రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

బ్లడ్ సింపుల్ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
బ్లడ్ సింపుల్ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

23, సెప్టెంబర్ 2019, సోమవారం

875 : స్క్రీన్ ప్లే అప్డేట్స్

‘లేడీ బర్డ్’ లో దృశ్యం 

      మింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్...హాలీవుడ్ లో విజయవంతమైన టీనేజీ జానర్. కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే వయస్సుకు రావడం. పదహారేళ్ళకూ నీలో నాలో ఆ వయసు చేసే చిలిపి పనులకు కోటి దండాలు - అని పాడుకోవడం. కౌమారపు గొంగళి పురుగు కాస్తా రంగులేసుకుని యవ్వనపు సీతాకోక చిలుకలా ఎగిరే నూనూగు మీసాల, ఎదిగి వచ్చిన ఎదల, వయసొచ్చిన లేలేత టీనేజీ దశ. హై స్కూలైపోయి కాలేజీలో అడుగుపెట్టే బాధ్యతల వల. తల్లి పక్షి రెక్క లొచ్చిన పిల్లలకి ఇక తిండి పెట్టేది లేదని గూట్లోంచి తోసి పారేస్తుంది. ఇక కీచు కీచుమంటూ నట్టనడి లోకంలో పడి, రెప రెప రెక్కలు కొట్టుకుని ఎగరడం నేర్చుకుంటూ, తిండి వెతుక్కునే పనిలో జీవనపోరాటం మొదలెడతాయి పక్షి పిల్లలు. లేత టీనేజర్లదీ ఇదే పరిస్థితి. కుటుంబ సౌఖ్యంలోంచి సంక్లిష్ట ప్రపంచ ప్రాంగణంలోకి...బాధ్యతల బరిలోకి. వ్యక్తిగా పరిణతి చెందే అనుభవాల్లోకి. బాల్యపు దృక్కోణం చెదిరి ప్రాపంచిక దృక్పథంలోకి. పదేళ్ళ బాల్యం నుంచీ పంతొమ్మిదేళ్ళ టీనేజీ  వరకూ కథలు చెప్పే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ని హాలీవుడ్  కమర్షియలైజ్ చేసింది.

          తెలుగులో హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో దాసరి నారాయణ రావు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ‘నీడ’ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ. అప్పుడప్పుడే యవ్వనపు గడప తొక్కిన కుర్రాడు, రతి క్రీడ పట్ల కుతూహలంతో వేశ్యల పాలబడి దారితప్పే కథ. ఈ వయస్సంటేనే వివిధ విషయాల పట్ల కుతూహలం. తెలుసుకోవాలన్న కుతూహలం ఎదుగుదలకి సంకేతం. టీనేజీ సహజాతమైన ఈ జిజ్ఞాసని, కుతూహలాన్నీ చంపేస్తూ ప్రేమించడం, ప్రేమలో పడ్డంగా చూపడం ఎదుగుదలని ఆపేసే అపరిపక్వత. చిత్రం, టెన్త్ క్లాస్ లాంటివి అప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్నికనే ఇలాటి సహజాత వ్యతిరేక సినిమాలుగా వుంటాయి. ఇవి కమర్షియల్ కోణాన్ని మాత్రమే చూస్తాయి. హాలీవుడ్ నుంచి కూడా ఇలాటి సినిమాలొచ్చినా, ఎక్కువ సినిమాలు ఎదుగుదల గురించే వుంటాయి. మనం ఇప్పుడున్న తీరులో వున్నామంటే ఎలా పరిణామం చెంది ఇలా తయారయ్యామో చెప్తాయి ఈ రకం సినిమాలు. మానసిక పునాదిని  వయస్సొచ్చాక అయిన అనుభవాలే వేస్తాయి. ‘బోర్న్ టు విన్’ అనే గ్రంథంలో సైకాలజిస్టులు ఒక మాట అంటారు : కడుపులో వున్నప్పుడు బిడ్డ తలరాత దేవుడు రాస్తాడో లేదో గానీ, పుట్టాక తల్లిదండ్రులు మనసు మీద రాస్తారని. వయస్సొచ్చాక ఈ మనసు మీద రాతతోనే సంఘర్షణ వుంటుంది స్వేచ్ఛకోసం. తమ రాత, తమ చేత తామే నిర్ణయించుకోవాలనుకుంటారు రెబెల్ మనస్తత్వంతో.

          కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది :  అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు.

          ఈ సినిమాలకి ఇతర సినిమాల కథలకి లాగే కాన్ఫ్లిక్టే (సంఘర్షణే ) ఆధారం. ఉన్నట్టుండి యువపాత్రకి ఎదురు చూడని అనుభవం ఎదురవుతుంది. దాంతో సంఘర్షించి రేపటి వ్యక్తిగా ఎదగడమే ఈ కథల స్వభావం.

అదే రూటులో తెలుగు 
           కానీ తెలుగులో దీనికి భిన్నంగా, హైస్కూలు - ఇంటర్ పిల్లల ప్రేమలే వర్కౌటవుతాయని అవే కాలక్షేపంగా తీయడం. తాజాగా మలయాళంలో హిట్టయిన ఇలాటి దొకటి ‘తన్నీర్ మథన్ దినంగళ్’ (పుచ్చకాయల రోజులు) తెలుగు రీమేక్ హక్కులు కొనే పోటీ కూడా మొదలైందని తెలుస్తోంది. ఒక దర్శకుడు దీని మీద ఆసక్తి పెంచుకుని రీమేక్ చేస్తే ఎలా వుంటుందని అడిగారు. తెలుగులో రెగ్యులర్ గా వస్తున్న రోమాంటిక్ కామెడీలకి  గత కొన్ని నెలలుగా ప్రేక్షకుల్లేక, నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్సే వరసగా చూస్తున్న మార్పు కన్పిస్తోంది. ఇప్పుడీ రీమేక్ తలపెడితే రిజల్ట్ ఏమిటో చెప్పడం కష్టం. పైగా అది మలయాళ కొత్త దర్శకుడు తన పర్సనల్ డైరీలాగా ఫీలై తీశాడు. ఎవరివో పర్సనల్ డైరీలూ, ముచ్చటైన ఫోటో ఫ్రేమ్ కథలూ, పోయెట్రీలూ  రీమేక్ చేసేకంటే, అలాటివి స్వయంగా ఫీలై క్రియేట్ చేసుకోలేరా అన్నది ప్రశ్న.

          హాలీవుడ్ లో ప్రేమలొక్కటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కావు. వాళ స్పాన్ వైవిధ్యంతో విశాలమైనది. ఇంకోటేమిటంటే, ఈ తరహా కథలకి వరల్డ్ మూవీస్ కి ఏ స్ట్రక్చర్ వుండదో, హాలీవుడ్ కథలకి ఆ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటూ, కమర్షియల్ ప్రదర్శనలకి విశాల ప్రాతిపదికన నోచుకుంటాయి. తెలుగు మేకర్లు ఈ తేడా గమనిస్తే, నాన్ కమర్షియల్ వరల్డ్ మూవీస్ కి ఇన్స్పైర్ అయ్యే పొరపాటు చేయకుండా జాగ్రత్తపడొచ్చు.

          సంధికాలంలో ఎదుగుదల కోసం టీనేజర్ల సంఘర్షణాత్మక హాలీవుడ్ మూవీస్ కి కొన్ని ఉదాహరణలు :  ‘రెబెల్ వితౌట్ కాజ్’ లో బాధాకర గతమున్న టీనేజర్ కొత్త టౌనుకి వచ్చి, కొత్త స్నేహితులతో బాటు, కొత్త శత్రువుల్ని సృష్టించుకుంటాడు. ‘స్టాండ్ బై మీ’ లో ఒక రచయిత అదృశ్యమైన ఒక బాలుడి మృతదేహాన్ని కనుగొనే ప్రయాణంలో, తన టీనేజీలో చనిపోయిన తన మిత్రుడి జీవితం గురించి చెప్పుకొస్తాడు. ‘లేడీ బర్డ్’ ర్ లేత టీనేజర్, తను కోరుకుంటున్న భవిష్యత్తుని హై స్కూలు ఇవ్వడం లేదని, తనలోని కళాభినివేశం కోసం సంఘర్షిస్తుంది. ‘ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్’ లో పోలీసులు రోజూ ఉదయం ఒక టీనేజర్ ని తెచ్చి లాకప్ లో పడేస్తూంటారు. వీళ్ళేం చేశారనేది వీళ్ళు చెప్పుకునే కథలు. ‘మస్టాంగ్’ లో ఐదుగురు అనాథలైన టీనేజీ అక్క చెల్లెళ్ళు యువకులతో తిరుగుతున్నారని బంధిస్తారు. అమ్మాయిల స్వేచ్ఛమీద మోరల్ పోలీసింగ్ ఈ కథ. ‘రివర్స్ ఎడ్జ్’ లో లేత టీనేజర్ తను చేసిన ఘోర నేరాన్ని క్లాస్ మేట్స్ కి గొప్పగా చెప్పుకుంటే, క్లాస్ మేట్స్ ఇంకా మతిపోయేలా కామెడీ చేస్తారు.  ‘హేవెన్లీ క్రీచర్స్’ లో ఇద్దరు టీనేజీ అమ్మాయిలు సన్నిహితంగా గడపడాన్ని సహించలేక తల్లిదండ్రులు విడదీస్తే, ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల మీద పగ దీర్చుకుంటారు...


ఇదో పెద్ద పరిశ్రమ

          టీనేజిలో తమ మనసేమిటో తమకే తెలీక గందోరగోళంగా వుంటుంది. ఈ గందరగోళాన్ని తీరుస్తాయి ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు. హాలీవుడ్ లో కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు దానికదే ఒక పెద్ద పరిశ్రమ. ఏడాదికి ఇరవై ముప్ఫై తీస్తూంటారు. 2018 లో 35  తీశారు. ఈ సంవత్సరం ఇప్పటికే 22 తీశారు. వీటిలో అన్ని జానర్లూ వుంటున్నాయి. ఎదుగుదల గురించే కాక, లవ్, కామెడీలే కాకుండా, యాక్షన్, అడ్వెంచర్, హార్రర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, అన్ని జానర్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు హేరీ పోటర్ సినిమాలన్నీ ఈ జానర్వే.

         తెలుగులో ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ (16 -19 ఏజి గ్రూపు) సినిమాల సెగ్మెంట్ ఖాళీగా పడివుంటోంది. దీన్ని క్యాష్ చేసుకుంటూ ఇంతవరకు లేని కొత్త ట్రెండ్ ని సృష్టించే ఆలోచన చేయడం లేదు. ఎంత సేపూ ఇరవై పైబడిన హీరోహీరోయిన్లతో అవే ముదురు రోమాంటిక్ కామెడీలు. థ్రిల్లర్ తీసినా గడ్డాలు పెంచుకున్న హీరోల హీరోయిజాలే. హాలీవుడ్ లో ‘బ్లడ్ సింపుల్’ తీసిన కోయెన్ బ్రదర్స్ ఇంకో ప్రయోగం చేశారు. నియో నోయర్ జానర్లో ‘బ్రిక్’ అనే నూనూగు మీసాల టీనేజీ జ్యూనియర్ కాలేజీ మర్డర్ మిస్టరీ తీసి సంచలనం సృష్టించారు. ‘బ్లడ్ సింపుల్’ లాగే ఇది కూడా యూనివర్సిటీల్లో కోర్సుగా నమోదైంది. నియో నోయర్ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ!

          మనమేకర్లు ఆ వరల్డ్ మూవీస్ అనే ఆర్ట్ మూవీస్ అడ్డాలోంచి, కాఫీ షాపు చర్చల్లోంచి బయట పడితే తప్ప ఇవన్నీ అర్ధం గావు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ పదం కూడా తెలియని వాళ్ళు మేకర్లుగా వున్నారు. యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తప్ప ఇంకోరకం సినిమా తెలీదు. వూరూరా ఆధునికంగా వెలిసే మల్టీప్లెక్సులు గొప్ప, వాటిలో వేసే సినిమాలు దిబ్బ.

          ప్రేమల్ని కామెడీల్ని కాసేపు పక్కనబెడదాం. ఎదుగుదల గురించిన కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో ‘హోం ఎలోన్’ వుంది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ వుంది. మొన్న వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘అలీటా’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే అంటున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ లో ఫ్లాష్ బ్యాక్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ ప్రమాణాలతో వుంటుంది. హిందీలో వచ్చిన ‘కయీ పోచే’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. ఇండియన్ కథతో డానీ బాయల్ తీసిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఇంకొకటి.

చుట్టూ వయోలెంట్ లోకం
               ఈ నేపథ్యంలో ఎదుగుదల లేని, యాక్షన్, అడ్వెంచర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ అనే ఏ వెరైటీలేని, మరో ఉత్త హైస్కూలు ప్రేమల మలయాళ  ‘తన్నీర్ మథన్ దినంగళ్’ ని రీమేక్ చేయడం ఎంత వరకు అవసరమో వాళ్ళకే వదిలేద్దాం. కానీ తాము ఎలాటి ప్రపంచంలో వున్నారో టీనేజర్లకి తెలుసు. తియ్యటి అమాయక ప్రేమ సినిమాలు వాళ్ళనింకా మభ్య పెట్టలేవు. ప్రపంచం అతి సంక్లిష్టంగా, కన్ఫ్యూజింగ్ గా వుంది. పరమ వయోలెంట్ గా వుంది. ఇంకా చెప్పాలంటే అరచేతిలో విజువల్స్ కి దిగి వయోలెంట్ గా వుంది. వీడియో గేమ్స్ దగ్గర్నుంచీ సెల్ఫీల వరకూ. టిక్ టాక్ ల వరకూ. పబ్ జీ ల వరకూ. పోర్న్ వరకూ. టీనేజర్ల గ్యాంగ్ రేపుల వరకూ. పిల్లల కిడ్నాపుల వరకూ. తమతో ఆడుకునే పిల్లల రేపుల వరకూ. మార్కుల రేసుల వరకూ. కారు రేసుల వరకూ. బైక్ చోరీల వరకూ. చైన్ స్నాచింగుల వరకూ. బెట్టింగుల వరకూ. మాదక ద్రవ్యాల వరకూ. సోషల్ మీడియాల్లో వయోలెంట్ కామెంట్స్ వరకూ. వయోలెంట్ కానిదేదీ లేదు. ఒక విషయంపై ఎవ్వడూ వినడం లేదు. మాట్లాడ్డం లేదు. సమాచార మివ్వడం లేదు. అరుస్తున్నాడు. తిడుతున్నాడు. ఎవర్ని అడగాలి? ఎవర్ని అడిగి మార్గం నిర్దేశించుకోవాలి? ఈ ముళ్ళ చక్రం అనే ప్రపంచంలో ఇరుక్కోకుండా ఎలా వుండాలి? ఇరుక్కుంటే ఎలా బయట పడాలి?

          రమేష్ బాబు ‘నీడ’ కాలంలో ప్రపంచమిలా లేదు. అరచేతిలో ఇన్ని తలలతో విచ్చుకోలేదు. చెడు కన్పిస్తే, వూరిస్తే, కుతూహలం కల్గిస్తే, ఎక్కువలో ఎక్కువ రోడ్డు పక్క వేశ్య రూపంలోనే. ఇవ్వాళ ఇలా లేదు. ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచాన్ని మనం దాటేశాం. అదృష్టవశాత్తూ మనం గడిపిన ప్రపంచం వేరు. కానీ మన వెనక వచ్చిన టీనేజర్లకి మనం కాకపోతే ఇంకెవరు చేతనయింది చేస్తారు? 


          చుట్టూ ఈ కొత్త వయోలెంట్ ప్రపంచంతో కూడా ఏం చేయాలా అని మనసు పెట్టి ఆలోచిస్తే, టీనేజర్లని  ఇంకా పల్లీ బఠానీలతో మభ్యపెట్టకుండా వాళ్ళ వాయిస్ ని విన్పించే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో పుణ్యం కట్టుకోవచ్చు. ఖాళీగా వున్న ఈ సెగ్మెంట్ ని భర్తీ చేయవచ్చు. కళా సేవ కాదు, కాసు లొచ్చేదే. హాలీవుడ్ జానర్లు క్యాష్ కౌంటర్లే, డోంట్ వర్రీ! ఈ వ్యాసం మేసేజీలా వుందేమో, ఇదొక వ్యాసమంతే!



next : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రాయడమెలా?
సికిందర్



21, నవంబర్ 2018, బుధవారం

707 : స్పెషల్ ఆర్టికల్


   Why has Scandinavia been producing such good thrillers? Maybe because their filmmakers can't afford millions for CGI and must rely on cheaper elements like,you know,stories and characters.
Roger Ebert, film critic

       స్కాండినేవియా థ్రిల్లర్ సినిమాల స్క్రిప్టింగ్ టూల్స్ ని అర్ధం జేసుకుంటే, లో - బడ్జెట్ లో తెలుగులో తీసి విఫలమయ్యే థ్రిల్లర్స్ ని ప్రేక్షకుల హృదయాలకి అతి చేరువగా తీసికెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. స్కాండినేవియా క్రైం సాహిత్యంలో 1990 లలో ప్రారంభమైన నార్డిక్ నోయర్ అనే జానర్, అక్కడి సినిమాల్లోకి రావడం 2008 నుంచి మొదలయింది. నోయర్ జానర్ 1940 లలోనే ఫ్రాన్సులో ఫిలిం నోయర్ గా ప్రాణం పోసుకున్నాక, వెంటనే హాలీవుడ్ అందిపుచ్చుకుని, స్టార్స్ తో సైతం వందలాది ఫిలిం నోయర్ సినిమాలు తీసింది. ఫిలిం నోయర్ జానర్ ప్రధానంగా డిటెక్టివ్ సినిమాలు. దీనికి చాలా వరకూ డెషెల్ హెమెట్, జేమ్స్ మెక్ కెయిన్ లు రాసిన ఘాటైన డిటెక్టివ్ నవలల్ని తీసుకుని హాలీవుడ్ లో  ఫిలిం నోయర్ సినిమాలు తీస్తూపోయారు.1960 లలో కలర్ సినిమాలతో దీని పేరు నియో నోయర్ గా మారిపోయింది. స్టార్స్ తో తీస్తున్న ఈ నోయర్ సినిమాలని కుర్ర హీరోహీరోయిన్లతో తీయడంతో టీనేజి నోయర్ అనే సబ్ జానర్ పుట్టింది. ఇదంతా - ఫిలిం- నియో- టీనేజీ నోయర్ల గురించి బ్లాగులో గతంలో తెలుసుకున్నదే. ‘బ్లడ్ సింపుల్’, ‘బ్రిక్’ అనే నియో నోయర్, టీనేజీ నోయర్ సినిమాల్ని విశ్లేషించుకున్నదే. 

          
ప్పుడు నార్డిక్ నోయర్ ఈ కోవలో చేరుతోంది. మిగతా ఏ జానర్ సినిమాలకీ ఓ ప్రామాణీకరించిన కళా విలువలంటూ వుండవు.  ప్రేమ సినిమాలని ఎలాగైనా తీసుకోవచ్చు, కుటుంబ సినిమాల్ని ఎలాగైనా తీసుకోవచ్చు. కామెడీ, యాక్షన్, హార్రర్ మొదలైన సినిమాలు, ఆఖరికి క్రైం  థ్రిల్లర్ సినిమాలు కూడా ఎలాగైనా తీసుకోవచ్చు. ఆయా దర్శకుల క్రియేటివిటీలతో. అయితే వీటన్నిటిలో ఒక్క క్రైం థ్రిల్లర్స్ కి మాత్రమే కళాత్మకంగా కొన్ని ప్రత్యేక కొలమానాలని నిర్ధారిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలే నోయర్ జానర్ కి దారితీశాయి. ఈ నోయర్ జానర్ ఫ్రెంచి నుంచి హాలీవుడ్ కి, ఆ తర్వాత స్కాండినేవియాకీ ప్రాకింది. ఇండియాలో బాజీ అనే ఫిలిం నోయర్, మనోరమ సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దర్, మక్బూల్, షైతాన్, మున్నారియిప్పు, అరణ్యకాండం, 16 డి, ఇంకా మరెన్నో హిందీ, తమిళ, మలయాళ నియోనోయర్ సినిమాలు వచ్చాయి. తెలుగులో జాడలేదు. 

          ఉత్తర యూరప్ లోని కొన్ని దేశాల సముదాయాన్ని నార్డిక్ దేశాలని పిలుస్తారు. డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడెన్, నార్వే, అలెండ్ ఐలాండ్, ఫరో ఐలాండ్, స్కాండినేవియా మొదలైన ఏడు మినీ దేశాలు కలిసి నార్డిక్ దేశాలయ్యాయి. 1990 లలో స్కాండినేవియాలో హెన్నింగ్ మాంకెల్ అన్న రచయిత, వాలండర్ అనే పోలీస్ అధికారి పాత్రతో రాస్తూ పోయిన క్రైం నవలలు నోర్డిక్ నోయర్ జానర్ ప్రారంభానికి దారి తీశాయి. ఈ జానర్ ని సృష్టించడానికి మళ్ళీ అమెరికా మీదే ఆధారపడ్డారు. ప్రసిద్ధ అమెరికన్ క్రైం నవలా రచయిత ఎడ్ మెక్ బెయిన్ (1926 -2005) రాసిన పోలీస్ ప్రోసీజురల్  క్రైం నవలలే నార్డిక్ నోయర్ కి మూలమయ్యాయి. స్కాండినేవియా క్రైం జానర్ కి కొత్త ద్వారాలు తెరుస్తూ, నవలలుగా, టీవీ సిరీస్ గా,  చలనచిత్రాలుగా, సొంత ఐడెంటిటీతో ‘స్కాండీ నోయర్’ అన్పించుకునే స్థాయికి చేరిందీ జానర్. పక్కదేశాలూ దీన్ని అనుసరించాయి. ఖండాంతర దేశాల ప్రేక్షకుల్లో, పాఠకుల్లో విపరీతమైన క్రేజ్ పెంచేసిన గ్లోబల్ బ్రాండ్ కూడా అయింది.
***
   ‘నార్డిక్ నోయర్ ఆక్స్ ఫర్డ్ రీసెర్చి ఎన్ సైక్లోపీడియా’ ప్రకారం, ఈ జానర్ లో పోలీస్ నేరపరిశోధక కథలుంటాయి. వీటికి నేపధ్యంగా-  
          1. క్షీణించిన సామాజిక విలువలుంటాయి.
          2. సమానాధికారవాదుల పక్షపాతం, ద్వేషం వుంటాయి.
          3. హీరోలు యాంటీ హీరోలుగా వుంటారు. వాళ్ళ వృత్తులతో, బలహీనతలతో సతమతమయ్యే - జీవితంలో అన్నివిధాలా దెబ్బతిన్న యాంటీ హీరోలు. ప్రైవేట్ డిటెక్టివ్ లు, లేదా పోలీస్ డిటెక్టివ్ లై వుంటారు. తమ
జీవితాలు దగాపడ్డా ఇతరులకి న్యాయం కోసం ఎన్నైనా త్యాగాలు చేస్తారు.
          4. హీరోయిన్ పాత్రలు బలంగా వుంటాయి.
          5. సకల భ్రష్టత్వంతతో, పరమ నికృష్టంగా విలన్లుంటారు.
          6. హాలీవుడ్ కథల కంటే కటువుగా వుంటాయి వీటి కథలు.
          7. వీటన్నిటినీ కలిపివుంచే డార్క్ మూడ్ తో – రక్తాన్ని గడ్డకట్టించే మంచు ప్రాంతాలుంటాయి. రహస్యాల్ని కప్పెట్టుకున్న హిమ కుహరాలు. నైరాశ్యాన్ని కల్గించే నిర్జీవ మంచు మేటలు.
          8. స్థానిక ఫీల్ తో కథ చెప్పే తీరుతెన్నులు వైవిధ్యభరితంగా వుంటాయి.
          9. సంభాషణలు సూటిగా, సాదాగా వుంటాయి.
          10. అక్కడి సంస్కృతీ సంప్రదాయాల్ని సజీవంగా వుంచుతాయి.

          నార్డిక్ దేశాల్లో శీతాకాలం సుదీర్ఘంగా వుంటుంది. పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. ఉదయం పది గంటలకి తెల్లారుతుంది. మధ్యాహ్నం రెండున్నరకి చీకటి పడిపోతుంది. దీంతో ఎక్కువమంది మనో మాంద్యానికి లోనై మద్యం ఎక్కువ సేవిస్తారు. బలమైన, సురక్షితమైన మధ్యతరగతి వర్గముంది. ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్లకి తెలుసు. శబ్ద, వాయు కాలుష్యాలు లేవు. నిశబ్దమే అక్కడి శబ్దం. నిశ్శబ్దమే వాళ్ళ సంస్కృతి. నిశ్శబ్దమే వాళ్ళ కమ్యూనికేషన్. నిశ్శబ్దాన్ని సంభాషణలతో భర్తీ చేసే అవసరం వాళ్ళకి రాదు. అమెరికన్లు మాట్లాడేంత వేగంగా మాట్లాడరు. వాళ్ళు అంతర్ముఖీనులు కావొచ్చు, కానీ నిజాయితీ పరులు. తామేమిటో తమకి తెలిసిన వాళ్ళు. ఇవన్నీ నార్డిక్ నోయర్ సినిమాల్లో వ్యక్తమవుతాయి. చీకట్లో మునిగి వుండే కాలమే ఎక్కువ కాబట్టి,  నార్డిక్ రచయితల్ని అంతటి హింసాత్మక నేర కథలు రాసేందుకు పురిగొల్పి వుండొచ్చు. కానీ ఇతర దేశాల్లో కంటే ఇక్కడ నేరాలు చాలా తక్కువ.

         
టీవీ సీరీసులు, సినిమాలూ తరచుగా ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు జరుపుకుంటాయి. నార్డిక్ దేశాలు సినిమా వ్యాపారానికి  అతి చిన్న ఏరియాలు. కాబట్టి బ్లాక్ బస్టర్స్ ని తీయాలని అనుకోరు. తమ సంస్కృతీ సంప్రదాయాల్ని సజీవంగా వుంచేందుకే సినిమాలు తీస్తారు. బాగా తీయాలి, ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరాలి -  అనే దృష్టే వుంటుంది తప్ప,  ధనార్జన మీద ఆసక్తి వుండదు. రేటింగ్స్ ని పట్టించుకోరు.
***
         ఈ జానర్ అమెరికా దాకా ప్రాకి  ది కిల్లింగ్స్, ది బ్రిడ్జి వంటి నార్డిక్ నోయర్ టీవీ సిరీస్ రిమేక్ అవడం మొదలెట్టాయి. 2011 లో ఆస్కార్ అవార్డు దర్శకుడు (‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’) డేవిడ్ ఫించర్, ఆస్కార్ అవార్డు రచయిత (షిండ్లర్స్ లిస్ట్) స్టీవెన్ జిలియన్ లు కలిసి  ‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ అనే నార్డిక్ నోయర్ నవలని విజయవంతమైన హాలీవుడ్ మూవీగా తీసి సంచలనం సృష్టించారు (బడ్జెట్ – 90 మిలియన్ డాలర్లు, రెవిన్యూ 232.6 మిలియన్ డాలర్లు). ఇందులో జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రేగ్, రూనీ మారాలు నటించారు.

          నార్డిక్ నోయర్ సినిమాలు విరివిగా నెట్లో దొరుకుతాయి. నార్డిక్ నోయర్ నవలల వ్యాపారం ఇప్పుడు మల్టీమిలియన్ డాలర్ వ్యాపారంగా మారింది. వేర్ రోజెస్ నెవెర్ డై, ది క్రో గర్ల్,  డైయింగ్ డిటెక్టివ్ లాంటి నవలల్ని గుండెలుగ్గబట్టుకుని చదవాలి.  అలాగే ది హంట్, హెడ్ హంటర్స్, జార్ సిటీ వంటి సినిమాలు రక్తం గడ్డకట్టిస్తాయి. అమెరికన్ నోయర్ సినిమాలు ఒకెత్తు, నార్డిక్ నోయర్ మరొకెత్తూ.  అమెరికన్ నోయర్ కథలు సంపన్న వర్గాల రాత్రి భాగోతాల వ్యక్తిగత కథలుగా వుంటే, నార్డిక్ నోయర్ కథలు సామాజిక -  వ్యవస్థాగత రుగ్మతలకి కూడా విస్తరిస్తాయి, నైసర్గిక నేపథ్యాలతో. పైన చెప్పుకున్న నార్డిక్ నోయర్ 10 ఎలిమెంట్స్ తో – ప్రామాణీకరించిన కళా విలువలతో  – అంటే జానర్ మర్యాదలతో కూడి వుంటాయి. 

          ఈ 10 ఎలిమెంట్స్ లో ఒక్క మంచు ప్రాంతాల నైసర్గిక స్వరూపం తీసేస్తే, మిగిలిన వాటిని ఇంకే ఇతర ప్రాంతాల చలనచిత్రాలకైనా అన్వయించుకోవచ్చు. క్రైం జానర్ సినిమాలంటే  ఒకడ్ని ఇంకొకడు చంపాడని, మరొకడు వాణ్ణి పట్టుకోవడానికి బయల్దేరే కాలక్షేప బఠానీలుగా తీస్తూంటేనే ప్రేక్షకులు చెత్తబుట్టలో విసిరేసి పోతున్నారేమో ఆలోచించాలి క్రియేటివ్ భయస్థులు. ‘క్రియేటివ్ భయస్థులు’ భాష కరెక్ట్ కాదేమోగానీ, విషయం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ క్రియేటివ్ పరికల్పనల్లో స్వేచ్ఛ అనేదే పరదా తొలగించుకుని కాస్త తొంగి చూడదు. భయమే బుసలు కొడుతూవుంటుంది. ఈ గీత దాటితే ఏమవుతుందో ఏమో - నల్గురు పోతున్న అట్టర్ ఫ్లాపుల బాటలోనే మనమూ సామిరంగా అనుకుంటూ పోదామనే క్రియేటివ్ భయాలే స్వర్గసీమలా వుంటాయి. పైకి క్రియేటివ్ స్వేచ్ఛ గురించి చాలామాట్లాడతారు. చేతల్లో క్రియేటివ్ భయాలు వెండితెర మీద భాంగ్రా వేస్తూంటాయి. రోజురోజుకీ ముందు కెళ్ళిపోతున్న ఎంటర్ టైన్మెంట్ మెంట్ రంగం, దాంతో పాటూ ఈలేసుకుంటూ వలస వెళ్ళిపోతున్న ప్రేక్షకులూ, వున్నచోటే ఎక్కడేసిన గొంగళిలా వుండిపోతే, తమకెంత బాగుండునని కలలుంటాయి.
***
    ఇందుకే క్రైం జానర్ కి కాస్తయినా సామాజిక గోడచేర్పు వుండాలంటే గొప్ప సందేహంలో పడిపోతారు. ఒకడ్ని ఇంకొకడు చంపాడు, వాణ్ణి ఇంకొకడు పట్టుకుంటాడు చాలు,  దీన్ని పిచ్చ కామెడీ చేయొచ్చుగా అనే చైల్డిష్ ఆలోచనలు. హిందీలో పింక్, షైతాన్ వంటివి, తమిళంలో 16 డి, సామాజిక గోడచేర్పు వల్లే నోయర్ థ్రిల్లర్స్ గా అంత కొత్తానుభూతినిచ్చాయి ప్రేక్షకులకి. కొత్తగా తెచ్చిపెట్టుకున్న ఈ గ్లోబల్ సంస్కృతిలో రాత్రి పూట యూత్ ఏం చేస్తూంటారో, వాటి పరిణామాలేమిటో చూపించిన ఈ నయా థ్రిల్లర్స్ కి అంతగా  కనెక్ట్ అయ్యారు యూత్. అల్లాటప్పా ఫార్ములా డ్రామా మూస కథలకి యూత్ కనెక్ట్ అయ్యే రోజులుపోయాయి స్మార్ట్ ఫోన్ల కాలంలో. ఎప్పుడో ‘ఇది నిజంగా జరిగిన కథ’ అంటూ ఎవరైనా తీసినా అవీ మూస ఫార్ములా టెంప్లెట్స్ గానే వుంటున్నాయి. 

          తెలుగు సినిమాల్లో డిటెక్టివ్ పాత్ర మార్కెట్ యాస్పెక్ట్ కాదు పక్కన పెడదాం, పోలీస్ పాత్రని ప్రొఫెషనల్ గా చిత్రించవచ్చు. పోలీస్ ప్రొసీజురల్ కథలతో వాస్తవిక క్రైం థ్రిల్లర్స్ తీయవచ్చు. పైన చెప్పిన నార్డిక్ జానర్ మర్యాదలతో వీటిని అలంకరించవచ్చు. ముఖ్యంగా నేటివిటీ విషయం. కథ జరిగే ప్రాంతపు ఫీల్ ని పట్టుకోవడం. ఒక వూళ్ళో కథ జరిగితే ఆ వూరి ఫీల్ ఒకటుంటుంది. అది విజువల్స్ లో పలకాలి. మనోరమ సిక్స్ ఫీట్ అండర్ నోయర్ లో బీహార్లో ఒక గ్రామాన్ని దాని వ్యక్తిత్వంతో చూపించారు. కథకి తగ్గ మిస్టీరియస్ వాతావరణం కూడా ఆ పరిసరాల్లో పట్టుకున్నారు. కథ అనుకున్నాక ప్రాంతాన్ని స్టడీ చేయాలి. నగరంలో ఒక  కావచ్చు, గ్రామంలో కావొచ్చు. నగరంలో చిక్కడపల్లి అయితే చిక్కడపల్లి నేటివిటీని స్టడీ చేసి అది పలికేలా సీన్లు రాసుకోవాలి. ఏదైనా గ్రామంలో నైతే అక్కడి నేటివిటీని విజువలైజ్ చేస్తూ సీన్లు రాసుకోవాలి. విజువల్ బ్యాక్ డ్రాప్ నోయర్ సినిమాలకెంతో బలాన్నిస్తుంది. 

          ఇక ఆ ప్రాంతంలో సామాజిక స్థితిని కూడా పరిశీలించాలి. దాన్ని కథలో మిళితం చేసుకోవాలి. కథలో వుండే అనుకూల, వ్యతిరేక శక్తుల్ని ఆ సామాజిక వాతావరణంలో జాగ్రత్తగా సెటప్ చేయాలి.

          నోయర్ జానర్ అంటే అన్నిటినీ తొక్కిపారేసుకుంటూ వెళ్ళిపోయే రొడ్ద కొట్టుడు రోడ్డు రోలర్ మూస ఫార్ములా కాదు. ఎత్తు పల్లాలతో దేని ఉనికిని అది చాటుకునేలా చేసే ఆడియెన్స్ ఫ్రెండ్లీ జానర్. గ్లోబల్ యుగం ప్రపంచంలో దేని అస్తిత్వాన్నీమిగల్చకుండా చదును చేసి పారేసింది. దీని మీద పాత్రికేయుడు థామస్ ఎల్ ఫ్రీడ్మన్ ‘వరల్డ్ ఈజ్ ఫ్లాట్’ అన్న గొప్ప పుస్తకం రాశాడు. చదునైపోతున్న జీవితాల్ని నీరుపోసి పెంచి పోషించేవి నోయర్ జానర్లే. అమెరికన్ నోయర్ సంపన్నవర్గాల హిపోక్రసీని తీసుకుంటే, నార్డిక్ నోయర్ సామాజిక వాతావరణాన్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకుంది. బ్యాక్ డ్రాప్స్ లేని క్రైం జానర్లు డొల్ల పిల్ల వేషాలే.


సికిందర్    

8, జూన్ 2018, శుక్రవారం

654 : స్క్రీన్ ప్లే సంగతులు


( జరిగిన కథ : జీహై – జూన్ హా ఇద్దరూ వూరి బయట భూత్ బంగ్లా కెళ్తారు. అక్కడ జీహై, జూన్ హాకి మానసికంగా దగ్గరవుతుంది. భూత్ బంగ్లా లో దెయ్యాన్ని కాక పిచ్చోణ్ణి చూసి నవ్వుకుని బయల్దేరతారు...)
        సీన్ : తిరిగి నదీ వారగా వచ్చేసరికి పడవ కొట్టుకు పోతూ వుంటుంది. ఏం చెయ్యాలో అర్ధం గాదు. ఇంతలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమవుతుంది. జూహీ వెనక్కి తిరిగి చెట్ల వైపు వురుకుతుంది. జూన్ హా కూడా వురుకుతాడు. ఆమెని దాటుకుని పోతాడు. పోయే సరికి వెనుక ఆమె కాలు బెణికి కిందపడిపోయి అరుస్తుంది. వెనక్కి వచ్చి లేపుతాడు.నడవలేకపోతుంది. వీపు మీద ఎక్కమంటాడు వంగి. ఆమె తటపటాయించి అతడి వీపెక్కుతుంది, మోసుకుంటూ వర్షపు జల్లులో పొలాల వెంబడి పరిగెడతాడు.

పాయింట్ :   వెనక భూత్ బంగ్లా సీనులో ఒక షాట్ ని గమనించాం. మనం బుర్రగొక్కుంటూ చూసేలా వున్న ఆ షాట్ ఏమిటో కూడా చెప్పుకున్నాం. దెయ్యం వుందనుకున్న గది వైపుకి జూన్ హా,  షాట్ లోకి వంగి నడుస్తూ రైట్ ఎంట్రీ ఇస్తే, అతడి మీద వాలుతున్నట్టు జూహీ కూడా రైట్ నుంచి ఏటవాలుగా ఎంట్రీ ఇస్తుంది.  దర్శకుడు ఈ షాట్ ని ఇలాటి బాడీ లాంగ్వేజీతో  ఎందుకు తీశాడా అని మనం బుర్ర గోక్కున్నాం. దీని సింబాలిక్ అర్ధం ఇప్పుడు ఈ సీన్లో చూస్తున్నాం. ఇక్కడ ఆమె కాలు బెణికి అతడి వీపెక్కాల్సి వచ్చింది. అంటే జరగబోయేది ముందుగానే కాలం వాళ్ళ అలాటి బాడీ లాంగ్వేజీలో చెప్పేసిందన్న మాట. కొన్ని మనకి తెలీకుండా చేసేస్తూంటాం. అది కాలం చేస్తున్న హెచ్చరిక అనుకోం. కాలంలో ముందేం జరుగుతుందో మనం వూహించలేం. వూహించి వుంటే జీహై  అలా  ఏటవాలుగా అతడి వెనకాల వెళ్తున్నప్పుడే - నేనేమిటి ఇలా వెళ్తున్నాను, ఇతడి వీపెక్కే పరిస్థితి వస్తుందా అని అప్పుడే ఆలోచించి వుంటే, తర్వాత పరిగెడుతున్నప్పుడు కాలు బెణక్కుండా జాగ్రత్త పడేదేమో. ఇలాటి గమ్మత్తులు చేస్తూ కాలం వీళ్ళని ఎలా కలుపుతోందో చూస్తున్నాం. వెనక సీన్లో జూహీ  మానసిక ఎటాచ్ మెంట్, దాని ప్రభావానికి ఫిజికల్ గా ఆమె కింద పడిపోతే అతనూ కింద పడిపోవడం, ఇప్పుడీ సీనులో ఇలా ఫిజికల్ గా ఇద్దరూ ఎటాచ్ అయిపోవడం.

     ఈ సీనులో ఒక లోపమున్నట్టు అన్పించవచ్చు. వర్షం ప్రారంభం కాగానే జూహీ వెనక్కి తిరిగి పరుగెత్తుతుంది. అలాగే ఆమెని దాటుకుని పోయి జూన్ హా కూడా  పరుగెత్తుతాడు. ఆమె కాలు బెణికి పడిపోతే అప్పుడు వెనక్కి వచ్చి ఆమెని చేరుకుంటాడు. అప్పటి  వరకూ ఇద్దరూ ఎవరి మానాన వాళ్ళు వురుకుతున్నట్టే. ఒకర్నొకరు పట్టించుకోకుండా. 

          ఈ సినిమాని తెలుగులో కాపీ కొడితే మనమిలా చేస్తాం : వర్షం మొదలయ్యింది. ఇద్దరూ ఒక అనుభూతికి లోనయ్యారు. యంగ్ హీరోయిన్ చేతులు చాపి స్లో మోషన్ లో చిటపట చినుకులతో ఆడుకుంటోంది. తడిసిన ఆమె అందాలన్నీ సెక్సీ గా ఎక్స్ పోజ్ అవుతున్నాయి. యంగ్ హీరో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నాడు...వొళ్ళూ వొళ్ళూ రాపిడి. రగిలిన వేడి. ఎగిసిన ప్రేమ అలజడి!

          లేదా – వర్షం మొదలవగానే ఇద్దరూ చేతులు పట్టుకుని పరిగెట్టడం మొదలెట్టారు. ఆమె కాలు బెణికి పడిపోయింది. అతను లేపి వీపునేసుకున్నాడు...

          వాళ్ళు ఇన్నోసెంట్స్ అనీ, వాళ్ళల్లో ఇంకా అడాలసెన్సే తొంగి చూస్తోందనీ, పసిపిల్లల మనస్తత్వమనీ... ఇలా పాత్రలు ఎస్టాబ్లిష్ అయ్యాయనీ, గతంలోనే మనం చెప్పుకున్నాం. అయినా ఈ మానసిక స్థితిని, పాత్ర చిత్రణల్నీ  కిల్ చేసి - రోమాంటిక్ జయ కేతనాన్ని రెపరెప లాడించెయ్యాలనీ ఉబలాట పడతాం మనం సగటు తెలుగు సినిమాల అద్దె బుద్ధి కొద్దీ. 

          కొరియన్ దర్శకుడు సంకల్పించిన ఈ సీను ఎందుకు కరెక్ట్ అంటే, హీరోహీరోయిన్లు స్పష్టంగా ప్రేమని ఫీలవడం లేదు. పిల్లల్లాగే తిరుగుతున్నారు. పిల్లలు ఏదైనా జరిగితే ఎవరి మానాన వాళ్ళు జంప్ అయిపోతారు. చిన్నపిల్లలు మొదట తమ సేఫ్టీ చూసుకుంటారు. తోటి పిల్లకాయ గోతిలో పడితే తర్వాత వచ్చి చూస్తారు. అందుకని భూత్ బంగ్లా సీనులో గదిలో ‘దెయ్యాన్ని’ చూసి హీరో కేకలేసుకుంటూ హీరోయిన్ని పట్టించుకోకుండా ఎలా పారిపోయాడో, తర్వాత ఆమె కేకలు విని నాలిక్కర్చుకుని ఎలా వెనక్కొచ్చాడో, అదే మనస్తత్వంతో వున్న హీరోయిన్ ఇప్పుడు వర్షం మొదలవగానే తన మానాన తాను  పరుగెత్తడం మొదలెట్టింది. హీరో కూడా ఆమెని దాటుకుని తన మానాన తాను  పరుగెత్తాడు. ఆమె పడిపోగానే వెనక్కొచ్చాడు. వాళ్ళు ప్రేమని ఫీలయితే అలా ఎవరి మానాన వాళ్ళు పరుగెత్తే వాళ్ళు కాదు. కాలం మాత్రమే వాళ్ళ మధ్య ప్రేమని ఫీలవుతోంది- వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తోంది. అందుకని వాళ్ళకేం జరుగుతోందో ఇంకా వాళ్లకేం తెలీదు.

          ఈ సీన్ కట్ చేశాక దర్శకుడేం చేయాలి? ఇప్పుడామెని వీపెక్కించుకుని వర్షంలో పొలాల వెంబడి పరిగెడుతూ వున్నాడు.  దీన్తర్వాత సీనేం వేయాలి? ఇప్పుడెలాగూ వానలో శరీరాలు అతుక్కున్నాయి కాబట్టి వాన పాటేసుకోవాలా?  మనం ఇలాగే చేసి కుతి తీర్చుకుంటాం. మనం రాసేవన్నీ ఇదివరకు సినిమాల్లో వచ్చేసిన టెంప్లెట్ సీన్లే కనుక, చూసిన తెలుగు సినిమాల్లో సీన్లన్నీ గుర్తుచేసుకుంటూ, వాటిని  పేర్చుకుంటూ పోవడమే మనం కథ రాయడమంటే.  ఇలాంటప్పుడు చూసిన సినిమాల్లో రకరకాల వాన పాటలూ మనకి  మెదుల్తాయి తప్పక. కాబట్టి ఆ టెంప్లెట్ లో వాన పాటొకటి వేసేస్తే మనకి  పని భారం కూడా తగ్గుతుంది. కవిగారూ, సంగీత దర్శకుడూ ఆ అయిదు నిమిషాల  స్క్రీన్ స్పేస్ ని ఎలా భర్తీ చేయాలో  వాళ్ళ పాట్లేవో  వాళ్ళు పడతారు. మనం పని తప్పించుకుని వెళ్లిపోవచ్చు. పాట కాగానే హీరోయిన్ తాతగారి మనుషులతో హీరోకి ఫైట్  వేసేస్తే ఆ పావు గంట నిడివితో ఫైట్ మాస్టర్ తంటాలు పడతాడు. మనం మొత్తం కలిపి ఈ ఇరవై నిముషాలు సీన్లు రాయకుండా ఎస్కేప్ అవ్వొచ్చు!  తక్కువ పని చేసి ఎక్కువ నష్టం కలిగించే మన మోటోని వీటో చేసే వాళ్ళెవరూ వుండరు. మన జీవితం ఆరు స్క్రీన్ ప్లేలూ ఇరవై కూలి దినాలుగా గడిచిపోతుంది...కమ్మగా నిద్రపోవచ్చు. 

          ఇలాటి విద్రోహపు ఆలోచనలు కొరియన్ దర్శకుడికి రాలేదు. తర్వాతి సీనేం చేయాలో మొదలెట్టిన సైకలాజికల్ ట్రాకుని అనుసరిస్తూనే  పోతున్నాడు. పాత్రల సైకాలజీయే కథనం చేస్తుంది, సీన్లు వస్తాయి.  ఇలాటి సైకలాజికల్ ట్రాక్ ని నియో నోయర్ మూవీ ‘బ్లడ్ సింపుల్’ లో కథానాయకుడు విస్సర్ పాత్రలో మనం గతంలో చూశాం. ఫారినోళ్ళు ఒఠ్ఠి పిచ్చోళ్ళు. క్యారక్టరైజేషనూ, పనికిమాలిన సైకలాజికల్ ట్రావెలూ అంటూ బొత్తిగా మనకి నీచాతినీచమన్పించే పనులేవో చేస్తారు. మనక్కావాల్సింది ఒక ఫ్లాపు తీయడానికి ఫ్లాపంటి పన్నెండు సూత్రాలు. ఫ్లాపే మన జీవన మాధుర్యం. అదెంతో తియ్యనైన పదార్ధం.

          పడుచు హీరోహీరోయిన్లు పడవెక్కిన కాణ్ణించీ ఇప్పుడు వర్షంలో ఇలా వీపెక్కడం వరకూ ఇదంతా కథనం డిమాండ్ చేస్తున్న వాళ్ళ మానసిక -  శారీరక సాన్నిహిత్యాల సెటప్ అన్నమాట. స్ట్రక్చర్ అంటే ఇదే. సైకాలజిస్టు చూసినా ఈ ట్రాకుని తప్పుబట్ట లేడు. ఇలా సెటప్ చేసిన తర్వాత ఇద్దర్నీ ఒక చోట సెటిల్ చేసి మాట్లాడుకోనివ్వాలి. జీవితంలో ఎవరి సైకలాజికల్ ట్రాకైనా ఇంతే. చర్యలన్నీ మానసికమైనవే. మనసులోనే పుడతాయి. ఇలా సెటప్, ఆ తర్వాత సెటిల్, దీంట్లో మాటలతో మరింత దగ్గరవడం. వీళ్ళెలా సెటిలయ్యారో కింది సీన్లో చూద్దాం.

 సీన్ :    కెమెరా టిల్ట్ డౌన్ చేస్తూంటే ఇద్దరూ మంచె ఎక్కి  కూర్చుని వుంటారు పొలాల మధ్య. వర్షం పడుతూ వుంటుంది. ఆమె ముడుచుక్కూర్చుని వణుకుతూ వుంటుంది. అతను తడిసిన షర్టు విప్పి, పిండి ఆమెకిస్తాడు. ఆమె తల, చేతులు  తుడుచుకుని షర్టు అందిస్తుంది. ఆ నీళ్ళు పిండి ఇంకోసారి ఇస్తాడు. చెంపలు తుడుచుకుతుంది. పొలంలో కాసిన పుచ్చకాయ తెంపు కొస్తాడు. చేత్తో దాన్ని ముక్కలు చేసి ఆమెకో ముక్క ఇచ్చి తానొకటి తీసుకుంటాడు. అతను చేత్తో ఒక్క దెబ్బకి పుచ్చకాయని పది ముక్కలు చేసినప్పుడు,  చిన్న పిల్లలా ఆనందపడి నవ్వుతుంది. ఇద్దరూ తియ్యగా తింటూంటారు. వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామంటాడు. పడవెలాగో వస్తుందంటాడు. దీంతో సీను పూర్తవుతుంది. వర్షం వెలిసి లాంగ్ షాట్ లో ఇంద్ర ధనుస్సు వెలుస్తుంది. 

          పాయింట్ :  ఈ సీనులో భూత్ బంగ్లాలో కనపడ్డ పిచ్చోడితో గల సింబాలిక్ మీనింగు దర్శన మిస్తుంది. పిచ్చోడు చంకలో చుట్టి పెట్టుకున్న కోటు లోంచి గడ్డి పరకలు వేలాడుతూ వుండడం  గమనించాం. గడ్డి ఇక్కడ ఈ మంచె మీద పరచి వుంది. పిచ్చోడు తలకి కోటు చుట్టుకుని వుండడాన్నీ గమనించాం. ఇక్కడ హీరో షర్టు విప్పి ఇస్తే హీరోయిన్ తడిసిన తల తుడుచుకుంది. ఈ కాకతాళీయాల్ని  కాలమహాత్మ్యంగా చమత్కరించాడు దర్శకుడు. వెనుక సీన్లో కాలం చెప్తున్న పిచ్చోడి సింబాలిక్ అర్ధం – మీరు వానలో తడిసినా మంచె మీద తల దాచుకోబోతారనీ,  అతడి షర్టుతో ఆమె తల తుడుచుకోబోతోందనీ...

          నిజానికి ఇలాటి  ఫోర్ షాడోయింగ్ సింబాలిజాలు ‘బ్లడ్ సింపుల్’ నిండా వున్నాయి. వాటిని విశ్లేషించుకున్నాం కూడా. ఫిలిం నోయర్, నోయో నోయర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు నిజానికి విధి రాత, తలరాత, చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టు కర్మ ఫలాలు అనుభవించడాల  చుట్టూ కథలై సాగుతాయి. ఎక్కడైతే ట్రాజడీ, డ్రామా వుంటాయో అక్కడ సింబాలిజాలు చక్కగా వర్కౌటవుతాయి. ఎందుకంటే,  ఈ జానర్లు సమయం తీసుకుని  నిదానంగా సాగే సీన్లతో కూడి వుంటాయి గనుక. ట్రాజడీలూ డ్రామాలూ  అంటేనే ఆలోచనాత్మక కథలు. నటీనటులతో సీన్లు ఆలోచింపజేసేవిగా వుంటాయి కాబట్టి, చుట్టూ వాతావరణ పరిస్థితుల్లో సింబాలిజలు నాటడానికి ఎక్కువ ఆస్కారముంటుంది. ఈ సింబాలిజలు ప్రేక్షకుల సబ్ కాన్షస్ (అంతరంగం) తో కనెక్ట్ అయి తదేకంగా సినిమా చూసేట్టు చేస్తాయి. కొన్ని యాక్షన్ సినిమాల్లో సబ్ కాన్షస్ కనెక్షన్స్ కోసం బ్లర్ చేసిన కలర్ లైట్స్ చూపిస్తారు. 

          దర్శకుడు వీళ్ళిద్దర్నీ మంచె మీద ‘సెటిల్’ చేసి కాసేపు కాలక్షేపం చేయించాడు. ఐతే ఎక్కువ మాట్లాడించలేదు. ఆమె అతడి షర్టుతో తల తుడుచుకోవడం, ఇద్దరూ పుచ్చకాయ తినడం లాంటి అనుభవాలున్నాక ఇక మాటలు అవసరం లేదు. ఇలా వున్న సీనులో ఒకే ఒక్క మాట – అదీ జూన్ హా చేత పలికించాడు - వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామనీ, పడవెలాగో వస్తుందనీ. జూన్ హా ఈ మాటనడం ఆమె పట్ల ఫీలవుతున్న బాధ్యతకి నిదర్శనం. ఆమెని  క్షేమంగా ఇల్లు చేరుస్తానని అభయమిస్తున్నట్టు ఆ మాటలున్నాయి. ప్రేమికుడి చేత సమయస్ఫూర్తితో ఇంతకంటే  ఏం పలికించాలి.  జూహీ క్షేమం కోరుకునే కుర్రాడు జూన్ హా అని ఎష్టాబ్లిష్ అయింది ఈ మాటలతో. 

           సీనుకో ‘కీ’  డైలాగు వుంటుంది మంచి సినిమాల్లో. ఆ  ‘కీ’  డైలాగు కథ గురించో క్యారెక్టర్ గురించో ఒక కొత్త సంగతి చెప్తుంది. ఆ ప్రకారంగా ఆ కథా లేదా పాత్రా సాగుతాయి. ఒక సీను ఉద్దేశం కథని ముందుకు నడిపించే అంశాన్ని లేవనెత్తడమో, లేదా క్యారెక్టర్ గురించి కొత్త విషయం చెప్పడమోగా వుంటుందని తెలిసిందే. 

          ఈ సీనులో దర్శకుడు ఆ ఒక్క డైలాగుతో ఆ రెండు కార్యాలూ  నిర్వహించాడు. ఆ  డైలాగు ఆమెకి అభయమిస్తున్నట్టుగా వుంటూనే, తిరిగి నది దగ్గరికి వెళ్ళబోతున్నారనీ తర్వాతి  సీనుకి లీడ్ ఇస్తోంది. 

          ఈ సీను డైలాగ్ ఎజెండా ఏమిటి, దేన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డైలాగులు రాశారు - అన్నవి పరిశీలించదగ్గ అంశాలు. సెటప్ నుంచి సెటిల్ సెగ్మెంట్ కి కథనం మారేక, ఈ సెటిల్మెంట్లో సరస సంభాషణ మొదలెట్టలేదు తెలుగు సినిమాల్లోలాగా. వాళ్ళిలా సెటిలవడంలోని మజా వాళ్ళ చర్యల్లో విజువల్ గా బయట పడిపోతోంది. అతను తుడుచుకోవడానికి షర్టు ఆఫర్ చేయడం, తినడానికి పుచ్చకాయ ఇవ్వడం వగైరా. ఇంకా ఇంకా దీని తాలూకు డైలాగులు అవసరం లేదు. వెర్బల్ కథనం అవసరం లేదు. వాళ్ళ  చర్యల సారం (సబ్ టెక్స్ట్) వాళ్ళ మధ్య పరిస్థితి ఏమిటో చెప్పేస్తోంది విజువల్ గా.  ఇప్పటికి వాళ్ళు ఇలా  కలిసిరావడం, కలిసి తిరగడం, కలిసి కూర్చోవడం అన్నీ కూడా మొదలవబోయే  వాళ్ళ ప్రేమలో భాగమేనని మనకి బాగా తెలిసిపోయింది. తెలిసిపోయిన  ఈ విషయం పాతబడిపోయింది. గత ఇరవై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ పది సెకెన్లే. పది సెకన్లకి మించి ఒకే  విషయమ్మీద దృష్టి  పెట్టి చూస్తూ కూర్చోలేరు. ఎప్పటికప్పుడు విషయం  మారిపోతూ వుండాలి. 

      కాబట్టి ప్రేమలో పడతారనే విషయం పాతబడి పోయాక ఇంకా దీన్నే వాళ్ళ మధ్య డైలాగులతో బాదుతూ కూర్చోనవసరం లేదు. ఒక సీన్లో దృష్టిలో పెట్టుకోవాల్సిన సూక్ష్మ అంశాలు చాలా వుండి చస్తాయి. వీటిని వివరించినా డిస్కషన్స్ లో అందరికీ అర్ధంకావు. అర్ధం గాకపోతే నమ్మరు. నమ్మకపోతే నమ్మిందే చేస్తారు. అందుకని అరగుండు సినిమాలు గుండు గుత్తగా వచ్చేస్తున్నాయి...ప్రేక్షకుడి వంద రూపాయల టికెట్టుకి సరిపడా పూర్తి స్థాయి కళా మెళకువలతో సినిమాలు అందించడం ఇహ వల్ల కాదు.

          ఈ సీనులో ప్రేమ గురించి మనకి తెలిసిపోయాక, ఇంకో కొత్త విషయం కావాలి. ప్రేక్షకుడ నుకుంటాడు- సరేనయ్యా, ఇంతసేపూ ప్రేమలో రకరకాల స్థితి గతులు చూపించావ్- వాళ్లిక ప్రేమలో పడతారని డిసైడ్ అయిపోయాం – దీన్తర్వాత ఏం జరుగుద్దీ చెప్పవయ్యా బాబూ, క్యారెక్టర్స్ ని ముందుకు తీసికెళ్ళి కాస్త చూపించవయ్యా బాబూ  - అని డిమాండ్ చేసి కూర్చుంటాడు.

          ఇదే సీను చివర డైలాగుతో తీర్చేశాడు దర్శకుడు.  వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామనీ, పడవెలాగో వస్తుందనీ హీరో చేత చెప్పించి. ఈ డైలాగు ప్రాముఖ్యమేమిటో పైన వివరించుకున్నాం. కాబట్టి హీరో పాత్రని ముందుకు తీసికెళ్ళి అతనేమిటో చెప్పించడం పూర్తి చేశాడు దర్శకుడు. ఈ హీరో ఇక హీరోయిన్ క్షేమం కోరుకునే కుర్రాడన్న మాట. 

          క్యారెక్టర్ కి సంబంధించి ఈ ‘కీ’  డైలాగుని మాత్రమే రిజిస్టర్ చేయడం సీన్ ఎక్స్ టెండెడ్ ఎజెండా అయినప్పుడు, సీను ప్రారంభాన్ని వేరే డైలాగులతో కలుషితం చేయకూడదు. వాటిలాగే ఈ ‘కీ’ డైలాగు కూడా గాలిలో కలిసిపోయే ప్రమాదముంది. 

          ఇక లాంగ్ షాట్ లో మంచెమీద వీళ్ళు కూర్చుని వుండగా, వర్షం వెలసి  ఇంద్రధనుస్సు  కన్పించడం థీమాటికల్ గానూ వుంది, తర్వాతి సీనుకి అర్ధవంతమైన ట్రాన్సిషన్ గానూ వుంది. ఇంద్రధనుస్సు డిజాల్వ్ అయి మసక చీకట్లు ముసురుకుంటూ  తారలు వెలుస్తాయి.
(ఇంకా వుంది)

సికిందర్

4, మే 2018, శుక్రవారం

643 : స్క్రీన్ ప్లే సంగతులు



          విదేశీ సంస్కృతా అనుకుంటాం గానీ, ఆ విదేశీ సంస్కృతుల్లోనూ మనం ఫీలయ్యే విలువలు కన్పిస్తాయి. ముఖ్యంగా విలువలతో కూడిన కళలు, సినిమా. జీవితంలోంచి పుట్టించే కళలు, సినిమాలు. జీవితంలో అనుభవమైన  ప్రవర్తనలు, ప్రేమలు, భావోద్వేగాలు, సంబంధాలు వగైరా. కొరియన్ దర్శకుడు క్వాక్ జే యంగ్ 1989 లోనే ‘వాటర్ కలర్ పెయింటింగ్ ఇన్ ఏ రేనీ డే’ తో దర్శకుడుగా రంగప్రవేశం చేసి విజయం సాధించినా, ఆ  తర్వాత తీసిన రెండు సినిమాలూ అపజయాల పాలవడంతో ఎనిమిదేళ్ళూ తెరమరుగైపోయాడు. 2001 లో అతడికి 42 ఏళ్ళు. అప్పుడు తీసిన ‘మై సాసీ గర్ల్’ అనే క్రేజీ రోమాంటిక్ కామెడీతో సంచలన దర్శకుడైపోయాడు. దక్షిణ కొరియాలో ఇది ఆ సంవత్సరం రెండో టాప్ మూవీగా రికార్డు సాధించింది.  దీంతో ఇతర దేశాల్లో దీని రేమేకుల, ఫ్రీ మేకుల పరంపర మొదలయింది. హాలీవుడ్ లో ఇదే పేరుతో 2008 లో రీమేక్ చేస్తే హిట్టయ్యింది. అదే సంవత్సరం బాలీవుడ్ లో  ‘అగ్లీ ఔర్ పగ్లీ’ అని రీమేక్ చేస్తే హిట్టయ్యింది. చైనా, జపాన్, రష్యా, హంగేరీల లోనూ రీమేకులు హిట్టయ్యాయి. నేపాల్ లోనూ ‘సానో సంసార్’ గా హిట్టయ్యింది. ఇక టాలీవుడ్ లో ఎంత ఫ్రీమేకులు చేసినా హిట్టయ్యే మాటే వుండదు కాబట్టి, 2006 లోనే  ‘మా ఇద్దరి మధ్య’  అని తీస్తే ఫ్లాపయి కూర్చుంది ఆనవాయితీ  ప్రకారం. ‘మై సాసీ గర్ల్’ ని 2016 లో ‘మై న్యూ సాసీ గర్ల్’ గా వేరే కొరియన్ దర్శకుడు రీమేక్ చేస్తే ఫ్లాపయ్యింది. 

         
2003 లో దర్శకుడు క్వాక్ ‘ది క్లాసిక్’ తీశాడు. క్రిందటిది రోమాంటిక్ కామెడీ అయితే, ఇది జానర్ మార్చి  పూర్తిగా రోమాంటిక్ డ్రామా. ఈ సంవత్సరం జనవరిలో అతనిచ్చిన తాజా  ఇంటర్వూలో ఇలా చెప్పాడు – మెలోడ్రామా అంతరిస్తున్న జానర్ గా  స్ట్రగుల్ చేస్తోంది. ఒకప్పుడు హాలీవుడ్ ప్రేమ సినిమాలు తెగ చూసే వాణ్ణి.  నా యూత్ లో అవి నన్నుకట్టి పడేసేవి. ఇప్పుడా మెలోడ్రామాలు లేవు.  మెలోడ్రామాల మీద పెట్టు బడులు పెట్టే నిర్మాతలు లేరు.  అందరూ సైన్స్ ఫిక్షన్ ఆర్భాటాలు, హత్యలు, కుట్రలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్లూ తీసే నిర్మాతలే వస్తున్నారు. కానీ అమెరికా ఇవతల చూస్తే ఇంకో దృశ్యం కన్పిస్తుంది. మా తూర్పు  ఆసియా వాసులం ఇంకా మెలోడ్రామాలూ, కంట తడిపెట్టించే ఎమోషన్లూ అంటే పడిచస్తాం. నన్ను ఓల్డ్ ఫ్యాషన్డ్ వ్యక్తి ననుకున్నా ఫర్వాలేదు. కానీ మెలో డ్రామాలు మన పాత సంస్కృతుల, సాంప్రదాయాల చిహ్నాలవల్ల , స్మరణల వల్ల చాలా లాభపడతాయి. అవి ఇంకో కాలపు జ్ఞాపకాలని తట్టి లేపుతాయి. ఆ జ్ఞాపకాల్ని ప్రేక్షకులు షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా, అవి మనందరిలో భాగమే కాబట్టి సామూహికానుభవానికి లోనవుతాం... 

         ‘ది క్లాసిక్’ ఈ అనుభవాన్నే ఇస్తుంది. కొరియన్ ప్రేక్షకులు తమ నిజమైన సాంస్కృతిక, సంప్రదాయ విలువల్ని ఉటంకించిన ‘క్లాసిక్’ కి  దాసోహులైపోయారు. దక్షిణ కొరియా ప్రజలు విద్యాధికులు. చిల్లర సినిమాలు తీస్తే తిప్పి కొడతారు. ఈ సినిమా తట్టిలేపిన పాత స్మృతుల మజా ఎంతంటే, తమ జీవితాల్లోని జ్ఞాపకాలే ప్రత్యక్షంగా కళ్ళముందు పురులు విప్పుకున్నంత.  

          మరొకటేమిటంటే, పేసింగ్ విషయంలో పన్నిన వ్యూహం. సీన్లు వేగంగా కదుల్తూనే, కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నప్పుడు మందకొడివైపోతాయి. మనల్ని ఆపి ఆలోచింపచేసేందుకు. సారాన్నంతా మొదలంటా జుర్రుకునేందుకు. ఒక్కోసారి ఈ సీన్లలో నేపధ్య సంగీతం కూడా వుండదు. విలువలు తెలియడమే కాదు, విలువల్ని ప్రెజెంట్ చేయడంలో కూడా దర్శకుడు ఒక అవగాహనతో కన్పిస్తాడు. 

          దీని ఘనవిజయం తర్వాత నుంచి 2018 వరకూ ఇంకో ఏడూ దర్శకత్వం వహించాడు, మరో నాల్గింటికి కథలందించాడు. వీటిలో రోమాంటిక్ డ్రామాలు, కామెడీలు, థ్రిల్లర్లు, సైన్స్ ఫిక్షన్లు వున్నాయి. తాజాగా ఈ సంవత్సరం  జనవరి 18 న ‘కలర్స్ ఆఫ్ ది విండ్’ రోమాంటిక్ డ్రామా విడుదలైంది. ఇందులో గర్ల్ ఫ్రెండ్ చనిపోతూ, తనలాగే వున్న అమ్మాయి ఫలానా వూళ్ళో వుందని, అన్వేషించమని బాయ్ ఫ్రెండ్ ని పురిగొల్పుతుంది. ఇది కూడా సున్నిత డ్రామా. ఈ డ్రామా ‘ది క్లాసిక్’ లో కూడా ఎలా వర్కౌట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం...

సీన్ :
   తోటలో పాత పుస్తకాలు  సర్దుతూంటుంది టీనేజీ జీ హై. వాటిని ఎత్తుగా పేర్చుకుని ఇంట్లోకి వస్తుంది. రూంలోకి రాగానే కిటికీ మీద దృష్టి పడుతుంది. కిటికీ అద్దాలవతల మూడు పావురాలు కూర్చుని వుంటాయి. అలా చూస్తూంటే చేతిలో పట్టుకున్న పుస్తకాలు జారి పడి పోతాయి. వాటిని పట్టించుకోకుండా ఆసక్తిగా కిటికీ వైపే చూస్తూ కదుల్తుంది... ‘నా చిన్నప్పుడు  పేద్ద ఇంద్రధనుస్సు చూసింది గుర్తుంది నాకు నదీ తీరాన...’ అని వాయిసోవర్ వస్తూంటే, వచ్చి కిటికీ అద్దాలు పైకి లేపుతుంది. అక్కడున్న పావురాల్ని తరిమి కొడుతుంది. ఆకాశంలోకే అలా చూస్తుంది. పెద్ద ఇంద్రధనుస్సు కనబడుతుంది.... ‘అప్పుడు మా మదర్ చెప్పింది...ఇంద్రధనుస్సు స్వర్గానికి ద్వారమని...మరణించిన వారు ఆ ద్వారంలోంచి స్వర్గానికి పోతారనీ...’ అంటూ  మళ్ళీ వాయిసోవర్ వస్తుంది. 

         వచ్చి పుస్తకాలు  తీస్తూంటుంది. పావురాలు వచ్చి మళ్ళీ కిటికీ లో కూర్చుంటాయి... ‘నా చిన్నప్పుడే నాన్న పోయాడు. అమ్మ విదేశాల కెళ్ళింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలా చెప్పాను, విన్పించుకోలేదు...’  వాయిసోవర్ మీద  పుస్తకాలన్నీ పేర్చుకుని లేస్తూంటే మళ్ళీ కింద పడిపోతాయి. చిరు కోపంతో చూస్తుంది.

         ‘నా పేరు జీహై, నా బ్లడ్ గ్రూపు ‘ఓ’... నా ఏడేళ్లప్పుడే టెక్వాండో నేర్చుకోవడం మొదలెట్టా...’ వాయిసోవర్ కి దృశ్యం పడుతుంది- టెక్వాండోలో ఒకణ్ణి కొడితే ముక్కులోంచి రక్తం కారుతుంది.

          దృశ్యం పూర్తికాగానే,  పుస్తకాలు సర్దడం మొదలెడుతుంది. వాటిని అలమారలో పెట్టి మూస్తుంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు అలమార తెరుస్తుంది. అక్కడొక పెట్టె వుంటుంది... ‘దీంట్లో నా పేరెంట్స్ ఉత్తరాలూ డైరీలూ వున్నాయి...ఇవి చదివినప్పుడల్లా అమ్మ ఏడ్చేది...’ వాయిసోవర్ కంటిన్యూ అవుతూంటే పెట్టెని అందుకుంటుంది. దాన్ని వొళ్ళో పెట్టుకుని కూర్చుని, వూదగానే గుప్పుమని  దుమ్ములేవడంతో దగ్గొచ్చి దగ్గుతుంది.

          పెట్టెని టీపాయ్ మీద పెట్టి తెరుస్తూంటే, ‘మా అమ్మ తొలి ప్రేమ ఇందులో వుంది...’ అని వాయిసోవర్. ఒక కవరు లోంచి ఉత్తరం తీసి చదువుతూంటే ఫోన్ మోగుతుంది. రిసీవ్ చేసుకోవడానికి అవతలి గదిలోకి వెళ్తే కిటికీ లోంచి గాలి వీచి, పెట్టెలోని ఉత్తరాలన్నీ ఎగిరిపోతాయి. వాటి కిందున్న ఒక డైరీ పేజీలు  రెప రెప లాడుతూంటాయి.

      అవతల ఫోన్లో ఫ్రెండ్ మాటలు వింటుంది జీహై – ‘సాంగ్ మిన్ తో ఆర్ట్ మ్యూజియంకి వస్తావా?’ అని. జీహై ముఖకవళికలు మారిపోతాయి, ‘నన్నెందుకు ట్యాగ్ చేస్తున్నావ్?’ అంటుంది సీరియస్ గా.  సాంగ్ మిన్నే రమ్మన్నాడని చెప్తుంది ఫ్రెండ్. విచారంగా చూస్తుంది జీహై.... ‘సాంగ్ మిన్  కి ఈమెయిల్ లెటర్స్ రాయమని ఒక రోజు నన్నడిగింది  సూ క్యుంగ్....’ అనే వాయిసోవార్ తో  దృశ్యం పడుతుంది – కంప్యూటర్ లో జీహై  లెటర్ టైపు చేస్తూంటే వాయిసోవర్ – ‘రెండు నెలలు సూ క్యుంగ్ కోసం లెటర్లు రాశా...’  అని.

          అక్కడే సూక్యుంగ్ వుంటుంది సూచనలిస్తూ...
          (సమాప్తం)

పాయింట్ :         మొత్తం ఐదున్నర నిమిషాల ఒకే సీను ఇది. ఇందులోనే రెండు మాంటేజీలు. ఇది ప్రధాన కథ. ఇందులో జీహై ప్రధాన పాత్ర, ఈ ప్రధాన కథలో ఈ సీను బిగినింగ్ విభాగంలో భాగం. బిగినింగ్ విభాగపు  బిజినెస్ ప్రకారం, ఈ ఒక్క సీనులోనే ప్రధాన పాత్ర  జీహై పరిచయమైపోయింది. ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి విదేశాల కెళ్ళింది ప్రస్తుతం. తను ఏడేళ్ళప్పుడే  టెక్వాండో నేర్చుకుంది. తన బ్లడ్ గ్రూప్ ‘ఓ’ – అంటే తనది మంచి ఆత్మ విశ్వాసంగల పర్సనాలిటీ. స్వయం నిర్ణయాధికారం గలది. సిక్స్త్ సెన్స్ కూడా ఎక్కువ. ఇదంతా టెక్వాండో లో ఆమె ఇచ్చుకునే మాంటేజ్ షాట్ లో బయటపడుతుంది. అంటే, ఆమె ఫలానా ఇలాటిదని చెప్పి వదిలెయ్యకుండా, సీను వేసి చూపించాడు దర్శకుడు. ‘రంగస్థలం’ లో ఒక పాటలో, ‘వినపడేట్లు కాదురా, కనబడేట్టు కొట్టండెహె’ అని అరుస్తాడు. అలాగే  సినిమా అంటే వినపడేట్లు చేయడం కాదు, కనబడేట్టు సీనెయ్యడం!  

          హీరోయిన్ కి  సూక్యుంగ్ అనే ఫ్రెండ్ వుంది. ఆమెకి సాంగ్ మిన్ అనే బాయ్ ఫ్రెండ్ వున్నాడు. ఇలా హీరోయిన్ జీహైతో  బాటు ముక్కోణ ప్రేమలో సాంగ్ మిన్ అనే హీరో, సూక్యుంగ్ అనే సెకండ్ హీరోయినూ పరోక్షంగా పరిచయమై పోయారు. 

     ఇక బిగినింగ్ విభాగపు బిజినెస్ లో భాగంగా వచ్చే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కూడా ఈ మొదటి సీనులోనే ప్రారంభమైపోవడం గొప్ప క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే బ్రెవిటీయే. సీన్లకి సీన్లు లొట్టపీసు సీన్లు వేయకుండా సంక్షిప్తతని సాధించే వాడే ప్రేక్షకుల పాలిట పుణ్యాత్ముడు. ఫ్రెండ్ సూక్యుంగ్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు, జీహై ముఖభావలు గమనించినప్పుడు తను సాంగ్ మిన్ ని ప్రేమిస్తున్నట్టు అర్ధమైపోతుంది. కానీ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాక డైలమాలో పడింది. ఇక్కడ మాంటేజీ కూడా వేసి ఫ్రెండ్ కోసం ఉత్తరాలు రాస్తున్న పరీక్షని కూడా ఎదుర్కొంటున్నట్టు చూపించాడు దర్శకుడు. 

          ఇలా మొదటి సీనుతోనే ప్రధాన కథ పాయింటులోకి తీసి కెళ్ళిపోయాడు దర్శకుడు. ఇక ఈ విభాగం మరో బిజినెస్ అయిన కథా  నేపధ్యంకూడా చూపించేశాడు. ఇది తల్లి ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో కూతురి ప్రేమ కథ అని. దీంతో ఈ ప్రేమ కథ జానర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు ఇది రోమాంటిక్ డ్రామా అనే విధంగా. ఈ జానర్ మర్యాదని పాటిస్తూ, ఈ సీనంతా ఒక పవిత్ర భావం ద్యోతకమయ్యేలా చిత్రీకరణ చేశాడు. పింక్ కలర్ టింట్ లో ఇంటీరియర్ సెట్టింగ్,  కిటికీ బయట ఆహ్లాదకర వాతావరణం. మంద్రంగా మీటుతూ సంగీతం. హీరోయిన్ ప్రతి కదలికా, చేతా, ముఖభావాలూ సున్నితత్వం, సౌకుమార్యం, అమాయకత్వమూ ఉట్టిపడేలా మంద్రంగా.  మందాకినిలా అనుకుందాం. మాంటేజీలు వేసినప్పుడు కూడా స్మూత్ ట్రాన్సిషన్ కి వాయిసోవర్ నే వేసుకున్నాడు. దీంతో నడుస్తున్న సీనులో వున్న పవిత్రభావం  డిస్టర్బ్ అయినట్టే కన్పించదు. ఇదే రోమాంటిక్ కామెడీ జానర్ అయితే చిత్రీకరణ ఇలా వుండదు. స్పీడుగా అల్లరల్లరిగా వుంటుంది. ఈ అల్లరిలో ఒక్క సీనులో పొందికగా, ఒద్దికగా ఇన్ని సంగతులు చెప్పడం కుదరదు. సీన్లకి సీన్లు లొట్టపీసు సీన్లు వేసుకుంటూ వుండడమే.  

      ఇప్పుడు ఈ మొదటి సీనులో చెప్పుకొస్తున్న ప్రధాన కథలోనే దాచి పెట్టి,  ఫ్లాష్ బ్యాక్ కథకి హింట్స్ కూడా ఇస్తున్నాడు దర్శకుడు. ఈ లేయర్, ఈ డెప్త్ కూడా గమనించాలి.
ఇంట్లోపాత పుస్తకాలు  గడచిన కాలానికి గుర్తులు. అంటే హీరోయిన్ తల్లి తాలూకు గతం అన్న మాట. ఆ గతాన్ని భారమైన పుస్తకాలుగా లేత చేతుల మీద మోసుకుంటూ ఇంట్లోకొచ్చింది. చిందర వందరైన తల్లి గతాన్ని పేర్చి,  ఇంట్లోకి తెచ్చి  స్థానం కల్పిస్తున్న అర్ధంలో. ఇంట్లోకొచ్చి ఆ పుస్తకాలన్నీ జారవిడిచేసింది. కిటికీలో మూడు పావురాల్ని చూసింది. ఆ పావురాలు సింబాలిజమ్స్. దేనికి సింబలిజమ్స్? గతంలో తన అమ్మకీ, ఆమెతో ఇద్దరబ్బాయిలకీ సింబాలిజమ్స్. అదే సమయంలో ఆమె కిటికీ లోంచి కన్పిస్తున్న ఇంద్రధనుస్సుని చూసింది. అటు వైపు కదిలింది. కిటికీ అద్దాలు ఎత్తింది. అక్కడున్న పావురాల్ని తరిమేసింది. పావురాల్ని చీదరగా తరిమేయడమేమిటి? అంటే ఆ పావురాలు  డిస్టర్బ్ అయిన పాత ప్రేమలకి గుర్తులని హింట్ ఇస్తున్నాడు దర్శకుడు. ఆమె ఇంద్రధనుస్సుని చూడడం, చనిపోయిన వారు ఇంద్రధనుస్సు గుండా స్వర్గానికి వెళతారని తల్లి చెప్పింది గుర్తు చేసుకోవడం...వూరికే కాదు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో మనం చూడబోయే  ముగింపే.  హీరోయిన్ తండ్రి మరణించినట్టు ఎలాగూ మనకిప్పుడు  తెలిసింది, ఇక ఆ రెండో అబ్బాయి కూడా చనిపోయాడా? వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్లిపోయరా? లేకపోతే, చనిపోయిన వాళ్ళు ఇంద్రధనుస్సు గుండా ... అని అంత ప్రత్యేకంగా తల్లి చెప్పడమెందుకు? 

          ఈ ఇంద్రధనుస్సే ఫ్లాష్ బ్యాక్  ముగింపులోనూ వస్తుంది! ప్రధాన కథ ప్రారంభంలో ఈ ఇంద్ర ధనుస్సు, ఫ్లాష్ బ్యాక్ ముగింపులో ఇంద్ర ధనుస్సు-  తల్లికథ, కూతురు కథలకి ఇంద్రధనుస్సులతో ఒక ముడి. 

          అలాగే రెండవ మాంటేజిలో,  సెకెండ్ హీరోయిన్ కోసం హీరోయిన్ లవ్ లెటర్ టైపు చేస్తున్నప్పుడు, సెకెండ్ హీరోయిన్ చికెన్ పీస్ ని కసాపిసా నమిలి తింటుంది. అంటే న్యాయంగా హీరోయిన్ కి దక్కాల్సిన ప్రేమని అలా నమిలేస్తోందన్న మాట! 

      ఆమె పెట్టె లోంచి ఉత్తరం తీసి చదవబోయింది. ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాకపోతే ఆ ఉత్తరాలన్నీ చదువుకుంటూ కూర్చునేదేమో... ఫోన్ రావడంతో వెళ్ళడంతో, ఇక్కడ గాలికి ఉత్తరాలన్నీ కొట్టుకుని పోయాయి. అడుగున డైరీ బయట పడింది...ఆమె చదవాల్సింది ఇదీ అని గాలికి పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి... 

          ఇలా ఏకకాలంలో రెండు కాలాల ప్రేమ కథలకి అంకురార్పణ చేసిన సీన్ క్రియేషన్ ని ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించేస్తాడు. ఆ మత్తు వీడి పోలేరు ఇక ప్రేక్షకులు.

(ఇంకా వుంది)

సికిందర్

          (నోట్ : నియోనోయర్ థ్రిల్లర్ ‘బ్రిక్’, సర్క్యులర్ థ్రిల్లర్ ‘ట్రయాంగిల్’ ల గురించి రాయడం తలపెట్టి ఆపేయాల్సి వచ్చింది. కారణం, థ్రిల్లర్స్ పట్ల తెలుగులో ఆదరణ కన్పించకపోవడమే. ప్రేక్షకుల్లో కాదు, మేకర్స్ లో. ప్రేక్షకులకి కాస్త వెరైటీ నివ్వాలని మర్చిపోయినట్టున్నారు. దగ్గర దగ్గర రెండు దశాబ్దాలుగా స్టార్ మూవీస్ కైతే యాక్షన్ కామెడీలు, స్మాల్ మూవీస్ కైతే రోమాంటిక్ కామెడీల కాలాన్ని ఇంకా సాగదీస్తున్నారు.  కాబట్టి థ్రిల్లర్స్ గురించి రాయడాన్ని పక్కన పెట్టేశాం. అప్పుడప్పుడు ఒకరిద్దరు గుర్తు చేస్తూంటారు. గత సంవంత్సరం నియోనోయర్ ‘బ్లడ్ సింపుల్’ గురించి రాస్తే కూడా ఒకరిద్దరే ఆసక్తి చూపారు. కనీసం ఆ ఒకటి పక్కన సున్నా పడ్డా రాయవచ్చు. ఆ సున్నా కోసం ఎదురుచూద్దాం. ఒకటి పక్కన సున్నా = 10 మంది).