రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఆగస్టు 2016, శనివారం

రివ్యూ!








దర్శకత్వం : సునీల్ రెడ్డి

తారాగణం : సాయి ధరం తేజ, లారిస్సా బొనెసీ, మన్నారా చోప్రా, వెన్నెల కిషోర్, అజయ్, పోసాని, సప్తగిరి, సత్య, రఘుబాబు తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : షేక్ దావూద్, మాటలు : లక్ష్మీ భూపాల్- హర్షవర్ధన్
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : గుహన్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్
నిర్మాతలు : డా. రోహిత్ రెడ్డి
విడుదల : 13 ఆగస్టు, 2016
***
        ఒకవేళ మన రెండు  రాష్ట్రాల్లో  పోలీసులకి నేరస్థుల్ని దండించే పని కష్టంగా తోస్తే, వాళ్ళ థర్డ్ డిగ్రీ టార్చర్ ని మించిపోయే  ‘తిక్క’ అనే తలతిక్క  సినిమా చూపిస్తే చాలు - గిలగిల కొట్టుకుని అక్కడికక్కడే చస్తారు నేరస్థులు. ఎన్ కౌంటర్ చేయలన్నా ఈ సినిమా ప్రయోగిస్తే  సరిపోతుంది. ఈ సినిమా పేరు చెబితే నేరస్థులిక తెలుగు రాష్ట్రాల్లో  వుండరు. నేరస్థులకే ఇలా వుంటే మనలాంటి  వాళ్ళ పరిస్థితేమిటో ఊహించుకోవాల్సిందే. ఈ సినిమాలో హీరోతో బాటు అతడి తండ్రి చీటికీ మాటికీ విషం బాటిల్ తీసి తాగెయ్యబోతారు. ఈ సినిమా కెళ్తే మనం కూడా ఓ విషం బాటిల్ ఎందుకు తెచ్చుకోలేదా అని విలవిల్లాడి పోతాం. ఎడాపెడా సినిమా పెట్టే టార్చర్ ని తట్టుకునే శక్తిలేక చచ్చిపోవడమే బెటరని ఆక్రందిస్తాం. ఈ సినిమా టికెట్స్ తో బాటు కౌంటర్స్ లో విషం బాటిల్స్ కూడా  పెట్టి ప్రేక్షకులకి సరఫరా చేసే ఏర్పాటు నిర్మాత చేసివుంటే ఎంతో పుణ్యం కట్టుకున్న వాళ్ళయ్యే వాళ్ళు. 

          ఈ తలతిక్క సినిమా తీసిన, రాసిన వాళ్ళెవరికీ  అసలు సినిమా అంటే ఏంటో కనీస జ్ఞానం లేదని అడుగడుగునా బట్టబయలై పోతూంటుంది. చిన్న పిల్లలు ఒక చోటచేరి చేసే పిల్ల కాయచేష్టల్లా నిర్మాత పెట్టిన డబ్బుతో ఇష్టమొచ్చినట్టు ఆడుకున్నారు. కామెడీ అంటే తమకి తామే కితకితలు పెట్టుకుని కిలకిలా నవ్వుకోవడంగా భావించుకుని ఒక పిచ్చి వాళ్ళ స్వర్గాన్ని వాళ్లకి వాళ్ళే సృష్టించుకుని అందులో  ఓలలాడారు. వాళ్ళ గెస్ట్ హౌస్ లో వాళ్ళే వేసుకుని ఆనందించుకుంటే సరిపోయే దానికి ప్రేక్షకుల మీదికి వదిలి ఇంత అరాచకం సృష్టించారు. ఒక్క చోటైనా ప్రేక్షకుడనే నిర్భాగ్యుడు నవ్వితే ఒట్టు. తెలుగు చలన చిత్ర చరిత్రలో సినిమా పేరుతో  ఇంత నరకప్రాయమైన చెత్త ఎప్పుడూ వచ్చి వుండదు. 

          మూడేళ్ళ క్రితం ‘ఓం’ అనే త్రీడీ తో కళ్యాణ్  రామ్ ని నిండా పాతిక కోట్లకి ముంచేసి, తిరిగి ఇప్పుడు నిర్మాత రోహిత్ రెడ్డి జేబులు కూడా ఖాళీ చేయించిన దర్శకుడు సునీల్ రెడ్డి పాలబడి ఇప్పుడిప్పుడే పైకొస్తున్న  హీరో సాయి ధరమ్  తేజ కూడా బలైపోయాడు. సినిమా  అంటే ఏంటో సగటు ప్రేక్షకులకున్న  అవగాహన కూడా లేకుండా రచన పేరుతో, దర్శకత్వం పేరుతో అనర్హులు చేరి నిర్మాతనీ, హీరోనీ భ్రష్టు పట్టించారు.  ఈ సినిమా దర్శకుడు, రచయితలూ వెనక్కి వెళ్లి సినిమా అంటే ఏమిటో అ ఆ లు నేర్చుకుని వస్తే నిర్మాతలూ హీరోలూ ప్రేక్షకులూ బతికిపోతారు- బయ్యర్లు కూడా!

          ఎక్కడైనా ఎప్పుడైనా సినిమా కథ ఇలా ఉంటుందా....ఆదిత్య (సాయి ధరమ్ తేజ్) అనే కార్పోరేట్ ఉద్యోగి ఉద్యోగం తక్కువ తాగితందానా లాడి, అమ్మాయిల వెంట పడ్డం ఎక్కువగా చేసే ఒక తిక్కలోడు. బాగా డబ్బున్న వీడి తండ్రి (రాజేంద్ర ప్రసాద్) కూడా తాగి తందానా లాడి ఆడ పిచ్చితో తిరిగే మరో తిక్క శాల్తీ. కొడుకు కారు నడుపుతూంటే వెనక సీట్లో తెచ్చుకున్న అమ్మాయితో సరసాలాడే కామ పిశాచి. పట్టపగలు కారులోనే తప్ప తాగుతూ డ్రైవ్ చేస్తూ అడ్డంగా పోతాడు ఆదిత్య. అంజలీ( లారిస్సా బొనేసా) అనే  వెర్రిబాగుల హీరోయిన్ కారు ఆ కారుని గుద్దెయ్యడంతో మనవాడికి చచ్చేంత పనై ప్రేమలో పడిపోతాడు. నమ్మశక్యంగాని  ఓవరాక్షన్ తో, వెర్రి చేష్టలతో ఏమేమో  చేస్తూ ఆమెని ప్రేమలో పడేసుకుంటాడు.  కానీ  వీడు కొన్ని తేదీలు గుర్తుంచుకోలేదని ఆ వెర్రిబాగుల హీరోయిన్ వీడికి కటీఫ్ చెప్పేసి తండ్రి  చూసిన హాఫ్ మగాడ్ని (వెన్నెల కిషోర్) చేసుకో  బోతూంటుంది. ఇక మనవాడికి పిచ్చి బాగా ఎక్కిపోయి టెర్రరిస్టులు దాడులు చేసినట్టుగా, మావోయిస్టులు కాల్పులు జరిపినట్టుగా (ఇలా పోలీస్ బాసే  అనుకుంటాడు పాపం)  పెట్రోల్ బంకుతో సహా పేల్చేసి నానా బీభత్సం సృష్టిస్తాడు. పోలీసులు వీణ్ణీ వీడి ఫ్రెండ్స్ నీ బొక్కలో వేస్తారు. ఇప్పుడు వీడి ప్రేమ ఎలా తిరిగి దక్కాలి? ఇందుకేం చేయాలి? ఏమైనా చేశాడా? రకరకాల గుంపుల మధ్య పడి అసలు కన్పిస్తాడా, గుంపుకో చోటా విలన్ చొప్పున వున్న గ్యాంగులు తలా ఒక్కో అమ్మాయిని వెతుక్కుంటూ గోలగోలగా పిచ్చాసుపత్రి పేషంట్స్ లా తిరుగుతోంటే అసలు మన వాడెక్కడున్నాడు? ఉన్నాడా, ఇంత సినిమా చాలనుకుని చెక్కేశాడా?  రైటర్ షేక్ దావూద్ సాబ్ హీరోయిన్ తో బాటు మిగతా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకీ తన మతాచారాన్ని  తెచ్చి పూస్తూ, బురఖాలు తొడిగించేసి సాంతం కన్ఫ్యూజ్ కామెడీ చేసుకు పోతూంటే- హీరోయిన్ తో బాటు అమ్మాయిల మొహాలే, గ్లామరే కన్పించని తాలిబానిజంతో సినిమాకే గతి పట్టింది?  తాలిబాన్లకి చూపిస్తే సూపర్ హిట్టయ్యే ఈ సినిమా ఎందుకొచ్చి తెలుగు వాళ్ళ మధ్య పడింది? దావూద్ సాబ్ కి తాలిబాన్ల నుంచి వార్నింగ్స్ వచ్చి ఈ విధంగా బురఖాలు తొడిగించేశారా? కానీ ఇప్పుడు బురఖా లేసుకుని కన్పించకుండా తిరగాల్సింది ఈ సినిమా రచయితలూ దర్శకుడే! నిర్మాతకి మాత్రం పెద్ద బురఖా తొడిగేశారు. అదేం బురఖా, కాస్ట్లీ దుబాయ్ బుట్ట బురఖాయేనా?

          మాటల రచయితలుగా దర్శన మిచ్చిన లక్ష్మీ భూపాల్, హర్షవర్ధన్ అనే వాళ్ళు ఒక్కసారి థియేటర్లో కూర్చుని తాము రాసింది చూడగలరా? వినగలరా? ఒక్క క్షణమైనా ఆ మాటల దాడి నుంచి విరామం ఇచ్చారా? ఒకరా ఇద్దరా-  ప్రతీ సీన్లో గుంపులు గుంపులుగా ఎందరో నటీనటులు చేరి-  కామెడీ పేరుతో  గోలగోలగా ఎవరేం మాట్లాడుతున్నారో- అరుచుకుంటున్నారో – చెవులు పోటెక్కే సౌండ్ పొల్యూషన్ తో – చేపల బజార్లా ఏమేం చేస్తున్నారో – తాము ఫాలో అయి రెండు ముక్కల్లో సూటిగా ఈ కథేమిటో చెప్పగలరా? 

          వెంటనే సూటిగా రెండు ముక్కల్లో ఈ చేపల బజార్ కథేమిటో చెప్ప గల్గితే ప్రేక్షకులు ఆత్మహత్యా ప్రయత్నాలు మానుకోగలరు. 

          ఈ సినిమా తీయడానికి ఎన్ని కోట్లయ్యిందో అన్ని తలా ఓ కోటి కృష్ణా నగర్- ఫిలిం నగర్ లలో ఏళ్ల తరబడి ఒక్క అవకాశమూ దక్కక, దిక్కులేక తిరుగుతున్న  అసిస్టెంట్లు ఓ పాతిక మందికి ఇచ్చి వుంటే-  నిర్మాత రోహిత్ రెడ్డికి నీతిగా నిజాయితీగా ఎంతో న్యాయం చేసి పెట్టే వాళ్ళు. ఆయన మరో పాతిక సినిమాలు తీయడానికి రెడీ అయ్యే వాళ్ళు. పాతికలో పది పోయినా లా ఆఫ్ ఎవరేజేస్ కింద తను లాభాల్లోనే వుండే వాళ్ళు. ఒకప్పుడు సేలంకి చెందిన మోడరన్ థియేటర్స్ సంస్థ అనుసరించిన సక్సెస్ ఫుల్ పంథా ఇది.


-సికిందర్





12, ఆగస్టు 2016, శుక్రవారం

రివ్యూ!







రచన- దర్శకత్వం :  మారుతి

తారాగణం ; వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, సంపత్ రాజ్, జయప్రకాష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని తదితరులు
సంగీతం : జిబ్రాన్ , ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్, కూర్పు : ఉద్ధవ్,
పోరాటాలు : రామ్ –లక్ష్మణ్, రవివర్మ
బ్యానర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : సూర్య దేవర నాగవంశీ,  పిడివి ప్రసాద్
విడుదల : 12 ఆగస్టు,  2016
***
      వెంకటేష్ – మారుతీ అనే జనరేషన్ గ్యాప్ వున్న కాంబినేషన్ తో,  ‘బాబు బంగారం’ అనే సంసారపక్ష టైటిల్ తో,  కొంత కాలంగా కుతూహలం రేకెత్తిస్తున్న వెంకీ మార్కు కుటుంబ కథా చిత్రం- ఎన్ని విచిత్రాలు చేసిందో ఈ కింద చూద్దాం...

కథ : 
          
కృష్ణ (వెంకటేష్) జాలిగల ఎసిపి. నేరస్థులని కొట్టాలన్నా అతడికి మనసొప్పదు. అలాటి వాడు  ఇంకో జాలి గుండెగల శైలజ (నయనతార) ని చూసి మనసు పారేసుకుంటాడు. వెంటనే సెలవు పెట్టేసి ఆమెని ప్రేమించడానికి బయల్దేరతాడు. ఆమె నడిపే మెస్  సాధక బాధకాల్లో పాలు పంచుకుంటాడు. ఆమెది పెద్ద కుటుంబం. అందరూ ఆడవాళ్లే-  బామ్మ, అమ్మ, ముగ్గురు చెల్లెళ్ళూ.  ఒక హత్య కేసులో ఇరుక్కున్న తండ్రి శాస్త్రి (జయప్రకాష్) అజ్ఞాతంలో ఎక్కడున్నాడో తెలీసు. అతడి ఆచూకి కోసం మల్లేష్ (సంపత్ రాజ్)  ముఠా  శైలజని వేధిస్తూంటారు. తన కుటుంబానికి కృష్ణ చేసిన మంచి పనులకి శైలజ అతణ్ణి ప్రేమిస్తుంది. ఇంతలో కృష్ణ తనతో  ప్రేమ నటించాడనీ, తన తండ్రి ఆచూకీ కోసమే  తనకి దగ్గరయ్యాడనీ అసహ్యించుకుని దూరమవుతుంది శైలజ. ఈమెతో ప్రేమా లేక, ఆమె తండ్రి నిర్దోషి అని నిరూపించే  అవకాశమూ లేక డైలమాలో పడతాడు కృష్ణ. ఇక్కడ్నించీ ఈ రెండు లక్ష్యాలూ సాధించడానికి ఏం చేశాడు కృష్ణ అన్నది మిగతా సెకండాఫ్ కథ. 

ఎలా వుంది కథ 
        చాలా చాలా పాత వాసనలతో వుంది. చూసి చూసి వున్న మూస ఫార్ములా కథతో,  పాత్రలతో అనాసక్తి కరంగా వుంది. అసలిదొక కథగా వుండే అవకాశం కూడా లేదనే  లాజిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ తరం దర్శకుడు మారుతీ,  వెంకటేష్ తో ఈ కాలపు కథ తీసుకోకుండా, వెంకటేష్ కాలపు కథనే తీసుకోవడంతో, పాత వెంకటేష్ సినిమా చూస్తున్నట్టే వుంది. ఇలాటి సినిమాలు ఎందరో అప్పటి దర్శకులు తీసేశారు- ఇంకా ఇప్పుడు ఇప్పటి ప్రేక్షకుల కోసం ఇప్పటి దర్శకుడు మారుతి కూడా తీయాలా!

          . ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’ లాంటి వినూత్న ఇమేజియేతర కథలతో కాలంతో బాటు ముందుకు కదులుతున్న వెంకీని వెనక్కి లాక్కొచ్చి పాత పీఠం మళ్ళీ ఎక్కించినట్టుంది.  ఇందుకు పూర్తిగా మారుతీ బాధ్యుడనలేం, వెంకీ కూడా ‘ఊఁ...తీయ్!’ అనకపోతే ఈ పురాతన కహానీ కుహనా కమర్షియల్ గా నయా జమానాలో వచ్చే అవకాశమే లేదు. ఫస్టాఫ్ ప్రేమలో పడేసే రొటీన్ ట్రాక్ తో వుంటే, సెకండాఫ్ విలన్లతో యాక్షన్ కామెడీ కథగా మారుతుంది. ఈ యాక్షన్ కామెడీ కథలో క్రియేటివిటీ లోపించడంతో మూసఫార్ములా సన్నివేశాలే రాజ్యమేలి నిద్రపుచ్చుతాయి. పైగా ఫస్టాఫ్ ముగియగానే  ఈ సెకండాఫ్ కథేమిటో తెలిసిపోవడంతో చూడ్డాని కేమీ మిగలదు. 

          ఆపదల్లో వున్న హీరోయిన్ కుటుంబాన్ని కాపాడి ఆమె ప్రేమని పొందే కథలతో స్టార్ సినిమాలు ఇంకా ఎన్ని సార్లు తీస్తారనేది మిలియన్ డిస్కుల ప్రశ్న. 

ఎవరెలా చేశారు
        వీలైనంత ఫన్నీ గా తన పాత్రలో వెంకీ కన్పించడానికి  ప్రయత్నించారు. కానీ  లేని కథే ఈ పోలీస్ పాత్రకి తోడ్పడలేదు. దీంతో కృతకంగా కన్పిస్తుంది పాత్ర.  పైగా వెంకీ పాత్రకి సరయిన నయనతార పాత్ర సహకారం లేదు. వెంకీ చేసే ఫన్ కి దీటుగా నయన్  కూడా చేసి వుంటే ఈ ఇద్దరు సీనియర్లు మళ్ళీ ఓ ఊపు ఊపే వారు ఈ రొటీన్ మూసతో. కానీ నయన్  పాత్రని దర్శకుడు అస్తమానం శోక పాత్రగా కొనసాగించడంతో- ఎప్పుడూ కుటుంబ బాధలతో ఆమెకి ఏడుపే మిగిలింది. ఈ రెండు పాత్రల సంకలనాన్ని ఈ రోజుల్లో కూడా బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా ఇంత  నిస్తేజంగా ఎలా ప్రెజెంట్ చేస్తారో తెలీదు. బాక్సాఫీస్ ఎప్పుడూ యూత్ ఫుల్ గానే వుంటుంది మరి. నయన్  మెస్ నడపడం, వెంకీ సహకరించడం ఇటీవలి ‘పెళ్లి చూపులు’ లో వచ్చిన వ్యవహారమే. ఇక పాటల్లో కూడా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. నయన్ జస్ట్ వేస్టయిన గ్లామర్ తార అనొచ్చు ఈ సినిమాలో. 

          ఇక యాక్షన్ కామెడీ వచ్చేసరికి వెంకీ- తన ఇరవై ఆరేళ్ళ నాటి  ‘బొబ్బిలి రాజా’ ఎలిమెంట్స్ ని అరువు దెచ్చుకున్నారు. ఫైట్ చేస్తున్నప్పుడు ‘అయ్యో అయ్యో’ అనే ఊతపదం, క్లయిమాక్స్ ఫైట్ లో ‘బలపం పట్టి భామ వొళ్ళో’   పాట పేరడీ వంటి గిమ్మిక్కుల్ని ఆశ్రయించారు. కామెడీ అనేది కథలోంచి సహజంగా పుట్టుకురావాలి గానీ, ఇలా ఇంకో సినిమా పేరడీలు తెచ్చుకుని, స్పూఫ్ లు తెచ్చుకుని నింపే ప్రయత్నం చేస్తే దీనికి మారుతి ఎందుకు? క్రియేటివిటీ చచ్చిపోతే  వచ్చి చేరేది -ఈ సినిమాలో పదేపదే వాడిన  పదంలాగా -  పుచ్చిన బత్తాయిల్లాంటి  కృషి ఫలాలే. కుళ్ళిన బత్తాయిలనకుండా పుచ్చిన బత్తాయిలనడం కూడా పట్టాలు తప్పిన మారుతీ ఎక్స్ ప్రెస్ తడాఖా నేమో!

          గ్లామర్ పరంగా, ఫిజిక్స్ పరంగా ఆకర్షణీయంగా వెంకీ వున్నంత స్థాయిలో, తన కథా కథనాలతో మారుతీ కూడా పోటీపడి వుంటే  బావుండేది. పృథ్వీ తో మళ్ళీ ‘నాన్నకు ప్రేమతో’ పేరడీ కి న్యూవేవ్ దర్శకుడు మారుతి కెందుకు? ఇంకొకరి మూస మార్గం మారుతి కెందుకు? బత్తాయి లమ్మే బాబ్జీ పాత్రలో పృథ్వీ, నయన్ పాత్రని ప్రేమించే బావగా నానా హంగామా చేయడం బాగానే వుంది ఫన్నీగా, కానీ ఆమె వెంకీ ప్రేమకి లొంగిందని తెలుసుకుని- సంగతి చూస్తానని తొడలు కొట్టుకుని సవాళ్లు చేసి వెళ్ళిన  వాడు- మళ్ళీ కన్పించడెందుకో అర్ధం కాదు. ఎమ్మెల్యే పిచ్చయ్యగా పోసాని, మేజీసియన్ గా బ్రహ్మానందం వీళ్ళిద్దర్లో పోసానికి ఎక్కువ కామెడీకి అవకాశం దక్కింది. అయితే సెకండాఫ్ లో కామెడీ ఒక్కో విడివిడి ఎపిసోడ్ లుగా కాకుండా- కథని ముందుకునడిపించే రెండు సీక్వెన్సులుగా వచ్చి వుంటే కమెడియన్ లందరూ ఒక వెలుగు వెలిగే వాళ్ళు. దురదృష్ట మేమిటంటే కథని ముందుకు పరిగెత్తించే సీక్వేన్సులుగా గాక, వంతు లేసుకున్నట్టు విడివిడి ఎపిసోడ్లు కమెడియన్లు పంచుకోవడంతోనే ఫస్టాఫో సెకండాఫో విషయం లేక కుప్పకూలుతున్నాయి. 

          విలన్ గా సంపత్ రాజ్, బామ్మగా షావుకారు జానకి, నయన్ తండ్రిగా జయప్రకాష్ కన్పిస్తారు. వెన్నెల కిషోర్ కి సరైన పాత్ర, కామెడీ కూడా లేవు.
          ఛాయాగ్రహణం, సంగీతం చెప్పుకునేంత ప్రత్యేకంగా ఏమీ లేవు. 

చివరికేమిటి 
          
సెకండాఫ్ తోనే సమస్య. హీరోయిన్ తండ్రి దగ్గర విలన్ల తాలూకు ఒక వీడియో వుంటే, అది పెన్ డ్రైవ్ రూపంలో హీరో చేతికి చేరితే, ఆ పెన్ డ్రైవ్ ని కొట్టేయడం కోసం విలన్లు చేసే ప్రయత్నాలే కథగా మారడంతో పూర్తిగా అనాసక్తికరంగా మారిపోయింది. ఇలాటిది ఇంకెన్ని సార్లు ఎన్ని సినిమాల్లో చూస్తాం. పైగా హీరోకి బలమైన గోల్, దానికి తగ్గ ప్రత్యర్ధి వర్గమూ లేకపోవడం కూడా మారుతీ కథనపు బలహీనతగా తయారయ్యింది. అసలా హీరోయిన్ తండ్రి ఆ వీడియోతో పారిపోయి ఎక్కడో భయపడుతూ బతకడం కంటే, కుటుంబాన్ని విలన్ల ఆగడాలకి వదిలేయడం కంటే, పారిపోయినప్పుడే  ఆ ఎసిపి అయిన హీరోనే ఆ వీడియోతో ఆశ్రయిస్తే సరిపోయేదిగా? అప్పుడు ఈ కథంతా వుండే అవకాశమే లేదుగా?  కథగా ఇదంతా ఉండేందుకు అవకాశమే లేనప్పుడు ఈ కథంతా కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు సినిమాగా తీసినట్టు? ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ తండ్రి ఆ విలన్ల వీడియో తీసినప్పుడు, విలన్లకి ఈ సంగతి తెలిసి వెంటబడినప్పుడు,  హీరోయిన్ తండ్రి నేరుగా  పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతే ఆ ఫ్లాష్ బ్యాక్ తోనే కథ ముగిసిపోయే వ్యవహారం కదా? ఎందుకు ఇంత పెద్ద వ్యవహారం పెట్టుకున్నారు? లాజిక్ తట్టకనా, లేకపోతే ప్రేక్షకులకి లాజిక్ ఏం తెలుస్తుందనా?

          ఇంత కాలం గ్యాప్ తర్వాత వెంకీ ‘బాబు బంగారం’ అంటూ ఒక ఫీల్ గుడ్ టైటిల్ తో వచ్చినప్పుడు సినిమా కూడా ఎంత వెచ్చ వెచ్చగా, నులి వెచ్చగా - చలిమంట వేసుకున్న అనుభవంలా  ఆహ్లాదపర్చాల్సింది - నిలువెత్తు ఒరిజినాలిటీతో!


-సికిందర్ (దీనికి స్క్రీన్ ప్లే సంగతులు 
అవసరం లేదు)
http://www.cinemabazaar.in






11, ఆగస్టు 2016, గురువారం

స్క్రీన్ ప్లే సంగతులు!

పాత్రలేకుండా విడిగా కథ వుండదు, కానీ కథ లేకుండా పాత్ర ఉండగలదు. ఎందుకంటే కథని పుట్టించేదే పాత్ర. కథ వచ్చేసి ఎంత ప్రయత్నించినా పాత్రని పుట్టించలేదు. కథని – పాత్రని పక్కన పెడదాం : ఓ సంఘటన ఏదైనా తీసుకుందాం. ఓ మనిషో ఓ జంతువో లేకుండా ఓ సంఘటన జరుగుతుందా?  బస్సు దాని కదే వెళ్లి లోయలో పడిపోతుందా? డ్రైవర్ తీసికెళ్తేనే కదా వెళ్లి లోయ పడే సంఘటన  జరిగేది. కుక్క కరిస్తేనే కదా ఎవరైనా కుయ్యో మొర్రోమనే  సంఘటన జరిగేది. కాబట్టి జీవులు మాత్రమే సంఘటనల్ని  జరపగలవు. జీవుల్లాంటి చైతన్యమున్న ప్రకృతి సైతం సంఘటనలని జరిపించగలదు. పాత్రంటే జీవియే. అలా అది మాత్రమే కథని సృష్టించగలదు. కథ వచ్చేసి పాత్రని సృష్టించలేదు. కానీ కొందరు కథకులతో ఎలా ఉంటుందంటే- కుక్క కూర్చుని వుంటే మనిషే దాని దగ్గరి కెళ్ళి సరదాపడి కరిపించుకున్నట్టు, బస్సు దానికదే హుషారుగా వెళ్లి లోయలో పడిపోయినట్టు చిత్రిస్తూ కథని అల్లేస్తూంటారు. పర్యవసానం :  కథ (కథకుడు) నడిపించినట్టూ నడుచుకునే పాసివ్ పాత్రలు, దాంతో బలహీన కథనాలు. 

          ఇంకా వివరంగా చెప్పుకుంటే,  ధీరజ్ కుమార్ చెల్లెల్ని కిడ్నాప్ చేశారన్న వార్త గుప్పుమన్న దనుకుందాం. అప్పుడు ధీరజ్ కుమార్ బయల్దేరాడు. వీధిలో ఒకర్ని అడిగాడు- నా చెల్లెల్ని మీరు చూశారా అని. నీ చెల్లెల్ని ఎవరో కార్లోకి లాక్కుని వెళ్లిపోయారని ఆ పెద్ద మనిషి అన్నాడు. బాధతో విలవిల్లాడాడు ధీరజ్ కుమార్. తన చెల్లెలు ఎంత గుణవంతురాలో, ఆమె లేకపోతే తనెలా బతకలేడో  చెప్పుకుని వాపోయాడు. ఆ మనిషి జాలిపడి అలా వెళ్లి ఎంక్వైరీ చేయమన్నాడు. ధీరజ్ కుమార్ ముందుకెళ్ళి ఇంకొకర్ని అడిగాడు. ఆ కారు పంజగుట్ట వైపు వెళ్లి నట్టుందని ఆ మనిషి అన్నాడు. బోలెడు సిస్టర్ సెంటిమెంటు ఫీలవుతూ ధీరజ్ కుమార్ పంజగుట్ట చేరుకుని అక్కడ వచ్చేపోయే కార్లని చూస్తూ నిలవడ్డాడు. అతడి వాలకం చూసి జనాలు వాకబు చేశారు. విషయం తెలుసుకుని అయ్యో పాపమనుకుని, అయితే వెంటనే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇమ్మన్నారు. వెంట వాళ్ళు కూడా వచ్చారు. ఇంతమంది తోడ్పాటుతో ధీరజ్ కుమార్ పోలీస్ స్టేషన్ కెళ్ళి భోరుమన్నాడు. చెల్లెలు లేకపోతే  చచ్చిపోతానన్నాడు.  అతడి ఎమోషన్ కి బోలెడు ఫీలై పోయారు పోలీసులు కూడా...

        ఎక్కడ చూసినా ధీరజ్ కుమార్ సానుభూతిని  పొందాలని చూస్తున్నాడు. చెల్లెలి గుణ గణాలని వర్ణిస్తూ సిస్టర్  సెంటి మెంటుని తెగ వెళ్ళబోసుకుంటున్నాడు. ఆపదలో వున్న సిస్టర్ క్షేమం కన్నా, ఆమెని కనుక్కోవాలన్న ఆదుర్దా కన్నా,  తన మీద జాలి పుట్టించుకునే ప్రయత్నమే  చేస్తున్నాడు...ఎందుకని?  తనుగాక కథకుడు ఏదో ఫీలైపోవడం వల్ల... కథకుడు ఫీలైపోయిన భావోద్వేగాలతో ధీరజ్ కుమార్ పట్ల ప్రేక్షకులు కళ్ళ నీళ్ళ పర్యంతమైపోతారని, బాగా ఏడ్చేసి  సిస్టర్ సెంటిమెంటు అద్భుతంగా పండించారని హర్షాధ్వనాలు చేస్తారనీ అనుకోవడం వల్ల.  ఆ సిస్టర్ అవతల ప్రమాదంలో ఉందన్న అర్జెన్సీ కన్నా- లాజిక్ కన్నా- ఇక్కడ ఆమె పేర సెంటిమెంటల్ డ్రామాతో  ఏడ్వడమే ముఖ్యం,  అవతల ఆమెని రేప్ చేసి పడేసినా ఫర్వాలేదు. రేప్  చేసి పడేస్తే భోరుమని  అదింకో సెంటిమెంటల్ ఎపిసోడ్. 

          ఇంకోటి జాగ్రత్తగా గమనించాలి : ధీరజ్ కుమార్ ఎక్కడా సొంత బుర్రని ఉపయోగించడం లేదు. వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ, లేదా అడిగించుకుంటూ,  వాళ్ళూ వీళ్ళూ ఇచ్చే  డైరెక్షన్స్ తో చెల్లెల్ని వెతుక్కుంటున్నాడు. 

          ఇదే ధీరజ్ కుమార్ చెల్లెలు కిడ్నాప్ అయిందని తెలుసుకుని ఇంకోలా రియాక్ట్ అయ్యాడనుకుందాం. వెంటనే లేచి పరిగెత్తాడు. సంఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశాడు. ఓ పక్క పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి ఎలర్ట్ చేశాడు. సంఘటనా స్థలంలో కారు నంబర్ సమాచారం దొరికించుకుని, అది పోలీసులకి అందజేస్తూ ఆ కారు వెళ్ళిన దిశలో దూసుకు పోయాడు.  ఓచోట ట్రాఫిక్ హెవీగా, స్లోగా వుంది. ఆ కారు కోసం ఎక్స్ రే కళ్ళతో చూస్తూ చివరికి కొన్ని కార్ల మధ్య పట్టుకున్నాడు. అతడి ధాటికి తట్టుకోలేక దుండగులు పారిపోబోయారు చెల్లెల్ని వదిలేసి.  వాళ్ళల్లో  ఇద్దర్ని పట్టుకుని చితకబాది, పోలీసులకి అప్పగించాడు ధీరజ్ కుమార్. చెల్లెల్ని హగ్ చేసుకున్నాడు...

       ఇక్కడ జరిగిన సంఘటనకి తానేం చెయ్యాలో తనకి బాగా తెలుసు ధీరజ్ కుమార్ కి. ఎవర్నీ అడుక్కుంటూ తిరగలేదు. తనే ఆరా తీస్తూ బుర్ర నుపయోగించుకుని ఆఘమేఘాలమీద దూసుకుపోయాడు. కథకుడు  అడ్డుపడడం లేదు, ధీరజ్ కుమార్ ఎటు వెళ్తూంటే అటు తనూ పరుగులు తీస్తున్నాడు కథకుడు. చెల్లెల్ని కాపాడుకోవడానికి పరుగెత్తడమే చెల్లెలి సెంటి మెంటు అని ధీరజ్ కుమార్ తీసుకుంటున్న చర్యలే తెలియజేస్తున్నాయి. ఎవరో దుండగుల్ని  పట్టుకుని చెల్లెల్ని  క్షేమంగా తనకి అప్పగించకుండా, తనే దుండగుల్ని  పట్టుకుని చెల్లెల్ని విడిపించుకున్నాడు. ఇది యాక్టివ్ పాత్ర- కథకుడు సృష్టించి దాని ఇష్టానికి వదిలేసిన పాత్ర. తనే కథని నడుపుకుంటూ పోయిన కథానాయక పాత్ర, నాల్గు డబ్బు లొచ్చే కమర్షియల్ సినిమాపాత్ర. 

          దీనికి ముందు పైన చెప్పుకున్న మొదటిది పాసివ్  పాత్ర. కథకుడు తన చాదస్తం కొద్దీ అడుగడుగునా అడ్డు పడుతూ నడిపించిన  డమ్మీ పాత్ర. కథ తానే నూ ముందు పుట్టినట్టు పోజు కొడుతూ నడిపిస్తే నడుచుకుంటూ పోయిన అనుత్పాదక పాత్ర. రూపాయి కూడా రాని ఆర్ట్ సినిమా పాత్ర.

          ఈ మొదటి తరహాలోనే పాసివ్ గా ఉంటున్నాయి అనేక సినిమాల్లో హీరోల పాత్రలు.  మన సినిమాలు కమర్షియల్ సినిమా ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలని ఇందుకే గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. ఎన్ని సార్లు చెప్పుకున్నా ఎవరు పట్టించుకుని బాగుపడతారు గనుక. బాగు పడాలన్న కోరిక,  కమిట్ మెంట్ లేనివి ప్రపంచంలో తెలుగు సినిమాలే. యాక్టివ్ పాత్ర చిత్రణకి - పాసివ్ పాత్ర చిత్రణకి  వాటి స్పందనల రీత్యా  వున్న తేడాని తెలుసుకోకపోవడం వల్ల. 

          ఈ రెండూ కాక మూడోది పాసివ్- రియాక్టివ్  పాత్ర అనేదొకటుంది.  ఇది యాక్టివ్ పాత్ర లాగే ప్రవర్తిస్తుంది. వాళ్ళనీ వీళ్ళనీ ఎడా పెడా తిడుతుంది, తంతుంది- బోలెడు యాక్షన్ లోవుందే అన్నట్టు భ్రమ కల్గిస్తుంది. పైన చెప్పుకున్న మొదటి కేసులో లాగే ఇది పాసివ్వే. అయితే పాసివ్ గా ఉండక రియాక్ట్ అయి తంతుంటుంది. ఆఁ..నీ డబ్బా మొహం  చెల్లెలు అంత  గొప్పదేటి?-  అని ఎవడో అన్నాడనుకుందాం, నా చెల్లెల్నే అంటావురా!-  అని వీర లెవెల్లో రియాక్ట్ అయి బాదేస్తూంటాడు  మన ధీరజ్ కుమార్. మళ్ళీ ఇంకొకళ్ళని చెల్లెలి జాడ అడుక్కుంటూ  తిరుగుతూంటాడు. ఈ కోపం, ఈ ప్రతాపం  అసలు కిడ్నాపర్స్ మీద చూపించాలని మాత్రం అనుకోడు...ఇలా వుంటుంది  పాసివ్ రియాక్టివ్ పాత్ర చిత్రణ. 


        ఇవన్నీ ఒకెత్తయితే, ఇప్పుడు ‘శ్రీరస్తు శుభమస్తు’ లోకొస్తే, హీరోయిన్ ని ఈ పాసివ్- రియాక్టివ్ క్యారక్టర్ గా ముస్తాబు చేయడం కొత్తేమీ కాకపోతే- కొత్తగా వున్న దేమిటి? ఏమిటంటే హీరో పాసివ్ కాదు, రక్షించారు. పోనీ యాక్టివా అంటే  పూర్తి యాక్టివూ కాదు. ఎందుకంటే దీనికి పూర్తి జ్ఞానం లేదు. లేకపోవడం వల్ల రాంగ్ రూట్లో గోల్ ప్రయాణం కట్టింది. గోలే రాంగై పోయింది, చేయాల్సిన పని ఒకటుండగా ఇంకోటి చేసుకుపోయింది...

          చేయాల్సిన పని : తనింట్లో ఆల్రెడీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వదిన ఐదేళ్లుగా హీనంగా బతుకుతోంది. ఇంట్లో పరిస్థితిని, ఈమె జీవితాన్నీ చక్కదిద్దాలి. 

          చేసిన పని : ఆల్రెడీ వదిన వున్న కూపంలోకి ఇంకో మధ్యతరగతి అమ్మాయిని తన భార్యగా తీసుకురావాలనుకోవడం.

          మనకి కథాప్రారంభంలోనే బాగా ధనవంతుడైన ప్రకాష్ రాజ్ ఇంట్లోకి పెద్ద కొడుకు మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే మధ్యతగతి పట్ల ఏహ్య భావమున్న ప్రకాష్ రాజ్  ఆమెని హీనంగా చూడ్డం  మొదలెడతాడు. ఇది అయిదేళ్ళూ కొనసాగాక, ఇప్పుడు చిన్న కొడుకు అల్లు శిరీష్ ఇంకో మధ్య తరగతి అమ్మాయిని ప్రేమించానంటాడు. ప్రకాష్  రాజ్ వ్యతిరేకిస్తాడు. మధ్యతరగతి వాళ్ళు గొప్పింటి సంబంధం  చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని చూస్తారనీ, వాళ్ళు మనల్ని చూసి గాక, మన డబ్బు ని చూసి వస్తారనీ పాత పాటే పాడతాడు. దమ్ముంటే నువ్వు గొప్పింటి కొడుకువని ఆ అమ్మాయికి చెప్పుకోకుండా, పెళ్ళికి ఒప్పించుకోడానికి ట్రై చెయ్ నీకే తెలుస్తుంది-  అంటాడు ప్రకాష్ రాజ్. అల్లు శిరీష్ ఈ ఛాలెంజిని స్వీకరించి, అలా ఒప్పించలేకపోతే  నువ్వు చూసిన గొప్పింటి సంబంధమే చేసుకుంటా నంటాడు...

          ఇదీ  ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం . అంటే హీరో కి ఒక గోల్ ని ఏర్పాటు చేసే మలుపు. ఈ గోల్ లో వున్న బలమెంత? ఎందుకంటే,  ఐదేళ్లుగా ఇంట్లో వదినతో పరిస్థితి చూస్తూ ఇంకో మధ్య తరగతి అమ్మాయిని తెస్తానంటున్నాడు అల్లు శిరీష్. అంటే ఆ అమ్మాయిని కూడా తండ్రి రాచి రంపాన పెట్టడానికా? ఒక హీరో పాత్ర తన ప్రేమ తప్ప ఇంకేదీ ముఖ్యం కానట్టు స్వార్ధంతో ఉంటుందా ? 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రకరకాల కథల్లో రకరకాల సమస్యలు పుడతాయి. ఎన్ని రకాల కధలున్నా ఆ సమస్యలు ఉండేవి ఏడు రకాలే. వీటిలో  సమస్య మిస్టరీగా వుంటే ఆ రహస్యాన్ని ఛేదించడం  గోల్ గా వుంటుంది. ఏదైనా ప్రమాదం సమస్యగా వుంటే రక్షణ కోసం ప్రయత్నించడం గోల్ గావుంటుంది, కన్ఫ్యూజన్ సమస్యగా వుంటే స్పష్టత కోసం ప్రయత్నించడం గోల్ అవుతుంది. అలాగే డోలాయమాన స్థితి సమస్యైతే ఓ నిర్ణయం తీసుకోవడం గోల్ గా వుంటుంది, అజ్ఞానమే సమస్యయితే  జ్ఞానం గోల్ అవుతుంది, సమస్య ఓ ప్రశ్నని లేవనెత్తితే దానికి జవాబు గోల్ గానూ, ఇక ఆఖరిదైన సంక్షోభం తలెత్తితే శాంతిని నెలకొల్పడం గోల్ గానూ వుంటాయి.

          ఈ సినిమాలో కుటుంబంలో వున్న  సంక్షోభమే సమస్యగా వుంది. అంటే ఇక్కడ శాంతిని నెలకొల్పడం గోల్ గా వుండాలి. ఇక్కడ శాంతిని నెలకొల్పకుండా తనవరకూ తన ప్రేమని తెచ్చి స్థాపించుకోడం  సంక్షోభాన్ని రెట్టింపు చేయడమే. 

          అంటే ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుతూ మరో వైపు హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉండమని కాదు. తండ్రి అలా షరతు పెట్టినప్పుడు తను కూడా ఇలా అని వుండాలి : నువ్వన్నట్టే నేనా  ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే ఆ అమ్మాయితోబాటు వదినని కూడా నువ్వు బాగా చూసుకుంటావా- ఈ కౌంటర్ ఛాలెంజిని ఒప్పుకుంటావా?

          తండ్రి పెట్టిన షరతు తండ్రికే బూమరాంగై వదిన జీవితమూ తన ప్రేమా ఒడ్డున పడి  తద్వారా ఇంట్లో సుఖసంతోషాలు నెలకొనాలన్న ద్విముఖ వ్యూహంతో హీరో గోల్ ని సెట్ చేసుకుని వుంటే అప్పుడు తానొక హీరో అన్పించుకునే వాడు.

          ఇలా కాకుండా వదిన ఎలా ఏడిస్తే నాకెందుకు- తండ్రి మీద గెలిచి మధ్యతరగతి అమ్మాయినే తెచ్చుకుంటా అని బయల్దేరతాడు హీరో. తన మీద గెలిచాడన్న కసితో ఆ తండ్రి ఈ అమ్మాయిని కూడా వదిన పక్కన పడేసి ఇద్దర్నీ కలిపి నంజుకు తింటే? అప్పుడది సీక్వెల్ గా ఇంకో సినిమా తీయవచ్చనా?

          కానీ మధ్యతరగతి అమ్మాయిని పరీక్షిస్తూ మధ్యతరగతి వాడిలా నటించే ఈ పాయింటు కూడా వెంటనే చీలిపోయింది. ఎందుకంటే అసలు ఏ తరగతి వాణ్ణీ ప్రేమించే మూడ్ లో హీరోయిన్ లేదు. చదువు తప్ప ఆమె కింకో ఆలోచనే లేదు. అతడి మీద విరుచుకు పడుతూ, తిడుతూ, వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తూ, జాడించి తంతూ వుంటుంది కథ ముగిసే వరకూ. కాబట్టి ఇక్కడ ప్రేమే లేనప్పుడు అంతస్తుల అంతరాల ప్రశ్నెక్కడిది? అంతస్తుల అంతరాల ప్రశ్నే లేనప్పుడు మధ్య తరగతి వాడి వేషం హీరో కెందుకు? అసలు హీరోయిన్ ప్రేమిస్తోందో లేదో, ప్రేమించకపోతే ప్రేమించేలా చేసుకుని, అప్పుడు తండ్రికి చెప్పి వుంటే-  అప్పుడేర్పడాలి  నిజానికి పైన చెప్పుకున్న ప్లాట్ పాయింట్ వన్.

          అసలు హీరోయిన్ తనని ప్రేమిస్తోందా, తన డబ్బుని ప్రేమిస్తోందా అని మధ్యతరగతి వాడిలా నటిస్తూ గూఢచర్యం నెరపడమే ఆమెపట్ల అపచారం. ఇలాటి వాడు రేపు ఆమె శీలాన్ని కూడా శంకించి ఇంకెలాటి మారువేషాలేస్తాడో. 

          హీరో హీరోయే అయితే,  ఉన్నదున్నట్టు తన అంతస్తు తెలిసిపోయేలా ప్రేమిస్తూ,  ఆమె తన అంతస్తుని ప్రేమిస్తోందా- లేక మనసుని ప్రేమిస్తోందా పారదర్శక ప్రవర్తవతో తెలుసుకుంటే ఎవరికీ నష్టం లేదు. 


           చివరికి హీరోయిన్ పెళ్లింట్లో తన గుట్టురట్టయి, అల్లరై ఇంటికి తిరిగి వచ్చేస్తాడు హీరో- వచ్చేసి తండ్రితో సుదీర్ఘ మోనోలాగ్ తో నోర్మూయించేస్తాడు- నేను ఓడిపోయి రాలేదు, ఈ ఇంట్లో వదిన పరిస్థితే నేను ప్రేమించినమ్మాయి పరిస్థితి కాకూడదని వదిలేసి వచ్చానంటాడు!!!

          ఇది పెద్ద జోకులా వుంది. అవతల తనకి శృంగభంగమైతే తప్ప  ఇవతల వదిన పరిస్థితి గుర్తుకు రానట్టుంది. హీరోయిన్ ని ప్రేమించాలని శ్రీకారం చుడుతున్నప్పుడు హీనమైన వదిన బతుకు కళ్ళముందు మెదల్లేదేమో. ఒక హీరో అనే వాడు ఇంట్లో ఒక అన్యాయాన్ని సహిస్తూ- ఏళ్ల పాటూ ఎలావుండగల్గుతాడు? 

          ఈ మొత్తం అసహజత్వానికి ఒక్కటే కారణం : కథా ప్రారంభం. ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు సామాన్యమైన కోడల్ని ఇంటికి తీసుకురావడం, దాని మీద ప్రకాష్ రాజ్ తిరగబడి అలాటి వాళ్ళమీద తన నీచమైన అభిప్రాయం చెప్పి- ఆ కోడల్ని పనిమనిషి కంటే హీనంగా చూడ్డమనే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ సీన్లే – ఆ తర్వాత అల్లు శిరీష్ క్యారక్టర్ ని కలగాపులగం చేసేశాయి. ఈ పెద్ద కొడుకు -కోడలు అనే ఎపిసోడ్ లేకపోతే, కథలో ఈ పాత్రలే లేకపోతే అల్లుశిరీష్ పాత్రకి తోకలా వదిన వుండేది కాదు. అల్లు శిరీష్ ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ఏంటో బయటపెడితే  సరిపోయేది. ఒక పాత్ర ఫలానా ఇలాంటిది అని చెప్పడానికి రెండేసి మూడేసి  ఉదాహరణలతో పునరుక్తిగా, ప్రేక్షకులకి స్పూన్ ఫీడింగ్ చేస్తూ చెప్తూ పోతే- ఇదిగో  ఇలాగే అర్ధం లేకుండా తయారవుతాయి  పాత్రలూ- కథా.

          హీరో యాక్టివ్వే, కాకపోతే అతడి ఇంటి పరిస్థితుల సమాచారాన్ని బ్లాకవుట్ చేశాడు దర్శకుడు- దాన్ని చివర్లో చెప్పించి బ్యాంగ్ ఇద్దామనుకున్నాడు. అది బూమరాంగైంది. ఒక్క సారిగా పాత్ర పడిపోయింది. పాత్ర పెరిగిపోయిందని చాలా మంది ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు... మంచిదే,  లాజిక్ అలోచించడం కంటే  ఎమోషన్ లో కొట్టుకుపోయి సముద్రంలో కలవడంలోనే అదో సుఖం!

-సికిందర్
http://www.cinemabazaar.in
       

       
       
       
       
       

6, ఆగస్టు 2016, శనివారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : ఏలేటి చంద్రశేఖర్

తారాగణం : మోహన్ లాల్, గౌతమి, ఊర్వశి, విశ్వంత్, అనూషా అంబ్రోస్, 

రైనా రావు, నాజర్, పరుచూరి వెంకటేశ్వర రావు, గొల్లపూడి మారుతీ రావు, హర్షవర్ధన్, ఎల్బీ శ్రీరామ్, వెన్నెల కిషోర్, చంద్ర మోహన్, అయ్యప్ప శర్మ తదితరులు 

మాటలు : రవిచంద్ర తేజ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, వశిష్టా శర్మ

సంగీతం : మహేష్ శంకర్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాస్తవ్ 
బ్యానర్ : వారాహి చలన చిత్ర 
నిర్మాతలు : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి 
విడుదల : 5 ఆగస్టు, 2016
***

       గతవారం ‘పెళ్లిచూపులు’ తర్వాత ఈవారం  ‘మనమంతా’ మళ్ళీ తెలుగులో క్వాలిటీ సినిమాల రాకని రుతుపవనాలంత ఆహ్లాదకరంగా రికార్డు చేస్తున్నాయి. అభిరుచిగల తెలుగు ప్రేక్షకులు ఏ హిందీ లోనో ఇంకెక్కడో ఇలాటి సినిమాల్ని చూసే అగత్యాన్ని ఇవి తప్పిస్తున్నాయి. ‘పెళ్లి చూపులు’ ప్రేమకథకి రియలిస్టిక్ టచ్ ఇచ్చి  ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశాక,  కుటుంబ కథకి కూడా రియలిస్టిక్ అప్రోచ్ సాధ్యమేనంటూ  ‘మనమంతా’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమర్షియల్ ఫార్ములాలకి  ప్రత్యాన్మాయంగా అవే జానర్స్ ని ఇంకో కోణంలో తీసి మొనాటనీతో విసిగిన ప్రేక్షకులకి వెరైటీని అందించవచ్చని ఇవి చెబుతున్నాయి. పైగా సినిమా కళకి అంటరాని పదార్ధమై పోయిన క్రియేటివిటీని కూడా ఇవి హృద్యంగా ప్రదర్శిస్తున్నాయి. 

       
ర్శకుడు ఏలేటి చంద్ర శేఖర్, నిర్మాత సాయి కొర్రపాటి చాలా సాహసించి తెలుగు సినిమాకి చాలా మేలు చేశారు. కమర్షియల్ ఆకర్షణలు వుండని వాస్తవిక సినిమా ఆకర్షణంతా దాని మాస్టర్ స్ట్రోక్ లోనే వుంటుందని, ఈ మాస్టర్ స్ట్రోకే  కమర్షియాలిటీని ఇస్తుందనీ   చాటుతూ - డ్రైగా వుండే వాస్తవిక సినిమాలు తీసే వాళ్ళని పునరాలోచనలో పడేశారు. శుష్కంగా వుండే వాస్తవిక సినిమాలకి హై ఎండ్ క్రియేటివ్ మైండ్ తో వాటిదైన మాస్టర్ స్ట్రోక్ ఇస్తే తప్పకుండా సామాన్య ప్రేక్షకులూ  వాటికి  ఆకర్షితులవుతారు. 

        గతంలో అనేక భాషల్లో అనేక ‘నాల్గైదు కథల’ సినిమాలొచ్చాయి. వాటిలో తెలుగులో వచ్చినవైతే మాస్టర్ స్ట్రోక్ లేక చతికిల బడిపోయాయి. వివిధ పాయలుగా సాగే కథలు ఒక చోట సంగమించే దగ్గర చమత్కృతి చేయలేక చప్పగా ముగిసిపోయే వైఖరినే ప్రదర్శిస్తూ వున్నాక, ‘మనమంతా’ దీన్ని చక్కదిద్దే స్టడీ మెటీరియల్ గా వచ్చి నిలబడుతోంది.
        నాల్గు కథల ‘మనమంతా’ లో అందరూ కమర్షియల్ నటీనటులే వున్నారు...


కథలు
     సాయిరాం (మోహన్ లాల్) సూపర్ మార్కెట్ లో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్. ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందుల్లో వుండి వర్కర్( ధన్ రాజ్)  దగ్గర చేబదుళ్లు తీసుకుంటూ వుంటాడు. ఇంకో అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ (హర్షవర్ధన్) కీ ఇతడికీ పరస్పరం పడదు. స్టోర్ మేనేజర్ (పరుచూరి వెంకటేశ్వర రావు) త్వరలో రిటైర్ కాబోతున్నాడు. ఆ పోస్టు తనకంటే ఎక్కువ చదువుకున్న  విశ్వనాథ్ కే వచ్చే  అవకాశాలు  వుండడంతో సాయిరాం తీవ్రాలోచనలో పడతాడు. తనకి ఈ  మేనేజర్ పోస్టు దక్కితే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయన్న నమ్మకం అతడిది.

        ఇంకోవైపు గాయత్రి (గౌతమి) అనే మధ్యతరగతి గృహిణి వుంటుంది. పొదుపుగా ఎలా కుటుంబాన్ని నిర్వహించాలి, ఎలా ఆదా చేయాలీ అని నిత్యం ఆరాటపడుతూ, పొరుగింటి వదినగారు (ఊర్వశి) తో పథకాలేస్తూ వుంటుంది. ఆ మేరకు ఏవి కొనాలని ఏ బజారు కెళ్ళినా ఆ పొదుపు కాస్తా దుబారా అయిపోయి బెంబేలెత్తి పోతూంటుంది. 

        మరో వైపు అభి (విశ్వంత్) అనే చదువే లోకంగా జీవించే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐరా(అనూశా అంబ్రోస్)  అనే అమ్మాయితో ప్రేమలో పడి ప్రేమే జీవితంగా గడుపుతూంటాడు.

        మరింకో వైపు మహతి (రైనారావ్) అనే స్కూలు బాలిక నాల్గేళ్ళ స్లమ్ కుర్రాణ్ణి చూసి వాణ్ణి చదివించాలని ప్రయత్నిస్తూంటుంది...

        ఇలా ఈ నల్గురి ప్రయత్నాలూ మలుపు తీసుకుంటాయి : మేనేజర్ గా ప్రమోటవడానికి ఇంటర్వ్యూ రోజున విశ్వనాథ్ తనకి  అడ్డురాకుండా ఒకరౌడీతో క్రిమినల్ పథకమేస్తాడు సాయిరాం. దీంతో విశ్వనాథ్ అదృశ్యమై పోతాడు. ఫలితంగా సాయిరాం పెద్ద చిక్కుల్లో పడిపోతాడు. 

        గాయత్రికి తన పాత ప్రొఫెసర్ (గొల్లపూడి మారుతీ రావు) ఎదురై ఒకప్పుడు ఆమె చేసిన ఆర్ధిక సాయానికి బదులు తీర్చుకుంటూ ఆమెకి సింగపూర్ లో జాబ్ ఆఫరిస్తాడు. దీంతో ఈ వయసులో ఆమె అందర్నీ వదిలేసి ఎలా వెళ్ళగలనని అయోమయంలో పడిపోతుంది. 

        ఐరాని ప్రేమిస్తున్న అభికి ఆ ప్రేమ వికటించి, ప్రేమాలేదు దోమా లేదని ఆమె లాగి కొట్టడంతో చావడానికి సిద్ధమైపోతాడు.  

        చదివించడానికి స్కూల్లో వేసిన స్లమ్ కుర్రాడు అదృశ్యమై పోవడంతో ఆందోళనగా వాణ్ణి వెతుక్కుంటూ తిరుగుతూంటుంది ఇంకోవైపు మహతి...

        ఇలా సమస్యల్లో పడ్డ  ఈ నల్గురికీ ఈ నల్గురితోనే యాదృచ్ఛికంగా ఎలా పరిష్కరాలు లభించాయన్నది మిగిలిన ‘నదుల అనుసంధానపు’ కథ. 


ఎలావుంది కథ 

    ప్రయోగాత్మకమైనది. కమర్షియల్ విలువల కోసం సంయమనం కోల్పోనిది. పాటలు కూడా లేనిది. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో వచ్చే కమర్షియల్ సినిమాల్ని ఆదరిస్తున్నట్టుగా, మల్టిపుల్ కథలతో సమాంతరంగా సాగే  నాల్గైదు కథనాలతో సినిమాలు  వస్తే దూరంగా వుంటున్నారు ప్రేక్షకులు. వాళ్లకి కావలసింది చిన్న చిన్న కథలు కాదు, ఒకే పెద్ద కథ. ప్రచురణ రంగంలో కూడా నవలలు రాజ్యమేలినప్పుడు కథల సంకలనాల్ని ఎవరూ కొనేవాళ్ళు కాదు- పెద్దపెద్ద నవలలే కొనుక్కుని చదివేవాళ్ళు. తెలుగు వాళ్ళ టేస్టే అలాటిది. ఏదైనా తాటి కాయంత వుండాలి. అయితే ‘మనమంతా’ కూడా ఒకే పెద్ద కథే. ఇది చివరికి తెలుస్తుంది. దీ న్ని నాల్గు కథల సమాహారమని ఆంథాలజీగా పబ్లిసిటీ చేయడం ప్రేక్షకుల్ని దూరం చేసుకోవడమే. ఈ కథంతా అతి పెద్ద సస్పెన్సు. కుటుంబ కథల్లో సస్పెన్సు ఉన్నవి రావడం లేదనీ, సస్పెన్సు తో వుంటే (సస్పెన్స్ అంటే ఇక్కడ నేరాలో ఘోరాలో వుండాలని కాదు) కుటుంబ కథలు రొటీన్ మూసలోంచి బయట పడతాయనీ గతంలో చెప్పుకున్నాం. దీనికిప్పుడు  ‘మనమంతా’ తార్కాణంగా నిలుస్తోంది.

        ఇందులో ఉన్నవి నిత్యజీవితంలో కలిగే చిన్న చిన్న కోరికలే. ఇవి తీర్చుకోవడానికి పడే పాట్లే. పెద్ద లక్ష్యాలు, పెద్ద సంఘర్షణలు కమర్షియల్ సినిమాలకి వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కొందరు దర్శకులు ఎలా చేస్తున్నారంటే-  ఈ చిన్న చిన్న కోర్కెలు, అవి తీర్చుకునే పాట్లతో  కమర్షియల్  సినిమాలు ఆలోచిస్తున్నారు. రియలిస్టిక్ సినిమాల పనిముట్లని కమర్షియల్ సినిమాలకి వాడి నడిపించాలనుకుంటున్నారు- అలా చేస్తే అవి రెంటికి చెడ్డ రేవడి అవుతాయని తెలుసుకోవడానికి ‘మనమంతా’ చూస్తే  సరిపోతుంది. సాయిరాం పాత్రతో నైతిక పతనం, గాయత్రి  పాత్రతో మధ్యతరగతి మందహాసం, అభి పాత్రతో  బబుల్ గమ్  ప్రేమలు, మహతి పాత్రతో సామాజిక స్పృహా ఇందులో వున్నాయి. రౌడీని నమ్మితే పాముని నమ్మినట్టే నని అయ్యప్ప శర్మ పోషించిన రౌడీ పాత్రతో నీతి కూడా వుంది. హైపర్ లింక్ జానర్ కింది కొచ్చే ఈ కథ ముగింపు మాత్రం 2005 లో విడుదలైన మనీషా  కోయిరాలా నటించిన ‘అంజానే’ ( అనుకోకుండా) ముగింపుని గుర్తుకు తెస్తుంది- కాకపోతే ‘అంజానే హార్రర్ కథ.


ఎవరెలా చేశారు
      మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  సగటు ఉద్యోగి పాత్రలో సినిమాకొక జీ వితాన్ని దానం చేశారు. ఆర్ధిక ఇబ్బందులతో అప్పులు చేసే సగటు జీవిగా ప్రారంభమై, ఉద్యోగంలో ఒక్క మెట్టు పైకి ఎక్కాలన్న ఆలోచన దురాలోచనకి దారి తీసి- మనసులోని చీకటి కోణాన్ని బయటపెట్టుకుని- ఆతర్వాత తను పన్నిన ఉచ్చులోంచి తను బయటపడేందుకు పడే కష్టాలతో పాత్రలో ఒదిగిన తీరు చెప్పుకోదగ్గది. ఎక్కడా సూపర్ స్టార్ హవా కన్పించకుండా, నేనూ మీలాంటోణ్ణే అన్నట్టు ఆమ్ ఆద్మీకి వెండితెర మీద పట్టం గట్టారు. కమర్షియల్ కీకారణ్యంలో సామన్యులు తమని తాము వెండి తెర మీద చూసుకోగల అదృష్టానికి ఎప్పుడు నోచుకున్నారు గనుక!

        గౌతమి ఈ సినిమాలో చాలా గ్రేస్ ఫుల్ గా కన్పిస్తారు. బాధ, కాస్తంత ఆనందం, మళ్ళీ బాధ, అయోమయం, ఏం చెయ్యాలో పాలుపోని తనం- ఇవన్నీ మెలో డ్రామాకి  దూరంగా అతి సరళంగా నిర్వహించుకురావడం చాలా సహజంగా జరిగిపోయింది. ఈమె పక్కవాద్యం  ఊర్వశి అలవాటు చొప్పున కామిక్ రిలీఫ్ కి బాగా తోడ్పడ్డారు. వీళ్ళిద్దరూ కలిసివుంటే  ఏదోవొక గమ్మత్తు జరుగుతుంది. రోమాంటిక్ సైడ్ విశ్వంత్, అనూషా అంబ్రోస్ లు తమ  మోడరన్ పాత్రలతో  రోమాన్స్ కొరతని తీరుస్తారు. ఇక చైల్డ్ ఆర్టిస్టు రైనారావ్ దగ్గర్నుంచీ ప్రతివొక్కరూ పాత్రలు చిన్నవైనా రియలిస్టిక్ లుక్ తో రక్తి కట్టిస్తారు. జుట్టూ గడ్డం పెరిగిపోయి, కంపుకొట్టే శరీరంతో రౌడీ పాత్రలో అయ్యప్ప శర్మ వర్మ సినిమాల్లో క్యారక్టర్లని గుర్తుకు తెస్తారు. 


        టెక్నికల్ గా కెమెరా వర్క్, సంగీతం, ఎడిటింగ్ వగైరా ఉన్నత విలువలతో వున్నాయి. మాటల  రచయిత రవిచంద్ర తేజ సినిమా డైలాగులు రాయకుండా బతికించారు. సెంట్రల్ హైదరాబాద్ లో మధ్యతరగతి నివాస ప్రాంతాల్ని వాటి నేటివిటీతో చూపించడం ఈ వాస్తవిక సినిమాకి సహజత్వాన్నిచ్చేలా వుంది. 


చివరి కేమిటి 

    కథా నిర్మాణ పరంగా ముగింపు ఎపిసోడ్ దర్శకుడు  ఏలేటి ఇచ్చిన బంపర్ మాస్టర్ స్ట్రోకే సందేహం లేదు- హిందీ ‘అంజానే’ ని గుర్తుకు తెచ్చినప్పటికీ. హిందీ ‘అంజానే’ కూడా ‘ది అదర్స్’ అనే హాలీవుడ్ కి కాపీ అనేది వేరే విషయం. ఫీల్ గుడ్ మూవీ అంటే ఇలా వుం టుందనేలా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి నిరూపించారు ఏలేటి. ఐతే కథనానికే  ఈ మాస్టర్ స్ట్రోక్ పరిమితమై పోయింది తప్ప కథా ప్రయోజనానికి కాదు. చివరికి ఈ కథకి మూల స్థంభంలా తేలిన గాయత్రి పాత్రకి సమగ్ర ముగింపు పలికారా అంటే లేదనే జవాబు వస్తుంది. ఈ పాత్ర ముగింపు అభ్యుదయమా, పురాణాల వడపోతా? గాయత్రి అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా అవ్వాలా, లేక సతీ అనసూయగా వుండి పోవాలా? ఇంకో రెండడుగుల్లో కొత్త భవిష్యత్తు ని వెతుక్కుంటూ సింగపూర్ విమాన మెక్కుతోంటే  తిరోగమింప జేసి- నీ స్థానం ఇక్కడి ఇల్లే తల్లీ, ఈ కష్టాలే పడు!- అన్నట్టు జండర్  స్టీరియో టైపింగ్ చేయడమే కథా ప్రయోజనాన్ని దెబ్బ తీసింది.

        సుమారు ఇలాటిదే అయిన సగటు గృహిణి పాత్రలో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ (2012) అనే హిందీ, సనాతన ధర్మాన్ని త్రోసిరాజని అభ్యుదయాన్నే చాటింది. దర్శకుడు ఏలేటి నాల్గు కథనాల సంగమంలో చేసిన చమత్కృతి ప్రేక్షకుల టెన్షన్ ని మాత్రమే సడలించ డానికి  పనికొస్తుంది. అది  ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తుంది.  గాయత్రిని అలా తిరిగి  బందీగా రొటీన్ జీవితంలో పడెయ్యడంతో మెటీరియల్ స్థాయిలోనే ఈ ఉపశమనం మిగిలిపోయింది. ఇలా కాకుండా కల్పనా చావ్లా అంతరిక్షాని కేగినట్టు, విమానమెక్కి రివ్వున గాయత్రి మేడమ్ సింగపూర్ కెగిరిపోతే, అదింకా అత్యున్నత  స్పిరిచ్యువల్ అనుభవంగా చిరకాలం మిగిలేది ప్రేక్షకుల దోసిట్లో.


        ‘గ్లాడియేటర్’ లాంటి మెగా మూవీస్ తీసిన దర్శకుడు రిడ్లీ స్కాట్,  1991 లో ‘థెల్మా అండ్ లూయిస్’ అనే థ్రిల్లర్ తీశాడు. ఇందులో ముగింపులో వెంటాడుతున్న పోలీసులు పట్టుకుంటే మనం వెనక్కెళ్ళి జైల్లో బందీ అయిపోతామని, మనం ముందుకే వెళ్ళాలని (
"keep going")  హీరోయిన్లిద్దరూ నిర్ణయం తీసుకుని- కొండ చరియ పైనుంచి కారుని డ్రైవ్ చేసి స్పీడుగా అనంత లోకాలకి దూసుకెళ్ళి పోతారు. ఇదొక స్పిరిచ్యువల్ అనుభవం. దీనికి ఆస్కార్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది ఆ సంవత్సరం. మన కమర్షియల్ సినిమాల్లో ఇలాటి స్పిరిచ్యువల్ అనుభవాల ముగింపులు సాధ్యం కాక పోవచ్చు, రియలిస్టిక్ సినిమాల్లో  ప్రయత్నిస్తే పోయేదేం లేదు.


-సికిందర్
(దీనికి స్క్రీన్ ప్లే సంగతులు ఇవ్వడం లేదు.
ఇస్తే ముగింపు  ఎపిసోడ్ వెల్లడించాల్సి వస్తుంది)
http://www.cinemabazaar.in





రివ్యూ!

రచన- దర్శకత్వం : పరశురామ్


తారాగణం : అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావురమేష్, తనికెళ్ళ భరణి, అలీ, ప్రగతి, సుమలత, హంసా నందిని, రవిప్రకాష్, రణధీర్ తదితరులు 

సంగీతం : ఎస్ ఎస్ తమన్, కెమరా : మణికంద 
బ్యానర్ : గీతా ఆర్ట్స్ , నిర్మాత : అల్లు అరవింద్ 
విడుదల : 5  ఆగస్టు, 2016
***
రెండేళ్ళ తర్వాత  తిరిగి అల్లు  శిరీష్  అదృష్టాన్ని పరీక్షించుకుంటూ యాక్షన్ సినిమాల ఫార్ములా దర్శకుడు పరశురాంతో పాత స్టయిల్ రొటీన్ ప్రేమ కథే  ప్రయత్నించి సేఫ్ అవుదామనుకున్నట్టుంది. సేఫ్ ప్రయత్నమనగానే ఇంకా పాత మూస ఫార్ములాలే ప్రయత్నించాలా అనేది  సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ఇష్టానికి వదిలేద్దాం. ఆయన అనుభవజ్ఞుడు. ఈ లెక్కన కాలంతో పాటు ముందు కెళ్ళని, ఇంకా  2000 నాటి తరహా సినిమాలే చూసే అభిరుచిగల ప్రేక్షకులకి ఇది కచ్చితంగా నచ్చి తీరాలి. అలాటి ప్రేక్షకులకోసమైనా తీసిన-
 ‘శ్రీరస్తు శుభమస్తు’ లో అసలేముందో చూద్దాం...


కథ 

      బాగా డబ్బున్న కృష్ణ మోహన్ ( ప్రకాష్ రాజ్) కొడుకు శిరీష్ ( అల్లు శిరీష్) కాశ్మీర్ టూర్ వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ లో గాయపడ్డ అనన్య (లావణ్యా త్రిపాఠీ) ని చూడగానే ప్రేమిస్తాడు. ఆమె వైజాగ్ లో ఇంజనీరింగ్ చేస్తోందని తెలిసి వైజాగ్ వచ్చి ప్రేమ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.  తండ్రి కృష్ణ మోహన్ కి ఈ మధ్య తరగతి కుటుంబాలంటే పడదు. వాళ్ళు ఉన్నత కుటుంబాల్లో పెళ్లి సంబంధాలు చేసుకుని జీవితాలకి భద్రత చూసుకునే రకాలని మండిపాటు. ఈ అభిప్రాయంతోనే పెద్ద కొడుకు (రవిప్రకాష్) ప్రేమించి చేసుకున్న మధ్యతరగతి కోడలిని హీనంగా చూస్తాడు. ఈ నేపధ్యంలో శిరీష్ కూడా వచ్చేసి ఇలాటిదే అయిన తన ‘మధ్యతరగతి ప్రేమ’ గురించి చెప్పేసరికి ఇంకోసారి   కృష్ణ మోహన్ బుర్ర తిరిగిపోతుంది. ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి నిన్ను ప్రేమించదు, నీ డబ్బు చూసి ప్రేమిస్తోందని అనేసరికి- అయితే నేను మిడిల్ క్లాస్ వాడిలానే ఆమెకి కన్పించి  ప్రేమిస్తుందో లేదో చూస్తా, ప్రేమించకపోతే నువ్వు చూసిన గొప్ప సంబంధమే చేసుకుంటా- అని ఛాలెంజి చేసి వెళ్ళిపోతాడు శిరీష్.


        కానీ అనన్య అసలు ఈ ప్రేమలంటే ఇష్టం లేనట్టే వుంటుంది. శిరీష్ ఉనికినే సహించదు. అతడి చేష్టలకి ఎంతసేపూ వెళ్ళగొట్టాలనే చూస్తూంటుంది. అంతగా డబ్బు లేని ఆమె తండ్రి జగన్నాథం (రావురమేష్), స్నేహితుడు రామనాథం (తనికెళ్ళ భరణి) చేస్తున్నఆర్ధిక సహాయంతో తను ఇంజనీరింగ్ చదువుకుని పైకి రావాలని కృషి చేస్తోంది. తనకి ఇంకో ఆసక్తి లేదు. అలాటి ఈమెనే కోడలిని చేసుకుంటానని సాక్షాత్తూ రామనాథమే  రావడంతో, ఏమీ అనలేని  నిస్సహాయ స్థితిలో పడుతుంది. శిరీష్ ని వదిలించుకుంటుంది.

        ఇలా దెబ్బ తిన్న శిరీష్ ఆమె ఇంట్లో చేరి ఆమె పెళ్లి కార్యక్రమాల్లో ఆమె మనసు మార్చే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ ప్రయత్నాల్లో ఎలా సఫలమయ్యా డనేది మిగతా కథ. 

ఎలా వుంది కథ 
     ముందు చెప్పుకున్నట్టు దశాబ్దంన్నర క్రితం, ఇంకా అంతకి ముందు కూడా వచ్చిన ఎన్నో -‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’  టైపు రొటీన్ ఫార్ములా ప్రేమ సినిమాల్లాగే వుంది . పెళ్లవుతున్న హీరోయిన్ ఇంటికి హీరో వెళ్ళి తనవైపు ఆమెని తిప్పుకునే బాపతు సినిమాల కోవలోనే వుంది ఈ  కథ. ఈ కథలో  ట్రెండ్  దృష్టిలో పెట్టుకుని కొత్తదనం వైపు మళ్ళించేందుకు తగ్గ ఘట్టం ఒకటి అసంకల్పితంగా జొరబడ్డా, అది దృష్టికి రాలేదో, లేక అనుకున్న పాత మూసకే  కట్టుబడాలని  ఉద్దేశపూర్వకంగా  ఉపేక్షించారో తెలీదు (ఈ ఘట్టం గురించి తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుందాం) కానీ మొత్తంగా  చూస్తే, వాళ్ళ పాట్లేవో వాళ్ళు పడుతున్న నేటి కాలపు యువజంట ప్రేమ కథలో  మోరల్ పోలీసులుగా పెద్దలు  జోక్యం చేసుకుని-ప్రేమలూ పెళ్ళిళ్ళూ ఎప్పుడూ తమ ఆదుపులోనే వుండేట్టుగా  సంకెళ్ళు వేసే (సినిమా) పాలసీకి సమర్ధింపుగా, ఈ దర్శకుడు కూడా అందించిన మరో నీతి కథే తప్ప – యువతకి స్వేచ్ఛ గానీ, యూత్ అప్పీల్ గానీ ఇందులో కన్పించవు.

         ‘అహ నా పెళ్ళంటా’ లోనూ రాజేంద్రప్రసాద్ కి ఇలాగే తండ్రితో గొప్పా పేదా తేడాలతో సమస్య వచ్చి, పిసినారి కూతుర్ని పిసినారిగానే ప్రేమించి సొంతం  చేసుకుంటానని  బయల్దేరతాడు. ఈ వినోదభరిత కథలో పెద్దల జోక్యం గానీ, యువతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పీకే క్లాసులుగానీ వుండవు- ఎందుకంటే ఇది కామెడీ కథ. కామెడీ జానర్లో అలాటి వాసనలు కుదరవు. మరి యూత్ లవ్ స్టోరీస్ లో జానర్ మర్యాదని భంగపర్చే  పెద్దల సిద్ధాంతాలు ఎలా పొసగుతాయి? ఈ మధ్యే ‘కళ్యాణ వైభోగమే’ లోనూ ఇదే పరిస్థితి. పోనీ ఫ్యామిలీ సినిమా అనుకున్నా పాత్రచిత్రణలు, వాటి మనస్తత్వాలు ఇంత అసహజంగా ఎందు కున్నాయి? ఏమైనా ఎలా వున్నా పాతదే చాలునని అల్లు అరవింద్ రాజీ పడ్డట్టుంది, తనకున్న  నెట్ వర్క్ తో  సినిమాని నిలబెట్టుకోవడం కష్టం కాదు కాబట్టి. 

ఎవరెలా చేశారు    సేమ్ టు సేమ్ అల్లు శిరీష్, మార్పేమీ లేదు. ఇంకా క్యారక్టర్  ప్రకారం గత ‘కొత్త జంట’ లో కొంత ట్రెండీ గానైనా  కన్పించాడు. ఇప్పుడు ఈ క్యారక్టర్ ప్రకారం, కథ ప్రకారమూ ట్రెండీ నెస్ కుదరక, పైగా గతంలో ఎందరో  హీరోలు ఇలాటి పాత్రలు నటించెయ్యడంతో పాత్రలో కూడా నవ్యత లేకుండా పోయింది. పాత్ర చిత్రణ సరిగ్గా లేకపోతే  నటన గురించి మాట్లాడుకోవడం కూడా  అప్రస్తుతమై పోతుంది. పాత్ర చిత్రణ సరీగ్గా ఉంటేనే ఎలా నటించాడని చెప్పుకునేందుకు విషయ ముంటుంది. 

        చిట్ట చివర్లో అల్లుశిరీష్ తండ్రి పాత్ర ప్రకాష్ రాజ్ తో అనే మాట- ఇంట్లో ఇంత కించ పడుతున్న వదినని చూస్తూ ఇంకో కోడలిని తీసుకు రాలేక వదిలేసి వచ్చానంటాడు. అంటే ఐదేళ్లుగా వదిన పరిస్థితి తన ఇంట్లో ఎలా వుందో ముందు తెలీదా? అసలు ఇలాటి తండ్రి వున్న ఇంట్లోకి ఇంకో మధ్య తరగతి అమ్మాయిని తీసుకువస్తానని ప్రపోజ్ చెయ్యడమే తప్పు. ఛాలెంజి చేసి ఆ ఆమ్మాయితోనే  వస్తానని చెప్పడం ఇంకా తప్పు. తను చెయ్యాల్సింది ముందు తండ్రి మనస్తత్వాన్ని మార్చడం, తద్వారా వదినకి గౌరవ ప్రదమైన స్థానాన్ని  కల్పించడం- ఆ తర్వాతే ప్రేమా గీమా!  

        పాత రోటీన్ కథలే అయినా, ఫ్యామిలీ కథంటూ ప్రచారం చేసినా- ఇలాటి లోటుపాట్లతో ఎలా చెలామణీ చేయగలరు. నిజ జీవితాల్లో తామెలా ఉంటారో, ఎలా వ్యవహరిస్తారో జనాలు ప్రతీ ఒక్కరికీ వాళ్ళ కుటుంబాల్లో అనుభవపూర్వకంగా తెలిసే వుంటుంది. వాళ్ళు పోల్చి చూసుకుంటే ఇలాటి కథలు- పాత్రలు  నిలబడతాయా?

        అల్లు శిరీష్ తన ఆకృతికి తగ్గట్టు నటించి మెప్పించాలంటే ఇలాటి మూస ఫార్ములా పాత్రలు తగవు. తన ఆకృతిని మరపించే యూత్ అప్పీల్ వున్న, స్పీడుతో  కూడుకున్న  ఇంకా క్రీజీ క్యారక్టర్స్  పోషించాల్సి వుంటుంది- తమిళంలో ధనుష్ లాగే. అంతే గానీ గ్లామర్ హీరోగానో, మాస్ హీరోగానో అయిపోదామంటే బాక్సాఫీసుతో అయ్యేపని కాదు.  

         ఇక లావణ్యా త్రిపాఠి పాపం సినిమా చిట్టచివరి వరకూ ఎక్కడా  యూత్ అప్పీల్  అనేదే లేకుండా, ప్రేమించనే ప్రేమించకుండా, ప్రేక్షకుల్ని అలరించే రోమాన్సే లేకుండా రుసరుసలాడే, చిటపటలాడే మొనాటనీతో విసిగించేస్తుంది  - అల్లు శిరీష్ పాత్ర పెట్టే  టార్చర్ పుణ్యాన! ఎంతసేపూ ఇద్దరి మధ్య కీచులాటల దృశ్యాలే. ఎందుకీ చదువుకునే ఓ మధ్యతరగతి అమ్మాయిని ఇంతగా వెంటపడి వేధిస్తున్నాడని మనకే చిరాకేస్తుంది. చూస్తే ఈ ట్రాక్ ‘యువత’ లోంచి దిగుమతయ్యిందని అర్ధమవుతుంది. పరశురాం మొదటి మూవీ ‘యువత’ లో ఇలాగే ఆవారా హీరో మెడిసిన్ చదివే హీరోయిన్ ని అమర్యాదగా సంబోధిస్తూ వెంటపడి వేధిస్తూంటాడు. ఈ వెంటపడ్డాలకీ, ప్రేమలో ఒప్పించుకోవడాలకీ చాలా తేడా వుంది. లైంగిక వేధింపుల్లా వుండే ఈ వెంటపడి వేధించడాలు ‘స్టాకింగ్’  నేరం కిందికొచ్చి ఏంచక్కా  నిర్భయ చట్టాన్ని మెడకి బిగిస్తాయి. కానీ మూస కథలకి, హీరోల పాత్రలకీ  బయటి ప్రపంచంతో సంబంధం వుండదు కదా? 

పబ్లిసిటీ కోసం తీసిన ఈ ఫోటో షూట్ రోమాంటిక్ దృశ్యాలేవీ సినిమాలో లేవు...
     తండ్రి డబ్బుని  ఎంజాయ్ చేసే, భవిష్యత్ గురించి ఏ బెంగాలేని  వాడు హీరో. చదువుతోనే భవిష్యత్తూ, అదీ ఇంకొకరి సాయం పొంది తండ్రి తెచ్చిస్తున్న డబ్బుతోనే  చదువుకుని పైకొచ్చే బాధ్యతా  వున్న హీరోయిన్. తనకీ ఈమెకీ ఇంత తేడా వుంటే  హీరోగారి ప్రేమ గోలేమిటి- తండ్రితో చేసిన హాస్యాస్పదమైన ఛాలెంజితో? 

        హీరోయిన్ గనుక ఈ హీరోగారి ఇంట్లో బండారం తెలుసుకుంటే- ‘ఏంట్రా నీ దబాయింపు- వెళ్లి ముందు మీ ఇంట్లో మీ వదినకి మంచి స్థానం కల్పించు  ఫో! నీ వదిన అలా బతుకుతున్న కొంపలోకి నేనూ రావాలట్రా?’ - అని తోసి పారేసేది!

        ఇది రోమాంటిక్ కామెడీగానూ ఎందుకు కాలేకపోయిందంటే, రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లే పరస్పరం ప్రత్యర్ధులుగా వుంటారు. మరొకరు వుండరు. అలాంటప్పుడు హీరో గారు పెట్టే  టార్చర్ కి హీరోయిన్ రియాక్ట్ అవుతూ పాసివ్ గా వుండదు. మాటకి మాట,  చేతకి చేత బదులిస్తూ యాక్టివ్ గా వుంటుంది.  

        ప్రకాష్ రాజ్, రావురమేష్, తనికెళ్ళ పాత్రలు పెద్దరికాలతో ప్రేమకథకి అడ్డుతగిలే పాత్రలే. సెకండాఫ్ లో వచ్చే అలీ- సుబ్బరాజుల కామెడీ కాస్త బెటర్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాకి. తమన్ సంగీతంలో క్యాచీ సాంగ్స్ మాత్రం లేవు. మణికంద కెమెరా వర్క్ ఫర్వాలేదు. పరశురాం రచనా, దర్శకత్వాలు సినిమా ప్రారంభమే భారంగా మందకొడిగా సాగుతాయి. చివర్లో ప్రకాష్ రాజ్ తో అల్లు శిరీష్ అనే మాటలు పైకి హైలైట్ గానే దృశ్యాన్ని రక్తికట్టిస్తాయి గానీ, తరచి చూస్తే పైన చెప్పుకున్న అల్లు శిరీష్ లోపభూయిష్ట పాత్ర చిత్రణ రీత్యా ప్రేక్షకుల్ని మభ్య పెట్టడంగానే తేలతాయి. 


చివరికేమిటి     
      జా
నర్ స్పష్టత లేని సినిమాలు ప్రేక్షకులు ఇప్పుడెక్కడ చూస్తున్నారు? గత సంవత్సరం హిట్టయిన చిన్నా పెద్దా సినిమాలన్నీ జానర్ మర్యాదని కాపాడుకున్నవే నని అర్ధంజే సుకుంటే, ‘శ్రీరస్తు శుభమస్తు’ కి ఏ జానరూ లేదు. పాసివ్ హీరోయిన్ తో రోమాంటిక్ కామెడీ అన్పించుకునేట్టు లేదు, పాత్ర చిత్రణ లోపాలతో ఫ్యామిలీ స్టోరీ అన్నట్టూ లేదు. మూసఫార్ములా అనడానికీ పాత్ర చిత్రణలే అడ్డొస్తున్నాయి. రోమాంటిక్ కామెడీ అనుకున్నప్పుడు  యువత జీవితాల్లో చేసుకునే ప్రయోగాలకి వాళ్ళే బాధ్యత వహించి వాళ్ళే పరిష్కరించుకునే, పెద్దల జోక్యం లేని స్వావలంబన దిశగా యువతని నడిపించేట్టూ  వుండాలి.  లేదూ, ఫ్యామిలీ కథకే కట్టుబడదామనుకుంటే ఆ కుటుంబ సంబంధాలో మానవ సంబంధాలో అవైనా  అర్ధవంతంగా చూపించాలి. కానీ యూత్ సమస్యా- కుటుంబ సంబంధాలూ రెండూ కలిపి కొడితే కాషాయం తయారవుతుందే  తప్ప కమర్షియల్ కి అవకాశముండదు. రెండోది, టార్గెట్ ఆడియెన్స్ ఎవరు? యువతా, లేక కుటుంబాలా? ముందు ఇది నిర్ణయించుకుంటే గానీ తీయాలనుకుంటున్న కథ తో స్పష్టత రాదు.



-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు సోమవారం)
http://www.cinemabazaar.in/