రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

బడ్జెట్ మూవీ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
బడ్జెట్ మూవీ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

5, మార్చి 2024, మంగళవారం

1409 : రివ్యూ

 

రచన –దర్శకత్వం : శక్తి ప్రతాప్ సింగ్
తారాగణం : వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్, సంపత్ రాజ్ షతాఫ్ ఫిగర్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం తదితరులు
సంగీతం : విక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : హరి కె వేదాంతం
నిర్మాణం : సోనీ పిక్చర్స్, సందీప్ ఎం.
విడుదల ; మార్చి 1, 2024
***
        రుణ్ తేజ్ నటించిన ఘని’, గాండీవధారి అర్జున అనే  గత రెండు సినిమాలూ ఫ్లాపయిన తర్వాత, ఇంకో యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడు. తెలుగులో వైమానిక దళ కథతో తొలి సినిమాగా తీసిన దీనికి ఫుల్వామా దాడి- ప్రతీకార దాడుల ఉదంతం ఆధారం. జనవరి 25నే ఇదే ఉదంతం మీద హిందీలో ఫైటర్ వచ్చింది. ఇలా ఒకే కథతో వెంటవెంటనే రెండు సినిమాలు రావడంతో ఏది బెటర్ అన్న ప్రశ్న వస్తుంది. అదేమిటో చూద్దాం...

కథ

వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్), భార్య రాడార్ అహనా గిల్ (మానుషీ చిల్లర్) ఆపరేషన్ వజ్ర పేరుతో టెస్ట్ ప్రాజెక్ట్ చేపడతారు. 20 మీటర్ల తక్కువ ఎత్తులో ఫైటర్ జెట్స్ నడిపితే శత్రువుల రాడార్స్ కి చిక్కకుండా పైలట్స్ ప్రాణాలు కాపాడుకోవచ్చనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే ఈ టెస్టులో స్నేహితుడు (కబీర్) నవదీప్ చనిపోవడంతో అహనా అర్జున్ తో విభేదించి దూరంగా వుంటుంది. ఫ్రెండ్ మృతికి కారకుడైనందుకు అర్జున్ బాధలో వుండగా, ఫుల్వామాలో సైనికుల మీద ఉగ్రవాద దాడి జరిగి 40 మంది సైనికులు చనిపోతారు. దీంతో ఫ్రెండ్ మృతికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం అర్జున్ కి లభిస్తుంది. ఫుల్వామా దాడికి ప్రతీకారంగా వైమానిక దళం పాక్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రతీకార దాడిలో పాల్గొన్న అర్జున్ ఎలా విజయం సాధించాదనేది మిగతా కథ.

ఎలావుంది కథ

2019 ఫుల్వామా ఘటనకి ముందు 2016 లో యురీలో సైనిక స్థావరం మీద జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా యురీ - ది సర్జికల్ స్ట్రైక్  అనే సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ - యామీ గౌతమ్ నటించారు. ఇది 2019 జనవరి 11 న విడుదలైంది. వెంటనే ఫిబ్రవరి 14 న ఫుల్వామా దాడి జరిగింది. దీంతో ఈ సినిమాకి విపరీత ఆదరణ లభించింది. 44 కోట్ల బడ్జెట్ కి 342 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఈ మూవీ బలమైన కథతో, బలమైన చిత్రీకరణతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇందులో “హౌ ఈజ్ ది జోష్?” “హై సర్!” అన్న డైలాగు బాగా వైరల్ అయింది.
         

దీని తర్వాత 2024 జనవరి 25 న ఫుల్వామా దాడి మీద హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ విడుదలైంది. ఇందులో బలమైన కథా కథనాలు లేక యావరేజీగా ఆడింది. ఇప్పుడు మళ్ళీ ఫుల్వామా మీద ఆపరేషన్ వాలంటైన్ వచ్చింది. ఇది కూడా బలమైన కథా కథనాల లోటుని ప్రదర్శించింది. కారణం, ఫుల్వామా కథకి ముందు ఏర్ ఫోర్సు జరిపే ఆపరేషన్ వజ్ర అనే టెస్టు, ఫుల్వామా కథ తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్ జరిపే ఆపరేషన్ నెహ్రూ పేర దాడి... ఇలా ఫుల్వమాకి ముందు ఒక కల్పిత కథ, తర్వాత ఇంకో కల్పిత కథ అతికించడంతో మధ్యలో ఫుల్వామా కథ బలి అయింది. ప్రేక్షకులు ఏ కథ ఫీలవ్వాలో అర్ధం కాని పదార్ధంగా తయారైంది. పూర్తి నిడివి ఫుల్వామా మీద వుండాల్సిన కథ లేకపోవడంతో భావోద్వేగాలు, డ్రామా, సంఘర్షణ అనే బాక్సాఫీసు ఎలిమెంట్లు  అదృశ్యమైపోయాయి. కేవలం యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమా చూడాలంతే.
          
ఫస్టాఫ్ ఆపరేషన్ వజ్ర టెస్టు తో, వరుణ్ తేజ్ -మానుషీ చిల్లర్ ఫ్లాష్ బ్యాక్స్ తో, ఇంకా బోలెడు ఏర్ ఫోర్స్ హడావిడితో సాగుతుంది. ఇదంతా ఏమిటో అర్ధం గాకుండానే ఇంటర్వెల్ ముందువరకూ సాగుతుంది. అప్పుడు ఫుల్వామా  మీద దాడి జరగడంతో అసలు కథలో కొస్తుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఏర్ ఫోర్స్ బాలకోట్ స్ట్రైక్ ప్లాన్ చేయడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
        
సెకండాఫ్ లో బాలకోట్ ఉగ్ర స్థావరాల మీద విజయవంతమైన దాడితో ఆ ఆపరేషన్ ముగుస్తుంది. దీంతో కథ అయిపోయినట్టే. కానీ దీనికి ప్రతీకారంగా మళ్ళీ పాక్ ఎదురుదాడి అనే కల్పిత కథతో పొడిగించారు. మళ్ళీ దీన్ని ఏర్ ఫోర్స్ తీపికొట్టిన విధానంతో ముగించారు.     
       
ఇలా కథ మూడు ముక్కలుగా వుండడంతో సినిమాని నిలబెట్టే భావోద్వేగాలు అనే ముఖ్యమైన ఎలిమెంట్ మిస్సయ్యింది. దీంతో విషయపరంగా
, పాత్రల పరంగా డొల్లగా, యాక్షన్ పరంగా జోరుగా తయారయ్యింది. ఇలా ఆపరేషన్ వాలంటైన్’, ఫైటర్ రెండూ ఒకటే అయ్యాయి.

నటనలు – సాంకేతికాలు

 కంచె అనే వార్ మూవీ తర్వాత వరుణ్ తేజ్ మరో సారి యుద్ధ వీరుడి పాత్రలో పర్ఫెక్ట్ గా కనిపిస్తాడు. ఇలాటి పాత్రలు అతడికి కొట్టిన పిండే అన్నట్టు వుంది. కాకపోతే కంచె లోలాంటి బలమైన పాత్రచిత్రణ కొరవడింది మూడు ముక్కల కథ వల్ల. ఇంకోటేమిటంటే హీరోయిన్ మానుషీ చిల్లర్ తో కెమిస్ట్రీ, సంఘర్షణ, ఫీల్ వంటివి ఏవీ లేకపోవడం. ఫ్రెండ్ మృతికి బాధ కూడా బలంగా లేకపోవడం. కేవలం లుక్స్ కి, యాక్షన్ కి ఒక మోడల్ గా కనిపించడం వరకూ చేశాడు వరుణ్ తేజ్. క్లయిమాక్స్ లో కాస్త దేశభక్తి ఎలిమెంట్ పోషించాడు.

        మానుషీ చిల్లర్ డిటో. ఈమెతో బాటు ఇతర పాత్రధారులకీ సరైన పాత్రచిత్రణలు లేవు. ఫస్టాఫ్ లో తీసుకున్న సమయమంతా పాత్రచిత్రణల్ని స్థాపించడానికి తీసుకున్నా బావుండేది. ఫైటర్ లో ఈ ప్రయత్నమే చేశారు- ఇంటర్వెల్ కి ముందు ఫుల్వామా దాడి జరిగే వరకూ. ఆ తర్వాత ఆ పాత్రచిత్రణలు ఎటు పోయాయనేది వేరే సంగతి.

        మిక్కీ జె మేయర్ సంగీతం ఓ మాదిరిగా వుంది. నిజానికి ఫుల్వామా లాంటి విషాద సంఘటన చుట్టూ కథకి  వెంటాడే సంగీతం వుండాలి. కానీ ఫుల్వామా కథ మధ్యలో ఓ ముక్క కాబట్టి సినిమా సాంతం ఒక వెంటాడే సంగీతానికి స్కోప్ లేకుండా పోయింది.

        హరి కె వేదాంతం కెమెరా వర్క్ మాత్రం ఉన్నతంగా వుంది. అలాగే ఏరియల్ యాక్షన్ దృశ్యాల విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ కి తగ్గట్టు వున్నాయి. ఈ విషయంలో ఫైటర్ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే గగనతలంలో జెట్ ఫైటర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉత్కంఠ భరితంగా వుంది. ఈ సినిమాలో కథా కథనాల కన్నా, పాత్రచిత్రణల కన్నా యాక్షన్ దృశ్యాలే హైలైట్.

        ఇలాటి హై కాన్సెప్ట్ సినిమాలకి ముఖ్యంగా కావాల్సింది భారతీయాత్మ. షోలే’, గదర్ వంటి యాక్షన్ సినిమాల్లో భారతీయాత్మని దండిగా సమకూర్చి పెట్టడం వల్లే మళ్ళీ మళ్ళీ విరగబడి చూశారు ప్రేక్షకులు. యుద్ధ సినిమాలో ఇదింకా చాలా ముఖ్యం. జేపీ దత్తా బోర్డర్ పెద్ద ఉదాహరణ. ఇలాటి సినిమాలు చూసి, తెలుసుకుని తీస్తే ఆపరేషన్ వాలంటైన్ లాంటివి రిపీట్ ఆడియెన్స్ తో నాలుగు రోజులు ఎక్కువ ఆడుతాయి.
—సికిందర్

28, నవంబర్ 2023, మంగళవారం

1386 : బాక్సాఫీసు సమాచారం


వంబర్ లో  స్మాల్, మీడియం రేంజి సినిమాలకి పూర్తి ఓపెన్ మార్కెట్ లభించింది. నవంబర్ లో ఒకే ఒక్క పెద్ద సినిమా విడుదల కావడంతో ఈ అరుదైన అవకాశం లభించింది స్మాల్, మీడియం రేంజి మూవీస్ కి. ఆ పెద్ద సినిమా నవంబర్ చివరి వారంలో విడుదలైన ఆది కేశవ. విడుదలైన 20 స్మాల్, మీడియం రేంజి సినిమాల్లో 16 స్మాల్ కాగా, 4 మీడియం. కొత్త వాళ్ళతో 16 స్మాల్ సినిమాలన్నీ సహజంగానే ఫ్లాపయ్యాయి. ఇవి ఫ్లాప్ అని స్క్రిప్టుకి శ్రీకారం చుట్టినప్పుడే తెలిసిపోతుంది. ప్రతీనెలా ఇవి చాలా కమిట్ మెంటుతో ఫ్లాపవ్వాలని ప్రయత్నిస్తూంటాయి. 4 మీడియం రేంజిలో ఒకటి హిట్టవుతూ అవుతూ ఆగిపోయింది. మిగిలిన 3 హిట్టయ్యాయి. ఇక ఒకే ఒక్క పెద్ద సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. అది విష్ణు తేజ్ తో సితారా ఎంటర్ టైంమెంట్స్ నిర్మించిన ఆది కేశవ. ఇది దారితప్పి 2023 లో వచ్చింది. అలాగే ఫ్లాపయిన మీడియం మూవీ మంగళవారం’. హిట్టయిన మీడియం సినిమాలు కీడా కోలా’, మా ఊరి పొలిమేర 2’, కోట బొమ్మాళి పి ఎస్- నవంబర్ లో హిట్టయినవి ఈ మూడు మీడియం రేంజి సినిమాలే. ఎందుకు హిట్టయ్యాయి?

       
 కీడా కోలా తొలి తెలంగాణా గ్యాంగ్ స్టర్ సినిమా. కొంత కాలం క్రితం భారీ స్థాయిలో తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమా తెలపెట్టాడు ఓ తెలంగాణ సినిమా తీసిన తెలంగాణ దర్శకు డు. అది ముందుకెళ్ళలేదు. దాని స్థానంలో తొలి తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమాగా కీడాకోలా విడుదలైంది. తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించాడు. గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వస్తూంటాయి. విచిత్ర పాత్రలతో గ్యాంగ్ సినిమాగా రావడం దీని ప్రత్యేకత. విచిత్ర పాత్రలు, వింత కథనాలు. దీనికి కామెడీ జోడిస్తే ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ అయిపోయింది. ఇలా వొక ఔటాఫ్ బాక్స్ సినిమాని ఆదరించారు ప్రేక్షకులు.
        
మా ఊరి పొలిమేర 2 చేతబడి కథతో సినిమా. మా ఊరి పొలిమేర 1 ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది. దీనికి దర్శకుడు అనిల్ విశ్వనాథ్.  మసూద’, విరూపాక్ష చేతబడి సినిమాలని హిట్ చేసిన ప్రేక్షకులు దీన్నీ హిట్ చేశారు. రూరల్ థ్రిల్లర్స్ విషయానికొస్తే, చేతబడి సినిమాలు, గ్రామదేవతల సినిమాలు హిట్టవుతున్నాయి. దెయ్యాలతో హార్రర్ సినిమాలు పాతబడిపోయిన చోట ఇలాటివి సక్సెస్ అవుతున్నాయి. అంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పుడూ వర్కౌటయ్యే ఫార్ములా. కాకపోతే జానర్ మార్చాలి. ఇదే జరిగింది మా ఊరి పొలిమేర రెండు భాగాలతో.
       
కోట బొమ్మాళి పిఎస్ పోలీసు థ్రిల్లర్. పోలీసుల్ని పోలీసులు పట్టుకోవడమే కథ కావడంతో ఇదో కొత్తదనం. శ్రీకాంత్ నటించిన ఈ థ్రిల్లర్ కి దర్శకుడు తేజ మార్ని. ఈ మలయాళ రీమేక్ లో ఇంకా ఎన్నికల రాజకీయాల, కుల సంఘర్షణల కోణాలు జతపడడంతో సామాజికంగా ప్రేక్షకులకి దగ్గరగా వెళ్లింది. మూస ఫార్ములాకి భిన్నంగా ఇది రియలిస్టిక్ జానర్ కావడంతో మార్పుని కోరుకుంటున్న ప్రేక్షకులు దీన్ని హిట్ చేశారు. ఇది కూడా ఔటాఫ్ బాక్స్ సినిమానే.
        
అంటే ఒకప్పుడు అసాధారణ కథలతో ఔటాఫ్ బాక్స్ సినిమాలు తీయడానికి భయపడ్డ నిర్మాతలకి ఈ సినిమాల రిజల్టుతో ప్రేక్షకుల గ్రీన్ సిగ్నల్ లభించినట్టే. కీడా కోలా’, కోటబొమ్మాళి పిఎస్ రెండూ ఔటాఫ్ బాక్స్ సినిమాలే. ఇలా ఈ రెండు ఔటాఫ్ బాక్సులు, ఒకటి దెయ్యాలకి బదులు చేతబడి ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించి హిట్టయ్యాయి.
        
ఇక మంగళవారం. ఇది కూడా ఔటాఫ్ బాక్సే. బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాకపోతే ఓవర్ బడ్జెట్ ని అందుకోలేక ఆగిపోయింది. 7-8 కోట్లలో తీయాలిన సినిమా 12 కోట్లకి పెంచారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ట్రెండింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన ఈ మూవీ నింఫోమేనియాక్ పాత్ర కథ. ఇలాటిది తెలుగులో ఇంతవరకూ రాలేదు. దీనికి గ్రామదేవత కథ జోడించారు. కాంతారా హిట్టయినప్పట్నుంచీ గ్రామ దేవతలు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీన్ని లాజికల్ సస్పెన్సు తో క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే తీశారు. రివ్యూలు కూడా ప్రోత్సాహకరంగా వచ్చాయి. అయితే ప్రేక్షకులు మోయలేనంత ఓవర్ బడ్జెట్టయి పోయింది. ఔటాఫ్ బాక్సుకి ఇంత బడ్జెట్ అవసరం లేదని ఇది చెప్తుంది.
        
ఆదికేశవ టైటిల్ తో సహా 1990 లలో రావాల్సిన సినిమా. దర్శకుడితో సహా దారితప్పి 2023 లో వచ్చింది. వస్తే వచ్చింది, దీన్ని ఫన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా తీసినా బావుండేది. దర్శకుడు ఎన్. శ్రీకాంత్ రెడ్డి అంత శ్రమ తీసుకోదల్చుకోలేదు. కొత్త స్టార్ వైష్ణవ్ తేజ్, డాన్సింగ్ స్టార్ శ్రీలీలలు వుండగా పాత సీమ ఫ్యాక్షన్ కథకే కొత్త శోభ వచ్చేస్తుందనుకుని చుట్టి పారేశాడు. ప్రేక్షకుల్ని తేలిగ్గా తీసుకుని ఇలాటి పాత మూస సినిమాలు తీస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఈ సినిమా తీర్పు చెప్పింది. ఈ పెద్ద సినిమా టీజర్ చూసే ప్రేక్షకులు పసిగట్టేసి కామెంట్లు పెట్టారు. ఈ భారీ ఫ్లాపు అగ్ర నిర్మాతల రాంగ్ ప్రొడక్షన్.
—సికిందర్
       

 

 

 

22, నవంబర్ 2023, బుధవారం

1382 : r


 

దర్శకత్వం : రాబీ వర్గీస్ రాజ్
తారాగణం : మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, కిషోర్, విజయరాఘవన్ తదితరులు
రచన : రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీ; సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం : మహమ్మద్ రహీల్
బ్యానర్ : మమ్ముట్టి కంపెనీ, నిర్మాత : మమ్ముట్టి
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఓటీటీ)
***
        లయాళంలో సెప్టెంబర్ లో విడుదలైన సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్  థియేట్రికల్ రన్‌ ముగించకముందే  రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సెప్టెంబర్ 28160 స్క్రీన్‌లలో విడుదలై, మూడవ రోజుకే 330 స్క్రీన్‌లకి పైగా విస్తరించి  సూపర్ హిట్టయ్యింది. ఈ సంవత్సరం మలయాళంలో హిట్టయిన నాలుగే సినిమాల్లో ఇదొకటి. దీనికి రాబీ వర్గీస్ రాజ్ కొత్త దర్శకుడు. మమ్ముట్టి నిర్మాతగా రూపొందిన ఈ మూవీ ఇప్పుడు ఐదు భాషల్లో ఓటీటీలో విడుదలైయింది. దీని బాగోగులు చూద్దాం...

కథ

కేరళ లోని కన్నూర్ జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడానికి 'కన్నూర్ స్క్వాడ్' పేరుతో ఒక పోలీసు బృందం ఏర్పాటవుతుంది. దీనికి జార్జి మార్టిన్ (మమ్ముట్టి) నాయకత్వం వహిస్తాడు. 2015లో జరిగిన ఒక  పాత హత్య కేసుని జార్జి టీమ్ తెలివిగా ఛేదిస్తుంది. దీంతో టీంని ఎస్పీ అభినందిస్తాడు. 2017లో కాసర గోడ్ లో ఒక రాజకీయనాయకుడి హత్య జరుగుతుంది. అతడి కూతురు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరుతుంది. ఈ హంతకుల్ని 10 రోజుల్లోగా పట్టుకోవాలని ఎస్పీ చోళన్ (కిశోర్) కి పైనుంచి వొత్తిడి పెరుగుతుంది. దాంతో కేసుని కన్నూర్ స్క్వాడ్ కి అప్పగిస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే ఈ టీమ్ సభ్యుడు జయన్ (రోనీ డేవిడ్ రాజ్) లంచం తీసుకుంటూ కెమెరాకి చిక్కుతాడు. టీం నుంచి అతడ్ని తొలగించమని పైఅధికారుల నుంచి ఆదేశాలందుతాయి. తామంతా కలిసే అన్ని ఆపరేషన్స్ నీ సక్సెస్ చేస్తూ వచ్చామనీ, జయన్ బాధ్యత తాను తీసుకుంటాననీ పై అధికారుల్ని ఒప్పిస్తాడు జార్జి.
       
ఇప్పుడు లంచగొండి జయన్ ని జార్జి వెనకేసుకు రావడానికి కారణమేమిటి
? తన టీం తో 10 రోజుల్లో హంతకుల్ని పట్టుకోగలిగాడా? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఆటంకాలు, ప్రమాదాలు ఏమిటి? అసలు రాజకీయ నాయకుడి కథ ఏమిటి? ఇవి ముందు కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

కేరళలో కన్నూర్ స్క్వాడ్ ని 2008 లో అప్పటి ఎస్పీగా వున్న శ్రీజిత్ ఏర్పాటు చేశారు. కన్నూర్‌లో నేరాల సంఖ్యని అరికట్టడానికి దర్యాప్తు విభాగంగా ఈ స్క్వాడ్‌ ని ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ ఇప్పటికీ పనిచేస్తోంది. 2017 లో ఈ స్క్వాడ్ చేపట్టిన రాజకీయ నాయకుడి హత్య కేసు ఆధారంగా ఈ సినిమా కథ చేశారు.  కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఈ కథని రచయితలు రోనీ డేవిడ్ రాజ్, మహమ్మద్ షఫీలు రాయడం ప్రారంభించారు. 15 డ్రాఫ్టులు రాసి ఫైనల్ స్క్రిప్టు తయారు చేశారు. ఈ సినిమాతో దర్శకుడైన ఛాయాగ్రహకుడు రాబీ వర్గీస్ రాజ్ తండ్రి సి.టి. రాజన్, 30 ఏళ్ళ క్రితం మమ్ముట్టితో మహాయానం అనే సినిమా తీసి సర్వం కోల్పోయాడు. ఇప్పుడు అదే మమ్ముట్టి నిర్మాతగా, రాబీ వర్గీస్ రాజ్ దర్శకుడుగా మారి కన్నూర్ స్క్వాడ్  సినిమా తీసి 100 కోట్ల క్లబ్ లో చేర్చాడు. ఈ సూపర్ స్టార్ సినిమా బడ్జెట్ 30 కోట్లు మాత్రమే. తెలుగులో తీస్తే 130 కోట్లు టేబుల్ మీద పెట్టాల్సిందే.
       
ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన ఇన్వెస్టిగేషన్ ప్రధాన కథ. హంతకుల్ని పట్టుకునేందుకు ఇచ్చిన పది రోజుల గడువుతో టైమ్ లాక్ కథ. తెర మీద కౌంట్ డౌన్ రికార్డవుతూంటే ఉత్కంఠ రేపుతూ పరుగులుదీసే కథ. కనుక ఈ కౌంట్ డౌన్ కి అడ్డుపడే పాటలు
, కామెడీలు, కాలక్షేపాలు వంటి వినోదాత్మక విలువలకి దూరంగా, సీరియస్ మూడ్ లో సీరియస్ గానే సాగుతుంది ఆద్యంతం. ఈ సీరియస్ నెస్ తో బోరుకొట్టకుండా, నిజ కేసులో వున్న సదుపాయం ఈ కథకి ఉపయోగపడింది. హంతకుల కోసం ఈ కథ కన్నూర్, కాసరగోడ్, వాయనాడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పుణే, ముంబాయి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బెల్గాం, మంగళూరు, కోయంబత్తూరు మొదలైన 12 ప్రాంతాలకి ప్రయాణిస్తుంది. వేల కొద్దీ మైళ్ళు రోడ్డు మార్గానే పోలీసు వాహనంలో తిరుగుతారు. ఎందుకంటే విమాన ప్రయాణాలకి తగ్గ బడ్జెట్ పోలీసు డిపార్ట్ మెంట్ దగ్గర లేదు.
       
ఇక బుద్ధి బలంతో ఇన్వెస్టిగేషన్
, కండబలంతో యాక్షన్ పుష్కలంగా జరుగుతాయి.
 హంతకులకి సహకరించిన ఒకడ్ని పట్టుకోవడానికి మారుమూల గ్రామానికి వెళ్ళే స్క్వాడ్ మీద అక్కడి జనం తిరగబడే సన్నివేశం సినిమాకి హైలైట్.  హంతకులు సిమ్ కార్డులు మారుస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జంప్ అవుతూంటే- మొబైల్ టవర్ డంప్ నాలిసిస్ వంటి అత్యాధునిక టెక్నాలజీ నుపయోగించి ఇన్వెస్టిగేట్ చేసే వాస్తవిక చిత్రణ ఇందులో కన్పిస్తుంది. ఈ ఔటర్ స్ట్రగుల్ ఒకవైపు, తొందరపెట్టే పై అధికారులకి సమాధానం చెప్పే, క్రుంగిపోకుండా టీంకి స్ఫూర్తి నింపే, ఇన్నర్ స్ట్రగుల్ ఇంకోవైపూ పడే మమ్ముట్టి పాత్రతో కథకి జీవం కూడా వస్తుంది.
       
అయితే చాలా చోట్ల లాజిక్
, కంటిన్యూటీ లేకపోవడం, స్పీడుతగ్గి బోరుకొట్టడం వంటి లోపాలుకూడా వున్నాయి. ఈ టైమ్ లాక్ వాస్తవిక కథని వేగమే ప్రధానంగా రెండుగంటల్లో ముగించేస్తే బావుండేది. రెండున్నర గంటలు సాగింది. ఓటీటీలో నిడివి తగ్గించి వుండొచ్చు. ఇక క్లయిమాక్స్ లో మంచి ఊపు వస్తుంది.
       
ఇలాటిదే నిజ కేసుతో కథ తమిళంలో కార్తీతో
ఖాకీ గా వచ్చింది 2017లో. ఇది కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళనాడు పోలీసులు సాగించే వేట. కాకపోతే ఇది ఆన్ని కమర్షియల్ హంగులూ వున్న మసాలా యాక్షన్.

నటనలు- సాంకేతికాలు

72 ఏళ్ళ మమ్ముట్టి కూడా రజనీకాంత్, కమల్ హాసన్, బాల కృష్ణ, శివరాజ్ కుమార్, సన్నీ డియోల్ ల వంటి హిట్లిచ్చిన 60 ప్లస్ స్టార్స్  క్లబ్ లో చేరిపోయాడు. ఇక చిరంజీవి కోసం వెయిటింగ్. మమ్ముట్టి చాలా తక్కువ స్థాయి పాత్ర పోషించాడు. అతను ఎఎస్సై. ఎస్సై కూడా కాదు. అతడి టీంలో వుండేది కానిస్టేబుల్సే. అందులో ఒకడు రచయిత  రోనీ డేవిడ్ రాజ్.  మరో ఇద్దరు అజీజ్, శబరీష్ వర్మ. ఇన్వెస్టిగేషన్లో ఎదుర్కొనే సమస్యల్లో, ప్రమాదాల్లో, ఇంకా కొన్ని వ్యక్తిగత విషయాల్లో టీంకి ధైర్యాన్ని నింపి, ముందుకు నడిపించే పాత్రలో - టీం లీడర్ అంటే ఇతనే అన్పించేలా నటించాడు మమ్ముట్టి. భారీ డైలాగులు, బిల్డప్పులు లేని సహజ నటన, టీంలో ముగ్గురూ కానిస్టేబుల్స్ కి స్ఫూర్తిగా వుంటారు.
       
రాజకీయ నాయకుడి ఇంట్లో దోపిడీకి వెళ్ళి చంపి పారిపోయే హంతకులుగా అర్జున్
, ధ్రువన్ లది పాత్రలకి తగ్గ జిత్తులమారి నటన. ఇంకా హంతకుల వేటలో 12 ప్రాంతాల్లో ఎదురయ్యే పాత్రలేన్నో వుంటాయి.  అయితే కెమెరా వర్క్ ఛాయాగ్రాహకుడైన దర్శకుడు నిర్వహించలేదు.
మహ్మద్ రహీల్ కెమెరా వర్క్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. నైట్ ఎఫెక్ట్ లో, ఫారెస్టులో తీసిన  సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక  సుశీన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథతో బాటు ప్రేక్షకులు ప్రయాణించేలా చేస్తుంది.
       
మొత్తం మీద
కన్నూర్ స్క్వాడ్ పోలీసు శాఖ గురించి ఒక ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్. చట్టాన్ని అమలు చేసే వాస్తవిక చిత్రణని అందిస్తుంది. పోలీసుల రోజువారీ సవాళ్ళని, నిధుల కొరతని, ఓ మాదిరి వేతనాల్ని భరిస్తూ, అదే సమయంలో రాజీపడని విధి నిర్వహణకి కట్టుబడి, సమాజం పట్ల మానవీయంగా ఎలా మారతారో చూపిస్తుంది.

—సికిందర్

1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

1362 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం : శివ నిర్వాణ
తారాగణం : విజయ్ దేవరకొండ, సమంత, మురళీ శర్మ, సచిన్ ఖెడేకర్, శ్రీకాంత్ అయ్యంగార్, లక్ష్మి, శరణ్య, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం :  హిషామ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : మురళి జి
బ్యాంర్ ; మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
విడుదల సెప్టెంబర్ 1, 2023
***

త సంవత్సరం లైగర్ పానిండియా యాక్షన్ ఈద్పరాజయంతో సందిగ్ధంలో పడ్డ విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోమాంటిక్ మూవీ మీదికి దృష్టి మరల్చాడు. ఇలాటి సినిమాలు తీసే (నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్) దర్శకుడు శివ నిర్వాణ మీద బాధ్యత వుంచాడు. యూత్ అప్పీల్ కోసం సమంతని హీరోయిన్ గా తీసుకున్నాడు. దీన్ని అయిదు భాషల్లో పానిండియాగా విడుదల చేశారు. హిందీ కోసం కాశ్మీర్ లో సుదీర్ఘంగా షూటింగ్ జరిపారు. పాటలు ఇప్పటికే హిట్టయ్యాయి. 2022 డిసెంబర్ లో విడుదల వాయిదా పడి, ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవరకొండ సినిమా ఎలా వుందో ఓసారి చూద్దాం...

కథ

విప్లవ్ (విజయ్ దేవర్ కొండ) బిఎస్ఎన్ఎల్ లో కాశ్మీర్ లో జాబ్ వేయించుకుని అక్కడికెళ్ళి ఎంజాయ్ చేస్తూంటాడు. ఆరా (సమంత) అనే అమ్మాయి తన ఫ్రెండ్ తో పాకిస్తాన్ నుంచి వచ్చి, తప్పిపోయిన తమ్ముడ్ని వెతుకుతూంటుంది. ఆమెని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డ విప్లవ్, ఆమె తమ్ముడ్ని వెతకడంలో పడతాడు. తమ్ముడు దొరకడు గానీ- ఆమె ఆరా కాదనీ, ఆరాధ్య అనీ తెలిసి పోతుంది. ఆరాధ్య తండ్రి శ్రీనివాస రావు (మురళీ శర్మ) కాకినాడలో ప్రవచనాలు చెప్పే ఆస్తికుడు. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖెడేకర్) అతడ్ని వ్యతిరేకించే నాస్తికుడు. వీళ్ళిద్దరూ విప్లవ్ ఆరాధ్యల పెళ్ళికి అడ్డుపడతారు. ఇప్పుడు విప్లవ్ ఆరాధ్యలు వీళ్ళని ఎదిరించి ఎలా పెళ్ళి చేసుకున్నారు? తమ పెళ్ళి పెటాకులవదని ఎలా నిరూపించ దల్చుకున్నారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది పూర్తిగా రోమాంటిక్ కామెడీ కాదు. రోమాంటిక్ కామెడీగా మొదలై, రోమాంటిక్ డ్రామాగా మారే సీరియస్ కథ. ప్రేమికులు- వాళ్ళ జాతకాలు- వాటితో అంగీకారానికి రాని వాళ్ళిద్దరి ఆస్తిక, నాస్తిక తండ్రులూ - వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) ఈ కథ. అబ్బాయి జాతకం కలవక పోతే హోమం చేయించమంటాడు అమ్మాయి ఆస్తిక తండ్రి. హోమం లేదు గీమం లేదు పొమ్మంటాడు అబ్బాయి నాస్తిక తండ్రి. దీంతో అమ్మాయి తండ్రిని ఎదిరించి అబ్బాయితో వచ్చేస్తుంది.
       
జాతకాలు కలవని వీళ్ళు సంసారం చేస్తే
సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు అమ్మాయి తండ్రి. తమలాంటి చక్కగా సంసారం చేసే జంట ప్రపంచంలోనే లేదని ప్రూవ్ చేయాలని ఇద్దరూ అనుకుని పెళ్ళి చేసుకుంటారు. ఇక్కడామె సమస్య తన తండ్రితోనే తప్ప అబ్బాయి తండ్రితో కాదని గుర్తించదు. అలా వెళ్ళిపోతూ అబ్బాయి తండ్రితో తన తండ్రిని తక్కువ చేసి అవమానిస్తున్నానని కూడా తెలుసుకోదు. ఇద్దరూ చేయాల్సింది ఇలాటి సందర్భంలో ఇతర ప్రేమికులకి ప్రేరణగా వుండే ఫార్ములాతో, తండ్రులిద్దర్నీ రాజీకుదిర్చి పెళ్ళి చేసుకోవడం. ప్రేమ సినిమాలో ప్రేమికులకి ఆదర్శంగా వుండని భారీ బడ్జెట్ స్టార్ హీరోహీరోయిన్ల ప్రేమ సినిమాలతో యూత్ ఏం తెలుసుకుంటారు?


ఇది ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కొస్తే
, పెళ్ళి చేసుకుని ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నారో అది మర్చిపోయి అపార్ధాలతో తమ మధ్య కొత్త కాన్ఫ్లిక్ట్ కి దారి తీస్తారు. కథకి అసలు కాన్ఫ్లిక్ట్ తండ్రులతో చూపించింది వుండగా, తమ మధ్య వేరే కాన్ఫ్లిక్ట్ సృష్టించుకుని దూరాలు పెంచుకుంటారు. దీంతో సెకండాఫ్ సీరియస్ రోమాంటిక్ డ్రామాగా మారిపోతుంది. ఈ సీరియస్ నెస్ ని మరిపించడానికి వేరే పాత్రల్ని దింపి, కామెడీలు సృష్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
      
ఈ కచ్చా పచ్చాగా వండిన కథకి స్టార్ హీరోయిన్లకున్న యూత్ అప్పీల్ తో, హిట్ పాటలూ కాశ్మీర్ లొకేషన్స్ తో, అగ్ర నిర్మాణ సంస్థ భారీగా ఖర్చు చేసిన ప్రొడక్షన్ విలువ లతో, ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అయితే నిడివి రెండు గంటలా 50 నిమిషాలు ఓర్చుకోవాలి.

నటనలు - సాంకేతికాలు

విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీ కాబట్టి ప్రేమని సాధించుకోవడం కోసం యాక్టివ్ పాత్రగా వుంటూ కథని ముందుకు నడిపిస్తాడు. సెకండాఫ్ రోమాంటిక్ డ్రామాగా మారిపోతుంది కాబట్టి, సంసారంలో సమస్యల్ని సృష్టించుకోవడమే తప్ప, పరిష్కరించలేని పాసివ్ పాత్రగా మారిపోయి, కథా నాయకత్వాన్ని ఇతర పాత్రలకి వదిలేస్తాడు. అయితే పాత్ర చిత్రణలో ఈ కొట్టొచ్చినట్టుండే లోపం ప్రేక్షకుల కామన్ సెన్సుకి అందకుండా పాస్ అయిపోతాడు.
     
కాశ్మీర్ సీన్స్ లో లవర్ బాయ్ గా బాగా యాక్ట్ చేశాడు. సుమారు గంట సేపు సాగే కాశ్మీర్ లొకేషన్స్ లో వెన్నెల కిషోర్ ని కలుపుకుని
, సమంత ప్రేమకోసం చేసే సున్నిత కామెడీ సీన్లని, ఒక యాక్షన్ సీనుని, మూడు హిట్ సాంగ్స్ నీ  ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కాశ్మీర్ ఎపిసోడ్ ముగించుకుని వచ్చాక మొదలయ్యే సీరియస్ డ్రామాలో గుర్తుండే ఒక్క సీను కూడా దర్శకుడ్ని అడిగి పెట్టించుకోలేక పోయాడు. ముగింపు సీనులో మాత్రం తన లోని నటుడ్ని బయటికి తీసి అభిమానుల గుండె బరువెక్కించాడు. అయితే ఈ డ్రామాకి లాజిక్ లేదనేది వేరే విషయం.
      
సమంత పాత్ర చిత్రణ లోపాల్ని ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫస్టాఫ్ లో కాస్త అల్లరి పాత్రగా వుంటే యూత్ కి ఇంకా బాగా దగ్గరయ్యేది. సెకండాఫ్ లో గర్భస్రావమనే ట్రాజడీతో ఆమె డీలా పడింది.
     
ఇంట్రెస్టింగ్
, యాక్టివ్ క్యారెక్టర్లు ఎవరంటే, తండ్రుల పాత్రల్లో మురళీ శర్మ, సచిన్ ఖెడేకర్లు. వీళ్ళ విరుద్ధ భావాలతో గొడవపడే సీన్లని చాలా నీటుగా హేండిల్ చేశాడు దర్శకుడు. మెట్రో రైల్లో సంబంధం మాట్లాడుకునే సీను సహా.
     
విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో శరణ్య
, సమంత నానమ్మ పాత్రలో లక్ష్మి, విజయ్ దేవరకొండ పై ఉద్యోగి పాత్రలో రోహిణీ - ఈ ముగ్గురివీ అర్ధవంతమైన పాత్రలు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణల కామెడీ ఫర్వాలేదు.
     
మలయాళ సంగీత దర్శకుడు అబ్దుల్ పాటలతో
, నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తే, ఛాయాగ్రహణంతో మురళి సమ్మోహన పరుస్తాడు.
     
దర్శకుడు తండ్రులతో వున్న కాన్ఫ్లిక్ట్ తోనే సెకండాఫ్ నడిపి
, విజయ్- సమంతలు ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నారో, ఆ పాయింటుతో రోమాంటిక్ కామెడీగానే సాగించి వుంటే- పానిండియాకి ఇంకో లెవెల్లో వుండేది.  తెలుగు సినిమా కథల పరిధిలోనే వుంటే అది తెలుగు సినిమాయే. విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ లో సమంత కోసం పాకిస్తాన్ కి  వెళ్ళడానికి కూడా సిద్ధ పడతాడు. నిజానికి సమంతని పాకిస్తానీ అమ్మాయిగానే చూపించి, తీరా పాకిస్తాన్లో  ఆమెని హిందూ ఆమ్మాయిగా రివీల్ చేసి వుంటే - ఇది ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాని సరికొత్త సీమాంతర ప్రేమ కథ అయ్యేది. పానిండియాకి పాన్ మసాలా అయ్యేది.

—సికిందర్

 


22, జులై 2023, శనివారం

1349 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్
తారాగణం : సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ, గారీ ఓల్డ్ మాన్, కెనెత్ బ్రనగా, టామ్ కాంటీ తదితరులు
సంగీతం : లుడ్విగ్ గోరన్సన్, ఛాయాగ్రహణం : హయ్ట్ వాన్ హయ్టెమా 
బ్యానర్స్ : సింకాపీ ఇన్ కార్పొరేషన్, అట్లాస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు: ఎమ్మా థామస్, ఛార్లెస్ రోవెన్, క్రిస్టఫర్ నోలన్
విడుదల : జులై 21, 2023
***

ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ఒపెన్ హైమర్ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైంది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తర్వాత టాప్ పొజిషన్లో వున్న నోలన్ సినిమా అంటే అంతర్జాతీయంగా ప్రేక్షకులు విరగబడి చూస్తారు. తీసింది 12 సినిమాలే అయినా వాటిలో ఒక్క టెనెట్ (2020) తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లే. సైన్స్ ఫిక్షన్లు ఎక్కువ తీసే నోలన్ తాజాగా బయోపిక్ ప్రయత్నించాడు. అణుబాంబు సృష్టికర్త జూలియస్ రాబర్ట్ ఒపెన్ హైమర్ జీవి చరిత్రని ఎపిక్ బయోగ్రఫికల్ థ్రిల్లర్ అంటూ అందించాడు.


దీంతో సహజంగానే జపాన్ ని ధ్వంసం చేసిన అణుబాంబు సృష్టికర్త ఒపెన్ హైమర్ గురించి దృశ్యాత్మకంగా చూసి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నోలన్ ఫ్యాన్స్ కేర్పడింది. ఓపెనింగ్స్ తోనే 45-50 మిలియన్ డాలర్ల బాక్సాఫీసుతో విజయవంతంగా నిలిచిన ఈ మూవీ బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు. ఇది లాభాలార్జించాలంటే 400 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు రాబట్టాలని అంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? ఈ మూవీ మిగిలిన నోలన్ సినిమాల్ని తలదన్నేలా వుందా? అన్ని  వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే మేకింగ్ తో వుందా? ఈ విషయాలు పరిశీలిద్దాం...

కథ

రాబర్ట్ జే ఒపెన్ హైమర్ అలియాస్ ఒప్పీ (సిలియన్ మర్ఫీ) అమెరికాలో జన్మించిన యూదు. 1927 లో జర్మనీలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది, అమెరికా వచ్చి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా చేరుతాడు. ఇక్కడ క్వాంటం మెకానిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖల్లో చేస్తున్న కృషిని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీంతో  మన్హట్టన్ ప్రాజెక్ట్లో సైంటిస్టుగా నియమిస్తుంది. ఇలావుండగా మరోవైపు జీన్ టట్లక్ (ఫ్లారెన్స్ పాగ్) అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూంటాడు. మన్హట్టన్ ప్రాజెక్టు నుంచి బదిలీ అయి న్యూ మెక్సికోలోని  లాస్ అలమోస్ లాబొరేటరీకి డైరెక్టర్గా నియమితుడవుతాడు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ జనరల్ లెస్లీ గ్రోవ్స్ (మాట్ డామన్) జర్మనీ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రారంభించిందని వెలుగులోకి వచ్చిన సమాచారంతో,  ఒప్పీ ని  అణ్వాయుధ తయారీకి ఆదేశిస్తాడు.
        
దాంతో ఒప్పీ టీమ్ ని ఏర్పాటు చేసుకుని ఆటంబాంబు తయారు చేసి విజయవంతంగా పరీక్ష జరుపుతాడు. ఆ తర్వాత ఒప్పీకి చెప్పకుండా అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ (గేరీ ఓల్డ్ మాన్) 1945 ఆగస్టు 6 న, మళ్ళీ 9 న ఒకటి కాదు, రెండు ఆటం బాంబులు జపాన్ లోని హీరోషిమా, నాగసాకి లపై ప్రయోగించాలని ఆదేశించడంతో ఒప్పీ బెదిరిపోతాడు. జపాన్లో జరిగిన బీభత్సానికి ట్రూమన్ ని నిలదీస్తాడు. ఇక్కడ్నించీ ఒప్పీకీ ప్రభుత్వానికీ సంబంధాలు చెడి, ఒప్పీ మీదే కోర్టు విచారణకి దారితీస్తుంది.
        
ఈ నేపథ్యంలో ఒప్పీపై ప్రభుత్వం చేసిన ప్రత్యారోపణ ఏమిటి? ఒప్పీ కమ్యూనిస్టు సానుభూతి పరుడనేది నిజమేనా? ఒప్పీ తను నిర్దోషియని ఎలా నిరూపించుకున్నాడు? అణుబాంబు ప్రయోగం తర్వాత ఒప్పీ ఎందుకు పశ్చాత్తాపం చెందాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

అమెరికన్ ప్రొమీథియస్ అని 2005 లో కై బర్డ్, మార్టిన్ షెర్విన్ లు రాసిన ఒపెన్ హైమర్ బయోగ్రఫీ ఈ మూవీ కాధారం. క్రిస్టఫర్ నోలన్ తన స్టయిల్లో బయోపిక్‌ని తెరపై చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా కథ అయినప్పటికీ క్లాసిక్ నోలన్ మూవీగానే కన్పిస్తుంది. నోలన్ ఇష్టపడే నాన్ లీనియర్ కథనం, విభిన్న కలర్ స్కీములు, ఒప్పీ  మానసిక స్థితిని చిత్రించడానికి మాంటేజ్‌లతో వివరణాత్మక కథనం మొదలైన నోలన్ నుంచి ఆశించే ప్రతిదీ వుంటాయి- ఒక్క కమర్షియల్ ఎలిమెంట్లు తప్ప.
        
సినిమా విడుదలకి ముందు ఇది హార్రర్ జానర్ అని ప్రకటించి సంచలనం రేపాడు నోలన్. ఇంత ప్రతిష్టాత్మక సినిమా చీప్ గా హార్రర్ ఏమిటని అభిమానులు నొచ్చుకున్నారు. చెప్పినట్టుగానే నోలన్ ఇష్టపడే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోబాటు, పొలిటికల్ డాక్యుమెంటరీ ఆనవాళ్ళు లేకుండా దాదాపు హార్రర్ గానే ఈ బయోపిక్ వుంది. జపాన్ మీద ప్రయోగించిన అణుబాంబు తాలూకు హార్రర్ కాదిది- దీని పర్యవసానంగా ఒప్పీ అనుభవించే హార్రర్. ఇది ఆటంబాంబు దాడి కథ కాదు. ఒప్పీ అనుభవించే భయానక మానసిక స్థితి కథ. అతడి మేధకీ, హృదయానికీ మధ్య సంఘర్షణ. లక్షల మంది అమాయకుల్ని బలిగొన్న ఆటంబాంబుని కనుగొన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయాణం ఈ కథ.
        
అయితే సాంకేతికంగా ఇది కథ కాదు, గాథ. అందువల్ల రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా నాయకుడు- ప్రతినాయకుడు- సంఘర్షణ అనే యాక్షన్ థ్రిల్లర్ గా వుండదు. ఇది ఒక జీవిత చరిత్ర కావడంతో ఒప్పీ జీవితపు ముఖ్య సంఘటనల సంపుటిగా, డైరీగా  మాత్రమే ఇది వుంటుంది. ఇక్కడ నోలన్ అభిమానులు నిరాశపడతారు. ఇది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే యాక్షన్ థ్రిల్లర్ గాక, మూడు గంటల సేపు సాగే డైలాగు డ్రామా. క్యారక్టర్ స్టడీ. దీన్ని థ్రిల్స్, సస్పెన్స్, యాక్షన్ కోరుకుని చూస్తే మాత్రం అణుబాంబు మీద పడ్డట్టే వుంటుంది. 
        
ఫస్టాప్ మందకొడిగా సాగుతుంది ఒప్పీ వృత్తిగత, వ్యక్తిగత జీవిత చిత్రణతో. దీన్ని చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అతడి శృంగార జీవితం కూడా కలుపుకుని పాయింటుకి రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆటం బాంబు తయారీ దగ్గర్నుంచి ఆసక్తి పెరిగేలా చేసి, ఆటంబాంబు ప్రయోగంతో అసలు కథలోకి తీసికెళ్ళాడు నోలన్.
        
జపాన్ మీద అణుబాంబు ప్రయోగానికి ఎదురుతిరిగే ఒప్పీతో సెకండాఫ్ కథ వుంటుంది. కమ్యూనిస్టు అనే అనుమానంతో అతడ్నే ప్రభుత్వం దోషిగా నిలబెట్టడంతో డ్రామా ఊపందుకుంటుంది. అధికారులు చుట్టు ముట్టి జరిపే ఈ విచారణ భావోద్వేగ భరితంగా వుంటుంది. మరోపక్క అణుబాంబు కనిపెట్టిన పాపిగా ఒప్పీ అనుభవించే మనోవేదన గుండెల్ని కదిలిస్తుంది. ముగింపు భావోద్వేగాల పతాక సన్నివేశాలతో కట్టి పడేస్తుంది. అణుబాంబు పితామహుడు ఒపెన్ హైమర్ సంక్షుభిత మనస్థితిని దర్శించాలంటే ఈ బయోపిక్ ని ఒక దృశ్యమాధ్యమం రూపంలో తన మేధస్సుతో అనితర సాధ్యంగా అందించాడని చెప్పాలి దర్శకుడు క్రిస్టఫర్ నోలన్.

నటనలు -సాంకేతికాలు

ఒపెన్ హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీకి ఆస్కార్ నామినేషన్‌ తప్పనిసరి అని అప్పుడే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నామినేషనే కాదు, ఆస్కార్ ప్రతిమనూ సొంతం చేసుకుంటాడు. మరే ఇతర నటుడూ సాధించలేని ఔన్నత్యాన్ని అతను దాదాపు సాధించినట్టు కన్పిస్తాడు. ఎందరో నటులకి అతనొక గైడ్ గా కన్పించినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అతడి హావభావాల్ని, ముఖకవళికల్ని కెమెరా జూమ్ చేసి పట్టుకున్న తీరు ఇంతవరకు ఏ సినిమాలోనూ చూసి వుండం. అతడి నిస్సహాయత, ఆక్రోశం, ఆందోళన, పాప భీతి... ఒకటేమిటి, ప్రతీదీ హార్రర్ గా చేసి ప్రేక్షకుల మీదికి విసిరేదే. ఇది జపాన్ మీద అణుబాంబు దాడి కథ కాదు, అణుబాంబులా విస్ఫోటించే  సిలియన్ మర్ఫీ అభినయపు గాథ.
        
ఇంకా ఇందులో ఎన్ని పదుల పాత్రలున్నాయో చెప్పలేం. ఏ పాత్రలో ఎవర్ని చూస్తున్నామో కూడా పట్టుకోవడం కష్టం. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గా టాం కోంటీ, మరో శాత్రవేత్త నీల్స్ బోర్ గా కెన్నెత్ బ్రనగా (ఈయన 2018 లో అగాథా క్రిస్టీ నవల మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్ ని దర్శకుడుగా తెరకెక్కించాడు), అమెరికా ప్రెసిడెంట్ హారీ ట్రూ మన్ గా గేరీ గోల్డ్ మాన్, లెఫ్టినెంట్ జనరల్  లేస్లీ గ్రోవ్స్ గా మాట్ డామన్‌ మాత్రం  గుర్తుంటారు.
        
సాంకేతికంగా లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం థియేటర్ సౌండ్ సిస్టమ్ లో కట్టిపడేస్తుంది. సన్నివేశాల్లో సంగీతం ఇంకి పోయి, ఎదురుగా నిజంగానే సంఘటనలు జరుగుతున్నాయా అన్నట్టు వుంటుంది. రిచర్డ్ కింగ్ సౌండ్ డిజైన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హయ్ట్ వాన్ హయ్టెమా ఛాయాగ్రహణం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా క్లోజప్ షాట్లు కథనాన్ని మనస్సుల్లో ముద్రించేస్తాయి. రూత్ డి జోంగ్ పీరియడ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంకో అద్భుతం. ఎల్లెన్ మిరోజ్నిక్ రూపొందించిన దుస్తులు ఇంకో హైలైట్. ఇక జెన్నిఫర్ లేమ్ ఎడిటింగ్ మాత్రం ఈ పూర్తి స్థాయి డైలాగ్ డ్రామాని గేట్లు తెరిచి వదిలేసి నట్టుంది మూడు గంటల సేపూ.
        
పోతే, అణుపరీక్ష నిర్వహించే సీను గ్రాఫిక్స్ వాడకుండా నిజదృశ్యం చూస్తున్నట్టు క్రియేట్ చేయగల్గడం క్రిస్టఫర్ నోలన్ కళాదృష్టికి ఓ చిన్న మచ్చు తునక.
—సికిందర్