రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జూన్ 2019, బుధవారం

843 ; స్క్రీన్ ప్లే సంగతులు - 3

Concluding part of  8 - 15 points have been  added to this article today, ie 20.6.19


లీనియర్ కథా విశ్లేషణ:
         
లీనియర్ కథలో మొదటి ప్లాట్ పాయింట్ తల్లీ కూతుళ్ళు వంశీని చంపితే, ప్రభాకర్ హెల్ప్ చేయడంగా; రెండో ప్లాట్ పాయింట్ ప్రభాకర్ పోలీసులకి లొంగి పోవడంగా వున్నాయి. నిజంగా జరిగితే రెండూ కరెక్టే స్ట్రక్చర్ విధుల రీత్యా. కానీ ఈ రెండిట్లో మొదటిది నిజంగా జరగలేదు. ఇదే సమస్య. ప్రపంచ సినిమా చరిత్రలో నిజంగా జరగని సంఘటనతో ప్లాట్ పాయింట్ వన్ రావడం ఇదే బహుశా. ఇదే విచిత్రం, ఇదే వింత. 

         
ల్లీ కూతుళ్ళు వంశీని చంపే దృశ్యంగానీ, ఆ తర్వాత ప్రభాకర్ హెల్ప్ చేసిన వైనంగానీ నిజంగా జరిగినవి కావు. డిసిపి కార్తికేయ ఊహాగానం మాత్రమే. సెకండాఫ్ లో అతను ఊహించి దృశ్యాన్ని అల్లి చెప్పినట్టుగా చూశాం. దీన్నే లీనియర్ కథ అర్ధమవడానికి ప్లాట్ పాయింట్ వన్ లో సెట్ చేసి, లీనియర్ కథ  రాయాల్సి వచ్చింది. కార్తికేయ తను జయంతి ఫ్లాట్ కెళ్ళినప్పుడు డోర్ చైన్ తోబాటు గ్రానైట్ దిమ్మె డ్యామేజీ అయివుండడాన్ని గుర్తు చేసుకుని, హత్యా దృశ్యాన్ని అల్లాడు. వంశీ వచ్చి మీటర్ రీడింగ్ అంటూ డోర్ బెల్ నొక్కిందగ్గర్నుంచీ, తల్లి కూతుళ్ళు అతణ్ణి చంపిన విధానం, ఆ తర్వాత ప్రభాకర్ వచ్చి హెల్ప్  చేస్తాననడం వరకూ దృశ్యాన్ని అల్లి చెప్పాడు. ఈ ఊహా గానాన్నే లీనియర్ కథలో ప్లాట్ పాయింట్ వన్ గా వాడుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందో తల్లీకూతుళ్ళు గానీ, ప్రభాకర్ గానీ చెప్తేనే నిజ సంఘటనగా నమ్మ వీలవుతుంది. కార్తికేయ ఊహించి చెప్తే కాదు. అంటే ప్లాట్ పాయింట్ వన్ లేనట్టే భావించాల్సి వస్తుంది. ఊహాజనిత ప్లాట్ పాయింట్ వన్ తో కథ వుండదుగా అంటే, ఇలా వుంటుందని దర్శకుడు భావించాడంతే, మనమేం చేస్తాం?         

      మనతో సహా ఈ కథలో ఎవ్వరికీ తెలీదు - అసలు తల్లీ కూతుళ్ళు వంశీని చంపారా, ప్రభాకర్ వాళ్లకి హెల్ప్ చేశాడా అన్న విషయం - కేవలం ఆ తల్లీ కూతుళ్ళకీ, ప్రభాకర్ కీ  తప్ప! ఊహాగానాలతో వాళ్ళ మీద అన్యాయంగా నిందమోపి వాళ్ళని క్షమించి వదిలెయ్యడం పెద్ద మనసు అన్పించుకోదు, కేసుని తేల్చలేని చేతగాని తనమన్పించు కుంటుంది. ఇలా పోలీసు ఉన్నతాధికారుల పాత్రచిత్రణలు లోపభూయిష్టంగా మారాయి, ఊహాజనిత ప్లాట్ పాయింట్ వన్ వల్ల. 

ఎందుకు హెల్ప్ చేశాడు?
          సినిమాలో చూపించినట్టుగా నాన్ లీనియర్ కథనంలో ఏం చేశారంటే, సూపర్ మార్కెట్ లో వంశీని చూసి జయంతి పారిపోయి రావడం, తల్లితో కలిసి భయపడుతూ వుంటే, డోర్ బెల్ మోగడం, అప్పుడు ‘ఎవరూ?’ అంటే, ‘మీటర్ రీడింగ్’ అంటూ సమాధానం రావడం (మీటర్లు ఫ్లాట్ లో వుంటాయా?) వరకూ చూపించి కట్ చేసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సెకండాఫ్ లో కార్తికేయ ఊహాగానంతో మాత్రమే దృశ్యం వేసి చూపించారు. దీనివల్ల మొత్తం కేసు దర్యాప్తే  అనుమానాస్పదమవడంతో బాటు, బూటకపు ప్లాట్ పాయింట్ వన్ సీను వచ్చింది. కథకూడా బూటకంగా తయారయింది. ‘మీటర్ రీడింగ్’ అన్న తర్వాత ఏదో సస్పెన్స్ పోషిద్దామనుకుని కట్ చేశారు. ఈ కట్ అవడం కట్ అవడం మొత్తం స్క్రిప్టులోంచి అన్నీ కట్ అయిపోయాయి. 

          కార్తికేయ ఊహాగానం కూడా పరిపూర్ణం కాదు, పాత్ర చిత్రణల్లేవు. ఈ సీన్ని ఊహాగానంగా కాకుండా నిజంగా చూపించి వుంటే, అంటే ‘మీటర్ రీడింగ్’ అన్న తర్వాత కంటిన్యూ చేసివుంటే ప్లాట్ పాయింట్ వన్ గా వుండడమే గాక, ప్లాట్ పాయింట్ వన్ ధర్మాల్ని నిర్వర్తించేది. పాత్ర చిత్రణల్ని సమగ్రం చేసేది. పైగా కథ పట్ల నమ్మకం కల్గించేది.

         కార్తికేయ ఊహాగానంతో తల్లీ కూతుళ్ళు వంశీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో మనకి అర్ధమైనా, అసలు ప్రభాకర్ ఎందుకు హెల్ప్ చేయడానికి వచ్చాడో అర్ధంగాదు. చనిపోయిన అతడి భార్య మానస జయంతి లాగే వుందని మనకి తెలుసు. ఆ ఫీలింగ్ తో హెల్ప్ చేయడాని కొచ్చాడా? అయితే అదిక్కడ చెప్పించి క్లియర్ చేయాలి. ఆ తల్లీ కూతుళ్ళు అడగాలి – మీరెందుకింత రిస్కు తీసుకుంటున్నారని. జయంతికి అనుమానాలు వచ్చేయాలి. ‘రోజూ మీరు బయటి వరకూ నన్ను ఫాలో అవుతున్నారెందుకు? ఒన్ సైడ్ లవ్వా? ఇప్పుడీ హెల్ప్ చేసి నన్ను మీ గ్రిప్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? సారీ, నేనింకో వంశీని కోరుకోవడం లేదు, ప్లీజ్ లీవ్...’ అనెయ్యాలి. 

          అతను మనసులో మాట చెప్పుకోలేని వ్యధ ననుభవించాలి -  ‘నువ్వు నా చనిపోయిన భార్యలాగే  వున్నావన్న ఫీలింగ్ తో ఫాలో అయ్యా, హెల్ప్ చేసున్నా’- అన్నాకూడా దొరికిపోతాడు. ఆమె అనుమానాల్ని నిజం చేసిన వాడవుతాడు. ఇదెలా కొలిక్కి వచ్చిందనేది ఇక్కడ చెప్పి ముందుకెళ్లాలి. ప్లాట్ పాయింట్ వన్ వరకూ బిగినింగ్ విభాగంలో జరిగిన సంబంధిత విషయాలు కొలిక్కి వచ్చేయాలి. అప్పుడే అర్ధం, బలం. పాత్ర చిత్రణలు కూడా సవ్యంగా వుంటాయి. 

     కానీ ఏం జరిగిందంటే, ఈ మొత్తం హత్యా దృశ్యాన్ని, అంటే ప్లాట్ పాయింట్ వన్ సీనుని – దీని తర్వాత శవాన్నిమాయం చేయడాన్నీ ఖండ ఖండాలు చేసి, ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ గా చూపడంతో, ప్రభాకర్ మనసులోనిమాట - అసలెందుకు హెల్ప్ చేయాలనుకున్నాడో -  సినిమా ముగింపులో అతడి చేతే  జయంతికి చెప్పించాల్సి వచ్చింది. నాన్ లీనియర్ కథకి ఇలా దాచి ముగింపులో చెప్పడం మంచిదే.

          అయితే ఇందువల్ల జయంతి పాత్ర డమ్మీ అయింది. ముగింపులో కూడా అతణ్ణి ప్రశ్నించలేని, అతను చెప్పిందే నమ్మాలన్న పాసివ్ నెస్ కి మారిపోయింది. నాన్ లీనియర్ కథనంలో సీన్ల ఏకత్వం చెదిరిపోక తప్పదు. దీంతో కొన్ని నష్టాలూ తప్పవు. ఇందుకే నాన్ లీనియర్ కథనాల్లో ప్లాట్ పాయింట్స్ తెలియవు, వీటిని లీనియర్ గా మార్చి చూసినప్పుడే లోపాలు సహా తెలుస్తాయి. 

మరికొన్ని లోపాలు :

          లీనియర్ కథని వరసగా చూసుకుంటూ వస్తే ఈ కింది కథన లోపాలతో వుంటుంది. అంటే నాన్ లీనియర్ కథనంలో ఈ లోపాలు తొలగిపోయాయని కాదు. లీనియర్ కథ వచ్చిందే నాన్ లీనియర్ ఆర్డర్ లోంచి. లోపాలు నాన్ లీనియర్ లోనే వున్నాయి. 

           1. మార్నింగ్ జయంతి ఆఫీసు కారెక్కి ఆఫీసుకి పోతూ ఏదో గుర్తు కొచ్చినట్టు సూపర్ మార్కెట్ దగ్గరాప మంటుంది. ఆ టైంలో షాపింగ్ చేయడమేమిటి. పైగా ఏం షాపింగ్ చేయడానికి వచ్చిందో లోపలికి వెళ్ళాక కూడా తెలీదు. రోజూ కారులో వుండే కొలీగ్ కూడా ఇప్పుడుండదు. అంటే వంశీ ఆమెని కనిపెడితే ఆమె పారిపోవడం కోసం, తద్వారా వచ్చే సీన్ల కోసం, కావాలని ఆమెని మధ్యలో సూపర్ మార్కెట్ లోకి పంపించారన్న మాట షాపింగ్ నెపంతో అసహజంగా. 

         2. కార్తికేయకి లాడ్జిలో వ్యక్తి  మిస్సయ్యాడని ఫోరెన్సిక్ టీముతో వెళ్ళినప్పుడు- ఇలాటి సీన్లు చూడడడం చాలా తమాషాగా వుంటుంది - ఆ ఫోరెన్సిక్ టీము లోపలికి వచ్చి - మనం ఏం వూహిస్తూ వుంటామో అదే చేసి పారేస్తారు!  చాలా సినిమాల్లో లాగే, గ్లవ్స్ తొడుక్కోకుండా ఉత్త చేతులతో వస్తువులు ముట్టుకుంటారు, తర్వాత గ్లవ్స్ తొడుక్కుంటారు! ఇప్పుడు కూడా ఫోరెన్ ‘సిక్’ మహానుభావుడు రూమ్ లోకి రాగానే ఉత్త చేత్తో లైటు స్విచ్ వేస్తాడు, తర్వాత గ్లవ్స్ తొడుక్కుంటాడు - శవ్వ శవ్వ!! ఇక్కడకొచ్చిందే సాక్ష్యాధారాల సేకరణ కోసం. ఆ సాక్ష్యాధారాల్ని తన వేలిముద్రలేసి కలుషితం చేస్తున్నానన్న ఇంగితం కూడా వుండి చావదు. 

           3. ఇక్కడ కొచ్చింది బీచ్ రోడ్డులో కాలిన గుర్తు తెలియని శవాన్ని కనుగొన్న నేపధ్యంలో. ఈ లాడ్జి కొచ్చాక ఈ రూము వంశీ బుక్ చేసుకున్నాడని తెలుస్తుంది. అప్పుడు కాలిన శవం వేలిముద్రలతో ఇక్కడి వేలిముద్రల్ని టాలీ చేసి, కాలిన శవం వంశీదని డిక్లేర్ చేస్తాడు ఫోరెన్ ‘సిక్’ మహానుభావుడు! లీనియర్ కథలో కాలిన శవం ప్రభాకర్ హత్య చేసిన అలీదని మనం తెలుసుకున్నాం. ఆ అలీ వేలిముద్రలతో ఈ వంశీ వేలిముద్రలెలా కలిశాయి?  అలీ శవం వంశీ శవమెలా అయిపోయింది? దీనికి డిసిపి కార్తికేయ గారు సమాధానం చెప్పాల్సి వుంది. 

          4. 
హెల్ప్ లేకుండా ఇద్దరు లేడీస్ చంపి శవాన్ని తెచ్చి బీచ్ రోడ్డులో పడెయ్యడమా... ఎవరో హెల్ప్ చేసి వుండాలనీ, అతను లవరై వుండొచ్చనీ పై అధికారి విశ్లేషణ. ఎవరో ఎందుకు హెల్ప్ చేయాలి. ఆ లేడీసే వంశీని బీచ్ రోడ్డుకి రప్పించి ఫినిష్ చేసి వుండొచ్చుగా? వేలిముద్రల్ని అనుకూలంగా మార్చుకుని, అలీ శవాన్ని ఇంకా వంశీ దని నమ్ముతున్నాడు విశ్లేషణాధికారి కూడా. 

           5. ప్రభాకర్ జయంతికి కాల్ చేసి పోలీసులకి ఏం చెప్పావని అంటాడు. మీరు చెప్పిందే చెప్పామంటుంది. అతను చెప్పింది, మనమధ్య కాంటాక్ట్స్ వున్న విషయం బయట పెట్టవద్దని మాత్రమే.

     6. డిసిపి కార్తికేయ తల్లీ కూతుళ్ళని ప్రశ్నించినప్పుడు ఎవరో బ్లాంక్ కాల్స్ చేస్తున్నాడని తల్లి అంటుంది. ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారో కార్తికేయ తెలుసుకోవచ్చు. తల్లీ కూతుళ్ళ కాల్ లిస్ట్స్ కూడా తెప్పించుకుని పరిశీలించ వచ్చు. అప్పుడు ప్రభాకర్ కాల్స్ అందులో తెలిసిపోతాయి. ఇక ఆమె గూగుల్ మ్యాప్స్ హిస్టరీని కూడా చెక్ చేస్తే, ఏఏ రోజు ఏఏ సమయాల్లో ఎక్కడెక్కడుందో డేటా అంతా తెలిసి పోతుంది. ఇవేవీ చెయ్యడు. ఆమె సోషల్ మీడియా ఎక్కౌంట్స్  ని కూడా చెక్ చెయాలనుకోడు.  భూతద్దం మాత్రం పట్టుకుని వుంటాడు. 

           7. కార్తికేయ ప్రభాకర్ ఫ్లాట్ దగ్గర నిఘా వేసినప్పుడు, జయంతిని అనుసరించి వస్తూ కనపడతాడు ప్రభాకర్. వాళ్ళు మాట్లాడుకోకుండా ఎవరి దారిని వాళ్ళు  వెళ్లిపోతూంటే, వాళ్ళిద్దరికీ ఏ సంబంధమూ లేదని నిర్థా రించుకుంటాడు కార్తికేయ. హత్య కేసులో అనుమానితులుగా వున్న ఇలాటి వాళ్ళు సంబంధమున్నట్టు కన్పిస్తారా? అసలు జయంతి తన భార్యలా వుందని ప్రభాకర్ ఇంకా ఫాలో కావడమేమిటి? కేసు నేపధ్యంలో కాంటాక్ట్ వున్నట్టు కన్పించ కూడదని తనే ఆమెకి జాగ్రత్త చెప్పాక కూడా? ఇప్పుడు కథ మిడిల్ లో వుంది. ఈ ఫాలో అయ్యే వ్యవహార మంతా కేసుకి పూర్వం బిగినింగ్ విభాగం లోనిది. ఇది ఆటోమేటిగ్గా ప్లాట్ పాయింట్ వన్ లో హత్య తర్వాత అతను  హెల్ప్ ఆఫర్ చేసినప్పుడు కొలిక్కి వచ్చేస్తుంది- పైన చెప్పుకున్నట్టు, ‘మీరెందుకింత రిస్కు తీసుకుంటున్నారు? రోజూ మీరు బయటి వరకూ నన్ను ఫాలో అవుతున్నారెందుకు? ఒన్ సైడ్ లవ్వా? ఇప్పుడీ హెల్ప్ చేసి నన్ను మీ గ్రిప్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? సారీ, నేనింకో వంశీని కోరుకోవడం లేదు, ప్లీజ్ లీవ్...’ అని సహజాతిసహజంగా జయంతి అనడం ద్వారా, ఈ ఫాలో అయ్యే వ్యవహారం ముగిసిపోవాలి. కానీ ప్లాట్ పాయింట్ వన్ లేకపోవడం వల్ల, పాత్రచిత్రణల్లేక, ఇలా మిడిల్లో ఈ విషమ పరిస్థితిలో  కూడా ఆమెని ఫాలో అవుతూ తిరుగుతున్నాడు మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్!
(మిగిలిన భాగం రాత్రి)



Added on 20.6.19
      8.  ఒక కానిస్టేబుల్ వచ్చి ప్రభాకర్ ఎవరో తెలిసిందని వెబ్ సైట్లో చూపిస్తాడు. ప్రభాకర్  ని ఐపీఎస్ అధికారిగా  పేర్కొంటూ వున్న ఆ న్యూస్ చూసి స్టన్ అవుతాడు కార్తికేయ...అలీ గ్యాంగ్ ని పట్టుకున్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్ అని రివీలవుతుంది. ఇది చాలా విచిత్రంగా వుంటుంది. వంశీ హత్య కేసు సందర్భంగా కార్తికేయ ప్రభాకర్ ని ఒకసారి  కలిసి ఆరా తీశాడు. అప్పుడు ప్రభాకర్  మాజీ ఐపీఎస్సే నని గుర్తుపట్టకుండా వుంటాడా, ఈ రాష్ట్రంలోనే పని చేసినప్పుడు? గుర్తు పట్టడమే కాదు, అతడి గతమంతా తెలిసి కూడా వుండాలి. అతడి భార్య మానసని అలీ చంపాడనే విషయం సహా. ఆ తర్వాత అతను జాబ్ కి రిజైన్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడన్న విషయంతో బాటు.  ఈ నేపథ్యమంతా ప్రభాకర్ ని కలిసినప్పుడే గుర్తుకు రావాలి సాటి ఐపీఎస్ అయిన కార్తికేయకి, ఇప్పుడు వెబ్ సైట్లో చూపిస్తే కాదు. ఇది చాలా సిల్లీ. ఈ నేపథ్యంలో ఇంకో అనుబంధ  అంశమేమిటంటే, ఐపీఎస్ అధికారియైన ప్రభాకర్ భార్య హత్య కేసు నమోదు కాలేదా? పోలీస్ శాఖ దర్యాప్తు చేయకుండా వదిలేశారా? ఈ సినిమా ఇలా తీయడానికి వదిలేసి వుంటారు. 

          ఇక ప్రభాకర్ ఐపీఎస్ అని రివీలయ్యాక, అలీ గ్యాంగ్ ని వెంటాడుతున్న దృశ్యంతో ఇంటర్వెల్ వేశారు. అంటే ఐపీఎస్ కార్తికేయ పాయింటాఫ్ వ్యూలోనా? కాదు, దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో. ఇదేం చిత్రణో అర్థం గాదు, కథకి శిల్పం గిల్పం లేకుండా అల్పం. వెబ్సైట్లో చూడగానే కార్తికేయ తన పాయింటాఫ్ వ్యూలో ఈ షాట్ వేసుకోవడానికి అతడికి ప్రభాకర్ గురించేమీ తెలీదు- ఇంటర్వెల్ తర్వాత ఇంకో పై అధికారిని అడుగుతాడు ప్రభాకర్ గురించి.
ఇలా వుంది వ్యవహారం!     
     
          కాబట్టి ఇక్కడ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి ప్రభాకర్ ని ఐపీఎస్ గా చూపిస్తూ మధ్యలో దర్శకుడు తన పాయింటాఫ్ వ్యూతో ఎంటరవుతూ ఇంటర్వెల్ షాట్ వేసుకున్నాడు.  అలీ గ్యాంగ్ ని వెంటాడుతూ సడెన్ గా ఇదెలా వుంటుందంటే, ఏదో మూస మాస్ ఫార్ములా సినిమా లోంచి ముక్క వచ్చి పడ్డట్టుంటుంది. జానర్ మర్యాద చెడి రసభంగం కూడా అవుతుంది.

          9. సెకెండాఫ్ ప్రారంభంలో ఐపీఎస్ కార్తికేయ, ఇంకో పై అధికారికి కాల్ చేసి ప్రభాకర్ గురించి అడుగుతాడు. ప్రభాకర్ మాజీ ఐపీఎస్ అధికారి అనీ, అతడి గురించిన సమాచారం అతడి దగ్గర  పని చేసిన కోలా వెంకట్ అనే ఎస్సై కి తెలుసనీ అంటాడు పై అధికారి. కార్తికేయ కోలా వెంకట్ ని కలుసుకుంటాడు. ప్రభాకర్ చాలా మంచి ఆఫీసర్ అనీ, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నామనీ, ఆయన రెండేళ్ళ క్రితం రిజైన్ చేశారనీ అంటాడు కోలా వెంకట్. 

          ఈ ఎస్సై కోలా వెంకట్ కూడా ఎంత సిల్లీ ఫెలో అంటే, ప్రభాకర్ గురించి అన్ని విషయాలు చెప్పిన వాడు, ఎందుకు రిజైన్ చేశాడో చెప్పడు. ప్రభాకర్ భార్య మర్డరయిన ముఖ్య విషయమే గాలి కొదిలేసి మాట్లాడతాడు. అసలు ప్రభాకర్ గురించి అడగగానే అతడి ముఖం విషాదమవ్వాలి. కాకుండా తన్మయత్వంతో ప్రభాకర్ గుణగణాలు చెప్తాడు. 

        10. కార్తికేయ తిరిగి వచ్చి ప్రభాకర్ ని కలుస్తాడు. ఆ తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామనీ, ఇన్ఫర్మేషన్ కావాలనీ అంటాడు.  వాళ్ళనే పట్టుకుని అడగ మంటాడు ప్రభాకర్. ఇంతకీ కార్తికేయ కోలా వెంకట్ దగ్గర తెలుసుకున్న పనికొచ్చే ముక్కేమిటి? ఏమీ లేదు, మంచి వాడన్న పొగడ్తలు తప్ప. ఎందుకు రిజైన్ చేశాడని కూడా అడగాల్సిన అసలు ప్రశ్న అడగడు. ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ దగ్గరకి అనవసరంగా వచ్చి, తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామని అంటాడు. అసలు అనుమానాలు రావాల్సింది ప్రభాకర్ మీద. ఇప్పుడు కూడా అతడికి ప్రభాకర్ భార్య హత్య  గురించి ఏమీ తెలీదు. మీరెందుకు రిజైన్ చేశారని కూడా అడగడు. ఈ విషయం తను ఫోన్ చేసినప్పుడు ఆ ఇంకో పై అధికారియే క్లియర్ చేసి వుండాలి. అతనేమో కోలా వెంకట్ ని కలవమన్నాడు. కోలా వెంకట్ సోది చెప్పాడు.  

          ఇది ప్లాట్ పాయింట్ - 2 కి దారి తీసే పించ్ - 2 సీను. ఆ తల్లీ కూతుళ్ళనే పట్టుకుని అడగమని ప్రభాకర్ అనడం. తల్లీ కూతుళ్ళని కాపాడుతున్న వాడు నోరు జారి అనేశాడా? ఏమో తెలీదు. ఎక్కడా పాత్రల మనసులో ఏముందో బయట పెట్టాలనుకోడు దర్శకుడు, మనకి తోచింది మనం వూహించుకోవాలంతే.

          11. కార్తికేయ పై అధికారి నాజర్ ని కలుస్తాడు. ప్రభాకర్ కి జయంతితో కాంటాక్ట్ వుండి వంశీ హత్య విషయంలో ఆమెకి హెల్ప్ చేసివుంటే, కాంటాక్ట్ లేనట్టే  రోజూ ఉదయం ఆమెని ఎందుకు ఫాలో అవుతున్నాడని అంటాడు నాజర్. అంటే నాజర్ ఉద్దేశంలో ప్రభాకర్ హెల్ప్ చేయలేదు. మరెవరు చేశారు?

     12. తల్లీ కూతుళ్ళనే పట్టుకు అడగండని కార్తికేయతో అనేసినందుకు తల్లీ కూతుళ్ళని ప్రమాదంలోకి నెట్టాడని తనే వెళ్లి లొంగి పోతాడు ప్రభాకర్. ఇది ప్లాట్ పాయింట్ టూ సీను. వంశీని తనే హత్య చేశానంటాడు. తను చేసిన అలీ హత్యని వంశీ హత్యగా వర్ణించి చెప్తాడు. అంటే ఇప్పుడు కూడా అలీ శవాన్ని వంశీ శవంగానే నమ్ముతాడు కార్తికేయ తెలివితక్కువగా. లావుగా వున్న అలీ శవాన్ని బక్కగా వుండే వంశీ శవమనుకుంటాడు. విచిత్రంగా. ఇక  తల్లీ కూతుళ్ళనే పట్టుకు అడగమన్న ప్రభాకర్ ఇప్పుడొచ్చి లొంగిపోతే ఆంతర్యం ఆలోచించడు కార్తికేయ.  

          13. ప్రభాకర్ ని సైకియాట్రిస్టు విచారిస్తాడు. జయంతిని ప్రేమిస్తున్నానంటాడు ప్రభాకర్. నువ్వు జయంతిని ప్రేమించలేదు, వూహించుకుని చెప్తున్నావని అంటాడు సైకియాట్రిస్టు. ఇతడి మాటలు నిరాధారాలని కార్తికేయకి  చెప్పేస్తాడు.  కేస్ క్లోజ్ అని కార్తికేయకి నాజర్ చెప్పేస్తాడు. కేసుని ఏదో రకంగా కొలిక్కి తేవాలన్నట్టు సైకియాట్రిస్టు ఏదో సర్టిఫికేట్ ఇచ్చేస్తే, అది పట్టుకుని నాజర్ కేసు క్లోజ్ అనడం సిల్లీ. 

          14. హత్య రాత్రి 8 - 9 మధ్య జరిగినట్టు పీఎం రిపోర్టు వుందనీ, ఆ సమయంలో తల్లీ కూతుళ్ళ ఎలిబీలు చెక్ చేశాననీ, వాళ్ళు ఇంటి దగ్గరే వున్నారనీ, 8.30 కి వాటర్ బాయ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు చూశాడనీ, ఆ తర్వాత వాళ్ళు చంపి శవాన్ని తీసి కెళ్ళి బీచ్ రోడ్డులో పడేసి తగులబెట్టారనుకున్నా, 9 గంటలకి బీచ్ రోడ్డులో మంటని చూసినట్టు సాక్షి చెప్పినప్పుడు - అంత స్వల్ప వ్యవధిలో తల్లీ కూతుళ్ళు శవాన్ని తీసుకుని బీచ్ రోడ్డుకి చేరుకోవడం అసాధ్యమనీ, కనుక వాళ్ళని అనుమానించ లేమనీ వివరిస్తాడు నాజర్. తల్లీ కూతుళ్ళే చంపి వుంటే,  వంశీనే బీచ్ రోడ్డుకి రప్పించి చంపి వుంటారని ఇప్పటికీ ఎందుకను కోడు? వాళ్ళు  ఫ్లాట్ లోనే చంపారని ఇప్పుడు కార్తికేయ ఊహాగానం చేసినందుకా? ఆ ఊహాగానానికి సాక్ష్యా ధారాలేమున్నాయి? సాక్ష్యాధారాలకోసం కనీసం ఆ ఫ్లాట్ ని సీజ్ కూడా చేయలేదు. కేవలం డోర్ చైను, గ్రానైట్ దిమ్మె - ఈ రెండూ హత్య జరిగిందనేందుకు నిదర్శనా లవుతాయా? 

        15. కార్తికేయ జిల్లా వార్తల్లో ఒక కేసు చూస్తాడు – 4 వ తేదీ నదిలో కొట్టుకు వచ్చిన మంత్రి తమ్ముడు వంశీ శవం గురించి. ఆ శవాన్ని ప్రభాకరే  నదిలో పడేశాడనీ, అది పక్క జిల్లాకి కొట్టుకు పోయి దొరికితే అది జిల్లా వార్త అవుతుంది తప్పితే ప్రముఖ వార్త అవదని అనుకున్నాడనీ అంటాడు.  అసలు మంత్రి తమ్ముడి  శవం దొరికితే అప్రధాన వార్త అవుతుందా? జిల్లా ఎడిషన్ లో వేసి వదిలేస్తారా? ఐపీఎస్ ఇలాగే ఆలోచిస్తాడా? పైగా ఈ సీను ఎంత నిర్లక్ష్యంగా తీశారంటే. అతను చదివేది జిల్లా ఎడిషన్ కూడా కాదు. ‘ఈనాడు’ మెయిన్ ఎడిషన్. ఇది కూడా ఊహాగానమే. ప్రభాకరే  శవాన్ని నదిలో పడేశాడనడానికి ఏ సాక్ష్యాధారమూ లేదు. 

          ఇలా ఇన్ని పొసగని విషయాలతో ఈ హత్యా దర్యాప్తు కథ వుంది. నాన్ లీనియర్ గా ముక్కలు చేసి చూపించడంతో లొసుగులు తెలియడం లేదు. ఇక నాన్ లీనియర్ కథా కమామిషు చూద్దాం...

సికిందర్

17, జూన్ 2019, సోమవారం

842 : స్క్రీన్ ప్లే సంగతులు - 2


లీనియర్ కథ
            ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ) ఒక ఐపీఎస్ ఆఫీసర్. మానస (ఆషిమా నర్వాల్) ని చూసి ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. వూళ్ళో కాంట్రాక్ట్ కిల్లర్ అలీని, అతడి గ్యాంగ్ నీ పట్టుకునే ప్రయత్నాల్లో వుంటాడు. ఘర్షణలో కొంత మంది గ్యాంగ్ మెంబర్స్ చచ్చిపోతారు. అలీ దొరుకుతాడు. అతను పగబట్టి తప్పించుకుని ప్రభాకర్ భార్య మానసని హత్య చేస్తాడు. అతణ్ణి  పట్టుకోవడానికి ప్రభాకర్ విజృంభిస్తాడు. ఇక చంపడమే లక్ష్యంగా పెట్టుకుని జాబ్ కి రిజైన్ చేసి, వెతుక్కుంటూ వైజాగ్ వచ్చి మకాం పెడతాడు. 

          ఎదుటి ఫ్లాట్ లో అచ్చం మానస లాగే వున్న జయంతి (ఆషిమా నర్వాల్), తల్లి (సీత) తో వచ్చి దిగడంతో స్టన్ అవుతాడు. ఆమె తల్లి కోరిక మేరకు లగేజి సాయం పడుతూ క్లోజ్ గా ఆమెని చూస్తాడు. అప్పట్నుంచీ ప్రతీరోజూ ఆమె ఆఫీసు కెళ్ళాడానికి ఫ్లాట్ డోర్ తీసుకుని బయటికి రాగానే, తనూ డోర్ తీసుకుని కాకతాళీయంగా వచ్చినట్టు ఆమెని కింద ఆఫీసు కారుదాకా అనుసరించి, పక్క కెళ్ళి పోవడం మొదలెడతాడు.

          ఇది గమనించిన జయంతి కోలీగ్ అతడి గురించి హెచ్చరిస్తుంది. అతనలాటి వాడు కాదని మందలిస్తుంది జయంతి. ప్రభాకర్ ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూంటాడు. కానీ సరిగ్గా వెళ్ళడు. అతణ్ణి చూస్తేనే భయమేస్తుందని వాపోతుంది రిసెప్షనిస్టు. ఇంకా అలీ అన్వేషణలో వున్న ప్రభాకర్ ని ఒక ఇన్ఫార్మర్ కలిసి లొకేషన్ షేర్ చేస్తానంటాడు. ఆ లొకేషన్ లో అలీ వుంటాడు. అలీ అనుచరుడు అలీకి సమాచారమిస్తాడు. ప్రభాకర్ కోటిని చంపేశాడనీ, బాబ్జీ కోమాలో కెళ్ళిపోయాడనీ అంటాడు. ఇక్కడికి ప్రభాకర్ వచ్చేటప్పటికి అలీ తప్పించుకుంటాడు. 

        మర్నాడుదయం జయంతితో అదే ఫాలోయింగ్ రిపీట్ చేస్తాడు ప్రభాకర్. ఆమె కారెక్కి వెళ్తూ ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపమంటుంది. దిగి లోపలికి వెళ్తుంది. కావాల్సిన వస్తువు చెక్ చేస్తూంటే ఒకడు గమనించడం కంటబడుతుంది. అతణ్ణి చూసి ఆమె పారిపోతూంటే వెంటాడతాడు. ఆమె తప్పించుకుని ఫ్లాట్ కొచ్చేసి తల్లికి చెప్తుంది వంశీ వైజాగ్ వచ్చేశాడని. ఇద్దరికీ భయాందోళనలు మొదలవుతాయి. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. భయపడుతూ ‘ఎవరూ?’ అంటే, ‘మీటర్ రీడింగ్’ అని వాయిస్ వస్తుంది. జయంతి తల్లి డోర్ తీయగానే జొరబడిపోతాడు వంశీ.

          అతడితో పెనుగులాడి పెనుగులాడి, కేబుల్ మెడకి చుట్టి లాగి చంపేస్తారు తల్లీ కూతుళ్ళు. ఈ శబ్దాలు విని ప్రభాకర్ వస్తాడు. పరిస్థితి చూసి హెల్ప్ చేస్తానంటాడు. వాళ్ళు నేను చంపానంటే నేను చంపానని నేరం మీదేసుకుని లొంగి పోతామంటారు. మీలో ఎవరు నేరంమీదేసుకున్నా మరొకర్ని పోలీసులు వదలరని అంటాడు. ఐతే ఇద్దరం లొంగిపోతామంటారు. లొంగిపోతే లొంగి పోవచ్చు గానీ, కేసులోంచి తప్పించుకోవాలంటే మాత్రం బాడీని మాయం చేయాలంటాడు. ఇతనెవరో చెప్పమంటాడు. ఇతను  మంత్రి తమ్ముడు, రెండేళ్ళ నుంచి జయంతి తనని పెళ్లి చేసుకోవాలని వేధి స్తూంటే తప్పించుకుని వైజాగ్ వచ్చేశారు. ఇది కనుక్కుని వచ్చేసి దాడి చేశాడు. ఇ
ది ఫిబ్రవరి 4 పగలు జరిగిన సంఘటన. 

        ఫిబ్రవరి 6  రాత్రి 8 - 9 గంటల మధ్య, బీచ్ రోడ్డు మైదానంలో ప్రభాకర్ తన భార్యని చంపిన అలీని చంపేసి పెట్రోలు పోసి నిప్పంటిస్తాడు. తెల్లారి సమాచారమందుకుని డీసీపీ కార్తికేయ (అర్జున్) వచ్చి, మొహం పూర్తిగా కాలిపోయిన శవాన్ని చూస్తాడు. వేలి ముద్రలు చెడకుండా చేతులు బాగానే వుంటాయి. ఇతనెవరో గుర్తు పట్టడానికి ఒకే ఒక్క ఆధారంగా ప్యాంటుకి టైలర్ లేబుల్ వుంటుంది. ఒక సాక్షి వచ్చి, రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇక్కడ మంట చూశానంటాడు.  

          అటు ప్రభాకర్ జయంతికి కాల్ చేసి, ప్రాబ్లమేం లేదుగా అనడుగుతాడు. పోలీసులు వస్తే తామిద్దరికీ కాంటాక్ట్ వున్న విషయం చెప్పవద్దంటాడు. కార్తికేయ పోస్ట్ మార్టం రిపోర్టు తెలుసుకుంటాడు. మరణం రాత్రి 8
- 9 గంటల మధ్య జరిగి వుండాలి. వూపిరి తిత్తుల్లోకి పొగ చేరలేదు కాబట్టి, చనిపోయిన తర్వాత అగ్నికి ఆహుతై వుండాలి. తాడు లేదా కేబుల్ నుపయోగించి ఊపిరి  తీసి వుండాలి. ఇంతలో లాడ్జిలో ఒక గెస్ట్ మిస్సయ్యాడని సమాచారం వస్తుంది. 

          ప్రభాకర్ కారు నడుపుకుంటూ పోతూంటాడు. పక్క సీట్లోకి చూస్తాడు. ఖాళీగా వుంటుంది. మళ్ళీ చూస్తాడు. మానస కన్పిస్తుంది. ఎక్కడికి తీసి కెళ్తున్నావని అడు గుతుంది. వెళ్ళాక నీకే  తెలుస్తుందని అంటాడు. ఇప్పుడే చెప్పమంటుంది. మళ్ళీ చూస్తే  ఆమె వుండదు. కారు నది దగ్గరాపుతాడు. కారులోంచి ప్యాక్ చేసిన వంశీ శవాన్ని తీసి నదిలో పడేస్తాడు. 

         
లాడ్జిలో ఒక గెస్ట్ మిస్సయ్యాడని వచ్చిన సమాచారంతో ఫోరెన్సిక్ టీముతో వెళ్తాడు కార్తికేయ. అక్కడ వేలి ముద్రలు కాలిన శవం వేలి ముద్రలతో సరిపోతాయి. ఆ లాడ్జిలో దిగింది వంశీ అనీ, అతనే హత్యకి గురయ్యాడనీ అభిప్రాయాని కొస్తాడు కార్తికేయ. 

          వంశీ గురించి తెలుసుకుంటే అతను మంత్రి కొడుకు. జయంతిని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్నాడు
.  ఈ సమాచారంతో జయంతినీ, ఆమె తల్లినీ అనుమానించి ప్రశ్నిస్తాడు కార్తికేయ. అప్పుడు వాళ్ళ డోర్ చైనూ, లోపల గ్రానైట్ దిమ్మే డ్యామేజి అయి వుండడాన్ని ఓరకంట గమనిస్తాడు. వంశీ ఎవరో తెలియదంటారు వాళ్ళు. ఫిబ్రవరి 6 తేదీ రాత్రి ఎక్కడున్నారని అడుగుతాడు. ఆఫీసు నుంచి లేటుగా వచ్చానని అంటుంది జయంతి.

          కార్తికేయ వెళ్ళిపోతూ, ఎదుటి ఫ్లాట్ దగ్గరికి తిరిగొస్తాడు. ఫ్లాట్ లో వున్న ప్రభాకర్ ని చూసి, ఆ తల్లీ కూతుళ్ళ గురించి ఆరా తీస్తాడు.  జయంతి గురించి తెలియదంటాడు ప్రభాకర్. వాళ్ళు అనుమానాస్పదంగా ఏమీ లేరంటాడు. తర్వాత ప్రభాకర్ జయంతికి కాల్ చేసి, పోలీసులకి ఏం చెప్పారని అడుగుతాడు. మీరేం చెప్పమన్నారో అదే చెప్పామని అంటుంది.

          ప్రభాకర్ కి మానస మెదులుతుంది. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావ్ అనడుగుతుంది. ఆమెతో రోమాన్స్ చేసిన దృశ్యం మెదులుతుంది. కార్తికేయ వెళ్లి జయంతి కొలీగ్ ని విచారిస్తాడు. ఆమె జయంతికి బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తుంది. వంశీ గురించి కూడా చెప్పలేదంటుంది.  ఫిబ్రవరి 6 రాత్రి 8 -9 గంటల మధ్య ఆమె ఎక్కడుందని అడుగుతాడు. ఆ తర్వాత వెళ్లి పై అధికారి (నాజర్) ని కలుస్తాడు.  హెల్ప్ లేకుండా ఇద్దరు లేడీస్ చంపి శవాన్ని తెచ్చి బీచ్ రోడ్డులో పడెయ్యడమా... ఎవరో హెల్ప్ చేసి వుండాలనీ, అతను లవరై వుండొచ్చనీ అంటాడు పై అధికారి.

        కార్తికేయ ఇంకో జయంతి కొలీగ్ ని విచారిస్తాడు. జయంతి ఎదుటి ఫ్లాట్ లో వున్న ప్రభాకర్ ప్రవర్తన గురించి చెప్తుంది కొలీగ్. మార్నింగ్ ప్రభాకర్ ఫ్లాట్ దగ్గర నిఘా వేస్తాడు కార్తికేయ. ముందు జయంతి బయటికి వచ్చి కారెక్కి వెళ్ళిపోతుంది. ఆమె వెనకాలే వచ్చిన ప్రభాకర్ జాగింగ్ చేస్తూ వెళ్లి పోతూంటాడు. వాళ్ళిద్దరికీ ఏ సంబంధమూ లేదని నిర్థారించుకుంటాడు కార్తికేయ. 

           ఒక కానిస్టేబుల్ వచ్చి ప్రభాకర్ ఎవరో తెలిసిందని వెబ్ సైట్లో చూపిస్తాడు. ప్రభాకర్  ని ఐపీఎస్ అధికారిగా  పేర్కొంటూ వున్న ఆ న్యూస్ చూసి స్టన్ అవుతాడు కార్తికేయ...అలీ గ్యాంగ్ ని పట్టుకున్న ఐపీఎస్ అధికారి ప్రభాకర్...
          ఐపీఎస్ ప్రభాకర్ అలీ గ్యాంగ్ ని వెంటాడుతున్న దృశ్యంతో ఇంటర్వెల్.
***
          కార్తికేయ పై అధికారికి కాల్ చేసి ప్రభాకర్ గురించి అడుగుతాడు. ప్రభాకర్ మాజీ ఐపీఎస్ అధికారి అనీ, అతడి గురించిన సమాచారం అతడి దగ్గర  పని చేసిన కోలా వెంకట్ అనే ఎస్సై కి తెలుసనీ అంటాడు పై అధికారి. కార్తికేయ కోలా వెంకట్ ని కలుసుకుంటాడు. ప్రభాకర్ చాలా మంచి ఆఫీసర్ అనీ, ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నామనీ, ఆయన రెండేళ్ళ క్రితం రిజైన్ చేశారనీ అంటాడు కోలా వెంకట్. 

          ప్రభాకర్ ఐపీఎస్ మీద  దృశ్యాలు వస్తాయి. అలీ గ్యాంగ్ ని వెంటాడడం, అలీని పట్టుకుంటే అతను పగతో అరవడం వగైరా. ఈ వార్త న్యూస్ పేపర్లో ప్రముఖంగా వస్తుంది. 

          ఇక కార్తికేయ తిరిగి వచ్చి ప్రభాకర్ ని కలుస్తాడు. ఆ తల్లీ కూతుళ్ళని అనుమానిస్తున్నామనీ, ఇన్ఫర్మేషన్ కావాలనీ అంటాడు.  వాళ్ళనే పట్టుకుని అడగ మంటాడు ప్రభాకర్. కార్తికేయ పై అధికారి నాజర్ ని కలుస్తాడు. ప్రభాకర్ కి జయంతితో కాంటాక్ట్ వుండి వంశీ హత్య విషయంలో ఆమెకి హెల్ప్ చేసివుంటే, కాంటాక్ట్ లేనట్టే  రోజూ ఉదయం ఆమెని ఎందుకు ఫాలో అవుతున్నాడని అంటాడు నాజర్. 

       ప్రభాకర్ వర్రీ అవుతాడు. వెళ్లి లొంగి పోతాడు. వంశీని తనే హత్య చేశానంటాడు. అపార్ట్ మెంట్ లో వంశీ తన కెదురై జయంతి గురించి అడుగుతూంటే, వాళ్ళు బీచ్ రోడ్డుకి మారిపోయారని దారి మళ్ళించాననీ, రాత్రి బీచ్ రోడ్డులో వున్నఅతణ్ణి  చంపేశాననీ అంటాడు. 

          కార్తికేయ జయంతిని ప్రశ్నిస్తాడు. ప్రభాకర్ గురించి తనకేమీ తెలీదని అంటుంది. ప్రభాకర్ ని సైకియాట్రిస్టు విచారిస్తాడు. జయంతిని ప్రేమిస్తున్నానంటాడు ప్రభాకర్. మానసని కార్లో తీసుకుపోతున్న అదే దృశ్యాన్ని మళ్ళీ వూహించుకుంటాడు. ఒక చోటికి చేరుకున్నాక  పెళ్లిని ప్రతిపాదిస్తాడు. నువ్వు జయంతిని ప్రేమించలేదు, వూహించుకుని చెప్తున్నావని అంటాడు సైకియాట్రిస్టు. ఇతడి మాటలు నిరాధారాలని కార్తికేయకి  చెప్పేస్తాడు.  కేస్ క్లోజ్ అని కార్తికేయకి నాజర్ చెప్పేస్తాడు.

          కార్తికేయ ఒప్పుకోడు. తను జయంతి ఫ్లాట్ కెళ్ళినప్పుడు డోర్ చైన్, గ్రానైట్ దిమ్మె డ్యామేజీ అయివుండడాన్ని గుర్తు చేసుకుని, హత్యా దృశ్యాన్ని అల్లుతాడు. వంశీ వచ్చి మీటర్ రీడింగ్ అంటూ డోర్ బెల్ నొక్కిందగ్గర్నుంచీ, తల్లి కూతుళ్ళు అతణ్ణి చంపిన విధానం, ఆ తర్వాత ప్రభాకర్ వచ్చి హెల్ప్  చేస్తాననడం వరకూ దృశ్యాన్ని అల్లి చెప్తాడు. 

          హత్య రాత్రి 8 - 9 మధ్య జరిగినట్టు పీఎం రిపోర్టు వుందనీ, ఆ సమయంలో తల్లీ కూతుళ్ళ ఎలిబీలు చెక్ చేశాననీ, వాళ్ళు ఇంటి దగ్గరే వున్నారనీ, 8.30 కి వాటర్ బాయ్ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు చూశాడనీ, ఆ తర్వాత వాళ్ళు చంపి శవాన్ని తీసి కెళ్ళి బీచ్ రోడ్డులో పడేసి తగులబెట్టారనుకున్నా, 9 గంటలకి బీచ్ రోడ్డులో మంటని చూసినట్టు సాక్షి చెప్పినప్పుడు - అంత స్వల్ప వ్యవధిలో తల్లీ కూతుళ్ళు శవాన్ని తీసుకుని బీచ్ రోడ్డుకి చేరుకోవడం అసాధ్యమనీ, కనుక వాళ్ళని అనుమానించ లేమనీ వివరిస్తాడు నాజర్. 

       కార్తికేయ జిల్లా వార్తల్లో ఒక కేసు చూస్తాడు – 4 వ తేదీ నదిలో కొట్టుకు వచ్చిన మంత్రి తమ్ముడు వంశీ శవం గురించి. వెంటనే ఎలర్ట్ అవుతాడు. ఇప్పుడు కేసు అర్ధమైనట్టు ప్రభాకర్ తో చెప్తాడు. వంశీ హత్య 6 వ తేదీ కాదు, 4 వ తేదీన జరిగిందనీ. ఆ శవాన్ని ప్రభాకర్ నదిలో పడేశాడనీ, అది పక్క జిల్లాకి కొట్టుకు పోయి దొరికితే అది జిల్లా వార్త అవుతుంది తప్పితే ప్రముఖ వార్త అవదని అనుకున్నాడనీ, అసలు వంశీని తను చంపలేదనీ, చంపిన తల్లీ కూతుళ్ళని కాపాడడానికి శవాన్ని మాయం చేశాడనీ, ఆతర్వాత 6 వ తేదీ రాత్రి బీచ్ రోడ్డులో  అలీని హత్య చేసి ఆ శవాన్ని వంశీగా నమ్మించే ప్రయత్నం చేశాడనీ చెప్పుకొస్తాడు. 

          ప్రభాకర్ జయంతిని  కలిసి సరెండర్ అవుతున్నట్టు చెప్తాడు. చెయ్యని హత్యకి మీరెందుకు సరెండర్ అవాలని అంటుందామె. అప్పుడు మానస గురించి చెప్తాడు. మానస లాగే వున్న నిన్ను చూసి హెల్ప్ చేశాను, సరెండర్ అవుతున్నది వంశీ హత్యలో కాదు, మానసని చంపిన అలీని చంపిన కేసులో... కాబట్టి మీరు సేఫ్ అంటదు.  ఆమె ఏడుస్తుంది.      

         లొంగిపోయిన ప్రభాకర్ కార్తికేయతో చెప్తాడు  - జయంతి భయపడితే తట్టుకోలేననీ, ఆమె భయం పోగొట్టడానికి ఎన్ని హత్యలైనా చేస్తాననీ అంటాడు. చేయని హత్య గురించి పిచ్చిగా మాట్లాడుతున్నాడనీ, తన భార్యని చంపిన అలీని చంపినా, ఆ తల్లీ కూతుళ్ళ పట్ల మానవత్వంతో ప్రవర్తించి నేరం తన మీదేసుకున్నాడనీ, ఇలాటి ఐపీఎస్ ని మనం కాపాడుకోవాలనీ, కేసు క్లోజ్ చేస్తాడు నాజర్.
(విశ్లేషణ రేపు) 

 
సికిందర్  
telugurajyam.com




13, జూన్ 2019, గురువారం

841 : స్క్రీన్ ప్లే సంగతులు


'కిల్లర్’ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చేశారు. నాన్ లీనియర్ అంటేనే ఫ్లాష్ బ్యాకులతో వుండేది. ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ గా వుండొచ్చు, అనేక ఫ్లాష్ బ్యాకులుగానూ వుండొచ్చు. ‘కిల్లర్’  లో ఒకటికంటే ఎక్కువ హత్యలతో వేర్వేరు కథలున్నాయి. దీంతో ఒకటి కంటే  ఎక్కువ, అంటే మల్టిపుల్ ఫ్యాష్ బ్యాక్యులతో కూడిన నాన్ లీనియర్ కథనం ఏర్పాటయింది. వీటిలో రెండు హత్యలకి సంబంధించి ప్రెజెంట్ టైం కథనంలో రెండు సమాంతర కథనాలు వుంటాయి. అంటే మొత్తంగా చూస్తే మల్టిపుల్ మర్డర్స్ కి, మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో, నాన్ లీనియర్ కథనమన్న మాట. ఇలా ఇంతటి సంక్లిష్టతతో మల్టీపుల్ మర్డర్స్ మిస్టరీలని, మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో, నాన్ లీనియర్ కథనం చేసినప్పుడు, కథలో లాజిక్కులు మిస్సయిపోయాయి. అసలు కథకి పునాది వంటి మౌలిక అంశమే  గల్లంతై పోయింది. ఇవి పైకి మామూలు కంటికి కనపడవు. ఎందుకంటే ప్రేక్షకులకి ఫ్లాష్ బ్యాకుల్ని జోడించుకుని చూడంతోనే, కాలంలో ముందుకూ వెనక్కీ అవుతున్న కథనాన్ని అతికించుకుంటూ ఫాలో అవడంతోనే సరిపోతుంది. లోపాలు తెలిసేంత అవకాశం వుండదు. 

          కానీ లాజిక్కే, కామన్ సెన్సే  హత్య కేసు దర్యాప్తు కథల్ని నడిపేది. క్లూస్ ఆధారంగా గొప్ప విశ్లేషణలు చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు లాజిక్ ని ఎగేసి, కామన్ సెన్సు లేకుండా ప్రవర్తిస్తే, ఆ దర్యాప్తు అధికారుల పాత్రలు హాస్యాస్పదంగా వుంటాయి. ఫార్ములా కథలకి లాజిక్కులు అవసరం లేని సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవచ్చేమో. మాస్, యాక్షన్, అడ్వెంచర్ తదితర కథలని ఫార్ములా కథలుగా తీస్తున్నప్పుడు కథనంలో లాజిక్ అవసరం లేకపోవచ్చేమో (వుంటే చాలా మంచిది). హత్య దర్యాప్తు కథలు వేరు. వీటిని లాజిక్ లేకుండా ఫార్ములా కథలుగా చేస్తే సిల్లీగా వుంటాయి. ఫార్ములా కథల్లో హీరో ఎడాపెడా చంపేస్తే కేసు కాదు, కథ అది కాదు కాబట్టి. దర్యాప్తు కథల్లో ఒక హత్యయినా సరే, అదే కథవుతుంది. హంతకుణ్ణి పట్టుకోవడానికి ఆ హత్యని కూలంకషంగా శోధించి, మూల్యాంకన చేసి, నేరాన్ని రుజువు చేయడం వుంటుంది. 

          టీవీలో ఎఫ్ఐఆర్, సిఐడి లవంటి క్రైం ఇన్వెస్టిగేషన్ షోలు చూస్తే అవెంత ప్రొఫెషనల్ గా, పక్కాగా వుంటాయో తెలుస్తుంది. ఈ టీవీ షోల స్థాయిని సినిమాలు అందుకోలేకపోవడం ప్రొఫెషనల్స్ గా వుండే నేటి నయా మేకర్ల కాలంలో చాలా బ్యాడ్. సినిమా అనగానే కథతో చులకన భావం, అలసత్వం. ఇలా వుంటే సరిపోతుందిలే నని చుట్టేయడం. పోలీస్ ప్రోసీజురల్ జానర్ గురించి జ్ఞానం లేకపోయినా వాటిమీద చేతులు వేయడం. పోలీసు పాత్రల్ని తమలాగే తెలివి తక్కువ వాళ్ళుగా చిత్రించుకోవడం. 

          నేరస్థుడు తప్పే చేస్తాడు. తప్పు చేసి కూర్చుంటాడు. ఆ తర్వాత వాడికి ఏ బాధ్యతా లేదు. జీతాలు తీసుకుంటున్న పోలీసులకే బోలెడు పని పెడతాడు. వాడొక్క క్షణంలో నేరం చేసేసి కూర్చుంటాడు. అది రుజువు చేయడానికి పోలీసులకి క్షణాల మీద క్షణాలు లక్షల క్షణాలు పడతాయి. వాడు బుర్ర లేకుండా నేరం చేసినా రుజువు చేయాలంటే ఎన్నో బుర్రలు మంటెక్కి పోతాయి. ఇలా సినిమాల్లో జరుగుతుందా? ఊహుఁ, బుర్ర వాడకుండా మాట్లాడుతూంటారు పోలీసులు. ‘కిల్లర్’ లో అర్జున్, నాజర్ ల పోలీసు పాత్రలు – ఉన్నత పోలీసు అధికారుల పాత్రలు! – బుర్ర లేకుండా మాట్లాడుతూంటాయి. కిల్లర్ అయిన విజయ్ ఆంటోనీ యేమో హయిగా  కూర్చుని చూస్తూ వుంటాడు...

          ఈ కథకి మూలం విజయ్ ఆంటోనీ మాజీ ఐపీఎస్ అధికారి పాత్ర. అతడితోనే కథ మొదలవుతుంది. అలాంటప్పుడు అతడి బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఆలోచించాలి, కథ చేయాలి. రెండేళ్ళ క్రితం అతడి భార్య హత్యకి గురైన విషయమే తెలియనట్టు ఐపీఎస్ పాత్రలైన అర్జున్, నాజర్ లు కేసు దర్యాప్తు చేస్తూంటే ఎలా వుంటుంది? ఐపీఎస్ భార్య హత్యకి గురైతే ఐపీఎస్ వర్గాలకి తెలియక పోతుందా? పెద్ద న్యూస్ కాకుండా పోతుందా? ఆమె ఎలా వుండేదో ఆ రూపం గుర్తుండక పోతుందా? అప్పుడు అచ్చం ఆమెని పోలిన హీరోయినే ఇప్పుడు కన్పిస్తూంటే, అదీ విజయ్ ఆం టోనీతోనే వుంటే, ఇదేమిట్రా బాబూ అన్పించదా, సినిమా చూస్తున్న మనకే అన్పిస్తూంటే? 

          కథకి పునాది అయిన ప్రశ్నార్థకమైన ఈ మౌలికాంశం మల్టీపుల్ మర్డర్స్ తో, మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల నాన్ లీనియర్ (ఎంఎంఎన్) కథనంలో పైకి కనపడకుండా పోయింది. ఇంకా అనేక తప్పులు కూడా మరుగున దాగి వున్నాయి. ఎంఎంఎన్ లాంటి కథకి స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే, ఆ నాన్ లీనియర్ ఆర్డర్ నే కార్డుల మీద రాసుకుని, వాటిని లీనియర్ గా ఆర్డర్ లో పేర్చుకుంటూ రావాలి. ఇలా చేయడానికి రెండో సారి సినిమా చూడాల్సి వచ్చింది. లీనియర్ ఆర్డర్ లో పేర్చుకుంటే,  కథ ఎప్పుడు ఎక్కడ మొదలై ఎలా కొనసాగిందో ఆద్యంతాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇలా లీనియర్ ఆర్డర్ గా సీన్లని విడగొట్టి చూసినప్పుడు కథకి పునాది వేసిన మౌలికాంశంతో బాటు, మరికొన్ని పాత్రలకి, కథనానికీ అడ్డుపడే లాజిక్కులు బయటపడ్డాయి. సినిమాయే కదా అని దర్యాప్తు కథలకి సృజనాత్మక స్వేచ్ఛ తీసుకుంటామంటే చెల్లదు. దర్యాప్తు కథలంటేనే ప్రేక్షకుల మెదడుకి మేత వంటివి. మెదడుకి శ్రమ పెట్టేవి. అవి సవ్యంగా వుండి తీరాలి.

          ఏ సినిమా అయినా రెండుసార్లు చూసి రివ్యూలు రాయమంటారు నిపుణులు. ప్రింట్ మీడియా కాలంలో ఒకసారి చూసినా ఆలోచించి రాయడానికి వారం టైం వుండేది. ఆన్ లైన్ల కాలంలో గంటలో రాసేయాల్సిన పరిస్థితి. రెగ్యులర్ సినిమాలకి రాసేయ్యొచ్చు. ‘కిల్లర్’ లాంటి  నాన్ రెగ్యులర్ సంక్లిష్ట సినిమాలకి కష్టం. ఇలా స్క్రీన్ ప్లే సంగతులు రాసినప్పుడే అసలు సిసలు స్థితిగతులు తెలుస్తాయి. 

          ముందుగా లీనియర్ గా కథెలా వుందో చూద్దాం...






11, జూన్ 2019, మంగళవారం

840 : సరదాగా కాసేపు!


        దేశంలో 18 భాషల్లో ప్రాంతీయ సినిమాలున్నాయి. ఇవి ఆర్ట్ సినిమాల బాట వదిలేసి కమర్షియల్ సినిమాల రూటులో కొచ్చి కళాకారుల్నీ, ఉపాధి అవకాశాల్నీపెంచుకుంటూ పరవళ్ళు తొక్కుతున్నాయి. వీటి స్థితిగతులేమితో ఒకసారి చూద్దాం...
         
ప్రపంచంలోనే   హాలీవుడ్ ని అనుసరించి నామకరణం చేసుకున్న మొట్టమొదటి సినిమా పరిశ్రమ టాలీవుడ్ అని చరిత్రలో నమోదైంది. దక్షిణ కోల్ కతా లోని ఒక ప్రాంతం టోలీగంజ్. ఇక్కడే 1920 లలో సినిమా పరిశ్రమ ఆవిర్భవించింది. దీంతో ఈ ప్రాంతం పేరు మీదుగా టాలీవుడ్ అని నామకరణం జరుపుకున్నారు. టాలీవుడ్ ఆర్ట్ సినిమాలకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని తెలిసిందే. మహాదర్శకుడు సత్యజిత్ రే దీనికి కారకుడు. అయితే ఇది జరగడానికి ఓ 24 ఏళ్ల  కాలం పట్టింది. కానీ సినిమాల పరంగా ఎంత పేరు సంపాదించుకున్నా, బెంగాలీ కమర్షియల్ సినిమాలకి కేంద్రంగా టాలీవుడ్ మార్పు చెందినా, హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమల స్థాయికి మాత్రం చేరుకోలేకపోతోంది. 

         
*నేటి తుళు సినిమా కామెడీల మయమైంది. మసాలా జోకులతో నవ్వించడమే సినిమాగా మారింది. ఒకనాటి సీరియస్ వాస్తవిక సినిమాలు ఇప్పుడు లేవు. వరసగా ఎన్ని కామెడీలు వస్తున్నా విసుగు లేకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. కామెడీ కి సస్పెన్స్ – యాక్షన్ కలగలిపి సినిమాలు తీసి సక్సెస్ అవుతున్న కె. సూరజ్ శెట్టి ఇప్పుడు డిమాండ్ లో వున్న  దర్శకుడు. గత రెండు సినిమాలూ ఇలాటివి తీశాక, ఇంకో థ్రిల్లర్ కామెడీ విడుదల చేశాడు. ఇదీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడింది. ఇందులో కుళ్ళు జోకులు, అసభ్య దృశ్యాలు లేవని ముందే ప్రచారం చేశాడు. ‘అమ్మర్ పోలీస్’ అని తీసిన ఈ కామెడీ థ్రిల్లర్ కి ‘నో ప్లాయ్ ట్రిక్స్, ఓన్లీ ఫన్నీ ట్రిక్స్’ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు.

      *త్యజిత్ రే ని పరిచయం చేయడమంటే సూరుణ్ణి పరిచయం చేయడం లాంటిదే. ఈ లోకానికి  సూర్యుడెంతో, సమాంతర సినిమా జగత్తుకి సత్యజిత్ రే అంత. తమ ఆలోచనల కోసం, విధానాల కోసం, కళ కోసం సత్యజిత్ రే వైపు చూడని ప్రపంచ  సినిమా కళాకారులు లేరు. అంతగా ఆయన జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర రంగాలని ప్రభావితం చేశారు. ఆయన ప్రారంభమయింది 1955 లోనే. అదీ పథేర్ పాంచాలి’  అనే సమాంతర సినిమాతోనే. సమాంతర సినిమానే  వాస్తవిక సినిమా అనో, ఆర్ట్ సినిమా అనో అంటున్నాం. పథేర్ పాంచాలి’  అంటే పాటల బాట అని అర్ధం. నిజంగానే ఆయన ఈ కళా సృష్టితో తనకూ, సినిమా లోకానికీ  ఒక పాటల  బాటనే  ఏర్పర్చారు. సినిమాని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకు వెళ్ళా లంటే  అనుసరించాల్సిన బాటలెన్నింటినో ఆయనిందులో పొందుపరచారు. అది భావోద్వేగాల ప్రకటన కావొచ్చు, సంగీతం కావొచ్చు, ఛాయాగ్రహణం కావొచ్చు, నటనలూ కావొచ్చు. అమెరికాలో ఎనిమిదేళ్ళ వయసులో ఓ కుర్రాడు పథేర్ పాంచాలిని  చూసి తీవ్రంగా కదిలిపోయాడు. అది అతణ్ణి సినిమా దర్శకుడు అయ్యేంతవరకూ వెంటాడింది. అలాటి  సత్యజిత్ రే ప్రభావంతో  ఆయన టాక్సీ డ్రైవర్’ ‘రేజింగ్ బుల్’ , ‘డిపార్టెడ్’  వంటి అద్భుత చలన చిత్రాల్ని రూపొందించాడు. ఆయనే హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కార్ససీ.

         
*రాష్ట్రావతరణతో బాటు సినిమావిర్భావం  ఒకేసారి జరిగిన రాష్ట్రం ఏదైనా వుందంటే  అది మణిపురే. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ప్రాంతీయ సినిమాలు నిర్మిస్తున్న రాష్ట్రం కూడా ఇదే. అత్యధిక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకునే రాష్ట్రం కూడా ఇదే.  దేశంలో డిజిటల్ లో మొట్ట మొదటి సినిమా తీసింది కూడా మణిపూర్ లోనే. 1972 లో మణిపూర్ రాష్ట్రం ఏర్పడిందో లేదో అదే సంవత్సరం తెలుపు – నలుపులో  మాతం – గి మణిపూర్’  (నేటి మణిపూర్) అనే తొలి మణిపురి సినిమా వెలువడింది. దీనికి  చాలా కాలం ముందు,1948  లోనే తొలి  సినిమా ప్రయత్నం జరిగింది గానీ అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆ సంవత్సరం తలపెట్టిన ‘మైను పెంచా’ నిధులు సమకూరక మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. నిర్మాతలు మణిపూర్ మహారాజా ని ఆశ్రయించారు. కానీ అప్పటి రెండో ప్రపంచ యుద్ధపు పరిస్థితుల్లో మహారాజా ఆర్ధిక సాయం చేయలేకపోయాడు. తిరిగి 1972 వరకూ మణిపురి సినిమా ఆలోచన ఎవరూ తలపెట్టలేదు. అయితే 1949  లో మణిపూర్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడంతో దీన్ని వ్యతిరేకిస్తూ తీవ్రవాద బీజాలు అప్పుడే పడ్డాయి. తర్వాతి కాలంలో ఈ పరిణామం మణిపురి సినిమాలు నిర్మించుకోవడానికి మంచి మేలే చేసింది. 

       *దేశంలో ఆయా ప్రధాన భాషల్లో సినిమా రంగాలున్నాయి. ఒక్కోటీ వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల పరిశ్రమలుగా అభివృద్ధి చెందాయి. కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రధాన భాషలో సినిమాలు ఇంకా ఎదగని లఘు పరిశ్రమలుగానే  వున్నాయి. అయితే ఒక ప్రధాన భాషకి మాండలికంగా వున్న భాషలో ప్రాంతీయ సినిమా పరిశ్రమ రెండు వేల కోట్ల బృహత్ పరిశ్రమగా ఎదగడం ఒక్క చోటే జరిగింది. అది భోజీ వుడ్ లో. భోజీ వుడ్ ఉత్పత్తి చేస్తున్న భోజ్ పురి సినిమాలు తెలియని వారుండరు.  పశ్చిమ బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్ లతో బాటు, నేపాల్ లోని మధేష్ ప్రాంతంలో  మాట్లాడే భోజ్ పురి భాష హిందీకి ఒక మాండలికంగా వుంది. 25 కోట్ల మంది భోజ్ పురి ప్రేక్షకులు గల విస్తారమైన  మార్కెట్ తో,  ఏడాదికి 75 సినిమాలు నిర్మించే రెగ్యులర్ మూవీ ఇండస్ట్రీగా ఇవ్వాళ్ళ  భోజీ వుడ్ వర్ధిల్లుతోంది. 

         
*ప్రాంతీయ సినిమాల వరసే మారిపోయింది. పేరుకు స్థానిక  భాష తప్ప ప్రాంతీయమనేది ఏమీ వుండడం లేదు. ఎక్కడెక్కడి ప్రాంతీయ సినిమాలూ -  ఉత్తరాదిలోనైతే హిందీ కమర్షియల్స్ కి, దక్షిణాదిలో నైతే తెలుగు, తమిళ కమర్షియల్ సినిమాలకి అనుకరణలుగా, కృత్రిమంగా మారిపోయాయి. ప్రాంతీయ సినిమాలు వాటి స్థానిక జీవితాల్ని, సమస్యల్నీ చర్చించే వాస్తవిక కథా చిత్రాలనే గుర్తింపునే కాదు, మొత్తం వాటి అస్థిత్వాన్నే కోల్పోక తప్పని పరిస్థితులేర్పడ్డాయి. ఆయా ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులే ఆ పరిస్థితులకి కారణమవుతున్నాయి. ప్రపంచీకరణకు పూర్వం వున్న తరం చూసిన జీవితం, ఎదుర్కొన్న సమస్యలూ వేరు. ప్రపంచీకరణ అనంతర తరానికి దృష్టి కానుతున్న విషయాలు వేరు. ఈ దృష్టికి జీవితాలూ, సమస్యలూ కాదు – ఆనందాలూ సుఖ సంతోషాలే కనపడుతున్నాయి. అందుకని సినిమాలంటే ఫక్తు ఎంటర్ టైనర్లే కావాలి. దీన్ని ముందుగానే గమనించి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు సొమ్ము చేసుకోవడం మొదలెట్టాయి. ఎంత కమర్షియల్ సినిమాలైనా వాటిలో కూడా  అప్పుడప్పుడు సామాజిక కథా చిత్రలనేవి వచ్చేవి. ఐతే  ప్రపంచీకరణా, తరం మారిన ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులూ కలగలిసి,  2000 నుంచీ హిందీ తెలుగు తమిళ సినిమాలు ఫక్తు కాలక్షేప పాప్ కార్న్ ఎంటర్ టైనర్లుగా మారిపోయి పల్లెపల్లెకూ దూసుకెళ్ళడం మొదలెట్టాయి. వందల కోట్ల బడ్జెట్లతో పల్లెల్లో ఈ సినిమాలు కళ్ళు మిరుమిట్లు గొల్పుతూంటే ఇంకెక్కడి ప్రాంతీయ వాస్తవిక కథా చిత్రాలు! అవి కూడా స్థానికతని  వదులుకుని ప్రపంచీకరణకే జైకొడుతూ, నల్గురితో పాటు (బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్) నారాయణా అని పిచ్చ కామెడీ ఎంటర్ టైనర్ల బాట పట్టేశాయి. 

       * మధ్య బాలీవుడ్ లో పొరుగు దేశపు సినిమా కళాకారుల ట్రెండ్ నడిచింది. కొన్ని ఉద్రిక్తతల నడుమ ఆ కళాకారులు స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఈ తాజా పరిణామాలకి ఇంకో రూపం 1947 లో వుంది. అప్పట్లో ఇటు కళాకారులు అట్నుంచి ఇటు వచ్చేశారు. కానీ విఫలమైన ఈ తాజా ట్రెండ్ తో ఆ చరిత్ర ఇంకో ప్రయత్నం చేయబోయింది, కుదరలేదు. దేశ విభజనతో బాటు సాంస్కృతిక విభజన కూడా జరిగిపోయిన దరిమిలా అప్పట్లో పంజాబీ సినిమా రెండు ముక్కలైంది. ఒక ముక్క లాహోర్ లో వుండిపోయింది. రెండో ముక్క బొంబాయి వచ్చేసింది. బొంబాయి వచ్చేసిన కళాకారుల్లో మహ్మద్ రఫీ వున్నారు. ఆయన భార్య రావడం ఇష్టం లేక విడాకులిచ్చేశారు. మహ్మద్ రఫీ వచ్చి వుండక పోతే ఆయన మహ్మద్ రఫీ అయ్యేవారు కాదు. కేఎల్ సైగల్, నూర్జహా, శంషాద్ బేగం, పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ ల వంటి హేమాహేమీలూ సహజంగానే బొంబాయి చేరుకున్నారు. హిందీ సినిమాల అభివృధికి పాటుపడ్డారు. మరి పంజాబీ సినిమా సంగతీ? పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్ కెళ్ళిపోతే, తూర్పు పంజాబ్ ఇండియాకి దక్కింది. పంజాబీ సినిమాల మూలాలే పాకిస్తాన్ లో భాగమైన పశ్చిమ పంజాబ్ లోని లాహోర్ లో వున్నాయి. అక్కడే మొదటి పంజాబీ సినిమా పుట్టింది. మరి దేశవిభజన తర్వాత ఇండియాలో పంజాబీ సినిమా భవిష్యత్తేమిటి?

(మరికొన్ని వచ్చేవారం)