రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 10, 2019

796 : రివ్యూ
రచన - దర్శకత్వం : సుజోయ్ ఘోష్
తారాగణం : అమితాబ్ బచ్చన్, తాప్సీ, అమృతా సింగ్, టోనీ ల్యూక్, తన్వీర్ ఘనీ, మానవ్ కౌల్ తదితరులు
మాటలు : రాజ్ వసంత్, సంగీతం : ఆమాల్ మాలిక్, అనుపమ్ రాయ్, క్లింటన్ సెరేజో, ఛాయాగ్రహణం : అవీక్ ముఖోపాధ్యాయ్
బ్యానర్స్ : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, అజురే ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : గౌరీ ఖాన్, సునీర్, అక్షయ్, గౌరవ్

విడుదల : 8 మార్చి, 2019
***
          ‘పింక్’ జంట మరో క్రైం థ్రిల్లర్ తో వచ్చారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ మరో కోర్ట్ రూమ్ డ్రామాకి తెరలేపారు. కాకపోతే ఈసారి హోటల్ గదిలో. క్రైం థ్రిల్లర్స్ ని ప్రొఫెషనల్ కథా కథనాలతో తీస్తున్న బెంగాలీ దర్శకుల్లో ఒకడైన సుజోయ్ ఘోష్ ఈసారి లొకేషన్ ని యూరప్ కి మార్చేశాడు. ‘పింక్’ తో పాపులరైన అమితాబ్ - తాప్సీల కాంబినేషన్ లో మరో థ్రిల్లర్ అంటే, ‘పింక్’ ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షక సమూహం ‘బద్లా’ కి బదలాయింపు జరగడమే. మరి అలా జరిగిందా? దీని పరిధి ఎంత? అసలీ ప్రతీకార (బద్లా) -  రివెంజి డ్రామా దేని గురించి? ఇవి తెలుసుకుందాం...

కథ
      స్కాట్లాండ్ బిజినెస్ వుమన్ నైనా సేథీ (తాప్సీ - తాపసీ?) బాయ్ ఫ్రెండ్ అర్జున్ (టోనీ ల్యూక్)  హత్యకేసులో నిందితురాలు. ఆమె కంపెనీ లాయర్ జిమ్మీ (మానవ్ కౌల్) ఈ కేసు వాదించడానికి ప్రముఖ సీనియర్ లాయర్ బాదల్ గుప్తా (అమితాబ్ బచ్చన్) ని మాట్లాడి పంపిస్తాడు. నైనాని కలుసుకున్న బాదల్, ప్రాసిక్యూషన్ కి కొత్త సాక్షి దొరికాడనీ, ఆ కీలక సమాచారమున్న సాక్షిని ఇంకో  మూడు గంటల్లో జడ్జి ముందు ప్రవేశ పెట్టబోతున్నారనీ, కనుక  ఏం జరిగిందో త్వరగా చెప్తే కోర్టులో ఆ సాక్షిని ఎదుర్కొంటాననీ అంటాడు. 

          నైనా చెప్పుకొస్తుంది - పెళ్ళయి భర్తా కూతురూ వున్న తను పెళ్ళయిన అర్జున్ తో సంబంధం పెట్టుకోవడం తప్పని తెలుసుకుని కొన్ని నెలల క్రితమే విడిపోయింది. ఐతే ఎవరో బ్లాక్ మెయిలర్ కాల్ చేసి వాళ్ళిద్దర్నీ డబ్బు తీసుకుని హోటల్ కి రమ్మంటే వెళ్లారు. అక్కడ ఎవరో కొడితే నైనా కళ్ళు తిరిగి పడిపోయింది. లేచి చూస్తే అర్జున్ చచ్చి పడున్నాడు. పోలీసులకి అర్ధం గాలేదు. డోర్ లోపలి నుంచి లాక్ చేసి వుంటే, హంతకుడు బయటికి ఎలా వచ్చి వెళ్ళిపోయాడు? అనుమానం నైనా మీదికే వెళ్ళింది. అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలారు. 


        ఇది విన్న బాదల్, ఆమెని కాపాడడానికి ఇది సరిపోదనీ, సరీగ్గా పూర్తి నిజం చెప్పమనీ వొత్తిడి చేస్తాడు. అప్పుడు నైనా చెప్తుంది - ఆమే, అర్జున్ ఒక రిసార్ట్స్ లో గడిపి వస్తూ ఈ రిలేషన్ షిప్ ని ముగిద్దామని మాట్లాడుకుంటు ప్పుడు, కారు కంట్రోలు తప్పడంతో అవతలి కారు ప్రమాదానికి గురైంది. ఆ కారులో సన్నీ అనే యువకుడు చనిపోయాడు. అతడి సెల్ ఫోన్ చూస్తే డ్రైవింగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నట్టు వుంది. ఇందులో తన తప్పేం లేదనీ, ఇతనే మెసేజీలు పెడుతూ కంట్రోలు తప్పాడనీ, పోలీసులకి కాల్ చేద్దామని ఆమె చెప్పినా అర్జున్ వినలేదు. అలాచేస్తే తమ సంబంధం తెలిసిపోతుందనీ, వీడి కారు సహా నీట్లోకి తోసెయ్యమనీ చెప్తే తోసేసింది తను. 

          ఆ సన్నీ తల్లి రాణి (అమృతా సింగ్) ఎలాగో తెలుసుకుని తనని పట్టుకుని, కొడుకు శవం ఎక్కడుందో చెప్పకపోతే అంతు చూస్తానని బెదిరించింది... ఇదీ సమస్య. ఇప్పుడు ఒకటి కాదు, రెండు హత్యల్లోంచి నైనాని బాదల్ ఎలా కాపాడేడు? కాపాడేడా లేక...


ఎలావుంది కథ
      ఇది ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ అనే స్వీడిష్ క్రైం థ్రిల్లర్ కి అధికారిక రీమేక్. ఇలాటి క్రైం థ్రిల్లర్స్ లో, ఇంకా ఫిలిం నోయర్ జానర్ క్రైం థ్రిల్లర్స్ లో, కథలు కర్మ ఫలాన్ని అనుభవించేలా చేస్తాయి. చట్టానిదే పై చేయిగా వుంటాయి. కర్మ ఫలం, విధి, నైతిక విలువలు అనే ఫిలాసఫీల్ని బేస్ చేసుకుని చట్ట కథలు చెప్తాయి. నైనా, అర్జున్ లు రహస్య సంబంధాన్ని ముగించుకుని జీవిత భాగస్వాములతో వుందామనుకున్నారు. అది కూడా జీవిత భాగస్వాముల్ని మోసం చేయడమే. తప్పు చేశామని వాళ్లకి చెప్పేస్తే అది వేరు. అందుకని విధి కారు ప్రమాదం రూపంలో ముంచుకొచ్చి వాళ్ళని ఇరుక్కునేలా చేసింది. అలా జీవిత భాగస్వాములకి తెలిసిపోయేలా చేసి కర్మ ఫలాన్నిఅనుభవించమంది. మరి ఇందుకు అన్యాయంగా ఒకణ్ణి బలి తీసుకుందే అంటే, కాదు. అవతలి కారులో చనిపోయిన వాడు తక్కువేమీ కాదు, బ్యాంకులో అవినీతి చేస్తున్నాడు. 

          అయితే ఈ కథని రీమేక్ చేస్తూ రోల్ రివర్సల్ చేశాడు దర్శకుడు. ఒరిజినల్ లో లాయర్ గా ఫిమేల్ ఆర్టిస్టు వుంటుంది, నిందితుడుగా  మేల్ ఆర్టిస్టు వుంటాడు. ఈ రీమేక్ లో లాయర్ గా అమితాబ్ వుంటే, నిందితురాలిగా తాప్సీ వుంటుంది. అయితే కహానీ, కహానీ - 2 ల వంటి రెండు హిట్ క్రైం జానర్లు తీసిన దర్శకుడు సుజోయ్ ఘోష్, ఈసారి రీమేక్ కి వెళ్ళాడు. తనదైన మరో వొరిజినల్ కంటెంట్ తో రావాల్సింది.
ఎవరెలా చేశారు 
      ఇది అమితాబ్ కి పింక్’ లాంటి పవర్ఫుల్ పాత్ర. ‘పింక్’ లో తాప్సీని కాపాడే క్రిమినల్ లాయర్ గా ఆవేశంతో దృశ్యాల్ని జ్వలింప జేసినట్టు గాక, చాలా కూల్ గా వ్యవహరించే పాత్ర. ఒక గదిలోనే  డైలాగ్ ఓరియెంటెడ్ గా సాగే ఈ డ్రామాలో నిజాన్ని బయటికి తీయడానికి ఎత్తుకి పై ఎత్తులేసే, ఎనలైటికల్ స్కిల్స్ వున్న పాత్ర. కేసు వివరాలతో,  క్లూస్ విశ్లేషణలతో అమితాబ్ వాక్ప్రవాహం కట్టి పడేస్తుంది. ఒక్క కేసూ ఓడిపోని నలభై ఏళ్ల ట్రాక్ రికార్డ్ వున్న క్రిమినల్ లాయర్ పాత్రగా ఓ గదిలో అంతసేపూ నటించి మెప్పించడానికి వయస్సు అడ్డురాలేదు. పైగా స్టామినా పెరిగిపోయింది. అమితాబ్ కాకుండా మరొకరు ఈ డ్రామాతో ఆకట్టుకోవడం కష్టమే. 

          ఎదుటి పాత్రగా తాప్సీ ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆలోచనాత్మకంగా ఆచితూచి తూకం వేసి విషయాలు వెల్లడిస్తుంది. ఈ సైకలాజికల్ గేమ్ లో అవకాశం దొరికినప్పుడల్లా అమితాబ్ ని ఔట్ చేసేస్తూంటుంది. ఈ మానసిక చదరంగపు ఆటలో థ్రిల్లింగ్ గా పావులు కదపడం- అదీ నలబై ఏళ్ల అనుభవమున్న మహా క్రిమినల్ లాయర్ తో - ఆమెకెలా సాధ్యమంటే,  అప్పటికే ఆమె కొమ్ములు తిరిగిన బిజినెస్ వుమన్. ఈ పాత్రలో తాప్సీ ఓ మెట్టు పైకెక్కింది.           మూడో పాత్ర నాటి పాపులర్  హీరోయిన్ అమృతా సింగ్ పోషించిన రాణి పాత్ర. ‘కలియుగ్’ లో పోర్న్ వెబ్ సైట్ ఓనర్ గా నెగెటివ్ పాత్రని గుర్తుకు తెచ్చే నటన. కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకునే టైటిల్ రోల్ పోషించింది. ప్రతీకారం తీర్చుకునే టెక్నిక్ తో క్లాస్ నటన. భర్త నిర్మల్ గా తన్వీర్ ఘనీ ముగింపు ట్విస్టుకి పనికొచ్చే కీలక పాత్ర. 

          ఇందులో ఐదు పాటలు సందర్భానుసారంగా వచ్చేవే. టైటిల్ సాంగ్ ‘బద్లా’ రెండర్ధాలతో ఇలా సాగుతుంది - ఏయ్ పిల్లోడా లోకం మారింది జాగ్రత్త. కురుల స్టయిల్, నకిలీ నవ్వు, అబద్ధపు ప్రొఫైల్ మారాయి జాగ్రత్త. కథలో ఎప్పుడు కర్త మారతాడో ఎవరికీ తెలీదు జాగ్రత్త. పెట్రోలు ఎనభై అయింది, పాకెట్ సైజు మారింది జాగ్రత్త. ఆధునిక ప్రేమలు,  సూపర్ స్టార్ బజార్లు మారాయి జాగ్రత్త. పాత కల్చర్ ఇంటింటా రావాలి, లోకం మారింది జాగ్రత్త.... కళ్ళని కళ్ళతో తీర్చుకో పగ. కలల్ని కలలతో తీర్చుకో పగ. మాటల్ని మాటలతో తీర్చుకో పగ. స్నేహాన్ని స్నేహంతో తీర్చుకో పగ...డాలర్ ధర, వడపావ్ ఆకారం మారాయి జాగ్రత్త. వార్తలు, పేపర్లు మారాయి జాగ్రత్త. చావు బతుకులు డైలీ చూస్తూ దేవుడు మారలేదు రోయ్...

          చాలా క్రేజీ పాట. పగా ప్రతీకారాలకీ, ఏదైనా మారిందనడానికీ బద్లా అనే ఒకే పదం వుంది హిందీలో. మారిందనడానికి లేదా మారాడనడానికీ బదల్ గయా అని కూడా అనొచ్చు. అదన్న మాట. ఇలా ఒక చరణం బద్లా అంటూ మారిన సంగతులు చెప్తూ, ఇంకో చరణం బద్లా అంటూ ప్రతీకారాల గురించి చెప్పడం. నిజానికి ఈకథ ప్రతీకారం గురించే నడిచినా, ముగింపులో కథంతా ఎలా మారిపోయిందో కూడా చూపిస్తుంది. ఇలా ‘బద్లా’ టైటిల్ ని చాలా క్రియేటివ్ గా రెండంచుల కత్తిలా కథకి రెండర్దాలతో వాడారు. మనోజ్ యాదవ్, అనుపమ్ రాయ్ లు రాశారీ పాట. అనుపమ్ రాయ్ పాడేడు.  

          నేపధ్య సంగీతంలో కూడా క్రియేటివిటీ వుంది. ప్రారంభం నుంచీ ముగింపు దాకా ఒకటే రేంజిలో ట్యూన్ చేయకుండా, సన్నివేశాలు మామూలుగా వున్నప్పుడు రేంజి తగ్గిస్తూ, సన్నివేశం విషమించినప్పుడు సడెన్ గా పెంచి షాకిస్తూ -  నేపధ్య సంగీతంతో కూడా కథ చెప్పారు. కారు ప్రమాదం జరిగి నైనా, అర్జున్ లిద్దరూ మంతనాలడుకుంటున్నప్పుడు, ఇంకో కారు వచ్చేస్తూంటే, ప్రమాదంలో పడ్డామనుకుని  అర్జున్ తమ కారు కేసి కంగారుగా నడిచి వస్తున్న  సీనుకి ఆర్ ఆర్ టెర్రిఫిక్. 

          మంచు కురిసిన స్కాట్ లాండ్ లొకేషన్స్ -  మర్డర్ మిస్టరీలకిచ్చే లేత బ్లూ మసక వెలుతురులో మిస్టీరియస్ వాతావరణాన్ని సృష్టిస్తూ వుంటుంది. ఈ క్రైం థ్రిల్లర్ యాక్షన్ సీన్స్ లేకుండానే బోలెడు వెర్బల్ యాక్షన్ తో వుంది.


చివరికేమిటి 
       మెదడుకి మేత. పొరలు పొరలుగా వీడే సస్పెన్స్. ఒక సస్పెన్స్ పొర విప్పగానే అందులోంచి ఇంకో సస్పెన్స్  పొర. గదిలో అమితాబ్ తాప్సీల వెర్బల్ యాక్షన్, ఫ్లాష్ బ్యాక్స్ లో ఆమె  చెప్పే జరిగిన సంఘటనలు.  వాటిని ఇంకోలా సరిచేసే  అమితాబ్ వూహాగానాల మాంటేజెస్. రెండు మిస్టరీలున్నాయి : లోపలినుంచి లాక్ చేసిన హోటల్ గదిలో హంతకుడు హత్య చేసి ఎలా వెళ్ళాడు? రెండోది, నైనా యువకుడి శవం సహా కారుని నీట్లోకి తోసినప్పుడు నిజంగానే చచ్చి పోయి వున్నాడా? అసలు గదిలో హంతకుడి వేలిముద్రలే లేకపోవడం నైనా కథనాన్ని అబద్ధం చేసేసే ఫోరెన్సిక్ సాక్ష్యం. నైనా కారుని నీట్లోకి తోసినప్పటికే యువకుడు చనిపోయి వుంటే ఇలాకూడా  నైనా ని పట్టించే అటాప్సీ సాక్ష్యం.

          అయితే హోటల్ గది క్రైం సీన్లో పోలీసులు చేతులకి గ్లవ్స్ లేకుండా అన్నీ ముట్టుకోవడం, అలాగే నైనా పాయింటాఫ్ వ్యూలో హంతకుడు ఆ గదిలో చేతులకి గ్లవ్స్ లేకుండా అన్నీ ముట్టుకోవడం వంటివి బావుండవు. హోటల్ గదిలో ఎవరో తనని కొడితే కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పిన నైనాకి వైద్యపరీక్షలు నిర్వహిస్తే నిజమో అబద్ధమో తెలిసిపోతుంది. ఈ పని చేయకుండా,  లాక్ చేసిన గదిలో అర్జున్ తో పాటు ఆమె ఒక్కతే  వుందన్న బలహీన సర్కమ్ స్టేన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు ఆమె మీద కేసు పెడతారు. 

          తల్లులైన నైనా, రాణీ ల మధ్య ఇంటర్వెల్ సీను వస్తుంది. నా కొడుకుని బలిగొన్న నువ్వు  నీకో కూతురుందని మర్చి పోయావ్. నాకు కొడుకే లేకపోయాక నేను పోగొట్టుకునే దేమీ వుండదింకా... బిడ్డకి దూరమవడంలోని నరకమెలా వుంటుందో ఇక నీకు రుచి చూపిస్తా - అన్న రాణి హెచ్చరిక మదర్ సెంటి మెంటుతో ఈ మర్డర్ల కథకి బలమైన ఎమోషనల్ డెప్త్ నిస్తుంది. మహిళా దినోత్సవం నాడు విడుదలైన ఇది నెగెటివ్ కోణంలో చిత్రించినట్టయింది. రోల్ రివర్సల్ వల్ల ఇలా జరిగింది. ఒరిజినల్ లో వున్నట్టుగా అమితాబ్ స్థానంలో తాప్సీ వుంటూ, తాప్సీ స్థానంలో అమితాబ్ వుంటే  మహిళా విజయంగా వుండేది.       రోల్ రివర్సల్ వల్ల ప్రేక్షకుల్ని పరిమితం చేసుకున్నట్టు కూడా అయింది. ‘పింక్’ అంత ఘన విజయం సాధించడానికి కారణం అది అమ్మాయిల్నీ కుటుంబాల్నీ కూడా ఆకర్షించడం. హైదరాబాద్ లో తెలుగు అమ్మాయిలూ కుటుంబాలూ కూడా విపరీతంగా చూశారు. ఇందులో నైట్ లైఫ్ పేరిట యూత్ పాల్పడుతున్న కార్యకలాపాల్లో తాప్సీ ఇరుక్కుని, లైంగిక దాడిని ప్రతిఘటించి, హత్యా యత్నం కేసులో వుంటుంది. ఆమె లాయర్ గా అమితాబ్ బచ్చన్ కోర్టులో మొత్తం అమ్మాయిలందరి ప్రతినిధిగా వాదిస్తాడు. ఈ రియల్ లైఫ్ డ్రామా అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. ‘బద్లా’ కి ఈ అవకాశం లేకుండా పోయింది. రోల్ రివర్సల్ వల్ల ఇది హీరోయిన్ తాప్సీ వివాహేతర సంబంధం పెట్టుకుని, అకృత్యాలకి పాల్పడ్డ నెగెటివ్ షేడ్ గల కథగా మారిపోయింది. దీంతో ప్రేక్షకుల్లో మగ మహానుభావులకే పరిమితమైంది. 

          మరొకటేమిటంటే, ఇందులో అమితాబ్ లాంటి మహానటుడు కేసులో తాప్సీ ని పట్టుకునే కథ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా వుంది. ‘పింక్’ లో పిచ్చుక లాంటి తాప్సీ ని అమితాబ్ కాపాడడం సరైన డ్రామాగా వుంది. ‘బద్లా’ లో  జరగాల్సింది ఒరిజినల్ లోని పాత్రల్ని మార్చడం కాదు, ‘పింక్’ ని రివర్స్ చేయడం. ‘పింక్’ లో లాయర్ గా అమితాబ్ తాప్సీని కాపాడేడు. ‘బద్లా’ లో లాయర్ గా తాప్సీ  అమితాబ్ ని కిల్లర్ గా పట్టుకుని వుంటే భలే మజా వచ్చేది. ఈ మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోలేదు.  


         
ఈ మర్డర్స్ మిస్టరీతో ఎండ్ సస్పెన్స్ కథ ఎండ్ సస్పెన్స్ కథనపు సుడిగుండంలో పడి గల్లంతవకుండా వున్న ఏకైక ఫార్ములాని అనుసరించారు. ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ ప్రవేశ పెట్టిన ఫార్ములా. దీని రీమేక్ గా హిందీ ‘ధువాఁ’  అనుసరించిన ఫార్ములా -  ముసుగు తొడిగిన కథ!

సికిందర్ 
Watched at : Prasads
 9 pm,  March 8, 2019

Saturday, March 9, 2019గీతగోవిందంనిర్మాతపై ఐటీ దాడి: వచ్చిందెంత, కట్టిందెంత?
      విజయ్ దేవరకొండ, రశ్మికా మందన హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందంబాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేసింది. స్టార్ హీరోల సినిమాలకు మాత్రం తీసిపోకుండా భారీ వసూళ్లు సాధించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. నేపధ్యంలో గీతగోవిందంసినిమా నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి పడింది. అందుతున్న సమాచారం మేరకు శుక్రవారం సినిమా నిర్మాతల కార్యాలయాలకు వచ్చిన ఐటీ అధికారులు సినిమా కలెక్షన్లు, చెల్లించిన పన్ను వివరాలను పరిశీలించారు.

        హైదరాబాద్, బంజారాహిల్స్లోని జీఏ 2 పిక్చర్స్కార్యాలయానికి వచ్చిన ఐటీ యూనిట్– 14 బృందం, వసూళ్ల రికార్డులను పరిశీలించింది. సినిమా సుమారు రూ. 130 కోట్ల వరకూ వసూలు చేసివుంటుందని భావిస్తున్న అధికారులు, మేరకు పన్నులను చెల్లించారా? లేక ఏమైనా ఎగ్గొట్టారా? అసలు సినిమా వసూళ్లు ఎంత? అన్న వివరాల లెక్కలు తీస్తూ, నిర్మాణ సంస్థ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
        జీఏ 2 పిక్చర్స్గతంలో తీసిన రెండు సినిమాల వివరాలు, వాటి ఆదాయాలను, లెక్కలను కూడా పరిశీలించారు. కార్యాలయ సిబ్బందితో పాటు నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించారు. గీత గోవిందం సినిమాకు చెందిన నిర్మాతలు ఆదాయ పన్ను ఎంత కట్టారు అనే విషయం తెలియాల్సి ఉంది.

 (ఈ ఐటీ అధికారులు పార్టీలకి అమ్ముడుబోయి పార్టీల్ని ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని పట్టుకుని లెక్కలెందుకు అడగరు. ఇరవై కోట్లు, ముప్ఫై కోట్లు పార్టీలు ఇచ్చి కొనుక్కుంటున్నట్టు, వీళ్ళు అమ్ముడుబోతున్నట్టు వార్తలొస్తున్నాయిగా. పశువుల్ని కొన్నట్టు కొనుక్కుంటున్నారని కూడా ఎదుటి పార్టీలు ఆరోపిస్తూనే వున్నాయిగా. ఇంకేం కావాలి. అక్కడికెందు కెళ్ళరు?)Tuesday, March 5, 2019

795 : సందేహాలు - సమాధానాలుQ :  సీన్ స్ట్రక్చర్ (యాక్షన్ – రియాక్షన్) గురించి వివరిస్తారా?
Hare e Sh, AD Hare
A :  సీన్ స్ట్రక్చర్ గురించి వివరించాలంటే చాలా వుంటుంది. బ్లాగులోనే ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో సవివరంగా వుంది.  సీన్లు అన్నిటినీ ఒకే గాటన కట్టి వివరించలేం. బిగినింగ్ లో వుండే సీన్ల సీనిక్ బిజినెస్ ఒక ఉద్దేశంతో వుంటే, మిడిల్ లో వచ్చే సీన్ల సీనిక్ బిజినెస్ మరో ఉద్దేశంతో  వుంటుంది. అలాగే ఎండ్ లో సీనిక్  బిజినెస్ ఇంకో ఉద్దేశంతో  వుంటుంది. అన్నిటి స్ట్రక్చర్ ఒకటే. స్ట్రక్చర్ లోపల జరిగే వాటి బిజినెస్సులు అంకాల వారీగా వేర్వేరు. స్క్రీన్ ప్లే మొత్తానికి త్రీ యాక్ట్స్ (బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అంకాలు) ఎలా వుంటాయో ప్రతీ సీనుకీ అలా అంకాలు వుంటాయి. ప్రతీ సీనూ అందులోని విషయంతో బిగినింగ్ తో మొదలై, మిడిల్ తో నడిచి, ఎండ్ తో ముగుస్తుంది. ఏ సీను అయినా ఎక్కడ్నించి వస్తుంది? సీను విడిగా ఎక్కడ్నించీ పుట్టుకు రాదు. సీనుకి విడిగా అస్తిత్వం లేదు. ఏ సీనైనా ఒక సీక్వెన్స్ లో భాగంగా పుట్టి బతకాల్సిందే. ప్రతి సినిమా కథలో ఎనిమిది  సీక్వెన్సు లుంటాయి. కొన్ని సీన్లు కలిపితే  ఒక సీక్వెన్స్, ఎనిమిది  సీక్వెన్సులు కలిపితే ఒక స్క్రీన్ ప్లే. ముందుగా సీక్వెన్స్ అంటే ఏమిటో అర్ధం జేసుకుంటే, దాని లోపల సీన్ల కర్తవ్యమేమిటో బోధపడుతుంది.

         
ఏ సినిమా కథకైనా – అదెంత అట్టర్ ఫ్లాప్  సిగ్రేడ్ సినిమా అయినా, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేల్లో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లోనే సీక్వెన్సులు లేని బలహీన కథ అల్లారు. ఈ సినిమా మొత్తం మీద రెండే రెండు సీక్వెన్సు లుంటాయి. ఫస్టాఫ్ అంతా ఒకే సీక్వెన్స్, సెకెండాఫ్ అంతా కలిపి ఒకే సీక్వెన్స్! స్ట్రక్చర్ ని నిర్లక్ష్యం చేస్తే ఇంతే జరుగుతుంది. ఏ  సినిమా కథనైనా నిలబెట్టేవి ఎనిమిది సీక్వెన్సులు. బిగినింగ్ లో రెండుమిడిల్ లో నాల్గుఎండ్ లో రెండు చొప్పున వుంటాయి (పటం చూడండి). 

 కాలపరీక్షకు తట్టుకు నిలబడింది ఈ ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ల నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు  కథనాన్ని  రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్లే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ల నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వెన్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీలా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి. మహేష్ మంజ్రేకర్ సంజయ్ దత్ తో తీసిన వాస్తవ్లో నైతే, సీక్వెన్సులే కాదు- ప్రతీ సీను కూడా ఓ మినీ మూవీయే! ప్రతీ సీనులో కూడా ఆ సిను తాలూకు స్ట్రక్చర్ లో బిగినింగ్- మిడిల్- ఎండ్ లు స్పష్టంగా వుంటాయి.

          స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు
, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్య స్థాపనా జరిగిపోతే చప్పున అరగంట- ముప్పావు గంట లోపల కథ పాయింటు కొచ్చే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షణాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్లి ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి  క్లయిమాక్స్ కొస్తుంది కథ. ఇదీ స్టాండర్డ్ స్క్రీన్ ప్లేల్లో జరిగే తంతు. 

          ఈ సీన్లు, సీక్వెన్సుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఏ సీనైనా ఈ రెండు ఉద్దేశాల్లో ఒక ఉద్దేశంతో వుంటుంది : పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమో, లేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో. ఇది ఆ సీనులో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో జరుగుతుంది. ఒకసారి యూట్యూబ్ లో ‘జస్టిస్ చౌదరి’ క్లిక్ చేసి, 51.25 నుంచి 53.39 వరకూ రెండు నిమిషాల సీను చూడండి. ఈ సీనులో జస్టిస్ చౌదరిగా ఎన్టీఆర్, పాపారావుగా సత్యనారాయణ వుంటారు. 

          చౌదరి : ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? (1)
          పాపారావు : మా అమ్మ ముగ్గురు బిడ్డల్ని కన్నది. పెద్దవాడు ఇప్పుడు మీముందున్న నేను. రెండో వాడు రెండేళ్ళ  క్రితం మీరు లాయర్ గా వున్నప్పుడు మీ చలవ వల్ల ఉరికంబం ఎక్కాడు. మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను. (2)
          చౌదరి : మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! (3)
          పాపారావు : నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...(4)
          చౌదరి :  గెటవుట్! ఐ సే గెటవుట్!! (5) (pp – 1, end of beginning)
middle
          మళ్ళీ చౌదరి :  నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్!! (6)
          పాపారావు :  మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...(7 )
          చౌదరి : ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి! (8)
          పాపారావు : చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు! (9) (pp- 2, end of middle)
end
          చౌదరి : మిస్టర్ పాపారావ్, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్? నౌ గెటవుట్!! (10 )
          పాపారావు : ఆల్ రైట్. (11 )
***
      ఈ పై సీనుని విశ్లేషిస్తే, ఇందులో మొదటి 5 సంభాషణలు బిగినింగ్, తర్వాతి 4 సంభాషణలు మిడిల్, మిగిలిన 2 సంభాషణలు ఎండ్ లుగా వున్నాయి.  బిగినింగ్ బిజినెస్ అంటే పాత్రల పరిచయం, నేపధ్య వాతావరణం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అని కదా? 

          బిగినింగ్ లో ఈ  5 సంభాషణలతో ఇవెలా జరిగాయో చూద్దాం. ఈ సీనుకొచ్చేసరికి జస్టిస్ చౌదరి పాత్ర మనకూ పాపారావుకీ తెలిసిందే. పాపారావు తనని చౌదరికి పరిచయం చేసుకున్నాడు రెండో సంభాషణతో. పాత్రల పరిచయాలు ముగిశాయి. నేపధ్య వాతవరణం తెలుస్తూనే వుంది- న్యాయాన్ని కొనడానికొచ్చిన వాతావరణం. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూస్తే - పాపారావు పరిచయ డైలాగులోనే – ‘మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను’ అనడంతో ప్రారంభమైంది.

          ఈ ప్రారంభం ఇలా కొనసాగింది -  3 వ డైలాగుతో చౌదరి : ‘మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ!’ అని గద్దించడంతో,  4 వ డైలాగుతో పాపారావు -  ‘నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...’  అనడంతో పరిస్థితి తీవ్రమైంది. కేసు విషయంలో పాపారావు ప్రలోభ పెట్టడానికి వచ్చాడని స్పష్టమైంది. ఇలా చౌదరికీ, పాపారావుకీ మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన 2 వ డైలాగుతో మొదలై, 4 వ డైలాగుతో ముగిసింది. 

          దీనికి మండిపోయి చౌదరి – ‘గెటవుట్, ఐ సే గెటవుట్’  అని 5వ డైలాగు పేల్చడంతో సమస్య ఏర్పాటై పోయి, బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక ఈ సమస్యని ఎలా డీల్ చేయాలన్న గోల్ ఏర్పడింది ప్రధాన పాత్రయిన చౌదరికి.

          ఇప్పుడు మిడిల్ చూద్దాం. మిడిల్ అంటే తలెత్తిన సమస్యతో రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్ల సీన్లే కాబట్టి, ఇక్కడ సమస్యేమిటో చెప్పి గోల్ ఏర్పాటు చేసిన నేపధ్యంలో మిడిల్ ఇలా నడిచింది – 6 వ సీనుతో చౌదరి సమస్యని డీల్ చేసే గోల్ తో అన్నాడు - ‘నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్’  అని. ఇది యాక్షన్ తీసుకోవడం.  

          దీనికి  7 వ డైలాగులో  పాపారావు - ‘మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...’ అనడం రియాక్షన్ చూపడం.  

          దీనికి 8 వ డైలాగులో  చౌదరి – ‘ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి’ అనడం మరో యాక్షన్ తీసుకోవడం. 

          దీనికి 9 వ డైలాగుతో పాపారావు  - ‘చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అనడం మరో రియాక్షన్ చూపడం. 

         
మిడిల్లో యాక్షన్ రియాక్షన్లు పోనుపోను సీరియస్ అయి మిడిల్ బిజినెస్ ని కొలిక్కి తెస్తాయి కదా? అలా ఇక్కడ పాపారావు మాటలతో కొలిక్కి వచ్చింది. రావడమే కాకుండా ‘చూడు మిస్టర్ చౌదరీ’ అంటూ అతను ఏకవచన సంబోధనకి మారడం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాడని తెలుపుతోంది. తగ్గివున్న ప్రత్యర్ధి కోరలు చూపిస్తున్నాడు. మిడిల్ చివరి సీను ప్రత్యర్ధి చేతిలో వుండాలని రూలు కదా? 

          ప్రధాన పాత్ర చౌదరి వైపు నుంచి చూస్తే, అతను పతనా వస్థకి చేరాడు పాపారావు రియాక్షన్ తో. ‘చూడు మిస్టర్ చౌదరీ’ అని జస్టిస్ అయిన తనని అనడం ముమ్మాటికీ తలవొంపే. పైగా ‘త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’ అని తన షరతులు విధిస్తున్నాడు. ‘ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అని పరోక్షంగా అల్టిమేటం ఇస్తున్నాడు. 

          ఇంతకంటే దీనావస్థ లేదు చౌదరికి. మిడిల్ ముగింపు సీనుతో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడినప్పుడు, అది ప్రధాన పాత్రని పతనావస్థకి చేర్చే సీనుగా వుండాలని రూలు కదా?  ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూలు ఎదురెదురు అద్దాలుగానే వుంటాయిగా? ప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఏర్పడితే, ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ గోల్ గల్లంతై కన్పిస్తుంది  కదా? ఇదే కదా పాయింట్ వన్ కీ, ప్లాట్ పాయింట్ టూకీ మధ్య వుండే మిడిల్లో జరిగే యాక్షన్ రియాక్షన్ల బిజినెస్? 

          ఈ మిడిల్ బిజినెస్ లో జస్టిస్ చౌదరి గోల్ ప్లాంట్ టూ దగ్గర గల్లంతైంది. ప్రత్యర్ధి పాపారావుది పై చేయి అయింది. 

          ఇక ఎండ్ - ఎండ్ అంటే ప్లాట్ పాయింటూలో కుంగి పోయిన స్థితి నుంచి ప్రధాన పాత్ర పైకి లేవడం కదా? లేచి దెబ్బ కొట్టడం కదా పట్టు వదలని గోల్ కోసం?  ఎండ్ విభాగంలో ఇక యాక్షన్ రియాక్షన్ల కథనం వుండదు. పైచేయి ప్రధాన పాత్రదే, పారిపోవడం ప్రత్యర్ధి పనే. 

          ఈ విధంగా ఇప్పుడు 10 వ డైలాగుతో చౌదరి -  ‘మిస్టర్ పాపారావ్, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్? నౌ గెటవుట్’
          పాపారావు నోర్మూసుకుని ‘ఆల్ రైట్’ అని గెటవుటై పోవడం.
***
      ఇదీ సీను స్ట్రక్చర్. మరి సీను ధర్మం పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమో, లేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో  అయివుండాలని చెప్పుకున్నాం కదా? మరి పై సీనులో ఏది జరిగింది?  మిడిల్ 9 వ డైలాగులో పాపారావు - ‘త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’  అనడం ద్వారా కథని ముందుకి నడిపించే సమాచారమిచ్చారు. చౌదరిని ఎవరో కలుస్తారన్న మాట? ఎవరు? ఆ వచ్చే వ్యక్తి అడిగితే చౌదరి నిర్ణయం మార్చుకుంటాడన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు కూడా పాపారావు. ఇలా రాబోయే సీన్లలో ఏం జరగబోతోందన్న సస్పన్స్ ని సృష్టిస్తూ, కథని ముందుకు నడిపించే సమాచార మిచ్చారు. 

          సీనుకి స్ట్రక్చర్ వల్ల డ్రామా పండుతుంది. స్ట్రక్చర్ లేకపోతే డ్రామా పండదు, మండదు, మొండికేస్తుంది. సీనుకి స్ట్రక్చర్ వల్ల పాత్ర చిత్రణలు సవ్యంగా వుంటాయి. సీనుకి స్ట్రక్చర్ వల్ల సీక్వెన్సు స్ట్రక్చర్ లో వుంటుంది. సీక్వెన్సులకి స్ట్రక్చర్ వల్ల యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంటాయి. యాక్ట్స్ కి స్ట్రక్చర్ వల్ల  మొత్తం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో బలంగా వుంటుంది.

          ఇంకో సూక్షం కూడా అర్ధం చేసుకోవాలి. అసలు స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ ఎక్కడ పుడుతుంది? మొట్ట మొదట కథకి అనుకునే అయిడియాలో పుడుతుంది. ఆ కథ తాలూకు రెండు మూడు వాక్యాల ఐడియాలో బిగినింగ్ మిడిల్ ఎండ్ స్ట్రక్చర్ లేకపోతే, ఇక దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఆ కథకి సంబంధించిన అయిడియాలో ఎలా బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలుగా కథ కుదురుకుందో, అదే కూర్పు సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, సీక్వెన్స్ , ట్రీట్ మెంట్, చివరికి డైలాగ్ వెర్షన్ - ఈ  ఐదు అంచెల ప్రక్రియల్లో ప్రస్ఫుట మవ్వాలి. డైలాగ్ వెర్షన్ అంటే సీన్లు క్రియేట్ చేయడమే. ఈ సీన్లు ఐడియా స్ట్రక్చర్ కి లోబడి అదే స్ట్రక్చర్ లో వున్నప్పుడే తెరమీద స్క్రీన్ ప్లేకి చైతన్యం వస్తుంది.

సికిందర్

Monday, March 4, 2019

794 : రివ్యూకథ, దర్శకత్వం : ఇంద్ర కుమార్
తారాగణం : అజయ్ దేవణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అర్షద్ వార్సీ, రీతేష్ దేశ్ ముఖ్, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా, జానీ లివర్, అలీ తదితరులు
రచన : వేద్ ప్రకాష్, పరితోష్ పెయింటర్, బంటీ రాథోడ్, గౌరవ్ – రోషిన్, ఛాయాగ్రహణం : కికో నకహారా
***
          1990 లో ‘దిల్’ తో దర్శకుడైన ఇంద్రకుమార్ ఇంకా సినిమాలు తీస్తూ కొత్త తరం ప్రేక్షకుల్ని ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో 2007 లో ‘ఢమాల్’,  2013 లో ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీలు తీసి సక్సెస్ అయ్యాడు. ఈ రెండు సక్సెస్ లు పట్టుకుని వాటి సీక్వెల్స్ తీస్తూ పోయాడు. యాక్షన్ కామెడీ ‘ఢమాల్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఢమాల్’ తీసి తిరిగి ఇప్పుడు మరో సీక్వెల్ గా ‘టోటల్ ఢమాల్’ తీశాడు. ఈ మూడు ఢమాల్స్ హిట్టవడం ఒక సంచలనం. ప్రస్తుత ఢమాల్ మూడు రోజుల్లోనే వందకోట్లు రాబట్టి, వారం తిరిగే సరికల్లా ఇంకో వంద కోట్లతో పెద్ద హిట్ కొట్టింది. ఇంత అర్ధం పర్ధం లేని పాత తరహా మైండ్ లెస్ కామెడీకి ఇంత సక్సెస్ ఏమిటబ్బా అని తలలు పట్టుకుంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇంద్ర కుమార్ తీరిగ్గా కూర్చుని ఇంటర్వ్యూ లిస్తున్నాడు. ఇంతకీ ఈ మల్టీ స్టారర్ మైండ్ లెస్ కామెడీలో ఏముంది?  ఇది తెలుసుకోవడానికి ఈ పిచ్చి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్దాం... 

కథ 
     గుడ్డూ (అజయ్ దేవగణ్), జానీ (సంజయ్ మిశ్రా) ఇద్దరూ తోడు దొంగలు. పోలీస్ కమీషనర్ మల్లిక్ (బొమన్ ఇరానీ) రద్దయిన నోట్ల దందా చేస్తూంటే యాభై కోట్లు కొత్త నోట్లు కొట్టేసి పారిపోతారు. డ్రైవర్ పింటూ (మనోజ్ పహ్వా) వీళ్ళని దెబ్బ కొట్టి ఆ డబ్బుతో తను పారిపోతాడు. 

          అవినాష్ (అనిల్ కపూర్), బిందూ (మాధురీ దీక్షిత్) లు విడాకుల కేసులో కోర్టులో వుంటారు. కీచులాడుకుని విడాకులు పొందుతారు. విడాకులు మంజూరు చేసి కొడుకు ఎవరి దగ్గర వుండాలో  అతన్నడిగి తేల్చుకోవాలని తీర్పు ఇస్తాడు జడ్జి. కీచులాడుకుంటూనే కొడుకు దగ్గరికి బయల్దేరతారు ఇద్దరూ. 

          లల్లన్ (రీతేష్ దేశ్ ముఖ్), ఝింగుర్ (పితోబాష్ త్రిపాఠీ) లు ఫైర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు. పైన బిల్డింగ్ తగులబడుతూంటే కింద వల పట్టుకుని ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ళు ముందు దూకాలని కండిషన్ పెడతారు. లక్ష ఇచ్చిన వాడు దూకగానే ఆఫీసర్లు వచ్చి పట్టుకోబోతారు. ఇద్దరూ పరారవుతారు. 

          ఆదిత్య (అర్షద్ వార్సీ), మానవ్ (జావేద్ జాఫ్రీ) అన్నదమ్ములు. ఒక పురాతన వస్తుశాలలో ఉద్యోగాలున్నాయంటే వస్తారు. ఓనర్ పన్లోకి తీసుకుని, గ్యాలరీ క్లీన్ చేయమంటే మొత్తం పగులగొట్టి క్లీన్ చేశామంటారు. ఓనర్ పట్టుకోవడానికి వెంటబడితే అతడి ఆటోమేటిక్ కారెక్కి పారిపోతారు. 

          డబ్బు కొట్టేసిన పింటూ విమానమెక్కి,  విమానం నడుపుతున్నవాడు ఎవరో మెంటల్ కావడంతో విమానం కూలి కిందపడతాడు. కొడుకు దగ్గరికి ప్రయాణిస్తున్న అవినాష్ - బిందూలు ఇది చూసి ఆగుతారు. తమ పరిస్థితుల వల్ల పరారవుతున్న లల్లన్ – ఝింగుర్, ఆదిత్య – మానవ్ లు కూడా ఇక్కడికే వచ్చి ఆగుతారు. కొన ప్రాణాలతో వాళ్లకి డబ్బు రహస్యం చెప్పేస్తాడు పింటూ. ఇంతలో గుడ్డూ, జానీలు కూడా వచ్చి వినేస్తారు. పోలీస్ కమిషనర్ మల్లిక్ కూడా వచ్చి వినేస్తాడు. పింటూ చచ్చిపోతాడు. జనక్ పూర్ జూలో దాచి పెట్టిన ఆ యాభై  కోట్లు అందరూ కలిసి పంచుకోవడం దగ్గర వాటాలు కుదరక  పోటీ పెట్టుకుంటారు. పోటీలో ఎవరు ముందు జూకెళ్తే వాళ్ళదే డబ్బు. 

          ఈ పోటీలు ఎలా పడ్డారు? ఏమేం కష్టాలు అనుభవించారు? జూకి ఎవరు ముందు చేరుకున్నారు? లేక అందరూ ఒకేసారి వెళ్లి పడ్డారా? జూలో ఎదురైన ఇంకో పరిస్థితేమిటి? చిన్నప్ప స్వామి (మహేష్ మంజ్రేకర్) తన గ్యాంగుతో జంతువుల మీద ఏం కుట్ర చేశాడు? ఈ మిగతా కథ తెలియాలంటే వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలావుంది కథ 
       మైండ్ లెస్ కామెడీ జానర్. హిందీలో స్టార్ ఎట్రాక్షన్ వుంటే మైండ్ లెస్ కామెడీలు హిట్టవుతున్నాయి. ‘గోల్ మాల్’ సిరీస్ కూడా ఇలాగే హిట్టయ్యాయి. 2007 లో ‘ఢమాల్’ తీసినప్పుడది 1963 నాటి ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కి కాపీ. తెలుగులో ‘కిష్కింధ కాండ’ గా తీశారు. ‘ఢమాల్’ కథని పొడిగిస్తూ 2011 లో ‘డబుల్ ఢమాల్’ తీశారు. ఇప్పుడు తీసిన ‘టోటల్ ఢమాల్’ ని ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కే ఇంకో వెర్షన్ గా సీక్వెల్ చేశారు. కాబట్టి రిపీటయిన కథే కథనం మార్చిన సీన్లతో కన్పిస్తుంది. ఐతే ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా కూడా పనిచేస్తోంది చివర్లో జూలో జంతువులతో కామెడీలతో కలుపుకుని. 

 ఎవరెలా చేశారు 
     అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్, రీతేష్ దేశ్ ముఖ్ లాంటి స్టార్లు సిగ్గుపడకుండా అర్ధం పర్ధంలేని  పిచ్చి కామెడీలన్నీ చేశారు. సిట్యుయేషన్స్ మైండ్ లెస్ గానే వుంటాయి, ఆ సిట్యుయేషన్స్ లో పేలే డైలాగులే నవ్విస్తూంటాయి... ‘వాళ్లకి తెలీదేమో నన్ను మించిన కుక్క లేదని’, ‘డబ్బు లాగే దాకా వదలను’, ‘డబ్బు లాగేక ఎందుకు వదులుతావ్ డబ్బు?’, ‘ఇది నీ రోప్ (తాడు) అనుకో - ఇదే నీ లాస్ట్ హోప్’, ‘స్ట్రగుల్ చేయడానికి రాలేదు - సెటిల్ అవడానికి వచ్చాం’, ‘నీకు అవినాశ్ అని పేరెవరు పెట్టారు -నువ్వు సత్తెనాశ్ వి’, ‘మేకల్ని బలిస్తారు - పులుల్ని కాదు’, ‘ఇది నీకు టార్చర్ - నాకు వామప్ అనుకో’,  ‘హైదరాబాదీలంటే బిర్యానీతోనే ఐడెంటిఫై కారు -  ఖుర్బానీలతో  (ప్రాణత్యాగాలతో) కూడా ఐడెంటిఫై అవుతారు’, ‘మూన్నాళ్ళ జీవితం ఇవ్వాళ్ళ మూడో నాడు’, ‘పరిస్థితి ఎమర్జెన్సీ గా వుంది - వాతావరణం భయానకంగా వుంది - ఈ ఛాన్సు లక్కు మార్చుకోవడానికుంది’, ‘ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు- మన చేత తన్నులు తిన్నవాళ్ళు -  వాళ్ళ చేతిలో తన్నులు తిన్న వాళ్ళం’, ‘ప్రపంచంలో గుండె బలం లేనోళ్ళు  మన దేశంలో తండ్రులే’, ‘మిడిల్ క్లాస్ వాణ్ని ప్రావిడెంట్ ఫండ్  డబ్బులడగడం వాడి కిడ్నీ అడగడం లాంటిదే’, ‘సాధారణ వడ్డీ -  చక్రవడ్డీ ఎలా లెక్కిస్తారు?....ఇలా అంతుండదు.  

          అరవ మాయగాడుగా అలీ, విమానాలు అద్దెకిచ్చే వాడుగా జానీ లివర్ కన్పించి గోల కామెడీ చేస్తారు. సోనాక్షీ సిన్హా ఒక ఐటెం సాంగ్ లో కన్పిస్తుంది. జూ ఓనర్ గా ఈషా గుప్తా వుంటుంది. ఈమె సెక్యురిటీ గార్డుగా క్రిస్టల్ ది మంకీ అనే చింపాంజీ వుంటుంది.  

          ప్రొడక్షన్ విలువలు, మేకింగ్ రిచ్ గా వున్నాయి. ఉత్తరా ఖండ్ కొండ ప్రాంతాల ఔట్ డోర్ లొకేషన్స్ అద్భుతంగా వున్నాయి. రెండు గంటల సేపూ ఔట్ డోర్ అడ్వెంచర్ గానే సాగుతుంది సినిమా. పాటలు పెద్ద గొప్పగా లేవుగానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం, వీఎఫ్ఎక్స్ ఉన్నతంగా వున్నాయి. కామెడీగా వుండే యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో వేగం థ్రిల్ చేస్తుంది. 

చివరికేమిటి 
      ఇప్పుడు కూడా పాత ఇంద్రకుమార్ కొత్త దర్శకులకి తీసిపోని విధంగా మేకింగ్ చేయడం ఒక గొప్ప విషయం. ఎక్కడా చీప్ లుక్, లూజ్ మేకింగ్ రానివ్వలేదు. కామెడీలో పంచ్ ని ఏ షాట్స్ పెట్టి తీయాలో అలా తీసి కెమెరాతో కూడా నవ్వించాడు. ఔట్ డోర్ లొకేషన్స్ లో హీమాన్ క్యారెక్టర్లతో వెస్టర్న్ ఫీల్ తీసుకొచ్చాడు. కామెడీకి లాజిక్ అవసరం లేదు. కానీ ఆ కామెడీ పుట్టడానికి కారణమైన బేస్ లాజికల్ గా వుండి తీరాలి. పోలీస్ కమీషనర్  దగ్గర యాభై కోట్లు కొట్టేయడం లాజికల్ బేసే. దీన్నాధారంగా చేసుకుని ఎంత పిచ్చి కామెడీ అయినా చేసుకోవచ్చు. అందుకని విమానాలు అద్దె కిచ్చే సీను, హెలీ కాప్టర్ కి గాలి చక్రం లేకపోతే  ఫ్యాను తగిలించి ఎగరేసే సీను లాంటివెన్నో చెల్లిపోయాయి. ఊబిలో కూరుకు పోతున్న వాణ్ణి  తాడు అనుకుని పాముని విసితే, ఆ పాముని పట్టుకుని పైకి ఎగబ్రాకే (వాడి బరువుకి పాము మధ్యకి తెగిపోదా అనే ప్రశ్న అనవసరం) సీను, జూ నైట్ సీన్ క్లయిమాక్స్ లో ఏనుగు, దాని పిల్ల, చింపాంజీ, దాని పిల్ల, సింహం, దాని పిల్లలతో ప్రమాదంలో పడి - మదర్ సెంటి మెంట్లు రెచ్చగొట్టి బయటపడే కామెడీ సీన్లూ....ఇలా ప్రతీ చోటా పిచ్చి పిచ్చి కామెడీలు చేయిస్తూ పోయాడు స్టార్లతో.  సిట్యుయేషన్స్ సిల్లీనే, వాటికి పేల్చుకునే డైలాగులే పిచ్చ కామెడీ. 

          ఇంకోటేమిటంటే, అందరు నటుల్నీ కలిపి ఎక్కడా గుంపు కామెడీ చేయలేదు. డబ్బు కోసం అందరూ పోటీ పడి ఒకే గుంపుగా వెళ్లి వుంటే, ఆ గుంపు సీన్లు కాసేపటికి బోరు కొట్టి విషయం అయిపోయేది. ముందుగా ఎలా ఇద్దరిద్దరు కలిసి పారిపోయి వచ్చారో, డబ్బు రహస్యం తెలిశాక అలాగే  ఇద్దరిద్దరు చొప్పున విడివిడిగా ప్రయాణాలు సాగిస్తారు. అప్పుడు అనిల్ కపూర్ - మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్ - సంజయ్ మిశ్రా, రీతేష్ దేశ్ ముఖ్ - పితోబాష్ త్రిపాఠీ, అర్షద్ వార్సీ - జావేద్ జాఫ్రీ, బోమన్ ఇరానీ - విజయ్ పాట్కర్ ఐదు జంటలూ విడివిడి ప్రయాణాలు చేస్తూ, ఐదు ఎపిసోడ్లుగా ఏ జంటకా జంట విడివిడి కామెడీలు చేసుకుంటూ పోతారు. జూతో సహా ఇలా విడివిడి కష్టాల కామెడీలు చూపించడం వల్ల మొనాటనీకీ, బోరుకీ వీల్లేకుండా బయటపడిందీ రెండు గంటల మైండ్ లెస్ కామెడీ. కథని  ఈ విధంగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడంతో వ్యాపారాత్మకంగా చెల్లుబాటైందీ మల్టీ స్టారర్ ఎంటర్ టైనర్.

సికిందర్
Watched at Inox Gvk One, B. hills
At 7.30 pm, Feb 25, 2019