రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, డిసెంబర్ 2016, గురువారం

రివ్యూ!


స్క్రీన్ ప్లే దర్శకత్వం : సుజోయ్ ఘోష్
తారాగణం : విద్యాబాలన్,అర్జున్ రాంపాల్, నైషా సింగ్, టునీషా శర్మ, అంబా సన్యాల్, మానినీ చద్దా, ఖరజ్ ముఖర్జీ, జుగల్ హన్స్ రాజ్ తదితరులు
కథ : సుజోయ్ ఘోష్, సురేష్ నాయర్, మాటలు : రీతేష్ షా
సంగీతం : క్లింటన్ సెరెజో, చాయాగ్రహణం : తపన్ బోస్
బ్యానర్ : బౌండ్ స్క్రిప్ట్ మోషన్ పిక్చర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సుజోయ్ ఘోష్, జయంతీలాల్ గడా
విడుదల :  2డిసెంబర్ 2016
***
          2012 కహానీకి సీక్వెల్ గా చెప్పుకుంటూ విడుదలైన కహానీ -2’ నిజానికి కొనసాగింపు కథేమీ కాదు, పాత్రలూ వేరు. కథ, పాత్రలు వేరైనప్పుడు సీక్వెల్ అనలేం. అయితే  దర్శకుడు సుజయ్ ఘోష్ దీనికింకో విధంగా చెప్పాడు- ‘కహానీఅనేదాన్ని  ఒక ప్రత్యేక  జానర్ కి పర్యాయపదంగా తీసుకోవాలని. స్త్రీని శక్తివంతంగా చూపించే జానర్ ని  కహానీఅనాలని. కాబట్టి  ఇకనుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని కహానీ సినిమాలుఅనాలేమో. కానీ కహానీల్నిక్రైం ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ సుజయ్- విద్యా బాలన్ ద్వయం తప్ప ఇంకెవరూ తీయలేరనేంత  గట్టి ముద్ర వేసి వదుల్తున్నారు- మొదటి కహానీఎంత పవర్ ఫుల్లో, ఇప్పుడు రెండో కహానీ’  అంతకంటే పవర్ఫుల్ ! మధ్యలో వచ్చిన అనిరుథ్ రాయ్ చౌధురి- తాప్సీల పింక్లాంటివి అరుదుగా వస్తాయి. శక్తివంతమైన స్త్రీని చూపించడ మంటే ఇక్కడ ఏ ఉద్యమనాయకురాల్నో చూపించడం కాదు- నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని హీరోయిన్  పాత్ర చుట్టూ సస్పెన్స్  థ్రిల్లర్స్ గా చేసి చూపించడం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని నేటి యూత్ ఫ్రెండ్లీ సినిమాలుగా మార్చి వినోదపర్చడం...సొమ్ము చేసుకోవడం... 

         
దివరకు చెప్పుకున్నట్టు బాలీవుడ్ లో బస చేసిన బెంగాలీ దర్శకులు విలక్షణమైన సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే పింక్తర్వాత ఇప్పుడు కహానీ -2 అంతటి కళ్ళు తిప్పుకోనివ్వని పకడ్బందీ థ్రిల్లర్. సినిమా చూస్తూ రివ్యూ రైటర్ మెమోలో ఏదైనా పాయింటు ఫీడ్ చేసుకోవాలన్నా ఏకాగ్రత దెబ్బతినేసేంత బిగిసడలని కథాకథనాల క్రియేటివ్ ప్రాసెస్ ఇది. ఒక విద్యాబాలన్ కోమాలో కెళ్ళిపోయి, ఇంకో విద్యాబాలన్  హేండాఫ్ క్యారక్టర్లా యాక్షన్లో కొచ్చి  కుతకుతలాడే కసినంతా తీర్చుకునే విలాసవంతమైన క్వాలిటీ మూవీ...

కథ 
      విద్యా సిన్హా (విద్యా బాలన్) ఒక ఉద్యోగం చేసుకుంటూ పధ్నాల్గేళ్ళ  కూతురు మిన్నీ (టునీషా శర్మ) ని పోషించుకుంటూ వుంటుంది. కాళ్ళు పడిపోయిన కూతురు చక్రాల కుర్చీకీ, మంచానికీ బందీ అయిపోయి వుంటుంది. ఉంటున్నది కలకత్తా దగ్గరలో చందాపూర్ అనే చిన్న టౌన్లో. కూతురికి వైద్యం అమెరికాలో సాధ్యపడుతుందని డాక్టర్ అంటే  అమెరికా తీసికెళ్ళే ప్రయత్నాల్లో వుంటుంది. ఇంతలో కూతుర్ని కిడ్నాప్ చేశామని కాల్ వస్తుంది. విద్యాసిన్హా ఆదరాబాదరా పరిగెడుతూ యాక్సిడెంట్ పాలయ్యి కోమాలో కెళ్ళిపోతుంది. సబిన్స్ పెక్టర్ ఇందర్జిత్ సింగ్ (అర్జున్ రాంపాల్) రంగంలో కొస్తాడు. కోమాలో వున్న విద్యా సిన్హాని చూడగానే షాకవుతాడు. డాక్టర్ ఆమె ఐడీ చూపించి, ఈమె విద్యా సిన్హే అంటాడు. కాదు ఈమె కలింపాంగ్ లో వుండాల్సిన దుర్గా రాణీ  సింగ్ అని ఇందర్జిత్  సింగ్ ఆమె ఇంటికెళ్ళిపోయి  సోదా చేస్తాడు. ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదువుతూంటే దిమ్మదిరిగిపోతుంది...

      తర్వాత పైఅధికారి ఇందర్జిత్ కి ఒక హేండ్ బిల్ అందించిఈ వాంటెడ్ కిల్లర్ ని పట్టుకోవాలని ఆదేశిస్తాడు. ఆ ఫోటో చూస్తే దుర్గా రాణీ సింగ్ దే. కలింపాంగ్ లో ఎనిమిదేళ్ళ క్రితం ఒక మర్డర్ చేసి, ఇంకో కిడ్నాప్ చేసి పారిపోయిన దుర్గా రాణీ సింగ్ ని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందంటాడు పై అధికారి. ఒకవైపు కోమాలో వున్న విద్యాసిన్హా, ఇంకో వైపు చేతిలో దుర్గా రాణీ సింగ్ గురించిన డైరీ...ఇందర్జిత్ కి బుర్ర వేడెక్కిపోతుంది.

        అసలు విద్యా సిన్హాగా పేరు మార్చుకున్న దుర్గా రాణీ సింగ్ ఎవరు? ఆమె ఎందుకు ఎవర్ని మర్డర్ చేసి, ఎవర్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు కిడ్నాపైన కూతురు ఎక్కడుంది? ఎవరు ఎందుకు కూతుర్ని కిడ్నాప్ చేశారు? కోమాలో వున్న విద్యా సిన్హా కి మాత్రమే  తెలిసిన ఈ కూతురి కిడ్నాప్ గురించి ఇందర్జిత్ సింగ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? విద్యాసిన్హా కోమాలోంచి మేల్కొంటుందా లేదా? ఈలోగా ఇందర్జిత్ సింగ్ పై అధికారినుంచి విషయాలు దాస్తూ ఏం పాట్లు పడ్డాడు? అసలెందుకు విషయాలు దాస్తున్నాడుపెళ్ళయిన ఇతడికి దుర్గా రాణీ సింగ్ తో వున్న సంబంధమేమిటి? ఈ సంబంధం బయటపడితే పీక్కునే దేంటి?....ఇన్ని చిక్కు ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. అదేమిటో తెరపైనే చూడాలి.

ఎలావుంది కథ 
      ఈ పైకి కన్పిస్తున్నదంతా కథ కాదు. ఇదంతా ఇంకో కథకి కథ. 2014 లో ఆలియా భట్- రణదీప్ హుడా లతో ఇంతియాజ్ అలీ తీసిన హైవేలో చివర బయట పడే కథే, ‘కహానీ -2’  లో మందు
పాతరలా మధ్యలో పేల్తుంది. కాకపోతే హైవేలో అది హీరోయిన్ ఆలియా భట్ పాత్ర అనుభవమైతే, ‘కహానీ -2’ లో బాల పాత్ర మిన్నీ వ్యధ. ఎక్కడో ఓ చోట, ఇళ్ళల్లో  చిన్న పిల్లలతో  పాల్పడుతున్న చైల్డ్ ఎబ్యూజ్ అనేది ఎవ్విరీ డే న్యూజ్ లాగా మారిపోయిన ప్రస్తుత కాలంలో, అందులోంచి తనకేమీ కాని ఆరేళ్ళ ఓ పిల్లని కాపాడేందుకు ఓ సాధారణ స్కూలు ఉద్యోగిని తెగించి ఏమేం చేసిందన్నది, ఈ క్రమంలో ఏమేం కోల్పోయిందన్నదీ అసలు కథ. నిత్యజీవితంలో సమస్యల్ని ఇంకా ప్రేక్షకుల్ని ఏడ్పిస్తే డబ్బులొస్తాయనే రొడ్డకొట్టుడు ఏడ్పు కథగా కాకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ గా చేసి చూపిస్తూఓ సరికొత్త వీక్షణానుభవాన్నిచ్చే వుమన్ ఎంపవర్ మెంట్ కథ.

ఎవరెలా చేశారు
     విద్యాబాలన్ గురించి ఇంకా చెప్పుకోవాల్సిందేముటుంది. సరైన పాత్ర ఇస్తే దాని దుంపతెంచుతుంది. మేకప్ కూడా అవసరం లేకుండా నటించి పారేస్తుంది. గ్లామర్ కోసం పాత్ర లబోదిబోమన్నా చెప్పినట్టు పడుండమంటుంది. ఫ్రీ స్టయిల్ నటన ఆమెది. రెండు పాత్రలతోనూ  సస్పెన్స్ థ్రిల్లర్ ని హై వోల్టేజ్ డ్రామాలాగా మార్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ( దుర్గా రాణీ సింగ్)కి వ్యతిరేకంగా సంపన్నుల కుటుంబం, స్కూలు యాజమాన్యం, లేడీ కానిస్టేబుల్ చేసే అన్యాయాలకి తనదైన వ్యూహరచనా సామర్ధ్యంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మళ్ళీ ప్రస్తుత  విద్యాసిన్హా పాత్రలో వాంటెడ్ కిల్లర్ గా చందా నగర్ నుంచీ కలకత్తా దాకా పోలీసుల్ని కిందామీదా చేసేస్తుంది. మిన్నీని అమెరికా తీసికెళ్ళే తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు- ఆపితే అయిపోయారన్నట్టే ఒక్కొక్కళ్ళూ. ఆమెని కిల్లర్ గా భావించుకునే మనుషులేగానీ, ఆమె తల్లికాని తల్లి  మనసుని కూడా ఎవరూ పట్టించుకోని విషాదం పాత్రచుట్టూ వుంటుంది. స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ ని సొంత పిల్లల్లాగా చూసుకుంటారో లేదో గానీ, ఒక స్కూలు క్లర్క్ గా, పెళ్ళికాని దుర్గా రాణి ఎందుకు ఒక స్కూలు బాలిక కోసం సింగిల్ మదర్ గా జీవితాన్ని డిసైడ్ చేసుకుందన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆమె కథే సమాధానం. విద్యాబాలన్ వి ఈ రెండూ ఆదర్శ పాత్రలు

    సబిన్స్ పెక్టర్ గా అర్జున్ రాం పాల్ ది కూడా చాలాసహజ  పాత్ర
కాస్త ఏమీ పట్టని తత్త్వంతను వస్తూంటే కానిస్టేబుల్ కూర్చుని వున్నా పెద్దగా పట్టించు
కోడు
ఎంక్వైరీ కెళ్ళినప్పుడు పేపరు చదువుకుంటున్న  ఒకడ్ని అడ్రసు అడిగితే,  వాడు పేపరు పేపరు చదువుకోవడమే తప్ప తనని పట్టించుకోకపోయినా-  ఏం చేస్తాం..అనుకుంటూ వెళ్ళిపోయే రకం  అర్జున్ రాం పాల్ సబిన్స్ పెక్టర్ పాత్ర.  కోపమనేదే వుండదుఇదే బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో కహానీ’ లో కూడా పోలీసు పాత్రలు ఇలాటి  డిఫరెంట్ ఫీల్ నే ఇస్తాయిఅర్జున్ రాం పాల్ లాగే  పై అధికారి పాత్రలో ఖరజ్ ముఖర్జీ ఆసక్తికర పాత్ర పోషించాడు.

        మిన్నీగా ఆరేళ్ళ బాలికగా నైషా ఖన్నా నటిస్తేపధ్నాల్గేళ్ళ బాలికగా టునీషా శర్మ నటించిందిఇద్దరూ లైంగికంగా తనకేం జరుగుతోందో తెలీని పసితనపు  మిన్నీ అంతరంగాన్ని సున్నితంగా ఆవిష్కరించారుమిన్నీ నానమ్మ పాత్రలో అంబా సన్యాల్ ది టెర్రిఫిక్ నటనఆమె కొడుకు పాత్రలో జుగల్ హన్స్ రాజ్లేడీ కానిస్టేబుల్ పాత్రలో మానినీ  చద్దా మరో రెండు నెగెటివ్ పాత్రలు పోషించారు.  

      నటనలకినటింప జేయడాలకీ ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ లా వుంటుంది దర్శకుడి ప్రతిభక్లింటన్ సెరేజో సంగీతం లోని మూడు బ్యాక్ గ్రౌండ్ పాటల్లో లమ్హోకే రస్ గుల్లే’ ( రసగుల్లా ల్లాంటి క్షణాలుపాట టాప్తపన్ బసు ఛాయాగ్రహణం రియల్ లోకేషన్స్ లోముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్ లో ఓ కళాత్మక చిత్రణసబ్ కాన్షస్ గా ప్రేక్షకుల్ని సన్నివేశాల్లో సంలీనం చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లో వెలిగే వర్ణ కాంతులతో ఒక అద్భుత ప్రయోగం చేశారురోడ్ల మీద పసుపు పచ్చ కాంతి ప్రసరింపజేయడం కూడా అందులో ఒకటి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో వివిధ రూపకాలంకారాల్ని వాడినట్టు ఇక్కడ వర్ణకాంతుల్ని ఉపయోగించారుసినిమాకి ఛాయాగ్రహణంతో కూడా చాలా పనుంటుందని ఇక్కడ నిరూపించారుకథ కాన్షస్ లెవెల్లో ప్రేక్షకులకి అందితేఇలాటి ఛాయాగ్రహణం లోతుగా సబ్ కాన్షస్ లెవెల్ కి తీసికెళ్తుందిఒక హిప్నాటిక్ లోకాన్ని సృష్టిస్తుందిబెంగాల్లోని చందా నగర్కలింపాంగ్కలకత్తా లొకేషన్స్  కాసేపు ఈ హిందీ సినిమాని కొత్త లోకాలకి తీసికెళ్తాయి.

చివరికేమిటి 
       మొదలెట్టింది లగాయత్తూ  ముగిసేదాకా ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రెండు మూడు సార్లు చూడొచ్చు. ప్రతి సీనూ, ప్రతీ షాటూ క్షణం క్షణం కథని ముందుకు పరిగెత్తించేవే తప్ప ఎక్కడా కథని ఆపి కాలక్షేపం కోసం లేవు. చాలా పూర్వం అగర్, ఔర్ కౌన్ లలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని గుర్తుకు తెచ్చేలా వుండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి కాలానికి హై టెన్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. మొదటి పదినిమిషాల్లోపు పాత్రకి యాక్సిడెంట్ అయ్యే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసిమళ్ళీ చివర పదిహేను  నిమిషాల  ముందు పాత్ర కోమాలోంచి లేవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి- మధ్యలో అంతా  గత/ వర్తమాన కాలపు యాక్షన్స్ తో సంక్షుభితంగా వుంటుంది మిడిల్. నడుస్తున్న కథకి ఎలా స్పష్టమైన బిగినింగ్-మిడిల్-ఎండ్ లుంటాయో, అలా  గడిచిపోయిన కథకీ వుంటాయి. డైరీపేజీల్లోంచి వంతులవారీగా వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ గడిచినపోయిన కథ వుంటే, ప్రస్తుత కాలంలో కేసుతో పోలీసుల సంఘర్షణగా  వుంటుంది

        పకడ్బందీ రచన, పకడ్బందీ నటనలు ఎందుకు సాధ్యం కావు మనసుంటే- ఏదో నడిచిపోతుందని స్టార్ వేల్యూ మీద ఆధారడిపోయి చుట్టేస్తే అదొక సినిమా అన్పించుకుంటుందా? ప్రేక్షకులు దొంగ నోట్లు ఇవ్వడంలేదు దొంగ సినిమాలు చూపించడానికి- దొంగ సినిమాల మధ్య అప్పుడప్పుడు ఇలాటి దొర సినిమాలు వస్తున్నా, తేడా పసిగట్టలేని ప్రేక్షకులు వుంటున్నందువల్లే బరితెగించి దొంగ సినిమాలు వస్తూంటాయి.... ‘కహానీ -2’ దొరసాని సినిమా!


-సికిందర్
http://www.cinemabazaar.in











3, డిసెంబర్ 2016, శనివారం

రివ్యూ!





రచన - దర్శకత్వం : వైశాఖ్
తారాగ‌ణం: మోహ‌న్‌లాల్‌, క‌మ‌లినీ ముఖ‌ర్జీ, జ‌గ‌ప‌తిబాబు, లాల్‌, విను మోహ‌న్ బాల త‌దితరులు
క‌థః ఉద‌య్ కృష్ణ‌, సంగీతం: గోపీసుంద‌ర్‌, ఛాయా గ్రహ‌ణం: షాజీ కుమార్‌
బ్యానర్ :
 శ్రీ స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్
నిర్మాత: సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి
విడుదల : డిసెంబర్ 2, 2016
***


      మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల  మధ్యకి వరసగా వచ్చేస్తున్నాడు. మనమంతా, జనతా గ్యారేజ్ ల వంటి డైరెక్టు తెలుగు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో గుర్తిపు సంపాదించుకున్న మోహన్ లాల్, ఇప్పుడు  మూడో ప్రయత్నంగా మలయాళ డబ్బింగ్ ‘మన్యం పులి’ (పులి మురుగన్) తో విచ్చేశాడు. మలయాళం లో ఇది నూట పాతిక కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. భారీ సెట్టింగులు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్, తారాగణం, గ్లామర్ మొదలైన రెగ్యులర్ కమర్షియల్ హంగులేవీ లేకుండానే పాతిక కోట్ల బడ్జెట్ తో తీసి, నూట పాతిక కోట్లు సంపాదించుకోవడం రికార్డే. అదీ కేరళ లాంటి చిన్న మార్కెట్ లో. ఏమైనా సినిమా తీయడంలో ఈ కొత్త బేసిక్స్ ని ఆహ్వానించాల్సిందే. అయితే ఇది ప్రేక్షకుల బేసిక్ ఇన్ స్టింక్ట్స్ ని సొమ్ముచేసుకోవడం అవుతుందేమో ఆలోచించాలి...

 కథ       అది పులియూర్ అనే మన్యం ప్రాంతం. అక్కడ  పులులు మనుషుల్ని చంపి తింటూంటాయి. పదేళ్ళ కుమార్ అలియాస్ కుమారస్వామి తండ్రిని కూడా పులి తినేస్తుంది. అంతకి ముందే తల్లి చనిపోతుంది. చిన్నపిల్లాడుగా వున్న  తమ్ముడు మణి తో మిగులుతాడు. తండ్రిని చంపిన పులిని చంపడం కోసం తర్ఫీదు  పొందుతాడు. ఆ పులిని వలపన్ని చంపేస్తాడు. పెద్దయ్యాకా మన్యంలోనే స్థిరపడి లారీ డ్రైవర్ గా బ్రతుకుతూంటాడు. మరోవైపు మనుషులని చంపుతున్న పులుల్ని చంపుతూంటాడు. దీంతో చట్టం దృష్టిలో పడతాడు. ఫారెస్ట్  రేంజర్ (కిషోర్) కుమార్ ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. కుమార్ ప్రేమిస్తున్న మన్యం పిల్ల మైనా (కమలినీ ముఖర్జీ) మీద కన్నేస్తాడు. అతన్నుంచి తప్పించుకున్న ఆమెని  కుమార్ పెళ్లి చేసుకుంటాడు. కూతురు పుడుతుంది, అయినా రేం జర్ ఆమెని వదిలిపెట్టడుతాడు. రేంజర్ ని చిత్తుగా తంతాడు కుమార్. రేంజర్  ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోతాడు. కుమార్ తమ్ముడి స్నేహితులు ఆయుర్వేద పరిశోధనలకోసం మన్యం వస్తారు. ఆ గంజాయి మొక్కల్ని లారీ కెక్కించుకుని కుమార్ ని రమ్మంటారు. ఆయుర్వేద కంపెనీలో తమ్ముడికి జాబ్ ఇప్పిస్తామని తీసుకుపోతారు. అక్కడ డాడీ గిరిజ (జగపతి బాబు) అనే కంపెనీ ఓనర్ దగ్గర బస చేస్తారు.  కట్ చేస్తే, ఆ డాడీ కుమార్ ని చంపడం కోసం తిరుగుతూంటాడు. ఎందుకు? కుమార్ వల్ల ఇతడికేం నష్టం జరిగింది? ఏమిటా కథ?...అన్నది తెర మీద చూడాలి.

ఎలావుంది కథ  
       చాలా అతుకుల బొంతలా వుంది. మొదటి అరగంట చూసి నిద్రపోయి, చివరి అరగంట చూస్తే చాలు- ఎందుకంటే ఇవి యాక్షన్ సీన్సు గనుక. యాక్షన్ సీన్స్ తప్ప ఈ సినిమాలో కథని భరించడం కష్టం. మృగం (పులి) మానవ  మృగం (జగపతిబాబు పాత్ర) అనే కాంట్రాస్ట్ పెట్టి వీటితో హీరో తలపడే కథ పూర్తిగా ఉద్దేశం అంతుచిక్కని అతుకులబొంత కథ. పులి- పులి వేట అనగానే ఎవరికైనా జిమ్ కార్బెట్ (1875-1955) గుర్తుకొస్తాడు. ఆనాడు బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ హంటర్ అయిన ఇతను నరమాంస భక్షక పులుల్ని సంహరించేవాడు ప్రభుత్వ  ఆదేశాలతో. మనిషిరక్తం రుచి మరిగిన పులులు  సమీప గ్రామాల్లోకి వచ్చి దాడి చేసేవి. వీటిని పట్టుకుని షూట్ చేసేందుకు జిమ్ కార్బెట్ అడవుల్లో చేసే ప్రాణాంతక సాహసాలు గగుర్పాటు కల్గించే విధంగా వుంటాయి. మన్యంపులి కథలో పులులు గ్రామాల మీద దాడి చేయవు. అడవుల్లో ఉంటున్న వాళ్ళ  మీదే  పడుతూంటాయి. ఒక సీనులో ఒక పాత్ర ఓ పాముని పట్టుకుని సురక్షితంగా వదిలిపెడుతూ- ఇది వున్న చోటుకి మనం రావడం తప్పంటాడు. అందుకని దాన్ని చంపకుండా పక్కకి తీసికెళ్ళి వదిలేస్తాడు. మరి ఇది పులులకీ వర్తించదా? పులులుండే చోట మనుషులు ఎందుకుండాలి? అవి చంపుతున్నాయని వాటినెందుకు చంపడం? రెండోది, బాల్యంలో హీరో తండ్రిని చంపిన పులి అదే అని ఎలా గుర్తు పట్టి చంపాడు? జిమ్ కార్బెట్ గ్రామం మీద దాడి చేసిన పులి అడుగుజాడల్ని పరిశోధించి, వాటి ఆధారంగా అడవుల్లో సదరు పులిని అన్వేషించే వాడు. దానికోసం మంచె కట్టుకుని దాని మీద రేయింబవళ్ళు గడిపేవాడు. జిమ్ కార్బెట్ ఒక లెజెండ్. పులులతో తన అనుభవాల గురించి ఆయన రాసిన పుస్తకం చదివితే పులుల గురుంచి అంతా తెలిసిపోతుంది- వాటి స్వభావం, జీవనం, జిత్తులు సమస్తం. జిమ్ కార్బెట్ పేర ఉత్తరాఖండ్ లో నేషనల్ పార్క్ ఏర్పాటయ్యింది. 

        మన మన్యం హీరో అసలే అంతరించిపోతున్న పులి జాతిని అలా చంపుతూంటే మనకే కోపం వస్తుంది. దాన్ని హీరోయిజంగా తీసుకుని ఎలా ఎంజాయ్ చేయగలం. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పులి దాని స్వభావం కొద్దీ తండ్రిని చంపిందని జీవితాంతం పులుల మీద ద్వేషం పెంచుకునే మానసికంగా ఎదగని, ఓ మానసిక పీడితుడి కథని ఓ హీరో మీద చూడ్డం  విజ్ఞులకి కష్టమే. ఈ కథ పర్యావరణానికే గాక, చట్టాలకీ వ్యతిరేకమని భావించాల్సి వుంటుంది. 

ఎవరెలా చేశారు
       
డ్డలుంగీ కట్టుకుని మాస్ పాత్ర నటించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ అసలీ పాత్రద్వారా ఏం చెప్పాలనుకున్నాడో అర్ధంగాదు. పులుల్ని చంపే యాక్షన్ సీన్స్ కోసం మాత్రమే తనని చూడాలనుకున్నట్టు తయారయ్యిందే తప్ప మరొకటి కాదు. తన కుటుంబం పట్ల, స్నేహితులపట్లా  కనబర్చే మానవీయ కోణం ఏ దశలోనూ పులుల పట్ల ప్రదర్శించని -క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ ఆర్క్ లేని, కథలో ఒక గోల్ లేని, దిశాదిక్కూ లేని పాత్రగా మిగిలిపోయాడు. ఒక చోట కమలినీ ముఖర్జీ పాత్రచేత తన్నించుకోవడం, ఇంకోచోట జగపతి బాబు పాత్ర కాళ్ళు పట్టుకోవడం లాంటి భేషజాలు లేని వ్యక్తిత్వాన్ని ఒక స్టార్ గా ప్రదర్శించినా- కాస్త మనసున్న ప్రేక్షకుల కోసం, ఇదే వినయాన్ని  కనీసం చివర్లోనైనా  పులులతో కూడా చాటుకోవాల్సింది. 

        కమలినీ ముఖర్జీది ఉత్తుత్తి రుసరుస లాడే పాత్ర కామెడీ కోసం. జగపతిబాబు పాత్ర ఇచ్చే బిల్డప్పులు ఓపెనింగ్ లో, ఇంటర్వెల్ లో ఎందుకోసమా అని చూస్తే చివర తేలేది సరుకులేని మ్యాటరే. 

        తెలుగులో మంచి సంగీతం ఇస్తున్న గోపీ సుందర్ ‘మన్యం పులి’ లో షాకింగ్ గా తలనొప్పి మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా చాలా పూర్ గా వుంది- దీన్ని కవర్ చేయడానికి హోరెత్తించే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ రుద్దారు. డబ్బింగ్ కూడా నీటుగా లేదు- బి గ్రేడ్ సినిమాల్లో లాగా ప్రతీ డైలాగూ అరిచి (లౌడ్) మాట్లాడ్డమే. షాజీ కుమారన్ కెమెరా వర్క్, పీటర్ హెయిన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ, సీజీ వర్క్, ఇవే సినిమాలో కాస్త నయమన్పించే అంశాలు.

        దర్శకుడు వైశాఖ్ దర్శకత్వంలో, రచనలో పూర్తిగా విఫలమయ్యాడు- విఫలమయ్యాడు అనేకంటే చవకబారు పనితం కనబర్చాడనండం న్యాయం. చాలా పాత కాలం ‘బి’ గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సీన్లు, కామెడీ, కథ అల్లిక మొదలైనవి చవకబారుగా వున్నాయి. ఎక్కడా కథనంలో టెన్షన్ అనేదే వుండదు. సీన్లు చప్పగా వచ్చిపోతూంటాయి. స్క్రీన్ ప్లే అనే మాటే ఇక్కడ వర్తించదు. కేవలం పేటర్ హెయిన్స్ యాక్షన్ ప్లే గురించే చెప్పుకోవాలి. ఇదంతా మాస్ కి వర్కౌట్ అయిపోతుంది. మలయాళం లో కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయోమో గానీ, తెలుగులో వీటిని తీసిపడేస్తే చీకాకు తప్పుతుంది.  

చివరికేమిటి
        రోజుల్లో పులుల్ని చంపడం నేరంగా కాదు, హీరోయిజంగా చూపించారు. ఇదే ఈ సినిమా ఇస్తున్న మెసేజ్. ఇందుకే హిట్టయింది. ఇక ఈసారి ఇంకో అడుగు ముందుకేసి వీరప్పన్ ఏనుగుల్ని ఎలా చంపాడో ఆ కథతో కూడా తీస్తే బాగా హిట్టవుతుంది. డిస్కవరీ ఛానెల్లో అమాయక జంతువుల్ని వెంటాడి చంపే పులుల్ని  షూట్ చేసి చంపినట్టు కూడా చూపిస్తే ఛానెల్ టీఆర్పీ బాగా పెరిగిపోతుంది...

-సికిందర్
http://www.cinemabazaar.in


       




1, డిసెంబర్ 2016, గురువారం

రివ్యూ!



దర్శకత్వం : ప్రదీప్ కృష్ణ మూర్తి
తారాగణం : విజయ్ ఆంథోనీ, అరుంధతీ నాయర్, చారు హాసన్, వైజి మహేంద్ర, సిద్ధార్థ్ శంకర్, మీరా కృష్ణన్ తదితరులు
రచన : ప్రదీప్ కృష్ణ మూర్తి- జో డీ క్రజ్, కార్తీక్ కృష్ణ, సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రహణం : ప్రదీప్ కలిపురయత్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంథోనీ
విడుదల : డిసెంబర్ 1, 2016
***
         ‘బిచ్చగాడు’ తో బాగా పాపులర్ అయిన తమిళ హీరో – సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ఈసారి బేతాళుడుగా మారి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ని ప్రయత్నించాడు. రొటీన్ ఫార్ములా సినిమాలకి భిన్నమైన సబ్జెక్టులు చేస్తున్న ఆంథోనీ ‘బిచ్చగాడు’ తో ప్రేక్షకుల హృదయాల్లో బాగా నాటుకుపోయాడు. ‘బిచ్చగాడు’ పూర్తిగా మానవ విలువలకి సంబంధించిన సార్వజనీన ఎమోషనల్ డ్రామా కావడంతో దాన్ని ప్రాంతాలకతీతంగా ఆదరించారు. ఐతే ‘బేతాళుడు’ లో సార్వజనీనతని  కాసేపు పక్కన పెట్టి,  తన పాత్రవరకే పరిమితమయ్యే ఎమోషన్స్ తో, సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకోసం తీశాడు.

         ఈ ప్రోత్సాహంతో అన్నట్టు దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కూడా ఎలాటి కమర్షియల్ అంశాల జోలికీ వెళ్ళకుండా ‘ బేతాళుడు’ని ఒక సీరియస్ కేస్ స్టడీ లాగా తీశాడు. ఐతే ఈ కేస్ స్టడీ కూడా ఎంతవరకు నిలబడిందన్నది ప్రశ్న. వివరాల్లోకి వెళ్తే గానీ ఇది తేలదు...

కథ 
     ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే దినేష్  చిత్తభ్రాంతులకి  లోనవుతూంటాడు. తనలో ఇంకో వాయిస్ ఎవరిదో విన్పిస్తూంటుంది. అమాంతం పనిచేస్తున్న సిస్టం లోంచి చెయ్యి వచ్చి దాడి చేస్తుంది. ఆ వాయిస్ ఇంకా రకరకాల సమస్యలు సృష్టిస్తూంటుంది. ఇదంతా ఐశ్వర్య ( అరుంధతీ నాయర్) ని పెళ్లి చేసుకున్నప్పట్నించే జరుగుతూంటుంది. మిత్రుడి సలహాతో సైకియాట్రిస్టుని సంప్రదిస్తాడు. ఆ సైకియాట్రిస్టు హిప్నటైజ్ చేసి దినేష్ తల్లి గర్భంలో వున్నంత వరకూ తీసికెళ్తాడు. అయినా అతడి మానసిక సమస్యకి మూలం దొరకదు. ఇక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ తో గత జన్మలోకి తీసికెళ్తాడు. అప్పుడు గతజన్మలో మాచర్లలో శర్మగా పుట్టి టీచర్ గా పనిచేసిన దినేష్ కి,  భార్య జయలక్ష్మి వల్ల మరణం సంభవించిందని తెలుస్తుంది. ఆ జయలక్ష్మి మీద ఇప్పుడు పగదీర్చుకోవడం కోసమే శర్మ వాయిస్, దినేష్ లోపల చేరి ఇబ్బంది పెడుతోందని అర్ధమవుతుంది. ఆ జయలక్ష్మి ఎవరు?  ఆమెతో శర్మకి అసలేం జరిగింది? పెళ్ళికి ముందే శర్మతో వున్న పిల్ల వాడెవడు? పెళ్లి తర్వాత శర్మకి పుట్టిన పిల్లాడికి ఏమైంది?...ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం దినేష్ మాచర్లకి ప్రయాణం కడతాడు...

ఎలావుంది కథ 
       మొదటే చెప్పుకున్నట్టు ఇదొక సైకలాజికల్ కేస్ స్టడీ. అయితే గతజన్మలు వున్నాయో లేదో, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ప్రక్రియ విశ్వసనీయ
మైనదో కాదో, అలాగే  గత జన్మలో మనిషి ఈ జన్మలో ఆవహిస్తాడనడానికి శాస్త్రీయ నిరూపణలున్నాయో లేదో,  అలాగే అసలిదంతా కేవలం మనుషులు హిస్టీరియాకి లోనై  ప్రవర్తిస్తారేమో ...అన్నవి తేల్చే జోలికి  పోలేదు సరికదా, పరస్పర విరుద్ధ వాదనలు చేసిందీ కథ. ఎలాగంటే  హీరోకి ఎవరో క్లినికల్ పరిశోధనల్లో భాగంగా ఓ మందు ప్రయోగించడం వల్ల అది బ్రెయిన్ ని స్నాప్ చేసి పూర్వజన్మలోకి తీసికెళ్ళిందని చెప్తారు. అది పూర్వ జన్మలోకి తీసికెళ్ళిందో, అలా ఫీలయ్యే చిత్తభ్రాంతులకి (హేల్యూసినేషన్స్) కి లోను చేసిందో ఎవరికి  తెలుసు? శాస్త్రీయంగా ఏదీ తేల్చకపోయినా,  పూర్వజన్మల కథ అనే తలపండిన బాక్సాఫీసు ఫార్ములాకి పరిమితం చేసి ఈ కథ చెప్పివున్నా అదో అందం.  బాక్సాఫీసు ఫార్ములానే మందు ప్రయోగంతో అభాసు చేసుకుంటే ఇదే కథో అర్ధంగాకుండా పోతుంది. అర్ధమై నమ్మాలన్నా ఏ కథని నమ్మాలో అర్ధంగాని పరిస్థితి  : శర్మ ఆత్మ తానుగా పగదీర్చుకోవడానికి సహజంగా దినేష్ లో తిష్ట వేసిన పారానార్మల్ థ్రిల్లర్ కథానా, లేకపోతే మందువల్ల బ్రెయిన్ లో తేడా వచ్చి  పూర్వజన్మ ని చూసిన సైకలాజికల్ కథానా? కథకి ఉండాల్సిన ఏకసూత్రత పాటింపు ఇక్కడ జరగలేదు. 

ఎవరెలా చేశారు
      పాత్రమేరకు విజయ్ ఆంథోనీ  చక్కగా నటించాడు, నీటుగా కూడా నటించాడు. ఈ కాలపు దినేష్ గా, పాత కాలపు శర్మగా నటుణ్ణి నిలబెట్టుకున్నాడు. క్లయిమాక్స్ లో ఒక యాక్షన్ సీన్లో మాత్రం బేతాళ ప్రతాపం చూపించలేదు. మామూలు హీరోలాగానే ఫైట్ చేశాడు. ఆ ఇంజెక్షన్ చేసింతర్వాత ఎలా ప్రవర్తిస్తాడో చూద్దామని అంటాడు విలన్. ఆ ఇంజెక్షన్ తో అతను బేతాళుడిగా మారిపోయి ప్రళయ బీభత్సాన్ని  సృష్టిస్తాడని మనమాశిస్తే అడియాసే అవుతుంది. విజయ్ ఆంథోనీ ఒక వెరైటీ పాత్రనైతే చేశాడన్పించుకున్నాడుగానీ, వెరైటీ అంతగా దమ్ము లేకుండాపోయింది. 

     హీరోయిన్ అరుంధతీ నాయర్ కూడా ఐశ్వర్యగా ఈ జన్మ పాత్రలో,  జయలక్ష్మిగా గత జన్మ పాత్రలో నటించింది. ఆధునికత్వం, గ్లామర్ అనే వాటికి  దూరంగా సంసారపక్షంగా వుండే రూపు రేఖలామెవి. లావు కూడా ఆ వయస్సుకి ఎక్కువే. ఐశ్వర్య పాత్రలో సస్పెన్స్ వుంది. ఈ సస్పెన్స్  పాత్ర ఫీలయ్యేది కాదు, మనం ఫీలయ్యేది. చివరికి ఈ పాత్రని జస్టిఫై చేయడం కష్టమే. ఈ పాత్రే కాదు, పూర్వ జన్మలో జయలక్ష్మి పాత్ర ప్రవర్తన కూడా జస్టిఫికేషన్ కి, సెంటిమెంట్స్ కి, నేటివిటీకీ దూరమే. 

     ఇతరపాత్రల్లో పాత్రధారులందరూ పకడ్బందీగానే నటించారు. విజయ్ ఆంథోనీ సమకూర్చిన పాటలూ బాగానే వున్నాయి సింపుల్ గా- చక్కగా అర్ధమయ్యే భాషతో.  ప్రదీప్ కెమెరా వర్క్ మరో ఎస్సెట్ ఈ సినిమాకి. టెక్నికల్ విలువలు ఉన్నతంగా వున్నాయి. లొకేషన్స్ కూడా కొత్తగా బావున్నాయి . అన్నీ బావున్నాయి- ఒక్క దర్శకుడితో మాత్రమే ఏమంత బాగా లేదు.

 చివరికేమిటి 
       ఈ పర్సనల్ సైకలాజికల్ కేస్ స్టడీలో రెండు అంశాలు పొసగకుండా వున్నాయి. పూర్వ జన్మలో చూపించిన కథ, సెకండాఫ్ లో మెడికల్ మాఫియా కథ. సెకండాఫ్ లో ఎప్పుడైతే హీరోయిన్ అపహరణకి గురై మెడికల్ మాఫియా లాబ్ కి చేరుతుందో,  అప్పుడు కథ దారి తప్పిపోయింది. హీరో సైకలాజికల్ సమస్య ఎలా తీరుతుందా అని ఎదురు చూస్తూంటే, మందుల కోసం మనుషుల మీద ప్రయోగాలూ చేసే వేరే కథగా మారిపోవడం- అసలు హీరో సమస్యకి ఈ మందులే కారణమన్నట్టుగా  చిత్రించండం కాన్సెప్ట్ పట్ల కన్ఫ్యూజన్ ని బయటపెడుతుంది. ఇది ముగింపుని కూడా సహేతుకంగా లేకుండా చేసింది. హీరో బావున్నప్పుడు సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక చోట అంటాడు- నేను క్లిష్టంగా వున్న దాన్ని సులువు చేస్తాను, సులువుగా వున్న దాన్ని క్లిష్టంగా మార్చేస్తానని. హీరో మాటేమో గానీ దర్శకుడు మాత్రం సులువుగా కన్పిస్తున్న  కథని నానా క్లిష్టతరంగా  మార్చేసి  అతి క్రియేటివిటీ చూపించబోయాడు. పూర్వజన్మ కథలో  జయలక్ష్మితో శర్మకి ఏవో అపార్ధాలేర్పడి వుంటాయని వూహిస్తాం –కట్టుకున్న భార్య మంచిదే అయివుండాలన్న బాక్సీఫీసు నమ్మకాల ప్రకారం. భర్తే అపార్ధం జేసుకుని పగపెంచుకున్నాడని అనుకుంటాం. దీనికి విరుద్ధంగా నేరాలు ఘోరాలు కథలాగా, భార్యతో ఒక చవకబారు క్షుద్రకథని చూపించినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ కి లేదా- పూర్వజన్మ కథకి విలువే  లేకుండా పోయింది.

     సినిమాలో వినోదం అస్సలు లేదు, ఉన్న కథ ప్రకారమైనా భావోద్వేగాలు పండిస్తాయనుకుంటే అదీ కుదరకుండా కథ పక్క దార్లు పట్టిపోయింది. తప్పుల్ని కవర్ చేయడం కోసం చివరి షాట్ లో కూడా ప్రయత్నించి విఫలమయ్యారు- ఎవరో ముసలావిడ ఇప్పుడు జయలక్ష్మిని నేనే నంటూ చనిపోతే,  ఇప్పుడున్న ఐశ్వర్య ఎవరు? జయలక్ష్మి కాదా? మరి జయలక్ష్మి లాగే భావించుకుని సినిమా సాంతం చూశారే ప్రేక్షకులు?  చూసిందంతా హుష్ కాకీయేనా?


-సికిందర్ 
http://www.cinemabazaar.in
    
    









27, నవంబర్ 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు!







సినిమా కథలో ఫ్లాష్ బ్యాక్ అవసరం ఎంతన్నది హీరో పాత్ర కేర్పడే అవసరాన్నిబట్టి వుంటుంది. సినిమా కథ హీరో పాత్రలోంచే పుడుతుంది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ అవసరం కూడా హీరో పాత్రలోంచే రావాలి. ఈ రావాల్సిన అవసరమెలా తెలుస్తుంది? పరిస్థితి తీవ్రతని బట్టి, డిమాండ్ ని బట్టి తెలుస్తుంది. బలహీన పరిస్థితి ఫ్లాష్ బ్యాక్ ని డిమాండ్ చేయదు. స్క్రీన్ ప్లే ప్రారంభమే హీరో సముద్రం దగ్గర నిలబడి ఎమోషనల్ గా చూడడం  హీరోకి సంబంధించినంత వరకూ తీవ్ర పరిస్థితే కావచ్చు,  అది ప్రేక్షకులు  ఫీలయ్యే అవకాశం లేదు.  ఎందుకంటే అతను ఏ మానసిక స్థితిలో వున్నాడో ఇంకా ఆ ప్రారంభ సీనులోనే ప్రేక్షకులకి మెంటల్ మేకప్ తెలీదు. ఇక అతను మెళ్ళో తాయెత్తు తెంపి సముద్రంలోకి విసిరేస్తే దానికి కూడా ప్రేక్షకులు స్పందించలేరు. అదేమీ తాళిబొట్టు తెంపి పారెయ్యడ మంత తీవ్ర సంఘటన కాదు  – ఆ ఒక్క చర్యతో ప్రేక్షకులకి కుతూహలం పుట్టించడానికి.  అసలు తెంపింది  తాయెత్తు అని కూడా అప్పటికి ప్రేక్షకులకి తెలీదు, తర్వాత కథలో తెలుసుకుంటారు. కనుక  ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో  ఇలా ఈ సీను విషయం లేని సీనుగా తేలుతోంది. విషయంలేని  సీనుతో స్క్రీన్ ప్లే ప్రారంభాన్ని ముడి వేయడం కుదరనట్టే, ఫ్లాష్ బ్యాక్ కీ ఇంధనం ఇవ్వడం కుదరదని ఇక్కడ సోదాహరణంగా గమనించవచ్చు. అంటే ప్రారంభ సీనే కనెక్ట్  అవకుండా తేలిపోతూ, పాసివ్  మూడ్ లోకి నెట్టేస్తోందన్న మాట ప్రేక్షకుల్ని! 

        హీరో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూశాడు, బయట బస్సు పోతూ కన్పించింది. వెంటనే అతడి జ్ఞాపకాలు పదేళ్ళు వెనక్కి ఓ బస్సు మీదికి మళ్ళాయి...అతడి జీవితాన్ని ఆ బస్సు మార్చేసిన రోజు అది... అని ఫ్లాష్ బ్యాక్  ప్రారంభించడం ఎంతో, ‘జయమ్ము’ లో తాయెత్తు తెంపే  ప్రారంభ సీను తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించడం కూడా అంతే. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడానికి ఈ ఒక్క సీను సపోర్టు చేయదు. కనుక అదొక సీనే అని అన్పించుకోదు. పై ఉదాహరణలో బస్సు పోవడం తప్ప సీనులో ఇంకేమీ జరగలేదు. పైగా ఆ బస్సుని చూసిన హీరో ఎవరో ఏమిటో మనకి తెలీదు. కనుక అతడి గతం (ఫ్లాష్ బ్యాక్) పట్ల మనకి కుతూహలం పుట్టదు. అసలు అతణ్ణి కేర్ చెయ్యం. ఎలా కేర్ చేస్తాం, అతడి వర్తమానమే ప్రారంభం కానప్పుడు. వర్తమానం లేక గతంలేదు, భవిష్యత్తూ లేదు కదా?

        హీరో పాత్ర పుట్టాకే  ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళాలి. ‘యే దిల్ హై ముష్కిల్’ లో హీరో పాత్ర పుట్టాకే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. పుట్టడమంటే వర్తమానం, వర్తమానంలో ఈ హీరో ఒక సింగర్ అని అతడి చేతే అన్పిస్తారు. సింగర్ గా ఎలా స్ట్రగుల్ చేసి ఈ రేంజికి వచ్చాడో పరిచయం చేస్తారు. అప్పుడు తనకి పరిచయమైన అమ్మాయిలతో ప్రేమలు ఎలాగెలా కొనసాగాయో చెప్పిస్తూ  ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టిస్తారు అతడి పాయింటాఫ్ వ్యూలోనే. ఇతనెందుకు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టుకున్నాడు? ఆ పరిస్థితి ఏమొచ్చింది? ఇతను మొదలెట్టుకోలేదు, పరిస్థితి డిమాండ్ అలా చేసింది. ఆ పరిస్థితి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇంటర్వ్యూ ఇవ్వడమనే పరిస్థితి, అవసరం, డిమాండ్ వగైరా అతడి చేత ఫ్లాష్ భ్యాక్ ప్రారంభించేలా చేసింది. కనుక ఈ స్క్రీన్ ప్లే ప్రారంభ సీనుకి అర్ధం, బలం, సపోర్టూ వగైరా చక్కగా ఏర్పడుతూ,  ఫ్లాష్ బ్యాక్ పట్ల కుతూహలం కూడా పుట్టించడానికి కారణమయ్యింది. దేనికీ కారణం కాని సీను ఒక సీనే కాదు.   

        ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా గంటన్నర సేపు హీరో వర్తమానమంతా చూపించి, అప్పుడు ఎక్కడ్నించో వచ్చిన  కొత్త పాత్రని ప్రవేశ పెట్టి, అతను హీరోని గుర్తుపట్టి, ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అని ఆశ్చర్యపోయేలా చేసి, ప్రేక్షకులకి కుతూహలం పుట్టిస్తారు. ఇంతసేపూ వర్తమానంలో ఇంత సాత్వికంగా కన్పిస్తున్న హీరో ఈ హీరో కాడా? ఇంకెవరోనా? ఎవరు? ఎక్కడ్నించి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఆ ఫ్ల్లాష్ బ్యాక్ కథాకమామిషేమిటి....అన్నవి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది.

        1915 లో డీ డబ్ల్యివ్ గ్రిఫిత్ అనే దర్శకుడు ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’ అనే మూడుగంటల మూకీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అనే దాన్ని కనిపెట్టి ప్రదర్శించాడు. కాకపోతే దాన్ని ‘స్విచ్ బ్యాక్’ అన్నాడు అప్పట్లో. అప్పటి నుంచీ ప్రారంభమైన ఫ్లాష్ బ్యాకులు రానురానూ అవసరమున్నా లేకపోయినా, కావాలని పెట్టేసే  చాపల్యానికీ దారితీశాయి. 

        మరైతే  ‘జయమ్ము’ ఫ్లాష్ బ్యాక్ ఇంకెలా ప్రారంభించాలి? అసలు ఫ్లాష్ బ్యాక్ అవసరముందా ఈ కథకి? తమ కథలో ఏదో  గందరగోళం వుండి అదేమిటో అర్ధంగానప్పుడే ఫ్లాష్ బ్యాకులు మొదలెడతారని సిడ్ ఫీల్డ్ అంటాడు. కథమీద కమాండ్ లేనప్పుడు ఏ టెక్నిక్కుల జోలికీ వెళ్ళకుండా, ఉత్త సీదా సాదా స్ట్రెయిట్ నేరేషన్ లో సినిమా తీయడమే ఉత్తమం. ‘జయమ్ము’ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడైనప్పుడు,  రాంగోపాల్ వర్మకి ఏ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాక్ పెట్టే అలవాటు లేదని గమనించే వుంటారు. సినిమా కథ అనేది వెండి తెర మీద మున్ముందుకే దూసుకెళ్తూ కన్పించాలి లైవ్ గా. ముందుకీ, కాసేపు వెనక్కీ వెళ్ళకూడదు. బైక్ మీద హైదరాబాద్ నుంచి బెజవాడకి  జామ్మని దూసుకెళ్తున్నప్పుడు ముందుకే వెళ్ళిపోతాం. మధ్యలో  వెనక్కి సూర్యాపేట వచ్చి కాసేపు వూళ్ళో తిరిగి మళ్ళీ బయల్దేరం. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు చెట్లన్నీ కూడా వెనక్కే పోతూ కన్పిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ తో కథకి జరిగే నష్టం ఇదే. ముందుకు నడుస్తున్న కథని మధ్యలో ఆపేస్తుంది. ప్రేక్షకులకి ముందుకెళ్ళి కథ తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఒక కథలో కొంత భాగం గతంగా చూపాలనుకోవడం చద్దన్నం పెట్టడం లాంటిదే. పూర్తి కథ వర్తమానంలో నడుస్తూ ఫ్రెష్ గా లైవ్ గా వున్నప్పుడే ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ వుంటుంది. ఎప్పటిదో రికార్డెడ్ ఐటెం చూపిస్తున్నట్టు మధ్యలో ఫ్లాష్ బ్యాక్ కి కావాలని వెళ్తే అదో సహన పరీక్షే అవుతుంది. ఇది ఫ్లాష్ బ్యాకులు అవసరంలేని లీనియర్ కథల సంగతి. కొన్ని కథల్ని ఫ్లాష్ బ్యాక్స్ తో నాన్ లీనియర్ గా చూపిస్తేనే నిలబడతాయి. ‘ఖైదీ’ లాంటి యాక్షన్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు అన్నీ నాన్ లీనియర్ గా చూపించకపోతే నిలబడవు.  

        ఇంకోటేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ అంటే- మెయిన్ స్టోరీ కాదు. అది మెయిన్ స్టోరీకి కావలసిన సందర్భంలో, కావాల్సిన సమాచారాన్ని తవ్వి అందించే వనరు మాత్రమే. జస్ట్ డేటా బ్యాంక్. ‘బాబూ నువ్విక్కడ వున్నావా?’  అని హీరోని చూసి పాత్ర ఆశ్చర్య పడ్డప్పుడు, ఆ బాబు ఇక్కడున్న కారణాన్ని తెలిపే గత సమాచారాన్ని అందిస్తూ ఓపెన్ అయ్యేదే  ఫ్లాష్ బ్యాక్ అనే డేటా బ్యాంక్- కాల్ సెంటర్- సమాచార కేంద్రం ఏదైనా.

        ఈ సమాచారాన్ని గంటల తరబడీ ఇస్తూ కూర్చోలేరు, బోరు కొడుతుంది.  ఫ్యాక్షన్ సినిమాల్లో అరగంటకి మించి ఫ్లాష్ బ్యాక్స్ వుండవు.  ‘జయమ్ము’ లో సినిమా ప్రారంభంలోనే మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్, ఇంటర్వెల్ కూడా దాటేసి, ఇంకో ఇరవై నిమిషాలకి గానీ  ముగింపుకి రాదు! అంటే ఇంతసేపూ ప్రధాన కథని మింగేసిందన్న మాట. ఇదేలాగో ఈ కింద చూద్దాం.

స్క్రీన్ ప్లే స్ట్రక్చర్
     మిడిల్ : హీరో సముద్రం ముందు నిలబడి ఎమోషనల్ గా చూస్తూ మెళ్ళో వున్న తాయెత్తు తెంపి సముద్రంలోకి విసిరేస్తాడు 

        బిగినింగ్ : 2013 లో కరీంనగర్లో హీరో జీవితం, జాతకాల మీద నమ్మకాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వగైరా. తన శక్తి సామర్ధ్యాల్ని గుర్తించకుండా బాబా చెప్పే జోస్యాల మీద ఆధారపడి చెప్పినట్టల్లా చేస్తూంటాడు.  ప్రభుత్వ ఉద్యోగం కోసం పదేళ్లుగా పరీక్షలు రాస్తూ నిరుద్యోగిగానే వుంటాడు. చీరలు నేసి సంపాదించే తల్లి వుంటుంది. ఇక ఒక రాత్రి హీరో స్మశానంలో పడుకుంటే తప్పకుండా ఉద్యోగం వస్తుందని బాబా చెబితే, అది నమ్మి  స్మశానంలో పడుకుంటాడు హీరో. తెల్లారే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నప్పుడు మార్కెట్ లో మొదటిసారిగా హీరోయిన్ ని చూస్తాడు. అలా హీరోయిన్ అనే ‘అద్భుత శక్తి’ ఎదురు పడింది కాబట్టే ఉద్యోగం వచ్చిందని బాబా అంటాడు. ఆమె హీరో జీవితంలోకి వస్తే కోరికలన్నీ నెరవేరుతాయని కూడా జోస్యం చెప్తాడు. కాకినాడ మున్సిపాలిటీలో పోస్టింగ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడికే బదిలీ చేయించుకుని వస్తానని తల్లితో చెప్పి వెళ్ళిపోతాడు.

        కాకినాడ మునిసిపాలిటీ ఆఫీసు వాతావరణం. ఉద్యోగంలో చేరుతూనే బదిలీకి పెట్టుకుంటాడు. జేసీ అనే పై అధికారి, అడపా  అనే కింది అధికారీ అలాగే చూస్తామంటారు. ఆఫీసు పక్కనే మీ సేవా కేంద్రంలోనే తను కరీంనగర్లో చూసిన  హీరోయిన్ ని చూస్తాడు హీరో. ఈమె ఇక్కడే పనిచేస్తూంటుంది. హీరోకి బాబా చెప్పిన జోస్యం గుర్తుకొచ్చి ఈమెతో ప్రేమలో పడతాడు. కానీ ఆమెకి చెప్పే ధైర్యం వుండదు. 

        మున్సిపాలిటీలో బ్రోకర్ గా తిరిగే తత్కాల్ అనే వాడిద్వారా  హీరోయిన్ వివరాలు తెలుసుకుంటూ ప్రేమని బలీయం చేసుకుంటాడు హీరో. ఎలాగైనా ఈమెని పెళ్లి చేసుకుని, కరీంనగర్ కి బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలన్న ఆలోచనతో వుంటాడు. ఈ మునిసి పాలిటీలోనే తాను పెట్టబోయే నర్సరీకి అప్లికేషన్ పెట్టుకుంటుంది హీరోయిన్. అది హీరో దగ్గరికే రావడంతో ఆమెకు దగ్గరయ్యే అవకాశం లభిస్తుంది హీరోకి. 

        మునిసిపాలిటీలో ఇంకా రకరకాల మనుషులు వుంటారు, ఇల్లు కట్టుకోవడానికి తిరిగే ఒక పేద బ్రాహ్మడు, పైరవీలు చేసే తాత్కాల్ అనే బ్రోకర్, గాసిప్స్ చెప్పుకునే చిరుద్యోగులూ వగైరా. 

        హీరో పై అధికారి జేసీ,  అమ్మాయిలకి వలేసి వాడుకుని వదిలేస్తూంటాడు. వాడుకోవడానికి హీరో అద్దెకుంటున్న పోర్షన్ కే వస్తూంటాడు. అలాగే హీరో కింది అధికారి అడపా కూడా ఆఫీసులో ఓ ఉద్యోగినికి లైనేసి హీరో పోర్షన్ కే తెచ్చుకుంటాడు. ఈ సమయాల్లో హీరో ఏమీ చేయలేక బయటే గడుపుతూంటాడు. ఈ రంకుల్ని చూసి ఇంటి ఓనర్ కూడా లైట్ గా తీసుకుంటాడు.

        హీరోకి పోటీగా కాంతారావనే  రోమియో వుంటాడు. వీడు బైక్ మీద హీరోయిన్ ని షికార్లకి  ఎగరేసుకు పోతూంటే ఏమీ చేయలేకపోతాడు. ఒకరోజు  పౌరుషానికి పోయి సెకండ్ హేండ్ బైకి కొని హీరోయిన్ ని ఎక్కించుకుంటే అది పాడవుతుంది. అప్పుడూ రోమియో వచ్చేసి ఆమెని ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. ఈ బైక్ అమ్మిన మెకానిక్, అతడి అసిస్టెంట్  కూడా వేరే కామెడీలు చేస్తూంటారు. ఒకసారి హీరో బాబాకి ఫోన్ చేస్తే, ఆ అమ్మాయిని ప్రేమిస్తే నీ ఉద్యోగం పోతుందంటాడు. 

        ఒకరోజు సాయంత్రం రెస్టారెంట్ కి వస్తానన్న హీరోయిన్ రాదు. కాల్స్ కి రెస్పాన్స్ కూడా ఇవ్వదు. ఇంతకి  ముందు ఆమె తను పక్కనే వున్నా ఎవరితోనో కాల్స్ మాట్లాడుతూ వుండడాన్ని గమనిస్తాడు. ఇప్పుడు రెస్టారెంట్ కి వస్తానని రాలేదంటే ఎక్కడికి వెళ్లి వుంటుందని  ఆందోళన చెందుతూంటే  ఇంటర్వెల్ పడుతుంది...

          ఇంటర్వెల్ తర్వాత బిగినింగ్ కంటిన్యూ :  ఒక కామెడీ సీనుతో ప్రారంభం. తిరిగి హీరోని చూస్తే ఇంకా హీరోయిన్ గురించిన ఆందోళనతో వుంటాడు. ఆమె రోమియో కాంతారావుతోనే వెళ్లి వుంటుందని అనుకుంటాడు. ఇంతలో జేసీ రూమ్ కావాలంటాడు. అప్పుడు హీరోకి హీరోయిన్ మీద అనుమానం వేసి చాటుగా చూస్తాడు. హీరోయిన్ జేసీతోనే రూమ్ కి వస్తుంది. హీరో కుమిలిపోతాడు. ఏం చేయాలో పాలుపోదు. లోపల జేసీ హీరోయిన్ ని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తూంటాడు. ఇతను ప్రేమించడం లేదని అప్పుడర్ధం  అవుతుందామెకి. కానీ తప్పించుకునే మార్గం కన్పించదు. అవతల ఏం చేయాలో పాలుపోని హీరో బాబాకి కాల్ చేస్తాడు. రెస్పాన్స్ వుండదు. అప్పుడు జ్ఞానోదోయం అవుతుంది. తను బాబా మీద ఆధారపడకూడదనీ, తన జీవితం తనదనీ, ఆత్మవిశ్వాసంతో తన నిర్ణయాలు తనే తీసుకోవాలనీ, జోస్యాలతో బ్రతికే మూఢత్వం వద్దనీ డిసైడ్ అయిపోయి- వెళ్లి రూమ్ డోర్ తీసి తప్పుకుంటాడు. అక్కడ్నించి హీరోయిన్ తప్పించుకుంటుంది, డోర్ తీసి కాపాడింది హీరోయేనని తెలుసుకోకుండా. 

          మిడిల్ కంటిన్యూ :  సముద్రం ముందు నిలబడి ఎమోషనల్ గా చూస్తూంటాడు హీరో. బాబాని నమ్మి కట్టుకున్న తాయెత్తుని తీసి సముద్రంలోకి విసిరేస్తాడు. ఇక బాగా ధైర్యం వచ్చేసి, తనని ఏడ్పించిన వాళ్ళ పని పడతాడు. కాంతారావుకి తడాఖా చూపిస్తాడు. బైక్ అమ్మిన వాడికీ బుద్ధి చెప్తాడు, జేసీనీ, అడపానీ ఎదుర్కొంటాడు. హీరోయిన్ తనకి లొంగకుండా తప్పించుకుందని ఆమె నర్సరీకి పర్మిషన్ ఇవ్వడు జేసీ. హీరో బదిలీకీ అడపా అడ్డమేస్తాడు. హీరో ఒక పాటతో ఊరేగింపుగా వెళ్లి, ఓ ఫ్లాట్ లో ఇంకో అమ్మాయితో వున్న జేసీని అల్లరిపాలు చేస్తాడు. హీరోయిన్ కి ఆమె అన్న పెళ్లి సంబంధం తెస్తాడు. హీరోయిన్ ఏమీ నిర్ణయించుకోదు. హీరో మీద ఆమెకి ప్రేమ పుడుతుంది. ఆ  ప్రేమని తాత్కాల్ చెడగొడతాడు- హీరో తను అద్దెకుంటున్న పోర్షన్ ని శృంగార కార్యకలాపాలకి  ఇస్తున్నాడని. దీంతో హీరోయిన్ తన అన్న తెచ్చిన సంబంధాన్నే చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఈ పెళ్లిని చెడగొట్టడానికి హీరో పూనుకుంటాడు. 


            ఎండ్: హీరోయిన్ పెళ్లి సందడి. ఈ పెళ్లిని చెడగొట్టే పని తత్కాల్ కి అప్పగిస్తాడు హీరో. పెళ్లి పంతులుగా ఆ పేద బ్రాహ్మడు వస్తాడు. ఇంతలో హీరో ఇంటి ఓనర్ వచ్చి హీరోగురించి హీరోయిన్ కి అపార్ధం తొలగిస్తాడు. ఆరోజు తన పోర్షన్ లో జేసీ బారిన పడకుండా హీరోయిన్ ని కాపాడింది హీరోయేనని చెప్తాడు. దీంతో హీరోయిన్ కి మళ్ళీ హీరో మీద మనసుపోతుంది. తర్వాత పెళ్లి చెడగొట్టడం,  హీరో హీరోయిన్లు ఒకటవడం, ‘సుఖాంతం’ అన్న అక్షరాలు పడి సినిమా ముగియడం...

బిగినింగ్ బారెడు


       పైన మిడిల్ తో ప్రారంభమై, బిగినింగ్ కి వచ్చి, తిరిగి మిడిల్ కి వెళ్లి ఆపైన ఎండ్ కి వెళ్ళే ఈ  అయ్యే నాన్ లీనియర్ కథనాన్ని చూస్తే,  ఫ్లాష్ బ్యాక్ గా చూపించుకొచ్చిన బిగినింగ్ విభాగం హద్దులు దాటి ఎంత బారుగా సాగిందో తెలుస్తోంది. ఇంటర్వెల్ ని కూడా దాటిపోయి ఇరవై నిముషాలు సాగుతుంది. దీంతో ఇంటర్వెల్ దగ్గర కూడా ప్లాట్ పాయింట్ వన్ కి అవకాశం లేకుండా పోయింది. అంటే కథ ప్రారంభం కాలేదు, అంటే కథేమిటో ఇంకా తెలీదన్న మాట ప్రేక్షకులకి. హీరోయిన్ ఏమయ్యిందా అని హీరో ఆందోళన చెందడమనే బలహీన- విషయం లేని, ఆసక్తి రేపని - సీను మీద ఇంటర్వెల్ వేశారు. దీంతో ఫస్టాఫ్ అంతా చూసిందేమిటో అర్ధంగాని పరిస్థితి. 

        బిగినింగ్ విభాగాన్ని  ఇంటర్వెల్ లోపు వీలయితే అరగంటలోగా, కాకపోతే ముప్పావుగంటలోగా ముగించడం పద్ధతి. ఈ మధ్య ఇంటర్వెల్ దాకా వెళ్ళకుండా ఈ పద్ధతికే వస్తున్నాయి సినిమాలు ప్రమాణాల ప్రకారం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ‘జయమ్ములో’ ఏ హద్దులూ లేవు, కనీసం ఇంటర్వెల్ అనే కథకి బలాన్నిచ్చే మూల స్టంభాన్ని కూడా నమ్ముకోలేదు. దీంతో తో స్ట్రక్చర్ చెదిరిపోయి- ఇంటర్వెల్ లోపు ప్రారంభం కావాల్సిన మిడిల్ వన్ విభాగాన్ని పూర్తిగానూ, ఇంటర్వెల్ తర్వాత ప్రారంభం కావాల్సిన మిడిల్ టూ విభాగాన్నీ పాక్షికంగానూ ఆక్రమించేసి స్క్రీన్ ప్లేని నీరు గార్చేసింది. 


        ఫస్టాఫ్ గంటంపావు సేపూ సాగుతుంది బిగినింగ్ విభాగం,  సెకండాఫ్ ఇంకో ఇరవై నిమిషాలూ సాగి మొత్తం తొంభై అయిదు నిముషాలు- అంటే గంటన్నర పైన అయిదు నిమిషాలూ తినేస్తుంది ప్రధాన కథని. ఎక్కడి అరగంటా- ముప్పావుగంట పరిమితి, ఎక్కడి గంటన్నర సాగతీత! ఇంతసేపూ కథే మొదలవక,  అసలు కథేమిటో అర్ధం గాక వుంటుంది పరిస్థితి. మిడిల్ ప్రారంభమైతే కదా, కథ మొదలై అది అర్ధమయ్యేది? 



         ఈ గంటన్నర పోనూ సెకండాఫ్ లో అరగంట మాత్రమే మిడిల్ విభాగం పంచుకుంటుంది. మిడిల్ విభాగం సినిమా నిడివిలో సగభాగం అక్రమిస్తేనే కథకి బలం వుండేది. ఈ బలాన్నే అరగంటకి కుదించేస్తే ఎలా వుంటుంది...అసలు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథకన్నా ఇతరుల కామెడీ ట్రాకులే ఎక్కువైపోయాయి. అంటే అసలు కథ జోలికి అంతగా వెళ్ళదల్చుకోలేదు రచయిత. ఎందుకంటే ఆ కథని నిర్వహించడం తనకి తలకి మించిన పనిగా వుందేమో. ఇందుకే క్లయిమాక్స్ లో కూడా చివరి వరకూ హీరోలేకుండా కమెడియన్ల చేతే లాగించేశారు. ఈ ఎండ్ విభాగం కూడా ఓ అరగంట తెగ సాగుతుంది. మొతం కలిపి సినిమా నిడివి రెండు గంటలా 41 నిమిషాలు!

ఆలస్యం అమృతం అమృతాంజనం
      సెకండాఫ్ లో ఆలశ్యంగా వచ్చే మిడిల్ విభాగంలో, హీరో జేసీ బారినుంచి హీరోయిన్ ని కాపాడి, తాయెత్తుని తెంపి సముద్రంలోకి విసిరేసే ఘట్టం ప్లాట్ పాయింట్ వన్. ప్లాట్ పాయింట్ వన్ రావడానికి ఇంతాలాస్యం అన్నమాట. ఇక మిడిల్ ఆఖర్లో, హీరోయిన్ వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డం ప్లాట్ పాయింట్ టూ. అంటే ప్లాట్ పాయింట్ వన్ కీ, టూ కీ ఎడం కేవలం అరగంటే నన్న మాట! అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. అసలు సినిమా ప్రారంభమే ప్లాట్ పాయింట్ వన్ (తాయెత్తు సముద్రం లో విసరడం) ఘట్టంతో ప్రారంభం కావడం ఎక్కడా వుండదేమో. ‘శివ’ లో నాగార్జున సైకిల్ చైనుతో జేడీని కొట్టే ఘట్టంతో సినిమా ప్రారంభించి వుంటే ఎలా వుండేదో? 

        బాపూ రమణ గార్ల సిల్వర్ జూబ్లీ ఆడి, రెండు జాతీయ అవార్డులు పొందిన ‘ముత్యాల ముగ్గు’ (1975) కీ, ‘జయమ్ము’ కీ దగ్గర పోలికలున్నాయి. ‘ముత్యాల ముగ్గు’ కుటుంబ కథ. సీతని  అనుమానించి అడవులకి పంపే ఉత్తర రామాయణం లాంటిది లవకుశ లనే బాలపాత్రలు సహా. ఇందులో ప్లాట్ పాయింటు వన్ గా వచ్చే ప్రధాన ఘట్టంలో క్రైం ఎలిమెంట్ ని ప్రవేశ పెట్టారు. (క్రైంఎలిమెంట్ వున్న కుటుంబ కథలు బావుంటాయి). రోమాంటిక్ డ్రామా అయినా  ‘జయమ్ము’ లో క్రైం ఎలిమేంట్ తోనే ప్లాట్ పాయింట్ వన్ ప్రధాన ఘట్టం వుంది. 


        ‘ముత్యాల ముగ్గు’ లో సంగీత పాత్ర గదిలోకి బట్టలు విప్పుకుని నూతన్ ప్రసాద్ పాత్ర చొరబడి, ఆమె భర్త శ్రీధర్ పాత్ర వస్తున్న సమయానికి, కంటపడేలా పారిపోయే సీనులో ఎలాటి క్రిమినాలిటీ వుందో- ‘జయమ్ము’ లోనూ హీరోయిన్ ని జేసీ మభ్యపెట్టి  హీరో పోర్షన్ కి తెచ్చుకోవడంలో అలాటి క్రిమినాలిటీయే వుంది, ఇప్పుడేం జరుగుతుందన్న సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ. 


        రెండూ హీరోయిన్ పాత్రల శీలాన్ని హననం చేయడానికి ఉద్దేశించినవే. కాకపోతే ‘జయమ్ము’ లో హీరో ఆమెని కాపాడుకుంటాడు, ‘ముత్యాలముగ్గు’ లో రాముడిలా అనుమానించి త్యజిస్తాడు. అయితే కథని ప్రారంభిస్తూ మిడిల్ కి తీసికెళ్ళే ఈ ప్లాట్ పాయింట్ వన్ సీన్ ని,  బాపూ రమణలు సమయం వృధా చేయకుండా- సినిమా ప్రారంభమైన అరగంటలోనే  పెట్టేశారు. 





        ‘జయమ్ము’లో గంటన్నర పైగా పట్టింది! నేనింకా చట్నీయే వేస్తూంటాను తినండి, ఇడ్లీ గంట తర్వాత పెడతానంటే ఎలా వుంటుందో ఇదీ అలాగే వుంటుంది. కేవలం చట్నీ లాంటిది బిగినింగ్ విభాగం. జనం మిడిల్ విభాగమనే ఇడ్లీ కోసం చూస్తూంటారు. అప్పటి వరకూ చట్నీని చూస్తూ కూర్చుంటారు. ఇడ్లీ వస్తేనే చట్నీ ఉపయోగంలోకి వచ్చేది. మిడిల్ వస్తేనే బిగినింగ్ కి అర్ధంపర్ధం వుంటుంది. మిడిల్ కి వెళ్ళకుండా ఎంతసేపూ బిగినింగే వేసుకుంటూ కూర్చోవడం శుద్ధవేస్ట్. దానికి కథతో పనుండదు. కథని ప్రేమించకపోతేనే బిగినింగ్ తో కాలక్షేపం చేసేది. బాపూ రమణలు కథని ప్రేమిస్తారు కాబట్టే ఫ్లాష్ బ్యాకులతో ఎలాటి గిమ్మిక్కులు చేయకుండా, వినోదం పేరుతో  ఫస్టాఫ్ అంతా కథతో సంబంధం వుండ ని కామెడీతో కాలక్షేపం చేయకుండా- కేవలం కథతోనే కదం తొక్కారు.
        ఫ్లాష్ బ్యాక్స్ తో ప్లాట్ పాయింట్ వన్ ఎండమావియై పోతుంది...

పాత్రోచితానుచితాలు

     ప్లాట్ పాయింట్ వన్ హీరో పాత్రకి కీలక ఘట్టం, సమస్యతో సంఘర్షించడానికి సమాయత్తం చేసే కేంద్రం. ఇక్కడే హీరోకి 1) ఒక లక్ష్యం ఏర్పడుతుంది, 2) ఈ లక్ష్యం కోసం దేన్నైనా పణంగా పెడతాడు, 3) దీని పరిణామాల హెచ్చరికలు ఎలా వున్నా లెక్క చెయ్యడు, 4) ఎట్టి పరిస్థితిలోనూ సమస్యని పరిష్కరించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఎమోషన్ తో వుంటాడు... ఈ నాల్గు టూల్సూ  హీరో పాత్రని రక్త మాంసాలున్న సజీవ పాత్రగా తయారు చేస్తాయి. 

       
జయమ్ము హీరో జేసీతో హీరోయిన్ ని చూసిన ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం లో- 1) ఇక హీరోయిన్ ని పొందాలన్న  ‘లక్ష్యం’ బలీయంగా మారింది, 2) దీనికోసం తనకి అడ్డున్న, తనకి ప్రాణప్రదమైన, మూఢ నమ్మకాల్నే ‘పణం’ గా పెడుతూ తాయెత్తుని తెంపి పారేశాడు, 3) బాబాని కాకుండా తనని తాను నమ్ముకుంటే ‘పరిణామాలు’ ఎలా వుంటాయో కూడా ఖాతరు చేయలేదు, 4) ఇవన్నీ కలగలిసి విపరీతమైన ఎమోషన్ కి లోనయ్యాడు... 

        ఈ ఎమోషన్ తర్వాత ఏమైంది? ఈ ఎమోషన్ ని  కేవలం తాయెత్తుని తెంపే వరకే వాడుకున్నాడు. ఆ తర్వాత ప్రేమకోసం - అసలు లక్ష్యం కోసం వాడుకోలేదు, పెద్ద నోట్లలా రద్దు చేసుకున్నాడు. చూస్తే ఏటీఎం ఖాళీ. ప్రేమలో మళ్ళీ మునపటి పిల్లిలాంటి వాడే. ప్రేమలో ఎమోషన్ చచ్చిపోయింది, ప్రేమ కోసం లక్ష్యమూ చచ్చిపోయింది. ఇప్పటికైనా ఆమెకి ప్రేమని వెల్లడించే  ధైర్యం చెయ్యడు. మరెందుకు పాపం అంత మంచి తాయెత్తుని తెంపుకున్నట్టు? 


        మిడిల్లో హీరో సమస్యతో సంఘర్షించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు- కేవలం తనని ఏడ్పించిన వాళ్ళకీ, ప్రేమకి అడ్డు తగిలిన వాళ్ళకీ కామెడీ చేస్తూ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి పనికి రాని బైక్ వాడి మీద కూడా కసి తీర్చుకున్నాడు. ఈ మూడు నాల్గు సీన్ల వరకే తనలో వచ్చిన మార్పుకి ఫలితం చూపెట్టాడు. దీని తర్వాత మళ్ళీ మామూలే. మునుపటి పాసివ్ క్యారక్టరే.  ఇక మిగిలింది ప్రేమ ఒక్కటే. ఈ ప్రేమ కోసం ప్రయత్నమే చేయడు. ఉపగ్రహంలా  కథ చుట్టే తిరుగుతాడు తప్ప, కథలోకి ఇప్పటికీ వెళ్ళడు. ఈ మూగ ప్రేమతో ఎలా గడిస్తే అలా గడవనీ అన్నట్టు వుండిపోతాడు. దీంతో లక్ష్యం కోసం సంఘర్షణ లోపించి పేలవంగా కన్పిస్తాడు. టూల్స్ నాల్గింటిలో అసలు టూల్ (లక్ష్యం) కే కొన్న బైక్ కి లాగే తుప్పుపట్టింది. 


        యధా ప్లాట్ పాయింట్ వన్ తధా క్లయిమాక్స్ అన్నారు. ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ టూల్స్ లో లక్ష్యమనేదే లోపించాక క్లయిమాక్స్ లో ఏమీ చేయలేని హీరో అదృశ్యమైపోయాడు. 


        ఈ కథ రోమాంటిక్ డ్రామా అనుకుంటే ఇవన్నీ సరిపోతాయి - హీరో హీరోయిన్లు పాసివ్ గా వుండడం, అసలు పరస్పరం ప్రేమనే వెల్లడించుకోక పోవడం, దాంతో ప్రేమలో సమస్యే ఏర్పడక పోవడం, సంఘర్షణే లోపించడం, ఏకపక్షంగా ఏవో అపార్థాలేర్పడ్డం, చివరికి పెద్దలే జోక్యం చేసుకుని పరిష్కరించడం (హీరో పోర్షన్ లో జేసీ బారిన పడకుండా హీరోయిన్ ని కాపాడింది హీరోయేనని, హీరోయిన్ కి చెప్పి ఇంటి ఓనర్  చివరికి అపార్ధాన్నితొలగించే దృశ్యం)...ఇవన్నీ సరిపోతాయి. అలాంటప్పుడు హీరో చేత దర్శకుడు తాయెత్తు తెంపించి లేని కథకి గొప్ప  బిల్డప్ ఇవ్వనవసరం లేదు. అమలుకాని ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేయనవసరం లేదు. సెటప్  పే ఆఫ్ కాకుండా చేసుకోవాల్సిన అవసరమే లేదు. విప్లవాత్మకంగా తాయెత్తుని తెంపేసి గొప్ప అభ్యుదయవాది అన్పించుకున్న హీరోతో ప్రేమ విషయంలో చేయించిందేమిటి? ఏమీ లేదు. ఇతర పాత్రలే పూనుకుని అతడి ప్రేమని సాధించి పెట్టాయి. జయమ్ము నిశ్చయమ్ము వాళ్ళకే అయింది- హీరోకి కాదు. అలాంటప్పుడు అతడి తాయెత్తూ మూఢనమ్మకాలతో అతణ్ణి అలాగే కొనసాగించి, ఇతర పాత్రల చేత ప్రేమవిజయం గావిస్తే రోమాంటిక్ డ్రామా నేచర్ కి సరీగ్గా సరిపోయేది. 


        అలాంటప్పుడు, అంధవిశ్వాసాల్లోంచి ఆత్మవిశ్వాసంలోకి - అని కాన్సెప్ట్ చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడంలో అర్ధం లేదు- అంధవిశ్వాసాల్లోంచి బయటికి వచ్చి అతనేమీ సాధించనప్పుడు. అంటే తాయెత్తు తెంపడం అనే ఈ కథకి కీలక చర్య పూర్తిగా తప్పన్న మాటే. అంటే తాయెత్తు తెంపే ఎమోషనల్ సీనుతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించడం చాలా బ్లండర్ అని ఇప్పుడు తెలియడం లేదూ? తాయెత్తు- అంధవిశ్వాసాలు- ఆత్మవిశ్వాసం - వీటితో వున్న  గందరగోళమే ఫ్లాష్ బ్యాక్ ని సృష్టించిందన్న మాటే. సిడ్  ఫీల్డ్  చెప్పింది ఇలా నిజమేనెమో!


            ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఈమె రిజర్వుడు గా వుంటుంది. ఎవరి పట్లా ఏ దృక్పథమూ కలిగి వుండదు. వాళ్ళతో దెబ్బతిన్నానని అనుకున్నాకే దృక్పథం అలవర్చుకుంటుంది.  అన్నిటి కంటే పెద్ద సస్పెన్స్ ఏమిటంటే,  కాకినాడ లో వుండే ఈమె కరీంనగర్ కి ఎందుకొచ్చిందనేది . హీరో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కరీంనగర్ మార్కెట్ లో ఆమెని చూస్తాడు. అక్కడెందుకుంది? హీరోకి - బాబాకీ ఈ సన్నివేశంతో పనుంటుంది  కాబట్టి వచ్చిందా? హీరో తనకి జాబ్ వచ్చిందని బాబాకి చెప్పగానే, ఒక ‘అద్భుత శక్తి’ ఎదురొచ్చింది కాబట్టి జాబ్ వచ్చిందంటాడు బాబా. హీరో ఆమెని ఊహించుకుని ఆనందిస్తాడు! ఇలా వుంది సన్నివేశ కల్పన! తర్వాత కాకినాడలో ఒకర్నొకరు చూసుకున్నప్పుడు కరీనం నగర్లో చూసుకోనట్టే ప్రవర్తిస్తారు. కనీసం హీరోకైనా - కరీంనగర్ మీరెందుకొచ్చారని అడగాలన్పించదు. 

        హీరోయిన్ పాత్రతో ఇంకో పెద్ద అభ్యంతరముంది.  ఒకచోట తత్కాల్ అనే వాడు హీరో మీద హీరోయిన్ కి కావాలని ఫిర్యాదు చేస్తూ, ఇతరుల శృంగార కలాపాలకి హీరో తన పోర్షన్ ని ఇస్తున్నాడని చెప్పేస్తాడు. ఆమె డిస్టర్బ్ అయి హీరో మీద  ఇక ప్రేమ వద్దనుకుంటుంది. మొదట జేసీ అనేవాడితో దెబ్బ తిని ప్రేమే వద్దనుకుంది. దాని తాలూకు బాధ, సఫరింగ్ ఏమీ వుండవు. పైగా అన్న తెచ్చిన సంబంధం వద్దని హీరో మీద ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు హీరో గురించి చెడుగా వినడంతో ఈ ప్రేమ కూడా వద్దనుకుని అన్న తెచ్చిన సంబంధమే చేసుకుంటానంటుంది. బాధ, సఫరింగ్ ఏమీ వుండవు మరబొమ్మలాగా. మళ్ళీ చివరికి పెళ్లి పీటల మీద హీరో వైపు ఫిరాయిస్తుంది. ఇలావుంది పాత్రచిత్రణ.


        ఇదలా ఉంచితే అసలు అభ్యంతరమేమిటంటే, తత్కాల్ అనేవాడు హీరో గురించి అలా చెబితే తక్షణం ఆమెకి జేసీతో తను వెళ్ళింది హీరో పోర్షన్ కే అని అర్ధమైపోవాలి! ఐతే అప్పుడు డోర్ తీసి తనని కాపాడింది హీరోయేననీ తెలిసిపోయి, తను చేసింది హీరోకీ తెలుసనీ రివీల్ అయిపోవాలి! చాలా షాక్ కి గురవ్వాలి.  ఇక అప్పుడు హీరో దగ్గరికైనా వెళ్లి మ్యాటర్ క్లియర్ చేసుకోవాలి- లేదా హీరోకి అలాటి పరిస్థితిలో కంటపడినందుకు సిగ్గుతో ఏమైనా చేసుకోవాలి. ఇదేమీ లేకుండా తనని కాపాడిన హీరోనే  ‘పోర్షన్ ని శృంగార కలాపాలకి ఇచ్చే చెడ్డవాడు’ గా భావించుకుని ఎలా అసహ్యించుకుంటుంది? పెళ్లి సమయంలో ఇంటి ఓనర్ వచ్చి- ఆ రోజు జేసీ బారి నుంచి తనని కాపాడింది హీరోయేనని చెప్తేగానీ తెలీదా? ఎప్పుడో తాత్కాల్ చెప్పినప్పుడే  తెలీదా? 


        ఇలాటి పాత్ర చిత్రణలతో కథనం కూడా తప్పుడు కథనంగా మారిపోయింది. ఇంకా  బాబా గురించి చెప్పుకుంటే,  ఇతనూ పరస్పర విరుద్ధమైన మాటలు చెప్తాడు. శ్మశానంలో పడుకుంటే ఉద్యోగం వస్తుందన్న వాడే ‘అద్భుత శక్తి’ (హీరోయిన్) ఎదురురావడం వల్లే ఉద్యోగం వచ్చిందని మాట మారుస్తాడు. ఆమెని చేసుకుంటే కోరికలు నెరవేతాయని అన్న వాడే, ఆమెని ప్రేమిస్తే ఉద్యోగం పోతుందని అంటాడు- ఇలాటి వాణ్ణి ఎప్పుడో వదిలించుకోవాలి హీరో. ఆమె తన జీవితంలోకి వస్తే శుభం జరుగుతుందని ఓ పక్క బాబా అంటే, హీరో ఓ బైక్ కొని ఆమెని ఎక్కించుకోగానే అది బ్రేక్ డౌన్ అవుతుంది.  ఇక ఇంటి ఓనరైతే అద్దెకిచ్చిన పై పోర్షన్లో రోజూ రంకు జరుగుతోంటే కూడా  హాయిగా వుంటాడు!


        సినిమాల్ని పైపైన ఏదో రాసేసి, పైపైన ఏదో తీసేస్తే, పైపైన ఏదో చూసేసి ఎంజాయ్ చేసేస్తున్నారు ప్రేక్షకులు- వాళ్ళకో నమస్కారం! బిగ్ సెల్యూట్!!


- సికిందర్






       

       


.