రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, నవంబర్ 2018, శుక్రవారం

705 : స్ట్రక్చర్ అప్డేట్స్


    “SCREENPLAYS ARE STRUCTURE.” — William Goldman
         “SCREENPLAYS ARE TEMPLETS” ―Tollywood
        ఈవారం విడుదలైన అదుగో’ – విషయపరంగా విఫలమైనా, స్క్రీన్ ప్లే పరంగా ఒక క్రియేటివిటీని ప్రదర్శించింది. ఈ వ్యాసం పూర్తి చేస్తున్న సమయంలో ఇది మన దృష్టి కొచ్చింది. ఈ వ్యాసం టాపిక్ దేనిగురించైతే వుందో, అదే ‘అదుగో’ లో ఎదురైంది - బిగినింగ్ విభాగంతో క్రియేటివిటీ. అంటే ప్లాట్ పాయింట్ వన్ తో ప్రారంభం... బిగినింగ్  విభాగాన్ని ఫ్లాష్ బ్యాక్ గా చూపడం. టీనేజీ నోయర్ ‘బ్రిక్’ లో లాగా. కమర్షియల్ సినిమాలకి స్ట్రక్చర్ ఒకటే అయినా, క్రియేటివిటీలు అనేక విధాలుగా చేసుకునే స్వేచ్ఛ చాలా వుంటుంది. కానీ  ఈ స్వేచ్ఛని వాడుకోక పోవడం వల్ల క్రియేటివిటీలు ఒక మూసలో పడి, ఎవరైనా స్క్రీన్ ప్లేలు రాసేసే ఈజీ టెంప్లెట్ గా మారిపోయాయి. దీంతో స్ట్రక్చర్ అనే స్క్రీన్ ప్లే సౌధం బోసిపోయినట్టు తయారవుతోంది. స్ట్రక్చర్ కి సొగసులు అద్దేవి టెంప్లెట్ లోంచి బయటికి వచ్చే విభిన్న క్రియేటివిటీలే. బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథా నేపధ్యపు ఏర్పాటు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అనే నాల్గు ఉపకరణాలు సదరు బిజినెస్ నిర్వహిస్తాయి సరే, ఈ బిజినెస్ లో ఒకే మూస క్రియేటివిటీ ఎందుకుండాలి? అంటే హీరో హీరోయిన్లు సహా ముఖ్య పాత్రల్ని పరిచయం చేస్తూ, అదే జానర్ కథో ఆ ఫీల్ ని నేపధ్యంలో ప్రతిఫలింపజేస్తూ, హీరో సమస్యలో ఇరుక్కునే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, చివరికి ఓ అరగంట సమయానికి హీరోని ఎదుటి పాత్రతో సమస్యలో ఇరికించి – ఆ ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ, హీరోకి గోల్ ఏర్పాటు చేసే – ఒకే క్రియేటివిటీ కదా సినిమా తర్వాత సినిమాగా చేస్తూ వస్తున్నది...

         
ఇందుకే హాలీవుడ్ లో పాత పండితులు స్ట్రక్చర్ వల్ల సినిమాలన్నీ ఒకే అచ్చులో పోసినట్టు వుంటున్నాయని విమర్శించారు. క్రియేటివిటీని స్ట్రక్చర్ చంపేస్తోందని చెప్పి- ఆ స్ట్రక్చర్ ని మర్చిపోయి స్క్రీన్ ప్లేలు యదేచ్ఛగా రాసుకొమ్మని పుస్తకాలు రాశారు. మీ ఇష్టం,  మీ క్రియేటివిటీతో బిగినింగ్ ని ఎంతైనా సాగదీసుకోండి, మీ క్రియేటివ్ మైండ్ తో మీరు ఫీలయినట్టుగా సినిమా కథ రాసుకోండన్నారు. అలా బిగినింగ్ ని సాగదీస్తే –ఇంటర్వెల్ మీదుగా ఆ బిగినింగ్ కాస్తా సాగిసాగి, మిడిల్ మటాష్ అనే స్క్రీన్ ప్లేలు తయారై కమర్షియల్ సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ అవుతున్న నడుస్తున్న చరిత్ర చూస్తున్నదే. హాలీవుడ్ ఈ పాత పండితులు చెప్పే స్కీముని పట్టించుకోలేదు. అందుకని హాలీవుడ్ సినిమాలు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలతో వుండవు. తెలియక తెలుగు సినిమాలే ఇలా వుంటూ దెబ్బతింటున్నాయి.

         
ఇందుకే  స్టీవెన్ స్పెల్ బెర్గ్ ఇలా చెప్పివుంటాడు - People have forgotten how to tell a story. Stories don't have a middle or an end any more. They usually have a beginning that never stops beginningఅని!
***
      స్ట్రక్చర్ అవసరం లేదని చెప్పడం ఫక్తు కళే తప్ప వ్యాపారం పట్టని నాన్ కమర్షియల్ వాదమే. వ్యాపారాన్నే కాదు, ప్రేక్షకుల మెదడు కథల్ని రిసీవ్ చేసుకునే మానసిక ప్రక్రియని  కూడా వ్యతిరేకించే ఆత్మాశ్రయ ధోరణి వ్యాపకమే. అది వరల్డ్ మూవీస్ అనే ఆర్టు సినిమాలకి వర్తించే నృత్యమే. ఈ నృత్యాలకి హాలీవుడ్ మొదట్నుంచీ మోకాలొడ్డింది గానీ, టాలీవుడ్ కి నచ్చుతూ తాజాగా ‘వీరభోగ వసంతరాయలు’ అనే కరాళ నృత్యం కూడా చేసి చూపించింది. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలు వరల్డ్మూవీస్ పులి వేషాలు. వాటి పట్ల అర్ధంలేని వ్యామోహం పెంచుకుంటే బాక్సాఫీసు ఫలితాలెలా వుంటాయో అజ్ఞాతవాసి, ఆ, ఊపిరి, మను -  ఇంకా మరికొన్ని ఆల్రెడీ నిదర్శనాలున్నాయి -  తాజా భోగరాయలు సహా. 

        స్ట్రక్చర్ లో వుండని వరల్డ్మూవీస్ ని చూసి వాతలు పెట్టుకోవడమంటే దేవుడి మీద భారం వేసి స్క్రిప్టులు రాయడమే. దేవుడేం చేస్తాడు- ఇది కలెక్టివ్ కాన్షస్ నెస్ కాదు పొమ్మని అట్టర్ ఫ్లాప్ చేస్తాడు. దేవుడు సార్వజనీనాన్ని చూస్తాడు, సృజనాత్మకత పేరుతో సంకుచితత్వాన్ని కాదు. సంకుచితత్వం కాబట్టే వరల్డ్ మూవీస్ కొన్ని చిన్న చిన్న యూరోపియన్ దేశాలకే పరిమితమైపోయాయి. వరల్డ్ లో ఇంకో చోట ఎక్కడా ఆడని వాటిని వరల్డ్ మూవీస్ అనే కన్నా అక్కడి ప్రాంతీయ సినిమాలంటే సరిపోతుంది. 

          ఇవ్వాళ దేశంలో 18 భాషల్లో ప్రాంతీయ సినిమాలు తీస్తున్నారు. వాళ్ళంతా ఒకప్పటి ఆర్ట్ సినిమాల అస్తిత్వాన్ని వదిలించుకుని, కన్స్యూమర్ ప్రపంచానికి దీటుగా కమర్షియలైజ్ అవుతూ మెయిన్ స్ట్రీంలో కదం తొక్కుతున్నారు. వాళ్ళకున్న పరిమిత బడ్జెట్స్ లోనే రోమాన్స్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ థ్రిల్లర్స్ వగైరా తీస్తూ, ఎందరికో ఉపాధి కల్పించే అభివృద్ధి పథంలో కొచ్చేశారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లాగా ప్రతి వొక్కరూ తమ భాషకి ‘వుడ్’ తగిలించుకుని గ్లోబలైజేషన్ ఫలాలు పొందడానికి పోటీలు పడుతున్నారు. బెంగాలీ, కొంకణి, అస్సామీ భాషల్లోనైతే అక్కడి నేటివ్ వాతావరణంలో సస్పెన్స్ థ్రిల్లర్స్ ని మంచి క్వాలిటీతో అద్భుతంగా తీస్తున్నారు. తెలుగులోలాగా వరల్డ్ మూవీస్ అంటూ వైకల్యాలు పెంచుకోకుండా, వినియోగదార్ల ప్రపంచానికి ఏం కావాలో అది అందిస్తూ నిర్మాతలకి నాల్గు డబ్బులు వచ్చేట్టు చూస్తున్నారు. దేశంలో ప్రాంతీయంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో పూర్తి సమాచారం ‘సంచిక డాట్ కాం’ వెబ్ సైట్లో సినిమా విశ్లేషణ శీర్షికలో తెలుసుకోవచ్చు. 
                                                   ***
        ఇప్పుడు ప్రశ్నేమిటంటే, సినిమాలు ఒకే అచ్చులో పోసినట్టు వుండడం స్ట్రక్చర్ వల్లనా, లేక మూస క్రియేటివిటీల వల్లనా? క్రియేటివిటీని స్ట్రక్చర్ చంపేస్తోందా, లేక టెంప్లెట్ మూస క్రియేటివిటీలే స్ట్రక్చర్ ని చంపేస్తున్నాయా? స్ట్రక్చర్ తో వున్న పాత ‘దొంగరాముడు’ లో లాంటి క్రియేటివిటీని ఎవరైనా ఎప్పుడైనా వూహించారా? స్ట్రక్చర్ కే ఆ క్రియేటివిటీ ఎంత వన్నె చేకూర్చింది? ప్లాట్ పాయింట్ వన్ తో చేసిన క్రియేటివిటీ? ఒక్క బిగినింగ్ విభాగమే తీసుకుంటే- ఆ బాల్య కథనే స్క్రీన్ ప్లేకి బిగినింగ్ బిజినెస్ గా చేసి, ఆ బాల పాత్రనే దాని సమస్యతో ప్లాట్ పాయింట్ వన్ కి చేర్చి, వాడికే గోల్ నివ్వడం ఎంత అపూర్వ క్రియేటివిటీ. దీంతో ఎదిగిన దొంగ రాముడుగా అక్కినేని ఎంట్రీ ఇచ్చేసరికి, ఆ చిన్నప్పటి గోల్ తో నేరుగా మిడిల్లోకి వెళ్ళిపోయారు. దీంతో అక్కినేనిని ఎంత రొటీన్ బిగినింగ్ విభాగపు బిజినెస్ లో చూసే బోరు కూడా తప్పించారు!

          స్ట్రక్చర్ ని ఫాలో అయితే ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. స్ట్రక్చర్ ని ఫాలో అవని ప్రయోగాలు అప్రియాలు. టీనేజి నోయర్ ‘బ్రిక్’ లో చూస్తే, ప్లాట్ పాయింట్ వన్ తో ఎంత ప్రయోగం!  సినిమా ప్రారంభంలోనే చచ్చిపడున్న హీరోయిన్ ని దీనంగా చూస్తూంటాడు హీరో. వెంటనే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? బిగినింగ్ విభాగమే. ఇందులో హీరో హీరోయిన్ల పాత్రల పరిచయం, కథా నేపధ్యం, సమస్యకి దారితీసి పరిస్థితులూ వుంటాయి – ఇదంతా అరగంట లోపు ఫ్లాష్ బ్యాక్ గా ముగిసి, ప్రస్తుతానికి వస్తుంది కథ. ఇక్కడ ఇప్పుడు చచ్చి పడున్న అదే హీరోయిన్ని అలాగే చూస్తూంటాడు హీరో. అంటే మొదట్లో మనం చూసిన ఈ సీను ప్లాట్ పాయింట్ వన్ ఘట్టమన్న మాట. అంటే సినిమా ప్రారంభమే ప్లాట్ పాయింట్ వన్ దృశ్యమన్న మాట. ఎవరు చంపి వుంటారు? ఇదీ హీరో గోల్. ఇక్కడ్నించీ మిడిల్ ప్రయాణం. ఇదే బిగినింగ్ శైలిని  ‘అదుగో’ లో చూడొచ్చు.

          మామూలుగా మనమెలా అనుకుని చూస్తూంటాం – ‘బ్రిక్’ లో ఈ ప్రారంభ దృశ్యం చూసి, ఈమె ఎలా చచ్చి పోయిందనే దానికి ఇక సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందనుకుంటాం. మొదట బిగినింగ్ విభాగం, తర్వాత చాంతాడంత మిడిల్ విభాగమంతా చూపించి, క్లయిమాక్స్ కి చేర్చి, ఆ క్లయిమాక్స్ తో మళ్ళీ మొదటి దృశ్యం దగ్గరి కొస్తారనుకుంటాం. సర్వ సాధారణంగా జరిగేదిదే. ‘ఖైదీ’ లోనైనా, ఫ్లాష్ బ్యాక్ తో ఇంకే  3 -1- 2 నాన్ లీనియర్ కథనం లేదా దృశ్యాలున్న కమర్షియల్లోనైనా. ఇలా రెండుగంటల సినిమా అంతా చాంతాడంత ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చూపించడం. కానీ ‘బ్రిక్’ లో కేవలం బిగినింగ్ విభాగాన్నే ఫ్లాష్ బ్యాక్ గా చూపించి చప్పున ముగించడంతో, బోలెడు బోరంతా తప్పింది. రొటీన్ మూసలో బోరుగా ప్రారంభించి చూపించే బిగినింగ్ విభాగపు బిజినెస్ నే, ఫ్లాష్ బ్యాక్ గా చేసి  చూపించడంతో, బిగినింగ్ తో వుండే రొటీన్ మూస ఫీలింగ్ కూడా తప్పింది! పైగా మనం చూసిన ప్రారంభ దృశ్యమే ప్లాట్ పాయింట్ వన్ అని ఇప్పుడు తెలిసి థ్రిల్లయేందుకూ వీలు కలిగింది!  ఈ థ్రిల్లే ‘అదుగో’ లో వుంది.  

         
అంటే ‘శివ’ నే తీసుకుంటే, నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టే దృశ్యంతో సినిమా ప్రారంభించి, ఎందుకు కొడుతున్నాడో తెలియని సస్పన్స్ సృష్టిస్తూ, ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి –సినిమాలోని అదే బిగినింగ్ విభాగంలో వున్న సీన్లన్నీ అదే వరసలో అదే అరగంటలో చూపించుకొస్తూ వచ్చి,  సినిమా ప్రారంభ దృశ్యమైన నాగార్జున జేడీని కొట్టే దృశ్యంతో కలపడం లాంటి దన్నమాట. అప్పుడీ ప్రారంభ దృశ్యమే ప్లాట్ పాయింట్ వన్ అయి థ్రిల్ చేస్తుంది.

          మారని బిగినింగ్ స్ట్రక్చర్ లోపల, ప్లాట్ పాయింట్ వన్ తో మారిపోయే థ్రిల్లింగ్ క్రియేటి
విటీలెన్నైనా చేయవచ్చని దొంగరాముడు, బ్రిక్, అదుగో, ది మేయర్ లాంటి చాలా కొన్ని కమర్షియల్ సినిమాల్లో మాత్రమే బయటపడుతోంది. దీన్ని గుర్తించి విరివిగా వాడుకోవాల్సిన అవసరముందేమో ఆలోచించాలి.
***
       అరిస్టాటిల్ నుంచీ సిడ్ ఫీల్డ్ దాకా ఎవరైనా – అక్షరం పుట్టక ముందునుంచీ కథలు చెప్పుకోవడంలో శతాబ్దాలుగా ప్రూవైన సార్వజనీన స్ట్రక్చర్ లోని ఆయా అంక విభాగాల్లో  - ఫలానా ఫలానా పనిముట్లతో కథా నిర్వహణ ఫలానా ఫలానా విధాలుగా జరగాలని మాత్రమే చెప్పారు. నిర్మాణమే చెప్పగలరు. నిర్మాణాన్నాధారంగా జేసుకుని నిర్మాణంలోపల కథా నిర్వహణతో సృజనాత్మక స్వేచ్చ తీసుకోవడం స్క్రీన్ ప్లేలు (?) రాసే రచయితల పని. కానీ ఏం జరుగుతూ వస్తోంది – మార్గదర్శులు స్ట్రక్చర్ బిగినింగ్ విభాగంలో చెప్పిన 4 పని ముట్లయిన – పాత్రల పరిచయం, కథా నేపధ్య ఏర్పాటు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటుతో ప్లాట్ పాయింట్ వన్ – అనే ఈ వరుసని ఈ వరసక్రమంలోనే చేసుకుపోవడం జరుగుతోంది. ఇది అలసత్వ ధోరణి లేదా, ఒకటే పట్టుకుని సాగే లేజీ రైటింగ్. స్ట్రక్చర్ లేని బ్యాడ్ రైటింగ్ ఎంతో, స్ట్రక్చర్ వున్న లేజీ రైటింగ్ అంతే. 

          ప్రతీ సినిమాలో బిగినింగ్ విభాగం ఇంతే కదా - హీరో వుంటాడు. అతను ఫలానా అని చెప్తారు. కొన్ని సీన్లు నడుస్తాయి. హీరోయిన్ పరిచయమౌతుంది. ఆమె ఫలానా అని చెప్తారు. ఇద్దరి మధ్య కొన్ని సీన్లు నడుస్తాయి. ఇదేం కథో బ్యాక్ డ్రాప్ లో వాతావరణం చూపిస్తారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ ప్రేమలో సమస్య కోసం ఇంకో పాత్రతోనో, పరిస్థితులతోనో కొన్ని సీన్లు నడిపిస్తారు. అప్పుడా పాత్రతోనో, పరిస్థితులతోనో  వాళ్ళిద్దరి ప్రేమని సమస్యలో పడేసి ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ని ముగిస్తారు. ఈ రొటీనే కదా రాసుకుంటూ కూర్చోవడం  లేజీగా?

          ఏ జానర్ కథ బిగినింగ్ అయినా ఈ వరస కథనంతోనే మార్పులేకుండా ప్రతీ సినిమాలో ప్రేక్షకులు చూస్తూనే వున్నారు. బిగినింగ్ పనిముట్లు నాల్గూ ఇలాగే ఒక దాని తర్వాత ఒకటి అదే సీక్వెన్స్ లో ఆపరేట్ చేయడాన్ని భరిస్తూనే వున్నారు. నాటి ‘శివ’ అయినా, నేటి ‘ఫిదా’ అయినా ఇదే తంతు చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఈజీగా సినిమా ప్రారంభమయ్యాక దేని తర్వాత ఏం జరుగుతుందో వూహించి చెప్పేస్తున్నారు. ఈ సీన్లు ఇలా వెళ్లి అరగంటకో, ముప్పా వు గంటకో, ఇంటర్వెల్ కో ఓ మలుపు తిరిగి పాయింటు (ప్లాట్ పాయింట్ వన్) కొస్తాయిలే  ఏముందని చప్పరించేస్తున్నారు.  ఆ పాయింటు వచ్చేవరకూ మొనాటనీని భరిస్తూ ఓపిగ్గా చూస్తూ కూర్చుంటున్నారు. ఇలాటి స్క్రీన్ ప్లేలు ఓ ప్రహసనమే గాక, యాంత్రికమూ కృత్రిమమూ కూడా. కథేమిటో, పాయింటేమిటో తెలియడానికి ఎప్పుడో వచ్చే ప్లాట్ పాయింట్ వన్ వరకూ ఎదురుచూడ్డ మేమిటి ఈ స్పీడు యుగంలో కూడా ఇంకా? 

          ఆలస్యం చేయకుండా సినిమా ప్రారంభమే ‘బ్రిక్’ లో లాగా బిగినింగ్ ని తిరగేసి, ప్లాట్ పాయింట్ వన్ చూపిస్తూ కథేమిటో ప్రారంభ సీన్లోనే చెప్పేస్తే? బిగినింగ్ విభాగం వరకే ఫ్లాష్ బ్యాక్ గా చేస్తే? ‘దొంగరా రాముడు’ లో లాగా బిగినింగ్ విభాగంలో బాల్యపు కథనానికే ప్లాట్ పాయింట్ వన్ వేసి, అనూహ్యంగా కథగా మార్చేస్తే?  ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లోలాగా  బిగినింగ్ కథనం ఒకలా నడుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఇంకోలా మారిపోవడంగా చేస్తే? ‘ది మేయర్’ లోలాగా ఇరవై నిమిషాల కొచ్చే ప్లాట్ పాయింట్ వన్ ఉండుండి కేవలం ఒక్క ప్రకటనతో ప్రేక్షకులూహించని విధంగా ఏర్పడిపోతే? బిగినింగ్ స్ట్రక్చర్ లోపల ఒకే మూసలో వుంటున్న క్రియేటివిటీలకి చెక్ పెట్టేవే ఇవన్నీ. ఇప్పటి వినియోగదార్లతో మార్కెట్ యాస్పెక్ట్ ఇదేనేమో? 

          సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్ కింద ఫలానా ఈ కథతో ఈ సినిమా చూసే ప్రేక్షకులెవరు, వాళ్ళ ఏజి గ్రూపేమిటి. అభిరుచులేమిటి, యూత్ అప్పీల్ ఏమిటి, ట్రెండ్స్ ఏమిటి, ఇప్పుడు అమ్ముడుబోతున్న జానర్ లేమిటన్న అంశాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే చాలదనీ, స్క్రీన్ ప్లేల పరంగా కూడా మార్కెట్ యాస్పెక్ట్ ని చంపేస్తున్న కొన్ని చీడల్ని తొలగించాల్సిన అవరసర ముందనీ పై ప్లాట్ పాయింట్ వన్ క్రియేటివిటీలు చెప్తున్నాయి. లేకపోతే ఎంత కాలమిలా అదే బిగినింగ్ విభాగపు బిజినెస్ తో విసుగెత్తేలా, అదే పాతకాలపు పద్ధతిలో ప్రారంభ దృశ్యాలు యింకా చూపించడం! 

          ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేదే క్రియేటివిటీ. క్రియేటివిటీ నాలెడ్జి నేస్తం. నాలెడ్జి ఇహ చాల్లే అని ఒకచోట ఆగిపోతుంది. ఆలా ఆగిపోయిన నాలెడ్జిలో ఇరుక్కున్న క్రియేటివిటీ అప్డేట్ అవాలని అడుక్కుంటుంది. నాలెడ్జి అప్డేట్ అవకపోతే దాంతోపాటే క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఇది వ్యక్తిగతంగా. వ్యవస్థాగతంగా - నాలెడ్జికి విలువలేని వ్యవస్థలో క్రియేటివిటీకి చోటుండదు. ఆ వ్యవస్థ వ్యాపారంలో నవ్యత లేక నష్టాలపాలవుతుంది.
***
      ఇలా ఇప్పుడు ‘ది మేయర్’ అనే కొరియన్ మూవీ బిగినింగ్ విభాగమూ, దాని ప్లాట్ పాయింట్ వన్నూ సరికొత్త క్రియేటివిటీని ప్రదర్శిస్తాయి. కొరియన్ సినిమాలు వరల్డ్ మూవీస్ లాంటి ఆర్ట్ సినిమాలు కావు, పక్కా కమర్షియల్ సినిమాలు. స్ట్రక్చర్ తో వుంటాయి. కమర్షియల్ సినిమాల మార్కెట్ అయిన అమెరికాలో ఆడడమే కాదు, కొరియన్ డైరెక్టర్లు హాలీవుడ్ లో సినిమాలు కూడా తీస్తున్నారు. 

           ‘ది మేయర్’ 2017 లో విడుదలైన విజయవంతమైన రాజకీయ జానర్ సినిమా. ఎన్నికల ప్రచార కథ. మేయర్ పదవికి గెలుపు కోసం పరస్పర పాపాల చిట్టా విప్పుకుని, చేయరాని పనులు చేయడం. దక్షిణ కొరియా అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ. రాజధాని సియోల్ నగర మేయర్ గా వరసగా నాల్గోసారి ఎన్నికైతే, దేశాధ్యక్ష పదవి కాళ్ళమీద పడుతుంది. ఇందుకే కథలో ఇప్పుడున్న మేయర్ ఖతర్నాక్ పనులు చేస్తాడు. మేయర్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు చోయీ మిన్సిక్ నటించాడు. ఇంకో ముఖ్యపాత్ర ఎన్నికల ప్రచార స్పెషలిస్టుగా షిమ్ క్యుంగ్ నటించింది. దర్శకుడు పార్క్ ఇంజే. బడ్జెట్ 9 మిలియన్ డాలర్లు, వసూళ్లు 93 మిలియన్ డాలర్లు.
          ఇక బిగినింగ్ విభాగపు వన్ లైన్ ఆర్డర్ లోకెళ్దాం...
***
      1.  ఇండోర్ స్టేడియంలో ర్యాప్ మ్యూజిక్ తో యూత్ ర్యాలీ జరుగుతూంటే టైటిల్స్ ప్రారంభం. నగర మేయర్ జొరబడి వచ్చేసి,  యూత్ తో కలిసి ర్యాప్ మ్యూజిక్ తెగ ఆడి పాడేస్తాడు. యూత్ హర్షాధ్వానాలు చేస్తారు.  ఒక యూత్ ముందు కొచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది – తన బాయ్ ఫ్రెండ్ చాలా కాలంగా సైన్యంలో వుండి పోయాడనీ, తనేం చేయాలో చెప్పమనీ. చీట్ చేయవద్దంటాడు మేయర్. నీ ప్రేమ శక్తితో ఆతడి పట్ల విశ్వాసంగా వుండమంటాడు. ఇంకో యూత్ లేచి, మీరు సియోల్ నగరాన్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారని అడుగుతాడు. నగరం గురించి ఎమర్జెన్సీ డ్యూటీలో పడి కూతురి గ్రాడ్యుయేషన్నే మిస్సయ్యానంటాడు మేయర్. ఇంకో యువతి ముందుకొచ్చి – తన పేరు పార్క్ అనీ, అడ్వర్టైజ్ మెంట్ కంపెనీలో పని చేస్తున్నాననీ పరిచయం చేసుకుని – మొదటిసారిగా నాల్గేళ్ళ క్రితం మీకే ఓటేశాను...వేసినందుకు బాధ పడ్డాను... మీ సర్కస్ విద్యలతో విసుగెత్తి పోయాను... ఇలా వుంటే మీరే ఎన్నికా గెలవరని అంటుంది.

          ఎన్నికల్లో గెలవాలంటే మరేం చేయాలంటాడు మేయర్. సిన్సియర్ గా కమ్యూనికేట్ అవమంటుంది. కమ్యూనికేట్ అవకపోతే ప్రజలనుంచి కట్ అయిపోతారంటుంది. మేయర్ ఆమెని మెచ్చుకుని, యూత్ చేత చప్పట్లు కొట్టిస్తాడు. 

          2.  అదే రాత్రి తన నివాస స్థలంలోకి మేయర్ వెళ్తూంటే కొత్త సెక్యూరిటీ గార్డు ఆపేస్తాడు. నన్ను గుర్తు పట్టలేదా అని క్లాసు పీకుతాడు మేయర్.
          3.  ఉదయం ఎత్తైన ప్రదేశం మీదికి నడిచి వెళ్లి రొప్పుతూ సియోల్ నగరాన్ని చూస్తూంటాడు మేయర్. దర్శకుడి పేరుతో, సినిమా పేరుతో టైటిల్స్ పూర్తవుతాయి.
          4.  ఒక పొలిటీషియన్ని అని చెప్పుకున్న వ్యక్తి కన్ఫెషన్ చెప్పుకుంటూ వుంటే, గ్యాస్ కమ్మి చర్చి ఫాదర్ చనిపోతాడు.
          5.  అడ్వర్టైజ్ మెంట్ కంపెనీలో ఒక యాడ్ స్క్రీనింగ్ చూస్తూంటారు. వెనుక వరసలో కూర్చున్న అతను, పోలిటీషియన్ కన్ఫెషన్ చెప్పుకోవడానికి వెళ్ళాడంటే ఎవరైనా నమ్ముతారా అంటాడు. ముందు వరసలో కూర్చున్న కంపెనీ ఉద్యోగిని పార్క్ కి మెసేజి వస్తుంది. మనం కలవ్వచ్చా అని అసెంబ్లీ సభ్యుడు షిమ్ పంపిన మెసేజ్.
          6. అసెంబ్లీ సభ్యుడు, మేయర్ అనుచరుడు షిమ్ ని కలుస్తుంది పార్క్. స్టేడియంలో మేయర్ తో జరిగిన సంభాషణని పురస్కరించుకుని రాజకీయాలపై ఆమె అభిప్రాయం అడిగి తెలుసుకుంటాడు షిమ్. మేయర్ కి నీతో అవసరముందని అంటాడు.
          7. పార్టీ ఆఫీసులో మేయర్ నాయకులతో సమావేశమవుతాడు. పార్టీ లీడర్ కిమ్ పారిశ్రామిక వాడలో డబ్బుతీసుకుని కనస్ట్రక్షన్ కంపెనీకి భూమిని ప్రామీస్ చేశాడని రూమర్స్ వస్తున్నాయి, ఇదే నిజమైతే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తాడు  మేయర్. “అంటే రేపు మీ ప్రెసిడెంట్ పదవికి అడ్డురాకుండా కిమ్ ని పార్టీ నుంచి బహిష్కరిస్తారా? ఒకవేళ రూమర్ నిజమే అయితే పార్టీ శ్రేయస్సు కోసం దాయకూడదా? మీరు పార్టీని ముంచేద్దామని ప్రయత్నిస్తున్నారా? మీరు మీ రీఎలెక్షన్ మీద దృష్టి పెట్టండి మేయర్ గారూ” అని జే అనే నాయకుడు మందలిస్తాడు. “నాతో ఇలా మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకున్నావ్?” అని సీరియస్ అవుతాడు మేయర్.
          8.  ప్లే గ్రౌండ్ లో యూత్ తో కలిసి ఫుట్ బాల్  ఆడుతూ కింద పడిపోతాడు పార్టీ లీడర్ కిమ్. దూరంగా కూర్చుని షిమ్, జేలు మాట్లాడుకుంటూ వుంటారు. “మేయర్ గాడొక బాస్టర్డ్. వాడికి నేనెంత చేసినా విశ్వాసమే లేదు. మళ్ళీ వాడు గెలిస్తే ఇక ప్రెసిడెంట్ కి పోటీ పడతాడు” అని జే అంటూంటే, అది జరగదని అంటాడు షిమ్, “బ్లూ హౌస్ నీది తప్ప మరొకరిది కాబోదు” అంటాడు. “వాడి మీద కన్నేసి వుంచు. ఇది చాలా రిస్కీ సిట్యుయేషన్. వాడు గెలిస్తే చాలా పవర్ఫుల్ అయిపోతాడు. ఓడిపోతే పార్టీ సియోల్ ని కోల్పోతుంది” అంటాడు జే. “ఆ రూమర్ నిజమో కాదో నేను తెలుసుకోవాలి” అంటాడు షిమ్.
          9. ప్రతిపక్ష న్యూ ఫ్రీడమ్ పార్టీ ఆఫీసు. నినాదాలు. లోపల మేయర్ పదవికి పోటీపడుతున్న ఆమె మేకప్పవుతూ వుంటుంది. ఒక లీడర్ వచ్చి “ఇక మోత మోగించాలి, మేయర్ గాడికి బీపీ పెరిగేలా చేయాలి”  అంటాడు. బయట ఆవరణలో యాడ్ స్పెషలిస్టు  పార్క్ వచ్చి మీడియా వాళ్లతో కలిసి వేదిక వైపు చూస్తూంటుంది. మేయర్ అభ్యర్ధిని వస్తుంది మైకు దగ్గరికి. “నా ప్రియమైన సియోల్ పౌరులారా, నేను యాంగ్ జిన్ ని...” అంటుంది. అంటూండగానే ప్రసంగ పాఠం కాగితాలెగిరిపోతాయి. వాటిని ఏరుకుంటూ వంగినప్పుడు ఆమె వక్షోజాలు ఎక్స్ పోజ్ అవుతాయి. అవి మీడియా కెమెరాల్లో పడతాయి. కాగితాలేరుకుని, వక్షోజాలు కప్పుకుంటూ మైకు దగ్గరికి వస్తుంది. పార్క్ తమాషాగా చూస్తూంటుంది.
          10.  పార్టీ కార్యాలయంలో షిమ్ ఈ కార్యక్రమాన్ని టీవీలో చూస్తూంటాడు. పార్క్ వస్తే ఆమెని ఒక గది చూపిస్తారు. అక్కడ యాడ్స్ లివింగ్ లెజెండ్ ఒకాయన వుంటాడు. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న టాప్ వర్డ్ ఏమిటని అడుగుతాడు. “వక్షోజాలు” అంటుంది పార్క్. షిమ్ వస్తాడు. లివింగ్ లెజెండ్ వెళ్ళిపోతాడు. షిమ్ పార్క్ పక్కన ఒక సెల్ ఫోన్ పెడతాడు. ఆమె ఫోన్ కూడా అక్కడ పెట్టమంటాడు. పెడుతుంది. “ఎన్నికల ప్రచారమంటే బురదలో ముత్యాలేరుకోవడం లాంటిది. చేతులు మురికి అవకుండా ఇది చేయలేం. నీకు ఓకే అయితే ఆ ఫోన్ తీసుకో. అందులో ఈ ఆఫీసులో వున్న వాళ్ళందరి కాంటాక్ట్ ఇన్ఫో వుంది. ఈ రాత్రి నీక్కొంత మెటీరియల్ అందుతుంది. దాన్ని వైరల్ చెయ్” అని వెళ్ళిపోతాడు.
          11. పార్క్ ఫ్లాట్ లో రాత్రి మెటీరియల్ అందుతుంది. అది లాప్ టాప్ లో లోడ్ చేసి చూస్తుంది. ఆ వీడియోలో మేయర్, అటు తిరిగి కూర్చున్న వ్యక్తితో అంటుంటాడు – “ఆ  సీరియల్ రేపిస్టుని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు ఇంటర్నెట్ చూడరా? ప్రపంచం చాలా మారిపోయింది...” పార్క్ ఈ వీడియో మీద వర్క్ చేస్తుంది.
          12. యాడ్స్ లివింగ్ లెజెండ్ అమ్మాయిలతో డ్రింక్ చేస్తూంటాడు. ఒక ఏజెంట్ వచ్చి, “మేయర్ ప్రెసిడెంట్ అవుతాడా?” అనడుగుతాడు. మేయర్ కి సాలిడ్ కనెక్షన్స్ లేవనీ, కానీ షిమ్ తోడుంటే ప్రెసిడెంట్ అవుతాడనీ లివింగ్ లెజెండ్ అంటాడు.
          13. పార్టీ ఆఫీసులో ప్రచార కమిటీతో షిమ్ సమావేశం. మనకున్నఒకే ఆప్షన్ పన్నుల రాయితీని ప్రమోట్ చేయడమేనని అంటాడు. “దీని గురించి అసలేమైనా ఆలోచించారా? లేక పాత ఎన్నికల మేనిఫెస్టోనే కాపీ పేస్ట్ చేస్తున్నారా?” అని ప్రశ్నిస్తాడు. సభ్యులు మౌనం వహిస్తారు. “సియోల్ లో నిరుద్యోగుల రేటెంత?” అడుగుతాడు షిమ్. ఇరవై శాతమని అంటాడొక సభ్యుడు. దీనికి నీ పరిష్కారమేమిటని అడుగుతాడు షిమ్.  చర్చిస్తున్నామని అంటాడు ఇంకో సభ్యుడు. “మీరిద్దరూ నా ముందు నుంచి వెళ్ళిపోండి!...వెళ్ళండి...వెళ్ళమన్నానా? వెళ్ళిపోండి!!”  అని అరుస్తాడు షిమ్. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక, “ మేయర్ గారు ఎన్నికల్లో నిలబడుతున్నట్టు ప్రకటించడానికి ఇంకెన్ని రోజులున్నాయి?” అంటాడు. రెండ్రోజులంటారు. “ఎన్ని రోజులూ?” గద్దిస్తాడు. రెండ్రోజులని ముక్తకంఠంతో అందరూ అంటారు. మీటింగ్ పూర్తయింది, వెళ్లిపొమ్మంటాడు.

          నలిగిన బట్టలతో, వాడిపోయిన మోహంతో వస్తాడు  యాడ్స్ లివింగ్ లెజెండ్.  ఎందుకు లేటుగా వచ్చావని షిమ్ అడుగుతాడు. రాత్రి ఒక ప్రాబ్లంలో పడ్డానని, తర్వాత చెప్తాననీ అంటాడు లివింగ్ లెజెండ్. “తర్వాతంటే ఎప్పుడు? నిన్ను డిస్మిస్ చేశాకనా?” అంటాడు షిమ్. సెక్రెటరీని పిలిచి, నీకిచ్చిన వీడియో ఇమ్మంటాడు. ఆమె పెన్ డ్రైవ్ ఇస్తుంది. లివింగ్ లెజెండ్ వంగిపోయి, “రాత్రి రెయిడింగ్ జరిగింది. బ్రోతల్ కేసులో పోలీసులు నన్ను పట్టుకున్నారు. వార్నింగ్ ఇచ్చి విడిచి పెట్టారు” అంటాడు. మగాడు మూడు విషయాల్లో వొళ్ళు దగ్గర పెట్టుకుని వుండాలంటాడు షిమ్. అవేమిటన్నట్టు చూస్తాడు లివింగ్ లెజెండ్. “ఫింగర్ టిప్, టంగ్ టిప్, డిక్ టిప్”  అంటాడు షిమ్. వెళ్ళిపొమ్మంటాడు ఇక్కడ్నించీ. లివింగ్ లెజెండ్ వెళ్ళిపోయాక పెన్ డ్రైవ్ లో వీడియో చూస్తాడు షిమ్.
          ఆ వీడియోలో మేయర్ మాట్లాడుతున్న అదే దృశ్యం కంటిన్యూ, “ఆడవాళ్ళతోనే సమస్య...టాప్స్, బాటమ్స్ చూపించుకుంటూ తిరుగుతారు. సరీగ్గా బిహేవ్ చేయడం వీళ్లెప్పుడు నేర్చుకుంటారు?”  కట్ అయి సీను మారుతుంది...
          14.  అదే పార్టీ ఆఫీసులో వేరే రూమ్ లో కాంగ్ అనే అసంబ్లీ సభ్యుడు, ఇంకో టెక్నీషియన్ ఆ వీడియో చూస్తూంటే, పార్క్ కూడా చూస్తూంటుంది. “మేయర్ ని చూస్తూంటే జాలేస్తోంది...” అంటాడు టెక్నీషియన్. దీన్ని తనకి పంపించమని పక్కకెళ్ళి పోతాడు కాంగ్. పార్క్ కల్పించుకుని, “ఈ వీడియో సోర్స్ ఏమిటి? నీ దగ్గర ఒరిజినల్ వుందా? ఫుల్ వెర్షన్?”  అంటుంది. “దాంతో నీకేమిటి పని?” అంటాడు టెక్నీషియన్. సోర్స్ ని వెరిఫై చేయాలనీ, లేకపోతే బ్యాక్ ఫైర్  అవచ్చనీ అంటుంది. కాంగ్ వచ్చి “సరుకు ఎక్కువ కాలం నిల్వ వుంటే చెడిపోతుంది” అంటాడు. “కొరియాలో ఇలాగేనా ఎన్నికలు నిర్వహిస్తారు?”  అంటుంది. “నువ్వే చూశావ్ – ట్రెండింగ్ ఛార్ట్స్ లో ఆమె టాప్స్ ఎలా టాప్ లో వున్నాయో. పార్టీ విధానాల గురించి ఎవడిక్కావాలి?” అంటాడు. ఆలోచనలో పడుతుంది. ఆమె సెల్ కి మెసేజ్ ఎలర్ట్ వచ్చి పరుగెడుతుంది.
          15. నగర విజువల్స్. ఎక్కడ చూసినా అదే వీడియో. ఎవరి సెల్ ఫోన్ లో చూసినా అవే మేయర్ కామెంట్స్. ఆడవాళ్ళ గురించి దారుణంగా మాట్లాడాడని అట్టుడుకుతుంది నగరం. పార్క్ గొంతు పలుకుతూంటుంది – అదొక డిన్నర్ పార్టీలో పోలీసాఫీసర్ తో మేయర్ మాట్లాడినప్పటి వీడియో అని...
          16. “మేం చెప్పాల్సిందేమీ లేదు” అని ఫోన్లో అంటాడు షిమ్. తన పర్సనల్ రూంలోకి వెళ్తాడు. అక్కడ ర్యాక్స్ నిండా ఎన్నో జతల బూట్లు పేర్చి వుంటాయి. “ఈ స్కాండల్ మేయర్ కి గేమ్ ఛేంజర్...” అనుకుంటాడు. “వాడి అప్రోవల్ రేటింగ్ కి దెబ్బ...” అని, ఒక బూట్ల జత అందుకుని దగ్గరగా పెట్టుకుని చూస్తూ, “షిమ్ ... యూ ఆర్ టూ గుడ్...” అని నవ్వుకుం
టాడు. నిగనిగ లాడుతున్న ఆ బూట్ల మీద అతడి ప్రతిబింబం అష్టవంకర్లు పోతూ వుంటుంది.
          17.  మీడియా సమావేశంలో యాడ్స్ లివింగ్ లెజెండ్ - “నేను మేయర్ గారి ప్రచార మేనేజర్ ని. ఇప్పుడు వైరల్ అయిన ఆ వీడియో ఫుల్ వెర్షన్ మీకు చూపిస్తాను. దాన్నెలా దురుద్దేశపూర్వకంగా ఎడిట్ చేశారో కూడా చూపిస్తాను...”
          వీడియో స్క్రీనవుతుంది. మేయర్ మాట్లాడుతున్న దృశ్యం - “ఆడవాళ్ళతోనే సమస్య...టాప్స్, బాటమ్స్ చూపించుకుంటూ తిరుగుతారు... సరీగ్గా బిహేవ్ చేయడం వీళ్లెప్పుడు నేర్చుకుంటారు? – అనా మీరనేది? అంటే జరుగుతున్నవి రేపులే కాదని మీ ఉద్దేశమా? రేప్ జరిగినప్పుడల్లా బాధితురాల్ని కూడా బాధ్యురాల్నిచేస్తున్నారు... మీరిలా ఎలా ఆలోచిస్తారసలు? మీలాంటి వాళ్ళ వల్ల ప్రజా సేవలో వుంటున్న నాయకులకి చెడ్డ పేరొస్తోంది!!’ అరుస్తాడు మేయర్.  
          ఇక ప్రశ్నలడగమంటాడు లివింగ్ లెజెండ్. ఈ వీడియో ఎక్కడిదని రిపోర్టర్ అడిగితే, సియోల్ పోలీస్ చీఫ్ తో మేయర్ గారి డిన్నర్ అప్పటిదని అంటుంది పార్క్. ఎవరు లీక్ చేశారో తెలుసుకున్నారా అన్న ఇంకో ప్రశ్నకి,  “ప్రతిపక్ష లీడర్ యాంగ్ లీక్ చేయించిందని అనుకుంటున్నాం...” అంటుంది పార్క్.  ఇలా ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారు...దీన్ని రగడ చేసి లబ్ది పొందాలనా?” ఇంకో ప్రశ్న అడుగుతూంటే, దఢేల్మన్న శబ్దంతో ఇనప డోర్ తోసుకుని వచ్చేస్తాడు మేయర్. అతడి వెనుక షిమ్ వస్తాడు. వేదిక నెక్కి చెప్పడం ప్రారంభిస్తాడు మేయర్ :
          “ఇంత ఉక్కబోతలో మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు. ఇందాకే మీరు చూసినట్టు ఇలాటి దుష్ప్రచారాలు ఇంకా ఈ రోజుల్లో కూడా ఎన్నికల్లో చేస్తున్నారా? నా ప్రియమైన సియోల్ పౌరులారా, మీ నగరాన్ని మీరే దృష్టికోణంలో చూస్తున్నారు? ఎన్నో అవకాశాలూ ఉద్యోగాలూ కల్పించే నగరంగా...ప్రమాదాలకీ విపత్తులకీ తక్షణం స్పందించే యంత్రాంగం గల నగరంగా... నేనింకో ఇమేజి దీనికి జోడిస్తాను : మన జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోయే అందమైన నగరంగా...ఇటీవల నేనొక డే కేర్ సెంటర్ కెళ్ళాను. తాజా పరీక్షల విధానాన్ని తనిఖీ చేయడానికి. అక్కడ చదువుకుంటున్న పిల్లల్ని అడిగాను - మీ ఇల్లెక్కడా అని. అందరూ ఒకటే చెప్పారు ఫలానా ఫలానా అపార్ట్ మెంట్స్ అని. ఇవాళ్టి పిల్లలు వాళ్ళ నివాస స్థలాల్ని చుట్టూ పరిసరాలకి బదులుగా అపార్ట్ మెంట్స్ తో గుర్తిస్తున్నారు. సియోల్ కాంక్రీట్ దిబ్బలా మారిపోయింది. ఇలాగానా మన జ్ఞాపకాల్లో నిల్చిపోవాల్సింది మన నగరం? ఇది చాలా ప్రమాదకర పరిణామం. నేను మీ నగరాన్ని అందమైన జ్ఞాపకాల గుచ్ఛంలా తిరిగివ్వాలనుకుంటున్నాను. దీన్నిక్కడ్నించే ప్రారంభిస్తాను, ఈ పారిశ్రామిక వాడ నుంచే. ఇక్కడ సిటీ లైబ్రరీ నిర్మిస్తాను. ఈ పారిశ్రామిక వాడలో నేనొక ఫ్యాక్టరీ వర్కర్ గా జీవితం ప్రారంభించాను. ఇరవై ఏళ్ళు తిరిగేసరికల్లా మూడు సార్లు మేయర్ గా ఎన్నికయ్యాను. ఈ పారిశ్రామిక వాడ నాకు రెండో ఇల్లు లాంటిది. ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నాను – ఈ నాల్గోసారి నేను ఎన్నికల్లో నిలబడ్డాను. మీ సహకారం, ప్రోత్సాహం నాకు బలాన్నిస్తాయని నమ్ముతున్నాను. మీ నిర్మాణాత్మక విమర్శల్ని ఔషధంలా స్వీకరిస్తాను. అలాగే, నా విధానాల్నిఖండిస్తూ, దుష్ప్రచారాలు చేస్తూ, నన్ను దెబ్బ తీయాలని చూస్తున్న ప్రతిపక్షాల్ని నేను సహించను, లొంగను. నన్ను తిరిగి మీ మేయర్ గా ఎన్నుకోండి. సంక్షేమానికీ, సంస్కరణలకీ ఓటెయ్యండి. మన పెద్దల మాట ఒకటుంది... రేసు గుర్రం దాని గిట్టల్ని టకటక లాడించక మానదని. నేను మీ రేసు గుర్రాన్ని కావాలనుకుంటున్నాను, ధన్యవాదాలు”
***
       17 సీన్లతో ఈ బిగినింగ్ విభాగం ఇరవై నిమిషాలు. ఈ బిగినింగ్ విభాగంలోనే కథనం అప్పుడే కథ ప్రారంభమయినట్టూ వుండీ ప్రారంభం కానట్టూ వుంటుంది. బిగినింగ్ విభాగంలో ఎప్పుడూ కథ ప్రారంభం కాదనేది తెలిసిందే. బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయమూ, సమస్యకిదారి తీసే పరిస్థితులూ వగైరా ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ వస్తే – అక్కడా  పాత్రకి ఏర్పడే ఆ సమస్య తాలూకు గోల్ తో, ఏ సినిమా కథయినా ప్రారంభమయినట్టు లెక్క. దీనికి ముందు బిగినింగ్ లో చూపించే కథనమంతా కథని ప్రారంభించడానికి చేసే సన్నాహాలే. అయితే ప్రస్తుత సినిమా విషయంలో ఈ సన్నాహాలూ దీంతో బాటే పరోక్షంగా కథా ప్రారంభమూ  బిగినింగ్ విభాగంలో  కన్పిస్తాయి.  

          సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన లేకపోతే బిగినింగ్  విభాగంలో నడిచే దృశ్యాలు కథ ప్రారంభమైన మిడిల్ విభాగపు దృశ్యాల్లాగే కనబడతాయి. సమస్యతో సంఘర్షణ జరుగుతున్నట్టే వుంటాయి. ఈ ‘ది మేయర్’ బిగినింగ్ విభాగపు దృశ్యాల్లో ప్లాట్ పాయింట్ వన్ తాలూకు సమస్యా,  దాని గోల్ కన్పించడంలేదు. ప్రారంభ సీను నుంచీ ఇది ఎన్నికల సందర్భమని తెలుస్తూనే వుంది. కథా నేపథ్యాన్ని ఏర్పాటు చేయడం వరకే వుంది. కథానేపథ్యపు ఏర్పాటుతో బాటు పాత్రల పరిచయాలూ వున్నాయి. మేయర్ పాత్ర, అతడి అనుంగుడు షిమ్ పాత్ర, పబ్లిసిటీ స్పెషలిస్టు పార్క్ పాత్ర, యాడ్స్ లివింగ్ లెజెండ్ పాత్ర, ప్రతిపక్ష అభ్యర్ధి యాంగ్ పాత్ర మొదలైనవి. ఈ పాత్రల్ని కథకవసరమైన రాజకీయ జీవితాల మేరకే వృత్తిగతంగా మాత్రమే పరిచయం చేశారు. దీంతో బాటు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా కూడా సీన్లేసి కథా శిల్పాన్ని దెబ్బ తీయలేదు. ఫ్యామిలీల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న చాదస్తానికి పోలేదు.  మార్కెట్ యాస్పెక్ట్ అంటే. ఈ కథకి ఇప్పటి మార్కెట్ కి ఏది బావుంటుందో తెలియడమే మార్కెట్ యాస్పెక్ట్. దీంతో చెబుతున్న కథ మీదే ప్రేక్షకులకి ఫోకస్ ఏర్పాటు చేసినట్టయింది. మొదటి సీనులో మేయర్ పాత్ర పరిచయాన్నియూత్ అప్పీల్ తోనే  ఎత్తుకున్నారు. ఇది మార్కెట్ యాస్పెక్ట్. అతను యూత్ ర్యాలీలో డాన్స్ చేయడం, అతణ్ణి అడిగే మొదటి ప్రశ్న యూత్ తో యూత్ ప్రేమలకి సంబంధించే వుండడమూ మార్కెట్ యాస్పెక్టే. తర్వాతి ప్రశ్న అతడి కుటుంబంతో కనెక్ట్ చేశారు. తర్వాతి ప్రశ్నతో వృత్తికి, ఎన్నికలకి కనెక్ట్ చేశారు. ఒక కథా పథకం లేకుండా ఏదో తోచిన ప్రశ్నలు అడిగించలేదు యువ పాత్రల చేత. 

          అవతల మేయర్ కి పోటీ చేయడానికి ప్రకటనకి సిద్ధమైన ప్రతిపక్ష అభ్యర్ది యాంగ్, కావాలని ఆ కాగితాలు ఎగరేసుకుని, వాటి కోసం వంగి, వక్షసంపదని ఎక్స్ పోజ్ చేసుకుంది. ఓట్లు పొందడానికి ఇదొక్కటే మార్గమనుకుంది. ఆ సంపద వైరల్ అయింది. కానీ ఈ ప్రతిపక్షం మేయర్ కి వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్నసీన్లు లేవు. మేయర్ కి ప్రత్యర్ధులు అతడి పార్టీలోనే వున్నట్టు షిమ్ పాత్రద్వారా చూపించారు. ఈ షిమ్ మేయర్ వీడియోతో గేమ్ ఆడేడు. అయినా ఇది కూడా సమస్యకి అంటే ప్లాట్ పాయింట్ వన్ కి దారితీయలేదు. అంతలోనే పార్క్ దీన్ని క్లియర్ చేసేసింది. అప్పుడు మేయర్ తో నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రకటన సీను వచ్చేసింది. ఇదే ప్లాట్ పాయింట్ వన్ అయింది.

          ఇదీ సమస్యకి (ప్లాట్ పాయింట్ వన్ కి) దారి తీసే పరిస్థితుల కల్పన చూపించకుండా నేరుగా సమస్యని (ప్లాట్ పాయింట్ వన్ ని) ఏర్పాటు చేయడం. పరిస్థితులు ఆల్రెడీ ఇది ఎన్నికల సిట్యుయేషన్ అని మొదటి సీను నుంచీ వుంది. కానీ ఈ సీన్లేవీ మేయర్ ప్రకటనకి దారితీయలేదు. ఆ చూపిస్తున్న ఎన్నికల్ వాతావరణంలో మేయర్ పోటీ చేస్తాడని మనకి తెలుసు. అంటే ఆల్రెడీ గోల్ వుంది. అతను ప్రకటన చేయడమే మిగిలింది. ఆ ప్రకటన తన ప్రాసెస్ లో తను చేసేశాడు దేంతోనూ నిమిత్తం లేకుండా. ఎడిట్ చేసిన తన వీడియోతో అనర్థం జరిగిపోతోందని హడావిడిగా అతను ప్రకటన చేయలేదు. అలా చేసి వుంటే ఆ వీడియోనే తర్వాత అతను ఎదుర్కొనే కథయ్యేది. ఈ వీడియో కంటే ముందే వెనుక వొక సీనులో, మేయర్ ప్రకటన చేయడానికి రెండు రోజులు టైముందని చెప్పేశారు. ఆ షెడ్యూల్ ప్రకారమే అతను  ప్రకటన చేశాడు. కాబట్టి పాత్రలు సృష్టించిన ఏ పరిస్థితులూ ప్లాట్ పాయింట్ వన్ కి దారి తీయలేదు. వీడియో ఎపిసోడ్ ని పార్క్ చేత చెక్ పెట్టించేశారు. ‘శివ’ లో హీరోయిన్ ని టీజ్ చేస్తున్న జేడీకి ముందే చెక్ పెట్టేస్తే ఎలా వుండేది? ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున సైకిలు చెయినుతో కొట్టే దృశ్యం వచ్చేది కాదు. ‘ది మేయర్’ లో వీడియోకి చెక్ పెట్టేసి ఈ ఎపిసోడ్ తో ప్లాట్ పాయింట్ వన్ కి సంబంధాన్ని తుంచేశారు. ఆల్రెడీ కథనంలో ట్రావెల్ చేస్తున్న డిసైడ్ అయిపోయిన మేయర్ ప్రకటన వుంది కాబట్టి. 

          ప్లాట్ పాయింట్ వన్ తో ఇదొక ఇన్నోవేషన్. ప్లాట్ పాయింట్ వన్ కి దారితీసే పరిస్థితుల కల్పన లేకుండా బిగినింగ్ విభాగంతో క్రియేటివిటీ. ఇంకో క్రియేటివిటీ ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ లో ఎలా వుందో చూద్దాం...

సికిందర్
   

8, నవంబర్ 2018, గురువారం

704 : రివ్యూ


రచన – దర్శకత్వం : విజయ్ కృష్ణ ఆచార్య
తారాగణం : అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, జాకీ ష్రాఫ్, అబ్దుల్ ఖదీర్ అమీన్, లాయిడ్ ఓవెన్, రోణిత రాయ్, తదితరులు
సంగీతం : మానుష్ నందన్, ఛాయాగ్రహణం :
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,
నిర్మాత : ఆదిత్యా చోప్రా
విడుదల : నవంబర్ 8. 2018
***

         బాలీవుడ్ లో ఇప్పుడు చారిత్రక సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ లో చరిత్ర సృష్టించిన బందిపోట్ల కథల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఒకవైపు సైఫలీ ఖాన్ తో రాజస్థాన్ బందిపోటు ‘హంటర్’ తీస్తూంటే, మరోవైపు  రణబీర్ కపూర్ తో మధ్యప్రదేశ్ బందిపోటు ‘షంషేర్’ ముస్తాబవుతోంది. ఇంకో వైపు ఇప్పుడు ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ నిర్మాణం పూర్తి చేసుకుని ఈ వారం విడుదలై పోయింది. అమీర్ ఖాన్ – అమితాబ్ బచ్చన్ లతో సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ ఎపిక్ యాక్షన్ మీదే దేశమంతా దృష్టి పెట్టి వుంది. 210 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో  నిర్మించిన ఈ మెగా పీరియడ్ మూవీ కోసం ఏకంగా రెండు భారీ షిప్పులే  నిర్మించారు. ఇంకా హేమా హేమీలైన నటీనటులూ, సాంకేతిక నిపుణులూ కలిసి అవిరళ కృషి చేశారు.  ‘ధూమ్’ సిరీస్ సినిమాలు తీసిన విజయ్ కృష్ణ ఆచార్య  ఇంత భారీ బాధ్యత భుజానేసుకున్నాడు.  మొదటి రోజు అన్ని ఆటలకి రెండు లక్షల టికెట్లు అమ్ముడుబోయి విడుదలకి ముందే సంచలనం సృష్టిస్తున్న మూవీలో కన్పించే ఈ థగ్గుల ముఠా ఏ మాత్రం ప్రేక్షకుల్ని అలరించారో చూద్దాం...

కథ  
       18 వ శతాబ్దంలో  బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ  చిన్న చిన్న రాజ్యాల్ని కబళిస్తూ రౌనక్ పూర్ మీద కన్నేస్తుంది. బ్రిటిష్ అధికారి జాన్ క్లైవ్,  రౌనక్ పూర్ రాజు మీర్జా బేగ్ ని మోసంతో హతమార్చి రాజ్యాన్ని కాజేస్తాడు. కుటుంబం మీద జరిగిన ఆ ఘాతుకం బారినుంచి సైన్యాధ్యక్షుడు ఖుదాబక్ష్ (అమితాబ్ బచ్చన్) మీర్జా బేగ్ కూతురు జఫీరా (ఫాతిమా సనా షేక్) ని కాపాడి తీసికెళ్ళి పోతాడు. బ్రిటిషర్ల మీద తిరుగుబాటు ప్రకటించి రెబెల్ గా ముఠా కడతాడు. 
          ఒక ఫిరంగీ మల్లా (అమీర్ ఖాన్) అనే ఆవారా మోసకారి వుంటాడు. ఇతను బ్రిటిషర్ల ఏజెంటుగా వుంటూ వ్యక్తుల్ని పట్టిస్తూంటాడు. ఆజాద్ పేరుతో రెబెల్ గా మారిన ఖుదాబక్ష్ ని పట్టించే పనిని బ్రిటిషర్లు ఇతడికే అప్పజెప్తారు. ఫిరంగీ ఆజాద్ దగ్గర మాయోపాయంతో చేరి అతణ్ణి బ్రిటిష్ వాళ్ళకి పట్టించడంతో ఉద్రిక్తతలు నెలకొంటాయి. మోసం చేసిన ఫిరంగిని ఆజాద్ ఏం చేశాడు? అసలు ఫిరంగి ఆంతర్యమేమిటి? బ్రిటిష్ వాళ్ళు ఏమయ్యారు?...ఇదీ మిగతా కథ. 
ఎలా వుంది కథ
          బాలీవుడ్ లో ఇప్పుడు చరిత్రలోకి తొంగి చూసే సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కల్పిత కథలు, కల్పిత పాత్రలూ గ్లామర్ కోల్పోయాయి. వరసకట్టి ఒక అరడజను చారిత్రక సినిమా లు రాబోతున్నాయి. వీటిలో ప్రముఖమైనది ప్రస్తుత మెగా కథ. 1839 లో ఫిలిప్ మీడోవ్స్ టేలర్ అనే రచయిత రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్అన్న నవల ఈ మూవీకి స్ఫూర్తి అని  చెప్పారు. థగ్గులనే వాళ్ళు దారి దోపిడీలకి పాల్పడి చంపేసే కౄర హంతక తెగ. వీళ్ళు 600 ఏళ్ళపాటు అవిచ్ఛిన్నంగా దురాగతాలు సాగించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే ఈ తెగని నామరూపాల్లేకుండా అంతమొందించారు. ఈ చరిత్రతో పైన చెప్పుకున్న నవలకీ, ఈ సినిమాకీ ఏ సంబంధమూ లేదు. థగ్గుల గురించి తెలుసుకుందామని పోతే నిరాశే మిగిలుతుంది. కేవలం థగ్స్ అనే పేరుని బాక్సాఫీసు అప్పీల్ కోసం వాడుకున్నారు. అమీర్ పాత్ర థగ్గు కాదు, అతడికో ముఠా కూడా వుండదు. ముఠా వుండేది అమితాబ్ పాత్రకే. అతడిది బ్రిటిషర్ల మీద రెబెల్ పాత్ర. దోపిడీ ముఠాలే లేవు. సింపుల్ గా చెప్పాలంటే  కొందరు సామాన్యులు బ్రిటిషర్లని ఓడించే రొటీన్ కల్పిత ఫార్ములా కథ ఇది. అమీర్, అమితాబ్ లిద్దరివీ కూడా చారిత్రక పాత్రలు కావు. పైన చెప్పుకున్న సైఫలీ ఖాన్, రణబీర్ కపూర్ల చారిత్రక సినిమాల్లో వాళ్ళవి చరిత్రలో నిజ పాత్రలు. నిజ పాత్రల ఉనికి లేకుండా చరిత్ర పేరు చెప్పి సినిమా తీస్తే ఆ కథతో ప్రేక్షకులెలా కనెక్ట్ అవుతారు. ఇంతకంటే అప్పట్లో మనోజ్ కుమార్ తీసిన బ్రిటిషర్లతో  భారీ కాల్పనిక దేశభక్తి ‘క్రాంతి’ సినిమా
చాలా  నయం.
ఎవరెలా చేశారు

      థగ్గులతో చారిత్రాత్మక సినిమా అన్న కలరిచ్చి, ఆ థగ్గుల పాత్రలే లేకుండా అమితాబ్, అమీర్ లని అరిగిపోయిన రొటీన్ ఫార్ములా పాత్రలుగా చూపించడం సగం ఆసక్తిని  చంపేస్తుందీ సినిమా. పాత్రలు ఫ్రీడం, ఫ్రీడం అంటూ వుంటాయి- బ్రిటిషర్ల నుంచి ఇలాటి స్వాతంత్ర్య పోరాటపు సినిమాలు వచ్చీ వచ్చీ ఇక అరిగిపోయాయి. అందుకే చరిత్రలో పోరాటయోధుల్ని వెతికి సినిమాల్ని తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యే 1948 ఒలింపిక్స్ లో,  హాకీలో బ్రిటిషర్లని ఓడించి కసి తీర్చుకున్ననిజ ఆటగాళ్ళ పాత్రలతో ‘గోల్డ్’ తీశారు. ఇది ఎంతో అలరించింది. ఇలాటి చారిత్రక మూలాల్లేని పాత్రలు కాకపోవడంతో అమితాబ్, అమీర్ ల పాత్రలూ నటనలూ తేలిపోయాయి.

        సురయ్యా అనే డాన్సర్ పాత్రలో కత్రినా కైఫ్ చేసే రెండు డాన్సులు అద్భుతంగా వుంటాయి. కానీ పాత్రగా ఆమెకి స్థానం లేదు. స్థానమున్న పాత్రలో జఫీరాగా నటించిన ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా చేసే యాక్షన్ సీన్స్ ఉత్కంత రేపుతాయి. జ్యోతిషం చెప్పే శనిచర్ పాత్రలో మహ్మద్ జీషాన్ అయూబ్, బ్రిటిషర్ జాన్ క్లైవ్ పాత్రలో లాయిడ్ ఓవెన్ లు కన్పిస్తారు. ఈ ఆరుపాత్రల చుట్టే కథ వుంటుంది. 
          పాటలూ వాటి భారీ సెట్టింగుల చిత్రీకరణా వొక విజువల్ అప్పీల్. పోరాట దృశ్యాలు అంత అద్భుతంగా ఏమీ వుండవు - ఓడల మీద యాక్షన్ సీన్స్ సహా. కానీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా వున్నాయి. లోకేషన్స్, కాస్టూమ్స్ వగైరా ఇష్టారాజ్యమే,  ఎందుకంటే చరిత్రతో సంబంధం లేదు కాబట్టి. సంభాషణల పరంగానూ బలహీనమే. అమీర్ కంత్రీ పాత్రకి కూడా డాఈళాఈఊఓ కిక్కులేదు. మనిషి గురించి, జీవితం గురించీ అమితాబ్ వల్లే వేస్తూ వుండే బరువైన డైలాగులు ఇప్పుడెవరికి కావాలి. 
చివరికేమిటి 


 ఈ సినిమా చివరి షాట్ లో అమీర్ ఖాన్  ఓడెక్కి- మనల్ని ఇంతకాలం దోచుకున్న తెల్లవాళ్ళని దోచుకోవడానికి ఇంగ్లాండ్ పోతున్నానంటాడు. ఇదే ముగింపు డైలాగు. దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యకి ఇప్పుడు బోధ పడిందన్న మాట - థగ్గులతో కథ తీస్తే దోచుకోవడం మీద తీయాలని! అమీర్ ఖాన్ ఆ దోచుకునేదేదో దేశంలో దోచుకుంటున్న బ్రిటిష్ వాళ్ళని దోచుకుంటూ ముప్పు తిప్పలు పెడితే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే కథ. థగ్గుల చరిత్రలో థగ్గులు  బ్రిటిష్ వాళ్ళ  ఖజానాల్ని గుల్ల చేస్తూంటేనే బ్రిటిషర్లకి కోపమొచ్చి థగ్గుల్ని ఏరి ఏరి  ఫినిష్ చేశారు. ఎలా వుండాల్సిన కథ ఎలా తీశారో. రెండు పెగ్గులేసి పడుకోవాలన్పించే కథ. దీని స్క్రీన్ ప్లే నైతే చెప్పనవసరం లేదు. పైగా మందకొడి నడక. చిన్నప్పుడు ఫాతిమా పాత్ర దసరాకి నా రెండు పళ్ళూడి పోయాయని సెక్యులరిజాన్ని జోడించి చెప్తుంది. పెద్దయ్యాక అదే దసరాకి రావణ దహనం అప్పుడు నిప్పుల బాణం వేసి రావణుడి సహా తెల్లవాడిని దగ్ధం చేస్తుంది. ఇది కూడా గంగా జమున తెహజీబ్ లా బాగానే  వుంది గానీ,  మొదట్లో పళ్ళూడి పోయాయని చెప్పడం దగ్గర్నుంచీ దర్శకుడు కోరలు పీకేశాడు సినిమాకి.
సికిందర్


4, నవంబర్ 2018, ఆదివారం

703 :‘పాలపిట్ట’ ఆర్టికల్, విస్మృత సినిమాలు -1


      కొన్ని మంచి సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడక కనుమరుగైపోతాయి. కారణాలనేకం వుంటాయి. మంచి సినిమాలకి ప్రేక్షకాదరణ లేకపోవడమనే సమస్య ఏ కాలంలోనైనా వుంటూనే వుంది. మంచి సినిమా అంటే కమర్షియల్ విలువలకి దూరంగా ఉండేదని ఒక  నిర్వచనమైతే వుంది గానీ, మంచి సినిమా ప్రమాణాలేమిటో ఎవరికీ తెలీదు. తెలిసినా ఉపయోగం లేదు. ఎందుకంటే వాటికి ప్రేక్షకులు తక్కువ. ఆ తక్కువ మంది ప్రేక్షకులే అభిరుచిగల ప్రేక్షకులు. కొన్నిసార్లు వీరి దృష్టిలో కూడా పడకుండా అదృశ్యమై పోతూంటాయి మంచి సినిమాలు. అలాటి ఒక తాజా మంచి సినిమా గురించి చెప్పుకోవాలంటే ‘మన ఊరి రామాయణం’ ని గుర్తు చేసుకోవాలి.

          ‘మన ఊరి రామాయణం’ ది విచిత్ర పరిస్థితి. పాత తరహా టైటిల్ చూసి ఇది మన సినిమా అనుకుని పెద్ద వాళ్ళు వెళ్లారు. తీరా చూస్తే అది కుర్రకారు సినిమా. టైటిల్ ని చూసి కుర్రకారు ఇది మనది కాదులే అనుకుని దూరంగా వుండిపోయారు. ఇలా ఒక మంచి సినిమా రెంటికీ చెడ్డ రేవడి అయింది. 

         
ధోని, ఉలవచారు బిర్యానీ  వంటి సమాంతర సినిమాలకు దర్శకత్వం వహించి తన అభిరుచి యేమిటో చాటుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చాటుతూ 2016 లో మన ఊరి రామాయణంతీశారు. ఇది కూడా రీమేకే. ఇతర భాషల్లో తనకి  నచ్చిన ఉత్తమ సినిమాల్ని రీమేక్ చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్, ఈసారి  కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకి సవాలు విసురుతూ కమర్షియలేతర సినిమా తీశారు. ఒక సినిమాని పాటలు, ప్రేమలు, డాన్సులు, ఫైట్లు, కామెడీలూ లేకుండా చూడలేనంత మొద్దుబారిపోయి వున్నామా మనం నిజంగా - లేకపోతే పలాయనవాదంతో అలా నటిస్తున్నామా? నిజంగా ఇవేవీ లేని ఒక బలమైన కమర్షియలేతర సినిమాని చూడలేమా తెలుగులో? సినిమా అక్షరాస్యతా రేఖకి  అంత దిగువకి జారిపోయి క్షణికానందం కోసం ఉత్త కాలక్షేప సినిమాలు చూస్తూ జీవితాలు చాలించుకోవడమేనా? చూసే సినిమాలు అధమంగా వుండాలనుకున్నప్పుడు, కొనే సెల్ ఫోన్లు కూడా అధమంగానే  వుండాలిగా? అనవసరంగా ఈ హిపోక్రసీ  ‘మన ఊరి రామాయణంలాంటి సినిమాల్ని చంపేస్తోంది. కానీ ఈ సినిమా ముందు కమర్షియల్ సినిమాలు కూడా బలాదూర్  అనేందుకు ఇందులో ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చో బెట్టే  అంశాలు ఎలా వుండాలో అలా కుదిరి, ఇది కదా సినిమా అంటే అన్న ఒక కొత్త ఎరుకతో సంతృప్తి చెందుతాం.

కథలోకి వెళ్దాం 
       దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించుకుని సొంతూరు వస్తాడు భుజంగయ్య (ప్రకాష్ రాజ్). ఊళ్ళో భార్య, అత్తా, ఇద్దరు కూతుళ్ళూ వుంటారు. బయట డబ్బు మదంతో, ఇంట్లో అడ్డమైన పెత్తనంతో ఎవర్నీ నోరెత్త నివ్వకుండా ఇష్టారాజ్యంగా బతికేస్తూంటాడు. చేసే పనేం లేదు. సాయంత్రం కాగానే తన ఇగోని సంతృప్తి పర్చుకుంటూ నేస్తాలకి మందు పోసి పొగడ్తలు విని తరించడమే. ఇంటి కాంపౌండు నానుకుని రోడ్డు మీదికి ఓ షాపు తన సొంతానిది. దాన్ని అద్దెకివ్వకుండా సాయంకాలాలు పానశాలగా మార్చడమే. దుబాయ్ కి వెళ్ళక ముందు ప్రతీ శ్రీరామ నవమికీ రావణుడి వేషం వేసేవాడట. ఇప్పుడు నవమి వచ్చింది. ఆ ఉత్సవాలు డబ్బు ఖర్చుపెట్టి భారీగా నిర్వహిస్తూంటాడు. ఆ ఉత్సవాల్లో భాగంగా తను  రావణాసురుడి వేషం వెయ్య బోతున్నాడు.  ఆ రాక్షసత్వం ఇప్పుడు ఇంట్లో కూడా ప్రదర్శిస్తూ పెద్ద కూతుర్ని డిగ్రీ చదువుకో నివ్వడు. ఎందుకంటే కాలేజీ పేరుతో  ఆమె బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందని అనుమానం, కాబట్టి కాలేజీ మాన్పించేసి పెళ్లి చేసేస్తానంటాడు. ఒక రోజు ఇంట్లో మాటామాటా పెరిగి ఉక్రోషంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. వూళ్ళో తనకి నమ్మిన బంటు శివ (సత్యదేవ్) అనే ఆటో డ్రైవర్ ఉంటాడు. వీడికి దుబాయ్ వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని వెంట తిప్పుకుంటూంటాడు. ఆ రాత్రి షాపులో మందు భాయీలతో మందేసుకుని శివ ఆటో ఎక్కి ఎక్కడికో బయల్దేరతాడు భుజంగయ్య. బయల్దేరుతోంటే రోడ్డుపక్క అమ్మాయి కన్పిస్తుంది. ఆమెని పొందాలన్పిస్తుంది. శివని  పంపిస్తాడు. సుశీల (ప్రియమణి) అనే ఆ వేశ్యని మాట్లాడి శివ పట్టుకొస్తాడు. వాళ్ళు కులకడానికి షాపులోకి తోసి తాళం వేసుకుని, భోజనం తీసుకుని గంటలో వస్తానని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడు ఇక రాడు.  

          ఈ రాకపోవడమే భుజంగయ్య కొంపలు ముంచుతుంది. రాత్రంతా వేశ్యతో షాపులో ఇరుక్కుని, ఏ సమయంలో ఏం జరుగుతుందో, తెల్లారితే ఇదెక్కడ బయటపడి ఇంటా బయటా పరువుపోతుందో, తానేమై పోతాడో - అని క్షణం క్షణం ప్రాణాలరజేతిలో బెట్టుకుని నానా చావూ చస్తాడు. 

         
భుజంగయ్య ఈ రొంపి లోంచి ఎలా బయట పడ్డాడు, చిట్ట చివరికి తాళం ఎవరు తీశారు, అప్పుడు ఎవరికి తను దొరికిపోయాడు, దొరికిపోతే ఏం జరిగిందనేది అడుగడుగునా సస్పెన్స్ తో కట్టి పడేసే కథే.

కథ వెనుక కథ 
       2012 లో జాయ్ మాథ్యూస్ అనే కొత్త దర్శకుడు తీసిన షటర్’  అనే మలయాళ  సినిమాకి రీమేక్ ఇది. మలయాళ ఒరిజినల్ కేవలం సస్పెన్స్ థ్రిల్లరే అయితే, తెలుగులో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనే బంగారు పళ్ళేనికి  మరింత గాత్వాన్ని కల్పిస్తూ,  రామాయణంతో పౌరాణిక గోడ చేర్పు ఇచ్చారు. బాపూ రమణలు ఆ పైన వుంటే అక్కడ్నించీ  ప్రకాష్ రాజ్ కి అభినందన సందేశం పంపుతారు - రామాయణాన్ని ఇలా కూడా తీస్తావటయ్యా భలేవాడివి- అని. 1979 లో దాసరి నారాయణ రావు అక్కినేని నాగేశ్వర రావుతో రాముడే రావణుడైతేతీశారు. కానీ రావణుడే రాముడైతే? ఇదే ఈ కథ. రావణుడు రాముడిగా మారే కథ. ఒక నోరు తిరగని పేరుతో పోలెండ్ దర్శకుడొకాయన వున్నాడు-  స్ట్రిస్టాఫ్ కీష్ లాస్కీ అని. ఇంగ్లీషులో స్పెల్లింగ్ ఇలా వుంటుంది- Krzysztof Kieslowski  అని. ఈయన 1989లో టెన్ కమాండ్ మెంట్స్ని ఆధారంగా తీసుకుని డెకలాగ్అనే పది నీతికథల టెలిఫిలిమ్స్ తీశాడు. అవన్నీ ఒకే అపార్ట్ మెంట్ లో జరుగుతాయి. అలా వేశ్యతో ఒక షాపులో ఇరుక్కున్న  రావణుడి నీతి కథే ఇది. మనిషిలో రాముడు రావణుడు ఇద్దరూ వుంటారు. ఇంకో తన బలమెంతో తెలియని హనుమంతుడూ వుంటాడు. అలాగే సీతలా  కన్పించే అమ్మాయి సీత కాకపోవచ్చు- శూర్పణక అయివుండవచ్చు. ఇవన్నీ కలిపి ఒక సస్పెన్స్ రామాయణం ఈ కథ. మలయాళ ఒరిజినల్ దర్శకుడు తన కథని పొయెటికల్ వయొలెన్స్ ఆన్ సెల్యూలాయిడ్అన్నాడు. ఇది తెలుగు కూడా వర్తిస్తుంది.

నటనల సంగతి
       ప్రకాష్ రాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత రావణుడైనా వాడు కుక్కిన పేనయ్యే రోజొకటి వస్తుంది. వేశ్యతో ఇరుక్కున్న ఈ పరిస్థితిని అద్వితీయంగా పోషించాడు. చాలా క్లిష్ట పాత్ర ఇది. పాత్రలోకి మనల్ని లీనం చేసి వదలకుండా తనతో తీసుకుపోతాడు. క్షణం క్షణం మారిపోయే పరిస్థితులకి అంతకంతకూ పెరిగిపోయే భావోద్వేగాల తీవ్రతని కంటిన్యుటీ చెడకుండా పకడ్బందీగా నటించాడు. షాపు వెనకాలే ఇంట్లో భార్యా పిల్లలున్నారు, షాపులో వేశ్యతో తను వున్నాడు. తాగిన మత్తులో వేశ్యని కోరుకున్నాడు, తీరా ఆమెకి దగ్గర కాలేకపోతున్నాడు. అలాటి తత్త్వం కాదు తనది. ఇంట్లోభార్యని నోరెత్తకుండా చేసే తను ఇప్పుడు వేశ్య ఏరా పోరా అంటున్నా కూడా కిక్కురుమనలేక పోతున్నాడు. తాళం వేసుకుపోయిన శివ ఎంతకీ రాకపోయేసరికి భయం- పరువు ప్రతిష్టలగురించి భయం పట్టుకుంది. పైగా పక్క షాపు వాడికి తన షాపు అద్దె కివ్వననేసరికి వాడు కోపం పెంచుకున్నాడు. ఇప్పుడు షాపులో ఏ మాత్రం అలికిడి అయినా వాడొచ్చే  ప్రమాదముంది. కానీ ఈ దిక్కుమాలిన వేశ్య సెల్ ఫోన్ కి మాటిమాటికీ కస్టమర్స్ నుంచి కాల్స్ రావడం, ఆమె పెంకెగా అరిచి మాట్లాడడం ప్రాణాల్ని తోడేస్తోంది...ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రావణుడి క్షోభ అంతా ఇంతా కాదు. ఇదంతా ప్రకాష్ రాజ్ నటనతో అడుగడుగునా ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఉత్కంఠని రేపుతాయి. అంత తేలిగ్గా మర్చిపోలేం ఈ పాత్రలోప్రకాష్ రాజ్ ని.

         
 ప్రియమణి కూడా వేశ్య చేష్టల్ని చాలా నేర్పుగా నటించింది. ఎంత సేపూ తన గొడవే గానీ అవతలి వాడి ఏడ్పు ఏమాత్రం పట్టని పాత్ర చిత్రణతో తను సృష్టించే సమస్యలు ఇన్నీ అన్నీ కావు- పరువు గురించి వీడికి భయముంటే తనకేంటన్నవేశ్యల కుండే సహజ నిర్లక్ష్యంతో హడలెత్తించేస్తుంది. దాదాపు ముప్పావు కథ ఈ జగమొండి తనంతోనే సాగేక, అప్పుడు తెల్లారి వెంటిలేటర్ లోంచి అవతల ఇంట్లో అతడి భార్యా పిల్లల్ని చూసినప్పుడు, మెత్తబడి మొట్టి కాయలేయడం మొదలెడుతుంది అతడి పాడు బుద్ధికి. తను కూడా మానవత్వం నేర్చుకుని హూందాతనం ప్రదర్శిస్తుంది. ప్రియమణి కూడా గుర్తుండిపోతుంది ఈ పాత్రతో.

         
ఇక సత్యదేవ్ గురించి. తెలుగు వాడైన ఇతను పూరీ జగన్నాథ్ తీసిన జ్యోతిలక్ష్మితో పరిచయమయ్యాడు. ఆ సినిమాలో వేశ్యతోనే, ఈ సినిమాలోనూ వేశ్యతోనే. భుజంగయ్య తనకి రాముడు లాంటి వాడు. తను హనుమంతుడు. కానీ వాళ్ళిద్దర్నీ  షాపులోకి తోసి తాళం వేసుకుని భోజనం కోసంవెళ్ళిన వాడు ఎక్కడెక్కడో ఇరుక్కుంటాడు - ఏమేమో చేస్తాడు - ఎక్కడెక్కడో తిరుగుతాడు. తెల్లారిపోయాక నడిబజార్లో తాళం తీసే అవకాశం లేక, లోపలున్న గురువు గారి పరిస్థితికి తల్లడిల్లిపోతాడు- ఈ ఆటో డ్రైవర్ పాత్రలో  సత్యదేవ్ కూడా అత్యంత సహజంగా నటించాడు.  

         
ఇక పృథ్వీ ది చాలా విభిన్న పాత్ర, నటనా. బాగా రొటీనై పోయిన తన ఓవరాక్షన్ పేరడీల, డైలాగుల జడివానలోంచి ఓ తొలకరితో కొత్తదనానికి నాట్లు వేశాడు. ఒక స్ట్రగుల్ చేసే సినిమా దర్శకుడిగా మామూలు చొక్కా ప్యాంటు వేసుకుని,  సామాన్యుడిలా ఆటోల్లో తిరుగుతూ, తగ్గి మాట్లాడుతూ, పోగొట్టుకున్న స్క్రిప్టు వెతుక్కునే పాత్రలో పృథ్వీ జస్ట్ ది బెస్ట్. 

         
ఇక ఇలాటి కథ వున్న సినిమాతో ఇళయరాజా గురించి చెప్పేదేముంది- ఆయనకి మరో మౌనరాగమో మరోటో దొరికినట్టే. తన సంగీత సారమంతా కథలోకి దింపేశారు. అలాగే కెమెరా మాన్ ముఖేష్ ఒక ఆర్ట్ వర్క్ లా చిత్రీకరణ చేశాడు. అంత ప్రధాన పాత్రలో నటిస్తూ కూడా ప్రకాష్ రాజ్ కనబర్చిన దర్శకత్వపు మెళకువలు- షాట్స్ తీయడంలో నేర్పు విజువల్ మీడియా మీద తనకున్న పట్టు ఏమిటో తెలియజేస్తాయి. ఏ నటీనటులూ కూడా ఆయన దర్శకత్వంలో అసహజంగా కన్పించరు. 

భుజంగయ్య పాత్ర
       వూళ్ళో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వాతావరణమంతా మనకి తెలుస్తూ వుంటుంది. ఈ ఉత్సవాలకి  ఉదారంగా విరాళాలిస్తున్న భుజంగయ్య దుబాయ్ లో భారీగా సంపాదించుకు వచ్చాడని మాటల్లో మనకి తెలుస్తుంది. దీనికి తగ్గట్టు  వొంటి మీద బంగారు గొలుసులు, వేళ్ళకి ఉంగరాలు, చేతులకి కంకణాలు, జేబులో పాకెట్ లో ఫుల్లుగా నోట్లతో,  బ్రహ్మాండమైన సిల్కు దుస్తుల్లో  కళకళ లాడుతూ వుంటాడు. ఇంతేకాదు, ఈ సందర్భంగా భుజంగయ్యకి కళాపోషణ కూడా వుందని మనకి అర్ధమవుతుంది. ఉత్సవాల్లో రావణ పాత్ర పోషించాలన్న అతడి అభిలాష వల్ల. ఈ అభిలాష ఇంట్లో అతడిలోని రావణుణ్ణి మేల్కొల్పి నరకం చూపిస్తుంది. భుజంగయ్య ఇంట్లో మర్యాదలేని రాక్షసుడుయితే, బయట ఏంతో గౌరవనీయుడైన రావణుడు గారు. ఇంట్లో భార్య, అత్తా, పెద్ద కూతురు, చిన్న కూతురూ వున్నా, వీళ్ళని రాచి రంపాన పెడుతూంటాడు ఆడవాళ్ళన్న దయా, వీళ్ళే తనకి దిక్కూ మొక్కూ అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా.   

          ఇలా కూతురి ప్రేమ వ్యవహారం గురించి తెలిసి ఇంకోసారి నానా రభస చేసి, వొళ్ళు మండి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు భుజంగయ్య. ఈ వెళ్ళడం సింబాలిక్ గా రాముడు అరణ్య వాసానికి వెళ్ళినట్టే వుంటుంది.  ఇక రామాయణం ప్రారంభమైనట్టే. కాకపోతే ఇక్కడ రావణుడే  అరణ్యానికి వెళ్తున్నాడు. అలా వెళ్లిపోయి షాపులో నేస్తాలతో మందు కొట్టి, అర్ధరాత్రి బయటి కొచ్చి, శివ ఆటో ఎక్కుతాడు. ఈ ఆటోలో పోతున్నప్పుడే ఖర్మ కాలి రోడ్డు పక్క నిలబడి కన్పిస్తుంది రూపవతి సుశీల.

          ఈ సుశీల అనే వేశ్య గాలానికి చిక్కి,  తన షాపులోనే తను ఇరుక్కుంటాడు. ఇక్కడ పరిస్థితులు బాగా విషమిస్తోంటే, ఇక విధిలేక అన్నట్టు అస్తిత్వ  పోరాటం మొదలెడతాడు. తనకి గొప్ప పరువు ప్రతిష్ట లున్నాయని విర్రవీగి ప్రవర్తిస్తే, ఆ పరువు ప్రతిష్టలు కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇక లెంపలేసుకుని తన ప్రవర్తన మార్చుకోవాలే తప్ప, ప్రాణాల కంటే మిన్న అయిన పరువూ ప్రతిష్టల్ని పోగొట్టుకోలేడు. కాబట్టి ఇక మనసు చీకటి కోణాల్లో మేట వేసిన భయాలనే నెగెటివ్ శక్తులతో పోరాటం మొదలెడతాడు. ఆ షాపు గదిలో ఒక్కో సంఘటన అతడిలోని ఒక్కో రావణ గర్వాన్ని పటాపంచలు చేస్తూపోతుంది. మనిషి ఏదైనా కోల్పోతాడు గానీ పరువు ప్రతిష్టలు  కోల్పోవడానికి సిద్ధ పడడు కదా? 

          భుజంగయ్య ఈ సంఘర్షణలో తనలో అజ్ఞానమనే అడ్డుగోడల్ని కూల్చేసుకుంటాడు. జీవితపు నగ్నసత్యాల్ని తెలుసుకుంటాడు. పరమ సత్య మేమిటో గ్రహిస్తాడు. జీవితంగురించి
, కుటుంబ విలువల గురించి, మనిషి విలువ గురించీ చక్కగా నేర్చుకుని  తనలోని రావణుణ్ణి భూస్థాపితం చేసి, రాముడిలా ఇంటికి తిరిగి వస్తాడు. అతడి వనవాసం మనస్ఫూర్తిగా పూర్తయ్యింది. 

ఇదొక సైకో థెరఫీ 

       కరీనా కపూర్- రాహుల్ బోస్ లతో 2003 లో సుధీర్ మిశ్రా తీసిన చమేలీలో కూడా ఒక వర్షపు రాత్రంతా బస్టాపులో వేశ్యతో చిక్కుబడిపోయిన హీరో తెల్లారే సరికి మారిన మనిషిగా ఇంటికి తిరిగొస్తాడు. ఇంతే, గొప్ప కథలు సైకో థెరఫీలే చేస్తాయి. పాత్రల ఇగోల్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి మోక్షం కల్గిస్తాయి. 

      ప్రకాష్ రాజ్ కథంతా, పరివర్తనంతా  ఏడ్పులతో, డైలాగులతో చెప్పలేదు. ఒక్క నీతి వాక్యం మౌఖికంగా చెప్పలేదు. ఏ వాయిసోవర్ తోనూ ముగింపు మెసేజి లివ్వలేదు. ఇదే క్వాలిటీ గల సినిమా అంటే. ఇవన్నీసంఘటనల ద్వారానే, ఆ సంఘటనలకి పాత్రల ప్రతిస్పందనల ద్వారానే  తెలియజేస్తూ పోయారు. ఈ కథ చెప్పడానికి వాడిన ప్రధాన రసం ఏ చింతపండు పులుసో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ కుండే  అద్భుత రసం. ఒక సంఘటనకి మించి ఇంకో సంఘటనగా టెన్షన్ పెంచుతూ టైం  అండ్ టెన్షన్ గ్రాఫ్ మీద కూడా దృష్టి పెట్టారు. ఆ ప్రకారం క్యారెక్టర్ ఆర్క్ కూడా పడుతూ లేస్తూ ప్రయాణిస్తూంటుంది. ఆ మధ్య డోంట్ బ్రీత్అనే హార్రర్ సస్పెన్స్ వచ్చింది. దానికంటే ఓ పదిశాతం తక్కువ సస్పెన్స్ -టెన్షన్ థ్రిల్ ఎలిమెంట్స్ తో ఇది వుండొచ్చు. షాపు బయటి పాత్రలతో ఒకరకమైన సస్పెన్స్, లోపలి పాత్రలతో ఇంకో సస్పెన్స్ తో- రెండంచుల కత్తిలా కథ. 

          ఇంటర్వెల్ మలుపుని  కూడా నరాలు బిగబట్టుకుని చూడాల్సి వస్తుంది. మన దగ్గర ఎలా ఉంటుందంటే - ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో  సస్పన్స్ అంటే అది యాక్షన్ సినిమాల వ్యవహారమనీ,  మనం పెడితే దెబ్బతింటామనుకునీ, అవే నిస్తేజ ఫార్ములా డ్రామాలు తీస్తూ పోతారు. ప్రసుత రామాయణంలో ఎవరూ హత్య చేయలేదు, ఇంకే నేరమూ చేయలేదు. అచ్చమైన  కుటుంబ కథే ఇది. కుటుంబ కథలో తటస్థించిన ఒకానొక దురదృష్టకర ఘట్టం. దీన్నిలా  సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్తే ఏం కొంపలు మునిగాయని?  మన ఊరి రామాయణం - మనలోని రామాయణంఅంటూ పాట ద్వారా వెల్లడయ్యే మానసిక లోకపు కల్లోలం. దీనికి పరిష్కారంతో సైకో థెరఫీ. ఇంతకంటే ఉత్తమ కథా రచన ఏముంటుంది?

          ఇందులో సినిమా దర్శకుడి పాత్ర పృథ్వీ  పోగొట్టుకునే స్క్రిప్టు కూడా ఒక ప్లాట్ డివైస్ గా కథ నడుపుతుంది. చివరి దృశ్యంలో నటులు పృథ్వీ- ప్రియమణిలతో ఈ స్క్రిప్టు ఒక అందమైన ముగింపు నిస్తుంది. హార్రర్ కామెడీలూ, ఇంకేవో యాక్షన్ సినిమాలూ పక్కన పెడదాం కాస్సేపు - నిత్య జీవితంలో మన కెదురయ్యే ఘట్టాలు మన చేతల వల్ల  ఎంత సస్పెన్స్ లో పడి ప్రాణాలు తోడేస్తాయో - కల్తీలేని ఈ అచ్చ కుటుంబ కథలో చూసేసి జీవిత కాలమంతా  నెమరేసుకోవచ్చు. షరతు ఏమిటంటే, ఈ సినిమా చూస్తేపాప్ కార్న్ కాకుండా స్వీట్ కార్న్ తినాలి.


సికిందర్
(‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రిక, అక్టోబర్ -2018 సంచిక)