రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, నవంబర్ 2017, శనివారం

553 : సందేహాలు - సమాధానాలు



Q : మీ రివ్యూలు అనాలసిస్ లు బావుంటాయి. మీరు ప్రతి రివ్యూనీ  త్రీ ఏక్ట్ స్ట్రక్చర్ తో కంపేర్ చేస్తుంటారు. కానీ చిరంజీవి గారి ‘ఖైదీ’  మిడిల్ - బిగినింగ్ - ఎండ్ స్ట్రక్చర్ లో వుంటుంది కదా. విశ్రాంతి సమయానికే కథ మొత్తం ప్రేక్షకుడికి తెలిసి పోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో మిగిలింది హీరో విలన్స్ ని ఎలాగూ చంపుతాడు అనే ప్రేక్షకుడికి తెలిసిన విషయమే కదా. రజనీ కాంత్ ‘బాషా’ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి  దీనికి వున్న డిఫరెన్స్ ఏంటి? మీరు అనాలసిస్ రాస్తే చదవాలని వుంది. ఇది నా రిక్వస్ట్.
                                                                                              - ఉమా మహేష్ రెడ్డి


A : కథలకి వుండేది త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఒక్కటే. దాన్ని బిగినింగ్ – మిడిల్- ఎండ్ అనే వరసక్రమం అంటున్నాం.  అందుకని దేన్నైనా దీంతోనే రివ్యూ చేయాలి. ‘ఖైదీ’ లో వున్నది ఇదే స్ట్రక్చర్ వరసక్రమం మారింది. మీరన్న మిడిల్ - బిగినింగ్ – ఎండ్ లుగా. ఇది కథకుడి క్రియేటివిటీ, స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ లో ఒక వరసలో (లీనియర్ గా) వుండే బిగినింగ్ – మిడిల్- ఎండ్ విభాగాల్నే, అటూ ఇటూ మార్చడం (నాన్ లీనియర్ గా) కథకుడి క్రియేటివిటీ. దీన్ని బాగా అర్ధం జేసుకోవాలి. స్ట్రక్చర్ తో చేసే క్రియేటివిటీ మాత్రమే. ఇది ఫ్లాష్ బ్యాక్ తో కథ చెప్పడం తప్ప మరోటి కాదు. మిడిల్ తో కథ ప్రారంభించి, బిగినింగ్ కి వెళ్ళడమంటే, ఆ బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడమే.



          స్ట్రక్చర్ తో ఎప్పుడూ సమస్య వుండదు. దాంతో క్రియేటివిటీకి పాల్పడితేనే సమస్యలు ఎదురవుతాయి. మీరన్న విశ్రాంతి సమయానికే కథ మొత్తం ప్రేక్షకుడికి తెలిసి పోవడం లాంటిది. ఒకప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనంగా వున్నప్పుడు స్ట్రక్చర్ తో ఏం చేసుకున్నా సమస్య కాలేదు. ‘గుండెలు తీసిన మొనగాడు’ లో లాగా ఎండ్ సస్పెన్స్ చేసినా, ‘అంతస్తులు’ లో లాగా సెకండాఫ్ సిండ్రోం సృష్టించినా సమస్య కాలేదు. ఆ రోజుల్లో కథల నాణ్యత ఒక్కటే ప్రేక్షకులు పట్టించుకునే వారు, అదెలా చెప్పారనేది కాదు. కేవలం కథ నాణ్యంగా లేకపోతేనే తిప్పి కొట్టే వాళ్ళు. అయినా 90 లవరకూ కూడా అత్యధికశాతం సినిమాలు స్ట్రక్చర్ లోనే వుంటూ వచ్చేని.  ఫ్లాష్ బ్యాక్ సినిమాలు చాలా తక్కువ.

          తరాలు మారి,  వినోద సాధనాలు పెరిగి, వాటి రకరకాల ఫటాఫట్  పాప్ కార్న్ కంటెంట్స్ కి దృష్టి చెదరగొట్టుకుని, సినిమాల్లో కథల నాణ్యతని పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు. హీరోయిజాల మీద పడ్డారు. హీరోయిజాలకే రేటింగులూ టీఆర్పీలు ఇస్తూ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టారు. సినిమాలు నాణ్యంగా రాకుండా చెడగొడుతున్నది ఇతర దృశ్య మాధ్యమాలే. కాబట్టి ఓపిగ్గా రెండున్నర గంటలు కథ చూస్తూ కూర్చునే మానసిక స్థితి ఎవరికీ లేదు. చూపించే ఫటాఫట్ కథల్నైనా కన్ఫ్యూజ్ చేస్తూ  చెప్తే అసలే భరించలేరు. అందుకే ఒకప్పుడు వర్కౌట్ అయిన ఫ్లాష్ బ్యాకులు, ఎండ్ సస్పెన్సులు, సెకండాఫ్ సిండ్రోములు మొదలైన వాటికి  కాలం తీరింది. 

          ఇప్పుడు స్ట్రక్చర్ తో క్రియేటివిటీ కి పాల్పడుతూ ఒక ఫ్లాష్ బ్యాకుతో, అనేక ఫ్లాష్ బ్యాకులతో ఎక్కువ సినిమాలు వస్తున్నాయంటే, రెండే కారణాలని చెప్తారు మేధావులు :  కథలో సరుకు లేకపోవడం, అదో గొప్ప ఫ్యాషన్ గా ఫీలైపోవడం. తేటగా శుభ్రంగా బిగినింగ్- మిడిల్ – ఎండ్ క్రమంలో (స్ట్రక్చర్ లో) కథ చెప్పినంత హాయైన పని మరొకటి లేదు. రాం గోపాల్ వర్మ కథతో ఎప్పుడైనా గిమ్మిక్కులు చేశారా? ఫ్లాష్ బ్యాకులు చూపించారా? ‘శివ’ దగ్గర్నుంచీ చక్కగా బిగింగ్ మొదలెట్టుకుని,  మిడిల్ లో సంఘర్షణ జరుపుకుని,  ఎండ్ తో కథని కొలిక్కి తెచ్చి ముగిస్తూనే వున్నారు కదా? ఆయనకి లేని పైత్యం ఇతర్లకి ఎందుకు? ఆయన కథలు ఇప్పుడు బావుండకపోవచ్చు.  అయినా ఆయన కథలు చెప్పడం సార్వజనీన స్ట్రక్చర్ లోనే వుంటుందెప్పుడూ. బాగాలేవని తెలిసిన కథల్ని కూడా గిమ్మిక్కులు చేసి మెప్పించాలని చూడలేదు. 

          ఇంకా ‘ఖైదీ’ లాగానో, ‘బాషా’ లాగానో స్ట్రక్చర్ తో క్రియేటివిటీ ప్రదర్శించుకోవాలనుకుంటే తప్పకుండా ప్రదర్శించుకోవచ్చు. ఫ్యాక్షన్ సినిమాలన్నీ ‘బాషా’ ని అనుసరించి వచ్చినవే. అయితే ఇలా ఒక ఫ్లాష్ బ్యాక్ తో, లేదా అనేక  ఫ్యాష్ బ్యాకులతో కథలు చెప్పాలంటే పాటించాల్సిన కొన్ని సున్నితమైన టెక్నిక్స్ వున్నాయి. ఒకటే ‘ఖైదీ’, ‘బాషా’ మంత్రం లేదు. ఈ టెక్నిక్స్ అందరికీ అర్ధం గావు. హాలీవుడ్ సినిమాలు చూపించినా ఒప్పుకోరు. హాలీవుడ్ సినిమాల్లోంచి సులభంగా కథలు కొట్టేయాలి, కష్ట పెట్టే టెక్నిక్స్ ని కాదు. కాబట్టి అవే ఖైదీలూ బాషాలూ అలాగే చేసుకోనియ్యాలి. ‘గరుడవేగ’ అలా చేసిందే.

 Q : ‘గరుడవేగ’  స్క్రీన్ ప్లే సంగతుల్లో ఫ్లాష్ బ్యాక్ లో అసలు కథ సెకండాఫ్ లో అరగంటకి చూపించడం కరెక్ట్ కాదని మీరన్నారు. మీరే పేర్కొన్న స్పైడర్, సింగం -3, వివేకం మొదలైన చిత్రాల్లో,  అసలు కథ ఫస్టాఫ్ లోనే ఓపెన్ చేసినా అవి ఫ్లాపయ్యాయి కదా? దీనికేం చెప్తారు?   
 జిఏఆర్ (కెనెడా)
 (పూర్తి పేరు వెల్లడించ వద్దన్నారు)

A : ‘గరుడవేగ’ స్క్రీన్ ప్లే సంగతులు మొదటి వ్యాసంలో స్పష్టం చేశాం దీన్ని. మీరన్న సినిమాలు ఫ్లాపవడానికి కారణం కథ ఫస్టాఫ్ లో మొదలవడం కాదు. వేరే క్రియేటివ్ కారణాలున్నాయి. ఇంకోసారి ఆ వ్యాసం చూడండి. స్ట్రక్చర్ (బిగినింగ్ –మిడిల్ –ఎండ్) వల్ల సినిమాలు ఫ్లాప్ కావు. స్ట్రక్చర్ తో క్రియేటివిటీ ప్రదర్శిద్దామని స్ట్రక్చర్ ని చెదరగొట్టినప్పుడే ఫ్లాపవుతాయి.  ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో (మిడిల్ –బిగినింగ్- ఎండ్)  కథ చెప్పడం స్ట్రక్చర్ ని చెడగొట్టడం కాదు. కేవలం విభాగాల్ని అటూఇటూ మార్చడమే. స్ట్రక్చర్ ని  చెదరగొట్టడం ఎప్పుడవుతుందంటే, ఒక విభాగం స్పేస్ లోకి ఇంకో విభాగాన్ని చొరబెట్టడం వల్ల అవుతుంది. కింది పటంలో స్ట్రక్చర్ ని చూడండి :



          ఇందులో బిగినింగ్, ఎండ్ లు చెరి  25 శాతముంటే, మిడిల్ ఇంటర్వెల్ కి ఇటూ అటూ కలుపుకుని 50 శాతముంది. ఇందులో ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమయ్యే చోట,  ప్లాట్ పాయింట్ -1 వుంది. ఇక్కడ కథ మొదలవుతుంది. అప్పుడు కథ స్ట్రక్చర్ లో వున్నట్టు. ఇప్పుడు ఈ కింది పటం  చూడండి : 


          ఇందులో బిగినింగ్ విభాగం దాని 25 శాతం స్పేస్ ని అతిక్రమిస్తూ ఇంటర్వెల్ ని కూడా దాటిపోయి,  మిడిల్ స్పేస్ ని అవతల ఎండ్ లోకి నెట్టేస్తూ ప్లాట్ పాయింట్ -2 వరకూ, 75 శాతం దాకా ఆక్రమించింది. అంటే కథ ఇక్కడ ప్రారంభమవుతుందన్నమాట. ఆ కథకి  పాతిక శాతమే స్పేస్ వుంటుందన్నమాట. స్క్రీన్ ప్లేలో బిగినింగ్ అంటే కథకి ఉపోద్ఘాతమే, కథ కాదు. కాబట్టి ఇక్కడ 75 శాతం వరకూ  ఉపోద్ఘాతమే చూసి,  అప్పుడు ఓ పాతిక శాతం మాత్రమే కథ చూస్తామన్న మాట. ‘గరుడవేగ ‘ లో ఇదీ జరిగింది.

 Q : ఇప్పుడు ఏదైనా ఒక కథను టెంప్లెట్ స్క్రీన్ ప్లే గా రాయాల్సిన గత్యంతరం ఏర్పడితే – ‘ఖైదీ’ స్ట్రక్చర్ స్లాట్ లో పెడితే,  తరవాత ఏంటని ప్రేక్షకుడికి తెల్సి పోతుంది. బిగినింగ్ ని చివరిదాకా లాగితే ఎండ్ సస్పెన్సో, లేక పోతే కథేంటో చెప్పకుండా ఇంకా ఎంతసేపు రా బాబూ అని ప్రేక్షకుడు తల పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అధిగమించే మార్గం ఏది?
                                                                                                                                     - ఉమా మహేష్ రెడ్డి  
                                                                                                      

 A :   స్క్రీన్ ప్లేనే వుంటుందండీ, టెంప్లెట్ స్క్రీన్ ప్లే వుండదు. అది బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అనే, మనిషి మెదడు కథల్ని రిసీవ్ చేసుకునే వరుస విభాగాలతో, యూనివర్సల్ స్ట్రక్చర్ గా ఏర్పడి, కాలపరీక్షకి తట్టుకుని నిలబడుతోంది. టెంప్లెట్ అనేది వున్న స్ట్రక్చర్ లోపల కథనానికి క్రియేటివ్  వెర్రితల.  వెరసి ‘టెంప్లెట్ సినిమా’ అవుతుంది. పూరీ జగన్నాథ్ సినిమాల్లాగా. అంటే, ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్ -  ఇక సెకండాఫ్ లో హీరోయిన్ కట్ అయిపోయి, విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపూ ఇంతే. కొన్ని పోపు డబ్బాలు వరసగా పెట్టుకుని (బ్యాంకాక్ బీచిలో) వాటిలో అవే దినుసుల్ని నటీనటుల్ని మారుస్తూ వరసగా వేసుకుంటూ పోవడమన్న మాట. ఇది కథనానికి వర్తించే క్రియేటివిటీ. స్ట్రక్చర్ అలాగే వుంటుంది.  ఇక మీప్రశ్నలో చివరి భాగం - దీన్ని అధిగమించే మార్గం ఏది? అనేదానికి -  అధిగమించే మార్గాలు 'శివ' దగ్గరే వాటి మానాన వాటిని వదిలేసి దారితప్పి తిరుగుతున్నాం. ‘శివ’ని చూసి తెలుసుకోండి. శివ = సిడ్ ఫీల్డ్. ఇంతకన్నా ఏం కావాలి.


 సికిందర్