రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, మే 2023, బుధవారం

1336 : స్పెషల్ ఆర్టికల్

 

పాత సినిమాల రీరిలీజుల ట్రెండ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడురోజు 31 వ తేదీ విడుదలయింది. మే 31 హీరో కృష్ణ జయంతి సందర్భంగా నివాళిగా ఈ పునర్ విడుదల. 52 ఏళ్ళ క్రితం ఆగస్టు 27, 1971 న విడుదలైన, పద్మాలయా బ్యానర్ పై కృష్ణ నిర్మించిన  మోసగాళ్లకు మోసగాడు ఆనాడే పానిండియా కాదు, తొలి పాన్ వరల్డ్ మూవీగా పెను సంచలనం సృష్టించింది. జానపద వీరుణ్ణి కౌబాయ్ హీరోగా మార్చేసి, మొత్తం భారతీయ సినిమానే కొత్త జానర్ లోకి కదం తొక్కించిన యాక్షన్ సినిమాల డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో, కౌబాయ్ హీరోగా కృష్ణ నటించిన ఈ ఔట్ డోర్ యాక్షన్- ఇటు ఒకవైపు  తెలుగు ప్రేక్షకుల్ని శత దినోత్సవం దాకా ఉర్రూతలూగిస్తే, మళ్ళీ భాష మార్చుకుని అటు నూట పాతిక దేశాల్లో ట్రెజర్ హంట్గా డబ్బింగై రికార్డులు సృష్టించింది! ఇదీ పాన్ వరల్డ్ దెబ్బ అంటే!

        మోసగాళ్లకు మోసగాడు విడుదలై రెండు తరాలు గడిచిపోయాయి. మూడో తరం నడుస్తోంది. కనీసం రెండు తరాల ప్రేక్షకులు దీన్ని చూసి వుండరు. చూసి వుంటే కొందరు బుల్లి తెర మీద చూసి వుండొచ్చు. ఇప్పుడు 1971 తర్వాత మళ్ళీ వెండి తెర మీద చూసే భాగ్యం ఇప్పుడే లభిస్తోంది. రీమాస్టర్ చేసిన, డోల్బీ సౌండ్ తో 4 కే రిజల్యూషన్ తో థ్రిల్ చేసేందుకు అప్ గ్రేడ్ అయి విడుదలవుతోంది.
        
ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్  (1965), ‘ది గుడ్, ది బాడ్ అండ్ ది అగ్లీ (1966),’మెకెన్నాస్ గోల్డ్ (1969) వంటి హాలీవుడ్ క్లాసిక్స్ నుంచి ప్రేరణ పొంది హీరో కృష్ణ చేసిన ప్రయోగమిది. తెలుగు నేలపై గుర్రాల మీద తిరుగుతూ ఎవరూ కన్పించరు. మరి దీన్ని సినిమాగా తీసి ఎలా ఒప్పించాలి? అమెరికన్ కౌబాయ్ లు తెలుగునాట తుపాకులు పేలుస్తూ ఎలా తిరుగుతారు? తిరిగేలా చేసి ఒప్పించారు ప్రసిద్ధ కవి, రచయిత ఆరుద్ర.          

ఏక్  నిరంజన్ లో పూరీ జగన్నాథ్ విదేశాల్లో కనిపించే బౌంటీ హంటర్ అనే పాత్రలో ప్రభాస్ ని చూపిస్తే నేటివిటీ లేక ప్రేక్షకులకి ఎక్కలేదు. ఆరుద్ర ఈ నేటివిటీ గురించే ఆలోచించి వుంటారు. తన కౌబాయ్ హీరో పాత్ర కూడా విదేశీ బౌంటీ హంటరే! అంటే నేరస్థుల్ని చట్టానికి పట్టించి తృణమో పణమో సంపాదించుకునేవాడు. అందుకని ఆరుద్ర కథని సమకాలీనం చేయకుండా,  తెలివిగా ఇండియాని ఏలిన బ్రిటిష్- ఫ్రెంచి ల కాలంలో స్థాపించారు.

అనగనగా బొబ్బిలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అమరవీడు సంస్థానం మీద దాడి చేస్తారు. అక్కడ్నించీ మొదలెడితే గద్వాల
, కర్నూలు సంస్థానాల వరకూ ఓ నిధికోసం వేట కొనసాగుతుంది. అప్పటి నేపధ్యవాతావరణం, ఆ నట్ట నడి తెలుగు ప్రాంతంలో విదేశీ సంస్కృతీ, నిధి వేటా అనేవి  ఆరుద్ర సృష్టించిన కృష్ణ ప్రసాద్ (కృష్ణ) పాత్రకి సరిపోయి- క్రిమినల్ పాత్రలో నాగభూషణాన్ని పదే పదే  పట్టిచ్చే బౌంటీ హంటర్ లాగా చూపించినా చెల్లిపోయింది. పైగా విలన్స్ కి బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య..అంటూ మాస్ పేర్లు కూడా తగిలించడంతో అప్పటి నేలక్లాసు ప్రేక్షకులు పేచీ పెట్టకుండా ఆ పాత్రల్ని ఆనందంగా ఓన్చేసేసుకున్నారు!
        
దురదృష్టవశాత్తూ ఇందులో నటించిన నటీనటులెవరూ జీవించి లేరు.. హీరో హీరోయిన్లు కృష్ణ, విజయనిర్మల సహా భారీగా కొలువుదీరిన తారాగణంలో గుమ్మడి, సత్యనారాయణ, ముక్కామల, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, ధూళిపా, రావు గోపాలరావు, త్యాగరాజు, జగ్గారావు, నగేష్ వంటి దివంగత నటీనటుల్ని మళ్ళీ ఒకసారి నిండుగా వెండి తెర మీద చూసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ రీరిలీజ్.
        
1966-2000 మధ్య 112 యాక్షన్ సినిమాలకి దర్శకత్వం వహించిన కె ఎస్ ఆర్ దాస్ టెక్నికల్ గా దీన్ని హాలీవుడ్ కి సమానా స్థాయిలో నిబట్టేందుకు కృషి చేశారు. సరికొత్త యాంగిల్స్ లో చిత్రీకరించిన వీఎస్ ఆర్ స్వామి కెమెరా వర్క్ ఆనాడు చర్చనీయాంశమైంది. పి. ఆదినారాయరావు సంగీతంలో 5 పాటలున్నాయి. కృష్ణని ఎడారిలో కట్టి పడేసి- నాగభూషణం ఎంజాయ్ చేసే- ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా సాంగ్ ఇప్పుడూ ఎంజాయ్ చేయవచ్చు.
       
పద్మాలయా బ్యానర్ పై కృష్ణ సోదరులు జి. ఆదిశేషగిరి రావు
, జి. హనుమంతరావు నిర్మాతలు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో  అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభయ్యాయి. చాలా చోట్ల బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయి. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో కూడా బుకింగ్స్ భారీగా వున్నాయి. ఇటీవల రీరిలీజ్ అయిన ఎన్టీఆర్ సింహాద్రి వసూళ్లని కూడా మోసగాళ్లకు మోసగాడు క్రాస్ చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ స్వర్గం నుంచి కూడా సూపర్ స్టారే అన్నమాట!!

—సికిందర్
       

 

 

29, మే 2023, సోమవారం

1335 : రివ్యూ!


రచన- దర్శకత్వం : ఎం ఎస్ రాజు
నటీనటులు : నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్ కుమార్, జయసుధ, శరత్ బాబు, అన్నపూర్ణ, రవివర్మ తదితరులు
సంగీతం : సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం : అరుళ్ దేవ్, ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల రెడ్డి
నేపథ్య సంగీతం : అరుల్ దేవ్!స్వరాలు : సురేష్ బొబ్బిలి 
నిర్మాత : నరేష్  
విడుదల : మే 26, 2023
***

టుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ల రిలేషన్ షిప్ వివాదం కొన్ని సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. నరేష్, పవిత్రా లోకేష్, నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతిల మధ్య వివాదం బెంగుళూరు హోటల్ కి చేరి, రచ్చ జరిగి తాత్కాలికంగా ఓ ముగింపుకొచ్చింది. ఇంకా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన సమస్యలున్నాయి. దీన్ని నరేష్ సినిమాగా నిర్మించాలనుకుని, ప్రముఖ నిర్మాత - దర్శకుడు ఎంఎస్ రాజుతో కలిసి తెరకెక్కించారు. ఈ మధ్య అడల్ట్ సినిమాలు తీస్తున్న ఎంఎస్ రాజు ఈ మిడిలేజి రిలేషన్ షిప్ కథని నరేష్- పవిత్రల రిలేషన్ షిప్ బయోపిక్ అన్నట్టుగా తన సృజనాత్మక శక్తితో తీర్చి దిద్దారు. ఇలాటి బయోపిక్ తోనే పూర్వం యశ్ చోప్రా హిందీలో ఒక క్లాసిక్ నిచ్చారు. మరి ఎం ఎస్ రాజు ఏమిచ్చారో చూద్దాం...

కథ
ఈ కథ 5 చాప్టర్లుగా వుంటుంది. మొదటి చాప్టర్ The Flirting లో ప్రముఖ సినిమా నటుడుగా వున్న నరేంద్ర (నరేష్) షూటింగులో నటి పార్వతి (పవిత్రా లోకేష్) ని చూసి మనసు పారేసుకుంటాడు. క్రమంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అయిష్టంగా వుంటుంది.

The Mistake అనే రెండో చాప్టర్లో నరేంద్ర కుటుంబ జీవితం వుంటుంది. నరేంద్రకి మూడో భార్య  సౌమ్యా సేతుపతి (వినితా విజయ్ కుమార్) ఓ కొడుకూ వుంటారు. సౌ మ్యని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితుల దగ్గర్నుంచి ఆమె అసలు రంగు బయటపడే ఘట్టం వరకూ ఈ చాప్టర్ వుంటుంది. కేవలం డబ్బు కోసం పెళ్ళి చేసుకున్న సౌమ్య తో నరేంద్రకి మనశ్శాంతి వుండదు. కొడుకు విషయంలో గొడవ జరిగే సరికి విడాకుల దాకా పోతుంది. 

My Story
అనే మూడో చాప్టర్లో సినిమా రచయిత ఫణీంద్ర (విజయ్ వర్మ) తో సహజీవనం చేస్తున్న పార్వతి, ఆమె ఇద్దరు పిల్లల జీవితం వుంటుంది. ఆస్తి కోసం ఫణీంద్ర ఆమెని వేధిస్తూంటాడు. ఈ వేధింపులు భౌతిక దాడికి దారితీస్తాయి.

Krishna’s Story
అనే నాల్గో చాప్టర్లో నరేంద్ర, పార్వతి ఇంటికెళ్ళి ఫణీంద్రకి బుద్ధి చెప్పి, ఇంట్లోంచి వెళ్ళ గొట్టిస్తాడు. పార్వతిని చేపడతాడు.
        
The Conflict అనే ఐదో చాప్టర్లో నరేంద్ర పార్వతితో కలిసి వుండడంతో భార్య సౌమ్య, ఫణీంద్రతో కలిసి ఓ కుట్రకి ప్లాన్ చేస్తుంది. బెంగుళూరు హోటల్లో పోలీసుల సాయంతో నరేంద్ర ఈ కుట్రని తిప్పికొట్టి, విజయగర్వంతో పార్వతిని తీసుకుని వెళ్ళిపోతాడు.
       
ఇలా అయిదు చాప్టర్లుగా చూపించిన ఈ బయోపిక్ లో
, ఇది వరకే పబ్లిక్ డొమైన్ లో వున్న నరేష్- పవిత్రల రిలేషన్ షిప్ కథని పబ్లిక్ డొమైన్ లో వున్నట్టుగానే చూపించారు-  పబ్లిక్ డొమైన్ లో లేనిది
My Story అనే మూడో చాప్టర్లో ఫణీంద్రతో పవిత్రా లోకేష్ సహజీవన కథే.

ఎలావుంది కథ

1981 లో యశ్ చోప్రా సిల్సిలా కథ తయారు చేసుకున్నప్పుడు అది కల్పిత కథ. అయితే అప్పట్లో జయా బచ్చన్‌ ని  వివాహం చేసుకున్న అమితాబ్ బచ్చన్ కి రేఖ తో  సంబంధం గురించి ఊహాగానాలు పత్రికల్లో మోతెక్కేవి. ఇది తన కథ లాగే వుందనుకున్న చోప్రా, వాళ్ళు ముగ్గుర్నీ నటించడానికి ఒప్పించాడు. దీంతో ఈ సినిమా వాళ్ళు ముగ్గిరి కథే అన్నట్టుగా ప్రచారం జరిగి సూపర్ హిట్టయ్యింది.
       
అయితే పత్రికల్లో వస్తూ వున్న చెత్త గాసిప్స్ కి ఇన్స్పైర్ అవకుండా
, చోప్రా ఈ ట్రయాంగులర్ రిలేషన్ షిప్ కథని మనో విశ్లేషణతో, సున్నిత కథగా మంచి విలువలతో ఆవిష్కరించాడు. కానీ స్వయంగా పబ్లిక్ డోమైన్లో వున్న నరేష్ కి డీసెన్సీ ని ప్రదర్శించడం సినిమాలో సాధ్యం కాలేదు. మూడో భార్యని వెనుక నుంచి తన్నే సీను దగ్గర్నుంచీ, బెంగుళూరు హోటల్ సంఘటనలో చీప్ టేస్టు ప్రదర్శించడం వరకూ దూకుడుగా చిత్రీకరించుకున్నాడు. మొత్తం ఈ బయోపిక్ ని తన వైపు నుంచే చెప్పాడు తప్పితే అవతలి మూడో భార్య వైపు నుంచి విషయమేమిటో మనకి తెలీదు. కాబట్టి ఇది ఏకపక్షంగా చూపించిన బయోపిక్ అయింది. ఈ బయోపిక్ లో నరేష్ పోషించిన నరేంద్ర పాత్ర దక్షత కలిగిన పరిష్కర్తగా వుండాల్సింది వుండదు.
       
ఈ కథని ఎంఎస్ రాజు తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని
, స్టేక్ హోల్డర్స్ ముగ్గుర్నీ సమన్వయం చేసి సమగ్ర కథ చెప్పాల్సింది. సిల్సిలా లోనైతే స్టేక్ హోల్డర్స్ ముగ్గురూ ప్రత్యక్ష్యంగా పాల్గొనడంతో ప్రేక్షకులకి సందేహాలు మిగల్లేదు.

నటనలు- సాంకేతికాలు

తమ బయోపిక్ లో తామే నటించిన నరేష్, పవిత్రలకి నటించే అవసరం రాలేదు, నిజజీవితంలో తమ అనుభవాల్ని తాము జీవించ గలరు కాబట్టి. అయితే ఈ పాత్రల్ని మిడిలేజి రిలేషన్ షిప్ మర్యాదలకి దూరం పోకుండా, సినిమాటిక్ రోమాన్సులు చేయకుండా, సంయమనం పాటించడంతో పాత్రలు నీటుగా కన్పిస్తాయి. నరేష్ పాత్ర మాత్రం తప్పంతా మూడో భార్యదే అన్నట్టు సానుభూతిని సృష్టించుకుని, పవిత్రతో రిలేషన్ షిప్ ని జస్టిఫై చేసినట్టు, లైసెన్సు పొందినట్టు వుంది.

పవిత్ర కూడా తానెంతో మంచి మనసుగల మనిషి అన్నట్టు లుక్కిస్తూ పాత్రకి తగ్గట్టు హూందాగా నటించింది. ఇక మూడో భార్యకి పెట్టాల్సిన అవలక్షణాలన్నీ పెట్టేశారు. పూర్తిగా సినిమాటిక్ విలనే. చివరి చాప్టర్లో వనితా విజయ్ కుమార్ ఈ పాత్రలో చాలా హంగామా చేస్తుంది. హీరో కృష్ణగా శరత్ బాబు
, విజయనిర్మలగా జయసుధ నటించారు.

సాంకేతికంగా నరేష్ మంచి పెట్టుబడి పెట్టారు. చాలా రిచ్ లుక్ వచ్చింది. సంగీతమే ఈ రిచ్ లుక్ తో అంతగా  పోటీ పడలేదు. దర్శకత్వంలో ఈ సారి ఎం ఎస్ రాజు ఓ మెట్టు పైకెక్కారు- అయితే చాప్టర్ల వారీ కథాకథనాల్లో అంతగా బలం లేదు. న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నట్టు వుంది.
—సికిందర్
       

 

 

1334 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : విజయ్
తారాగణం : విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజీమా మోహన్, రేబా మోనికా జాన్, పృథ్వీ రాజ్ తదితరులు
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : సందీప్ విజయ్
బ్యానర్ : శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీ సాయి బాబా మూవీస్
నిర్మాతలు : రామాంజనేయులు, రాజశేఖర రెడ్డి
విడుదల : మే 27, 2023 (జియో సినిమా)
***

        టీవల విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ పరాజయం తర్వాత, బూ అనే హార్రర్ మూవీ తమిళ- తెలుగు భాషల్లో ఈ రోజు ఓటీటీలో విడుదలయింది. ఓటీటీ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియో సినిమా దీన్ని ఉచితంగా అందిస్తోంది. విజయ్ అనే దర్శకుడు ఒక రాత్రి జరిగే ఈ హార్రర్ కథని గంటన్నర సినిమాగా తీశాడు. ఇందులో విశ్వక్ సేన్ తోబాటు ఐదుగురు హీరోయిన్లు కన్పిస్తారు. కనువిందు చేయడానికి అందాల హీరోయిన్ల శ్రేణి వుంది. థ్రిల్ చేయడానికి విశ్వక్ సేన్ వున్నాడు. ఇంకేం కావాలి? తారాగణంతోనే ఇంత ఊరిస్తున్న ఈ హార్రర్ తెరపైన ఎలా  వుందో చూద్దాం...

కథ

తల్లి వూరికెళ్ళిన అవకాశాన్ని తీసుకుని రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రెండ్స్ ని ఆహ్వానిస్తుంది ఆ రాత్రి హలోవీన్ పార్టీకి. ఆ రోజు అక్టోబర్ 31 హలోవీన్ నైట్ జరుపుకునే సందర్భం. రకుల్ ఇంట్లో అస్థిపంజరాలు, దెయ్యపు ఆకారాలూ అలంకరించి, దెయ్యాల్ని ఆహ్వానిద్దామని చెప్పి ఒక హార్రర్ పుస్తకం తీసి కథలు చెప్పడం మొదలెడుతుంది.  ఆ ఒక్కో దెయ్యం కథ నిజ జీవితంలో వాళ్ళ ముందుకొచ్చేసి బెదరగొడతాయి. అప్పుడు ఒక దెయ్యాన్ని వదిలించుకోవాలంటే ఇంకో దెయ్యం కథ చదవాలి. ఇలా చదువుకుంటూ పోతూంటే  పారానార్మల్ సైంటిస్టు విశ్వక్ సేన్ కథ వస్తుంది. ఇప్పుడు ఈ కథ కీలకమైనది. ఈ కథ ఏమిటి? దెయ్యాల ఉనికి మీద ప్రయోగాలు చేసే విశ్వక్ సేన్, తను ప్రేమించిన ఒక్కో గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కోల్పోతూ వచ్చాడు? చివరికి రకుల్ ప్రీత్ సింగ్ తోనే పెళ్ళి చూపులు జరిగే సరికి, రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసింది? ఈ హార్రర్ ప్రశ్నలకి సమాధానాల కోసం మిగతా సినిమా చూడాలి.

ఎలా వుంది కథ

అమెరికాలో, యూరప్ లో జరుపుకునే హలోవీన్ పండుగ ఇండియాలో అర్ధం లేకుండా కేవలం పిశాచాల మాస్కులేసుకుని భయపెట్టుకునే ఆటగా మార్చేశారు. పాశ్చాత్య దేశాల్లో వేసవి చివర్లో చేతి కందే పంటల్ని దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుకునేందుకు అక్టోబర్ 31న హలోవీన్ పండుగ జరుపుకుంటారు. ఆ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టేందుకే పిశాచాల మాస్కులేసుకుని నృత్యాలు చేస్తారు. దీన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఇంకో అడుగు ముందుకేసి దెయ్యాల్ని ఆహ్వానించే ఆటగా మార్చేసింది.
        
అయితే ఆమె పుస్తకంలో చదివే కథలతో ఎపిసోడ్స్ ఆసక్తికరంగానే వున్నాయి. ఇవి భయపెట్టే విధంగా వుండవుగానీ, ఆసక్తి రేకెత్తిస్తాయి. ఉదాహరణకి నివేదా పేతురాజ్ ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు, నీకు వెక్కిళ్ళు వస్తాయా అనడుగుతుంది హార్రర్ ఫేసు గల ముసలవ్వ. రావని చెప్తుంది నివేద. తీరా ఇంట్లో దాహం వేసి నీళ్ళు లేక వెక్కిళ్ళు వస్తాయి. దాంతో దెయ్యం లేచి ఆమె పనిబడుతుంది.
        
ఇలాటి నాల్గు కథల తర్వాత విశ్వక్ సేన్ కథ వస్తుంది. ఇతను పారానార్మల్ సైంటిస్టుగా దెయ్యాలున్నాయా లేదా తేల్చడానికి ఒక కళ్ళు జోడు తయారు చేసి దాంతో ప్రయోగాలు చేస్తూంటాడు. ఇతడి ప్రయోగాలకి గర్ల్ ఫ్రెండ్స్ బలౌతూంటారు. ఇక ఇంకో బకరాగా రకుల్ ప్రీత్ సింగ్ తోనే పెళ్ళి చూపులు జరిగే ట్విస్టుతో ముగింపుకొస్తుంది కథ.
        
ఈ మొత్తం కథలో హార్రర్ దృశ్యాలేం భయపెట్టేవిగా వుండవు. కానీ సస్పెన్స్ తో ఆసక్తికరంగా వుంటాయి. విద్యుల్లేఖా రామన్ కామెడీ పాత్ర భయపడే చేష్టలతో ఇది హార్రర్ సినిమా సుమా అని గుర్తు చేస్తూ పోయారు.

నటనలు-సాంకేతికాలు

రకుల్ ప్రీత్ సింగ్ చదివే నాల్గు కథల తర్వాత ఐదో కథలో ఎంట్రీ ఇస్తాడు విశ్వక్ సేన్. అప్పటికి గంట సమయం గడిచిపోతుంది. అతడి ఎంట్రీ తర్వాత అరగంటే సినిమా వుంటుంది. గంటన్నర సినిమా కావడం ఒకటి, విశ్వక్ సేన్ గంటకి కనిపించడం వొకటి- ఇలా థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు హాహాకారాలు చేస్తారని కాబోలు ఓటీటీలో పడేశారు. అయితే విశ్వక్ సేన్ తన మాస్ యాక్షన్ కి దూరంగా సాఫ్ట్ గా, డీసెంట్ గా నటించాడు. కనిపించేది కాసేపే అయినా అర్ధవంతంగా నటించాడు.

        రకుల్ ప్రీత్ సింగ్ ది ఫన్నీ క్యారక్టర్. ఆమె ఫన్ కోసం పాల్పడే చర్యలు ఫ్రెండ్స్ ని భయపెట్టి చంపుతూంటాయి. పుస్తకంలోని ఒక కథతో దెయ్యంతో హార్రర్ లో ఇరుక్కోవడం, దానికి విరుగుడు ఇంకో కథ చదవడమేనని పుస్తకంలో చెప్పడంతో, ఇంకో కథా చదివి మళ్ళీ ఇరుక్కోవడం, అందులోంచి బయటపడేందుకు పుస్తకంలో చెప్పినట్టు ఇంకో కథా చదవడం... ఇలా ఆ పుస్తకం పన్నిన వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకోవడం.
       
కానీ దెయ్యం కథల పుస్తకాలు ఎందుకో తెలుగులో వుండవు
, ఇంగ్లీషులోనే వుంటాయి ఫీల్ కోసం. మిగిలిన పాత్రల్లో నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజీమా మోహన్, రేబా మోనికా జాన్ లు కథలకి న్యాయం చేశారు. విద్యుల్లేఖా రామన్ ఇది హర్రర్ సినిమా అని గుర్తు చేస్తూ వుండడానికి ఒకటే భయపడే కామెడీ చేసింది. పోలీస్ ఇన్స్ పక్టర్ గా వచ్చే పృథ్వీరాజ్ కి ముగింపులో చిన్న ట్విస్టు ఇస్తాడు.
       
ఈ గంటన్నర సినిమా ఆద్యంతం విజువల్ అప్పీల్ తో వుంది. వదలకుండా చూసేలా చేస్తుంది. విశ్వక్ సేన్
, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్లు వున్నప్పుడు ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వున్నాయి. ముఖ్యంగా కెమెరా వర్క్, ఎడిటింగ్, కళా దర్శకత్వం, మేకప్, కాస్ట్యూమ్స్, సీజీ వర్క్ క్వాలిటీతో వున్నాయి.
       
దర్శకుడు విజయ్ రైటింగ్
, మేకింగ్ పాత విలువలు జొరబడకుండా ఆధునిక దృక్పథంతో నిర్వహించడం ఈ హార్రర్ కి ప్లస్ అయింది. 2005 లో ఇదే టైటిల్ తో హాలీవుడ్ నుంచి హలోవీన్ హార్రర్ వచ్చింది. అది అర్ధం పర్ధం లేకుండా చీప్ హార్రర్ గా వుందని రివ్యూలున్నాయి. తెలుగు- తమిళ బూ మీద ఈ మచ్చ పడదని కి చెప్పొచ్చు.
—సికిందర్

 

26, మే 2023, శుక్రవారం

1333 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం : జూడ్ ఆంథనీ జోసెఫ్
తారాగణం: టోవినో థామ‌స్, వినీత్ శ్రీనివాస‌న్, కుంచ‌కోబోబ‌న్‌, అప‌ర్ణా బాల‌మురళి,  తన్వీ రామ్, ఆసిఫ్ అలీ, అజూ వర్గీస్ తదితరులు
సంగీతం: నోబిన్ పాల్, ఛాయాగ్రహణం : అఖిల్ జార్జ్
బ్యానర్స్: కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్
నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
సమర్పణ : బన్నీ వాస్
విడుదల : మే 26, 2023
***

        లయాళం మూవీ 2018 కేరళలో మే 5న విడుదలైంది. విడుదలైన పది రోజుల్లో వసూళ్ళు వందకోట్లు దాటేశాయి. నేటికి వసూళ్ళు 140 కోట్లకి చేరుకున్నాయి.  దేశవ్యాప్తంగా వసూళ్ళ సంచలనం సృష్టిస్తున్న 2018 ఇతర భాషల్లో నేడు విడుదలయింది. తెలుగులో దీన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. మలయాళ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ సినిమాని 2018 లోనే ప్రకటించాడు. అప్పుడు దీని టైటిల్ 2403 ఫీట్ : ది స్టోరీ ఆఫ్ అన్ ఎక్స్ పెక్టెడ్ హీరోస్. నవంబర్ 2022 లో దీని నిర్మాణం పూర్తయింది. 2018 లో కేరళ ని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితుల ఆక్రందనల్నీ, ప్రాణాల కోసం వాళ్ళు చేసిన పోరాటాల్నీ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించాడు. ఇదెలా వుందో తెలుసుకుందాం...  

కథ

న్యూస్ రిపోర్టింగ్ తప్ప ఇంకేదీ పట్టని నూరా (అపర్ణా బాలమురళి) పాండిచ్చేరిలో నీటి ఎద్దడి పై రిపోర్టింగ్ చేస్తూంటే, ఆమె కారుని తమిళనాడుకి చెందిన  డ్రైవర్ సేతుపతి (కళయరాసన్) ట్రక్కు ఢీ కొట్టడంతో గొడవవుతుంది.
        
ఆర్మీలో పనిచేస్తున్న అనూప్ (టోవినో థామస్) యాక్షన్లో కొందరు సైనికుల మరణాలు చూసి భయపడి పారిపోయి వచ్చేసి ఒక షాపులో పనిచేస్తూంటాడు. ఢిల్లీనుంచి మంజూ (తన్వీ రామ్) అనే టీచర్ కొత్తగా వచ్చి స్కూల్లో చేరడంతో ఆమెని ప్రేమిస్తాడు.
       
అబుధాబీలో  
పని చేస్తున్న ఐటీ స్పెషలిస్ట్ రమేష్ (వినీత్ శ్రీనివాసన్) కి భార్యతో సత్సంబంధాల్లేక పనిమీద శ్రద్ధ పెట్టడు. ఇంతలో తల్లి ఆస్పత్రిలో చేరిందని తెలుసుకుని కేరళ వచ్చేస్తాడు.
       
మత్స్యకారుడు
మాథచన్ (లాల్) చిన్న కొడుకు నిక్సన్ (ఆసిఫ్ అలీ)  మోడల్ కావాలని కలలు గంటూ చేపలు పట్టే పనిని చులకనగా చూస్తూంటాడు. సంపన్న వ్యాపార
వేత్త కుమార్తెని పట్టి ప్రేమిస్తూంటాడు.
        
టాక్సీ డ్రైవర్ కోషీ (అజూ వర్గీస్) టాక్సీతిప్పుతూ రోజుల తరబడి కుటుంబానికి దూరంగా వుంటాడు. అతను ఓ విదేశీ జంటకి టూరిస్టు కేంద్రాల్ని తిప్పి చూపించే బేరం కుదుర్చుకుంటాడు.
       
డ్యూటీ పట్ల
నిబద్ధతతో వుంటూ ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాధికారి షాజీ (కుంచాకో బోబన్), పైఅధికారులు తనకు సహకరించకపోయినా పట్టుదలతో విధి నిర్వహణ చేస్తూంటాడు.
       
ఇలా ఎందరో వ్యక్తులు
, ఎన్నో కుటుంబాలు. వాళ్ళ వాళ్ళ జీవన పోరాటాలు చేస్తూంటారు. ఇంతలో ఉన్నట్టుండి వరదలు ముంచుకు రావడంతో అందరూ అపాయంలో పడతారు. కొందరి ప్రాణాలూ, చాలా మంది ఆస్తులూ వరద నీట్లో కొట్టుకుపోతాయి. ఇందులోంచి ఎవరెవరు ఎంతమంది బ్రతికి బయటపడ్డారు? వాళ్ళ కలలూ కోరికలూ ఏమయ్యాయి? ఒకరికొకరు తెలియకపోయినా మానవత్వంతో చేయందించి ఈ ఉపద్రవాన్ని ఎలా దాటారు?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
డిజాస్టర్ జానర్ కి చెందిన కథ. పాత్రలకి ఒక విపత్తు సంభవించడం, అందులోంచి బ్రతికి బయటపడం ప్రధానంగా వుండే కథ. ఈ కథని కల్పిత కథగా గాకుండా యదార్ధ గాథ ఆధారంగా తీశారు. దీన్ని 1924 లో కేరళలో సంభవించిన చారిత్రక భారీ వరదల్ని ప్రస్తావిస్తూ ప్రారంభించారు. ఆనాడు వెయ్యి మంది బలయ్యారు. ఒక పర్వతానికి పర్వతమే కొట్టుకుపోయింది.
       
2018 ఆగస్టులో
అసాధారణంగా అధిక వర్షపాతం కారణంగా కేరళ లోని 14 జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించాయి . ఇంత పెద్ద వరద 1924 తర్వాత ఇదే. ఈ వరదల్లో 483 మందికి పైగా మరణించారు, 15 మంది తప్పిపోయారు.  వరద పోటుకి రాష్ట్రంలోని 54 డ్యాముల్లో 35 డ్యాములకి చరిత్రలో మొదటిసారిగా గేట్లు ఎత్తేశారు.
       
అయితే సినిమా కథలో ముంచెత్తిన వరదలు
, ఆ వరదల్లో మనకి పరిచయం చేసిన పాత్రల పాట్లు, మరణాలు, విజయాలూ ఏకపక్షం చేసి చూపించారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వమేమైంది, సహాయక చర్యలేమయ్యాయి అన్న ప్రశ్నలు అడ్డు తగిలేలా కథ సాగుతుంది. ప్రభుత్వ సాయాన్ని నామ మాత్రం చేశారు.
       
వాస్తవానికి కేంద్రప్రభుత్వం తన బలగాలతో అతి పెద్ద రెస్క్యూ ఆపరేషనే చేపట్టింది. వాట్సాప్ గ్రూపులు పబ్లిక్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాయి. మత్శ్య కారులూ వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సరే. మొత్తం కలిపి భారీ యెత్తున హెలీకాప్టర్లు
, విమానాలు, బోట్లు, సైన్యం, పోలీసులు, వైద్య బృందాలు, అన్నపానీయాలు అందించే ఎన్జీవోలూ - వీటన్నిటితో చాలా యాక్షన్ స్టోరీ జరిగింది.
       
అయితే యాక్షన్ స్టోరీని కూడా జతచేసి థ్రిల్ చేసే బదులు
, పాత్రల మధ్య హ్యూమన్ డ్రామాకే ప్రాధాన్యమిచ్చి ఈ కథ చేసినట్టు కనబడుతోంది. ఈ హ్యూమన్ డ్రామా కోసం సృష్టించిన సన్నివేశాలు భావోద్వేగాలతో బలంగా వుండడం ఈ వరద కథకి కలిసి వచ్చిన అంశం.

నటనలు - సాంకేతికాలు

ప్రధాన పాత్ర పోషించిన టోవినో థామస్ ఫస్టాఫ్ లో ఇతర అనేక పాత్రల కథల మధ్య ప్రధాన పాత్రగా అన్పించడు. సెకండాఫ్ లో పోను పోనూ ప్రాధాన్యం పెరిగి ఒక కదిలించే ముగింపుతో గుర్తుండి పోతాడు. ఈ పాత్ర  కాలా పత్తర్ లో అమితాబ్ బచ్చన్ పాత్రని గుర్తుకు తెస్తుంది. నేవీ కెప్టెన్ అయిన అమితాబ్ బచ్చన్, షిప్ మునిగిపోతూంటే భయపడి దూకెసి- ప్రయాణీకుల్ని వల్ల ఖార్మానికి వదిలేసిపారిపోతాడు. సైనికుడైన టోవినో థామస్ సైనికుల మరణాలు చూసి పారిపోతాడు. అమితాబ్ బొగ్గు గని కార్మికుడుగా చేరతాడు. టోవినో వూళ్ళో షాపులో పనికి కుదురుతాడు. చివరికి ఇద్దరూ వరద ముప్పు నెదుర్కొంటారు.
       
ఇక ఈ సినిమాలో మొత్తం39 పాత్రలున్నాయి టోవినో  థామస్ పాత్ర కాక. వీటిలో టీచర్ పాత్ర వేసిన తన్వీరామ్
, మత్స్య కారుడి కొడుకు పాత్ర వేసిన ఆసిఫ్ అలీ, ప్రభుత్వాధికారి పాత్ర వేసిన కొంచాకో బొబన్ లని గుర్తుపట్టగలం. ఈ నటులు సెకండాఫ్ విపత్తులో భావోద్వేగపూరిత సన్నివేశాలతో కట్టిపడేసినా, పాత్ర చిత్రణలు మాత్రం ఎగుడు దిగుడుగా వుంటాయి. ఫస్టాఫ్ లో ఈ అనేక పాత్రల కథలు ఫాలో కావడం కష్టమైనా, సెకండాఫ్ లో  ఏకత్రాటిపై కొచ్చేసరికి  తమవెంట తీసుకుపోతాయి.
       
సాంకేతికంగా బలంగా వుంది. 15 ఎకరాల్లో గ్రామం సెట్ వేసి సృష్టించిన వరద దృశ్యాలు టెక్నికల్ గా మంచి క్వాలిటీతో వున్నాయి. ప్రకృతి ప్రకోపం
, ప్రజల ఆక్రోశం తాలూకు దృశ్యాల చిత్రీకరణ టాప్ రేంజిలో వుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్, మ్యూజిక్, యాక్షన్ కొరియోగ్రఫీ బ్యాలెన్సుడుగా పనిచేసి సెకండాఫ్ ని  పకడ్బందీగా నిలబెట్టాయి. సెకండాఫ్ అంతా బలంగా లేనిది ఫస్టాఫే.

చివరికేమిటి

ఇందులో పాత్రల అనుభవాలు చూస్తే పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన ప్రసిద్ధ కథ గుర్తుకొస్తుంది. ఆపత్కాలంలో పాత్రలతో అలాటి నైతిక, మానవత్వ, సామాజిక, ఆశావాహ అనుభవాల్ని కళ్ళముందుంచాడు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసఫ్. గుండెల్ని కెలికే, హృదయవిదారక దృశ్యాలు, అంతలోనే ఊరటనిచ్చే విజయాలూ చూపించుకుపోతూ వెలుగు నీడల ఆట ఆడాడు. ఈ అనుభవాల్లో ఎన్ని నిజమో, ఎన్ని కల్పన చేశాడో గానీ- పూర్తిగా హ్యూమన్
డ్రామాకే ప్రాధాన్యమిచ్చి
, వ్యవస్థ సహాయ కార్యక్రమాలతో కూడిన హాలీవుడ్ టైపు యాక్షన్ స్టోరీని దూరంగా వుంచాడు. బాక్సాఫీసుతో ఈ రిస్కు బాగా వర్కౌట్ అయింది.
        
అయితే ఫస్టాఫ్ లో కథ లేకుండా చాలా పాత్రల పరిచయాలూ, వాటి జీవితాలూ, ఆశయాలూ ఎస్టాబ్లిష్ చేయడానికే సమయమంతా తీసుకుని ప్రేక్షకుల్ని ఖాళీగా కూర్చోబెట్టాడు. వరదలు ప్రారంభమయ్యాకే ఇంటర్వెల్ నుంచి ఏకబిగిన సెకండాఫ్ అంతా వూపిరి సలపని ఎమోషనల్ జర్నీకి సమకట్టాడు. ఇది నిజమైన కేరళ స్టోరీ. 2018 కేరళ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నిజమైన నివాళి. టోవినో థామస్ పాత్రకి శ్రద్ధాంజలి!
సికిందర్


22, మే 2023, సోమవారం

1332 : స్పెషల్ ఆర్టికల్


 

        (డియర్ రీడర్స్, నేటి నుంచి తిరిగి అన్ని శీర్షికలూ మీ అందుబాటులో కొస్తాయి. రివ్యూలతో బాటు స్క్రీన్ ప్లే సంగతులు, స్క్రీన్ ప్లే టిప్స్, స్ట్రక్చర్ అప్డేట్స్, సందేహాలు- సమాధానాలు, రైటర్స్ కార్నర్, స్పెషల్ ఆర్టికల్స్ మొదలైన శీర్షికలు తిరిగి ఎప్పట్లాగా అందుకోగలరు. కొందరు పాఠకులు (కొత్త రచయితలు, దర్శకులు) పేరు లేకుండా వాట్సాప్ మెసేజీలు చేస్తున్నారు. పేరు, వివరాలు తెలిపితే బావుంటుంది. అయితే వ్యక్తిగతంగా సమాధానాలివ్వడం సాధ్యం కాదు. అర్హమైన వాటికి సందేహాలు -సమాధానాలు శీర్షిక ద్వారా మాత్రమే సమాధానాలివ్వగలమని గమనించగలరు)

        ప్పుడు పరిస్థితి ఎక్కడికి దారితీసిందంటే, చూసి చూసి సినిమా ప్రదర్శనా రంగం బాలీవుడ్ నిర్మాణ రంగాన్ని బ్లేమ్ చేయడం మొదలెట్టింది. త్వరలో 50 మల్టీప్లెక్సుల్ని మూసి వేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసిన కారణం, బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షించక పోవడమేనంటూ ప్రకటన కూడా విడుదల చేసింది ఆ సంస్థ. అటు అమెరికాలో కూడా దివాలా తీసిన రీగల్ సంస్థ 500 థియేటర్లని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మనదేశంలో ప్రముఖ పీవీఆర్- ఐనాక్స్ లీజర్ సంస్థ గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 333 నికర నష్టాన్ని చవిచూడడంతో, 50 మల్టీ ప్లెక్సుల్ని మూసి వేయబోతున్నట్టు ప్రకటించింది.

        త ఏడాది మార్చిలో, పీవీఆర్ -ఐనాక్స్ లీజర్ సంస్థలు మూడవ, నాల్గవ, ఐదవ శ్రేణి సెంటర్లలో మల్టీప్లెక్సులు ప్రారంభించి,1500 కంటే ఎక్కువ స్క్రీన్‌ల నెట్వర్క్ తో  దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌ ని  రూపొందించడానికి విలీనాన్ని ప్రకటించాయి. అయితే 2023 జనవరి నుంచి మార్చి వరకు తొలి త్రైమాసికంలో పీవీఆర్ - ఐనాక్స్ గ్రూపుకి దాదాపు రూ. 333 కోట్ల నష్టాలు వాటిల్లాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 100 కోట్లకి పైగా నష్టాల్ని చవిచూసింది ఈ గ్రూపు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం, అందుకు తగ్గట్టు రెవెన్యూ లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.
        
రెవెన్యూ లేకపోవడానికి బాలీవుడ్ సినిమాలు ఒక దాని తర్వాత మరొకటి బాక్సాఫీసు దగ్గర చతికిల బడడం కారణం. ఈ యేడాది బాలీవుడ్‌లో ఇప్పటి వరకు హిట్ అనిపించుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి షారుఖ్ పఠాన్’. రెండోది అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ’. మూడు నెలల కాలంలో విడుదలైన 24 సినిమాల్లో ఈ రెండు సినిమాలు తప్పించి ఇంకేదీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయాయి.
       
అసలు ఆకర్షించడానికి స్టార్ సినిమాలు పెద్దగా విడుదల కూడా కాలేదు. విడుదలైన స్టార్ సినిమాల్లో షారూఖ్
పఠాన్ తప్ప ఇంకేదీ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేదు. సల్మాన్ ఖాన్ -వెంకటేష్ కిసీకా భాయ్ -కిసీకీ జాన్’, రణబీర్ కపూర్ తూ ఝూటీ -మై మక్కార్’, అజయ్ దేవగణ్ భోలా’, కార్తీక్ ఆర్యన్ షెహజాదా’, అక్షయ్ కుమార్ సెల్ఫీ - ఈ ఐదు స్టార్ సినిమాలకి ప్రేక్షక దర్శన భాగ్యం లభించలేదు.
       
ఇక చిన్న తారాగణం
, కొత్త తారాగణంతో విడుదలైన 18 లోబడ్జెట్ సినిమాల్లో ది కేరళ స్టోరీ తప్ప మిగిలినవి పీవీఆర్- ఐనాక్స్ గ్రూపుకి చుక్కలు చూపించాయి. దీంతో బాలీవుడ్ పనితీరు మీద ధ్వజమెత్తింది. బాలీవుడ్ క్రాష్ అయిందని కొందరు పరిశీలకులు కూడా గొంతు కలుపుతున్నారు.
       
ఇక మిగిలిన త్రైమాసికాల్లో
బాహుబలి’ ఫేమ్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’,  రణవీర్ సింగ్ -లియా భట్ నటించిన ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ , రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’, షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’, డుంకీ’, సల్మాన్ ఖాన్ నటించిన  ‘టైగర్ 3’ వంటి బిగ్ స్టార్ భారీ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు.
       
ఇక
సగటు ప్రేక్షకుడు మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు రూ. 250, రూ. 350 చూసి పారిపోతున్నాడు. తినుబండారాల ధరలు చూసి సొమ్మసిల్లి పడిపోతున్నాడు. ఈ మల్టీ బాదుడు చూసి కూడా జనం మల్టీప్లెక్సులకి రావడం తగ్గిపోయింది. చిన్న పెద్ద సినిమాలన్నిటికీ ఒకే టికెట్ రేటు పడితే చిన్న సినిమాలకి ప్రేక్షకులు తగ్గి పోతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా నష్టాలు వస్తున్న 50 స్క్రీన్స్ ని వచ్చే ఆరు నెలల కాలంలో మూసివేయాలని పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ప్రకటించింది.
        
తెలంగాణలో టికెట్టు ధర రూ. 295 వుంది. అదే ఆన్‌లైన్ బుకింగ్ అయితే రూ. 329 రూపాయలు. మొన్నటి వరకు రూ. 200 గరిష్టంగా వున్న టికెట్ ధర రూ. 250 కి చేరుకుంది. పెద్ద సినిమాలకి మరో రూ. 50 రూపాయలు పెంచుకునే సదుపాయం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దాని ఫలితమే ఇప్పుడు పెద్ద సినిమాలకి రూ. 295, ఆన్‌లైన్ లో అయితే రూ. 329. హైదరాబాద్ లో ప్రైవేట్ యాజమాన్యాలు నడుపుతున్న ఒకటి రెండు మల్టీప్లెక్సుల్లో ముందు వరస రెండు లైన్లలో సీట్లకి ధర తగ్గించి రూ. 150 వసూలు చేస్తున్నారు. సగటు ప్రేక్షకుడికి కాస్త ఊరట.
        
అమెరికాలో రీగల్ సంస్థ దివాలా తీయడానికి హాలీవుడ్ సినిమాలు కారణం కాదు. మహమ్మారిలో లాక్ డౌన్ల కాలం నుంచి వాయిదా వేసిన చెల్లింపుల ద్వారా పెరిగిన అద్దె వంటి పాండమిక్ అనంతర ఖర్చులు మూసివేతలకి  ప్రధాన కారణంగా పేర్కొంది సంస్థ. 2019 నుంచి  2022 వరకు ఒక్కో థియేటర్‌కి సగటు నెలవారీ అద్దె 30 శాతం పెరిగిందని పేర్కొంది. మహమ్మారి థియేటర్ వ్యాపారంపై చాలా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఈ సంస్థ మీద 4.8 బిలియన్ డాలర్ల ఋణ భారముంది. మహమ్మారి కాలంలో 3 బిలియన్ డాలర్లు నష్టపోయింది. గత సంవత్సరంలో బాక్స్ ఆఫీసు మెరుగుపడింది. మార్వెల్ స్టూడియోస్ స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’, ‘షాంగ్-చీ’, టెన్ రింగ్స్’,  సోనీస్ వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్ మొదలైన హిట్స్  అనేక ఇతర వాటిలో ప్రేక్షకుల్ని తిరిగి సినిమా వైపుకు లాగాయి. అయినా పేరుకుపోయిన చెల్లింపులు దివాలా తీయించాయి.
       
ఇప్పటికే న్యూయార్క్
, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ మొదలైన నగరాల్లో 29 మల్టీప్లెక్సులు మూతబడ్డాయి.  దివాలా తీసిన సమయంలో రీగల్ దేశవ్యాప్తంగా సుమారు 500 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది. 
        
మనదేశంలో మల్టీప్లెక్సులు మహమ్మారి దెబ్బని తట్టుకున్నాయి. కానీ బాలీవుడ్ దెబ్బని తట్టుకోలేకపోతున్నాయి. అందుకే అన్నారు- ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలని. బాలీవుడ్ స్థానభ్రంశం చెంది సౌత్ సినిమాలు దేశాన్ని ఆక్రమిస్తాయని. ఇకనైనా బాలీవుడ్ కళ్ళు తెరవక పోతే అంతర్జాతీయ బ్రాండింగ్ ని కూడా కోల్పోయే పరిస్థితి ఎదురుకావొచ్చు.

—సికిందర్