రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, డిసెంబర్ 2022, శుక్రవారం

1273 : రివ్యూ!


దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
తారాగణం : రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రా లోకేష్, తులసి, రాజశ్రీ నాయర్ తదితరులు
కథ స్క్రీన్ ప్లే మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం : బీమ్స్ సిసిరోలియో ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్స్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

నిర్మాతలు : టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్  
విడుదల : డిసెంబర్ 23, 2022
***
        మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  గత ఖిలాడీ’, రామారావు ఆన్ డ్యూటీ రెండూ ఫ్లాప్ అవడంతో అసహనంగా వున్నారు. మాస్ మహారాజా కావడంతో ఆప్షన్స్ ఎక్కువ వుండవు. అవే మాస్ సినిమాలు అలాగే నటించాలి. ఈడియట్ నాటి ముద్రపడిన క్యారక్టరైజేషన్, యాక్టింగ్ కొనసాగిస్తూ పోవాలి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఇమేజి చట్రంలో ఇరుక్కున్నాడని అనుకునే వాళ్ళు. ఇదే పరిస్థితి రవితేజది. కాబట్టి ఇప్పుడు తాజా ధమాకా ని వేరే ఆశలేం పెట్టుకోకుండా చూడాలి. ఈసారి అలా చూస్తే ఎలా వుంటుంది? ఫ్యాన్స్ కి ఓకేనా? దర్శకుడు నక్కిన త్రినాధరావు మాస్ మహారాజాకి హిట్ ఇచ్చినట్టేనా? ఇవి తెలుసుకుందాం...

కథ  
వైజాగ్ లో నంద గోపాల చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) ఓ కంపెనీ బాస్. కంపెనీకి కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ)ని సీఈఓ గా నియమించాలని నిర్ణయిస్తాడు. ఇది నచ్చని కంపెనీలో వ్యతిరేకులు జెపి (జయరాం) తో కలిసి కుట్ర చేస్తారు. జెపికి కొడుకుని సీఈఓ చేయాలని పథకం. ఇంకోవైపు మధ్యతరగతికి చెందిన స్వామి(రవితేజ) వుంటాడు. ఇతడికి తండ్రి వాసుదేవరావు (తనికెళ్ళ భరణి), తల్లి దేవకి (తులసి), చెల్లెలు (రాజశ్రీ నాయర్) వుంటారు. స్వామికి చేస్తున్న ఉద్యోగం పోవడంతో చెల్లెలి పెళ్ళి సమస్య అవుతుంది. ఇతను చెల్లెలి ఫ్రెండ్ పావని (శ్రీలీల) ని ప్రేమిస్తూంటాడు. పావని తండ్రి (రావు రమేష్) కి స్వామి నచ్చడు. దీంతో ఒకేలా వున్న స్వామి, ఆనంద్ లని పరీక్షించి ఎవర్ని చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటుంది. ఇంతలో జెపి కుట్ర అమలుకావడంతో ఆనంద్ ప్రమాదంలో పడతాడు. ఆనంద్ ని కాపాడేందుకు స్వామి రావడంతో జెపి, శ్రీలీల సహా అందరూ వూహించని షాక్ కి లోనవుతారు.
        
ఏమిటా షాక్? దేని గురించి? ఆనంద్, స్వామిలకి సంబంధించిన రహస్యమేమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? జెపి కుట్రని స్వామి ఎలా ఎదుర్కొన్నాడు? అసలు తనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా ధమాకా ఏమిటో చూడాల్సిందే. 

ఎలావుంది కథ 

రవితేజ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ వున్న కథ. లేనిదల్లా కథే. కథ బదులు కామెడీలు, పాటలూ వస్తూంటాయి. ఫ్యాన్స్ అదృష్టం బావుండి మధ్య మధ్యలో వచ్చే కామెడీలూ పాటలూ బావుండడంతో, పాటలకి మాస్ మహారాజా విరగదీసి డాన్సులు చేయడంతో, పక్కన అందమైన శ్రీలీల వుండడంతో ఫుల్ ఖుష్ అవుతారు.  
        
ఫ్యాన్స్ కాని వాళ్ళకి ఇంటర్వెల్లో రవితేజ ద్విపాత్రాభినయానికి సంబంధించి ట్విస్టు రావడంతో, అది మంచి కమర్షియల్ ధమాకాలా అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో ధమాకా ఏమీ వుండదు. చిచ్చుబుడ్డి ఇంటర్వెల్లోనే పేలిపోవడంతో సెకండాఫ్ సైలెంట్ గా వుండిపోతుంది.  సైన్స్ ప్రకారం చూసినా పేలిన చిచ్చుబుడ్డి ప్రకంపన లుంటాయి. కానీ ప్రకంపనలు లేకపోవడంతో విలన్ కూడా వీక్ అయిపోయాడు. ఆ ప్రకంపనలు సెకండాఫ్ లో వుండి వుంటే, మరో చిచ్చుబుడ్డి చివర్లో పేలివుంటే డబుల్ ధమాకాగా వుండేది.

ఫస్టాఫ్ లో స్వామి పాత్రలో రవితేజ ఉద్యోగం పోవడంతో మాస్ తిరుగుళ్ళు తిరగడం, హీరోయిన్ శ్రీలీలని రౌడీల బారినుంచి కాపాడడం, సాంగ్, సాంగ్ తర్వాత శ్రీలీలతో లవ్ ట్రాక్, మరోవైపు కంపెనీ మీద కుట్రతో సీన్లు, ఆనంద్ పాత్రలో రవితేజని స్వామి అనుకుని శ్రీలీల ప్రేమించడం, కన్ఫ్యూజ్ కామెడీ, మరో సాంగ్... ఇలా రెగ్యులర్ టెంప్లెట్ లో కొత్తదనం లేని కథనంతో సాగుతూ, పైన చెప్పుకున్న ధమాకాతో ఇంటర్వెల్ పడుతుంది.

ఇక సెకండాఫ్ లో సమస్యేమిటంటే, ఇంటర్వెల్ ధమాకాతో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం తెలిశాక, సెకండాఫ్ లో ఇక స్వామి పాత్రతోనే నడపాల్సి వచ్చింది. చాలా సింపుల్ గా ఆలోచిస్తే, ద్విపాత్రాభినయం రహస్యం విలన్లకి తెలియకుండా, ప్రేక్షకులకి మాత్రమే తెలిసి వుంటే, సెకండాఫ్ లో ద్విపాత్రాభినయం కంటిన్యూ అయి విలన్లతో కన్ఫ్యూజింగ్ గేమ్ గా కథంటూ వుండేది. ఇలా చేయకపోవడంతో, చేయడానికేమీ లేక, కామెడీలూ పాటలతో భర్తీ చేశారు. ముగింపు కూడా కుదర్లేదు.

నటనలు –సాంకేతికాలు

ఫ్యాన్స్ కి, మాస్ ప్రేక్షకులకి నచ్చే అదే వెటకారం, నటన, కామెడీలతో మార్పులేకుండా ఇమేజి చట్రంలో ఎంటర్ టైన్ చేశాడు రవితేజ. ఇంత పెద్ద స్టార్ కి ఎమోషనల్ బ్యాగేజీ లేని పాత్రచిత్రణ, కథా కథనాలు సరిపెట్టడం కూడా ఇందుకే. రామ్- లక్ష్మణ్, వెంకట్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ అంత హైపర్ నటనతో వున్న రవితేజని అందుకోలేదు. ఒక గ్రౌండ్ లో, ఒక యార్డులో సెట్ చేసిన ఫైట్ సీన్లు మాస్ మహారాజానీ కట్టేశాయి. ఛేజింగ్స్ తో మూవ్ మెంట్లో యాక్షన్ సీన్స్ వుండి వుంటే రవితేజ హైపర్ యాక్షన్ కి జోడు గుర్రంలా వుండేది.
        
అన్ని పాటలకి చేసిన డాన్సులు, రెండు పాత్రలపట్ల చూపిన వేరియేషన్స్ కమర్షియల్ విలువలకి తగ్గట్టున్నాయి. పాత్రల పరంగా కష్టపడి నటించాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్ శ్రీలీల కేవలం ప్రేమ కోసం వుండే గ్లామర్ పాత్ర, నటన. రావురమేష్, పక్కన హైపర్ ఆది చేసే కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. తనికెళ్ళ రొటీనే. కానీ ఫోన్ తీసుకుని ఇంటర్వెల్లో రవితేజ డబుల్ యాక్షన్ రహస్యం ఇతర పాత్రలకి టాంటాం చేయడంతో సెకండాఫ్ విషయం లేకుండా పోయింది. శివ లాంటి సినిమాకి రచయిత అయిన తను- ఇలా చెయ్యకయ్యా బాబూ, సెకండావ్ కొంప కొల్లేరవుతుందని ఈ సినిమా రైటర్ కి చెప్పి వుండాల్సింది.
        
కాస్ట్యూమ్స్, సెట్స్, ఔట్ డోర్స్ ప్రొడక్షన్ విలువలతో అత్యంత రిచ్ గా, కలర్ఫుల్ గా వున్నాయి. కార్తీక్ ఘట్టమేని కెమెరా వర్క్ కనువిందు చేస్తుంది. బీమ్స్ సంగీతంలో పాటలు, నేపథ్య సంగీతం ఇంకో హైలైట్. దర్శకుడు త్రినాధరావు దర్శకత్వం బాగానే వుందిగానీ, ఇంకెన్ని సినిమాలు అవే మూస కథలతో తీస్తారనేది ప్రశ్న.

—సికిందర్
               

1272 : రివ్యూ!

 

రచన -దర్శకత్వం : ఎ వినోద్ కుమార్
తారాగణం: విశాల్, సునైనా, ప్రభు, రమణ, తలైవాసల్ విజయ్, మునిష్కాంత్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : బాలసుబ్రమణ్యం
బ్యానర్: రానా ప్రొడక్షన్స్
నిర్మాతలు: రమణ, నంద
విడుదల : డిసెంబర్ 22, 2022
***
          మిళంలో విశాల్ సినిమాలంటేనే యాక్షన్ సినిమాలు. తెలుగులో మార్కెట్ వుండడంతో డబ్బింగ్స్ విడుదలవుతూంటాయి. గత ఫిబ్రవరిలో విడుదలైన సామాన్యుడు కూడా సక్సెస్ కాలేదు. కారణం విశాల్ సినిమాలన్నీ విషయపరంగా ఒకేలా వుంటాయి. ఆ విషయం పాతబడి వుంటుంది. ఇదే ధోరణిని కొనసాగిస్తూ లాఠీ కూడా విడుదలైంది. 30 ఏళ్ళ క్రితం ప్రసిద్ధ నిర్మాత ఎంఎస్ రాజు, దర్శకుడు గుణశేఖర్ కి తొలి అవకాశమిచ్చి  తమిళ హీరో ప్రశాంత్, తమిళ విలన్ రఘువరన్ లతో తెలుగులో లాఠీ అని తీస్తే మంచి హిట్టయ్యింది. ఉత్తమ తొలి సినిమా దర్శకుడుగా గుణశేఖర్ కి నంది అవార్డు కూడా లభించింది. మరో రెండు అవార్డులు ఎడిటర్ కి, కెమెరా మాన్ కీ లభించాయి. పోలీస్ లాఠీ అంటే ఏంటో పవర్ఫుల్ గా చూపించిన ఈ సినిమా ముందు విశాల్ లాఠీ ఏ స్థానంలో నిలబడుతుందనేది ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెబుతుందో, ఈ కొత్త దర్శకుడు ఏం కొత్త లాఠీ కథ చెప్పాడో వివరాల్లోకి వెళ్ళి చూద్దాం...  

కథ

మురళీ కృష్ణ (విశాల్) ఒక కానిస్టేబుల్. అతడికి భార్య కవిత (సునైనా), కొడుకూ వుంటారు. ఆనందమయ జీవితం గడుపుతూంటాడు. ఓ రోజు డ్యూటీలో భాగంగా ఒకడ్ని లాఠీ పెట్టి విపరీతంగా కొట్టి సస్పెండ్ అయిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత డిఐజి కమల్ (ప్రభు) మంచి తనం వల్ల ఉద్యోగంలో చేరతాడు. ఇంకో రోజు డాన్ సూరా (సన్నీ పిఎన్) కొడుకు వీర (రమణ) డిఐజి కమల్ కూతుర్ని వేధిస్తాడు. దీంతో డిఐజి కమల్ వాడ్ని కిడ్నాప్ చేసి లాకప్ లో వేసి, మురళీ కృష్ణని పిలిచి లాఠీ పెట్టి బాగా విరగదీయమని ఆదేశిస్తాడు. వీర ఎవరో తెలియని మురళీ కృష్ణ వీరని లాఠీ పెట్టి బాగా విరగదీస్తాడు. కొడుకు వీరని రాజకీయ ప్రవేశం చేయించాలని ప్రయత్నాల్లో వుంటాడు సూరా. లాకప్ లో వొళ్ళు హూనమయ్యేసరికి మురళీ కృష్ణ మీద పగబడతాడు. ఈ క్రమంలో మురళీ కృష్ణ ఒంటరిగా తననీ, తన కుటుంబాన్నీ ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ.  

ఎలా వుంది కథ

ఇంకో విశాల్ బ్రాండ్ పాత మోడల్ కథే. పోలీసు కానిస్టేబుల్, డిఐజి కూతురు, డాన్, డాన్ కొడుకు వంటి మూస ఫార్ములా పాత్రలతో; డిఐజి కూతుర్ని డాన్ కొడుకు వేధిస్తే, కానిస్టేబుల్ కొట్టడం, కానిస్టేబుల్ మీద డాన్ పగబట్టడం వంటి పాత మూస కథనం తోడై సినిమా ప్రాణం తీసింది. నేటి కాలానికి సరిపడే ఓ మార్కెట్ య్యాస్పెక్ట్ గానీ, దానికి అనుగుణమైన క్రియేటివ్ యాస్పెక్ట్ గానీ కొత్త దర్శకుడికి తెలీక తను చూసిన పాత సినిమాలే సినిమా అనుకుని చుట్టేసినట్టుంది. ఫలితంగా ఈ కథకి కనీస బాక్సాఫీసు అప్పీల్ గానీ, యూత్ అప్పీల్ గానీ కానరాకుండా పోయాయి. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంటు జోడించి ఎమోషన్లు పెంచాలనుకున్నాడు. ఆ పాత ఫ్యామిలీ కథ కూడా ఎమోషన్లు పెరిగేంతగా లేకపోవడంతో పూర్తిగా విశాల్ చేజారిపోయి- బి గ్రేడ్ మాస్ ప్రేక్షకుల సినిమాగా మిగిలింది.

ఫస్టాఫ్ విశాల్ ఉద్యోగం పోగొట్టుకున్న జీవితం, భార్యతో కొడుకుతో కుటుంబ కష్టాలు, డాన్ కొడుకుని కొట్టడంతో ఆ కష్టాలు మరింత పెరిగి సెకండాఫ్ కి రంగం సిద్ధం కావడం జరిగి, సెకండాఫ్ లో పగబట్టిన డాన్ తో పోరాటం సాగి సాగి- కొడుకు కిడ్నాప్ తో ఓ భవనంలో బందీ అయిపోతుంది కథ. అక్కడ 45 నిమిషాలూ ఇంకా సాగదీసిన కథతో యాక్షన్ క్లయిమాక్స్, ముగింపూ.
        
చివరి 45 నిమిషాలు యాక్షన్ నిలబడిందా అంటే, భవనంలో అక్కడక్కడే కొట్టుకుంటూ సహనాన్ని పరీక్షిస్తుంది. ఎంతకీ ముగియని క్లయిమాక్స్ ప్రేక్షకుల మీద లాఠీ చార్జి లా వుంటుంది. గాయాలతో బయటపడేసరికి రెండున్నర గంటలు గడిచిపోతాయి.  కథకి లాజిక్ కూడా వుండదు. తన అవసరానికి కానిస్టేబుల్ ని ఉపయోగించుకున్న డిజిపి, అదే విలన్ తో ప్రమాదంలో పడితే కనిపించకుండా పోతాడు డిజిపి. ఇది కానిస్టేబుల్ ఒంటరి పోరాటం చేసే కథ కాబట్టి డిపార్ట్ మెంట్ అతడ్ని అతడి ఖర్మానికి వదిలేయాలన్నట్టు మాయమైపోతారు. ఇలా విశాల్ ఆఖరికి ఇలాటి సినిమాతో లాఠీ చార్జి కూడా చేశాక, ఇలాటి సినిమా ఇదే చివరిదవుతుందా, లేక ఉరికంబం ఎక్కించే ఇంకో సినిమా వస్తుందా చూడాలి.

నటనలు- సాంకేతికాలు

విశాల్ నిజాయితీగా కష్టపడ్డాడు. సామాన్య కానిస్టేబుల్ పాత్రలో సహజత్వంతో ఇమిడిపోయేందుకు ప్రయత్నించాడు. ఉద్యోగం పట్ల నిబద్ధత వరకూ ఓకే, కానీ ఫ్యామిలీ సీన్లు సరిగ్గా లేక పాత్రతో బాటు నటన కుదర్లేదు. యాక్షన్ సీన్స్ లో మాత్రం విజృంభించాడు. రిస్కు తీసుకుని కొన్ని యాక్షన్ బిట్స్ నటించాడు. యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ చాలా కాలం తర్వాత తన స్కిల్స్ చూపించాడు. 45 నిమిషాల యాక్షన్ సీన్స్ కరువుదీరా కంపోజ్ చేశాడు.
        
కవిత పాత్రలో సునైనా ఫర్వాలేదు. ఎక్కువ కనపడని పాత్ర. క్లయిమాక్స్ కొడుకు పాత్రలో చైల్డ్ ఆర్టిస్టు చుట్టూ వుంటుంది. భయం, ఏడుపు వగైరా బాగా నటించాడు. ఇక నాటు విలన్ గా సన్నీ, అతడి నాటు కొడుకుగా రమణ క్రూడ్ గా నటించారు.
        
సాంకేతికంగా బాగా ఖర్చుపెట్టారు. కానీ కొత్త దర్శకుడు వినోద్ కుమార్ అరిగిపోయిన పాత కథని  దాదాపు రెండు గంటలు బలహీన దర్శకత్వంతో ఎలాగో క్లయిమాక్స్ కి చేర్చి, సినిమాని విశాల్ - పీటర్ హెయిన్స్ చేతుల్లో పెట్టేశాడు. వీళ్ళిద్దరూ ప్రేక్షకుల మీద లాఠీ చార్జి చేశారు!

—సికిందర్

22, డిసెంబర్ 2022, గురువారం

1271 : న్యూస్!


  మొత్తానికి రెండు నెలల ఉత్కంఠకి తెరపడింది. ఏమవుతాయి, మన సినిమా లేమవుతాయి, మన సినిమాలకి ఇప్పటికైనా అంత సత్తా వుందా, అంతర్జాతీయ పోటీల్ని తట్టుకుంటాయా, ఆస్కార్ పట్టించుకుంటుందా... ఇంకా అదనీ ఇదనీ సస్పెన్స్ అనుభవించిన సంగతులన్నీ నిన్న సాయంత్రంతో తేటతెల్లమైపోయాయి! ఆ రెండు సినిమాలు - రాజమౌళి ఆర్ ఆర్ ఆర్’, గుజరాతీ చెల్లో షో ఎట్టకేలకు 95వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) కి షార్ట్ లిస్ట్ అయ్యాయి. 1927 లో ఆస్కార్ అవార్డ్స్ ని స్థాపించిన నూరేళ్ళ పైబడిన చరిత్రలో మన దేశం రెండే సినిమాలకి ఆస్కార్ అవార్డులు సాధించాయి- అవి కూడా బ్రిటన్ దర్శకుల సినిమాలకి! 1983 లో మొదటి ఆస్కార్, 2009 లో మూడు ఆస్కార్లు. నామినేట్ అవడమే బ్రహ్మవిద్య అనుకుంటే, గెలవడం బ్రిటన్ దర్శకులు గెలిపిస్తేనేమిటి సంబరాలు జరుపుకుని సంతృప్తి పడ్డాం. అదీ మన గొప్పతనం.  

       ర్శకుడు పాన్ నళిన్ రూపొందించిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన చెల్లో షో (ది లాస్ట్ ఫిలిమ్ షో), ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందిన ఎస్ ఎస్  రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్స్ 2023కి ఇండియా నుంచి అధికారిక ఎంట్రీలుగా పోటీలకి ఎంపికవడం హర్షదాయకంగా వుంది ఎదురు చూసిన అభిమానులకి. అయితే చెల్లో షో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో బాటు, వివేక్ అగ్నిహోత్రి  'ది కాశ్మీర్ ఫైల్స్' రెండిటినీ అధిగమించి ఉత్తమ విదేశీ చలన చిత్రం విభాగంలో పోటీలకి షార్ట్ లిస్ట్ అవడం గమనార్హం.         

'ఆర్ ఆర్ ఆర్ ఎనర్జిటిక్ సాంగ్ 'నాటు నాటు' కి షార్ట్ లిస్ట్ అయింది. ఉత్తమ పాటల కేటగిరీకి సంబంధించినంత వరకు, 81 ట్యూన్‌లలో 15 పాటలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. వీటిలో నాటు నాటు తో బాటు, 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' నుంచి 'నథింగ్ ఈజ్ లాస్ట్', 'బ్లాక్ పాంథర్: వాకాండా ఫరెవర్' నుంచి 'లిఫ్ట్ మీ అప్', 'టాప్ గన్: మావెరిక్' నుంచి 'హోల్డ్ మై హ్యాండ్' వున్నాయి.

ఎంట్రీ పొందిన 92 దేశాల నుంచి అంతర్జాతీయ చలనచిత్రాలు ముందుకు వచ్చాయి. ఈ జాబితాలో క్లోజ్ (బెల్జియం), డెసిషన్ టు లీవ్ (దక్షిణ కొరియా), ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ), బార్డో (మెక్సికో), జాయ్‌ల్యాండ్ (పాకిస్థాన్‌) వున్నాయి. ఇలా 91 దేశాల సినిమాలతో చెల్లో షో పోటీ పడాల్సి వుంది. అలాగే నాటు నాటు సాంగ్ 15 పాటలతో పోటీ పడాల్సి వుంది. ఇప్పట్నుంచీ ఇదో ఉత్కంఠ, సస్పెన్స్!

1983 లో భానూ అతైయా, 2009 లో ఏఆర్ రెహ్మాన్ హోరాహోరీ పోరులో ఆస్కార్ స్వర్ణ ప్రతిమలు చేజిక్కించుకుని ఔరా అన్పించారు. 1957 లో మహెబూబ్ ఖాన్ దర్శకత్వంలో మదర్ ఇండియా ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం విభాగంలో  అయిన మొదటి సినిమాగా చరిత్రలో నమోదయ్యాక, 1961 లో ఇస్మాయిల్ మర్చంట్ నిర్మించిన ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్ అకాడమీ అవార్డ్స్ కి నామినేట్  అయిన రెండో సినిమా అయింది.
        
1983 లో బ్రిటన్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో తీసిన గాంధీ నామినేట్ అవడమేగాక భానూ అతైయాకి ఉత్తమ వస్త్రాలంకరణ పురస్కారం లభించింది. ఇది మన దేశానికి మొదటి ఆస్కార్. తర్వాత, 1987 లో ఇస్మాయిల్ మర్చంట్ ఏ రూమ్ విత్ ఏ విండో’, 1989 లో మీరా నాయర్ సలాం బాంబే’, 1993 లో ఇస్మాయిల్ మర్చంట్ హోవర్డ్స్ ఎండ్’, 1994 లో మళ్ళీ  ఇస్మాయిల్ మర్చంట్ ది రిమెయిన్స్ ఆఫ్ ది డే తో నామినేషన్ల హీరో అయ్యాక, 2002 లో అమీర్ ఖాన్ లగాన్ నామినేట్ అయింది.
        
ఇక 2009 లోనే బ్రిటన్ దర్శకుడు డానీ బాయల్ స్లమ్ డాగ్ మిలియనీర్ తో ఇండియాకి 3 ఆస్కార్లు సొంతమయ్యాయి. ఉత్తమ సంగీతానికి ఏఆర్ రెహ్మాన్, ఉత్తమ గీత రచనకి గుల్జార్, ఉత్తమ శబ్ద గ్రహణానికి రసూల్ పోకుట్టి 3 ఆస్కార్లు సంపాదించి పెట్టారు. అయితే నామినేట్ అయిన మొత్త 10 కేటగిరీల్లో 8 గెలుచుకుంది స్లమ్ డాగ్ మిలియనీర్. మిగిలిన 5 అవార్డులు విదేశీ సాంకేతికులు పొందారు. అలాగే 10 కేటగిరీల్లో నామినేట్ అయిన గాంధీ 8  కూడా ఆస్కార్లు పొందింది. భానూ అతైయా తప్ప  మిగిలిన సాంకేతికులు విదేశీయులు.

ఇలా బ్రిటన్ దర్శకులతోనే మన రెండు సినిమాలు ఆస్కార్ స్వర్ణ జ్ఞాపికలు  సొంతం చేసుకోవడం జరిగితే, ఇప్పుడు చెల్లో షో పరిస్థితేమిటి? అంతర్జాతీయ విభాగంలో పరిగణన పొందాలంటే ఆ సినిమా ఆ దేశ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించాలి. హాలీవుడ్ సంస్కృతిని అనుమతించరు. ఇందుకే ఆర్ ఆర్ ఆర్ ఉత్తమ చలన చిత్రంగా అంతర్జాతీయ కేటగిరీలో షార్ట్ లిస్ట్ కాలేదు. చెల్లో షో  ఈ అర్హతతోనే షార్ట్ లిస్ట్ అవగల్గింది. అయితే ఇంకా 91 దేశాలతో పోటీ పడితేనే అవార్డు సంగతి తేలేది. అక్కడ దర్శకుడు బ్రిటిషరా, ఇండియనా అని కాదు, ఏమిచ్చాడనేదే. దర్శకుడు పాన్ నళిన్ ఏమిచ్చాడో సినిమాలో చూశాం- పేద బాలల శాస్త్ర విజ్ఞాన తృష్ణ, సృజనాత్మక శక్తి! సినిమా రీళ్ళు అంతరించి, డిజిటలీకరణ చెందుతున్నసంధికాలంలో సానుకూల దృక్పథం, పురోగామి చైతన్యం! ఇది యూనివర్సల్ ఎమోషన్.
        
నామినేషన్ల ఓటింగ్ జనవరి 12 నుంచి 17 వరకు వుంటుంది. నామినేషన్లు జనవరి 24న ప్రకటిస్తారు. అవార్డులు మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే ఉత్స
వంలో అందిస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో.

—సికిందర్

21, డిసెంబర్ 2022, బుధవారం

1270 : న్యూస్!


 

    పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ డమ్ కి నిచ్చెనలు వేస్తున్నాడా? ప్రణాళిక వేసుకోవడం ఆల్రెడీ ప్రారంభమైంది. చిన్న చిన్న సూచనలు గ్లోబల్ వేదికల మీద కనిపిస్తూనే వున్నాయి. గత ఆగస్టులో తను బహుళ బ్రాండ్ షూట్లతో బిజీగా వున్నప్పుడు న్యూయార్క్ లో వార్షిక ఇండియన్ డే పరేడ్కి హాజరై, కె -పాప్ గ్రూపు బ్యాండ్ తో కలిసి ఇచ్చిన మ్యూజిక్ వీడియో వైరల్ అయింది. మేము ఆగము అసలే ఆగము అని ఒక తెలుగు లైను వుండే ఈ పాప్ నంబర్ లో ఇచ్చిన డాన్స్ మూవ్ మెంట్స్ సోషల్ మీడియాలో వెర్రెత్తించాయి.

        కె- పాప్  లేదా కొరియన్ పాప్ అనేది దక్షిణ కొరియాలో ఉద్భవించిన ఈ శతాబ్దపు  ట్రెండ్‌ సెట్టింగ్ మ్యూజికల్ గ్రూపు. ఈ గ్రూపులో అనేక బ్యాండ్ లున్నాయి. వాటిలో ట్రైబ్ ఒకటి. ఈ ట్రైబ్ కళాకారులతోనే కలిసి మ్యూజిక్ వీడియో ఇచ్చాడు. కె -పాప్ గ్రూప్ ఇండియన్ స్టార్ తో కలిసి పని చేయడం అదే మొదటిసారి.  ప్రయోగాత్మకంగా రాక్, హిప్-హాప్, ఎలక్ట్రానిక్ డ్యాన్స్ వంటి అనేక రకాల కళా ప్రక్రియల సమ్మేళనం ట్రైబ్ అందించే సంగీతం. అల్లు అర్జున్ వీడియో ఒక టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో భాగంగా వెలువడింది.
        
తర్వాత డిసెంబర్ మొదటివారంలో పుష్ప తో రష్యా ప్రయాణం. అక్కడ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా మాస్కోలో రష్యన్ భాషలో పుష్ప ప్రీమియర్ ప్రదర్శన. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి, హీరోయిన్ రశ్మికా మందన్న మాస్కో ఫెస్టివల్లో స్పెషల్ షో తర్వాత, పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ ని థియేట్రికల్ రిలీజ్ చేసి వచ్చారు.    మాస్కోలోని ఇండియన్ ఎంబసీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఎరౌండ్ ది వరల్డ్ లో ఒకటిగా ఫెస్టివల్లో  పుష్ప ని ఎంపిక చేసింది.  అంతేగాకుండా క్రిటిక్స్ పిక్ గా కూడా నమోదైంది.  ఇక థియేట్రికల్ రిలీజ్ కి అల్లుతో పాటు టీమ్ మొత్తం ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు.  రేడియో ఇంటర్వ్యూలు, టీవీ ఇంటర్వ్యూలు ధారాళంగా ఇచ్చారు.
        
అయితే దిగ్భ్రాంతికరంగా సినిమా భారీ యెత్తున ఫ్లాపయింది. మూడు రోజుల్లోనే చాలా థియేటర్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రచార కార్యక్రమాల సమయంలో ఖర్చు చేసిన 3 కోట్ల రూపాయలూ నష్టంగా మిగిలింది.
        
ఇది అల్లుకి వార్నింగ్ బెల్. దీని ఫలితమేమిటో తర్వాత చూద్దాం. పై రెండు తీపి- చేదు అనుభవాలలా వుండగా, జపాన్ లో ఎన్టీఆర్- రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్లు డ్రీమ్ రన్‌ అన్పించి సంతోషాన్ని మిగిల్చాయి. ఆర్ ఆర్ ఆర్ జపాన్ బాక్సాఫీసు కలెక్షన్ 15 కోట్లకి చేరుకుంది. జపాన్ అంతటా దాదాపు 210 థియేటర్లలో రిలీజ్ చేశారు. వాటిలో 31 ఐమాక్స్ థియేటర్లు. రెండోది, అటు ప్రఖ్యాత ఆస్కార్ నామినేషన్ రేసులో వుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్, రామ్ చరణ్), స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ సాంగ్, స్కోర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్‌ఎక్స్, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి మొదలైన 14 ప్రధాన కేటగిరీల క్రింద నామినేషన్ రేసులో ఎంటరైంది.
        
మరోవైపు, ఆర్ ఆర్ ఆర్ జనవరి 2023లో జరిగే ప్రసిద్ధ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి రెండు విభాగాల్లో నామినేట్ అయింది. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఆంగ్లేతర భాష ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) లకి గాను రెండు కేటగిరీల్లో నామినేట్ చేసింది.
        
కె- పాప్ హిట్, పుష్ప రష్యన్ ఫ్లాప్, ఆర్ ఆర్ ఆర్ జపాన్ హిట్, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు ఇవన్నీ చూస్తూంటే అల్లు అర్జున్ కి తను గ్లోబల్ స్టార్ అవ్వాలన్న పట్టుదల పెరగడం సహజమే. దీని ఫలితంగానే ఇప్పుడు పుష్ప- ది రైజ్ సీక్వెల్ పుష్ప- ది రూల్ విషయంలో చేస్తున్న డిమాండ్లు. అసలు పుష్ప- ది రూల్ షూటింగ్ ప్రారంభం కాకముందే, ఓవర్సీస్ హక్కుల కోసం మేకర్స్ రికార్డ్ ధరని డిమాండ్ చేశారు. ఓవర్సీస్ రైట్స్ పొందేందుకు 80 కోట్లకి పైగా అడగడం మొదలెట్టారు. బయ్యర్లు బెదిరిపోయారు.
        
ఇప్పుడు అల్లు డిమాండ్లు మేకర్స్ కి బడ్జెట్ ని పెంచేస్తున్నాయి. పుష్ప ఫ్రాంచైజీ మొదటి ఇంస్టాల్ మెంట్ పుష్ప- ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో ఇంస్టాల్ మెంట్ పుష్ప -ది రూల్ మరింత భారీగా, మెరుగ్గా నిర్మించడానికి దాదాపు 400 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. ప్రీక్వెల్ కి మించి సీక్వెల్ అన్నమాట. అయితే అల్లు గ్లోబల్ ప్రణాళికల ఫలితంగా ఈ బడ్జెట్ మరింత పెరుగుతోంది. తొందరగా పూర్తి చేసేందుకు వొత్తిడి చేయకుండా గ్లోబల్ ప్రమాణాలతో తీయాలన్నదే అల్లు కోరిక.
        
అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ గా వైరల్ అవుతూంటే తను లోకల్ గా వుండలేడు కదా? అటు రష్యాలో పుష్ప ఫ్లాపవడం చూస్తే, గ్లోబల్ ప్రమాణాలకి అది సరిపోలేదనే అర్ధం. హాలీవుడ్ ప్రమాణాలే గ్లోబల్ ప్రమాణాలు. కేవలం సాంకేతికంగా కాదు, విషయపరంగా కూడా. హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజారణ పొందడానికి విషయపరంగా ఏ సార్వజనీతనతో వుంటున్నాయో ఆ ప్రమాణాలు. లోకల్ నుంచి పానిండియా అవడం వెరైనట్టే, పానిండియా నుంచి గ్లోబల్ అవడం పూర్తిగా వేరు. ఇది కుర్తించినప్పుడే అల్లు అర్జున్ గ్లోబల్ ప్రణాళికలు విజయవంతమవుతాయి.
        
న్యూయార్క్ వార్షిక ఇండియన్ డే పరేడ్ లో, యే భారత్ కా తిరంగా హై, కభీ నహీ ఝుకేంగా (ఇది మా త్రివర్ణ పతాకం, ఇది తగ్గేదేలే) అని నినదించినట్టు, ఇది నా గ్లోబల్ పుష్ప- తగ్గేదేలే! అన్పించేట్టు వుండాల్సి వుంటుంది.

“But having a really good understanding of history, literature, psychology, sciences ― is very, very important to actually being able to make movies.” ― George Lucas

సికిందర్