రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, నవంబర్ 2017, గురువారం

551 : సెకండాఫ్ సంగతులు

    సెకండాఫ్ మొదటి ఎపిసోడ్ ప్రారంభం కాగానే  ఈ సినిమా కథకి  ‘ఉపోద్ఘాతం’’ చెప్పే  (ఇంకా కథ మొదలవనే లేదు) టీవీ ఛానెళ్ళ ప్రసారాల ప్రహసనం మొదలై, ఫస్టాఫ్ మోడర్నిటీని ఇదెంత డిగ్నిటీ లేకుండా చేసి, ఏకసూత్రతని నీరుగార్చిందో గత వ్యాసంలో తెలుసుకున్నాం.  దీని తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకుడు ప్రతాప రెడ్డి  వస్తాడు. ఇతను ఇది రూలింగ్ పార్టీ చేసిన రాజకీయ కుట్రంటూ చిందులేస్తాడు. ముందు ఫస్టాఫ్ లో చూపిస్తూ వచ్చిందంతా మత కోణంలో  స్వతంత్రంగా టెర్రరిస్టులతో బాంబు దాడి కుట్రలా అన్పిస్తే, ఇదిప్పుడు రూలింగ్ పార్టీ చేసిన రాజకీయ కుట్ర కలరిచ్చుకుంది. రూలింగ్ పార్టీ టెర్రరిస్టులతో రాజకీయ కుట్ర చేయడమేమిటి. ఇదే సందేహం ఫస్టాఫ్ లో ఒక పాత్రకి వస్తుంది – టెర్రరిస్టు రాజకీయ కుట్రలో పాల్గొనడమేమిటని. చివరికి  దీనికి మతకోణంతో  మేనేజ్ చేశారు.  

         ఒక సినిమా కథ ఏ పాయింటు మీదా నిలబడక ఇలా అరగంటకో పాయింటు చొప్పున మారిపోతూ వుంటుందా?  టెర్రరిజంలోంచి రాజకీయంలోకి, రాజకీయంలోంచి మైనింగ్ మాఫియాలోకి? వేర్వేరు జానర్ల లోకి? వేర్వేరు ఒక్కో బుల్లి కథా అన్పించేలా కొన్ని ఎపిసోడ్లుగా నడుస్తూ వుండే  కథనంతో – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య లాంటివి చూశాం గానీ, ఇలా కాదు. వీటిలో కథని దాచిపెట్టి  మభ్య పెట్టడం వుండదు. దేనికది విడివిడి ఎపిసోడ్లతో పొరపాటు చేశారని తెలిసిపోతూనే వుంటుంది. ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో  డాక్యుమెంటరీలు తీస్తారు. సినిమాకి కొన్ని  బేసిక్స్ వుంటాయి : కథ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఉచ్చులో పడకుండా చూసుకోవడం, మిడిల్ మటాష్ అవకుండా చూసుకోవడం, కథ గాథ అవకుండా చూసుకోవడం, కథ సెకండాఫ్ సిండ్రోమ్ కాకుండా చూసుకోవడం, కథ ఎండ్ సస్పెన్స్ కాకుండా చూసుకోవడం, కథని కథకుడు నడపకుండా చూసుకోవడం, మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ విబేధించకుండా జాగ్రత్త పడడం...ఇలా...

          స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ సినిమాల కొచ్చి ఎలా తిరగబెడుతుందంటే,  తడవకో పాయింటు వచ్చి పడుతోంటే, ఒకే పెద్ద కథలా అన్పించక, చిన్న చిన్న కథల సంపుటి అన్పించేలా అసంతృప్తికరంగా తయారవుతుంది – ఇదే దర్శకుడి ‘చందమామ కథలు’ లాగా. ఐతే ‘గరుడ వేగ’ ని ఉద్దేశపూర్వకంగా ‘చందమామ కథలు’ లాగా తయారు చేశారనుకోలేం - వీలైనంత ఎక్కువ సేపు కథని దాచిపెట్టే ప్రయత్నంలో (ఎందుకో?) వేరే కథనాలతో కాలక్షేపం చేస్తూపోయారు. ఆ ప్రయత్నం ‘చందమామ కథలు’  లాగా చిన్న చిన్న కథల సంపుటిలా మారిపోయింది. చిన్న చిన్న కథల సినిమాలు తెలుగులో ఆడవు. ఒకే పెద్ద కథ వుండాలి. నవలలు రాజ్యమేలిన కాలంలో నవలలే అమ్ముడయ్యేవి గానీ, కథానికల సంపుటాలు వేస్తే నిల్వ వుండేవి. తెలుగు పాఠక – ప్రేక్షక లోకం అభిరుచికి సినిమాల విషయం కూడా ఇంతే. 

     పరిశుభ్రంగా,  సీదా సాదాగా కథ చెబితే ఏమవుతుంది? మంచి కథవ్వాలంటే, సినిమాలకి ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే, కథకి క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్ ముఖ్యం కదా?  హాలీవుడ్ సినిమాల ప్రభావంతో  ఇలాటి హై కాన్సెప్ట్ తో కూడిన భారీ  యాక్షన్ సినిమాలు  తీస్తున్నప్పుడు, హాలీవుడ్ లోంచి ఏం తెలుసుకుంటున్నట్టు? హై కాన్సెప్ట్ కథల్లో వుండే బిగ్ ఇష్యూస్ తో లైనాఫ్ యాక్షన్ సింపుల్ గా, క్లీన్ గా వుంటే బలంగా వుంటుందని కదా? ఇందుకు వ్యతిరేకంగా, అదే లో- కాన్సెప్ట్ కథల్లో వుండే  చిన్న పాయింటుకి  లైనాఫ్ యాక్షన్ సంక్లిష్టంగా వుంటే బలంగా వుంటుందని కదా? ఇవి బేసిక్సు. అసలు  బేసిక్స్ ఏమిటో లిస్టు ముందు పెట్టుకుని సినిమా కథకి శ్రీకారం చుట్టకపోతే,  ఆ కథ తుగ్లక్ పాలనలాగే  వుంటుంది.

          పైగా ఈ రాజకీయ పాత్ర పవర్ఫుల్ పాత్ర కాదు. పోసాని రూపంలో ఒక  కామెడీ పాత్ర. ఫస్టాఫ్ హై ఓల్టేజి యాక్షన్ అంతా ఈ కామెడీ పాత్ర రాకతో నేలపాలు. ఒక కామెడీ పాత్రని  చంపడానికి అట్టహాసంగా అంత బాంబు దాడి కుట్రంతా అవసరమా. లాల్చీ పైజమా వేసుకుని పాత మూస నేతలా కన్పించగానే సినిమాలో పెప్ అంతా పోయింది. జానర్ మర్యాద ప్రకారం ఫుల్ హవాతో, ఒక బలమైన హై ప్రొఫైల్ పొలిటీషియన్ కదా కావాల్సిం దిక్కడ?

          ఈ ప్రతాపరెడ్డి కూడా ఏమారోపిస్తున్నాడు? రాజకీయ కుట్ర అంటున్నాడు. అసలు తనకి  మైనింగ్ మాఫియాతో సంబంధమున్న విషయం మనకి సస్పెన్స్ లో వుంచారు (ఎందుకో?). అలాంటప్పుడు ఈ బాంబు దాడి కుట్ర మాఫియా విలనే చేసి వుంటాడని ప్రతాపరెడ్డికి అన్పించదా? ఒకవేళ మాఫియాతో  సంబంధాలు కప్పి పుచ్చడానికే  ఈ ఆరోపణ చేసి వుంటే, తర్వాతైనా మాఫియాని నిలదీయాలనుకోడా?  అంతా తికమక. ప్రేక్షకులు  ఉదారంగా, ఎంతో ఔదార్యంతో, సినిమా భక్తితో అరమోడ్పు కనులతో వివశులై, దైవ సమానులైన మేకర్లు అందించే  సినిమాలు చూస్తారు గనుక, ఏదో  పైపైన పాలిష్ చేసి చూపించేస్తే సరిపోతుందనేమో ఇలా! 

          ఇతడితో కామెడీ సీన్లు నడుస్తూండగానే, ఎక్కడో టీవీ చూస్తున్న విలన్ కొద్ది క్షణాలు కన్పించి కట్ అయిపోతాడు. రోబో చెయ్యితో, ఇంకేదో మాయ కన్నుతో హైఫైగా అట్టహాసంగానే  వుంటాడు. మళ్ళీ ఇతనెవరు?  టెర్రరిస్టు నాయకుడిలా లేడే? అంటే  మొదలెట్టబోయే  అసలు మాఫియా కథకి మనం చూడబోయే అసలు విలన్ అన్నమాట. ఫస్టాఫ్ గంటంపావు, సెకండాఫ్ ఇప్పటిదాకా ఇంకో పావుగంట – మొత్తంకలిపి గంటన్నర సేపు విలనే కన్పించకపోతే ఎలాటి బిగ్ కమర్షియల్ యాక్షన్ కథ? కథని ఎండ్ సస్పెన్స్ చేస్తే, దాంతో ముడిపడి వుండే  విలన్ కూడా ఎండ్ లోనే కన్పిస్తాడు. మార్కెట్ యాస్పెక్ట్ తో ముడిపడని  ఈ క్రియేటివ్ యాస్పెక్ట్ అవసరమా? 

          ఇక  సెకండాఫ్ ఇదే మొదటి ఎపిసోడ్ లో సుల్తాన్ బజార్ లో మళ్ళీ రషీద్ సుల్తాన్ అనే టెర్రరిస్టుతో ఇంకేవో  డీలింగులు!  ఇప్పుడు సెకండాఫ్ లో కూడా ఇరవై నిముషాలు గడిచిపోతున్నా కథేంటో వూహకందదు. అంటే ఫస్టాఫ్ లో ప్రారంభించిన బిగినింగ్ విభాగం ఇంటర్వెల్ ని కూడా దాటేసి,  సెకండాఫ్ లో ఇంకా ముగియడం లేదు. ఇలా కథకి స్ట్రక్చర్ అంతా చెదిరిపోయింది. ఈ బిగినింగ్ ఎప్పుడు ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఇంకె ప్పుడొస్తుంది? వచ్చాక మిడిలెంత కుంచించుకు పోయి వుంటుంది? అప్పుడు మొత్తం సినిమాలో అసలు  ‘విషయం’ ఏ మేరకు సోసోగా వుంటుంది?

ఇంటరాగేషన్ ఇంటికి!
        ఇదే మొదటి ఎపిసోడ్ లో  ఇంటర్వెల్లో పట్టుబడ్డ నిరంజన్ ఇంటరాగేషన్ విషయం. ఇంటర్వెల్లో సాహసించి హీరో పట్టుకున్న నిందితుణ్ణి ఇంటరాగేషన్ ఎవరు చేస్తారని మనం వూహిస్తాం? అదే హీరో చేస్తాడని కదా. అలా జరగదు.  హీరో అసిస్టెంట్స్ చేస్తూంటారు. ఫస్టాఫ్ లో అంత భారీ ప్రమాదకర కుట్ర చూపించాక, ఇప్పుడు దాని విలువ తనే తగ్గించుకుంటూ కథకుడు, ఇంటరాగేషన్ ని అసిస్టెంట్స్ కి అప్పగించి  హీరోని దూరం పెట్టేశాడు. 

          ఫస్టాఫ్ అంతా ఏమేం కథానికలు చూపించినా,  హీరో కి ఒక క్యారక్టర్ ఆర్క్ అంటూ ఏర్పడిందనీ, దాంతో టైం అండ్ టెన్షన్  గ్రాఫ్ ఏర్పాటయ్యిందనీ  గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఈ రెండూ ఇంటర్వెల్ కొచ్చే టప్పటికి రాంగ్ ఇంటర్వెల్ బారినపడి సంతృప్త స్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకున్నాం. ఇంటర్వెల్లో కథనాపేశారు. మళ్ళీ వెంటనే కథని ఎత్తుకోవాలంటే ఏదో చేసి హీరోనే గతి. ఎందుకంటే హీరో క్యారక్టర్ ఆర్క్ ఏర్పడక పోతే ఏదీ వుండదు. హీరో క్యారక్టర్ ఆర్క్ ఏదో చేస్తూ పోతేనే ఏర్పడుతుంది. క్యారక్టర్ ఆర్క్ లేకుండా టైం అండ్ టెన్షన్  గ్రాఫ్ ఎలా ఏర్పడుతుంది? కనుక  చల్లారిన అన్నమే వడ్డించడం మొదలెట్టారిలా.

          సెకండాఫ్ ప్రారంభమయ్యాక టీవీ ఛానెళ్ళతో, రాజకీయ నాయకుడితో పతనమైన ఈ గ్రాఫ్ ని హీరో చేత ఇంటరాగేషన్ చేయించైనా మళ్ళీ లేపాలనుకోలేదు. ఈ మొదటి ఎపిసోడ్ అంతా  హీరోకి ప్రాధాన్యమే లేదు. నిందితుణ్ణి పట్టుకున్న హీరో ముందుగా  వాడి సంగతి చూస్తాడు ఎక్కడైనా. ఇక్కడ హీరో కన్పించకుండా పోయి, నిందితుడైన నిరంజన్ని హీరో అసిస్టెంట్స్ టార్చర్ చేస్తూంటారు! ఎందుకీ మైనర్ క్యారక్టర్స్ తో పసలేని చిత్రీకరణ? తెలుసుకుందాం దీని వెనుక కథకుడి ఉద్దేశం. అప్పుడొక కన్నింగ్ లాయర్ వస్తాడు. ఇక మనకి అర్ధమై పోతుంది, ఇక్కడ హీరో ఎందుకని లేకుండా చేశాడో కథకుడు. 

          హీరో వుంటే ఈ కన్నింగ్ లాయర్ రాలేడు. నిందితుడితో డీల్ కుదుర్చుకుని చక్కా పోలేడు. అందుకని  కథకుడాశిస్తున్న కథా సౌలభ్యం కోసం హీరో బహిష్కృతుడయ్యాడు. 

          హీరో గనుక ఇంత ముఖ్యమైన ఇంటరాగేషన్ సీనులో వుంటే, ఎవరో లాయర్ వచ్చాడని లేచి బయటి కెళ్ళిపోడు. లాయర్ని పొమ్మంటాడు. లాయర్ లోపలి కెలా వచ్చాడని అసిస్టెంట్స్ మీద కేకలేస్తాడు. ఎన్ఐఏ  ఆఫీసు అంటే పోలీసు ఠాణా కాదుగా. అదీ ఇంటరాగేషన్  రూములోకి ఎవరో వచ్చేసి డిస్టర్బ్ చేస్తే వూరుకుంటారా? ఇప్పుడు ఇలా వచ్చేసి నిరంజన్ తన  క్లయంట్ అనీ, క్లయింట్ తో మాట్లాడే అధికారం తనకుందనీ అంటాడు. ఎలా ఎప్పుడయ్యాడు  క్లయంట్ ? పేపర్స్ ఏవీ? అసిస్టెంట్స్ అడగరు. లేచి బయటికెళ్ళి పోతారు చక్కగా  – ఓహ్ గాడ్! ఎన్ఐఏ !!

          ఒకవేళ పేపర్స్ చూపించినా ఇలా వచ్చేయడానికి ఇదేం  పోలీస్ స్టేషన్ కాదు. టెర్రర్ కేసులో నిందితుణ్ణి కోర్టుకి అప్పగించాకే లాయర్ బెయిల్ కి మాత్రమే వేయగలదనేది కామన్ సెన్సు. ఆ బెయిల్ రావడానికి ఏళ్ళు పడుతుంది.  లేకపోతే  అసలు బెయిలే రాకపోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి  వస్తోందంటే, ఎన్ఐఏ గురించి చాలా రీసెర్చ్ చేశామన్నందుకు. సృజనాత్మక స్వేచ్ఛ అనే అధికారంతో ఇతర వ్యవస్థల అపసవ్య చిత్రణలు  అయిపోయాయి, ఇక ఎన్ఐఏ దొరికింది!  సృజనాత్మక  స్వేచ్ఛే ముఖ్యమనుకుంటే  రీసెర్చి దేనికి? సృజనాత్మక స్వేచ్ఛకి కూడా సమయ సందర్భాలుంటాయి.  ఎక్కడబడితే అక్కడ, ఎలాబడితే అలా వాడలేరు. ఫాల్స్ డ్రామా సృష్టించి ఆకట్టుకోలేరు.  

          నిరంజన్ దగ్గరున్న చిప్ కోసం పదికోట్లకి ఒప్పందం చేసుకుని, విదేశాలకి జంపయ్యేలా చూస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోతాడు కన్నింగ్ లాయర్. ఎన్ఐఏ ఆఫీసులో ఎన్ఐఏ కేసుని నీరుగార్చే ఇంత కుట్ర! అయినా హీరో ఏమీ చెయ్యడు! నిరంజన్ దగ్గర చిప్ వుందని హీరోకే తెలీదు! అసలు నిరంజన్ అయ్యర్ అనే వాడు  వేరేమత టెర్రరిస్టు ఎలా అయ్యాడో తెలుసుకోడు, మనకి చెప్పడు. ఈ ఎన్ఐఏ ఆఫీసులో లాయర్ కుట్ర అనే అనాలోచిత రచన, దీని తర్వాతి రెండో ఎపిసోడ్ లో హీరో పాత్ర ఇంకెంత దెబ్బతినడానికి కారణమయిందో చూద్దాం.
                                                         
రెండో ఎపిసోడ్ - సీనస్ ఇంటరప్టస్
      ఇక రెండో ఎపిసోడ్ లో నిరంజన్ ని నాగపూర్ జైలుకి తరలించే ప్రహసనం, ఆగిపోయిన ఇంటరాగేషన్ సంగతి పూర్తి చేయకుండానే, ఇంకో విషయంలోకి జంప్. ఫస్టాఫ్ ఓపెనింగ్ టీజర్ దగ్గర్నుంచీ కన్పిస్తున్న ఇతనెవరో ఇప్పటికైనా మనకి తెలియజేసి, టెంపోని – స్టోరీ డైనమిక్స్ నీ  ఇంకా పైస్థాయికి ఎగబ్రాకించాలన్న ఆలోచన లేకుండా! ఇంకా ఇతనెవరో తెలియని చప్పిడి కథనమే అందిస్తున్నారు మనకి. ఎప్పుడో ఆకలి చచ్చిపోయాక ఇతనెవరో చెప్తే ఎంత, చెప్పక పోతే ఎంత. సెటప్ కీ, దాని పేఆఫ్ కీ మధ్య ఒక పక్వానికొచ్చే వ్యవధి వుంటుంది. ఆ వ్యవధి దాటితే  పేఆఫ్ కుళ్ళిపోతుంది. 

          మొన్న ‘డిటెక్టివ్’ లో ఓపెనింగ్ టీజర్ గా చూపించిన పిడుగుపాటు మృతి అనే సెటప్ ని, ఇంటర్వెల్ కల్లా అదెలా జరిగిందో చెప్పేసి పే ఆఫ్ చేశారు. ఇంకెప్పుడో సెకండాఫ్ లో చెబితే పే ఆఫ్ అవదు, బూమరాంగ్ అవుతుంది. ఒక ఓపెనింగ్ బ్యాంగ్ తో మొదలయ్యే తెలుగు సినిమాలు కూడా ఇంటర్వెల్ కల్లా ఆ బ్యాంగ్ కి అర్ధం చేప్పేసి కథతో ముందు కెళ్ళిపోతాయి. ఇలా ఓపనింగ్ టీజర్ లో సుదీర్ఘంగా అవసరంలేని యాక్షన్ అంతా చేసిన మైనర్ పాత్ర నిరంజన్ సెటప్ ని, ఇంటర్వెల్లో దొరికిపోయినప్పుడు అప్పుడే అతనెవరో రివీల్ చేస్తేనే మనుగడలో వున్న ఓపెనింగ్ టీజర్ బతికి పే ఆఫ్ అయ్యేది. దానికక్కడి వరకే సారవంతమైన భూమి, ఆ తర్వాత ఫలదీకరణ చెందదు. ఇంటర్వెల్ తర్వాత దానికి బతుకు లేదు. ఇది గమనించకుండా,  ఇంకా సెకండాఫ్ లోవరకూ పే ఆఫ్ ని లాగితే ఇక అది అప్రస్తుతమైపోతుంది. అప్పుడు పే ఆఫ్ చేసినా ఒకటే,  చేయకపోయినా ఒకటే. 

          వెనుక ఎపిసోడ్ లో ఇంటరాగేషన్  సీనుకి సెటప్ – పేఆఫ్స్ కూడా ఎలావున్నాయో చూడండి : ఆ సీను కేవలం పక్కదారి పట్టిస్తూ లాయర్ హంగామా కోసమేనన్నట్టుంది. సీను సెటప్ ఒకటైతే, పే ఆఫ్ మరొకటి! సీను సెటప్ నే  గనుక గౌరవించి, ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఒక  క్వాలిటీ సీనే  అందించాలనుకుంటే, ఆ  సోకాల్డ్ ఇంటరాగేషన్ ఇలా మొదలవ్వాలి – ఎవర్నువ్వు? వేరే మత టెర్రరిస్టులతో నువ్వెందుకు కలిశావ్? ముందు నీ సంగతేంటో చెప్పు! – అని ప్రేక్షకుల సెన్సాఫ్ అర్జెన్సీ ని దృష్టిలో పెట్టుకుని మొదలవ్వాలి. ప్రేక్షకుల సెన్సాఫ్ అర్జెన్సీ కూడా బేసిక్స్ లో భాగమే. సీను ఇలా మొదలెట్టకుండా (సెటప్ ) – నిన్నూ... నించోబెట్టి, వంగదీసి, కింద నుంచీ - అంటూ అసభ్యంగా ఇంకేదో వైద్య పరిభాషతో ఇంటలెక్చువల్ లుక్ ఇచ్చుకుంటూ, శాడిస్టులుగా ఎమోషనలై పోతూంటారు హీరోగారి అసిస్టెంట్స్ ఎందుకో! ఫాల్స్ బిల్డప్. 

          ఇది హాఫ్ వేలో ఓపెన్ అయిన సీనా అంటే కాదు. ఇప్పుడే మొదలైంది. హాఫ్ వేలో వుంటే, ఆల్రెడీ అతగాణ్ణి అడుగుతున్నారనీ, అతను చెప్పడం లేదనీ అనేలా డైలాగుల  రూపం వుండేది. అలాలేదు. సరీగ్గా ఇప్పుడు లాయర్ వచ్చేశాక,  ఇంకా మొదలెట్టని ‘ఇంటరాగేషన్’ ని బుద్ధిగా ఆపేసి వెళ్ళిపోతారు అసిస్టెంట్స్ . ఈ ఇంటరాగేషన్ తో మొదలెట్టిన సీనుకి పేఆఫ్ లాయర్ కుట్రతో వుంది. సెటప్ (ఇంటరాగేషన్) ఒకటైతే, ఇంకో పాత్ర గొడవతో (కుట్రతో) పే ఆఫ్ మరొకటి! దీంతో ఈ సీను – ఇందులోని డ్రామా వీగి పోయి సీనస్ ఇంటరప్టస్ అయింది. ఈ కింద చూడండి :

          Now, I had been aware of this problem before, but I never had a name for it. But this was such a clear example of the problem that I labeled it Sceneus Interruptus. Leaving the scene too early simply means the purpose of the scene is unsatisfied, unfulfilled. It does not accomplish its dramatic function and therefore leaves a gaping hole in the action. And when that happens, something is definitely missing ― From ‘The Definitive Guide To Screenwriting’ ― Syd Field )

          ఇదన్న మాట. అంటే ఇంటరాగేషన్ ఉద్దేశంగా వున్నసీను తెగిపోయింది, ఇంకో విషయం వచ్చి సీన్ని హైజాక్ చేసింది . ఈ సీనులో నిరంజన్ ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో మనం వుంటే, ఇలా కాకుండా దీన్నాపేసి ఇదే సీనులో అతను ఇంకో కుట్రకి తెరతీస్తే జరిగేదేమిటి? మనం థ్రిల్ ఫీల్ కాం. ఎందుకంటే ఇప్పటికైనా ఆసలతనెవరో తెలిస్తేనే కదా అతడి తాజా  కుట్రకి ఇంకింత మనం టెన్షన్ పడేది? ఇలా ఒక పాయింటుతో మొదలెట్టిన  సీనుని ఇంకో పాయింటుతో భంగపర్చితే ఏర్పడే సమస్యకి ఒకటే వుంది – రెండు పాయింట్లనీ మనుగడలో వుంచే ముచ్చట. తర్వాత ఆ ఇంటరాగేషన్ పాయింటూ రన్ అవ్వాలి, ఈ కుట్ర పాయింటూ రన్ అయ్యేట్టు వుండాలి. 

           ఇదెలాగంటే, మొదట మొదలెట్టిన ఇంటరాగేషన్ అనే పాయింటుని ఒక క్లిఫ్ హేంగర్ మూమెంట్ కి చేర్చి సస్పెన్సు లో ఆపాలి. అప్పుడు లాయర్ ని పిలిపించుకుని అతడి కుట్రేదో అతణ్ణి  చేసుకోనివ్వాలి ( అంటే ఇలా లాయర్ రావడాన్ని మనం ఒప్పుకుంటున్నట్టు కాదు. ఈ వున్న సీనైనా  ఎలా వుండాలో,  ఇలాటి సీనస్ ఇంటరప్టస్ లకి విరుగుడేమిటో తెలుసుకుంటున్నామంతే ).

          ఎప్పుడైనా ఏ సీనైనా డల్ గా, మన్నుతిన్న పాములా ఓపెన్ అవకుండా – తగిన డైనమిక్స్ తో, 4 కె రన్ కి నేను సైతం అన్నట్టు ఓపెనవ్వాలనేది ఇంకో బేసిక్సు. సీను ఓపెనింగ్ ఈ మూడింట్లో ఒకటి డిమాండ్ చేస్తుంది – డైనమిక్ యాక్షన్ తో ఓపెనవడం, లేదా డైనమిక్ డైలాగుతో ఓపెనవడం, లేదూ ఈ రెండూ కలిసి ఓపెనవడం. ఈ మూడింట్లో ఏది బలంగా వుంటుందనేది అంతవరకూ మనకి  కలిగించిన సస్పెన్స్ మీద ఆధారపడుతుంది.

          ఉదాహరణకి,  ఈ సినిమాలోనే నిరంజన్ తో ఇంటరాగేషన్ సీను తీసుకుంటే, దీని ఎత్తుగడలో మనకి  సస్పెన్సు కల్గిస్తున్న అంశం, నిరంజన్ అసలెవరా అనేది. ఈ సస్పెన్సు ని  సినిమా ప్రారంభ సీను దగ్గర్నుంచీ భరిస్తున్నాం. ముందు దీన్ని పే ఆఫ్ చేయాలి. కాబట్టి ఈ ఇంటరాగేషన్ సీను ఎత్తుగడకి,  పవర్ పాయింటుగా  ఒక డైనమిక్ డైలాగే వుండాలి.

          అసలెవర్నువ్వు  - లాంటి డైనమిక్ డైలాగుతో ఈ సీను ఓపెనయితే మనకి వెంటనే కనెక్ట్ అవుతుంది. మనం తేరుకుంటాం. హమ్మయ్యా ఇప్పుడు సస్పెన్స్ తీరిపోతోందని తృప్తి పడతాం. అప్పుడీ సీను సూటిగా మనకి గుచ్చుకుంటుంది ఎత్తుగడలోనే. గుచ్చుకోని సీను విచ్చుకోదు.

          ఇలా కాకుండా, నిరంజన్ని కూర్చోబెట్టి  టార్చర్ చేస్తున్నట్టు ఆ సంబంధ డైలాగులతో సీను మొదలెడితే మన ‘కచ్చి’ తీరదు. ఇంకా సస్పన్స్ తెగక బోరు ఫీలవుతాం. కాబట్టి ఈ సీను ఇలా యాక్షన్ తో, అదీ పవర్ పాయింటుతో సంబంధంలేని డైలాగులతో,  ఓపెనవడం విఫల రచన. ఈ సీనుకి వెనక నిరంజన్ తో జరిగిన సీన్ల తీరుని కూడా దృష్టిలో పెట్టుకుంటే - ఫస్టాఫ్ నుంచీ ఇంతవరకూ ఏం చూస్తూ వచ్చాం – ఇతను నోరు విప్పకుండా తప్పించుకునే యాక్షన్ సీన్సే చూస్తూ వచ్చాం.

          దీనికి ద్వంద్వ న్యాయం అమలు చేస్తే, ఇప్పుడు ఈ ఇంటరాగేషన్ సీను ఓపెనింగ్ ఇలా  వుంటుంది – ఇతడితో ముందు సీన్లన్నీ డైలాగుల్లేని  యాక్షన్ తో వున్నాయి కాబట్టి,  ఇంటరాగేషన్ సీను కూడా టార్చర్ ఉద్దేశంతో డైలాగుల్లేకుండా యాక్షన్ తో మొదలవ కూడదు.  రెండూ ఒకటై పోతాయి. డైనమిక్స్ అన్పించుకోదు. ద్వంద్వాల పోషణ అవదు. అందుకని డై ...లా...గ్...తో మొదలవాలి. ఇది డైనమిక్స్. వెనక సీన్లు యాక్షన్ తో వుంటే, దాని సంబంధ సస్పెను తీర్చే ఈ సీను డైలాగ్ తో మొదలవాలి. అప్పుడే రేయింబవళ్ళలాగా, ఎండా వానల్లాగా ద్వంద్వాల  పోషణ, ఒక రసానుభూతికి అవకాశం. క్వాలిటీ సీను కోరుకుంటేనే. ప్రేక్షకులా తొక్కా అనుకుంటే  అవసరం లేదు. తొక్కతో వాళ్ళ నోట్లు నొక్కడమే పని. 

          ఆ డైనమిక్ డైలాగ్ – ఎవర్నువ్వు? – లాంటి  మన సెన్సాఫ్ అర్జెన్సీ ని తీర్చే సంభాషణే. ఆఫ్ కోర్స్, ఈ సీనుని యాక్షన్ తో కలిపి కూడా ప్రారంభించ వచ్చు. పైన చెప్పుకున్నట్టు - యాక్షన్ తో ఓపెనవడం, లేదా డైలాగుతో ఓపెనవడం, లేదూ ఈ రెండూ కలిసి ఓపెనవడం గనుక. ఇంటరాగేషన్ అంటే యాక్షన్ తప్పకుండా వుంటుంది కాబట్టి,  డైలాగ్ –యాక్షన్  రెండూ కలిసి ఓపెనవచ్చు. ఆ డైలాగ్ మాత్రం మనం ఎదురుచూస్తున్న సస్పన్స్ తీర్చే దిశగా వుండాలి. 

          ఇప్పుడు ఈ సంబంధమైన డైలాగులతో మన సస్పన్స్ తీరుస్తూ, ఇంకో సస్పెన్స్ తో వున్న అంశంతో -  ఉచ్ఛ స్థితికి తీసికెళ్ళి  సీను ఆపేస్తే- (క్లిఫ్ హేంగర్ మూమెంట్) – ఆపేసి అడ్డగోలుగానే  ఆ లాయర్ మహాశయుణ్ణి రావించి, కుట్ర జరిపించుకుంటే – రెండిటికీ న్యాయం జరిగి సీనస్ ఇంటరప్టస్ పరిష్కారమైపోతుంది.  .

          ఎలాగంటే, ఉచ్ఛ స్థితికి తీసికెళ్ళి ఆపేసిన ఇంటారాగేషన్ మాటల కంటిన్యుటీని తర్వాతి సీన్లో చూసేందుకు సిద్ధపడతాం ( పాత సస్పెన్స్ తీరిపోయి, ఫ్రెష్ గా కొత్త సస్పన్స్ తో డైనమిక్స్. సీన్లకి ఒక చైతన్యం. ప్రవహిస్తూ వుంటేనే సీన్లకి చైతన్యం, మడుగు కడితే మృతప్రాయం). ఇక కుట్ర ఎలాగూ సాగుతుంది. 

          కథకుడి ఈ సీన్లో సీనస్ ఇంటరప్టస్ పరిష్కారం కాకపోవడం వల్ల జరిగిన అనర్ధమేమిటంటే, కుట్ర ఒకటే ముందుకు సాగడం, ఇంత ముఖ్యమైన ఇంటరాగేషన్ పాయింటు ఇక్కడే గాల్లో  కలిసి పోవడం!

నో బేసిక్స్ – ఓన్లీ  మ్యాజిక్
      ఇప్పుడు తిరిగి రెండో ఎపిసోడ్ కి వద్దాం. నిరంజన్ని నాగపూర్ జైలుకి తరలించే ప్రహసనం. ఇంటరాగేషనేమిటో పూర్తి కాకుండానే. ఇతనెవరో ఇంకా మనకి చెప్పకుండానే మళ్ళీ బోలెడు యాక్షన్ జరిపించేస్తున్నారు. పాత్రతో మనం కనెక్ట్ కాని యాక్షన్ ఎలా నిలబడుతుంది. నాగపూర్ కి ఎందుకని హీరో అడిగితే,  పైనుంచి కాల్ వచ్చిందని చీఫ్ సమాధానం. అంటే ఈ ఎన్ఐఏ ని కేంద్రంలో అధికారంలో వున్న నాయకులు కొనేశారన్న మాట! తెలుగు సినిమా తల్చుకుంటే దేశాన్నే అమ్మేస్తుంది. సిబిఐ, ఐటీ, ఎసిబి, పోలీసు తదితర వ్యవస్థల్ని వాడుకోవడం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కన్పించేసరికి  ఎన్ఐఏ ని నెగెటివ్ గా చూపించడం మొదలెట్టారు. రేపు ‘రా’ ని, ఎల్లుండి సైన్యాన్ని కూడా ఇలాగే చూపిస్తారు కాబోలు. అంతర్గత యంత్రాంగాలు బోరుకొట్టినట్టున్నాయి, ఇక దేశభద్రతని కాపాడే యంత్రంగాల మీద  పడ్డారు - దేశం వైపు వుండాలని లేకుండా. చాతనైతే ఈ యంత్రాంగాల ప్రతిష్టని పెంచే  కథలు చేసుకోవాలి.

          ఇలా నాగపూర్ ట్విస్ట్ ఇచ్చి ఇంకో చిక్కులో పడ్డాడు కథకుడు. ఇలా ట్విస్ట్ ఇస్తే అప్పుడు ఎన్ఐఏ హీరో ఎం చెయ్యాలి- దీనమ్మ మమ్మల్నే దద్దమ్మల్ని చేస్తారా అని తిరగబడాలి. రాజశేఖర్ కి అంకుశం గుర్తుకు రావాలి. ఇక్కడే వుంది కథ!  ఇదే కథ!  ఇంతకి  మించిన కథ ఏముంటుంది ఈ కీలక పాయింటు  రైజ్ అయ్యాక. కథ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందా, ప్లాట్ పాయింట్ వన్ ఏదవుతుందాని ఎదురు చూసే వాళ్ళకి ఇదే  పాయింటు అన్పిస్తుంది.

          సరే, దీన్ని కూడా దాటేసి హీరో స్టయిలిష్ గా నిరంజన్ ని తీసుకుని నాగపూర్ బయల్దేరతాడు. ఇదన్నమాట వెనక చెప్పుకున్న హీరో పాత్ర దెబ్బతిని పోయే విధం. 

          ఇప్పుడు  చూస్తే – నిరంజన్ని నాగపూర్ జైలుకి ఎలా తరలిస్తారు? పైనుంచి కాల్ వస్తే నాగపూర్ జైలుకి తీసికెళ్ళి పోగలరా? ఆ జైలు అధికారి కోర్టు పత్రాలు అవీ లేకుండా లోపలేసుకుంటాడా? సత్రమా? గోడౌనా? ఇప్పుడాని నిరంజన్ కూడా - మీరు నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసికెళ్తున్నారు. ముందు ఇక్కడున్న మీ ఎన్ఐఏ  కోర్టులో నన్ను హాజరు పర్చండి. కోర్టు ఇక్కడ దాని పరిధిలో వున్న జైలుకి జ్యుడీషియల్ రిమాండుకి  పంపిస్తుంది. అప్పుడు ట్రాన్సిట్ పెట్టుకోండి. అప్పుడు కోర్టు అనుమతిస్తే నాగపూర్ జైలుకి నన్ను తీసికెళ్ళండి – అనాలిగా?  అంత హైటెక్ నిరంజన్ పాత్ర కూడా ఏమీ కాదా? 

          నిరంజన్ ఏమీ ఫీల్ కాడు, హీరోకి ఫీలింగే లేదు ఈ అవమానం. కారులో బయల్దేరతారు. ఒక ఎసిపి స్థాయి అధికారికి ఈ ఎస్కార్ట్ డ్యూటీయేమిటి?  ఏమో! అది కూడా రోడ్డు మార్గంలో?  ఎన్ఐఏ, సిబిఐ అధికారులు విమానాల్లో కదా తరలిస్తారు నిందితుల్ని. ఇక్కడ రోడ్డు మార్గం ఎందుకంటే, విలన్ ముఠా దాడి చేయాలి కాబట్టి. అంతా కథాసౌలభ్యమే, పాత్రచిత్రణలు అవసరం లేదు. హీరోని కథ నడపనీయడంలేదు కథకుడు, ఇతర పాత్రల చేత కథకుడే  ఎలా కథ నడిపిస్తే హీరో అలా నడుచుకుంటున్నాడు. సినిమాల్లో  లాజిక్ ఎందుకూ, మ్యాజిక్కే అనే కాడ్నించీ - బేసిక్స్ ఎందుకూ, మ్యాజిక్కే అనేకాడికొచ్చిందన్న మాట.
***
       రిలాక్సవుదాం. మెదళ్ళు  శ్రమపడిపోయి వుంటాయి. రిలాక్సయి ఎంటర్ టైన్మెంట్ చూద్దాం. ఈ సినిమాలో కామెడీ లేదనీ, ఎంటర్ టైన్మెంట్ లేదనీ ఎవరన్నారు. ఇప్పుడు చూడబోయేది  అదే. చార్లీ చాప్లిన్ చూస్తే కూడా అసూయతో చచ్చిపోయేంత! దీన్నిలాగే చెప్పుకోవాలి. ఇలా చెప్తున్నందుకు ఫీలవ్వొద్దు, హర్ట్ అవ్వొద్దు. సినిమాని సినిమాలాగా చూడాలంటారు కదా (అంటే ఏమిటో), అలాగే  ఈ కామెడీ ని కామెడీ లాగే చూసి ఎంజాయ్ చేద్దాం. ఇష్టం లేకపోతే ఈ పేరాలు వదిలేసి ముందు కెళ్ళి పోవచ్చు.
 
          రెండు కార్లు, ఒక వ్యాను నిరంజన్ ని తీసుకుని నాగపూర్ వెళ్తున్నాయా... ఇక విలన్ గారి రెండు భారీ క్రేన్లు సరదాపడి వెంటపడతాయి. వెనుకనుంచి ఓ గుద్దుగుద్దుతాయి. గుద్దుతూనే వుంటాయి. వ్యానులో కూర్చున్న ఎఐఏ హీరోగారు వెనక అద్దంలోంచి గుద్దుతున్న క్రేన్లని చూస్తూ హారిబుల్ గా ఒకటే కేకలు పెడుతూంటాడు. జేబులో పిస్తోలుంది. తీసి వెంటనే కాల్చేస్తే  దెబ్బకి చచ్చూరుకుంటారు క్రేన్ డ్రైవర్లు.  ఆ పని చెయ్యడు ఫస్టాఫ్ లో అంతటి హై ఒల్టేజ్ యాక్షన్ హీరో అయికూడా.  ఇక అరిచీ అరిచీ,  అప్పుడు కథాసౌలభ్య సుకుమారుడైన ‘కథోత్కచుడు’ అనుమతిస్తే,  చిట్టచివరికెలాగో పిస్తోలు తీసి కాలుస్తాడు! ఏమవుతుంది, ఏమీ కాదు. కథా సౌలభ్యం కదా. ఈ ‘కతో’ న్మత్తుడు ఈ  వ్యానులో వుంటే తెలుస్తుంది – తన మాన ప్రాణాలకోసం, నాలుగు కాలాలు రచనా వ్యాసంగం చేసుకోవడం కోసం -  కథా సౌలభ్యం కావాలో, కామన్ సెన్సు కావాలో!

          ఆఫ్టరాల్ ఈ క్రేన్ల స్పీడెంత, కార్ల స్పీడెంత!  రివ్వున ముందుకు దూసుకెళ్ళి
పోగలవు. వెళ్ళిపోతే ఎలా?  అనుకున్న కథా సౌలభ్య దృశ్య మాలిక ఎలా సాధ్యం? అందుకని మెల్లమెల్లగా పోతూ, ముద్దు ముద్దుగా గుద్దించుకుంటుంటాయి. అప్పుడప్పుడు పక్కకి జరుగుతాయి – కాస్త  పక్కవారగా వచ్చి కూడా గుద్దిపో నాయనా అన్నట్టు. ఆ క్రేన్లు  వాటం చూసి పక్కకొచ్చి సైడ్ బ్యాంగింగ్ చేసి, ఈ సరదా కూడా తీర్చేస్తాయి – వెహిక్యులర్ రేపింగ్!

          ఇలా గ్యాంగ్ రేప్ చేయించుకునీ చేయించుకునీ సొట్టలు పడి డస్సిపోయి బ్రిడ్జి మీదికొస్తే, క్రేను అమాంతం కారుని ఎత్తి నదిలో పడెయ్యడం. పడ్డాక ఆ నీట్లో  కొత్త గ్యాంగ్ టకటకా గన్స్ తీసి షూట్ చేయడం. కామెడీకి పరాకాష్ట! నదిలో పడ్డాక  షూట్ చేస్తారేంట్రా బాబూ, కార్లోనే చంపి నదిలో పడెయ్యక!  అంటే వాళ్ళు  ఫ్లాష్ చెప్పుకోవడానికీ, అది వినడానికీ బతికుండాలిగా. హీరో గారు నిరంజన్ తో తప్పించుకోవాలి, నిరంజన్ గారు వెన్నముద్దలా దాచిపెట్టిన కథని  ఫ్లాష్ బ్యాక్ రూపం లో హీరోకి పంచిపెట్టాలి. ఈ ఉద్దేశంతో ఈ జోకర్ గ్యాంగ్ తో కూడా మనం  కామెడీ పడాలి. 

          ఆఖరికి కథకుడి సృజనాత్మక స్వేచ్ఛకి  యాక్షన్ డైరెక్టర్లు కూడా బలై పోయారు. మైండ్ లెస్ కామెడీలు నవ్వించగలవు. సీరియస్ యాక్షన్ కూడా మైండ్ లెస్ అయితే కామెడీ అయిపోతుందని  ఇలా తెలుస్తుంది మనకి. దీని తర్వాత ఇంకో రెండు యాక్షన్ సీన్లే. ఇవి కూడా కామెడీలే. ఆఖరికి యాక్షన్  విషయంలో కూడా ఫస్టాఫ్ కీ, సెకండాఫ్ కీ ఏకసూత్రత లేకుండా పోయింది.

ఇదిగో ఎదురుచూస్తున్న కథ!
      ఇక నదిలోంచి బయటపడి నిరంజన్ చెప్పే ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ చెబుతూ ఎన్నెన్నో మనకి అర్ధంగాని శాస్త్ర సాంకేతిక విషయాల మీద లెక్చర్. మనకి ఎక్కడ బోరుకొడుతుందోనని హీరో అడ్డుతగులుతూ  సింపుల్ గా చెప్పమనడం.  అయినా నిరంజన్ మళ్ళీ అలాగే  లెక్చరివ్వడం. మనకి ఒక్కముక్కా అర్ధంగాదు. ఇదంతా ఒక్క  ముక్కలో అర్ధమయ్యేలా ఇలా తేల్చెయ్యొచ్చు : యూరేనియం పక్కనే, ప్లుటోనియం నిల్వలు బయట పడ్డాయి. దాన్ని తవ్వి ఉత్తర కొరియాకి స్మగ్లింగ్ చేస్తున్నారని!  ‘సింగం త్రీ’ లో బయాల  జికల్ వ్యర్ధాల  గురించైనా, ‘వివేకం’ లో కృత్రిమ భూకంపాల గురించైనా ఎలా చెప్పేశారు సింపుల్ గా,  కమర్షియల్ గా అర్ధమయ్యేలా!  నిరంజన్ చెబుతూంటే దానికి ఏవేవో సైంటిఫిక్ పరిశోధనల తాలూకు విజువల్స్ తో హంగామా. ఇంత కచ్ఛితత్వమంతా, ఈ టెక్నికాలిటీస్ అన్నీ  కూడా అసలు స్క్రిప్టు రచనలో కనబర్చాల్సింది. 

          నిరంజన్ దగ్గర ఈ స్మగ్లింగ్ గురించిన  రహస్యాలే వున్నాయి. దీనికోసమే చంపాలని చూస్తున్నారు గ్యాంగ్. ఈ గ్యాంగ్ వెనుక ఎందరో కేంద్ర,  రాష్ట్ర మంత్రులూ, ఐఏఎస్, ఐపీస్ అధికారులూ వున్నారట! ఉత్తర కొరియాకి అణుసరఫరా చేసి అమెరికాకి ఎసరు పెడతారన్న మాట. పాయింటేమిటంటే, ఇతర మాఫియా కుట్రలు చూపించాలంటే ఇంకొకర్ని బ్యాడ్ గా చూపించాల్సిన అవసరముండదు. అణుపదార్ధం స్మగ్లింగ్ అనే ‘కొత్త పాయింటు’ దొరికిపోవడంతో, నౌకల ద్వారా ఈ స్మగ్లింగ్ మఫియాలోక్కరే చేయలేరు కాబట్టి ప్రభుత్వ యంత్రంగాన్నంతా దీన్లోకి లాగి సత్యదూరమైన మహా స్కామ్ గా చూపించారు. దీనికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా అంటే అనుమానమనే.

          ఇదంతా ముగిసేటప్పటికి సెకండాఫ్ అరగంట గడిచిపోతుంది. అంటే సినిమా ప్రారంభమైనప్పట్నుంచీ ఒక గంటా 45 నిమిషాలన్న మాట!  ఎప్పుడో ఫస్టాఫ్ లో అరగంటా ముప్పావుగంటలో రావాల్సిన ఈ కీలక ఘట్టం, జరిగిపోతూ జరిగిపోతూ ఇక్కడ సెటిలయ్యింది. అంటే బిగినింగ్ విభాగమే  ఇంత సాగిందన్న మాట. చెప్పాల్సిన కథకి ఇంత బారుగా ఉపోద్ఘాతం చెప్పుకొచ్చారన్నమాట. ఇంతకీ కథేమిటని ఇప్పుడు తెలిసిందేమిటంటే  - మైనింగ్ మాఫియా గురించి! ఇక దీన్ని అడ్డుకుని విద్రోహుల్ని  పట్టుకునే గోల్ గురించి! ఇప్పుడు దీనికీ,  ఇంతవరకూ చెప్పుకొచ్చిన కథానికలకీ ఏమైనా సంబంధముందా? 

          ప్లాట్ పాయింట్ వన్ ఇక్కడికి వచ్చి చేరడమంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేనే కదా. ఇప్పటిదాకా కథని ఇలా దాచి పెట్టడం ఎండ్ సస్పెన్స్ కూడానూ కదా. చిరంజీవి ఖైదీ లో రాళ్ళపల్లి  అంటాడు నూతన్ ప్రసాద్ తో – అసలు విషయాన్నివూరగాయలా ఎంతసేపు వూరిస్తారు చెప్పండీ – అని. అదే ఇదన్న మాట. కథని జాడీలో వూరగాయవేసి అటకె క్కించారు. తుగ్లక్ వున్నాడు. అతను ఢిల్లీలో వున్న రాజధానిని 700 మైళ్ళ దూరంలో దేవగిరికి మార్చి దౌలతాబాద్ అని పేరుపెట్టాడు. జనమంతా అక్కడికి వెళ్ళాలన్నాడు. అక్కడ బాగా లేదని మళ్ళీ ఢిల్లీకి మార్చి,  జనమంతా మళ్ళీ ఇక్కడికి రావాలన్నాడు. ఈ వలసలతో వందలాది మంది జనం చనిపోయారు. 

          ఇలాగే ఫస్టాఫ్ లో వుండాల్సిన ప్లాట్ పాయింట్ వన్ ని,  ఎక్కడో సెకండాఫ్ లోకి తరలించడం తుగ్లక్ కథనం. అక్కడి దాకా ప్రేక్షకుల సహనం చచ్చిపోతుంది. ఢిల్లీ ఢిల్లీయే, చింతలపాలెం చింతలపాలెమే. ప్లాట్ పాయింట్ వన్ అనే ఢిల్లీని కదిలిస్తే  చింతలపాలెమే అవుతుంది కథ. ప్లాట్ పాయింట్ వన్ అనేది కథకి రాజధాని లాంటిది. ఇక్కడ్నించే కథలోకి అన్ని కార్యకలాపాలూ విస్తరిస్తాయి. ఈ రాజధానిని సెకండాఫ్ లో ఎక్కడికో తరలిస్తే కార్యకలాపాల విస్తృతి కూడా తగ్గిపోతుంది.. 

          అంటే మిడిల్ ఇప్పుడు ప్రారంభమయ్యిందన్న మాట. అసలు కథంతా నడిచేది ఈ మిడిల్లోనే. ఇప్పుడు చూడబోయేదే  కథ. ఇంతవరకూ చూసిందంతా కథతో సంబంధంలేని  ఉపోద్ఘాతం. ఇప్పుడు ఈ మిడిల్ విభాగంలో నడిచే కథకి  అరగంట కూడా నిడివి లేదు. మిడిల్లో  గంటకి  పైగా వుండాల్సిన కథకి బొటాబొటీ అరగంటే! ఈ సినిమా మొత్తం మీద మనం చూసేది అరగంట వున్న కథే!

ఇదీ హీరో గోల్ 
       ఇప్పుడు  ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాక నిరంజన్ ని తీసుకుని హీరో కాలినడకన వెళ్తూంటే, ఒక ధాబా తగుల్తుంది. ఈ ధాబా నిండా వేశ్యా లోకమే వుంటుంది. తప్పించుకున్న హీరో ఇక్కడికి చేరాడని విలన్ తెలుసుకుని మళ్ళీ ఎటాక్ చేయిస్తాడు. సన్నీ లియోన్ పాటయ్యాక గ్యాంగ్ వచ్చేసి విచ్చల విడిగా కాల్పులు జరుపుతూంటారు. ఇదింకో మైండ్ లెస్ యాక్షన్ సీను. మనకి ఇంకో కామెడీ. ఎవడైనా హీరో ఇక్కడున్నాడని తెలిస్తే, గుట్టుగా వచ్చి, ఈ గుంపులో ఎక్కడున్నాడో కనిపెట్టి,  షూట్ చేసి వెళ్ళిపోతాడు.  గ్యాంగ్ వచ్చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపితే,  హీరో తప్పించుకుని, వెనక వారగా దెబ్బతీసి కాల్చేసే ప్రమాదముంది. అంతే కదా? ఈ జ్ఞానం లేకుండా గ్యాంగ్ విరుచుకుపడి, పదుల సంఖ్యలో వున్న అమాయక వేశ్యల్ని కాల్చి పారేస్తూంటారు. హీరో తప్పించుకుని చేయాల్సిన పని మాత్రం చెయ్యడు. గ్యాంగ్ పారిపోయాక, ఇక్కడ శవాల్ని చూసి తనవల్ల జరిగిందానికి ఏ మాత్రం ఫీలవ్వడు. ఇంతకీ ఈ దాడిలో సన్నీ లియోన్ ఏమైందో మనకి తెలీదు!

          మాఫియా విలన్ కి ఫోన్ చేసి - నేనొస్తున్నా, చాతనైతే పారిపొమ్మని ఛాలెంజి చేస్తాడు. దీంతో మిడిల్ ముగిసింది. ఇది ప్లాట్ పాయింట్ టూ తో క్లయిమాక్స్ అన్న మాట. కాకపోతే ఈ ధాబా మీద ఎటాక్ కి ముందు, అటు ప్రతాపరెడ్డితో బాటు, కేంద్రం నుంచి వచ్చిన ఇంకో మంత్రితో మైండ్ లెస్ టీవీ కవరేజీ లుంటాయి. విలన్ తో మంతనాలుంటాయి. 

 ఎపిసోడ్ మూడు – కామెడీ క్లయిమాక్స్
          ఇది విలన్ పారిపోవడం గురించే వుంటుంది. అంత ప్లుటోనియం స్మగ్లింగ్ బిజినెస్ వదిలేసి,  తనకి సపోర్టుగా  వున్నరాజకీయ,  అధికార యంత్రంగాల్నీ వదిలేసి పారిపోయే ఏర్పాట్లలో వుంటాడు. ఇదేం కథో  అర్ధం గాదు. ప్లుటోనియం స్మగ్లింగ్ గురించి హీరోకీ విలన్ కీ వుండాల్సిన సంఘర్షణే వుండదు. ఇలా చేస్తే దీని పరిణామాలెలా వుంటాయో క్లాసు పీకి,  మెసేజ్ ఇచ్చేదీ వుండదు. ఎత్తుకున్న కాన్సెప్ట్ ఊసే వుండదు. హీరో బెదిరిస్తే ఎన్ఐఏ ని కంట్రోల్ చేస్తున్న రాజకీయ నాయకులేం చేస్తున్నారో తెలీదు. విలన్ తో బాటూ అందరూ ఇంత బిజినెస్ వదిలేసి గప్ చుప్. ఈ కథలో విలన్ చేసిందేమీ లేదు. కన్పించే పదినిమిషాలు ఒఠ్ఠి పాసివ్ విలన్. విలన్ భార్యని కిడ్నాప్ చేసి బంధించి, హీరోని అక్కడికి రప్పించి,  బాంబులు పెట్టేసి షిప్ లో పారిపోతాడు విలన్. ఇక ఈ పేచీలు పెట్టే కామెడీ భార్యతో హీరో గారి బోలెడు కామెడీ పాట్లు. ఎలాగో వెళ్ళిపోతున్న విలన్ షిప్ మీదికి బాంబులు పేల్చి - ఫినిష్ చేస్తాడు కథని!

          ఇదీ విషయం. ఫస్టాఫ్ ని ఎలాగో మాయ చేసినా సెకండాఫ్ లో కుదరలేదు. ఎందుకు కుదరలేదో కారణాలన్నీ పరిశీలించాం. ఈ కారణాలు గనుక సరిదిద్దుకుని వుంటే ఈ మూవీ బాక్సాఫీసు మనుగడ వారానికే ముగిసేది కాదు. ట్రేడ్ సమాచారం ప్రకారం ఒక్క నైజాం  లోనే నయం అన్పించుకుని, మిగిలిన ఏరియాల్లో నై అన్పించుకునేది కాదు. ఎంత పెద్ద బడ్జెట్లు  ధారబోసి హంగామా చేసినా, చివరికొచ్చేసి కంటెంట్ క్వాలిటీయే నిర్ణయిస్తుంది ఫలితాన్ని, హంగామాలు కాదు. దురదృష్టమేమిటంటే, కంటెంట్ తో చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు.

-సికిందర్ 






20, నవంబర్ 2017, సోమవారం

550 : రివ్యూ!

దర్శకత్వం : తనూజా చంద్ర
తారాగణం : ఇర్ఫాన్ ఖాన్, పార్వతీ తిరువోత్ కొట్టువట్ట, నేహా ధూపియా, పుష్టీ శక్తి, ఈషా శర్వాణీ, భజరంగ్ బలీ సింగ్ తదితరులు
కథ : కామనా చంద్ర, స్క్రీన్ ప్లే : తనూజా చంద్ర – గజల్ ధలీవాల్, మాటలు : గజల్ ధలీవాల్
సంగీతం :  బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రావర్కర్; ఛాయాగ్రహణం : ఈషిత్ నారాయణ్
బ్యానర్ : జీ స్టూడియోస్, జార్ పిక్చర్స్
నిర్మాతలు : సుతపా సిక్దర్, శైలజా కేజ్రీవాల్, అజయ్ రాయ్
విడుదల : నవంబర్ 10,  2017
***
         
యంగ్ రోమాంటిక్  కామెడీలకి, రోమాంటిక్ డ్రామాలకీ, రోమ కామ యమ డ్రామాలకీ  ఎప్పుడూ మార్కెట్  రెడీగానే వుంటుంది, కాకపోతే ఎప్పుడు ఫ్లాపవుదామా అని అవి కూడా రెడీగా వుంటాయి. కారణం అవి ప్రేమలు కాక కథకుల చాదస్తాలు గనుక. అదే మిడిలేజీ ప్రేమ సినిమాలు అరుదుగా వస్తాయి, కానీ వచ్చినప్పుడల్లా నచ్చి తీర్తాయి. కారణం కథకుల కామన్ సెన్సు గనుక. కాలేజీ ప్రేమలకి వయసు అవరోధం కాదు, మిడిలేజీ  ప్రేమలకి వయసే అవరోధం. ఈ అవరోధం ప్రేమకి ఒక మర్యాద నిచ్చేస్తుంది. అలా దర్జాగా ప్రేమలు దోబూచులాడతాయి వయసు మీరిన జంటల మధ్య. అచ్చి బుచ్చి కాలేజీ ప్రేమలు అప్పచ్చి  అవకుండా అచ్చి వచ్చేది మిడిలేజీ  ప్రేమల్ని చూసి చస్తేనే. చాదస్తపు కథకులు వీణ సినిమాలతో యూత్ ని ఇంకా ముసలి మూకలా తయారు చేసి రోకలి కట్టేస్తారు. కామన్ సెన్సు కథకులు మిడిలేజీ ప్రేమ సంగతులతో యూత్ ని గిటార్ వాయించగల్గేంత  అప్డేట్ చేసి వదుల్తారు. ఐతే ఐరనీ ఏమిటంటే, ఈ వయసు మళ్ళిన ప్రేమలు చూసేదేమిటని యూత్  ఛీ థూ అనుకోవడం. బుద్ధిగల  ప్రేమల్ని చూపించే  ఆ థియేటర్లకి డుమ్మా కొట్టి, కాలేజీల్లో బుద్ధిలేని  ప్రేమలు వెలగబెట్టుకోవడం, అవి ఆరిపోగానే అల్లరై పారిపోవడం. ప్రేమనేదాన్ని కాలేజీలు  కాదు, మిడిలేజి ప్రేమ సినిమాలు చక్కగా నేర్పుతాయి.

          ర్శకురాలు తనూజా చంద్ర ఎప్పుడో 1998 -99 లలో మహేష్ భట్ క్యాంపులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ తో ‘సంఘర్ష్’, ‘దుష్మన్ ‘అనే రెండు బిగ్ థ్రిల్లర్ హిట్స్ తీసి, ఇంకో మూడు చిన్నతరహా సినిమాలు చేసి, గత పదేళ్లుగా పూర్తిగా తెరమరుగైపోయింది. ఇప్పుడు తను వయసు పైబడి, వయసుమళ్ళిన ప్రేమ సినిమాతో ఒక స్లీపర్ హిట్ ఇస్తోంది. ఇది అరుదైన విన్యాసం. ఇంత గ్యాప్ తర్వాత ఓ సినిమా అంటేనే  హడలిపోతారు ప్రేక్షకులు. కానీ తనూజా  అంత వడలి పోలేదు.

          ఖాన్లలో ఇర్ఫాన్ ఖాన్ వేరు. భారీ బడ్జెట్లు అవసరం లేదు. కమర్షియల్ హంగామాలక్కర్లేదు. ఓ చిన్న పరిధిలో, జీవితం కన్పిస్తే చాలు –ఒప్పుకుని నటించేస్తాడు. పాన్ సింగ్ తోమార్, డీ- డే, హైదర్, పీకూ, లంచ్ బాక్స్, హిందీ మీడియం, ఇప్పుడు ఖరీబ్ ఖరీబ్ సింగిల్...దేనికదే సినిమాటిక్ కాని ఒక సినిమాయేతర జీవితం, అనుభవం, నటనా.

          ఖరీబ్ ఖరీబ్ సింగిల్ (చాలా మతిపోయే టైటిల్. దీన్ని తెలుగు చేయాలంటే కవులే కావాలి, ఖరీబ్ అంటే సమీపం) లో ఇంకేమని మెచ్యూర్డ్ ప్రేమల్ని చూపిస్తారు. ఇటీవలి కాలంలో అమితాబ్ – టబులతో ‘చీనీ కమ్’ వచ్చింది, ఇర్ఫాన్ – దీపికా లతో ‘పీకూ’ వచ్చింది, ఇర్ఫాన్ – నిమ్రత్ కౌర్ లతో ‘లంచ్ బాక్స్’ కూడా వచ్చింది...ఇలా మూడింట్లో రెండూ ఇర్ఫాన్ వే వచ్చాక,  ఇంకా తనకి మూడోది దేనికి?  ఇంకేం వయసు మళ్ళిన ప్రేమలు చూపిస్తారు? ఇదే చూద్దాం...

కథ
       జయా సుశీంద్రన్ (పార్వతీ తిరువోత్ కొట్టువట్ట) ముంబాయిలో ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి. వయసు 35. భర్త చనిపోయాడు. ఈమెని చూసి కొంటె కొలీగ్ ఒకామె, ఇంకెంత కాలమిలా సింగిల్ గా  వుంటావ్, త్వరగా సెటిలవ్వు, లేకపోతే  ‘దర్వాజా బంద్  అయిపోతుంది’ అని టీజ్ చేస్తూంటుంది. భర్త పేరే పాస్ వర్డ్ పెట్టుకున్నజయ, అతడి  జ్ఞాపకాల్ని చేరిపేసుకో లేకపోతుంది. ఏమైతే అయిందని ఓ డేటింగ్ సైట్ లో ప్రొఫైల్ పెట్టేస్తుంది, రెండేళ్ళు వయసు తగ్గించుకుని. ఇద్దరు పోకిరీలు రెస్పాండ్ అవుతారు. ఒక కవి కూడా జాయినవుతాడు. కవిని కలుసుకుంటుంది. యోగేంద్ర కుమార్ ధీరేంద్ర నాథ్ ప్రజాపతి అలియాస్ కవి యోగి (ఇర్ఫాన్) అనే చాంతాడంత పేరున్న నలభై ఏళ్ల బ్రహ్మచారి ఆమెకి అస్సలు నచ్చడు. అతడి వేష భాషలు, తన గురించే గొప్పలు చెప్పుకోవడం, లేకి జోకులేయడం, ముగ్గురు మాజీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి  బయట పెట్టుకోవడం ఇదంతా చీదరగా వుంటుంది. తను విడో అనేస్తుంది. అయినా వదలడు. ఏం చేస్తూంటావంటే, తను ఆల్రెడీ రిచ్ కాబట్టి ఏమీ చెయ్యనంటాడు. తిట్టుకుంటూనే రోజూ కలుస్తూంటుంది. పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా, ఆ ముగ్గురు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తననే తల్చుకుని తల్లడిల్లిపోతున్నారని ఇంకా వంత పాడేసరికి – నీకంత సీను లేదని ఛాలెంజి చేస్తుంది. తనతో వస్తే చూపిస్తానంటాడు తన సీనేమిటో. హృషికేష్, ఆళ్వార్, గ్యాంగ్ టక్ ... మూడు చోట్ల ముగ్గురు ఎక్స్ ల పరిస్థితి. 

          వద్దనుకునీ, వెళ్దామనుకునీ, మళ్ళీ వద్దనుకునీ – విమాన మెక్కేస్తుందతడితో లాంగ్ జర్నీకి. ఈ జర్నీలో అతడితో ఆమెకేమేం జరిగాయన్నది, జరిగి చివరికేం నిర్ణయం తీసుకుందన్నదీ మిగతా కథ. 

ఎలా వుంది కథ
      హృద్యమైన కథ అని సినిమాలకి వాడి ఎంత కాలమైంది? మర్చేపోయాం. పైగా ఒక రోమాంటిక్ కామెడీ హృద్యమైనది కావడం ఎక్కడైనా జరిగిందా  - హృషికేశ్ ముఖర్జీ కాలంలో జరిగిందేమో. ఇప్పుడు టీనేజీ  రోమాన్సుల్ని టీనేజర్లే చూడడం లేదు. ప్రస్తుత  రోమాంటిక్ కామెడీ వయసు మళ్ళిన పాత్రల వల్ల, ఫార్ములా పైత్యాలు లేకపోవడంవల్లా, ఇంకే సినిమాటిక్ అభద్రతా భావాలకి లోనవకపోవడం వల్లా, ఇంత హృద్యమైనది అయింది. దీన్ని ఇలాటి ఇతర కథలతో (చీనీ కమ్, పీకూ, లంచ్ బాక్స్) పోల్చలేం. దీనికిదే ఒక విభిన్నమైనది- మోస్ట్ బ్యూటిఫుల్. ఒకసారి చూస్తే మర్చిపోలే కుండా చేస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా చేస్తుంది (మూడేసి సార్లు చూడ్డం వల్లే ఈ రివ్యూ డిలే అయింది. అయినా ఇలా  రాయడం మీద కన్నా ఇంకోసారి చూడ్డం మీదే వుంది).

          ఇంత గాఢంగా హత్తుకుని ఉక్కిరిబిక్కిరి చేసే మిడిలేజీ రోమాన్స్  దరిదాపుల్లో  కన్పించదు. చాలా సింపుల్ గా వుంటూనే అంత  బలంగానూ వుంటుంది. ఒకటే చెప్తుంది పైకి చెప్పకుండానే – ఓసారి ప్రేమ పుట్టిందా, గౌరవించుకో ఆ ప్రేమని. 
 ఏ సంబంధంలోనైనా తనని గౌరవించక పోతే ఆ సంబంధం లోంచి తప్పుకుని గౌరవమున్న చోటికెళ్ళిపోతుంది ప్రేమ. మనిషిని గౌరవించనక్కర్లేదు, ఆ మనిషిని చూడగానే కలిగిన ప్రేమని గౌరవించు, దాన్ని గుర్తు పెట్టుకో, అప్పడా ప్రేమే ఆ  మనిషి మీద గౌరవం పెరిగేలా చేసి కలిపి వుంచుతుంది. దట్సాల్. ప్రేమ డిసప్పాయింట్ చెయ్యదు, నువ్వే డిసప్పాయింటయి ప్రేమని అగౌరవ పరుస్తావ్. నీ డిసప్పాయింట్ మెంట్ కేవలం నీ దురవగాహనే.

          ప్రేమ కథల్ని మణిరత్నం కూడా ఇక తీయలేడేమో అనుకుంటున్నప్పుడు, ఎలాతీయవచ్చో  చెబుతూ ఈ కథ వచ్చింది. ప్రేమని మూలంలో అర్ధం జేసుకుంటే ప్రేమ కథలు బాగానే తీయవచ్చు.

ఎవరెలా చేశారు 
       చూస్తే  ఇందులోని పాత్రలు రెండూ - కాన్షస్ మైండ్ కి ఒకటి, సబ్ కాన్షస్ మైండ్ కి మరొకటీ  ప్రతీకలుగా కన్పిస్తాయి. అయితే కథలో ఈ పాత్రలు  తారుమారై వుంటాయి. ఇందుకే ఇవిసూదంటు రాయిలా ఆకర్షిస్తున్నాయి. వెండి తెర మీద సినిమా చూపించడమంటే కాన్షస్ – సబ్ కాన్షస్ ల లడాయి (ఇంటర్ ప్లే) చూపించడమేగా. ఈ ఇంటర్ ప్లే తారుమారయిందిక్కడ. సాధారణంగా కాన్షస్ మైండ్ (ప్రధాన పాత్ర),  సబ్ కాన్షస్ (కథలో సమస్య- లేదా ప్రత్యర్ధి పాత్ర ) తో తలపడుతుంది. కానీ ఈ కథలో రివర్స్ లో  సబ్ కాన్షసే వెళ్లి కాన్షస్ తో తలపడుతుంది. ఈ కథలో జయ ప్రధాన పాత్ర, యోగి ప్రత్యర్ధి పాత్ర అయ్యాయి. ఎందుకు జయ ప్రధాన పాత్రయింది?  పెళ్లి చేసుకోవాలని తనే ప్రయత్నానికి దిగింది కాబట్టి. లక్ష్యమున్న పాత్ర తనే  కాబట్టి. అయితే ఈ పాత్ర సర్వసాధారణంగా వుండే ప్రధాన పాత్రల్లాగా ఓపెన్ గా వుండదు. గుంభనంగా వుంటుంది. తనేమిటో బయటపడదు. పాసివ్ గా వుండదు, యాక్టివ్ గా వుంటుంది.  దుస్తులు లైట్ కలర్స్ వేసుకుంటుంది. ఇవి సబ్ కాన్షస్ మైండ్ లక్షణాలు. సబ్ కాన్షస్ ఓపెన్ గా వుండదు. గుంభనంగా వుంటుంది. తానేమిటో బయటపడదు. పాసివ్ గానూ వుండదు, నిత్యం కాపలా కాస్తూ యాక్టివ్ గా వుంటుంది. దానికి కలర్స్ వుండవు. 

        యోగి కాన్షస్ మైండ్ ఎలా అయ్యాడు? అతను ఆర్భాటంగా వుంటాడు. షోకిల్లా రాయుడిలా తిరుగుతాడు. ఔట్ స్పోకెన్. తనగురించి అన్నీ వాగేస్తూంటాడు. వేసుకునే డ్రెస్ లు కూడా బ్రైట్ కలర్స్. యాక్టివ్ గానే వుంటాడు. ఇవి కాన్షస్ మైండ్ లక్షణాలు. అది కూడా షోకిల్లా రాయుడే. ప్రదర్శనాభిలాష ఎక్కువ దానికి. ఏదీ దాచుకోకుండా ఎంజాయ్ చేస్తుంది. అందరి దృష్టినాకర్షిస్తూ  బ్రైట్ గా వుంటుంది. కానీ అప్పుడప్పుడు పాసివ్ గా  కూడా అయిపోతుంది. సబ్ కాన్షస్ నుంచి లైఫ్ లైన్ అందినప్పుడు తిరిగి యాక్టివ్ గా అవుతుంది. 

          కాన్షస్ మైండ్ కి,  సబ్ కాన్షస్ (అంతరాత్మ) అంటే మా చెడ్డ భయం. అంతరాత్మ వేసే ప్రశ్నల్ని, చెప్పే నీతుల్నీ అది తట్టుకోలేదు. అందుకే దాన్ని తప్పించుకు తిరుగుతూ తన స్టయిల్లో తాను బయట ఎంజాయ్ చేస్తూంటుంది. ఇలా అయితే అది జీవితం కాదు. అందుకని కథల్లో దాన్ని తీసికెళ్ళి సబ్ కాన్షస్ లో (సమస్యలో లేదా, ప్రత్యర్ది పాత్రతో లడాయికి) తోసి పారేస్తారు. అప్పుడది నానా యాతనలు పడి, చచ్చీ చెడి జీవిత సత్యాలూ అవీ బుద్ధిగా నేర్చుకుని, గెల్చి ఒడ్డున 
పడుతుంది పునీతమై. ఇదీ కథల వెనుక వుండే మానసిక శాస్త్రో చిత ఫ్రేమ్ వర్క్.

      ఇంకా గొప్ప కథల్ని విడమరిస్తే కాన్షస్ మైండ్,  అంటే హీరో అనేవాడు ఇగో. ఆ ఇగో పొగరు అణచడానికే సబ్ కాన్షస్ లో పడేస్తారు గొప్ప కథల్లో. అప్పుడది సబ్ కాన్షస్ లో అన్ని పోరాటాలూ జయించి, ఒడ్డునపడి, మెచ్యూర్డ్ ఇగోగా మారుతుంది. మనుషులు ఇగోని చంపుకోలేరు.  దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా అభివృద్ధి చేసుకుంటే  బాగుపడతారు. ఇగోని  మెచ్యూర్డ్ ఇగోగా మార్చి చూపించేవే గొప్ప కథలు. గొప్ప కథలంటే సైకో థెరఫీ. అవి ప్రేక్షకులకి కూడా సైకో థెరఫీ చేస్తాయి. పురాణాల మర్మం కూడా ఇదే. 

          ఇప్పుడు ప్రకృతి ధర్మం ప్రకారం, ఇలాటి కాన్షస్ మైండ్ అనే యోగి, సబ్ కాన్షస్ అయిన జయతో తలపడాలే గానీ,  జయే వచ్చి యోగితో తలపడ్డమేమిటి? దీనికిలా చెప్పుకుందాం : ఫాంటసీ కామెడీలుంటాయి. వాటిలో పైలోకాల నుంచి దేవుళ్ళు ఆర్భాటంగా దిగివస్తారు. వాళ్ళని ఓ పట్టుపడుతూంటారు మనుషులు. తట్టుకోలేక లబోదిబో మంటారు దేవుళ్ళు. దేవుళ్ళంటే సబ్ కాన్షసే కదా. మనుషులు ఉత్త కాన్షస్ బేవార్సులు. ఇదీ ఫాంటసీ కామెడీల ఫార్ములా.ఒకరి ఆటస్థలం లోకి మరొకరొస్తే ఇంతే, దేవుళ్ళయినా సరే. అలవిగాని చోట అధికులమనరాదు. 

          ఇలాగే  సబ్ కాన్షస్ అయిన జయ,  వెళ్లి కాన్షస్ యోగితోనే  తలపడుతూ దేవత అయిపో
యింది  ఫాంటసీ రూలు ప్రకారం. అంటే ఒకరకంగా ఈ రోమాంటిక్ కామెడీ  ఫాంటసీ కామెడీ రూపంలో వుందన్న మాట. ఫాంటసీ కామెడీ లాంటి పాత్రలతో!  ప్రకృతి ధర్మం ప్రకారం,  సబ్ కాన్షస్ తన ఆటస్థలంలోకి  కాన్షస్ ని రప్పించుకుని ఓ ఆటాడుకోవాలి గానీ, తగుదునమ్మా అని బయట కాన్షస్ ఆట స్థలంలో కెళ్ళి తనే ఆడాలనుకోవడం కరెక్ట్ కాదు, కామెడీ. ఇదీ ఈ రోమాంటిక్ కామెడీ పాత్రల వెనకాల వున్న రహస్యం. డైనమిక్స్ తో వున్నవే మంచి పాత్రలు, తిరగేసిన డైనమిక్స్ తో ఇంకా క్రేజీ పాత్రలు.
***
      మలయాళ నటి పార్వతికిది మొదటి హిందీ. ఆమె వండర్ఫుల్ నటి.  35 ఏళ్ల ప్రౌఢ పాత్రలో ఎక్కడికెళ్ళినా ఆంటీగానో, ఆపాజాన్ (అక్కయ్య) గా పిలిపించుకుంటూ, గ్రేస్ ఫుల్ గా రెస్పాండ్ అయ్యే మెచ్యూర్డ్ పర్సనాలిటీని అలవోకగా పోషించేస్తుందీమె. ముఖ్యంగా ఆమె క్లోజప్స్ కి ఆమె హావభావాలే వన్నె తెస్తాయి. ఒక మతిపోయే క్లోజప్ - పాస్ వర్డ్ గా పెట్టుకున్న భర్త పేరు డిలీట్ చేసే ముందు క్షణాలు – ముఖభావాలు ఒక దీర్ఘాలోచన నుంచి క్రమక్రమంగా చిరునగవుగా మారుతూ - భర్తకి వీడ్కోలుగానా, యోగికి ఆహ్వానంగానా? అంతుచిక్కదు! అదొక మోనాలిసా నవ్వుకి తక్కువ కాదు. ఇలాటి ఉత్సుకత రేపే దృశ్యాలెన్నో వున్నాయీమెతో. 

          ఇర్ఫాన్ సరే. స్టార్ గా తన హవా ఏమాత్రం ప్రదర్శించకుండా పాత్రనీ, దాంతో నటననీ, డైలాగుల్నీ అండర్ ప్లే చేస్తూ రిక్షావాళ్ళని కూడా ఫుల్ ఖుష్ చేసేస్తాడు. ఎక్కడా కూడా ప్రేమించాల
న్నట్టు హీరోయిన్ వెంటపడడు. ముందు తన ముగ్గురు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని హీరోయిన్ కి చూపించుకోవాలి.  అంతవరకూ ఆమె తన తోటి ప్రయాణికురాలే. ఈ తోటి ప్రయాణీకురాలు ప్రేమ డెవలప్ చేసుకోవాలా వద్దా  అని తన్నుకు చస్తూంటే తనేం చేయగలడు. ఈ తరహా  వ్యక్తిత్వపు పాత్రని నిజజీవితంలోంచి వూడిపడ్డట్టు కూల్ గా పోషించాడు.

          ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గా నేహా ధూపియా, పుష్టీ శక్తి, ఈషా శర్వాణీ కన్పిస్తారు. ఈ పాత్రల గురించి చెప్తే కథలో సస్పన్స్ పోతుంది. ఒక్కో వూళ్ళో ప్రత్యక్షమయ్యే మోస్ట్ కేటలిస్టు పాత్రలివి. అలాగే చివర్లో గ్యాంగ్ టక్ లో వచ్చే భజరంగ్ బలీ  సింగ్ పాత్ర. ఇవి కథలో కన్పించని చాలా లోతుల్లోకి తీసికెళతాయి. 

          సాంకేతికంగా ఉన్నతంగా వుంది. ముంబాయి, డెహ్రాడూన్, హృషికేశ్, రాజస్థాన్ లోని ఆళ్వార్, సిక్కిం లో గ్యాంగ్ టక్ దృశ్యాలు ఈ ప్రయాణపు కథని సమున్నతం చేశాయి.

చివరి కేమిటి 
తనూజా చంద్ర, కామనా చంద్ర, గజల్ ధలీవాల్ 
         దర్శకురాలు తనూజా చంద్ర, సీనియర్ రచయిత్రి కామనా చంద్ర, మాటల రచయిత్రి గజల్ ధలీవాల్ ల విజయమిది. దర్శకురాళ్ళు ఎందుకో తమ ఆస్తిత్వాన్ని కోల్పోతూ మేల్ డైరెక్టర్స్ ని అనుకరించి - మేల్ వెర్షన్ కమర్షియల్ మసాలాలే అందించడానికి ఉత్సాహపడుతూంటారు. ఫిమేల్స్ గా  తామేం ఫీలవుతున్నారో ఆ దృక్కోణంలో సినిమాల్ని చూపించాలనుకోరు. ఇది చాలా కాలంగా వుంటున్న ధోరణి. ఇదంతా త్రోసిరాజని తనూజా చంద్ర, తన లోని ఆడతనాన్ని సుకుమారంగా, అంతే బలంగా, అర్ధవంతంగా ప్రస్ఫుటింపజేస్తూ, తన స్త్రీ సహజాతం కొద్దీ ప్రేమని చూసి,  తన విజన్ లో తీయడం వల్ల ఇవాళ్ళొక విభిన్నతరహా వయసుమళ్ళిన రోమాంటిక్ కామెడీని చూస్తున్నాం. 

          ఎక్కడా తాను  పురుష భావజాలానికి లోనైంది లేదు, అలాగని ఫెమినిజం కూడా లేదు. భావజాలాల కతీత మైనది ప్రేమ. ఎవరైనా నోర్మూసుకుని అక్కడికి చేరాల్సిందే. ఇంకా అలాగని తన ఆడ చాదస్తాలు ప్రదర్శించిందీ  లేదు. ఆఁ... ఏవుందీ  మగాడిలాగే తీసిందనో, ఆడ బుద్ధి పోనిచ్చుకోలే
దనో అన్పించుకోకుండా జెండర్ న్యూట్రాలిటీతో వుంది. ప్రొఫెషనలిజమింతేగా.   

          తనే కాదు, మిగతా ఇద్దరు రచయిత్రులూ ఇదే విజన్ తో వున్నారు. ప్రేమ అనే వొక శాశ్వత విలువకి లోతులు తెలిసిన సీనియర్ కథా రచయిత్రి , దీనికి నేటికాలపు శబ్దం పలికించడానికి యువ
తరపు మాటల రచయిత్రి. ఇక దర్శకురాలూ మాటల రచయిత్రిల స్క్రీన్ ప్లే!

        రోమాంటిక్ కామెడీలు రోమాంటిక్ కామెడీలు ఎందుగ్గాకుండా పోతున్నాయి? మధ్య కొచ్చి రోమాంటిక్ డ్రామాలుగా మార్చెయ్యడం వల్ల. ఇంటర్వెల్ రాగానే మొదలవుతాయి వియోగాలూ ఏడ్పులూ. ఇలా అయినప్పుడు రోమాంటిక్ డ్రామాలే తీసుకోవాలి. రోమాంటిక్ కామెడీ నిర్వచనం తెలియకుండా -  అమ్మో సెంటి మెంట్ లేదనో, ఫీల్ లేదనో వాటిని చొరబెట్టేసి,  ప్రేమికుల చేత ఏడ్పుల మోత మోగిస్తే,  గొప్ప రోమాంటిక్ కామెడీ అయినట్టు తమకు తామే ఫీలై పోవడం. అవన్నీ 90 శాతం ఫ్లాపుల కిందికి  చేరిపోతున్నా, ఇంకా ఇంకా అదే ఫీలింగు, ఫ్యాషనబుల్ గా ‘రోంకామ్’ అంటూ కొత్త డీలింగులు.

          రోమాంటిక్ కామెడీలు ఒక సైకలాజికల్ ప్రయోజనాన్ని ఆశించి వుంటాయి. ప్రేమికులు తమ సమస్యలు తామే పరిష్కరించుకునే విజేతలు కావాలన్నది వీటి పరమార్ధం. ఇందుకే రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులు. ప్రేమలో వాళ్ళే సమస్యల్ని సృష్టించుకుంటారు, వాళ్ళే  పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకోవ డానికి చాతుర్యంతో ఏ వ్యూహాలు పన్నుతారో అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ ఖర్మ. వాళ్ళు వేసుకున్న చిక్కు ముడిని వాళ్ళే విప్పుకోవాలి. ఫ్రెండ్సో, తల్లిదండ్రులో, మరొకరో జోక్యం చేసుకుని పరిష్కరించరాదు. అప్పుడు రోమాంటిక్ కామెడీ అవదు, రోమాంటిక్ డ్రామా అయిపోతుంది. హీరో హీరోయిన్లు పాసివ్ అయిపోతారు. విడిపోతారు. ఏడుస్తారు. జానర్ మర్యాద చెడుతుంది. అది కథ గాకుండా గాథ అవచ్చు. ఇంకా అన్ని దరిద్రాలూ చుట్టుకుంటాయి. 

          రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్థులు. ఇద్దర్లో ఎవరూ పాసివ్ గా వుండరు. ఇద్దరూ యాక్టివ్ క్యారక్టర్స్ అయి వుంటారు. ఎప్పుడూ విడిపోరు, ఏడుస్తూ కూర్చోరు. ఫీలింగులూ, సెంటి మెంట్లూ, ఫ్లాష్ బ్యాకులూ చూపిస్తూ,  వాళ్ళ పోటాపోటీ కామెడీ పోరుకి రసభంగం కల్గించరు. చిట్టచివర్లో ఒక్క ఐదు పది నిమిషాలే  రోమాంటిక్ కామెడీ బరువెక్కుతుంది. అప్పుడే సెంటిమెంట్లూ, ఫీలింగులూ, ఏడ్పులూ ఏవైనా వుంటే బయట పడేది. తర్వాత మళ్ళీ ఒక ఫన్నీ నోట్ తో సుఖాంతమయ్యేది. 

          తనూజా చంద్ర మేకింగ్ ఈ నిర్వచనాన్ని గౌరవిస్తూ వుంది. జానర్ మర్యాదతో బాటు, స్ట్రక్చర్, కథనంలో సస్పెన్స్, క్లయిమాక్స్ లో వూహించని మలుపుతో సీరియస్ అవడం ఇవన్నీ
విజయవం
తమైన మేకింగ్ కి తోడయ్యాయి. మేకింగ్ కి  మిడిలేజీ  రోమాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని, దీనికింద రోమాంటిక్ కామెడీ జానర్ ని ఎత్తుకుని, మళ్ళీ దీనికింద జర్నీ కథగా చెబుతూ, అప్పుడు దీనికింద స్క్రీన్ ప్లేని సెట్ చేయాలి. సార్వజనీన మూడంకాల స్క్రీన్ ప్లే. ఇందులో మళ్ళీ మూడు సెగ్మెంట్లు గా కథనముండాలి :1. నవ్వించే, ఇదయిపోగానే,  2. కవ్వించే, మళ్ళీ ఇదైపోగానే,  3. విలపించే – ఇలా విడివిడి ఎమోషన్స్ ని పోషించాలి. అన్నీ కలిపేసి పోషిస్తే  గజిబిజి అవుతుంది రసాస్వాదన. ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్ వెళ్తూంటే  టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పైపైకి సాగుతుంది. 

          ఈ మొత్తం చట్రంలో జర్నీ కథని నడపడమే కత్తిమీద సాము. జర్నీ సినిమాలెన్నో వచ్చాయి, వస్తూనే వున్నాయి. దీన్ని ఎలా నిలబెట్టాలి?  సిడ్ ఫీల్డ్ ప్రకారం అటెన్ బరో ‘గాంధీ’ తీసినప్పుడు ఇదే సందేహం వచ్చింది. మహాత్ముడి జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి – ఏదని చెప్పాలి? ఎన్నని చెప్పాలి? అవన్నీ చెప్పాలంటే ఎన్ని సినిమాలు తీయాలి? అందుకని అయన జీవితాన్ని సమగ్రంగా చూపేందుకు మూడుగా విభజించాడు : 1. దక్షిణాఫ్రికాలో లాయర్ గా జీవితం, పొందిన అవమానం; 2. ఇండియా కొచ్చి సహాయనిరా కరణోద్యమం, స్వాతంత్ర్యం; 3. హిందూ ముస్లిం సమస్య, నిర్యాణం.  ఆయన స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ ఇదీ. దీంతో సమగ్రంగా వచ్చేసింది గాంధీజీ జీవితం.

          తనూజా చంద్ర జర్నీ కథనంతో స్క్రీన్ ప్లే నిలబడాలంటే ఇలాటి పిల్లర్లు కావాలి. ఒక్కో పిల్లర్ ఒక్కో అనుభవం కావాలి. ఈ జర్నీ హీరోయిన్ ని తీసుకుని హీరో తన గతంలోకి చేస్తున్నాడు. ఆ గతంలో ముగ్గురు మాజీ గర్ల్ ఫ్రెండ్స్. మూడు పిల్లర్స్ గా ఈ ముగ్గురితో కథ మూడు మలుపులు తిరగాలి – ఈ మలుపులు హీరోయిన్ ని ప్రభావితం చేస్తూండాలి. మొత్తం ఈ జర్నీనీ, కథనీ.  ఈ మూడు పిల్లర్లే  నిర్ణయించాలి. అప్పుడు సమగ్రమవుతుంది ‘గాంధీ’ లాగే. 

    ఫస్టాఫ్ లో ఇద్దరి మధ్య నవ్వించే కథనం, మొదటి  ఎక్స్ ని కలిశాక  హీరోయిన్ హీరోని కవ్వించే కథనంగా మారుతుంది. సెకండాఫ్ లో  రెండో ఎక్స్ ని చూశాక హీరోయిన్ అలిగి, కవ్వించే కథనంగానే కొనసాగుతుంది. ఇక క్లయిమాక్స్ లో మూడో ఎక్స్ ని కలవడాన్ని తప్పిస్తూ,  తనే మలుపు తిప్పేస్తుంది కథ. అతడి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇది అసహజమని ఇద్దరికీ తెలుసు. ఎవరు చొరవ చేసి చక్కదిద్దుకోవాలి? 

          క్లయిమాక్స్ పది నిమిషాలూ ఈ సస్పన్స్  కట్టిపడేస్తుంది. ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అంటే అదేదో శంఖినీ జాతి స్త్రీ పాడు వ్యవహారమనుకుంటారు. కేవలం థ్రిల్లర్స్ లోనే సస్పన్స్ వుంటుందనుకుంటారు. కానీ ఎప్పుడయినా క్రైం ఎలిమెంట్ వున్న కుటుంబ కథలు, సస్పన్స్ తో వున్న ప్రేమ కథలు నిలబడ్డాయి. 

          మొదటి పది నిమిషాల్లోనే  కథ జర్నీ కి సిద్ధమవుతూ ప్లాట్ పాయింట్ వచ్చేస్తుంది. ఇలా మొదటి పది నిమిషాల్లో ప్లాట్ పాయింట్  వన్ వేసుకునే కథకులు ఇంటర్వెల్ కల్లా కథ అవగొట్టి సెకండాఫ్ ని మట్టిలో కలిపేసే  ఘటనలే ఎక్కువ. కనీసం ఇంటర్వెల్ కి గానీ ప్లాట్ పాయింట్ వన్ వేసుకుంటే గట్టెక్క గల్గే ఊత కర్రలు దొరుకుతాయి. సగానికి కుదించుకు పోయే మిడిల్ ని దాటడా
నికి ఓ కర్ర, పావుశేరు మిగిలే ఎండ్ ని దేకడానికి ఇంకో కర్ర. 

          అలాటిది ఇక్కడ పది నిమిషాల్లో  మిడిల్లో పడ్డ కథని, ప్లాట్ పాయింట్ టూ వరకూ గంటా నలభై నిమిషాల సుదీర్ఘ కాలమంతా నడపాలంటే కత్తిమీద సామే. ఆ సాము చేయడానికే కథని జ్వలింప జేసే మూడు పిల్లర్ల ఏర్పాటు.

          ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో బోరు కొట్టే ఒక్క క్షణంలేదు, చాలా సినిమాల్లో వచ్చేసిన సీన్లే కదాని ఒక్క సెంటి మీటరు తీసేసే అవసరమే లేదు. ఇదంతా మూస ఫార్ములాలకి వర్తిస్తుంది. ఇంటర్వెల్ కి కావాలని ఏదో ట్విస్ట్ ఇచ్చే, బ్యాంగ్ ఇచ్చే, దిగువతరగతి క్రియేటివిటీ లేదు. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ ఏ కోణంలో చూసినా ఈ యేటి మేటి బాలీవుడ్ కానుక.

-సికిందర్
         

.