రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, మార్చి 2016, బుధవారం

స్క్రీన్ ప్లే సంగతులు!

సాధారణంగాబిగినింగ్ విభాగం చప్పున ( ఓ పది నిమిషాల్లో ) ముగిసిపోయి  ప్లాట్ పాయింట్ - 1 ఏర్పడే మన సినిమాలు చూడ్డానికి హాయిగా వుంటాయనుకుంటాం. ఎందుకంటే బిగినింగ్ విభాగం ఎంత చప్పున ముగిసిపోతే  అంత త్వరగా ఉపోద్ఘాతం  తప్పి కథ ప్రారంభమవుతుంది కాబట్టి. ఐతే ఇలాటి సినిమాలు ఎప్పుడో గానీ రావు. వచ్చాయంటే తిరుగులేకుండా ఫ్లాప్ అవడమే జరుగుతోంది. పది నిమిషాల్లో కథ ప్రారంభించేస్తే ఫ్లాపవడమేమిటని అన్పించవచ్చు. గత సంవత్సరం ఇలాటి సినిమాలు రెండు వచ్చాయి. సుమంత్ అశ్విన్- రెహానాలు నటించిన వేమారెడ్డి అనే కొత్తదర్శకుడి  ‘చక్కిలిగింత’ ఒకటైతే, మంచు లక్ష్మి- అడివి శేష్ లు నటించిన వంశీ కృష్ణ అనే మరో  కొత్త  దర్శకుడి  ‘దొంగాట’  అని రెండోది.  వీటిలో ‘దొంగాట’ ఆ కాస్తయినా ఆడిందంటే సెకండాఫ్ లో నేర్పు చూపెట్టడం వల్లే. మొదటిదైతే ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికే కథ అయిపోయింది! అంటే తెలుగు దర్శకుడు త్వరగా కథ ప్రారంభిస్తే త్వరగా సరుకు అయిపోతుందన్నమాట. ఇందుకని ప్లాపులు. 

       ఈ ఇద్దరు దర్శకులూ 2002  లో అడ్రేయిన్ లైన్ తీసిన అన్ ఫెయిత్ ఫుల్  స్ట్రక్చర్ ని పరిశీలించి ఆ ప్రకారం చేసుకుని  వుంటే చాలా బావుండేది.  ఈ ఇద్దరు దర్శకులూ చేసిన ఘోరమైన పొరపాట్లని ఎలా దిద్దుకుని ఉండొచ్చో  అన్ ఫెయిత్ ఫుల్ ని చూపెడుతూ, గతంలో వీళ్ళిద్దరి సినిమాల స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకున్న నేపధ్యంలో,  సరీగ్గా ఆలాటి  పొరపాట్లే మళ్ళీ చేయకుండా  రవికాంత్ అనే కొత్త దర్శకుడు ‘క్షణం’ తీసి సూపర్ సక్సెస్ అయ్యాడు. 

        ‘క్షణం’ లో ఈ పొరపాట్ల సవరణతో బాటు, ఇలాటి కథ– అంటే పది  నిమిషాల్లో సెటప్ చేసేసే కథని - అక్కడ్నించీ ఆ  ఒకే పాయింటు ఆధారంగా చివరంటా రెండు గంటలపాటు సాగదీయాల్సి వస్తున్నప్పుడు, మధ్యలో అది చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా  ‘క్షణం’  హింట్ ఇస్తోంది. 

        ఉదాహరణకి హైదరాబాద్ నుంచి బయల్దేరి వైజాగ్ వెళ్ళే బస్సుకి మధ్యలో డ్రైవర్ మారతాడు. మారకపోతే  ఆ 700 కిలోమీటర్ల సుదీర్ఘ  డ్రైవింగ్ ఒకే  డ్రైవర్ వల్ల కాదు. యాక్సిడెంట్ జరగవచ్చు. ఆ డ్రైవర్ రెస్టు తీసుకుని, రెస్టు లో వున్న ఇంకో డ్రైవర్ స్టీరింగ్ తీసుకుంటే క్షేమంగా బస్సు గమ్యం చేరుతుంది. 

        అలాగే సినిమా ప్రారంభమే ఒక పాయింటు అనుకుని దాంతో  కథ ప్రారంభించాక, దాంతోనే ముగింపు దాకా రెండు గంటల పాటు సుదీర్ఘ కథనం ( డ్రైవింగ్ ) చేయాలంటే మధ్యలో ఎక్కడో బోరుకొట్టి బోల్తా పడొచ్చు. అక్కడే కథ సమాప్తమై కూర్చోవచ్చు  (‘చక్కిలిగింత’).  అందువల్ల ఎత్తుకున్న ఆ డ్రైవింగ్ పాయింటుని మధ్యలో విశ్రాంతి కి పంపుతూ,  అందులోంచే  ఇంకో పాయింటుని లాగి స్టీరింగ్ ని అందిస్తే, ఆ అనుబంధ పాయింటుతో చివరిదాకా కథనం ( డ్రైవింగ్) సాఫీగా జరిగిపోతుందని  ‘క్షణం’ తెలియజెప్తోంది. 

        ఇక ‘దొంగాట’ లో జరిగిన పొరపాటేమిటంటే, ఓ పది నిమిషాల్లో బిగినింగ్ విభాగాన్ని ముగించి ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేశాక, వెళ్ళాల్సిన మిడిల్ విభాగంలోకి వెళ్ళకుండా, తిరిగి బిగినింగ్ విభాగం లోకే వచ్చి అక్కడే గిరికీలు కొట్టడం. ఇందుకే మొదట్లోనే కథ ప్రారంభించినా ఇంటర్వెల్ దాకా విషయం లేదనే రివ్యూ లొచ్చాయి. మనం ఒక ఆఫీసు కెళ్ళి పనిచూసుకుని ‘వస్తా సార్’  అని బయటికి వచ్చి, మళ్ళీ ఆ ఆఫీసులోకే  వెళ్లి ఆ ఆఫీసరు మొహం చూస్తూ కూర్చోము కదా? ఇంత సంస్కారం లేకుండా ఉంటున్నాయి సినిమా కథలు. ఆ మాటకొస్తే కమర్షియల్ సినిమా కథలకి సిగ్గులజ్జ లుండవు. 

        ఇలా ‘దొంగాట’ లో బిగినింగ్ ప్రాబ్లం, ‘చక్కిలిగింత’ లో డ్రైవింగ్ పాయింటు ప్రాబ్లం రెండూ   ‘క్షణం’లో ఎలా సాల్వ్ అయ్యాయో ఇక చూద్దాం. 

          ఈ రెండిటి తో బాటు- ఈ సస్పెన్స్ జాతి కథ చెప్పడానికి- ఎండ్ సస్పెన్స్ అనేసుడిగుండం లో కూడా పడకుండా పనికొచ్చిన టెక్నిక్ ఏమిటో చూద్దాం. 

ముందుగా మొత్తం కథ..
    ఈ
కథలో మధ్యలో డ్రైవింగ్ పాయింటు మారడం వల్ల ఇంటర్వెల్ ని కూడా రివీల్ చేయలేని లాక్ పడిపోయింది. సాధారణంగా మనం చూసిన ఓ సినిమా కథ ఒకరికి చెప్తున్నప్పుడు  ఇంటర్వెల్ విషయాన్ని దాచిపెట్టకుండా చెప్పేస్తాం. సినిమా ముగింపుని మాత్రమే చెప్పకుండా అపుతాం. దీని వల్ల ఆ సినిమా చూడాలనుకునే వ్యక్తికి ఎలాటి ఇబ్బందీ వుండదు. కానీ  ‘క్షణం’ లో ముగింపుతో బాటు, ఇంటర్వెల్ ని కూడా రివీల్ చేయలేని పరిస్థితితో కథనముంది. ఈ ఇంటర్వెల్ ని రివీల్ చేసినా ఈ  కథ సస్పెన్స్ వేల్యూ మొత్తం పోతుంది.

        కానీ స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవాలంటే ఎలాటి సస్పెన్సుల్నీ, ముగింపుల్నీ గుప్పెట్లో పెట్టుకోలేం. ఓపెన్ చేస్తేనే విశ్లేషణ అర్ధమవుతుంది. కాబట్టి ఇక్కడ స్పాయిలర్ ఎలర్ట్ ని తీసి పక్కన పెడదాం. 

        ఈ కథలో
అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉంటున్న రిషి ( హీరో) కి ఇండియానుంచి మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ( హీరోయిన్) కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. నాల్గేళ్ళ క్రితం వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన శ్వేత ఇలా పిలవడంతో బయల్దేరి వస్తాడు రిషి. హైదరాబాద్ లో వుంటున్న శ్వేత తన నాల్గేళ్ళ  కూతురు రెండు నెలల నుంచీ  కన్పించకుండా పోయిందనీ, ఎవరూ- ఆఖరికి పోలీసులు కూడా కనుక్కోలేక పోతున్నారనీ వాపోతుంది. కారులో పోతూండగా దుండగులు తన మీద దాడి చేసి కూతుర్ని ఎత్తుకు పోయారని వివరాలు చెబుతుంది. 

        రిషి రంగం లోకి దిగుతాడు. అంతటా తికమక పెట్టే సమాచారమే వస్తూంటుంది అతడికి. ఎవర్నడిగినా, పోలీసులు సహా, లేని కూతుర్ని ఎలా వెతికి పెట్టమంటారని ప్రశ్నిస్తారు. పోలీసులు కేసు క్లోజ్  చేశామంటారు. రిషి కి శ్వేత మానసిక స్థితి మీద అనుమానం వేస్తుంది. అయినా పేపర్లలో అమ్మాయి ఫోటోతో ప్రకటన వేయిస్తాడు. ఆ ప్రకటన చూసి ఎవరో వ్యక్తి ఆ అమ్మాయి ఫోటోలూ సర్టిఫికెట్లతో వచ్చి ఆ అమ్మాయి తప్పిపోయిన తనమ్మాయేనని క్లెయిమ్ చేస్తాడు. రిషి ఇంకింత గందరగోళంలో పడతాడు.

        రిషి శ్వేత భర్తని కలుస్తానంటే ఆమె కలవనీయదు. వాళ్ళిద్దరి కాపురం సజావుగా లేదని అర్ధమవుతుంది.  
రిషి కి డ్రగ్స్ బానిసైన శ్వేత మరిది బాబీ మీద అనుమానం వస్తుంది.  ఆఫ్రికన్లతో కుమ్మక్కయి వున్న అతడి డ్రగ్ రాకెట్ ని చూసి  శ్వేత కూతుర్ని ఇతనే  కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తాడు. పిక్చర్లోకి ఈ డ్రగ్ రింగ్ తో సంబంధమున్న బాబూఖాన్ వస్తాడు. రిషి రహస్యాన్ని ఛేదిస్తున్న క్రమంలోనే కళ్ళ ముందే శ్వేత అపార్ట్ మెంట్ మీంచి  దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

        దీంతో రిషి చిక్కుల్లో పడతాడు. ఈ కొత్త కేసులో అనుమానితుడిగా పోలీసుల వేధింపులకి గురవుతాడు. ఇది ఆత్మహత్య అంటే నమ్మని పోలీసులు దర్యాప్తుని విస్తరిస్తారు. శ్వేత భర్త, బాబీ  తెరపైకొస్తారు. ఒక ఇంటరాగేషన్ సమయంలో బాబీని ఆత్మరక్షణ కోసం కాల్చేస్తుంది ఎసిపి జయ. ఈ జయతో రిషి కొనసాగుతాడు. మెడికల్ గా శ్వేత భర్త బయట పెట్టని నిజమొకటుంది. అది శ్వేతకి పుట్టిన కూతురు తనది కాదని. ఇది మనసులోనే వుంచుకుని శ్వేతని వేధించాడు.

        రిషికి బాబూఖాన్ ద్వారా మరికొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు, దీంతో జరిగే సంఘటనలు, డ్రగ్ స్మగ్లర్లతో ఘర్షణలూ వీటితో- అమ్మాయి కిడ్నాప్ రహస్యం వెల్లడవుతుంది. ఆనాడు శ్వేత మీద దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్ళింది ఈ ఆఫ్రికన్లే. ఇంకో ఇద్దరు కిరాయి కిల్లర్స్ ఈ ఆఫ్రికన్లని చంపాలని చూస్తూంటారు. వీళ్ళ చేతిలోనే బాబూఖాన్ మరణిస్తాడు. ఈ కిరాయి కిల్లర్స్, ఆఫ్రికన్లు, బాబీ మొత్తం కలిపి ఎసిపి జయ నెట్వర్క్ అని తెలుస్తుంది. ఫాం హౌస్ లో ఆమెని పట్టుకుంటే అక్కడే వుంటుంది అమ్మాయి. 

        ఎసిపి జయ ఒక సైకోపాత్. తనకో కూతురుండాలని  ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయించింది - ఈ అమ్మాయి తన కూతురు - ఇకంతే. ఈ కూతుర్ని సొంతం చేసుకోవడానికి  ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. శ్వేతకి కూతురే లేదని డబ్బులు గుమ్మరించి సాక్ష్యాలు  సృష్టించింది. ఫోటోలతో వచ్చిన వాడూ తన మనిషే. అపార్ట్ మంట్ లో, స్కూల్లో. పోలీస్ స్టేషన్లో అన్ని చోట్లా అందర్నీ కొనేసింది. అందుకే రిషి ఎక్కి కెళ్ళినా అలాటి సమాధానాలే  వచ్చాయి. బాబీని చంపింది కూడా ఆత్మరక్షణ కోసం కాదు. వాడు నిజం కక్కకుండా  వుండేందుకే అలా కాల్చేసింది. ఇంకా చాలా చేసింది, చేయబోతుంది కూడా..

        జయ విశ్వరూపం చూసి  షాకులో వున్న రిషికి అప్పుడు ఆ అమ్మాయి తన కూతురేనన్న పచ్చి నిజం తెలుస్తుంది. శ్వేతతో ప్రేమలో జరిగిన తొందరపాటు ఫలితమిది... ఇక జయ రిషిని షూట్ చేసేస్తుంది. ఇన్స్ పెక్టర్ సైకోపాత్ జయని  కాల్చేస్తాడు. రిషి బతికి తన కూతుర్ని చూసుకుంటాడు...

పెద్ద బ్లాకు- చిన్న పాయింటు 
      అంశాల వారీగా ఈ కథని పేర్చుకు రావడానికి సీన్ల వరస అయిదు  రకాలుగా వుంది. కథ ఎలా ప్రారంభించి ఎలా చెప్పుకొచ్చినా,  అసలంటూ మూలంలో కథ మొదలయ్యింది  రిషి- శ్వేతల ప్రేమ దగ్గరే కాబట్టి,  ఈ ప్రేమ లేకపోతే కథే లేదు కాబట్టి-  ఇక్కడ్నించి మొదలెడదాం. 1) ప్రేమ ప్రారంభం - దీని వైఫల్యం  తాలూకు సీన్ల వరస, 2) శ్వేత మీద దుండగులు  దాడిచేసి, కూతుర్నిఎత్తుకెళ్ళే సీన్లతో బాటు, ఆ కూతురు ఎలా ఎలా ఎక్కడికి చేరిందో ఆ సీన్ల వరస, 3) యూఎస్ లో వున్న రిషి జీవితం, శ్వేత అతణ్ణి అర్జెంటుగా రమ్మని అమ్మాయి అన్వేషణ బాధ్యత అప్పగించడం దగ్గర్నుంచీ,  ఆ అన్వేషణ తాలూకు సుదీర్ఘమైన సీన్ల వరస, 4) క్లయిమాక్స్ లో ఎసిపి జయ క్యారక్టర్ రివీల్ అయి ఆమె  పాల్పడ్డ ఈ కుట్ర తాలూకు మొత్తం అన్ని సీన్ల వరస, 5) ముక్తాయింపు. 

        ఇలా అయిదు బ్లాకులుగా సీన్ల వరసలున్నాయి. వీటి సర్దుబాటు ఎలా అర్ధవంతంగా జరిగిందో చూద్దాం. వీటిలో 2 వ బ్లాకులో కారులో అమ్మాయిని చూపించకుండా శ్వేత మీద జరిగిన దాడిని చూపిస్తూ కథనాన్ని ప్రారంభించారు. ఈ దాడి వరకే చూపించి 3వ బ్లాకు సీన్ల వరస ఎత్తుకున్నారు. రిషి ఇండియా బయల్దేరి వస్తున్నప్పుడు 1వ బ్లాక్ ఓపెన్ చేశారు. నాల్గేళ్ళ క్రితం రిషీ శ్వేతల ప్రేమ ఎలా ప్రారంభమయ్యిందీ చూపించి కట్ చేసి, 3వ బ్లాకుని కొనసాగించారు. 

        ఈ మూడవ బ్లాకే చాలా రిస్కీ బ్లాకు. ఎందుకంటే సినిమా ప్రారంభంలో ఓ పది నిమిషాల్లోనే ఇది  ప్రారంభమై, సుదీర్ఘంగా క్లయిమాక్స్ దాకా సాగుతుంది కాబట్టి. అమ్మాయి తప్పిపోయిందన్న చిన్న పాయింటు పట్టుకుని అంత సేపు కథనం చేయాలి కాబట్టి. ఈ బారెడు బ్లాకులో సందర్భాన్ని బట్టి అక్కడక్కడా మొదటి బ్లాకులో వున్న ప్రేమ కథని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా వేసుకుంటూ పోయారు. ఇది ఎంత అర్ధవంతంగా వున్నా ప్రధాన కథ ఇదికాదు, అమ్మాయి కథే కాబట్టి ఎంత సేపని ఆమెని వెతుక్కుంటూ ఉంటాడు హీరో? విషయం లేక కథనం కొల్లాప్స్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి ఇంటర్వెల్లో ఒక ట్విస్టు ఇచ్చి దృష్టి మరల్చేశారు. ఇంటర్వెల్లో ఆ ట్విస్టు హీరోయిన్ ఆత్మహత్య. 

        మధ్యలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకునే కథనం ఎవరైనా చేస్తారా? హీరోయినే లేకపోయాక ఇంకా సినిమా ఏమిటి...అనేది ఒట్టి మూఢ నమ్మకమని ప్రేక్షకులు అర్ధం జేసుకునే స్థితికి చేరుకోకపోతే ఎప్పటికీ బాగుపడరు. సినిమా ముగింపుని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆమె రిషి కూతురికి తల్లి, పైగా పెళ్ళయిపోయింది. ఇంకామెకి కథలో పనిలేదు. ముగింపులో కూడా ఆమె వుండిపోతే  కంగాళీ అయిపోతుంది ఆమె పాత్ర.  

        పుట్టింది భర్త  కూతురు కాదని తెలిసి కూడా భర్తకి చెప్పకుండా కాపురం చేయడంలోని అనైతికత ఎప్పుడూ హీరోయిన్ పాత్రకి తగనిదే. దీన్ని ప్రశ్నించవచ్చు ప్రేక్షకులు, ఇంతవరకే. 

        ఇంటర్వెల్ లో ఈ ట్విస్టు వల్ల కథనం సహజంగానే ఈ ఆత్మహత్యా కేసు మీదికి మళ్ళిపోయింది. ఇక్కడ కొత్తగా ఇంకో కథ తెచ్చి అతికించ లేదు. ఇది సెకండాఫ్ సిండ్రోమ్ కాదు, స్క్రీన్ ప్లే కూడా నిట్టనిలువునా ఫ్రాక్చర్ ఆవలేదు. ఉన్న కథలోంచే, పాత్రలోంచే ఆత్మహత్య అనే అత్యవసరమైన, అన్ని విధాలా సమంసమైన, కథ సమగ్రతకి సంతుష్టకరమైన పాయింటుని లాగి ఈ  సుదీర్ఘ బ్లాకులో ప్రయాణానికి ప్రమాదం లేకుండా చూసుకున్నారు.

        అమ్మాయి అదృశ్యమైన కథ బోరు కొట్టే ప్రమాదం తప్పి కాస్సేపు బ్రేకు పడింది. ప్రారంభం హైదరాబాద్ అనుకుంటే, ఇంటర్వెల్లో బస్సు డ్రైవర్ మరాడన్నమాట - శ్వేత ఆత్మహత్య కేసు రూపంలో. అమ్మాయి అదృశం కేసు రూపంలో వున్న మొదటి డ్రైవర్ రెస్టు తీసుకుంటున్న డన్నమాట. ఈ రెండో డ్రైవ్ క్లయిమాక్స్ దాకా సాగుతుంది, అక్కడ మళ్ళీ రెస్టులో వున్న మొదటి డ్రైవ్- డ్రైవర్  అందుకోవడంతో,  ఈ బస్సు అనే మొత్తం కథా వైజాగ్ అనే ముగింపుకి సల్లక్షణంగా చేరుకుందన్న మాట. 

        ‘చక్కిలిగింత’ లో లాంటి డ్రైవింగ్ పాయింటు ప్రాబ్లం ఇలా సాల్వ్ అయిందన్నమాట. 

బిగినింగ్ కి బ్రేకే!
       యిదు బ్లాకుల కథని స్ట్రక్చర్ పరంగా చూస్తే, 1) ప్రేమ ప్రారంభం - దీని వైఫల్యం  తాలూకు సీన్ల వరస, 2) శ్వేత మీద దుండగులు  దాడిచేసి, కూతుర్నిఎత్తుకెళ్ళే సీన్లతో బాటు, ఆ కూతురు ఎలా ఎలా ఎక్కడికి చేరిందో ఆ సీన్ల వరస, 3) యూఎస్ లో వున్న రిషి జీవితం, శ్వేత అతణ్ణి అర్జెంటుగా రమ్మని అమ్మాయి అన్వేషణ బాధ్యత అప్పగించడం దగ్గర్నుంచీ,  ఆ అన్వేషణ తాలూకు సుదీర్ఘమైన సీన్ల వరస, 4) క్లయిమాక్స్ లో ఎసిపి జయ క్యారక్టర్ రివీల్ అయి ఆమె  పాల్పడ్డ ఈ కుట్ర తాలూకు మొత్తం అన్ని సీన్ల వరస, 5) ముక్తాయింపు. 

          ఇందులో 1, 2 బ్లాకులు పూర్తిగానూ, 3 వ బ్లాకులో రిషి అన్వేషనని చేబట్టడం వరకూ సీన్లు బిగినింగ్ విభాగంలో కొస్తాయి.

        3వ బ్లాకులో అన్వేషణ చేపట్టిన దగ్గర్నుంచీ క్లయిమాక్స్ లో జయని అనుమానించి ఫాం హౌస్ కి బయల్దేరే వరకూ మిడిల్ విభాగం లోకి వస్తాయి.

        4, 5 బ్లాకులు ఎండ్ విభాగంలోకి వస్తాయి.

        ఇలా  త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వున్న కథని కథనం చేసేప్పుడు ఆసక్తికరంగా ఉండేందుకు బిగినింగ్ విభాగాన్ని మాత్రమే నాన్ లీనియర్ చేశారు. బిగినింగ్ విభాగంలోని 1, 2 బ్లాకులుతో పాటు, 3 వ బ్లాకులో రిషి అన్వేషనని చేబట్టడం వరకూ వున్న సీన్లని నాన్ లీనియర్ చేశారు. మిగిలిన మిడిల్, ఎండ్  విభాగాల్ని లీనియర్ గానే ఉంచారు.     అంటే ‘ఖైదీ’ లోలాగా ఇది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మిడిల్- బిగినింగ్- ఎండ్ ( 2 – 1 3) నేపధ్యంలో లేదని గుర్తించడం అవసరం. 

        బిగినింగ్ లో వున్న సీన్ల వరసలో  ఒక్క ప్రేమ కథని మాత్రమే ఫ్లాష్ బ్యాక్ చేశారు. ఇలా చూసినప్పుడు ఇది బిగినింగ్ విభాగానికి మాత్రమె వర్తించే   2-1-3 ( ఖైదీ)  నేపధ్యంగా వుంది. ప్రధాన కథ ఫ్లాష్ బ్యాక్ లో లేదు,  ప్రేమకథ మాత్రమే మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా బిగినింగ్- మిడిల్ -ఎండ్ విభాగాలవరకూ విస్తరించి వుంది.

        దీనివల్ల సాధించిన ప్రయోజన మేమిటి? మరో దొంగాట’ గాడిలో పడకుండా తప్పించుకోగలిగారు. 

        బిగినింగ్ విభాగం ముగింపులో రిషి అన్వేషణ చేపట్టే ప్లాట్ పాయింట్ -1 ఘట్టం దాకా వున్న సీన్లలో ప్రేమకి సంబంధించినవి ఆ ప్రేమెలా ప్రారంభమయ్యిందో అంతవరకూ మాత్రమే చూపించి ఆపేశారు. ప్లాట్ పాయింట్ -1 నుంచీ కథ మిడిల్లో పడింది. ఇక్కడ్నించీ మిడిల్ బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని రిషి కిచ్చిన గోల్ తో 3 వ బ్లాకు పూర్వార్ధం దగ్గర్నుంచీ, ఆ మిడిల్ ముగిసే ప్లాట్ పాయింట్ – 2 దాకా క్లయిమాక్స్ వరకూ, ఆ మిడిల్ బిజినెస్ నే తుచ తప్పకుండా కొనసాగించారు. 

        అంతే గానీ, ప్లాట్ పాయింట్ -1 దగ్గర బిగినింగ్ ముగిసిపోయాక మళ్ళీ బిగినింగ్ బిజినెస్ నే ఎత్తుకుంటూ బాకీ వున్న ప్రేమ కథని చెప్పుకురాలేదు!

         ఆ మిగిలిన్ ప్రేమకథని మిడిల్- ఎండ్ విభాగాల్లో మల్తీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వేస్తూ అడ్డం రాకుండా చూసుకున్నారు. ఈ తేడా బాగా గమనించాలి. 

        ‘దొంగాట’ లో పదినిమిషాల్లో కిడ్నాప్ తో ప్లాట్ పాయింట్ - 1 ఏర్పడ్డాక దాని పరిణామాలతో కూడిన మిడిల్ బిజినెస్ ని ప్రారంభించకుండా, మళ్ళీ బిగినింగ్ బిజినెస్ తో కూడిన టైం పాస్ సీన్లు వేస్తూపోయారు ఇంటర్వెల్ వరకూ!

        ఇలా ‘క్షణం’లో ‘అన్ఫెయిత్ ఫుల్’ కి సరిపోలింది. ‘దొంగాట’ లో లాంటి బిగినింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది.

యాంటీ ప్లాట్ కథనం

క నేరం  జరిగితే హీరో ఆ నేరస్థుణ్ణి ( విలన్ ని) పట్టుకునేందుకు అన్వేషణ సాగించడం ఒక రకం కథ- సస్పెన్స్ థ్రిల్లర్ జాతి. ఒక నేరం హీరోయే చేశాడని నేరస్థుడు ( విలన్) రుజువులతో సహా హీరోకి సాలెగూడు కడితే అందులోంచి హీరో బయట పడ్డం ఇంకో రకం కథ- మిస్టరీ జాతి. 2014 లో బెన్ అఫ్లెక్, రోసమండ్ పైక్ హీరో హీరోయిన్లుగా డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ‘గాన్ గర్ల్’ (Gone Girl) లో ఇదే వుంది. గిట్టని భర్త ( హీరో) ని తన మర్డర్ కేసులోనే ఇరికిస్తూ ఆధారాలు సృష్టించి దాక్కుంటుంది హీరోయిన్. ఆ భర్త అమాయకంగా భార్య కన్పించడంలేదని పోలీసుల్ని ఆశ్రయిస్తాడు. మిస్సింగ్ కేసుగా ప్రారంభమయ్యే ఈ కథ భర్తే భార్యని చంపి  నటిస్తున్నాడన్న ఆధారాలు లభించి మలుపు తిరుగుతుంది...

         
ఒక నేరం చేసిన నేరస్థుణ్ణి పట్టుకోవడానికి వలపన్ని ప్రేక్షకులకి కూడా అనుమానం రాని విధంగా వివిధ పాత్రల్ని సీఐడీ లుగా దింపి హీరో ఆడే గేమ్ ఇంకో రకం కథ- కోవర్ట్ జాతి. 1955 నాటి ‘టు ఛేజ్ ఎ క్రూకెడ్ షాడో’ , దీని అనుసరణగా 1982 లో హిందీలో వచ్చిన ‘ధువా’  ఈ జాతికింద వస్తాయి. 

        నేరం చేసిన నేరస్థుడు (విలన్) ఆ నేరాన్ని కప్పి పుచ్చుతూ రివర్స్ లో తనే తప్పుదోవ పట్టించే అనేక పాత్రల్నీ, ఆధారాల్నీ దింపడం మరింకో రకం కథ- ఇంట్రీగ్ (
intrigue – కుట్ర) జాతి. దీన్ని రివర్స్ సస్పెన్స్ అనికూడా అంటారు. ‘క్షణం’ ఈ జాతి కిందికొస్తుంది. 

        విలన్ తన గుట్టు కాపాడుకోవడానికి అబద్ధాలు, అబద్ధపు రుజువులు, అసలా నేరం జరగనే లేదనడానికి అబద్ధపు కథలూ సృష్టించడం ఇంట్రీగ్ జాతి కథా లక్షణాలు. అసలు తనొక విలన్ గానే కన్పించడు. ఒక కుట్ర  చుట్టూ నడిచే ఇలాటి కథల్లో అసలా కుట్ర ఏ మిటి? ఆ కుట్ర బయట పడకుండా ఎవరు కాపాడుతున్నారు? ఇందులో ఎవరెవరు చేరి వున్నారు? ఎందుకు ఆ కుట్రని కాపాడాల్సి వస్తోంది? కుట్ర బయట పడితే ఏం జరుగుతుంది? ఎవరెవరు నష్టపోతారు? ఆ కుట్రని బయటికి తీయాలని ఎవరు తవ్వుతున్నారు? ఎందుకు తవ్వుతున్నారు? కుట్ర తెలిస్తే దాన్ని కాపాడే ఉద్దేశం ఉందా? కుట్ర దారుణ్ణి బ్లాక్ మెయిల్ చేయడానికా? ఇందులో వున్న రిస్కేమిటి? లాభాలేమిటి? అబద్ధాలెలా వున్నాయి? ఎవరు చెబుతున్నారు?...ఇలాటి సందేహాలెన్నో రేకెత్తిస్తూ కథనం నడపగల్గినప్పుడు అది ఈ జాతి కథ వుతుంది. జాతి మర్యాదని కాపాడుతుంది. 

        ‘క్షణం’ ఇలాటి జాతి మర్యాదని కాపాడిన  క్వాలిటీ రైటింగ్ మాత్రమే కాదు, ఇంటలిజెంట్  రైటింగ్ కూడా!  ఎవరంటారు క్వాలిటీ రైటింగ్, ఇంటలిజెంట్ రైటింగ్ తెలుగుకి పనికిరావని ఈ సినిమా ఘనవిజయాన్ని చూశాక కూడా?

-సికిందర్





1, మార్చి 2016, మంగళవారం

సాంకేతికం


     సినిమా నిర్మాణంలో కళాకారులు వాళ్ళ వాళ్ళ శాఖలకే పరిమితం కావడం జరగడం లేదు. రచయితలూ, ఛాయాగ్రాహకులు, ఫైట్ మాస్టర్లు, నృత్య –కళా దర్శకులూ  మొదలైన వాళ్ళంతా సమన్వయం  కోసం దర్శకులకి సలహా సూచనలు ఇచ్చి పుచ్చుకోవచ్చు. దీన్నెవరూ తప్పు బట్టరు. అయితే ఈ సమన్వయం కాస్తా ఓ రోజుకి స్వాహాగా మారిపోయి తామే దర్శకులై పోతూంటారు. ఎందుకని కళాకారులు తాము కొనసాగుతున్న శాఖని కాదనుకుని ఇతరుల శాఖల్లోకి చొరబడాలనుకుంటారు? ? ఇది నిలకడ లేనితనం కాదా?

     సీనియర్ కళా దర్శకుడు, నిర్మాతా అయిన  చంటి అడ్డాల తను దర్శకుడగా మారేందుకు చేసిన ప్రయత్నాల్ని చెప్పుకొచ్చినప్పుడు ఈ ప్రశ్న ఎదురయ్యింది. తను మంచి కళా దర్శకుడుగా ఉంటూ నిర్మాత అయ్యారు, ఇంకా మళ్ళీ దర్శకుడుగా కూడా ఎందుకు మారాలి? ఇలాగైతే దేనికి న్యాయం చేయగలరు – అన్నప్రశ్నకి,  ఫ్రెండ్లీగా చెప్పుకొచ్చారు : ‘గురువు గారు దాసరి గారు నువ్వొక శాఖని నమ్మి అందులో  రాణించాక, ఇతర ఆసక్తులుంటే వాటిలోకి వెళ్ళడం కరెక్టు అన్నారు. అలా నేను కళా దర్శకత్వాన్ని ఎంచుకుని, అందులో రాణించాకే నిర్మాతనయ్యా, నిర్మాతగా సక్సెస్ అయ్యాకే  దర్శకత్వం అనుకున్నా..’ అన్నారు. 

          ఈ కంపార్ట్ మెంటలైజ్డ్ కమిట్ మెంట్ ని చూస్తే  మనకి పైకి ఆకట్టుకునేలానే  ఉండొచ్చు. కానీ ఐడెంటిటీ అనేదొకటి వుంటుందిగా? ఆరోప్రాణం, పవిత్రప్రేమ, కృష్ణ బాబు, బాచి, అడవి రాముడు, అల్లరి రాముడు, ఒక ఊరిలో, యముడికి మొగుడు...వంటి అనేక సినిమాలకి నిర్మాతగా పోస్టర్ల మీద చంటి అడ్డాల పేరు ప్రేక్షకుల్లో బాగా పాపులరైంది. కానీ 170 సినిమాలకి తను కళా దర్శకత్వం వహించారు. తానొక సీనియర్ కళా దర్శకుడనే పేరే మరుగున పడిపోయింది. నిర్మాత హోదా ఇంత పనీ చేసింది. ‘ధర్మచక్రం’, ‘ప్రేమ’ అనే రెండు సినిమాలకి ఉత్తమ కళాదర్శకుడిగా రెండుసార్లు నంది అవార్డులందుకున్న చంటిని ఇక కళాదర్శకుడిగా చూడలేమా? శాఖల సంక్రమణం వల్ల వచ్చిన సమస్యే ఇది.

          ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు తత్సంబంధమైన డిగ్రీలతో నేరుగా కళాదర్శకులై పోతున్నారు. వెంట వెంటనే భారీ సినిమాల అవకాశాలందుకుని గ్రాఫిక్స్ సమ్మిళిత కళా దర్శకత్వం వహించేస్తున్నారు.  వీళ్ళకీ, మామూలు కళాదర్శకుల దగ్గర ఏళ్ల కేళ్ళు  సహాయకులుగా  పనిచేసీ చేసీ కళాదర్శకులయ్యే  చంటి లాంటి సాంప్రదాయ కళాదర్శకులకీ తేడా ఏమిటని ఆయన్ని అడిగితే -
          ‘ఆ రోజుల్లో కథ విన్పించడం దగ్గర్నుంచీ, మేకప్, కాస్ట్యూమ్స్ తో బాటు, పాటల విషయంలోనూ కళాదర్శకుల పాత్ర వుండేది. ఒక పాటకి సెట్ వేయాలంటే కళాదర్శకుడికి ముందుగా ఆ పాటని పంపేవారు. ఆ పాట ప్రకారం అతను సెట్ వేసే వాడు. ఇప్పుడు పాటలకీ సెట్స్ కీ పొంతన వుండడం లేదు. పాట  ఇవ్వకుండానే సెట్ వేసేయమంటారు. ఇయర్ ఫోన్స్ లో పాట వింటూ నృత్య దర్శకుడు ఫ్లైట్ దిగుతాడు. సెట్ ని పట్టించుకోడు. పాటకి తగ్గ మూవ్ మెంట్స్  ఇవ్వడు. సెట్ లో అంత మంది గ్రూప్ డాన్సర్లని గుంపుగా పెట్టేస్తే, అంత ఖర్చుతో మేం వేసే సెట్ కన్పించకుండా పోతుంది. ఇక దర్శకుడు ఇది తన తంతే కాదన్నట్టు బయట నించుని సిగరెట్ పీలుస్తూంటాడు. అంతా కలిసి టపటపా పాట లాగించేసి వెళ్ళిపోతారు..’ అంటూ చెప్పుకొచ్చారు చంటి. 

          అప్పట్లో కె.  రాఘవేంద్ర రావు సెట్లో వుండి, కళా దర్శకుడి సహాయంతో కెమెరాకి సరైన బ్లాకులు ఎంపిక చేసుకుని, పాటలు చిత్రీకరించే వారన్నారు చంటి.

          పాలకొల్లుకి చెందిన చంటి, 1982 లో మద్రాసు వెళ్లి ప్రసిద్ధ కళాదర్శకుడు వి. భాస్కరరాజు దగ్గర సహాయకుడిగా చేరారు. చిన్ననాటి నుంచీ ఫ్రీ హేండ్ డ్రాయింగ్ లో ఆరితేరి ఉండడంతో, పబ్లిసిటీ ఈశ్వర్ సోదరుడు పైడ్యాచార్య దగ్గర శిష్యుడిగా చేరారు. పౌరాణిక, జానపద  చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం పొందారు. కానీ అలాంటి సినిమాలకి పనిచేసింది లేదు. 1989 లో వెంకటేష్ నటించిన ‘ప్రేమ’ సినిమాకు కళాదర్శకుడయ్యారు. అలా మొదటి సినిమాతోనే మొదటి నంది అవార్డుని అందుకున్నారు. ఇక అప్పటినుంచీ జైత్ర యాత్రే. అగ్ర హీరోల, అగ్ర దర్శకుల సినిమాలకి కళా దర్శకుడిగా పనిచేసి ఇంకా మంచి గుర్తింపు పొందారు. చిరంజీవి నటించిన ‘రాజా విక్రమార్క’ లో ‘భళా చాంగు భళా’ పాటకి అత్యంత సింపుల్ గా సెట్ వేశారు. అది అప్పట్లో చర్చనీయాంశమైంది. అలాగే ‘గ్యాంగ్ లీడర్’ లో వానపాటకి వేసిన వెదురు బొంగులతో కూడిన  సెట్ కూడా పేరు తెచ్చింది. తను భాస్కరరాజు దగ్గర పనిచేస్తున్నప్పుడే రిచ్ అసిస్టెంట్ అవడం వేరు, ఇలా సింపుల్ సెట్లు వేయడం పూర్తిగా వేరు.

          సెట్స్ లో ప్రమాదాల విషయానికొస్తే, ఓసారి వెంకటేష్ నటించిన ‘సుందరకాండ’ కోసం అరకులో వేసిన సెట్ పెద్ద గాలి దుమారం రావడంతో పై కప్పు లేచిపోయింది. వెంటనే  టార్పాలిన్ కప్పి లోపల షూటింగ్ మొదలు పెడితే, అక్కడక్కడా వర్షపు నీళ్ళు కారుతున్నాయి. అప్పుడు మీనా విసుక్కుంటూ ఆ నీళ్ళకి గిన్నెలు పడుతున్నట్టుగా కల్పించి షూట్ చేశారు. ఆ సినిమా చూసిన వాళ్లకి అది స్క్రిప్టులో ముందే రాసుకున్న సీన్ అనుకోవచ్చు, కానీ వర్షం పడుతోంటే అప్పటికప్పుడు అనుకుని చిత్రీకరించిన సీను అది. 

          పోతే  ‘ధర్మచక్రం’ కి  తనకి ఉత్తమ కళాదర్శకుడిగా అవార్డు ఎందుకిచ్చారో అర్ధం కాలేదన్నారు. ఈ విషయమే అవార్డుల కమిటీని అడిగితే, అందులో కోర్టు సీనుకి మూడు సింహాల పిల్లర్ మీదుగా వేసిన పైకప్పు ప్రతీకాత్మకంగా ఉండడంతో అవార్డు ఇచ్చామన్నారట!  ఎంత కళాహృదయమో, కళాదర్శకుడే  సంకల్పించని సంగతికి! 

          సినిమా షూటింగులు స్టూడియోల్ని దాటుకుని రియల్ లోకేషన్ల లోకి వచ్చాక, సెట్ కార్మికులకి పని తగ్గిపోయిందన్నారు. మౌల్డర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లవర్ డెకొరేటర్లు, సెట్ ప్రాపర్టీ సిబ్బందీ, బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులూ కనుమరుగయ్యారన్నారు. కాలక్రమంలో మెగా సెట్స్ కి  క్రేజ్ పెరగడంతో మళ్ళీ పనులు దొరుకుతున్నాయన్నారు.

          ఇటీవలే కళాదర్శకుల సంఘం అధ్యక్షుడిగా చంటి అడ్డాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రంగంలో కొత్త వారికీ మంచి అవకాశాలు, భవిష్యత్తూ వుంటాయనీ, కాకపోతే ఇప్పుడు ఆర్ట్ సంబంధ కోర్సులు చేసి నేరుగా కళా దర్శకులయ్యే వారికి  చెక్ పెట్టామన్నారు. ముందుగా అసిస్టెంట్ గా పనిచేసి కనీసానుభవం సంపాదించుకుంటే తప్ప యూనియన్ గుర్తిపు కార్డు ఇవ్వబోమన్నారు చంటి అడ్డాల.

-సికిందర్
 (2011- ‘ఆంధ్రజ్యోతి’)


   


29, ఫిబ్రవరి 2016, సోమవారం

నాటి సినిమా!



దేశం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే  రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని ఆ గీతాచార్యుడు సాకార రూపంలో ఈ లోకాన అవతరిస్తాడు. ఆ రూపం ‘బొబ్బిలి పులి’ అయినప్పుడు,  ఆ ప్రక్షాళనా  శతఘ్నులు భళ్ళున భళ్ళున అగ్ని వర్షాలు కురిపిస్తాయి!
          ఎస్, ఇందుకే కనక వర్షం కురిసింది!

        స్ట్రాంగ్ క్యారెక్టర్.. స్ట్రాంగ్ స్టోరీ.. చివరికి  ఇవన్న మాట సినిమా సిల్వర్ జూబ్లీ  అవడానికి మూలస్థంభాలు! సినిమా అంటే ఇప్పుడొస్తున్న  పాసివ్ పాత్రలతో పేలవమైన కథనాలతో చుట్టేసే క్రేజీ కాంబినేషన్ల ప్రదర్శన కాదు. డాక్టర్ ఎన్టీ రామారావు - డాక్టర్ దాసరి నారాయణ రావుల కాంబినేషన్ ఇలాటిది కాలేదు. వాళ్ళ బాధ్యతాయుతమైన భాగస్వామ్యంలో  ‘బొబ్బిలిపులి’ అనే పరాకాష్ట ధూర్తజనులకి కొరడా చరుపైంది. అవినీతిని ఏదో లంచం రూపంలో చూపించేసి, చంపడం వేరు. అవినీతి వల్ల భౌతిక నష్టతీవ్రతని పెంచి చూపించి, శత్రువుని వధించడం పూర్తిగా వేరు. మొదటిది ( లంచం ) ప్రేక్షకులు తేలిగ్గా తీసుకున్నే నిత్య వ్యవహారమే. రెండోది ( ప్రాణ నష్టం, ఆస్తి నష్టం) మాత్రం సీరియస్ గా పట్టించుకోవాల్సిన పవర్ ఫుల్ వ్యక్తీ కరణ అవుతుంది. ఇందుకే ‘బొబ్బిలిపులి’ ది  పవర్ఫుల్ స్టోరీ అయింది. ఇందుకే ‘బొబ్బిలి పులి’  ఎన్టీఆర్  నట జీవితానికో కుదుపు నిచ్చిన బ్లాక్ బస్టర్ మాత్రమే కాలేదు, అంతలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఉత్తరీయమిచ్చిన ఉపాఖ్యానం కూడా అయింది.

        ‘బొబ్బిలి పులి’  అనే నాణేనికి ఇలా రెండు ముఖా లేర్పడ్డాయి. ఇందుకు ఉత్తరాది పాత్రి కేయ బృందమూ సాక్ష్యమే. ఓ వైపు ఊరూరా ప్రభంజనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ చైతన్య రథ యాత్రా విశేషాల్ని కవర్ చేస్తూనే, మరో వైపు మారు మూల పల్లెల్లో క్రిక్కిరిసిన థియేటర్ లలో ‘బొబ్బిలిపులి’  బాక్సాఫీసు గాండ్రింపుల్ని సైతం  లోకానికి చాటిన చరిత్రా వుంది.

        అపూర్వంగా  ఎన్టీఆర్ నటించిన  ఈ శక్తిమంతమైన పాత్ర తప్ప, మరింకో చర్చనీయాంశం సాక్షాత్తూ షెర్లాక్ హోమ్స్ వచ్చి తన ట్రేడ్ మార్క్ భూతద్ధం పెట్టి గాలించినా ఈ సినిమాలో దొరకదు. కాబట్టి ఒక పాత్ర బలంగా ఎదగడానికి ఏవి దోహద పడతాయో, తెలుసుకోవడమే  మనకి ముఖ్యాంశ మవుతుంది.

        సినిమాల్లో కథే పాత్రని నడిపితే అది  నసపెట్టే పాసివ్ పాత్రవుతుంది. పాత్రే కథని నడిపిస్తే అప్పుడది యాక్టివ్ పాత్ర,  లేదా స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది. స్ట్రాంగ్ క్యారెక్టర్ కి వ్యక్తిగత ఆశయమే వుంటే,  అది అంతవరకే  పరిమితమైన దాని సొంత కథవుతుంది. ఇంకో మెట్టు పైకెళ్ళి ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటే అప్పుడది సామాజిక కథగా, పాత్రగా ప్రమోటవుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అంతర్జాతీయ సమస్యని తలకెత్తుకుంటే, అప్పుడు విశ్వజనీన కథగా, పాత్రగా పదోన్నతి పొందుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అక్కడ పారలౌకిక అంశాల్ని స్పృశిస్తే,  భక్తి లేదా ఆథ్యాత్మిక కథగా, పాత్రగా పరమోన్నతమవుతుంది. కథల, పాత్రల గౌరవ ప్రపత్తులు ఈ ఆరోహణా క్రమంలో వుంటాయి. మెట్లెక్కే కొద్దీ  పెరుగుతూంటాయి.

        1982 లో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ‘బొబ్బిలిపులి’  లో ఎన్టీఆర్ పోషించిన మేజర్ చక్రధర్ పాత్ర  పై ఆరోహణా క్రమంలో రెండో స్థానాన్ని అలంకరిస్తోంది. ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటూ సామాజిక పాత్ర అయింది. దుష్టులు ధర్మాన్ని చె రబట్టడం ప్రపంచ వ్యాప్త సమస్యే. దీనిమీద సామాజిక బాధ్యతతో తిరగబడ్డ చక్రధర్  విశ్వ జనీన ఆశయంతో ప్రతీ ఒక్కర్నీ అందుకే కదిలించ గలిగాడు. సినిమాల్లో కనీసం అయిదు కదిలించే సన్నివేశాలుంటే  విజయం ఖాయమని  నటి ఇంగ్రిడ్ బెర్గ్ మాన్ చెప్పినట్టు మూడు  ఆస్కార్ ల రచయిత విలియం గోల్డ్ మాన్ తన పుస్తకంలో రాశాడు. ఐదేం ఖర్మ, అరడజనుకి పైగా కుదిపివేసే సన్నివేశాలు కొలువు దీరాయి ‘బొబ్బిలిపులి’ లో.

      పాజిటివ్ సహిష్ణుతతో మేజర్ చక్రధర్ తన వాళ్ళ పట్ల ఔదార్యం వహించే ప్రతీ  మలుపూ కదిలించే సంఘటనే! అదే పాజిటివ్ సహిష్ణుత రీత్యా నిస్పృహ కి లోనవకుండా, ఆత్మ స్థయిర్యమూ కోల్పోకుండా, ప్రజా కంటకుల మీద దండయాత్ర చేసినప్పటి ప్రతీ ఘట్టమూ  కదిలించే సంఘటనే! 

        ఇలా పరస్పర భిన్నమైన అంతర్గత, బహిర్గత ఆశయాలుండబట్టే  మర్చిపోలేని సజీవ పాత్రయ్యాడు. ఇది యాక్షన్ సినిమాయే అయినా ఇందులో పాత్ర వ్యక్తిగత జీవిత చిత్రణకి కూడా ( దాదాపు 50 సీన్లు) ప్రముఖ స్థానముంది. మనం డబ్బు సంపాదన అనే యాక్షన్లో పడిపోయి  వ్యక్తిగత  జీవితాన్నిపట్టించుకోం. దీని ఫలితాన్ని మానసిక రుగ్మతల రూపంలో అనుభవిస్తున్నాం. జీవించడానికి బయట యాక్షన్ తో బాటు, ఇంటి మీద కాస్త ఎఫెక్షనూ అంత ముఖ్యమే. ఈ సంగతి పైకి చెప్పకుండా అన్ కాన్షస్ గా సైకో ఎనాలిసిస్ చేసేదే పవర్ఫుల్ పాత్ర. కాకి కేం తెలుసు సైకో ఎనాలిస్ అన్నాడో కవి. చరిత్రలో నిలచిపోయిన కొటేషను. కాకి సంగతేమో గానీ, మన టైంపాస్ తెలుగు సినిమా  పాత్రలు కూడా సైకో ఎనాలిస్  చేయగలవని మేజర్ చక్రధర్ నిరూపిస్తున్నాడు.

        సెలవు మీద ఊరొచ్చిన సైనికుడతను. ఇక్కడ ప్రేమించినమ్మాయి ( శ్రీదేవి) తో పెళ్లను కుంటోండగానే  సైన్యం నుంచి అర్జెంటుగా పిలుపు! ఆ పిలుపందుకుని పెళ్లి కంటే దేశ రక్షణే ముఖ్యమనుకుని వెళ్లి పోతాడు. అంతలో తల్లి అస్తమించిన వార్త. విధి నిర్వహణలో తల్లి ఋణం కూడా తీర్చుకోలేని దైన్యం. ఎలాగో ఊరొస్తే, చెల్లెలి (అంబిక)  తొందరపాటు ఫలితంగా కుండ మార్పిడి పెళ్ళిళ్ళు తప్పవు. అసలు ప్రేమించినమ్మాయిని పెళ్లి చేసుకోలేని బాధని కూడా దిగమింగుకుని, మతిస్థిమితం లేని ఈ భార్య (జయచిత్ర) తో రాజీ పడి,  ఇక విధి నిర్వహణకి తిరుగు ప్రయాణమవబోతూంటే, నడిరాత్రి నగరంలో దుష్ట త్రయం (సత్యనారాయణ, రావు గోపాలరావు, రాజనాల)  దగుల్బాజీ తనం నగ్నంగా కళ్ళబడుతుంది!

        ఇక దేశ సరిహద్దుల్లో కాదు విధి నిర్వహణ, ఈ దేశం నడిబొడ్డునే అని కళ్ళు తెర్చి సమరభేరి మోగిస్తాడు దుష్టజాతి మీద! 

      ఇలాటి సైనికుల కథల్లో  రొటీన్ గా కొన్ని స్టాక్ సీన్లు వుంటాయి. వాటిలో ముఖ్యమైనది సరిహద్దులో డ్యూటీ చేస్తూ ప్రియురాలి నుంచి ఉత్తర మందుకోవడం. అలనాటి హీరో బాలరాజ్ సహానీ లా ‘హకీఖత్’ లో   ‘హోకే  మజ్బూర్ హమే ఉస్నే బులాయా హోగా’ అని తల్చుకుని పాట పాడుకోవచ్చు. లేదా జేపీ దత్తా ‘బోర్డర్’  లో లాగా ‘సందేశే ఆతే హై  హమే తడ్పాతే హై’ అని కూడా పాడుకోవచ్చు. మేజర్ చక్రధర్ కూడా ఇలాటి లేఖే ప్రేమించినమ్మాయి నుంచి అందుకుని  ‘ఇది ఒకటో నంబరు బస్సూ’  అని ఎంటర్ టైన్ చేస్తాడు.

        ఇలాటి రోమాంటిక్  హీరో జ్వలిత హృదయుడు అవడానికి రెండు బలమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒకటి, సమాజ ద్రోహులు గోడౌన్ లో చక్కర నిల్వల్ని తరలించుకుపోయి అగ్ని ప్రమాదం సృష్టించే  సంఘటన. ఇది ఎప్పుడో రాజేష్ ఖన్నాతో మన్మోహన్ దేశాయ్ తీసిన ‘రోటీ’ లో రేషన్ డీలర్ జీవన్ దాచేసిన సరుకుని సింపుల్ గా పట్టుకోవడం లాంటి సాత్విక సంఘటన కాదు – చాలా నీచమైన తామసిక సంఘటన! 

        ఒక నేరాన్ని దాచడానికి నిప్పెట్టి ఇంకో దుర్మార్గం చేసే రాక్షస చర్య.  అవినీతి అనగానే ఓ లంచం పుచ్చుకునే  సీనుతో సరిపెట్టేసే  సాదా కథనం కాదు. ఆ అవినీతి దుష్పరిణామంగా నష్ట తీవ్రతని భౌతికంగా చూపించే మేజర్ సీను. ఇందుకే దీంతో తలపడి కోర్టులో నిరూ పించలేక, చక్రధర్ పడే వేదన - విజువల్ గా నష్ట తీవ్రతని  చూసి చలించిన ప్రేక్షకులు కూడా అంత ఆవేశంతో రగిలిపోవడానికి వీలయ్యింది.

        ఇలా అమాయక ప్రజల ఆస్తి నష్టానికి కారణమయ్యీ, కోర్టులో దుష్టులు తప్పించుకుంటే, రెండోసారి ప్రాణ నష్టం చూస్తాడు చక్రధర్. ఇదింకా బలమైన సంఘటన. రోడ్డుపక్క నిద్రపోతున్న అభాగ్యుల మీదికి  తాగిన మైకంలో కారు తోలిన దుర్మార్గం కూడా కళ్ళెదుటే కోర్టులో వీగిపోతుంది!

        దీంతో తిరగబడతాడు చక్రధర్. కోర్టులోనే అవినీతి యంత్రాంగాన్ని పట్టుకుని చితకబాది చితకబాది  వదుల్తాడు. కిష్కింధ అవుతుంది కోర్టు.

        ఫిలిం ఈజ్ బిహేవియర్ అంటారు స్క్రీన్ ప్లే పండితులు. పాత్రంటే ఏంటి?  సంఘటనని సృష్టించేది. మరి సంఘటనంటే? పాత్రకి వన్నెచేకూర్చేది...అని అంటాడు 19 వ శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత హెన్రీ జేమ్స్.  మనుషులు నాల్గు భౌతిక తత్త్వాల ( అగ్ని, భూమి, వాయు, జల౦) తోనూ, మూడు మానసిక తత్త్వాల ( చర, స్థిర, ద్విస్వభావాలు) తోనూ ఉంటారని అంటారు ప్రాచీన శాస్త్రకారులైన పరాశరుడు, వరాహ మిహిరుడు ప్రభృతులు.

      ఈ పైవన్నీ క్రోడీకరించుకుని,  రక్తమాంసాలతో సజీవంగా అవతరించిందే మేజర్ చక్రధర్ పవర్ఫుల్ పాత్ర!

        కోర్టు లో తిరగబడి ఇలా ప్రకాశించిన చక్రధర్, ఇక బొబ్బిలిపులియై కొండ కోనల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని  ప్రజా ద్రోహుల్ని బంధించి హతమారుస్తూంటాడు. ఇదంతా యమలోకం వాతావరణాన్ని స్ఫురింపజేస్తుంది. తనేమో యమధర్మ రాజు, అనుచరులు యమ భటులు, వాళ్ళు పట్టుకొచ్చే జీవులు పాపులు. వాళ్ళకి కఠిన శిక్షలు. మరణ శిక్షలు.

        ప్రపంచ పురాణా లన్నిటినీ కూలంకషంగా పరిశోధించడానికే  జీవితాన్నంతా వెచ్చించిన గ్రేట్ జోసెఫ్ క్యాంప్ బెల్ -  ఓ చిన్న జోకు అయినా, మహా గొప్ప ఫిక్షన్ అయినా అన్నిటి మూలాలూ పురాణాల్లోనే ఉన్నాయని అంటాడు. అందుకే ఒక కల్పిత పాత్రలో వివిధ పురాణ పాత్రల కోణాలూ  కనిపిస్తాయనీ పేర్కొంటూ- ‘ది హీరో విత్ ఎ థౌజండ్ ఫేసెస్’ అన్న ఉద్గ్రంథాన్ని రచించాడు. సశాస్త్రీయంగా ఇలాటి మిథికల్ క్యారెక్టరే మేజర్ చక్రధర్ కూడా! 

        నవలా పాత్రలాగా సినిమా పాత్ర డైలాగులతో కథ నడపలేదు. చేతలతో నడిపితేనే చెల్లుబడి అయ్యేది. చేతలన్నీ  అయ్యాకా మాటలతో ఎంతైనా నడపొచ్చు. ఇలాటి మేకప్ ఉండబట్టే క్లయిమాక్స్ లో చాలా సుదీర్ఘమైన  ఆ వాదోపదావాలతో కూడిన కోర్టు సీనుని విగు పుట్టించకుండా డైలాగులతో లాక్కు రాగలిగాడు చక్రధర్. పైగా తన వాదపటిమకి తగ్గట్టు కథనంలో మొదటి మలుపు ( ప్లాట్ పాయింట్- 1)  దగ్గర స్థాపించిన సమస్య ( ప్రాణ నష్టం) కూడా అంత బలంగానూ వుంది. ప్లా పా- 1 దగ్గర సమస్య ఏర్పాటు బలంగా వుంటే దాంతో పోటీ పడుతూ ఆటోమేటిగ్గా క్లయిమాక్స్ కూడా బలంగా వచ్చేసినట్టే. ఇలాటి కథా పథకం బలం వల్లే సినిమా మొత్తం మీద చివరి కోర్టు సీనుని అంత హైలైట్ గా మార్చగలిగాడు చక్రధర్. 

      అతడి వాదం ఒక్కటే. ఒకే కేసులో ఒక కోర్టుకీ దాని పై కోర్టు కీ పొంతన లేని తీర్పు లేమిటి? శత్రువుని సైనికుడు సరిహద్దులో చంపితే  సత్కారమా? అదే దేశం లోపల నేరస్థుల్ని వధిస్తే మరణశిక్షతో ఛీత్కారమా? నిజంగా సైనికుడు దేశాన్ని ఎప్పుడు కాపాడినట్టు? మర లాంటప్పుడు ఈ మరణశిక్ష తన కెందుకు విధించినట్టు?

        యంత్రాంగం సమాధానం ఇవ్వలేని లేని ప్రశ్నలు.  దేశం మొత్తం మీద ఒక్క సైనిక జవాను మాత్రమే వేయగల కఠిన ప్రశ్నలు. 

        అతడి ఆవేదన మాత్రమే గొప్పది. 

        ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడు కొస్తూంటే, పందికొక్కులు దేశంలోపల సర్వ వ్యవస్థల్నీ నాశనం చేస్తున్నాయి.

        స్ట్రాంగ్ క్యారెక్టర్ కి నషాళాన్నంటే అంతే స్ట్రాంగ్ స్టోరీ!

        ఈ పాత్ర చిత్రణతో  తెరమీద మహానటుడు ఎన్టీఆర్ ప్రేక్షకులకి ఊపిరి సలపనీయడు. తెరవెనుక సూత్రధారి దాసరి కూడా కళ్ళు తిప్పుకోనివ్వడు.

        తెలుగు ప్రజల సాంస్కృతిక, రాజకీయ భావజాలాల మీద ‘బొబ్బిలిపులి’ ది చెరగని ముద్ర!


- సికిందర్
(2009- ‘సాక్షి’)
http://www.cinemabazaar.in/

       

        

28, ఫిబ్రవరి 2016, ఆదివారం



రచన – దర్శకత్వం : చునియా

తారాగణం : కార్తీక్ రాజు, నిత్యా శెట్టి, జహీదా, అలీ, విశ్వ, రాశి, కృష్ణుడు, నరేష్, అనితా
చౌదరి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయా గ్రహణం : కన్నా కూనపరెడ్డి
బ్యానర్ : అయాన్ క్రియేషన్స్,   నిర్మాత : ఆయాన్ క్రియేషన్స్ 
విడుదల : 26 ఫిబ్రవరి, 2016
***
రో దర్శకురాలు చునియా అలియాస్ సాహెబా తెలుగుకి పరిచయమవుతోంది. కె.  రాఘవేంద్రరావు శిష్యురాలిగా, నాగార్జున సంస్థ సీరియల్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవంతో, సినిమా దర్శకత్వ అవకాశాన్ని సంపాదించుకుంది. మేకింగ్ లో ఉన్నప్పడు ఆమె ప్రతిభా పాటవాల గురించి పాజిటివ్ విషయాలు చాలా వినవచ్చాయి. మరి ‘పడేసావే’  అన్న టైటిల్ తో ప్రేమ సినిమాని అందిస్తూ, ప్రేక్షకుల మధ్య కొచ్చినప్పుడు ఆ పాజిటివ్ విషయాలు ఎలావున్నాయో చూద్దాం.

కథ
       కార్తీక్ (కార్తీక్ రాజు), నిహారిక (నిత్యా శెట్టి) లు చిన్ననాటి స్నేహితులు.  పెద్దయ్యాక కార్తీక్ నిహారికని ఫ్రెండ్ లాగానే చూస్తాడు. ఆమె ప్రేమిస్తున్నాడనుకుంటుంది. ఒకరోజు తన ఫ్రెండ్ స్వాతి ( జహీదా) ని కార్తీక్ కి పరిచయం చేస్తుంది. ఆమెని చూసి వెంటనే ప్రేమలో పడతాడు కార్తీక్. అప్పటికే ఆమెకి ఎంగేజ్ మెంట్ జరిగి వుంటుంది. అయినా ఆమె కార్తీక్ మీద  ప్రేమని పెంచుకుంటుంది. ఇది తెలుసుకున్న నిహారిక హర్ట్ అవుతుంది. నిహారిక కూడా కార్తీక్ ని ప్రేమిస్తోందని స్వాతికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్యా  సమస్య ఎలా పరిష్కారమయిందనేది  మిగతా కథ.

ఎలా వుంది కథ
       ఈ ముక్కోణ ప్రేమ కథ ట్రెండ్ లో లేకపోవడం మొదటి డ్రా బ్యాక్. ఆతర్వాత దీన్ని చెప్పిన విధానం రెండో మైనస్. ఓ పదేళ్ళ క్రితం ఈ కథ ప్రేక్షకులకి నచ్చేదేమో. ఇప్పుడు కాలాతీతమై పోయింది. ఇప్పుడున్న మార్కెట్లో ఇలాటి కాలం చెల్లిన కథకి స్థానం లేదు. ప్రేమ కథలు చాలా ముందుకెళ్ళి పోయాయి. 

ఎవరెలా చేశారు
       
హీరోగా నటించిన కార్తీక్ రాజుకి ఇది రెండో సినిమా. ‘టిప్పు’ అనే మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ఆదరణా గుర్తింపూ పొందలేకపోయాడు. ఇదే ఇప్పుడు రిపీటయ్యింది. ముందుగా ఈ పోటీ రంగంలో తను నటనని సాన బెట్టుకోవాల్సి వుంటుంది. తనని మించిన కొత్త హీరోలు వస్తున్నారు. నటన ఎలా వున్నా ఈ సినిమా దాని బలహీనతల  వల్ల తనకే విధంగానూ ఉపయోగపడే అవకాశం లేదు. హీరోయిన్ లిద్దరూ  ఈ సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేకపోయారు. కారణం,  కథా కథనాలకి తోడు వాళ్ళ పాత్రల తీరుతెన్నులే. ఇప్పటి అమ్మాయిలూ ఈ పాత్రల్లాగా వుండరని వాళ్ళకీ తెలిసివుంటుంది. పాత ఫార్ములా  హీరో పాత్రలాగే ఈ నాటి యూత్ కి ప్రతినిధులు అన్పించుకునే ఛాయలు ఎక్కడా ఈ హీరోయిన్లు ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది.
         ఇక ఒకనాటి హీరోయిన్ రాశి ఇందులో తల్లి పాత్ర పోషించింది. అలీ, వెన్నెల కిషోర్ లు కామెడీ కోసం వున్నారు గానీ అదీ విఫలమయ్యింది. కన్నా కూనపరెడ్డి ఛాయాగ్రహణం, అనూప్ రూబెన్స్ పాటలు ఫర్వాలేదనిపించుకున్నా, ఇవొక్కటే సినిమాని నిలబెట్టలేవు. 

చివరికేమిటి?
       
తెలుగులో దర్శకురాళ్ళు రావడం చాలా అరుదు. అలాటిది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలయినంత జెండర్ ప్రధానమైన ప్రత్యేకతని ముందు చాటుకోవడం తెలియాలి. అందరు మగాళ్ళ లాగే తనూ సినిమా తీస్తే జెండర్ ప్రత్యేకత కాదుకదా ఏ  ప్రత్యేకతా వుండదు. సబ్జెక్టుని ఒక స్త్రీగా తాను  చూసే కోణం ఎలావుంటుందో ప్రేక్షకులకి పరిచయం చేసినప్పుడే తేడా తెలుస్తుంది. మేల్ డైరెక్టర్లు సినిమా అంటే, పాత్రలూ అంటే రొటీన్ గా వాళ్ళ దృక్కోణం లోంచి ఇలా చూపిస్తున్నారు, నేను వీళ్ళని ఫాలో అవకుండా ఒక ఫిమేల్ డైరెక్టర్ గా భిన్నత్వంతో నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు దర్శకురాలు నాల్గు కాలాలు గుర్తుండే సినిమాలు తీయగల్గుతుంది. మరీ దీపా మెహతానో, మీరా నాయరో కానవసరం లేదుగానీ, దర్శకురాలిగా తన కమర్షియల్ విజన్ ని తను రూపొందించుకుంటే చాలు. లేకపోతే తనకీ శ్రమ వృధా, నిర్మాతలకీ పెట్టుబడి వృధా.

        ఇవ్వాళ్ళ మార్కెట్ కి కావాల్సింది ఇలాటి ప్రేమలు కాదు- ప్రేమల పేరుతో  యూత్ పాల్పడే క్రేజీ చేష్టలు. కథ కంటే కథన కుతూహలమున్న వర్కౌట్లు. బాలీవుడ్ లో ఇది చేస్తున్నారు, టాలీవుడ్ లో పదేపదే పాత  ప్రేమలు పట్టుకుని మార్కెట్ లో అపహాస్యం పాలవుతున్నారు.

-సికిందర్






27, ఫిబ్రవరి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!


దర్శకత్వం : రవికాంత్ పారెపు
తారాగణం : అడవి శేష, అదా శర్మ, అనసూయ, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, రవి వర్మ, సత్యదేవ్ తదితరులు
కథ : అడివి శేష్,  స్క్రీన్ ప్లే : అడివి శేష్- రవికాంత్ పారెపు, డైలాగ్స్- స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి,  సంగీతం : శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం : షానీల్ దేవ్
బ్యానర్ : పివిపి సినిమా- మాటనీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : పరమ్  వి. పొట్లూరి, కెవిన్ ఏన్
విడుదల :26 ఫిబ్రవరి 2016
***
        సృజనాత్మకంగా తెలుగు సినిమాకి  శిఖరాగ్ర తలాల్ని తాకే సృష్టి ఇక అసాధ్యమేమో అనుకుంటున్న నాటు దర్శకత్వాల కాలంలో, కొత్తగా పాతికేళ్ళ యువదర్శకుడు అత్యంత పరిణతితో, దృశ్యమాధ్యమం మీద సంపూర్ణావగాహనతో, పట్టుతో, ప్రావీణ్యంతో, తన పనితనాన్ని తెలుగులో అరుదైపోయిన క్వాలిటీ సినిమా స్థాయికి చేర్చి ‘క్షణం’ ని సార్ధకం చేశాడు. సినిమా కళని కాలాన్ని బట్టి ఏమాత్రం సానబట్టకుండా అరిగిపోయిన దర్శకత్వాలతో అవే రకం నాసి సినిమాలు తీసే వాళ్లకి మార్కెట్లో సవాలు  విసిరాడు. సాధారణంగా  మార్కెట్లో ఓ కొత్త తరహా ఉత్పత్తి వచ్చిందంటే మిగతా ఉత్పత్తి దారులు అప్రమత్తమై దాంతో పోటీ పడే మరో కొత్త ఉత్పత్తి తో మార్కెట్లోకి వస్తారు. ఇది సినిమా ఫీల్డుకు వర్తించదనుకుంటారు. కొత్త మేకింగ్ తో ఓ సినిమా వచ్చిందని ఎంత ప్రచారం జరిగినా, వెళ్లి చూడమని ఎందరు చెప్పినా దర్శకులయ్యే వాళ్ళు, దర్శకులైన వాళ్ళూ అటువైపు కన్నెత్తి చూడరు. పోటీతత్వం ఇలా పడకేయడం మరే రంగంలో చూడం. మేకింగ్ పరంగా ‘క్షణం’ అనే కళాసృష్టి విసురుతున్న కొత్త సవాళ్లు ఎవరికీ పట్టడం లేదు. నాటు దర్శకత్వాల్లోనే వాళ్లకి స్వర్గసుఖాలున్నట్టున్నాయి.

      కొత్త దర్శకుడు రవికాంత్ పారెపు మొదటి ప్రయత్నంగా ఒక థ్రిల్లర్ ని, అందునా చాలా సంక్లిష్ట కథా సంవిధానంతో కూడిన ప్రయత్నానికి సాహసించాడు. ఇందులో పూర్తి విజయం సాధించాడు. అయితే పూర్తి క్రెడిట్ తానొక్కడికే దక్కదు, రైటింగ్ సైడ్ అడివి శేష్ కీ,  అబ్బూరి రవికీ కూడా కలిపి దక్కుతుంది. ఏదైనా ముందు క్వాలిటీ రైటింగ్ వల్లే సాధ్యమవుతుందని నిరూపించారు ఈ ముగ్గురూ.

        ‘క్షణం’ ఒక కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుత విజువల్ కాన్వాస్ తో, మనసు మరల్చుకోనివ్వని ఉర్రూతలూగించే విషయ వ్యక్తీకరణతో, ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ జాతి లక్షణాల్ని ప్రదర్శించుకుంటుంది. కల్తీ లేని దీని జాతి లక్షణమే దీని విజయరహస్యం. ఇప్పుడున్న సోకాల్డ్ సృష్టి కర్తలు ఈ విజయరహస్యాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు, పట్టుకోవాలన్న ఆసక్తి వుంటే కదా! 

        థ్రిల్లర్ అనగానే ‘ఒక వస్తువు కోసం కొంతమంది వెంటాడే’  ఈజీగా వుండే రోడ్ మూవీస్ గానే ఉంటున్న వైనం ఇటీవల ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ తో  కూడా మళ్ళీ చూశాక,  ఈ మూసని  బ్రేక్ చేస్తూ వచ్చిన ‘క్షణం’ ఏం చెబుతోందో ఒకసారి చూద్దాం...


కథ
       అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఉంటున్న ( రిషి) కి ఇండియానుంచి మాజీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. నాల్గేళ్ళ క్రితం వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన శ్వేత ( అదా శర్మ) పిలుపుకి కారణమేంటో తెలుసుకోవడానికి ఇండియా వస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్న శ్వేత తన నాల్గేళ్ళ  కూతురు రెండు నెలల నుంచీ  కన్పించకుండా పోయిందనీ, ఎవరూ- ఆఖరికి పోలీసులు కూడా కనుక్కోలేక పోతున్నారనీ వాపోతుంది. రిషి రంగం లోకి దిగుతాడు. అంతటా తికమక పెట్టే సమాచారమే వస్తూంటుంది అతడికి... ఎవర్నడిగినా,  పోలీసులు సహా,  లేని కూతుర్ని ఎలా వెతికి పెట్టమంటారని ప్రశ్నిస్తారు. పోలీసులు కేసు క్లోజ్  చేశామంటారు. రిషి కి ఎవర్ని నమ్మాలో అర్ధం గాదు. శ్వేత అబద్ధం చేప్తోందా తనకి కూతురుందనీ?. డ్రగ్స్ బానిసైన శ్వేత మరిది బాబీ (రవివర్మ) మీద కన్నేస్తాడు. ఆఫ్రికన్లతో కుమ్మక్కై వున్న అతడి డ్రగ్ రాకెట్ ని చూసి  శ్వేత కూతుర్ని ఇతనే  కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానిస్తాడు. పిక్చర్లోకి ఈ డ్రగ్ రింగ్ తో సంబంధమున్న బాబూ ఖాన్ ( వెన్నెల కిషోర్) వస్తాడు. ఇంకెవరెవరో వస్తారు.  ఆ పిల్ల తన కూతురేనని  ఇంకొకడొస్తాడు ... అసలేం జరిగి వుంటుంది? శ్వేత మానసిక స్థితిని అనుమానిస్తాడు. ఒకటొకటే అమ్మాయి అదృశ్య రహస్యాన్ని ఛేదిస్తూ పోతాడు...ఒకటొకటే నమ్మలేని నిజాలు బయటపడుతూంటాయి...ఒకటి తవ్వితే ఇంకోటి.. ఆఖరికి తెలుసుకున్న కూతురి రహస్యం ఎదురుతిరిగి తనకే కొట్టడంతో షా కవుతాడు. తన గురించి తనకే తెలీని నిజం బయట పడి అవాక్కవుతాడు...

ఎలావుంది కథ : 
       
హెన్రీ కథల్లోలాగా కొసమెరుపు వున్న షాకింగ్ కథ. కూతురు వుందా లేదా - అసలుందా లేదా -  అన్న సెంట్రల్ పాయింటుతో ప్రేక్షకుల్ని ఆద్యంతం లాక్కెళ్ళే  సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ ఒక కొత్త అనుభూతినిచ్చే విధంగా వుంది చాలా కాలం తర్వాత. అయితే చివర్లో సస్పెన్స్ వీడిపోయాక ఒక నైతిక సంబంధమైన ప్రశ్న ఈ కథ పట్ల గౌరవాన్ని కొంచెం తగ్గిస్తుంది. పుట్టిన కూతురు వేరొకడి రక్తమన్న విషయం దాచి పెట్టి భర్తతో కాపురం చేయడం హీరోయిన్ పాత్రకి తగదు అన్పించేలా వుంటుంది. ఇదేదో విదేశీ కథైతే  అక్కడ ఓకే అనుకోవచ్చు, ఇక్కడ  కాదు. ఎంత  ఈ రహస్యం తెలిసేటప్పటికి సినిమా ముగింపుకొచ్చినా – హీరోయిన్ అనైతికత మనల్ని వెంటాడుతూనే వుంటుంది.

ఎవరెలా చేశారు
         
అందరూ చాలా బాగా చేశారు, నటీనటుల కాడ్నించీ టెక్నీషియన్స్ వరకూ. అడివి శేష్ ఒక హీరోలా హీరోయిజం ప్రదర్శించకుండా, ఓ సామాన్యుడిలా సహజ నటన కనబర్చాడు. ఇంతవరకూ చేసిన సినిమాలు ఒకెత్తు- ఇదొక్కటీ ఒకెత్తు. అతను కేవలం హీరో పాత్రలే వేయకుండా కొన్ని సినిమాల్లో  హీరోయేతర పాత్రలు కూడా వేస్తూ ఇమేజి చట్రాలకి దూరంగా ఉంటున్నాడు. ‘దొంగాట’ లో బుద్ధి తెచ్చుకునే నెగెటివ్ పాత్ర వేశాక, ఇప్పడు బుద్ధి నేర్చుకునే మాజీ బాయ్ ఫ్రెండ్ పాత్ర వేశాడు. తను వున్న ప్రతీ సీనూ ఏ బిల్డప్పులూ లేకుండానే వేడి పుట్టించాడు. అతడి గ్లామరస్ రూపం ఈ పాత్రకి  చాలా ప్లస్ అయింది. 

        హీరోయిన్ అదా శర్మ ఈ సారి మసాలా సినిమాలకి దూరంగా ఒక  విషయమున్న, నటిగా తనకి పని వున్న పాత్ర నటించింది. అసలు పిల్ల ఉందా లేదా, తనని నమ్మాలా వద్దా, తను సైకోనా కాదా అన్న షేడ్స్ అన్నిటినీ అలవోకగా ప్రదర్శిస్తూ ఎమోషనల్ డ్రామాని బాగా రక్తి కట్టించింది. 

        కమెడియన్ సత్యం రాజేష్ పోలీసు అధికారి పాత్రలో తను చౌదరి అయి, కానిస్టేబుల్ ని రెడ్డీ అని పిలుస్తూ కమ్మా రెడ్ల కనిపించని సెటైరికల్ ప్లేని సైడ్లో ప్రదర్శించుకుంటూ పోయాడు. ఇది కాదు  పాయింటు - చాలా సర్ప్రైజింగ్ గా, నిజమైన  బంజారా హిల్స్ పోలీసు వాడిలా ఖతర్నాక్ లుక్ తో, పర్వెర్టెడ్ డైలాగ్స్ తో, ప్రతీచోటా హైలైట్ అవుతూ పోయాడు. అతడికి అవార్డు రావొచ్చు. 

        ఇంకో సర్ప్రైజ్  గిఫ్ట్, ఎసిపి జయగా నటించిన అనసూయ. ప్రతీ పాత్ర వెనకాలా కొంత చీకటి చరిత్ర ఉన్నట్టే, తన నంగనాచి పాత్రని కూడా  టెర్రిఫిక్ గా పోషించు కెళ్ళింది తన క్లాస్ నటనతో.

        ఇక వెన్నెల కిషోర్ బాబూఖాన్ పాత్రలో ఓ షేర్ ఖాన్ త్యాగమొకటి చేస్తూ పాత్రని ఎక్కడికో తీసికెళ్ళాడు. ఇది కూడా కామెడీ పాత్ర కాదు. సత్యం రాజేష్, ఇతనూ ఇక్కడ కామెడీ పాత్రలు కావు. వెన్నెల కిషోర్ ఇహ కామెడీ మానేసి ఇలాటి సెన్స్ వున్న క్యారక్టర్లు వేస్తే ప్రేక్షకుల ఆదరణ ఇంకా బాగా పొందగలడు.

        ఈ సినిమాలో ఆఫ్రికన్ నటులు కూడా ఫెంటాస్టిక్ గా వున్నారు. ఇక డ్రగ్ బానిసగా రవివర్మ డ్రగ్ బానిసలకే గురువు అన్నట్టుగా వున్నాడు. హీరోయిన్ భర్తగా నటించిన సత్యదేవ్ కూడా పైకి కన్పించని శాడిస్టుగా మెత్త మెత్తగా తనవంతు కార్యక్రమం నిర్వహించాడు. ఈ సినిమాలో అందరూ పైకి పవిత్రులే, వెనకాల మాత్రం గోతులే. అయితే కూతురి పాత్రలో అమ్మాయి సెలక్షన్ కుదర్లేదు. చూస్తే ఆమెకి తల్లి పాత్ర అదాశర్మ రంగూ పోలికలూ లేవు, తండ్రి పాత్ర సత్యదేవ్ కి మ్యాచ్ అయ్యే రంగూ పోలికలతో వుంది. కానీ తండ్రి ఈ పాత్ర కానప్పుడు- అసలు తండ్రెవరో ఆ  రూపురేఖలకి దగ్గరగా ఆమె వుండాలేమో...?

        తక్కువ బడ్జెట్ తోనే టెక్నికల్ గా ఈ మూవీ చాలా సాధించింది. దీని విజువల్ కాన్వాస్, డ్రమ్స్ ప్రధానంగా మ్యూజికల్ ట్రాక్,  తెలుగు సినిమాకి ఒక కొత్త జన్మ ప్రసాదించి నట్టున్నాయి. నిజంగానే నిన్న తెలుగు సినిమా పునర్జన్మెత్తింది. కెమెరామాన్ షానీల్ దేవ్ ఈ విజువల్ వండర్ కి చాలా పెద్ద ఎస్సెట్. శ్రీ చరణ్ పాకాల కూడా డ్రమ్స్ తో, అతి కొద్ది ఇన్ స్ట్రుమెంట్స్ తో- సినిమా ఆద్యంతం కథాకథనాలకి తోడ్పడే ఒక థీమ్ ట్రాక్ ని క్రియేట్ చేశాడు. రొడ్డ కొట్టుడు బ్యాక్ గౌండ్ మ్యూజిక్ కాలుష్యం నుంచి విముక్తి కల్గించాడు. లోకేషన్స్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, ఫైట్స్,  యాక్షన్ దృశ్యాలు కూడా ఉన్నతంగా వున్నాయి.

        ఈ కథని అడివి శేష్ ఇస్తే, అడివి శేష్ తో  దర్శకుడు రవికాంత్ కలిసి స్క్రీన్ ప్లే చేశారు. అబ్బూరి రవి మాటలు రాసి స్క్రిప్టు గైడెన్స్ ఇచ్చారు. ఇదంతా ముగ్గురు విద్యార్ధులు శ్రద్ధగా చదువుకుని  పరీక్ష రాసినట్టుంది. పకడ్బందీ కథా కథనాలు, పకడ్బందీ పాత్రచిత్రణలు, పకడ్బందీ సంభాషణలు ఇందుకే సాధ్యమయ్యాయి. కమర్షియల్ సినిమాని బిల్డప్పుల హీరోతనాలూ, పాటలూ స్టెప్పులూ, లవ్వులూ కామెడీలూ, ఇంకేవో  సెంటిమెంట్లూ సున్నాలూ పూసుకోకుండా కూడా తీయవచ్చని (రాయవచ్చని)  ఓ గైడ్ లా తయారుచేసి పెట్టారు దీన్ని. 

        చిన్నవయసులో దర్శకుడుగా రవికాంత్ తను కొత్తవాడనే ఛాయలు ఎక్కడా కన్పించకుండా- చాలా మెచ్యూరిటీతో దర్శకత్వం వహించాడు. చివర్లో నైతికతకి తిలోదకాలివ్వడం తప్పితే, ఇంకే తప్పులూ దొర్లకుండా చేసిన ఈ తొలిప్రయత్నం థ్రిల్లర్స్ జాతిలో ఒక కళా సృష్టిగా నిలిచిపోతుంది. ప్రేమ కథని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో అవసరమున్నప్పుడల్లా రివీల్ చేస్తూపోయిన క్రియేటివిటీ - సమయస్ఫూర్తి - సబ్జెక్ట్ మీదున్న కమాండ్ ని తెలియజేస్తుంది. 

        ఒక సినిమా తీయాలంటే ఇంత వుంటుందా అని పునరాలోచనలో పడెయ్యకపోతే, ఎవడుపడితే వాడొచ్చి  రొడ్డ కొట్టుడు సినిమాలు తీసేసి పోతాడు. ఈ ‘క్షణం’ చూసి ఒక్క క్షణం ప్రేక్షకులు కూడా ఇలా నిజమైన క్వాలిటీ సినిమాలు చూసే అవకాశమివ్వకుండా, ఎందుకు  రాచిరంపాన పెడుతున్నారో ఆలోచించాలి.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు : సోమవారం)