రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

22, అక్టోబర్ 2016, శనివారం

రివ్యూ!





రచన – దర్శకత్వం : పూరీ జగన్నాథ్

తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్‌, జగపతిబాబు, అదితీ  ఆర్య,
వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, అలీ, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ముఖేష్  జి.
బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, నిర్మాత: నందమూరి కల్యాణ్‌ రామ్‌
విడుదల : అక్టోబరు 21, 2016
***
   నిర్మాత –నటుడు కల్యాణ్ రామ్  మరోసారి అదృష్ట పరీక్షకి నిలబడ్డారు- ఈసారి నిలబడి తీరాలన్న దృఢ చిత్తంతో-  సిక్స్ ప్యాక్ బాడీతో – ‘ఇజం’ అనే మోడర్నిజపు టైటిల్ తో- పూరీజగన్నాథ్ సౌజన్యంతో. ఎంత బడ్జెట్ అయినా వెనుకాడకుండా రిస్కు తీసుకునే కల్యాణ్ కి సక్సెస్ ఎందుకు రాదు- తప్పకుండా వస్తుంది, ధరించే పాత్రలో కూడా సిక్స్ ప్యాక్ అంత విషయమున్నప్పుడు. మరి ఈసారి ఏం జరిగింది? రిస్కు ని  తన పంచ్ డైలాగు ప్రకారం ‘డకింగ్’ చేయగల్గారా, లేక  తనే డకౌట్ అయ్యారా ఓసారి చూద్దాం....

కథ 
      సుల్తాన్ అనే పేరుతో కల్యాణ్ రామ్ అలియాస్ సత్యా మార్తాండ్ (కల్యాణ్ రామ్) తన సిక్స్ ప్యాక్ దేహదారుఢ్యంతో మొరాకో లోని  ఓ దీవిలో స్ట్రీట్ ఫైట్లు చేసి జీవనం గడుపుతూంటాడు. ఓ స్ట్రీట్ ఫైట్ సందర్భంగా అలియా ఖాన్ (అదితీ ఆర్య) అనే అమ్మాయిని చూడగానే మనసు పారేసుకుని వెంటపడతాడు. ఈమె బడా డాన్ జావేద్ ఇబ్రహీం (జగపతి బాబు) కూతురు. జావేద్ ఇబ్రహీం ప్యారడైజ్ బ్యాంకు  నడుపుతూ ఇండియాలోని నల్లకుబేరుల ధనం దాస్తూంటాడు. ఇండియాలో  ఇతడి ఏజెంటుగా కోటిలింగాల (పోసాని) అనే మంత్రి వుంటాడు. ఆలియా వెంటపడుతున్న సత్యా మార్తాండ్ (అసలు పేరు) ఆమె కన్పిస్తే తాళి  కట్టేస్తానని కూడా బెదిరిస్తూంటాడు. ఇతడి నస తండ్రికి చెప్పుకుంటుంది. ఇతణ్ణి  చంపమని గ్యాంగ్ కి చెప్తాడు. అసలు తనని కలుస్తూ కబుర్లు చెప్తున్న కల్యాణ్ రామ్ అనే బీడీ ఫ్రెండే తన కూతుర్ని వేధిస్తున్న రోమియో అని జావేద్ కి తెలీదు. పైగా డబ్బున్న వాళ్ళ కూతుళ్ళని ఎలా ప్రేమించాలో చిట్కాలు కూడా చెప్తూంటాడు. ఓ పెళ్ళిళ్ళ ఏజెంట్ (అలీ) కి చెప్పి కూతురికి సంబంధాలు చూస్తూంటాడు. ఓ పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఇంట్లోకి జొరబడి జావేద్ లాప్ టాప్ ఎత్తుకు పోతాడు సత్య. ఇక తనని కలుస్తున్న కల్యాణ్ రామే సత్య అని జావేద్ కి తెలిసిపోతుంది. అంతే కాదు, ఈ సత్య తన బ్యాంకుని  కొల్లగొట్టేందుకు వల పన్ని వచ్చిన ‘గ్రాండ్ లీక్స్’ అనే అజ్ఞాత వెబ్సైట్ నడుపుతున్న జర్నలిస్టు అని కూడా తెలిసిపోతుంది... ఇక సత్య తన బ్యాంకు కొల్లగొట్టకుండా, లక్షలాది కోట్ల నల్లధనం ఇండియాలో ప్రజలకి పంచకుండా అడ్డుకోవడానికి ఇప్పుడు జావేద్ ఏమేం చేశాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఈ మధ్య వీకీ లీక్స్ అంటూ, పనామా పేపర్స్ అంటూ నల్ల కుబేరుల బండారాలు పడుతున్న  సంగతి  తెలిసిందే. ప్రభుత్వం కూడా విదేశాల్లోని నల్లధనం తెచ్చి ఇండియాలో తలా ఇరవై లక్షలు పౌరుల జేబుల్లో కుక్కి  చక్కిలిగింతలు పెడతానని అంటున్న- లేదా అనేసి మరచిపోతున్న విషయం కూడా తెలిసిందే. తీరా చూస్తే తేలిందేమంటే- ఆ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం స్వచ్ఛ భారత్ చేసి పూచిక పుల్ల సహా వూడ్చేసి  తీసుకురావాలన్నా కూడా అదసలు నల్లధనమని ముందు రుజువు చెయ్యాలి ప్రభుత్వం. రుజువు చెయ్యాలంటే కింది కోర్టుల నుంచీ పై సుప్రీం కోర్టు దాకా ఈ ‘నల్ల’ ఖతాదార్లతో ఇన్ కం టాక్స్ శాఖవాళ్ళు  ఎంతకాలం కొట్లాడుతూ కూర్చోవాలో తెలీదు. ఎన్నేళ్ళూ, ఎన్ని యుగాలూ పడుతుందో తెలీదు. ఎన్ని కేసులు రుజువవుతాయో కూడా తెలీదు. పైగా ఇంకో తిరకాసుంది- దొంగా దొంగా అంటూంటే దొంగేమైనా దోచిన సొత్తు దగ్గర వుంచుకుంటాడా? ఆ విదేశీ బ్యాంకుల్లోంచి  నల్లకుబేరులు తమతమ నల్లధనాల్ని ఎప్పుడో తరలించేసుకుని - నల్లతనాల్ని చెరిపేసుకుని తెల్లగా మారిపోయారు. తెల్లధనంగా ఆ సొమ్మంతా విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి స్వదేశంలోకే దింపి రియల్ ఎస్టేట్ రంగాన్ని దివ్యంగా వెలగబెడుతున్నారు! ఇలా డిమాండ్ కి మించిన భవనాలు నిర్మించేస్తూంటే అవి ఖాళీగా పడి ఉంటున్నాయి, ఐనా వాళ్లకేం నష్టం. 

        ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి ఆ బ్యాంకుని హ్యాకింగ్ చేసి నల్లధనమంతా తెచ్చి క్లయిమాక్స్ లో దేశ వ్యాప్తంగా ప్రజలకి తలా ఇంత పంచి చక్కిలిగింతలు పెట్టడానికి - ఎక్కడ్నించి వస్తుందని? తమ ఖాతాల్ని  నల్ల ఖతాదార్లు ఎప్పుడో తామే ‘హ్యాకింగ్’ చేసుకున్నారు పూరీ కంటే ముందే. ఇంకా జనాలకి- పోనీ ప్రేక్షకుల్ని ఆ డబ్బింకా స్విస్ బ్యాంకుల్లోనే వున్నట్టు ఎలా నమ్మిస్తారు. అక్కడి నల్లధనం చక్కగా తెల్లధనంగా  మారిపోయి ఇండియాకే విదేశీ పెట్టుబడులుగా వెనక్కి వస్తోందిగా - ఎందరికో ఉపాధి కూడా  కల్పిస్తూ. 

        ఇంత విశాల కాన్వాస్ వున్న ఓ సామాజిక అంశాన్ని పూరీ తెర కెక్కించే ముందు వాస్తవాల్ని  చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి రాజకీయ, సామాజిక స్పృహ కొంచెం ఎక్కువే. ఏ స్పృహా వుండని రొటీన్ మసాలా సినిమాల్ని ఎన్నైనా సహిస్తారు గానీ, ఇలాటి తప్పుడు సమాచారంతో నిజం లేని ‘ఇజం’ ని కూడా హజం చేసుకుంటారులే అని తక్కువ అంచనా వేయడం తొందరపాటు తనమే అవుతుంది. 

 ఎవరెలా చేశారు?
      కల్యాణ్ రామ్ ఈ సినిమా స్వయంగా నిర్మించి ఎంత లాభ పడినా పడకున్నా నటనలో మాత్రం మంచి శిక్షణ పొందడానికి ఈ సినిమా అవకాశం కల్పించింది. శిక్షకుడు పూరీ జగన్నాథ్ కల్యాణ్ ని నటనలో ఉత్తమ విద్యార్థిగా తీర్చి దిద్దారు. డైలాగులు పలికించడంలోనేమి, కత్తిలానటింపజేయ
డంలోనేమి కల్యాణ్ కెరీర్ ని నిత్య కల్యాణం పచ్చ తోరణం చేశారు పూరీ. కాకపోతే పాత్రే, పాత్ర చిత్రణే వాస్తవ దూరంగా ఉండాల్సి వచ్చాయి. కోర్టు సీనులో కల్యాణ్ భావావేశం, వాక్పటిమ తన పాత్ర సిక్స్ ప్యాక్ దారుఢ్యంతో సింక్ కాకపోవడం- కథలో చివరికొచ్చేసరికి తను సిక్స్ ప్యాక్ అన్న సంగతి మర్చిపోవడం వల్ల జరిగిందేమో. కోర్టు సీన్లకి ఇంకా నందమూరి వంశానిదే పెట్టింది పేరని చెప్పొచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఆ మధ్య జ్యూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు కల్యాణ్ రామ్. అయితే కల్యాణ్ రామ్ కోర్టు సీను నటన ఫరవా లేదనిపించినా విషయపరంగా ఈ సీనుకి, ఇందులోని పూరీ రాసిన డైలాగులకీ చోటెంతన్నది ప్రశ్న. కథే దేశంలోని అవాస్తవాల మీద అల్లినప్పుడు అందులోని సమస్తం  అప్రస్తుతమే అయిపోతాయి కూడా ఆటోమేటిగ్గా. 

        హీరోయిన్ అదితీ ఆర్య ఆదితీ అగర్వాల్ ముఖకవళికలతో వుంది. ఆమెకి పెద్దగా నటించే అవసరమే రాలేదు. పూరీ హీరోయిన్ కి నటనతో పనేమిటి.  ఉడుక్కో గలిగితే, సణుక్కో గలిగితే, తిట్టుకో గలిగితే, విరుచుకు పడగలిగితే చాలు- క్యారక్టర్ కవరై పోతుంది. 

        జగపతిబాబుది కిల్ అయిన పాత్ర. ఇంతటి కథకి తన విలన్ పాత్ర ఎలా వుండాలి. జోకర్ గా మారిపోయి చివరికి విలనే కాకుండా పోయింది పాత్ర. హాలీవుడ్ లో, కొంత వరకు బాలీవుడ్ లో ఎలా వుంటుందంటే నటులు స్క్రిప్టు పంపించమంటారు. ఆ స్క్రిప్టు చదివి కథతో బాటు, ఇతర పాత్రలతో  ఇంటరాక్షన్ తో బాటు,  తమ పాత్రని ఫాలో అయి, దాని సమగ్రతని బేరీజు వేసుకుంటారు. తేడా వుంటే సరిదిద్దమంటారు. తెలుగులో నటులు స్క్రిప్టు అడగరు. ఇచ్చినా చదవరు. చదవడం, రాయడం అన్నవి చాలా లో - క్లాస్ యాక్టివిటీస్.  ఆ పూటకి సీ ను పేపరు చూసి నటించి వెళ్ళిపోవడమే.  పాత్ర సౌష్టవం, సమగ్రత, ట్రావెల్ ఎలా ఉన్నాయనేది అవసరమే లేదు. అందుకే ఇలాటి జావేద్ భాయ్ లాంటి క్యారెక్టర్ ల రూపంలో నటులు నీరసం తెప్పిస్తారు ప్రేక్షకులకి. పాత్రచిత్రణ తెలిసిన నటులు  తెలుగులో వున్నారో లేదో వెతుక్కోవాలి. 

        సినిమాలో ఇంకా చాలా పాత్రలున్నాయి. వాటి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. యాక్షన్ సీన్స్ బాగా కంపోజ్ చేశారు. కెమెరా వర్క్ బ్రిలియెంట్ గా వుంది. పాటల గురించి చెప్పాలంటే, ఈ థీమ్ లో వుండాల్సిన రకం పాటలు మాత్రం కావివి.


 స్క్రీన్ ప్లే సంగతులు  
      పూరీ సినిమాలకి షాట్స్ ప్లే వుంటుంది తప్ప స్క్రీన్ ప్లే ఏముంటుంది. ఆయన సరదాగా ఓల్డ్ స్కూల్ దర్శకుడు. ఎలాటి కథనైనా సరదాగా అదే ఓల్డ్  సీసాలో పోసేస్తారు. ఆయనకి బ్యాంకాక్ బీచిలో సీసా ఏదో దొరికివుంటుంది. అందులో సందేశమేదో ఆకర్షించి వుంటుంది (మెసేజ్ ఇన్ ది బాటిల్ లాగా - దీని మీద ‘శివమణి- 98480 22338’ అని సినిమా కూడా తీశారు).  అందుకే అక్కడి  బీచి కెళ్ళిపోయి ప్రతీ సినిమాకీ అంత సరదాగా పదిహేను రోజుల్లో స్క్రిప్టులు రాసేయ గల్గుతున్నారు. పదిహేను రోజుల్లో!! గిన్నీస్ లో చేరాల్సిన రికార్డ్!! ఆయనది లేజీ రైటింగ్ అనలేం గానీ, క్యాజువల్ రైటింగ్. క్యాజువల్ గా అలా అలా పైపైన ఏదో రాసేసుకుని తీసేస్తారంతే. మరి అంతే క్యాజువల్ గా ప్రేక్షకులు చూడాలిగా! క్యాజువాలిటీ వార్డులో చేరేంత పనవుతోంది. 

        కోన వెంకట్- గోపీ మోహన్ లని వుండే వాళ్ళు. వాళ్ళు అదే పనిగా ఒకటే సింగిల్ విండో స్కీమ్ పెట్టుకుని, ఏ సూపర్ స్టార్ వచ్చినా అందులోకే తోసి పారేసి-  సూపర్ స్టార్ గారు విలన్ గారింట్లో చేరి కామెడీ చేయుట అను బ్రహ్మనందపు ఆటగా ఆడించీ ఆడించీ, ఒక్క ప్లాట్ పాయింట్ టూ లాంటి దెబ్బకి సింగిల్ విండో మూసేసి వెళ్ళిపోయారు. పూరీ ఇంకా అదే ఓల్డ్ సీసాతో కొనసాగడమంటే  -క్లయిమాక్స్ దాకా వెళ్ళకుండా రేపోమాపో ఆ ప్లాట్ పాయింట్ టూ దెబ్బకి తనుకూడా దగ్గరవుతున్నట్టే.

        శంకర్ ‘భారతీయుడు’ తీయకుండా వుండి వుంటే ‘భారతీయుడు’ ని కూడా పూరీ ‘ఇజం’ లాగే తన సీసాలో పోసి తీసేస్తారు. భూమి బల్ల పరుపుగా వుందని ఆనాడెవరో నమ్మినట్టు, తను కూడా ఎలాటి కథనైనా బల్ల పరుపుగా చదును చేసేస్తారు. శంకర్ ‘ఇజం’ తీయాలనుకుంటే ఫ్యూచరిస్టిక్ జానర్ లోకి తీసికెళ్ళి 2050 లలో కథ స్థాపిస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు దీంతో కాలీన స్పృహ లేదు. బిగ్ కాన్వాస్ ని డిమాండ్ చేసే ఇలాటి హై కాన్సెప్ట్ సబ్జెక్టుని అంతే అద్భుత ప్రపంచంలోకి  తీసికెళ్ళి శంకర్ సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తారు. పూరీ విజన్ కి హైకాన్సెప్ట్, బిగ్ కాన్వాస్, ఉదాత్త కథా, మానమర్యాదలూ అనే ఉన్నత దృశ్యాలు అందవు. ‘ఈడియెట్’ కాడ్నించీ ‘ఇజం’ వరకూ అదే పాత మూస టెంప్లెట్ పెట్టుకుని అందులోకే భారత రామాయణాల్ని కూడా తోసేసి తన బ్రాండ్ టపోరీ కథలుగా మార్చేయగలరు. హీరోయిన్ ఏ పోలీస్ కమీషనర్ కూతురో, మాఫియా కూతురో, రాజకీయ నాయకుడి కూతురో అయివుండాలి; హీరో ఆవారా టపోరీగా ఉంటూ ఆమెని ప్రేమించమని వేధిస్తూ వుండాలి; ప్రేమించాక తానో అండర్ కవర్ ఏజెంటుగా బయటపడాలి; ఆ తర్వాత ఆమె విలన్ తండ్రితో ఆడుకోవాలి. ఏ సీరియస్ సామాజిక కథయినా కూడా ఈ డ్రామాలోకే సర్దుకోవాలి.  

        ‘ఇజం’ కథని భవనాలు కూలిపోతున్న విషయ గాంభీర్యంతో బ్రహ్మాండంగా ప్రారంభించారు. కానీ జర్నలిస్టు పాత్రకి కూడా అదే బాల్యం నాటి ఫ్లాష్ బ్యాక్, అందులోని అదే అన్యాయం అవసరమా. జర్నలిస్టనే వాడు తన గురించి కాక, సమాజం గురించి ఏదో ఫీలై జర్నలిస్టు అవుతాడు. ఆ తర్వాత తన గురించి ఫీలైపోయి నయూం లాంటి వాళ్ళతో నయా దందాలు చేసుకోవచ్చు దండాలు పెట్టుకుంటూ, అది వేరే విషయం. కానీ తన కేదో అన్యాయం జరిగిందని జర్నలిస్టు అయిపోడు. ఇజం జర్నలిజపు కథ ఒక వాస్తవంగా ఉందనుకుంటున్న సామాజిక సమస్యని డీల్ చేస్తున్నప్పుడు, అంతే వాస్తవికం గా డీల్ చేస్తే సరిపోతుంది. ఫ్లాష్ బ్యాకూ, టపోరీ వేషాలూ అవసరం లేదు. ఈ టపోరీ ప్రేమ కథని ప్లాట్ పాయింట్ అనేదే లేకుండా ఇంటర్వెల్ వరకూ సాగదీసి  ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ టైపు ఎండ్ సస్పెన్స్ కాని ఎండ్ సస్పెన్స్ కథనంతో నడపనవసరమే లేదు. సామాజిక కథ జానర్ మర్యాద ఇక్కడే తప్పిపోయింది. అసలు చివరి దాకా ప్రేమ కథ అనే సపరేట్ ట్రాకే జానర్ మర్యాదకి ప్రధాన దెబ్బ. ఇతివృత్తపు రసపోషణకి  పెద్ద అడ్డంకి.  సెకండాఫ్ లో కూడా ప్రధాన కథకి అడ్డుపడే - పదే పదే హీరోయిన్ ప్రేమ గోల తాలూకు ట్రాకు - ప్రధాన కథతో సంబంధం  లేకుండా పాటలూ - మాస్ ప్రేక్షకులకి కూడా చీకాకే.  

        ఫస్టాఫ్ లో ఎడతెగకుండా ఇంటర్వెల్ వరకూ గంటా అయిదు నిమిషాలూ, సెకండాఫ్ లో మళ్ళీ అడపాదడపా ఇంకో అరగంటా తినేసే టపోరీ ప్రేమకే ఇంత సమయం పోతే,  ప్రధాన కథకి మిగిలింది కేవలం 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల ‘కథ’ కి పూర్తి వందశాతం టికెట్ ధర చెల్లించుకుంటున్నారు  ప్రేక్షకులు. పదిహేను రోజుల్లో స్క్రిప్టు ఎలా  పూర్తయి పోతోందంటే ఇలాగే - ఓ అరగంటకి  మాత్రమే సరిపడా ప్రధాన కథ ఆలోచించి, ఇక ఆలోచించనవసరం లేని మిగతా భాగాన్ని తయారుగా వున్న బాటిల్లోంచి తీసి ఒంపెయ్యడం వల్లే.   

        అంత భారీ స్థాయిలో తమ బ్యాంకు హీరో కొల్ల గొడుతున్నాడని తెలిసీ వాడితో ప్రేమకోసమే  పారిపోయి రావడం, అదీ పిస్తోలు పట్టుకుని హైదరాబాద్ నగరంలో బాహాటంగా తిరగడం, ఎప్పుడో హీరో చెప్పి వున్న అతడి తల్లిపేరు పట్టుకుని ఆధార్ కేంద్రంలో అడ్రసు తెలుసుకుని ఇంటికి వచ్చెయ్యడం- (ఆ పేరు గల మనిషి నగరం మొత్తం మీద ఆమె ఒకత్తే వుందేమో. పోనీ ఇంటి పేరు కూడా తెలీదు దాన్నాధారంగా పట్టుకుందను కోవడానికి- అయినా ఆధార్  కేంద్రాల్లో ఇలా అడ్రసులు ఇచ్చేస్తారా) -  పిస్తోలుతో ఆ హీరో తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఆ ఇంట్లో మకాం పెట్టడమూ ఇదంతా- కేవలం ఈ సినిమా ప్రేమ కథే అయితే సరే గానీ, ఒక పెద్ద సామాజిక కథ ఇది. సమాజం కోసం హీరో ఏం చేస్తున్నాడో తెలిసి కూడా అతడి పక్షం వహించి అందులో పాలు పంచుకోకుండా, పిచ్చి ప్రేమంటూ తిరిగే పాత్ర బహుశా ఇంకే బాధ్యత గల సినిమాలోనూ వుండదేమో. 

        అసలీమె డాన్ కూతురే ఎందుక్కావాలి. హీరోతో బాటు పనిచేస్తున్న అజ్ఞాత జర్నలిస్టుల్లో ఒకత్తి ఎందుకు కాకూడదు. ఈ సినిమా ఏకత్రాటిపై, ఏకసూత్రత అనే బేసిక్ కథా లక్షణంతో ఒకే కథగా ఎందుకు వుండకూడదు. గంటా ముప్పయి  ఐదు నిమిషాల టపోరీ ప్రేమ కథగా కూడా ఎందుకుండాలి. 

        జావేద్ ఇబ్రహీం పాత్రని శంకర్ కిస్తే ఆయన పరమ కర్కోటకుడుగా ఆకాశానికెత్తేస్తాడు. పూరీ చేతిలో ఇది హాస్యాస్పదంగా తయారయ్యింది. పైగా హీరో తన బ్యాంకు పని బడుతున్నాడని తెలిసి కూడా ప్రధాన కథ వదిలేసి, ప్రేమ ట్రాకుని ‘పండించడం’ కోసం కూతుర్నివెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఆ బాపతు విలనిజంతో బిజీగా ఉంటాడు. హీరో హ్యాకింగ్ చేస్తూంటే ఆచూకీ తెలుసుకుని చంపించడానికి మనుషుల్ని పంపుతాడు. అంతేగానీ, హ్యాకింగ్ ని నిరోధించే టెక్నికల్ టీం అతడి అంత పెద్ద బ్యాంకులోనే వుండరు. మొదట హీరోయిన్ ఖాతా హ్యాకింగ్ జరిగిందని ఎలా చేతులెత్తేసి మొత్తుకుంటారో, ఆ తర్వాత సర్వర్ హ్యాకింగ్ అయి సొమ్ములు ఖాళీ అయిపోతున్నప్పుడు కూడా అంతే లబోదిబోమంటారు. 

        ఇంతకీ అలా ఖాళీ అయిన సొమ్ములు మన దేశవ్యాప్తంగా ప్రజల బ్యాంక్ ఎక్కౌంట్ లలో పడిపోయి- తండోపతండాలుగా  వాళ్ళ జేబుల్లో సెల్ ఫోన్లు డబ్బులు పడ్డ మెసేజిలతో ఠింగు ఠింగు మని  ఎలా మోగుతాయో అర్ధంగాదు. ఇది చూస్తున్న ఈ సమయంలోనే మన జేబుల్లో మొబైల్స్  కూడా ఇలా మోగివుంటే, ఓ ఇరవైలక్షలతో మనం కూడా కింగు లయ్యేవాళ్ళం కదా పూరీకి పూరాగా ప్రణమిల్లి. అప్పుడు ఈ రివ్యూ ఇలా రాసే బాధ కూడా తప్పేది. 

        జావేద్ భాయ్ కి హీరో డబ్బులు కొల్ల గొట్టేశాడన్న కసే లేదు, సరే నా కూతుర్ని తీసుకుపొమ్మంటాడు. హీరోకి కూడా ఈ జావేద్ భాయ్ తన ఫ్రెండ్స్ అయిదు గుర్నీ చంపించాడన్నపగే వుండదు. పాపం ఫ్రెండ్స్! ఇలా ‘కరీం బీడీ’ కామెడీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటైపోతారు, ఈసారి మామా అల్లుళ్ళుగా! దావూద్ ఇబ్రహీం- సారీ- జావేద్ ఇబ్రహీం అంటే పూరీకి అంత ప్రేమ ఎందుకో అర్ధం గాదు.

        ‘బిజినెస్ మాన్’ లో మాఫియా కార్పొరేటీ కరణ అంటూ నడిపిన ప్రహసనం ఎలా వుందో, అలాగే  వుంది ఈ బ్లాక్ మనీతో ఫార్సు కూడా. జర్నలిస్టు హీరోని అరెస్టు చేయవచ్చు గానీ, జర్నలిస్టు భావజాలాన్ని అరెస్టు చేయలేరన్నారు. ఏమిటా జర్నలిస్టు భావజాలం- అక్కడ స్విస్ బ్యాంకుల్లో నల్ల డబ్బే లేకపోయాక! వున్నా తీసుకొచ్చే వీలే లేనప్పుడు! ఈ నల్లధనం గురించి వివిధ మాంటేజీలు వేస్తూ తెర మీద వివిధ పత్రికల, మీడియా సంస్థల పేర్లేశారే- వాటిలో వున్న ఒక పత్రిక ‘అవుట్ లుక్’ మ్యాగజైన్ లోనే వుంది అసలు కథ! కాకతాళీయంగా ఈ మొత్తం వ్యవహారంపై ఓ పత్రిక్కి వ్యాసం కూడా రాసి ఇవ్వాల్సి వచ్చింది ఈ వ్యాసకర్త అప్పట్లో.

        హీరో హ్యకింగే చేస్తున్నప్పుడు నల్ల డబ్బు తెచ్చేందుకు కోర్టులతో చట్టాలతో పనేముందని అనొచ్చు. హ్యాకింగ్ చేయడానికి వాస్తవంగా అసలక్కడ అలాటి డబ్బే లేదన్నది అలా వుంచితే, హీరో చేసే హ్యాకింగ్ కి ఎథికల్ హ్యాకింగ్ అని నీతివంతమైన పేరెందుకు.  ఈ నైతిక ప్రహరీ వెనుక ఎందుకు దాక్కుంటున్నాడు హీరో. అతను చట్టాన్ని చేతిలోకి తీసుకున్న విజిలాంటీ జర్నలిస్టు అయినప్పుడు నేరాన్ని నిర్ద్వంద్వంగా నేరంతోనే కొట్టాలి- ‘డెత్ విష్’ లో విజిలాంటీ క్యారక్టర్ వేసిన చార్లెస్ బ్రాన్సన్ లాగా. అంతే కదా. పెద్ద పెద్ద పదాలు వాడినంత మాత్రాన, బిల్డప్పులిచ్చినంత మాత్రాన,  అర్ధవంతమైన ఇంటలెక్చువల్ కథ- పాత్ర అయిపోతాయా? అసలు చిన్నప్పుడే హీరో పంటికి పన్ను అన్నట్టు, తన తండ్రి కాలు విరగ్గొట్టిన వాణ్ణి పెట్రోలు పోసి తగలేట్టేశాడు కదా. అలాంటి సిక్స్ ప్యాక్ వయొలెంట్ విజిలాంటీకి ఇంకా ఎథికల్ హ్యాకింగ్ ఏమిటి- మొరాకోలోనే గొడ్డలి తీసుకుని బ్యాంకు బొక్కసాన్ని బద్దలు కొట్టెయ్యకుండా. 

      ఇక ‘జర్నలిజం ఇజం ఇజం ఇజం జర్నలిజం -దిస్ ఈజ్ పెట్రియాటిజం’ అంటూ పాట హోరెత్తించారు చివర్లో. ఈ సినిమా జర్నలిస్టులు చూడాలన్నా తమ వృత్తి గురించి గొప్పగా ఫీలవడానికి ఏమైనా వుందా. అలా కథ చెప్పారా.  ఒక్క సీనులో కూడా హీరోని జర్నలిస్టు కష్టాలతో చూపించలేదు, ఆ వృత్తినే చూపించలేదు, చూపించిందంతా టపోరీ ప్రేమా చిన్నప్పటి అన్యాయమూ. మళ్ళీ ఇందులో దేశభక్తిని గుర్తు చేయడమెందుకు, నిజాల్ని వెలికి తీస్తూనే అన్నేసి లక్షల పేజీల్ని అనునిత్యం నింపుతూనే వుంటారు జర్నలిస్టులు. ఆ నిజాల్ని ముందు పెట్టుకుని సరైన సమాచారంతో బాధ్యత గల సినిమా తీసి నిరూపించుకోవాల్సింది పూరీయే దేశభక్తిని! జానర్ మర్యాద అనేది అత్యవసరం ఇప్పటి రోజుల్లో. జానర్ మర్యాద పాటించిన ఆరేడు సినిమాలే నిలబడ్డాయి గతసంవత్సరం. ప్రేక్షకులు దేనికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారో చెప్పలేరు, దర్శకులే ఆ కనెక్షన్ ఏమిటో అర్ధం జేసుకోవాలి- ఇప్పుడు జానర్ మర్యాద అని! పూరీకి ఆ బాటిల్ వున్నంత కాలం ఇదెప్పుడూ ఆయన సాధించలేరు. ఆయన సబ్జెక్టులు తీయాల్సింది అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని నమ్ముకుని. అల్లావుద్దీన్ అద్భుత దీపమంటే తనలో వుండే సబ్ కాన్షస్ మైండే!



-సికిందర్




       




       






       

24, మార్చి 2020, మంగళవారం

922 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -3



        క్రైం థ్రిల్లర్ జానర్ (పోలీస్ డిటెక్టివ్) సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. వీటి కథాకథనాలెలా వుంటాయన్నది ప్రస్తుత విషయం. అన్ని జానర్ల కథాకథనాల నిర్మాణం ఒక్కటే : త్రీ యాక్ట్ స్ట్రక్చర్. బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలు. బిగినింగ్ ప్రారంభమే ఒక హత్యతో వుండొచ్చు. పోలీస్ డిటెక్టివ్ రంగ ప్రవేశం చేసి దాని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడు, ఓ అరగంట స్క్రీన్ టైంలో ప్లాట్ పాయింట్ వన్ వచ్చి బిగినింగ్ ముగియ వచ్చు. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో హంతకుడు రివీల్ అవచ్చు. ఇలా ఇక్కడ స్క్రీన్ ప్లే మిడిల్లో పడినప్పుడు, ఆ హంతకుణ్ణి పట్టుకునే కథ మొదలవచ్చు.
       
వ్యాసాలకి సంబంధించి అందిన కొన్ని సందేహల్లో, మిస్టరీ జానర్ ఎండ్ సస్పెన్స్ అయినప్పుడు, ఎండ్ సస్పెన్స్ కథనంతో వున్న ‘రాక్షసుడు’ అనే పోలీస్ థ్రిల్లర్ కూడా మిస్టరీ జానరే కదా, అది సక్సెస్ అయింది కదా, అలాంటప్పుడు పోలీస్ డిటెక్టివులని క్రైం థ్రిల్లర్ గా కాకుండా, మిస్టరీగానే తీయొచ్చు కదాని ఒక సందేహం అందింది. ముందుగా స్క్రీన్ ప్లే అంటే ఏమిటో శాస్త్రీయంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఈ శాస్త్రీయతని పాటించాలా వద్దా రైటర్స్ కి / మేకర్స్ కి వదిలేద్దాం. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నట్టు, విజువల్ మీడియా అయిన సినిమాలకి ఎండ్ సస్పెన్స్ తో వుండే మిస్టరీలు వర్కవుట్ కావడంలేదని, హాలీవుడ్డీయులు సీన్ టు సీన్ సస్పెన్స్ కథనాలకి తెరతీశారు. మిస్టరీల్లో లాగా కాకుండా కథని ఓపెన్ చేసేసి, సీను సీను కీ యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ సస్పెన్సు వుండేలా కథనాల్ని మార్చారు. హంతకుణ్ణి చివరి వరకూ ప్రేక్షకుల నుంచి దాచి పెట్టకుండా, వాడు తెలిసిపోయేలా, వాణ్ణి పట్టుకునే ఎలుకా పిల్లీ ఓపెన్ గేమ్ గా చేశారు. 


       ఇలా చేయడానికి స్క్రీన్ ప్లేలకి వుండే శాస్త్రీయ పునాదినే తీసుకున్నారు. విజువల్ మీడియా అయిన సినిమాలకి పాత్ర (హీరో) వుంటే - దానికి ఎదుటి పాత్ర (విలన్) తెరమీద కన్పిస్తేనే కథ. మన అంతరంగంలో నిత్యం జరిగే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తెరమీద కన్పించాలి. ఈ ఇంటర్ ప్లే ఈ రెండు ముఖ్యపాత్రలు వుంటేనే వస్తుంది : 1. హీరో (కాన్షస్), 2. విలన్ (సబ్ కాన్షస్). త్రీ యాక్ట్స్ స్క్రీప్లేల నిర్మాణ రహస్యమిదే. ఎండ్ సస్పెన్స్ కి జవాబుగా ఇలా ఇంటర్ ప్లేతో  సీన్ టు సీన్ సస్పెన్స్ కి పూనుకున్నాక, సాధారణ నవలా మర్డర్ కథలు వెండితెర మీద ఎక్కువ చైతన్యంతో రసవత్తర మయ్యాయి. 

        ఎండ్ సస్పెన్స్ కథనాల్లో ఈ ‘ఇంటర్ ప్లే’ వుండదు. హంతకుడు (విలన్) ఎవరో చివరివరకూ హీరోకీ, ప్రేక్షకులకీ తెలీదు. ఇలా హీరో మాత్రమే హత్యా దర్యాప్తు పరంగా తెరమీద కన్పిస్తూ, చివరివరకూ, అతను కనుక్కునే వరకూ విలన్ కన్పించకపోవడంతో, వాళ్ళిద్దరి మధ్యా ‘ఇంటర్ ప్లే’ కి అవకాశం లేని కర్వ్యూ ఈ బాపతు సినిమాల్లో రాజ్యమేలుతోంది. అందువల్ల స్క్రీన్ ప్లేల శాస్త్రీయత ఇక్కడ దెబ్బతిని పోతోంది.  

        కరోనా కర్ఫ్యూ పెట్టినా జనాలు రోడ్ల మీదికి ఎందుకొస్తున్నారంటే - దే వాంట్ ఇంటర్ ప్లే. పోలీసులతో బాహాబాహీ. యాక్షన్. మనిషి బేసిక్ స్క్రీన్ ప్లే సైకాలజీ. బ్రెయిన్ ఆ విధంగా జెనెటికల్ గా వైరింగ్ అయి వుంది. ఇందాక కేసీఆర్ అన్నట్టు, కన్పిస్తే కాల్చివేత కూడా పెడితే ఇంకా మజా వస్తుంది వాళ్ళ ఇంటర్ ప్లేకి. ఈ వైరింగ్ ఎండ్ సస్పెన్స్ లో వుండదు. అంతా ఏకపక్ష పాసివ్ కథనం. ఇంటర్ ప్లేకి కర్ఫ్యూ విధిస్తే అది ఎండ్ సస్పెన్స్ తో కూడిన మిస్టరీ కథ అవుతోంది.  

        ఇలావుంటే, ఈ ఎండ్ సస్పెన్స్ కి జవాబుగా సీన్ టు సీన్ సస్పెన్స్ కి పైన చెప్పిన విధంగా తెరతీశాక, ఇంకోవైపు ఎండ్ సస్పెన్స్ తో ఇంకో ప్రయోగం కూడా చేశారు. దీని సాంకేతిక పదమేదీ మన దృష్టికి రాలేదు. మనవరకూ ‘కవరింగ్ లెటర్ కథన’ మని ఏదో పేరుపెట్టి పిలుద్దాం.  అంటే అసలు హత్య జరిగినట్టు ఎక్కడా తెలీదు. ఒక కథ నడుస్తూంటుంది. ఆ త్రీ యాక్ట్ కథలో లీనమైపోతాం. ఈ కథ వెళ్లి వెళ్లి చిట్టచివరికి ఒక ట్విస్టుతో అసలు కథ - అంటే మరుగున వున్న హత్యానేర కథని రివీల్ చేస్తుంది. అంత సేపూ పాత్రలు నడిపిన కథంతా - ఈ అసలు కథని రివీల్ చేయడానికి పన్నిన వ్యూహమని అప్పుడు మనకి తెలుస్తుంది. జరిగిన ఒక హత్యలో హంతకుణ్ణి పట్టుకోవడం గురించే నడిచే ఈ వేరే కథ, ఎండ్ సస్పెన్స్ ఫీలవకుండా కవర్ చేసేస్తుంది. అంటే పైపైన నడుస్తున్న ఈ కథలో ఇంటర్ ప్లేకి తోడ్పడే పాత్రలుంటాయి. అందువల్ల ఎండ్ సస్పెన్స్ అనుమానం, ఫీల్ రాదు.

        ఈ కవరింగ్ లెటర్ కథనానికి 1950 లలో బ్రిటన్నుంచి ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్లాక్ అండ్ వైట్ మూవీ అంకురార్పణ చేసినట్టు కనపడుతుంది. దీన్నాధారంగా చేసుకుని 1980 లలో హిందీలో ‘ధువాఁ’ (పొగ) వచ్చింది. మిథున్ చక్రవర్తి, రాఖీ, అమ్జాద్ ఖాన్ లతో. ఈ మూవీ చూద్దామన్నా నెట్ లోగానీ, సీడీల కాలంలో సీడీగా గానీ దొరికేది కాదు. ఇప్పుడు మళ్ళీ వీకీపీడియాలో ఎందుకో ఒకసారి కథ చూద్దామని చూస్తే, ఆశ్చర్యకరంగా యూట్యూబ్ లో వీడియోనే ప్రత్యక్షమైంది! దీని లింక్ ఇస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసి ఈ మూవీ చూడండి
– ఎండ్ సస్పెన్స్ కథకి ఎండ్ సస్పెన్స్ ని మరిపించే ‘కవరింగ్ లెటర్ కథనం’ అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ ‘ధువాఁ’ నే ఆధారంగా చేసుకుని తమిళ మలయాళ కన్నడల్లో అప్పట్లో సినిమాలొచ్చి బాగా ఆడాయి. 


     ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘రాక్షసుడు’ కధనం కూడా ఇదే కాబట్టి. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన, తమిళ రీమేక్ ‘రాక్షసుడు’ (2019) పోలీస్ థ్రిల్లరే, చిన్నచిన్న ఆడపిల్లల్ని చంపే సైకో కిల్లర్ కథ. పూర్తిగా చూస్తేగానీ ఇది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తెలీదు. తెలియకుండా వుంచిన ప్రయోగం మధ్యలో టీచర్ పాత్ర మీదికి దృష్టి మళ్ళించి అతనే కిల్లర్ అన్నట్టుగా కథ నడపడం. దీంతో విలన్ రూపంలో అతను కన్పించి ‘ఇంటర్ ప్లేకి’ న్యాయం చేశాడు. డిటెక్టివ్ పోలీస్ థ్రిల్లర్ జానర్ మర్యాద పాటిస్తూ సీన్ టు సీన్ యాక్షన్ తో కూడిన సస్పెన్స్ కథనం ఇలా కుదిరింది. చివరికి సీరియల్ కిల్లర్ ఇతను కాదని, అసలు వేరే పాత్రతో రివీలవుతుంది. అప్పుడు మాత్రమే ఇదంతా ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తెలుస్తుంది. ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అన్పించకుండా, టీచర్ రూపంలో కరివేపాకు పాత్రతో, కవరింగ్ లెటర్ కథనం చేశారన్న మాట. 

        ఇదే మామూలు ఎండ్ సస్పెన్స్ మిస్టరీగా తీస్తే ఇలా వుండేది : ఆడపిల్లల్ని చంపుతున్న సీరియల్ కిల్లర్ ఎవరు - ఎవరు - ఎవరూ అని దీర్ఘాలు తీస్తూ చివరిదాకా తీరుబడిగా కథ నడిపి, అప్పుడు సీరియల్ కిల్లర్ని, అంటే విలన్ని రివీల్ చేసేవాళ్ళు. దీంతో ఇది చూసే వాళ్లకి పెద్ద సహన పరీక్షై, సినిమా సంతనూతలపాడు కెళ్ళిపోయేది. మాస్ మార్కెట్ అయిన కమర్షియల్ సినిమాలకి ‘ఇంటర్ ప్లే’ వుండాల్సిందే. క్లాస్ మార్కెట్ అయిన ఆర్ట్ సినిమాలకి ‘ఇంటర్ ప్లే’ లేకపోయినా మేధావులు చూసి చప్పట్లు కొడతారు. మేధావుల సినిమాలు మాస్ మార్కెట్ చూడదు, మాస్ మార్కెట్ సినిమాలు మేధావులు చూడరు. ఆర్ట్  సినిమాలు చూసి మెచ్చుకునే వాళ్ళకి  వాటి ఆర్ధిక లాభ నష్టాలు కూడా పట్టవు.

        ఇంతాచేస్తే ‘రాక్షసుడు’  పోలీస్ డిటెక్టివ్ సినిమా కాదు. అలవాటుగా, షరా మామూలుగా ఎస్సై సినిమానే. సీరియల్ కిల్లర్ కేసులు మామూలు పోలీస్ స్టేషన్లో  వుండవు. క్రైం బ్రాంచ్ పొలీస్ డిటెక్టివులు చూసుకుంటారు.

       రేపు అసలు విషయానికొద్దాం...

సికిందర్

6, అక్టోబర్ 2020, మంగళవారం

984 : రివ్యూ


 

      దెయ్యాలున్నాయా లేవా? వున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని అవి స్వాధీనం చేసుకుని స్వాహా చేసేస్తాయి. తమ కథల్ని చెప్పనివ్వవు. మీడియా మేనేజ్ మెంట్. రాజకీయ నాయకుల నుంచి నేర్చుకున్నాయి. సైలెన్స్ ప్లీజ్... అని నోరూ చెవులు కూడా మూసేస్తాయి. నిశ్శబ్దం పాటించాలి. తమిళ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్ సృజనాత్మకతా పరంగా నిశ్శబ్దం పాటిస్తున్నాయి. అవి అదే అనాథాశ్రయంలో ఇద్దరు అనాథ బాలికల అవే పాత కథల్నుంచీ పదేపదే పేదగా పుట్టుకొస్తాయి. సమకాలీనంగా ఇంకే సమస్యలూ లేనట్టు. పదే పదే గత కాలంలోనే పేదగా జీవించే సస్పెన్స్ థ్రిల్లర్స్ కి దెయ్యాల దర్బారు నుంచి విముక్తి లేదు. ఆ నిశ్శబ్దం కాస్తా నీరుగారి దెయ్యపు కచేరీలతో నిండిపోతుంది…  
    30 కోట్లు పెట్టి తీయాలనుకున్నప్పుడు మూడుండాలి : ఏం తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం, ఎలా తీస్తున్నామనే ప్రశ్నలు. కమర్షియల్ లాభ నష్టాలతో ముడిపెట్టి జవాబులు. పరమాద్భుత లొకేషన్స్, కళ్ళు చెదిరే తారాగణం, అదిరిపోయే ప్రొడక్షన్ విలువలు ఇవి కావు జవాబులు. ఇవి పోయే డబ్బులు వచ్చే డబ్బుల లెక్కలు కావు. పేపరు మీద రాస్తున్నప్పుడే వచ్చే డబ్బులా పోయే డబ్బులా తెలిసిపోకపోతే తీయడం మభ్యపెట్టుకోవడమే. మొదటి ప్రయత్నం తోనే మభ్యపెట్టుకున్నామని తెలుసుకోకపోతే ఆ అలసత్వానికి అంతం లేదు. దర్శకుడు హేమంత్ మధుకర్ 2010 లో హిందీలో తీసిన దెయ్యం సినిమా ఏ ఫ్లాట్ పరాజయం గురించి ఎవరేమన్నారో తెలిసీ అప్రమత్తమవక పోతే  మభ్య పెట్టుకునే నిశ్శబ్దాలు చాలానే వుంటాయి. 

    సస్పెన్స్ థ్రిల్లర్ అత్యంత సంక్లిష్ట జానర్. హిచ్ కాక్ అంతటి వాడికే పట్టుబడలేదు. తీసే ప్రతీ సస్పెన్స్ థ్రిల్లర్ అతడికి యాతనే. మూస ఫార్ములాలు చేస్తూ సరదాగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లాగిద్దామనుకుంటే సాగే పనికాదు. సస్పెన్స్ థ్రిల్లర్ ఫుల్ టైమ్ జాబ్. సస్పెన్స్ - క్రైమ్ జానర్లో తలపండిన వాడికి ఇతర జానర్లు నల్లేరు నడక. ఎందుకంటే కథలకి కావాల్సిన మనస్తత్వ చిత్రణ, భావోద్వేగాలు, సమయస్ఫూర్తి, కాలీన స్పృహ, లాజిక్, డైనమిక్స్ వంటి కథాంగాలు వొంటబట్టి వుంటాయి క్రైమ్ జానర్లో.

     నిశ్శబ్దం  తమిళంలో  సైలెన్స్  మొదట మాటలు లేకుండా మూకీగానే తీయాలనుకున్న ఆలోచన. మనసు మార్చుకుని మాటలు జోడించిన ప్రయత్నం. ఈ మాటలు జోడించడం మామూలుగా లేదు. మూకీ అనే మాటల అనావృష్టి నుంచీ అతి వృష్టి కురిపించే క్రియేటివిటీ. నటులకున్న మాటలు చాలనట్టు వాయిసోవర్ల కుండపోత. ఎవరి వాయిసోవర్ ఎందుకో అర్ధం కాకుండా సాంతం స్వగతాల జడివాన. డాక్యుమెంటరీ చూస్తున్నట్టు డైజెటిక్ సౌండ్. డైజెటిక్ సౌండ్, ఇంట్రా డైజెటిక్ సౌండ్ ఎప్పుడు ఎలా ఎందుకు వాడాలో తెలుసుకోకుండా శబ్ద గందరగోళం. కథలో ఏం జరుగుతోందో వంతులేసుకుని వ్యాఖ్యాతలు వివరిస్తే గానీ అర్ధంగాని పరిస్థితి వుంటే కథని శానిటైజ్ చేయాలి. దాని విజువల్ స్టోరీ టెల్లింగ్ నేచర్ కి వైరస్ సోకి వుంటుంది. సినిమా తీస్తే ఇతరులు నేర్చుకునేట్టు వుండాలి గానీ నేర్చుకున్నది పోయేట్టు వుండకూడదు.

    మరి నిశ్శబ్దం కర్ధమేమిటి? ఈ అర్ధమే పట్టుకోగలిగి వుంటే సినిమా ఎక్కడో వుండేది గ్లోబల్ చార్ట్ లో అనూష్కాని తళతళ మెరిపిస్తూ. ఇది జానర్ రీసెర్చి చేసుకుని ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో (1955) టెక్నిక్ తో తీయాల్సిన 41 మిలియన్ డాలర్ల స్టార్ మూవీ. జానర్ రీసెర్చా? అదేమిటి? అదేమిటో తెలియాలంటే వీధి బడి దశ నుంచీ సినిమా నేర్చుకుంటూ రావాల్సి వుంటుంది.

కథ 

        సాక్షి (అనూష్కా) మూగ చెవిటి పెయింటర్. తల్లిదండ్రులెవరో తెలీదు. యూఎస్ లో అనాథాశ్రయంలో పెరిగింది సోనాలీ (శాలినీ పాండే) తో బాటు. ఆమెకి సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీ నుంచి పిలుపు వస్తుంది. అక్కడ పెయింటింగ్ వేసి విజిటింగ్ కి వచ్చిన సెల్లో ప్లేయర్ ఆంథోనీ గోన్సాల్వేస్ (మాధవన్) ని ఇంప్రెస్ చేస్తుంది. తన కన్సర్ట్ కి అతనా హ్వానిస్తే వెళ్తుంది. అలా పరిచయం పెరిగి అతడికి పెయింటింగ్ నేర్పుతుంది, అతను మ్యూజిక్ నేర్పుతాడు. ఇక ప్రేమ పుడుతుంది. ఎంగేజిమెంట్ చేసుకుని అతణ్ణి తీసుకుని ఒక శిథిల విల్లాలో జోసెఫైన్ వుడ్స్ అనే ఆమె పెయింటింగ్ అన్వేషణలో బయల్దేరుతుంది. ఆ విల్లాలో 47 ఏళ్ల నుంచీ దాని ఓనర్ దెయ్యం వుంటుంది. అది వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపేస్తూంటుంది. ఇప్పుడు ఆంథోనీని కూడా చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. 

    సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) కేసు టేకప్ చేస్తుంది. ఆమెకి తోడుగా కెప్టెన్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) దిగుతాడు. అయితే విల్లాలో కేసుకి సంబంధించి ఆధారాలేవీ దొరకవు. మరోవైపు చూస్తే కొందరు యువతుల మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. సోనాలీ కూడా అదృశ్యమవుతుంది. సోనాలీని ఆంథోనీ హత్య కేసులో అనుమానిస్తుంది మహాలక్ష్మి. సొనాలీని వెతకడం మొదలుపెడుతుంది.

    ఇప్పుడు సోనాలీని ఎందుకనుమానించింది మహాలక్ష్మి? సోనాలీకున్న మానసిక సమస్యేమిటి? ఆంథోనీకి కూడా వున్న మానసిక రుగ్మతేమిటి? ఈ ఇద్దరి మధ్యా సాక్షి స్థానమేమిటి? విల్లాలో ఆమె చూసింది ఎంత వరకు నిజం? ఈ మొత్తం కేసులో కెప్టెన్ రిచర్డ్ పొందాలని చూసిన ప్రయోజనా లేమిటి? ఇదంతా మహాలక్ష్మి ఎలా పరిష్కరించి దోషిని తేల్చింది? ఇదీ మిగతా కథ.  
నటనలు- సాంకేతికాలు

         నటనల గురించి చెప్పుకోవాలంటే పాత్రల గురించి చెప్పుకోవాలి. పాత్ర చిత్రణల్లో లోపాలుంటే ఎంతటి నటనలూ మెప్పించలేవు. అనూష్కా సాక్షి పాత్ర అలాటి లోపాలున్న ఈ సినిమా పాత్రల్లో ప్రధానమైనది. దీంతో ఆమె నటన ఉపరితలంలోనే వుండి పోతోందే తప్ప ఇన్నర్ ఎమోషన్లు పలికే పరిస్థితి లేదు. అసలు ఇన్నర్ ఎమోషన్లు లేనట్టే వుంటాయి పాత్ర చిత్రణ, నటనా. సైన్ లాంగ్వేజీ, అప్పుడప్పుడు ఫోన్లో టైపు చేసి వాయిస్ ఇన్ఫర్మేషన్ వంటి ఉపకరణాల ద్వారా సాధారణ సమాచారాన్ని తెలుపుతుంది తప్ప, డ్రామాకి ముఖ్యమైన తన ఇన్నర్ ఎమోషన్స్ ని అర్ధమయ్యేలా చెప్పడంలో వుండే స్ట్రగుల్ తో కూడిన ఉద్విగ్నభరిత సన్నివేశాలుండవు. పోనీ బొమ్మవేసి చూపే ప్రయత్నం చేసే ఆడియెన్స్ ఫ్రెండ్లీ మెలోడ్రామా వుండదు. ఇన్నర్ ఎమోషన్సే లేనప్పుడు ఇక  అయ్యోపాపం అన్పించే స్ట్రగుల్ ఏ రూపంలోనైనా ఎందుకుంటుంది. అసలొక మూగజీవి అయిన సాక్షి లాంటి పెయింటర్ కి పెయింటింగ్సే తన భాష, మాధ్యమం కాకుండా పోతాయా? తనని కుదిపేస్తున్న భావోద్వేగాల్ని కుంచె ద్వారా ప్రకటించకుండా ఏ చిత్రకారుడుండ గలడు? లేనప్పుడు అలాటి పాత్ర ఎందుకు? సాక్షి మూగజీవి పాత్రకి లాగే ఆమె పెయింటరన్న వృత్తిపరమైన పాత్ర చిత్రణ కూడా లేదు. టెంప్లెట్ సినిమాల్లో టెంప్లెట్ పాత్రలాగే రెండు పెయింటింగు లేయించి గొప్ప పెయింటరని చెప్పి, పది మిలియన్ డాలర్లతో బ్రహ్మాండమైన బిల్డప్పిచ్చి వదిలేశారు. మళ్ళీ ఈ పాత్ర చిత్రణ తాలూకు కొనసాగింపే వుండదు. ఒకసారి బర్ఫీ లో రణబీర్ కపూర్ ని చూస్తే తెలుస్తుంది మూగజీవి సమగ్ర పాత్రంటే ఏమిటో.

పాత్రకి కథతోనే సమస్య 

        సమస్య ఎక్కడొచ్చిందంటే, అసలీ సస్పెన్స్ థ్రిల్లర్ కథ అనూష్కా పాత్ర కథ అని తెలుసుకోక పోవడం దగ్గర వచ్చింది. స్టార్ హీరోయిన్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ హంగామా తీస్తున్నప్పుడు ఆమె మీదే కథ వుండాలని కలం పుచ్చుకుని రాస్తాడు రచయిత. అంతేగానీ ఆమెని అవతలికి లాగేసి, ఇతర పాత్రలతో కథ గిల్లుకుంటూ కూర్చోడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అసలు కథే౦టో అర్ధం గాకపోతేనే. అందుకే ఇన్ని ఇతర పాత్రలతో ఇన్ని ఫ్లాష్ బ్యాకులు, వాళ్ళ వాయిసోవర్లు. కథతో అయోమయం వుంటేనే అర్ధం లేని ఫ్లాష్ బ్యాకులతో హడావుడి చేస్తారంటాడు సిడ్ ఫీల్డ్. 

    సెంట్రల్ క్యారక్టర్ గా అనూష్కా మీద కథా, పాత్రచిత్రణా ఎలా వుండి వుంటే అమెరికాలో తీసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్లో గ్లోబల్ ఎట్రాక్షన్ అయివుండేదో తర్వాత కథా కథనాలు విభాగంలో చూద్దాం.  

డిటో మాధవన్ 

      ఇక మాధవన్ గురించి. భారతీ రాజా దర్శకత్వంలో ఎర్రగులాబీ లు (సిగప్పు రోజాక్కల్ -  1980) లో కమలహాసన్ క్లాసిక్ సీరియల్ కిల్లర్ పాత్రని గుంజి నిశబ్దం లో గుంజీళ్ళు తీయించాడు. పుంజాలు తెంపుకుని పారిపోయింది పాత్ర. విశేషమేమిటంటే, ఇదే సీరియల్ కిల్లర్ కథని భారతీ రాజాయే రాజేష్ ఖన్నాతో హిందీలో రెడ్ రోజ్ గా తీస్తే అదీ సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఇంత కాలం తర్వాత ఐఎండీబీ లో ఇప్పటి ప్రేక్షకులు రెడ్ రోజ్ ని చూసి ఆహా ఓహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాటి థ్రిల్లర్ ని చూడలేదంటున్నారు అప్పటి రాజేష్ ఖన్నాని పొగుడుతూ. 

    నిశ్శబ్దం లోనే కెప్టెన్ రిచర్డ్ పోలీసు పాత్ర ఎక్కడిదనుకున్నారు? భారతీ రాజా థ్రిల్లర్ లోనే కమలహాసన్ / రాజేష్ ఖన్నా అమ్మాయిల్ని చంపుతూంటే చూసి ఎంజాయ్ చేసే సైకో పెంపుడు తండ్రి పాత్ర. మాధవన్ అమ్మాయిల్ని చంపుతూంటే రిచర్డ్ సహకరించడం డబ్బు కోసమన్నట్టుగా వుండదు. భారతీ రాజా థ్రిల్లర్లో తండ్రి పాత్రలాగా అతను సైకో అని మనమర్ధం చేసుకోవాలి. భారతీ రాజా థ్రిల్లర్ లోని కమల్ పాత్రని అదే కథతో మాధవన్ కథగా ముక్క అతికించి, అదే గొప్ప ఒరిజినల్ క్రియేషన్ అన్నట్టుగా చివర్లో సస్పెన్స్ రివీల్ చేశారు. 

    ఆంథోనీ పాత్రలో మాధవన్ కూడా డిటో అనూష్కా. కథ కుపయోగపడని అతడి సంగీతం. ఆ సంగీతంలో తనలో దాగున్న సీరియల్ కిల్లర్ భావోద్వేగాలున్నాయా అంటే లేదు. అమీర్ ఖాన్ సర్ఫరోష్ లో గజల్ గాయకుడి రూపంలో వున్న టెర్రరిస్టుగా నసీరుద్దీ న్ షా, పాడే పాటలో అంతరార్ధం పాత్ర నిజస్వరూపాన్ని తెలిసీ తెలీనట్టు ప్రకటిస్తుంది. ఇది కథ కాదు లో వెంట్రిలాక్విజం కళాకారుడైన కమల్ కూడా తన భావోద్వేగాల్ని వెంట్రిలాక్విజం ద్వారా ప్రకటిస్తాడుగా?

    మాధవన్ పాత్రకి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు యాదృఛ్ఛికంగా పెట్టేశారా లేక ఉద్దేశపూర్వకంగానా? ఆంథోనీ గోన్సాల్వెజ్ గోవాకి చెందిన సుప్రసిద్ధ సంగీత కారుడు. లక్ష్మీ కాంత్ - ప్యారేలాల్ లకి సంగీతం నేర్పిన గురువు. వాళ్ళ ఎన్నో పాటలకి ఆయనే స్ఫూర్తి. ఏకంగా ఆయన పేరే ప్రయోగించి అమర్ అక్బర్ ఆంథోనీ లో అమితాబ్ బచ్చన్ మీద మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వెజ్ అనే ఆల్ టైమ్ హిట్ పాట సృషించేశారు. అలాటి ఆంథోనీ గోన్సాల్వెజ్ పేరు మ్యూజిషియన్ అయిన సీరియల్ సైకో కిల్లర్ కి వాడడం ఏమీ బాగాలేదు. ప్యారేలాల్ శర్మ ఇప్పటికీ ఆంథోనీని స్మరిస్తాడు. 

పొడిపొడి ప్రణయ బాంధవ్యం 

       ఇక మాధవన్ - అనూష్కాలు పరస్పరం తమ కళల్ని నేర్పుకునే  క్రమంలో కూడా రసపోషణ వుండదు. ఆకలిరాజ్యం లో కమల్ -శ్రీదేవిల మధ్య వున్నట్టు. శ్రీదేవి తాళం పాడితే కమల్ స్వరాలు కూర్చే పోటాపోటీ - ఆమె సంగీతమైతే అతను సాహిత్యంగా - కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే పాట లాగా. మాధవన్ సంగీతానికి అనూష్కా చిత్ర లేఖనం పోటీయో, లేదా అనూష్కా చిత్ర లేఖనానికి మాధవన్ సంగీతం పోటీయో లేకుండా కళాకారుల పాత్రలెందుకు? వీళ్ళు ప్రేమికులైనప్పుడు కళల సమాగం లేని అంటీముట్టని చిత్రణ లెందుకు? ప్రియుడే సంగీతము - ప్రియురాలే నాట్యము - అని  ఇది కథ కాదు లో కళాకారులైన కమల్, జయసుధ పాడుకున్నారుగా? మాధవన్ సంగీతం అనూష్కాకి వినపడని లోపంలోంచి మాధవన్ పడే వేదనాభరిత డ్రామా ఏది?

    ఇలా అనూష్కా, మాధవన్ - ఇద్దరు స్టార్స్ మీద ప్రణయంలో యూత్ అప్పీల్ ప్రవహించే కనీస ఎమోషనల్ బాండింగ్ కూడా లేకపోవడం కొట్టొచ్చే లోపం. ఇన్ని లోపాలతో తెరమీద ఈ స్టార్స్ ని చూసి ఎందుకు ఎంజాయ్ చేయాలి?

అంజలి పాత్రా గల్లంతు 

      ఇక అంజలి. దర్శకుడు ముందుగా అనుకున్న కథలో అంజలి పాత్ర లేదు. ఆమె స్థానంలో మగ పాత్ర వుంటే, కథ మేల్ డామినేషన్ తో వుందనిపించి మగ పాత్ర తీసేసి,  పోలీస్ డిటెక్టివ్ ని స్త్రీ పాత్రగా మార్చానన్నాడు దర్శకుడు. అయినా అనూష్కాతో బాటు అంజలి పాత్రనీ నీరుగార్చే చిత్రణలు చేశాడు. అంజలి పాత్రకి మహాలక్ష్మి పేరుకి అర్ధం పర్ధం, ప్రయోజనం లేవు. తెలుగు ప్రేమ సినిమాల్లో పెడుతున్న ఇంకో టెంప్లెట్ పేరుగానే మూలన పడింది. ఆంథోనీ పేరుతో అలా చేశారు. మహాలక్ష్మి పేరుతో ఏమీ చేయలేదు అమెరికా బ్యాక్ డ్రాప్ లో. తను పోలీస్ డిపార్ట్ మెంట్ కే గర్వకారణమైన విజయలక్ష్మిలా వుండదు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ మిథికల్ క్యారక్టర్ ని ప్లేచేసి విశ్వ గురు అంటున్నఇండియా ఖ్యాతిని పెంచాలను కోలేదు. పేరు గొప్ప పని దిబ్బ అన్నట్టు వుంది. 

    తగ్గట్టే స్టయిలిస్ట్ యాక్టింగ్ తో అసహజ ఇన్వెస్టిగేషన్. 47 ఏళ్లుగా దెయ్యం చంపుతూంటే ఆంథోనీని దెయ్యం చంపలేదని మొదటే ఎలా నిర్ధారించింది? సాక్షి ఫ్రెండ్ సోనాలీ కనిపించకపోతే ఆమె చంపినట్టా? ఇది వరకు దెయ్యం చేసిన హత్యలతో ఈ హత్యకున్న తేడా ఏమిటో కేసు పాత రికార్డుల్లో సైంటిఫిక్ ఎవిడెన్సు లతో నిగ్గు తేల్చిందా? దీని జోలికే పోలేదే. కథా సౌలభ్యం కోసం వూరికే సోనాలీని టార్గెట్ చేయడం వల్ల అసలు దెయ్యమనే మూల కథే ప్రశ్నార్ధకమైంది.

    సరే, చివరికి దెయ్యం చంపలేదనే తేలింది. మరి చంపుడు కార్యక్రమం పెట్టుకున్న దెయ్యం ఏమైంది? తన ముందు తను చంపాల్సిన ఆంథోనీని ఇంకెవరో చంపుతూంటే చూస్తూ వుందా? ఆంథోనీతో బాటు చంపడానికొచ్చిన వాణ్ణీ బోనస్ గా చంపుకుని దెయ్యం నెక్స్ట్ శాల్తీ కోసం కూర్చోవాలిగా? అసలు వచ్చిన మహాలక్ష్మితో బాటు పోలీసు టీమునీ సఫా చేసేయాలిగా? మహాలక్ష్మి లో గజలక్ష్మిని చూసి జడుసుకుందా అమెరికన్ దెయ్యం? ఇదే చూపించి వుంటే మోతెక్కి పోయేది అమెరికా!!

    కాబట్టి బిల్డప్ కోసం ఏదో దెయ్యం కలరిచ్చారు తప్ప, అసలు దెయ్యాముందా లేదా స్పష్టత లేదు కథకుడికి. కన్పిస్తున్న దెయ్యాలుగా పాత్రలే వున్నప్పుడు వేరే దెయ్యం అక్కర్లేదేమో. మహాలక్ష్మిగా అంజలి ఈ కేసులో తేల్చిందేమీ లేదు. చివరికి సుబ్బరాజే తన కథ చెప్పుకుని ఆంథోనీ హత్యా రహస్యం విప్పుతాడు ప్రేక్షకులకి. మహాలక్ష్మికి కాదు. కనీసం ఇంకో పనైనా చేయలేదు మహాలక్ష్మి - కెప్టెన్ రిచర్డ్ పోలీసుని చంపి కిందికి తోసేస్తాడు. ఆ శవం దగ్గర రిచర్డ్ వేసుకున్న బ్లేజర్ బటన్ దొరుకుతుంది మహాలక్ష్మికి. దాంతో ఆంథోనీ హత్యతో రిచర్డ్ కి సంబంధముందన్న విషయం తర్వాత, ముందు ఈ పోలీసు హత్యలో రిచర్డ్ రెడ్ హేండెడ్ గా దొరికిపోతే కిమ్మనదు. ధైర్య లక్ష్మి కూడా కాలేదు. రిచర్డ్ చేసిన ఈ పోలీసు హత్యని ప్రమాద వశాత్తూ మరణంగా నమోదు చేసిందేమో చూపించలేదు. అసలు అర్ధం కాని కథలో అనూష్కా లాగే తనూ గల్లంతైన పాత్రే. ఎవరెవరో ఫ్లాష్ బ్యాకులేసుకుని ప్రేక్షకుల నుద్దేశించి వాయిసోవర్లు చెప్తూంటే, వీటితో సంబంధం లేనట్టు హైఫై పోలీస్ డిటెక్టివ్ మాహాలక్ష్మి ఎక్కడుంటుందో తెలీదు. చివరికి ఆంథోనీ మిస్టరీ వెల్లడవడం కూడా తన మూలంగా జరగదు. తనుండదు. పూర్తిగా పాసివ్ క్యారెక్టర్.  
    *హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లక్ష్మీదేవిని పూజిస్తుందట!

        విదేశీయులు, ఇతర మతస్థులు కూడా హిందూ దేవుళ్లను ఆరాధిస్తుంటారు. అలాంటి వాళ్లలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఎన్నో హాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన సల్మా హయెక్ లక్ష్మీదేవిని పూజిస్తుందట. ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిపైనే దృష్టి పెడుతుందట. ఈ విషయాన్ని సల్మా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. లక్ష్మీదేవి ఫొటోను కూడా పోస్ట్ చేసింది.  
       
`నేను నా అంత:సౌందర్యంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు దేవత లక్ష్మీదేవిపై దృష్టి పెట్టి ధ్యానం చేస్తాను. హిందూ మతస్థులు ఆమెను సంపదకు, అదృష్టానికి, ప్రేమకు, అందానికి ప్రతినిధిగా భావిస్తారు. ఆమె చిత్రం నాకు చాలా సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. సంతోషం, ప్రశాంతత మన అంత:సౌందర్యానికి బాటలు వేస్తాయ`ని సల్మా పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు `అద్భుతం` అంటూ కామెంట్ చేసింది. 
ఆంధ్రజ్యోతి
, 9.10.20
అనాధల బ్యాచి 

     సాక్షి ఫ్రెండ్ సోనాలీగా శాలినీ పాండే అనాధాశ్రయంలో పదేపదే ఇలాటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో రిపీటవుతున్న పాత మూస పాత్ర. స్టార్ సినిమాల్లో హీరో ఎప్పుడూ బస్తీలో వుండే అనాథే- పేరు శీను గాడే అన్నట్టు - సస్పెన్స్ థ్రిల్లర్స్ లో హీరోయిన్, ఆమె నేస్తం అనాథాశ్రయంలో పడుండే అనాధలు! తెలుగు రాష్ట్రాల్లో యువతీ యువకులు దిక్కులేని అనాధలన్న మాట. ఇప్పుడు అమెరికా తీసికెళ్ళీ ఇదే పరాభవం. 

    సోనాలీకి సాక్షి మరెవరితో వుండకూడదనీ, తనతోనే వుండాలని పొసెసివ్ నెస్ చిన్నప్పట్నుంచీ. దీంతో పెద్దయ్యాక సాక్షితో క్లోజ్ గా వుంటున్నాడని అనుమానించి ఒకడి మీద  హత్యా యత్నం చేసి  జైలుకి కూడా వెళ్ళి వచ్చిన చరిత్ర. అమెరికన్ ప్రభుత్వం ఆమెకి మానసిక చికిత్స చేయకుండా మళ్ళీ దేశం మీదికి వదిలేసి నట్టుంది. ఈ పాత మూస టెంప్లెట్ పాత్ర నేటి కాలం పోకడలకి లెస్బియన్ అయి వుంటుందని ప్రేక్షకులు భావిస్తారన్న స్పృహలేదు కథకుడికి. పొసెసివ్ నెస్ వికటించి పొటెన్షియల్ కిల్లర్ గా మారిన సోనాలీతో ఇంకా ఫ్రెండ్ షిప్ ఏమిటో సాక్షికి. ఇది మరిన్ని హత్యలకి దారి తీసేందుకు తానే కారణమైందన్న పొరపాటు, సాక్షి పాత్ర సమూలంగా నెగెటివ్ అయిందన్నసంగతీ గ్రహించాడో లేదో కథకుడు. 

సుబ్బరాజు, మాడ్సెన్ సూపర్ స్టార్స్

        వీళ్ళిద్దరూ తమ పాత్రల్ని ఎంజాయ్ చేశారు, ఎలాటి బంధనాలు, సంకెళ్ళు లేవు. కానీ క్యారక్టర్ గ్రోత్ తో, వాళ్ళ సీక్రెట్స్ తో బ్యాంగు లిచ్చుకుంటూ పోయారు. సోనాలీని ప్రేమించిన వివేక్ గా సుబ్బరాజు తన గోడు సరీగ్గానే వెళ్లబోసుకున్నాడు. రివెంజ్ క్యారక్టర్ గా మారి కథ ముగించాడు. నీటు పాత్ర, క్లాస్ నటన. పోలీసు కెప్టెన్ గా మైకేల్ మాడ్సెన్ ది విలక్షణ నటన. రిజర్వాయర్ డాగ్స్’, కిల్ బిల్’, ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ వంటి 113 సినిమాల సీనియర్ నటుడు. భారతీరాజా థ్రిల్లర్ లోని పెంపుడు తండ్రి పాసివ్ పాత్రని, కెప్టెన్ గా యాక్టివ్ పాత్రగా పోషించి సైకో విలనిజాన్ని డీసెంట్ గా పోషించాడు. అనూష్కా, అంజలి పాత్రల్లా కాకుండా వీళ్ళిద్దరివీ సస్పెన్సుతో కూడిన పాత్రలు.

సాంకేతిక వైభవం
       
కథా వైభవం లేకపోయినా సాంకేతిక వైభవానికి కొదవ లేదు. కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే విత్తం కొద్దీ వైభవం. తెర నిండా డాలర్లు అతికించి నట్టుంది. రెండు డాలర్లు మనకిస్తే మందు బాటిల్ పక్కనుంచుకుని చూసేవాళ్లం. మందే కథని మరిపించ గలదు, స్నాక్స్ పని చెయ్యవు. 

    గోపీ సుందర్ సంగీతం, షానీల్ దేవ్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, చాడ్ బఫెట్ ఆర్ట్, నీరజా కోన కాస్ట్యూమ్స్, అమెరికన్ యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుత క్వాలిటీతో  పోటీపడుతూ వున్నాయి. దర్శకుడి కథా నిర్వహణే సక్సెస్ కి వేటు వేసింది.

సికిందర్  

(కథా కథనాల సంగతులు రేపు)

25, జూన్ 2020, గురువారం

954 : స్క్రీన్ ప్లే సంగతులు


             స్పెన్సుకి తల వుండి తోక లేకపోతే తెనాలి రామకృష్ణుడి మేక తోక పద్యంలా తికమకగా వుంటుంది. మేకని తలతో మొదలు పెట్టి మెడ, కడుపు, కాళ్ళు అంటూ తోక కొస్తాం. అంటే తల స్టార్టింగ్ పాయింట్, తోక ఎండ్ పార్టు. మేకని చూసే నార్మల్ పధ్ధతి ఇది. ఇలా తల నుంచి కాక, తోక నుంచి మొదలు పెడితే మొత్తం మేక శరీర భాగాలు తోకకి ఎండ్ పార్టులవుతాయి. అంటే తోకకి తోకలవుతాయి. తోకే లేకపోతే తల ఏమవుతుంది? స్పెన్సు కీ అదే అవుతుంది. ఇక సస్పెన్సుకి ఇద్దరు విడి విడి విలన్లుంటే తలా తోకా రెండూ వుండవు!

        మురుగ దాస్ కూడా రజనీ కాంత్ తో తలాతోకా లేని పనే చేశాడు. ‘దర్బార్’ లో ఇద్దరు విడి విడి విలన్స్ ని పెట్టాడు. రజనీ కాంత్ డ్రగ్ దందా మూలాలు వెతుకుతున్నప్పుడు, ఇతనే విలన్ అని మనం సెటిలై ఫాలో అయ్యే ఒక విలన్ తెరపైకొస్తాడు. రజనీ అతడి కొడుకు దొరికితే వాణ్ణి చంపేసి విలన్ కి షాకిస్తాడు. అప్పుడు రజనీకి తెలియని ఇంకో విలన్ వచ్చి ఉన్న విలన్ని చంపేస్తాడు. చంపడమేగాక, రజనీ మీద దాడి చేసి అతడి కూతుర్నీ చంపేస్తాడు. సెకండాఫ్ లో ఈ కొత్త విలనెవరో తెలియక రజనీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇలా హీరోగా రజనీ ముగించాల్సిన కథలో విలన్ పాత్రని రెండో విలన్ చంపి ముగించి, సూపర్ స్టార్ గా రజనీ పాత్రకి దక్కాల్సిన క్రెడిట్, బాక్సాఫీసు అప్పీల్, ఫ్యాన్స్ చప్పట్లూ వగైరా మార్కెట్ యాస్పెక్ట్స్ ని అప్పనంగా తను కొట్టేసి సినిమాకి నష్టం చేశాడు. రజనీ పాసివ్ క్యారక్టర్ గా వెలవెల బోయాడు. ఇలా కథని రెండో విలన్ ముగించాక అతడితో ఇంకో కథ ప్రారంభమవడంతో, అసలు కథ తెగిపోతూ స్క్రీన్ ప్లే నిట్టని లువునా ఫ్రాక్చర్ అయి - సెకండాఫ్ సిండ్రోం, మిడిల్ మటాష్ వంటి అనారోగ్యాలు సినిమాకి పట్టుకున్నాయి.

       ఇద్దరు విలన్లతో ఇలావుంటే, ఇక సాహోలో లెక్కలేనంత మంది విలన్లు. వాళ్ళ లెక్కలేనన్ని విలనిజాలు. వాళ్ళందరూ ఒకే కథగా, ఒకే ఎజెండాతో వుంటే, హీరో ప్రభాస్ కి ఓ ఏకీకృత గోల్ ఏర్పడి, ఉమ్మడి శత్రువుల్ని మూకుమ్మడిగా చంపుతూ కథకో అర్థాన్నీ, బలాన్నీ సమకూర్చి పెట్టేవాడు. హాలీవుడ్ ఫాంటసీ -సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మల్టిపుల్ విలన్సే వుంటారు. ఇవి ఎక్కువగా కామిక్ బుక్స్ సిరీస్ ఆధారంగా తీసినవై వుంటాయి కాబట్టి. ఈ మల్టిపుల్ విలన్స్ ఒక సిండికేట్ గా ఏర్పడి వుంటారు. లేదా ఒక మెయిన్ విలన్ వుంటూ మిగిలిన వాళ్ళు ఆ విలన్ కి ఏజెంట్లుగా వుంటారు. వీళ్ళందరికీ హీరోతో ఒకే సమస్యతో సంబంధం - పోరాటం వుంటుంది.

        ఇప్పుడు ‘పెంగ్విన్’ తో వచ్చిన సమస్య కూడా ఇలా మల్టిపుల్ విలన్ సిండ్రోమే:
ఇద్దరు విలన్లు వుండడం. ఇద్దరు విలన్లతో కథలు నిలబడవని కాదు, ఇద్దరూ ఒకటవ కృష్ణుడు, రెండో కృష్ణుడు బాపతుగా ఒకరు పోయాక ఇంకొకరు వస్తేనే సమస్యంతా. ఇద్దరూ ఒకే గోల్ తో ఒకే సమయంలో ఒకే గ్యాంగ్ గా, సిండికేట్ గా ఆపరేట్ చేస్తే సమస్య రాదు. వాళ్ళు ఒకే కథతో ఉమ్మడి శత్రువులుగా ఒకే టార్గెట్ గా హీరోకి వుంటారు కాబట్టి. ఇలాకాక ‘పెంగ్విన్’ లోలాగా హీరోయిన్ కీర్తీ సురేష్ ని ఒక ఇబ్బంది పెట్టి తను కాదని ఒక విలన్ వెళ్ళిపోతే, ‘దర్బార్’ లో రజనీ కాంత్ లా ఆమె ఇంకో విలన్ని వెతుక్కోవడంతో -  ఈ విడివిడి విలన్ల రాక పోకలు విడివిడి కథలయ్యాయి. దీంతో ఆమూలాగ్రం ఎడతెగని ఒకే ధారగా ప్రవహించాల్సిన ఒకే కథ, మధ్యలో ఒక పాయగా విడిపోయి సస్పెన్సు, సినిమా అన్నీ వీగిపోయాయి.
2
   నెట్ లో ఒక విషయం గురించి సెర్చి చేస్తూంటే ‘జస్ట్ వాట్ కైండ్ ఆఫ్ మదర్ ఆర్యూ?’ అన్న నవల తగిలింది. బ్రిటిష్ రచయిత్రి పౌలా డాలీ తొలి థ్రిల్లర్ నవల. 2014 లో అచ్చయింది. బాగా పేరు తెచ్చి పెట్టింది. ఏమిటా అని సినాప్సిస్ చదివితే, ‘పెంగ్విన్’ పోలికలే కన్పించాయి. లీసాకి ముగ్గురు పిల్లలు. లేక్ డిస్ట్రిక్ట్ లో వుంటుంది. తన పిల్లలతో బాటు పొరిగింటి పిల్ల లుసిండాని తీసుకుని షికారు వెళ్తుంది. లుసిండా తప్పిపోతుంది. దీంతో ‘నువ్వెలాంటి తల్లివి?’ అని అందరూ నిందిస్తారు. ఆమెని బాధ్యురాల్ని చేసి వెలి వేస్తారు. ఇంతలో తన రెండో కూతురు కూడా అదృశ్య మవుతుంది. దీంతో మరింత కలకలం లేస్తుంది. ఇంతలో దయనీయ స్థితిలో లుసిండా తిరిగి వస్తుంది. ఈ స్థితికి మళ్ళీ నిందలు మోస్తుంది లీసా. ఇక అసలేం జరిగిందో తెలుసుకుని తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దడానికీ, కూతుర్ని వెతకడానికీ సమకడ్తుంది. ఈ క్రమంలో తెలుసుకుంటున్న నిజాలతో షాకింగ్ డొమెస్టిక్ డ్రామాలు, మనుషుల అసలు స్వరూపాలూ భయంకరంగా వెల్లడై, ఎడతెగని సస్పెన్స్ థ్రిల్లర్ కి దారితీస్తాయి...

        కీర్తి సురేష్ పాత్ర రిథమ్ కథ కూడా దీనికి దగ్గరగా వుంటుంది. కాకపోతే ఫస్టాఫ్ వరకే. నీలగిరి ఘాట్స్ లో వుండే రిథమ్ రెండేళ్ళ కొడుకు అజయ్ (ఉమర్) ని పోగొట్టుకుంటుంది. దీనికి భర్త రఘు (లింగా) ఆమెని నిందించి విడాకులు తీసుకుంటాడు. మూడేళ్ళ తర్వాత ఆమె గౌతం (రంగరాజ్) ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏడు నెలల గర్భవతిగా వుంటుంది. కానీ ఆరేళ్ళ క్రితం అదృశ్యమైన కొడుకు అజయ్ కోసమే తల్లడిల్లుతూ వుంటుంది. పోలీసులు ఇక చనిపోయినట్టే నని చేతులెత్తేస్తారు. ఇంతలో అనుకోకుండా ఎనిమిదేళ్ళ అజయ్ (అద్వైత్) తిరిగొస్తాడు. కానీ మానసికంగా దెబ్బ తిని వుంటాడు. ఏం జరిగిందో, తనని ఎవరు తీసికెళ్లారో డాక్టర్ డేవిడ్ (మాథి) ఎంత  ప్రయత్నించినా చెప్పడు. కొడుకుని ఇలా ఎవరు చేశారో తెలుసుకోవాలని పూనుకుంటుంది రిథమ్. ఇంతలో అంజన (ఐశ్వర్య) అనే ఇంకో అమ్మాయి అదృశ్యమవుతుంది. ఈమె జాడ కూడా దొరకదు. ఇంతేగాక ఇంటికి తిరిగొచ్చిన అజయ్ కోసం కిడ్నాపర్ మళ్ళీ ప్రయత్నిస్తూంటాడు. ఇతను చార్లీ చాప్లిన్ మాస్కులో వుంటాడు. ఎవరితను? ఎందుకు చిన్న పిల్లల్ని అపహరిస్తున్నాడు? మళ్ళీ ఇప్పుడు రిథమ్ కొడుకుని కాపాడుకుంటూ కిడ్నాపర్ ని పట్టుకో గల్గిందా? అంజన ఏమైంది? రిథమ్ తెలుసుకున్న అసలు నిజమేంటి? ఇదీ మిగతా కథ.
3
     రాట్ససన్, అంజాం పాథిరా, ఫోరెన్సిక్, సైకో, పొన్మంగళ్ వందాళ్, ఇప్పుడు పెంగ్విన్ ...ఇలా వరుసగా సీరియల్ కిల్లర్ సినిమాలు తమిళ మలయాళాల నుంచి వస్తున్నాయి.  వీటిలో రాట్ససన్, పొన్మంగళ్ వందాళ్, పెంగ్విన్ మూడూ చిన్న పిల్లల కిల్లర్స్ కథలతో వచ్చాయి. అయితే ‘పెంగ్విన్’ తో సమస్య ఏమిటంటే, దీన్ని ఒక విలన్ తో సీరియల్ కిల్లర్ కథలా నడిపించి చీట్ చేయడం. ఒక విలన్ తో సీరియల్ కిల్లర్ కథలా నడిపిస్తూ దాన్ని క్యాన్సిల్ చేసి, ఇంకో విలన్ తో రిథమ్ చిన్నప్పటి వేరే కథగా కొత్త ఖాతా తెరవడం. ఇటీవల తెలుగులో వచ్చిన ‘హిట్’ లో చిన్నప్పుడు ఇద్దరు స్నేహితురాండ్ర మధ్య జరిగే పరిణామాలతో ఎండ్ సస్పెన్స్ ఎలా వుందో చూశాం కదా? అలాటి ఎండ్ సస్పెన్స్ అన్నమాట. ఈ కాలంలో ఇంకా వద్దన్నా సినిమా కథకి ఎండ్ సస్పెన్స్ చేస్తే చేశారు, దోషి (విలన్) ఎవరో తేల్చడానికి రెండున్నర గంటలూ ఓపికని పరీక్షించి, చివరికా విలనెవరో విప్పి చెప్పే ఎండ్ సస్పెన్సేదో కథని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్తూ హై రేంజిలో బ్లాస్ట్ అయ్యేలా చూడాలిగా? ఇలా చేయడం ఎవరికైనా దాదాపూ అసాధ్యమే. అందుకే ఎండ్ సస్పెన్స్  క్లయిమాక్సులు మెట్టు దిగి నేలబారు విషయాలతో తేలిపోతున్నాయి.  

        ఇక సెకండాఫ్ లో రిథమ్ కి సీరియల్ కిల్లర్ దొరుకుతాడు. అతను డాక్టర్ డేవిడ్. చిన్న పిల్లల అవయవాల కోసం అపహరిస్తూంటాడు. ఆ శవాల మధ్య అంజన వుంటుంది. అంజనని కాపాడి డాక్టర్ ని పోలీసులకి అప్పగిస్తుంది రిథమ్. అయితే ఆమె కొడుకుని తను అపహరించ లేదంటాడు. అదెవరో నువ్వే తెలుసుకొమ్మని పరీక్ష పెడతాడు. ఇంకో అరగంటలో సెకండాఫ్ ముగుస్తుందనగా, కొలిక్కొచ్చిందనుకుంటున్న కథ కాస్తా క్యాన్సిల్ అయి, ఇంకో కథ ముందుకొస్తుంది. స్క్రీన్ ప్లే ఇలా ఫ్రాక్చర్ అయి, సెకండాఫ్ సిండ్రోంలో పడుతుంది. ఈ మొదలయ్యే రెండో కథ రిథమ్ చిన్నప్పటి కథ.

        ఐతే ఫస్టాఫ్ అంతా తెలియని విలన్ తో, ఇది మేకర్లకి ప్రియమైన పనికిరాని ఎండ్ సస్పెన్స్ కథ అని తెలిసిపోతూనే వుంటుంది. కానీ సెకండాఫ్ చివరి వరకూ ఆగకుండా, సగంలోనే ఆ విలన్ డాక్టరని తేలడంతో - హమ్మయ్యా ఎండ్ సస్పెన్స్ ప్రమాదం తప్పిందనుకుంటాం. ఇక్కడే ఈ సైకో డాక్టర్  ఫేక్ విలన్ అని తెలియడంతో, మళ్ళీ ఎండ్ సస్పెన్స్ కథే మొదలు!

        డాక్టర్ పాత్రతో ట్రాక్ ఆడియెన్స్ ని చీట్ చేయడమే. సైకో డాక్టర్ పాత్రని ఇన్వెస్టిగేషన్ లో తగిలిన ఒక తప్పుడు లీడ్ గా చూపించి వదిలెయ్యకుండా, అతడికో బ్యాక్ డ్రాప్, కథా, సుదీర్ఘ ఇంటరాగేషన్, హీరోయిన్ తో డ్రామా, బిల్డప్పులతో ఇతనే విలన్ అన్పించేలా చేశారు. ఇతను కాదంటూ డ్రామామీద నీళ్ళు చల్లారు. 

        ‘ప్రిజనర్స్’ లో ఆడపిల్లల కిడ్నాపర్ ని పట్టుకునే ప్రయత్నం చేసే పోలీసు అధికారి ఒకడ్ని ఫాలో అయి, వాడి ఇంట్లో శవాల గుట్టని చూస్తాడు. రెండు మాటల్లో వీడు కిడ్నాపర్ కాదని, వేరే సైకో అని సిబ్బందికి అప్పజెప్పేస్తాడు. ఇది ఫస్టాఫ్ ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఇంకా పాకాన పడని ఇన్వెస్టిగేషన్ ప్రారంభదశలో, ఇదింకో తప్పుడు లీడ్ గా కన్విన్స్ చేస్తుంది. కానీ ‘పెంగ్విన్’ సెకండాఫ్ లో పాకాన పడ్డాక, తప్పుడు లీడే నిజమైన లీడ్ అన్పించేలా ఇంత డ్రామా చేశారు. దీంతో కథ తెగిపోయి ఇద్దరు విడి విడి విలన్లు ఏర్పడ్డారు కథా నియమాలకి విరుద్ధంగా. ఇప్పుడు సైకో డాక్టర్, చివర్లో ఫ్రెండ్ భావన. 

        దీన్ని నివారించాలంటే ఏం చేసి వుండాలి? ఒకే కన్పించని విలన్ తో ఎండ్ సస్పెన్స్ కథ ఎండ్ సస్పెన్స్ కథలా అన్పించకుండా చేసే టెక్నిక్స్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ నుంచీ ‘ధువా’ వరకూ వున్నాయి. ‘రాట్ససన్’ (తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’) కూడా వుంది.
చిన్నచిన్న ఆడపిల్లల్ని చంపే ఈ సైకో కిల్లర్ కథ. పూర్తిగా చూస్తేగానీ ఇది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తెలీకుండా గుట్టుగా వుంటుంది. ఇందులో ఫస్టాఫ్ మధ్యలోనే మధ్యలో టీచర్ పాత్ర మీదికి దృష్టి మళ్ళించి అతనే కిల్లర్ అన్నట్టుగా కథ నడుపుతారు. దీంతో విలన్ రూపంలో అతనే కన్పించి ఎలా దొరుకుతాడా అనే సీన్ టు సీన్ సస్పెన్స్ ఏర్పడుతుంది. ఇంటర్వెల్లో ఇతను కాదని తేల్చేస్తారు. మళ్ళీ కొత్త లీడ్స్ తో కొత్త ఇన్వెస్టిగేషన్. ఈ ఇన్వెస్టిగేషన్ తో చివర్లో అసలు సీరియల్ కిల్లర్ని వెల్లడి చేస్తారు. ఇప్పుడు మాత్రమే చూసిందంతా ఎండ్ సస్పెన్స్ మిస్టరీ అని తేల్చి, ఫ్లాప్ కి దొరక్కుండా బయటపడేలా చేశారు. అంటే టీచర్ రూపంలో బిల్డప్ లేని కరివేపాకు పాత్రతో ఫస్టాఫ్ ని భర్తీ చేస్తూ, కవరింగ్ లెటర్ కథనం చేశారన్న మాట. ‘పెంగ్విన్’ లో ఈ టెక్నిక్ వాడుకోక పెంగ్విన్ లని చిన్నబుచ్చారు.
4
      ఇక రెండో కథగా  మొదలయ్యే రిథమ్ చిన్నప్పటి కథ. రిథమ్ తన ఫ్రెండ్ భావన (నిత్య కృప) మీద అనుమానం వచ్చి పట్టుకుంటే, ఆమె చెప్పుకొస్తుంది చిన్నప్పటి కథ. రిథమ్ చదువులో ఫస్ట్. ఆమెతో పోలుస్తూ తనని వేధించారు పేరెంట్స్. ఆమెలా తను చదవాలి, ఆమెలా తను ఎదగాలి... ఈ టార్చర్ భరించలేక రిథమ్ మీద పగ పెంచుకుంది. తన అర్హతలతో తనకి సొంత ఐడెంటిటీ లేకుండా చేసిన రిథంకి బుద్ధి చెప్పాలనుకుని కొడుకుని కిడ్నాప్ చేసి బంధించింది. ఇలా ఈ ఆరేళ్ళూ రిథమ్ కడుపుకోత చూస్తూ ఆనందం అనుభవించింది తను. 
        ‘హిట్’ లో కూడా చిన్నప్పుడు అనాధాశ్రయంలో తన చెల్లెలి అవకాశం హీరోయిన్ కి పోవడంతో, పెద్దయ్యాక హీరోయిన్ని కిడ్నాప్ చేసి చంపుతుంది హీరోయిన్ ఫ్రెండ్. చిన్నప్పుడు విలన్ తో ఏదైనా జరిగితే, పెద్దయాక అతణ్ణి గుర్తు పట్టి రివెంజి తీర్చుకోవడం జనం మెచ్చిన ఒక బాక్సాఫీసు ఫార్ములా. చిన్నప్పుడు తోటి చిన్నపిల్ల వల్ల ఆమెకి తెలీకుండా ఏదో జరిగిపోతే, దానికి పెద్దయ్యాక పగదీర్చుకోవడం జనం మెచ్చని ఫార్ములా కాని ఫార్ములా. పిల్లలు తోటి పిల్లలతో ఇంకా అగరు. అప్పటి కప్పుడు జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు. జాకెట్లు చింపేసుకుంటారు. అయిపోతుంది ఆరణాల పగ. ఆరణాల పగతో ఐదుకోట్ల మెగా సినిమా తీయనవసరం లేదు. చిన్నప్పుడు పిల్లలకి ప్రేమలు గుర్తుంటాయి గానీ, పగలు గుర్తుండవు.   
5
      అసలు రిథమ్ పాత్ర గోల్ ఏమిటి? తన కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవాలని గోల్ పెట్టుకుంటుంది. ఇది అవసరం లేదు. ఆరేళ్లుగా పోలీసులు సహా ఎవరూ తెలుసుకోలేని విషయం ఇప్పుడనవసరం. కొడుకు తిరిగి వచ్చిందే చాలు. రెండో భర్తతో ఏడు నెలల గర్భంతో వుంది. కడుపులో బిడ్డ, దొరికిన బిడ్డ ఇద్దరూ చాలు. ముందు కొడుకు ఆరోగ్యం బాగు చేసుకుంటే అతనే తర్వాత ఎప్పుడో చెప్తాడు ఎవరు కిడ్నాప్ చేశారో. ఈ తెలుసుకునే బాధ్యత ఈ పెండింగ్ కేసులో పోలీసులకే ఎక్కువ. 

        అయితే ఇప్పుడు పారిపోయి వచ్చిన కొడుకు కోసం అదే చాప్లిన్ మాస్కు కిడ్నాపర్ ప్రయత్నిస్తూంటాడు. ఇది రిథంకి గోల్ కావాలి. ఒక ప్రెగ్నెంట్ వుమన్ గా కొడుకుని కాపాడుకుంటూ కిడ్నాపర్ ని తెగించి పట్టుకునే గోల్ - ఈ గోల్ లో ఆపరేటివ్ ఎమోషన్ వుంటుంది. అంతేగానీ తాననుకున్నట్టు కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవడంలో ఏ ఎమోషనూ లేదు, పైన చెప్పుకున్న కారణాల వల్ల. 

        ఇలావుంటే, అంజన అనే ఇంకో అమ్మాయి కిడ్నాప్ తో రిథంకి కనెక్షన్ లేదు. ఆమె గురించి ఫీల్ కాదు కూడా. డాక్టర్ని పట్టుకున్నాక అక్కడ కాకతాళీయంగా కన్పించిన అంజనని కాపాడుతుందంతే. ఈ కథలో అంజన పాత్ర అవసరం లేదు. 

        పైన చెప్పిన నవలలో, కథానాయిక లీసా వల్ల పొరుగింటి లుసిండా కన్పించకుండా పోతే, అందరి సూటిపోటి మాటలతో లీసా గిల్టీ ఫీలవుతుంది. ఇంతలో సొంత కూతురు కూడా కిడ్నాపై లుసిండా తిరిగొస్తుంది. ఇప్పుడు తన కూతురు మాయమవడంతో ఇక తనేం చేయాలో డిసైడ్ చేసుకుంటుంది. ఈ కిడ్నాపుల గుట్టు రట్టు చేసి, మొదటి అమ్మాయితో  తన మీద పడ్డ నింద తొలగించుకునే బలమైన ఎమోషనల్ గోల్, కూతుర్ని కనుగొనే ఫిజికల్ గోల్ రెండూ ఏర్పడ్డాయి. ఇలా ముందు పొరుగింటి అమ్మాయి కిడ్నాపై తర్వాత కూతురు కిడ్నాపవడంతో, కథ ఏకత్రాటి పైనే వుంది. ‘పెంగ్విన్’ లో సొంత కొడుకు కిడ్నాపై వచ్చాక, పొరుగు అమ్మాయి కిడ్నాప్ అవడంతో, ఈ అమ్మాయితో రిథం కేలాటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా పోయింది. ఎందుకంటే దీనికి తను బాధ్యురాలు కాదు, తననెవరూ నిందించడం లేదు కూడా. 

        ఆఫ్ కోర్స్, మొదటి భర్త నిందించాడు. ఆమె అజాగ్రత్త వల్లే కొడుకు కిడ్నాపయ్యాడని నిందించి, విడాకులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ నింద ఆరేళ్ళ పాటూ కొడుకు తనకి తాను తిరిగి వచ్చేవరకూ మోసిందే తప్ప, ఏమీ చేయలేక పోయింది. కొడుకు రావడంతో నిందా తొలగిపోయింది, మొదటి భర్తా క్షమించమన్నాడు.
6
    ఈ కథలో ‘హిడెన్ ట్రూత్’ రిథమ్ ఫ్రెండ్ భావన చిన్నప్పటి పగ. చిన్నప్పుడు భావన తన మీద పగ ఫీలయిందని రిథంకి తెలీదు. అయితే వర్తమాన కథలో కొడుకు తిరిగొచ్చాక, కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుకోవాలన్న తపన రిథమ్ కి ఆమె సబ్ కాన్షస్ పరంగా కరెక్టే. అయితే కొత్త దర్శకుడు ఇలా పలుకుతున్న ఆమె సబ్ కాన్షస్ ని పట్టుకుని, ఓపెనింగ్ ఇమేజిని కరెక్టు చేసుకోవాలని తెలుసుకోలేదు.   సినిమా ఓపెనింగ్ ఇమేజి ఎలా వుంటుందంటే, పొగమంచు... సరస్సు... ఎల్లో హుడ్ వేసుకున్న రెండేళ్ళ పిల్లాడు... వెంట కుక్క పిల్ల... ఇంతలో ఎల్లో గొడుగుతో చాప్లిన్ మాస్కు వేసుకున్న కిల్లర్... పిల్లాడి గొంతు కసక్ మని కోసి సరస్సులోకి అలా అలా మాయం...   
 
        థ్రిల్లర్ కి చాలా క్వాలిటీతో వున్న పొయెటిక్ సీన్. దర్శకుడి ఉత్తమాభిరుచి. కానీ విజువల్సే సినిమా కాదు. విజువల్స్ కి కథాత్మ జతపడాలి. ‘ఇట్’ అనే హాలీవుడ్ మూవీలో పిల్లల అపహర్త ఇలాటి ఒక మాస్కులోనే వుంటాడు. ఇది ఇన్స్ పిరేషనేమో. కానీ ఈ ఓపెనింగ్ ఇమేజికి కథతో, కాన్సెప్ట్ తో సంబంధంలేదు. పైగా ఇది రిథమ్ కనే ఓ పీడ కల మాత్రంగానే వుంటుంది. కానీ దర్శకుడు స్క్రిప్టులో సరైన దృష్టి పెడితే, ఆమె సబ్ కాన్షస్ విలువ లేని ఈ కలని ప్రసారం చేయడం కాదు, తనకే తెలియని విలువైన ఒక సమాచారం అందించడానికి ప్రయత్నిస్తూంటుంది. ఇందుకే దర్శకుడు, ఆమె కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారో తెలుసుకోవాలనే గోల్ ని స్క్రిప్టులో అప్రయత్నంగా అక్షరీకరించాడు. దీనికి ఓపెనింగ్ ఇమేజి కూడా తోడైతే, ఈ గోలే బలమైన ఎమోషన్ గల ఆపరేటింగ్ గోల్ అయ్యేది. కొడుకుని ఇలా ఎవరు తయారు చేశారు? - అన్న ప్రశ్నలోనే కథాత్మతో కూడిన ఓపెనింగ్ ఇమేజి దాగి వుంది. ఆ కథాత్మ లేదా మిస్టరీ - చిన్నప్పుడు ఫ్రెండ్ భావనతో కూడిన పగ. హిడెన్ ట్రూత్. తనకి తెలీని సమాచారం. ఈ హిడెన్ ట్రూత్ ని అందించాలని ఆమె సబ్ కాన్షస్ ప్రయత్నిస్తున్నట్టయితే, అప్పుడు తదనుగుణ మైన ఓపెనింగ్ ఇమేజి వెండి తెరనలంకరించేది.

        మాస్కు కిల్లర్ తన రెండేళ్ళ కొడుకుని చంపినట్టు కల రావడం అయిపోయిన కథ. మాస్కు కిల్లర్ భావనకి సంబంధించిన అస్పష్ట మయా దృశ్యాలని ఏర్పర్చడం అవ్వాల్సిన కథ. ఓపెనింగ్ ఇమేజికి అవ్వాల్సిన కథ కావాలి, అయిపోయిన కథ కాదు. వెంటాడుతున్న ఈ అస్పష్ట ఓపెనింగ్ ఇమేజికి అర్ధమేమిటాని హిడెన్ ట్రూత్ కి దారి తీసే ఆమె అన్వేషణ కావాలి. 

        2003 లో అనురాగ్ బసు దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘సాయా’ (నీడ) లో, హీరో జాన్ అబ్రహాం కి నీళ్ళే నీళ్ళు ఎదురవుతూంటాయి. సీలింగ్ కూడా కారిపోతూ  నీళ్ళు నిండి పోతూంటాయి. ఎందుకిలా జరుగుతోందో అర్ధం గాదు. చనిపోయిన భార్య (తారా శర్మ) ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుంటాడు. డాక్టర్ గా ఆమె ఈశాన్య రాష్ట్రంలో వైద్య బృందంలో వెళ్లినప్పుడు వరదల్లో కొట్టుకు పోయింది. మృత దేహం కూడా లభించలేదు. గర్భవతిగానే తనువు చాలించింది. ఇప్పుడు నీళ్ళు కురిపిస్తూ భార్య తనకి చెప్పాలని ప్రయత్నిస్తోందేమిటో తెలుకోవాలని ఈశాన్య రాష్ట్రానికి వెళ్తాడు. తెలుసుకుంటే ఆమె సజీవంగానే గిరిజనులకి దొరికింది. పురుడు పోయగానే చనిపోయింది. వాళ్ళే దహన సంస్కారాలు చేసి బిడ్డని పోషించుకుంటున్నారు. ఆ బిడ్డని చూసుకుంటాడు జాన్ అబ్రహాం. ఇలా బిడ్డ దగ్గరికి తనని చేరేసేందుకు సింబాలిక్ గా వరదల్ని గుర్తుచేసే జల ధారలతో తనతో సంభాషించిందన్న మాట భార్య. ఇది సింబాలిజంతో కూడిన వెంటాడే హిడెన్ ట్రూత్.
7
     దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కొత్త దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ కి అవకాశ మిచ్చి ‘పెంగ్విన్’ నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ ఎక్కడా సినిమాలకి పని చేయలేదు. సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ నూవీస్ ఏవీ తీసిన అనుభవం లేదు. నాటకరంగంలో వుంటూ సినిమా కథ రాసుకొచ్చేసి ‘పెంగ్విన్’ తీసేశాడు. మేకర్ గా మంచి ప్రతిభ కనబర్చాడు. రైటర్ గా ఎందరో లాగా తప్పకుండా విఫల మవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఎంతగానంటే సెకండాఫ్ భరించలేనంత. పైన చెప్పుకున్న లోపాలతో సెకండాఫ్ నీలగిరి లోయల్లోకి వెళ్ళిపోయింది. మనమే ఎలాగో విరిగే కొమ్మ అంచు పట్టుకుని కొన ప్రాణాలతో వేలాడుతూంటాం. ఈ సాహసానికి ఇస్తే అవార్డు మనకే ఇవ్వాలి. ఫస్టాఫ్ కథా కథనాలు వాటి దృశ్యీకరణతో  క్లాస్ గా వున్నాయి. అరగంటలో ప్లాట్ పాయింట్ వన్ వచ్చే వరకూ, రిథమ్ ఫ్లాష్ బ్యాక్స్ మధ్య ప్రస్తుత జీవితం చూపిస్తూ, కొడుకు తిరిగి రావడంతో ప్లాట్ పాయింట్ వన్ వేసి, ఆమెకి గోల్ నిచ్చాడు. అదే సమయంలో మాస్క్ కిల్లర్ ని యాక్టివేట్ చేసి మిడిల్ కెళ్ళి పోయాడు. 

        అలాగే సెకండాఫ్ లో డాక్టర్ తో ఫేక్ డ్రామా ముగించి, కొత్త అన్వేషనతో ప్లాట్ పాయింట్ టూ నిచ్చాడు. కానీ ఇంటర్వెల్లో కొడుకు మీద వయోలెంట్ షాట్ వేశాక, ఇక సెకండాఫ్ అంతా షాట్స్ మిస్సవుతున్న ఫైరింగే చేసుకుంటూ వెళ్లి అమెజాన్ కప్పగించాడు. తమిళనాడులో బయ్యర్లు హేపీగానే వున్నారు, లాక్ డౌన్ పుణ్యమాని దీన్నుంచి తాము తప్పించుకున్నందుకు. 

        విజువల్ క్వాలిటీకి కెమెరా మాన్ కార్తీక్ పళని దోహదం చేశాడు. సాంప్రదాయ షాట్స్ వల్ల టేస్ట్ ఏమిటో తెలిసింది. ఎడిటింగ్ కూడా స్మూత్ ఎడిటింగే. ఎక్కడా పాప్ కార్న్ ఎడిటింగ్ చేయలేదు. స్వరాలతో సంతోష్ నారాయణ్ కూడా కథానాయిక పేరు రిథమ్ లాగే, ఒకే రిథమ్ ని మెయింటైన్ చేస్తూ క్లాస్ టచ్ నిచ్చాడు. 

        ఇక హీరోయిన్ కీర్తీ సురేష్. పూర్తి విషాద పాత్రలో, తనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ తో అవార్డుకి అర్హమైనట్టు నటించింది...

సికిందర్