రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, ఆగస్టు 2023, గురువారం

1356 : స్క్రీన్ ప్లే సంగతులు!


     మిళంలో పా. రంజిత్, లోకేష్ కనక రాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ నవతరం దర్శకులు ముగ్గురూ స్టార్ సినిమాల కథల్ని, పాత్ర చిత్రణల్ని మూస ఫార్ములా - టెంప్లెట్ చట్రంలోంచి బయటికి తీసి కమర్షియల్ సినిమాలకి కొత్త రూపం తొడుగుతున్నారు. కథలు, పాత్ర చిత్రణలే కాదు, కథనాన్ని కూడా సాంప్రదాయ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తో విభేదించి స్ట్రక్చరేతర రియలిస్టిక్ జానర్లోకి మార్చేస్తున్నారు. పా. రంజిత్ రజనీకాంత్ తో తీసిన కబాలీ’, కాలా’, ఆర్యతో తీసిన సార్పట్టా ఈ కోవలో కొస్తాయి. లోకేష్ కనక రాజ్ కార్తీతో తీసిన ఖైదీ’, కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ ఈ పంథాననుసరించాయి. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ శివ కార్తికేయన్ తో తీసిన డాక్టర్’, రజనీ కాంత్ తో తీసిన తాజా జైలర్ దీనికి అద్దం పడతాయి. బాలీవుడ్ ఈ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించక ఫ్లాపులతో కుంగుతోంది. టాలీవుడ్ ఇంకా చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్ ల కాలం నాటి మూస ఫార్ములా- టెంప్లెట్ లోనే ఇరుక్కుని భోళాశంకర్ లాంటి పరాభవాల్ని చవిచూస్తోంది.

        రీబూట్ చేసిన సీనియర్ స్టార్ కమర్షియల్ కి జైలర్ ని మించిన ఆధునిక మోడల్ లేదు. ఇంకా సీనియర్ స్టార్ ని మూసఫార్ములా టెంప్లెట్ కథా కథనాలతో బంధించి ఇమేజిని కాపాడలేరు. ఇమేజి మారాల్సిందే. పాత్రలు, పాత్ర చిత్రణలు మారాల్సిందే. నాల్గు పాటలు, వాటికి స్టెప్పులు, నాల్గు ఫైట్లు, కామెడీలూ ఇవన్నీ వదులుకుని ముందుకు పోతున్నారు తమిళ స్టార్ల ఫ్యాన్స్ తో బాటు ప్రేక్షకులు. కానీ తెలుగు స్టార్ల ఫ్యాన్స్, ప్రేక్షకులు కాలంలో ఎక్కడో ఇరుక్కుని వాటినే డిమాండ్ చేసి తృప్తి తీర్చుకుంటున్నారు. ఆధునిక దృక్పథమనే మాటే లేదు.
       
ఈ పూర్వరంగంలో
జైలర్ స్క్రీన్ ప్లే సంగతులు పరిశీలించాల్సిన అవసరమేర్పడుతోంది. అసలు జైలర్ స్క్రీన్ ప్లే కథా, గాథా? కథతో కూడిన గాథా, గాథతో కూడిన కథా? కథ తీస్తున్నామనుకుని గాథ తీసి ఫ్లాప్ చేసుకున్న సినిమాలెన్నో- తాజా బ్రో సహా. సినిమాలు కథతో వుంటాయి, లేకపోతే గాథతో వుంటాయి. ఈ రెండూగాక కథతో కూడిన గాథ ఏమిటి? గాథతో కూడిన కథేమిటి? మళ్ళీ ఇందులో డాక్యుమెంటరీ తరహా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఏమిటి? ఇలాటిది బహుశా ఇంతవరకూ చూడలేదు. జైలర్ లో ఎందుకు చూశాం? సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన  జైలర్ అన్ని స్క్రీన్ ప్లే నియమాలనూ ఉల్లంఘించి కూడా పది రోజుల్లో 500 కోట్లు వసూలు చేసిందంటే దీని స్క్రీన్ ప్లేని పోస్ట్ మార్టం చేసి చూడాల్సిందే. ఈ పని మొదలెడదాం. ముందుగా విషయమేమిటో చూద్దాం...

విషయం ఇదీ!

    ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) భార్య విజయ (రమ్యకృష్ణ) తో, కొడుకు అర్జున్ (వసంత్ రవి)- కోడలు శ్వేత (మిర్నా మీనన్) – మనవడు ఋత్విక్ లతో రిటైర్మెంట్ జీవితాన్నిసంతోషంగా గడుపుతూంటాడు. ఋత్విక్ యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుకోవడంలో తోడ్పడుతూ వుంటాడు. కొడుకు అర్జున్ ఎవరికీ భయపడని నిజాయితీగల ఏసీపీ. దేవుళ్ళ విగ్రహాల్ని విదేశాలకి స్మగ్లింగ్ చేసే మలయాళీ గ్యాంగ్‌స్టర్ వర్మ (వినాయకన్) పై అర్జున్ దర్యాప్తు చేస్తూంటాడు. ఈ క్రమంలో వర్మ అనుచరుడు శీనుని ఎదుర్కొంటాడు. వర్మ ఆచూకీ గురించి శీను చెప్పడు. అర్జున్ వర్మని పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ అకస్మాత్తుగా తప్పిపోతాడు. అతడ్ని వర్మ చంపివుంటాడనే విషయాన్ని కప్పిపుచ్చడానికి ఆత్మహత్యకి  పాల్పడి వుండవచ్చని పోలీసు శాఖ ప్రచారం చేస్తుంది. 
        
కొడుకుని పోగొట్టుకున్న ముత్తువేల్ దుఃఖిస్తూ, కొడుకుని మరీ అంత  నిజాయితీపరుడిగా, నిర్భయుడిగా పెంచడం తప్పయినట్టు పశ్చాత్తాపపడుతూ, ఒక నిర్ణయం తీసుకుంటాడు. పోలీసు శాఖ సహకరించక పోతే తానే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాడు. వర్మ అనుచరుడు శీనుని చంపి, స్థానిక టాక్సీ డ్రైవర్ విమల్ (యోగిబాబు) సాయంతో శవాన్ని మాయం చేస్తాడు.
       
దీంతో
వర్మ మనుషులు ముత్తువేల్ మనవడి మీద హత్యాయత్నానికి పాల్పడతారు. ముత్తువేల్ మనవడ్ని కాపాడుకుంటాడు. వర్మ ఫోన్ చేసి, ఎన్నిసార్లు కుటుంబాన్ని కాపాడుకుంటావని వెక్కిరిస్తాడు. కుటుంబంలో ఒకొక్కర్నీ చంపుతానని హెచ్చరిస్తాడు. ముత్తువేల్ వర్మ అనుచరులిద్దరిని ట్రాప్ చేసి చంపేస్తాడు. తర్వాత భద్రత కోసం కుటుంబాన్ని ఒక సైకియాట్రిస్టు ఇంట్లో వుంచి, కర్ణాటక బయల్దేరతాడు. అక్కడ ఒక పరివర్తన చెందిన నేరస్థుడు నరసింహ (శివరాజ్ కుమార్) ని కలిసి, నలుగురు షార్ప్ షూటర్స్ ని ఏర్పాటు చేయమని కోరతాడు ముత్తువేల్.

       
షార్ప్ షూటర్స్ సాయంతో ముత్తువేల్ వర్మని అవమానించి
, బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో వర్మ, బీహారీ గ్యాంగ్ స్టర్ కామదేవ్ (జాకీష్రాఫ్) సాయం తీసుకుంటాడు. గ్యాంగ్ ని పంపి ముత్తువేల్ కుటుంబాన్ని చంపమని కోరతాడు. ఇంటి మీద దాడి చేసిన కామదేవ్ గ్యాంగ్ ని ముత్తువేల్ షార్ప్ షూటర్స్ చంపేస్తారు. విజయగర్వంతో పిచ్చిగా నవ్వుతాడు ముత్తువేల్.
       
ఇప్పుడు వర్మ టార్గెట్ ముత్తువేల్ అని అసలు విషయం తెలుసుకున్న కామదేవ్
, ముత్తువేల్ అసలెవరో వర్మకి చెప్తాడు. పూర్వం ముత్తువేల్ తీహార్ జైలులో జైలర్. ఖైదీలతో కఠినంగా వ్యవహరించే జైలర్ ముత్తువేల్, వాళ్ళని సంస్కరించే ప్రయత్నం చేసేవాడు. ఈ క్రమంలో ఖైదీలతో బాటు గ్యాంగ్ స్టర్ కామదేవ్ తో, ఇంకా అనేక మంది క్రిమినల్స్ తో ముత్తువేల్ కి నెట్ వర్క్ ఏర్పాటయింది. అతడికి సాయపడే ఈ నెట్ వర్క్ లో ఒక సభ్యుడే నరసింహా. ఈ గతమంతా తెలుసుకున్న వర్మకి, ముత్తువేల్ పవర్ అర్ధమవుతుంది.
       
ఇప్పుడు తన ఇంటిమీద జరిగిన దాడిని తిప్పికొట్టిన ముత్తువేల్
, డైరెక్టుగా తేల్చుకుందామని వర్మ స్థావరాని కెళ్తాడు. వర్మని కొట్టిపడేసి చంపబోతూంటే, వర్మ ముత్తువేల్ కొడుకు అర్జున్ వీడియో చూపిస్తాడు. అర్జున్ చనిపోలేదు, వర్మ బందీగా బ్రతికే వున్నాడు. ఈ నిజం తెలుసుకున్న ముత్తువేల్ కి, వర్మ ఒక బేరం పెడతాడు. కొడుకు సజీవంగా దక్కాలంటే, ఒక ఆలయంలో వున్న ప్రసిద్ధ పురాతన కిరీటాన్ని తెచ్చివ్వాలంటాడు.  ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో వుంది.
        
ముత్తువేల్ ఆలయానికి ట్రస్టీగా వున్న బ్లాస్ట్ మోహన్ (సునీల్) అనే సినిమా నటుడి మీద దృష్టి పెడతాడు. మోహన్ నటి కామనా (తమన్నా) ని ప్రేమిస్తూంటాడు. దర్శకుడు కూడా కామనాని ప్రేమిస్తూంటాడు. ఈ వ్యవహారంలో తలదూర్చి ఆలయంలో కిరీటం దోపిడీకి ప్లానేస్తాడు ముత్తువేల్. దీనికి తన నెట్ వర్క్ లో ముంబాయిలోని స్మగ్లర్‌ మాథ్యూ (మోహన్ లాల్) సాయం తీసుకుని కిరీటాన్ని కాజేస్తాడు. దాన్ని వర్మకి పంపిస్తాడు.
        
కిరీటాన్ని అందుకున్న వర్మ ముత్తువేల్ కొడుకు అర్జున్ ని విడుదల చేస్తాడు. ఇప్పుడు ఏసీపీ అర్జున్ తన అసలు స్వరూపం బయటపెడతాడు. నీతీ నిజాయితీలు కాదని, డబ్బు సంపాదించుకోవాలని, వర్మ తనకి షేర్ ఇస్తే తండ్రి ముత్తువేల్ ని చంపి అడ్డు తొలగిస్తాననీ అంటాడు. కిరీటంలో వున్న హిడెన్ కెమెరా ద్వారా ఇదంతా చూస్తున్న ముత్తువేల్, కొడుకు విశ్వాసఘాతానికి ఖిన్నుడవుతాడు. ఆ కిరీటం నకిలీదని తెలుసుకుని వర్మ పిచ్చెత్తిపోతాడు. ముత్తువేల్ వచ్చేసి వర్మ స్థావరాన్ని ధ్వంసం చేసి, అతడ్ని అంతమొందించేస్తాడు. కొడుకుకి ఒక అవకాశమిస్తూ చట్టానికి లొంగిపొమ్మంటాడు. కొడుకు అర్జున్ వినకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. నరసింహా షార్ప్ షూటర్స్ అతడ్ని చంపేస్తారు.

టెస్ట్ తో స్క్రీన్ ప్లే సంగతులు

ఇప్పుడొక చిన్న టెస్టు పెట్టుకుందాం. ఈ టెస్టుతో స్క్రీన్ ప్లే అంటే ఎవరికెంత తెలుసో తేలిపోతుంది. తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్దాం. పై విషయంలో- ట్రీట్ మెంట్ లో- లేదా స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్స్ ఎక్కడెక్కడున్నాయి? ఇంకోసారి మొత్తం చదవండి. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుంది? ప్లాట్ పాయింట్ టూ ఎక్కడుంది? బిగినింగ్ ఎంతవరకూ వుంది? మిడిల్ ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసింది? ఎండ్ ఎక్కడ మొదలైంది? ఈ బ్లాగు ద్వారా ఇంతకాలం సంపాదించుకున్న జ్ఞానంతో శ్రద్ధగా చదివి, ప్లాట్ పాయింట్స్ ని, యాక్ట్స్ నీ గుర్తిస్తేనే తర్వాత స్క్రీన్ ప్లే సంగతులు అర్ధమవుతాయి....
        టైమ్ తీసుకోండి. సాయంత్రం ఇక్కడే కలుద్దాం. స్క్రీన్ ప్లే సంగతులు పూర్తి చేద్దాం...
—సికిందర్

22, ఆగస్టు 2023, మంగళవారం

1355 : స్పెషల్ ఆర్టికల్


 

            వర్-ది-టాప్ (ఓటీటీ) కంపెనీల ఆగమనంతో సినిమా హాళ్ళు సంక్షోభంలో పడ్డాయన్న ఆందోళన కాలక్రమంలో తగ్గిపోతూ వస్తోంది. సినిమా ప్రపంచం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన మార్పుకి గురైంది. సినిమాలు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు మొదలైన వినోద కాలక్షేపపు విస్తృత కంటెంట్‌ ని ఓటీటీలు అందించడంతో ప్రేక్షకులు సినిమా హాళ్ళకి వెళ్ళడం తగ్గించేశారన్న అంచనాల్ని గణాంకాలతో వెల్లడిస్తూ వచ్చారు మార్కెట్ రీసెర్చర్లు. అయితే దీనికి భిన్నంగా, పీవీఆర్- ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ గ్రూపు సంస్థ క్వాలిటీ లేని హిందీ సినిమాల వల్ల తమకు నష్టాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఆరోపించడం మొదలెట్టింది. దీన్ని తట్టుకోవడానికి హాలీవుడ్, కొరియన్ సినిమాలు ఆడించుకుంటున్నామని ప్రకటించుకుంది.

        ది నిజం? ఓటీటీలతో సినిమా హాళ్ళకి ప్రమాదమా, లేక హిందీ సినిమాల క్వాలిటీ రాహిత్యంతో థియేటర్లకి నష్టాలా? ఏది నిజం? రెండోదే నిజం కావచ్చని ఈ నెల విడుదలైన గదర్ 2, ఓఎంజీ2 హిందీ సినిమాలు సంకేతాలిస్తున్నాయి. మొదటిది భారీ హిట్టయి, రెండోది బ్రేక్ ఈవెన్ తో హిట్టయి సినిమా హాళ్ళకి ప్రాణం పోశాయి. క్వాలిటీ విషయానికొస్తే మొదటి దానికి పరమ చెత్త అని 1, 1.5 రెంటింగ్స్ తో రివ్యూలొచ్చాయి. సినిమా చూస్తే పరమ హిట్టయి రివ్యూలని వెక్కిరిస్తోంది.
       
పైగా పీవీఆర్- ఐనాక్స్ అభిప్రాయం కూడా తప్పని రుజువు చేస్తోందీ సినిమా. ఇప్పుడు గదర్2 లాంటి క్వాలిటీ లేని హిందీ సినిమాయే తమకి కనకవర్షం కురిపిస్తోంది. బాక్సాఫీసు 400 కోట్లకి చేరువలో వుంది. కారణం
, పక్కా మాస్ మూవీ కోసం మొహం వాచి వున్న నార్త్ ఇండియా రూరల్ ప్రేక్షకుల ఆకలిని తీర్చేయడం. మారు మూల మూతబడడానికి సిద్ధంగా వున్న పాత తరం సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళు కూడా గదర్ 2 తో ప్రాణం పోసుకుని, సినిమా అంటే ఇది కదాని బూజు దులుపుకుంటున్నాయి.
       
పీవీఆర్- ఐనాక్స్ చెప్పే క్వాలిటీ ఓఎంజీ2 లో తప్పకుండా వుంది. క్వాలిటీతోనే ఇది 100 కోట్లు కలెక్షన్లు దాటింది. అంటే ఓటీటీల వల్ల ప్రేక్షకులు సినిమా హాళ్ళకి దూరం కాలేదని
, వాళ్ళకి కావాల్సిన సినిమా వస్తే థియేటర్లలో పెద్ద తెరపై చూడడానికి క్రిక్కిరిసి పోతారనీ ఈ రెండు సినిమాలూ చెబుతున్నాయి. ప్రశ్నేమిటంటే, వాళ్ళకి కావాల్సిన సినిమా అంటే ఏది? ముందుగా ఎలా నిర్ణయించడం? నిర్ణయించి అలాటి సినిమా ఎలా తీయడం? గదర్ 2 ని సక్సెస్ ఫార్ములా ముందు నిర్ణయించి తీశారా? తీస్తే అంత అడ్డగోలుగా ఎందుకుంటుంది? పోనీ అడ్డగోలుగా తీస్తే సినిమా హిట్టవుతుందని నమ్మి తీయ వచ్చా? కాబట్టి ఇదంతా జూదం. అదృష్టం మీద ఆధారపడి వుంటుంది. మేకర్స్ చేయాల్సింది క్వాలిటీని అందించడమే. ఇది సులభం. ఎంత సులభమో ఓఎంజీ2 చెప్తోంది. గదర్ 2 జూదం. ఎప్పుడో గానీ జాక్ పాట్ కొట్టవు ఇలాటి సినిమాలు.  
       
హిందీలో ఈ రెండు సినిమాలే కాదు
, సౌత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ కూడా ఓటీటీల వల్ల సినిమా హాళ్ళకి నష్టమన్న అభిప్రాయాన్ని తుడిచేసింది. 10 రోజుల్లో 500 కోట్ల థియేటర్ కలెక్షన్లతో విజయయాత్ర కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు దాటింది. క్వాలిటీ పరంగా ఇది గదర్ 2 కి పూర్తిగా భిన్నం. క్వాలిటీగా తీసిన మాస్ కమర్షియల్ ఇది. ఇందులో రజనీ పాత్ర రెగ్యులర్ ఫ్యాన్ ఎలిమెంట్స్ తో వుండదు. అయినా పంచ్ డైలాగులు, రోమాన్సులు, కామెడీలు, పాటలు, స్టెప్పులు, ఫైట్లు అని ఫ్యాన్స్ మడి గట్టుకుని కూర్చోకుండా భుజానెత్తుకున్నారు.
       
ప్రేక్షకులకి క్వాలిటీ వీక్షణానుభవమివ్వడానికి అనునిత్యం థియేటర్లు ఆధునిక సాంకేతిక ఆవిష్కణల్ని సమకూర్చుకుంటున్నాయి.
చాలా థియేటర్లు ఐమాక్స్, 4 డీ ఎక్స్ స్క్రీన్స్ తో మరింత లీనమయ్యే వీక్షణానుభవాన్ని అందిస్తున్నాయి. కానీ వీటిలో ప్రదర్శించే సినిమాలు మాత్రం పూర్ క్వాలిటీతో పేరు గొప్ప వూరు దిబ్బ అన్నట్టు థియేటర్ల పరువే  తీస్తున్నాయి.
       
ఓటీటీలతో సినిమా హాళ్ళకి ఎక్కడ సమస్య వస్తోందంటే
, సినిమాలు విడుదలైన నాల్గైదు వారాల్లో ఓటీటీల కిచ్చేస్తున్నారు. దీంతో పట్టుమని రెండు వారాలు హిట్టయిన సినిమాలు కూడా థియేటర్లలో ఆడడం లేదు. నాల్గు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదాని ప్రేక్షకులు ఉపేక్షిస్తున్నారు. ఇది చాలనట్టు మీడియా ధోరణి కూడా వుంది. సినిమా విడుదలైన రోజునుంచే - ఈ సినిమా ఏ ఒటీటీలో? ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఓటీటీ డేట్ ఫిక్స్- అంటూ అనాలోచితంగా పోటీలు పడి మీడియాలో రాతలు రాసేస్తున్నారు. సినిమా విడుదలైంది సినిమా హాళ్ళ కోసమా, ఓటీటీల కోసమా? ఈ సినిమా బ్రహ్మాండంగా వుంది వెళ్ళి థియేటర్లో చూడండని ప్రోత్సహించకుండా, థియేటర్లని దెబ్బ కొట్టేలా ఓటీటీ న్యూస్ ఇవ్వడమేమిటో వాళ్ళ ముతక జర్నలిజానికే తెలియాలి. ప్రేక్షకులకి జ్ఞాపకాల్ని మిగిల్చేవి సినిమా హాళ్ళే. ఓటీటీలు కాదు. నేటి హైటెక్ యూత్ కైనా రేపు ముసలి తనంలో ఫలానా సినిమా ఫలానా థియేటర్లో చూశాం కదాని ఆనాటి ముచ్చట్లు చెప్పుకునేలా చేసేవి థియేటర్లే!

—సికిందర్

 

14, ఆగస్టు 2023, సోమవారం

1353 : రివ్యూ!


 

రచన –దర్శకత్వం : అమిత్ రాయ్
తారాగణం : అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠీ, యామీ గౌతమ్, గీతా అగర్వాల్, ఆరూష్ వర్మ, పవన్ మల్హోత్రా, అరుణ్ గోవిల్ తదితరులు
సంగీతం : విక్రమ్ మాంట్రోస్, హన్స్ రాజ్ రఘు వంశీ, డీజే స్ట్రింగ్స్, ప్రణయ్, సందేశ్ శాండిల్య; ఛాయాగ్రహణం : అమలేందు చౌదరి
బ్యానర్స్ : కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వయాకామ్ 18 స్టూడియోస్, వకావూ ఫిల్మ్స్
నిర్మాతలు : అరుణా భాటియా, విపుల్ డి షా, రాజేష్ బహల్, అశ్వి వర్డే
విడుదల ; 11.8.23
***

        2019 లో హౌస్ ఫుల్ హిట్టయిన తర్వాత నుంచి నటించిన 12 సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాక, ఓఎంజీ -2 తో ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టు కన్పిస్తున్నాడు అక్షయ్ కుమార్. 2012 లో తానే నటించిన ఓఎంజీ (ఓ మైగాడ్) సూపర్ హిట్టయ్యింది. ఇది తెలుగులో గోపాల గోపాల గా రీమేకైంది. 2010 లో రోడ్ టు సంగం అనే సినిమాతో దర్శకుడుగా మారిన అమిత్ రాయ్, 13 ఏళ్ళ తర్వాత రెండో సినిమా తీసే అదృష్టానికి నోచుకున్నాడు. అయితే ఓఎంజీ -2’, ఓఎంజీ కి సీక్వెల్ కాదు. రెండిటి కథలు, పాత్రలు వేర్వేరు. అక్షయ్ కుమార్ తప్ప ఓఎంజీ లో నటించిన వాళ్ళెవరూ ఓఎంజీ -2 లో లేరు. ఇంతకీ అమిత్  రాయ్ ఏం తీశాడు? ఇది ఎందుకంత సెన్సార్ తో వివాదంలో పడింది? అక్షయ్ కుమార్ కిది హిట్టేనా? ఇవి తెలుసుకుందాం.

కథ

    కాంతి శరణ్ ముద్గల్ (పంకజ్ త్రిపాఠీ) శివ భక్తుడు. ఓ పుణ్యక్షేత్రంలో పూజా సామగ్రి అమ్మే షాపు నిర్వహిస్తూంటాడు. భార్య ఇందుమతి (గీతా అగర్వాల్), కొడుకు వివేక్ (ఆరూష్ వర్మ), కూతురూ వుంటారు. వివేక్ స్కూల్లో చదువుతూ వుంటాడు. ఒకరోజు వివేక్ అనైతిక చర్యకి పాల్పడ్డాడని స్కూలునుంచి డిస్మిస్ అవుతాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. తన కొడుకు తప్పుడు సమాచారం వల్ల, తప్పుదారి పట్టించే వాళ్ళ వల్లా దగా పడ్డాడని భావించిన కాంతి, స్కూలు ప్రిన్సిపాల్ అటల్ నాథ్ మహేశ్వరి (అరుణ్ గొవిల్ )తో ఘర్షణ పడతాడు. లాభం లేక, అవమానం తట్టుకోలేక వూరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. కుటుంబంతో వెళ్ళి పోతూంటే, దేవదూత శివగణ్ (అక్షయ్ కుమార్) ప్రత్యక్షమై సత్యం కోసం పోరాడమంటాడు. దీంతో స్కూలు యాజమాన్యాన్ని, నకిలీ వైద్యుల్ని, బూటకపు మందులు అమ్మే వాళ్ళనీ కోర్టుకి లాగుతాడు కాంతి.
       
కాంతి లక్ష్యం ఏమిటి
? విద్యా వ్యవస్థలో ఏం మార్పు కోరుకుంటున్నాడు? ఆ మార్పు సాధించాడా? ఎలా సాధించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఓఎంజీ లో నాస్తికుడు భూకంపం వల్ల తన వ్యాపారానికి జరిగిన నష్టానికి దేవుడి మీద కేసు వేసి కోర్టుకి లాగితే, ఓఎంజీ-2 లో ఓ వ్యాపారి పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల తన కొడుకు పెడ దారి పట్టిపోయాడని స్కూలు యాజమాన్యాన్ని కోర్టుకి లాగుతాడు. ఈ కథ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి. ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ సీరియస్ చర్చల్లోవుండేది. తర్వాత చెత్త బుట్ట దాఖలైంది. దాన్ని దులిపి పైకి తీశాడు దర్శకుడు.
        
కౌమార దశలో లైంగిక విజ్ఞానం లేకపోవడం వల్ల అపోహలు పెంచుకుని పిల్లలు మోసపోతున్నారని, ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా క్రుంగిపోతున్నారనీ, దీన్ని అరికట్టి ఆరోగ్యవంతమైన తరాల్ని అందించాలంటే, పాఠశాల దశలోనే తగిన లైంగిక విజ్ఞానాన్ని సార్వజనీనం చేయాలనీ వాదించాడు దర్శకుడు.
        
మొట్ట మొదటిసారిగా, 1974 లో బికె ఆదర్శ్ తీసిన గుప్త్ జ్ఞాన్ లోనూ ఇదే విషయం చెప్పారు. 1979 లో దాసరి నారాయణరావు తీసిన నీడ లో అశ్లీల సాహిత్యం చదివి వ్యభిచారానికి అలవాటుపడ్డ టీనేజర్ గురించి చెప్పారు. ఇదొక బర్నింగ్ టాపిక్ గా వుంటూ వస్తోంది. కానీ ప్రభుత్వాలు కదలడం లేదు. పైగా ఇలాటి సినిమాలు తీస్తే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఓఎంజీ -2 సెన్సార్ ఇబ్బందుల్లో ఇరుక్కుని విలవిల్లాడిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ శివుడి పాత్రనే మార్చేస్తూ చాలా సన్నివేశాలు, డైలాగులూ కత్తిరించేసిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తో సరిపెట్టింది. పిల్లలూ పెద్దలూ అందరూ చూసి కళ్ళు తెరవాల్సిన సమస్యకి   సర్టిఫికేట్ జారీచేస్తే, దీన్నెవరు చూడాలి? ఈ సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాలో శివుడ్ని చూపించారని, రామాయణం తో తీసిన ఆదిపురుష్ కి ఉదారంగా సెన్సార్ అనుమతి ఇచ్చేసి విమర్శల పాలైనట్టు ఈసారి కాకూడదని, ఓఎంజీ -2 మీద ప్రతాపం చూపెట్టారు.
        
అయినా ఓఎంజీ -2 కంటెంట్ పరంగా దెబ్బతినకుండా, సెన్సారే జరగనట్టు సాలిడ్ గా వుందంటే అది దర్శకుడి ప్రతిభే. ఈ కంటెంట్ లో ఇంకెన్ని కత్తిరింపులు వేసినా (ఆల్రెడీ 27 వేశారు) కథని చెడగొట్టలేరు. అలా రాసి తీశాడు దర్శకుడు.
        
స్కూల్లో చదివే వివేక్ ని తోటి స్టూడెంట్స్ టాయిలెట్ లో చూసి, నీది ఇంత చిన్నగా వుందా? చేతితో రుద్దితే పొడుగ్గా అవుతుంది అని ఇంటర్నెట్ లో రకరకాల వెబ్సైట్స్, వీడియోలు చూపిస్తారు. దీంతో వివేక్ పొడవు పెంచుకోవడం కోసం అదే పనిగా హస్తప్రయోగం చేసుకోవడం మొదలెడతాడు. ఏవో మందులు తింటాడు. ఇంటిదగ్గర అమ్మలక్కలు బుగ్గలు నిమిరి లేత పిల్లాడు ఎలా వాడిపోయాడు అని దిగులుపడతారు విషయం తెలీక. ఇంకోసారి వివేక్ స్కూలు టాయిలెట్ లో చేతికి పనిచెప్తే ఎవరో వీడియో తీసి వైరల్ చేస్తారు. ఇది రచ్చ అయి స్కూలు నుంచి డిస్మిస్ అవుతాడు.
        
దీంతో పరువు పోగొట్టుకున్న తండ్రి కాంతి, కొడుకుని తిరిగి స్కూల్లో చేర్పించడానికి విఫలయత్నాలు చేసి కుటుంబంతో వూరు విడిచి వెళ్ళి పోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు దేవదూత శివగణ్ ప్రత్యక్షమై కర్తవ్యం బోధించేసరికి స్కూలు యజమాన్యాన్ని కోర్టుకి లాగుతాడు. తన కేసు వాదించడానికి లాయర్లు ముందుకు రాకపోవడంతో తానే వాదిస్తాడు.
        
అంచెలంచెలుగా శివగణ్ అందించే క్లూస్ తో ప్రాచీన గ్రంథాల దగ్గర్నుంచీ, పాశ్చాత్య దేశాల వరకూ చెప్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ ని అధ్యయనం చేసి కేసు వాదిస్తాడు.రెండు వేల ఏళ్ళ నాడే విష్ణు శర్మ లైంగిక విజ్ఞానం గురించి రాశాడనీ, నేర్పాడనీ;  దేవతల మొదటి ఇచ్ఛ కామమేననీ, దాంతో సృష్టి ఏర్పాటయిందనీ, ఇది అసభ్యమని పురాణాల్లో ఎక్కడా చెప్పలేదనీ, ధర్మార్ధ కామ మోక్షాల గురించే చెప్పారనీ... ఇలా వాత్సాయన కామసూత్రాల్నీ, అజంతా ఎల్లోరా గుహల్లో శిల్పాల్నీ, ఇంకా చాలా డేటానీ కోర్టు ముందుంచుతాడు. ప్రాచీన కాలంలోనే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంత ఓపెన్ గా వుంటే ఇప్పుడెందుకు దాయాలని అతడి ప్రశ్న.
        
ఈ కేసు చాలా మలుపులు తిరుగుతుంది. రోడ్డు పక్క నాటు వైద్యుల్నీ, కొందరు ఘరానా డాక్టర్లనీ, సెక్స్ వర్కర్ నీ కోర్టుకి లాగుతాడు. ఎదుటి లాయర్ కామినీ మహేశ్వరి కూడా తక్కువేం కాదు. ఈమెతో కలిసి స్కూలు యజమాన్యం, మత పెద్ద, కొందరు రాజకీయులూ మతాన్ని లాగి, కాంతి మీద కేసులు వేయించి నోర్మూయించేదాకా పోతుంది...
        
విషయం మీద చాలా అవగాహనతో, ఇబ్బంది అన్పించే అంశాల్ని హాస్యంతో తేలికబరుస్తూ ఆద్యంతం ఒక స్టడీ మెటీరీయల్ లాగా అందించాడు దర్శకుడు. సాధారణంగా బూతంతా చూపించి చివర్లో నీతి చెప్తారు. అలా కాకుండా శృంగారంతో తేడా చూపించాడు. కాంతి భార్యని కోర్టులో -మీ మొదటి రాత్రి ఎలా జరిగిందని కూతురి ముందే అడిగినప్పుడు, చాలా తెలివిగా కోర్టంతా నవ్వేలా ఆమె చెప్పే సమాధానం దర్శకుడి క్రియేటివిటీకి నిదర్శనం.
        
అలాగే సెక్స్ వర్కర్ ని కాంతి క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ- నీ కొడుకు ఎలాటి పౌరుడు కావాలని కోరుకుంటున్నావ్, నీ దగ్గరికి వచ్చే విటుల్లాగానా?’  అని వేసే ప్రశ్న సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం గురించే వుంటుంది. ఈ సన్నివేశం, సినిమా ముగింపులో కాంతి కొడుకు చెప్పే మాటలూ కదిలిస్తాయి.
        
కరుణా, జాలి, ఆలోచన, హాస్యం పుట్టించే ఇలాటి సినిమాకి యూనివర్సల్ యూ సర్టిఫికేట్ ఇవ్వకుండా విలన్ లాగా ప్రవర్తించింది ప్రభుత్వమని చెప్పాలి.

నటనలు – సాంకేతికాలు

    అక్షయ్ కుమార్ శివుడి గెటప్ మారలేదు. పేరు మాత్రం దేవదూత శివగణ్ గా మార్చారు. సినిమా మొత్తం మీద ఏడెనిమిది సీన్లలో కన్పిస్తాడు. బయటే గుళ్ళూ గోపురాల్లో తిరుగుతూంటాడు. ఎక్కడికెళ్ళినా ఒక వృషభం అతడి వెనుక వెళ్తూ వుంటుంది. అతను కామెడీ క్యారక్టర్. కానీ లోతుగా ఆలోచిస్తే తప్ప అర్ధంగాని కోర్టు చిట్కాలు చెప్తాడు. చివర్లో కాంతి ఓడిపోయాక క్లయిమాక్స్ లో విజయం అతడి చేతిలో పెట్టే బహిరంగ కోర్టు దృశ్యాలు సినిమాని మరో స్థాయికి తీసికెళ్తాయి. అక్షయ్ కుమార్ ఈసారి దేశభక్తి, మతభక్తి డైలాగులతో అరుపులు అరవకుండా నిగ్రహించుకున్నాడు.
        
అయితే సినిమాకి పబ్లిసిటీ లేక మౌత్ టాక్ మీద ఆధారపడింది. సెన్సార్ గొడవలే పెద్ద పబ్లిసిటీ అనుకున్నారేమో, అదేమంత కలిసి రాలేదు. అక్షయ్ పూనుకుని ప్రమోషన్స్ ప్రారంభిస్తే మంచి హిట్ వైపు వెళ్తుంది.
        
సినిమా కాంతి పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠీ మీదే పూర్తిగా ఆధారపడింది. అతను ప్రతి చోటా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎదుటి లాయర్ పాత్రలో యామీ గౌతమ్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అమెవైపు వాదనలు కూడా ఆలోచింప జేస్తాయి. మరొక చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ జడ్జి పాత్రలో పవన్ మల్హోత్రా. సినిమా జడ్జిలా కాకుండా  రియల్ జడ్జిలా వుంటాడు. నేపథ్యంలో నాల్గు పాటలు వస్తాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ విలువలు బావున్నాయి.
        
13 ఏళ్ళ తర్వాత దర్శకుడు అమిత్ రాయ్ అవుట్ డెటెడ్ అయిపోకుండా నేటి ప్రమాణాలకి తగ్గకుండా చిత్రీకరణ జరిపాడు. గుప్త్ జ్ఞాన్ తర్వాత 49 ఏళ్ళకి తిరిగి మరోసారి సెక్స్ ఎడ్యుకేషన్ అవశ్యకతని ప్రేక్షకుల ముందుంచాడు.

—సికిందర్


12, ఆగస్టు 2023, శనివారం

1352 : పరిచయం

 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ జైలర్ గురించి ఎంత చెప్పుకుంటున్నారో, ఇందులో నటించిన విలన్ గురించి కూడా అంతే చెప్పుకుంటున్నారు.చెత్త మొహం, అతి క్రూరుడు, సుత్తితో మొహం పగులగొట్టి చంపేసే రాక్షసుడు, కళ్ళతోనే భయం పుట్టించే, మాసిన లుంగీ చొక్కా వేసుకునే, మురికి వాడల్లో తిరిగే పిచ్చోడు లాంటి జనం భయపడి చచ్చే,  నీచ నికృష్టపు దేశవాళీ విలన్ గా కనిపించిన నటుడి పేరు వినాయకన్. స్టార్ సినిమాలో ఒక విలన్ కి పేరు రావాలంటే అది కోరుకునే పెద్ద మనసు స్టార్ కుండాలి. విలన్ కెంత పేరొస్తే హీరోగా తనకంత పేరొస్తుందన్న సమభావముండాలి. విలన్ ఎంత బలవంతుడైతే హీరో కంత బలం పెరుకుతుందన్న క్రియేటివ్ దృష్టి వుండాలి. ఇవన్నీ రజనీకాంత్ ప్రదర్శించినందువల్లే జైలర్ సక్సెస్ కి వినాయకన్ కూడా ప్రధాన కారకుడయ్యాడు.
        
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ అభిమానుల్ని ఆహ్లాదపరిచే, వినోదాత్మక, భావోద్వేగ, శైలీకృత యాక్షన్ సన్నివేశాల్ని దట్టించిన పాపులర్ కమర్షియల్ మూవీ. దీని ప్రధాన విజయమేమిటంటే విలన్ గా వినాయకన్‌ని ఎంపిక చేయడం. మలయాళ ప్రేక్షకులకి వినాయకన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇతర భాషల ప్రేక్షకులకి కొత్త టాలెంట్ ని పరిచయం చేయాలంటే జైలర్ బాగా తోడ్పడుతుంది. అయితే వినాయకన్ ని తీసుకోవాలని ముందుగా అనుకోలేదు. ముందుగా అనుకున్న స్టార్ వేరు.  జైలర్ ఆడియో లాంచ్‌లో స్వయంగా రజనీకాంత్ చెప్పారు.
       
పేరు ప్రస్తావించకుండా రజనీ చెప్పిందాన్ని బట్టి చూస్తే
, ఆయన చెప్తున్నది మోహన్ బాబు గురించేనని అన్పించక మానదు. మోహన్ బాబు విలన్ గానే నట జీవితం ప్రారంభించి తర్వాత విలన్ అయ్యారు. మోహన్ బాబు, రజనీ చాలా సంవత్సరాలుగా మంచి మిత్రులు కూడా.  మోహన్ బాబు నిర్మించిన సూపర్ హిట్ పెదరాయుడు లో రజనీ కీలక పాత్ర పోషించారు కూడా. ఈ నేపథ్యంలో జైలర్ ఆడియో లాంచ్ సందర్భంగా రజనీ చెబుతున్నది మోహన్ బాబు గురించేనని ఇట్టే తెలిసిపోతుంది.
        
జైలర్ లో విలన్ పాత్రని ఎవరైనా స్టార్ లేదా కొత్త నటుడు పోషిస్తే బావుంటుందనుకున్నానని రజనీకాంత్ చెప్పారు. విలన్ పాత్రలకి పేరుబడ్డ వారెవరిని తీసుకున్నా పెద్దగా ప్రభావం వుండదని అన్నారు. అప్పుడు దర్శకుడు నెల్సన్ ఒక పేరు సూచించాడని, ఆయనొక పెద్ద సౌత్ స్టార్ అనీ, తనకి మంచి మిత్రుడు కూడానని చెప్పారు. ఆయన విలన్ కి సరిపోతాడని భావించి తనే ఫోన్ చేసి మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత నెల్సన్ వెళ్ళి కథ విన్పించి వచ్చాక తను పునరాలోచనలో పడ్డాననీ, ఆ స్టార్ కున్నఇమేజిని బట్టి, పాత్రతో వ్యవహరించడానికి తగినంత స్వేచ్ఛ వుండదని, ప్రాక్టికల్ గా కొన్ని పరిమితులు వుంటాయనీ, పైగా తను విలన్ ని కొట్టే సన్నివేశాలు కూడా వున్నాయనీ, ఆ స్టార్ తో ఆ పని చేయలేననీ భావించి, ఆ స్టార్ కి ఫోన్ చేసి సారీ చెప్పినట్టు వివరించారు.
       
అయితే రజనీ మాటల్ని ఎక్కువమంది తమిళ ప్రేక్షకులు వేరేగా తీసుకున్నారు. ఆయన చెప్పింది కమల్ హాసన్ గురించేనని భావించారు. చెన్నై ఆడియో లాంచ్ లో రజనీ 45 నిమిషాలు ప్రసంగించారు.
ఈ స్పీచ్‌తో నెటిజన్లు రజనీ ప్రస్తావించిన స్టార్ మరెవరో కాదని, ఐదు దశాబ్దాల తన ప్రత్యర్థి కమల్ హాసనే నీ తేల్చేశారు. ఇప్పుడు దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరినీ కలపి తెరపై చూసే అవకాశం చేజారిపోయిందని, వీరిద్దరి అభిమానులు భొరున విలపించారు. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ, కమల్ మళ్ళీ తెరపై 'తలైవర్ 171'లో ఒక్కటవుతారని ప్రచారం ఒకటి జరుగుతోంది.
        
మోహన్ బాబు కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు- స్టార్ ని విలన్ గా మార్చే ప్రయత్నం అలా కుదరక పోవడంతో రజనీ, నెల్సన్ లు కొత్త ముఖం కోసం అన్వేషించి వినాయకన్ ని పట్టుకున్నారు. స్టార్ ని తెచ్చి విలన్ చేస్తే ఏమయ్యేదో గానీ, కొత్త ముఖాన్ని తెచ్చుకుని  స్టార్ ని చేశారు. ఇంత పచ్చిగా, మురికివాడల క్యారక్టర్ అన్పించే వినాయకన్ స్టార్ విలన్ అయిపోయాడు! స్లమ్ డాగ్ విలియనీర్ అన్నట్టు.

ఎవరీ వినాయకన్
?

ఇంతకీ ఎవరీ వినాయకన్ అంటే- నటుడు, గాయకుడు, స్వరకర్త, నాట్యాచారుడు- ఇన్ని కళలున్నాయి ఈ మలయాళీ ఆర్టిస్టులో. 1995 లో మాంత్రికం లో అతిధి పాత్రతో నట వృత్తిని ప్రారంభించాడు . ఆ తర్వాత రెండు సినిమాల్లో సహాయ పాత్ర, కమెడియన్ పాత్రా పోషించాడు. తర్వాత స్టాప్ వయొలెన్స్’, ఛోటా ముంబాయి సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు. మొత్తం 53 మలయాళ సినిమాలు, 8 తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా (అసాధ్యుడు’- 2006), ఒక హిందీ సినిమా నటించాడు. 2016 లో కమ్మటి పాదం లో నటనకి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు పొందాడు. సినిమాల్లోకి రావడానికి ముందు బ్లాక్ మెర్క్యురీ అనే డాన్స్ గ్రూపుని నిర్వహించేవాడు. మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేసేవాడు.
       
ఇందుకేనేమో  
జైలర్ లో విలన్ గా బాగా హై వస్తే అనుచరులతో కలిసి పిచ్చ డాన్స్ చేస్తాడు. తాళ్ లో ఐశ్వర్యారాయ్ పాటకి కూడా డాన్స్ చేసి పడేశాడు. చంపడం అంటే అతడికెంత ఆనందమంటే, అనుచరుణ్ణి కింద పడదోసి, ఛాతీ మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని, సుత్తితో తనివిదీరా మొహమ్మీద కొట్టి చంపుతాడు. ఇలాటిదే సీను రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన వీరప్పన్ కథ జంగిల్ (2000) లో - మనుషుల్ని చంపడానికి ఉవ్వీళ్ళూరుతూ వుండే పొట్టి రాజ్ పాల్ యాదవ్ తో వుంటుంది.
       
విగ్రహాల స్మగ్లర్ వర్మగా విలన్ పాత్రలో వినాయకన్ నటన రియలిస్టిక్ నటన. పాత్ర లోతుపాతుల్లోకి వెళ్ళిపోయి
, పాత్రనంతా కళ్ళల్లో నింపుకుని- అక్కడ్నించీ ఒడలు జలదరించేలా పాత్రని ఆకాశాన్నంటిస్తాడు. రజనీ కాంత్ మాత్రం కూల్ గా వుంటాడు. రజనీని డామినేట్ చేస్తూ ఆయన ముందు వినాయకన్ ది ఓవరాక్షన్ కాదు- ఆ పాత్రే అంత. దీన్ని రియలిస్టిక్- మెథడ్ యాక్టింగ్ తో ఓవరాక్షన్ అన్పించకుండా చేశాడు. మృగానికి ఓవరాక్షనేంటి? మృగం తీరే అంత. వినాయకన్ మృగంగా మారితేనే ఇది సాధ్యం.
       
ఇప్పుడు వినాయకన్ పానిండియా కాదు
, గ్లోబల్ పండితుల దృష్టిలో పడినట్టు తాజా వార్తలొస్తున్నాయి. ఎప్పుడైనా దేశ సంస్కృతిని ప్రతిబింబించే దేశవాళీ పాత్రలే, దేశీయ నటనలే గ్లోబల్ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తాయి.
—సికిందర్   


11, ఆగస్టు 2023, శుక్రవారం

1351 : రివ్యూ!


 దర్శకత్వం : మెహర్ రమేష్

తారాగణం : చిరంజీవి, కీర్తీ సురేష్ తమన్నా, సుశాంత్, మురళీ శర్మ, సాయాజీ షిండే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్య తదితరులు
సంగీతం : మహతీ స్వరసాగర్, ఛాయాగ్రహణం : డడ్లీ
బ్యానర్స్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్,, క్రియేటివ్ కమర్షియల్స్
నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర, కెఎస్ రామారావు
విడుదల : ఆగస్టు 11, 2023
***

నవరిలో వాల్తేరు వీరయ్య విజయోత్సాహంతో వున్న మెగా స్టార్ నుంచి వెంటనే ఈ సంవత్సరం భోళాశంకర్ అనే మరో మాస్ కమర్షియల్ విడుదల. ఇది తమిళ హిట్ వేదాలం రీమేక్ అని తెలిసిందే. దీనికి పదేళ్ళ గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకుడు. దర్శకత్వానికి పదేళ్ళ గ్యాప్, రీమేక్ కి ఎనిమిదేళ్ళ గ్యాప్ చాలా చెప్తాయి కాలదోషం పట్టిన సంగతులు. చిరంజీవికి కాలదోషం లేదు. ఆయన ప్రయత్నాలకే కాలీన స్పృహ కన్పించడం లేదు. ఈ కాలపు ప్రేక్షకులకి ఏ కాలపు సినిమాలు అందిస్తున్నారో చూసుకోకుండా కుమ్మేస్తున్నారు. ఆయన కుమ్మడం, ప్రేక్షకులు కుయ్యోమనడం ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం... 

కథ

శంకర్ (చిరంజీవి) సోదరి మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ని తీసుకుని కోల్ కతా లో దిగుతాడు. ఆమెని కాలేజీలో చేర్పించి టాక్సీ డ్రైవర్ గా మారతాడు. అతడికి లాస్య (తమన్నా) అనే క్రిమినల్ లాయర్ పరిచయమవుతుంది. పోలీస్ కమీషనర్ నగరంలో ఆడవాళ్ళ అపహరణలు జరుగుతున్న దృష్ట్యా టాక్సీ డ్రైవర్లు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తాడు.  దీంతో శంకర్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) అనే మాఫియా గ్యాంగ్ మెంబర్లని ఒకొక్కర్నీ  చంపడం మొదలెడడు. అటు వైపు మహాలక్ష్మిని లాయర్ లాస్య సోదరుడు శ్రీకర్ (సుశాంత్) ప్రేమించడంతో లాస్య శంకర్ దగ్గరికి ఆ పెళ్ళి సంబంధం తెస్తుంది. శంకర్ ఒప్పుకుంటాడు. ఇంతలో లాస్యకి శంకర్ చేస్తున్న హత్యలు తెలిసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుంది. సోదరి పెళ్ళి ఆగిపోవడంతో శంకర్ ఇరకాటంలో పడతాడు.
       
అసలు శంకర్ ఎవరు
? ఎందుకు మాఫియాల్ని హతమారుస్తున్నాడు? అతడి గతం ఏమిటి? చేస్తున్న హత్యల్ని ఎలా సమర్ధించుకుని ఆగిపోయిన సోదరి పెళ్ళి చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ   
2015 లో తమిళంలో అజిత్ నటించిన వేదాలం రీమేక్ కథ ఇది. తెలుగులో ఆవేశం పేరుతో డబ్ అయి విడుదలైంది కూడా. యూట్యూబ్ లో ఫ్రీగా వుంది కూడా. అయినా తెలిసిన పాత కథనే రీమేక్ చేశారు. కోల్ కత బ్యాక్ డ్రాప్ లో ఇలాటిదే అన్నాచెల్లెలు కథతో 2021 లో రజనీకాంత్ నటించిన అన్నాత్తే (తెలుగులో పెద్దన్న’) వచ్చి ఫ్లాపయ్యింది. ఇందులో కూడా చెల్లెలు కీర్తీ సురేషే. ఇంకోటేమిటంటే, భోళా శంకర్ లో తమన్నా లాగా, ఇందులో కూడా కోల్ కతాలో నయనతార లాయరే. ఇంకో అద్భుతమేమిటంటే, ఒకేలా వున్న వేదాలం’, అన్నాత్తే రెండు సినిమాలకీ దర్శకుడు శివయే!
       
అంటే తెలుగు ప్రేక్షకులు ఒకేలా వున్న
ఆవేశం’, పెద్దన్న రెండూ చూశాక, మళ్ళీ అలాటిదే భోళా శంకర్ కూడా చూడాలన్న మాట. ఇవి మామూలు బరువు బాధ్యతలు కావు. ప్రేక్షకులు నెరవేర్చుకుని విధేయత నిరూపించుకోవాలి. తీసిందే తీస్తూంటే చూసిందే చూస్తూ పోవాలి. ఇదేమైనా మాయాబజారా ఎన్ని సార్లు తీసినా చూడాడానికి. 
        
అయితే సమస్యేమిటంటే, 2013 లో షాడో తర్వాత సినిమాలేని దర్శకుడు మెహర్ రమేష్, పదేళ్ళ తర్వాత అదే తన కాలం నాటి దర్శకత్వానికి సాహసించడం. పూర్తిగా ఔట్ డేటెడ్ మేకింగ్ కి పాల్పడడం. 1970-80 ల సినిమా అన్పించేలా తీయడం. టైటిల్స్ లో స్టోరీ డెవలప్ మెంట్ అని తన పేరు పడుతుంది. వేదాలం సీన్ల వరసే దించేస్తే డెవలప్ మెంట్ ఏముందో అర్ధంగాదు. ఇలా ప్రేక్షకులకి తర్వాతేం జరుగుతుందో తెలిసిపోయే టెంప్లెట్ కథనం వాడేసి సినిమా చుట్టేసినట్టే వుంది.
       
మెగాస్టార్ ని ఎలివేట్ చేసే ఒక్క సిట్యుయేషన్ గానీ
, హీరోయిజాన్ని నిలబెట్టే ఒక్క ఎమోషనల్ సీనుగానీ లేకుండా ఫ్లాట్ గా రన్ చేసేశారు. ఏ సన్నివేశం కూడా అజిత్ తో తమిళంలో లాగా మనసు పెట్టి తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక పదినిమిషాలు మాత్రమే బలం. మిగతా ఫస్టాఫ్, సెకండాఫ్ చిత్రీకరణ డొల్లగా వుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బావుందనుకునేంత లోనే బోరుగా మారిపోతుంది. భోళా శంకర్ గా చిరంజీవి అసలు క్యారక్టర్ వెల్లడయ్యే ఫ్లాష్ బ్యాక్ కూడా విఫల మైంది.
       
కేవలం చిరంజీవి యంగ్
, స్టయిలిష్ లుక్, డాన్సులు, ఫైట్లు మాత్రమే అప్డేట్ అయి వున్నాయి. సినిమాలో విషయం, మేకింగ్ మాత్రం కాలానికి దూరంగా ఔట్ డేటెడ్ గా వున్నాయి.

నటనలు- సాంకేతికాలు

చిరంజీవికి మూస ఫార్ములా పాత్రలు కొత్త కాదు. అవి ఎన్నిసార్లు నటించినా, పాత్రల పరిధి అంతే కాబట్టి, నటన మార్పు లేకుండా రిపీట్ అవుతూ వుంటుంది. అయితే ఈసారి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. కమెడియన్ల గుంపుతో  చేసిన కామెడీలు ఎవర్నీ నవ్వించలేక పోయాయి. ఎమోషన్లు చూద్దామంటే సిస్టర్ సెంటిమెంటు కూడా కృత్రిమంగా, అంతంత మాత్రంగా వుంది. ఒక్క యాక్షన్ సీన్లతో, పాటలకి స్టెప్పులతో మాత్రమే మెప్పించడానికి పరిమితమై పోయారు చిరంజీవి. ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే కాబట్టి వీటిని క్రమం తప్పకుండా సరఫరా చేస్తారు.
       
తమన్నా రొటీన్ ఫార్ములా హీరోయిన్. తమన్నాతో బాటు కీర్తీ సురేష్ పాత్ర కూడా అంతంత మాత్రమే. మొన్నే రజనీకాంత్ తో చెల్లెలిగా నటించి
, మళ్ళీ ఇప్పుడు చిరంజీవితో చెల్లెలిగా నటించడం ఎంత ఎంబరాసింగ్ గా వుందో ఆమె మొహంలో చూస్తే తెలిసిపోతుంది. ఇక బోలెడు మంది కామెడియన్లు, విలన్లు రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయారు. సంగీతం, కెమెరా వర్క్, ఇతర టెక్నికల్ విభాగాలు ఎంత బాగా పని చేసినా దర్శకుడు కూడా పని చేయాలిగా? ఇది పూర్తిగా మెహర్ రమేష్ చెడ గొట్టుకున్న మెగా అవకాశం, మళ్ళీ రాదు.


మెగాస్టార్ ఈ కాలపు ప్రేక్షకుల కోసం ఇంకా తన
1970-80 లనాటి పురాతన కాలం టైపు సినిమాలు నటించకుండా, ఆ కాలంలో జరిగే పీరియడ్ కథలతో పీరియడ్ సినిమాలు నటిస్తే పాత సినిమాల వైభవమైనా చూసినట్టుంటుంది నేటి తరం ప్రేక్షకులకి. 1969 నేపథ్యంలో తీసిన ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్లాగా?
-సికిందర్