రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 31, 2026

1445 : రైరర్స్ స్పెషల్

 

“హల్లో హల్లో...” ఫోన్లో వాయిస్...”ఎస్?” ... “మీదగ్గర ఆర్గానిక్ స్టోరీ ఏమైనా వుందా?” ... “ఆర్గానిక్ స్టోరీ అంటే ఏంటి?”...అవతల నిశ్శబ్దం... “హల్లో హల్లో...” ఫోన్లో ఇంకో వాయిస్... “ఎస్?” ... “హీరో మేనేజర్ కి స్టోరీ వినిపిస్తే ఆర్గానిక్ గా వుండాలని అంటున్నాడు సార్” ... “ఆర్గానిక్ అంటే ఏంటి?”...అవతల నిశ్శబ్దం... “హల్లో హల్లో ...” మరింకో వాయిస్... “ఎస్? ఆర్గానిక్ కావాలా?”... “ఎస్సార్!”... “ఏం వ్యవసాయం మీది?”... “అర్ధం కాలేదు సార్”... “పంటలకి ఆర్గానిక్ ఎరువులు వాడుతున్నారా?” ...నిశ్శబ్దం...మెల్లిగా, “సినిమాలకి వాడదామనీ...ఆర్గానిక్ వాడితే ట్రెండ్ లో వుంటామని అంటున్నారు కదా...”

ఇదీ వరస! ‘Water, water everywhere and not a drop to drink’ అని కొలెరిడ్జ్ రాసిన ఫేమస్ పోయెంని పేరడీ చేస్తే,  ‘Organic, organic everywhere, but no one knows what it means!’ లాగా తయారయింది పరిస్థితి.

"నీరు, నీరు, అంతటా నీరే, కానీ తాగడానికి ఒక్క చుక్క కూడా లేదు" అంటే కొలెరిడ్జ్  ఉద్దేశంలో ... ఒక నావికుడు ఆల్బట్రాస్ పక్షిని చంపిన తర్వాత, సముద్రం మధ్యలో గాలి లేని ఓడలో కొంతమంది నావికులు చిక్కుకుపోతారు. విచిత్రం ఏమిటంటే, వాళ్ళ చుట్టూ మైళ్ళ కొద్దీ సముద్రపు నీరు ఉన్నప్పటికీ, అది ఉప్పగా ఉండడం వల్ల తాగలేరు, తాగితే దాహంతో చచ్చితారు.

 మనకి  అపార వనరులు ఉన్నప్పటికీ, వాటిలో ఏదీ ఉపయోగపడకుండా, శుభ్రంగా లేకుండా, నిరాశాజనకంగా వున్న పరిస్థితిని వివరించడానికి ఈ రోజుల్లో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తున్నాం.

నాలెడ్జి వున్న వాడికి యాక్షన్ వుండదు, యాక్షన్లో వున్న వాడికి నాలెడ్జి వుండదు.  ఎక్కడైనా సినిమా ఫీల్డు స్టయిలిదే. రెండు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మానైతే, హాలీవుడ్ లో ఎవ్వరికీ ఏమీ తెలీదనేశాడు! సినిమాల్లో ఏది ఎందుకు ఎలా తీశారనే దానికి అర్దాలూ తాత్పర్యాలూ వెతికి విశ్లేషణలు రాసి తెలియజేసే వర్గమొకటి వుంది. ఈ  వర్గం హాలీవుడ్ నుంచి వెలువడే వందలాది స్క్రీల్ ప్లే వెబ్ సైట్స్ లో అదే పనిగా రాసి ప్రపంచం మీదికి వదుల్తూ వుంటుంది.  హాలీవుడ్ నుంచి తప్ప ఇంకెక్కడ్నుంచీ ఇలాటి కంటెంట్ రాదు. ఇంగ్లీషు తెలియకపోతే, గూగుల్ లో ట్రాన్స్ లేట్ నొక్కితే తెలుగులో వచ్చేస్తుంది. లేదా చాట్ జిపిటి నడిగితే చెప్పేస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అరచేతిలో కాదు, నోటికే అందించేస్తోంది టెక్నాలజీ- చార్లీ చాప్లిన్ నటించిన ‘మోడరన్ టైమ్స్’ లో- కార్మికులు  లంచ్ బ్రేక్ పేర టైం వేస్ట్ చేయకుండా, పని చేస్తున్న చోటే నోటికి తిండిని అందించే ఆటోమేటిక్ ఫీడింగ్ మెషీన్ చాప్లిన్ ని ఎంత హింసించిందనేది వేరే విషయం, కామెడీ.

 2. ఆల్రెడీ ఆర్గానిక్ వుంది!

    ఇంతకీ ఆర్గానిక్ గా కథ చెప్పడమంటే ఏమిటి? జెర్సీ (2019) లో 36 ఏళ్ళ వయసులో మళ్ళీ క్రికెట్‌లోకి రావాలని ప్రయత్నించే ఓ విఫల క్రికెటర్ కథ ఇది. ఇందులో భావోద్వేగాల ఉధృతి కమర్షియల్ గా ప్రభావం చూపిస్తూ, దాన్ననుసరించి సాగే కథనం చాలా సేంద్రీయంగా (అంటే ఆర్గానిక్ గా) వుంటుంది. ఆర్థిక ఇబ్బందులు, భార్యతో సంబంధాలు, ఆరోగ్య సమస్యలూ  వంటి ప్రతీ సంఘర్షణ కారకం అతడి పట్టుదలలోంచి, ఆత్మగౌరవం లోంచీ దశలవారీగా సహజంగా వచ్చేస్తుంది. ప్రేక్షకుల చేత బలవంతంగా కన్నీళ్ళు తెప్పించే  కృత్రిమత్వం వుండదు. ప్రతీ  భావోద్వేగం అతడి స్వానుభవంలోంచి,  సంఘర్షణలోంచి పుట్టి, జీవితానికి దగ్గరగా ఆడియెన్స్ ఫీలయ్యేట్టు కథనాన్ని చేసుకు పోతూంటుంది.

బలగం (2023) కుటుంబంలో  పెద్ద కర్మ నేపథ్యంలో సాగే కథ. ఇందులో కుటుంబంలో అహంకార ఘర్షణలు, అంతర్గత ఉద్రిక్తతలు, చివరికి వీటి సర్దుబాటూ మొదలైనవి సేంద్రీయ ప్రవాహంతో సాగుతాయి. మానవ మనస్తత్వానికి దగ్గరగా వుండే పాత్రచిత్రణలు, లోపాలు, చిన్నచూపూ వంటి వికారాలు చివరికి ఆప్యాయతానురాగాలతో ముగుస్తాయి.

నిజం చెప్పాలంటే రియలిస్టిక్ కథలే కొంచెం తేడాతో ఆర్గానిక్ కథలు. కమర్షియల్ సినిమాల్లో రియలిస్టిక్ కథనం ఎబ్బెట్టుగా వుంటుంది. ఉదాహరణకి ఎన్టీఆర్ నటించిన అశోక్. ఇందులో సెకండాఫ్ కథనంలో వాడిన ఫ్రెంచి న్యూవేవ్ టెక్నిక్ వల్ల కథ కమర్షియల్ స్వభావాన్ని కోల్పోయి ఫ్లాపయ్యింది. పైగా ఎన్టీఆర్ పాత్ర యాక్టివ్ పాత్ర కాదు,  పాసివ్ పాత్ర కూడా కాదు- పాసివ్ రియాక్టివ్ పాత్ర. ఇలాటి పాత్రతో రియలిస్టిక్ లేదా ఆర్ట్ సినిమా వర్కౌట్ అవుతుందేమో గానీ కమర్షియల్ సినిమా కాదు.

కానీ కమర్షియల్ సినిమాకి ఆర్గానిక్ కథనం చక్కగా చేయొచ్చు. చెయ్యాలి కూడా. ఇదే జెర్సీలో చేశారు. ఆర్గానిక్  కథనం అంటే  పచ్చి వాస్తవికత అని అర్థం కాదు. ఒక ఫాంటసీ సినిమా, కమర్షియల్ యాక్షన్ సినిమా లేదా రూరల్ డ్రామా అన్నీ ఆర్గానిక్ గా వుండొచ్చు. వుండి తీరాలి కూడా. ఎందుకు? ఎందుకంటే, ఎప్పుడో దశాబ్దాల నుంచీ త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో క్యారక్టరైజేషన్ కి సంబంధించి ఉత్ప్రేరకాలుగా ఫలానా ఈఈ ఎలిమెంట్స్ వుండాలని పండితులు చెబుతూ  వస్తున్నది- ఆర్గానిక్ కథనాన్ని దృష్టిలో పెట్టుకునే! ఆర్గానిక్  కథనానికి బీజం త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో ఎప్పుడో వేసేశారు. ఇది అర్ధం జేసుకోవడం లేదు. వంద సార్లు శివ సినిమా చూపించినా బోధపడట్లేదు. తీరా సినిమా ఫ్లాపైతే శివ శివా అనుకోవడమే!

3. పుట్టుక, నడక
    కథలో ఆర్గానిక్ కథనం ఎక్కడ్నుంచి, ఎలా పుడుతుంది? సింపుల్. కథలో వచ్చే ప్లాట్ పాయింట్ వన్ అనే మొదటి మలుపులో పాత్రకి కాన్ఫ్లిక్ట్ ఎదురైనప్పుడు- అప్పటికే పాత్రలో ఈ నాలుగు  ఎలిమెంట్లకి (గోల్ ఎలిమెంట్స్) తగ్గ ఇంధనం లోడ్ అయి వుండాలి : కోరిక, పణం, పరిణామాల హేచ్చేరిక, భావోద్వేగాలు. కోరిక ఏమిటి? కాన్ఫ్లిక్ట్ ని ఎదుర్కొని అనుకున్నది సాధించడం. ఈ కోరికేమిటో స్పష్టం కావాలి. పణం ఏమిటి? ఆ కోరికని సాధించడానికి దేన్ని పణంగా పెడుతోంది పాత్ర- జీవితాన్నా? కుటుంబాన్నా? సమాజాన్నా? దేశాన్నా? ఇది కూడా స్పష్టం కావాలి. ఈ రిస్కు తీసుకుంటున్నందుకు తలెత్తే పరిణామాలు ఎలా వుండబోతున్నాయి? సన్నిహితుల్లో ఎవర్నయినా కోల్పోతుందా? తన ప్రాణాలే పోయే పరిస్థితి వుందా? ఇంకే ప్రమాదాన్ని ఎదుర్కోబోతోంది పాత్ర? దీనికి సంబంధించిన విషయం కూడా అప్పటికే సూచనాప్రాయంగా కథలో ఏర్పాటయి వుండాలి. ఇవన్నీ కలిసి పాత్రకి బలమైన భావోద్వేగం పుట్టేట్టు చేయాలి. ఈ భావోద్వేగమే మొత్తం కథనంతా బలంగా నడిపిస్తుంది.

అంటే, పాత్ర అంతర్గత కారణాలతో సంబంధముండే కథనమన్నమాట. అంతర్గత కారణాలతో పాత్ర డ్రైవ్ చేసే కథనమే సహజసిద్ధ సేంద్రీయ (ఆర్గానిక్) కథనమన్న మాట. రైటర్ గారికి పాత్ర అంతర్గత కారణాలు తెలియకపోతే కథనం చేలో పడ్డ గుడ్డెద్దు లాగా అక్కడక్కడే తిరుగుతుంది. ఎన్ని సినిమాల్లో సెకండాఫ్ లో ఇది చూడ్డం లేదు. పాత్ర దాని కథని దాని అంతర్గత కారణాలతో దాన్ని నడుపుకోనివ్వాలి. రైటర్ తన కారణాలు పాత్ర మీద రుద్దితే ఆ పాత్ర పాసివ్ పాత్ర అవడమే గాక, కథనం బాక్సాఫీసుకి ప్రమాదకరంగా మారుతుంది.

శివలో నాగార్జున పాత్ర కోరిక మాఫియాని అంతమొందించడం. ఇందుకు పణంగా అన్న కుటుంబాన్నే పెడుతున్నాడు. దీని పరిణామాల హెచ్చరికగా అన్న కూతురి ప్రాణాలకి ముప్పు పొంచి వుంది. ఈ భావోద్వేగాలతో కట్టి పడేస్తూ పాత్ర దాని నిర్ణయాలు అది తీసుకుంటూ, దాని వ్యూహాలు అది రచించుకుంటూ, దాని పోరాటం అది చేసుకుంటూ పోతోంది. డేంజరస్ సిట్యుయేషన్ లోలేని పాత్రతో ఏం కథనం, ఏం కథ!

ఇమాజినేషన్ ఈజ్ రియాలిటీ అన్నాడు నెవెల్ గోడార్డ్. మనసులో ఇమాజిన్ చేయకపోతే బయట ఏదీ సృష్టి జరగదు. అంతర్గత కారణాలతో పాత్ర మనసులో ఇమాజిన్ చేయకపోతే బయట కథనాన్ని సృష్టించలేదు!

రైటర్ చేయాల్సింది ఆ పాత్ర మనసులోకి దూరి చూడడమే. ఇలా ఆర్గానిక్ కథనంతో స్ట్రక్చర్ ఎప్పుడో ఏర్పాటై వుంది. ఇప్పుడు ఇదేదో కొత్త ట్రెండ్ అనుకుని ఆర్గానిక్...ఆర్గానిక్ ...అని ఆవురావురంటున్నారు. ఒక కోడైరెక్టర్  ప్రముఖ హీరో మేనేజర్ కి కథ వినిపిస్తే, ఆర్గానిక్ గా వుండాలన్నాడు. ఆర్గానిక్ గానే వుందని ఎంత విశ్లేషించి చెప్పినా, లేదు మార్చాలంటాడు.  ఎలా మార్చాలో చెప్పమంటే చెప్పేది లేదు. ఇందుకే ముందు ఆర్గానిక్ స్టోరీ టెల్లింగ్ అంటే ఏమిటో తెలుసుకుని కథలు వింటే కొట్లాటలు తప్పుతాయి.

-సికిందర్


Sunday, October 4, 2026

1444 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : జేసన్ సంజయ్
తారాగణం : సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, మఘలక్ష్మీ సుదర్శనన్, శివ్ పండిట్, శీలా రాజ్‌కుమార్ తదితరులు
సంగీతం : ఎస్ థమన్, ఛాయాగ్రహణం :  కృష్ణన్ వసంత్, కూర్పు : కేఎల్ ప్రవీణ్, కళ : బెంజమిన్ మిలన్
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : ఏ సుభాస్కరన్
విడుదల : అక్టోబర్ 2, 2026
***
తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేశాడు. తొలి ప్రయత్నంగా ట్రెజర్ హంట్ –హీస్ట్ జానర్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ని తెరకెక్కించాడు. హీరో సందీప్ కిషన్ కి మూడున్నర గంటలు ఈ కథ చెప్పి ఇంప్రెస్ చేసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. ఫరియా అబ్దుల్లాని  హీరోయిన్ గా తీసుకుని,  ప్రసిద్ధ లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ సుభాస్కరన్ నిర్మాతగా సినిమా పూర్తీ చేసి ఈ రోజు గాంధీ జయంతి నాడు తమిళ- తెలుగు భాషల్లో విడుదల చేశాడు. మరి దళపతి వారసుడిగా సినిమా తీసి సక్సెస్ అయ్యాడా? తన బలాలు, బలహీనతలు ఏమిటి? ఇవి తెలుసుకుందాం...

కథేమిటి? 
గురు అలియాస్ సిగ్మా (సందీప్ కిషన్) ఒక ఆర్జేగా పనిచేస్తూనే ట్రెజర్ హంటర్‌గా నిధుల వేట సాగిస్తూంటాడు. టాడు. అతడి తల్లి దాచిపెట్టిన నిధి కోసం  కూడా వేటాడుతూంటాడు. మరోవైపు  ఆర్జే (రేడియో జాకీ) గా పనిచేసే సామ్ (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయితో రోమాన్స్ సాగిస్తూంటాడు. ఇలావుండగా, అక్రమ వ్యాపారాలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ మొదలైన నేర కలాపాలతో భారీ సామ్రాజ్యాన్ని నడిపే మాఫియా లీడర్ వీర శంకర్ రెడ్డి (సంపత్ రాజ్) తో, 500 కోట్ల ఒక డీల్ విషయంలో సిగ్మా పోరాడాల్సి వస్తుంది.  ఈ  500 కోట్ల డీల్ ఏంటి?  విదేశీ బ్యాంకు లాకర్ లో దాచిన ఈ డబ్బుని దోచుకునే  పథకాన్ని ఎలా అమలు చేశాడు? తన తల్లి కోరిక ఏమిటి? తల్లి జ్ఞాపకార్ధం తను చేసిన మేలేమిటి? ...ఈ  ప్రశ్నలకి సమాధానమే మిగతా ఈ సినిమా కథ.

 

ఎవరెలా చేశారు?
పదహారేళ్ళుగా సినిమాలు నటిస్తున్న సందీప్ కిషన్ ఈ కథ మూడున్నర గంటలు విని థ్రిల్ అయినట్టు చెప్పడం చూస్తే, గాంధీ జయంతికి గాంధీగారు పకపకా నవ్వేసి వుంటారు. 24 ఏళ్ళ యువదర్శకుడు జేసన్ సంజయ్ ఏనాటిదో తను పుట్టనప్పటి పాత తరహా సినిమాలో సందీప్ కిషన్ ని ఎలా చూపించ కూడదో అంత చాదస్తంగా చూపించి సందీప్ కి సరిజోడీ అనిపించుకున్నాడు.  సందీప్ కామెడీ, రోమాన్స్, యాక్షన్ అన్నిటా హాస్యాస్పదంగా కనిపిస్తూ పాత్రకి చేయాల్సిన డ్యామేజీ అంతా చేసేశాడు. సినిమానే నీరసంగా వుంటే తనెలా ఉత్సాహంగా వుంటాడు. మదర్ సెంటిమెంటు, లవర్ తో రోమాన్స్, ఆర్ధిక కష్టాలు – వీటితోనే ఫస్టాఫ్ బారుగా సాగుతుంది. ఇంతలో ఇంటర్వెల్లో మాత్రం కథ యాక్షన్లో కొచ్చి, తనుకాస్త ఇరగదీసి మాస్ హీరో అనిపించుకునే అదృష్టానికి నోచుకుంటాడు.

ఇక సెకండాఫ్ ఎత్తుకున్న భారీ కథ గురించి గానీ, పాత్ర గురించి గానీ చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ వుండదు. పాత సినిమాల పద్ధతిలోనే ఫైట్లు కూడా వుంటాయి. 500 కోట్ల రూపాయల దోపిడీ పథకానికి కావాల్సిన తాళాల గుత్తి కథ బాక్సాఫీసుని కూడా తెరవకుండా చేస్తుందని తెలుసుకోకపోడం అసలు సమస్య. పైగా అంత బిల్డప్ ఇచ్చిన విలన్, హీరో వీక్ గా వుంటే మనకెందుకులే అని చేతులు ముడుచుకుని కూర్చున్నట్టు అన్పించడం, దాంతో క్లయిమాక్స్ పిల్లలాటతో సమానంగా సాగడం సిగ్మాకి ఒక స్టిగ్మా (మచ్చ). సందీప్ కిషన్

ఇక హీరోయిన్ ఫరియా అబ్డులాకి వున్నదే కాసేపు కనిపించే పాత్ర. అందులో ఎం చేసిందో ఆమెకే తెలీదు. ఆ కాసేపు చలాకీగా కనిపించి, కొంత కామెడీ చేసి తన రెమ్యూనరేషన్ ప్యాకేజీ తను తీసుకుని వెళ్ళి పోయింది. వెళ్ళిపోవడమే మంచిదైంది- రోమాన్స్ మీద (తన మీద) దృష్టి పెట్టని సందీప్ కిషన్ కి హీరోయినెందుకసలు? 

ఇక విలన్లు సంపత్ రాజ్, శివ్ పండిట్లు తాము చేసిన విలనీ ఏంటో వాళ్ళకే తెలియాలి. పాతకాలం సినిమా కాబట్టి ఆ కాలంలో కొత్తగా వచ్చిన తాము ఏం చేయగలిగారో అదే చేసేసి ప్యాకేజీతో వెళ్ళిపోయారు. అసలీ సినిమాలో ఏ పాత్రకీ ఇంకో పాత్రతో సంబంధమే వుండదు. కొట్టొచ్చినట్టు కన్పించే సంబంధం ఒకటే- ఈ  యువదర్శకుడు సూపర్ స్టార్ దళపతి విజయ్ కి తనయుడనే!

సాంకేతికాల సంగతి?
తమన్ సంగీతం, నేపథ్య సంగీతం కొన్ని చేజ్, హీస్ట్ సన్నివేశాల్ని వేగంగా పరిగెత్తించే పనిని విజయవంతగా చేసినా, సడెన్ గా వచ్చే ఒక ఐటెం సాంగ్ యువదర్శకుడి పాత టేస్టుకి కూడా న్యాయం చేయాలి కాబట్టి ఆ మేరకు తమన్ కష్టపడ్డాడు. కృష్ణన్ వసంత్ కెమెరా పనితనం రిచ్ అండ్ స్టైలిష్ లుక్ ఇవ్వడం,  ప్రవీణ్ ఎడిటింగ్ హీస్ట్ సన్నివేశాల్లో మాత్రం పదునుగా వుండడం సాంకేతికులు వెనుకబడి లేరని రుజువు చేస్తాయి. వెనుకబడింది యువదర్శకుడే.

చివరికేమిటి?
24 ఏళ్ళ యువ దర్శకుడి మొదటి ప్రయత్నాన్ని మరీ ఇంతగా విమర్శించకూడదు. కానీ జేసన్ సంజయ్ అమెరికా వెళ్ళి దర్శకత్వం కోర్సు చేసి వచ్చాడు. అమెరికాలో ఇలా తమిళ/తెలుగు పాత మూస టెంప్లెట్ సినిమాలు తీయడం నేర్పుతున్నారా? ఇదీ మనకొచ్చే సందేహం. అమెరికా వెళ్ళినా ఇదే టాలెంటుతో తిరిగి వచ్చాడంటే, ఇక రేపు ఇంకెన్ని ఇలాటి సినిమాలు తీస్తాడోనని భయం పుట్టడం సహజం. సినిమా అని చెప్పడానికి వీల్లేని కథా కథనాల్ని, పాత్రల్ని, దర్శకత్వాన్నీ తన ఈడు యువప్రేక్షకుల మీద రుద్దడమంటే –తనేం చేస్తున్నాడో తనకే తెలీని పసితనమన్న మాట.  గాంధీ జయంతికి గాంధీగారు ఈ ఏమీ తెలీని పసివాణ్ణి క్షమించి, తెలియక సినిమాకెళ్ళే ప్రేక్షకుల్ని రక్షించు గాక!

-సికిందర్