రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, డిసెంబర్ 2023, శుక్రవారం

1393 : రివ్యూ

 

రచన : దర్శకత్వం ప్రశాంత్ నీల్
తారాగణం : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతీ హాసన్, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్ తదితరులు
సంగీతం : రవి బస్రూర్, ఛాయాగ్రహణం : భువన్ గౌడ
బ్యానర్ : హోంబలే ఫిలిమ్స్
నిర్మాత : విజయ్ కిరగందూర్
విడుదల :  డిసెంబర్ 22, 2023
***
       
    ‘బాహుబలి తర్వాత పానిండియా స్టార్ గా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి మూడు భారీబడ్జెట్ పానిండియా సినిమాలతో హిట్లు లేక స్ట్రగుల్ చేస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్ తీసుకున్న ఒక నిర్ణయం ఫలించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్రం చూసిన ప్రభాస్ ఆఫర్ ఇవ్వడం, ఆ ఆఫర్ తో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సాలార్ తీయడం ఒకెత్తు అయితే, కేజీఎఫ్ సినిమాలతో టాప్ లో వున్న ప్రశాంత్ మళ్ళీ అలాంటి యాక్షన్ డ్రామా తీయడం పెద్ద చాలెంజీగా మారింది. టీజర్స్, ట్రైలర్స్ విషయంలో ఫ్యాన్స్ నుంచి గట్టి వ్యతిరేకత ఎదుర్కొని, సినిమా విడుదల వాయిదాలు వేస్తూ బెటర్ మెంట్ కోసం చేసిన కృషి ఆసక్తి రేపిందిమరి ఈ కృషి ఫలించిందా? ఫలిస్తే ఏ మేరకు ఫలించింది? ప్రభాస్ కి ఈసారి హిట్టేనా? దాదాపు మూడు సంవత్సరాలుగా రూపొందుతున్న సాలార్ అడ్వాన్సు బుకింగులతో రేపిన తూఫానుతో ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకి న్యాయంచేసే విధంగా వుందా? 

కథ

    ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి పాలకుడైన రాజ మన్నార్ (జగపతి బాబు) తన కుమారుడు వరదరాజ మన్నార్‌ (పృథ్వీరాజ్ సుకుమారన్) ని వారసుడిగా ప్రకటించే ఆలోచనతో వుంటాడు. దీంతో సామ్రాజ్యంలో సామంత దొరలు అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి కుతంత్రాలు మొదలు పెడతారు. రాజమన్నార్ సామ్రాజ్యాన్ని వదిలి కొంతకాలం వెళ్ళినప్పుడు తిరుగుబాటు చేస్తారు దొరలు. ఆ దాడి నుంచి వరదరాజ మన్నార్ తప్పించుకుని అసోం పారిపోతాడు. అసోంలో దేవా (ప్రభాస్) తల్లి (ఈశ్వరీ రావు) తో వుంటాడు. తను గని కార్మికుడుగా వుంటే, తల్లి టీచరుగా వుంటుంది. ఇక్కడికి వరదరాజమన్నార్ వచ్చేసి చిన్ననాటి స్నేహితుడైన దేవాని కలుసుకుని సాయం ఆర్ధిస్తాడు. ప్రాణ స్నేహితుడైన వరదరాజ మన్నార్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే దేవా, అతడ్ని ఖాన్సార్ సామ్రాజ్యానికి తిరుగులేని వారసుడుగా చేయడానికి సాలార్ (నాయకుడు) అయి బయల్దేరతాడు.       
       
అసలు దేవా చిన్నప్పుడు ఖాన్సార్ నుంచి ఎందుకు తల్లితో పారిపోయి అసోంలో తలదాచుకున్నాడు
? అతడి జీవితంలోకి ఆద్య (శృతీ హాసన్) ఎలా వచ్చింది? భారత్- పాక్ సరిహద్దులోని ఖాన్సార్ ఆటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది? దీన్ని శత్రువుల బారినుంచి రక్షించడానికి యూక్రేన్, సైబెరియాలనుంచి వచ్చిన దళాలతో దేవా ఎలా తలపడ్డాడు?... మొదలైన విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    కేజీఎఫ్ సినిమాల లాగే ముష్కరుల చీకటి ప్రపంచపు క్రూర కథ. కథాంశం సూపర్ హిట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా వుంటుందని ప్రశాంత్ ముందే చెప్పాడు. సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి అనేక సమూహాలు కుతంత్రాలతో పాల్పడే ప్రమాదకరమైన పెద్ద గేమ్ చుట్టూ ప్రధానంగా ఈ కథ వుంది. అయితే హడావిడీగా ముగించేద్దామనే ధోరణిలో కచ్చా పక్కాగా కథ తయారైంది. దీంతో తీసుకున్న గేమ్ తాలూకు డ్రామా, భావోద్వేగాలూ బలహీనంగా మారాయి. యాక్షన్ మాత్రం పీక్ లో వుంది, డ్రామా వీక్ అయింది.
       
పైగా లెక్కలేనన్ని పాత్రలు
, వాటి పేర్లు, సంబంధాలు గుర్తు పెట్టుకుని ఫాలో అవడం పెద్ద చాలెంజీ ప్రేక్షకులకి. వర్తమాన కాలంలో అంటే 2017 లో కథ ప్రారంభమై సెకండాఫ్ లో పూర్వ కాలానికెళ్తుంది. ఫస్టాఫ్ వర్తమానకాలంలో పాత్రల పరిచయాలతో అతి నెమ్మదిగా సాగుతుంది. ఇక్కడ కిడ్నాపైన  శృతీహాసన్ ని ప్రభాస్ కాపాడడం, తల్లితో అతడి సంబంధాలు, విదేశం నుంచి వచ్చిన శృతి నేపథ్యం వగైరాలతో నెమ్మదిగా సాగుతుంది. శృతికీ ప్రభాస్ కీ మధ్య ఎక్కడా రోమాన్స్ వుండదు. మందకొడిగా వున్న  ప్రభాస్ ఇంటర్వెల్ ముందు యాక్షన్ సీన్స్ తో భారీ యెత్తున విశ్వరూపం చూపిస్తాడు. ఇక్కడ్నుంచీ సెకండాఫ్ లో దర్శకుడికి ఇష్టమైన కేజీఎఫ్ ఫార్ములా హీరో ఎలివేషన్ సీన్లే వుంటాయి.
        
సెకండాఫ్ లో కాన్సార్ సామ్రాజ్యపు కథ, దాని మీద సామంత దొరల కుట్రలు, వాళ్ళ కథలు వుంటాయి. ప్రాణ స్నేహితుడి వారసత్వాన్ని నిలబెట్టడంకోసం ప్రభాస్ ఇచ్చే ఎంట్రీతో ఊపందుకుంటుంది. అయితే యాక్షన్ పార్ట్ ప్రారంభమయ్యే వరకూ కథ బలహీనంగానే వుంటుంది. యాక్షన్ ఎపిసోడ్లు ప్రారంభమయ్యాక కథతో పనే లేకుండా పోయింది. పైగా ఎన్నో పాత్రలు, వాటి ఉపకథలూ వుండడంతో చాలా సేపు ప్రభాస్ పక్కకెళ్ళిపోతాడు. రెండు యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం హాలీవుడ్ ఉలిక్కిపడేలా వున్నాయి- బాలీవుడ్ సరే!
       
ప్రభాస్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవకపోవడానికి అతడికి జరిగిన అన్యాయం ఏమీ లేదు. స్నేహితుడి కోసం పోరాటం వల్ల అతడి బాధ ప్రేక్షకుల బాధ కాలేకపోయింది. ప్రభాస్ ఎంత నటించినా అది కృతకంగానే వుండిపోయింది. తనకి తగిన అన్యాయం జరిగి
, విధ్వంసానికి తెర లేపితే కథ కరెక్టుగా దారిలో పడేది. ఈ కథ  చివర్లో ఓ సర్ ప్రైజ్ ట్విస్ట్ తో రాబోయే రెండో భాగానికి  రంగం సిద్ధమైంది.

నటనలు- సాంకేతికాలు

     బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ ని ఒక విజయవంతమైన యాక్షన్ హీరోగా చూడడం ఒక ఊరట ఈ సినిమాతో. ఇంతకాలం ప్రభాస్ తో ఈ రేంజి  యాక్షన్ ఎపిసోడ్స్ ని, ఫైట్స్ నీ మిస్ చేసుకున్న ఫ్యాన్స్ కి ఇది పండుగే. క్లయిమాక్స్ యాక్షన్ బ్లాక్ ప్రభాస్ కేకాక, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఫస్టాఫ్ లో ప్రభాస్ దేవా పాత్రలో వున్న ప్రశాంతతని  కాపాడుకుంటూయాక్షన్ బ్లాక్స్ లో రైజింగ్ టైగర్ అవడం ఒక వినూత్న ఎలివేషన్.
        
ఇక ఈశ్వరీ రావు, శృతీ హాసన్, శ్రియా రెడ్డి, బాబీ సింహా వంటి చాలా మంది తెలిసిన, ప్రతిభావంతులైన నటులున్నా పాత్రలకి తగిన స్థానం లేక ముద్ర వేయలేకపోయారు. జగపతి బాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు మాత్రం ఫర్వాలేదని పించుకుంటారు.
        
సాంకేతికంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో క్రియేటివిటీ చెప్పుకోదగ్గది. కేజీఎఫ్ సినిమాల్లో లాగే క్లోజప్ షాట్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కి బలాన్నిచ్చాయి. కేజీఎఫ్ సినిమాల్లో లాగే గ్రే కలర్లో మూడీ టోన్ లో దృశ్యాలున్నాయి. కాస్ట్యూమ్స్  పాత్రలకి తగ్గట్టు ముతకగా, మొరటుగా వున్నాయి. ఈ సినిమాని నిలబెట్టడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాత్ర చాలా వుంది. రెండు పాటలు బాగానే వున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇండియాలో అందరు మేకర్స్ నీ బలాదూరు చేసేలా వున్నాయి.

చివరికేమిటి
        స్నేహంరాజ్యం కోసం పన్నాగాలు, అధికార దాహం లాంటి అంశాల చుట్టూ సాగే సాలార్ బలమైన కథా కథనాల విషయాన్ని పక్కన పెట్టి, చెలరేగినన యాక్షన్ ఎపిసోడ్ల మీద ఆధారపడ్డ యాక్షన్ థ్రిల్లర్. మితిమీరిన హింసరక్తపుటేరులు తట్టుకుని చూడాల్సిన వసరముంటుంది. ఈ రోజుల్లో హింసే ఎక్కువ అమ్ముడుబోతోంది. ఈ సినిమాలో మనదికా ని ఊహాజనిత ప్రపంచాన్ని యుటోపియాగా సృష్టించి, మూడుగంటల పాటు అందులో విహరింప జేసిన ప్రశాంత్ నీల్- ప్రభాస్ లు మాత్రం సక్సెస్ అయ్యారు బాక్సాఫీసుకి- కంటెంట్ సంగతి ఎలా వున్నా!

—సికిందర్

21, డిసెంబర్ 2023, గురువారం

1392 : రివ్యూ


దర్శకత్వం : రాజ్ కుమార్ హిరానీ
తారాగణం : షారుఖ్ ఖాన్, తాప్సీ పన్నూ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్
బొమన్ ఇరానీ తదితరులు
రచన : రాజ్ కుమార్ హిరానీ, అభిజాత్  జోషీ, కణికా ధిల్లాన్,
సంగీతం (పాటలు) : ప్రీతమ్ , నేపథ్య సంగీతం : అమన్ పంత్; ఛాయాగ్రహణం :  మురళీ ధరన్, మానుష్ నందన్
బ్యానర్స్ : జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్
నిర్మాతలు : గౌరీ ఖాన్, రాజ్ కుమార్  హిరానీ, జ్యోతీ దేశ్ పాండే
విడుదల : డిసెంబర్ 21, 2023
***
         సంవత్సరం పఠాన్’, జవాన్ అనే రెండు బ్లాక్ బస్టర్స్ నటించిన షారుఖ్ ఖాన్ మూడో ప్రయత్నంగా ఎమోషనల్ డ్రామా డంకీ తో ప్రపంచ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అలాగే వరస హిట్లు అందిస్తూ వస్తున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఐదేళ్ళ తర్వాత మరోకొత్త కానుక అందించే ప్రయత్నంతో అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుని వచ్చాడు. అయితే ఈ అస్త్రాలు పని చేశాయా? లేక అస్త్రసన్యాసానికి దారితీశాయా? ఈ ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం...

కథ
పంజాబ్ లోని ఓ ఊళ్ళో మనూ (తాప్సీ పన్నూ), సుఖీ (విక్రమ్ కౌశల్), బుగ్గూ (విక్రమ్ కొచ్చర్), బల్లీ (అనిల్ గ్రోవర్) నల్గురూ  ఆర్ధిక సమస్యలతో వుంటారు. వీళ్ళ కలలు లండన్లో వుంటాయి. కానీ వెళ్ళడానికి చదువుల్లేవు, డబ్బుల్లేవు. నకిలీ వీసా ఏజెన్సీలని ఆశ్రయించి మోసపోతారు. ఈ సమయంలో పఠాన్ కోట్ నుంచి ఆర్మీ జవాన్ హర్ దయాళ్ సింగ్ అలియాస్ హార్డీ సింగ్ (షారుఖ్ ఖాన్) ఊళ్ళోకొస్తాడు. తనని కాపాడిన మనూ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పి, అతడి టేప్ రికార్డర్ ఇచ్చిపోదామని వస్తాడు. ఆ అన్నయ్య చనిపోయాడని తెలుసుకుని మనూ అండ్ ఫ్రెండ్స్ ని లండన్ పంపి ఆదుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ నల్గురూ ఇంగ్లీషు నేర్చుకుని స్టూడెంట్స్ వీసా మీద వెళ్దామనుకుంటారు. కానీ బల్లీకి తప్ప ఇంకెవరికీ వీసాలు రావు.
       
అయినా ఎలాగైనా
లండన్ వెళ్ళేందుకు హార్డీ సాయపడాలనుకుంటాడు. దీంతో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గా డంకీ (డొంకదారి/అడ్డదారి) రూట్లో దేశాలు దాటుకుంటూ అక్రమంగా లండన్ చేరేందుకు బయల్దేరతారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ప్రమాదాలెదుర్కొన్నారు, ఇలా వలస వెళ్ళిన చొరబాటు దార్ల పరిస్థితి చివరి కేమవుతుంది - అన్నవి తెలిపేదే మిగతా కథ.

ఎలావుంది కథ

డంకీ ఫ్లయిట్ అని పంజాబ్ లో పాపులరైన పదం. అమెరికా, కెనడా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో అక్రమ ప్రవేశాలకి సంబంధించి వాడే ఇమ్మిగ్రేషన్ టెక్నిక్ ఇది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ టెక్నిక్ ని అనుసరిస్తారు. అంతర్జాతీయ ప్రయాణాల ఆకర్షణ, విదేశాల్లో స్థిరపడి ఇంటికి డబ్బులు పంపాలనే కలల కారణంగా ఈ అక్రమ వలసలకి పాల్పడతారు. ఇందులో చాలా కష్టాలు, మోసాలు, పట్టివేతలు, జైల్లో మగ్గడాలూ వుంటాయి.
        
2017 లో మలయాళంలో దుల్కర్ సల్మాన్ అమెరికా వెళ్ళే ఇలాటి కథతో కామ్రేడ్ ఇన్ అమెరికా’, 2022 లో పంజాబీలో మరో అమెరికా అక్రమ వలసల కథ ఆజా మెక్సికో చలియే విడుదలయ్యాయి. ఇప్పుడు డంకీ మూడోది. కాబట్టి ఇది దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ  అందించిన ప్రత్యేక కొత్త కాన్సెప్టు ఏమీ కాదు, అతడి గత సినిమాల్లాగా. అలాగే గత సినిమాల కంటే ఇది బలహీన సినిమా.
       
మున్నాభాయ్ ఎంబీబీఎస్
, పీకే, త్రీ ఇడియట్స్, సంజు లాంటి బలమైన సూపర్ హిట్స్ అందించిన హిరానీ ఈసారి బలహీన పడ్డాడు. ఈసారి ఏమైందో తన బ్రాండ్ రచన చేయలేకపోయాడు. కాలానికి తగ్గ రచనకి బదులు తొమ్మిదేళ్ళ నాటి పీకే స్టయిల్ దగ్గర ఆగిపోయాడు. పైగా కొట్టొచ్చినట్టూ రచనలో డెప్త్ కోల్పోయాడు. అస్త్రాల వాడి తగ్గింది. ఆస్థాన రచయితల్ని మార్చి కొత్తతరం నుంచి వర్క్ తీసుకుని వుంటే వేరేగా వుండేది.
       
ఫస్టాఫ్ ఊళ్ళో సమస్యలూ
, హాస్యాలూ వగైరాలతో కథలోకి వెళ్ళకుండా కాలక్షేపం చేయడం వరకూ, అక్కడక్కడా పాత వాసన వేసినా ఫర్వాలేదపిస్తాడు. పైగా గత యాక్షన్ సినిమాలకి భిన్నంగా షారుఖ్, ఈసారి సాఫ్ట్ రోల్ లో చాలా కాలం తర్వాత కామెడీ చేయడం వెరైటీని తీసుకొస్తుంది. ఈ ఫస్టాఫ్ కథ పాతికేళ్ళ నాటి ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు 50 ఏళ్ళ వయస్సులో షారుఖ్ తోపాటు ఇతరులు గతాన్ని తల్చుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఇలా  త్రీ ఇడియట్స్ ట్రీట్ మెంట్ నే అనుసరించాడు హిరానీ. అయితే
విక్కీ కౌశల్ పాత్ర ఆత్మహత్యతో బలమైన ఎమోషనల్ ఇంటర్వెల్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది.
       
సెకండాఫ్ కూడా ఈ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. క్లయిమాక్స్ లో ప్రస్తుతానికొచ్చి ఓ సందేశంతో ముగుస్తుంది. ఈ సెకండాఫ్ లోనే కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ నవ్వించాక
, సెకండాఫ్ ఏడ్పించే కథ.
        
అక్రమంగా దేశాలు దాటేటప్పుడు పడ్డ బాధలు. పాకిస్తాన్, ఇరాన్, టర్కీ లద్వారా ఇంగ్లాండ్ లో ప్రవేశించే ప్రయత్నాలు క్లుప్తంగా చూపించేసి అసంతృప్తి కల్గిస్తాడు. ఇంగ్లాండ్ లో ఇల్లీగల్ గా బతికే వారి కష్టాల మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. ప్రేక్షకుల చేత కన్నీళ్ళు పెట్టించడంలో మాత్రం సఫల మయ్యాడు. లండన్లో షారుఖ్ ఖాన్ కోర్టులో చేసే ప్రసంగాన్ని దేశభక్తి, సరిహద్దులు, వీసాలు, పేదల కష్టాలూ వగైరా అంశాలతో బలంగా చూపించినా, ఎందుకో ఆ డైలాగులు గుండెల్లోంచి వస్తున్నట్టు వుండవు. మళ్ళీ క్లయిమాక్స్ చాలా ఎమోషనల్ గా వుంటుంది.
        
సెకండాఫ్ ఇంత భారంగా కాకుండా, దేశాలు దాటే ఎడ్వంచర్స్ కి ఎక్కువ కవరేజి ఇచ్చి, ఆతర్వాత ఏడ్పించే కథ క్లుప్తంగా ముగించి క్లయిమాక్స్ వెళ్తే ఎంటర్ టైన్మెంట్ కి ఎక్కువ అవకాశముండేది. అక్రమంగా విదేశాలకెళ్ళి సంపాదించాలనే బంగారు జీవితాల్ని కలలు గనే ఇలాటి కథని - నిధికోసం వేట తాలూకు చేసే సాహసాలతో కూడిన ట్రెజర్ హంట్ జానర్ లో తీసివుంటే, రాజ్ కుమార్ గత సినిమాల్లాగా వినోదాత్మక సందేశం లాగా వుండేది.
       
అమెరికన్ పర్వతాల్లో బంగారు గనులు తవ్వుకుందామని బయల్దేరే బృందాలతో హాలీవుడ్ క్లాసిక్
మెకన్నాస్ గోల్డ్ లాగా. తీరా పర్వతాల్లోకి చేరాక భూకంపం రావడం! ఇలాగే బంగారు గనులు తవ్వుకుందామని లండన్ బయల్దేరే పాత్రల సాహసాలు చూపించి, చివర్లో  లండన్లో కలలు కల్లలయ్యే భూకంపం లాంటి కష్టాలతో ఓ సందేశ మివ్వాల్సింది.

నటనలు - సాంకేతికాలు

ఫస్టాఫ్ నవ్వించి, సెకండాఫ్ ఏడ్పించే రెండు కోణాల్లో షారుఖ్ మాత్రమే ఈ సినిమాకి ఏదైనా వుంటే ఆకర్షణ. కల్ హోనా హో తర్వాత గుర్తుండే నటన. పాతికేళ్ళ వయసులో,  50 ఏళ్ళ వయసులో రెండు పాత్రలతో మెప్పిస్తాడు. కానీ సందేశం జవాన్ లో ఇచ్చిన పోలిటికల్ స్పీచ్ అంత ప్రభావశీలంగా లేకపోవడం లోపం.
        
తాప్సీ కూడా యంగ్, ఓల్డ్ రెండు పాత్రల్లో తన ఎమోషనల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. అందరికంటే ఎక్కువ ముద్ర వేసేది విక్కీ కౌశల్ పాత్ర, నటన. ఓ —పదిహేను నిమిషాలు తన సొంతం చేసుకుని గడగడ లాడించేస్తాడు. మిగిలిన పాత్రల్లో విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, బొమన్ ఇరానీ తదితరులు ఫన్నీ సీన్స్ లో నవ్విస్తారు.
       
సినిమాలో యాక్షన్ సీన్స్ లేవు. ప్రీతమ్ సంగీతంలో పాటలు కూడా ఈసారి హిరానీ ముద్రతో లేవు.
అమన్ పంత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ ఎమోషనల్ డ్రామాకి తగ్గట్టు సహకారం అందించింది. మురళీ ధరన్, మానుష్ నందన్ ల ఛాయాగ్రహణం, ఇతర నిర్మాణ విలువలు హిరానీ స్థాయిలో ఉన్నతంగా వున్నాయి. 
       
దేశంలో ప్రభుత్వాలు బంగారు కలల్ని నిజం చేసుకునే పని కల్పించకుండా
, ఉచితాల సంతర్పణ చేస్తున్నంత కాలం, పొట్ట చేతబట్టుకుని విదేశాల్లో పట్టుబడే ప్రతిష్టతో, గొప్పలు చెప్పుకుంటున్నట్టు దేశం బాగానే మూడో బడా ఆర్ధిక శక్తి అన్పించుకుంటుంది!
సికిందర్

 

10, డిసెంబర్ 2023, ఆదివారం

1391 : రివ్యూ

 


దర్శకత్వం: జోయా అఖ్తర్
తారాగణం : అగస్త్య నందా, సుహానా ఖాన్, ఖుషీ కపూర్, వేదాంగ్ రైనా, మిహిర్ ఆహుజా, అదితీ సైగల్, యువరాజ్ మెండా తదితరులు
కథ-  స్క్రీన్ ప్లే: జోయా అఖ్తర్, ఆయేషా దేవిత్రే ధిల్లాన్, రీమా కాగ్తీ; మాటలు : ఫర్హాన్ అఖ్తర్, గీత రచయితలు : జావేద్ అఖ్తర్, అంకుర్ తివారీ, అదితీ సైగల్; సంగీతం (పాటలు) : శంకర్–ఎహసాన్–లాయ్, అంకుర్ తివారీ, ది ఐలాండర్స్, అదితీ సైగల్; నేపథ్య సంగీతం : శంకర్–ఎహసాన్–లాయ్, జిమ్ సత్య; ఛాయాగ్రహణం : నికోస్ ఆండ్రిట్సాకిస్
బ్యానర్స్ : ఆర్చీ కామిక్ పబ్లికేషన్స్, గ్రాఫిక్ ఇండియా, టైగర్ బేబీ ఫిలింస్
పంపిణీ : నెట్‌ఫ్లిక్స్
విడుదల : డిసెంబర్ 7, 2023
***

        జిందగీ నా మిలేగీ  దోబారా, బాంబే టాకీస్, గల్లీ బాయ్స్ మొదలైన 7 సినిమాల దర్శకురాలు జోయా అఖ్తర్ ది ర్చీస్’- ఆంగ్లో- ఇండియన్ టీనేజీ మ్యూజికల్ కామెడీతో విచ్చేసింది. ముగ్గురు నయా వారసులు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ లు దీనికి సాధ్యం వహిస్తూ పరిచయమయ్యారు. థియేట్రికల్ విడుదల బదులుగా నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ఓటీటీలో విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  రెగ్యులర్ సినిమాలకి భిన్నమైన ఆంగ్లో- ఇండియన్ పాత్రలతో, ప్రసిద్ధ ఆర్చీ కామిక్స్ ఆధారంగా రూపొందిన ఈ టీనేజర్ల లైటర్ వీన్- కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీ ఎలాటి అనుభూతి నిస్తుందో, పనిలో పనిగా క్రిస్మస్ పండుగకి ఎలాటి మూడ్ ని క్రియేట్ చేస్తుందో చూద్దాం...

కథ

పూర్వం కొందరు బ్రిటిషర్లు భారతీయుల్ని వివాహం చేసుకోవడం ద్వారా ఆంగ్లో- ఇండియన్స్ అనే కొత్త సమాజం  ఏర్పడింది. స్వాతంత్ర్యానంతరం అనేక కుటుంబాలు ఇంగ్లండు వెళ్ళిపోయినా, కొన్ని కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంతో కల్పిత కథ చూస్తే- 1914 లో సర్ జాన్ రివర్‌డేల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఆంగ్లో -ఇండియన్ కుటుంబాల కోసం నార్త్ లో ఒక హిల్ టౌన్ నిర్మించాడు. దానికి రివర్ డేల్ అని పేరుపెట్టి తోటలతో అభివృద్ధి చేశాడు. ఇది సంపన్న, శాంతియుత ఆంగ్లో-ఇండియన్ నివాసితులతో స్వాతంత్య్రానంతర భారతదేశానికి ఒక కేరాఫ్ అడ్రసుగా మారింది. ఇక్కడ గ్రీన్ పార్క్ అనే తోటని అభివృద్ధి చేసి పుట్టే ప్రతీ పిల్ల/ పిల్లాడి చేత ఒక మొక్క నాటించే సాంప్రదాయముంటుంది.
       
1964 కి వస్తే- ఆర్చీ(అగస్త్య నందా)
, వెరోనికా (సుహానా ఖాన్), బెట్టీ (ఖుషీ కపూర్), వీళ్ళ 17 ఏళ్ళ నవతరం టీనేజీ గ్రూపు స్టూడెంట్లుగా వుంటారు. ఎవరి ఆనందాలు, కలలు, కోరికలు వాళ్ళకుంటాయి. ఆర్చీ లండన్‌లో సంగీతం నేర్చుకుని క్లిఫ్ రిచర్డ్ సన్ లాగా మారాలని కోరుకుంటాడు. టౌనులో దాదాపు అన్ని ఈవెంట్స్ లో పాటలు పాడే బ్యాండ్ ‘ది ఆర్చీస్‌ ని నిర్వహిస్తూ వుంటాడు. అయితే అమ్మాయిలతో అతను అయోమయంలో వుంటాడు. ఇద్దరు అమ్మాయిలు వెరోనికా (సుహానా ఖాన్), బెట్టీ (ఖుషీ కపూర్) లలో ఎవర్ని ఎంచుకోవాలో అర్ధంగాక ఇద్దర్నీ ప్రేమిస్తూంటాడు. అతడి బెస్ట్ ఫ్రెండ్ జగ్‌హెడ్ జోన్స్ (మిహిర్ అహుజా) ఇది వెధవ ఆలోచనరా అని తిడుతూ వుంటాడు.
       
ఇలా వుండగా
, ఒకరోజు రివర్‌డేల్ ఆధునికంగా రూపాంతరం చెందబోతోందని, అందులో భాగంగా గ్రీన్ పార్క్ ని తొలగించి ఒక భారీ హోటల్ నిర్మించబోతున్నారనీ ఆర్చీకి, అతడి గ్రూపుకీ తెలుస్తుంది. ఈ హోటల్ ని వెరోనికా తండ్రి మిస్టర్ లాడ్జ్ (అలీ ఖాన్) నిర్మించబోతున్నాడని తెలుస్తుంది. ఈ పార్కుతో తమకి చాలా సెంటిమెంటుంది. చిన్నప్పుడు తాము నాటిన మొక్కలే ఇలా వృక్షాలయ్యాయి. వీటి నరికివేతని ఏమాత్రం సహించలేక పోతారు. ఇక ఆర్చీ లండన్ వెళ్ళే ఆలోచన మానుకుని పార్కు రక్షణ కోసం నడుం కడతాడు.
       
పార్కుని రక్షించుకోవడానికి ఆర్చీ గ్రూపు ఏం చేసింది
? వెరోనికా తండ్రి దీని వెనుక వున్నాడని తెలిసిన తర్వాత ఆర్చీ ఆమెని ప్రేమించాడా? ఇద్దరి మధ్య సంబంధాలు ఏమయ్యాయి? బెట్టీతో ప్రేమ ఏమయ్యింది? పార్కులో హోటల్ కట్టకుండా ఎలా విజయం సాధించారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

అమెరికన్ కామిక్స్ పాత్ర  ఆర్చీ గురించి తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా దిన, వార పత్రికల్లో పాపులరైంది. 1939 లో పబ్లిషర్ జాన్ గోల్డ్ వాటర్, ఆర్టిస్టు బాబ్ మోంటానాలు దీన్ని సృష్టించారు. దశాబ్దాలుగా పత్రికల్లో, టీవీల్లో ఈ కామిక్స్ కొనసాగుతోంది. అమాయకంగా వుండే టీనేజర్ ఆర్చీ పరిష్కరించే సమస్యలతో నవ్వించే కామిక్స్ సిరీస్ ఇది.  2019 లో మార్వెల్ సంస్థ ఈ కామిక్స్ ని  టీవీ- సినిమా వెర్షన్ల ఉత్పత్తికి ఆర్చీ కామిక్స్ స్టూడియోస్ కి బదలాయించింది. 2021 లో దర్శకురాలు జోయా అఖ్తర్ దీని ఇండియన్ వెర్షన్ సినిమా నిర్మాణం చేపట్టింది.
        
'ది ఆర్చీస్ లో పాత్రల పేర్లు మార్చలేదు. పాత్రల నేటివిటీ కోసం ఆంగ్లో- ఇండియన్ సమాజంలో కథ స్థాపించింది. ముంబాయిలో, ఊటీ హిల్ స్టేషన్లో 1960ల నాటి ఆంగ్లో- ఇండియన్ నేపథ్యాన్ని సృష్టించి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేసింది. పైన చెప్పుకున్నట్టు కథ చాలా సింపుల్. ఇప్పటి సినిమా కథ అయితే ల్యాండ్ మాఫియాలు, వాళ్ళతో టీనేజర్ల రక్తపాతాలూ, అవసరమైతే యానిమల్ లో లాంటి బీభత్స భయానకాలూ వుండొచ్చు.
        
ఈ కథ పాటలతో ఈ మ్యూజికల్ గా వుంటుంది. 16 పాటలున్నాయి. చాలా పాత్రల అంతర్గత సంఘర్షణలు పాటల ద్వారా చెప్పారు. అలాగే కొన్ని ముఖ్యమైన ఘట్టాలనీ, కొన్ని ఆత్మీయ సన్నివేశాలనీ డైలాగులతో కాకుండా హుషారైన పాటల ద్వారా ఫీలయ్యేట్టు చేశారు. హాలీవుడ్‌లో ఇలాంటి సంగీత స్వరాలు కథనంలో ముఖ్యమైన భాగంగా వుంటాయి. మన దగ్గర ఈ కళా ప్రక్రియ అభివృద్ధి చెందలేదు. ఈ మధ్య కాలంలో ఇలాటి కొన్ని సినిమాలు వచ్చినా ఒక్కటి కూడా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేకపోయింది. ఈ కోణంలో చూస్తే ఈ సినిమాతో పెద్ద రిస్క్ తీసుకున్నారు. అయితే ఆంగ్లో -ఇండియన్ కథ కావడంతో చెల్లిపోయింది. సౌండ్ ట్రాకుని రెట్రో 1960ల బీట్‌ల ఆధారంగా స్వరకర్తలు శంకర్-ఎహసాన్-లాయ్, అంకుర్ తివారీ, ది ఐలాండర్స్, అదితి సైగల్ లు అద్భుతంగా సృష్టించారు. పాటలకి గణేష్ హెగ్డే చక్కగా కొరియోగ్రఫీ చేశాడు. యువనటీనటులు 60ల నాటి స్టయిల్లో హుషారెత్తే డాన్సులు చేశారు.

అయితే జావేద్ అఖ్తర్
, అంకుర్ తివారీ, అదితీ సైగల్ లు రాసిన హిందీ పాటలకి, ఫర్హాన్ అఖ్తర్ రాసిన హిందీ మాటలకీ తెలుగులో రాసిందెవరో ఎక్కడా సమాచారం లేదు. టీనేజర్లకీ, పెద్ద పాత్రలకీ జానర్ మర్యాదకి తగ్గట్టుగా ఆహ్లాదకర మాటలు, పాటలు తెలుగులో రాశారు. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలకి రైటింగ్, డబ్బింగ్ ఆర్టిస్టు లెవరో తెలియబర్చకపోవడం చాలా పెద్ద లోపం.

కొత్త 
వారసులు ఫర్వాలేదా?
ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కొత్తవారసులు  చాలా క్యూరియాసిటీ పెంచారు.   షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా
, శ్రీదేవి కుమార్తె ఖుషీ, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాలపై వాళ్ళ వంశపారంపర్యం కారణంగా ఒత్తిడి ఎక్కువే. ఈ ముగ్గురిలో ధనిక అమ్మాయి వెరోనికా పాత్రలో సుహానా ఆత్మవిశ్వాసంతో కన్పిస్తుంది. చాలా స్క్రీన్ ప్రేజెన్స్ తో బాటు, ప్రతి ఫ్రేమ్‌లో నటించగలనన్న ఆత్మ విశ్వాసంతో అప్రయత్నంగా నటించేస్తుంది. ఆర్చీగా అగస్త్య నందా బాగా షైన్ అయ్యాడుగానీ, కొన్ని సన్నివేశాల్లో అసౌకర్యంగా కనిపిస్తాడు. బెట్టీగా ఖుషీ అత్యంత బలహీనురాలు. ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపిస్తుంది కానీ నటనలో స్పార్క్ లేదు. 

మరోవైపు చూస్తే యువ నటీ నటులు తమ తమ పాత్రల్లో
రాణించారు. వంశం  ఒత్తిడి లేకపోవడం వల్లనేమో. ఇక టీనేజర్ల తల్లిదండ్రుల పాత్రల్లో కమల్ సిద్ధు, అలీ ఖాన్, వినయ్ పాఠక్, తారా సలూజా, కోయెల్ పూరీ చాలా ఫెంటాస్టిక్ గా నటించారు.

చివరికేమిటి.

ది ఆర్చీస్‌ లో దర్శకురాలు 1960ల నాటి ఒక మధురమైన ప్రపంచాన్ని సృష్టించింది. పీరియడ్ లుక్ తో, అద్భుతమైన కెమెరా పనితనంతో భవనాలు, రోడ్లు, ప్రాంతాలు, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వంలతో సంగీత రూపకం లాగా సింపుల్ కథ చెప్తూ, రాజకీయాలపై, పర్యావరణంపై సందేశాన్ని కూడా అందించింది. ప్రేమ కథ- పార్కు కథ రెంటినీ మిక్స్ చేసి  టీనేజర్ల మనస్తత్వాల్ని, స్వల్ప సంఘర్షణల్ని, పరిష్కారాల్నీ చూపించి నాటి కాలానికి ఒక నివాళిగా ముగించింది.  క్రిస్మస్ కి కూడా పండగ మూడ్ ని సృష్టిస్తూ, క్రిస్మస్ వేడుకల్ని కూడా చూపిస్తూ, రెండున్నర గంటల మ్యూజికల్ కామెడీని మిఠాయి పొట్లం చుట్టి అందించింది.
—సికిందర్
(‘హాయ్ నాన్నా స్క్రీన్ ప్లే సంగతులు తయారవుతోంది)


6, డిసెంబర్ 2023, బుధవారం

1390 : కొత్త సమాచారం

 


        ల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ - ఐనాక్స్ లిమిటెడ్ ప్రీమియం, లగ్జరీ సినిమా ఫార్మాట్స్ ని విస్తరించే ప్రణాళికని శరవేగంగా ముందుకు తీసికెళ్తోంది. కంపెనీ ఇటీవలే ముంబాయి లోని జియో వరల్డ్ ప్లాజాలో రెండవ మైసన్ సినిమా ని ప్రారంభించింది. ఈ కాంప్లెక్స్ లో  రెండు ఇన్సిగ్నియా స్క్రీన్‌లు, లేజర్ టెక్నాలజీతో కూడిన ఒక ఐమాక్స్  స్క్రీన్, మూడు ప్రీమియర్ స్క్రీన్స్ ఏర్పాటయ్యాయి. ఇంకా గాట్స్ బీ పేరుతో ఒక బార్, లాంజ్ ప్రారంభమయ్యాయి. వీటిలో సెలబ్రిటీ షెఫ్‌లు సారా టాడ్, విక్కీ రత్నానీ, యుటాకా సైటో, మయాంక్ తివారీ క్యూరేట్ చేసిన ఫుడ్ అండ్ బెవరేజీ మెనూ లభ్యమవుతోంది.
        
ప్పటికి పీవీఆర్ - ఐనాక్స్ దేశంలో ఐమాక్స్, 4డీఎక్స్, ప్లే హౌస్, గోల్డ్, లక్స్, పీఎక్స్ఎల్, ఓనిక్స్, డ్రైవ్-ఇన్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లు సహా 1,711 స్క్రీన్స్ కి యాజమాన్యం వహిస్తోంది. 2022 డిసెంబర్‌లో ఫ్రెంచ్ ఎగ్జిబిటర్ సీజీఆర్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, దేశానికి దాని హై-ఎండ్ ఐస్ థియేటర్స్ ఫార్మాట్‌ని తీసుకు వచ్చింది. ఇది ప్రధాన స్క్రీన్‌తో పాటు పరిధీయ దృష్టిని సృష్టించే సైడ్ ప్యానెల్స్ ని కలిగి వుంటూ తెరమీద రంగుల, కదలికల మెరుగైన కలబోతని అందిస్తుంది. 
       
పీవీఆర్-ఇనాక్స్
సురక్షిత, సన్నిహిత సినిమా వీక్షణానుభవాన్ని అందించడానికి ఒపెరా హౌస్‌ల సరళిలో ప్రత్యేక అంచెలవారీ బాల్కనీలు లేదా 'పాడ్‌ లతో ప్రేక్షకుల కోసం సరికొత్త, ప్రీమియం థియేటర్లని రూపొందించడానికి ఫ్రెంచ్ సినిమా ఆర్కిటెక్చరల్ డిజైన్ కంపెనీ ఓమా సినిమాతో జతకట్టింది. మన దేశం ఒక వైవిధ్యమైన సినిమా మార్కెట్ తో వుంది. ఈ నేపథ్యంలో పీవీఆర్- ఐనాక్స్ నిర్వహిస్తున్న కాంప్లెక్సులు జనాభా ఆధారంగా అందిస్తున్న సేవల్ని అనుకూలీకరిస్తోంది.

మైసన్ ప్రాపర్టీలోని ఆరు స్క్రీన్‌లలో సగటు టిక్కెట్ ధర రూ. 700. లగ్జరీ ఫార్మాట్‌ల ధర రూ. 1,200. ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్స్ ని కొంతకాలంగా విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీటిలో ఆడించడానికి సంవత్సరంలో సగం రోజులు కూడా ఈ ఫార్మాట్స్ లో తగినన్ని సినిమాలు రావడం లేదు.  ఒకప్పుడు 70 ఎంఎం థియేటర్లలో ఆడించడానికి తగినన్ని 70 ఎంఎం సినిమాలు లేక 35 ఎం ఎం సినిమాలు ఆడించినట్టు, ఐమాక్స్, 4డీఎక్స్ థియేటర్లలో రెగ్యులర్ ఫార్మాట్స్ సినిమాల్ని ఆడించుకోవాల్సి వస్తోంది- వీటి టిక్కెట్ ధరలతో.

ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్స్ లో  అప్పుడప్పుడు విడుదలయ్యే సినిమాలు కూడా హాలీవుడ్ సినిమాలే. ప్రీమియం ఫార్మాట్‌ సినిమాలు కూడా ఎక్కువ రోజులు ఆడడం లేదు. పైగా కొన్ని సినిమాలు ఈ ప్రీమియం థియేటర్స్ కలిగివున్న సాంకేతికాల్ని అందుకోలేక పోతున్నాయి. భారీ బడ్జెట్ దృశ్యాల కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ థియేటర్స్ అభివృద్ధిలో ముందున్నాయి, సినిమాలు వెనకున్నాయి.
       
సాంకేతిక రంగంలో
ఈ అనుభవాలు మామూలే.  సినిమా మాస్ మార్కెట్టా కాదా అనేది ముఖ్యం కాదు. దేశమే ఒక విభిన్న మార్కెట్. ప్రేక్షకుల ఆదాయాలతో, అభిరుచులతో సంబంధం లేకుండా, వాళ్ళని ళ్ళ నుంచి బయటికి  తీసుకురావడమే లక్ష్యంగా పీవీఆర్- ఐనాక్స్ పరిశ్రమిస్తోంది. రెండవ, మూడవ శ్రేణి నగరాల్లో ప్రీమియం ఫార్మాట్స్ ని కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కంపెనీ ఇంత ఆలోచిస్తోంటే సినిమా పరిశ్రమలు మాత్రం ప్రేక్షకుల్ని ళ్ళ నుంచి బయటికి  తీసుకొచ్చే లక్ష్యమే లేకుండా, ఓటీటీల నుంచి భారీ ఆదాయాలు పొందవచ్చనే ఆశతో సెకండాఫ్ సరుకులేని సినిమాల్ని భారీ ఎత్తున్న చుట్టి పారేస్తున్నాయి.

ప్రేక్షకుల సౌకర్యార్ధం పీవీఆర్- ఐనాక్స్ ఇటీవల ప్రారంభించిన పాస్‌పోర్టు ప్లాన్ కొత్త వెర్షన్స్ కూడా తీసుకువస్తోంది. విపరీతమైన మల్టీప్లెక్స్ ధరల పట్ల విమర్శలకి ప్రతిస్పందనగా ప్రారంభించిన ఈ ప్లాను కింద, ప్రేక్షకులు నెలకి రూ. 699 చెల్లించి సోమ- గురువారాల మధ్య  నెలకు 10 సినిమాల వరకు వీక్షించడాని వీలిచ్చే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్ ని పొందవచ్చు. ఇది ప్రీమియం, లగ్జరీ ఫార్మాట్‌ సినిమాలకి వర్తించదు. జాతీయ సెలవుల్లో, వారాంతపు రోజుల్లో వర్తించదు. ఈ పాస్ పై ఒకరికంటే ఎక్కువ మందికి ప్రవేశం లభించదు. సోమ- గురువారాల మధ్య రోజుకి ఒక సినిమాకి మాత్రమే అనుమతి వుంటుంది.
       
ప్రేక్షకులు ఇంట్లో చూసుకోవడానికి ఓటీటీల్లో పెద్ద సినిమాలు ఎప్పుడొస్తాయా అని చకోర పక్షుల్లా ఎదురు చూడకుండా
, థియేటర్లతో తమకున్న చిరకాల బంధాన్నినెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్తూ, ఈ కాలపు హై ఎండ్ థియేటర్స్ ని కాస్త కనికరిస్తే బావుంటుంది.

—సికిందర్