రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఆగస్టు 2023, ఆదివారం

1358 : రివ్యూ!


రచన - దర్శకత్వం : క్లాక్స్
తారాగణం : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్,  రాజ్ కుమార్ కసిరెడ్డి, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్,  సన్నీ కూరపాటి
సమర్పణ : సి. యువరాజు, నిర్మాత : రవీంద్ర బెనర్జీ
విడుదల : ఆగస్టు 25, 2023
***

రెక్స్ 100  హీరో కార్తికేయ ఆరు వరస ఫ్లాపుల తర్వాత 2022 లో తమిళంలో అజిత్ తో వాలిమై లో విలన్ గా నటించి పేరు తెచ్చుకుని, తిరిగి తెలుగులో బెదురులంక 2012 లో నటించాడు. తెలుగులో అతడికో హిట్ అవసరమున్నా లేకున్నా చేతినిండా అవకాశాలతో బిజీగా వున్నాడు. ఈసారి క్లాక్స్ అనే కొత్త దర్శకుడితో ప్రయత్నించాడు. క్లాక్స్ అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లో కొచ్చి పనిచేస్తూ ఈ సినిమా తీశాడు. ట్రైలర్స్ లో సోషల్ సెటైర్ లాగా అనిపిస్తున్న ఈ మూవీ దేని గురించనేది ఆసక్తి రేపింది. గ్రామీణ వాతావరణంలో కామెడీగా తీసిన ఈ మూవీ అసలు దేని గురించి? ఇది తెలుసుకుందాం... 

కథ

2012 లో గోదావరి జిల్లాలో బెదురులంక అనే వూరు. ఆ వూళ్ళో 2012 డిసెంబర్ లో యుగాంతం సంభవిస్తుందని వస్తున్న వార్తలు భయాందోళనల్ని సృష్టిస్తాయి. దీన్ని సొమ్ము చేసుకోవాలని వూరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ), బావమరిది భూషణం (అజయ్ ఘోష్), ఓ దొంగబాబా బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ డానియేల్ (రాం ప్రసాద్) ఓ పథక మేస్తారు. దాని ప్రకారం వూళ్ళో జనాలందరూ తమ దగ్గరున్న బంగారమిచ్చేయాలనీ, ఆ బంగారాన్ని కరిగించి సువర్ణ మహా శివలింగాన్ని తయారు చేయించి, గోదావరికి ఆర్పిస్తే యుగాంతం ముప్పు తప్పుతుందనీ నమ్మిస్తారు. అలాగే చర్చి ఫాదర్ క్రైస్తవులందరూ బంగారమిచ్చేస్తే  దాంతో మహా శిలువ తయారు చేయించి గోదావరికి అంకితమిస్తాననీ నమ్మిస్తాడు. భయంతో వున్న జనాలు బంగారమంతా ఇచ్చేస్తారు.
       
ఇలావుండగా
, నగరంలో  గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం మానేసి వచ్చి వూళ్ళో వుంటున్న శివ (కార్తికేయ) ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహాశెట్టి) ని ప్రేమిస్తూంటాడు. అయితే వూళ్ళో అందరూ బంగారమిచ్చినా అతను ఉంగర మివ్వడానికి ఒప్పుకోడు. ఇవి మూఢ నమ్మకాలని వ్యతిరేకిస్తాడు. దీంతో ప్రెసిండెంట్ అతడ్ని వూర్నుంచి బహిష్కరిస్తాడు.
       
ఇప్పుడు వూళ్ళోంచి వెళ్ళిపోయిన శివ ఏంచేశాడు
? వూళ్ళో జరుగుతున్న మోసాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? కూతురు చిత్రకి వేరే పెళ్ళి చేస్తున్న ప్రెసిడెంట్ ని ఎలా ఎదుర్కొని చిత్రని చేపట్టాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మయాన్ క్యాలెండర్ ఆధారంగా 2012 లో యుగాంతం సంభవిస్తుందనీ వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా కల్లోల పర్చిన సంగతి తెలిసిందే. దీన్నిఆధారంగా చేసుకుని 2009 లో 2012 అనే హాలీవుడ్ డిజాస్టర్ మూవీ కూడా సంచలనం సృష్టించింది. ఇది తెలుగులో ‘2012 యుగాంతం పేరుతో డబ్బింగ్ కూడా అయింది. ఇది చూశాక ఇందులోని దృశ్యాలకి కొన్ని రోజులు వైరాగ్యంతో గడిపాం.
       
ఇప్పుడు ఇదే యుగాంతం కథ తీసుకుని
బెదురులంక 2012 తీశాడు కొత్త దర్శకుడు. తను ‘’
2012’ హాలీవుడ్ సినిమా, అకిరా కురోసావా తీసిన సెవెన్ సమురాయ్‌ లో భయం, రేపటి గురించి ఆందోళనా లేకపోతే ప్రజల ప్రవర్తన ఎలా వుంటుందో చెప్పే ఒక డైలాగుతో బాటు, ఐన్ ర్యాండ్ ది ఫౌంటెన్ హెడ్ నవల అందించిన స్ఫూర్తితో ఈ సినిమా తీశానని చెప్పాడు. సినిమా లొకేషన్ ఎదురులంక అయితే, కథలో అక్కడి ప్రజలు యుగాంతం భయంతో జీవిస్తున్నారు కాబట్టి బెదురులంకగా మార్చానని చెప్పాడు.

కథకి తీసుకున్న విషయం బాగానే వుంది గానీ
, తెరకెక్కించడం అంతంత మాత్రంగా వుంది. ఏదైనా ఒక అపాయాన్ని అడ్డు పెట్టుకుని మతాల పేరుతో చేసే మోసాల కథలతో సినిమాలు వచ్చాయి. 1984 లో కోడి రామకృష్ణ తీసిన అదిగో అల్లదిగో ఇలాటి మూఢనమ్మకాల మీద తీసిన బలమైన కథ. ఆస్తికుడైన తండ్రికి నాస్తికుడైన కొడుకుగా చంద్రమోహన్ పాత్రతో ఈ కథ నడుస్తుంది. కానీ ప్రస్తుత కథలో హీరో కార్తికేయతో కాక చుట్టూ వున్న పాత్రలతో కథ నడుస్తుంది. దీంతో ఫస్టాఫ్ లో అంతంత మాత్రం కనిపించే కార్తికేయ సెకండాఫ్ లోనే కథలో కొస్తాడు. అయితే విలన్ల మోసాలు బయటపెట్టాల్సిన కథ కాస్తా క్లయిమాక్స్ లో వేరే మలుపు తీసుకుని, వేరే పాత్రతో ఒక మెసేజితో ముగిసి పోతుంది.

సెకెండాఫ్ లో సత్య
, వెన్నెల కిషోయర్ లు ప్రవేశించి నడిపే కామెడీ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా వుంటుంది.  

నటనలు- సాంకేతికాలు

దర్శకుడు కార్తికేయని సరిగా ఉపయోగించుకోలేక పోయాడు. కొత్త కాన్సెప్ట్ కాబట్టి కాస్త ఆసక్తికరంగా వుంది గానీ, వేరే సినిమా అయితే ఇలాటి పాత్రతో కార్తికేయకి ఫ్లాప్ అయ్యేది. ఉన్న సన్నివేశాలు నటించడంలో మనసు పెట్టనట్టు కనిపిస్తాడు. తను హీరోనా, అతిధి పాత్రా అన్నట్టు  వుంటాడు.

హీరోయిన్ నేహా శెట్టికి హీరోని ప్రేమించడంవరకే పని. ప్రారంభ సన్నివేశాల్లో తను ప్రెసిడెంట్ కూతురు బోసి మెడతో ఎందుకుంటుందో అర్ధం గాదు. ప్రెసిడెంట్ ఒక గొలుసు కొనివ్వలేదా? ఇక వూరంతా బంగారం ఇచ్చేస్తే తను చెవి రింగులతో అలాగే వుంటుంది. ఉంగరం దానం చేసేయమని హీరోని డిమాండ్ చేస్తూందే తప్ప, తను చెవి రింగులతో వున్నానని తెలుసుకోదు. ఇలాటి లోపాలున్నాయి దర్శకత్వంలో.   

గోపరాజు రమణ
, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాం ప్రసాద్ లాంటి హేమాహేమీలు కుట్ర స్వాములుగా నటించడం ఈ సినిమాకి ప్లస్ ఆయింది. పాత సినిమాల్లో రావుగోపాల రావు- అల్లు రామలింగయ్య- నూతన్ ప్రసాద్ లు వేసిన దుష్ట త్రయం పాత్రల్లాగే వుంటారు. సినిమాకి వాడిన గోదావరి జిల్లా భాష కలిసి వచ్చింది.

ఇక మణిశర్మ సంగీతంలో రెండు పాటలు ఫర్వాలేదు. గోదావరి నది మీద
, ఇతర గ్రామీణ పరిసరాల్లో కెమెరా వర్క్ ఆకర్షణీయంగా వుంది. కాసేపు నవ్వుకోవడానికైతే ఫర్వాలేదు ఈ సినిమా.

—సికిందర్

 

25, ఆగస్టు 2023, శుక్రవారం

1357 :రివ్యూ!

 


రచన - దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
తారాగణం :  వరుణ్ తేజ్, సాక్షీ వైద్య, విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్, అభినవ్ గోమఠం, రవివర్మ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్ ఛాయాగ్రహణం : ముఖేష్ జీ
బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర, నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
విడుదల : ఆగస్టు 25, 2023

          2017 లో రాజశేఖర్ తో గరుడవేగ అనే హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, 2022 లో అక్కినేని నాగార్జునతో ది ఘోస్ట్ అనే ప్లాపైన మరో యాక్షన్ థ్రిల్లర్ తీసి, ప్రస్తుతం యంగ్ హీరో వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ ని  తెలుగు ప్రేక్షకులకి అందించాడు. గత సంవత్సరం గని అనే ఫ్లాపైన స్పోర్ట్స్ డ్రామాలో నటించిన వరుణ్ తేజ్, ఇప్పుడు గూఢచారి వేషధారణతో విచ్చేశాడు. ఈ సంవత్సరం గూఢచారి వేషాలు వేసిన యంగ్ స్టార్స్ అక్కినేని అఖిల్, నిఖిల్ లు (ఏజెంట్, స్పై) ఫ్లాపులతో సరిపెట్టుకుని తెలుగు స్పై సినిమాలింతే అని తేల్చారు. మరి వరుణ్ తేజ్ సక్సెస్ అవడానికి చూపించిన తేడా ఏమిటి? ప్రవీణ్ సత్తారు దీన్ని నిలబెట్టడానికి చేసిన కృషి ఏమిటి? అసలు కృషి ఏమైనా జరిగిందా, లేక ఖుషీ కోసం ఈ సినిమా తీశారా? దీనికీ తమిళంలో సూర్య నటించిన సింగం 3 కీ సంబంధమేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

కేంద్రమంత్రి  ఆదిత్యా రాజ్ బహదూర్ (నాజర్) పర్యావరణ సదస్సులో పాల్గొడానికి లండన్ వెళ్తాడు.  అతడికి ఓ పెన్ డ్రైవ్ అందించాలని అక్కడున్న శృతి (రోషిణీ ప్రకాష్) ప్రయత్నిస్తుంది. అప్పుడు రాజ్ బహదూర్ మీద దాడి జరుగుతుంది. అతడి  సెక్యూరిటీ చీఫ్ గాయపడి, లండన్ లోనే వున్న ఫ్రెండ్ అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) కి రాజ్ బహదూర్ ని కాపాడే బాధ్యత అప్పగిస్తాడు. రాజ్ బహదూర్ పర్సనల్ సెక్రటరీ అయిన ఐఏఎస్ అధికారిణి ఐరా (సాక్షీ వైద్య), అర్జున్ వర్మ గతంలో ప్రేమికులు. వీళ్ళ గతం ఏమిటి? రాజ్ బహదూర్ ని చంపాలని చూస్తున్నదెవరు? అర్జున్ వర్మ ఎలా కాపాడేడు? విదేశాల నుంచి ఇండియాకి తరలిస్తున్న మెడికల్ వ్యర్ధాల డంప్ కీ, కి రాజ్ బహదూర్  మీద హత్యా ప్రయత్నాలకీ సంబంధమేమిటి? రణవీర్ (వినయ్ రాయ్) అనే అతను ఎవరు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ వెండితెరపై చూడాలి.

ఎలావుంది కథ

2017 లో తమిళంలో హరి దర్శకత్వంలో సూర్య నటించిన సింగం 3 లో కథ పర్యావరణానికి సంబంధించిందే. సమస్త జీవులకీ, పర్యావరణానికీ ప్రాణాంతకమైన, భూమిలో కలిసిపోయే గుణం లేని బయోమెడికల్ వ్యర్ధాలు, ఈ- వ్యర్ధాలూప్రత్యేక ప్లాంట్లలో నిర్వీర్యం చేయకుండా, ఆసియా దేశాలకి తరలించి డంప్ చేస్తున్న అంతర్జాతీయ పరిశ్రమల కుట్రని భగ్నం చేసే కథ. సింగం సిరీస్ సినిమాల్లో ఇది కూడా హిట్టయింది.
         
అయితే ఆ నాన్ బయో డీగ్రేడబుల్ వేస్ట్స్ తో అంతర్జాతీయ కుట్ర ఇక్కడ స్థానికంగా  ఎంతమంది స్కూలు పిల్లల్ని బలిగొందో చెబుతూ వచ్చిన ఆ దయనీయ కథని  అలాగే కొనసాగిస్తూ
, దాంతో ముడిపెట్టి బాధిత కుటుంబాల సమక్షంలో విలన్స్  ని శిక్షించాల్సింది పోయి- ఎత్తుకున్న ఈ పాయింటుని వదిలేసి రొటీన్ హీరో- విలన్ యాక్షన్ కథగా చూపించి వదిలేశారు.
        
ప్రవీణ్ సత్తారు సినిమాలో కూడా ఇదే జరిగింది. పేరుకే వ్యర్ధాలతో అంతర్జాయ కుట్ర కథ
, చూపించిందంతా కేంద్రమంత్రిని గాండీవధారి అర్జున కాపాడడం గురించే. చేతిలో ధరించిన గాండీవానికే విషయం లేదు. దీంతో విషయం లేక డొల్లగా, ఫ్లాట్ గా సాగుతుంది సినిమా. పర్యావరణ సమస్యతో బాధితుల్ని చూపించి అందులోంచి హీరో రియాక్టయి వుంటే కథ భావోద్వేగాలతో కూడి వుండేది. కేవలం కేంద్ర మంత్రిని కాపాడే చర్యల్లో ఎమోషన్స్ లేవు. ఇలా ఎమోషనల్ అప్పీల్ లేకుండా ఎన్ని యాక్షన్ సీన్లు- అదీ విదేశాల్లో భారీ యెత్తున స్టయిలిష్  యాక్షన్ సీన్లు తీసినా - అదంతా వ్యర్ధమే. నిజానికి తీసిన ఈ వ్యర్ధాన్నే ప్రేక్షకుల మీద డంప్ చేశారు. ఉదయం నుంచీ ప్రేక్షకులు ఎక్స్ అనే ట్విట్టర్ లో హాహాకారాలు చేస్తున్నారు.
        
ఇందులో వరుణ్ తేజ్ సహా ఎవరి పాత్రకీ లాజిక్ లేదు. లావ్ ట్రాక్ సాగదీయడమే తప్ప ఓ పట్టాన కొలిక్కి రాదు. యాక్షన్ సీన్సు తప్ప టాకీ పార్టు సీన్సు ఔట్ డేటెడ్ గా వున్నాయి. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ నత్తనడకతో వుంటుంది ఈ యాక్షన్ కథ. సెకండాఫ్ లో మరీ పతనావస్థకి చేరుకుంటుంది కథ. కేంద్ర మంత్రిని కాపాడే ట్రాకే సాగి సాగీ
, హీరోకీ- విలన్ కీ మధ్య అవే పోరాటాలు రిపీటవుతూ సెకండాఫ్ కుప్పకూలింది. ఈ యాక్షన్ కథ ఎక్కడా సస్పెన్స్, ట్విస్టులు, థ్రిల్స్ వంటివి లేకుండా పేలవంగా సాగి, చివరికి పర్యావరణం గురించి మెసేజ్ ఇస్తుంది!

నటనలు - సాంకేతికాలు

స్పై హీరో వేషం తప్ప, విషయంలేని క్యారక్టర్ పోషించాడు వరుణ్ తేజ్. ఫ్లాపైన స్పై హీరోలు అఖిల్, నిఖిల్ ల సరసన చేరాడు. కథలో బలం లేక పోవడంతో కాదు, అసలు కథే లేకపోవడంతో పాత్ర కాని పాత్రతో, యాక్టింగ్ కాని యాక్టింగ్ చేసి వదిలేశాడు.
        
హీరోయిన్ సాక్షీ వైద్య గ్లామరు ప్రదర్శనతో సినిమా సాంతం కన్పిస్తుందిగానీ
, పాత్రకి పనిలేక పోతే ఎందుకు కనిపిస్తోందో అర్ధం గాదు. కమెడియన్ అభినవ్ గోమఠం స్పై లో చేసిన కుదరని కామెడీ లాంటిదే ఇప్పుడు కూడా చూశాడు. కేంద్రమంత్రిగా నాజర్, విలన్ గా విమల్ రాయ్ పాత్రల్లో పసలేక పోయినా ఎంతోకొంత నటించారు.
        
మిక్కీ జె మేయర్ సంగీతమే కాస్త ఊరట. ముఖేష్ కెమెరా వర్క్ కూడా అగ్రనిర్మాత నుంచి మంచి బడ్జెట్ లభించడంతో బడ్జెట్ కి తగ్గ కృషి చేశాడు. యాక్షన్ డైరెక్టర్స్
, మిగతా సాంకేతిక శాఖల నిపుణులూ అంతే కృషి చేశారు. కానీ అంత బడ్జెట్ అందిస్తున్న నిర్మాతకి తగ్గట్టు మేకింగ్ చేసే పని మాత్రం చేయలేదు దర్శకుడు. ముందు దర్శకుడుగా తాను అప్డేట్ అవ్వాల్సిన అవసరం చాలా కన్పిస్తోంది.
—సికిందర్

  

24, ఆగస్టు 2023, గురువారం

1356 : స్క్రీన్ ప్లే సంగతులు!


     మిళంలో పా. రంజిత్, లోకేష్ కనక రాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ నవతరం దర్శకులు ముగ్గురూ స్టార్ సినిమాల కథల్ని, పాత్ర చిత్రణల్ని మూస ఫార్ములా - టెంప్లెట్ చట్రంలోంచి బయటికి తీసి కమర్షియల్ సినిమాలకి కొత్త రూపం తొడుగుతున్నారు. కథలు, పాత్ర చిత్రణలే కాదు, కథనాన్ని కూడా సాంప్రదాయ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తో విభేదించి స్ట్రక్చరేతర రియలిస్టిక్ జానర్లోకి మార్చేస్తున్నారు. పా. రంజిత్ రజనీకాంత్ తో తీసిన కబాలీ’, కాలా’, ఆర్యతో తీసిన సార్పట్టా ఈ కోవలో కొస్తాయి. లోకేష్ కనక రాజ్ కార్తీతో తీసిన ఖైదీ’, కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ ఈ పంథాననుసరించాయి. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ శివ కార్తికేయన్ తో తీసిన డాక్టర్’, రజనీ కాంత్ తో తీసిన తాజా జైలర్ దీనికి అద్దం పడతాయి. బాలీవుడ్ ఈ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించక ఫ్లాపులతో కుంగుతోంది. టాలీవుడ్ ఇంకా చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్ ల కాలం నాటి మూస ఫార్ములా- టెంప్లెట్ లోనే ఇరుక్కుని భోళాశంకర్ లాంటి పరాభవాల్ని చవిచూస్తోంది.

        రీబూట్ చేసిన సీనియర్ స్టార్ కమర్షియల్ కి జైలర్ ని మించిన ఆధునిక మోడల్ లేదు. ఇంకా సీనియర్ స్టార్ ని మూసఫార్ములా టెంప్లెట్ కథా కథనాలతో బంధించి ఇమేజిని కాపాడలేరు. ఇమేజి మారాల్సిందే. పాత్రలు, పాత్ర చిత్రణలు మారాల్సిందే. నాల్గు పాటలు, వాటికి స్టెప్పులు, నాల్గు ఫైట్లు, కామెడీలూ ఇవన్నీ వదులుకుని ముందుకు పోతున్నారు తమిళ స్టార్ల ఫ్యాన్స్ తో బాటు ప్రేక్షకులు. కానీ తెలుగు స్టార్ల ఫ్యాన్స్, ప్రేక్షకులు కాలంలో ఎక్కడో ఇరుక్కుని వాటినే డిమాండ్ చేసి తృప్తి తీర్చుకుంటున్నారు. ఆధునిక దృక్పథమనే మాటే లేదు.
       
ఈ పూర్వరంగంలో
జైలర్ స్క్రీన్ ప్లే సంగతులు పరిశీలించాల్సిన అవసరమేర్పడుతోంది. అసలు జైలర్ స్క్రీన్ ప్లే కథా, గాథా? కథతో కూడిన గాథా, గాథతో కూడిన కథా? కథ తీస్తున్నామనుకుని గాథ తీసి ఫ్లాప్ చేసుకున్న సినిమాలెన్నో- తాజా బ్రో సహా. సినిమాలు కథతో వుంటాయి, లేకపోతే గాథతో వుంటాయి. ఈ రెండూగాక కథతో కూడిన గాథ ఏమిటి? గాథతో కూడిన కథేమిటి? మళ్ళీ ఇందులో డాక్యుమెంటరీ తరహా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఏమిటి? ఇలాటిది బహుశా ఇంతవరకూ చూడలేదు. జైలర్ లో ఎందుకు చూశాం? సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన  జైలర్ అన్ని స్క్రీన్ ప్లే నియమాలనూ ఉల్లంఘించి కూడా పది రోజుల్లో 500 కోట్లు వసూలు చేసిందంటే దీని స్క్రీన్ ప్లేని పోస్ట్ మార్టం చేసి చూడాల్సిందే. ఈ పని మొదలెడదాం. ముందుగా విషయమేమిటో చూద్దాం...

విషయం ఇదీ!

    ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) భార్య విజయ (రమ్యకృష్ణ) తో, కొడుకు అర్జున్ (వసంత్ రవి)- కోడలు శ్వేత (మిర్నా మీనన్) – మనవడు ఋత్విక్ లతో రిటైర్మెంట్ జీవితాన్నిసంతోషంగా గడుపుతూంటాడు. ఋత్విక్ యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుకోవడంలో తోడ్పడుతూ వుంటాడు. కొడుకు అర్జున్ ఎవరికీ భయపడని నిజాయితీగల ఏసీపీ. దేవుళ్ళ విగ్రహాల్ని విదేశాలకి స్మగ్లింగ్ చేసే మలయాళీ గ్యాంగ్‌స్టర్ వర్మ (వినాయకన్) పై అర్జున్ దర్యాప్తు చేస్తూంటాడు. ఈ క్రమంలో వర్మ అనుచరుడు శీనుని ఎదుర్కొంటాడు. వర్మ ఆచూకీ గురించి శీను చెప్పడు. అర్జున్ వర్మని పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ అకస్మాత్తుగా తప్పిపోతాడు. అతడ్ని వర్మ చంపివుంటాడనే విషయాన్ని కప్పిపుచ్చడానికి ఆత్మహత్యకి  పాల్పడి వుండవచ్చని పోలీసు శాఖ ప్రచారం చేస్తుంది. 
        
కొడుకుని పోగొట్టుకున్న ముత్తువేల్ దుఃఖిస్తూ, కొడుకుని మరీ అంత  నిజాయితీపరుడిగా, నిర్భయుడిగా పెంచడం తప్పయినట్టు పశ్చాత్తాపపడుతూ, ఒక నిర్ణయం తీసుకుంటాడు. పోలీసు శాఖ సహకరించక పోతే తానే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాడు. వర్మ అనుచరుడు శీనుని చంపి, స్థానిక టాక్సీ డ్రైవర్ విమల్ (యోగిబాబు) సాయంతో శవాన్ని మాయం చేస్తాడు.
       
దీంతో
వర్మ మనుషులు ముత్తువేల్ మనవడి మీద హత్యాయత్నానికి పాల్పడతారు. ముత్తువేల్ మనవడ్ని కాపాడుకుంటాడు. వర్మ ఫోన్ చేసి, ఎన్నిసార్లు కుటుంబాన్ని కాపాడుకుంటావని వెక్కిరిస్తాడు. కుటుంబంలో ఒకొక్కర్నీ చంపుతానని హెచ్చరిస్తాడు. ముత్తువేల్ వర్మ అనుచరులిద్దరిని ట్రాప్ చేసి చంపేస్తాడు. తర్వాత భద్రత కోసం కుటుంబాన్ని ఒక సైకియాట్రిస్టు ఇంట్లో వుంచి, కర్ణాటక బయల్దేరతాడు. అక్కడ ఒక పరివర్తన చెందిన నేరస్థుడు నరసింహ (శివరాజ్ కుమార్) ని కలిసి, నలుగురు షార్ప్ షూటర్స్ ని ఏర్పాటు చేయమని కోరతాడు ముత్తువేల్.

       
షార్ప్ షూటర్స్ సాయంతో ముత్తువేల్ వర్మని అవమానించి
, బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో వర్మ, బీహారీ గ్యాంగ్ స్టర్ కామదేవ్ (జాకీష్రాఫ్) సాయం తీసుకుంటాడు. గ్యాంగ్ ని పంపి ముత్తువేల్ కుటుంబాన్ని చంపమని కోరతాడు. ఇంటి మీద దాడి చేసిన కామదేవ్ గ్యాంగ్ ని ముత్తువేల్ షార్ప్ షూటర్స్ చంపేస్తారు. విజయగర్వంతో పిచ్చిగా నవ్వుతాడు ముత్తువేల్.
       
ఇప్పుడు వర్మ టార్గెట్ ముత్తువేల్ అని అసలు విషయం తెలుసుకున్న కామదేవ్
, ముత్తువేల్ అసలెవరో వర్మకి చెప్తాడు. పూర్వం ముత్తువేల్ తీహార్ జైలులో జైలర్. ఖైదీలతో కఠినంగా వ్యవహరించే జైలర్ ముత్తువేల్, వాళ్ళని సంస్కరించే ప్రయత్నం చేసేవాడు. ఈ క్రమంలో ఖైదీలతో బాటు గ్యాంగ్ స్టర్ కామదేవ్ తో, ఇంకా అనేక మంది క్రిమినల్స్ తో ముత్తువేల్ కి నెట్ వర్క్ ఏర్పాటయింది. అతడికి సాయపడే ఈ నెట్ వర్క్ లో ఒక సభ్యుడే నరసింహా. ఈ గతమంతా తెలుసుకున్న వర్మకి, ముత్తువేల్ పవర్ అర్ధమవుతుంది.
       
ఇప్పుడు తన ఇంటిమీద జరిగిన దాడిని తిప్పికొట్టిన ముత్తువేల్
, డైరెక్టుగా తేల్చుకుందామని వర్మ స్థావరాని కెళ్తాడు. వర్మని కొట్టిపడేసి చంపబోతూంటే, వర్మ ముత్తువేల్ కొడుకు అర్జున్ వీడియో చూపిస్తాడు. అర్జున్ చనిపోలేదు, వర్మ బందీగా బ్రతికే వున్నాడు. ఈ నిజం తెలుసుకున్న ముత్తువేల్ కి, వర్మ ఒక బేరం పెడతాడు. కొడుకు సజీవంగా దక్కాలంటే, ఒక ఆలయంలో వున్న ప్రసిద్ధ పురాతన కిరీటాన్ని తెచ్చివ్వాలంటాడు.  ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో వుంది.
        
ముత్తువేల్ ఆలయానికి ట్రస్టీగా వున్న బ్లాస్ట్ మోహన్ (సునీల్) అనే సినిమా నటుడి మీద దృష్టి పెడతాడు. మోహన్ నటి కామనా (తమన్నా) ని ప్రేమిస్తూంటాడు. దర్శకుడు కూడా కామనాని ప్రేమిస్తూంటాడు. ఈ వ్యవహారంలో తలదూర్చి ఆలయంలో కిరీటం దోపిడీకి ప్లానేస్తాడు ముత్తువేల్. దీనికి తన నెట్ వర్క్ లో ముంబాయిలోని స్మగ్లర్‌ మాథ్యూ (మోహన్ లాల్) సాయం తీసుకుని కిరీటాన్ని కాజేస్తాడు. దాన్ని వర్మకి పంపిస్తాడు.
        
కిరీటాన్ని అందుకున్న వర్మ ముత్తువేల్ కొడుకు అర్జున్ ని విడుదల చేస్తాడు. ఇప్పుడు ఏసీపీ అర్జున్ తన అసలు స్వరూపం బయటపెడతాడు. నీతీ నిజాయితీలు కాదని, డబ్బు సంపాదించుకోవాలని, వర్మ తనకి షేర్ ఇస్తే తండ్రి ముత్తువేల్ ని చంపి అడ్డు తొలగిస్తాననీ అంటాడు. కిరీటంలో వున్న హిడెన్ కెమెరా ద్వారా ఇదంతా చూస్తున్న ముత్తువేల్, కొడుకు విశ్వాసఘాతానికి ఖిన్నుడవుతాడు. ఆ కిరీటం నకిలీదని తెలుసుకుని వర్మ పిచ్చెత్తిపోతాడు. ముత్తువేల్ వచ్చేసి వర్మ స్థావరాన్ని ధ్వంసం చేసి, అతడ్ని అంతమొందించేస్తాడు. కొడుకుకి ఒక అవకాశమిస్తూ చట్టానికి లొంగిపొమ్మంటాడు. కొడుకు అర్జున్ వినకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. నరసింహా షార్ప్ షూటర్స్ అతడ్ని చంపేస్తారు.

టెస్ట్ తో స్క్రీన్ ప్లే సంగతులు

ఇప్పుడొక చిన్న టెస్టు పెట్టుకుందాం. ఈ టెస్టుతో స్క్రీన్ ప్లే అంటే ఎవరికెంత తెలుసో తేలిపోతుంది. తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్దాం. పై విషయంలో- ట్రీట్ మెంట్ లో- లేదా స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్స్ ఎక్కడెక్కడున్నాయి? ఇంకోసారి మొత్తం చదవండి. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుంది? ప్లాట్ పాయింట్ టూ ఎక్కడుంది? బిగినింగ్ ఎంతవరకూ వుంది? మిడిల్ ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసింది? ఎండ్ ఎక్కడ మొదలైంది? ఈ బ్లాగు ద్వారా ఇంతకాలం సంపాదించుకున్న జ్ఞానంతో శ్రద్ధగా చదివి, ప్లాట్ పాయింట్స్ ని, యాక్ట్స్ నీ గుర్తిస్తేనే తర్వాత స్క్రీన్ ప్లే సంగతులు అర్ధమవుతాయి....
        టైమ్ తీసుకోండి. సాయంత్రం ఇక్కడే కలుద్దాం. స్క్రీన్ ప్లే సంగతులు పూర్తి చేద్దాం...
—సికిందర్

22, ఆగస్టు 2023, మంగళవారం

1355 : స్పెషల్ ఆర్టికల్


 

            వర్-ది-టాప్ (ఓటీటీ) కంపెనీల ఆగమనంతో సినిమా హాళ్ళు సంక్షోభంలో పడ్డాయన్న ఆందోళన కాలక్రమంలో తగ్గిపోతూ వస్తోంది. సినిమా ప్రపంచం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన మార్పుకి గురైంది. సినిమాలు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు మొదలైన వినోద కాలక్షేపపు విస్తృత కంటెంట్‌ ని ఓటీటీలు అందించడంతో ప్రేక్షకులు సినిమా హాళ్ళకి వెళ్ళడం తగ్గించేశారన్న అంచనాల్ని గణాంకాలతో వెల్లడిస్తూ వచ్చారు మార్కెట్ రీసెర్చర్లు. అయితే దీనికి భిన్నంగా, పీవీఆర్- ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ గ్రూపు సంస్థ క్వాలిటీ లేని హిందీ సినిమాల వల్ల తమకు నష్టాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఆరోపించడం మొదలెట్టింది. దీన్ని తట్టుకోవడానికి హాలీవుడ్, కొరియన్ సినిమాలు ఆడించుకుంటున్నామని ప్రకటించుకుంది.

        ది నిజం? ఓటీటీలతో సినిమా హాళ్ళకి ప్రమాదమా, లేక హిందీ సినిమాల క్వాలిటీ రాహిత్యంతో థియేటర్లకి నష్టాలా? ఏది నిజం? రెండోదే నిజం కావచ్చని ఈ నెల విడుదలైన గదర్ 2, ఓఎంజీ2 హిందీ సినిమాలు సంకేతాలిస్తున్నాయి. మొదటిది భారీ హిట్టయి, రెండోది బ్రేక్ ఈవెన్ తో హిట్టయి సినిమా హాళ్ళకి ప్రాణం పోశాయి. క్వాలిటీ విషయానికొస్తే మొదటి దానికి పరమ చెత్త అని 1, 1.5 రెంటింగ్స్ తో రివ్యూలొచ్చాయి. సినిమా చూస్తే పరమ హిట్టయి రివ్యూలని వెక్కిరిస్తోంది.
       
పైగా పీవీఆర్- ఐనాక్స్ అభిప్రాయం కూడా తప్పని రుజువు చేస్తోందీ సినిమా. ఇప్పుడు గదర్2 లాంటి క్వాలిటీ లేని హిందీ సినిమాయే తమకి కనకవర్షం కురిపిస్తోంది. బాక్సాఫీసు 400 కోట్లకి చేరువలో వుంది. కారణం
, పక్కా మాస్ మూవీ కోసం మొహం వాచి వున్న నార్త్ ఇండియా రూరల్ ప్రేక్షకుల ఆకలిని తీర్చేయడం. మారు మూల మూతబడడానికి సిద్ధంగా వున్న పాత తరం సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళు కూడా గదర్ 2 తో ప్రాణం పోసుకుని, సినిమా అంటే ఇది కదాని బూజు దులుపుకుంటున్నాయి.
       
పీవీఆర్- ఐనాక్స్ చెప్పే క్వాలిటీ ఓఎంజీ2 లో తప్పకుండా వుంది. క్వాలిటీతోనే ఇది 100 కోట్లు కలెక్షన్లు దాటింది. అంటే ఓటీటీల వల్ల ప్రేక్షకులు సినిమా హాళ్ళకి దూరం కాలేదని
, వాళ్ళకి కావాల్సిన సినిమా వస్తే థియేటర్లలో పెద్ద తెరపై చూడడానికి క్రిక్కిరిసి పోతారనీ ఈ రెండు సినిమాలూ చెబుతున్నాయి. ప్రశ్నేమిటంటే, వాళ్ళకి కావాల్సిన సినిమా అంటే ఏది? ముందుగా ఎలా నిర్ణయించడం? నిర్ణయించి అలాటి సినిమా ఎలా తీయడం? గదర్ 2 ని సక్సెస్ ఫార్ములా ముందు నిర్ణయించి తీశారా? తీస్తే అంత అడ్డగోలుగా ఎందుకుంటుంది? పోనీ అడ్డగోలుగా తీస్తే సినిమా హిట్టవుతుందని నమ్మి తీయ వచ్చా? కాబట్టి ఇదంతా జూదం. అదృష్టం మీద ఆధారపడి వుంటుంది. మేకర్స్ చేయాల్సింది క్వాలిటీని అందించడమే. ఇది సులభం. ఎంత సులభమో ఓఎంజీ2 చెప్తోంది. గదర్ 2 జూదం. ఎప్పుడో గానీ జాక్ పాట్ కొట్టవు ఇలాటి సినిమాలు.  
       
హిందీలో ఈ రెండు సినిమాలే కాదు
, సౌత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ కూడా ఓటీటీల వల్ల సినిమా హాళ్ళకి నష్టమన్న అభిప్రాయాన్ని తుడిచేసింది. 10 రోజుల్లో 500 కోట్ల థియేటర్ కలెక్షన్లతో విజయయాత్ర కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు దాటింది. క్వాలిటీ పరంగా ఇది గదర్ 2 కి పూర్తిగా భిన్నం. క్వాలిటీగా తీసిన మాస్ కమర్షియల్ ఇది. ఇందులో రజనీ పాత్ర రెగ్యులర్ ఫ్యాన్ ఎలిమెంట్స్ తో వుండదు. అయినా పంచ్ డైలాగులు, రోమాన్సులు, కామెడీలు, పాటలు, స్టెప్పులు, ఫైట్లు అని ఫ్యాన్స్ మడి గట్టుకుని కూర్చోకుండా భుజానెత్తుకున్నారు.
       
ప్రేక్షకులకి క్వాలిటీ వీక్షణానుభవమివ్వడానికి అనునిత్యం థియేటర్లు ఆధునిక సాంకేతిక ఆవిష్కణల్ని సమకూర్చుకుంటున్నాయి.
చాలా థియేటర్లు ఐమాక్స్, 4 డీ ఎక్స్ స్క్రీన్స్ తో మరింత లీనమయ్యే వీక్షణానుభవాన్ని అందిస్తున్నాయి. కానీ వీటిలో ప్రదర్శించే సినిమాలు మాత్రం పూర్ క్వాలిటీతో పేరు గొప్ప వూరు దిబ్బ అన్నట్టు థియేటర్ల పరువే  తీస్తున్నాయి.
       
ఓటీటీలతో సినిమా హాళ్ళకి ఎక్కడ సమస్య వస్తోందంటే
, సినిమాలు విడుదలైన నాల్గైదు వారాల్లో ఓటీటీల కిచ్చేస్తున్నారు. దీంతో పట్టుమని రెండు వారాలు హిట్టయిన సినిమాలు కూడా థియేటర్లలో ఆడడం లేదు. నాల్గు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదాని ప్రేక్షకులు ఉపేక్షిస్తున్నారు. ఇది చాలనట్టు మీడియా ధోరణి కూడా వుంది. సినిమా విడుదలైన రోజునుంచే - ఈ సినిమా ఏ ఒటీటీలో? ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఓటీటీ డేట్ ఫిక్స్- అంటూ అనాలోచితంగా పోటీలు పడి మీడియాలో రాతలు రాసేస్తున్నారు. సినిమా విడుదలైంది సినిమా హాళ్ళ కోసమా, ఓటీటీల కోసమా? ఈ సినిమా బ్రహ్మాండంగా వుంది వెళ్ళి థియేటర్లో చూడండని ప్రోత్సహించకుండా, థియేటర్లని దెబ్బ కొట్టేలా ఓటీటీ న్యూస్ ఇవ్వడమేమిటో వాళ్ళ ముతక జర్నలిజానికే తెలియాలి. ప్రేక్షకులకి జ్ఞాపకాల్ని మిగిల్చేవి సినిమా హాళ్ళే. ఓటీటీలు కాదు. నేటి హైటెక్ యూత్ కైనా రేపు ముసలి తనంలో ఫలానా సినిమా ఫలానా థియేటర్లో చూశాం కదాని ఆనాటి ముచ్చట్లు చెప్పుకునేలా చేసేవి థియేటర్లే!

—సికిందర్