రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, మార్చి 2017, మంగళవారం

రైటర్స్ కార్నర్ :









        ఏడడుగుల సంబంధం...ఎన్నో జన్మల అనుబంధం...అన్నాడు ఆనాడు సినిమా కవి. మరి కవులకీ ఇది వర్తిస్తుందేమో?  కవులు కాకపోతే  నేటి సినిమా రైటర్స్ కీ??....అంటే వాళ్ళ సంసారం గురించి కాదు, వ్యాపారం గురించి. పైకి ఎన్ని చెప్పుకున్నా సినిమా రైటర్స్ పక్కా వ్యాపారులే. వ్యాపారం కోసమే వున్నారు. వ్యాపారం లేకపోతే ఎవరైనా వున్నారా? కానీ వ్యాపారి అన్నాక నేను వాడికి అమ్మను, వీడికి అమ్మను అని కూర్చుంటాడా? కూర్చుంటే వ్యాపారం సాగుతుందా? కానీ సినిమా రైటర్ అనే వ్యాపారి లేనిపోని ఇగోలతో ఇలాగే చేసి వ్యాపారం పోగొట్టుకుంటాడు. అందుకే వ్యాపారంతో ఏడడుగులు ఎలా వేయాలో, వేసుకుని ఎలా ఎన్నో జన్మల బంధంగా ఆ వ్యాపారంతో చెలిమి చేయవచ్చో తెలుసుకోవడానికే  ‘ఇలా రాయడానికి ఏడడుగులు’ అనే ఈ సెవెన్ సీటర్ షేర్ ఆటోలో క్రిక్కిరిసిన మార్కెట్లో జర్నీ!!

     ఎసైన్ మెంట్ కి రాయడమంటే కొందరు రైటర్స్ కి  కష్ట సాధ్యంగా వుంటుంది. మీరొక రైటర్ అయివుండి, మీరు స్వతంత్రంగా రాసుకునే వాళ్ళయితే మీ కథ, మీ ఆలోచనలు, మీ రాత పని మీ వొక్కరివే. పూర్తి చేసిన స్క్రిప్టు కి క్రెడిట్ అంతా మీకే చెందుతుంది. కానీ మీరొక ఎసైన్ మెంట్ మీద పనిచేయాల్సి వస్తే, సీనుపూర్తిగా మారిపోతుంది. అప్పుడు మీరెంత మాత్రం మీ సొంత ఒరిజినల్ కథల్నీ, పాత్రల్నీ రాయలేరు. ముందే నిర్ణయమైపోయిన  కాన్సెప్ట్ లు, క్యారక్టర్లు మొదలైన వాటితో మీరు తలపడాల్సి వస్తుంది. ఈ నిర్ణేతలు నిర్మాతలు కావొచ్చు, లేదా దర్శకులు కావొచ్చు. వాళ్ళ  దగ్గర సోర్స్ మెటీరియల్ గా సొంత ఐడియాలు వుండొచ్చు, లేదంటే పూర్వపు స్క్రిప్టులు, రిమేక్ చేద్దామనుకున్న సినిమాలు, కాపీ కొడదామనుకున్న సినిమాలు, హక్కులు కొనుక్కున్న నవలలు, కథానికలు, కామిక్స్; ఇంకా వార్తా కథనాలు, వీడియో గేములు ...ఇలా ఏవైనా వుండొచ్చు. ఇలా మరొకరి ‘మేధో సంపత్తి’ ని మీరు డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు స్వేచ్ఛ అనేది వుండదు- ఆ ‘మేధోసంపత్తి’ పరిధిదాటకుండా బందీలైపోయి,  మీ ఆలోచనల్ని  పేపర్ మీద పెట్టాల్సి వుంటుంది. 

          స్క్రిప్టు ఎసైన్ మెంట్ తో అనుభవం కొన్నిసార్లు బురదనేలలా వుంటుంది, అడుగులు జారిపోతూంటాయి. ఒకవైపు రాయించుకుంటున్న వాళ్ళ మెప్పుదల, వాళ్ళిచ్చే నగదు మొత్తాలూ ఎంత సంతృప్తి నిస్తాయో; మరోవైపు ఫ్రస్టేషన్, నిరాశా నిస్పృహలూ  అంతే పీడిస్తాయి. అయినా ఇందులోంచి బయటపడలేరు. మీ కలులు, ఆశలు స్వతంత్ర రైటర్ గా స్థిరపడాలని వుంటే, మీరొక విషయం  అర్ధం జేసుకోవాలి : 99 శాతానికి పైగా స్క్రిప్టు వర్క్స్ అన్నీ ఎసైన్ మెంట్స్ తోనే ముడిపడి వుంటాయి. మీరు స్వతంత్ర రైటర్ గా మీ  సొంత స్క్రిప్టు తో ప్రయత్నాలు ప్రారంభిస్తే, ఆ ప్రయత్నాల్లోనే వుండిపోయే అవకాశాలే ఎక్కువ. ఎవరు మీ స్క్రిప్టు నచ్చి ఓకే చేస్తారో, అందుకెంత కాలం  పడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ మీరు మాత్రం ఫ్రస్ట్రేషన్ తో గడుపుతారు, ఒంటరి వాళ్ళయి పోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. టాప్ రైటర్లు ఏం చేస్తారో తెల్సా? చాలామంది ఇతరుల ఐడియాలనే, కాన్సెప్ట్స్ నే డెవలప్  చేస్తూ వుంటారు. 

          కనుక ఒక ఎసైన్ మెంటుకి రాయాలంటే మీరేం చేయాలి? ఎసైన్ మెంటుని టీం వర్కుగా చూడకూడదు. టీం వర్క్ అని చెప్పుకుంటారు గానీ, నిజానికి అది టీం వర్క్ కాదు- అందులో చాలా లుకలుకలుంటాయి. అందరూ కలిసి ఏ రాగద్వేషాలూ లేని ప్రవర్తనలతో- ఒకే ఉమ్మడి కార్యక్రమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న బృందంలా స్నేహపూర్వక వాతావరణం అక్కడ వుండడకపోవచ్చు. ఒకరు బాగా ఆలోచిస్తూంటే ఇంకొకరికి పడక పోవచ్చు, టీము స్ఫూర్తి కి విరుద్ధంగా ఒకరు ఇంకొకరి మీద ఆ నిర్మాతకో, దర్శకుడికో గాసిప్స్ చెప్పి వాళ్లకి క్లోజ్ అవ్వాలని ప్రయత్నించ వచ్చు- ఆ నిర్మాత గానీ దర్శకుడు గానీ  దీన్ని ప్రోత్సహించ వచ్చు. కాబట్టి మా టీం అనీ, మేం టీం వర్క్ చేస్తున్నామనీ అంటున్నారంటే అది శుద్ధ అబద్ధం. ఏ ఆఫీసులోనైనా వుండే పాలిటిక్సు ఇక్కడ కూడా  టీం వర్క్స్ లో  జొరబడిపోతాయి. టీములోనే పాలిటిక్సు చేసుకుని ఒక సబబైన కనీస కళా సృష్టి చేయడం సాధ్యం కాదు. 

          ఎసైన్ మెంటుకి ఇదంతా వుండదు. ఎసైన్ మెంటుని మీరెక్కడో పూర్తి చేసి ఇవ్వచ్చు. ఇచ్చాక ఇతరులు ఇచ్చిన వాటితో మీ వర్కుని మూల్యాంకన చేసి- నచ్చింది తీసుకోవచ్చు, ఏదీ నచ్చకపోతే మొత్తం తిరస్కరించవచ్చు. ఈ నేపధ్యంలో మీకు బాగా మైనస్ మార్కులు పడిపోయి, ఇతర చోట్ల నుంచి మీకు ఆహ్వానాలు అందని  పరిస్థితి ఏర్పడకుండా వుండాలంటే ఏం చేయాలో,  ఇతరుల ఐడియాల్ని డెవలప్ చేస్తూ కూడా అది  మీలోని రైటర్ పురోభివృద్ధికి తోడ్పడేలా ఎలా మల్చుకోవచ్చో ఇక చూద్దాం...

          1.
కాన్సెప్ట్ పట్ల పాషన్ పెంచుకోండి 
       ముందుగా మీరు మొనగాడు అని భావించుకోవడం మానెయ్యాలి. ఇక్కడ మొనగాళ్లెవరూ వుండరు, అందరూ నేర్చుకునే పోరగాళ్ళే.  ఎంత నేర్చుకున్నా వచ్చేవి ఫ్లాపులే. కాబట్టి ఒక నిర్మాతో మరెవరో చెప్పిన కాన్సెప్ట్ విని వచ్చి- వాడి మొహం, వాడి కేమైనా తెల్సా? అని బయట కామెంట్లు చేయకండి. మనసులో కూడా ఇలాటి ఆలోచనా ధోరణి ప్రబలకుండా జాగ్రత్త తీసుకోండి. మీ కాన్సెప్టు లే గొప్పవీ, మీరే  పెద్ద గొప్పా అన్న  అహాన్ని తగ్గించుకోకపోతే-  ఎసైన్ మెంటు కి కాదుకదా,  సొంతంగా రాసుకోవడానికి కూడా మీరు పనికి రాకుండా పోతారు.

          మీకు ఇలా ఒక ఎసైన్ మెంటు వచ్చిందనుకుందాం : అన్ని ఆటంకాల్నీ ఎదుర్కొని వరల్డ్ కప్ గెల్చిన ఫుట్ బాల్  టీం గురించి స్క్రిప్టు రాయాలి ... అప్పుడు మీకు ఫుట్ బాల్ అంటే పడక-  క్రికెట్ పెట్టండి సార్, అద్భుతంగా  రాస్తా- అన్నారనుకోండి, మీరు ఇంటికెళ్ళిపోతారు. మీకు ఫుట్ బాల్ అంటే ఇష్టం లేకపోతే మొదటే  మీకు మైనస్ మార్కు పడిపోతుంది. మీ ముఖభావాలే మిమ్మల్ని పట్టిచ్చేస్తాయి. మీరు రాయాలనుకున్న దాని పట్ల మీకు పాషన్ వుండి  తీరాలి. మీరు  సొంతంగా రాసుకుంటే ఎంత పాషన్ తో  రాస్తాతో, అంతే పాషన్ ఇతరుల కాన్సెప్ట్స్ పట్ల వుండాలి. వినగానే కాన్సెప్ట్ విలువని మీరు డిసైడ్ చేయలేరు. మీరొక పాషన్ తో దాన్ని చేపట్టి ఎలా డెవలప్ చేస్తారో, ఏ తీరాలకి చేరుస్తారో దాన్ని బట్టి విలువ వస్తుంది. కాన్సెప్ట్ మీ చేతి చలవే, మీ చేవ కొద్దీ దాని విలువ. 

          పాషన్ లేకపోతే ఏ నిర్మాతా ఎసైన్ మెంట్ ఇవ్వరు. కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే మీ రియాక్షన్స్ గమనిస్తూంటారు. కాబట్టి మీరు ముఖాముఖీ గోష్టీ మర్యాద అని ఒకటుంటుందని తెలుసుకుని దాన్ని పాటించాలి. చెబుతున్నది సంతోషంగా  వినాలి. లేకపోతే  ఎసైన్ మెంటుకి రావడమెందుకు? చెబుతున్నది సంతోషంగా విని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్  చేయకపోతే మీకు పాషన్ అనేది పుట్టదు. కాన్సెప్ట్ చెబుతూండగానే  ఏ ఏ విధాలుగా  దాన్ని ఆసక్తికరంగా మల్చవచ్చో మీ మనసులో రేఖా చిత్రం  ఏర్పడిపోతూండాలి. ప్రొఫెషనల్ రైటర్ అన్పించుకోవాలంటే ఇలాటి వృత్తితత్త్వం వుండాలి. ప్రొఫెషనల్ రైటర్ ఎలాటి దానికి ఏం కావాలో అది తనలోంచి తీసివ్వాలి. వింటున్నది ఇష్టం లేనట్టు  ముఖం పెట్టి కూర్చోవాలనుకుంటే ఇక్కడికి రానవసరం లేదు, బయటే స్వతంత్ర రైటర్ గా పాట్లు పడవచ్చు. 

          కాబట్టి ఎసైన్ మెంటుకి పాషన్ అవసరం. కాన్సెప్టు, సబ్జెక్టు శ్రద్ధగా వినండి. పాయింట్స్ ఏమైనా తడితే రాసుకోండి, వాళ్ళిచ్చే మెటీరియల్ ని  పరిశీలించండి, దీన్ని చేసితీరాలన్న పాషన్, పట్టుదలా  పెంచుకోండి. ప్రతీ ఎసైన్ మెంట్ నీ  మీ సామర్ద్యానికి ఛాలెంజిగా తీసుకోండి. అహంతో ఇది చెత్త అనుకుని మానేస్తే ప్రతీ చోటా చెత్తే కన్పిస్తుంది. మీరు రాసేదెప్పుడు? మీరేమిటో లోకానికి తెలిసేదెప్పుడు?  మీ ఉన్నతభావాలు మనసులో పెట్టుకు తిరగడం, మీ సిద్ధాంతాలేవో వల్లిస్తూ నల్గురిలో గొప్ప అన్పించుకోవడం- ఈ కార్యక్రమాల  వల్ల ఏమీ లాభం వుండదు.  కార్యరూపంలో ఏదీ లేకుండా మీరలాగే వుండిపోతారు. కూసే వాడు రాయడు, రాసే వాడు కూయడు. ఇది గుర్తుంచుకోండి. లెక్చర్లు ఇచ్చేవాడు పాఠాలు చెప్తాడుగానీ, ప్రాక్టికల్ గా చేయలేడనే అపహాస్యానికి  గురయ్యే స్థితికి చేరుకోకండి. 

          మీకు ఫుట్ బాల్ అంటే ఇష్టం లేకపోతే, ఇలాటి కథల్లో మీరిష్ట పడే ఎలిమెంట్స్ ఏవైనా ఆలోచించి ప్రవేశ పెట్టొచ్చేమో చూడండి. అండర్ డాగ్స్ థీమ్స్ మీద మీ ఆలోచనల్ని ఫోకస్ చేయండి. బ్రదర్ హుడ్ కాన్సెప్ట్స్  పట్ల మీకు పాషన్ వుండివుంటే,  అలాటి కథ ఫుట్ బాల్ కాన్సెప్ట్  కి కలప వచ్చేమో చూడండి. ప్రొఫెషనల్ రైటర్స్ ఇలాగే చేస్తారు. వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్స్ లోనే  తమ సొంత ఇష్టాల్ని  వెతుక్కుని  పాషన్ ని పెంచుకుంటారు. పాషన్ పుడితే అది మీకు ఎసైన్ మెంటుని ఓకే  చేయించడమే కాదు; ఆ నిర్మాతలనుంచి, ఇతరులనుంచీ  మీకుసహాయసహకారాలు పెరిగేట్టు కూడా చేస్తుంది. పైగా కొత్త చోట్ల నుంచి ఆఫర్స్  తెచ్చి పెడుతుంది. 

         2. ఏం కోరుకుంటున్నారో  తెలుసుకోండి

         ఎసైన్ మెంట్ అంటే నిర్మాత కాన్సెప్ట్ చెప్పగానే, ఓకే అనేసి జామ్మంటూ ఎగిరిపోయి మీ సొంత వెర్షన్ రాసుకు వచ్చెయ్యడం కాదు. దెబ్బతినిపోతారు. వృత్తి తెలిసిన నిర్మాత దీన్ని  అంగీకరించడు కూడా. చాలా మంది కొత్త  రైటర్లకి పధ్ధతి తెలీక, తెలిసినా అడిగే ధైర్యం లేక, చివరికి దెబ్బతిని పోతూంటారు. పత్రికా రిపోర్టర్ కి అధైర్యమనేది వుండదు, ఎంతటి వారినైనా ప్రశ్నలు అడుగుతాడు. లేకపోతే  అది వృత్తి ధర్మమే కాదు, వృత్తికి పనికి రాడు. రైటర్ కూడా అధైర్యంతో ప్రశ్నలు అడగడం మానేస్తే అతనొక రైటరే కాదు. నిర్మాత  ఆ కాన్సెప్ట్ ని ఎంచుకోవడానికి ఏవో కారణాలుంటాయి. ఆ కారణాలతో ఎటాచ్ అవగల రైటర్ అన్వేషణలో  వుండివుంటారు. ఎంతో రీసెర్చి కూడా చేసి వుంటారు. ఎన్నో మీటింగులు కూడా జరిపివుంటారు. దీన్ని ఎందుకు తెరకెక్కించాలో బాగా వర్కౌట్ చేసి వుంటారు. ఎవరి కోసం తెరకెక్కించాలో, మార్కెట్ ఎలా చేయాలో స్టడీ చేసే వుంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఏదెలా వుండాలని కోరుకుంటున్నారో కూడా తెలుసుకుని వుంటారు.  

          కాబట్టి మీరు కొన్ని ప్రశ్నలు అడక్క తప్పదు. నిర్మాత కేం  అవసరమో, ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం మీకవసరం. మీరేం రాయాలో, ఏది రాయకూడదో తెలుసుకోవడానికి కూడా ప్రశ్నించడం అవసరం : దీని టోన్, అట్మాస్ ఫియర్ ఎలా వుండాలి?  స్క్రిప్టు ఎంత వైవిధ్యంగా వుండాలి? జనరల్ బడ్జెట్ ఏమిటి? భారీ బడ్జెట్టా, లిమిటెడ్ బడ్జెట్లో పెట్టి రాయాలా? ...ఇలా మీరొక్క అక్షరం రాయడానికి ముందుగా ఇలాటి ప్రాజెక్టు సంబంధ సందేహాలు తీర్చుకోవడం అవసరం.  మీ మనసులో ఇంకా కథ రూపొందే ముందే ఇది  అవసరం. ఈ ప్రశ్నలు, ఇంకా ఇలాటివి ఇంకొన్ని  ప్రశ్నల వల్లా  మీరు ఏ శైలిలో రాయాల్సి వుంటుందో, సెక్సువల్ గా ఎంత ఎక్స్ పోజ్ తో రాయాలో, వయొలెన్స్ ఏ మేరకు వుండాలో, అసలుండ కూడదో, లుక్ ఫీల్ ఎలా వుండాలో, కాస్టింగ్ ఏమిటో, ఎన్ని లొకేషన్స్ అవసరమో, ఎంత భారీతనం వుండాలో, వుండకూడదో...ఈ సమాచారమంతా మీరు రాయడానికి సేకరించుకున్న వాళ్ళవుతారు. 

          అసలు ఆల్రెడీ లొకేషన్స్  నిర్ణయమైపోయి   వుండొచ్చు, కొన్ని సెట్స్ కూడా ప్లాన్ చేస్తూండవచ్చు, కొందరు నటీ నటులతో సంప్రదింపులు కూడా  జరుపుతూండొచ్చు. కనుక నిర్మాత ఏమనుకుంటున్నదీ స్పష్టంగా తెలుసుకోండి. వాటిని ఖండించకండి. ఎదురు సలహాలివ్వకండి. దేంట్లోనూ జోక్యం చేసుకుని మాటాడకండి. అది మీ పనికాదు. ఒక వడ్రంగి ఇచ్చిన కలప తీసుకుని చెప్పిన కుర్చీనో బల్లనో తన పనితనంతో తయారు చేసి ఇస్తాడు. అలాగే  ప్రొఫెషనల్ ఎసైన్ మెంట్ రైటర్ కూడా కాన్సెప్ట్ తీసుకుని, పైన చెప్పిన సమాచారం కూడా తీసుకుని, వాటితో తంటాలు పడాలే తప్ప- తంపులు పెట్టకూడదు. ఆల్రెడీ అన్నీ ఫిక్స్ అయిపోయివుంటాయి, కాబట్టి నోరు మెదపకుండా స్క్రిప్టు రాసుకోవాలి. సమాచారం కూడా తెలుసుకుని రాయడం వల్ల, చాలా సమయం కలిసివచ్చి, ఏ ఇబ్బందులూ పడకుండా ఫస్ట్ డ్రాఫ్ట్ అందించే అవకాశం వుంటుంది. 

          3. మీ మ్యాజిక్ మీరే ప్రదర్శించండి 

     
టేక్ కేర్...రైటర్ గా ప్రశ్నలు అడగొచ్చు కదాని, సబ్జెక్టు గురించి కూడా అడక్కండి. ఇంటికి పోతారు. రైటర్లు రాయడానికి తగిన స్వేచ్ఛా, స్పేస్ అవసరమని నిర్మాతలకీ తెలుసు. గొంతు మీద కూర్చుంటే క్రియేటివిటీ రాదనీ  తెలుసు. క్రియేటివిటీని జుర్రుకోవడం కోసం సబ్జెక్టుని పూర్తిగా  వెల్లడించరు. సబ్జెక్టు గురించి మీరడిగిందానికల్లా చెప్పరు. ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ తో వున్న నిర్మాత మిమ్మల్ని నియమించుకోవడానికి కారణమేమై వుంటుందంటే – ఎక్కడో ఎప్పుడో ఎలాగో మీ సమర్ధత తన దృష్టిలో పడివుంటుంది. కథ రాయడంలో మీ నేర్పూ  శైలీ తెలిసే వుంటుంది. మీ గురించి అన్నీ తెలుసుకున్నాకే పిలిచి వుంటారని మరవకండి.  మీలో ఎంతో కొంత టాలెంట్ వుందని పిలిచాక, తీరా ఆ  కాన్సెప్ట్ పట్ల మీరు పాషన్ కనబర్చకపోతే, అక్కడితో మీ పని కట్ అయిపోతుందనుకోండి, అదివేరే విషయం – కానీ పాషన్ పరీక్షలో  మీరు నెగ్గాక, మీ టాలెంట్ ని రాబట్టాలనుకుంటారు. సబ్జెక్టులో మీ సొంత కథనంతో, ఎలిమెంట్స్ తో, మీ విజువలైజేషన్ ఏమిటో చూడాలనుకుంటారు. మీమీద గౌరవంతో ఇలా కోరుకుంటారు. అంతేగానీ  పరీక్షపెట్టి టార్చర్ చేయడానికి కాదు. మీరు కాన్సెప్ట్ పట్ల అంత  ‘పాషనిస్టు’ అయివుండి కూడా, ఇది టార్చర్ అని అపార్ధం చేసుకుని పారిపోతే, దావానలంలా  ఈ వార్త ప్రాకిపోయి మీ వృత్తికి గోరీ కట్టేస్తుంది. సెలబ్రిటీలే న్యూస్ మేకర్లు అనుకోకండి- ఇలా చేస్తే బచ్చా రైటర్లు కూడా న్యూస్ మేకర్లు అవుతారు మూవీ లాండ్ లో. 

          సబ్జెక్టు గురించి మీరెక్కువ ప్రశ్నలు అడిగేస్తూంటే, మీ గురించి మీరు రెండు ప్రమాద ఘంటికలు మోగించుకున్నట్టే  : ఒకటవ ప్రమాద ఘంటిక -ఎసైంట్ మెంట్ కి తగ్గ సత్తా మీదగ్గర  శూన్యమని మీరే తెలుపుకుంటారు. అన్నీ నిర్మాతే చెప్పాల్సి వస్తే నిర్మాతే రాసుకోగలడు కదా, మిమ్మల్నెందుకు పిలవడం దండగ? 

          రెండో ప్రమాద ఘంటిక - రాయడానికి కూర్చుంటే ఇది మీ మెడకే ఉచ్చులా బిగుసుకుంటుంది. సబ్జెక్టు గురించి మీరన్ని ప్రశ్నలు అడుగుతూంటే, సరే అనుకుని నిర్మాత అన్నిటికీ సమాధానాలు చెప్పేయ వచ్చు. సబ్జెక్టు గురించి మనసులో అనుకుంటున్న ప్రతీదీ మీకు రివీల్ చేసెయ్యొచ్చు. దీంతో వీటి ఆధారంగా మీరు సంతోషంగా స్క్రిప్టు రాసుకుంటూ పోవచ్చు. అప్పుడు ఒకానొక క్షణంలో మీకే అన్పిస్తుంది- సబ్జెక్టు గురించి అన్నీ అడిగేసి మీరే గొయ్యిలో పడ్డారని. మీరు ఫాలో అవడానికి నిర్మాత అన్ని డైరెక్షన్లూ చెప్పేశాక ఇక సొంతంగా మీరు రాయడానికి మీకేం స్వేచ్ఛ  వుంటుంది? మీకంటూ మీకేం  స్పేస్ వుంటుంది?  మీరేం క్రియేటివిటీ చూపించగల్గుతారు? రైటర్ల నుంచి  క్రియేటివిటీ పెల్లుబకడానికే   ఈ స్వేచ్ఛా, స్పేస్ లు అవసరం కాబట్టే  నిర్మాతలు సబ్జెక్టుని పూర్తిగా వెల్లడించరు. దీన్ని అపార్ధం చేసుకుంటే ప్రొఫెషనల్ రైటర్ కాలేరు- కోపంతో ఇంట్లో కూర్చోవాల్సిన ఎమోషనల్ రైటర్ అవుతారు. ఎమోషనల్ రైటర్ కి ఇతరుల కాన్సెప్ట్స్ పట్ల పాషన్ కూడా పుట్టదు. 

          కాబట్టి  పై రెండు తప్పులూ చేయకండి. వీటి వల్ల మీరు రైటర్ అవ్వాలన్న కోరికతో  ఎప్పటికీ స్ట్రగుల్ చేస్తూనే వుండిపోతారు. 

          4. అతి రాతలు రాయకండి 

       ఇతరుల కాన్సెప్ట్ ని రాస్తున్నప్పుడు సర్వసాధారణంగా నిర్లక్ష్యంగా రాసేస్తూంటారు. అంటే పాషన్ లేక కాదు, వుంటుంది. కానీ దాన్ని మీరొక్కరే  అనుభవిస్తూ రాసేస్తారు. పాషన్ ని అనుభవించడం ఎంత అవసరమో, ప్రకటించడం కూడా అంతే అవసరం. పాషన్ ని ప్రకటించడం కూడా చేసినప్పుడు అందులో నిర్మాత మనోగతం కూడా ప్రతిబింబిస్తుంది. లేకపోతే ఎమౌతుందంటే, ఇచ్చిన సబ్జెక్టునీ, పాత్రల్నీ అత్యుత్సాహంతో అవసరానికి మించి విస్తరించేసి వీర విహారం చేస్తారు. మీరు వీర విహారానికి అర్హులని నిర్మాత భావిస్తే, వేరే లగ్జరీ కారు ఏర్పాటు చేస్తారు. గోవా దాకా యువరాజులా జాయ్ రైడ్ వెళ్లి రావొచ్చు. అంతే గానీ స్క్రిప్టులో ఇష్టానుసారం  వీర విహారాలు చేసే అనుమతి మీకు లేదు. నిర్మాత మీ క్రియేటివిటీకి అంత  స్వేచ్ఛా స్పేసూ ఇచ్చారంటే ఎందుకు? మీదైన స్టయిల్ ని, స్పార్క్ ని, బిలియెన్స్ నీ రంగరించి, సబ్జెక్టులో తనకే తెలీని డెప్త్ నీ, రహస్యాల్నీ బహిర్గతం చేసి, తను కోరుకుంటున్నదీ, తనకి అవసరమైనదీ వూహించని తీరులో మీరు ఇవ్వాలనే కదా? కాబట్టి ఇచ్చిన స్వేచ్ఛనీ  స్పేసునీ దుర్వినియోగం చేసుకోకండి. 

          చెత్తగా రాయకండి. ఫుట్ బాల్ ఆట మీద ఎన్ని సినిమాలు వచ్చి వున్నా, వాటిలో చెత్తకి ఫిదా అయిపోయి అలాగే రాసెయ్యకండి. చెత్తకి అవకాశం లేకుండా, ఫుట్ బాల్ మీద ఇదివరకు ఎవ్వరూ రాయని విధంగా రాసి నిరూపించుకోండి. 

          5. కొత్తతో పాతని కలుపుకు పోండి 
      నిర్మాతగానీ, సంబంధీకులు గానీ తమకేం కావాలో ఓవరాల్ పిక్చర్ మాత్రమే చెప్తారు. కాన్సెప్ట్ కి  కి లోబడి ఆ ఓవరాల్ పిక్చర్ కి న్యాయం చేసే విధంగా మీరు రాయాలి. అయితే చెత్త జొరబడకుండా రాయాలనుకున్నప్పుడు సూక్ష్మాంశాల పైన దృష్టి పెట్టాలి. క్యారక్టర్ షేడ్స్, స్కిల్స్; సబ్ ప్లాట్స్, కొన్ని రొటీన్ సన్నివేశాలు, ఫార్ములా పాత్రలు;  ట్విస్టులు, టర్నింగులు, క్యారక్టర్ బలహీనతలు, సంఘర్షణ, అంతర్గత భయాలు, కొత్తదనం గల సస్పెన్స్ సీక్వెన్సులు... మీరు దృష్టి పెట్టాల్సిన సూక్ష్మాంశాలలో ఇవి కొన్ని. వీటివల్ల మీ స్క్రిప్టుకి బలం వస్తుంది. ఏకపక్షంగా మీరేదో కొత్తగా చెప్పేస్తూ రుద్దకుండా, నిర్మాత ఇష్టపడే ఈ కమర్షియల్  ఎలిమెంట్స్ ని కూడా కలిపి రాసినట్టయితే మీరొక పక్కా ప్రొఫెషనల్ రైటర్ అన్పించుకుంటారు. 

          6.  విజ్ఞతతో వ్యూహ ముండాలి  

       మీరు రాయడానికి ముందు డెవలప్ మెంట్ చర్చల్లోగానీ, లేదా మీరు ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తి చేసి అందించాక గానీ,  మీ పోరాట వ్యూహం ఎలా వుండాలో మీరు నిర్ణయించుకోవాలి. ప్రొఫెషనల్ రైటర్స్ కి అభిప్రాయాలుంటాయని నిర్మాతలూ నమ్ముతారు. వాళ్ళు రోబోలనీ, చెప్పినట్టల్లా ఆడాలనీ వాళ్ళూ ఆశించరు. సినిమా నిర్మాణమంటేనే  కొలాబరేషన్. ఎందరినో కూడేసి రూపొందించే వినోద సాధనం. నిర్మాతలు నిర్మాణం చేయాలి, దర్శకులు దర్శకత్వం వహించాలి, నటీ నటులు నటించాలి. ఇక రైటర్లు రాయాలి. కాబట్టి కథ పట్లా, పాత్రల పట్లా మీకుండే  విశ్వాసాల కోసం మీరు నిలబడక తప్పదు,  ఆ హక్కు మీకుంది. అయినప్పటికీ పోరాట వ్యూహం విజ్ఞతతో వుండాలి. కొలాబరేషన్ అంటేనే కాంప్రమైజ్ అని గుర్తుంచుకోవాలి.   అంతిమ తీర్పు నిర్మాతదే అని కూడా మర్చిపోకూడదు. దీన్ని దాటుకుని వెళ్ళలేరు.

          అయినా మీలోని రైటర్ కాంప్రమైజ్ అవడానికి  స్ట్రగుల్ చేస్తూంటే, క్షణికావేశానికి  లోను కాకూడదు. ఎసైన్ మెంట్ ప్రాసెస్ అంటేనే ఇచ్చి  పుచ్చుకునేది. మీరే ఎక్కువ ఇచ్చుకునేది. ఎందుకంటే ఇచ్చుకునేందుకే మిమ్మల్ని పెట్టుకున్నారు. పెట్టుకున్నందుకు మీకు కొంత ఇచ్చుకున్నారు. కాబట్టి కాంప్రమైజ్ అవ్వాల్సిన ఖర్మ మీకే పడుతుంది. ఈ కళని మీరు ప్రాక్టీసు చేయాలి. సినిమా ఆడకపోతే మీకేం నష్టం రాదు, ఈ రైటర్ నాశనం చేశాడని ఎవరూ అనరు. ఎసైన్ మెంట్ రైటర్ గా  కాన్సెప్ట్ మీది కానప్పుడు, ఇంకేదీ మీది కానపుడు మిమ్మల్నిదోషిగా చూడరు. ఆ వినాశ కారకులు వేరే కళ్ళెదుట కన్పిస్తూంటారు. వాళ్ళ కేరీర్స్ కే ఎసరు రావొచ్చు, రైటర్ గా ఇంకో చోట మీరు చక్కగా రాసుకుంటూ వుంటారు.  

          ఈ స్ట్రగుల్  లో ఒక్కటే మీ ఆయుధం : మీరు పాషన్ తో మీ విశ్వాసాల కోసం నిలబడ్డారే తప్ప,  ఇగోతో కాదని స్పష్టమవుతుంది. ఈ వ్యూహం మీకు అవకాశాలకి దూరం చెయ్యదు, మరింత దగ్గర చేస్తుంది. 

          7. వేటుకు సిద్ధంగా వుండండి 

      సినిమాలు కొలాబరేషన్ మీడియా గనుక అనుకున్నది అనుకున్నట్టుగా జరగక పోవచ్చు. మంచే జరగొచ్చు, చెడైనా దాపురించ వచ్చు. దీనికి మొట్టమొదట దెబ్బ పడేది మీరు అపురూపంగా రాసిన మీ స్క్రిప్టు అనే పవిత్ర గ్రంధం మీదే. మీదే. మీరు ఎసైన్ మెంట్ రైటర్ గా వున్నారంటే, ఎప్పుడైనా మీ స్థానంలో మరొకరు రావొచ్చనీ, లేదా మీరు రాసింది ఎప్పుడైనా పూర్తిగా మారిపోవచ్చనీ తెలిసే మీరు వచ్చారని గుర్తు పెట్టుకోండి. స్క్రిప్టు మారిపోవడమనేది ప్రొడక్షన్  సమయంలో ఒక అనివార్య తంతు. మాటిమాటికీ మీరు ఎన్నో ప్రొడక్షన్ స్క్రిప్టులూ  రాయాల్సి రావొచ్చు. ప్రొడక్షన్ పూర్తయ్యే నాటికి మీరు ఒరిజినల్ గా రాసిన స్క్రిప్టు మీకే కన్పించకపోవచ్చు. 

          ప్రొడక్షన్లో మీరే కాదు, మీతో ఎంతో ఇష్టపడి రాయించుకున్న పాపం ఆ నిర్మాతే ఏమీ చేయలేక చేతులెత్తేస్తారు. ఎవరైనా సరే ప్రొడక్షన్ లో అప్పటి డిమాండ్స్ ని బట్టి తమ డిమాండ్స్ ని వదులుకోవాల్సిందే. ఇంతా చేసి ఇలా ఆత్మహత్య చేసుకోవడానికా నేను రాశానూ అని మొహం పెట్టి కూర్చోకండి. మీ ఆత్మహత్యతో జీవించి వున్న రైటర్స్ పరిస్థితులేమీ బాగు పడిపోవు. మీకు విగ్రహం పెట్టి జయంత్యుత్స వాలు జరుపుకోరు. ఇగోతో మీరిక్కడ ఒక్క క్షణం కూడా మనశ్శాంతితో వుండలేరు, పైగా ఇతరులకి దూరమైపోతారు. పాషన్ తో మీరు ప్రశాంతంగా వుండగల్గుతారు, నల్గురికీ దగ్గరవుతారు. 

          ఈ పై ఏడడుగుల్నీ  ఆచి తూచి వేస్తూ మీ నడక సాగించినట్టయితే, మీ కెరీర్ కే ఢోకా వుండదు. నిజానికి రైటర్ గా మీకు అవకాశం రావడమే గొప్ప. అవకాశాల కోసం ఏళ్లతరబడి ప్రయత్నించే ఎందరో  రైటర్లకి కాకుండా ఈ అవకాశం మీకు దక్కింది. మీరెంతో అదృష్టవంతులు. ఇంత గొప్ప సినిమా అవకాశంతో మీ స్నేహితుల్లో, మీ బంధువర్గంలో మీరు సగటు మనిషి నుంచి ప్రత్యేక వ్యక్తి స్థాయికి ఎదిగారు. అందుకని అవకాశాన్ని ప్రేమించండి, పరిస్థితుల్ని ద్వేషించకండి.


-ఏజెన్సీస్
http://www.cinemabazaar.in




11, మార్చి 2017, శనివారం

రివ్యూ!




రచన -దర్శత్వం : లోకేష్ రాజ్ 
తారాగణం :  సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, చార్లీ, ధుసూదన్ దితరులు
మాటలుః శాంక్ వెన్నెలకంటి, సంగీతం: జావేద్ రియాజ్, ఛాయాగ్రహణం : సెల్వకుమార్
బ్యానర్ : ఏకెఎస్ఎంటర్టైన్మెంట్, పొటెన్షియల్స్టూడియోస్
నిర్మాతః అశ్వనికుమార్ దేవ్
విడుదల : మార్చి 10, 2017
***
తెలుగు- తమిళ సినిమాల్లో నటిస్తూ అంతర్రాష్ట్ర హీరోగా వెలుగుతున్న సందీప్ కిషన్, మరో ద్విభాషా చలనచిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలుగులో నటిస్తే మూస, తెలుగు- తమిళం కలిపి  నటిస్తే వాస్తవికత అనే వ్యత్యాసం  చూపిస్తూ కూడా వర్ధిల్లుతున్నాడు. కాకపోతే మరీ తమిళ ‘నేరం’ తో చేయరాని  ‘రన్’ సపరేట్ గా తెలుగులో చేసి అపూర్వంగా దెబ్బ తినాల్సి వచ్చింది. అపూర్వంగా అని ఎందుకంటే,  తెలిసి ఎవరూ ఇండీఫిలిం ని రీమేక్ చేయరు, ఇంతవరకూ చేయలేదు ఇది తప్ప.
         
       ఇప్పుడు చేసిన మరో ప్రయోగమేమిటంటే, నాల్గు కథలు కలిసే కథా సాగరంలో నటించడం. ఈ ప్రయోగం కొత్తదేం కాదు- చాలామంది చాలాసార్లు చేసిందే. తాజాగా ఏలేటి చంద్రశేఖర్ తీసిన ‘మనమంతా’ (ఆగస్టు, 2016) కూడా వుంది. అయితే కొత్తేమిటంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ కొత్తవాడు. 

          నగరాలకి వెళ్లి స్ట్రగుల్  చేసే వాళ్ళుంటారు, స్ట్రగుల్ పెట్టే  వాళ్ళూ వుంటారు. ఇలాటి నల్గురి విడివిడి కథలే ఒకచోట కలవడం ఈ కథావస్తువు. ఇందులో ఉద్యోగం కోసం ఊర్నుంచి వచ్చిన శ్రీ ఒక ఐటీ కంపెనీలో చేరతాడు. ఆ ఐటీ కంపెనీలో హెచ్ ఆర్ గా పనిచేసే రెజీనా వుంటుంది. ఈ రెజినాని ప్రేమించే సందీప్ కిషన్ వుంటాడు. ఓ ఆకు రౌడీ ఆమె మీద యాసిడ్ పోస్తానంటే వాడి మీద తను యాసిడ్ పోస్తాడు. ఊర్నుంచి కొడుకు వైద్యం కోసం చార్లీ అని ఇంకొకడు వచ్చి క్యాబ్ డ్రైవర్ గా చేరతాడు. ఒక రౌడీ గ్యాంగ్ వుంటుంది. వీళ్ళు ఓ పిల్లాడు అనుకుని ఇంకో పిల్లాణ్ణి కిడ్నాప్ చేస్తారు. ఆ పిల్లాడు బడా గూండా మధుసూదన్ కొడుకని తెలుసుకుని వణికిపోతారు. అయినా ప్రాణాలకు తెగించి డబ్బుకోసం బెదిరిస్తారు. ఓ ఆ రాత్రి పూట ఓ చోట డబ్బు అందుకునేందుకు ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు ఈ కిడ్నాప్ లోకి ఇటు సందీప్, రెజీనా;  అటు శ్రీ, క్యాబ్ డ్రైవర్ నల్గురూ ఎలా ఇరుక్కుని కిడ్నాప్ గొడవ ఏఏ మలుపులు తిరిగిందనేది మిగతా కథ. 

          ఫస్టాఫ్- పరస్పర సంబంధంలేకుండా వీళ్ళందరి ట్రాకులు సాగుతాయి. సెకండాఫ్ లో ఇంకా కంటిన్యూ అయి – సెకండాఫ్  సగంలో అందరూ క్లాష్ అవడంతో అసలు కథ మొదలవుతుంది.

          మేకర్లు దీన్ని డార్క్ కామెడీ థ్రిల్లర్ అన్నారు. కానీ కామెడీ ఏమీ వుండదు. అలాగే పాటలూ డాన్సులూ వుండవు. ఇది కమర్షియల్  సినిమా స్ట్రక్చర్ లో వుండదు- నాల్గు కథలతో వచ్చే సినిమాలు కమర్షియల్ సినిమాలు కావు- రియలిస్టిక్, లేదా సెమి రియలిస్టిక్ సినిమాలు. ఒకే  కథతో సెమీ  రియలిస్టిక్ సినిమాల కైనా స్ట్రక్చర్ వుంటుంది గానీ,  నాల్గు కథలతో చెబితే స్ట్రక్చర్ సెమీ రియలిస్టిక్ కి కూడా వుండదు. అందుకని సెకండాఫ్ సగం పూర్తయ్యే వరకూ ఈ కథలు ఎటుపోతున్నాయో ఎవరికీ అర్ధం కాదు- ఏ ఒక్క కథలోనూ కథ ప్రారంభంగాక ఓపిగ్గా నిరీక్షించాల్సి వుంటుంది. 

          ఇది స్థూలంగా కన్ఫ్యూజ్డ్  కిడ్నాప్ కథ- ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాగే. ఒకరనుకుని ఇంకొకర్ని కిడ్నాప్ చేయడం, ఆపైన గందరగోళం తలెత్తడం... ఐతే కొత్త దర్శకుడు లోకేష్ కనకరాజ్ దీన్ని కావాలని పచ్చిగా తీశాడు. ఈ మధ్య అరవ వాస్తవికత మరీ బస్తీ పాత్రలతో, పెరిగిపోయిన జుట్లూ గడ్డాలతో, కంపుకొట్టే బట్టలతో, ధూమపానం- మద్యపానం చేస్తూ, గల్లీ భాష మాట్లాడుతూ తిరిగే అనెడ్యుకేటెడ్ మొహాలతో  తీయడం ఫ్యాషన్ గా మారింది. ఓ నల్గురైదుగురు తప్ప అందరూ ఇలా వూర మాస్ గా కన్పించే వాళ్ళే. లొకేషన్స్ కూడా అపరిశుభ్రమైన బస్తీలే. ఇది నగరంలో కథ అన్నాక- ఆ చెన్నై మహానగరాన్ని చూస్తున్నట్టు ఎక్కడా వుండదు- ఓ చిన్నపాటి టౌన్లో  మురికివాడల్లో  జరుగుతున్నట్టు వుంటుంది. 

          అరవ వాస్తవికత శృతిమించి స్లమ్స్ లో సెటిలవుతోంది- ఈ వాస్తవికతలో మళ్ళీ ఎన్నో సినిమాటిక్ లిబర్టీలు. చివరికి ఆటలో అన్నిపాత్రలూ ఒక చోట ఢీకొనడంలో లాజిక్ కూడా వుండదు. ఎప్పుడో పగలే కిడ్నాపర్ల బందికానా లోంచి తెలివిగా తప్పించుకున్న పిల్లాడు, అంత తెలివిగా  ఇంటికి పారిపోకుండా, కనీసం తండ్రికి ఫోన్ చేయకుండా, స్కూలుకైనా వెళ్ళిపోకుండా, పోలీస్ స్టేషన్ కైనా పోకుండా- ఏ ట్రాఫిక్ పోలీసుకైనా చెప్పుకోకుండా - అర్ధరాత్రి దాకా ఎందుకు తిరుగుతూంటాడో అర్ధం గాదు- మళ్ళీ దొరికిపోతేనే కథ ప్రారంభమయ్యే అవకాశం వుంటుందనా?  తన గురించే  అందరి కథలూ ప్రారంభం కావాలని ఎదురుచూస్తూంటే, ఇంటికెళ్ళి పోవడం బావోదని పాపం తన బాలల హక్కుల్ని అలసి సొలసిన నిద్రమొహంతో తనే కాలరాసుకున్నాడు  - దర్శకుడు అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పిస్తూ. 

          నైట్ దూరంగా ఆగిన కారు బడా గూండాదే అనుకుని, ఇట్నుంచి కిడ్నాపర్లు హెచ్చరిస్తూంటే, ఆ క్యాబ్ లో వున్న చార్లీ, శ్రీలు రివర్స్ తీసుకుని పారిపోకుండా, ముందుకే వచ్చి వాళ్ళకి దొరికిపోయి తన్నులు తినడం కూడా కథని ప్రారంభించడం కోసమేనా? ఇలా పాత్రల్ని కథల్ని కలపడం కోసం అతకని సంఘటనల్ని సృష్టించాడు. నాల్గు కథలూ ఒక చోట స్పర్శించే ప్రక్రియ అపరిపక్వతతో వుంది. 

          చివరికి పోలీసులూ, హీరో, కిడ్నాపర్, పిల్లాడు, వాడి తండ్రీ – వీళ్ళందరితో క్లయిమాక్స్ అడ్డగోలుగా వుంది. నగరాన్ని వదిలి వెళ్లి పోవాలనుకున్న సందీప్ – క్లయిమాక్స్ ముగిశాక- నగరాన్ని విడిచి వెళ్ళనంటాడు- ఇక  చస్తే వెళ్ళనంటాడు, తనతో కూడా జరిగిన  ఈ అన్యాయం చూశాక. ‘ఈ నగరం నా గుర్తింపు’ అంటాడు. 

          చిత్రీకరణ అంతా డార్క్ మూవీ బాపతు లైటింగ్ తో వుంది. నేపధ్య సంగీతం సన్నివేశాలకి తగ్గట్టే  వుంది. సందీప్ కిషన్ సహజత్వంకోసం సీరియస్ గా కన్పిస్తాడు. రెజీనాకి పెద్దగా పాత్రలేదు. శ్రీ అనే కొత్త నటుడి హావభావ ప్రదర్శన బావుంది.

-సికిందర్
cinemabazaar.in
  









రివ్యూ!






రచన -దర్శకత్వం:  అశోక్ .జి
తారాగణం: అంజలి, సింధుతులానీ,  దీపక్, రాజా వీంద్ర, ప్రకాష్, ప్తగిరి, స్వాతీ దీక్షిత్, సాక్షీగులాటీ  దితరులు
సంగీతం: సెల్వణేష్, స్వామినాథన్, ఛాయాగ్రణం: బాల్ రెడ్డి, జేమ్స్ క్వాన్
బ్యానర్ : శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్
నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్
విడుదల : మార్చి10, 2017

***
         సైకలాజికల్ థ్రిల్లర్ తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలంటే సైకియాట్రిస్టో, సైకాలజిస్టో అయి వుండనక్కరలేదు గానీ;  థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు తీయగల జానర్ పరిజ్ఞానంతో బాటు, డైనమిక్స్ తెలిసిన దర్శకుడు అయివుండడం అవసరం. దర్శకుడు జి. అశోక్ గతంలో తీసిన ‘పిల్ల జమీందార్’, ‘సుకుమారుడు’ అనే రోమాంటిక్ కామెడీల జానర్ నుంచి  కొత్తగా ‘చిత్రాంగద’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కి మారినప్పుడు  చాలా కష్టపడాల్సి వుంటుంది. రోమాంటిక్ కామెడీల కుండేంత  మంది ప్రేక్షకులు హార్రర్ కామెడీల కుంటారేమోగానీ, సీరియస్ సైకలాజికల్ థ్రిల్లర్స్ కి వుండే అవకాశం లేదు- తెలుగులో కొద్దిపాటి మార్కెట్ వుండే ఈ జానర్ తో కెరీర్ కెటూ ఉపయోగం వుండదు. పైగా ఇప్పుడు దర్శకులు ఏవి పడితే అవి తీసేస్తూ ఒక ఐడెంటిటీ లేకుండా- ఫలానా ఈ దర్శకుడు ఫలానా ఈ తరహా సినిమాలకి పేరు అనే ముద్ర లేకుండా ప్రేక్షకుల దృష్టిలోనే పడలేకపోతున్న కాలంలో, దర్శకుడు  అశోక్ ఇప్పటికైనా తనకి ఏ జానర్ మీద పట్టుందో ఆ జానర్ కి కట్టుబడితేనే  బావుంటుంది. తోచిన జానర్ నల్లా తీసిన వాళ్ళు పేర్లు కూడా గుర్తురాకుండా పోయారు. ఏటా తొంభయ్యేసి శాతం ఫ్లాపులకి ఈ ‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్’ తత్త్వం  కూడా కారణమే. 

          ‘గీతాంజలి’ ఫేం అంజలి సినిమా మొత్తాన్నీ మొదలు పెడితే చివరి దాకా వదలకుండా భుజాన మోయగల సత్తావున్న హీరోయినే. దెయ్యంగా కనపడినా, సైకోగా కనపడినా అందులో పూర్తిగా జీవించిగానీ వదిలిపెట్టదు. అయితే ఈసారి జీవించడానికి ఎన్నో జీవితాలున్నాయి, ఒక్కో జీవితం ఒక్కో షేడ్ తో వుంది- ఈ షేడ్స్ ని  ప్రకటించిందో ఓ సారి చూద్దాం...
కథ
       వైజాగ్ లో సైకాలజీ బోధించే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ చిత్ర (అంజలి) కాలేజీ అమ్మాయిలతో బాటు హాస్టల్లో వుంటుంది. హాస్టల్ లో దెయ్యం తిరుగుతోందనీ, ఆడ దెయ్యం మగవాడిలా మీద పడి కోరిక తీర్చుకుంటోందనీ అమ్మాయిలు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతూంటారు. దెయ్యం చిత్రే  అని బయటపడుతుంది. తనెందుకు మగపిశాచిలా ప్రవర్తిస్తోందో తెలుసుకోవాలని  నీలకంఠ (జయప్రకాష్)  అనే సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తుంది. హిప్నాటిక్ సెషన్ లో  ఒకావిడ ఎవరో ఒక వ్యక్తిని చెరువులో చంపేస్తున్నట్టు కన్పిస్తోందని చెప్తుంది. హత్య కలలోకి కూడా వస్తోందని చెప్పి, చెరువు  అమెరికాలో వుందని తెలుసుకుని ఫ్రెండ్ సువర్ణ (స్వాతీ దీక్షిత్) తో అక్కడికి బయల్దేరుతుంది.

         
అక్కడ పరిచయమైన పోలీస్ కానిస్టేబుల్ సంయుక్త (సాక్షీ గులాటీ) ఇంట్లో వుంటూ చెరువు దగ్గర వుండాల్సిన అరేబియా రెస్టారెంట్  కోసం వెతుకుతూంటుంది. తన ప్రవర్తనకీ, తనకి వస్తున్న కలకీ ప్రాంతంతో వున్న సంబంధం ఏమిటా అని శోధిస్తున్నప్పుడు, ఆమె నమ్మలేని నిజాలు ఆమె గురించే బయటపడతాయి- ఏమిటవి? నిజాలు తెలుసుకుంటే ఆమెకేం జరిగింది? నిజాలు బయట పడకుండా ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మొత్తం మిస్టరీ ఏమిటి? దీంతో ఆమెకున్న సంబంధమేమిటి? ... ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాల్సిందే.


ఎలావుంది కథ 
     సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మర్యాదని కాపాడుతూ కొత్తగానే  వుంది కథ - ఇది నవలగా వచ్చిన నిజకథ అన్నారు.  గత డిసెంబర్ ఫస్టున విడుదలైన తమిళంలో  విజయ్ ఆంటోనీ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘సైతాన్’ (‘బేతాళుడు’) కూడా  తమిళ రచయిత ‘సుజాత’ నిజ కథ ఆధారంగా రాసిన ‘ఆహ్’ అనే నవలకి చిత్రానువాదమే. సరీగ్గా ఈ కథని పోలి వుంటుంది ‘చిత్రాంగద’ కథ.  ‘బేతాళుడు’ లో హీరోకి కూడా ఇలాటివే పారానార్మల్ అనుభవాలెదురై, సైకియాట్రిస్టు దగ్గరికెళ్తే అతను పాస్ట్  లైఫ్ రిగ్రెషన్ ద్వారా గత జన్మలోకి తీసికెళ్తే- అక్కడ గతజన్మలో తానెవరో తెలుసుకుని- గతజన్మలో తన జీవితం ఎలాముగిసిందీ, తనని చంపినా భార్య  ఎందుకలా చంపిందీ తెలుసుకోవడానికి మాచర్ల ప్రయాణం కడతాడు.

         
‘చిత్రాంగద’ కథలో కూడా హీరోయిన్ ఇలాటివే పారానర్మల్ అనుభవాలతో డిస్టర్బ్ అయి, సైకియాట్రిస్టు చేసే  హిప్నాటిజంతో, తదనంతర ప్రయత్నాలతో, అమెరికా వెళ్లి అక్కడ  గత జన్మలో తాను  ఒక భర్త అనీ, తనని భార్య చంపేసిందనీ తెలుసుకుంటుంది...

          ‘
బేతాళుడులో గత జన్మ తాలూకు తన ఆత్మ తనని పట్టుకుని ఒకానొక  ‘జయలక్ష్మిని చంపమని  వేధించినట్టే, ప్రస్తుత కథలోనూ హీరోయిన్ ని పట్టుకున్న గతనజ్మలో భర్త అయిన ఆమె ఆత్మే, ప్రతీకారం కోసం రగిలిపోతుంది.

           
కాకపోతే బేతాళుడుజానర్ మర్యాద తప్పి- ఎత్తుకున్న కథ వల్లకాదని వదిలిపా రేసి- సెకండాఫ్ లో  అవయవాల అమ్మకపు మెడికల్ మాఫియా దుకాణం తెరిచి కూర్చుంది. అట్టర్ ఫ్లాప్ అయింది. కథ దివాలా తీశాక దుకాణాలెందుకుంటాయి. 

ఇది చాలనట్టు,  ప్రియుడితో కలిసి భార్య భర్తని చంపే నేరాలు ఘోరాల బాపతు క్షుద్ర కథగా బాక్సాఫీసు సెంటిమెంట్లకి విరుద్ధంగా తేల్చారు. ‘చిత్రాంగద’  కథలో గతజన్మలో భార్య భర్తని చంపాల్సివచ్చే కారణానికి బలమైన  పునాదులున్నాయి- బాక్సాఫీసుని ఒప్పిస్తూ.  

ఎవరెలా చేశారు 
      అంజలి నంబర్ వన్. కాకపోతే స్కర్ట్స్ లో ఆమె వేషధారణ భరించలేం. ఆమె ఫిజిక్ కి స్కర్ట్స్ ఎబ్బెట్టుగా వున్నాయి,  ‘బి’ గ్రేడ్ మూవీ ఫీలింగ్ కల్గించేలా.  తను అంత బరువెక్కి పోవడం కూడా ఎందుకో తెలీదు. వైజాగ్ లో స్కర్ట్స్ వేసుకు తిరిగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడుంటుందో దర్శకుడికే తెలియాలి. నటించడంలో గానీ, జీవించడంలో గానీ ఏ తేడా రానివ్వలేదు. ముందే చెప్పుకున్నట్టు పాత్రకి చాలా  షేడ్స్ వున్నాయి : స్ప్లిట్ పర్సనాలిటీతో ప్రారంభమై, పారానార్మల్ బిహేవియర్ తో కొనసాగి, పాస్ట్ లైఫ్ సిండ్రోంకి వచ్చి ... మళ్ళీ వీటన్నిటినీ పూర్వపక్షం చేస్తూ తన తప్పే తెలుసుకునే రియలైజేషన్ ... ఇవన్నీ కలగలిసిన సంక్షుభిత వ్యక్తిత్వాన్ని సమర్ధవంతంగా  ప్రకటించింది. ఒకటి : తాను ఆడేపాడే గ్లామర్ హీరోయిన్ కాలేనప్పుడు సమస్యాత్మక పాత్రల్ని నటించే సామర్ధ్యం పెంచుకోవడమే. అయితే తను చేసిన  ఈ ప్రయత్నానికి దర్శకుడి పని తనంగానీ,  సంగీతదర్శకుడి సరిగమలు గానీ ఏమేరకు సహకరించాయో తర్వాత చూద్దాం. 

          రెండో బలమైన పాత్ర సింధూ తులానీ పోషించిన భార్య పాత్ర. ఆశ్చర్యకరంగా  సింధూ తులానీ స్లిమ్ గా తయారయ్యింది! స్లిమ్ గా వున్నందుకే ‘కంచె’లో క్షత్రియ యువతి పాత్ర పోషించిన ప్రగ్యా జైస్వాల్ లాంటి  పర్ఫెక్షన్ తో వుంది క్షత్రియురాలి పాత్రలో తను కూడా తులానీ. తను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో వివరించే ఘట్టాలతో పాత్ర పట్ల సానుభూతి రేకెత్తే విధంగా పాత్రపోషణ చేసింది. 

          ఇక స్వాతీ దీక్షిత్, సాక్షీ గులాటీలవి కూడా నీటైన పాత్రలు. సైకియాట్రిస్టుగా జయప్రకాష్ ది ఏదో చక్రం తిప్పుతున్నట్టు వుండే పాత్ర గానీ, ఏం తిప్పుతూంటాడో మనకి అర్ధం గాదు. పైగా క్లయిమాక్స్ లో అర్జెంటుగా అమెరికాలో కళ్ళముందు చూస్తున్న యాక్షన్ దృశ్యానికి తొత్తు ఒకడు ఫోన్ చేస్తే, టకటకా కొన్ని ఆర్డర్స్ పాస్ చేసేసి, తాను ఇప్పుడే వస్తున్నానంటాడు- అమెరికా వెళ్ళడమంటే గాజువాక సెంటర్లో అర్జెంటుగా వాలిపోయే పనే అన్నట్టు.  పైగా తను అమెరికా చేరుకునే వరకూ రీళ్ళకి రీళ్ళు  క్లయిమాక్స్ జరుగుతూనే వుంటుందన్నట్టు (ఇప్పుడు రీళ్ళు లేకపోయినా ఇలాగే అనుకోవచ్చు తన తెలివి తేటలతో).  ఇంతా చేసి ఏమైపోతాడో అమెరికాకే వెళ్ళడు! 

          ఇక కామెడీ వుండాలన్నట్టు సప్తగిరీ రొటీన్ నాటు కామెడీ వుంటుంది. 
          టెక్నికల్ గా కెమెరా  వర్క్, ఆర్ట్ వర్క్ ఉన్నతంగా వున్నాయి- ఎంచుకున్న లొ కేషన్స్ , తీసిన విజువల్స్ చాలాచోట్ల కళాత్మకంగా వున్నాయి. సెకండాఫ్ నుంచి పూర్తిగా యూఎస్ లోనే వుంటుంది- అక్కడి దృశ్యాల చిత్రీకరణకి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోతే పాటల నాణ్యతే నొచ్చుకునే విధంగా వుంది. 

చివరికేమిటి 
      మంచి కథకి జరగాల్సిన న్యాయం జరగ లేదు. 2015 లో జానర్ మర్యాదని కాపాడిన తెలుగు సినిమాలే విజయాలు సాధించాయని గుర్తించిన మీదట, 2016లో జానర్ మర్యాద అవసరం గురించి ఈ బ్లాగు ద్వారా చేయాల్సిన ప్రచారమంతా చేశాం. అయితే తెలుగు సినిమాల విజయాలకి తప్పనిసరై పోతున్న జానర్ మర్యాద అనే డిసిప్లిన్ కి- ఇంకో విధంగా కూడా విఘాతం కలిగే అవకశం పొంచి వుందని  ఈ సినిమా చూస్తూంటే బోధపడుతుంది. జానర్ మర్యాదని కాపాడుతూ చిత్రీకరణ అంతా చేస్తే చాలదనీ, ఈ చిత్రీకరణకి తగిన నేపధ్యసంగీతం కూడా జతపడకపోతే జానర్ మర్యాదంతా పోతుందనీ తెలుసుకోగలుగుతాం. సంగీత దర్శకుడు సెల్వ గణేష్ స్క్రిప్టులో, పాత్రలో లీనమయ్యే నేపధ్యసంగీతాన్ని అందించకుండా రొడ్డకొట్టుడుగా వాయించుకుంటూ పోయాడు. ఈ కథ ఎంత బలమైనదో, ఒకమ్మాయి జీవితంతో  అంత సున్నితమైనది కూడా. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తున్నప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో బాజాలు మోగిస్తున్న చందాన చెలరేగిపోయాడు. చాలా వరస్ట్! నిజానికి ఈ చిత్రీకరణ చాలా వరకూ నిశ్శబ్దాన్నే డిమాండ్ చేస్తోంది. నిశ్శబ్దమే ఈ సినిమా బలం. సమయమెరిగి సంగీతదర్శకుడు కీబోర్డు కట్టేసినప్పుడే తన నేపధ్య సంగీతపు బలమేమిటో తెలుపుకోగల్గుతాడు. నిశ్శబ్దం కూడా సంగీతమే. పారితోషికం తీసుకుంటున్నాం కదా అని మొత్తమంతా వాయించుకుంటూ కూర్చుంటే సినిమానే నాశనం చేస్తాడు. ప్రేక్షకులు కథనీ, పాత్రనీ ఫీలవ్వడానికి సంగీతపరంగా ఏ మాత్రం అవకాశమివ్వలేదు. ఈ కథ మన వాకిట వాలిన పిట్ట లాంటిది. ఏ మాత్రం అలికిడి చేసినా ఎగిరిపోతుంది. 

          దర్శకుడు కూడా దీనికి బాధ్యత వహించాలి. స్క్రిప్టు రాస్తున్నప్పుడే సౌండ్ డిజైన్ తెలిసిపోతూంటుంది. సౌండ్ ని అనుభవిస్తూ  రాసినప్పుడు స్క్రిప్టు కూడా సంగీతం పలుకుతుంది. సౌండ్, కథ వేర్వేరు కాదు. సౌండ్  అంటే నేపధ్య సంగీతమే కాకుండా, స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా. ఇదంతా దర్శకుడికి తెలీదని కాదు- కానీ రొటీన్ గా ఏం జరిగిపోతూందంటే, అన్ని సినిమాలకీ ఒకే మూసలో  ఆర్ ఆర్ (నేపధ్య సంగీతం) చేసేస్తున్నారు. అలాటి మూసే ప్రస్తుత ప్రయత్నం. 

          ఇక కథనంతో ఇక్కడ వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటంటే, సకాలంలో కథని ప్రారంభించకపోవడం.  కథ ఎప్పుడు ప్రారంభమయ్యింది? హీరోయిన్ కి గతజన్మలో తానెవరో తెలిసినప్పుడు. ఇదెప్పుడు తెలిసింది? సెకండాఫ్ సగంలో. అప్పటివరకూ ఏం నడిచింది? ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ సగం వరకూ హీరోయిన్ తనకేం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నమే. ఒకవిధంగా ఇది ఎండ్ సస్పెన్స్ అనే సినిమాలకి పనికి రాని  కథనం. పాత్ర ఎవరో, కథేమిటో తెలియకుండా మూసి పెట్టినడపడం సస్పెన్స్ అన్పించుకోదు. ప్రేక్షకులకి సహన పరీక్ష అవుతుంది. 

          ఇలాటిదే కథ ‘బేతాళుడు’ లో హీరోకి తన గత జన్మ గురించి ఎప్పుడు తెలిసింది? ఫస్టాఫ్ సగంలో. కథ ఎప్పుడు ప్రారంభమయ్యింది? అప్పుడే – తానెవరో తెలియడం ప్లాట్ పాయింట్ వన్ అయితే- అక్కడ్నించీ ప్రారంభమైన మిడిల్ తో కథ ప్రారంభమయ్యింది. 

          ప్రస్తుత కథలో సెకండాఫ్ సగంలో కథ ప్రారంభమవడం వల్ల ఇంకేం జరిగింది? సినిమా నిడివి రెండున్నర గంటలకి చేరింది. ఫస్టాఫ్ ఉపోద్ఘాతాన్ని తగ్గించి, ఫస్టాఫ్ లో కథ ప్రారంభించి వుంటే నిడివి అరగంటకి తగ్గేది - ఈ అరగంటలో కామెడీ కోసం పెట్టిన కామెడీ కూడా కలుపుకుని. 

          థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలు ఎండ్ సస్పెన్స్ సుడిగుండంలో పడే ప్రమాదాన్ని ఎల్లవేళలా కాచుకోవాల్సి వుంటుంది. ఇలాటి హీరో లేకుండా కేవలం రెండు స్త్రీ పాత్రల మధ్య జరిగే కథ నిజానికి చాలా బ్యూటీఫుల్ గా, మహిళా ప్రేక్షకులనే టార్గెట్ ప్రేక్షకుల్ని నిర్ణయించుకుని, ఆ మేరకు మార్కెట్ యాస్పెక్ట్ తో  తీసి వుండాల్సింది.

 -సికిందర్ 
http://www.cinemabazaar.in