రచన- దర్శకత్వం: వేణు ఎం.
తారాగణం
: రాహుల్, మహిమా మక్వానా, అజయ్ఘోష్, అజయ్, కాశీవిశ్వనాథ్ తదితరులు
సంగీతం: అచ్చు, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్
బ్యానర్స్ : గుడ్ సినిమా గ్రూప్, బహుమన్య ఆర్ట్స్
నిర్మాతలు: తూము ఫణికుమార్, శ్రేయాస్ శ్రీనివాస్
విడుదల : మే, 12, 2017
***
టెంప్లెట్ సినిమాలు
తీయడానికి స్వావలంబన అక్కర్లేదు, పరాధీనత సరిపోతుంది. ఎవరో ఎప్పుడో ప్రారంభించిన
అదే టెంప్లెట్ పెట్టుకుని అందులో తూనికలూ కొలతల ప్రకారం అక్కడక్కడా కథ వేసుకుంటూ పోతే
దానికదే తెలుగు సినిమా అనే పదార్ధం తయారైపోతుంది. టెంప్లెట్ సినిమా తీయడానికి
కొత్త కథలు కూడా అవసరంలేదు, మూడు నాల్గు లేటెస్టుగా వచ్చిన ఇతర హీరోల సినిమాలనే కలిపి వండేసినా హీరోకేం
తెలీదు. టెంప్లెట్ సినిమాలు తీయడానికి మేధోపరమైన టాలెంట్ కూడా అవసరంలేదు, ఎంత
తక్కువ విషయ పరిజ్ఞానంతో తీస్తే అంత
టెంప్లెట్ తెలుగు ట్రంపెట్ మోగుతుంది. టెంప్లెట్ సినిమాలకి ప్రపంచంతో పనిలేదు, కాల్పనిక
ప్రపంచంలో తేలియాడుతూ స్వైరకల్పనలు చేస్తే సరిపోతుంది. టెంప్లెట్ సినిమాలకి
అప్డేట్ అవాల్సిన అవసరం కూడా లేదు, ఎంత పాత చింతకాయలా వుంటే అంత చల్లారిన ఆమ్లెట్ లా
వుంటుంది. సెక్స్ లేకుండా కణ విభజనతో సంతానోత్పత్తి చేసుకునే ఏకకణ జీవులైన అమీబాలు
టెంప్లెట్లు. ఇందుకే ఇవి మొగుడు అక్కర్లేని పాసివ్ సినిమాలు.
అదృష్టవశాత్తూ ఈ టెంప్లెట్
బారినుంచి థ్రిల్లర్ జానర్ తప్పించుకుంటోంది-
కారణం, ఇది సిసలైన డీఎన్ఏతో వుండే జానర్. ఇందులో
ఏ కథకా కథ కొత్త తరహా కథనాన్నే డిమాండ్ చేస్తుంది. ఫార్ములా రహిత కొత్త కథన
చాతుర్యాన్నీ డిమాండ్ చేస్తుంది. కొత్త కొత్త క్రియేటివ్ ద్వారాల్నీ, మేధోపరమైన టాలెంట్ నీ డిమాండ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చుట్టూ వున్న
పరిస్థితుల్ని చూపిస్తుంది. యూత్ కథలతో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇంకే టెంప్లెట్,
రోమాంటిక్ కామెడీ, దెయ్యం కామెడీ -దేనికీ సాధ్యంకాని ఇన్వాల్వ్ మెంట్ నిస్తూ,
ఆద్యంతం ఉత్కంఠతో కూర్చోబెట్టగల సామర్ధ్యం వున్న ఏకైక జానర్ ఇదొక్కటే. ఇందుకే ఇవి మొగుడులా వుండే యాక్టివ్
సినిమాలు.
ఇందుకే
శ్రమించడం ఇష్టంలేని పాసివ్ వర్గాలకి
తెలుగులో ఈ జానర్ సహజంగానే పట్టదు – అవతల తమిళ మలయాళాల నుంచి ఇవి వచ్చేసి సొమ్ములు చేసుకుంటున్నా కుంభనిద్ర
వదలదు. కథలకోసం సమాజంలోకి చూడకపోతే చూడకపోయారు- కనీసం సమాజంలో ఏఏ సినిమాలు ఎందుకు
ఆడుతున్నాయో కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి వుండదు. ఇలాటి పరిస్థితుల్లో అరుదుగా ఎప్పుడో
ఒక ‘క్షణం’ లాంటిది వస్తే, మళ్ళీ ‘వెంకటాపురం’ లాంటిది రావడానికి రెండు మూడేళ్ళు
పడుతోంది. చిన్న బడ్జెట్లు తీసే కొత్త దర్శకులకే కాదు, నిర్మాతలకీ మార్కెట్ నాలెడ్జి అస్సలు లేదు. మార్కెట్ అంటేనే
ఎలర్జీ!
కొత్త
దర్శకుడు వేణు, నిర్మాతలు ఫణికుమార్, శ్రీనివాస్ లు ఇతరులకి భిన్నంగా ‘వెంకటాపురం’ అనే థ్రిల్లర్ తీయడానికి ముందుకు
రావడమే గొప్ప. దీని కథనంలో వున్న సంక్లిష్టతని
చూసి రెగ్యులర్ తెలుగు కథలా లేదని వెనక్కిపోకుండా, నిర్మాతలు కొత్త దర్శకుడికి దన్నుగా నిలవడం మరీ
గొప్ప. ఇంత మాత్రాన ఈ గొప్పల్ని చూసి తప్పొప్పుల్ని ఎన్నకుండా వుండలేం.
తప్పొప్పులు పట్టించుకోకుండా దీన్ని చూసి ఇంకెవరైనా ఇలాటి సినిమాలు తీస్తూ పోయినా
లాభముండదు- బాగుపర్చలేని రోమాంటిక్ కామెడీలకీ, దెయ్యం కామెడీలకీ పట్టిన గతే వీటికీ
పట్టి మూన్నాళ్ళకే ఈ ముచ్చట కాస్తా ముగుస్తుంది.
కాబట్టి అసలు ‘వెంకటాపురం’ లో వున్నదేమిటి, ఇది
ఏఏ కోణాల్లో థ్రిల్లర్ లా వుంది, ఏఏ కోణాల్లో లేదు- ఒకసారి పరిశీలిద్దాం.
కథ
వైజాగ్ లో ఆనంద్
(రాహుల్ ) ఒక పిజ్జా డెలివరీ బాయ్. ఒక పెంట్ హౌస్ లో వుంటాడు. ఆ అపార్ట్ మెంట్
లోనే తల్లిదండ్రులుంటున్న ఫ్లాట్ లోకి కి చైత్ర (మహిమా మక్వానా) అనే స్టూడెంట్
వచ్చి దిగి, పరీక్షలకి చదువుకుంటూ వుంటుంది. ఆరుబయట టెర్రస్ మీద చదువుకుందా మంటే రాత్రిళ్ళు
తాగి అడ్డగోలుగా నిద్ర పోయే ఆనంద్ కన్పిస్తూంటాడు. తండ్రికి చెప్పి అతణ్ణి ఖాళీ చేయించేస్తుంది.
ఒకరోజు చైత్ర ఇంటికి దారిమర్చిపోయి బస్టాపులో
వుండి పోతే, రౌడీలు కన్నేస్తారు. ఆమెకి
లిఫ్ట్ ఇచ్చి ఆనంద్ కాపాడతాడు. దీంతో అతడిమీద ఆమె తల్లిదండ్రులకి సదభిప్రాయమేర్పడుతుంది.
వూరు తెలీని ఆమెకి వూరంతా తిప్పి
చూపించమని పురమాయిస్తారు.
ఇలా
ఆనంద్, చైత్రలు దగ్గరవుతూంటారు. కాలేజీలో చైత్రకి ఇద్దరు బెంచి
మేట్స్ వుంటారు. వీళ్ళు చాటు మాటుగా సిగరెట్లు తాగుతూంటారు. చైత్ర కూడా వాళ్ళతో
కలుస్తుంది. కాలేజీలో సిగరెట్లు తాగడం కుదరక భీమిలీ బీచ్ కి వెళ్తూంటారు ముగ్గురూ.
అక్కడ ఓ ముగ్గురు రౌడీలు అరాచకాలు
చేస్తూంటారు. వాళ్ళ కంట వీళ్ళు పడి ఇద్దరమ్మాయిలు అన్యాయమైపోతారు. చైత్ర
తప్పించుకుంటుంది.
అయితే
ఆమె హేండ్ బ్యాగు అక్కడే పడిపోతుంది. దాంతో ఆమెని బ్లాక్ మెయిల్ చేస్తూంటారు
రౌడీలు. జరిగింది ఆనంద్ కి చెప్పేస్తుంది
చైత్ర. తన హాల్ టికెట్ వున్న ఆ హేండ్ బ్యాగు తనకి చాలా అవసరమని అంటుంది. ఉద్రేకంతో
ఆనంద్ ఒక వేట కత్తి కొనుక్కుని రౌడీల కోసం
బయల్దేరతాడు. అలా భీమిలీ బీచికి వెళ్లి
రౌడీల్ని చంపడానికి కాపేస్తాడు. అప్పుడొక అనుకోని అనుభవం ఎదురవుతుంది. చైత్ర హత్య కేసులో పోలీసులకి చిక్కి జైలు
పాలవుతాడు. అతడికి ఎదురైన అనుభవం ఏమిటి? చైత్ర హత్య కేసులో ఎలా ఇరుక్కున్నాడు?
పోలీసులు ఆడిన గేమ్ ఏమిటి? వాళ్ళనేం చేశాడు ఆనంద్...ఇదంతా మిగతా కథ.
ఎవరెలా చేశారు
‘హేపీడేస్’ హీరోల్లో ఒకడైన రాహుల్
చాలా కాలం గ్యాప్ తర్వాత ఇమేజి మేకోవర్ తో యాక్షన్ హీరో అవతారమెత్తాడు. విచిత్రంగా
యాక్షన్ హీరోగానే బావున్నాడు. ‘హేపీ డేస్’
సహ హీరో వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ తో తను జీవితంలో
యాక్షన్ హీరో కాలేనని తే ల్చుకున్నాడు. రాహుల్ కి తానేమిటో తెలుసుకోవడానికి నాలుగైదు
ఫ్లాపులు అవసరమయ్యాయి. తను ఎటు వెళ్ళాలో ‘హేపీ డేస్’ లో వేసిన మైక్ టైసన్ పాత్రే రాసిపెట్టినట్టు, ఇప్పుడు
‘వెంకటా పురం’ లో సిక్స్ ప్యాక్ తో టైసన్
లా ఎంటరై, తమిళంలో కూడా పెద్ద బ్యానర్లో హీరోగా బుక్కై పోయాడు.
టైసన్
రాహుల్ నటనలో ఇంప్రూవ్ అయ్యాడు, అయితే పలకడానికి డైలాగులు తక్కువే. ఇది ఎంటర్
టైనర్ కాదుకాబట్టి డైలాగులు తక్కువే వుండొచ్చు. తన పాత్రకి రెండు ముఖాలున్నాయి-
ప్రేమికుడి ముఖం, పగదీర్చుకునే వాడి ముఖం.
ప్రేమికుడి ముఖానికి సరైన బలం వుండి వున్నట్లయితే, పగదీర్చుకునే ముఖానికి విశ్వసనీయత వచ్చేది.
పరుచూరి బ్రదర్స్ వి అధిక భావోద్వేగాల
రచనలనుకుంటాం గానీ, వాళ్ళవే ఏ ఎండాకా గొడుగు పట్టే ఎమోషన్స్. ‘ఖైదీ’ లో చిరంజీవికి ప్రేమ పార్శ్వం అంత ఎమోషనల్ గా
లేకపోయినట్లయితే, యాక్షన్ పోర్షన్ అంత హిట్టయ్యేది కాదు. రాహుల్ యాక్షన్ ని విరగదీస్తూంటే దాని
పూర్వ రంగం బలహీనంగా కన్పించి
వుండాల్సింది కాదు. యాక్షన్ హిట్టవ్వాలంటే రెండే ప్రేరణలు వుంటాయి- యాక్షన్ కి తగ్గ భావోద్వేగాలు, లేదా హాస్య ప్రియత్వం ( ‘ఫాస్ట్
అండ్ ఫ్యూరియస్- 8’ లోలాగా). వర్మ తీయించిన
‘జేమ్స్’ లో హీరోలాగా కార్డ్ బోర్డ్ పాత్ర రెండు పార్శ్వాల్లోనూ రాహుల్ పాత్రని
సజీవం చేయలేకపోయింది. పాసివ్ పాత్రకి
ప్రాణం లేకపోయినా అది దాని లక్షణం, కానీ యాక్టివ్ పాత్రకి యాక్షన్ తో పాటు
రక్త ప్రసరణ కూడా ముఖ్యమే. అప్పుడే
యాక్షన్లో మన రక్త ప్రసరణ కూడా పెరిగి
బీపీ తెచ్చుకోగలం.
***
కొత్త
హీరోయిన్ మహిమా మక్వానా ఈ థ్రిల్లర్ కథలో
పాత్రకి సరిపోవడం అలా వుంచి, అసలు వెండి
తెరకి ఆనే మొహం కూడా కాదు, శరీరం కూడా
కాదు. నటన గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని థ్రిల్లర్స్ లో
హీరోయిన్లవి కీలక పాత్రలై వుండొచ్చు, బాధిత పాత్రలై వుండొచ్చు. దీన్ని దృష్టిలో
పెట్టుకుని హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోకపోతే, బడ్జెట్ సినిమాలకి హీరోయిన్స్ పరంగా
రావాల్సిన బాక్సాఫీస్ డివిడెండ్స్ ని చేతులారా రాకుండా చేసుకోవడమే. మార్కెట్
దృష్టి లేకపోతేనే ఇలా జరుగుతుంది. మార్కెట్ అంటే ఎలర్జీ కదా. వినియోగదార్లుగా
ప్రేక్షకులతో మార్కెట్ బంధం ఏనాడో శాటిలైట్స్
బూమ్ లోనే తెగిపోయి మార్కెట్ ఎలర్జీ పట్టుకుంది. సినిమాల్ని థియేటర్ల కోసం కాకుండా
అప్పనంగా వచ్చిపడుతున్న శాటిలైట్ హక్కుల
కోసం కుప్పలు తెప్పలుగా తీస్తూ మార్కెట్
ఎలర్జీని పెంచుకున్నారు. ఇప్పుడా శాటిలైట్ హక్కులు హుళక్కి అయినప్పటికీ ఇంకా
మార్కెట్ గుర్తుకే రావడం లేదు. ఆనాటి ఆ ఎలర్జీ ఎటాక్ మామూలు ఎటాక్
కాదు.
హీరోయిన్
పాత్రలో ఎవరో ముక్కూ మొహం తెలీని కొత్త
హీరోయిన్ రేప్ కి గురై చనిపోతే who cares? ఆడియెన్స్ కేర్ చెయ్యరు. ‘శంకరాభరణం’
నుంచీ ‘ఎర్ర మందారం’ దాకా నోటెడ్ హీరోయిన్సే
రేప్ గురయితే ఆ పాత్రలకి అంత సానుభూతి వచ్చింది. నాల్గు సినిమాలతో ప్రేక్షకులకి
తెలిసిన హీరోయిన్ అయితేనే అయ్యో అని బాధపడతారు. ఆమె పాత్రని ఫాలో అవుతారు. కానీ
నాల్గు సినిమాలతో పాపులరైన బడ్జెట్ హీరోయిన్ తెలుగులో ఎక్కడుంది? శాటిలైట్ రేసులో ఈమెని కూడా తయారు
చేసుకోలేకపోయారు. సినిమాకొక కొత్త పిల్లని తెచ్చుకోవడం, చెత్తబుట్టలో పారెయ్యడం. అప్పుడెప్పుడో
గజలా వుండేది, తర్వాత అవికా గోర్ వుండేది, ఇప్పుడు తేజస్వి మదివాడ కన్పిస్తోంది...ఈమెని
కూడా బడ్జెట్ సినిమా హీరోయిన్ గా పాపులర్ చేసుకుని ప్రయోజనం పొందలేకపోతున్నారు. డిటో
హెబ్బా పటేల్.
థ్రిల్లర్స్
లో హీరోకి మొండి చెయ్యి చూపించినా ఫర్వాలేదు, కానీ వాటిలో కీలక, బాధిత పాత్రలకి గుర్తింపు
వున్న హీరోయిన్ కి ఎక్కువ డబ్బులు పెట్టయినా తెచ్చుకోవాల్సిందే. ఇది హిందీలో చేస్తున్నారు.
కానీ మనకి మార్కెట్ పరిణామాల్ని గమనించే
అలవాటే లేదు కదా. స్క్రిప్టుని దిద్దుకుంటూ దిద్దుకుంటూ అద్భుతాలు చేయాలనుకోవడమే
గానీ, మార్కెట్టే పట్టదు. మార్కెట్ పట్టినప్పుడే స్క్రిప్టు దిద్దుబాట్లకి,
నగిషీలు చెక్కడానికీ అర్ధం పర్ధం. ఇలా ‘వెంకటాపురం’ కొత్త హీరోయిన్ వల్ల ఈ కథతో ఎమోషన్ కనెక్ట్ ప్రసక్తే లేకుండా పోయింది.
దుష్ట
ఎస్సైగా అజయ్ ఘోష్, చివర్లో కేసు సాల్వ్ చేసే ఎసిపి గా అజయ్ కన్పిస్తారు. అజయ్
ఘోష్ విలనీ రొటీనే అయితే, అజయ్ డీసెంట్ నటనతో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ తండ్రిగా
కాశీ విశ్వనాథ్ ఏమంత బలమైన నటన కనబరచలేదు. చనిపోయింది కూతురే కావచ్చని ఫోన్
వచ్చినప్పుడు కూడా క్యాజువల్ గా వినడమేగానీ,
మోహంలో తదనుగుణ ఆందోళన కన్పబర్చడు. సెకండాఫ్ లో భార్య పాత్ర సహా తనూ కన్పించడు. ఆత్మ హత్య
చేసుకున్నారని చెప్తుంది హీరోయిన్.
బడ్జెట్
కారణంగా కావొచ్చు కెమెరా వర్క్, ఇతర సాంకేతికాలు
వగైరా అంతంతమాత్రంగా వున్నాయి. అచ్చు కూర్చిన సంగీతంలో ఐదు
పాటలున్నాయి. ఇలాటి థ్రిల్లర్స్ లో రిలీఫ్
కోసం మధ్య మధ్యలో పాటలు పెడితే ఒక్కోసారి
అవి అడ్డుతగిలేట్టు వుంటాయి. ఇందులో ఫస్టాఫ్ లో పెట్టిన మూడు పాటలూ ప్రేమ ట్రాకుని అనవసరంగా పొడి గించడానికే
ఉపయోగపడ్డాయి.
ఈ
జానర్ సినిమాలు కథతోనే నిలబడతాయి కాబట్టి దర్శకుడికి స్క్రిప్టు మీద చాలా
పనుంటుంది. అరగంట పాటలు, ఇంకో అరగంటా ఫైట్లు పోనూ మిగిలిన గంట సేపు కథకి పాత
సీన్లే రాసుకుంటే టెంప్లెట్ సినిమా పూర్తయిపోతుంది- కానీ ‘వెంకటాపురం’ లాంటి
థ్రిల్లర్ కి రెండు గంటలసేపూ ‘కిల్లర్ సీన్ల’ తో నింపాల్సిందే. వేరే అడ్డదారులు
వుండవు. ఇందుకే ఇవి తీసే దర్శకులు
మొనగాళ్ళు. కొత్త దర్శకుడు వేణు ఇలా వూపిరాడకుండా
చేసి కూర్చో బెట్టగల్గింది సెకండాఫ్ లోనే. ఐతే ఇందులో కూడా ఓడిడుకులున్నాయి. కానీ
ఓ కొత్త దర్శకుడు ఈ మాత్రం తీశాడంటే అభినందించాల్సిందే. ప్రస్తుత కాలంలో ఇలాంటివి
తీసినప్పుడే కొత్త దర్శకుడు నల్గురి దృష్టిలో పడతాడు. దెయ్యాలూ ప్రేమలూ ఎటూకాని సినిమాలు తీసేవాళ్ళు మొదటి ఆట మొదటి
అరగంటకే హిమాలయాలు పట్టుకుని పోవాల్సిందే.
స్క్రీన్ ప్లే సంగతులు
తెలుగు సినిమాలు రెండు
గంటలలోపు వున్నవి ఎప్పుడూ ఆడలేదు. బావున్నా ఆడలేదు. తెలుగు వాడికి కనీసం ఓ రెండు
గంటలు కూర్చుని తెలుగు సినిమా చూడకపోతే కడుపు నిండిన ఫీలింగ్ రాదు. అలాంటిది ఈ గంటా 50
నిమిషాల థ్రిల్లర్ తెలియబర్చే దేమంటే, వూపిర్లు బిగబట్టి, కళ్ళప్పగించి చూసేట్టు చేస్తే- గంటకే ముగించినా అదే కడుపునిండిన ఫీలింగ్ వస్తుందని.
మెటీరియల్
– మెటీరియల్ కావాలి ప్రేక్షులకి, అంతే. మెటీరియల్
లేని సినిమాల్లో పదేపదే హీరో గారు మెటీరియల్ కావాలీ మెటీరియల్ కావాలీ అని ఫాల్స్
కేకలేయడం చూశాం. అలాటి టెంప్లెట్ ‘మెటీరియల్’ మూడుగంటలు చూపించినా అర్ధాకలితోనే కడుపులు
పట్టుకుని పోతారు వీక్షకులు.
‘వెంకటాపురం’
నియో నోయర్ జానర్ లో వచ్చిన డార్క్ మూవీ కాదు. డార్క్ మూవీ లక్షణాలేవీ దీనికి
లేవు. భీమిలీ బీచిలో వాస్తవికంగా నేటి రిచ్ యూత్ ఆగడాలేవీ చూపించలేదు, ఫార్ములా
మూస రౌడీల్నే చూపించారు. తెలుగు సినిమాలు పుట్టినప్పట్నించీ రౌడీల గుణగణాలు
చూస్తున్నదే. కొత్తగా చూసేందుకు ఏమీ వుండదు. వీళ్ళు అవుట్ డేటెడ్ అయిపోయారు. కాబట్టి
‘వెంకటాపురం’ ఈ సెగ్మెంట్ లో కూడా కొత్తదనా న్ని కోల్పోయినట్టే. హీరోయిన్ పాత్రకి ఎంపిక
చేసుకున్న నటితో బాటు, ఈ రౌడీ విలన్ పాత్రల సృష్టి కూడా రావాల్సిన బాక్సాఫీసు డివిడెండ్లకి అడ్డుపడినట్టే.
సినిమా
అనేది నిల్వ నీరు కాదు, పారే సెలయేరు. సమాజంలో కొత్త ఫ్యాషన్లు ఎలా వస్తాయో, కొత్త
అసాంఘీక శక్తులు అలా వస్తూంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తేనే సినిమా కాలీన స్పృహతో
వున్నట్టు, లేకపోతే కాలం చెల్లినట్టు. 16-డి,
పింక్, షైతాన్ లాంటి డార్క్ మూవీస్ మనకు తెలీని నయా సంపన్న యూత్ ఆగడాల్నికొత్తగా వాస్తవికంగా చూపిస్తాయి కాలీన స్పృహతో. రౌడీల్లా
తిరగాలని ఎవరూ కోరుకోరు, కానీ ఆధునిక యువత రౌడీలు చేసే పనుల్లాంటివే రిచ్ గా
చేస్తూ దొరక్కుండా తిరుగుతూంటారు. డార్క్ మూవీస్ లో చూపించే ఆధునిక రిచ్ యువ విలన్
ఒక రూపకాలంకారం- మెటఫర్. ఈ రూపకాలంకారం సినిమా చూసే యువతకి- జాగ్రత్త, మీలో నేనున్నాను- అని
హెచ్చరిస్తూంటుంది. దీన్ని యువత నమ్ముతుంది. ఎందుకంటే తమలాంటి రూపకాలంకారమే చెప్తోంది....అదే రౌడీని
రూపకాలంకారం చేసి ఇలాటి హెచ్చరిక జారీచేయిస్తే యూత్ ఎవరూ నమ్మరు, ఎందుకంటే తాము
జీవితంలో అలాటి రౌడీలు కాలేరు. అదే పురాణాల్లో రూపకాలంకారంగా రావణుడు అంటే
నమ్ముతారు- తమలో కూడా రావణుడు వుంటాడని.
పురాణాల్లోని రూపకాలంకారం,
వర్తమానంలో ఆధునిక రూపకాలంకారం తప్ప మధ్యలో అంతా మిధ్య. పౌరాణిక –వర్తమాన కాలాల
మధ్య ఇంకే కాలానికి బందీ చేసి రూపకాలంకారం
చూపించినా మిధ్య! ‘వెంకటాపురం’ లో రౌడీ
పాత్రల్ని రూపకాలంకారం చేయడం మిధ్య! వృధా!
మాస్
కోసం ఈ పాత్రల్ని సృష్టించామన్నా, సినిమాల
కొచ్చే మాస్ ప్రేక్షకుల్లో కూడా మాస్ యువతే వుంటారు. ఈ మాస్ యూత్ఇ వ్వాళ్ళ చుట్టూ
వెలిగిపోతున్న ప్రపంచంలో తామూ సుఖాలనుభవించాలనే కలలు గంటున్నారు- బస్తీల్లో అవే
మాస్ జీవితాలతో ఇంకా రాజీపడే కాలం పోయింది.
***
వాళ్ళ
నేపధ్యాల చేత వాళ్ళు గడిపే విశృంఖల జీవితాల్లోంచి ఆధునిక యువ విలన్స్ కల్పించుకునే
నేరమనస్తత్వాలని డార్క్ మూవీస్ బట్టబయలు చేస్తాయి. అవి రేప్ కావొచ్చు, రోడ్ రేజ్
కావొచ్చు, బైక్ రేసింగ్ కావచ్చు, లేట్
నైట్ పార్టీల్లో హింస కావొచ్చు, రాష్ డ్రైవింగ్ తో ప్రాణాలు పోగొట్టుకోవడమో,
తీసుకోవడమో కావచ్చు...వగైరా వగైరా డార్క్ మూవీస్ లో రాత్రి పూటే జరుగుతాయి. రాత్రి
పూట జరగని హై సొసైటీలో ప్రధాన సంఘటన డార్క్ మూవీ కిందికి రాదు.
‘వెంకటాపురం’ లో ప్రధాన సంఘటన బీచిలో పగలే
జరుగుతుంది. ఇది రెగ్యులర్ రివెంజి యాక్షన్ మూవీ. కనుకే లాజిక్ తో అంతగా పనిలేకుండా,
రివెంజి డ్రామాగానే వుంటుంది. డార్క్
మూవీస్ లో పాత్రలు పలికే ప్రతీ మాటకి, పాల్పడే ప్రతీ చేతకీ లాజిక్ వుంటుంది. ‘వెంకటాపురం’
లాంటి రివెంజి యాక్షన్లో హీరోయిన్ ఇంటికి
దారి తెలీక, రాత్రయినా వెళ్ళలేక బస్టాపులో
వుండిపోవడానికి లాజిక్ అక్కర్లేదు. లాజికల్ గా
ఆమె తల్లిదండ్రులకి ఫోన్ చేయనక్కర్లేదు. తల్లిదండ్రులు కూడా కంగారు
పడి ఆమెకి ఫోన్లూ చేయనక్కర్లేదు. హీరో వచ్చి కాపాడే ఫార్ములా సన్నివేశమే ఇక్కడ ముఖ్యం. ఈ రివెంజి
యాక్షన్లో మూస ఫార్ములా కూడా కలిసిపోయి వుంది. అంటే ఈ కొత్త దర్శకుడు ఇంకా పాత స్కూల్లోంచి
పూర్తిగా బయటికి రాలేదు.
లేదా
హీరోయిన్ సిగరెట్లు తాగడం గురించి. బీర్లు తాగే హీరోనే బ్యాడ్ అనుకుని పెంట్ హౌస్
లోంచి ఖాళీ చేయించిన తను, వేరే బ్యాడ్ నేస్తాలతో సిగరెట్లు తాగడానికి అలవాటు పడ్డానికి
కూడా లాజిక్ ఏమీ అక్కర్లేదు. లేదా బీచిలో మూటలో దొరికిన, గుర్తించడానికి
వీల్లేకుండా వున్న శవం డీఎన్ఏ పరీక్షలు లేకుండానే హీరోయిన్ దని పోలీసులు ప్రకటిస్తే,
తండ్రి నమ్మేయడానికీ లాజిక్ అక్కర్లేదు.
కథలో ఇలాటివన్నీ మూస ఫార్ములా హంగులు.
వీటిని
నివారించలేమా అంటే నివారించవచ్చు. కానీ కొత్త దర్శకుడు తెలిసీ ఇలాగే ఫిక్స్ అయితే ఈ అవాస్తవికతల్ని భరించక తప్పదు.
***
ఈ
కథకి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటు (యూ ఎస్పీ) వుంది. అవతల ఎవరున్నారు? అన్న
పాయింటే చివరి దాకా ఉత్కంఠగా వుండడం. రివెంజి మూడ్ లోవున్న హీరో, బీచిలో వేట కత్తి విసురుతాడు. అదెవరికి
తగిలింది, అవతల ఎవరున్నారు, అది హీరో అంచనాలని ఎలా తలకిందులు చేసిందనే సస్పెన్స్
తో కూడిన బలమైన యూఎస్పీయే చివరి దాకా
కూర్చోబెడుతుంది. కథకి ఇలాటి బలమైన యూఎస్పీ
ని కనిపెట్టడం, దాన్ని తురుపు ముక్కలా వాడుకోవడం మాత్రం కొత్త దర్శకుడి గొప్ప టాలెంటే.
టెంప్లెట్ సినిమాల్లో ఇలాటి వేమీ వుండవు. వాటిలోంచి కొత్తదర్శకులు / రచయితలు తెలుసుకోవడానికీ, నేర్చుకోవడానికీ ఏమీ వుండదు.
వాటికి రివ్యూలు కూడా బోరు కొడతాయి.
ఈ కథని ఫ్లాష్ బ్యాకులతో చెప్పుకొచ్చారు.
ఫస్టాపులో ఒకే ఫ్లాష్ బ్యాక్ వుంటుంది కాబట్టి సరిపెట్టుకోవచ్చు గానీ, సెకండాఫ్ లో
అడుగడుగునా ఫ్లాష్ బ్యాకులతో కథ పదేపదే ముందుకీ వెనక్కీ ప్రయాణిస్తూంటే, సంఘటనల్ని
ఓ క్రమంలో పట్టుకుని అర్ధంజేసుకోవడం కనా కష్టమై పోతుంది. కన్ఫ్యూజ్ చేయడం గొప్ప టాలెంట్
కిందికి రాదు. మాస్ మీడియా అయిన సినిమా సులభంగా అర్ధమైపోవాలి- మౌత్ టాక్ పొందాలన్నా,
రిపీట్ ఆడియెన్స్ వుండాలన్నా సినిమా సులభగ్రాహ్యమవాలి. 16- డి లోనూ
అత్యుత్సాహానికి పోయి లెక్కలేనన్ని క్లూస్ మీద పడేస్తూపోతే, వాటిని పట్టుకుని కథని ఫాలోఅవడానికి దేవుడు దిగిరావాల్సి
వచ్చింది- ఏమంటే రెండోసారి చూస్తే సినిమా అర్ధమవుతుందన్నాడు కొత్త దర్శకుడు. ఇలావుంటుంది
వరస. అందులో క్లూస్ తో జడివాన అయితే, ఇందులో ఫ్లాష్ బ్యాకుల కుంభవృష్టి!
చేటలో
బియ్యం వేసుకుని రాళ్ళు ఏరేసినట్టు, కథలోంచి మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులనే ఖండికల్ని వేరు
చేసి, కథని పట్టుకోవాల్సిన మానసిక శ్రమ
ఎందుకు కల్గించాలి? రాంగోపాల్ వర్మకి లేని
ఫ్లాష్ బ్యాకుల నిషా కొత్తదర్శకుల కెందుకు? మిల్లర్లు కూడా రాళ్ళు లేని
పరిశుభ్రమైన బియ్యమందించేందుకు అప్డేట్ అయ్యారు. తెలుగు సినిమాలకి అప్డేట్ అంటేనే
అసహ్యం- చైనా గోడ కట్టుకుని చేరగిలబడ్డమే.
ఈ
రాళ్ళూ బియ్యం సిండ్రోమ్ లో స్ట్రక్చర్ ని
పట్టుకోవడం ఇంకో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ పరీక్ష లాంటిది. ఫ్లాష్ బ్యాకు
ఖండికల్లోంచి కథనీ, కథలోంచి ఫ్లాష్ బ్యాకుల్నీ
విడదీసి విడదీసి ఆలోచిస్తూ అలసిపోయి అర్ధరాత్రి ఇంటి కొస్తే- మనోడు వేటకత్తి
విసరడమే ప్లాట్ పాయింట్ వన్ అని టపటప కొట్టుకుని ట్యూబ్ లైటు వెలిగింది.
ఇలా
వేటకత్తి విసరడానికి ముందు, విసిరిన తర్వాతా అన్నట్టుగా తేలిన స్ట్రక్చర్ లో బిజినెస్
చూస్తే- బిగినింగ్ విభాగం మళ్ళీ ఒక టెంప్లెట్టే!
మిడిల్
లో బీచిలో శవం దొరకడంతో ప్రారంభమవుతుంది కథ. దొరికిపోయిన హీరో పోలీస్ స్టేషన్ తో
తోటి ముద్దాయికి చెప్తూంటే మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్ - అంటే బిగినింగ్ విభాగం.
ఇందులో
హీరో- హీరోయిన్ పాత్రల పరిచయం, సాన్నిహిత్యం, హీరోయిన్ సిగరెట్ల అలవాటుతో సమస్యకి
దారితీసే పరిస్థితుల కల్పనా- రౌడీలతో సమస్య ఏర్పాటూ వుంటాయి. స్థూలంగా చూస్తే ఈ
బిగినింగ్ విభాగపు బిజినెస్ నియమాలకి లోబడే వుంటుంది - అయితే ఈ బిజినెస్ ని హీరో
హీరోయిన్ల మధ్య బలహీనమైన సాన్నిహిత్యపు
సాగతీత సీన్లతో, సాంగ్స్ తో- టెంప్లెట్ సినిమాల్లో లాగా ఇంటర్వెల్ దాకా లాగి లాగి- అప్పుడు సమస్య ఏర్పాటు చేశారు. ‘శివ’ లోనాగార్జునకీ
రౌడీలతో అమల వల్లే సమస్య వస్తుంది. అయితే
ఇది అరగంట లోపే ఏర్పాటవుతుంది. బిగినింగ్ కి ఇంతకిమించి నిడివి వుంటే నసే.
హీరోయిన్
హీరోకి దూరమయ్యే ఏదైనా ప్రమాదంలో పడబోతూంటే వాళ్ళ జీవితాల్ని చాలా అందంగా బలంగా చూపించాలి- ‘కాబిల్’ లో ఇలాగే
చూపించి సక్సెస్ అయ్యారు. అప్పుడు ప్రమాదానంతరం వాళ్ళిద్దరి పట్లా ప్రేక్షకులకి
ఆందోళన పెరిగే అవకాశం వుంటుంది. కానీ ఇక్కడ ఇంటర్వెల్ దాకా చూపించినా హీరో
హీరోయిన్ల మధ్య బలమైన ప్రేమగానీ, స్నేహంగానీ ఏర్పడవు టెంప్లెట్ సినిమాల్లోలాగా. టెంప్లెట్ సినిమాల్లో ఫస్టాఫ్
అంతా కథకాని కథ అయిన లవ్ ట్రాక్ తో కాలక్షేపం చేసినట్టు- ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కూడా ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అన్న సంగతి పక్కన
బెట్టి, రసభంగం కల్గించే ఫ్లాష్ బ్యాక్ రూపంలో ప్రేమపురాణంతో ఫస్టాఫ్ నింపేశారు.
సస్పెన్స్
థ్రిల్లర్ ‘క్షణం’ లో ఇలాటి ట్రాప్ లో
పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇందులో
ప్రేమ కథని విడతలవారీగా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా ఆసక్తికరంగా చివరిదాకా వేస్తూ
పోయి- ప్రధాన కథకి అడ్డు లేకుండా చూశారు. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ అవదు. అది
ప్రధాన కథలా అంకాల్ని అక్రమించకూడదు. అది ప్రధాన కథకి కావలసిన సమాచారాన్ని అందించే
వనరు మాత్రమే. దీన్ని గంటల కొద్దీ చూపించడమంటే, ఎంతకీ ప్రధాన కథలోకి వెళ్ళకుండా,
సమాచారాన్ని ఇస్తూ కూర్చోవడం లాంటిది. ఇంకా రైలే రాకపోతే ఇప్పుడొస్తుంది. ఇప్పుడే
వచ్చేస్తుందని ఎనౌన్సర్ చెపుతూ సహనాన్ని పరిక్షీంచడం లాంటిది. రైలు రావడం జీవిత
కాలం లేటైతే, ప్రధాన కథ వచ్చేటప్పటికి
పుణ్య కాలం గడిచిపోతుంది.
***
ఇలా ఈ ఫస్టాఫ్ ఫ్లాష్
బ్యాక్ లో హీరోహీరోయిన్ల బలహీన సంబంధం
వల్ల, ఈ బిగినింగ్ విభాగం మిడిల్ విభాగానికి చేరడానికి పూర్తి స్థాయిలో పరిపక్వత చెందకుండా
పోయిందన్న మాట. అపరిపక్వ బిగినింగ్ బిజినెస్ అపరిపక్వ ప్లాట్ పాయింట్ వన్ నే
ఇస్తుంది. ఒకవైపు హీరోయిన్ కోసం రియాక్ట్ అవడానికి ఆమెతో అతడి కలాటి బలమైన
ఈక్వేషనే లేదు, మళ్ళీ తగుదునమ్మా అని ఎవరో తెలీని ఆమె ఫ్రెండ్స్ కి జరిగిన అన్యాయం
కోసం కూడా కత్తి కడతాడు.
ఈ
ఫ్రెండ్స్ కోసం కూడా కత్తి గట్టడమే ఏకసూత్రతని దెబ్బతీసి, హీరోయిన్ పట్ల
సానుభూతిని పలచన చేసింది. ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి లక్ష్యం ఒకే
సమస్యతో ఏర్పడుతుంది, ఏర్పడాలి. గ్యాంగ్ రేప్ కి గురైన హీరోయిన్ ఫ్రెండ్స్ అనే ఒక
సమస్య, బ్యాగు పోగొట్టు కున్న హీరోయిన్ అనే ఇంకో సమస్యా అనే రెండు చీలికలతో సినిమా
కథ వుండదు. కథ ఒక్క హీరోయిన్ తోనే వుండాలి. కానీ ఆమెది ఆఫ్టరాల్ బ్యాగు
సమస్య. ప్రెండ్స్ ది ఆమె కంటే తీవ్రమైన గ్యాంగ్
రేప్ సమస్య. ఫ్రెండ్స్ సమస్య హీరోయిన్ సమస్యని డామినేట్ చేసేదిగా వున్నప్పుడు
హీరోయిన్ సమస్య ఈ కథలో అప్రధానమైపోతుంది. ఆమె కోసం కాక, ఆమె ఫ్రెండ్స్
కోసం హీరో కత్తి గట్టినట్టు వుంటుంది. మళ్ళీ ఎవరో తెలీని ఆ హీరోయిన్ ఫ్రెండ్స్
పట్ల కృత్రిమ ఎమోషన్సే వుంటాయి.
ఫ్రెండ్స్
గ్యాంగ్ రేప్ కి గురవకుండా మొత్తం ముగ్గురూ తప్పించుకుని, వాళ్ళల్లో హీరోయిన్
మాత్రమే బ్యాగుని పోగొట్టుకుని వుంటే,
హీరోయిన్ పాత్రకి సహజ ప్రాధాన్యం ఏర్పడి ఏకత్రాటిపై వుండేది కథ.
అయితే
కేవలం బ్యాగుకోసం కత్తి పట్టుకుని చంపడానికి
పోవాలా- అన్న ప్రశ్న వస్తుంది. అంతవరకూ తన పనేదో తాను చేసుకునే ఒక సాధారణ పిజ్జా
డెలివరీ బాయ్ సడెన్ గా చంపేసేంత హింసావాది అయిపోవడం అతకని వ్యవహారమే. ఇక్కడ ‘శివ’
ని తీసుకోవాలి. ఇందులో నాగార్జున కాలేజీలో
బయటి రౌడీల పెత్తనాన్ని గమనిస్తూంటాడు. వాళ్ళ ప్రతినిధిగా వుంటున్న జేడీ
ఆగడాల్ని భరిస్తూంటాడు. ఒకసారి కొట్టబోతే
ఫ్రెండ్స్ ఆపుతారు. ఇంకోసారి ఆగడు, సైకిలు చైనుతో జేడీ భరతం పడతాడు. ఇక్కడ సమస్య
జేడీ అమలని డాష్ ఇవ్వడంతోనే పుడుతుంది. ఇలా జేడీని నాగార్జున కొట్టడం ప్లాట్ పాయింట్
వన్ ఘట్టం.
‘వెంకటాపురం’
లో కూడా సమస్య హీరోయిన్ బ్యాగుకోసం పుడితే
సరిపోతుంది. కానీ ఇంతకి ముందు బిగినింగ్ లో
సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో జరిగిన లోపమేమిటంటే- ముందు నుంచీ హీరోకి కూడా
రౌడీలతో సంపర్కం లేకుండా చేయడమే. రౌడీలు
హీరోకి తెలిసుండి, బీచిలో వాళ్ళ అగడాల గురించిన సమాచారం అతడికుండి, ఒకటి రెండు
సార్లు స్వల్ప ఘర్షణలు జరిగివుంటే, ఆ తర్వాత వాళ్ళు హీరోయిన్ మీద ఎటెంప్ట్ చేసి,
బ్యాగు లాక్కుని వుంటే- అప్పుడు వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకడానికి రెండు వేలు
పెట్టి ఇంట పెద్ద వేట కత్తి కొనుక్కుని- భావోద్వేగాలతో, భూకంపాలతో, భీకర ప్రళయాలతో
అతను బయల్దేరితే - డీటీఎస్ సౌండు
ఎఫెక్ట్స్ కూడా అర్ధవంతంగా వుంటాయి. పూర్వరంగం మ్యాటర్స్. తగిన పూర్వరంగం లేక బిగినింగ్ మిడిల్ కి
వెళ్ళలేదు, అప్పుడు ప్లాట్ పాయింట్ వన్
అనే కథకి మొదటి మూలస్థంభాన్ని బలిష్టంగా
ఏర్పాటు చెయ్యదు.
***
ఇక
ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో కత్తి విసిరే యాక్షన్ కూడా గజిబిజి అయింది. బీచిలో ఎమోషన్ తో కూర్చుని
చూస్తూంటాడు హీరో కత్తి పట్టుకుని. చూసి
చూసి కళ్ళు మూసుకుంటాడు- రెచ్చిపోతూ కత్తి
విసురుతాడు కళ్ళు మూసుకునే. అతను ఎవర్ని చూశాడు? టార్గెట్ చేసిన రౌడీల్నే చూసి
కళ్ళు మూసుకుని కత్తి విసిరాడా? కానీ వాళ్ళు రౌడీలు కారే? మరెవర్ని చూసి కళ్ళుమూసుకుని కత్తి
విసిరాడు? టార్గెట్ కాని వాళ్ళ మీదకి
ఎందుకు విసిరాడు? అలికిడి అయ్యింది
కాబట్టి, వాళ్ళే టార్గెట్స్ అనుకుని కళ్ళుమూసుకుని విసిరాడా?
బీచిలో అంతా ఓపెన్ గానే వుంటుంది. చాటునుంచి ఎవరూ వచ్చేదేమీ వుండదు. ఎవరొస్తున్నారో
దూరంనుంచే తెలిసి పోయి తను లేచి పారిపోవాలి లెక్కకైతే. పారిపోవాలి- ఎందుకంటే, ఆ వస్తున్న వాళ్ళు అలాంటివాళ్ళు. వాళ్ళ మీద తను
దాడి చేయదానికి కారణాల్లేవు. ఒకవేళ మాట వరసకి వాళ్ళు తాననుకున్న టార్గెట్సే
అనుకున్నా- కళ్ళు మూసుకుని కత్తి విసరడ మేమిటి? అలా విసిరితే రౌడీలు ముగ్గురూ
చచ్చి పోతారా? ఎవడో ఒకడు బతికిపోయి అదే కత్తితో వెంటాడితే? అసలు ముగ్గుర్లో ఎవరికీ తగలక, అదే కత్తితో ఆ
రౌడీలు ముగ్గురూ ఆవురావురని వచ్చి, రాక్షసానందంతో
ముక్కలు ముక్కలుగా నరికి, ఎంజాయ్ చేసి - సముద్రంలో విసిరేసి పోతే? ఇంత
తెలివితక్కువ హీరో బిల్డప్పులతో కత్తి తీసుకుని బంపర్ యాక్షన్ హీరోగా ఎలా బయల్దే
రతాడు చావడానికి కాకపోతే? ఇలా కథా సౌలభ్యం కోసం ప్లాట్ పాయింట్ వన్ లో ఫాల్స్ డ్రామా
సృష్టించారు- అమాయక ప్రేక్షకుల్ని బుట్టలో
పడెయ్యడానికి. ప్లాట్ పాయింట్ వన్ లో ఫాల్స్ డ్రామాని ఏ సినిమాలోనూ చూడం.
ఈ
సీనుతోనే ఇంటర్వెల్ పడుతుంది- అవతల ఎవరున్నారు? అనే ప్రశ్నని రేకెత్తిస్తూ.
సెకండాఫ్ లో ఒకచోట ఇదే రిపీట్ అయి సస్పెన్సుని ఇంకా పెంచుతుంది. చిట్టచివరికి కత్తి
విసిరినప్పుడు అవతలెవరున్నారో మొత్తం
రివీల్ వుతుంది. అవడానికి ఇది మంచి యూఎస్పీయే గానీ, దీని నిర్మాణంలో పునాదుల్లేవు.
అసలు
హీరోయిన్ కేం జరిగింది, పోలీసులందర్నీ హీరో ఎందుకు చంపేశాడూ అన్న మిగిలిన అంశాలు
వివిధ ఫ్లాష్ బ్యాకుల ద్వారా వెల్లడవుతాయి. ఈ ఫ్లాష్ బ్యాకుల్లో మళ్ళీ ఫ్లాష్
బ్యాకులుంటాయి. కథ పొరలు పొరలుగా విప్పుతూంటాడు దర్శకుడు. కానీ మహేష్ భట్ తీసిన
‘గ్యాంగ్ స్టర్’ లో ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ కథ తికమక పెట్టదు.
ఇది పెద్ద హిట్టయ్యింది.
హీరోయిన్
కి చేసిన అన్యాయానికి హీరో పోలీస్ స్టేషన్లో బాధ్యులైన పోలీసులందర్నీ చంపేసి
పోతాడు. కానీ ఒకసారి బీచిలో తను కత్తి విసిరి చంపబోయిన రౌడీల జోలికి మళ్ళీ ఎప్పుడూ
పోడు. ఎప్పుడైతే ప్లాట్ పాయింట్ వన్ కి అర్ధముండదో, హీరో చేసే పనులకీ అర్ధముండదు. ప్లాట్
పాయింట్ వన్ బలహీనంగా వున్నా క్లయిమాక్స్ బలహీనమైపోతుంది. మొత్తం స్క్రీన్ ప్లేకి నాడీ
కేంద్రం లాంటిది ప్లాట్ పాయింట్ వన్. ఒక
సినిమా ఎలావుందో తెలియడానికి సినిమా మొత్తం చూడనవసరం లేదు, ప్లాట్ పాయింట్ వన్
ఏర్పాటుని చూస్తే తెలిసిపోతుంది. ప్లాట్ పాయింట్ వన్ తర్వాతి
కథనంలోని మంచి చెడులన్నీ ప్లాట్ పాయింట్ వన్ నుంచే పుడతాయి. గాలిలో ఒక సీన్ ని
పట్టుకుని దానిమంచి చెడుల వాదులాట పెట్టుకుని లాభంలేదు- ఆ సీన్ని ప్లాట్ పాయింట్
వన్ కి అన్వయించే నిజ నిర్ధారణ చేయాలి. స్వతంత్రంగా
ఏ సీనూ వుండదు- అన్నీ ప్లాట్ పాయింట్ వన్ ని పరివేష్టించే వుంటాయి.
‘వెంకటాపురం’
స్థితి గతులిలా వున్నాక, ఒకవేళ నిర్మాతలు దీని డీవిడీలు విడుదల చేస్తే, చూసుకుంటూ
విశ్లేషణ చేసుకోవాలి. దీని సబబైన ఇంకో వెర్షన్ ని ప్రాక్టీసు చేయాలి. ఏదో సినిమా
చూసేసి మనం కూడా ఇలాటిది తీయగలమని గుడ్డిగా నమ్మేయకూడదు. ముఖ్యంగా థ్రిల్లర్స్ లో,
మర్డర్ మిస్టరీల్లో ఎక్కువ కథ జొప్పించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ క్లూలూ,
ఎక్కువ ఫ్లాష్ బ్యాకులూ, సమస్య ఎలా పరిష్కారమయ్యిందో చెప్పడానికి ఆది నుంచీ ఎన్నో సంఘటనల్ని గుర్తు
చేస్తూ ఎక్కువ వివరణలూ ఇవ్వకూడదు. ఇది నవల చేసే పని, మాస్ మీడియా అయిన సినిమా
చేయాల్సింది కాదు. తాము చాలా టాలెంటెడ్ అని తెలియడానికే తెర మీద హడావిడి చేస్తూంటారు దర్శకులు. సినిమా
చూస్తున్నప్పుడు దర్శకుడి మీదికి దృష్టి మళ్ళకూడదు. ప్రపంచాన్నిచూస్తున్నప్పుడు
మనకి దేవుడు మనకి కన్పించడు. క్రియేటర్స్ ఆర్ సైలెంట్ వండర్స్.