రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, నవంబర్ 2022, గురువారం

1247 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : జయతీర్థ
తారాగణం : జైద్ ఖాన్,  సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
బ్యానర్ : ఎన్ కె  ప్రొడక్షన్స్
నిర్మాతలు : తిలకరాజ్ బల్లాల్, ముజమ్మిల్ అహ్మద్ ఖాన్
విడుదల : నవంబర్ 4,  2022
***
        న్నడ సినిమాలు జాతీయంగా హిట్టవుతున్న నేపథ్యంలో మరో కన్నడ మూవీ  బనారస్ కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యువ ప్రేక్షకుల వినోదం కోసం థియేటర్లని అలంకరించింది. కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్ ఈ మూవీతో హీరోగా రంగప్రవేశం చేశాడు. మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామాగా ప్రచారం చేసిన దీనికి జయతీర్ధ దర్శకుడు. ఇతను చెప్పే మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామా ఏమిటో చూద్దాం...

కథ

సిద్ధార్థ్ (జైద్ ఖాన్) బీఎస్సీ ఫైనల్ స్టూడెంట్. ఇతను ధని (సోనాల్ మోంటెరో) ని కలిసి తను భవిష్యత్తులోంచి వచ్చానని, తామిద్దరికీ పెళ్ళయ్యిందనీ అంటాడు. ఇతను చెబుతున్న టైమ్ ట్రావెల్ విషయాలకి ఆసక్తి పెంచుకుని స్నేహం చేస్తుందామె. ఆమెతో చనువు పెంచుకుని ఒక రోజు ఆమె గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆమె ఫోటో తీస్తాడు. ఆ ఫోటో ఫ్రెండ్స్ కి చూపించి తను బెట్ గెలిచానని అంటాడు. ఓ అమ్మాయిని బెడ్రూంలో ఫోటో తీసి చూపించాలన్న బెట్ అది. ఒక ఫ్రెండ్ ఆ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. దీంతో అవమానంగా ఫీలైన ధని అదృశ్యమైపోతుంది. ఆమెని వెతుక్కుంటూ బనారస్ (వారణాసి) చేరుకుని ఆమెకి సారీ చెప్పాలని ప్రయత్నిస్తాడు సిద్ధార్థ్. చాలా బెట్టు చేసి చివరికి క్షమిస్తుంది.

ఇద్దరూ ప్రేమించుకుంటారు. బనారస్ లో ఆమె బాబాయ్ దగ్గర వుంటోంది. అయితే ప్రేమలో పడ్డాక సిద్ధార్థ్ టైమ్ లూప్ లో పడిపోతాడు. అతడి జీవితంలో ఒకే రోజు జరిగిన సంఘటనలే రిపీట్ అవుతూంటాయి. ఈ కాల వలయంలోని బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు. ఇలా ఇందులో విజయం సాధించి తిరిగి మామూలు జీవితంలోకి వచ్చాడా? ఇద్దరి ప్రేమ సుఖాంతమయ్యిందా? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఇటీవలి ఒకే ఒక జీవితం లాగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కథ ప్రారంభమైందనుకుంటాం. కానీ టైమ్ ట్రావెల్ కాకుండా  టైమ్ లూప్ కాన్సెప్ట్ గా మారిపోతుంది. గడుపుతున్న రోజు తెల్లారితే తేదీ మారకుండా, మళ్ళీ అదే తేదీతో రిపీటయ్యే, అవే సంఘనలు జరిగే, టైమ్ లూప్ కాన్సెప్ట్ గా మార్చి చేసిన కథ పూర్తిగా విఫలమైంది.

సిద్ధార్థ్ ఫస్టాఫ్ లో ధనిని ట్రాప్ చేసి ఫోటో తీశాక, తప్పు తెలుసుకుని మాయమై పోయిన ఆమెని బనారస్ వెళ్ళి పట్టుకుని, సారీ చెప్పే ప్రయత్నంతోనే ఫస్టాఫ్ గంటా 20 నిమిషాలు గడిచి పోతుంది. ప్రారంభంలో టైమ్ ట్రావెల్ ని ప్రస్తావించి చెప్పిన కథంతా, టైం ట్రావెల్ జోలికి ఎంతకీ వెళ్ళకుండా, చీప్ రోటీన్ లవ్ స్టోరీగా సాగుతుంది. పాతగా అన్పించే సీన్లు, పేలవమైన డైలాగులు, నత్తనడక కథనం.

సారీ చెప్పడానికి రిపీటవుతూ వుండే అవే సీన్లు, బనారస్ లో పుణ్య క్షేత్రాల టూరింగ్ అన్నట్టు సాగుతాయి. ఇక వచ్చే మూడు పాటలైతే భరించడం కష్టం. ఆమె మీద పూర్తి భక్తి పాట ఒకటి పెట్టేశారు ఈ రోజుల్లో. ఇది రోమాంటిక్ డ్రామానా, సైన్స్ ఫిక్షనా, భక్తి సినిమానా అర్ధం గాకుండా వుంటుంది.

ఈ మధ్య నార్త్ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సినిమాలు తీస్తే నార్త్ లో - రాజకీయాల పుణ్యమాని మత భక్తి పెరిగిపోయిన ప్రేక్షకులతో బాక్సాఫీసు బద్ధలవుతోందనే ఒక నమ్మకంతో సినిమాలు తీస్తున్న ట్రెండ్ మొదలైంది. కానీ మొన్న  రామ్ సేతుతో, ఇవ్వాళ  బనారస్ తో పథకం పారలేదు.

ఫస్టాఫ్ గంటా 20 నిమిషాల తర్వాత ఎలాగో పాయింటుకొచ్చి (పాయింటు మార్చి), సెకండాఫ్ ని దర్శించుకుంటే, మళ్ళీ ఈ గంటా 10 నిమిషాలూ టైమ్ లూప్ కాన్సెప్ట్ తమ మీదపడి విలవిల లాడతారు ప్రేక్షకులు. విల విల లాడడానికి ప్రేక్షకులు లేరనేది వేరే విషయం-మనలాంటి కొందరు అమాయకులు తప్ప. టైమ్ లూప్ లో చిక్కుకున్న సిద్ధార్థ్ కి ఆ వొక రోజే మళ్ళీ మళ్ళీ రిపీటవుతూంటుంది. కొన్ని మార్పులతో అవే సీన్లు మళ్ళీ మళ్ళీ చూస్తూ పోవాలి. ఇలా నాల్గు సార్లు జరిగాక లూప్ లోంచి బయటపడతాడు. బ్రతుకు జీవుడా అని మనం కూడా.

ఫస్టాఫ్ ఒక సినిమా, సెకండాఫ్ వేరే సినిమా చూస్తున్నట్టు వుంటుంది. ఈ టైమ్ లూప్ లో దృశ్యాలు కూడా సస్పెన్స్, హింస, రక్తపాతంతో వుంటాయి. పుణ్య క్షేత్రంలో రక్తపాతం. ప్రేమ కథతో వయొలెన్స్. మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామా అంటే ఇదే. ఈ టైం లూప్ దృశ్యాల వల్ల సెకండాఫ్ లో హీరో హీరోయిన్ల రోమాన్సుకి చోటే లేకుండా పోయింది. చక్కగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సెంటిమెంటల్  ప్రేమ కథేదో నడుపుకోక, టైమ్ లూప్ అంటూ సెకెండాఫ్ వేస్ట్ చేశాడు. దీన్ని పానిండియా రిలీజ్ చేశారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరో జైద్ కష్టపడి ఎలాగో నటించాడు. జైద్ బనారస్ ఎలా వెళ్తాడని సినిమాని బాయ్ కాట్ చేసేంత దృష్టి పడలేదు బాయ్ కాట్ బ్యాచులకి. వాళ్ళు షారూఖ్ ఖాన్ ని బాయ్ కాట్ చేస్తూ బిజీగా వున్నట్టున్నారు. అయితే అన్ని గుళ్ళు గోపురాలు తిరిగే జైద్ ఒకసారైనా బొట్టు పెట్టుకోలేదేమిటా అన్పించొచ్చు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకైన జైద్ సేఫ్ గా సేఫ్ గా సినిమాతో బయటపడ్డాడు. అయితే ఇలాటి అర్ధం కాని ప్రయోగాలు కాకుండా అర్ధమయ్యే సినిమాలు నటిస్తే మంచిది.

హీరోయిన్ సోనాల్ మోంటెరో సాంప్రదాయ పాత్ర పోషించింది. చూడ్డానికి బాగానే వుంది. పాత్రకి చదస్తాలు చాలా వున్నాయి. యువ ప్రేక్షకుల్ని ఇవి ఆకట్టుకోవు. అయితే సెకండాఫ్ లో కన్పించే సమస్యే లేదు చివర్లో తప్ప. సెకండాఫ్ టైం లూప్ లో పడి హీరో కొట్టుకోవడంతోనే సరిపోయింది.

కెమెరా వర్క్ అంత అద్భుతమేం కాదు. బడ్జెట్ పరిమితుల వల్ల వారణాసి లొకేషన్స్, విజువల్స్ సాదాగా వున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం మాత్రం అపస్వరాలు పలుకుతున్నట్టు వున్నాయి. మొత్తం మీద దర్శకుడు జయతీర్ధ చేయించిన ఈ తీర్ధయాత్ర రెండున్నర గంటల తీరని వ్యధగా చెప్పుకోవచ్చు. 

—సికిందర్

9, నవంబర్ 2022, బుధవారం

1246 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం :  మేర్లపాక గాంధీ
తారాగణం : సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సప్తగిరి, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్, బెనర్జీ, రఘుబాబు తదితరులు
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల; ఛాయాహగ్రహణం : వసంత్ ఏ
బ్యానర్స్ : నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్, అముక్తా క్రియేషన్స్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
విడుదల : నవంబర్ 4, 2022
***

      ముందుగా రివ్యూ హెడ్డింగ్ గురించి ఒక మాట : జోకులకి ప్రసిద్ధి అయిన ఒక సీనియర్ దర్శకుడు ఈ సినిమా గురించి ఫోన్లో మాట్లాడుతూ, లైకే చేయనప్పుడు మిగతా రెండూ ఎలా చేస్తారని నవ్వించారు. ఆయన జోకే రివ్యూ హెడ్డింగుగా కుదిరింది. 2011 నుంచి సక్సెస్ కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తున్న హీరో సంతోష్ శోభన్, మధ్యలో ఏక్ మినీ కథ అనే ఓటీటీ లో విడుదలైన మూవీతో మాత్రం ఫర్వాలేదన్పించుకున్నాడు. ఇది మినహాయిస్తే, అయిదు థియేటర్ సినిమాలతో సక్సెస్ ని అందుకోలేక తిరిగి ఇంకో ప్రయత్నం చేస్తూ, తనలాగే ఫ్లాప్స్ తో వున్న దర్శకుడితో ఈవారం బాక్సాఫీసు ముందుకొచ్చాడు.

        2013 లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే హిట్ తో ప్రారంభమయిన మేర్లపాక గాంధీ, తర్వాత తీసిన ఎక్స్ ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘మాస్ట్రో లతో పట్టుకోల్పోయి, ‘ఏక్ మినీ కథ తో పైకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి లైక్, షేర్ & సబ్ స్క్రైబ్ తీర్పు కోసం ప్రేక్షకుల ముందుంది. వీళ్ళిద్దరూ గ్లామర్ పోషణకోసం జాతిరత్నాలుఫరియా అబ్దుల్లాని హీరోయిన్ గా కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడైనా విజయఢంకా మోగించారా? ఢంకా కూడా మోగనని మొరాయించిందా? అరకు వెళ్ళి సినిమా తీసినా అరణ్య రోదనే అయిందా? మధ్యలో చూపించిన రివ్యూ రైటర్ పాత్ర చేత ఈ సినిమాకి రేటింగ్ వేయించుకున్నారా? ఈ అత్యవసర విషయాలు తెలుసుకుందాం...  

కథ

హైదరాబాద్ లో విప్లవ్ (సంతోష్ శోభన్) యూట్యూబ్ లో ట్రావెల్ వ్లాగర్. వివిధ ప్రదేశాల ట్రావెల్ వీడియోలు తీసి యూట్యూబ్ లో బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఈసారి అరకు అందాలు చూపించాలని ప్లాన్ చేసి, తండ్రి (బెనర్జీ) దగ్గర బలవంతంగా లక్ష రూపాయలు ఇప్పించుకుని, మధ్యలో తగిలిన కెమెరామాన్ జాక్ డానియేల్స్ (ప్రవీణ్) ని తీసుకుని బయల్దేరతాడు. అరకులో 30 ఏళ్ళుగా పీపీఎఫ్ (పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్) తీవ్రవాద దళంతో పోలీసులకి పోరు జరుగుతూ వుంటుంది. సీఎం (శుభలేఖ సుధాకర్) తో శాంతి చర్చలకని పిలిచి తమ దళ సభ్యులు ముగ్గుర్నీ  చంపారని పోలీసుల మీద పగబట్టి వున్న పీపీఎఫ్, ఇప్పుడు డీజీపీని టార్గెట్ చేసి వుంటారు.

అదే అరకు ప్రాంతానికి ట్రావెల్ వ్లాగర్ గా బాగా సంపాదిస్తున్న డిజిపి వర్మ (ఆడుకాలం నరేన్) కూతురు వసుధ (ఫరియా అబ్దుల్లా) వచ్చి విప్లవ్ కి తగుల్తుంది. విప్లవ్ ఆమె ప్రేమ కోసం వెంటపడతాడు. పీపీఎఫ్ దళంలో దద్దమ్మలన్పించుకున్న బ్రహ్మన్న(బ్రహ్మాజీ) తోబాటు ఇంకో అయిదుగురు డిస్మిస్ అయి తిరుగుతూంటారు. ఏదైనా ఘనకార్యం చేసి దళంలో స్థానం సంపాదించుకోవాలనుకుంటారు. వీళ్ళతో రెండు సార్లు గొడవపడ్డ విప్లవ్, వసుధ, డానియేల్స్ లని  అడవిలో కిడ్నాప్ చేస్తారు. ఇలా ప్రమాదంలో చిక్కుకున్న డిజిపి కూతురు వసుధతో ఇక ఏం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
చెప్పుకోవడానికి బావుంటుంది. చూస్తే మాత్రం భరించలేకుండా వుంటుంది. మాస్ ప్రేక్షకులు కూడా బయటికి వచ్చి బాగాలేదు వెళ్ళి పొమ్మంటారు. రేటింగ్స్ కూడా 1.2, 1.25, 1.5 అంటూ ట్రోలింగ్ అవుతున్నాయి.  సినిమాలో రేటింగ్స్ ఇచ్చే రివ్యూ రైటర్ పాత్ర చేత ఎవరో ఈ సినిమాకి 1.22 రేటింగ్ ఇప్పించి సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఇంత పరిహాసానికి గురైన సినిమా ఇంతకి ముందు చూసి వుండం. అరకు ఆకుల్లో  మేర్లపాక వారు వడ్డించిన భయానక  పాకం ఇది.  

టైటిల్ కీ కథకీ ఏ సంబంధం లేదు. హీరో హీరోయిన్లు ట్రావెల్ వ్లాగర్సే గానీ దీంతో కథ వుండదు. ట్రావెల్ వ్లాగర్స్ అనుకోకుండా తీవ్రవాద దళం వీడియోలు తీసి అప్ లోడ్ చేసి
, డిజిపి హత్యని నివారిస్తూ దళంతో ప్రమాదంలో పడి వుంటే ట్రావెల్ వ్లాగర్స్ థ్రిల్లర్ లాగైనా వుండేది. ఆ వీడియో టైటిల్ కి న్యాయం చేస్తూ, విపరీతంగా లైక్, షేర్ & సబ్ స్క్రైబ్ అయి విప్లవ్ ఆశించిన డబ్బులు వచ్చుండేవి. పాపులర్ వ్లాగర్ వసుధకి ఆల్రెడీ 3 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు వున్నారు. ఇదంతా వదిలేసి ఇంటర్వెల్ వరకూ అడవిలో తిరుగుతూ అర్ధం లేని కామెడీలతో వృధా చేశారు. ఇంకోటేమిటంటే బ్రహ్మన్న దళాన్ని జోకర్లుగా చూపించి కామెడీలు చేసే ప్రయత్నం కూడా ఘోరంగా విఫలమైంది. ఇంటర్వెల్లో వసుధని కిడ్నాప్ చేసే వరకూ కథే వుండదు- ఇంటర్వెల్ వరకూ తీసిన సగం సినిమా బడ్జెట్ వృధా. ఏ సీనుకీ పది రూపాయల విలువ లేదు.

సెకండాఫ్ మరీ వృధా. ముగ్గుర్నీ బందీలుగా పట్టుకున్న బ్రహ్మన్న దళంతో మళ్ళీ అర్ధం లేని కామెడీలు మొదలు. బ్రహ్మన్న 5 లక్షలు డిమాండ్ చేస్తే వసుధ ఏటీఎం నుంచి డ్రా చేసి ఇచ్చేయడానికి సిద్ధపడడం. అంత డబ్బు ఏటీఎం నుంచి ఎలా డ్రా చేస్తుందో. ముగ్గురూ తప్పించుకునే ప్రయత్నం చేసి దొరికిపోవడం. హీరో విప్లవ్ క్యారక్టర్ డీజీపీకున్న ప్రమాదంతో అసలు సమస్య గుర్తించకుండా పాసివ్ క్యారక్టర్ గా వుండిపోవడం, కామెడీలు చేయడం. సహనాన్ని పరీక్షించే ఈ సెకండాఫ్ లో బ్రహ్మన్న ఫ్రెండ్ గా సినిమా రివ్యూ రైటర్ సప్తగిరి వచ్చేసి వేరే కామెడీలు చేయడం.

సినిమా అవకాశాలు దొరక్క రివ్యూ రైటర్లుగా మారి సినిమాల మీద కసి తీర్చుకుంటున్నారనే అజ్ఞానపు కామెంట్లు చేయడం. మరి తన కొస్తున్న అవకాశాలతో మేర్లపాక ఏం సాధిస్తున్నట్టో. ఒక సినిమా ఏదీ లేని శూన్యమని, దానికి 0.25 రేటింగ్, అదికూడా తిన్న పాప్ కార్న్ కిచ్చాననీ సప్తగిరి చెప్తాడు. మేర్లపాక సినిమా కూడా శూన్యమే, దీనికీ 0.00 రేటింగ్ ఇప్పించుకోవాలిగా? రివ్యూ రైటర్ల మీద వ్యంగ్యాలు మాని సినిమా సరిగా తీసుకోవాలి.

నటనలు- సాంకేతికాలు

2015లో తను- నేనుఅనే రెండో సినిమాతో సంతోష్ శోభన్ ఎంత ఈజ్ గల కెమెరా ఫ్రెండ్లీ హీరోనో చూశాం. కానీ తన టాలెంట్ కి తగ్గ సినిమాలు చేయలేక పోతున్నాడు. ఈ సినిమాలో చేయాల్సిందంతా చేశాడు- కామిక్ టైమింగ్, ఫైటింగ్ స్కిల్స్, అవసరమైనప్పుడు ఎమోషన్లు పలికించడం, సాంగ్స్ కి డాన్సులేయడం...కానీ ఒక శూన్యం లాంటి  సినిమాలో ఇవన్నీ చేస్తే మిగిలేదీ శూన్యమే. దారితప్పి ఈ సినిమాలోకి వచ్చినట్టున్నాడు.

జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఫస్టాఫ్ లో బరువు పెరిగి, సెకండాఫ్ లో బరువు తగ్గి, స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకుని ఎలాగెలాగో వుంది. జాతిరత్నాలు తో వచ్చిన క్రేజ్ అంతా పోయింది. నటించిన పాత్రకూడా సిల్లీగా వుంది. పాపులర్ ట్రావెల్ వ్లాగర్ గా ప్రొఫెషనల్ గా ఎంటరై, తర్వాత ఆ సంగతే మర్చిపోయి సిల్లీగా తిరుగుతుంది.

దళ సభ్యుడిగా బ్రహ్మాజీ జోకర్ పాత్ర భరించలేకుండా వున్నా- ఆయన కామెడీ స్కిల్స్ ని మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఇలాటి సినిమాలో నటించకూడదు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవడానికేం లేదు.

మేకింగ్ క్వాలిటీ మీద కూడా శ్రద్ధ పెట్టలేదు. బి గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంది పాటలు సహా. సినిమాలో కథ మీద సరైన దృష్టి పెట్టకుండా ప్రిన్స్ లోలాగా కేవలం కామెడీ బిట్లు చేస్తే నిలబడదని మరోసారి ప్రూవ్ అయింది. కామెడీ బిట్లు చూడడానికి టీవీ వుంది, యూట్యూబ్ వుంది- ప్రత్యేకంగా సినిమా ఎందుకు? అక్కడక్కడా కొన్ని డైలాగులు మాత్రం నవ్విస్తాయి తప్ప చెప్పుకోవడానికేం లేదు.


—సికిందర్   


8, నవంబర్ 2022, మంగళవారం

1245 : రివ్యూ!


రచన -దర్శకత్వం :  రాకేష్ శశి
తారాగణం : అల్లు శిరీష్, నూ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్
కథ : ఏలన్, సంగీతం: అనూప్ రూబెన్స్ (పాటలు),అచ్చు రాజమణి (నేపథ్య సంగీతం); ఛాయాగ్రహణం : తన్వీర్ మీర్
బ్యానర్స్ : శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, GA2 పిక్చర్స్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్
విడుదల : నవంబర్ 4, 2022

***

        2013లో గౌరవం తో హీరోగా ప్రవేశించిన అల్లు శిరీష్ ఆ తర్వాత నటించిన 4 సినిమాలూ కలిసిరాలేదు. మార్పు లేకుండా రోమాంటిక్ సినిమాలు నటించడం ఒకటైతే, అల్లు అర్జున్ తమ్ముడిగా అభిమానుల్ని సృష్టించుకోక పోవడం రెండో కారణం. అయినా తిరిగి 2019 తర్వాత ఇప్పుడు మరో రోమాంటిక్ నటిస్తూ ఊర్వశివో రాక్షసివో తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తో కొత్త తరహా యూత్ రోమాన్స్ గా దీన్ని అభివర్ణించాడు దర్శకుడు రాకేష్ శశి. ఇతను 2018 లో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తో విజేత అనే సెంటిమెంటల్ తీశాడు. ఇది ఆడకపోయినా నిర్మాత అల్లు అరవింద్ ఇంకో అవకాశమిచ్చారు. దీన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా? ఈసారి శిరీష్ కి సక్సెస్ దక్కిందా? ఇవి తెలుసుకుందాం...

కథ

మధ్య తరగతికి చెందిన శ్రీకుమార్ (అల్లు శిరీష్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. టైలరింగ్ చేసే తల్లి, ఎలక్ట్రికల్ షాపు నడిపే తండ్రీ వుంటారు. తొందరగా పెళ్ళి చేయాలని తల్లి (ఆమని) ప్రయత్నాల్లో వుంటుంది. కానీ కుమార్ ఆఫీసులో సింధుజ (అనూ ఇమ్మా న్యూయెల్) ని వెంటపడి ప్రేమకి ఒప్పిస్తాడు. ఆమె ప్రోత్సాహంతో ఆమెతో ఒక రాత్రి గడిపాక, పెళ్ళంటే ఇష్టం లేదని, పెళ్ళి లేకుండా కలిసి వుండచ్చని చెప్పేస్తుంది. దీంతో హర్ట్ అయిన కుమార్ ఆత్మహత్యాయత్నం చేస్తాడు. తర్వాత ఆమెతో సహ జీవనానికి ఒప్పుకుని ఇంటికి దగ్గర్లోనే ఆమెతో మకాం పెడతాడు.

ఇప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండా సాగిస్తున్న వ్యవహారం ఎలా బయటపడింది? అప్పుడు తల్లిదండ్రులేం చేశారు? తల్లి కోసం కుమార్ సింధుజని పెళ్ళికి ఒప్పించుకోగల్గాడా? పెళ్ళి కంటే పారిస్ లో రెస్టారెంట్ తెరవాలనుకుంటున్న సింధుజ ఏం నిర్ణయం తీసుకుంది? ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ
  

2018 లో తమిళంలో వచ్చిన ప్యార్ ప్రేమ కాదల్ కి రీమేక్ ఇది. అతను పెళ్ళి అంటాడు, ఆమె పెళ్ళి లేకుండా ప్రేమ అంటుంది. సాధారణంగా ప్రేమించిన హీరోయిన్ తో గడిపి హీరో మోసం చేసే సినిమాలుంటాయి. ఇందులో రివర్స్ చేశారు. సింధుజ తనని ప్రేమిస్తున్న కుమార్ తో ఓ రాత్రి గడిపి ఇక చాలు పొమ్మనే సినిమా ఇది. సెక్స్ ని క్యాజువల్ గా తీసుకోవాలంటుంది. ఆమె అమెరికాలో పెరిగింది కాబట్టి ప్రేమా గీమా తెలియవనే సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఐతే అమెరికాలో సెక్స్ ని ఎంజాయ్ చేసిందా అన్న ప్రశ్న వస్తుంది. కుమార్ తో గడిపి సెక్స్ చాలు పొమ్మందంటే ఆమె క్యారెక్టరే సందేహాస్పదమవుతుంది. లోతుగా ఆలోచించకుండా పైపైన రాసేసి, కెమెరా పెట్టి బెడ్రూంలో తీసేస్తే ఇలాగే తయారవుతుంది పాత్ర.

ఇలా అమెరికాలో పెరిగింది కాబట్టి ప్రేమా గీమా తెలియవనే తెలివిలేని వివరణ ఇస్తూనే
, ఆమెకి పారిస్ లో రెస్టారెంట్ తెరవాలన్నది కల కాబట్టి దానికోసం పెళ్ళీ పిల్లలూ సంసారం పక్కన బెట్టినట్టు మళ్ళీ చెప్పారు. ఇలా రెండు కారణాలెలా వుంటాయి. మొదటి కారణాన్ని బైపాస్ చేసి రెండో కారణం మీద నిలబడ్డారు. ప్రాబ్లం ఏమిటంటే ఇది కుమార్ కి తెలియదు. కథలో జరుగుతున్న విషయాలు ప్రధాన పాత్రయిన కథానాయకుడికే తెలియకపోతే కథెలా నడపుతాడు. సినిమా ఏం నిలబెడతాడు.

అంటే కథకుడు కథానాయకుడికి విషయం తెలియకుండా అడ్డు పడుతున్నాడు. తెలిస్తే కథ వేరే అయిపోతుంది. తెలిస్తే ఆమె పారిస్ కల నిజం చేయడానికే పూనుకుంటాడు తప్ప పెళ్ళి కోసం పట్టుబట్టడు. కాబట్టి కథానాయకుడ్ని హీరోయిన్ విషయాలు తెలియకుండా వుంచేశాడు. కథలో కథకుడు తలదూర్చి కథానాయకుడి కథ తను నడపడమంటే కథా నాయకుడ్ని పాసివ్ క్యారక్టర్ గా మార్చడమే. ఇలా కుమార్ పాసివ్ పాత్ర.

సరే
, ఇంత రాడికల్ గా వున్న సింధుజకి ఎదుటి పాత్రగా కుమార్ సకల సుగుణాలతో కన్సర్వేటివ్ గా వుంటేనే కదా కథకి సంవాదం (కాన్ఫ్లిక్ట్) అనేది పుడుతుంది.

అలా హీరో కుమార్ ది అంత దేవదాసు ప్రేమో
, అర్జున్ రెడ్డి ప్రేమో కాదు. అతను మ్యాడ్ లవర్ ఏమీ కాదు. ప్రేమలో మోసపోయి ప్రేక్షకుల సానుభూతి పొందగల్గేంత పాత్ర చిత్రణేమీ లేదు. టైటిల్ ప్రకారం సింధుజ వరకూ రాక్షసిగా బాగానే వుంది. కుమారే అమాయక చక్రవర్తిలా లేడు. సినిమాలో మొదటి నలభై నిమిషాల సేపు ఆమెని ప్రేమలో పడెయ్యడానికి సాఫ్ట్ వేర్ ఆఫీసు అనికూడా లేకుండా చేసే అల్లరి, కామేడీ, పోకిరీతనం ఇవన్నీ అతడ్ని క్లాసిక్ లవర్ గా, తర్వాత సున్నిత మనస్కుడైన ఓ భగ్న ప్రేమికుడిగా మనం ఫీలయ్యే అవకాశాన్ని లేకుండా చేశాయి.

1991 లో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ గుణ లో హీరోయిన్ ప్రేమ కోసం పిచ్చివాడై ఆమెని కిడ్నాప్ చేసేదాకా వెళ్ళే భావోద్వేగాలతో భగభగ మండిస్తాడు కమల్. ఇలా కుమార్- సింధుజల మధ్య ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ కి, కుమార్ పాత్రేతర పాత్ర చిత్ర ణతో బలం లేకపోయాక, సెకండాఫ్ లో కుమార్ ఆమెతో సహజీవనానికే ఒప్పుకునే ప్లేటు ఫిరాయింపుతో, పూర్తిగా కాన్ఫ్లిక్టే లేకుండా చేశారు కథకి. హీరో మంచోడు, విలన్ మంచోడైతే ఇక కథేముంటుంది.

ఇలా ఇంటర్వెల్లోని కాన్ఫ్లిక్ట్ కూడా క్యాన్సిలై పోయాక
, సెకెండాఫ్ లో వేరే కాన్ఫ్లిక్ట్ పుట్టించి ఇంకో నష్టం చేసుకున్నారు. ఫస్టాఫ్ ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ క్యాన్సిలై, సెకండాఫ్ డూప్లికేట్ కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల స్క్రీన్ ప్లే అనే మధ్యకి ఫ్రాక్చరై, సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడ్డాక, ఇక ఈ సినిమా ఫ్లాపవకుండా కాపాడే నాథుడే లేకుండా పోయాడు.

ఈ ఎత్తుకున్న తాజా కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే
, కుమార్ రహస్యంగా సాగిస్తున్న సహజీవనం తల్లిదండ్రులతో ఘర్షణగా మారిపోవడం. ఈ రోమాంటిక్ డ్రామా కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులాశించే విధంగా హీరోహీరోయిన్ల మధ్య కొనసాగాల్సింది పోయి- తల్లిదండ్రుల మీదికి షిఫ్ట్ అయి- జానర్ మర్యాదకీ, ఫీల్ కీ, యూత్ అప్పీల్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ, మొత్తంగా మార్కెట్ యాస్పెక్ట్ కే దెబ్బ కొట్టేసే దుశ్చర్యగా మారింది. ఒక కథకి ఒకే కాన్ఫ్లిక్ట్ అన్న కామన్ సెన్సు కూడా లేకపోతే ఎలా? ఈమధ్య ఒక మేకర్ తో ఇలాంటిదే సమస్య- సర్దార్ లో లాంటి సమస్య. చెప్తే వినిపించుకోకపోతే ఏం చేస్తాం. కథలో ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందంటే అదెన్నో భావోద్వేగాలతో ముడిపడి వుంటుంది. దాన్ని కొల్లగొట్టి ఇంకో కాన్ఫ్లిక్ట్ తో ఇంకేవో భావోద్వేగాలు సృష్టిస్తామంటే- ఇదేమన్నా పేకాటా? పేకాటాడుకుంటే ఒకే కాన్ఫ్లిక్ట్ కి కట్టుబడి ఆడుకోవాలి.

సెకండాఫ్ లో ఇంటికి దగ్గర్లోనే రహస్యంగా సహజీవనం మకాం పెట్టి
, పేరెంట్స్ ని ఇంట్లోనే వున్నట్టు నటిస్తూ, కిటికీ గుండా రాకపోకలు సాగించే టైపు కామెడీ ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఈ కాలం చెల్లిన టెంప్లెట్ కామెడీ- అబద్ధం చెప్పి ఆడుకునే పాత ఆటతో- గత రెండు నెలల్లోనే వికృత టైటిల్ తో కృష్ణ వ్రింద విహారి’, పాత టైటిల్ తో స్వాతిముత్యం వచ్చి ఫ్లాపయ్యాయి.

ఫస్టాఫ్ లో సింధుజని ప్రేమలో పడెయ్యడానికి నలభై నిమిషాలు కామెడీలతో గడిపి ఇంటర్వెల్లో సీరియస్ చేసినట్టు
, తిరిగి సెకండాఫ్ లో దొంగచాటు సహజీవనంతో ఇంకో 40 నిమిషాలు కామెడీలు నడిపి, ముగింపు సీరియస్ చేశారు. దీంతో కొసరు కథతో ఎమోషన్ లేకుండా పోయింది. కథ లేకపోయినా, సహజీవనం పేరుతో అనేక లిప్ లాక్ సీన్లు, ఎరోటిక్ సీన్లు, డబుల్ మీనింగు డైలాగులు - వీటితో ఏమాత్రం నిలబడలేదు సినిమా.

నటనలు - సాంకేతికాలు

ఈసారి నటనాపరంగా, లుక్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు హీరో శిరీష్. మంచి కాస్ట్యూమ్స్ తో స్టయిలిష్ లవర్ బాయ్ గా వెండి తెరకి గ్లామర్ తీసుకొచ్చాడు. పాటల్లో మాస్ డాన్సులు, స్టెప్పులు వంటివి లేకుండా చూసుకున్నాడు. ఇక అల్లు శిరీష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది సినిమాల క్వాలిటీనే. తన క్యారక్టర్స్ కి డెప్త్ తో కూడిన భావోద్వేగాల చిత్రణే. చేసేవి ప్రేమ సినిమాలైనప్పుడు ప్రేమలో బలం చూపించే, కదిలించే  సన్నివేశాలే.

హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన మాట నెగ్గించుకునే రాడికల్ పాత్రలో బాగానే వుంది. అయితే తన పుట్టిన రోజు తనకే తెలియకుండా ఎలా చదువుకుంది, ఎలా జాబ్ లో చేరింది? ఇందుకే శిరీష్ ఆమె పుట్టిన రోజు ఆమెకి తెలియజేసే అద్భుతంగా తీసిన  సీనుకి అర్ధం లేకుండా పోయింది. దాంతో ఆమె మారడం కూడా కన్విన్సింగ్ గా లేకుండా పోయింది. శిరీష్ తో లిప్ లాక్స్ కి, మిగతా అడల్ట్ సీన్సుకీ మాత్రం కెమిస్ట్రీ తగ్గకుండా చూసుకుంది.

ఆమె తండ్రి  పాత్రలో పృథ్వీ, అతడి తల్లి పాత్రలో ఆమని కన్పిస్తారు. ఆఫీసులో కొలీగ్ గా వెన్నెల కిషోర్ కామెడీ చేస్తే, మేనమామగా సునీల్ కామెడీ చెయ్యడు. మేనల్లుడికి ప్రేమ సలహాలిస్తాడు.

మళ్ళీ ఈసారి అనూప్ రూబెన్స్ సంగీతంలో హిట్ సాంగ్స్ లేవు. చిత్రీకరణతో మాత్రం పాటలు కనువిందుగా వున్నాయి. 80 నిమిషాలు కామెడీ దృశ్యాలే వుండడంతో అచ్చు రాజమణి నేపథ్య సంగీతం గోలగోలగా వుంది అంత సేపూ. తన్వీర్ మీర్ కెమెరా వర్క్ క్లాస్ గా వుంది. సెట్స్ కి బాగా బడ్జెట్ ధారబోయడంతో విజువల్స్ అంతే రిచ్ గా వచ్చాయి. గత సినిమాలకంటే శిరీష్ కిది ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ మూవీ, కంటెంట్ పరంగా కాదు. GA2 పిక్చర్స్ బ్యానర్ కి కథల ఎంపికతో కాన్ఫ్లిక్ట్ వున్నట్టుంది.

—సికిందర్
  

7, నవంబర్ 2022, సోమవారం

1244 : సండే స్పెషల్ రివ్యూ!


     గత్ప్రసిద్ధ బ్రిటిష్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ గురించి తెలియని వారుండరు. షెర్లాక్ హోమ్స్ మీద చాలా సినిమాలొచ్చాయి. షెర్లాక్ హోమ్స్ చెల్లెలితో రాలేదు. షెర్లాక్ హోమ్స్  టీనేజీ చెల్లెలు డిటెక్టివ్ ఎనోలా హోమ్స్ సాహసాలతో సీక్వెల్స్ ప్రారంభమయ్యాయి. 2020 లో ఎనోలా హోమ్స్  విడుదలై విపరీత జనాదరణ పొందాక, దీని సీక్వెల్ గా ఈ నవంబర్ 4 న ఎనోలా హోమ్స్ 2  విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియోతో అందుబాటులో వున్న ఈ డిటెక్టివ్ ఫన్ థ్రిల్లర్ ప్రశంసలందుకుంటోంది. డిటెక్టివ్ ఎనోలాగా తిరిగి మిల్లీ బాబీ బ్రౌన్ కాస్త కొంటె తనం, తెగువ గల అదే నటనని ఫన్నీగా కొనసాగించింది. అన్న షెర్లాక్ హోమ్స్ గా హెన్రీ కావిల్ నటించాడు. ఈ సీక్వెల్ కి కూడా హారీ బ్రాడ్ బీర్ దర్శకత్వం వహించాడు. బ్రిటిష్ నటీనటులతో, దర్శకుడితో అమెరికన్ కంపెనీతో బాటు మిల్లీ బాబీ బ్రౌన్ నిర్మాతగా వుంది. ఎనోలా మిల్లీ బాబీ బ్రౌన్ 2004 లో జన్మించిన 18 ఏళ్ళ టీనేజర్.

        నోలా పాత్ర ఎలా పుట్టిందని తెలుసుకుంటే, ఈ షెర్లాక్ హోమ్స్ టీనేజర్ చెల్లెలి పాత్రని సృష్టించింది అమెరికన్ రచయిత్రి నాన్సీ స్ట్రింగర్. యంగ్ అడల్ట్ ఫిక్షన్ కింద ఈ పాత్రని సృష్టించి, ఎనోలా హోమ్స్ మిస్టరీస్ పేరుతో ఏడు నవలలు రాసింది. వీటిలో రెండు సినిమాలుగా వచ్చాయి. ఎనోలా హోమ్స్ 2 19 వ శతాబ్దపు షెర్లాక్ హోమ్స్ కాలంలోనే పీరియెడ్ మూవీగా వుంటుంది. నేర పరిశోధన అంటే మన తెలుగు సినిమాల్లోలాగా ఇన్వెస్టిగేషన్ తోనే బోరు కొట్టించకుండా, ఇన్వెస్టిగేషన్ కి యాక్షన్ ని జోడించుకుని ఫన్ రైడ్ గా వుంటుందిది. ఈ కథ ఇంగ్లాండులో 1888 లో అగ్గిపెట్టెల కర్మాగారంలో జరిగిన మ్యాచ్ గర్ల్స్ స్ట్రయిక్ (అగ్గిపుల్లల కార్మికురాళ్ళ సమ్మె) ఆధారంగా వుంటుంది.

చదువు మానేసి చలో లండన్ కి...

    ఎనోలా హోమ్స్ చదువుకోకుండా తల్లిని వదిలేసి లండన్ పారిపోయి వచ్చి అన్నలాగా డిటెక్టివై, హోమ్స్ వంశం పేరు నిలబెట్టాలనుకుంటుంది. కానీ అన్న షెర్లాక్ హోమ్స్ తన వరల్డ్ ఫేమస్ చిరునామా 221 బి, బేకర్స్ స్ట్రీట్ లో తిరుగులేని డిటెక్టివ్ గా చెలామణి అవుతున్నాడు. అన్నకి తెలియకుండా తను  హోమ్స్ డిటెక్టివ్ ఏజెన్సీ అని ప్రారంభించి కూర్చుంటే, రెండు కారణాలతో కేసులు రావడం లేదు : ఒకటి, సొంత ఐడెంటిటీ లేక అన్న చాటు పిల్లగా బ్రతకాల్సి రావడం; రెండు, అమ్మాయి కావడం. దీంతో ఇక లాభంలేదని మూటా ముల్లె సర్దుకోబోతూంటే, ఓ 14 ఏళ్ళ అమ్మాయి బెస్సీ వచ్చి వరంలా కేసు దానమిస్తుంది.

        బెస్సీ అక్క సారా కనిపించడం లేదని ఫిర్యాదు. ఎనోలా వాళ్ళింటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బెస్సీ, సారా అగ్గిపెట్టెల కర్మాగారంలో కార్మికురాళ్ళు. అక్కడేమైనా క్లూ దొరుకుతుందేమోనని ఎనోలా కార్మికురాలిగా చేరుతుంది. వందల మంది కార్మికురాళ్ళని నోటి పరీక్ష జరిపి లోపలికి పంపిస్తూ వుంటారు. అది టైఫస్ విషజ్వరం పరీక్ష. చాలామంది ఈ విషజ్వరంతో చనిపోతున్నారు. కార్మికురాలిగా లోపలికి వెళ్ళిన ఎనోలా కన్నుగప్పి మేనేజర్ ఆఫీసులోకి దూరి పరిశోధన చేస్తుంది. కొన్ని అగ్గిపుల్లలు దొరుకుతాయి. అవి ఇప్పుడు తయారవుతున్న తెలుపు రంగు బదులు ఎరుపు రంగు అగ్గిపుల్లలు.

        ఎనోలాకి మే అనే కార్మికురాలి మీద అనుమానం వచ్చి ఆమెని అనుసరిస్తుంది.  మధ్యలో బాగా తాగి వస్తున్న షెర్లాక్  హోమ్స్ కనిపిస్తాడు. అతడ్ని ఇంటి దగ్గర దిగబెడుతుంది. అతనొక కేసుని ఛేదించడానికి ఒంటరిగా కష్టపడుతున్నాడని తెలుసుకుంటుంది. తను కూడా తన కేసుతో ఒంటరిగానే కష్టపడుతోంది. ప్రభుత్వాధికారులు పాల్పడుతున్న బ్లాక్ మెయిల్ షెర్లాక్ చూస్తున్న కేసు. అయితే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు ఎక్కడ్నించి వస్తోందో అంతు చిక్కకుండా వుంది.

        తర్వాత మే కోసం వెళ్ళిన ఎనోలా అక్కడ మే ని చంపిన నేరం మీదపడి, పట్టుకోవడానికి వచ్చిన స్కాట్ లాండ్ యార్డ్ పోలీసు అధికార్లని కొట్టి పారిపోతుంది. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ కేసు ఎలా ఛేదించింది ఎనోలా? అసలు సారా ఏమైంది? కార్మికురాళ్ళు టైఫస్‌తో కాకుండా అగ్గిపుల్లల్లో ఉపయోగించే తెల్లటి భాస్వరం వల్ల చనిపోతున్నారని ఎనోలా కెలా తెలిసింది? ఆర్ధిక మంత్రి లార్డ్ మెక్‌ఇంటైర్ లాభాలు సంపాదించడానికి చౌకగా ఉండే భాస్వరాన్ని ఉపయోగించి అగ్గిపుల్లలు ఉత్పత్తి చేస్తున్నాడని ఎప్పుడు తెలిసింది? తన వెంటపడుతున్న స్కాట్ లాండ్ యార్డ్ అధికారులు కూడా బ్లాక్ మెయిలర్సేనా? కౌంటర్ కేసులో పీకల్లోతు ఇరుక్కున్న చెల్లెల్ని షెర్లాక్ హోమ్స్ ఎలా కాపాడాడు? ఇద్దరూ కలిసి అగ్గిపెట్టెల కర్మాగారం కుంభ కోణాన్ని ఎలా రట్టు చేశారు? ఇవన్నీ రసవత్తరంగా సాగే ఈ విక్టోరియా కాలపు మిగతా కథలో తెలుస్తాయి.

మిల్లీ బాబీ బ్రౌనే హైలైట్

        ఎనోలా హోమ్స్ గా మిల్లీ బాబీ బ్రౌన్ తో చాలా ఫన్ ఇదంతా. టీనేజీ తెగువ, ప్రమాదాల్ని తేలికగా తీసుకునే తత్వం, హాస్యం, చిలిపితనం, కొంటె తనం- తెలిసీ తెలియక ఏం చేస్తోందో అర్ధంగాని సాహసకృత్యాలు- ఇవన్నీ కలర్ఫుల్ క్యారక్టర్ గా మార్చేశాయి. ప్రారంభమే పోలీసులతో ఛేజింగ్, యాక్షన్; హత్యలో ఇరుక్కునే సన్నివేశంలో పోలీసు అధికారుల్ని మోతమోగించి పారిపోయే ధైర్యం - క్లయిమాక్స్ వరకూ ఇదే స్పీడు. ఆమెలో ప్రవహిస్తోంది హోమ్స్ రక్తమే.

        చివరికి జైల్లో ఇక ఉరి వేస్తారనగా ఆమె తల్లి వచ్చేసి, జైలరమ్మతో కలిసి కూతుర్ని విడిపించుకుని పారిపోయే దృశ్యం ఇంకా వినోదం. ముగ్గురు ఆడవాళ్ళు  గుర్రబ్బగ్గీలో పారిపోతూ వెంటాడుతున్న పోలీసుల్ని - ఎస్పీ సహా- బాంబులతో బెంబేలెత్తించి గెలిచే యాక్షన్ ఎపిసోడ్ ఆ కాలంలో స్త్రీ శక్తిని హైలైట్ చేస్తుంది.

        స్త్రీవాదం, పారిశ్రామిక కుట్ర, శ్రామికవర్గ తిరుగుబాటు, ప్రేమ కథ, తల్లి నుంచి జీవిత పాఠాలు, అన్న నుంచి సహకార గుణం వంటి అంశాలతో ఈ రెండు గంటల సినిమా స్పీడుగా సాగుతుంది. ఎనోలా పాత్రకి ఇంకో టెక్నిక్ వాడారు. ఫోర్త్ వాల్ టెక్నిక్. అంటే పాత్ర కెమెరా వైపు తిరిగి ప్రేక్షకులతో మాట్లాడే ప్రక్రియ. దీంతో అడుగడుగునా ప్రేక్షకులు ఆమెతో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ మాట్లాడే రెండు మాటలు చాలా తమాషాగా వుంటాయి. ఆమె హావభావాలు, శరీర భాషా ఫన్నీగా వుంటాయి.

        షెర్లాక్ పాత్రలో హెన్రీ కావిల్ డౌన్ ప్లే చేస్తాడు. ఎనోలా పాత్ర హైలైట్ అవడానికి తను బ్యాక్ గ్రౌండ్ లో వుంటాడు. ఆమె మరీ ప్రమాదంలో పడిపోతే తప్ప ముందుకు రాడు. ఒంటరిగా ఏదైనా సాధించగలననుకునే ఎనోలా, ఒంటరిగా కష్టపడుతున్న అన్న మాటలు వింటుంది. మనుషులు ఒంటరిగా ఏం సాధించలేరని, ఆధారపడడానికి ఒకరుండాలని, షెర్లాక్ చెప్పడంతో ఒప్పుకుంటుంది. 'హోమ్స్ అండ్ హోమ్స్' అని కంబైన్డ్ ఏజెన్సీ ప్రారంభిస్తారు.

        ఇంతకీ షెర్లాక్ తో వుండే అసలు తోడు ఏమయ్యాడు? అతను ముగింపులో ఏదో పనుండి వస్తాడు. తన పేరు డాక్టర్ వాట్సన్ అంటాడు. ఇలా నేర పరిశోధనల్లో షెర్లాక్ వెంట వుండే పాపులర్ పాత్ర డాక్టర్ వాట్సన్ పరిచయమవుతుంది. రెండో సీక్వెల్ వుంటే ఈ పాత్ర  కూడా వుండొచ్చు.

ఇందులో స్ఫూర్తి ఏమిటి?

        హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర తీరుతెన్నుల్ని ఆద్యంతం కట్టిపడేసేలా చేయడమెలాగో తెలుసుకోవచ్చు. 20 లోపు టీనేజీ హీరోయిన్ పాత్రతో, అదే ఏజీ గ్రూపు హీరోయిన్ తో, కొత్తగా యంగ్ అడల్ట్ ఫిక్షన్ జానర్ ని తెలుగులో ప్రవేశ పెట్టవచ్చని ఆలోచించవచ్చు. కథలో స్త్రీ సమస్య వుంటే దాన్ని శాకినీ ఢాకినీ లోలాగా హీరోయిన్ల పాత్రలు ముట్టుకోకుండా పలాయనం చిత్తగించడం కుదరదని తెలుసుకోవచ్చు. కర్మాగారంలో కార్మికురాళ్ళు ప్రాణాంతక సమస్యతో వుంటే ఎనోలా వూరుకోకుండా సమ్మె చేయించే సామాజిక బాధ్యత తీసుకోవడాన్ని గమనించవచ్చు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇతర స్త్రీ పాత్రల చేత సాహసాలు కూడా చూపించి జానర్ ఫీల్ ని పెంచొచ్చు. ప్రేక్షకుల్ని సినిమాలో యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేయడానికి ఫోర్త్ వాల్ టెక్నిక్ ని వాడవచ్చని తెలుసుకోవచ్చు.  

—సికిందర్