రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, నవంబర్ 2014, ఆదివారం

సాంకేతికం


పెళ్లంటే పరాయి డ్రెస్సులా?
కాస్టూమ్స్ డిజైనర్ మోహన్ 


ఇప్పుడు తెలుగు సినిమాల్లో డిజైనర్ పెళ్ళిళ్ళ ట్రెండ్ నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా తెలుగు పెళ్ళిళ్ళలో మెహందీ అనీ, సంగీత్ అనీ ఎక్కడిదో కల్చర్ తెచ్చిపెట్టుకుని నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి కల్పిస్తున్నారు. సానియా మీర్జా పెళ్లిలో ఇవి చూశామంటే అర్థముంది. కళల్లో లాగే నేటివిటీని కూడా ఫ్యూజన్ చేసి చూపిస్తామంటే ఎలా? తెలుగు సినిమా పెళ్ళి సన్నివేశాల్లో షేర్వానీ చుడీదార్లూ, పెళ్లిపీటల మీద అప్పుడే శోభనం పెళ్లికూతురి వేషంలో హీరోయినూ కన్పిస్తే ప్రేక్షకులు తెలుగు సినిమా చూస్తున్నట్టా, లేక ఏ రాజస్థానీ వేడుకకో తరలివెళ్ళినట్టా?


కాస్ట్యూమర్లని కంపెనీకి పరిమితం చేసి, స్టార్లు తమ దుస్తుల్ని తామే నిర్ణయించుకునే కాలం ప్రారంభమయినపుడు ఇలాటివి తప్పవేమో. ఆ మధ్య ఒక హాలీవుడ్ సినిమాలో అమెరికా ప్రాంతపు కథకి, నేపథ్యంగా ఆసియా ఖండపు కొండలు కన్పించేసరికి విమర్శకులు ఖండించారు. మనకా ప్రమాణాల పట్టింపు లేదు. ఈ పూర్వ రంగంలో ప్రముఖ కాస్ట్యూమర్ అవ్వారు మోహన్‌రావు అలియాస్ మోహన్ తన వృత్తినెలా సమర్థించుకుంటారో చూద్దాం. "నా వరకూ నేను పని చేసిన సినిమాల్లో పెళ్ళి దృశ్యాల్ని మధుపర్కాలతో మన నేటివిటీలోనే చూపించాం. హీరోయిన్లకి సాధారణ తెలుపు కాటన్ చీరా జాకెట్లనే తొడిగాం. పెళ్ళి సీనుందని చెప్పి నాకొప్పజెప్పాక, ఇక ఎందులోనూ ఎవరూ జోక్యం చేసుకోవడం జరగలేదు.''

జగపతిబాబు 'జాబిలమ్మ పెళ్ళి'తో ప్రారంభమై ఇప్పుడు బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' వరకూ చేరుకున్న మోహన్ ఏ కాస్ట్యూమర్ ప్రతిభయినా నేటివిటీలో ఒదిగినప్పుడే రాణిస్తుందని స్పష్టం చేశారు. అలాటి నేటివిటీకి పరాకాష్ఠ అయిన పౌరాణికాలకే ఆయనకి అవకాశాలొచ్చినప్పుడు ఇక చెప్పేదేముంది?
'పరమవీరచక్ర'లో బాలకృష్ణని ధర్మరాజుగా చూపించి మంచి మార్కులే కొట్టేశారు. దీనికి వాడిన గద, కిరీటం ఎక్కడివి? నాటి 'సీతారామకళ్యాణం'లో ఎన్టీఆర్ వాడినవే! ఆభరణాలు 'లవకుశ'లో ఎన్టీఆర్ ధరించినవే! రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో ఇవన్నీ భద్రపర్చి ఉన్నాయి. ఒక్క బొట్టు తప్ప, మిగతా దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు, చేతి వాచీలు, అవసరమైతే ఓ విగ్గు కూడా కాస్ట్యూమర్ బాధ్యతల క్రిందికే వస్తాయి. బొట్టు మాత్రం మేకప్‌మాన్‌కి దఖలుపడిన ప్రత్యేక హక్కు. ఇక పౌరాణికాల్లో గదలు, కిరీటాలు, వడ్డాణ కంకణ గింకణ గొడవంతా కాస్ట్యూమర్లదే!


ఈ విధంగా బాపు దగ్గర 'శ్రీరామరాజ్యం'కి పని చేయడం గొప్ప అదృష్టమని తన్మయం చెందారు మోహన్. బాపు వేసి ఇస్తున్న డిజైన్ల ప్రకారం కాస్ట్యూమ్స్ రూపొందిస్తున్నానన్నారు. ఇక్కడ మనం బాపులో కాస్ట్యూమ్స్ డిజైనర్‌ని కూడా చూడొచ్చు. మోహన్ ప్రయత్నిస్తున్న ఈ పౌరాణిక కళారూపం అవతలి పార్శ్వంలో 'అలా మొదలైందిఅనే ఆధునిక సక్సెస్‌ని కూడా చూడొచ్చు. ఒక దర్శకురాలి (నందినీరెడ్డి)తో తొలిసారి పనిచేసిన అనుభవ గాథ. బాలకృష్ణతో పాటు వరుణ్ సందేశ్‌కీ పర్సనల్ కాస్ట్యూమర్‌గా కొనసాగుతున్న ఆయన "కాస్ట్యూమ్ వేల్యూ ఉన్న సినిమా మహేష్‌బాబు నటించిన కౌబాయ్ సినిమా టక్కరి దొంగ'' అని చెప్పుకొచ్చారు. తను చెన్నయ్‌లో ఒక సినిమా పని ముగించుకుని వచ్చేవరకూ ఈ కాస్టూమ్స్ కోసం దర్శకుడు జయంత్ నిరీక్షించారన్నారు.

జయంత్‌తో బాటు జగపతిబాబు, నిర్మాత బూర్గులపల్లి శివరామకృష్ణ, బాపు, దాసరి, కోడి రామకృష్ణ, అరుణ్ ప్రసాద్, సి. కళ్యాణ్ తదితరులందించిన ప్రోత్సాహంతో ఈనాడు 50 సినిమాల కాస్ట్యూమర్‌గా నిలబడ్డానని చెప్పారు. 1986లో చిలకలూరిపేట నుంచి బయల్దేరి చెన్నయ్ చేరుకున్నారు మోహన్. అక్కడ కాస్ట్యూమర్‌గా ఉన్న అన్న ప్రసాద్ దగ్గర కొంతకాలం పనిచేసి, కాస్ట్యూమ్స్ కృష్ణకి అసిస్టెంట్‌గా చేరారు. తండ్రి పిడబ్ల్యుడిలో అసిస్టెంట్ ఇంజనీర్. 1992లో హైదరాబాద్ చేరుకుని ఫీల్డులో కొనసాగిన మోహన్, 1996లో 'జాబిలమ్మ పెళ్ళి'తో జగపతిబాబుకి పర్సనల్ కాస్ట్యూమర్‌గా మారారు. అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఈనాడు, చందమామ, ఘర్షణ, లవ్‌ఫరెవర్ (హిందీ) సినిమాలకు పనిచేశారు.


ప్రస్తుతం శ్రీరామరాజ్యంతో బాటు, బాలకృష్ణ మరో సినిమా, అల్లరి నరేష్, వరుణ్ సందేశ్ సినిమాలు రెండు ఆయన వస్త్రాలంకరణలో భాగమయ్యాయి. అయితే శ్రీరామరాజ్యంలో సీత పాత్ర పోషిస్తున్న నయనతారకి చెన్నయ్ నుంచి పర్సనల్ కాస్ట్యూమర్ పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 28- ప్రపంచ టైలర్లకి ఒక మహత్తర దినం. 1845లో ఇదే రోజున అమెరికాకు చెందిన ఎలియాస్ హోవ్ అనే ఆయన కుట్టు మిషన్‌ని కనిపెట్టాడు. ఆయన పేరు మీదుగా ఆ రోజు తామంతా టైలర్స్ డే జరుపుకుంటామని తెలియజేశారు మోహన్. ఆ మహానుభావుడి  పటాలు రెండు మోహన్ బిజీ  వర్క్‌షాపులో వేలాడదీసి ఉన్నాయి.

సికిందర్

(డిసెంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

అల్లరి ప్రాబ్లం!

బొమ్మాళి బ్రదర్ బాగుపడతాడా?

        ల్లరి నరేష్ కిప్పుడు మంచి కాక మీద అగ్ని పరీక్ష ఎదురయ్యింది! ఈ నెల విడుదలవుతున్న తాజా కామెడీ  ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఏమవుతుందో ఏమో నన్న సస్పెన్సే ఈ అగ్నిపరీక్ష! గుండెల్లో గుబులు, బయట నవ్వులు. ఐదు వరస ఫ్లాపులతో నిర్మాతలకీ కొనుగోలుదార్లకీ  గాభరా పుట్టిం చేస్తున్న ఒకప్పటి ఓపెనింగ్స్ హీరో నరేష్ ఇప్పుడు తాజా నవ్వుల సినిమాతో ఏం పంచిపెడతాడో నన్నదే  ఉత్కంఠ అంతటా. తీపి మిఠాయా - గొడ్డు కారమా- ఏది రుచి చూపిస్తాడు? ఉన్న పోటీలేని ఏకైక హాస్య కథా నాయకుడనుకుంటే, అతడికే సమస్య లెదురవడం విచిత్ర పరిస్థితి. నవ్వించే నటుడికి సమస్యలేమిటి? నవ్విస్తే కొడతారా? లేక నవ్విపోతారా? అలాగైతే అసలు కామెడీ హీరోలే కాని స్టార్లందరూ ఏమైపోవాలి?
                     గ్ర హీరోలు సక్సెస్ కి ఇక కామెడీయే ఏకైక మార్గమని, తమ ప్రతీ సినిమాలో కథ వదిలేసి కథతో సంబంధం లేని కామెడీ మీద కామెడీ ట్రాకులతో, బ్రహ్మానందాన్ని బాసటగా దింపుకుని, ఏడాది పొడవునా ప్రేక్షకుల్ని నవ్వించి నవ్వించి ఇంకా నవ్విస్తూనే వున్నా బోరు కొట్టడం లేదు కదా? పెద్ద హీరోల సినిమాలంటే ఇప్పుడు కామెడీ సినిమాలే అన్నంతగా అర్ధమే మారిపోయింది. అలాంటిది 2002 లో అల్లరిఅనే సినిమాతో పుట్టడమే కామెడీ హీరోగానే పుట్టి, ఈ పన్నెండేళ్ళుగా ఫక్తు కామెడీ సినిమాల్లోనే నటిస్తూ వస్తున్న, రికార్డు స్థాయిలో  అప్పుడే 49 సినిమాల వయస్సు కొచ్చేసిన అల్లరి నరేష్, అంతలోనే గల్లంతయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?

          సూటిగా చెప్పాలంటే, తను కామెడీ హీరోగా ఉంటున్న వాడు  కాస్తా ఏదో దుష్ట శక్తి ఆవహించినట్టు, పేరడీ హీరోగా మారిపోవడమే కారణం. ఇతర స్టార్ల సినిమాల్ని, పాత్రల్ని, కామెడీ లనీ పేరడీ చేయడం, సెటైర్లు వేయడం వంటి పనులు చేస్తూ, నవ్విస్తున్నాననుకుంటూ ఎక్కడేసిన గొంగళి లా వుండిపోవడం. దీంతో ప్రేక్షకులు పగలబడి నవ్వడమే లేదు సరికదా, నవ్విపోవడం మొదలెట్టారు. ఎలా తయారైందంటే, ఇతర స్టార్ల సినిమాల్లో చూసేసిన అవే తిరగమోత తాలింపు సీన్లని కామెడీ పేరుతో మళ్ళీ మళ్ళీ చూడాల్సిరావడం చాలాచాలా గుది బండగా మారింది! యాక్షన్ స్టార్లు కామెడీని నమ్ముకుని హింసని తగ్గించుకుంటే, నరేష్ సినిమాలేమో కామెడీ పేరుతో హింసిస్తున్నాయి.

          2012 వరకూ కొన్ని  అపజయాలున్నా విజయాలే ఎక్కువగా సడెన్ స్టార్, కింగ్ ఆఫ్ కామెడీ, ఈతరం రాజేంద్ర ప్రసాద్, సిక్స్ సిగరెట్ ప్యాక్ హీరో లాంటి రకరకాల బిరుదులతో పాపులారిటీ ప్రవాహంలో నవ్వుల నదిలో పువ్వుల పడవ మీద హాయిగా ప్రయాణిస్తున్న నరేష్ కి అదే సంవత్సరం ‘సుడిగాడు’ తో ఫుల్ రేంజిలోనే  క్రేజ్ పెరిగింది. ఎక్కువగా తమిళ రీమేకులు తీసే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఆరేళ్ళ అజ్ఞాతం తర్వాత నరేష్ తో తీసిన మరో తమిళ రీమేకు “సుడిగాడు”. ఇందులో సినిమా సాంతం బాగా రోటీనై పోయిన సినిమా హీరోల పాత్రల్ని, ప్రేమల్ని, హీరోయిజాల్ని, పంచ్ డైలాగుల్నీ ఆట పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రియేటివిటీ చాలా ఒరిజినల్ గా, మరెంతో కొత్తగా అన్పించడంతో అంతే రెచ్చిపోయి, దీన్నో పెద్ద హిట్ చేసి రుణం తీర్చుకున్నారు నాణ్యతకి విధేయులైన ప్రేక్షకులు కూడా!



       టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఎన్డీటీవీ వంటి జాతీయ మీడియా సంస్థలు సైతం దీనికి బ్రహ్మరధం పట్టాయి. ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తీస్తే, 33 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు! ఏదీ వదిలిపెట్టకుండా ఈగ, టాగూర్, దూకుడు, పోకిరీ, సింహా, జల్సా, ఖుషి, ఖలేజా, మగధీర, రచ్చ, చంద్రముఖి, భారతీయుడు, రోబో, అపరిచితుడు, ప్రేమికుడు, బాయ్స్, సెవెంత్ సెన్స్, 7జి బృందావనం కాలనీ, మాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లీడర్, పెదరాయుడు, నరసింహా, మర్యాదరామన్న, ఏమాయ చేశావే, శశిరేఖా పరిణయం, బొమ్మరిల్లు ...వంటి మొత్తం 28 సినిమాల్లోంచి వివిధ దృశ్యాల్నీ పేరడీ చేసి పారేశారు! 

          తెలుగు సినిమా హీరో 24x7 సమాజంలో ప్రజా సమస్యలే పరిష్కరిస్తూ ఉంటాడని; సమాజంలో జరిగే నేరఘోరాలకు, ప్రజలకు జరిగే అన్యాయాలకూ కోపం తో అతడి కళ్ళు తీవ్రంగా ఎర్రగా భగభగ మండి పోతాయని; చాలా ఈజీగా డీటీఎస్ సౌండులో అతడి నోటెంట పంచ్ డైలాగ్స్ పేల్తాయని; భారత ఆర్ధిక వ్యవస్థ నంతా తన భుజాల మీదే మోస్తూంటాడని; హీరోయిన్ పక్కన లేకపోతే అతడి హృదయం పేదల పట్ల ఆర్తితో కొట్టుకుంటుందని; అతడి హస్తాలు వందలమంది పవర్ఫుల్ విలన్లని ఇట్టే చిత్తుగా చితగ్గొట్టేస్తాయని; ఎక్కడ అతడి పాదాలు తాకితే అక్కడంతా సిరిసంపదలు, సుఖ సంతోషాలూ వెల్లివిరుస్తాయనీ ఒకటే సెటైర్లు!


          తెలుగు సినిమా హీరో అర్హతల మీద కూడా కామెడీ- దేవుళ్ళూ దేవతల కంటే కూడా తనకు జన్మనిచ్చిన తల్లినే అపారంగా ప్రేమించడం; చెల్లెలు ఎలాటి అపాయంలో వున్నా ఆమెని కాపాడడానికి తనే ఠంచనుగా వెళ్ళడం; తను నిరుపేద అయినా ఎలాంటి ధనికురాలైన హీరోయిన్ నైనా ప్రేమలో పడెయ్యడం; సమాజానికి ద్రోహం చేసే వాడు హీరోయిన్ తండ్రి అయినా సరే క్షమించకుండా శిక్షించడం; అసలు విలన్ కూతురైన హీరోయిన్నే ప్రేమించడం; తను మోడరన్ డ్రెస్సుల్లో వుండీ  సంస్కృతి గురించి, కట్టుబాట్ల గురించీ హీరోయిన్ కి క్లాసు పీకడం; తన ఫ్రెండ్ చెల్లెల్ని తన చెల్లెలుగానే చూడ్డం, ఆమె అందంగా వుంటే ఆమెనే ప్రేమించడం; సమాజశత్రువుల మీద అతి సులువుగా విజయం సాధించడం; విమానాలనీ, హెలికాప్టర్ లనీ  జీవితంలో మొట్ట మొదటిసారిగా చూస్తున్నా, సిటీ బస్సుల్లా  అవెక్కేసి ఎడాపెడా తిరిగెయ్యడం; వందల మందితో భీకర పోరాటాలు చేసినా తను ఫ్రెష్ గానే  వుండడం, సిక్స్ ప్యాక్ బాడీ కలిగివుండి, డైలాగ్ డెలివరీ లో- ఫైట్స్ లో అపర ఎక్స్ పర్ట్ అయిపోయి  ఉండడం!


          ఇంతటి  క్రియేటివిటీ తో బాక్సాఫీసుని ఊపేసిన ఈ  ‘అల్లరి’ మార్కు కామెడీ, నిజానికి మహేష్ బాబుకి వచ్చిన ‘దూకుడు’ అంతటి రేంజి నిచ్చింది నరేష్ కి తన కామెడీ సెగ్మెంట్ లో. కానీ ఆతర్వాత జరిగిందేమిటి? అదే క్రియేటివిటీని మక్కీకి మక్కీ రిపీట్ చేస్తూ యముడికి మొగుడు, కేవ్వుకేక, జంప్ జిలానీ అనే మూడు సినిమాల్లో నటించడం. ‘సుడిగాడు’ తర్వాత 2012- 2014 మధ్యకాలంలో వచ్చిన ఈ మూడు కామెడీలే కాక, యాక్షన్- త్రీడీ, లడ్డూ బాబు  అనే రెండు ప్రయోగాలూ కలిపి - మొత్తం ఐదు సినిమాలు వరసపెట్టి అట్టర్ ఫ్లాపయ్యాయి. ప్రయోగాల్ని పక్కన పెడదాం, అవి ఎప్పుడో గానీ జరిగే ప్రయత్నాలు కావు. నటుడిగా తనని నిలబెడుతున్న తన రెగ్యులర్ బ్రాండ్ కామెడీ విషయంలో ‘సుడిగాడు’ తర్వాత అనుసరించిన విధానమే మట్టికరిపించింది. ఒక క్రియేటివ్ ప్రయత్నం హిట్టయితే ఇక అదే జీవనాధారమని దయనీయంగా  సాగిలపడి కొనసాగాలనుకోవడం ఎదురు దెబ్బ తీసింది. మహేష్ బాబు ‘దూకుడు’ లాంటి క్రియేటివిటీ తో ఏ రేంజికి వెళ్లి, మళ్ళీ అదే ‘దూకుడు’ క్రియేవిటీ ని , అదే కోవలోని టైటిల్ తో ఫాలో అయిపోయి  ‘ఆగడు’ తో ఏమయ్యాడో- సరీగ్గా ఇదే నరేష్ తోనూ జరిగింది! దూకుడుకి ముందు- దూకుడు కి తర్వాత అని మహేష్ బాబు అయినట్టు, సుడిగాడుకి ముందు- సుడిగాడుకి తర్వాత  అయ్యింది సరీగ్గా నరేష్ బాబు  పరిస్థితి!


          హిందీలో ఆనాడు రమేష్ సిప్పీ ‘షోలే’ అనే మెగా హిట్ తీసిన వెంటనే అటువంటి ‘షోలే’ లాంటిదే  ‘షాన్’ తీద్దామనుకుని అట్టర్ ఫ్లాపయ్యాడు. ఆ గుణపాఠాన్ని చూసే అందులోంచి ఓ  కొటేషన్ పుట్టించారు - “షోలే కా షాన్ మత్ బనావో!” అని.


          చరిత్ర చదువుకోవాలిగా? షోలే షోలే నే! అదే అద్భుతం మళ్ళీ సిప్పీ తనే చేయలేడు. మొగలే ఆజం, మల్లీశ్వరి, మాయాబజార్..లాంటి అద్భుతాల్నిఆ దర్శకులు అలా వదిలేసి వేరే సినిమాలతో ముందు కెళ్ళి పోయారు. దూకుడు దూకుడే, సుడిగాడు సుడిగాడే ... ‘దూకుడు కా ఆగడు మత్ బనావో...సుడిగాడు కా యముడికి మొగుడు, కేవ్వుకేక, జంప్ జిలానీ  వగైరా వగైరా మత్ బనావో!’ –అని చరిత్ర మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. హీరో కృష్ణ కూడా అప్పట్లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే సాహసోపేతమైన ఇంటర్నేషనల్ హిట్ తీసి, తర్వాత అలాటిదే ‘మంచివాళ్ళకు మంచివాడు’ తీస్తే ఏమయ్యిందో  తెల్సిందే. ఒక ఇన్నోవేషన్ ఇచ్చిన సక్సెస్ మత్తు లోంచి చప్పున బయటి కొచ్చేయాలంతే. కానీ దాన్నే పట్టుకుని సినిమా తర్వాత సినిమాగా  నరేష్ ఇంకేవో  నగిషీలు చెక్కుకుంటూ ఉండడంతో అది  సుడిగుండం లోకి లాగేసింది! ఒక్క సుడిగాడు మూడు సుడిగుండాల్ని సృష్టించింది! 


          ఒక సందర్భంలో, ఫ్లాప్ హిట్ అని లేకుండా తను నటించే అన్ని సినిమాల ఫలితాల్ని పోస్ట్ మార్టం చేసుకుంటా నన్నాడు నరేష్. కానీ ‘సుడిగాడు’  హిట్ ని గనుక పోస్ట్ మార్టం చేసుకుని వుంటే, ఆ చేసుకున్న విధానం ప్రశ్నార్ధకమైనదే. 


          తత్ఫలితంగా డోలాయమానంలో పడింది పరిస్థితి. నిర్మాతలు భయపడ్డారు మళ్ళీ నరేష్ తో సినిమా అంటే. తను తీసుకునే పారితోషకం మూడు కోట్లే అయినా నిర్మాణ ఖర్చు లు విపరీతంగా పెట్టించి పది- పన్నెండు కోట్లకి చేరవేస్తాడనే టాక్ వున్న నరేష్ తో సినిమా అంటే ఇక ముందుకు రాలేని పరిస్థితి (బ్రదరాఫ్ బొమ్మాళికి పదమూడు కోట్లయిందని అంటున్నారు). అన్ని సెంటర్ల అభిమాన హాస్యనటుడనే పేరు తెచ్చున్న నరేష్ కి బి, సి సెంటర్ల ప్రేక్షకులు సైతం బైబై చెప్పేస్తున్న పరిస్థితి ఎదురయ్యింది. 



          వ్యక్తిగతం గా నరేష్ లో ఏ లోపమూలేదు. ఏ సక్సెస్సూ అతని తలకెక్కి స్వారీ చేయలేదు.
తను ఏకైక కామెడీ హీరోననే గర్వం, అహంకారం లేవు. మీడియం రేంజి నిర్మాతలకి, కొత్తగా వచ్చే దర్శకులకి కూడా అతను ఫ్రెండ్లీ హీరోయే.  తన పొజిషన్ చూసుకుని అడ్డగోలుగా పారితోషికం కూడా పెంచుకు పోలేదు. కాకపోతే నిర్మాణ వ్యయం బాగా పెంచేస్తాడన్న అభియోగం మాత్రం వుంది. అతడికి ఇంకా పాత  స్టయిల్లో పాటలకి భారీ సెట్టింగులు వేయించుకునే చాదస్తముంది. దీంతోనే వ్యయం తడిసి మోపెడవుతోంది. ఒకప్పుడు నరేష్ అంటే మినిమం గ్యారంటీ హీరో అని డేట్స్ కోసం పోటీలు పడేవారు నిర్మాతలు. ఆ డిమాండ్ తట్టుకోలేక ఏడాదికి సగటున నాల్గు సినిమాల్లో విశ్రాంతి లేకుండా నటించాడు నరేష్. 2008 లో నైతే బాపు తీసిన ‘సుందరకాండ’ తో మొదలు పెట్టి, విశాఖ ఎక్స్ ప్రెస్, పెళ్లి కాని ప్రసాద్, గమ్యం, బొమ్మన బ్రదర్స్- చందన సిస్టర్స్, సిద్దూ ఫ్రమ్  శ్రీకాకుళం, బ్లేడ్ బాబ్జీ, దొంగలబండి ..ఇలా అక్షరాలా ఎనిమిది సినిమాల్లో నటించి రికార్డు సృష్టించాడు. అలాగే 2010లో ఏడు సినిమాల్లో నటించాడు( శంభో శివ శంభో, రాంబాబు గాడి పెళ్ళాం, ఆకాశ రామన్న, బెట్టింగ్ బంగార్రాజు, శుభప్రదం, సరదాగా కాసేపు, కత్తి కాంతారావు). కానీ 2008 లోనే, రంగ ప్రవేశం చేసిన ఆరేళ్ళ కు గానీ అతని  స్టార్ డమ్ ప్రారంభం కాలేదు. అతడి జీవితంలో ఈ   ‘స్వర్ణయుగం’ మరో 16 సినిమాలతో అలాగే కొనసాగి, 2012 ఆగస్టు నాటికల్లా  “సుడిగాడు’ తర్వాత ముగిసింది. ‘సు’ (సుందరకాండ) తో మొదలైన స్టార్ డమ్ ‘సు’ (సుడిగాడు) తోనే ముగిసిపోయింది. మొత్తం 2014 వరకూ నటించిన 49 సినిమాల్లో 39వరకూ కామేడీలే వున్నాయి.

          ఐతే గమ్మత్తేమిటంటే, ఇతర స్టార్లకి ఒకరి స్టార్ డమ్ మరొకరికి వెళ్ళిపోయే తలనొప్పి ఎప్పుడూ పొంచి వుంటుంది. ఒకటో నంబర్ స్టార్ ఫ్లాపులిస్తే, ఒక్క హిట్ తో రెండో నంబర్ స్టార్ ఆ స్టార్ డమ్ ని లాక్కోవచ్చు. మళ్ళీ ఈ రెండో నంబర్ నుంచి నంబర్ త్రీ కూడా లాక్కోవచ్చు. ఇంకెప్పుడో కాలం  కలిసొచ్చి కసిమీద వున్న ఒకటో నంబర్ స్టారే మళ్ళీ త్రీ నుంచి లాగేసుకో వచ్చు! ఇదో ఎందరు స్టార్ లుంటే అన్ని స్తంభాలాట లాంటిది!


          అల్లరి నరేష్ కీ తల నొప్పి లేదు.  తన హాస్య నట ప్రపంచంలో తానొక్కడే స్టార్. తన స్టార్ డమ్ ని  లాక్కునే మరో కామెడీ హీరోయే లేడు. ఇతర స్టార్లు ఎందరున్నా, ఎప్పుడైనా కామెడీ స్టార్ ఒక్కడే ఉంటాడు. ఈ సౌలభ్యం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం. ఈ  ఒంటి స్తంభపు ఆట తానొక్కడే తీరుబడిగా ఆడుకుంటాడు. స్టార్ డమ్ ఎటూ పోనే పోదు. పోతే అక్కడే కింద పడి వుంటుంది. దాన్నీ మళ్ళీ తనే ఎత్తుకో వచ్చు. ఇది కూడా కనా కష్టమై పొతే అంతకన్నాకన్నా ట్రాజెడీ హీరో ఉంటాడా! అప్పుడు కామెడీ కోసం ప్రేక్షకులు ఎటు చూడాలి? 


         
ఈ నేపధ్యంలో, పట్టుదలతో తనని నిలబెట్టిన తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ నే ఈ ఆపత్కాలంలో తిరిగి  నమ్ముకోవాల్సి వచ్చింది నరేష్ కి.  ఆ దివంగత తండ్రి సమర్పణలో ‘సిరి సినిమా’ బ్యానర్ లో  బంధువు అమ్మిరాజుని నిర్మాతగా చేసుకుని,   బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’. పూర్తి చేశాడు నరేష్. దీనికి గతంలోనే   దర్శకుడుగా మారి, నిఖిల్ తో  ‘వీడు తేడా’ అనే సినిమా తీసిన ప్రముఖ రచయిత ఈసారి తనని గుర్తు పట్టకుండా మారు పేరు వెనుక దాక్కుని,  బాహాటంగానే దర్శకత్వం వహించాడు. ఆయనే  చిన్నికృష్ణ  అనే బి. చిన్ని!

              నరేష్ ని నిలబెట్టడానికి చేయాల్సిన గిమ్మిక్కులన్నీ ఈ సినిమాతో చేశారు. అందులో ప్రధానమైనది తమిళ హీరోయిన్ కార్తీక ని పెట్టుకోవడం. నాటి అగ్ర తార రాధ కూతురైన కార్తీక 2009లోనే  నాగచైతన్య నటించిన ‘జోష్’ తో తెలుగు తెర కెక్కింది గానీ, తెలుగు ప్రేక్షకులకి తన తల్లిలా దగ్గర కాలేకపోయింది. తమిళ డబ్బింగ్ హిట్ ‘రంగం’ తో మళ్ళీ తిరిగి వచ్చింది. అల్లరి నరేష్ కి ఇంకో రికార్డుంది. అతనితో నటించిన ఏ హీరోయినూ పై స్థాయికి వెళ్ళిన పాపాన పోలేదు. రాజేంద్ర ప్రసాద్ తో అలాకాదు. ఆయనతో కెరీర్ ప్రారంభ దశలో నటించిన సౌందర్య, ఆమని, రంభ అగ్ర తారలయ్యారు. అగ్ర తారలయ్యాక కూడా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో నటించారు. కానీ నరేష్ తో ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ కీ పట్టుమని నాల్గు అవకాశాలు దక్కలేదు. అలాగే అగ్ర హీరోయిన్లతో నటించాలని నరేష్ కీ వుంటుంది. అయితే వాళ్ళు భగ్న హీరోయిన్ లయ్యాకే ఆ అవకాశం దక్కుతూ వస్తోంది - చార్మీ, భూమిక, శ్రియ మొదలైన వాళ్ళతో అయ్యాక ఇప్పడు కార్తీక తో!

          మళ్ళీ ఇక్కడ కార్తీక హీరోయిన్ గా నటించ లేదు. నరేష్ కి కవల సోదరిగా నటించింది.  హీరోయిన్ గా వేరే మోనాల్ గుజ్జర్ వేసింది. సినిమా ప్రధానంగా నరేష్- కార్తీక ల మధ్యనే నడుస్తుందని అంటున్నారు. కొత్త తరహా కథతో, కొత్త రకం కామెడీతో- ఆ కవల సోదరుడికి తలనొప్పులు తెచ్చే కవల సోదరి స్పీడ్ పాత్రతో ఇదో భిన్నమైన అనుభవమే కాగలదు ప్రేక్షకులకి అని నిర్మాత ఆశాభావం.


          ఐతే అసలు సంగతేంటో నవంబర్ లో మాత్రమే తేలుతుంది. ఇది నరేష్ ని బయట పడేసిందా ఇక సమస్య వుండదు. ఐతే ఇదిచ్చే సక్సెస్ తో మళ్ళీ ‘సుడిగాడు’ తర్వాత చేసిన పొరపాట్లే చేస్తే కథ మళ్ళీ మొదటి కొస్తుంది. ఎప్పటికప్పడు సక్సెస్ ని మర్చిపోతూ, ఆ సక్సెస్ ఇచ్చిన సినిమా ఛాయలు లేని మరో కొత్త ప్రయత్నం చేస్తూంటేనే తనకు పోటీలేని, ప్రత్యాన్మాయం కూడా లేని ఈ స్థానాన్ని నిలబెట్టుకోగలడు. 


          దీని తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తయారవుతున్న  ‘బందిపోటు’ విడుదలవుతుంది. తనతో ‘అహ నా పెళ్ళంట’ తీసిన వీరభద్రంతో “బిస్కెట్ రాజా’ అనే మరోసినిమా ప్రకటించాడు నరేష్. తన యాభయ్యోవ సినిమా జనవరి 1,2015న విడుదలయ్యేలా చూడాలనుకుంటున్న అల్లరినరేష్ ఇంకో యాభై సినిమాల రికార్డు కూడా తనే పూర్తి చేసి దాన్ని  తండ్రికి నివాళిగా అర్పిస్తేనే జన్మ ధన్యమైనట్టు!

-సికిందర్
నవంబర్ 2014 ‘ఈవారం’ కోసం




.


1, నవంబర్ 2014, శనివారం

ఆయనే ఒక స్కూలు

ఆర్టికల్
బాపు సినిమాల్లో వైవిధ్య విలాసం!
            కీ.శే. బాపు సినిమాలు అనగానే రామాయణమే గుర్తు కొచ్చేంతగా ఆయన ముద్ర పడిపోయారు. ఆ ముద్ర చెరిపేసుకోవాలని ఏనాడూ ఆయన ప్రయత్నించలేదు. ఒక పెళ్లి కథో, ఇంకో భార్యాభర్తల మధ్య సంబంధాల కథో తీస్తే - ఆఁ... ఏముందిలే, ఇంకో రామాయణ పారాయణమే కదా అనేసి ప్రేక్షకులు ముందే ఊహించేస్తున్నా, ఆయన లక్ష్యపెట్టలేదు
            ఈ రోజుల్లో సినిమా విడుదలయ్యేవరకూ కథ బయటికి పొక్కకుండా తీసుకుంటున్న జాగ్రత్తల నేపధ్యంలో ఆలోచిస్తే, బాపు కా రోజుల్లో ప్రేక్షకులు తన సినిమా ఏ బాపతు కథో ముందే చెప్పేస్తున్నా గాభరాపడలేదు. ఎన్ని సార్లు రామాయణాన్ని తిప్పి తిప్పి తీస్తూ పోయినా, ఇంకేదో వైవిధ్యం కనబరుస్తాడనన్న ఆసక్తి ప్రేక్షకులకి మిగిలే ఉంటుందని ఆయన భరోసా. ఆ భరోసాతోనే ప్రేక్షకాసక్తిని నీరుగార్చకుండా అటువంటి సినిమాలు తీస్తూ విజయాలు సాధిస్తూ పోయారు. ఆ సినిమాల్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించుకో నక్కరలేదు. ఇక్కడ ప్రధానంగా చెప్పబోతున్నది, బాపు అంటే కేవలం రామాయణ ప్రమోటర్ మాత్రమే కాదనీ, ఆ నాటికి అందుబాటులో వున్న ఇంకా ఇతరానేక ప్రక్రియల్లో కూడా ఆయనది అందెవేసిన చెయ్యి అని కూడా గుర్తుంచుకోవాలని మాత్రమే!
            1967 – 2011 మధ్య కాలంలో ఆయన తీసిన మొత్తం 51 సినిమాల్లో నేరుగా తీసిన రామాయణం (సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీరామ రాజ్యం) తో నాలుగే వున్నాయి. అంతటి  రామభక్తుడు ఫక్తు పౌరాణికాలే తీయాలని ఉత్సాహ పడలేదు.  

పౌరాణీకాన్ని సాంఘీకం చేయడం పైనే దృష్టి పెట్టారు. దీంతో నాటి ముత్యాలముగ్గునుంచీ నిన్నమొన్నటి సుందరకాండదాకా పూర్తి రామాయణీకరించిన లేదా అక్కడక్కడా ఆ ఛాయలతో కూడిన  ప్రేమా పెళ్ళీ- దాంపత్యాల కథా కమామీషుల్ని సినిమాలుగా తీయకుండా
ఉండలేకపోయారు.  ఇవి పక్కనపెడితేశ్రీనాథ కవి సార్వభౌమ, త్యాగయ్య, భక్త కన్నప్ప, రాజాధిరాజు లాంటి హిందూ- క్రైస్తవ చారిత్రక- భక్తి కథా చిత్రాలూ తీశారు. మంత్రిగారి వియ్యంకుడు, జాకీ, బుల్లెట్ లాంటి పక్కా వినోదాత్మకాలూ తీశారు. బుద్ధి మంతుడు లాంటి ఆస్తిక- నాస్తిక చర్చకీ తెర తీశారు. వంశవృక్షం లాంటి సనాతన ధర్మాల కథ తోనూ తీశారు. మళ్ళీ శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ లాంటి హిందూ- క్రైస్తవ మతాంతర ప్రేమ కథతోనూ తీశారు. అలాగే, తూర్పు వెళ్ళే రైలు, రాధాకళ్యాణం లాంటి తమిళ రీమేకులూ తీశారు. స్నేహం అనే హిందీ రీమేకూ వదలలేదు. ఇక బాలీవుడ్ వెళ్లి ఏకంగా 12 హిందీ సినిమాలకి దర్శకత్వం వహించేశారు!
            ఇదంతా ఒకెత్తు అయితే, సినిమారంగ ప్రవేశం చేస్తూనే  ‘సాక్షి’  అనే సామాజిక చైతన్యం గల సినిమా తీయడం, ఈ సామాజిక- విప్లవ కథా చిత్రాల పంథా లోనే కలియుగ రావణాసురుడు, మనవూరి పాండవులు, బాలరాజు కథ లాంటివీ  తీయడం మరొకెత్తు!

            ఇలా ఇంత వైవిధ్యం ఆయన లోంచి ప్రవహించింది. ఇప్పటిలా కాక అప్పటి ప్రేక్షకుల అభిరుచి బహుముఖాలుగా వుండడం వల్ల, నాటి అనేక ఇతర దర్శకులకి లాగే బాపుకి ఈ వెరైటీ అంతా సాధ్యపడింది. అయితే ఇదంతా వ్యాపారాత్మక చిత్రాల పరిధి లోనే. ఆ పరిధి దాటి పోలేదు. ఒక చిత్రకా రుడిగా ఆయన మేధావియే కావొచ్చు, కానీ చలన చిత్రకారుడిగా సామాన్యులని అలరించే కమర్షియల్ సినిమాలే తీశారు. చిత్రకారుడిగా ఆయన శైలి ప్రభావంలో ఒక తరానికి తరమే యువ చిత్రకారులు కొట్టుకు పోయారు. అలాంటిది సినిమాల విషయానికొస్తే, ఆయన శైలిని అనుసరించకపోయినా ఫర్వాలేదు, కనీసం కథ చెప్పడంలో ఆయన సినిమాలు ఏ నూతన పోకడలు ప్రతిపాదిస్తున్నాయో తెలుసుకుని అనుసరించిన పాపాన ఏ యువ దర్శకుడూ పోలేదు. ఇదికూడా తెలుగు సినిమాల నాణ్యతా ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా తయారవడానికి మూలకారణ మైన వాటిలో ఒకటిగా చెప్పొచ్చు. ఏదైనా సినిమా చూస్తే అందులోంచి కథని తెలియకుండా ఎలా సొంతం చేసుకోవాలా అన్న దృష్టితోనే చూస్తారు తప్ప, ఆ కథ చెప్పడంలో ఏవైనా కొత్త విషయాలుంటే నేర్చుకోవాలన్న అధ్యయన దృష్టితో కాకపోవడం అలవాటుగా మారింది.

         బాపు తీసిన వాటిలో రెండు సినిమాలు - ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు రెండూ రెండు సినిమా కళా పాఠాలుగా నిలబడతాయి. రెండూ కమర్షియల్ గా సూపర్ హిట్టయినవే. కానీ రెండూ రెండు ప్రయోగాత్మక సినిమాలే. ప్రయోగాత్మక సినిమాలు ఆబాలగోపాలాన్ని ఉత్తేజ పర్చే కమర్షియల్ హిట్స్ కావడం చాలా చాలా అరుదైన విన్యాసం. నేడు క్రాసోవర్ సినిమాలంటూ కొత్త వర్గీకరణతో బాలీవుడ్ లో తీస్తున్న వందలాది మల్టీప్లెక్స్ సినిమాలని చూసి- ఓహో సినిమాలు ఇలా కూడా తీయవచ్చా అని సంబర పడుతున్నాం గానీ,  2000 - 2001 లలో వీటికి బీజం వేసిన ఆర్టు సినిమా దర్శకులైన శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ లని కీర్తిస్తున్నాం  గానీ, ఈ పని తెలుగులో ఏనాడో 1975 లోనే  బాపు ముత్యాల ముగ్గుతో చేసి చూపెట్టేశారు!

     `80 లు దాటి `90ల కల్లా దేశవ్యాప్తంగా ఆర్టు సినిమాల ఉద్యమం చల్లబడుతూ వచ్చి, అవి ఇంకెంత మాత్రమూ వర్కౌట్ కావని తెలుసుకున్న బెనెగళ్, నిహలానీ ప్రభృతులు, మళ్ళీ తమ ప్రేక్షకుల్లో ఊపుతీసుకు రావడానికి తొట్టతొలి సారిగా, తమ తమ భేషజాలూ ఇతర మానసిక నిషేధాలూ వదులుకుని బాలీవుడ్ తో రాజీ పడిఅప్పటి పాపులర్ స్టార్స్ ని ఆశ్రయించి, ‘జుబేదా’ (2001) అని ఒకరూ, ‘తక్షక్’ (2000) అని మరొకరూ తీసి ఆర్ట్ సినిమాలకి విచిత్రమైన రూపు తొడిగారు. అది కమర్షియలార్టుఅయి కూర్చుంది. ఇలా ఆర్టు సినిమా కమర్షియల్ కి క్రాసోవర్ అవడంతో వీటికి క్రాసోవర్ సినిమా అనే పేరు ప్రాచుర్యం లోకి వచ్చింది. ఈ ధోరణిలో బాలీవుడ్ స్టార్స్ తో ఇతర దర్శకులూ, కొత్తగా వచ్చే దర్శకులూ లో బడ్జెట్ సినిమాలు తామర తంపరగా తీస్తూ దేశవ్యాప్తంగా మల్టీ ప్లెక్స్ థియేటర్ లకి కావలసినంత ఫీడింగ్ ని ఇవ్వసాగారు. ఒకప్పుడు ఆర్ట్ సినిమాల్ని అభిమానించే ప్రేక్షకులు ఉన్నట్టే, ఇప్పడు మల్టీప్లెక్స్ ప్రేక్షకులు కమర్షియలార్టు  సినిమాల పోషకులయ్యారు. ఇదంతా భవిష్యద్దర్శనం చేసినట్టు బాపు గారు ఏనాడో ముత్యాలముగ్గు ద్వారా చూపించేశారు!
            అయినా అప్పుడూ ఇప్పుడూ కూడా తెలుగులో ఇలాటి ట్రెండ్ జాడే లేదు. కారణం, లో- బడ్జెట్ లో చిన్న సినిమాలయినా సరే, అవి  భారీ సినిమాల కృత్రిమత్వానికి అలవాటు పడిపోవడమే. దీన్నుంచి పక్కకు జరిగి సహజత్వాన్ని అంగీకరించక పోవడమే. భారీ సినిమాల అనుకరణల జాడ్యం లో పడి ఐపులేకుండా పోతున్నా సరే, దీపం చుట్టూ పురుగుల్లా సమిధలవడానికి ఇష్ట పడడమే

           
ఈ నాటికీ ముత్యాలముగ్గు అంతర్జాతీయ స్థాయి సినిమానే. అప్పటికే అది వ్యాపార విలువల్ని జోడించుకున్న కళాత్మక సినిమా. అతి తక్కువ డైలాగులతో ఆర్టు సినిమా లుండవచ్చు. కమర్షియల్ సినిమాలకి డైలాగుల దండకం వుండాల్సిందే. అలాంటిది అతి పొడుపు చేసిన డైలాగులతో, హావభావాల మీద పండించిన సన్నివేశాలతో,  క్లాస్-మాస్ ప్రేక్షకులనే తేడాల్ని చెరిపేస్తూ కనక వర్షం కురిపించుకున్న సినిమా ఏదైనా వుందంటే అది ఇదే. తర్వాత ఈ సరళిలోనే శంకరా భరణం, సితార, మేఘ సందేశం వచ్చి అవికూడా పెద్ద హిట్టయి ఉండొచ్చు. ఇవి ముత్యాల ముగ్గుకి అనుసరణలు మాత్రంకావు. ఆ ఉద్దండ దర్శకుల ఓరిజినాలిటీయే అది! కానీ ముత్యాలముగ్గు కథ ఎత్తుగడని కానీ, విశ్రాంతి ఘట్టం తర్వాత నుంచి పట్టాల్సిన మార్గం గురించి గానీ, చివరికి ముగింపెలా ఉండాలో గానీ, పరిశీలించుకుని వుంటే కొన్ని వందల సినిమాలు ఫ్లాపు బాట పట్టి పోయేవి కావు.
           
కానీ దురదృష్ట మేమిటంటే, కాపీ కొట్టడమనే తమ వంశాచారం ప్రకారం, ఎన్నో సినిమాల్లో ముత్యాలముగ్గు ఎత్తుగడనే యధాతధంగా దించేసుకుంటూ వస్తున్నారు. హీరోయిన్ సంగీతకి పెళ్ళ వుతూ వుంటే, హీరో శ్రీధర్ ఆ పెళ్ళికి అతిధిగా రావడమనే అత్యంత ఆసక్తిరేపే ప్రారంభ దృశ్యాన్ని కాపీ కొట్టి ఎన్నో సినిమాల్లో పదేపదే చూపించారు. అంతే గానీ, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని; వేరే యాక్షన్, కామెడీ తదితర కథా చిత్రాలకి వాటి కథల ప్రకారం ఈ ఎత్తుగడని మల్చుకుని, ఆ కొత్తదనాన్ని ప్రేక్షకులకి ఎప్పుడూ పంచి పెట్టింది లేదు.
           
విశ్రాంతి ఘట్టం తర్వాత ద్వితీయార్ధం అనేకానేక సినిమాల్లో కథ దారితప్పి వేరే కథ నడవడాన్ని గమనిస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతోందో ఏమిటో ముత్యాల ముగ్గు ని చూస్తే  తెలుస్తుంది. ప్రథమార్ధంలో ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది. పూర్వార్ధంలో లో ఇలా విడదీయడం సులభమే. ద్వితీయార్ధంలో  ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే సవాలు విసిరే ప్రక్రియ! 

          ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి?  పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు ఉపయోగపడే సాధనాలు వాళ్ళే.  వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే అవుతుంది.
         
పోనీ శ్రీధర్-సంగీతల ఎడబాటు తాలుకూ బాధల్ని వాళ్లిద్దరి మీదా  చిత్రీకరిస్తూ కాలక్షేపం చేద్దామా అంటే అదీ సుడిగుండంలో పడేస్తుంది. పైగా  రసభంగం కల్గిస్తూ శోక రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి పిల్లలు పుట్టి వచ్చేవరకూ కథ ఎలా నడపాలి? మొదట్నించీ చూస్తే  ఈ కథ అద్భుత రస ప్రధానంగానే నడుస్తూ వచ్చింది. ఈ అద్భుత రసాన్నే ఇక ముందూ కొనసాగించాల్సి వుంటుంది. అప్పుడే రస భంగం కలక్కుండా కథకి ఏకసూత్రత చేకూరుతుంది.  అందుకని ఈ అద్భుతరస స్రవంతికి  ఒక సాధనంగా ఉంటూ వస్తున్న  రావుగోపాలరావు అండ్ గ్యాంగు ని పోస్ట్ మార్టం చేసే పని చేపట్టారు సిద్ధహస్తులైన బాపూ- రమణలు దిగ్విజయంగా!
          ఇక ముగింపు ఎలా ఉండాలనే దానికి- పతాక స్థాయి కొచ్చేసరికి
ఒకర్నొకరు వెన్నుపోట్లు  పొడుచుకుని కలహించుకుంటున్న దుష్ట చతుష్టయానికి,  మామూలుగా నైతే కళ్ళు తెరచిన హీరో వచ్చి బుద్ధి చెప్తాడు. కానీ ఇక్కడ అలాకాదు, బాపు తన బుద్ధికి పని చెప్పి- బ్రహ్మపురాణంలో చెప్పినట్టు- సృష్టి ఉపసంహార ప్రక్రియల్లో ఒకటైన, పంచమహా భూతాలు ఒకదాన్నొకటి మింగేసుకునే ‘నైమిత్తిక’ తరహా ముగింపుతో బుద్ధి చెప్పారు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే పండితుడు పదే  పదే  ఒకటే చెప్తాడు- ఎప్పుడైతే ప్రేక్షకుల నరనరాన జీర్ణించుకు పోయిన పురాణాల తాలూకు ఛాయలు వెండితెరమీద ప్రతిఫలించి తెలియకుండా వాళ్ళ ఆత్మిక దాహాన్ని తీరుస్తాయో- అప్పుడా సినిమాకి బేషరతుగా వాళ్ళు దాసోహమై పోతారని!
          ఇక పాత్ర చిత్రణలో రావుగోపాల రావు ప్రతినాయక పాత్ర ఒక క్యారక్టర్ స్టడీ. దాని భాష, యాస, 
చేత, తలరాత అన్నీ నిజజీవితంలోంచి ఉట్టిపడినవే. ఇప్పటి తెలుగు సినిమాల విలన్ కి ఈ సహజత్వం తెలీదు. సహజంగా మాట్లాడ్డమే రాదు. అరుపులు అరవడం, కత్తితో పొడవడం ఇవే తెలుసు. సరిగ్గా ఈ 1975  లోనే అటు హిందీలో ‘షోలే’ విడుదలై అమ్జద్ ఖాన్ ‘గబ్బర్ సింగ్’ ప్రతినాయక పాత్ర సంచలనం సృష్టిస్తోంది. ఆ డైలాగులతో ఎల్పీ రికార్డులు ఎంత వేలంవెర్రిగా అమ్ముడుపోయాయో- ఇటు రావుగోపాలరావు ‘కాంట్రాక్టర్’ రికార్డులు అంతే జోరుగా అమ్ముడయ్యాయి. ఎక్కడ చూసినా  వీళ్ళిద్దరి ‘పంచ్’ డైలాగుల మోతే. ఎక్కడి ‘షోలే’ బడ్జెట్ - ఎక్కడి ‘ముత్యాలముగ్గు’ బడ్జెట్! ఇంకేం రుజువు చేసి పెట్టాలి భావి తెలుగాంధ్ర దర్శకులకి బాపు?
          రామాయణం ఇంత పనిచేసిందా – ఇక భారతం ఏం చేసిందో చూద్దాం. భారతాన్ని కమ్యూనిజంలోకి దింపి ‘మనవూరి పాండవులు’ తీశారు బాపు. కమ్యూనిస్టు, లేదా విప్లవ, ఇంకా లేదా జనం భాషలో డప్పు సినిమాలు- ఒక మూసలో కొట్టుకు పోతున్న కాలంలో, సంస్కరించి ఇలా కూడా నీటుగా చెప్పవచ్చని బాక్సాఫీసు విజయం సాక్షిగా తీర్పిచ్చారు బాపు. 

మనవూరి పాండవులు 
          భారతంలోని పాండవులు, శ్రీ కృష్ణుడు పాత్రల్ని ఓ పల్లెటూళ్ళో అన్యాయాలకి వ్యతిరేకంగా పెట్టి, ఎలాటి రొటీన్ అరుపులు, డప్పు పాటలు, విప్లవ డైలాగులూ లేకుండా ఓ కొత్త పంథాలో నడిపిన కథా కథనాలనుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు ఎర్ర సినిమాల దర్శకులెవరూ. తన రంగం కాని విప్లవ రంగంలో బాపు అడుగు పెట్టారన్న అభిప్రాయమే ఏమో- అలా మనవూరి పాండవులు మనవూరి పాండవులుగానే మిగిలిపోయింది. విప్లవ సినిమాలకి మార్గదర్శి కాలేకపోయింది. 
          ఇప్పుడు షార్ట్ ఫిలిం మేకర్లే సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న కాలంలో బాపు సినిమాల నిశ్శబ్ద సందేశాలేవీ ఆయా బిజీ యువదర్శకుల మస్తిష్కాలకి తాకే అవకాశమే లేదు. కంటెంట్ కంటే టెక్నిక్కే ప్రధానంగా దూసుకొస్తున్న ఈ నవ దర్శకుల చేతిలో తెలుగుసినిమాకి  మూసలో మునకలే తప్ప, ఏ క్రాసోవర్ తీరానికీ చేరే ప్రసక్తే లేదు!

-సికిందర్ 
నవంబర్ 2014, ‘పాలపిట్ట’ మాసపత్రిక కోసం