దానికి దేశం కోసమే చేస్తున్నట్టు రంగుపులిమి పాత్ర చిత్రణ చేయడం చాలా అన్యాయం. సైనికుడు కుటుంబం కోసం యుద్ధం చేయడు, దేశంకోసమే చేస్తాడు. 

          ఫస్టాఫ్ లో అమెరికా నుంచి వచ్చే గోపీచంద్ పాత్ర  సస్పెన్స్ లేని సాదా రొటీన్ మూస పాత్ర. ఇలాకాక, ఇంకో బాడీ లాంగ్వేజ్ కనబడుతూంటే,  పాత్ర సస్పన్స్ క్రియేట్ చేసి, మూస కథకి కూడా దానికదే  డెప్త్ వచ్చేది. అతను ఆర్మీ మేజర్ అయినప్పుడు ఆ రకమైన వైఖరి కూడా కన్పించదు. ఈ ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర ఇంటర్వెల్ తర్వాత రివీలవుతుంది. సెలవు మీద ఇంటికి వస్తే,  వూరూ పేరూ లేని నకిలీ సిగరెట్లకి తమ్ముడు బలై, దీనివెనుక కుట్ర తెలిసి పోరాటం మొదలెడితే- కుటుంబం నశించి (డిటో ‘పటేల్ సర్’ ఫ్లాష్ బ్యాక్) – పోరాటాన్ని ఉధృతం చేయడం  ఈ పాత్రకిచ్చిన టాస్క్. ఇక్కడా విషాద మేమిటంటే- ఇప్పుడూ తను సైనికుడిలా వుండడు. సైనికుడి మైండ్ తో మాట్లాడడు. తనకి  దక్కిన గోల్డెన్ మూమెంట్స్ చివరి సన్నివేశంలోనే. ఇక్కడ మాత్రమే కదిలించే పాత్ర – మిగతా ఎక్కడా కాదు. రొటీన్ యాక్షన్ జానర్ లో వుండిపోతుంది. తన ఆపరేషన్ కి ‘ఆక్సిజన్’  అని పేరు పెట్టుకున్నప్పుడు- ఆ ఆపరేషన్ సైనికుడు చేసే ఆపరేషన్ కోవలో వుండక పోవడం విచారకరం. ఇలాగైనా డిఫరెంట్ అన్పించుకోలేదు. 

          రాశీ ఖన్నాదీ మూస ఫార్ములా హీరోయిన్ పాత్ర. పల్లెటూళ్ళో హీరోతో ఆమె పాల్పడే చేష్టలు చూసీ చూసీ అరిగిపోయినవి.  సెకండాఫ్ లో మెడికల్ రీసెర్చర్ గా వచ్చే సెకండ్ హీరోయిన్
అనూ ఇమ్మాన్యుయేల్ కాస్త బాధ్యతగల పాత్రగా వున్నా, ఫార్ములా ప్రకారం ఆ పాత్ర ముగిసిపోతుంది. జగపతిబాబు, విలన్లు గా నటించిన ఇతరులూ సైతం చాలా పాత మూస పాత్రలు పోషించారు. అలీకి సీన్లు ఎక్కువే వున్నా కామెడీలో కిక్కు పెద్దగా లేదు.  

          యువన్ శంకర్ రాజా సంగీతం, ఛోటా కె. నాయుడు – వెట్రిల ఛాయాగ్రహణం సాధారణం. పీటర్ హెయిన్స్  సమకూర్చిన యాక్షన్ దృశ్యాల్లో హీరోతో మిలిటరీ యుద్ధ కళలు కన్పించవు. ఫ్లాష్ బ్యాక్ లో ఆర్మీ మేజర్ గా సరిహద్దులో టెర్రర్ స్థావరం మీద హీరో జరిపే దాడి – బిన్ లాడెన్ మీద అమెరికన్ దాడిని జ్ఞప్తికి తెచ్చే టెక్నిక్ తో వుండాల్సింది. పోలికలు కన్పించినప్పుడే కొన్ని సీన్లు ‘మర్చిపోలేని అనుభవాన్ని’ (దర్శకుడి మాటల్లో) ఇచ్చేది.


చివరికేమిటి 
     ఇతర సిగరెట్లు మంచి వైనట్టు నకిలీ సిగరెట్ల మీద సినిమా తీశారు. మంచిదే, ఈ చలనచిత్రం చూసి జనం మంచి సిగరెట్లు అలవాటు చేసుకుంటే! కథా ప్రయోజనం నెరవేరుతుంది. అసలు ఈ సినిమా తీయడం వెనుక కార్పొరేట్ కంపెనీల హస్తాలున్నాయేమో తెలీదు – తమ సిగరెట్లు అమ్ముకోవడానికి. మంచి  సిగరెట్లు తాగమని అన్యాపదేశంగా చెప్పే సినిమా ఎంతైనా గొప్పది. ఈ మార్పు ఈ దర్శకుడి తోనే ప్రారంభం కావాలి. 

          సిగరెట్ల మీద సినిమాలు తీస్తే, సిగరెట్లు తాగాలన్పించేలా వుంటున్నాయి. అనురాగ్ కశ్యప్ తీసిన  ‘నో స్మోకింగ్’ చూస్తే వెంటనే బయటికెళ్ళి గుప్పుగుప్పుమని పది సిగరెట్లు  దమ్ముల్లాగి పడెయ్యాలన్పించింది అప్పట్లో!  సిగరెట్ సినిమాలు అంతటి మార్పుని తెస్తాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’ నకిలీ సిగరెట్లు మానేస్తే పర్యావరణమంతా స్వచ్ఛమైన ఆక్సిజన్ తో తులతూ
గుతుందని తలపోసింది. జరిగింది వేరు. చూపించిన సినిమాలో మూస ఫార్ములా పాత సీనుల కాలుష్యం. 

          సారా అయినా సిగరెట్ అయినా పాత సీసాలో వేస్తే కొత్తగా అన్పిస్తాయని కావొచ్చు ఇలాటి పనికి తెగబడ్డారు. మూస ఫార్ములా టెంప్లెట్ చట్రం, దాంట్లో ఫ్యామిలీల కోసమని ఫ్యామిలీ కథ- (ఎంతాశ, ధూమ పానం మూవీని  కూడా ఫ్యామిలీలకి చూపించాలని) – ఈ ఫ్యామిలీ కథ ఫస్టాఫ్ తో పరిసమాప్తమై, సెకండాఫ్ వేరే స్మోకింగ్ కథగా మారడం చూస్తే – ఫస్టాఫ్ ఫ్యామిలీలు చూసి వెళ్లి పోవచ్చు, అప్పుడు సెకండాఫ్ పొగనంతా స్మోకర్లు భరించగలరు. ఇకపైన మంచి సిగరెట్లు తాగాలని చూసి నేర్చుకోవచ్చు. మంచి సిగరెట్లని అలవాటు చేసిన మంచి సినిమాగా మర్చిపోలేని అనుభవాన్ని మిగుల్చుకోవచ్చు.


      Ps :టెర్రర్ శిబిరం మీద విజయవంతమైన దాడి తర్వాత మేజర్ అయిన హీరో, సహచరులు, ఆనందంగా ఒక పాత హిందీ పాట పల్లవి నందుకుంటారు – ‘హకీఖత్’ లోని – ‘కర్ చలే హమ్ ఫిదా జానో తన్ సాథియోఁ.... అని. ఇది విజయోత్సవ గీత మనుకున్నట్టంది. యుద్ధంలో అమరులైన జవాన్లని చూపిస్తూ వచ్చే విషాద  నేపధ్య గీతమిది. దీనర్ధం : నేస్తాల్లారా మన జీవితాలనీ శరీరాలనీ అర్పణ చేసి వెళ్లి పోతున్నామని...  అర్ధం తెలుసుకోకుండా పాట పెట్టేస్తే,  ఇప్పుడిదేమిటని అర్ధం గాక భేజా ఫ్రై అవడమే మన పని!


-సికిందర్ 
https://www.cinemabazaar.in/

27, నవంబర్ 2017, సోమవారం

554 : రివ్యూ!


దర్శకత్వం : కెన్నెత్ బ్రనగా
తారాగణం : కెన్నెత్ బ్రనగా, జానీ డెప్ ,పెనెలోప్ క్రజ్, జూడీ డెంచ్మిషెల్ ఫీఫర్,  డైసీ రిడ్లీడెరెక్ జాకోబీ తదితరులు
కథ : అగథా క్రిస్టీ,  స్క్రీన్ ప్లే : మైకేల్ గ్రీన్,  సంగీతం : పాట్రిక్ డాయెల్,  ఛాయాగ్రహణం : హేరిస్ జంబర్ లౌకోస్
నిర్మాణం : కిన్ బెర్గ్ జానర్,  ది మార్క్ గోర్డాన్ కంపెనీ,  స్కాట్ ఫ్రీ ప్రొడక్షన్స్
విడుదల :  నవంబర్ 24, 2017
***
        గత మెంతోఘనకీర్తి, వర్తమానం శూన్యం అన్నట్టుంది హాలీవుడ్ హడావిడి. వర్తమాన సమకాలీన ప్రపంచ సంగతులు పక్కన పెట్టి, గడిచిపోయిన పాత కాలపు సంగతుల్ని వర్తమానంలోకి తోడి చూపిస్తోంది. ఇంకా రాని కాలపు వూహల్ని ఇదే వర్తమానంలోకి తెచ్చి  ప్రదర్శిస్తోంది. వర్తమానాన్ని భూత భవిష్యత్ కాలాల దర్శనీయ స్థలంగా మార్చేస్తోంది.  మూడు పీరియెడ్లు ఆరు ఫ్యూచర్లు గా వర్ధిల్లుతోంది. తీస్తే పీరియెడ్ సినిమాలు, లేదంటే ఫ్యూచరిస్టిక్ సినిమాలు తీసుకుంటూ వర్తమానంలో ఏదో వుందనుకుంటున్న శూన్యాన్ని భర్తీ చేస్తోంది. మరి ఇప్పుడున్న వర్తమాన సంగతులు ఇంకెప్పుడు చూపిస్తుందంటే, మరో యాభై ఏళ్ల తర్వాత అవి భూతకాలపు సంగతులయ్యాక.  అంటే ఇలా మనం ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసుకోలేమన్న మాట, ఇంకెప్పుడో భవిష్యత్ తరాలకి అప్పటి పీరియెడ్ సినిమాలుగా తీసి అపురూపంగా చూపిస్తారన్నమాట. పలాయనవాదాన్ని మించిన సక్సెస్ మంత్రం ఏముంది?

          ఇలా ఇప్పుడు 83 ఏళ్ల నాటి  అగథాక్రిస్టీ కథతో  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ అనే పీరియడ్ మూవీ తీశారు. పీరియెడ్ కథ, దానికో ఫేమస్ రచయిత / రచయిత్రి పేరుంటే చాలు, లాంచింగ్ తోనే బజ్ క్రియేట్ చేస్తుంది. ఇంతకన్నా పబ్లిసిటీ ఏం కావాలి. మరి ఆ కాలపు పాత ఫ్యాషను కథల్నీ, ముసలి హీరోల్నీ ఇప్పుడెవరు చూస్తారంటే, విదేశాల్లో 40 కి ఇటూ అటూ వయసున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా చూస్తారు. అక్కడ విభజనలేదు. ఇండియాలో 40 కి ఇటున్న వాళ్ళు ఎలాగూ చచ్చినా చూడరు,  వాళ్ళ టేస్టు వేస్టు వేరు. 40 రాగానే సినిమాలు చూడ్డం మానేసిన వాళ్ళు, ఖర్మ తప్పదనుకుంటూ  కదలవచ్చు ఇలాటి సినిమాలకి. ఐతే ఒక షరతు : అగథా క్రిస్టీ ఎవరో, ఆమె సృష్టించిన డిటెక్టివ్ హెర్క్యూల్ పైరట్ పాత్ర ఏమిటో తెలిసివుంటే, పనిలో పనిగా చదివి కూడా వుంటే -  ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు.

కథ   
     డిటెక్టివ్ హెర్క్యూల్ పైరట్ (కెన్నెత్ బ్రనగా) జెరూసెలం చర్చిలో ఒక దొంగతనం కేసుని  యాక్షన్ తో మహాద్భుతంగా పరిష్కరించి, కొంత కాలం విశ్రాంతి తీసుకుందామని ఇస్తాంబుల్ బయల్దేరతాడు. అక్కడ విశ్రాంతి తీసుకుని, లండన్ లో ఇంకో కేసు అటెండవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. జెరూసలెంలో ఓరియెంట్  ఎక్స్ ప్రెస్ ఎక్కి బయల్దేరినప్పుడు రచెట్ (జానీ డెప్) అనే బిజినెస్ మాన్ పరిచయం చేసుకుని, తనని చంపాలని చూస్తున్న ఒక గ్యాంగ్ బారి నుంచి కాపాడేందుకు రక్షణగా వుండాలంటాడు. నీ ఫేసు నాకు నచ్చలేదని తిరస్కరిస్తాడు పైరట్. ఆ రాత్రి ఆల్ప్స్ పర్వతాల మధ్య నుంచి ట్రైను పోతున్నప్పుడు వాతావరణం బీభత్సంగా తయారై, హిమపాతానికి రైలు మార్గం మూసుకుపోయి ట్రైనాగిపోతుంది. తెల్లారి చూస్తే కూపేలో రచెట్ చనిపోయి వుంటాడు. పన్నెండు కత్తిపోట్లు పొడిచి ఎవరో చంపారు.

          ఈ లగ్జరీ ట్రైనులో రిటైరైన నటి కరోలిన్ (మిషెల్ ఫీఫర్), స్పానిష్ నర్సు ( పెనెలోప్ క్రజ్), ఓ నీగ్రో డాక్టర్, ఇతనితో రహస్య ప్రేమాయణం సాగిస్తున్న మేరీ (డైసీ రిడ్లీ) అనే బ్యూటీ, ఇంకో రష్యన్ యువరాణి (జూడీ డెంచ్), మరింకో  హంగేరియన్ యువరాజు, ఇంకో కోపిష్టి క్యూబన్ ... ఇలా పన్నెండు మంది వుంటారు. వీళ్ళల్లో ఎవరీ హత్య చేశారు? ఎందుకు చేశారు? విశ్రాంతి తీసుకుందామని పోతున్న పైరట్ కి ఈ అత్యవసర పరిస్థితి మళ్ళీ కేసులోకి దింపుతుంది.  హతుడైన రిచెట్ దగ్గర పైరట్ కి ఓ పాత కాగితం దొరుకుతుంది. దాని మీద చెడిపోయిన అక్షరాలు ఒక పాత కేసుని జ్ఞప్తికి తెస్తాయి. ఆ కేసులో డైసీ అనే బాలికని కాసెట్టీ అనే క్రిమినల్ కిడ్నాప్ చేసి, డబ్బు గుంజి చంపేశాడు. ఈ షాక్ కి కడుపుతో వున్న బాలిక తల్లి సోనియా (మిరాండా రైసన్) చనిపోయింది. తట్టుకోలేక బాలిక తండ్రి కల్నల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరెస్టయిన పని మనిషి అవమానం తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంది. ఒక కిడ్నాప్ ఇన్ని చావులకి దారితీసింది... అయితే ఆ కిడ్నాపర్ కాసెట్టీయే,  ఇప్పుడు  హత్యకి గురైన బిజినెస్ మాన్ రచెట్ అని గుర్తిస్తాడు పైరట్. 

          ఇతణ్ణి ఎవరు చంపారన్నది మిస్టరీగా మారుతుంది. పైన చెప్పుకున్న సెకండరీ మిస్టరీతో ఈ మిస్టరీకి ఏమైనా సంబంధముందా? అదెలాటి సంబంధం? ఇతణ్ణి చంపి ఎవరు లాభపడతారు? ఆ వ్యక్తి  ఎవరు?... ఇవీ పైరట్ ముందున్న గడ్డు ప్రశ్నలు. 

ఎలావుంది కథ
       ప్రపంచ ప్రఖ్యాత డిటెక్టివ్ నవలారాణి – క్వీన్ ఆఫ్ క్రైమ్ - అగథా మేరీ క్లారిస్సా  క్రిస్టీ (1890 -1976), 1934 లో ఇదే పేరుతో రాసిన నవలకి రెండోసారి వెండి తెర రూపమిది. మొదటి సారి 1974 లో తెర కెక్కించారు. అది బాగా పేరు తెచ్చుకుంది. క్రిస్టీ సృష్టించిన డిటెక్టివ్ పైరట్ పాత్ర షెర్లాక్ హోమ్స్ తర్వాత అంత ప్రసిద్ధి చెందిన క్లాసిక్ పాత్ర. బ్రిటన్ కి చెందిన క్రిస్టీ,  ఎక్కువగా  గ్రామీణ వాతావరణంలో మర్డర్ మిస్టరీలు రాయడం ఒకెత్తు, పైరట్ కథానాయకుడుగా రాసిన 33 నవలలూ ఒకెత్తూ.
          క్రిస్టీ నవలలు ముగింపులకి పెట్టింది పేరు. ఎవరి వూహకీ అందని, మతులు పోయే, సంభ్రమాశ్చర్యాలు కల్గించే ముగింపు లివ్వడం ఆమె ప్రత్యేకత. ది ఎబిసి మర్డర్స్, వన్ టూ బకిల్ మై షూ, ఎండ్ లెస్ నైట్, ఈవిల్ అండర్ ది సన్... ఇలా ఏ మిస్టరీ చూసినా పరిపుష్టమైన భాషతో సాహిత్యాభిలాషుల విందులా కూడా వుంటాయి. 

         ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ అయితే మర్డర్ మిస్టరీల జానర్ లో గేమ్ ఛేంజర్. ఒక విప్లవం. ఆ కాలపు ఉద్దండ రచయితలు అలెన్ పో, కానన్ డాయెల్, ఇంకెవరూ వూహించనే లేకపోయిన - ఇలా కూడా చేయవచ్చాని ఆలోచనే చేయలేకపోయిన, అనితర సాధ్య ప్రయోగం చేసింది అగథా క్రిస్టీ దీని ముగింపుతో. ఆనాడూ ఈనాడూ మర్డర్ మిస్టరీలకున్న ఒకే ఒక్క ఫార్ములా ఏమిటి? ఓ నల్గురో, ఇంకెక్కువ మందో అనుమానితులుంటే,  వాళ్ళల్లో ఎవరు హంతకుడో,  లేదా హంతకురాలో కనిపెట్టడమేగా? ఈ చట్రంలోనే మిస్టరీలు వుంటాయిగా?  ఇలాకాక, మొత్తం అనుమానితులందరూ  హంతకులైతే?? .... అన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? క్రిస్టీకే వచ్చింది. దీంతో ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ లో హంతకుడెవరా అని  అన్వేషిస్తున్న పైరట్ కి,  మొత్తం పన్నెండు మంది అనుమనితులూ హంతకులుగా  దొరికిపోతారు!!!

          ఫార్ములాని బ్రేక్ చేసి, మూస చట్రంలోంచి మర్డర్ మిస్టరీ జానర్ ని బయట పడేసింది  క్రిస్టీ అప్పట్లోనే. అయితే నవలకీ సినిమాగా మార్చిన కథకీ తేడాలున్నాయి. సినిమా ప్రారంభంలో వున్న జెరూసలెం ఎపిసోడ్ సినిమాకోసం సృష్టించిందే. యాక్షన్ సీన్లు కూడా నవల్లో లేవు. ముగింపులో  పైరట్ పాత్ర ముగింపు విషయంలో కూడా  సినిమా కథకి పొడిగింపు వుంది. వీటి గురించి చివర చూద్దాం. 

ఎవరెలా చేశారు 
     అగథా క్రిస్టీ వర్ణన ప్రకారం డిటెక్టివ్ హెర్క్యూల్ పైరట్ ఐదున్నర అడుగుల ఎత్తు వుంటాడు. మీసం వుంటుంది. కొంచెం తిక్కగా వుంటాడు. బెల్జియం దేశస్థుడు. ప్రస్తుతం ఈ పాత్ర పోషించిన బ్రిటిష్ నటుడు, ఈ సినిమా దర్శకుడూ అయిన కెన్నెత్ బ్రనగా మూడంగుళాలు ఎక్కువే ఎత్తుంటాడు. . మీసం మామూలుగా వుండదు. గదిలో వుంటే ఈ చివరనుంచి ఆ చివరిదాకా వున్నట్టు కన్పిస్తుంది. నవ్వు తెప్పించే అదే తిక్కతనంతో వుంటాడు. అంతే సీరియస్ గా కేసుతో ప్రవర్తిస్తాడు. 1974 లో ఈ పాత్రని బ్రిటిష్ నటుడు ఆల్బర్ట్ ఫిన్నే పోషించాడు. అది పూర్తిగా క్రిస్టీ వర్ణనకి సరిపోతుంది. బెల్జియం వ్యక్తి అన్పించేలా వుంటాడు. 
          బ్రనగా బెల్జియం దేశస్థుడిలా కూడా అన్పించకపోయినా, ఈ పాత్ర పూర్తిగా అతడి వన్ మాన్ షో. చాలా పకడ్బందీగా, ఒక డిటెక్టివ్ ఎలా వుంటాడో, ఎలా వుండాలో అంత వృత్తితత్వాన్ని కనబరుస్తూ కట్టిపడేస్తాడు. గగుర్పాటు కల్గించే మూడు యాక్షన్ సీన్లు కూడా చేస్తాడు. దిక్కూమొక్కూ వుండని ఆల్ప్స్ పర్వతాల మధ్య ఒక ఎత్తైన బ్రిడ్జి మీద ట్రైన్ ఆగిపోయి – చూస్తేనే ఆ దృశ్యం భీతావహంగా వుంటుంది. బ్రనగా యాక్షన్ ఇక వూహించుకోవాల్సిందే. 

          ఈ హత్య కేసంతా బాహ్యంగా అతడి మేధా శక్తిని పరీక్షించేదైనా, అంతర్గతంగా అతను బాధపడేది  - ఫ్లాష్ బ్యాకులోని ఒక కిడ్నాపూ- దాని విపరిణామాలకి. అయితే ఆ క్రిమినల్ ఇప్పుడు హతుడయ్యాడు. ఇతడికి న్యాయం చేయాల్సి వచ్చిన నైతిక బాధ్యత –చివరికి అనుమానితులందరూ ఇతడి హంతకులే అయ్యేసరికి – తనకే ప్రశ్నఅయి ఎదురు నిలబడుతుంది బ్రనగాకి బాధ్యత. ఇప్పుడతను పడే వేదన, న్యాయం చెప్పలేని అశక్తత, కళ్ళల్లో తిరిగే నీరు – ఈ ప్రపంచంలో న్యాయం త్రాసుని ఎల్లప్పుడూ బ్యాలెన్సు చేయడం సాధ్యం కాదనే అంతర్ముఖీన విలాపం (“ The scales of justice cannot always be equally weighed ” ) - ముగింపుకో  నూలు పోగు. అతడి మీద చివరి మూడు నాల్గు దృశ్యాలు గుండెని మెలితిప్పే భావోద్వేగపు కణికలు.

          బ్రనగా ఇతర హేమాహేమీలైన నటులందరితోనూ సమర్ధవంతంగా నటింప జేశాడు. హాలీవుడ్ బిగ్ స్టార్స్ జానీ డెప్ తో బాటు పెనెలోప్ క్రజ్,
మిషెల్ ఫీఫర్, జూడీ డెంచ్ తదితరులతో సిల్వర్ స్క్రీన్ బ్రహ్మాండంగా వెలిగిపోతూంటుంది. దృశ్యాలు  పీరియెడ్ లుక్ తో రిచ్ గా, క్లాసిక్ గా వుండేవే. ఆల్ప్స్ మంచు పర్వతాల మధ్య ట్రైను పోతూండే ఔట్ డోర్ దృశ్యాలు, రాత్రిపూట భీకరంగా మారే వాతావరణంలో, ఈదురు గాలులూ పిడుగు పాట్లూ హిమపాతాల మధ్య – చుక్కు చుక్కు చుక్కు మనుకుంటూ, ఆవిరింజను బోగీల్ని లాక్కుంటూ పోయే ప్రకృతి కెదురీతా, ఠకాల్మని అంతెత్తు బ్రిడ్జి మీద భయానకంగా ఆగిపోయీ -  చివరిదాకా అందులోనే సాగే ఉత్కంఠ రేపే మర్డర్  డ్రామా – ఇవన్నీ విజువల్ అప్పీల్ ని హిమాలయాలకి తాటించే  శిఖరాగ్ర స్థాయి చిత్రీకరణలే. దర్శకుడిగానూ కెన్నెత్ బ్రనగా అపూర్వ విరుపులు – మాస్టర్ స్ట్రోక్స్. 

చివరికేమిటి 
        ప్రధానంగా ఏమిటంటే ఇది ఎండ్ సస్పెన్స్ కథ. ఈ మధ్య తెలుగు సినిమాల్లో దీని గురించి ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాం. అదిప్పుడు మౌలికంగా ఎలా వుంటుందో అలా ప్రత్యక్ష మయింది. మర్డర్ మిస్టరీ లన్నీ ఎండ్ సస్పెన్స్ లే. క్రిస్టీ నవలన్నీ ఇవే. ఎండ్ సస్పెన్స్ ని నవలగా చదవగలం  గానీ సినిమాగా చూడలేం. చదవడానికీ చూడడానికీ తేడా వుంది. సినిమాగా చూస్తే ఏమవుతుందంటే : 1. హంతకుడెవరా అని చివరివరకూ ఓపికపట్టి చూడాలి, 2. చివరిదాకా విలన్ కన్పించకపోవడంతో హీరో పాత్ర నిరుద్యోగిగా కన్పిస్తూ బోరు కొడుతుంది, 3. మొదటి ఆట చూసిన ప్రేక్షకుల ద్వారా హంతకుడెవరో తెలిసిపోతే తర్వాతి ఆటలకెళ్ళే  ప్రేక్షకులకి ఏ సస్పెన్సూ వుండదు.

         కాబట్టి మొదటి రెండిటి ఖర్మ ప్రేక్షకులు అనుభవిస్తారు. మూడోది ఆ సినిమా నిర్మాతలు అనుభవిస్తారు. నిర్మాతల శ్రేయస్సు కోసమైనా ఒక్క ఆట సస్పెన్సు  కోసం ఈ బుద్ధి మాలిన పని చెయ్యడు ఏ సినిమా కథకుడూ. చేశాడంటే జైల్లో పెట్టాల్సిందే. 

          అమెరికన్ రచయిత్రి, బుక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంజె రోజ్ ఏం చెప్పిందో ఓసారి చూద్దాం : A mystery is a whodunit. You know what happened, but not how or who's behind it. A thriller, or a suspense, is a howdunit. You know what happened, and you usually know who did it, but you keep reading because you want to know how they pulled it off.

          మిస్టరీ అంటే, whodunit (ఎవరు చేశారు?) అన్న ప్రశ్నతో సాగేది. ఏం జరిగిందో మనకి చూపిస్తారు. కానీ ఎవరు చేశారో, ఎలా చేశారో చివరి దాకా సస్పెన్స్ లో వుంచుతారు. సస్పెన్ థ్రిల్లర్ అంటే, howdunit (ఎలా చేశారు?) అనే ప్రశ్నతో సాగేది. ఏం జరిగిందో, ఎవరు చేశారో మనకి చూపించేస్తారు. ఎలా చేశారనేది సస్పెన్స్ లో పెడతారు. ఈ రెండోదే సినిమాలకి పనికొస్తుంది. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పుకుంటే-  హత్య జరిగింది, ఎవరు చేశారో అప్పుడే తెలిసిపోయింది, ఈ విలన్ని  హీరో ఎలా పట్టుకుంటాడనే ‘సీన్ టు సీన్ సస్పెన్స్’  ని సృష్టిస్తూ సాగేదే సస్పెన్స్ థ్రిల్లర్. మొదటిది ఎండ్ సస్పెన్స్ అయితే, ఇది సీన్ టు సీన్ సస్పెన్స్.  దీంతోనే ఎన్ని ఆటలైనా సినిమా ఆడుతుంది, మిగతా విషయాలు బావుంటే. సినిమాలకి ఎలా? అన్న ప్రశ్నే చూసేట్టు చేస్తుంది, ఎవరు? అనేది కాదు. ఎవరు? అనేది తెరమీద కనబడిపోతూండాలి, హీరోతో సిగపట్లకి దిగిపోవాలి. అప్పుడే మజా వస్తుంది. ‘స్పైడర్’ లో సైకోకిల్లర్ సూర్య ని చివరి వరకూ దాచి పెడితే,  మహేష్ బాబు ఏం చేస్తూండే వాడు? సినిమా ఫిజికల్ గా వుండాలి, నవల మానసికంగా వుండొచ్చు. 

మరెలా చూడాలి?
     ఇలాటి ఎండ్ సస్పెన్స్ తో వున్న ఎంఓఎ  (మర్డర్ ఆన్ ది ఓరియెంట్  ఎక్స్ ప్రెస్)  ని మరి ఇప్పుడెలా చూడగలం?  ఎలా చూడగలమంటే, ఆ కాలంలో అలా రాసేవాళ్ళు కాబట్టి ఆ కాల నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే చూడగలం. ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతున్న నవలని కోట్లాది మంది చదివేసి వుంటారు కాబట్టి ఇలాకూడా  సినిమా చూడ్డానికి ఏ సస్పెన్సూ వుండదు. అలాటి నవలని ఎలా తీశారనే అకడెమిక్ ఇంటరెస్ట్ తో చూసేవాళ్ళే ఎక్కువ. ఇలా ఇప్పటి కాల నేపధ్యంలో  ‘స్పైడర్’ తీస్తే ఒక్క ఆట కూడా ఆడదు. నిజ సంఘటనల మీద తీసే మర్డర్ కథల్ని కూడా  ఎండ్ సస్పెన్స్ తోనే వున్నా చూడగలం. ఎందుకంటే ఆ నిజ కథ దగ్గర ఫిక్స్ అయిపోయి, ఆ కళ్ళద్దాలతో చూస్తాం కాబట్టి. నోయిడాలో జరిగిన ఆరుషి హత్యకేసు మీద తీసిన ‘తల్వార్’ ఇలాటిదే. హంతకులెవరో తేల్చడానికి సాగే దర్యాప్తే కథ. ఇలా నిజకథలూ, పీరియెడ్ కథలూ అనే ప్రాతిపదిక లేక,  ఫిక్షన్ చేసి ఇప్పుడు జరుగుతున్న కథలా చేస్తే - ఆ ఎండ్ సస్పెన్స్  పనికిరాదు. 

           ఎంఓఎ కి స్క్రీన్ ప్లే రూల్స్ అన్నీ వుంటాయి. బిగినింగ్ మొదటి అరగంట వరకూ ట్రైన్ ఎక్కే వివిధ పాత్రల పరిచయాలూ,  వాటి  కాలక్షేపాలూ వుంటాయి. దాదాపూ ఇరవై పాత్రలు. సినిమా కాబట్టి ఇన్నేసి పాత్రల పేర్లు తెలుసుకోక పోయినా, గుర్తుంచుకోక పోయినా,   స్టార్స్ ని బట్టి వివిధ దృశ్యాల్లో ఎవరేం చేశారో, చేస్తున్నారో గుర్తుంచుకుంటూ పోగలం. కానీ స్క్రీన్ ప్లే చదివితే పేర్లే గుర్తుంచుకోవాలి. ఆ పేర్లతో ఎవరేమిటో గుర్తు పెట్టుకోవాలి. ఆ పేర్లతోనే ఎవరు ఎవరితో ఏం చేస్తూపోతున్నారో అతి కష్టపడి గుర్తుపెట్టుకుంటూ పోవాలి. ముప్పై పేజీల ఈ బిగినింగ్ విభాగపు పాత్రల పరిచయ కార్యక్రమంలో ఇన్నేసి పాత్రలతో గజిబిజి అయి,  బుర్ర చెడి పక్కన పడేస్తాం కాసేపు. ఎవరెవరెవరో ఒక లిస్టు రాసుకుని,  అది చూసుకుంటూ  చదివితే గానీ ఆ పైన చదవే పరిస్థితి వుండదు. నవల్లో స్పేస్ ఎక్కువ కాబట్టి, పాత్రల  వర్ణనలూ బయోగ్రఫీలూ ఎక్కువుంటాయి కాబట్టీ, మనసులో ముద్రించుకుంటూ వెళ్ళగలవు (ఎప్పుడో ఇంటర్మీడియేట్ లోవున్నప్పుడు చదివిన నవల్లో పాత్రలు ఇప్పుడేం గుర్తుంటాయి. నిక్కర్లేసుకుని ఎనిమిదో తరగతి లో వున్నప్పుడు పరిస్థితులు డిమాండ్ చేసి చదవడం ప్రారంభించిన కొమ్మూరి, టెంపోరావ్ నవలల్లో పాత్రలు  గుర్తున్నాయి విచిత్రంగా).  క్రిస్టీ ఇన్నేసి (పన్నెండు అనుమానిత పాత్రలే గాక మరెన్నో) పాత్రల్ని పెట్టడంలో ఒక ఉద్దేశముంది. కోర్టు జ్యూరీలో పన్నెండుమంది సభ్యులుంటారు. ఆ జ్యూరీని సింబాలిక్ గా వీళ్ళతో చివర్లో వాడుకోవడానికే  పెట్టింది.

ఎండ్ సస్పెన్స్ తో ఏం చేశారు?
        పాత్రల పరిచయాలయ్యాక,  ఇక సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన మొదలవుతుంది. తనకి ప్రాణహాని వుందని రిచెట్ పాత్ర పైరట్ ని రక్షణ కోరడం, పైరట్ తిరస్కరించడం, ఆ రాత్రి అల్లకల్లోల వాతావరణం ....మొదలైన వాటితో సమస్యకి దారితీసే పరిస్థితుల్ని కల్పించాక, ఇక సమస్య ఏర్పాటవుతుంది - ప్లాట్ పాయింట్ వన్ - తెల్లారి చూస్తే  రిచెట్ హత్య జరిగి వుండడం. ఇప్పుడు స్క్రీన్ టైం ముప్పావు గంట. కథ ప్రారంభమయ్యింది. మిడిల్లో పడింది కథ. ఇక ఈ హత్యని పరిష్కరించే సమస్యతో (గోల్ తో), మిడిల్ ధర్మం ప్రకారం, పైరట్ సంఘర్షణ మొదలవుతుంది.

          ఏమిటా సంఘర్షణ? ప్రత్యర్ధి లేడు, ఎవరితో సంఘర్షణ? ఏం సంఘర్షణ? ట్రైన్లో పన్నెండు మంది వుంటారు ప్రయాణీకులు. వీళ్ళని అనుమానితులుగా ప్రకటించి, ఒకరి తర్వాత ఒకరుగా ఇంటర్వ్యూలు  చేసుకుంటూ వెళ్ళడమే. ఈ ఇంటర్వ్యూల్లో కొందరితో ఎదురయ్యే ప్రతిఘటనలు, వాదోప వాదాలే. మిడిల్లో జరగాల్సిన యాక్షన్ – రియాక్షన్ల బిజినెస్ ప్రకారం ఈ తప్పొప్పుల వాగ్యుద్ధాలు కరెక్టే. కానీ ఇవి కేవలం వాగ్యుద్ధాలే . కేవలం వెర్బల్ యాక్షన్  మిడిల్ ని -  సినిమాని  - నిలబెట్టలేదు. మిడిల్ సంఘర్షణ విజువల్ యాక్షన్నికూడా కలుపుకుని వుండాల్సిందే. అందుకని అప్పడప్పుడు పైరట్ మీద దాడులతో యాక్షన్ సీన్లు. నవలలో లేని యాక్షన్ సీన్లు. అయినా ఈ ఎండ్ సస్పన్స్ తో హంతకుడెవరో తేలేవరకూ ఫ్లాట్ కథనమే వుంటుంది. విషయలేమి కొట్టొచ్చినట్టూ కనపడుతుంది. 

          మన సినిమాల్లో ఇలాటి కథలతో ఇదే సమస్య. మొదలెట్టింకాణ్ణించీ ముగిసేవరకూ,  హంతకుడెవరనే కాసేపటికి తళుకు బెళుకులు కోల్పోయే, బలం లేని ఒకే పాయింటు చుట్టూ కథనం చేయడం. క్రిస్టీ ఇలా చేయలేదు. డెప్త్ లేని వెలితి తీర్చేందుకు సెకండరీ మిస్టరీ జోడించింది. గతంలో కాసెట్టీ అనే క్రిమినల్ పాల్పడిన బాలిక కిడ్నాప్ కథ. ఆ సంబంధమైన ఫ్లాష్ బ్యాక్. ఆ కాసేట్టీయే ఇప్పుడు హతుడైన రిచెట్ అని బయటపడడం – దీంతో హంతకుడెవరనే ఎండ్ సస్పెన్స్ ఫిలింగ్, ఫ్లాట్ కథనం, విషయలేమి వగైరాలన్నిటికీ చెక్ పెట్టడం కుదిరింది. ఇంకొకటేమిటంటే, ఆ ఫ్లాష్ బ్యాకుతో రిచెట్ ని కనెక్ట్ చేసినట్టే, పైరట్ నీ కనెక్ట్ చేయడంతో మొత్తం కథకే జీవం వచ్చింది. నిజానికి పైరట్ గతంలో ఆ కిడ్నాప్ కేసు తన దగ్గరి కొచ్చినా చేపట్టలేకపోయాడు. అది అన్ని దారుణాలకి దారితీయడం అతడిలో గిల్ట్ ని పెంచింది. ఇలా పాత్రకి మంచి లోతు పాతులేర్పడ్డాయి. ఎమోషనల్ గా మనం కనెక్ట్ అవుతాం. ఇదే ఎమోషనల్ కనెక్ట్ తో ముగింపులో అతడి మోరల్ డైలమాని అర్ధం జేసుకోగల్గుతాం. 

          నిజానికి ఈ ఫ్లాష్ బ్యాక్ అప్పట్లో నిజంగా జరిగిందే. క్రిస్టీ ఫీలై నవలలో వాడుకుంది. అలాగే ఆల్ప్స్ పర్వతాల మధ్య ట్రైను  మంచులో చిక్కుకోవడం నిజ జీవితంలో ఆమె అనుభవించిందే. కథలో ఈ రెండూ ఇప్పుడు సినిమాకి మంచి బలాన్నిచ్చాయి. ఫ్లాష్ బ్యాక్ సరే, మంచు ఉత్పాతం అనే సంఘటనతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటవడంతో- అది బలంగా చాలాకాలం ఈ ప్లాట్ పాయింట్ వన్ గుర్తుండేలా మనసులో నాటుకుంటుంది.  ప్లాట్ పాయింట్ వన్ విజువల్ యాక్షన్ తో వుండాలసలు. ‘అన్ ఫెయిత్ పుల్’ లో, అలాగే విక్రం కుమార్ తీసిన  ‘24’  లో ఇలాగే విజువల్ యాక్షన్ తో కలుపుకుని వుండే ప్లాట్ పాయింట్ వన్లు ఇప్పటికీ మైండ్ ని డిస్టర్బ్ చేస్తూంటాయి. కథంటే సంఘటనల క్రమమే, మాటల క్రమం కాదు. నేనిలా అని తెలిసే ఎందుకు ప్రేమించావ్ – బుద్ధిలేక ప్రేమించా – అని మాటలనుకుని హీరోహీరోయిన్లు విడిపోయే ప్లాట్ పాయింట్ వన్లు లేకి చిత్రణలు. 

ఎలా విప్పారు?
      ఇలా కథలో కథ (ఫ్లాష్ బ్యాక్ )బయటపడి మిడిల్  బలీయమవుతున్నాక, ప్రస్తుత దర్యాప్తు కథనాన్ని బలీయం చేస్తారు. అదెలాగంటే, హత్యలో ఒకరు కాదు, ఇద్దరు పాల్గొని వుండాలని. ఆధారం? కత్తి పోట్లు రెండు రకాలుగా వున్నాయి. బలంగా పొడిచినవి, బలహీనంగా పొడిచినవి. కాబట్టి ఆ ఇద్దరూ ఒక మగ, ఒక ఆడ అయివుండాలని ఇంకో ట్విస్టు. ఇంకోటేం జరుగుతుందంటే,  అనుమానితుల్లో పెద్దావిడ భుజంలో ఎవరో కత్తి గుచ్చి పారిపోతారు. క్యారుక్యారు మంటుంది. 

          ఇదంతా నాటకం. పేద్ద నాటకం. ఒకరొకరూ వీళ్ళందరూ ఏదో విధంగా ఫ్లాష్ బ్యాక్ తో కనెక్ట్ అయి వున్నారని పైరట్ కనిపెట్టేసరికి - ప్లాట్ పాయింట్ టూ.

          పెద్దావిడ (మిషెల్ ఫీఫర్) ఎవరో కాదు, ఆనాడు కాసెట్టీ అలియాస్ రిచెట్ కిడ్నాప్ చేసి చంపేసిన బాలిక అమ్మమ్మ. మత్తులో వూగుతూ వుండే అమ్మాయెవరో కాదు, బాలిక పిన్నీ ... ఇలా కుటుంబ సభ్యులే కాకుండా, ఆ చనిపోయిన కుటుంబానికి సన్నిహితులే అందరూ.  అప్పటి కిడ్నాప్ అండ్ మర్డర్  కేసులో సాంకేతిక కారణాలతో కాసెట్టి విడుదలైపోయాడు. అది ఈ 12 మందినీ బాధిస్తోంది. బాలిక, ఆమె తల్లిదండ్రులు, పనిమనిషీ... ఇంకా పుట్టని గర్భస్థ శిశువూ... వీళ్ళ ఆత్మలకి శాంతిని చేకూర్చడమే ఈ 12  మంది ధ్యేయం. దీనికి నాయకత్వం  అమ్మమ్మ. ఈ ట్రైనులో కాసెట్టీ అలియాస్ రచెట్ పోతున్నాడని కనిపెట్టి అమ్మమ పన్నిన  గ్రాండ్ ప్లానే ఇది. కాకపోతే ఈ ట్రైనులో పైరట్ తగుల్తాడని వూహించలేదు. అయినా అతనున్నప్పటికీ  వెరవకుండా ప్లాను పారించుకుంది. 

          ఇలా బ్లాస్ట్ అవుతుంది ప్లాట్ పాయింట్ టూ. ఇది ప్లాట్ పాయింట్ వన్ కి మించిన బలంతో ఉండాల్సిన విధంగా వుంది. వుంది. పైగా ఎండ్ సస్పెన్స్ కూడా తెలిపోకుండా, వూహించని ట్విస్టుతో సస్పెన్సు విప్పుకుని - 12 మంది అనుమానితులే హంతకులుగా బద్దలయ్యింది. 

ముగింపు ఎలా? 
      ఇక ఎండ్ విభాగం మొదలు.  ఇందులో పైరట్ ఏ డిటెక్టివ్ కథలోనైనా వుండే విధంగానే తన దగ్గరున్న ఆధారాలతో కార్యకారణ సంబంధం వివరిస్తూ దెన్యూమో (denouement) చెప్పుకొస్తాడు. అప్పుడు ఆ 12 మందీ పాయింటాఫ్ వ్యూలో వాళ్ళు కాసెట్టీ అలియాస్ రచెట్ ని చంపున్నప్పటి ఫ్లాష్ కట్స్ పడతాయి.

          అందర్నీ వరసగా కూర్చోబెడతాడు. 12 మందీ ఒక జ్యూరీలాగా కూర్చుంటారు. 12 కత్తి పోట్లు పొడిచి చంపింది వాళ్ళే, జ్యూరీ వాళ్ళే, ఇప్పుడు తీర్పు చెప్పాల్సిందీ వాళ్ళే! వాళ్ళ ఎదురుగా నిలబడి తన వాదన విన్పించుకుంటాడు పైరట్. రెండే జరిగి వుండాలి : ట్రైనాగి పోయినప్పుడు ఎవరో ఆగంతకుడు జొరబడి చంపి పారిపోయి వుండాలి, లేదా మీ 12 మందీ చంపి వుండాలని. ఐతే నిజమేంటో తెలిసిన వాణ్ణి గనుక, ఇది దాచుకుని బతకలేననీ, మీకు ప్రమాదం కూడాననీ చెప్పి, తనని చంపెయ్యమనీ  అమ్మమ్మ ముందు పిస్తోలు పెడతాడు. 

          నా మనవరాలు చనిపోయినప్పుడే నేను చచ్చిపోయానని – ఆమె పిస్తోలు తలకి పెట్టి ట్రిగ్గర్ లాగుతుంది. గుళ్లుండవు. అటు పైరట్ – ఇటు వీళ్ళందరి అంతరాత్మల సంక్షోభంతో ఉద్రిక్తంగా వుంటుంది సీను.

          నవల్లో ఈ డ్రామా వుండదు. అందులో పైరట్ వాళ్ళ పట్ల సానుభూతితో వుంటాడు. సానుభూతితో ఏం చేయగలడు. తను పోలీసు కాదు, చట్టం కాదు. ట్రైను అధికారికి తన రెండు థియరీలు చెప్పేసి వెళ్ళిపోతాడు. ట్రైను అధికారి మొదటి థియరీనే ఓకే చేసి,  పోలీసులకి తెలియజేస్తాడు. దీంతో నవల ముగుస్తుంది. క్రిస్టీ దైవిక న్యాయం వైపున్నట్టు వుంటుంది. 

          సినిమాలో పైరట్ అలా వుండ లేకపోతాడు. కానీ ఏమీ చేయలేకపోతాడు. చట్టమూ పోలీసులూ దైవిక న్యాయం వైపే వుండడంతో - ఈ ప్రపంచంలో న్యాయాన్ని కాపాడడం అన్నిసార్లూ కుదరదని ఎమోషనలై – కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతాడు. నిజానికి సినిమాకి పాత్రకిచ్చిన ఈ భావోద్రేకపూరిత ముగింపే బావుంది. ఇలాగని పైరట్ పాసివ్ క్యారక్టర్ అయిందా? కాలేదు. చివరివరకూ పోరాడే పాత్ర పాసివ్ పాత్ర అవదు. చివరికి ఆశించిన ఫలితం దక్కవచ్చు, దక్కకపోవచ్చు. యాక్టివ్ పాత్రకి దీంతో నిమిత్తం లేదు- అంతిమంగా పాయింటు ఎస్టాబ్లిష్ చేశాడా లేదా అనేదే ముఖ్యం. ప్రాక్టికల్ గా వుండే పాయింటు. ఆ కాలంలో క్రిస్టీ చర్చి వైపు నుంచి ముగింపు చూసి వుండొచ్చు. ఇప్పుడు కాలం అలా లేదు. చట్టం వైపు నుంచే చూడాలి. అయినా ఈ చట్టం చేతిలో పెడితే ఆ చట్టమెలా వుంది? న్యాయం ఎక్కడుంది? న్యాయం ఇలాగే వుంటుందని ప్రాక్టికల్ గా  తెలియజేసి వెళ్ళిపోయాడు పైరట్.

          వాస్తవం ఎలా వుంటుందో  కళ్ళు తెరిపించి వెళ్ళిపోయే వాడే అసలైన హీరో. వాస్తవాన్ని తొక్కిపెట్టి, ఆ 12 మందినీ జైల్లో వేసిపోయేవాడు ప్రేక్షకుల్ని మభ్య పెట్టే హీరో.  


సికిందర్