రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, ఏప్రిల్ 2016, సోమవారం

'పోలీస్' స్క్రీన్ ప్లే సంగతులు- 2



రెండు దశాబ్దాలు నిండిన 
బాషా ఫార్మాట్తిరిగి థ్రిల్ కల్గించాలంటే ఇంకో రెండు దశాబ్దాలు వదిలెయ్యాలి. అప్పుడింకో తరం మారి,  ‘బాషా ఫార్మాట్తో పరిచయం లేని ఫ్రెష్ ప్రేక్షకులు రంగంలో వుంటారు. అప్పుడా సంగతి అప్పటి తరం దర్శకులు చూసుకుంటారు. ఇప్పటి తరం దర్శకులకి ఇంకా మక్కువ చావకపోతే, ‘బాషా ఫార్మాట్లోనే ఇంకెలా మెరుపులు మెరిపించగలమో ఆలోచించాలే తప్ప, ఊకదంపుడుగా ఆ చట్రంలో కథ నింపేస్తే కాదు. స్ట్రక్చరే ఒక చట్రమని ద్వేషించే వాళ్ళుంటారు. అవే బిగినింగ్, మిడిల్, ఎండ్ లు, వాటికీ మూడు మూల స్తంభాలూ అనే చట్రంలో పోత పోసినట్టు కథలన్నీ ఒకలాగే ఉంటాయని అంటారు.  అలాటిది బాషా ఫ్లాష్ బ్యాకుల టైపు చట్రం ఇంకెంత బోరు కొడుతుందో ఆలోచించాలి. అంతగా బాషా ఫార్మాట్ని బతికించుకోవాలనుకుంటే కావాల్సింది చట్రం కాదు, ఫార్మాట్ ని కాపాడే  కొత్త ఛత్రం- స్పార్క్ తో మెరిసే క్రియేటివిటీ. తేరిఅంటేనే తమిళంలో స్పార్క్ అయినప్పుడు ఆ స్పార్క్ కన్పించాలిగా??

       కిందటి పోస్టులో పేర్కొన్నట్టు ‘అక్బర్స్ జాబ్’ మొదలెడితే  ఆ  స్పార్క్ ఏదో ఎక్కడుందో బయట పడొచ్చు. కాబట్టి చాలా లోపభూయిష్టంగా వున్న ఈ కథ మొత్తాన్నీ తిరగరాసే ప్రయత్నం చేద్దాం...

        కేరళలో బేకరీ నడుపుకుంటూ కూతురితో జీవిస్తూంటాడు జోసెఫ్. టీచర్ ఏన్ పరిచయమవుతుంది. మీ ఆవిడ లేదా?’  - అంటుంది. ఆమెని ఇంటికి తీసికెళ్ళి  మిత్ర ఫోటో చూపిస్తాడు. ఈ రిమోట్ ఏరియా, ఈ టీవీ ఫోన్లు లేని పొదరిల్లు, ఈ పెంపుడు కుక్కా ఈ ఏకాంతం ..ఇదంతా  మిత్ర కన్న కలే. ఈ కల తీరకుండానే  పోయింది...ఆమె కలని నిజం చేయడానికి ఇక్కడి కొచ్చి ఉంటున్నాను. ఆమె ఇక్కడే ఈ పొదరింట్లోనే ఉంటోందని, ఈ చుట్టూ తిరుగాడుతూ ఉంటుందని నా నమ్మకం.. అదిగో ఆ చెట్టు పక్క నుంచి మనల్ని  చూస్తోంది కన్పిస్తోందా –‘ అని జోసెఫ్  చూపిస్తూంటే ఏన్ కేమీ కన్పించదు.  జోసెఫ్  కి మాత్రమే కనిపిస్తూంటుంది మిత్ర. జోసెఫ్  పరిస్థితికి బాధపడుతుంది ఏన్. ఇంకెప్పుడూ  మిత్రని గుర్తు చెయ్యొద్దనుకుంటుంది.

       నా జీవితం అయిపోయింది, నా కూతురి జీవితం ఏమిటా అనే ఆలోచన
అని అతనంటూంటే ఏదో అనెయ్యాలని ఏన్ నోటి దాకా వచ్చేస్తుంది. ఆగిపోతుంది. మిత్ర స్థానాన్ని మరొకరికి ఇవ్వలేకపోవడమే తన సమస్యనీ చెప్పుకుంటాడు. ఏన్ నిరాశ చెంది చూస్తుంది. మీ కూతురికి మీరు తోడుంటారుగా’  అంటుందిచెప్పలేను, ఏ క్షణంలో ఏమవుతుందో  అంటాడు. అప్పుడు నేనుంటానుగా మీ కూతురుకి-’  అనేస్తుంది. అయినా మీరెందుకు దూరమవుతారని అడుగుతుంది. మేడమ్, నేనొకరి దయాదాక్షి ణ్యాలపై ఈ జీవితాన్ని లీజుకి తీసుకుని బతుకుతున్నా’  అంటాడు.

        అనుమానంగా చూస్తుంది, భయంగా చూస్తుంది. అతడి మాటలేం అర్ధంగాక, ఇంకేం అడిగే ధైర్యంలేక అలా ఉండిపోతుందినా లీజు ముగిసిన రోజున నాకూతురికి మీరు కూడా వుండరు అనేస్తాడు.  గాభరాగా చూస్తుంది.


***
క రోజు స్కూల్నించి కూతుర్ని ఇంటి దగ్గర దిగబెట్టడానికి ఏన్  వచ్చినప్పుడు జోసెఫ్ వుండడు. కూతురు ఒక పెళ్లి  ఫోటో తీసి  చూపిస్తుంది. మిత్ర- విజయ్ ల పెళ్లి ఫోటోఅందులో మిత్ర తండ్రి, చెల్లెలు, మేనత్తా, విజయ్ తల్లీ వుంటారు. అక్కడ విజయ్ కుమార్ అని పేరుని చూశాక, జోసెఫ్ అసలు పేరు కాదని తెలుసుకుంటుంది ఏన్. ఫోటోని ఇంకా పరీక్షగా చూస్తే, విజయ్ పోలీస్ కటింగ్ తో ఉన్నట్టు కన్పిస్తాడు

        ఇంకో రోజు ఏన్ కూతుర్ని స్కూలుకి  తీసుకు పోతూంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ జీపుతో గుద్దుతారు. ఏన్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది వాళ్ళ మీద. జోసెఫ్ వాపసు తీసుకునేలా చేస్తాడు. ఎందుకిలా చేశారని అడిగితే, మిత్ర కల కోసం నేనిక్కడ ఉంటున్నా, ఎలాటి డిస్టర్బెన్స్  తట్టుకోలేదు మిత్ర’  అంటాడు.

        అదే రాత్రి  ఆ గ్యాంగ్ జోసెఫ్  ఇంటి మీది కొస్తారు. ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు రా, ఇది నా సెంటిమెంటల్ ప్లేస్ అని వాళ్ళని విరగదంతాడు.

ఇదే సమయంలో టీచర్ ఏన్ అటు తన ఇంట్లో గూగుల్ లో సెర్చి చేస్తూంటుంది. విజయ్ కుమార్ ఐపీఎస్ పేరుతో  వెయ్యి సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. దిగ్భ్రాంతితో విజయ్ ఫోటోలని చూస్తూంటుంది. యూనిఫాంలో వున్న డిసిపి విజయ్ కుమార్ అలియాస్ జోసెఫ్...

 ఎక్కడో  దూరంగా కుక్క ఒకటే మొరుగుతూంటుంది. దేంతోనో కొట్లాడుతున్నట్టే ఆ మొరుగుళ్ళు వినిపిస్తూంటాయి. ఏన్ మనసు ఏదో  కీడు శంకించి పరిగెడుతుంది. చూస్తే, జోసెఫ్- కాదు- ఇప్పుడు విజయ్ ఇంటిముందు ఘర్షణ జరుగుతూంటుంది. ఆ గ్యాంగ్ తో తలపడుతూంటాడు విజయ్. కుక్క వాళ్ళని చెండాడుతూంటుంది. కూతురు భయంతో కేకలేస్తూంటుంది. ఏన్ కూతుర్ని ఎత్తుకుంటుంది. అంతా సద్దుమణిగాక, ‘మీరు వద్దన్న డిస్టర్బెన్సే కద...’ అని అనబోతూంటే, సారీ చెప్తాడు. అతడి రహస్యం ఏమీ  ఎరగనట్టే వుం డిపోతుంది ఏన్.

        మళ్ళీ గూగుల్లో సెర్చి చేసి, డిసిపి విజయ్ కుమార్ కేసులకి సంబంధించిన సమాచారమంతా డౌన్ లోడ్ చేసి చదవడం ప్రారంభిస్తూంటే, ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది..

                                               ***
ఫ్లాష్ బ్యాక్ లో-
విజయ్ డిసిపిగా ఉంటాడు. ఒకరోజు బెగ్గర్ మాఫియాని కొట్టి హాస్పిటల్లో పడేస్తే అక్కడ హౌస్ సర్జన్ గా వున్న  మిత్ర పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. దీన్ని ఓకే చేస్తుంది విజయ్ తల్లి.
ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రేప్ కేసులో మంత్రి కొడుకుని అనుమానించి అరెస్ట్ చేయబోతే మంత్రి కొడుకు కాల్పులు జరుపుతాడు. ఆత్మరక్షణ చేసుకుంటూ విజయ్ జరిపే కాల్పుల్లో చనిపోతాడు మంత్రి కొడుకు. దీన్ని నమ్మడు మంత్రి. విజయ్ కావాలనే కాల్చి చంపాడని ఎదురు  తిరుగుతాడు. మంత్రితో వ్యవహారం కాబట్టి, అతను  నమ్మడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తాడు విజయ్. ససేమిరా అంటాడు మంత్రి. విజయ్ స్వాధీనం చేసుకున్న మంత్రి కొడుకు రివాల్వర్నీ, కాల్చిన బుల్లెట్స్ నీ మంత్రి ఆదేశాలతో మాయం చేస్తాడు విజయ్ పై అధికారి. నాకింత కడుపు శోకం కల్గించిన నీకు ఏ శోకం మిగల్చాలి?’ అంటాడు. మంత్రి మూర్ఖత్వంతో ఇక పిచ్చెక్కిన విజయ్నిన్ను కూడా చంపేస్తాను నా కొడకా!’  అని రివాల్వర్ కణతకి పెట్టేస్తాడు

మంత్రి ఏదో కనుసైగ చేస్తున్నట్టన్పించి, గిరుక్కున వెనక్కి తిరిగి కాల్చేస్తాడు విజయ్. వెనుక నుంచి విజయ్ పైకికాల్చబోతున్నమంత్రి తమ్ముడు కుప్ప కూలుతాడు. షాక్ అవుతాడు విజయ్
రెండు మర్డర్లా? ఓరినీ ఎన్ని ఆత్మరక్షణలురా నీకు? ఇప్పుడు సీసీ కెమెరాకి దొరికిపోయావురా! అయిపోయవురా!’  అంటాడు మంత్రిపైన వున్న కెమెరా కేసే చూస్తూంటాడు విజయ్.

        కెమెరాకి దొరికింది నేను కాదురా, నీ తమ్ముడికి కను సైగ చేస్తూ నువ్వు దొరికిపోయావురా, నా ఆత్మరక్షణ ఎప్పుడూ రైటే!’  అని ఆ ఫుటేజీ ఎత్తుకుని  పారిపోతాడు విజయ్.
                                                ***
        ట్టుకోలేక ఫైలు మూసేసి పరిగెడుతుంది టీచర్ ఏన్.
        అటు హైదరాబాద్ లో వున్నవిజయ్ పై అధికారి, కేరళలో వున్న విజయ్ కి కాల్ చేస్తాడు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు. యోగ క్షేమాలడుగుతాడు. మీరు లీజు కిచ్చిన లైఫ్ తో బాగానే వున్నాను సార్  అంటాడు విజయ్. ‘99 ఏళ్ళకి లీజుకిచ్చా, నిలబెట్టుకోవడం నీ పనే  అంటాడు పై అధికారి. సమ్మర్ వెకేషన్స్ కి కేరళ ప్లాన్ చేసినట్టూ, అక్కడికి రావచ్చా అనడుగుతాడు. ష్యూర్ అంటాడు విజయ్.

                                                ***
       మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో -
        విజయ్ ని కలుసుకున్న మిత్ర, తన తండ్రితో మీటింగ్ కి తొందర పెడుతుంది. ఇప్పుడు నాకే ఠికానా లేదు. అప్పుడు వాడలా పోయాడు, ఇప్పుడు వీడిలా పోయాడు. నన్ను సస్పెండ్ చేశారు, నా సర్వీస్ రివాల్వర్, యూనీఫాం కూడా  సరెండర్ చేశాను. సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఇచ్చేశాను, నా దగ్గర ఇప్పుడేమీ లేదు అంటాడు

        ‘ఇదే కావాలి. నీ సర్వీస్ రివాల్వర్ పోవాలి, యూనీఫాం పోవాలి, అన్నీ పోవాలి. లేకపోతే పోలీసే వద్దని కూర్చున్నాడు నాన్న.. నువ్వు సస్పెండ్ అయ్యావని తెలిశాక, రేపు వూస్టింగ్ కూడా అవుతావని చెప్పి ఆయన్ని ఒప్పించడం చాలా సులభమైంది, పద అని తీసికెళ్తుంది

        రెస్టారెంట్ మీటింగ్ లో  మిత్ర తండ్రి, చెల్లెలు, మేనత్తా వుంటారు. మిత్ర తండ్రి హేపీగా విజయ్ కి కంగ్రాట్స్ చెప్పబోతూండగానే తుపాకీ పేలుతుంది. బుల్లెట్ మిత్ర పక్కనుంచి దూసుకెళ్తుంది. మళ్ళీ పేల్తుంది. ఆమెని పక్కకి తోసేసి బయటికి వురుకుతాడు విజయ్. చేతిలో వెపన్ లేకుండానే దుండగుల్నిఎదుర్కొంటాడు. అంతా అయ్యాక తిరిగి చూస్తే ఎవరూ కన్పించరు

        కుటుంబాన్ని కారెక్కించుకు తీసి కెళ్లి పోతున్న మిత్ర తండ్రి- వీడిది మామూలు ప్రాబ్లం కాదు, మంత్రితో పెట్టుకున్నాడని వూరంతా కూస్తోంది. మంత్రి వీణ్ణి వదలడు,నువ్వు వదిలేయ్ వీణ్ణి!’ అని హెచ్చరిస్తాడు.

        మంత్రి విజయ్ కి కాల్ చేసి- చట్టపరంగా నీకు జరిగేది జరుగుతూంటుంది, కడుపు శోకం కోసం, బోనస్ గా నా తమ్ముడి ఆత్మశాంతి కోసం  నేను చేసేది చేసుకోవాలిగా? నీకూ శోకం మిగల్చాలని నీ లవర్ని టార్గెట్ చేశాఇవ్వాళ ఎస్కేప్ అయింది, రేవు అవదుగా? ముందు నిన్ను సస్పెండ్ చేయించడం నీకు సెక్యూరిటీ లేకుండా చేయడం కోసమే, కాపాడుకో నీ లవర్ని’  అంటాడు.

        విజయ్ ఎలర్ట్ అయి మిత్ర తండ్రికి కాల్ చేస్తాడు. జరిగిందానికి సారీ చెప్పి, మిత్రని ఇక తను మర్చిపోదల్చుకున్నట్టూ, ఐతే ఈ పరిస్థితుల్లో మిత్ర తండ్రి పోలీస్ సెక్యూరిటీ కోరడం అత్యవసరమని చెప్తూ, వెళ్లి కమీషనర్ ని కలిసి జరిగిందంతా చెప్పేయమంటాడు.

        ఒక నాటు రివాల్వర్ సంపాదించుకుని విజయ్, మంత్రి  వెళ్తున్నపుడు కారు మీద ఫైర్ చేసి పారిపోతాడు. మంత్రి విజయ్ మీద కమీషనర్ కి కంప్లెయింట్ చేస్తాడు. మీ మీద ఎందుకు ఎటాక్ చేస్తాడని కమీషనర్ అడిగితే చెప్పలేకపోతాడు. చెప్తే తన రివెంజియే  బయటపడుతుంది.

        మొన్న సీసీ కెమెరా ఫుటెజీలో ఈ కణతకి రివాల్వర్ పెట్టాడు విజయ్, బాగానే వుంది. మీరెందుకు వెనుక వున్న  మీ తమ్ముడికి కనుసైగ చేశారు?’ అంటాడు కమీషనర్. ఆత్మరక్షణ కోసమే  కనుసైగ చేశానంటాడు  మంత్రి.అసలు మీకెందుకు రివాల్వర్ పెట్టాడు విజయ్?’ అంటే చెప్పలేకపోతాడు.మీరతన్ని హెరాస్ చేశారా?’ అన్న  ప్రశ్నకీ సమాధాన ముండదు. ‘మొన్న రెస్టారెంట్లో విజయ్ పెళ్లి విషయం మటాడుతూంటే ఎటాక్ జరిగింది, వాళ్ళు మీ వాళ్ళేనా?’  అంటేనన్నే అనుమానిస్తారా!’  అని చిందులేస్తాడు  మంత్రి.

        ఇలా రివెంజితో మంత్రి ముందుకెళ్ళ కుండా  లాక్ చేసిన విజయ్, మిత్ర తండ్రి కమీషనర్ ని కలవకపోవడాన్ని ప్రశ్నిస్తాడు. అతను మిత్రని చూపిస్తాడు. ఒకవేళ నాన్న మీద ఏటాక్స్ చేస్తున్నారని నా సేఫ్టీ కోసం నాన్నని వదిలేస్తానా? నిన్నెందుకు వదిలెయ్యాలి?  మనం కలిసింది మనసులు కలవడం దగ్గరే ఆగిపోతే దానికర్ధముందా?’’ అంటుంది మిత్ర. ఆమె కమిట్ మెంట్ కి చలిస్తాడు విజయ్. ఒక ఆలోచన చేసిమా పెళ్ళికి ఇప్పుడు మంత్రి కూడా వస్తాడు అంటాడు మిత్ర తండ్రితో. వాణ్ణి  నమ్మకు. పిలిస్తే వాడు రావచ్చుగానీ, వాడి మనసు రావాలని లేదుఅని హెచ్చరిస్తాడు మిత్ర తండ్రి.

***
        మిత్ర కూడా తండ్రి మాటే పట్టుకుని మంత్రిని పిలవ్వొద్దంటుంది. మైండ్ గేమ్స్ వద్దంటుంది. అప్పుడేదో లాక్ వేశావ్ గా, వాణ్ణలా వుండనీయ్  అంటుంది. పెళ్ళికి చాలా మంది పోలీసులు వస్తారు. విజయ్ పై అధికారి కూడా వస్తాడు మంత్రిని వెంటబెట్టుకుని. మిత్ర షాక్ అయి ఎందుకిలా చేశావని విజయ్ ని చూస్తుంది. మిత్ర తండ్రి కూడా విజయ్ తన మాట వినలేదన్న కోపం ప్రదర్శిస్తాడు. విజయ్ మంత్రిని  వెంట బెట్టుకొచ్చిన  తన పై అధికారినే  క్యాలిక్యులేట్ చేస్తూంటాడు. మంత్రి ఆశీర్వదిస్తూ అన్నీ మర్చిపోదామంటాడు. పై అధికారి బలవంతం చేస్తేనే వచ్చానంటాడు. డ్యూటీలో భాగంగా విజయ్ కి కొన్ని తప్పవనీ, ఇది తెలిసి కూడా తను తొందరపడి  ఏదేదో చేశాననీ బాధ పడతాడు. మిత్రకీ, ఆమె తండ్రికీ విజయ్ మీద అపార్ధం తొలగిపోతుంది. అయితే మంత్రి మాటల్ని నమ్మరు.

        భోజనాల దగ్గర మంత్రి అంటాడు పై అధికారితో- పెళ్ళికి ఇంత మంది పోలీసులు వచ్చారంటే వీడికి చాలా మద్దతుంది సస్పెండైనా. వీడి మీద కేసులకి ఇంకేం న్యాయం చేస్తారు!’ అంటాడు. మీరు తాగి పడుకోకుండా ఈ సీన్ చూపించి మీలోని కడుపు శోకాన్ని నిద్ర లేపుదామనే ఇక్కడికి తీసుకొచ్చా. చట్టం ఏమీ పీకదు, మీరే పీక్కోవాలిఅంటాడు పై అధికారి.

        తర్వాత విజయ్ తో మాట్లాడతాడు పై అధికారి-నువ్వు మంత్రిని- మంత్రి నిన్నూ యేసేసే ఎదురెదురు మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ కల్పిస్తాను- వాణ్ణి యేసేసి ఇంకో ఆత్మరక్షణ స్టేట్ మెంట్ ఇచ్చుకుంటావా? ముచ్చటగా మూడుసార్లవుతుంది, మూడు పువ్వులూ ఆరు కాయలుగా వుంటుంది, మనం పోలీసులం ఇంతే!’  అంటాడు

        ‘మీరు నాకు మేలు చేస్తున్నారా, మీకేదో మేలుకి నన్నుపయోగించుకుంటు న్నారా?’ అంటాడు విజయ్. నీ ఇష్టమని వెళ్ళిపోతాడు పై అధికారి.

        మంత్రికీ, పై అధికారికీ మిత్ర తండ్రి సెండాఫ్ ఇస్తున్నప్పుడు, మిత్ర తండ్రితో పై అధికారి- ‘సస్పెండైనా మీరు పెద్ద మనసు చేసుకుని మా వాణ్ణి  అల్లుడుగా చేసుకున్నారు. సస్పెండైనప్పుడే అల్లుళ్ళని పట్టాలి, చీపుగా దొరుకుతారు’  అంటాడు.

        వీళ్ళని చూసి అసలే అయిష్టంగా వున్న మిత్ర తండ్రి, ఈ మాటలకి బాగా మండిపోతాడు - అసలు పోలీసే వద్దన్నా!’  అంటాడు. పోలీసే వద్దన్నారా? ఏఁ? ఎందుకనీ?’ అనడుగుతాడు పై అధికారి. పిలవకుండా వచ్చి -అడ్డంగా కూరలన్నీ మెక్కి- ఇలా పిచ్చి వాగుడు వాగి పోతారనీ!’  అని గట్టిగా అంటాడు మిత్ర తండ్రి.

        పెళ్ళికి వచ్చిన పోలీసాఫీసర్నే అంత మాటంటావా? ఏయ్, ఈణ్ణి లోపలెయ్యండి, లోపలెయ్యండి!’ అని  పై అధికారి అనగానే, మిత్ర తండ్రి అతడి కాలర్ పట్టుకుంటాడు. ఈడ్చి కొడతాడు పై అధికారి.  పోలీసులు మిత్ర తండ్రిని లాగి, జీపెక్కించి తీసి కెళ్లి పోతూంటారు. పరుగెత్తుకొచ్చిన విజయ్ ని ఆపేసి- ఇందాకా నేనేం అడిగానో గుర్తుందిగా? రేపు కలువ్  అనేసి వెళ్లి పోతాడు పై అధికారి మంత్రితో

***
    లాకప్ లో  వున్న మామని బాధగా చూసి, వెళ్లి పై అధికారిని కలుస్తాడు విజయ్. ఒక డేట్ ఫిక్స్ చేసి, రిసార్ట్స్ లో  మంత్రికీ విజయ్ కీ సిటింగ్ ఏర్పాటు చేస్తానంటాడు పై అధికారి. మంత్రి పెళ్ళికి వచ్చి విజయ్ ని కలుపు కున్నాడు గాబట్టిమంత్రి పిలిస్తే నమ్మి రిసార్ట్స్ కి వెళ్లినట్టు వుంటుంది పిక్చర్. డ్రింక్ తీసుకునేప్పుడు పూర్వ సంఘటనల రీత్యా మంత్రిని రెచ్చ గొట్టాలి విజయ్. మంత్రి వాడి ఇగో కొద్దీ రివాల్వర్ తీస్తాడు. అంతకంటే స్పీడుగా విజయ్ తన నాటు రివాల్వర్ తీయాలి. ఇద్దరూ పరస్పరం గురి పెట్టుకుంటారు. ఎవరు ముందు షూట్ చేస్తే వాళ్ళే బతుకుతారువిజయ్ ఎలాగు షార్ప్ షూటర్  కాబట్టి ముందు తనే షూట్ చేసేస్తాడు. చేతిలో రివాల్వర్ తో మంత్రి దేహం పడిపోతుంది. విజయ్ వచ్చి తనదగ్గర లొంగి పోవాలి. మిగతా విషయాలు తను చూసుకుంటాడు

        మీకేమిటి లాభమని విజయ్ అడుగుతాడు. ఎందుకంటే, ఇది తన కోసమే అయితే తన మామని బందీగా లాకప్ లో  పెట్టుకోరని అంటాడు. తన లాభమేమిటో చెప్తాడు పై అధికారి- మంత్రి ఒక స్కాం చేస్తున్నాడని తను తెలుసుకున్నాడు. మంత్రి తమ్ముడ్ని లాగి ఆ వివరాలన్నీ తెలుసుకుని బ్లాక్ మెయిల్ కి తెర తీశాడు. మంత్రి తమ్ముడే బ్లాక్ మెయిలర్ అని తెలుసుకోలేని మంత్రి కోట్ల రూపాయలు అందిస్తూ పోయాడు. ఎందుకో మంత్రి తమ్ముడ్ని అనుమానించాడు, వాణ్ణి ఫినిష్ చేయాలనుకున్నాడు. ఆరోజు విజయ్ రెచ్చిపోయి మంత్రి కణతకి  రివాల్వర్ పెట్టినప్పుడు- కావాలనే, విజయ్ కి తెలిసేట్టే,  వెనుక  వున్న తమ్ముడుకి కనుసైగ చేశాడు. ఇది కనిపెట్టి విజయ్ తమ్ముడ్ని కాల్చేస్తాడని ఊహించాడు. విజయ్ షార్ప్ షూటర్ కాబట్టి తన తమ్ముడి కంటే మెరుపు వేగంతో ఎటాక్ చేస్తాడని లేక్కేశాడు. అతడి లెక్క తప్పలేదు. విజయ్ ఆ తమ్ముడ్ని లేపేశాడు. ఇదంతా  బ్లాక్ మెయిలర్ గా మారిన తమ్ముడ్ని అడ్డు తొలగించుకోవాలన్న మంత్రి కుట్రే తప్ప, యాదృచ్చికంగా జరిగిందేమీ కాదు.

        ఈ కొత్త నిజం తెలుసుకున్న విజయ్- ‘నన్నడ్డం పెట్టుకుని ఎవరి గేములు వాళ్ళు బాగానే ఆడుతున్నారు’  అంటాడు కసిగా. ‘అందువల్ల నా ఇన్ కం కి గండి కొట్టి మంత్రి స్కాం చేసుకుంటే భరించలేను,  హీ మస్ట్ గో!’ అంటాడు పై అధికారి. వాడు పోతే తన కెంత లాభమో విజయ్ కీ అంతే  లాభమంటాడు. పైగా వాడి కొడుకూ, తమ్ముడూ చచ్చిపోయిన కేసులు ఆత్మరక్షణ కారణాన్నే బలంగా సూచిస్తున్నాయని చెప్పి,  విజయ్ మీద సస్పెన్షన్ ని ఎత్తివేయిస్తానని చెప్తాడు పై అధికారి. 

        ‘మీరు ఈ డేట్ ఫిక్స్ చేసే లోగా మంత్రి ఎటాక్ చేయకుండా మీరే చూడాలి’ అంటాడు విజయ్. మామని తీసుకుని వెళ్ళిపోతాడు.

***
విజయ్ ఇంటికి తిరిగొస్తాడు. కొత్త కోడలిగా మిత్ర వస్తుంది. మామని ఇంకెప్పుడూ పోలీసుల్ని మాటలనొద్దని మందలిస్తాడు విజయ్. రోజులు గడుస్తూంటాయి. హౌస్ సర్జన్ గా మిత్ర ఒంటరిగా హాస్పిటల్ కి వెళ్లి వస్తూంటుంది. అత్తగారు (విజయ్ తల్లి) తో కలిసి షా పింగ్స్ కి కూడా వెళ్లి వస్తూంటుంది. విజయ్ పై అధికారి నుంచి కబురు కోసం ఎదురు  చూస్తూంటాడు.  
        పై అధికారి మంత్రిని కలుస్తాడు. ‘మీ కొత్త ఫ్రెండ్ విజయ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. మీకు సారీలు చెప్పి మీ ద్వారా సస్పెన్షన్ రద్దు చేయించు కోవాలనీ ...అది జరిగితే మీకు అరకోటి ఇచ్చుకోవాలనీ...డిసిపి కదా...కానీ మీరు కడుపుశోకంతో కాంప్రమైజ్ కారనుకోండీ...’ అని అంటూంటే- తను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటాడు మంత్రి.  ఐతే వాణ్ణి లేపెయ్యమంటాడు పై అధికారి. ‘వాణ్ణి లేపి ఏంలాభం? వాడి పెళ్ళాన్ని లేపితే వాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు, అది కదా నాక్కావాలీ!’ అంటాడు మంత్రి.  ‘రెండూ ఒకటే- వాణ్ణి లేపినా వాడి పెళ్ళాం కుళ్ళు కుళ్ళి  ఏడుస్తుంది’  అంటాడు పై అధికారి. మంత్రి అపాయింట్ మెంట్స్ చూసుకుని మీటింగ్ కి తేదీ చెప్తాడు. ఆ తేదీ విజయ్ కి పాస్ చేస్తాడు పైఅధికారి.

        ఆ తేదీ నాడు విజయ్ రిసార్ట్స్ కి చేరుకుంటాడు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవంటాడు మంత్రి. తను కూడా రివాల్వర్ తెచ్చుకోలేదని,  బయట సెక్యూరిటీ చెక్ చేశారని, ఈ సంగతి  మీకు పాస్ చేసే ఉంటారనీ అంటాడు విజయ్. ఇద్దరూ డ్రింక్స్ తీసుకుంటూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూండగా- ‘నువ్వు వెపన్ తో వస్తావనుకున్నా’ అంటాడు మంత్రి. ‘నువ్వు మాజీ డిసిపితో డీల్ చేస్తున్నావని తెలుసుకో.  నీకు గన్ లైసెన్సే లేదు, ఎప్పుడూ తుపాకీ పట్టుకోనే లేదు, అదెలా పనిచేస్తుందో తెలీదు,  ఇప్పటికిప్పుడు నువ్వు  ఇల్లీగల్ గన్ సంపాదించుకు వచ్చినా దాన్ని పేల్చగలవా? ఏదో మర్డర్ చేసేయాలన్న ముసలి యావే తప్ప, చేవ ఎక్కడుంది? నేనే నేర్పాలి, నేర్పనా?’  అన్న విజయ్ రెచ్చగొట్టే మాటలకి- ‘అంత మాటంటావా!’  అని నాటు పిస్తోలు తీస్తాడు మంత్రి తాగిన మత్తులో. రకరకాల టార్గెట్స్ ని చూపిస్తూ షూట్ చేయిస్తూంటాడు విజయ్. ఒక్కటీ గురి కుదరదు. గది బీభత్సంగా  తయారవుతుంది కాల్పులతో. సెక్యూరిటీ పరుగెత్తు కొస్తారు.  విజయ్ నేల మీద పడిపోతాడు. అతడికి పిస్తోలు గురిపెట్టి కాల్చాలని ప్రయత్నిస్తూంటాడు మంత్రి. ఇప్పుడా పిస్తోల్లో గుళ్ళు లేవన్న సంగతి తెలుసు విజయ్ కి. ఈ దృశ్యం చూసిన సెక్యూరిటీ, మంత్రిని పెడ  రెక్కలు విరిచి పట్టుకుంటారు.

***
విజయ్ పై అధికారి స్టేట్ మెంట్ ఇస్తూంటాడు : సస్పెండైన డిసిపి విజయ్, మంత్రికి సారీ చెప్పి సస్పెన్షన్ ఎత్తివేయించుకోవాలని పోతే,  మొదట్నించీ అనుమానం పెనుభూతంగా ప్రవర్తిస్తున్న మంత్రి, విజయ్ ని చంపెయ్యాలని కాల్పులు జరిపాడనీ, సెక్యూరిటీ వాళ్ళు ఆపారనీ, దరిమిలా మంత్రిని అరెస్ట్ చేయక తప్పలేదనీ అంటాడు. 

        విజయ్ కి కాల్ చేసి ఎందుకిలా చేశావని నిలదీస్తే, ‘మీ స్వలాభం కోసం నేనెందుకు మర్డర్ చేయాలి సార్? వాడి మూర్ఖపు రివెంజి ప్రపంచానికి తెలిసేలా చేస్తే నాకు చాలనుకున్నాను. మీరలాగే ప్రపంచానికి  తెలియజేశారు. ఇప్పుడేమైంది? వాడి మంత్రి పదవి పోతుంది, స్కాం ఆగిపోతుంది, ఈ కేసులోంచి బయట పడకుండా మీరు చూస్తారు, ఇదీ మీకు లాభమేగా?’  అంటాడు విజయ్. 

        ‘వాణ్ణి చంపే దాకా నీ మీద సస్పెన్షన్ వుంటుంది’  అంటాడు పై అధికారి.
విజయ్ తిరిగి మామూలు జీవితంలో పడిపోతాడు. మిత్రని తీసుకుని గోవా హనీ మూన్ వెళ్తాడు. ఎంజాయ్ చేసి తిరిగొస్తాడు.  మంత్రి బెయిల్ కోసం సుప్రీం కోర్టు దాకా పోతాడు. అప్పటికి ఏడాది తిరిగి విజయ్ కి కూతురు పుడుతుంది. కూతురే లోకంగా ఉంటాడు. మిత్ర హౌస్ సర్జెన్సీ కూడా పూర్తయి డాక్టర్ గా డ్యూటీలో చేరుతుంది. విజయ్ కి పని లేకపోవడం పెద్ద సమస్య అయిపోతుంది. 

        పై అధికారిని కలుస్తూంటాడు. మంత్రి బెయిలు మీద వచ్చేవరకూ ఆగమంటూంటాడు పై అధికారి. ‘వాడు బయటికొస్తే మీ పట్టుదల కోసం నేను చంపాలి అంతేనా? కానీ ఇప్పుడు నా కోసం నేనే చంపాలి. వాడు బెయిల్ మీద బయటికి వస్తే నన్ను చంపడానికే వస్తాడని నాకు తెలుసు. వాడు నాకు పట్టిన క్యాన్సర్. ఈ క్యాన్సర్ కి ఇక చికిత్స తప్పదు. వాడు నన్ను చంపడానికి  వచ్చే ముందే వాడి కిల్లింగ్ ని నేను ప్లాన్ చేసుకోవాలి. అందుకునేను డ్యూటీలో చేరాలి. నేను డ్యూటీలో వుండి ఎన్ కౌంటర్ చేయడం పూర్తిగా వేరు. అప్పుడు మీరన్నట్టు నా మూడో ఆత్మ క్షణ స్టేట్ మెంట్ నా గుండెల్లోంచి ఇంకా బాగా ఒరిజినల్ గా ఉబికి ఉబికి వస్తుంది’ అంటాడు విజయ్. 

 తన సస్పెన్షన్ మీద నిర్ణయం తీసుకోకపోతే ట్రిబ్యునల్ కి పోతానంటాడు విజయ్. తను చెప్పినట్టు వినకపోతే, విజయ్ ని ప్రాసిక్యూషన్ కి రికమెండ్ చేసి జైల్లో కూర్చో బెడతానంటాడు పై అధికారి. ఆ రెండు కేసుల్లో ఇదే తన తుది నిర్ణయమవుతుందని స్పష్టం చేస్తాడు.  మంత్రి బెయిల్ మీద విడుదలై అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. విజయ్ ఎలర్ట్ అవుతాడు. విజయ్ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వడానికి పై అధికారి ఒకటే షరతు పెడతాడు- తను మంత్రి ఎక్కడ దాక్కున్నాడో ఇన్ఫర్మేషన్ తీసి ఇస్తాడు, విజయ్ వెళ్లి చంపెయ్యాలి. 

        మిత్రకి  పోలీస్ సెక్యూరిటీతో హాస్పిటల్ కి వెళ్ళాల్సి రావడంతో ఆమె కూడా ఎలర్ట్ అవుతుంది. ఎక్కడ మొదలయ్యిందో అక్కడే పరిష్కార ముంటుందని అంటుంది.
ఇద్దరూ కాసేపు ఏకాంతంగా గడుపుతారు. ఆమె ఏదేదో మాట్లాడేస్తూంటుంది. అవేవీ తలకెక్కవు విజయ్ కి...  ఎక్కడ మొదలయ్యిందో అక్కడే పరిష్కార ముంటుంది- అన్న ఆమె మాట ఒక్కతే చెవుల్లో  మొగుతూంటుంది. దానర్ధ మేంటోఅంతు చిక్కదు. ఆమె మాత్రం ఏదో  లోకంలో విహరిస్తున్నట్టు...
‘ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో నిర్జన ప్రదేశంలో పొదరిల్లు కట్టుకుని, ఫోనూ టీవీ లాంటి బయటి ప్రపంచంతో సంబంధాలూ  కట్ చేసుకుని, పెంపుడు కుక్కతో ఏకాంతంగా జీవించాలని.. అని చెప్పుకు పోతూంటుంది. విజయ్ కి ఏదో తట్టి అక్కడ్నించీ పరుగు దీస్తాడు.

        మంత్రి కొడుకు రేప్ చేసిన ఫాం హౌస్ కెళ్లి చూస్తాడు. అక్కడ రేప్ చేసింది మంత్రి కొడుకు కాదనీ, మంత్రేననీ స్పష్టమైన ఆధారాలు దొరుకుతాయి..షాక్ అవుతాడు. 

        కింది అధికారుల ఇన్వెస్టిగేషన్ నిర్వాకానికి తిట్టుకుంటాడు. అప్పుడు మంత్రి ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పై అధికారి- మంత్రి విజయ్ ఇంటికే వెళ్ళాడని !

                                        ***
మంత్రి బీభత్సం చేస్తూంటాడు- మిత్రనీ, విజయ్ తల్లినీ టార్చర్ చేస్తూంటాడు. ఒంటరిగా బాగా దొరికారని వాళ్ళని చిందర వందర చేస్తూంటాడు. ‘మీరు చచ్చే ముందు ఒక నిజం చెప్పనా?’ అని  అప్పుడు రేప్ చేసింది తన  కొడుకు కాదనీ, తానేననీ, తనకా సత్తా ఇప్పుడూ ఉందనీ అంటూ , మిమ్మల్ని కాస్సేపు వాడుకుంటానని  శాడిజం ప్రదర్శిస్తాడు. వాళ్ళు లొంగక పోయేసరికి కాల్చి చంపేస్తాడు- అప్పుడే విజయ్ వచ్చేస్తాడు- అతడి మీదికీ కాల్పులు జరిపి పరారవుతాడు. గాయపడిన విజయ్ తో ఏదో అనాలనుకుని అనలేక ప్రాణంవిడుస్తుంది మిత్ర. అటు తల్లి మృత దేహం పడుంటుంది. విజయ్ కూతురి కోసం పరిగెడతాడు. ఇల్లంతా వెతికినా కన్పించదు కూతురు.

 విజయ్ చితి మంటల్ని చూస్తూంటాడు.
        ‘నువ్వెంత పోలీసువైనా రాజకీయనాయకులు నిన్నునమ్ముతారను కోవద్దు ..నువ్వెంత  నిజంగా ఆత్మ రక్షణ కోసమే మంత్రి కొడుకుని చంపినా నమ్మలేదు మంత్రి. మాయ ..కన్పించేదంతా మాయ.. కన్పిస్తున్న మంత్రిని నమ్మించాలని నానా యాతన పడ్డావ్, వాడే కనిపించని  నేరస్థుడని తెలుసుకోలేక పోయావ్!’  ఘోషిస్తోంది అంతరాత్మ. 

        విజయ్ పై అధికారి దగ్గరికి వెళ్లి, తన ఇంటిదగ్గర సెక్యూరిటీని ఎందుకు విత్ డ్రా చేశారని  అడుగుతాడు. పై అధికారి బాధగా-  ‘రాజకీయం క్రిమినల్ స్వభావాన్ని పులుముకుంటే చాలా దారుణంగా వుంటుంది. మన చేతిలో ఏమీ వుండదు.  అంతా పైస్థాయిలోనే జరిగిపోయిందని నేననుమానిస్తున్నాను. వాడు ఇన్ ఫ్లూయెన్స్ చేసి ఉంటాడు..నాకు తెలీకుండా సెక్యూరిటీని విత్ డ్రా చేసేశారు..’ అంటాడు. నమ్మనంటాడు విజయ్. ముందు వాణ్ణి చంపిరా, తర్వాత మనం తేల్చుకుందామంటాడు పై అధికారి. ‘నువ్వు చంపితే అది సూసైడ్ అని నేనే  రాస్తాను’ అంటాడు. ‘చంపే ముందు అడిగితే వాడే చెప్తాడు సెక్యూరిటీ ఎవరు విత్ డ్రా చేసారో’ అంటాడు. ‘అది నేనే అయితే వచ్చి నన్ను చంపు’ అంటాడు. తన స్వాధీనంలో వున్న విజయ్ సర్వీస్ రివాల్వర్ ని తీసి ముందు పెడతాడు. దీంతో చంపి తిరిగి ఇచ్చేయాలంటాడు. ‘మీరింకా గేములాడుతున్నారా నాతో?’ అంటాడు విజయ్.

‘ఇది మనిద్దరి జాయింట్ డెత్ వారెంట్. రేపు నీతో తేడా వచ్చి మంత్రిని నువ్వే చంపావని నేనడానికి వుండదు.. నా స్వాధీనంలో వున్న రివాల్వర్ నీకెలా వచ్చిందన్న క్వశ్చన్ వస్తుంది. అప్పుడు నేనే ఇరుక్కుంటాను. నీ రివాల్వర్ తో నేనే మర్డర్ చేశానని నువ్వుకూడా అనలేవు, ఎందుకంటే నువ్వు మర్డర్ చేసి రాగానే నీ వేలిముద్రలతో దాన్ని సీల్  చేస్తాను కాబట్టి’  అంటాడు. ‘మీరేమంటున్నారు సార్?’ అని అరుస్తాడు విజయ్.

        ‘సెక్యూరిటీ నేనే విత్ డ్రా  చేశానని మంత్రి అంటే, వాణ్ణి చంపేశాక వెంటనే నన్ను చంపకు, మంత్రి చావు సూసైడ్ అని నేను కవిత్వం రాశాకే నన్ను చంపు, చచ్చే ముందు నీకీ హెల్ప్ చేస్తాను’  అంటాడు మళ్ళీ పై అధికారి. పిచ్చెత్తి నట్టయి  జుట్టు పీక్కుంటాడు విజయ్.

***
మంత్రిని వెతికి వెతికి వేటాడి వేటాడి, రేప్ చేసిన అదే ఫాం హౌస్ లో చంపుతాడు విజయ్. చంపే ముందు- ఆఫీసర్ పేరడిగి తెలుసుకుంటాడు. ‘నీ కొడుకు కిడ్నాప్ చేసిన అమ్మాయిని నువ్వు లాక్కుని రేప్ చేశావంటే, నీకు వావీ వరసలు కూడా లేవు. నా భార్య మీద, మా అమ్మ మీద కూడా చేతులేస్తావురా?’  అని కాల్చి కాల్చి కసికసిగా చంపేస్తాడు.

  పై అధికారి వచ్చి చూసి, రేప్ చేసింది తానేనని తెలిసిపోయిన అవమాన భారంతో, మాజీ మంత్రి కసికసిగా కాల్చుకునీ కాల్చుకునీ  చచ్చిపోయాడనీ కవిత్వం రాస్తాడు. రివాల్వర్ ఇమ్మని అడిగితే, ఇంకో పోయెట్రీ రాశాక ఇస్తానని, విజయ్ వెళ్లి- సెక్యూరిటీని విత్ డ్రా చేసిన ఆఫీసర్ ని షూట్ చేస్తాడు.

విజయ్ కి ఘనంగా పార్టీ ఇస్తాడు పై అధికారి. ఇక కూతుర్ని తీసుకుని వెళ్లి పొమ్మంటాడు. ‘అంతకి ముందే  నీ మామ నీ కూతుర్ని తనింటికి తీసుకెళ్లడం వల్ల బతికిపోయింది. లేకపోతే దాన్ని కూడా కోల్పోయే వాడివి. అంత మాత్రాన మామ మీద తెగ సెంటి మెంటల్ అయిపోకు. వాడు నాకు నచ్చలేదు. చాలా చెడ్డ మాటలన్నాడు. నేనడ్డంగా కూరలు దొబ్బి తిన్నానట. నాకాలర్ కూడా పట్టుకున్నాడు.  నేనసలే మెంటల్ ని, ఇది  మర్చిపోను. వాడిని పనిష్ చేయాల్సిందే. కూతురు పోయిన బాధతో ఉన్నాడుగా- ఇప్పుడు మనవరాలు కూడా లేకుండా పోయి కుళ్ళి కుళ్ళి ఏడవాలి, అది నేను చూడాలి. కాబట్టి దాన్ని తీసుకుని కన్పించకుండా పో! లేకపోతే నీ మర్డర్ వెపన్ బయటి కొ చ్చేస్తుంది. ఎన్నాళ్ళు నీ మామకి మనవరాల్ని దూరం పెడితే అన్నాళ్ళు  రివాల్వర్ బయటికి రాకుండా నీకు లైఫ్ వుంటుంది. గాటిట్? దెన్ ఫకాఫ్!!’ అంటాడు భీకరంగా పై అధికారి.
***
టీచర్ ఏన్ చదువుతున్న ఫైల్లో చివరి పేజీని చూసి తేరుకుని కంగారు కంగారుగా వెనక పేజీలన్నీ తిరగేస్తుంది. ఇవన్నీ తను ఫైల్ చేసిన పేజీలు కావు. అసలు నెట్ లోంచి తీసినవి కావు. తను తీసింది- నెట్ లో  ఉన్నదీ - పెళ్లి వరకే. అదనంగా ఈ పేజీలన్నీ ఎక్కడ్నించీ వచ్చాయి?
 ‘పెళ్లి తర్వాత అసలేం జరిగిందో మీడియాకి తెలిసే  అవకాశం లేదు. కాబట్టి అంత వరకే నెట్ లో  వుంటుంది. అక్కడ్నించీ అంతా నాకూ నా పై అధికారికీ మాత్రమే తెలిసిన గేమ్ కనుక,  అక్కడ్నించీ చివరివరకూ నేనే టైప్ చేసి మీ  ఫైల్లో పెట్టాను. మీరు ఏకబిగిన సస్పెన్స్ థ్రిల్లర్ లా చదువుకుంటూ పోయారు చూసుకోకుండా’ అంటాడు ఆమె వెనకే వున్న విజయ్.


కంగారు పడి చూస్తుంది ఏన్.  తనిలా ఇన్ఫర్మేషన్ తీయడం వేరే ఉద్దేశంతో కాదనీ, కూతురికి ఎలా తోడ్పడగలనా అని తెలుసుకోవడానికేననీ, అంతేగానీ విజయ్ ని ఎలా ప్రేమించగలనా అని కానే కాదనీ ఏడ్చేస్తుంది. విజయ్ షాక్ అయి చూస్తాడు. 

         ‘వద్దు, తెలిసీ మిత్ర నాతో రిస్క్ చేసింది, నువ్వు కూడా చదువుకునీ రిస్క్ చేయవద్దు. నాకెవరూ అవసరం లేదు, ప్లీజ్...ఇది మిత్రకే సొంతమైన ఇల్లు’  అంటూ ఫైల్ ని తగలబెట్టేస్తాడు. 

        అప్పట్నించీ ఇద్దరూ ముభావంగా వుంటారు. కూతురితో ఆడుకుంటూ పైపైన ఎంత అల్లరి చేసినా,  ఆ నిశ్శబ్దం ఇద్దరి మధ్యా వెన్నాడుతూనే  వుంటుంది. ఇది కనిపెట్టేస్తుంది కూతురు. తన స్థాయిలో ఏమిటీ సమస్యని ప్రశ్న లడిగేస్తూంటుంది. బావుండదని, ఇద్దరూ పరిచయమైనప్పుడు ఎలా వుండే వాళ్ళో అలా బిహేవ్ చేయడం మొదలెడతారు. 

        ఒక రోజు కూతురు ఇంట్లో వొంటరిగా వున్నప్పుడు  డోర్ బెల్ మోగుతుంది. కూతురు తలుపు తీసి చూస్తే ముగ్గురుంటారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగవాడు. వీళ్ళెవరో గుర్తుపట్టదు. కూతుర్ని చూడగానే మగవాడు ఉద్వేగంతో ఎత్తుకుని ముద్దా డేస్తూంటాడు, ఆడవాళ్లు లోపలికొచ్చేసి ఇల్లంతా చూసేస్తూంటారు. ‘బాగానే కట్టాడు, డబ్బెక్కడిదో?’ అనుకుంటారు. ‘కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బుకి కొదవా?’ అని మళ్ళీ అనుకుంటారు. గోడకున్న మిత్ర  ఫోటో కేసే చూస్తూ నిలబడతారు- ‘నయం, దేన్నో పట్టి వుంటాడనుకో లేదూ మనమూ?’  అనుకుంటారు. 

        కూతురు దగ్గర ఫోన్ నంబర్ అడిగి  తీసుకుని కాల్ చేస్తాడు మగ అతను. విజయ్ ఆఘమేఘాల మీద వచ్చేసి వీళ్ళందర్నీ చూసి- ‘మీరెందుకొచ్చారిక్కడికీ?’ అని తీవ్రంగా అంటాడు. ‘ఎలా వచ్చామని అడగవయ్యా మగడా’ అని వెటకారంగా అంటాడు విజయ్ మామ. ‘పోలీసు కాలాంతకుడైతే  లేడీసు దేవాంతకులు!’ అనేస్తారు మిత్ర చెల్లెలు, ఆమె మేనత్తా. 

        ‘ఐదేళ్లూ కన్పిచకుండా పోయావ్. ఒక్క పోలీసూ సహకరించలేదు. ఆ రోజువద్దన్నా నా ఏడాది నిండని మనవరాల్ని లాక్కుపోయావు. నా కూతుర్ని పోగొట్టావ్, మనవరాల్నయినా ఇమ్మంటే విన్లేదు నువ్వు. నీకు నీ కూతురు ఎక్కడ్నించి వచ్చేది- ఆ రోజు నీ ఇంట్లోంచి నేను తీసికెళ్ళి పోకపోయి వుంటే? ఇవ్వమని ఎంత ఏడ్చినా ఆ కనికరం కూడా లేదు నీకు.. నా కూతుర్ని పోగొట్టిన నీకు, నా మనవరాలితో వుండే హక్కులేదు- ఇచ్చేయ్!’
‘ఇవ్వను!’
       ‘ఇచ్చేయ్!’
        సమ్మర్ వెకేషన్స్ కి కేరళ వస్తానన్న పై అధికారి అప్పుడే వచ్చేస్తాడు, టీచర్ ఏన్ ని వెంటబెట్టుకుని. ఇక్కడ సీనంతా చూసి- చటుక్కున రివాల్వర్ తీసి విజయ్ మామకి పెడతాడు, తీసి విజయ్ కి పెడతాడు, తీసి ఫైనల్ గా కూతురికి పెడతాడు. ఆమె తలకి గట్టిగా పెట్టి నొక్కుతూ శాడిస్టిక్ గా చూస్తూంటాడు...
***
దంతా కథలో వున్న స్పార్కే. దర్శకుడి చేతిలో ప్రయోగించని తురుపు ముక్క. స్క్రీన్ ప్లే రచనలో ‘హిడెన్ ట్రూత్’  అనే టూల్ ని ఉపయోగించుకుని కథని తిరగ రాస్తే ఇలా వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ కాదు. అది రన్నింగ్ స్టోరీకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. రన్నింగ్ స్టోరీయే ఎప్పుడూ కథ- ప్రధాన కథ. దీని మీద కూడా ఫ్లాష్ బ్యాక్ ‘కథ’ నే సాగదీసి స్వారీ చేయిస్తూ ముగిస్తే రొటీన్ బాషా ఫార్మాటే వస్తుంది.  

 ఇలాకాక, ఫ్లాష్ బ్యాక్ లో ‘కథ’ ని ఫ్లాష్ బ్యాక్ లోనే ముగించేసి, ప్రధాన కథయిన రన్నింగ్ స్టోరీలో- ఇంకేదైనా  ఫ్లాష్ బ్యాక్ లో గుప్త సమాచారముంటే దాన్ని ప్రయోగించి, కథని పూర్తిగా వైట్ వాషింగ్ చేస్తూ  మాస్టర్ స్ట్రోక్ ఇస్తే,  బాషా ఫార్మాట్ ని బ్రేక్ చేసుకుని కథ ఇంకో లెవెల్  పై కెళ్లి పోతుంది! ఈ రన్నింగ్ స్టోరీకి ఓ పాత్రో లేక ఏదైనా అంశంమో  కేంద్ర బిందువుగా వుండాలి. ప్రస్తుత తిరగ రాతలో తేలిన కూతురి పాత్రలా.

ఫ్లాష్ బ్యాక్ హింసాత్మకంగా వుంటే, రన్నింగ్ స్టోరీ సాత్వికంగా వుండాలి. రన్నింగ్ స్టోరీ హింసాత్మకంగా వుంటే, ఫ్లాష్ బ్యాక్ సాత్వికంగా వుండాలి. రెండిటినీ వేర్వేరుగా ప్లాన్ చేసుకోవాలి- అయితే, రన్నింగ్ స్టోరీ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ని మరిపించేదిగా వుండాలి. ఎందుకంటే రన్నింగ్ స్టోరీకే  తెర మీద  The End  పడుతుంది గనుక.


-సికిందర్














       




24, ఏప్రిల్ 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు!

క ఉద్యోగానికి బయోడేటా పెట్టుకోవాలన్నా అందులో పరువుపోయే  అంశాలు రాయకుండా  జాగ్రత్త పడతారు. కానీ ఒక హీరో కోసం కథ  రాయాలంటే మాత్రం ఆ హీరో పరువంతా తీసే స్క్రీన్ ప్లే సంగతులు దట్టించి మరీ రాస్తారు. ఈ దర్శకుడు వచ్చి ఉత్త పుణ్యానికి తన పరువంతా తీస్తున్నాడని హీరో కి కూడా తెలుసుకునే పరిజ్ఞానం వుండదు. ఇద్దరు అజ్ఞానులు కలిసి ఒక విజ్ఞానదాయక సినిమా తీస్తారు. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి (పాతవాళ్లు చచ్చినా నేర్చుకోరు కాబట్టి) ఆ సినిమా ఒక విజ్ఞాన ఖనిలా ఉపయోగ పడుతుంది. ఆ సినిమాలు ప్రేక్షకుల కోసం కాకనేర్చుకునే వాళ్ళకోసం స్కూలు పుస్తకాలుగా ఉపయోగపడతాయి. నూటికి 90 శాతం ఫ్లాపవుతున్న  సినిమాలన్నీ నేర్చుకునే వాళ్ళ ప్రయోజనార్ధమే వ్యయ ప్రయాసల కోర్చి నిర్మిస్తున్నారు. ఇంత సేవ చేస్తూంటే నిందించడం, విమర్శించడం తగునా?

          కొత్త దర్శకులు కొందరు ఫలానా సీనియర్ దర్శకుడికి అసిస్టెంట్ గా పనిచేశామని చెప్పుకుని గ్లామర్ పెంచుకోవడం అలవాటు. అయినంత మాత్రాన ఆ సీనియర్ దర్శకుడి స్థాయికి సరితూగడం జరుగుతోందా? సీనియర్ దర్శకుల దగ్గర టెక్నికల్ గా సినిమా మేకింగ్ వరకే నేర్చుకోగలరు, రచన చేసుకోవడం ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవాల్సిన సాధనే. కానీ  ఈ సాధనకంటే మేకింగ్ నేర్చుకున్న సర్టిఫికేట్టే ప్రధానమైపోతే, దక్కే దర్శకత్వ ఛాన్సు కి  అరకొర రచనానుభవం ఏమాత్రం ప్లస్ అవుతోంది? క్రియేటివ్ శ్రమకి  ప్రత్యాన్మాయంగా కట్ అండ్ పేస్ట్ సదుపాయముండగా, ఇంకా రచనానుభవం కోసం పాటుబడాలని ఎవరనుకుంటున్నారని? 

        రెండు సినిమాల తమిళ దర్శకుడు అట్లీ, తన గురువు శంకర్ నుంచి మేకింగ్ నేర్చుకున్నాడేమో గానీ, స్టోరీ టెల్లింగ్ కి సంపాదించుకున్న అనుభవం ప్రశ్నార్ధకమని పోలీస్ని చూస్తే తెలిసిపోతోంది. ఏనాటిదో బాషా’- ఆ  బాషాతోబాటు ఆ తరహా పాత్ర, దాని ఫ్లాష్ బ్యాక్ కథలతో వచ్చిన తెలుగు ఫ్యాక్షన్ సినిమాలూ  గుర్తుకు వచ్చే విధంగా, తన కట్ అండ్ పేస్ట్ పనితనాన్ని మాత్రమే చూపెట్టాడు- మేకింగ్ కోసం మాత్రం గురువుగారు గర్వించేట్టు శ్రమించాడు.  



        ‘బాషాఫార్మాట్ ని మళ్ళీ మొన్నే బాలకృష్ణ నటించిన డిక్టేటర్’  లో చూశాం. ‘బాషాఫార్మాటే దాదాపు అంతరించిపోయాక  తగుదునమ్మా అని మళ్ళీ  పోలీస్తీశాడు. ఇది సరిపోదన్నట్టు చిత్రవిచిత్ర  హీరో పాత్ర చిత్రణ. హీరో పాత్రతో కథని  నడపకుండా, కథతోనే హీరో పాత్రని  నడపడం వల్ల ఆయా పరిస్థితులకి ఆ హీరో రియాక్షన్లూ, డైలాగులూ స్థానభ్రంశం చెంది స్క్రిప్టులో ముందూ వెనుకలై పోయాయి. ఫలానా ఈ సీన్లో చెప్పాల్సిన మాట ఎప్పుడో ఇంకేదో సీన్లో చెప్తాడుఫలానా ఆ సీన్లో అలా చెప్పకూడని మాట అలాగే చెప్పేసి వ్యక్తిత్వాన్ని  దిగజార్చుకుంటాడు. ఫలానా విపత్కర పరిస్థితిని ఎదుర్కోవలసిన తను, మడమ తిప్పి కథలోంచి సన్యాసం పుచ్చుకుంటాడు. తను పోలీసు అధికారి అన్న సంగతే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తాడు. ఓ చోట నా ఖర్మ ఇంతే అన్నట్టు ఏడుస్తాడు!!

        కమర్షియల్ సినిమా అంటే హీరో పాత్రతోనే కథ! ఏం జరిగినా, ఎవరడ్డొచ్చినా సరే, హీరో పాత్రతోనే కథ! ఆర్ట్ సినిమా అంటే కథతోనే  హీరో పాత్ర! ఈ తేడా గమనించకపోతే కమర్షియల్  సినిమాలు ప్రమాదంలో పడుతూనే వుంటాయి వందల కొద్దీ. 


        ఇక్కడ తరచూ ఎదురయ్యే ఒక వాదం గురించి చెప్పుకోవాలి. సినిమాల్లో తప్పొప్పులు ఎవరు పట్టించుకుంటున్నారు, హిట్టవుతున్నాయిగా, జనం విరగబడి చూస్తున్నారుగా - అనేది. నిజమే కల్తీ పాలు అని తెలీక తాగేస్తున్నారు, కార్బైడ్ పళ్ళు అని తెలీక తినేస్తున్నారు- కల్తీ పాలూ కల్తీ పళ్ళూ బాగా అమ్ముడుపోతున్నాయి కాబట్టి ఈ వ్యాపారం కరెక్టు అనుకోవాలా? కల్తీ అని తెలీక సినిమాలు కూడా చూసేస్తున్నారు, కాబట్టి కల్తీ సినిమాలతో వ్యాపారం కరెక్ట్ అనుకోవాలా? ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న


        ఇలా ఒక పాసివ్ రియాక్టివ్ పాత్ర వల్ల జరిగిన కల్తీ కారణంగానే శోచనీయంగా పోలీస్కథ నిస్తేజంగా తయారయ్యింది. ఈ సంగతి ప్రేక్షకులకి తెలీదు. స్టార్లూ దర్శకులూ తమకంటే ఎక్కువ ఆలోచనా పరులని నమ్మి ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. ఏది చూపిస్తే అదే కరెక్ట్ అనుకుంటారు


తెలిసిపోయే కథనం

      ఈ కథేమిటంటే విజయ్ అనే ఒక పోలీసు అధికారి మంత్రితో పెట్టుకుంటే ఆ మంత్రి విజయ్ తోబాటు విజయ్ కుటుంబాన్నీ నాశనం చేయడం, చనిపోయాడనుకున్న విజయ్ రహస్యంగా తిరిగి వచ్చి మంత్రితో సహా అనుచరుల్ని చంపుతూంటే, విజయ్ ఆత్మ పగదీర్చు కుంటోందని ప్రచారం జరగడం, ఈ ప్రచారాన్ని ఉపయోగించుకుని పై అధికారి ఇంకింతమంది నేరస్థుల్ని శిక్షించే సీక్రెట్ ఆపరేషన్ కి  విజయ్ ఆత్మని నియమించుకోవడం...

        స్క్రీన్ ప్లేలో కథ సర్దుకున్న తీరు-
          ప్రారంభం : ఎండ్ (రన్నింగ్ స్టోరీ
-1) : కేరళలో మారుమూల చోట బేకరీ నడుపుకుంటూ, ఐదారేళ్ళ కూతుర్ని చదివించుకుంటూ, ఎవరి జోలికీ పోని సాధు జీవితం గడుపుతూంటాడు జోసెఫ్. అతడి కూడా ఓ అసిస్టెంట్ ఉంటాడు. స్కూల్లో కూతురేదైనా గొడవ పడితే గొడవలు వద్దని  మందలిస్తాడు. అదే స్కూల్లో ఏన్ అనే టీచర్ దగ్గరవుతుంది. ఒకరోజు ఆమె ఈ కూతుర్ని స్కూలుకి తీసుకుపోతూంటే లోకల్ గ్యాంగ్ సభ్యులు జీపుతో గుద్దుతారు. ఆమె పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఆ గ్యాంగ్ తో గొడవలు వద్దని కంప్లెయింట్ వాపసు తీసుకునేలా చేస్తాడు జోసెఫ్. పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారి ఎందుకో జోసెఫ్ ని అనుమానించి, అతను వెళ్లి పోతూంటే- విజయ్ కుమారూ!’  - అని పిలుస్తాడు. జోసెఫ్ గిరుక్కున తిరిగి చూస్తాడు. పోలీస్ అధికారి టాపిక్ మార్చేస్తాడు. దీంతో జోసెఫ్ మీద ఏన్ కి కూడా అనుమానం వేసి  గూగుల్లో సెర్చ్ చేస్తూంటుంది. ఇటు కంప్లెయింట్ వాపసు తీసుకున్నప్పటికీ ఇంటి మీద గొడవకొస్తారు గ్యాంగ్. వాళ్ళు కొట్టేస్తూంటే తిరగబడతాడు. అటు ఏన్ కి గూగుల్లో విజయ్ కుమార్’  ఒకప్పుడు డిసిపి అని తెలుస్తుంది. పరుగెత్తుకుని వచ్చి చూస్తేఇక్కడ తీవ్రంగా పోరాటం చేస్తూంటాడు జోసెఫ్ అలియాస్ డిసిపి విజయ్ కుమార్. పోరాటాలు వద్దని శాంతి వచనాలు పలికే ఇతనే, మాంచి  ప్రొఫెషనల్ లా ఫైట్ చేస్తూంటే కళ్ళప్పగించి చూస్తూంటుంది. ఇక తానెవరో ఆమెకి తెలిసిపోవడంతో, నిజం చెప్పక తప్పదతడికి. తన గతం చెప్పుకొస్తాడు...

          బిగినింగ్ (ఫ్లాష్ బ్యాక్ -1) : నగరంలో సగం ఏరియాకి శాంతి భద్రతలని చూసుకునే డిసిపి విజయ్ కుమార్ తను. తన డ్రైవర్ గా కానిస్టేబుల్ (కేరళలో తోడున్న అసిస్టెంట్) ఉంటాడు. పెళ్ళంటూ పోరు పెట్టే ఒక తల్లి వుంటుందిఆమె చూసే సంబంధాలు ఏవీ నచ్చవు అతడికి. ప్రేమించి చేసుకుంటానంటాడు. పిల్లల చేత బిచ్చ మెత్తించుకుంటున్న బెగ్గర్ మాఫియాని చిత్తుగా తన్ని హాస్పిటల్లో పడేస్తాడు. అదే హాస్పిటల్లో హౌస్ సర్జన్ గా చేస్తున్న మిత్ర పరిచయమవుతుంది. తొలి మాటల్లోనే ఆమె ప్రేమ బాణం విసురుతుంది. ఫిక్స్ అయిపోతాడు. ఆమెకి పద్ధతైన తండ్రి, చెల్లెలు, మేనత్తా వుంటారు. మిత్రని విజయ్ తీసికెళ్ళి తల్లికి పరిచయం చేస్తాడు. ఆమెకి నచ్చుతుంది

        డిసిపి విజయ్ తన ఏరియాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మిస్సింగ్ కేసు చేపడతాడు. ఆమె ఎక్కి వెళ్ళిన వాహనాన్ని ట్రేస్  చేస్తాడు. ఈలోగా మానభంగానికి గురైన ఆమె దొరుకుతుంది. నిర్భయ టైపు ఘోరమైన కేసు. ఆమె మరణ వాంగ్మూలం రికార్డు చేస్తాడు. మంత్రి కొడుకు ఈ పని చేశాడు. ఆమె చనిపోతుంది. ఆమె తండ్రి ఏడ్పుని చూడలేకపోతాడు విజయ్. మీరే న్యాయం చేయాలంటాడు ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్న ఆ తండ్రి. విజయ్ భావోద్వేగానికి లోనవుతాడు. మంత్రి కొడుకుని పట్టుకుని ఘోరంగా చంపి మంత్రికి చెప్తాడు. నా వెంట్రుక కూడా పీకలేవ్’  అంటాడు. మంత్రి పగతో రగిలిపోతాడు. వాడు జీవితమంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా బుద్ధి చెప్పాలని ఆదేశిస్తాడు. ఇక్కడ విశ్రాంతి.


          ఎండ్ (రన్నింగ్ స్టోరీ -2 ) : పై ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న  ఏన్, మరి మిత్ర ఏమైంది- విజయ్ మదర్ ఏమైందీ - అని అడుగుతుంది సెకండాఫ్ ప్రారంభంలో విజయ్ అసిస్టెంట్ ని. అతను  చెప్పడం ప్రారంభిస్తాడు.


        మిడిల్ (ఫ్లాష్ బ్యాక్ -2 ):  డిసిపి విజయ్ పెళ్లి  ప్రయత్నాల్లో భాగంగా మిత్ర తండ్రిని కలుసుకుంటాడు. దూరం నుంచి మిత్ర తండ్రిని చూసిఆ గుండోడేనా మీ నాన్న?-  అని అడుగుతాడు. ఈ పోలీసు సంబంధం  మిత్ర తండ్రికి ఇష్టం వుండదు. విజయ్ చాలా  నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. ప్రేమ అనేది మా ఇద్దరికీ సంబంధించింది గానీ, పెళ్లి మన రెండు కుటుంబాలు ఒకటయ్యేది...మీరు వచ్చేసి మా పై పోర్షన్ లో ఉండొచ్చు..మనమంతా హాయిగా కలిసిమెలసి  వుంటాం...లాంటి తియ్యటి మాటలెన్నో చెప్తాడు. అదే సమయంలో తుపాకీ పేలుతుంది. మంత్రి మనుషులు ఎటాక్ చేస్తారు. షాకైన మిత్ర తండ్రి, విజయ్ మీద జరుగుతున్న ఎటాక్ ని చూసి, తన వాళ్ళ ప్రాణాలూ కాపాడుకుని, ఈ సంబంధం వద్దని వెళ్ళిపోతాడు


        విజయ్ మిత్రని కలుసుకుంటే, పోలీసుద్యోగం మానేస్తేనే మన పెళ్ళంటుంది. ససేమిరా అని ఆమెని ఆటో ఎక్కించేస్తాడు విజయ్. వెళ్లిపోతూంటే మళ్ళీ పరిగెత్తుకొస్తుంది మిత్ర- నువ్వలా వెళ్లిపోతూంటే చూస్తూ వూరుకుంటానని ఎలా అనుకున్నావ్- లాంటి మాటలేవో చెప్పి చిలిపితనాలు పోతుంది. పెళ్ళయి పోతుంది. పిల్ల పుడుతుంది. ఓ శుభవేళ మిత్ర తన కోరిక ఇలా వెలిబుచ్చుతుందిఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో నిర్జన ప్రదేశంలో పొదరిల్లు కట్టుకుని, ఫోనూ టీవీ లాంటి బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసుకుని, పెంపుడు కుక్కతో ఏకాంతంగా జీవించాలని..


        స్వయంగా మంత్రే వచ్చేసి తుపాకీ పేలుస్తాడు. దెబ్బకి కింద పడుతుంది మిత్ర. ఇంకో తుపాకీ దెబ్బకి విజయ్ నీ పడేసి, పైకెళ్ళి పిల్లకి స్నానం చేయిస్తున్న విజయ్ తల్లినీ లేపేసి, పిల్లని నీట్లో ముంచేసి వెళ్ళిపోతూ- వీళ్ళ బూడిద కూడా  దొరక్కూడదని  అనుచరులకి ఆర్డరేస్తాడు మంత్రి.


        అనుచరులు గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోతారు. కొనప్రాణాలతో మిత్ర ఒక కోరిక కోరుతుంది : కూతుర్ని బతికించుకుని, మళ్ళీ హింస జోలికి పోకుండా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించమని. విజయ్ ఏడాది కూతుర్ని రక్షించుకుని పారిపోతాడుగ్యాస్ బండ పేలి అంతా భస్మీ పటలమవుతుంది. అందులోనే కూతురితో పాటు విజయ్ బూడిదయ్యాడని  నమ్ముతుంది లోకం.


ఎండ్ (రన్నింగ్ స్టోరీ -3) :  విజయ్ కథంతా తెలుసుకున్నటీచర్ ఏన్, విజయ్ కి మరింత దగ్గరవుతుంది. మంత్రికి విజయ్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. ఒకరోజు టీచర్  ఏన్  పిల్లల్ని స్కూలు బస్సులో  ఎక్స్ కర్షన్ కని తీసికెళ్తూంటే, అది పేలిపోయి కాలువలో పడిపోతుంది. మంత్రి అక్కడ్నించి వెళ్లిపోతాడు. ఈ ప్రమాదంలో చాలా  మంది పిల్లలు చనిపోతారు. మంత్రి చేసిన ఈ పనికి కూతురుకూడా చనిపోయిందని విజయ్ కుమిలి కుమిలి ఏడుస్తాడు. కూతురు బతుకుతుంది. ఇక హింసా మార్గం తప్పదని విజయ్ యుద్ధానికి బయల్దేరతాడు

        ఆనాడు చచ్చిపోయిన విజయ్ ఆత్మలా నమ్మిస్తూ మంత్రి అనుచరుల్నీ, ఆఖరికి మంత్రినీ చంపేస్తాడు. మంత్రిని చంపుతూ- ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి  సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల  పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది అలాటి  తండ్రుల్నే అనీ చెప్పి చంపుతాడు


        ఈ చావులు బతికే వున్న విజయ్ పనేనని పై అధికారి అనుమానిస్తాడు. అతణ్ణి విజయ్ కలుసుకుంటాడు. పై అధికారి అభినందించి, ఇకనుంచి క్రిమినల్స్ ని ఎరేయడానికి నువ్వు విజయ్ ఆత్మలా పనిచేయాలని ఒప్పిస్తాడు.


        విజయ్ కేరళ నుంచి లడఖ్ కి మకాం మారుస్తాడు కూతురూ టీచర్ సహా. ఒక ఫోన్ కాల్ వస్తుంది. విజయ్ ఇక్కడ్నించీ ఆపరేషన్స్ మొదలెడుతున్నాడన్న  అర్ధంలో కథ ముగుస్తుంది.




         లా బాషాఫార్మాట్లో కథని సర్దడంవల్ల ముందేం జరుగుతుందో తెలిసిపోయే విధంగా తయారైంది స్క్రీన్ ప్లే. ఎక్కడో వెళ్లి జీవించడం, ఫ్లాష్ బ్యాక్ ఒపెనవడం, ఫ్లాష్ బ్యాక్ తర్వాత వెళ్లి విలన్ని చంపడం.. ఇదేగా  అనేక సార్లు చూస్తూ వచ్చింది. ఇపుడు మళ్ళీ చూడాల్సి రావడమే ఇక్కడ ఐరనీ. ఈ ఫార్మాట్ స్ట్రక్చరేమీ కాదు, ఇదొక 1995 నాటి బాషాక్రియేటివిటీ. స్ట్రక్చర్ శాశ్వతమైనది, అదెప్పుడూ మారదు. రిక్షాకైనా ఆటో రిక్షాకైనా మూడు చక్రాలే. ఆ మూడు చక్రాలతో అదొక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ని మార్చలేరు. మారిస్తే ముందు రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం వుంటుంది. బోల్తా పడుతుంది. కాబట్టి ముందున్న రిక్షా స్ట్రక్చర్ ని మార్చకుండా క్రియేటివ్ ఆలోచనలు పుట్టి - ఇంజను, టాపు, ముందద్దం వగైరాలు తగిలించి ఆటో రిక్షాగా తయారు చేశారు. ఠాట్ఈ ఫార్మాట్ కూడా కాదన్పించి, మరింత క్రియేటివిటీని వాడి, అదే మూడు చక్రాల స్ట్రక్చర్ లో సిక్స్ సీటర్ ఆటోలు తయారుచేశారు. నిత్యజీవితంలో ఇన్ని మార్పు లొస్తూంటే, ఏనాటిదో రిక్షా లాంటి బాషాఫార్మాట్ నే చెమటలు కక్కుతూ ఇంకా లాగుతున్నారు!

       ఫార్మాట్ ఒక క్రియేటివిటీ అనిగాకస్ట్రక్చర్ అని భ్రమపడితే అదేన్నటికీ మారదు. అందుకే ఇదే ఫార్మాట్ తో ఇన్నేసి సినిమాలు విసుగులేకుండా తీశారు. ఫార్మాట్ క్రియేటివిటీ అని తెలిసివుంటే ఈ ఫార్మాట్ లోనే కొత్త దనం కోసం (క్రియేటివిటీ కోసం) ప్రయత్నించే వాళ్ళుదర్శకుడు అట్లీ ఈ ఫార్మాట్ ని కొత్త మలుపు తిప్పే అవకాశం వున్నా, అందుకు తగ్గ  తురుపు ముక్క చేతిలో వున్నా, చూసుకోకుండా లేజీ రేటింగ్ కి పాల్పడ్డంతో, ఈ పాత ఫార్మాట్ కి కొత్తగా బంగారు బాట  వేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ తరుపు ముక్క ఏమిటో, దాన్నెలా ప్రయోగించ వచ్చో తర్వాత తెలుసుకుందాం.

          ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే కథలన్నీ క్రియేటివ్ ప్రదర్శనలే, వాటిని స్ట్రక్చర్ అనుకోరాదు. స్ట్రక్చర్ అనుకుంటేసినిమా ప్రారంభిస్తూ ఫ్లాష్ బ్యాక్ కంటే ముందు చూపించే కథ బిగినింగ్ విభాగమవుతుంది. అది బిగినింగ్ విభాగామా? కాదుకదా? పైన చెప్పుకున్న పోలీస్రన్నింగ్ స్టోరీ -1 బిగినింగ్ విభాగం కాదుకదా? అది ఎండ్ విభాగం. కాబట్టి ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే కథల్ని ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్ అని పోరబడకూడదు. అది స్ట్రక్చర్ ని విడగొట్టిన క్రియేటివ్ ప్రక్రియ. కేవలం బిగినింగ్- మిడిల్ - ఎండ్ లు స్థానాలు మారతాయంతే.

         ‘పోలీస్ఫార్మాట్లో బిగినింగ్ విభాగంఫస్టాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ -1 లో వుంది. బిగినింగ్ విభాగం లక్షణాల ప్రకారం వివిధ పాత్రల పరిచయం, 1. (ఇదొక పోలీస్ స్టోరీ అని) కథా నేపధ్యపు ఏర్పాటు, 2.(సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మిస్సింగ్ కేసుతో)  సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, 3. (మంత్రి కొడుకుని విజయ్ చంపడంతో ) సమస్య ఏర్పాటూ జరిగి, విజయ్- మంత్రీ  పరస్పర సవాళ్లతో  ప్లాట్ పాయింట్ – 1 ఏర్పడింది. ఇలా బిగినింగ్ విభాగమంతా ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే వుంది. ఇక్కడ ఇంటర్వెల్ పడింది.


        మిడిల్ విభాగం ఫ్లాష్ బ్యాక్ -2 లో వుంది. విజయ్ కీ మంత్రికీ సంఘర్షణ మొదలవడం, దీనికి గుర్తుగా విజయ్ పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు మంత్రి మనుషులు కాల్పులు జరపడం, విజయ్ పెళ్లి సంబంధం ఇబ్బందుల్లో పడి మళ్ళీ క్లియర్ అవడం, పెళ్లవడం, పిల్ల పుట్టడం, మంత్రి వచ్చి  దాడి చేయడం, అందర్నీ చంపాననుకుని వెళ్ళిపోవడం, బతికిన విజయ్ పిల్లతో పారిపోవడం...విజయ్ కూడా చచ్చి పోయాడని లోకం నమ్మడంతో, ప్లాట్ పాయింట్ -2  ఏర్పడి మిడిల్ ముగియడం.


        ఇలా బిగినింగ్, మిడిల్ ల తర్వాత, ఎండ్ వచ్చేసి  మూడు విడతలుగా వుంది. 1. సినిమా ప్రారంభంలో అరగంట సాగే కేరళ రన్నింగ్ స్టోరీ-1 (అంటే ప్లాట్ పాయింట్ -2 దగ్గర్నుంచీ అదృశ్యమైన విజయ్ కూతురితో కేరళ వచ్చి సాధారణ జీవితం గడుపు గడుపుతున్నట్టు చిత్రణ) ఇది జోసెఫ్ పేరుతో ఉంటున్న అతనెవరో బయటపడడంతో ముగుస్తుంది, 2. ఇంటర్వెల్ తర్వాత రన్నింగ్ స్టోరీ -2 గా విజయ్ గతాన్ని కంటిన్యూ చేసే లీడ్ గా చిన్న బిట్ గానూ, 3. విజయ్ గతమంతా చెప్పడం ముగిశాక, మంత్రి కేరళ వచ్చేసి కూతుర్ని టార్గెట్ చేయడం, విజయ్ ఆత్మలా వెళ్లి మంత్రి సహా అనుచరుల్ని అంతమొందించి, ఆఖర్న పోలీస్ ఏజెంట్ ఆత్మగాకొత్త ఎసైన్ మెంట్ అందుకునే రన్నింగ్ స్టోరీ -3 గానూ వుంది

        ఇందులో స్క్రీన్ ప్లేకి మూలస్థంభాలనదగిన ప్లాట్ పాయింట్-1,  ప్లాట్ పాయింట్-2 లు బలహీనంగా కాదు, హాస్యాస్పదంగా వున్నాయి. దీనిక్కారణం హీరో పాత్ర చిత్రణ. పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ గా తయారైన హీరో పాత్ర మొత్తం స్ట్రక్చర్ నే చెడగొట్టింది...


మాటలు కోట- చేతలు చేట!

      మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? వర్క్ లో లభిస్తుంది. చేయాల్సిన  వర్క్ లో తప్ప ఇంకెక్కడా మనశ్శాంతి అనేది మనిషికి లభించదు. మనశ్శాంతికి వర్క్ ని మించిన మందు లేదు. అన్ని సమస్యలకీ వర్కే సమాధానం. డాక్టర్ థామస్ ఆంథోనీ హేరిస్ రాసిన ఐయాం ఓకే- యూఆర్ ఓకేఅన్న బెస్ట్ సెల్లర్ లోఒక చోట ఓ 27 ఏళ్ల యువకుడి గురించి రాస్తాడు. అతను భార్యని పోగొట్టుకున్నాడు. మూడేళ్ళ కూతురుంది. భార్య పోయిన బాధతో ఇంకే పనీ చేయలేక పోతున్నాడు. మనశ్శాంతి లేక  రోజులు భారంగా  గడుపుతున్నాడు. ఎవరెంత  చెప్పినా తేరుకోవడం లేదు. ఒకరోజు కూతురు తనకి బొమ్మరిల్లు కట్టుకోవడం రావడం లేదని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. బొమ్మరిల్లు కట్టివ్వమని మారాం చేసిందిచేసేది లేక ఆ పనికి కూర్చున్నాడు. ఆ పని మీద మనసు లగ్నం చేసి పూర్తి చేస్తూంటే విచిత్రంగా  బాధంతా మర్చిపోయాడు. చక్కటి మనశ్శాంతిని ఫీలయ్యాడు, ఇక రోజూ ఆమె కోసం ఏదో ఒకటి తయారు చేయడమే పనిగా పెట్టుకుని దాంట్లో మునిగిపోయేవాడు..పోగొట్టుకున్న మనశ్శాంతికి పనిని మించిన ఔషధం లేదని తెలుసుకున్నాడు. అంటే బ్రెయిన్ మానసిక శాంతికి పనిని తప్ప మరే మందూ మాకూ కోరుకోదని స్పష్టమవుతోంది. అసలు పని చేస్తూంటేనే ఏ రోగాలూ రావు, మానసిక సమస్యలూ దరికి చేరవు

        విజయ్ సమస్యలకి పరిష్కారం కూడా పనిలోనే వుంది. అంటే కూతురికి బొమ్మరిల్లు కట్టడంలో కాదు, ఆ అదృష్టానికి అతను  నోచుకునే ప్రసక్తే లేదు. తగడు కూడా. ఎందుకంటే తల్లినీ, భార్యనీ ఏదో ప్రమాదంలో పోగొట్టుకోలేదు, అది తన స్వయంకృతమే. దీనికి ఇంకేదో నిష్కృతి చేసుకున్నప్పుడే మనశ్శాంతి, బొమ్మరిళ్ళు కట్టివ్వడంలో కాదు- నిమగ్నమవాల్సిన పని వేరే వుంది. అది అప్పుడే ప్లాట్ పాయింట్ -2 దగ్గరే మంత్రిని లేపేసి రావడమే. ఎండ్ విభాగంలో తనకి శత్రువనే వాడే  లేకుండా చూసుకోవడమే


        ఐతే ఇందుకు అతను  మొదట్నించీ తన ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరముంది. ఒక ఐపీఎస్ అధికారిగా చాలా డీసెన్సీ ని పాటించాలి తను. చట్టాన్ని చేతిలోకి తీసుకుని, నిందితుణ్ణి తనే దోషిగా నిర్ధారించి శిక్షించలేడు  తను- ఇదెంత సినిమా కథైనా సరే. అలా చేసి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని రేప్  చేశాడని మంత్రి కొడుకు మీద వ్యక్తగత కక్ష పెట్టుకుని, వాణ్ని పట్టుకుని, మర్మాంగాన్ని కోసేసి, కిరాతకంగా చంపి, తల కిందులుగా శవాన్ని వేలాడదీయడం ఏ రకమైన న్యాయ ప్రక్తియ, అసలేం సభ్యత ?


        ఇదొక అధికార దుర్వినియోగంతో తప్పయితే, రెండో తప్పు : ఇలా చంపింది తానేనని మంత్రికి చెప్పి, నా వెంట్రుక కూడా పీకలేవని ఛాలెంజి చేయడం. ఆ తర్వాత తన కథంతా గోవిందా చేసుకోవడం! ఎందుకీ మాటలు? ఏమిటీ చేతలు?


        హీరోలు ఈ ఛాలెంజి చేయడాలూ బెదిరించడాలూ చాలా విచిత్రంగా వుంటుంది. ‘రేసుగుర్రంలో విలన్ ముఖేష్ ఋషిని ఇలాగే బెదిరిస్తాడు అల్లుఅర్జున్. అనవసరంగా తనతో పెట్టుకోవద్దని పెద్ద ఫ్యాక్షనిస్టు అయిన ముఖేష్ ఋషికి  వార్నింగ్ ఇస్తాడు. ముఖేష్ రుషి పాత్రముందు  అల్లు అర్జున్ ది ఊరూపేరూ లేని బచ్చా పాత్రే అప్పటికి. పెద్ద హీరోలా పనిమాలా బెదిరించి ఆ తర్వాత తననీ, తన కుటుంబాన్నీ ముఖేష్ చేతే సర్వనాశనం చేయించుకుని ఇంట్లోంచి వెలికి గురవుతాడు. అలా వెళ్ళిపోతున్న అర్జున్ ని చూసి అయ్యోపాపం అనుకోవాలన్న ఉద్దేశంతో దృశ్య చిత్రీకరణ. అయ్యోపాపమని ఎలా అను కుంటారు- తన అవివేకంతో  ఇంత అన్యాయమైపోయాక. ‘శివలో  నాగార్జున అంత పెద్ద మాఫియాకి సవాలు విసిరాడంటే, అతడి వెనుక విద్యార్ధుల  బలముంది.


        ఇలాగే శ్రీమంతుడులో  కూడా పనీ పాటా లేక తిరిగే మహేష్ బాబు ఏకంగా ఢిల్లీ వెళ్లి పోయి కేంద్ర మంత్రిని బెదిరించేస్తాడు. సొంతంగా తనకే బిల్డప్పూ లేదు. కేంద్ర మంత్రి దగ్గర ఎవరి పేరు చెప్పుకుని అపాయింట్ మెంట్ సంపాదించుకున్నాడంటే, తను వ్యతిరేకించే బిజినెస్ మాగ్నెట్  అయిన తండ్రి పేరు చెప్పుకునే. లేకపోతే బిల్డప్ లేదు. తనకు ఏ సొంత వ్యక్తిత్వం వుండాలని తండ్రికి దూరమయ్యాడో, ఆ తండ్రి పరపతే ఇక్కడ అవసరపడింది తప్ప, మరోటి కాదు. ఇలా  విచిత్ర పాత్రచిత్రణలు మెదళ్ళలో ఎలా పుడతాయో- తాజాగా ఇప్పుడు విజయ్ అనే పోలీసు పాత్ర


        తాజాగా షారుఖ్ ఫ్యాన్లో ఇలాటి పనిమాలా బెదిరించుడు పాత్రలకిమంచి ట్రీట్ మెంటే  ఇచ్చినట్టు కన్పిస్తుంది . షారుఖ్ సాటి స్టార్, షారుఖ్ గురించి అవమానకరంగా మాటాడితే తట్టుకోలేక పోతాడు షారుఖ్ ఫ్యాన్. ఆ స్టార్ ని నాల్గు పీకి, నిర్బంధించి, సారీ చెప్పించి ఆ వీడియో యూ ట్యూబ్ లో పెడతాడు పెద్ద హీరోలా. ఇది షారుఖ్ తెలిసి పోలీసుల చేత ఆ ఫ్యాన్ ని చితగ్గొట్టించి- నువ్వు చేసింది తప్పూ, నా ఫ్యాన్ గా నువ్వు పనికి రావు, నా  జీవితం నాది, నీ జీవితం నీది వెళ్ళిపొమ్మని వెళ్ళ గొట్టేస్తాడు. ఈ సీను చూస్తూంటే, రేసుగుర్రం, శ్రీమంతుడు, పోలీస్ - సీన్లతో పుట్టిన ఎలర్జీ అంతా తగ్గిపోయి హాయిగా వుంటుంది ప్రాణం. లేకపోతే ఎవడుపడితే  వాడు బెదిరించడానికి బయల్దేరే  మొనగాడే
If you cannot protect yourself, do not threaten any one – అని ఎప్పుడు తెలుసుకుంటాయో ఈ హీరోల పాత్రలు.

        విజయ్ ఒక మంత్రినే అలా ఛాలెంజి చేశాక అతన్నుంచీ  ఏ ప్రమాదాన్నీ ఎందుకు ఆశించడో అర్ధం గాదు. ఒక అధికారి మంత్రిని బెదిరిస్తే మంత్రి  ఊరుకుంటాడా? యుద్ధం మొదలెట్టాక సర్వసన్నద్ధంగా ఉండక, తను రెచ్చ గొట్టిన మంత్రిని మర్చిపోయి-ఎలా తన ప్రేమా పెళ్ళీ గురించి కలలు గంటాడు. ఆ కాబోయే భార్యని కూడా ప్రమాదంలోకి ఎలా లాగి ఆమె చావుకి బాధ్యుడవుతాడు.  

         దర్శకుడి ఉద్దేశం కాకపోయినా, విజయ్ పాత్ర మోస్ట్ కన్నింగ్  క్యారక్టర్ అని వ్యక్తమయ్యే సన్నివేశం హీరోయిన్ తండ్రితో సంబంధం మాటాడానికి వెళ్ళే అప్పటిది. దూరం నుంచి ఆమె తండ్రిని చూసి- ఆ గుండోడేనా మీ నాన్న? అని చెత్తగా కామెంట్ చేసినవాడుతీరా ఆ తండ్రిని - మీరు  ఇంద్రుడూ చంద్రుడూ  అని పొగుడుతూంటే, వీడొక మోస్ట్ నమ్మలేని, క్యారక్టర్ లెస్ ఐపీఎస్ అధికారి అని మనకి అన్పిస్తాడు- హీరోలా ఉన్నతంగా గాక! దర్శకుడు ఆ  'గుండోడు' కామెంట్ చేయించకపోతే పాత్ర ఇంత అధమంగా వుండేది కాదు

        అక్కడే భారీ ఎత్తున ఎటాక్ జరిగినప్పుడు ఏమీ  అనలేని స్థితిసగం నగరపు  శాంతి భద్రతలు తన చేతిలో వున్నాయని పలికిన వాడి గుమ్మంలో ఇదీ పరిస్థితి. హీరోయిన్ తండ్రి సంబంధం వద్దని వెళ్లి పోతాడు. మళ్ళీ ఇంత ప్రమాదం తలపెట్టిన మంత్రి దగ్గరికి వెళ్లి ఇంకో హెచ్చరిక చేస్తాడు. మంత్రికి ఈ హెచ్చరికలు ఇంకా  రెచ్చగొట్టేందుకే పనికొస్తూంటాయి

        ఇక్కడ ఇంకో గజిబిజి ఏమిటంటే- ఈ దాడిని మంత్రి ఎవరి మీద ఎక్కుపెట్టాడు? ఎందుకంటే విజయ్ కుళ్ళి కుళ్ళి ఏడ్వాలని మంత్రి కోరిక. విజయ్ మీదే దాడి చేసి చంపేస్తే విజయ్ ఎలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు? ఇక్కడ దాడి జరిపింది విజయ్ మీదే! ఇలా కాకా మిత్ర టార్గెట్ గా దాడి చేసి ఆమెని చంపేసి వుంటే విజయ్ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ వుండే వాడేమో! ఇది మర్చిపోయాడు దర్శకుడు. 


        అప్పుడు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోయిన  హీరోయిన్  మళ్ళీ చిలిపిగా చేరువవుతుంది
. ఇదామె అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. తండ్రి మాటకి విలువ ఇవ్వకుండా. ఆ తండ్రి పెళ్ళిలో డమ్మీలా ఉంటాడు. ఇలా కిల్ అయిపోతుందీ పాత్ర


          పెళ్లి తర్వాత కూడా విజయ్ ఇంటికి భద్రత కల్పించుకోడు. పిల్ల పుట్టిన తర్వాత ఇక విజయ్ రెచ్చ గొట్టిన మంత్రే స్వయంగా వచ్చేసి ఒక్కొక్కర్నీ చంపడం మొదలెడతాడు. ఈ కాల్పులు పైన గదిలో  వున్న తల్లికి ఎందుకు వినపడవోగానీ, పైకెళ్ళి ఆమెనీ చంపేస్తాడు మంత్రి

        ప్రాణాలు వదుల్తూ- పిల్లని తీసుకుని దూరంగా వెళ్లి బతకమనీ, హింస వద్దనీ విజయ్ దగ్గర మిత్ర మాట తీసుకుందంటే, తప్పు తనదే నని ఆమె గ్రహించడం వల్లే. విజయ్ తో జీ వితం ఇలాగే  ఉంటుందని తెలిసీ పెళ్లి చేసుకుందామే. ప్రేమంటే ఆమెది. అలా తనని నమ్మి వచ్చిన ఆమెని కాపాడుకోలేని గొప్ప ఐపీఎస్ అధికారి విజయ్ దీ  ఒక ప్రేమేనా?

        ఆమె పెద్దమనసు చేసుకుని అలా  మాట తీసుకుందంటే, విజయ్ తప్పులన్నీ మాఫీ అయిపోయినట్టు కాదు -పిల్లని తీసుకుని జంప్ అవడానికి. ఆమె చివరి కోరిక తనకి ఎలిబీ అయిపోదు. తను నిజమైన మగాడైతే, తనవల్ల మృత్యు పాలైన అమాయకురాళ్ళు తల్లీ భార్యల ఆత్మలకి తను శాంతి చేకూర్చాల్సిన  బాధ్యత వుందని ఫీలయితే- అప్పుడే మంత్రిని చంపేసి పారిపోవాలి అజ్ఞాతంలోకి. అదీ పాత్రకి జస్టిఫికేషన్.


        అలా చేయలేదు. ఇక్కడ కూడా తెలివితక్కువగా  ఆలోచించాడు. ఎవ్వరి బూడిద కూడా దొరక్కూడదన్న మంత్రి ఆదేశంతో  విజయ్ కి ఓ క్రిమినల్ ఆలోచన పుట్టింది. తనుకూడా అందరితో కలిసి బూడిదయ్యాడని లోకం నమ్మాలన్న తెలివితక్కువ  ఆలోచన చేశాడు ( క్రిమినల్ ఆలోచనెప్పుడూ తెలివితక్కువదే).  ఆ తన చావుని ఫేక్ చేయడం ఆ మంత్రిని చంపే ఉద్దేశంతో కూడా కాదు- కేవలం భార్య కిచ్చిన  మాట ప్రకారం ఏ కేరళో పారిపోయి ఇంకో గుర్తింపుతో క్షేమంగా బతకాలని. ఇంత  తెలివి తక్కువ ఆలోచనతో కూతురితో పారిపోయి- తన తల్లీ భార్యల మృతదేహాలు సబబైన రీతిలో అంతిమ సంస్కారాలకి నోచుకోనివ్వకుండాగ్యాస్ సిలెండర్  పేలుళ్లో బూడిదయ్యే ఖర్మానికి వదిలేశాడు. ఇతణ్ణి ఓ హీరో క్యారక్టర్ అనాలా? ప్రేక్షకులు ఇతణ్ణి చూసి సానుభూతి చెందాలా?

        ప్రమాదంలో విజయ్ తో సహా కుటుంబంలో  అందరూ చనిపోయారని ప్రజలూ ప్రభుత్వమూ అందరూ నమ్మడం ఇంకో బడాయి. ఆ బూడిదని ఎనాలసిస్ చేస్తే ఎంత మంది చనిపోయారో తెలిసిపోతుంది. దర్శకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రేప్ కేసులో ప్రొఫెషనల్ గా, లాజికల్ గా, ఫోరెన్సిక్ రిపోర్టులూ వగైరా తెప్పించి హంగామాగా చర్చకి  పెట్టాడుగా- అదే లాజిక్ తో, అదే న్యాయంతో ఇక్కడ బూడిదని కూడా ఎందుకు ఎనాలిసిస్  చేయించ కూడదు? ఆ రేప్ కేసు రిపోర్టుల చర్చ కూడా చాలా పచ్చిగా వుంది. సెన్సార్ కట్ పడాల్సిన సీన్ ఇది.


        ఇలా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మంత్రికి ఛాలెంజి విసరడమే హాస్యాస్పదంగా వుంటే, మళ్ళీ ప్లాట్ పాయింట్ టూ దగ్గర తన కుటుంబాన్ని హతమార్చిన మంత్రిని వదిలేసి పారిపోవడం ఇంకా హాస్యాస్పదం. మంత్రిని తను రెచ్చ గొట్టడం, మంత్రి పిచ్చ కొట్టుడు కొట్టడం, మళ్ళీ మంత్రిని రెచ్చ గొట్టడం, మళ్ళీ మంత్రి పిచ్చ కొట్టుడు కొట్టడం...దీన్ని యాక్టివ్ పాత్రనాలా? పనికిరాని  పాసివ్ రియాక్టివ్ పాత్రనాలా? ప్లాట్ పాయింట్స్ రెండూ ఫెయిలయ్యాక ఇదొక కథేనా?

        ఈ ఎనాలిసిస్ తో తేలిందేమిటంటే ది మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్, న్యాయం అతడి పక్షానే వుందనివిజయ్ ఒక పచ్చి విలన్ అనీ


రన్నింగ్ స్టోరీ  కాన్సెప్ట్?
      రన్నింగ్ స్టోరీ -1 తో సినిమా ప్రారంభమే విచిత్రంగా, నవ్వొచ్చేట్టు వుంటుంది.  కేరళ మారుమూల రోడ్డు మీద వర్షంలో విజయ్ ఆగిపోయిన బైక్ బాగు చేస్తూంటాడు. కూతురు కొంత దూరంలో రోడ్డు పక్క నిలబడి వుంటుంది. ఒక కారు రయ్యిన పోవడంతో ఆమె మీద బురద చిమ్ముతుంది. అంతే, ఆ కూతురి ఆదేశంతో  ఇక విజయ్ ఆ కారుని ఛేజ్ చేస్తాడు. కొంత దూరంలో ఆపేసి కారతన్ని దిగమంటాడు. కారతను దిగి వర్షంలో  అలాగే నించుంటాడు. ఐదునిమిషాలు నిలబెట్టి- నీళ్ళల్లో తడవడమంటే ఎంత ఇబ్బందో అతడికి తెలియజేసి వెళ్లి పోమ్మంటాడు- ఇంకెప్పుడూ మనుషుల మీద బురద చిమ్ముకుంటూ వె ళ్ళొద్దన్న హెచ్చరికతో!

        వర్షం పడ్డప్పుడు, పడుతున్నప్పుడు, వాహనాలు బురద చిమ్ముకుంటూ వెళ్ళడం అత్యంత సహజం. పాదచారుల్ని మనిషి మనిషినీ  చూసుకుంటూ బురద చిమ్మకుండా వెళ్ళలేవు. మనుషులే జాగ్రత్త పడాలి. తండ్రి రోడ్డు దిగి బైక్ బాగుచేస్తూంటే కూతురు  రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు సీన్ ఓపెన్ చేయడమే తప్పు. ఆమెని కావాలని బురద మీద పడేట్టు అక్కడ నిలబెట్టాడు దర్శకుడు. పోనీ ఆ పిల్ల తెలీక అలా నిలబడిందనుకున్నా, ఆ తండ్రి అప్పుడేం చేయాలి- వర్షంలో రోడ్డు మీద అలా నించో వద్దమ్మాబురద చిమ్ముద్దనాలి. అలా అనకుండా రివర్స్ లో  కారతని మీదికే పెద్ద ఎమోషన్ తో వెళ్ళడం సిల్లీ. లాజిక్ లేకుండా ఎమోషన్ ఎలా పుడుతుంది?

        మొదటి సీన్లోనే దర్శకుడి  జీవితానుభవమెంతో  తెలిసిపోయాక, ఇక అడుగడుగునా కథతో అవస్థలే. ఈ రన్నింగ్ స్టోరీ అనేది కూడా ఒక కథే. దానికదే ఒక సపరేట్ కథ. ఇందులో విజయ్ కేదో అయ్యిందని కాదు, కూతురి కేం అవబోతోందన్న కథ. విజయ్ రెండు ఫ్లాష్ బ్యాకుల్లో కథ తినేశాడు. ఆ ఫ్లాష్ బ్యాకుల ఫలితమైన కొత్త జీవితం- ప్రాణి అయిన కూతురి కథ! రన్నింగ్ స్టోరీ కేవలం ఫ్రెష్ గా కూతురి జీవితం- భవిష్యత్తు గురించిన కథ! ఈ సెన్సే ఫీలవుతాం రన్నింగ్ స్టోరీలో. కానీ దర్శకుడికి ఈ లోతైన పాయింటే  తట్టదు. తండ్రికీ కూతురికీ మధ్య ఏవేవో సీన్లు వేసుకు పోతూంటాడు, అహింసని బోధిస్తూ


        ప్రారంభ సీన్లో కారతనికి బుద్ధి చెప్పాక- వెంటనే ఆ ఘనవిజయాన్నిపురస్కరించుకుని పాటఇది రొటీన్ గా అన్ని సినిమాల్లో వచ్చేదే. రన్నింగ్ స్టోరీ-1 లో ఇలా ఒకఘనవిజయం, పాట పెట్టినట్టు- మళ్ళీ పక్కనే ఫ్లాష్ బ్యాక్ -1 లో  డిసిపి విజయ్ గా ఇంకో ఘనవిజయాన్ని చూపించిమళ్ళీ పాట పెట్టేశాడు. ఇలా అరగంట వ్యవధిలో ఈ రిపిటీషన్ తో కథ అక్కడక్కడే తిరుగుతోందని కూడా గ్రహించినట్టు లేదు.


        ఇక పోలీస్ స్టేషన్లో జోసెఫ్ గా తెలిసిన హీరోని పోలీసు అధికారి విజయ్ కుమారూ!’  అని పిలిచి టెస్ట్ చేయడం ఎందుకు జరిగిందో అర్ధం కాదు. దాని కొనసాగింపు కూడా వుండదు. అంటే జోసెఫ్ ఎవరో ఆ అధికారికి తెలుసా? తెలిస్తే ఏం చేస్తున్నాడు పట్టుకోక? ఎందుకంటే, విజయ్ చావు ఒక పెద్ద స్కామ్తన చావుని అంత స్కామ్ చేసి వచ్చి బతుకుతున్న విజయ్ ని గుర్తు పడితే ఆ  అధికారి ఊరుకుంటాడా? కేవలం అతనలా పిలిస్తే ప్రేక్షకులు గొప్ప సస్పెన్స్ ఫీల్ అవుతారని చేసినట్టుంది- ఆ అధికారి పాత్ర గురించి ఆలోచించకుండా! ఇలా సరైన బేస్ లేకుండా ఉత్తుత్తి ఎమోషన్స్, సస్పెన్స్ లని ప్రేరేపించడాలు చాలానే వున్నాయి.

        ఇక విజయ్ తో బాటు కానిస్టేబుల్ కూడా ఎలా  అజ్ఞాతంలోకి వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ గా బతుకుతున్నాడో అర్ధంగాదు

        సౌండ్స్ అంటే కూడా గిట్టనట్టుంది- ఫ్లాష్ బ్యాక్ -2 లో మంత్రి వచ్చి చంపుతున్నప్పుడు పైగదిలో విజయ్ తల్లికి ఆ కాల్పుల మోతే వినబడనట్టు- ఇక్కడ కూడా పెంపుడు కుక్క గొంతు నొక్కేయడం. లోకల్ గ్యాంగ్ వచ్చి దాడి చేస్తున్నప్పుడు విజయ్ పెంపుడు కుక్క గ్యాంగ్ మీద పడి చెండాడ కుండా, కనీసం మొరగకుండా, పక్కన నిలబడి చోద్యం చూస్తున్నట్టు, ఆ పోరాటం మధ్య మధ్యలో షాట్స్ వేయడం చాలా చాలా హాస్యాస్పదం! కుక్క స్వభావాన్ని కూడా కిల్ చేశాడంటే ఏమనుకోవాలి మిస్టర్ అట్లీని? విజయ్ మాస్ ఫాలోయింగ్ వున్న స్టార్ కాబట్టిఆ ఫైట్ ని సింగిల్ హెండెడ్ గా అతడికే వదిలెయ్యాలా? కుక్క కూడా జోక్యం చేసుకోకూడదాకొంత క్రెడిట్ కుక్కకి పోతే భరించలేడా?- అన్నట్టే వుంది సీను!  


        ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు, అవతల టీచర్ ఏన్ గూగుల్లో సెర్చ్ చేస్తూంటుంది. ఇక్కడ ఈ సీన్ తో ఎంత అద్భుతం చేయ వచ్చో దర్శకుడు పట్టించుకోలేదు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఆమె గూగుల్ సెర్చి ఫలితంగా జోసెఫ్ డిసిపి విజయ్ అని తెలిసి ఫ్లాష్ బ్యాక్ – 1  ఒపెనవుతుంది.


        రన్నింగ్ స్టోరీ -3 ఫ్లాష్ బ్యాక్ -2 కి ప్రస్తుత కాలంలో కొనసాగింపు. ఇక్కడ మనకి తన అజ్ఞాతవాసానికి విజయ్ ఈ కేరళలో  ప్లేస్ ని ఎందుకు ఎంచుకున్నాడో, ఒకలాటి సెటప్ తో ఎందుకు బతుకుతున్నాడో అర్ధమవుతుంది. ఫ్లాష్ బ్యాక్ -2 లో, మంత్రి వచ్చి ఎటాక్ చేయక ముందు- విజయ్ భార్య మిత్ర తన కోరిక వెలిబుచ్చుతుంది- ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో నిర్జన ప్రదేశంలో పొదరిల్లు కట్టుకుని, ఫోనూ టీవీ లాంటి బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసుకుని, పెంపుడు కుక్కతో ఏకాంతంగా జీవించాలనీ ... 


        విజయ్ ఇలాగే బతుకుతున్నాడు. మారు మూల కేరళలో పొదరిల్లు..ఫోనూ టీవీ లేని ఇల్లు...పెంపుడు కుక్కా వగైరా...హౌ సిల్లీ! ఆమెని చేతులారా చంపుకుని, ఆమె కోరికని కాపీకొట్టి తను జీవించడం! ఇంట్లో ఆమె ఫోటో ఒక్కటి కూడా పెట్టుకోకుండా! అసలు హౌస్ సర్జన్ అయిన ఆమెకి డాక్టర్ కలలు లేవా...


        ఈ రన్నింగ్ స్టోరీ -3 ఎండ్ విభాగంలో చివరి దశ. మంత్రి స్కూల్ బస్సు మీద దాడి జరిపించి పిల్లల్ని బలిగొంటే  అందులో తన కూతురు కూడా పోయిందని ఘోరంగా ఏడుస్తాడు విజయ్. ఈ ఏడ్పుకి అర్ధం కన్పించదు. ఆనాడు  శత్రువుని వదిలేసి తను చావు నటించి పారిపోతే, కొడుకుని పోగొట్టుకున్న, శత్రు శేషం ఫీలవుతున్న ఆ మంత్రి ఎందుకు వూరుకుంటా డనుకున్నాడుకూతురి జీవితం కోసం హింస వద్దనుకున్నాను- అంటాడు మళ్ళీ విజయ్. యాక్షన్ కథకి ఒక హీరోగా తన భార్యని, తల్లినీ  చంపిన శత్రువుని అంతమొందించాలని, లేకపోతే  ప్రేక్షకులు వెలితి ఫీలవుతారని  అతడి బుర్రకే  తట్టడం లేదు.


        ఇక ఇప్పుడు తప్పదనుకున్నట్టు మంత్రిని చంపడానికి బయల్దేరతాడు. చచ్చిపోయిన విజయ్ ఆత్మలా. తన వాళ్ళ ఆత్మలకి  శాంతి చేకూర్చలేదు గానీ, ఇప్పుడు పెద్ద ఆత్మలా బయల్దేరాడు. ఒక్కొక్కర్నీ చంపుతూంటే సంచలనం - విజయ్ ఆత్మ పగ దీర్చుకుంటోందని. కేరళలో విజయ్ కుమారూ!’ అని పిలిచిన పోలీసు అధికారి ఏంచేస్తున్నాడో


        ఈ మొత్తం కథకి, కథ పేరుతోదర్శకుడు ఆడుతున్న నాటకాలకి, ఈ ఒక్క డైలాగు దెయ్యంలా వెంటాడుతోందిఅయితే దెయ్యం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోదు, పొడుస్తూనే వుండడం దాని జాతి లక్షణం- విజయ్ కుమారూ!’ అని. ఆ పోలీసు అధికారి యాక్టివేట్  అయితే విజయ్ కుమార్ కథే వుండదు


        ఆఖరికి మంత్రిని చంపుతూ- ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి  సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల  పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది ఇలాటి  తండ్రుల్నే అనీ చెప్పి చంపుతాడు


        నిజానికి ఐదేళ్ళ క్రితం ఇంటర్వెల్లోనే  ఈ మాట చెప్పి చంపాలి. సంఘటన జరిగిన ఐదేళ్లకి మెసేజ్ ఇస్తున్నాడు. ఈలోగా ఇంకెంత మంది కిమినల్స్ ని అలాటి తండ్రులు తయారు చేసి వదిలారో!


        దీని తర్వాత పై అధికారి ఇతను ఆత్మ కాదనీ, విజయ్ కుమారే అని గుర్తించి మ్యాచ్ ఫిక్సింగ్  చేసుకుంటాడు- నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూంటా, నువ్విలాగే దెయ్యంలాగే క్రిమినల్స్ ని చంపుతూ వుండమని


        ఇలా ముగుస్తుంది కథ! కేరళలో  విజయ్ కుమారూ!’  అనే పోలీసు అధికారి వున్నాడు కాబట్టేమో, అక్కడ్నించీ లడఖ్ కి మకాం మార్చేస్తాడు కూతురితో, టీచరుతో. ఫోన్ రాగానే ఆత్మలా బయల్దేరరతాడు క్రిమినల్ని చంపడానికి. ప్రతీ సారీ ఎక్కడో లడఖ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిపోతూంటాడా చంపడానికి? చెన్నైలో దర్శకుడి ఇంట్లోనే  ఉండొచ్చుగా. ఎంత మంది విజయ్ కుమారూ!’  అన్నా దర్శకుడే బాగా కాపాడతాడు


        ఈ కథలో మిత్ర తండ్రి, చెల్లెలు, మేనత్త మయ్యారో అయిపుండరు. ఫ్లాష్ బ్యాక్ -2, రన్నింగ్ స్టోరీ మూడు పార్టుల్లో ఎక్కడా కనపడరు. వీళ్ళని తురుపు ముక్కలా వాడుకుని రొటీన్ బాషాఫార్మాట్ ని  బాద్షాలా రధం ఎక్కించవచ్చని దర్శకుడి నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది...


అక్బర్స్ జాబ్
        ప్రముఖ పాత్రికేయుడు  ఎంజె అక్బర్ ప్రారంభంలో సండే’  మేగజైన్ కి సంపాదకత్వం వహిస్తున్నప్పుడు, విలేఖర్లు పంపే వార్తా కథనాలని మొత్తం తిరగ రాసేవాడు. వార్తా కథనాల శైలిని, భాషనీ అక్బర్ తిరగ రాతల్లోంచి నేర్చుకునే వాళ్ళు విలేఖర్లు. ప్రస్తుతం కేవలం క్యారక్టర్ వల్ల ఇంత  లోపభూయిష్టంగా తయారైన పోలీస్కథని మనం కూడా అలా ఓసారి తిరగ రాసి రేపు చూద్దాం...


-సికిందర్
cinemabazaar.in