రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, జనవరి 2023, గురువారం

1285 : స్పెషల్ న్యూస్!


థియేటర్ యాజమాన్యాలు సినిమా హాళ్ళలో బయటి ఆహారాన్ని అనుమతించ కూడదనే సుప్రీం కోర్టు తీర్పు మల్టీప్లెక్స్ కంపెనీలకి పెద్ద ఉపశమనమే. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పుతో సమస్య చుట్టూ వున్న అస్పష్టత తొలగిందని మల్టీప్లెక్స్ గ్రూపులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కాశ్మీర్ లో ప్రారంభమయిన ఈ తినుబండారాల రగడ ఢిల్లీలో కొలిక్కి వచ్చింది. మల్టీప్లెక్సులు తినుబండారాలనబడే ఫుడ్ అండ్ బెవరేజీ (ఎఫ్ బి) విక్రయాల ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్నాయి. టికెట్ రేట్ల కంటే ఎఫ్ బి ధరలు రెట్టింపు వున్నా భరిస్తున్నారు ప్రేక్షకులు.

        సినిమా హాలు అనేది హాలు యజమాని ప్రైవేటు ఆస్తి కాబట్టి, ఆహార విక్రయానికి సంబంధించిన నిబంధనల్ని నిర్దేశించే హక్కు యజమానికి వున్నందున, వారి సొంత ఆహార పానీయాలని విక్రయించే హక్కు వారికి వుందని, జనవరి 3 తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రేక్షకులకిది తప్పనిసరేం కాదనీ, ఇష్టం లేకపోతే వాటిని కొనుగోలు చేయనవ
సరం లేదనీ స్పష్టం చేసింది.
        
బంగారం అమ్మినట్టు 30 గ్రాములు (మూడు తులాలు) పాప్ కార్న్ 100 రూపాయలకి అమ్మే మల్టీప్లెక్సుల ధరాపాతంపై వినియోగదారులు కోర్టు కెక్కలేదు. మల్టీప్లెక్స్ కంపెనీల మొత్తం రాబడిలో 25 నుంచి 35 శాతం వాటా ఎఫ్ బీదే. లాభాల్లో 45 శాతం వాటా ఎఫ్ బీదే. వినియోగదారులు ధరలపై కాక, బయటి ఆహారాన్ని అనుమతించాలని  వివిధ రాష్ట్రాల్లో చాలా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటినీ కూడా క్లబ్ చేసి విచారించింది సుప్రీం కోర్టు.
        
అయితే థియేటర్లలో ఎక్కువ ధరలకి పాప్ కార్న్ అమ్మడం అనేది థియేటర్ యజమానులకీ, సినిమా ప్రేక్షకులకీ మధ్య నలుగుతున్న వివాదమే. చాలా మంది ఇప్పటికీ సినిమాహాళ్ళలో, ముఖ్యంగా టాప్ మల్టీప్లెక్సుల్లో ఖరీదైన ఆహారానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వున్నారు. ప్రస్తుతం టాప్ మల్టీప్లెక్సుల్లో పాప్‌కార్న్ టబ్ ధర 350 నుంచి 450 రూపాయలుంది. దీనికి 150 నుంచి 350 మధ్య వుండే కూల్ డ్రింక్ ని కలిపితే, ఇద్దరు వ్యక్తులకు పన్నులతో కలిపి రూ. 1,000 కి తక్కువ కాకుండా నడ్డివిరిచే వడ్డన!
        
టాప్ మల్టీప్లెక్సులు పీవీఆర్, ఐనాక్స్ కంపెనీలు తమ మొత్తం  రాబడిలో 25 నుంచి 35 శాతంగా వుంటున్న ఎఫ్ బి వాటాని ఇంకో మూడు శాతం పెంచే దిశగా యోచిస్తున్నాయి. 2020 ఆర్దిక సంవత్సరంలో పీవీఆర్ ఎఫ్ బి అమ్మకాల ద్వారా రూ. 960 కోట్లు ఆర్జించింది. ఇది మునుపటి సంవత్సరం రూ. 858 కోట్లుగా వుంది. ఐనాక్స్ 2019 లో రూ. 436 కోట్లు, 2020లో రూ. 497 కోట్లు ఆర్జించింది. ఇలావుండగా గత సంవత్సరం ద్రవ్యోల్బణ వొత్తిడి కారణంగా 10-20 శాతం వరకూ ధరల్ని పెంచాయి కూడా.

అసలు ప్రేక్షకుల సినిమా వీక్షణానుభవాన్ని మధురానుభూతిగా మల్చడానికి అయ్యే ఖర్చులో థియేటర్ నిర్మించడానికి భారీ మొత్తంలో మూలధనం, విద్యుత్ ఖర్చులతో పాటు, అద్దె ఖర్చులు, సిబ్బంది ఖర్చులూ వుంటున్నాయి. థియేటర్ నడపడానికి నిర్ణీత వ్యయం భారీగా వుంటుంది. వ్యాపారంలో సాధారణ అస్థిరత కారణంగా, ఏ సినిమాలు ఆడతాయో, ఏ సినిమాలు ఆడవో అన్నదానిపై ఆధారపడి ఆదాయ సముపార్జన వుంటుంది. పైగా ఎఫ్ బి అమ్మకాలకి సినిమాలకొచ్చే వ్యక్తులు మాత్రమే వినియోగదారులు.

థియేటర్‌ని నడపడం అనేది ప్రత్యేకంగా లాభదాయకమైన వ్యాపారం కాదనేది ఈ కంపెనీల అభిప్రాయం. అందువల్ల ఎఫ్ బి అందించే వ్యాపారం మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. కంపెనీలకి భారీగా వ్యయమయ్యేది సినిమాలపైనే. బాక్సాఫీసు వసూళ్ళలో 42-45 శాతం వరకూ నిర్మాతలకి లేదా పంపిణీ దారులకి చెల్లించాల్సి వుంటుంది. అందువల్ల సినిమా ప్రదర్శనా రంగం ఆహార పానీయాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై చాలా ఆధారపడి వుందని, టిక్కెట్ అమ్మకాలు మాత్రమే నిర్వహణ ఖర్చుల్ని కవర్ చేయవనీ అంటున్నారు.

సినిమా హాళ్ళు పది సంవత్సరాల క్రితంతో పోల్చినప్పుడు ఎఫ్ బి సెగ్మెంట్ లో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్నాయనీ, సినిమా హాళ్ళలో బయటి ఆహారాన్ని అనుమతించినట్లయితే ఈ పెట్టుబడి అంతటికీ అర్ధం వుండదనీ విశ్లేషిస్తున్నారు.

నిజమే, హోటల్ కెళ్ళినప్పుడు అక్కడి ఫుడ్డే తింటున్నప్పుడు, సినిమాకెళ్తే అక్కడి స్నాక్స్ తినడానికి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఫీలవడమెందుకు? కోర్టుల కెక్కడమెందుకు? మహేష్ బాబు కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్లో 120 రూపాయలకి రెండు ఇడ్లీలు తినడానికి అభ్యంతరం చెప్పడం లేదుగా?

ఇదంతా కాశ్మీర్లో మొదలైంది

2018 లో థియేటర్లలోకి సినిమా ప్రేక్షకులు సొంతంగా ఆహారం, నీరు తీసుకెళ్ళ డాన్ని నిషేధించరాదని జమ్మూ కాశ్మీర్  హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు జులై 18న ఆదేశాలు ఈ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాఋ. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తి  పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం,  జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని  తోసిపుచ్చింది. జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు తీర్పుని సమర్థిస్తే, ఇక ప్రేక్షకులు థియేటర్ లో నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగుతారని, జిలేబీ తిని వేళ్ళని సీటుకి తుడుస్తారనీ, తందూరీ చికెన్ ఆరగించి ఎముకలు సీట్లో వేస్తారనీ... ఇదంతా ఎవరు క్లీన్ చేయాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చురకలేశారు.
        
సినిమా హాలు అనేది హాలు యజమాని ప్రైవేటు ఆస్తి కాబట్టి, ఆహార విక్రయానికి సంబంధించిన నిబంధనల్ని నిర్దేశించే హక్కు యజమానికి వున్నందున, వారి సొంత ఆహార పానీయాలని విక్రయించే హక్కు వారికి వుందని పేర్కొంటూ ధర్మాసనం ఈ వివాదానికి తెరదించింది.
        
దాదాపూ 1970 ల వరకూ సినిమా హాళ్ళల్లో పొగత్రాగుట నిషేధం కాదు. లేడీస్ కి అస్సలు అభ్యంతరం కాదు. అదొక సమస్యే కాదు. థియేటర్ నిండా ఆ పొగ మేఘాల్లోనే సినిమాలు చూసి ఆనందించేవారు. సినిమాల్లో కూడా యదేచ్ఛగా పొగత్రాగే దృశ్యాల చిత్రీకరణ వుండేది. రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ లో సర్కస్ కొచ్చిన ఆఫీసర్లు పక్కన భార్యల్ని కూర్చోబెట్టుకుని జల్సాగా పొగత్రాగుతూ సర్కస్ ని తిలకించే దృశ్యం వుంటుంది. ప్రోగ్రాముల్లో కూడా ఇదే తంతు. నాటి బాలీవుడ్ గీత రచయిత ఆనంద్ బక్షీ అయితే ఇంకో అడుగు ముందుకేశారు. విదేశంలో ఇచ్చిన ఒక మ్యూజికల్ ప్రోగ్రాంలో ప్రేక్షకుల ముందు రాయల్ గా విస్కీ సేవిస్తూ పాట పాడిన వీడియో యూట్యూబ్ లో వుంది. 
        
ఆ స్వేచ్ఛ ఇప్పుడు తినుబండారాల విషయంలో కూడా లేదు. అసలు సినిమాకెళ్తే ఎందుకు తినాలన్నది ప్రశ్న. తినకుండా సినిమాలు చూడలేరా?
—సికిందర్

 

4, జనవరి 2023, బుధవారం

1283 : స్పెషల్ న్యూస్!


 

రోజు జనవరి 12,1968. సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన 11 వ సినిమా అసాధ్యుడు విడుదల. వెనక్కి వెళ్తే ఆ రోజు 1965 మార్చి 31. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొదటి సినిమా తేనెమనసులు విడుదల. ఇది ఉగాది విడుదలైతే అది సంక్రాంతి విడుదల. రెండూ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. అయితే కృష్ణకి సంక్రాంతి సెంటిమెంటు మొదలైంది అసాధ్యుడు విజయంతో. ఆ నాటి నుంచి సంక్రాంతికి తన సినిమా ఒకటి విడుదల అవ్వాలని నియమం పెట్టుకున్నారు. దాంతో రికార్డు బ్రేకింగ్ 30 సంక్రాంతి సినిమాలిచ్చారు. ఎన్టీఆర్ 28 సంక్రాంతి సినిమాలిస్తే తను రెండాకులు ఎక్కువే చదివి 30 ఇచ్చారు.

        క సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమాతో కూడా తలపడ్డారు- 1977 జనవరి 14 సంక్రాంతి రోజున ఎన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన దానవీర శూర కర్ణ పౌరాణికంతో కృష్ణ తన పౌరాణికం కురుక్షేత్రం ని ఎదురుపెట్టి ఢీ కొన్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణతో బాటు శోభన్ బాబు, కృష్ణం రాజు, జమునలతో మల్టీస్టారర్ గా తీసిన పౌరణికం, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ముందు నిలబడలేకపోయింది. కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు పాత్రలు తనే వేసి కృష్ణ కూడా త్రిపాత్రాభినయం చేసి వుంటే ఎన్టీఆర్ తో ఎలా వుండేదో.
          
కృష్ణ మొదటి సంక్రాంతి హిట్ 'అసాధ్యుడు' సంక్రాంతి సినిమా అంటే కుటుంబ కథతో వుండాలన్న అప్పటి నమ్మకాన్ని కూడా కాదని జేమ్స్ బాండ్ టైపు యాక్షన్ థ్రిలర్ గా నిర్మించారు. 1966 లో తను నటించిన గూఢచారి 116 ఘన విజయంతో దీనికి స్ఫూర్తి. ఇక కృష్ణ తెలుగు సినిమాలకి కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఆంధ్రా జేమ్స్ బాండ్ గా మారిపోయారు.
          
సంక్రాంతి సినిమాల బాక్సాఫీసు పరీక్షలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు ఇంకా చాలా మందే వున్నారు- అక్కినేని నాగేశ్వరరావు 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు కల్ట్ మ్యూజికల్ హిట్ తో అతి పెద్ద సంక్రాంతి హీరో అయ్యారు. ఇంకో పెద్ద హిట్, ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు 1991 సంక్రాంతికిచ్చి, పెద్ద తరహా పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు.
          
సూపర్ స్టార్ కృష్ణ గరిష్ట విడుదలల విషయానికి వస్తే దాదాపు 350 సినిమాలకి పైగా విస్తరించిన కెరీర్‌లో, 30 సినిమాలు సంక్రాంతి సినిమాలే. 1968 లో మొదటి సంక్రాంతి సినిమా  అసాధ్యుడు తర్వాత, 1969 లో శోభన్ బాబుతో కలిసి మంచి మిత్రులు’, 1973 లో కౌబాయ్ మంచి వాళ్ళకు మంచి వాడు’, 1976 లో పాడి పంటలు’, 1977 లో కురుక్షేత్రం’, 1978 లో ఇంద్రధనస్సు’, 1980 లో భలేకృష్ణుడు’, 1981 లో ఊరికి మొనగాడు’, 1983 లో బెజవాడ బెబ్బులి’, 1984 లో ఇద్దరు దొంగలు’, 1985 లో అగ్ని పర్వతం’, 1987 లో తండ్రీ కొడుకుల ఛాలెంజ్’, 1988 లో కలియుగ కర్ణుడు’, 1989 లో రాజకీయ చదరంగం’, 1990 లో ఇన్‌స్పెక్టర్ రుద్ర’, 1992 లో పరమ శివుడు’, 1993 లో పచ్చని సంసారం’, 1994 లో నంబర్ వన్’, 1995 లో అమ్మ దొంగా ...ఇలా సంక్రాంతుల సరదా సాగింది.
        
ఇక చిరంజీవి, బాలకృష్ణల విషయం తెలిసిందే. నిన్నటి వ్యాసంలో చూశాం. పోతే  10 సంక్రాంతి సినిమాలతో వెంకటేష్...ధర్మ చక్రం’, ప్రేమ’, చంటి’, కలిసుందాం రా’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్స్ ఇచ్చారు. మహేష్ బాబు 5 సినిమాలు ...ఒక్కడు’, టక్కరి దొంగ’, బిజినెస్ మేన్’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘1-నేనొక్కడినే’, రిలేరు నీకెవ్వరు’. జూనియర్ ఎన్టీఆర్ 4 సినిమాలు... నాన్నకు ప్రేమతో’, అదుర్స్’, నా అల్లుడు’, నాగ’. అల్లు అర్జున్ 2 సినిమాలు...దేశముదురు’, అల వైకుంఠపురంలో’. రామ్ చరణ్ 2 సినిమాలు... నాయక్’, ఎవడు’, వినయ విధేయ రామ. ప్రభాస్ 2 సినిమాలు...వర్షం’, యోగి’.
        
విచిత్రమేమిటంటే సంక్రాంతి టైటిల్ తో సంక్రాంతికి విడుదల కాని  సినిమా ఒకటుంది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. అక్కినేని, కృష్ణ, శ్రీదేవి, జయసుధలతో మల్టీస్టారర్. ఇది 1983 ఫిబ్రవరి 12 న సంక్రాంతి వెళ్ళిపోయాక విడుదలైంది ఊరంతా సంక్రాంతి. సంబరాలా సంకురాత్రి...ఊరంతా పిలిచిందీ... ఏడాదికో పండగాబ్రతుకంత తొలి పండగా అనే పాటతో పండగ చేసుకున్నారు.
        
ఇప్పుడు సంక్రాంతి పాటలు సంక్రాంతి సినిమాల్లో కూడా లేవు. మారణాయుధాలతో మరణ మృదంగాలు తప్ప. కృష్ణ ఏ మూహూర్తాన అసాధ్యుడు యాక్షన్ సినిమాతో తన సంక్రాంతి సినిమాల పరంపరని ప్రారంభించారో- కొత్త స్టార్ల ట్రెండ్ లో సంక్రాంతి సినిమాలంటే రక్తం కళ్ళ జూసే యాక్షన్ సినిమాలుగానే మారిపోయాయి!
***

 


3, జనవరి 2023, మంగళవారం

1282 : స్పెషల్ న్యూస్!


 

తెలుగు సినిమాల క్యాలెండర్ ని సంక్రాంతి నుంచి సంక్రాంతికి మార్చుకోవాలి. తెలుగు సినిమాల కొత్త సంవత్సరం సంక్రాంతి నుంచే ప్రారంభమవుతుంది. జనవరిలో సంక్రాంతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొత్త సినిమాల విడుదలలు పోటాపోటీగా వుంటాయి. ఈ పోటీలో ఎవరు సంక్రాంతి హీరో అన్న శీర్షికతో ఇంటర్నెట్ కి పూర్వం ప్రింట్ మీడియాలో ఆసక్తిగా ఎదురు చూసేలా కథనాలు వెలువడేవి. సినిమా చరిత్రలో మొదటి సంక్రాంతి హీరో ఎవరంటే పోటీ లేకుండా సోలోగా ఎన్టీఆరే. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలై హిట్టయ్యాయి. 28 సంక్రాంతుల్లో 28 సినిమాలు విడుదల చేసిన ఘనత ఎన్టీఆర్ దే.

        1954 లో చంద్రహారం తో మొదలు పెడితే 1981 లో ప్రేమ సింహాసనం వరకూ -మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, వెంకటేశ్వర మహాత్మ్యం, శ్రీకృష్ణార్జున యుద్ధం, గులేబకావళి కథ, గుడి గంటలు, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, తల్లా పెళ్లామా, శ్రీకృష్ణ విజయం, సతీ సావిత్రి మొదలైన చిరస్మరణీయమైన 28 సినిమాల శ్రేణి కనిపిస్తుంది.     

తర్వాత అక్కినేని నాగేశ్వరరావు అడపా దడపా సంక్రాంతి సినిమాలతో వచ్చినా అవి తక్కువే. ఎప్పుడూ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సంక్రాంతి సినిమాలతో ముఖా ముఖీ అయింది లేదు. తర్వాత ఎక్కువ సంక్రాంతి సినిమాలు చేసింది హీరో కృష్ణ. తనుకూడా సోలోగానే వచ్చేవారు. ఇక చిరంజీవి రంగప్రవేశం చేశాక ఆయన సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఢమాల్మన్నాయి. 1983 సంక్రాంతికి విడుదలైన ప్రేమ పిచ్చోళ్లు (హిందీ షౌకీన్ రీమేక్) సంక్రాంతికి విడుదలైన చిరంజీవి మొదటి చలన చిత్రం. ఆ పరాజయం తర్వాత, సంక్రాంతికి విడుదలైన మరో  రెండు సినిమాలు హిట్ కాలేదు. అలాగే 1996లో  బాలకృష్ణ నటించిన మొదటి సంక్రాంతి సినిమా వంశానికొక్కడు హిట్ కాలేదు.
        
1997 చరిత్రాత్మక సంవత్సరం. ఇద్దరి మధ్య సంక్రాతి సినిమాల పోటీ ప్రారంభమైన సంవత్సరం. చిరంజీవి హిట్లర్ తో, బాలకృష్ణ పెద్దన్నయ్య తో తలపడి ఇద్దరూ సంక్రాంతి హీరోలయ్యారు. దీని తర్వాత 1999 లో చిరంజీవి స్నేహం కోసం తో, బాలకృష్ణ  సమర సింహారెడ్డి తో వచ్చి బాలకృష్ణ సంక్రాంతి హీరో అయిపోయారు. సమరసింహా రెడ్డి ఆయనకి అతి పెద్ద తొలి బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత నుంచే మునుపెన్నడూ వూహించని చిరంజీవి -బాలకృష్ణ ల సంక్రాంతి సినిమాల రేసు అనే కొత్త పోటీ మొదలైంది. ఇద్దరి మధ్య ఎవరు సంక్రాంతి హీరో అన్న టైటిల్ కింద టాప్ చైర్ కోసం క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ లాగా పోరాటం మొదలైంది. తర్వాతి రెండు సంక్రాంతి సంగ్రామాల్లో కూడా చిరంజీవే క్షతగాత్రుడిగా మిగిలారు. 2001 లో చిరంజీవి మృగరాజు తో, బాలకృష్ణ నరసింహా నాయుడు తో బరిలోకి దిగి బాలకృష్ణే సంక్రాంతి హీరోగా నిలిచారు. మళ్ళీ 2004 లో అంజి తో చిరంజీవి, లక్ష్మీనరసింహా తో బాలకృష్ణ పోటీ పడితే, బాలకృష్ణే సంక్రాంతి హీరోగా టాప్ చైర్ ని అందుకున్నారు.
        
మృగరాజు లో చిరంజీవి సింహాన్ని మచ్చిక చేసుకోవడం బ్యాక్‌డ్రాప్‌గా వున్న కథ. బాలకృష్ణ నరసింహా నాయుడు మునుపటి బ్లాక్‌బస్టర్ హిట్ సమరసింహా రెడ్డి తరహాలో ఫ్యాక్షనిస్ట్ నేపథ్య కథ. గ్రాఫిక్స్ తో మృగరాజు కంటే ఫ్యాక్షన్ తో నరసింహా నాయుడు పండుగ ప్రేక్షకులకి నచ్చింది. ఈ రెండు ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్య ఇమేజియే మారిపోయింది. రౌద్రరసం పండించగల పవర్ఫుల్ స్టార్ గా 2021 లో 61 ఏళ్ళ వయసులోనూ ‘అఖండ’ ని అఖిలాండ బ్రహ్మాండం చేశారు.
        
మళ్ళీ ఇద్దరూ 2004 లో సిగపట్లకి దిగారు. రెండు చిరు వర్సెస్ బాలయ్య సినిమాలు. అంజి తో చిరు మరో గ్రాఫిక్స్, లక్ష్మీ నరసింహా తో బాలయ్య మాస్ పోలీస్ యాక్షన్. ఈ సారి కూడా పండుగ ప్రేక్షకులకి గ్రాఫిక్స్ నచ్చక, బాలయ్యనే సంక్రాంతి హీరోగా చేశారు. ఇలా వరుసగా మూడు సంక్రాంతులు బాలకృష్ణ వశమయ్యాయి.
        
దీని తర్వాత 2017 లోనే తిరిగి ఇద్దరూ సంక్రాంతి రేసులోకి వచ్చారు. చిరంజీవి ఖైదీ నెం 150 తో, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి తో. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించిన సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల్ని వెర్రెత్తిస్తూ మాస్ ఎంటర్ టైనర్ తో, బాలకృష్ణ 2014 లో లెజండ్ అనే సూపర్ హిట్ ఇచ్చాక,  లయన్’, డిక్టేటర్ అనే రెండు ఫ్లాప్స్ తర్వాత చారిత్రికంతో. ఇద్దరూ సంక్రాంతి హీరోలయ్యారు.
        
ఇప్పుడు ఐదేళ్ళ విరామం తర్వాత 2023 లో నువ్వా నేనా అన్నట్టు దిటవు గుండెలతో నిలబడ్డారు. విశేషమేమిటంటే, ఇద్దరూ ఒకే బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలతో సంక్రాంతిని శోభాయమానం చేయబోతున్నారు-  వాల్తేర్ వీరయ్య తో చిరంజీవి, వీర సింహా రెడ్డి తో బాలకృష్ణ. రెడ్డి, నాయుడు లేకపోతే బాలకృష్ణకి నడవదు. దీంతో ఇద్దరి అభిమానులు సంక్రాంతికి ఎవరి సినిమా పైచేయి సాధిస్తుందో అంచనాలు, జోస్యాలు మొదలు పెట్టేశారు. రెండు సినిమాల ప్రచారం అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ ప్రారంభమై పోయింది. ఇప్పటికే చిరంజీవి బాస్ పార్టీ’, బాలకృష్ణ జై బాలయ్య ప్రమోషనల్ సాంగ్స్ రెండూ యూట్యూబ్‌లో వైరల్ అయి వెర్రెత్తిస్తున్నాయి.
        
తిరిగి ఇద్దరూ 2017 లాగా సంక్రాంతి సక్సెస్ ని సమంగా పంచుకుంటారా అనేదే సస్పెన్స్. పంచుకునే అవకాశాలే ఎక్కువున్నాయి- ఎందుకంటే రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్ ఆకర్షణలతో, హీరోయిజాలతో వున్నవే. రెండూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించినవే. ఇవి పానిండియా మూవీస్ కాకపోవచ్చు, కానీ సంక్రాంతి కోడి పందాలకే మాత్రం తీసిపోవు.
***

1, జనవరి 2023, ఆదివారం

1280 : స్పెషల్ న్యూస్! (total articles published in 2022 : 193)

    
    2022 లో టాలీవుడ్ పని తీరు సంఖ్యా పరంగా14 హిట్స్ తో ఎప్పటిలానే స్టాండర్డ్ ఫలితాన్నిచ్చింది. ఏటా 10- 15 హిట్స్ తో 8-10 శాతం సక్సెస్ రేటుని నమోదు చేస్తూ వచ్చింది. ఈ సక్సెస్ రేటు సినిమాల సంఖ్య 100-120 వున్నప్పుడు. 2022 లో ఈ సంఖ్య బాలీవుడ్ ని కూడా తలదన్నేలా రికార్డు స్థాయిలో 300 కి చేరింది. ఒక సంవత్సరంలో 300 తెలుగు సినిమాలు నిర్మించేసి ఆలిండియా రికార్డు స్థాపించారు. అంటే నెలకు 25 సినిమాలు. అంటే దాదాపు రోజుకొకటి. ప్రేక్షకులు రోజూ ఒక సినిమా చూస్తే తప్ప డిమాండ్ - సప్లయి బ్యాలెన్స్ కాదు. ఇదలా వుంచితే రివ్యూలు రాసేవాళ్ళ పరిస్థితేంటి? ఇన్ని సినిమాలు ఎక్కడికిపోతున్నాయి? ఏమవుతున్నాయి? సంఖ్య పెరిగితే విజయా లేమైనా పెరిగాయా అంటే సగానికి పడిపోయాయి. 300 లో 14 హిట్స్ అంటే 4.67 శాతం విజయాలు. 8-10 శాతం నుంచి సగానికి పడిపోయిన టాలీవుడ్ పని తీరు.

        ష్టమెంతో టాలీవుడ్ లో లెక్క తేలదు బాలీవుడ్ లో తేలినట్టు. అయితే 300 లో 14 హిట్స్ పోగా 286 ఫ్లాప్స్ కి పెట్టుబడి వేల కోట్లలోనే వుండొచ్చు. బాలీవుడ్ 102 సినిమాలు తీసి 3 వేల కోట్లు నష్టపోతే టాలీవుడ్ 3 రెట్లు నష్టపోయి వుండాలి. ఇంత పెట్టుబడి టాలీవుడ్ లోకి వస్తోందంటే టాలీవుడ్ మెగా రిచ్ పరిశ్రమే. ఫ్లాపయిన 286 లో పెద్ద హీరోలవి, చిన్న హీరోలవి కలిపి 43 పోగా, మిగిలిన 243 చిన్నా చితకా సినిమాలే!
        
చిన్నాచితకా సినిమాలు నిర్మాతలకి నష్టాలే మిగిల్చినా ఆ సినిమాలకి పని చేసే వాళ్ళందరికీ ఉపాధి కల్పించే సామాజిక బాధ్యత వహిస్తున్నాయి. ఇది గొప్ప విషయం. కాబట్టి చిన్నా చితకా సినిమాలు తీయాల్సిందే దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య దృష్ట్యా. పెద్ద, మధ్యతరహా సినిమాలు ఫ్లాపయినా పెద్దగా నష్టం వుండదు- ఓటీటీలు భర్తీ చేస్తాయి కాబట్టి. ఇప్పటికే ఓటీటీలు ఫ్లాపుల అడ్డాగా పేరుబడ్డాయి. ఉందిగా సెప్టెంబరు మార్చి పైన అని పాట పాడినట్టు, థియేటర్లో ఫెయిలైనా ఓటీటీలో పాస్ అవచ్చు.
        
హిట్టయిన 14 సినిమాలేమిటో చూస్తే- 2022 జనవరిలో ఒక్క హిట్టు కూడా లేదు. ఫిబ్రవరి నుంచి వరుసగా డీజే టిల్లు, భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్, సర్కారు వారి పాట, ఎఫ్ 3, మేజర్, బింబిసార, సీతారామం, కార్తికేయ 2, ఒకే ఒక్క జీవితం, గాడ్ ఫాదర్ మసూదా, హిట్ 2, ధమాకా. ఇవి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్- రామ్ చరణ్, శర్వానంద్, కళ్యాణ్ రామ్, అడివి శేష్, నిఖిల్, దుల్కర్ సల్మాన్, సిద్దు జొన్నలగడ్డ నటించినవి. అడివి శేష్ రెండు నటిస్తే రెండూ హిట్టయ్యాయి.
        
ఫ్లాపయిన 43 లో చిరంజీవి (ఆచార్య), నాగార్జున (బంగార్రాజు, ఘోస్ట్), రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ), ప్రభాస్ (రాధేశ్యామ్), విజయ్ దేవరకొండ (లైగర్), నాగచైతన్య (థాంక్యూ), శర్వానంద్ (ఆడవాళ్ళూ మీకు జోహార్లు), నాని (అంటే సుందరానికి), రామ్ (వారియర్), వరుణ్ తేజ్ (గని), గోపీచంద్ (పక్కా కమర్షియల్), నిఖిల్ (18 పేజెస్), విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కాళ్యాణం, ఓరి దేవుడా), రానా (1945, విరాట పర్వం), సత్యదేవ్ (గాడ్సే), రాజశేఖర్ (శేఖర్), మోహన్ బాబు (సన్ ఆఫ్ ఇండియా), మంచు విష్ణు (జిన్నా), శ్రీవిష్ణు (భళా తందనాన, అల్లూరి), నాగశౌర్య (కృష్ణ వ్రింద విహారి), అల్లరి నరేష్ (ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం), అల్లు శిరీష్ (ఊర్వశివో రాక్షసివో), ఆనంద్ దేవరకొండ (హైవే), సుధీర్ బాబు (ఆ అమ్మాయి గురించి చెప్పాలి), సమంత( యశోద), తాప్సీ (మిషాన్ ఇంపాసిబుల్), కీర్తీ సురేష్ (గుడ్ లక్ సఖీ), ఆకాష్ పూరీ (చోర్ బజార్), రాజ్ తరుణ్  (స్టాండప్ రాహుల్), కల్యాణ్ దేవ్ (సూపర్ మచ్చీ), అశోక్ గల్లా (హీరో), కిరణ్ అబ్బవరం 3 సినిమాలు, ఆది సాయికుమార్ 5 సినిమాలు వున్నాయి.
        
చిన్నా చితకా విషయానికొస్తే 243 లో 50 శాతమైనా సస్పెన్స్ థ్రిల్లర్లు వుంటాయి. ప్రేమ సినిమాలు తక్కువే. ఈసారి వీటి బెడద తప్పింది. మాస్ మసాలా యాక్షన్లు, ఒకటీ అరా హార్రర్ కామెడీలు మిగిలిన సంఖ్యని భర్తీ చేశాయి. ఇవి కొత్త దర్శకులు కొత్త హీరోహీరోయిన్లతో తీసిన సినిమాలే. వందల సంఖ్యలో వీళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొత్త సంవత్సరం ఫ్రెష్ గా మళ్ళీ కొత్త కొత్త దర్శకులు, హీరోహీరోయిన్లు రావడం, వెళ్ళిపోవడం.
        
పెట్టుబడికే కాదు, కొత్త టాలెంట్స్ కి కూడా కొదవలేదు. తమ కోసం వందల సినిమాలు తీస్తున్న నిర్మాతలకి న్యాయం చేద్దామని మాత్రం ఎవరికీ లేదు. ఒకరు టాప్ గేర్ అని రివర్స్ గేర్ వేస్తారు, ఇంకొకరు ఎస్ 5 నో ఎగ్జిట్ అని అవుటైపోతారు. ఇంకొకరు డ్రైవర్ జమున అని పాత జమానాతో వచ్చి ఎటో వెళ్ళిపోతారు. కనీస అవగాహన లేకుండా చేసే పనేదైనా వుంటే సినిమాలు తీయడమేనేమో. ఇలా 2023 లో 300 రికార్డుని కూడా బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. అసలు నిర్మాతలకి అవగాహన వుంటే ఇలా జరగదు. కొత్తగా వచ్చే నిర్మాతలకి అవగాహనా తరగతులు నిర్వహించాలని ఆ మధ్య అనుకున్నారు. అదింకా కార్యరూపం దాల్చడం లేదు. 2023 లోనైనా సంఖ్య తగ్గించి నాణ్యత పెంచే వైపు దృష్టి సారిస్తా రేమో చూడాలి.

—సికిందర్