దర్శకుడు యసుజిరో ఒసు
స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ అన్నారు. టాలీవుడ్ ని చూస్తే అదేమంత మరీ బాలీవుడ్ లా అడ్డదిడ్డంగా విస్తరించుకుని,
అస్తవ్యస్త పనివిధానాలతో, ప్రవర్తనలతో గందరగోళమై ఏమీ కన్పించదు. క్రమశిక్షణకీ,
సమయపాలనకీ సాక్షాత్తూ బాలీవుడ్ చేతే శభాష్ అన్పించుకుంటూ, రాష్ట్ర రాజధాని నగరంలో
ఒక చిన్న టౌన్ షిప్ పరిమాణానికి కుదించుకుని, పరస్పరం సన్నిహితంగా మెలిగే సభ్యులతో,
ఒద్దికైన ఓ చిన్న కుటుంబంలా ముద్దుగా కన్పిస్తుంది.
మరి ఇంత ముద్దొచ్చే బుల్లి టాలీవుడ్ తను అత్యధికంగా ఉత్పత్తి చేసే చిన్న బడ్జెట్ సినిమాలతో
స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ నానుడిని ఏమాత్రం నిజం చేయడం లేదెందుకని?
యువర్స్ ట్రూలీ
టాలీవుడ్ నుంచి ఆల్రెడీ రక్తపాతాల భారీ బడ్జెట్ సినిమాలతో ఏ సీజన్లో నైనా రాష్ట్ర
ఉష్ణోగ్రత అట్టుడికి పోతుంటుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు తగుదునమ్మాయని చిన్న బడ్జెట్ సినిమాలుకూడా ఉష్ణోగ్రత పెంచెయ్యడ
మెందుకు?
దేశం దాటుకుని అటు
నైజీరియాని చూస్తే, లేదా ఇరాన్ ని చూసినా, పోనీ
దేశంలోనే ఏ కేరళనో, పశ్చిమ బెంగాల్నో చూసినా కూడా ఆ సినిమాలు తమదైన ఓ ప్రత్యేక ముద్రతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్నాయి.
గుర్తింపనేది ఊరికే ఆర్భాటాలు చేస్తే రాదు. ఆబోతుకి అచ్చోసి వదుల్తారు, అది
గుర్తింపు కాబోదు. ఆబోతుల్ని ఎవరూ గుర్తించరు. లేగ దూడల్ని గుర్తిస్తారు. అవి
స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ కి ప్రతిరూపాలు. ఏ మాయామర్మాలూ తెలీని అమాయక జీవులు. ప్రకృతిని
చూసి కుప్పిగంతులేస్తాయి. అంతేగానీ తమ పెద్దలైన ఆబోతుల్ని అనుకరించవు. నైజీరియా, ఇరాన్,
కేరళ, పశ్చిమ బెంగాల్ సినిమాలు కూడా ఇలాటి ప్రకృతికి పరవశించే లేగదూడలే!
దేశంలో టాలీవుడ్
కూడా భిన్నత్వంలో ఏకత్వం లాంటిదే. ఇక్కడ చిన్న సినిమా, పెద్ద సినిమా, శాటిలైట్ సినిమాలనే
కేటగిరీ లున్నాయి. పెద్దసినిమా స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఉమ్మడి కుటుంబాన్నివదిలేసి
ఏనాడో హాలీవుడ్ ని అనుకరిస్తూ వెళ్ళిపోయింది. అది చేయిదాటి పోయింది. దాన్నేం
చేయలేం. శాటిలైట్ సినిమా బాలీవుడ్ మల్టీ ప్లెక్స్ సినిమాలకి లాగే అస్తిత్వ సమస్యల్లో
వుంది. పూర్తిగా దానిది వ్యక్తిగత
లాభార్జన యావే గనుక దాని కష్టనష్టాలు మనకక్కర్లేదు. ఇక మిగిలింది చిన్న బడ్జెట్ సినిమా.
ఇది కూడా ఉమ్మడి కుటుంబపు నీతిని కాలదన్నేసి పెద్దసినిమాల్ని అనుకరిస్తూ
వెళ్ళిపోయింది- పెద్దసినిమాలకి నవ్వులపాలయ్యే నకళ్ళు గా తయారై నూటికి తొంభై ఐదు
శాతం వార్షిక ఫ్లాపులతో ఓ ఇరవై ఏళ్ల క్రితం లేని దురవస్థని దీనంగా అనుభవిస్తోంది -
ఇంకేం చేసేది? అగ్గిపెట్టెలో సిరిసిల్ల పట్టుచీరని కూర్చే కళ ప్రసిద్ధి
గాంచినట్టు, తెలిసినట్టు, పెద్దసినిమాల
ఆర్భాటా న్నంతా చిన్న సినిమాల్లో దూర్చాల నుకోవడం అత్యాశే!
చిన్న సినిమా ఉజ్వల
భవిష్యత్తు దాని చేతుల్లోనే వుంది. ప్రకృతికీ, సంస్కృతికీ పట్టం గట్టగలిగేది చిన్న సినిమానే. ఎప్పుడయినా
చిన్న చిన్న సినిమాల అందాల్ని అభివర్ణించడానికే బ్యూటీ అనే మాటని వాడతాం. చాలా అరుదుగా
ఏ మణిరత్నమో, భన్సాలీనో తీసే కొన్ని భారీ సినిమాల్ని చూసి ఒహో బ్యూటీ
అనొచ్చు. తెలుగులో బ్యూటీ అన్పించే భారీ
సినిమాలుండవు- ఈ శూన్యాన్ని భర్తీ చేసే బంగారు అవకాశం ఒక్క చిన్న సినిమాలకే వుంది.
ఇది గుర్తించే పాపాన పోవడంలేదు!
‘గబ్బర్ సింగ్
ఎందుకు హిట్టయ్యిందో చూసి పాయింట్లు రాసుకు రండి, మన స్మాల్ బడ్జెట్ సినిమాకి కథ
అదే వస్తుంది!’
‘బాద్షా, మిర్చీ,
అత్తారింటికి దారేది సినిమాల్చూసి మన స్మాల్
యాక్షన్ కి కథ లాగించూ!’
‘అపరిచితుడికి
బ్రహ్మానందాన్ని పెట్టుకుందాం, గజినీకి ఆలీ ఉన్నాడుగా, ఇక పవన్ కళ్యాన్ ‘గబ్బర్
సింగ్’కి ఎమ్మెస్ ని రమ్మనండీ, కామెడీ ఎందుకు పేలదో, ఏ ఆర్భకుడు ఎందుకు నవ్వడో
చూద్దాం!’
ఇదీ వరస! పెద్ద సినిమాలనే,
పెద్ద స్టార్లనే నే కాపీ కొడితేనే చిన్న సినిమా తయారవుతుంది, అంత శ్రమ
పడక్కర్లేదు. సొంత క్రియేటివిటీ కాకరకాయా అక్కర్లేదు. ఒక జపాను దర్శకుడు ఉండేవాడు.
పేరు యసుజిరో ఓజు. అప్పట్లో ఈయనకూడా హాలీవుడ్ సినిమాలకి ఉత్తేజితుడై, వాతలు పెట్టుకుని
అలాటి సినిమాలే జపానులో తీయడం మొదలెట్టాడు. ఏమాత్రం వాటిలో జపాన్ అనే సొంత దేశ
వాసనలు ఉండేవికావు. దీంతో కళ్ళు తెరచి, కప్పుకున్న హాలీవుడ్ గజచర్మం వదిలించుకుని,
జపాన్ మధ్యతరగతి జీవితాలమీద దృష్టి సారించాడు. తను తీస్తున్న లోబడ్జెట్ సినిమాలతో
ప్రక్షకుల్ని లోబర్చుకోవాలంటే, పిడికెడంత వాళ్ళ నిజజీవితాల్ని ప్రతిబిం బింబింపజేయడమే
తప్పితే, ఎక్కడో హాలీవుడ్ బిగ్ కాన్వాస్ కథల్ని పట్టుకొచ్చి జపాన్ లోబడ్జెట్ ఇమడ్చడం
కానే కాదన్న వృత్తి రహస్యం తెలుసుకున్నాడు. ఫలితమే ‘టోక్యో స్టోరీ’ అనే అజరామరమమైన
చలన చిత్ర సృష్టి!
ఆతర్వాత ఈవరసలో
తీసిన మరో యాభై సినిమాల వరకూ కథలూ పాత్రలూ మధ్యతరగతి జీవిత చట్రాన్ని దాటిపోలేదు. గొంతుమీద
ఏ పెద్దనిర్మాత వచ్చి కత్తి పెట్టినా జపాన్ మధ్యతరగతి జీవితాల్న హాలీవుడ్ చట్రంలో చూడదల్చుకోలేదాయన.
ఇలాటి నిబద్ధత కలిగిన దర్శకులే చిన్నసినిమాల అస్తిత్వ స్వస్థతలకి
మార్గాదర్శకులవుతారు!
హాలీవుడ్ నుంచి తీసుకోవాల్సింది
కథ చెప్పే టెక్నిక్ నే తప్ప, ఆ కథల్నే కాపీ కొట్టడం కాదన్న వ్యాపార సూత్రాన్ని భారీ సినిమాలు ఏనాటికీ తెలుసుకోలేవు.
తెలుసుకున్న నాడు అవికూడా విజయాల బాట పట్టొచ్చు. సినిమాలకి కథల్ని కాపీ కొడితే పరువు
ప్రతిష్టలు పోకపోవచ్చు. కెరీర్ పరిసమాప్తం కాకపోవచ్చు. కానీ గుర్తింపు వుండే ప్రసక్తే
లేదు. పెద్ద సినిమాలు వాటి భద్రతని ఇమేజి రక్ష కవచంలో చూసుకుంటున్నట్టు, చిన్న
సినిమా దాని సేఫ్టీని పెద్ద సినిమాల్ని కాపీ కొట్టడంలోనే చూసుకుంటోంది. రెండూ
నష్టాలే - రెండిటి లోనూ ప్రవహించేది కాపీ
రక్తమాంసాలే తప్ప సొంత సృజన కాదు కాబట్టి!
ఒక ప్రముఖ హిందీ
నటుడు ఇంటర్వూలో చెప్పినట్టు, ఇవ్వాళ్ళ ప్రపంచీకరణ నేపధ్యంలో మన సినిమాలు నిజంగా ఆ
నేపధ్యలో భాగం కాలేకపోతున్నాయి. ఏవో నాలుగు దేశాల్లో ఓవర్సీస్ వ్యాపారాలు చేసుకుని
అదే గొప్పనుకుని మిడిసి పడుతున్నాయి !
ఎందుకిలా?
ఎందుకంటే, ఈ ఒవర్సీస్ వ్యాపారావకాశాలు పెద్దసినిమాలకే ఎక్కువుంటాయి. అవికూడా
ఎన్నారైలు అధికంగా వుండే నాల్గైదు చోట్ల ఆడి సరిపుచ్చుకుంటాయి. కానీ ఎన్నారైల
సాంద్రతతో నిమిత్తంలేకుండా, ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోగల శక్తి ఒక్క చిన్న
సినిమాలకే వుంది. అవి మాత్రమే తమతమ
ప్రాంతాల్ని, సంస్కృతుల్నీ, జీవితాల్నీ ప్రపంచానికి దృశ్యం కట్టగలవు. సమాచార
వినిమయ వాణిజ్యం నాడినాడినీ స్పృశిస్తున్న
ప్రస్తుత కాలంలో ప్రపంచమంతా- ‘ఏదీ మీ తెలుగు సినిమా – సారీ! – మీ చిన్న సినిమా?
అదెక్కడా దాని ఒరిజినాలిటీతో కన్పించడదే? మా నాలెడ్జి బ్యాంకులో అలాటి మీ చిన్న
సినిమా లేని లోటు తీవ్రంగా వుంది...త్వరగా పంపించండీ– అంటూ నోటీసులిస్తోంది. విదేశాల్లో
తెలుగువాళ్ళే చూస్తే ఓవర్సీస్ వ్యాపారమన్పించుకోదు. భాషతో సంబంధంలేకుడా విదేశీయులందరూ
చూసే సత్తా సంపాదించు కున్నప్పుడే అది ఓవర్సీస్ వ్యాపారమైనా, ప్రపంచీకరణ అయినా
అన్పించుకోవడం!
చాలాచాల అలేజీగా ఏ రుచీపచీ వుండని బడా బడా సినిమాల్ని
అడ్డదిడ్డంగా కాపీ కొట్టే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చేసినప్పుడు ఇంకెక్కడి
స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఆశలు!
-సికిందర్