రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జనవరి 2014, ఆదివారం

బాక్సాఫీసు వాస్తవాలు వేరు!


రివ్యూ
1 – నేనొక్కడినే !







తారాగణం : మహేష్ బాబు, కృతీ సానన్, గౌతమ్, పోసాని కృష్ణ మురళి, సాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, సూర్య, నాసర్, ప్రదీప్ రావత్, , కెల్లీ దోర్జీ తదితరులు
కథ : చక్కా హరిప్రసాద్, స్క్రీన్ ప్లే : అర్జున్ వై కే, తోట శ్రీను
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, గీతాలు : చంద్ర బోస్
ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ : రాజీవన్, నృత్యాలు : ప్రేమ్ రక్షిత్ , యాక్షన్ : పీటర్ హెయిన్స్
బ్యానర్ : 14  రీల్స్ ఎంటర్ టైన్మెంట్ – ఇరోస్ ఇంటర్నేషనల్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
సెన్సార్ : u/a
విడుదల : జనవరి 10, 2014

సంక్రాంతి సినిమాలంటే ప్రేక్షకులకి పండగ ఆనందాన్ని మించిన ఆనందం. పండగపూట కడుపునిండా వినోదాన్ని ఆరగించాలని ఉవ్వీళ్ళూరుతారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తారు. ఎదురుచూసిన అభిమాన స్టార్ సినిమా అట్టహాసంగా విడుదలవగానే థియేటర్ల కి పరుగులు పెడతారు. అంతవరకే వాళ్ళ చేతుల్లో వుండేది. ఆతర్వాత
నొసట రాత అంతా ఆ సినిమా దర్శకుడు, స్టార్ లతో బాటూ నిర్మాతల చేతుల్లో వుంటుంది. వాళ్ళు ప్రాప్తకాలజ్ఞు లయ్యరా, ప్రేక్షకులు చిరుదరహాసాలతో బయటపడతారు, వాళ్ళు ప్రేక్షకాభిరుచులమీద ప్రయోగాలు చేశారా- పండగ మూడ్ చెడగొట్టుకుని చెల్లాచెదురై పో తారు. ప్రిన్స్ మహేష్ బాబు 1- నేనొక్కడినేతో ఈ రెండోదే జరుగుతుందని  సాక్షాత్తూ ఆయన ఫ్యాన్స్ కూడా ఊహించివుండరు. సరిగ్గా 2011 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కూడా ఇలాటి ఆందోళనకర పరిస్థితుల్నే సృష్టించాడు. కాకపోతే ఆ సినిమా పంజాసంక్రాంతికి ఓ నెల ముందే  విడుదలై ప్రేక్షకుల్ని రక్షించింది!

 ‘పంజాలాంటి అపజయాన్ని చూసికూడా ఆ దారిలోనే  నేనొక్కడినేఅనే మరో డార్క్ మూవీ తీయడం సాహసమే. అదీ దూకుడులాంటి పూర్తి వినోదాద్మక సూపర్ హిట్ తీసిన నిర్మాతలు- అలాంటి వినోదానికి దూరంగా సీరియస్ సినిమాతో ముందుకురావడం మింగుడు పడని వ్యవహారమే. వరస హిట్ల మీదున్న మహేష్ బాబు ఇలా తెలుగు సినిమాతో, తెలుగు సినిమా పాత్రతో ప్రయోగం చేయాలనుకోవడం, అందుకు దర్శకుడు సుకుమార్ ని ప్రోత్సహించడం అలావుంచితే, స్టార్ సినిమాకి సకుటుంబ సమేత ప్రేక్షక సమూహాలుంటాయి- అలాంటిది ఇన్నాళ్ళూ పక్కా ప్రేమసినిమాలుతో కుటుంబ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తూ వచ్చిన సుకుమార్, ఆ  కుటుంబ ప్రేక్షకులే ఎలా చూస్తారనుకుని  ఏకంగా బిగ్ స్టార్ మహేష్ తో యాక్షన్ జెనర్ లో ఈ ప్రయోగం చేశాడన్నది పెద్ద క్వశ్చన్ మార్కే! ...పోతే ఈ డెబ్బై కోట్ల మెగా బడ్జెట్ మూవీలో అసలేముందో ఇప్పుడు చూద్దాం...

ఏది నిజం? ఏది అబద్ధం ?
పరిస్థితుల ప్రభావంతో మార్పు చెందేది ఎప్పుడూ అసలైన సత్యం కాదని వేదాల్లో చెబుతారు. గౌతమ్ (మహేష్ బాబు) అనే రాక్ స్టార్ తన గురించిన సత్యం తెలుసుకోవడానికి గతంలోకి ప్రయాణిస్తాడు. అప్పటికే ఆ గతంతో సంబంధమున్న ఇద్దర్ని విదేశాల్లో చంపేశాడు. హైదరాబాద్ లో ఓ  రాక్  షో ఇస్తున్నప్పుడు మూడో వాడు తనని చంపడానికి వస్తే  వాణ్ని చంపేసి అరెస్టవుతాడు. ఆ హత్యా దృశ్యాల్ని సమీరా (కృతీ సానన్) అనే టీవీ జర్నలిస్టు చిత్రీకరిస్తుంది. తీరా  ఆ వీడియోలో చూస్తే, అక్కడ లేని  శత్రువుని ఊహించుకుంటూ గాలిలో  విన్యాసాలు చేశాడు తప్పితే చంపలేదని తెలుస్తుంది. సైకియాట్రిస్టు (సూర్య)కి చూపిస్తారు. ఆ సైకియాట్రిస్టు ఇతను  చిత్తభ్రాంతులకి లోనయ్యే మనోవ్యాధితో బాధపడుతున్నాడని తేలుస్తాడు. గౌతమ్ తను చూసిందీ చంపిందీ అబద్ధం కాదనీ, అది పూర్తిగా నిజమనీ వాదిస్తాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని హతమార్చిన వాళ్ళే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారని అంటాడు. కానీ నిజానికి  తను విదేశాల్లో కూడా ఎవర్నీ చంపలేదన్న విషయం అతడికి తెలీదు.

ఇలా వుండగా అతడి మీద మళ్ళీ హత్యా ప్రయత్నాలు జరుగుతూంటాయి. పోలీసు అధికారి (సాయాజీ షిండే) వచ్చి చూస్తే, ఘటనా స్థలం అలావుండదు. అంతా గౌతమ్ స్వైరకల్పనలేనని హేళన చేస్తాడు. దీంతో గౌతమ్ అసలు తానెవరో తెలుసుకోవాలన్న పట్టుదలతో గోవా వెళ్తాడు. సమీరా అనుసరించి వస్తుంది. అక్కడామెకి అతడిమీద ప్రేమలాంటిది పుడుతుంది. అతడి మానసిక స్థితితో ఆ ప్రేమకి సరిపడదు. ఇక్కడా అవే చిత్తభ్రాంతులు. ఇక్కడ కూడా దాడులు జరుగుతాయి. ఈ దాడులు సమీర మీదే జరుగుతున్నాయని పసిగడతాడు. అది నిజమే అయినా తనమీద ఎందుకు దాడులు జరుగుతున్నాయో ఆమె దాస్తుంది. 

ఇక ఇక్కడ దాడులు చేస్తున్న శత్రువు (కెల్లీ దోర్జీ) ని చంపేసి లండన్ బయల్దేరతాడు గౌతమ్...లండన్ లో అతను తెలుసుకున్న రహస్యాలేమిటి, అక్కడింకా ఎవరు శత్రువులున్నారు, అసలు తన తల్లిదండ్రుల్ని ఎందుకు చంపారు, ఆ గుట్టు ఏమిటి, తన తల్లి దండ్రులు అసలెలా వుంటారు- అదెలా తెలుస్తుంది- వగైరా ప్రశ్నల పరంపరకి  ఈ ద్వితీయార్ధంలో సమాధానాలు దొరుకుతాయి.  

ప్యాకేజీ- పాత్రలూ పరిమితం 
చాలాతక్కువ పాత్రలతో, అతితక్కువ వినోదాత్మక విలువలతో రొటీన్ కి భిన్నమైన కథా కథనాలతో చేసిన ఈ ప్రయోగంలో నటనవరకూ మహేష్ బాబు ఓకే, కానీ నటనే సినిమాని నిలబెట్టదు. కాసేపైనా తననుంచి ప్రేక్షకులాశించే అల్లరిచేయకుండా, నవ్వించకుండా , ఆద్యంతం సీరియస్ గా కన్పిస్తూ, హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాల్లో సైతం రొమాంటిక్ మూడ్ ని ప్రదర్శించక- తన జీవితం, తన సమస్యే తప్ప ప్రేక్షకులు పట్టని  ఆత్మాశ్రయ ధోరణిలో సాగే ఈ  పాత్ర ఆశించిన ఫలితాల్నిచ్చిందా అంటే అదేమీ లేదు- అలాంటప్పుడు ఈ ప్రయోగం విఫలమైనట్టే.

మానసిక సమస్యని పక్కన బెడితే, పాత్రకి చిన్నపుడు జరిగిన అన్యాయానికి సంబంధించి సానుభూతిని పొందడానికి తగిన నేపధ్యం కూడా లేకపోవడం పాత్ర బాగా బోరు కొట్టడానికీ, సహన పరీక్ష పెట్టడానికీ కారణం. దీనికి మరమ్మత్తు చేయాలంటే, 'ధూమ్ -3 ' లో అమీర్ ఖాన్ పాత్రచిత్రణ చూడాలి. ఇది తర్వాత చూద్దాం. సీరియస్ నటన తర్వాత, మహేష్ బాబు మూడు పాటలకి డాన్సులేశాడు. అవేమీ ధియేటర్లో కేరింతలు పెట్టించలేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎందుకనో పేలవంగా వుంది. ఐటెం సాంగ్ తప్పనిసరిగా పెట్టుకునే అలవాటున్న సుకుమార్,   ఈసారి ఐటెం సాంగ్ ని కూడా నీరుగార్చేశాడు. నేపధ్య సంగీతం కూడా శోక రసంతో థీమ్  ట్రాకుగా రిపీటవడం  సినిమా నడకని పెను భారం గా మార్చేసింది. పాటల తర్వాత యాక్షన్ దృశ్యాల్లో మహేష్  ని వంక పెట్టడా నికేం లేదు. యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ సముద్రం మీదా, లండన్ లోనూ కంపోజ్ చేసిన పోరాట దృశ్యాలు హైలైట్. అలాగే 'రోబో' ఫేమ్ ఛాయాగ్రాహకుడు ఆర్ రత్నవేలు ఎంచుకున్న లైటింగ్ స్కీమ్ చివరంటా డార్క్ మూడ్ నే క్రియేట్ చేయడానికి  పనికొచ్చింది తప్ప,  ప్రేక్షకులకి మానసికంగా కాస్తైనా పంచరంగులతో  అలరించలేకపోయింది. ఈ తరహా చిత్రాకరణ చిన్నాచితకా నటులతో తీసే సైకలాజికల్ థ్రిల్లర్స్ కి నప్పుతుంది- బిగ్ స్టార్స్ కి కన్నులపండువగా వుండాలి- అవుట్ డోర్ లోకేషన్స్ ప్రకాశాన్ని కూడా డీ ఐ తో డీలా పడేట్టు చేశారు. 

హీరోయిన్ కృతీ సానన్ వృత్తి గతంగా మోడలూ కథక్ కళాకారిణీ అయినా,  వెండితెరమీద ఈ సినిమాతో అరంగేట్రం చేసి నటనలోనూ ది బెస్ట్ అన్పించుకుంది. పోసానీ కామెడీ పాత్ర చిన్నదే, విలన్లు నాసర్, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీలవి అంత శక్తిమంతమైన విలన్ పాత్రలు మాత్రం  కావు. మహేష్ తనయుడు గౌతమ్ నటన ఎలాంటి బెరుకు లేకుండా మంచి ఈజ్ తో వుండడం విశేషం.

స్క్రీన్ ప్లే  సంగతులు 
ఈ సినిమాకి హరిప్రసాద్ కథ నందిస్తే, అర్జున్, తోట శ్రీనులు స్క్రీన్ ప్లే రాసినట్టు టైటిల్స్ లో వేశారు. సరిగ్గా ఇలాటిదే కథ -మానసిక సమస్యలేకుండా, తననెవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న పీడకలలతో- ఒక అసోసియేట్ దర్శకుడు రాసుకుని ఈ సమీక్షకుణ్ణి కలిశాడు. దాన్ని సరిదిద్ది స్క్రీన్ ప్లే రాశాక, ఒక ప్రముఖ హీరోకి విన్పించాడు. ఆ ప్రముఖ హీరో ఇలాటి కథ తమిళంలో అయితే తీస్తారేమోగానీ, తెలుగులో వర్కౌట్ కాదని తేల్చేశారు. 2005  నాటి సంగతి ఇది. ఆ తర్వాత ఆ అసోసియేట్ ఓ తమిళ హీరోకి విన్పించాలని విఫలయత్నం చేశాడు. కొన్నేళ్ళ తర్వాత అందులో పీడకలల యాంగిల్ కూడా తీసేసి పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ గా మార్చేశాం. దాంతో మరో అగ్రనటుడి కటాక్షం కోసం ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం ఆ అసోసియేట్.

ఇప్పుడు 'నేనొక్కడినే' కథేమిటో చూశాక  పైన పేర్కొన్న  ఆ ప్రముఖ నటుడు- ఇలాటి కథ తెలుగులో  వర్కౌట్ కాదని చెప్పడం ఎంత కరెక్టో అర్ధమౌతోంది ! ఆయనకి  ఇలాటి సైకలాజికల్ కథలతో   ఎలాటి 'చిత్తభ్రాంతులూ'  'అనుమానాలూ' లేవేమో-  

కొత్తదనం పేరుతో  ఇలా  బాక్సాఫీసు వ్యతిరేక సినిమాలు తీస్తూ పోతే, అసలే భారీ ఫ్లాపులు మూట గట్టుకుంటున్నఫీల్డు ఇంకా లోతుగా ఊబిలో కూరుకు పోకతప్పదు . కొత్తదనం పేరుతో  జరిగేదేమంటే, నేటివిటీ లేని క్రియేటివిటీని అంట గట్టడమే. స్టయిలిష్ నెస్ పేరుచెప్పుకుని హాలీవుడ్ కథా కథనాలతో తీస్తూపోతే, ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలనే చూడొచ్చు - తెలుగులో వాటి అనుకణలతో పనేముంది!

హాలీవుడ్ దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ తన పుస్తకంలో ఒక చోట పేర్కొన్నట్టు- - As the camera rolls and the director watches the scene unfold, the director’s taste must serve as the representative of all the audiences who will ever  see the film – అనేది అదేదో మేధావితనం గా అన్పించుకోవడం కోసం కాదు- సింపుల్ గా సింపుల్ కామర్సే అది- అంతే! బాక్సాఫీసు కాసుల ఘోష...కమర్షియల్ సినిమాకి బాక్సాఫీసే లక్ష్యం కావాలి తప్ప- మేధావులుగా పేరు తెచ్చుకునే ఎలాటి యావా  కాదు. పై దర్శకుడే మరోచోట అన్నట్టు- ‘భావోద్వేగాల్ని ప్రభావితంజేసే  సృజనాత్మక ప్రక్రియే ఆర్టు...ఆ సృజనాత్మక ప్రక్రియకి ప్రేక్షకులు ఉద్వేగభరితులవు తారు, నవ్వుతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, బాగా ఎక్సైటై పోతారు..దర్శకుడనేవాడు తన అభిరుచుల్ని ప్రేక్షకులమీద రుద్దకుండా, ప్రేక్షకులకుండే  సవాలక్ష కోరికలకి తను ప్రతినిధిగా వున్నప్పుడు  చాలావరకూ విజయం సాధిస్తాడు....’

మన స్టైలిష్ మూవీ మేకింగ్ లో ఏం జరుగుతోందంటే, అలాటి ప్రాతినిధ్యమే మాయమై, పై కొటేషన్ లోని ...as the director watches the scene unfold..పదాలు గల్లంతయిపోయి-seen unfold –అవడాన్ని పట్టించుకోడు. దృష్టంతా ఆ scene చుట్టూ భౌతికపరమైన కెమెరా, లైటింగ్, ఆర్ట్  డైరెక్షన్ హంగుల పైనే వుంటుంది. ఇలా తీసి స్టైలిష్ గా తీశామని చెప్పుకుంటారు.

నేనొక్కడినే’ స్క్రీన్ ప్లే చెప్పుకోవడానికైతే సార్వజనీన మూడంకాల (3-act) స్క్రీన్ ప్లే నే అయినా, నిర్వహణ లో బాగా దెబ్బతింది. ప్రారంభించడమే ప్రధాన కథలో కెళ్ళి పోయి పాయింట్ ఎస్టాబ్లిష్ చేసేవరకూ సాగే మొదటి అంకం ముప్ఫై నిమిషాలే తీసుకోవడం అభినందించదగ్గదే. ఈ క్రింది పటం చూడండి-



act -1, act-2, act-3 అనే మూడంకాల స్క్రీన్ ప్లే నిర్మాణంలో కథేమిటో తెలియజేసే act-1 లోని సెటప్ ప్రకారం గౌతమ్ ఎవరు, అతడి సమస్యేమిటి, అతనేం చేయబోతున్నాడనేది చెప్పుకొచ్చారు. హాయిగా అరగంటలో ముగించేసిన ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర కథ  మలుపు తిరిగి act-2లోకి ప్రవేశించాలి. ఆ మలుపు ఏమిటంటే, మూడోసారి కూడా గౌతమ్ జరగని దాడిని ఊహించుకున్న సందర్భంలో,  పోలీసుల హేళనకి గురై అసలు తానెవరో తెలుసుకోవడానికి గోవా ప్రయాణం కట్టడం.

ఇక్కడ్నించీ act-2 లోకి ప్రవేశించిన  కథా లోకంలో జరిగే బిజినెస్ ఏమిటంటే, పాత్ర తన సమస్య తో లేదా ప్రత్యర్ధితో సంఘర్షించడం- దీన్నే confrontation అంటారు. ఈ సంఘర్షణలో ఎదురు దెబ్బ లుంటాయి-ఎదురుదాడి చేయడం వుంటుంది. ఇంటర్వెల్ దగ్గర కొచ్చేసరికి, సమస్య తీవ్రత పెరిగి మరింత ఇరకాటంలో పెడడమో, లేదా తిరుగులేని సవాలు విసరడమో జరుగుతుంది. ఈ ప్రకారం గౌతమ్ తనని పీడిస్తున్న సమస్యకి కారకుడైన ఒక విలన్ని ఇంటర్వెల్ దగ్గర కాల్చి చంపడం కూడా ఓకే.

విశ్రాంతి తర్వాత act- 2 సెకండ్ పార్ట్ కొచ్చేసరికి కొత్తసమాచారంతో లండన్ వెళ్ళడం, తండ్రి లాకర్ తెరచి ఒక ఫార్ములా స్వాధీనం చేసుకోవడం, ఆ ఫార్ములాకోసం మిగిలిన ప్రత్యర్ధులు వెంటపడ్డంతో ప్రారంభమై ప్రధాన విలన్ (నాసర్)ని కనుగొనడంతో act-2 ముగుస్తుంది. ఇక act -3 లో క్లైమాక్స్ ప్రారంభమౌతుంది...ఇక్కడ ప్రధాన విలన్ తో తన తల్లి దండ్రుల గురించిన సమాచారంకోసం బేరసారాలు కుదరక అతన్ని చంపేయడంతో ముగుస్తుంది. ఇక తల్లిదండ్రులు ఎవరనే అన్వేషణతో కొనసాగి శుభం కార్డు పడే వరకూ సుదీర్ఘంగా జరిగేదంతా  ఉపసంహారమే!

అదే అంకం అదే బిజినెస్సూ!
సమస్య ఎక్కడొచ్చిం దంటే, మొదటి అంకంలో గౌతమ్ మానసిక సమస్య చెప్పేసి  పరిష్కారానికి గోవా దారి పట్టించాక,  రెండో అంకంలో పదేపదే ఆ సమస్యనే ( చిత్తభ్రాంతులు - hallucination) రిపీట్ చేసి, ఏ సంఘటన నిజమో ఏ సంఘటన అబద్ధమో తెలీని కన్ప్యూజన్లో ఆడియెన్స్ ని పడేస్తూ- గౌతమ్ క్యారక్టర్ ని అపహాస్యం పాల్జేశారు. రెండో అంకంలో జరగాల్సిన బిజినెస్ అది కాదు. ఇక్కడ జరగాల్సిన బిజినెస్ సమస్యతో పోరాటం- రెండో అంకంలో గౌతమ్ గోల్ మొదటి అంకం ముగింపులో ఎష్టాబ్లిష్ చేసినట్టు- తానెవరో, తన గతం ఏమిటో తెలుసుకునేందుకు జరపబోయే అన్వేషణ ! రెండో అంకంలో తను సంఘర్షిస్తే ఈ గోల్ కోసం సంఘర్షించాలే తప్ప, ఇంకా తన మొదటి అంకంలో చెప్పేసిన తన మానసికసమస్యతో కాదు. ఈ విధంగా కథ మీద ఫోకస్ కోల్పోయి, మొదటి అంకం బిజినెస్ ని రెండో అంకంలో కూడా చొరబెట్టి దాన్నే  క్లైమాక్స్ వరకూ లాగుతూ పోవడం వల్ల, సువిశాలమైన రెండో అంకం ఏరియా అంతా  కథన భంగం కలిగి గందరగోళం ఏర్పడింది. కథ బుర్ర కెక్కడం కష్టసాధ్య మైపోయింది.

పోనీ ప్రధాన విలన్ తో క్లైమాక్స్ అయినా ఎందుకు బలంగా లేదంటే -  కారణం, మొదటి అంకం ముగింపులో గౌతమ్ సమస్యని బలంగా ఎస్టా బ్లిష్  చేయకపోవడం వల్లే! ఎప్పుడైతే మొదటి అంకం ముగింపులో సమస్యని (పాయింటుని) దృశ్య రూపంలో ప్రభావవంతంగా ఎష్టాబ్లిష్ చేయ్యమో, అప్పుడు క్లైమాక్స్ కూడా బలహీనంగా, పేలవంగా  వస్తుంది. మొదటి అంకం ముగింపులో గోవా ప్రయాణం కట్టడానికి చిత్తభ్రాంతుల కారణమే చెప్పినా, అప్పుడు జరిగిన సంఘటన అంతకు మునుపు జరిగిన వాటికి భిన్నంగా ఏమీ లేదు. మార్పేమీ లేదు. ఇంకేదో అఘాయిత్యం లాంటి బలమైన సంఘటన జరిగి- చట్టానికి దొరక్కుండా పారిపోయే పరిస్థితి లాంటిది ఏర్పడితేనే బలమైన మలుపు అన్పించు కుంటుంది. ఏ స్క్రీన్ ప్లే కైనా ప్లాట్ పాయింట్-1, ఇంటర్వెల్, ప్లాట్ పాయింట్-2 లు మూలస్తంభాల్లాంటివి. వీటిని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటే తప్ప కథకి న్యాయం జరగదు.

ఈ లోపాలన్నీ టైం అండ్ టెన్షన్ థియరీని కూడా నాశనం చేశాయి. ఈ క్రింది పటం కూడా చూడండి...

 సినిమారీలు తిరిగే టైము గడుస్తున్న కొద్దీ కథలో టెన్షన్ పెంచుకుంటూ పోవాలి. అప్పుడే ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోతారు. ఆద్యంతం అన్ని అంకాల్లో అదే మొదటి అంకం బిజినెస్సే  నడుస్తూ కథనం మన్నుతిన్న పాములా పడుంటే  ఇంకా టెన్షన్ అనే మాట ఎక్కడ్నుంచి వస్తుంది?

పైగా ఎడాపెడా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో, చిన్ననాటి మాంటేజెస్ తో, జరుగుతున్న కథ ఫలానా ఈ ఈ  విధంగా జరిగిందంటూ ఎక్స్ పొజిషన్ లతో- వర్తమాన కథకి టెన్షన్ అనే కాన్సెప్ట్ లేకుండా చేశారు. కథకుడికి కథమీద స్పష్టత లేనప్పుడే మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులకి పాల్పడతారని స్క్రీన్ ప్లే పండితుల నిర్ధారణ. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులవల్ల చెప్పాలనుకుంటున్న అసలుకథ ఎక్కడేసిన గొంగళిలా పడుంటుంది.

పాత్ర చిత్రణ వైచిత్రి
మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన గౌతమ్ పాత్ర వాస్తవానికి చేష్టలుడిగిన ప్యాసివ్ పాత్ర. అది గొప్ప హీరోయిజం తో కూడిన యాక్టివ్ పాత్ర కావాలంటే, ఆ మూడంకాల్లో ఏ అంకం బిజినెస్ ఆ అంకంలో స్పష్టంగా జరగాలి. అప్పుడు మానసిక సమస్య అనే మొదటి అంకపు అంతర్గత ఎమోషనల్ స్ట్రగుల్ పదేపదే కథకి అడ్డు పడకుండా (పాత్ర ప్యాసివ్ గా అపహాస్యం గాకుండా) అసలు గోల్ కోసం పోరాడాల్సిన బహిర్గత ఫిజికల్ స్ట్రగుల్ తో యాక్షన్ లో కొచ్చి, పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ జైత్రయాత్ర కొనసాగించే వీలుంటుంది. హీరోయిజం ఉట్టిపడుతుంది. ఎంతసేపూ ఊహాలోకంలో తనమీద దాడుల్ని పదేపదే తిప్పికొట్టడం హీరోయిజం అన్పించుకోదు. అది యాక్టివ్ గా వుండడం కాదు, రియాక్టివ్ గా నిస్సహాయంగా ఉండిపోవడం. జ్యూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో ఇలాగే ఆ పాత్ర విలన్ జరిపే దాడుల్ని తిప్పి కొట్టడమే ( రియాక్టివ్ గా) నిగా పెట్టుకుంటుంది తప్ప, ఆ విలన్ ని ట్రాప్ చేసి తనే దాడులు ప్రారంభించే  ప్రారంభించే యాక్టివ్ పాత్రగా ఎప్పటికీ మారదు!
మహేష్ బాబు పాత్ర తన తల్లి దండ్రులు హత్యకి గురయారన్న బాధతో చివరంటా ఎంతో ఎమోషన్ పండించాడని అనుకోవడం కూడా భావ్యం కాదు. అసలా తల్లిదండ్రులు ఎలా, ఎందుకు చనిపోయారో ముందే చెప్పేసి వుంటే పాత్ర మీద నిజమైన సానుభూతి ఏర్పడే అవకాశం వుండేది. ఆ తల్లి దండ్రులకీ, మహేష్ బాబు పాత్రకీ జరిగిన అన్యాయమేంటో మనకు తెలియకపోతే ఎలా మనసులోతుల్లోంచి సానుభూతి ఫీలవుతాం?

 అమీర్ ఖాన్ నటించిన ‘ధూమ్-3’ లో, మొదటి పది నిమిషాల్లో అతడి చిన్నప్పుడు బ్యాంకు వాళ్ళ దురుసుతనం వల్ల  సర్కస్ కంపెనీ మూతపడే పరిస్థితేర్పడి, తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కళ్ళారాచూసిన తను, ఆ బ్యాంకు మీద పగ దీర్చుకోవాలన్న దయనీయ బ్యాక్ డ్రాప్ ఏర్పడి,  ఆసాంతం ఎనలేని సానుభూతి పొందుతూ వుంటాడు.

మహేష్ బాబు పాత్ర పేరెంట్స్ ఎందుకు హత్యకి గురయ్యారో క్లైమాక్స్ వరకూ దాచిపెట్టడంవల్ల పాత్ర పడుతున్న బాధలకి  అర్ధం లేకుండా పోయింది.

ఇంకా లాజిక్కొస్తే, తన పేరెంట్స్ ఐడెంటిటీ కోసం గోల్ తప్ప,  దాని దారీ తెన్నూ తెలీని ఈ అడ్డగోలు ప్రయాణమంతా ఎందుకు? ఒక పేరుపొందిన రాక్  సింగర్ గా తను ఆనాటి పోలీస్ రికార్డులన్నీ పరిశీలించడానికి అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఆ ఫైళ్ళతో తల్లి దండ్రులెలా ఉంటారన్న జిజ్ఞాసతో బాటు, కేసు వివరాలన్నీ తెలిసిపోతాయి కదా? ఇంత  సింపుల్ గా తేలిపోయే కథకి ఈ కన్ఫూజనంతా ఎందుకు?

ముగింపు- ఉపసంహారం విషయానికొస్తే- గతించిన తల్లిదండ్రుల ఉనికిని కనుగొనడం, ఆ ఫోటోలు చూసుకుని దుఖించడం వంటి సుదీర్ఘ సన్నివేశాలన్నీ ముగింపులో వచ్చి వుండకూడదు. విలన్ని చంపే ముందే వచ్చి వుంటే సింపతీ కోషేంట్ బాగా వర్కౌటయ్యేది. ఈ ఎపిసోడ్లు తారుమారు చేయడంవల్ల కథ ముగిశాక కూడా ఈ బోరేమిటనే ఫీలింగ్ ఏర్పడేది కాదు.

చివరగా- నిడివి ఇరవై నిమిషాలు కత్తిరించారని తాజా వార్త. ఇది టాక్ వెళ్ళిపోయాక విజయావకాశాల్ని పెంచుతుందా? ఏమో!

-సికిందర్















4, జనవరి 2014, శనివారం

ఐదు బడా రెండు చిన్న హిట్లతో బేజారే !


టాలీవుడ్ @ 2013 
\
                           
2013 తెలుగు సినిమాల చిత్రమాలని  చూస్తే ఎన్నో ఆకర్షణీయమైన పుష్ప గుచ్ఛాలు కన్పిస్తాయి. ఏంతో ఊరడించే తారాతోరణాలు కనువిందు చేస్తాయి. మరెంతో గర్వించే కనకవర్షాలు గోచరిస్తాయి. భారీ సంఖ్యలో విడుదలలూ మురిపిస్తాయి. జోరుగా నిర్మాణాలూ అలరిస్తాయి. వేలంవెర్రిగా ప్రేక్షక దర్శనాలూ దృశ్యంకడతాయి...

బాద్షా, అత్తారింటికి దారేది, బలుపు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చీ, రామయ్యా వస్తావయ్యా, నాయక్, గుండె జారి గల్లంతయ్యిందే, మసాలా, భాయ్, దూసుకె ళ్తా, స్వామిరారా, పోటుగాడు, ఇద్దరమ్మాయిలతో, గ్రీకువీరుడు, ప్రేమకథా చిత్రం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్...ఇలా ఎన్నో ఆసక్తికరమైన విడుదలలు...వాటిలో మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, రాం చరణ్, రామ్, మంచు విష్ణు, నిఖిల్, మంచు మనోజ్, సుధీర్ బాబు, సందీప్ కిషన్ లాంటి సూపర్ స్టార్లు, సాధారణ హీరోలూ కాక ...నయనతార, సమంతా, కాజల్, శృతీ హాసన్, అమలా పాల్, అంజలి, అనుష్కా, కలర్స్ స్వాతి, నిత్యా మీనన్, నందిత లాంటి క్రీజీ స్టారిణులు, హీరోయిన్లూ మరోసారి రంగప్రవేశం చేసి ఉత్కంఠ రేపారు...

శ్రీను వైట్ల, హరీష్ శంకర్, శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, వీరు పోట్ల, విజయ భాస్కర్ , దశరథ్ మొదలైన రంగంలో వున్న దర్శకులేకాక, కొరటాల శివ, విజయకుమార్ కొండా, సుదీర్ వర్మ, మేర్ల పాక గాంధీ, ఆర్ రవికుమార్ లాంటి కొత్త దర్శకులూ అరంగేట్రం చేశారు.
దిల్ రాజు, బండ్ల గణేష్, జెమిని కిరణ్, భోగవల్లి ప్రసాద్, శివప్రసాద రెడ్డి, దానయ్య డివివి, మారుతి, శ్రీధర్ లగడపాటి, నిఖితా రెడ్డి, చక్రి చిగురుపాటి, వంశీ కృష్ణా రెడ్డి, ప్రసాద్ ఉప్పలపాటి లాంటి నిర్మాతలూ ఈ సంవత్సరం తమ తమ అదృష్టాల్ని పరీక్షించు కున్నారు!

సక్సెస్ తో సిగపట్లు!
పైకి ఇంత వైభవోపేతంగా, అద్భుతంగా  కన్పిస్తున్న ఈ 2013 వెండి తెర శోభ వెనుక తొంగి చూస్తే, ఎందరెందరో మహానుభావులు...అందరూ దాగుడు మూతలాడే సక్సెస్ తో  సిగపట్లకి సిద్ధపడ్డారు. కొందరే లొంగ దీసుకో గలిగారు. మరికొందరు సక్సెస్ అన్పించుకునీ కుదేలయ్యారు. ఎన్టీఆర్ వజ్రాల జాకెట్ కే  (బాద్షా) ఏకంగా పదిలక్షలు ధార బోసి బడ్జెట్ కి గేట్లు బార్లా తెరిచేస్తే  ఏమౌతుంది మరి? టాక్ చూస్తే హిట్టే, కాసులు లెక్కేస్తే లోటే. బలుపు కూడా హిట్ టాక్  వచ్చినా బడ్జెట్ ఎక్కువై ఎనిమిది కోట్లు నష్టపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండి పోయి, బడ్జెట్ దాటేసింది. బొటాబొటీ లాభాలతో బయటపడింది. అత్తారింటికి దారేది ఒక్కటే ధాటిగా ఎనభై  ఐదు కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2012 లో గబ్బర్ సింగ్ తో ఇలాటి రికార్డే సృష్టించి, ఆ వెంటనే కెమరామాన్ గంగ తో రాం బాబు తో అట్టర్ ఫ్లాప్ నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్,  తిరిగి అత్తారింటికి దారేది తో దారిలో పడ్డారు.

మొత్తం వంద సినిమాలు ఈ సంవత్సరం  విడుదలైతే, వీటిలో పెద్దసినిమాలు పదిహేను. ఈ పదిహేనులోనూ  ఐదు  మాత్రమే ఆర్ధికంగా హిట్టన్పించు కున్నాయి. అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్,  మిర్చి, గుండె జారి గల్లంతయ్యిందే...ఈ ఐదూ తప్ప, మిగతా పది బడా చిత్రాలూ దారుణ పరాజయం పాలయ్యాయి. ఎన్టీఆర్ నటించి హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘రామయ్యా వస్తావయ్యా’ 35 కోట్ల బడ్జెట్లో 19 కోట్లు, అల్లు అర్జున్ నటించి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇద్దరమ్మాయిలతో’ 33 కోట్లలో 22 కోట్లు, దశరథ్ దర్శకత్వం వహించి నాగార్జున నటించిన ‘గ్రీకు వీరుడు’ 22 లో 10, వీర భద్రం చౌదరి దర్శకత్వంలో నాగార్జున నటించిన’ భాయ్’ కూడా 25 లో 10,  మెహర్ రమేష్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ‘షాడో’ 30 లో 10, విజయభాస్కర్ దర్శకత్వంలోవచ్చిన వెంకటేష్- రాం ల మల్టీ స్టారర్ ‘మసాలా’ 24 లో 10, ఏలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో గోపీచంద్ నటించిన ‘సాహసం’ పదకొండు కోట్ల పెట్టుబడిలో 5  కోట్లూ నష్టపోయాయి. బడ్జెట్ మించిపోయిన మంచు మనోజ్ ‘పోటుగాడు’ కూడా ఆరేడు కోట్లు నష్ట పోయింది.

హిట్టయిన అత్తారింటికి దారేది 85 కోట్లు రాబట్టగా,  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ , మిర్చీ తలా 40 కోట్లు దాటి వసూలు చేశాయి. నితిన్ నటించిన గుండె జారి గల్లంతయ్యిందే 22 కోట్లు వసూలు చేసి అతడికి  మరో సక్సెస్ నిచ్చింది.  ఇక చిన్న సినిమాలు 85 విడుదలైతే రెండు మాత్రమే హిట్టయ్యాయి. స్వామిరారా 7 కోట్లు వసూలు చేస్తే, ప్రేమకథా చిత్రం 15 కోట్లు వసూలు చేసింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎంత బావుందని టాక్ వచ్చినా వసూళ్లు లేవు. పబ్లిసిటీకి సరిగ్గా ఖర్చు పెట్టడంలేదని పుకారు.

ఈ వంద తెలుగు సినిమాలతో బాటు మరో డెబ్బై డబ్బింగ్ సినిమాలూ  రిలీజయ్యాయి. ఇవన్నీ కూడా భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. మొత్తంగా 170 సినిమాల్లో ఏడు మాత్రమే డబ్బు కళ్ళ జూసి, మిగిలిన నూట అరవై ఏడూ పరిశ్రమకి దారుణంగా 300 కోట్ల రూపాయలు నష్టం తెచ్చి పెట్టాయని అంచనా. ఓ డెబ్బై మంది నిర్మాతలు పూర్తిగా దివాలా తీశారని సమాచారం. ఇలా ప్రతి ఏటా క్రమం తప్పకుండా  భారీ నష్టాలు మూట గట్టుకునే రంగం  ఏదైనా వుందంటే అది సినిమా రంగమే అని చెప్పాలి. ఎందరో నటులకి, టెక్నీషియన్ లకీ, ఇతర మౌలిక సదుపాయాలకీ బాగా లాభాలు చేసిపెట్టి నిండా మునిగిపోయేది ఎవరంటే నిర్మాతలే ! ఈ నిర్మాతల మీద పిడుగుపాటులా మరో ఆర్ధిక భారం- టెక్నీషియన్లు తమ జీత భత్యాలు మరోసారి పెంచాలని తాజా డిమాండ్!
ఇప్పుడు ఫిలిం ఛాంబర్ పరిసరాల్లో ఏ నిర్మతనడిగినా చెప్పేదొక్కటే – సినిమాలు తీసే పరిస్థితులు ఇంకే మాత్రం లేవని. ఎవరైనా ఇదే మాటంటారు. మరో పక్క చూస్తే రోజూ ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉం టాయి. రోజుకి ఇద్దరేసి కొత్త నిర్మాతలు డాబుగా రంగ ప్రవేశం చేస్తూనే వుంటారు. మరుసటి సంవత్సరం చూస్తే వీళ్ళు కనపడరు. చాలా జ్ఞానవంతులై  సినిమాలు తీసే పరిస్థితులు ఇంకెంత మాత్రం లేవని చెప్పుకునే జాబితాలో చేరిపోతుంటారు. ఇంతకీ విజయవంతమైన సినిమాలు తీయలేక పోవడానికి కారణం కూడా వీళ్ళే...వీళ్ళ వ్యర్ధ వ్యూహాల కారణంగానే టోకున సినిమాలు ఫ్లాపవుతున్నాయి. అదెలాగో  ఈ క్రింద  చూద్దాం.

ఉద్యమాల సెగ- శాటిలైట్ల దగా!
ఈ సంవత్సరం కోస్తా, సీడెడ్ ఏరియాల్లో సమైక్య రాష్ట్ర ఉద్యమాలు ఎగసి పెద్ద సినిమాల విడుదలలకి బ్రేకు పడింది. బాద్షా, తూఫాన్, కెమెరా మాన్ గంగతో రాం బాబు మొదలైన పెద్ద సినిమాల విడుదలలు వాయిదా పడ్డంతో చిన్న సినిమాలకి పండగయ్యింది. థియేటర్లు విరివిగా దొరికే పరిస్థితులేర్పడి వారానికి నాలుగైదు చొప్పున జోరుగా విడుదలయ్యాయి. కానీ ఏం లాభం? వాటిలో నాణ్యత ఉంటేగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొమ్ము చేసుకోవడానికి? అవన్నీ చిరునామా లేకుండా పోయాయి. దీంతో చిన్న సినిమాలని తొక్కేస్తున్నారని ఘోష పెట్టే నిర్మాతల ఆరోపణల్లో పసలేదని రుజువయ్యింది. పెద్ద సినిమాల్ని పక్కనపెట్టి, పెద్ద థియేటర్లు సైతం అద్దెలకిస్తూ రూటు క్లియర్ చేసినా,  చిన్న సినిమాలు నాలుగు రాళ్ళు వెనకేసుకోలేని నాసిరకంగా తేలిపోవడంతో- అరిచే నోళ్ళకి తాళాలు పడ్డాయి. ఆ నోళ్ళే తీరా సినిమాలు తీసే పరిస్థితు ల్లేవని వాపోతున్నాయి. ఆ మధ్య కొందరు నిర్మాతలు వచ్చే జనవరిలో ప్రభుత్వం ఒక జీవో తేబోతోందనీ, దాని ప్రకారం తిరిగి రోజుకి ఐదాటల పధ్ధతి మొదలెట్టి, మార్నింగ్ షో కి అన్ని చిన్నా పెద్దా సెంటర్లలో చిన్న సినిమాలకే  కేటాయిస్తారనీ, అంతే గాకుండా, రెంటల్ గాకుండా పర్సంటేజీ పద్ధతిన అనుమతిస్తారనీ,  వినోదపు పన్ను కూడా మినహాయిస్తారనీ, నిర్మాతలమండలి లో పెద్దల నుటంకిస్తూ చెప్పుకోవడం మొదలెట్టారు. కానీ ఇన్నిచేసినా చిన్న సినిమాలు అదే చెత్త పద్ధతిలో తీస్తూ పోతే ఏమిటి ప్రయోజనం? మండలిలో ఒక కొత్త నిర్మాతకి రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటే చాలా ప్రశ్నలు వేస్తారు. ఇలాటి ప్రశ్నలు వేసి యోగ్యులకే సభ్యత్వమిచ్చే సాంప్రదాయం ఇంకా దర్శకుల సంఘం లో గానీ, రచయితల సంఘం లో గానీ లేదు. ఉంటే చాలావరకూ చెత్త సినిమాలు తగ్గిపోతాయి. కొందరు నిర్మాతలు చెప్పుకుంటున్నట్టు ప్రభుత్వం ఒక వేళ నిజంగానే అలాటి జీవోతో దయాదాక్షిణ్యాలు చూపినా, చిన్నసినిమాలకి మరో గండం వచ్చిపడింది. గత కొన్ని నెలలుగా చిన్న సినిమాలకి శాటిలైట్ హక్కులు కొనడం లేదు. టీవీ చానెళ్ళు చేవలేని చిన్న సినిమాలన్నిటినీ పక్కకు తోసేశాయి. ఇక మేం కొనం పొమ్మంటున్నాయి.

నిజం చెప్పాలంటే, ఓ డజను భారీ సినిమాలు తీసే నిర్మాతలు తప్పించి మిగతా పదుల సంఖ్యలో చిన్నాచితకా సినిమాలు తీసే నిర్మాతలందరి దృష్టి థియేటర్ల పైన కాదు, ప్రేక్షకుల పైన అసలే కాదు, శాటిలైట్ హక్కులపైనే గురి! దీంతో ఏమాత్రం భయభక్తులు లేకుండా సినిమాలు చుట్టిపారేస్తున్నారు. ప్రేక్షకులు తిప్పికొట్టినా ఫర్వాలేదు, ఒక్కరోజే ఆడినా పోయేదేమీ లేదు- శాటిలైట్ సొమ్ములొస్తాయిగా! ఇదొక ఇన్సూరెన్స్ లా ఆదుకునే అండలా వుంది.  పంట నష్టపోయిన రైతుకీ ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే అతను ఇన్సూరెన్స్ డబ్బులకోసం పంటవేయడు ! నిర్మాతలు మాత్రం ఇన్సూరెన్స్ ( శాటిలైట్) హక్కులకోసమే సినిమాలు తీయడం మరిగారు. ఇందుకే ఇన్నేసి ఫ్లాపులు కన్పిస్తూం టాయి- వీటిని చూసి అయ్యో అనుకోనక్కరలేదు. ఇవి వ్యర్ధ వ్యూహాత్మకంగా కోరుకున్న ఫ్లాపులే. ఈ లోగుట్టు ఇక చానెల్స్ కూడా పసిగట్టేసి నట్టున్నాయి –చెత్త సినిమాలు తమకి అంటగట్టి కోట్లు సొమ్ము చేసుకుంటున్నట్టు ఆలస్యంగా నైనా గుర్తించారు- చిన్న సినిమాలన్నిటి మీదా నిషేధం విధించేశారు! ఇందుకే ఇలాటి నిర్మాతలకి ఇప్పుడు  ‘సినిమాలు తీసే పరిస్థితులు ఏమాత్రం లేవు’ . డాబుగా వచ్చి మీడియాలో కనపడే చాన్సు కొట్టేసి, మాది మంచి సినిమా, కథాబలం దండిగా వున్న సినిమా, కామెడీ యాక్షన్ సెంటిమెంట్లతో మహిళల్ని కూడా ఆకట్టుకునే సినిమా, మూడేళ్ళు కష్టపడి స్క్రిప్ట్ వర్క్ చేసిన అద్భుత  సినిమా – అని పబ్లిసిటీ ఇచ్చుకుంటూ, అలాటి కళాఖండం తీస్తున్నట్టు నటిస్తూ,  హనీమూన్ ఎంజాయ్ చేసే పరిస్థితులకి శాటిలైట్ల వ్యవహారం ఇలా గండి కొట్టేసిందన్న మాట పాపం! భక్తి ప్రేక్షకుల మీద లేకపోతే,  ఇంకే వ్యూహాలూ స్కాం కింద వ్యర్ధంగానే పోగుపడి  చాలా మూల్యమే  చెల్లించు కునేలా చేస్తాయి మరి!

ఎందరో దర్శకులు- ఇంతే సంగతులు!
కేవలం అగ్రస్థానానికి చేరి సూపర్ స్టార్లతో సినిమాలు చేసే దర్శకులే ప్రతియేటా, లేదా రెండేళ్లకోసారి మరో సినిమాతో వచ్చే అవకాశాలు కన్పిస్తూం టాయి. మిగతా తొంభై శాతం చిన్నా చితకా సినిమాలకి ఇలా రిపీటయ్యే దర్శకులు ఒకరో ఇద్దరో వుంటారు. మిగిలిన వాళ్ళంతా ఆ ఏటికి ఒక సినిమా చేశామనిపించుకుని వెళ్ళిపోయే వాళ్ళే. ఈ సంవత్సరం విడుదలైన 85 చిన్న సినిమాల వైపు చూస్తే ఈ సంగతే బయట పడుతుంది. నందినీ రెడ్డి , నీలకంఠ, మోహన కృష్ణ ఇంద్రగంటి లాంటి ముగ్గురు నల్గురు తప్పితే మిగిలిన వాళ్ళంతా యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఎంట్రీ ఇచ్చిన కొత్త దర్శకులే. కొత్త నిర్మాతలు వచ్చి వెళ్లి నట్టే, ప్రతీ ఏటా అంతమంది కొత్త కొత్త దర్శకులు ముఖం చూపించి వెళ్లి పోతూంటారు. అయితే ఈ సంవత్సరం కాస్త తేడా చూపించి పెద్దహీరోల దృష్టిలో పడ్డ కొత్త దర్శకులు ముగ్గురున్నారు. ‘స్వామిరారా’ తో సుధీర్ వర్మ, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తో విజయకుమార్ కొండా, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ తో మేర్లపాక గాంధీ...ఈ ముగ్గురూ టాప్ రేంజిలోకి వెళ్ళిపోయారు.

అదే ‘జబర్దస్త్’ తో మళ్ళీ వచ్చిన హిట్ దర్శకురాలు నందినీ రెడ్డి గానీ, ‘చెమ్మక్ చల్లో’ తో వచ్చిన సీనియర్ దర్శకుడు నీలకంఠ గానీ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయారు. ‘అంతకుముందు ఆ తర్వాత’ తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటి మాత్రం యావరేజి టాక్ తో బయటపడ్డారు. సుప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ‘వెల్కం ఒబామా’ తోవచ్చి ఫ్లాపయ్యారు. ఇక ‘ప్రేమకథా చిత్రం’ అనే హిట్ తీసిన ఛా యాగ్రాహకుడు  జే.ప్రభాకర రెడ్డికి హిట్ దర్శకుడిగా చెప్పుకునే అవకాశమే లేకపోయింది. దాని ఘోస్ట్ డైరెక్షన్ అంతా ‘ఈ రోజుల్లో’ ఫేం మారుతి చేశారని చెప్పుకుంటారు. అలాగే మరో ప్రముఖ దర్శకుడు తేజ మరో యూత్ సినిమా ‘వెయ్యి అబద్ధాలు’ తో వచ్చి అట్టర్ ఫ్లాపయ్యారు. ఏడాది చివర్లో ( డిసెంబర్లో) విడుదలైన ‘సెకండ్ హేండ్’ దర్శకుడు ప్రతిభాగలవాడే అన్పించుకున్నా, ఎన్నుకున్న ప్రేమ కథ ఆఫ్ బీట్ కావడంతో మిశ్రమ స్పందనతో త్రిశంకుస్వర్గంలో వుండి పోవాల్సివచ్చింది.
అతితక్కువగా విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాలు ఒకటే చెబుతున్నాయి- తారాగణ బలం వుండ ని ఈ సినిమాలకి కథాబలంతో బాటు, పక్కా ప్లానింగే ప్రాణమని. అప్పుడు వాటి అఖండ విజయాలతో శాటిలైట్ హక్కులు ఊహించ లేనంత బోనస్ గా వచ్చి పడతాయని!

త్రీడీ- లేడీ జాంతానై!
ఈ సంవత్సరం రెండు త్రీడీ, నాలుగు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. ఎంత పాపులర్ హీరోలతో, హీరోయిన్లతో ఇలాటి ప్రయోగాలుచేసినా, బేసిగ్గా కథలేకపోతే గంగపాలే నని ఇవి నిరూపించాయి. అల్లరినరేష్ తో ‘యాక్షన్’ అనే త్రీడీ, కళ్యాన్ రాం తో ‘ఓం’ అనే మరో త్రీడీ కథ నాస్తి టెక్నికల్ హంగామా జాస్తి అన్నచందంగా తయారై నవ్వులపాలయ్యాయి. ‘ఓం’ త్రీడీ కి వ్యయం చేసిన పాతికకోట్లూ చేతికిరాలేదు. అదే విధంగా అనుష్కా, ఛార్మీ, ప్రియమణి, ఉదయభాను లతో వచ్చిన నాల్గు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బోల్తా కొట్టాయి. ఎంత క్రేజీ హీరోయిన్లయినా అర్ధంపర్ధం లేని కథలతో తీస్తే ఎవరుమాత్రం తట్టుకోగలరని? కావట్టి అనుష్కా ‘వర్ణ’, ఛార్మీ ‘ప్రేమ ఒక మైకం’, ప్రియమణి ‘చండీ’, ఉదయభాను ‘మధుమతి’ మతులుపోగొట్టి మట్టిలో కలిసిపోయాయి.
తాజాగా వచ్చే సంవత్సరం నయనతారతో శేఖర్ కమ్ముల తీస్తున్న ‘అనామిక’ ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

టాప్ స్టార్లు సగం సగం
ఈ ఏడు పదమూడుమంది టాప్ స్టార్లు తెరపైకి వచ్చారు. మహేష్ బాబు సోలోగా కాకుండా వెంకటేష్ తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్టయ్యింది. కానీ ఆతర్వాత వెంకటేష్ సోలోగా నటించిన షాడో, రాం తో కలిసి నటించిన మసాలా రెండూ ఫ్లాపయ్యాయి. రాం కూడా సోలోగా నటించిన ఒంగోలు గిత్త పరాజయం పాలయ్యింది. నాగార్జున నటించిన గ్రీకువీరుడు, భాయ్ రెండూ ఫ్లాపయ్యి ఆయన్ని డోలాయమానంలో పడేశాయి వెంకటేష్ కి లాగే. మరో సీనియర్ స్టార్ బాలకృష్ణ సినిమా ఈ ఏడు రిలీజ్ కాలేదు. మహేష్ బాబు తర్వాత ఎన్టీఆర్ ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాద్షా, రామయ్యా వస్తావయ్యా రెండూ తీవ్ర నిరాశ పర్చాయి. దీంతో కింకర్తవ్యం తోచడం లేదు. అరడజను వరస ఫ్లాపుల తర్వాత బలుపు తో బయట పడ్డా నన్పించుకున్న రవితేజ సైతం నిర్మాత దొరక్క, దొరికిన వాళ్ళు మారుతూ వచ్చి ఎలాగో తాజా సినిమా ప్రారంభించుకున్నారు. అల్లుఅర్జున్ ఇద్దరమ్మాయిలతో ఫ్లాపయ్యాడు. రాం చరణ్ తూఫాన్ తో ఘోరంగా తెలుగు, హిందీల్లో దెబ్బతిని, నాయక తో ఫర్వాలేదన్పించుకున్నాడు. నితిన్ మరోసారి హిట్టయ్యాడు. మంచు విష్ణు దూసుకె ళ్తా ఓకే అన్పించుకున్నా, సోదరుడు మనోజ్ పోటు గాడు తో బోల్తా పడ్డాడు. మిర్చీ అనే ఓకే  సినిమాతో వచ్చిన ప్రభాస్ హిట్టయ్యాడు. అందరికంటే పెద్దహిట్టిచ్చి (అత్తారింటికి దారేది)టాప్ చెయిర్ ని అలంకరిచిన స్టార్ గా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు!

వచ్చే సంవత్సరమైనా ఈ తప్పొప్పుల మూల్యాంకన చేసుకుని విజయాల్ని మరింతగా సొంతం చేసుకుంటారా? ఏమో!                                                                     

   -సికిందర్
-







2, జనవరి 2014, గురువారం

పెద్ద సినిమాల మాటే చిన్న సినిమాల బాట!

దర్శకుడు యసుజిరో ఒసు
స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ అన్నారు. టాలీవుడ్ ని చూస్తే  అదేమంత మరీ బాలీవుడ్ లా అడ్డదిడ్డంగా విస్తరించుకుని, అస్తవ్యస్త పనివిధానాలతో, ప్రవర్తనలతో గందరగోళమై ఏమీ కన్పించదు. క్రమశిక్షణకీ, సమయపాలనకీ సాక్షాత్తూ బాలీవుడ్ చేతే శభాష్ అన్పించుకుంటూ, రాష్ట్ర రాజధాని నగరంలో ఒక చిన్న టౌన్ షిప్ పరిమాణానికి కుదించుకుని, పరస్పరం సన్నిహితంగా మెలిగే సభ్యులతో,  ఒద్దికైన ఓ చిన్న కుటుంబంలా ముద్దుగా కన్పిస్తుంది. మరి ఇంత ముద్దొచ్చే బుల్లి టాలీవుడ్ తను అత్యధికంగా ఉత్పత్తి చేసే చిన్న బడ్జెట్ సినిమాలతో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ నానుడిని ఏమాత్రం నిజం చేయడం లేదెందుకని?

యువర్స్ ట్రూలీ టాలీవుడ్ నుంచి ఆల్రెడీ రక్తపాతాల భారీ బడ్జెట్ సినిమాలతో ఏ సీజన్లో నైనా రాష్ట్ర ఉష్ణోగ్రత అట్టుడికి పోతుంటుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు తగుదునమ్మాయని  చిన్న బడ్జెట్ సినిమాలుకూడా ఉష్ణోగ్రత పెంచెయ్యడ మెందుకు?

దేశం దాటుకుని అటు నైజీరియాని చూస్తే, లేదా ఇరాన్ ని చూసినా,   పోనీ దేశంలోనే ఏ కేరళనో, పశ్చిమ బెంగాల్నో చూసినా కూడా ఆ సినిమాలు తమదైన ఓ ప్రత్యేక  ముద్రతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్నాయి. గుర్తింపనేది ఊరికే ఆర్భాటాలు చేస్తే రాదు. ఆబోతుకి అచ్చోసి వదుల్తారు, అది గుర్తింపు కాబోదు. ఆబోతుల్ని ఎవరూ గుర్తించరు. లేగ దూడల్ని గుర్తిస్తారు. అవి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ కి ప్రతిరూపాలు. ఏ మాయామర్మాలూ తెలీని అమాయక జీవులు. ప్రకృతిని చూసి కుప్పిగంతులేస్తాయి. అంతేగానీ తమ పెద్దలైన ఆబోతుల్ని అనుకరించవు. నైజీరియా, ఇరాన్, కేరళ, పశ్చిమ బెంగాల్ సినిమాలు కూడా ఇలాటి ప్రకృతికి పరవశించే లేగదూడలే!

దేశంలో టాలీవుడ్ కూడా భిన్నత్వంలో ఏకత్వం లాంటిదే. ఇక్కడ చిన్న సినిమా, పెద్ద సినిమా, శాటిలైట్ సినిమాలనే కేటగిరీ లున్నాయి. పెద్దసినిమా స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఉమ్మడి కుటుంబాన్నివదిలేసి ఏనాడో హాలీవుడ్ ని అనుకరిస్తూ వెళ్ళిపోయింది. అది చేయిదాటి పోయింది. దాన్నేం చేయలేం. శాటిలైట్ సినిమా బాలీవుడ్ మల్టీ ప్లెక్స్ సినిమాలకి లాగే అస్తిత్వ సమస్యల్లో వుంది.  పూర్తిగా దానిది వ్యక్తిగత లాభార్జన యావే గనుక దాని కష్టనష్టాలు మనకక్కర్లేదు. ఇక మిగిలింది చిన్న బడ్జెట్ సినిమా. ఇది కూడా ఉమ్మడి కుటుంబపు నీతిని కాలదన్నేసి పెద్దసినిమాల్ని అనుకరిస్తూ వెళ్ళిపోయింది- పెద్దసినిమాలకి నవ్వులపాలయ్యే నకళ్ళు గా తయారై నూటికి తొంభై ఐదు శాతం వార్షిక ఫ్లాపులతో ఓ ఇరవై ఏళ్ల క్రితం లేని దురవస్థని దీనంగా అనుభవిస్తోంది - ఇంకేం చేసేది? అగ్గిపెట్టెలో సిరిసిల్ల పట్టుచీరని కూర్చే కళ ప్రసిద్ధి గాంచినట్టు, తెలిసినట్టు,  పెద్దసినిమాల ఆర్భాటా న్నంతా చిన్న సినిమాల్లో దూర్చాల నుకోవడం అత్యాశే!  

చిన్న సినిమా ఉజ్వల భవిష్యత్తు దాని చేతుల్లోనే వుంది. ప్రకృతికీ, సంస్కృతికీ  పట్టం గట్టగలిగేది చిన్న సినిమానే. ఎప్పుడయినా చిన్న చిన్న సినిమాల అందాల్ని అభివర్ణించడానికే బ్యూటీ అనే మాటని వాడతాం. చాలా అరుదుగా ఏ మణిరత్నమో, భన్సాలీనో తీసే కొన్ని భారీ సినిమాల్ని చూసి ఒహో బ్యూటీ అనొచ్చు.  తెలుగులో బ్యూటీ అన్పించే భారీ సినిమాలుండవు- ఈ శూన్యాన్ని భర్తీ చేసే బంగారు అవకాశం ఒక్క చిన్న సినిమాలకే వుంది. ఇది గుర్తించే పాపాన పోవడంలేదు!

‘గబ్బర్ సింగ్ ఎందుకు హిట్టయ్యిందో చూసి పాయింట్లు రాసుకు రండి, మన స్మాల్ బడ్జెట్ సినిమాకి కథ అదే వస్తుంది!’
‘బాద్షా, మిర్చీ, అత్తారింటికి దారేది సినిమాల్చూసి మన స్మాల్  యాక్షన్ కి కథ లాగించూ!’
‘అపరిచితుడికి బ్రహ్మానందాన్ని పెట్టుకుందాం, గజినీకి ఆలీ ఉన్నాడుగా, ఇక పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’కి ఎమ్మెస్ ని రమ్మనండీ, కామెడీ ఎందుకు పేలదో, ఏ ఆర్భకుడు ఎందుకు నవ్వడో చూద్దాం!’
ఇదీ వరస! పెద్ద సినిమాలనే, పెద్ద స్టార్లనే నే కాపీ  కొడితేనే  చిన్న సినిమా తయారవుతుంది, అంత శ్రమ పడక్కర్లేదు. సొంత క్రియేటివిటీ కాకరకాయా అక్కర్లేదు. ఒక జపాను దర్శకుడు ఉండేవాడు. పేరు యసుజిరో ఓజు. అప్పట్లో ఈయనకూడా హాలీవుడ్ సినిమాలకి ఉత్తేజితుడై, వాతలు పెట్టుకుని అలాటి సినిమాలే జపానులో తీయడం మొదలెట్టాడు. ఏమాత్రం వాటిలో జపాన్ అనే సొంత దేశ వాసనలు ఉండేవికావు. దీంతో కళ్ళు తెరచి, కప్పుకున్న హాలీవుడ్ గజచర్మం వదిలించుకుని, జపాన్ మధ్యతరగతి జీవితాలమీద దృష్టి సారించాడు. తను తీస్తున్న లోబడ్జెట్ సినిమాలతో ప్రక్షకుల్ని లోబర్చుకోవాలంటే, పిడికెడంత వాళ్ళ నిజజీవితాల్ని ప్రతిబిం బింబింపజేయడమే తప్పితే, ఎక్కడో హాలీవుడ్ బిగ్ కాన్వాస్ కథల్ని పట్టుకొచ్చి జపాన్ లోబడ్జెట్ ఇమడ్చడం కానే కాదన్న వృత్తి రహస్యం తెలుసుకున్నాడు. ఫలితమే ‘టోక్యో స్టోరీ’ అనే అజరామరమమైన చలన చిత్ర సృష్టి!
ఆతర్వాత ఈవరసలో తీసిన మరో యాభై సినిమాల వరకూ కథలూ పాత్రలూ మధ్యతరగతి జీవిత చట్రాన్ని దాటిపోలేదు. గొంతుమీద ఏ పెద్దనిర్మాత వచ్చి కత్తి పెట్టినా జపాన్ మధ్యతరగతి జీవితాల్న హాలీవుడ్ చట్రంలో చూడదల్చుకోలేదాయన. ఇలాటి నిబద్ధత కలిగిన దర్శకులే చిన్నసినిమాల అస్తిత్వ స్వస్థతలకి మార్గాదర్శకులవుతారు!

హాలీవుడ్ నుంచి తీసుకోవాల్సింది కథ చెప్పే టెక్నిక్ నే తప్ప, ఆ కథల్నే కాపీ కొట్టడం కాదన్న వ్యాపార సూత్రాన్ని  భారీ సినిమాలు ఏనాటికీ తెలుసుకోలేవు. తెలుసుకున్న నాడు అవికూడా విజయాల బాట పట్టొచ్చు. సినిమాలకి కథల్ని కాపీ కొడితే పరువు ప్రతిష్టలు పోకపోవచ్చు. కెరీర్ పరిసమాప్తం కాకపోవచ్చు. కానీ గుర్తింపు వుండే ప్రసక్తే లేదు. పెద్ద సినిమాలు వాటి భద్రతని ఇమేజి రక్ష కవచంలో చూసుకుంటున్నట్టు, చిన్న సినిమా దాని సేఫ్టీని పెద్ద సినిమాల్ని కాపీ కొట్టడంలోనే చూసుకుంటోంది. రెండూ నష్టాలే -  రెండిటి లోనూ ప్రవహించేది కాపీ రక్తమాంసాలే తప్ప సొంత సృజన కాదు కాబట్టి!
ఒక ప్రముఖ హిందీ నటుడు ఇంటర్వూలో చెప్పినట్టు, ఇవ్వాళ్ళ ప్రపంచీకరణ నేపధ్యంలో మన సినిమాలు నిజంగా ఆ నేపధ్యలో భాగం కాలేకపోతున్నాయి. ఏవో నాలుగు దేశాల్లో ఓవర్సీస్ వ్యాపారాలు చేసుకుని అదే గొప్పనుకుని   మిడిసి పడుతున్నాయి !

ఎందుకిలా? ఎందుకంటే, ఈ ఒవర్సీస్ వ్యాపారావకాశాలు పెద్దసినిమాలకే ఎక్కువుంటాయి. అవికూడా ఎన్నారైలు అధికంగా వుండే నాల్గైదు చోట్ల ఆడి సరిపుచ్చుకుంటాయి. కానీ ఎన్నారైల సాంద్రతతో నిమిత్తంలేకుండా, ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోగల శక్తి ఒక్క చిన్న సినిమాలకే వుంది. అవి మాత్రమే  తమతమ ప్రాంతాల్ని, సంస్కృతుల్నీ, జీవితాల్నీ ప్రపంచానికి దృశ్యం కట్టగలవు. సమాచార వినిమయ వాణిజ్యం  నాడినాడినీ స్పృశిస్తున్న ప్రస్తుత కాలంలో ప్రపంచమంతా- ‘ఏదీ మీ తెలుగు సినిమా – సారీ! – మీ చిన్న సినిమా? అదెక్కడా దాని ఒరిజినాలిటీతో కన్పించడదే? మా నాలెడ్జి బ్యాంకులో అలాటి మీ చిన్న సినిమా లేని లోటు తీవ్రంగా వుంది...త్వరగా పంపించండీ– అంటూ నోటీసులిస్తోంది. విదేశాల్లో తెలుగువాళ్ళే చూస్తే ఓవర్సీస్ వ్యాపారమన్పించుకోదు. భాషతో సంబంధంలేకుడా విదేశీయులందరూ చూసే సత్తా సంపాదించు కున్నప్పుడే అది ఓవర్సీస్ వ్యాపారమైనా, ప్రపంచీకరణ అయినా అన్పించుకోవడం!

చాలాచాల అలేజీగా ఏ రుచీపచీ వుండని బడా బడా సినిమాల్ని అడ్డదిడ్డంగా కాపీ కొట్టే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చేసినప్పుడు ఇంకెక్కడి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఆశలు!

-సికిందర్