రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జులై 2022, మంగళవారం

1184 : రివ్యూ!

 

 రచన- దర్శకత్వం : రజత్ కపూర్

తారాగణం : రజత్ కపూర్ (ద్విపాత్రాభినయం), మల్లికా షెరావత్, రణవీర్ షోరే, మనూ రిషీ చద్దా, చంద్రచూడ్ రాయ్, కుబ్రా సెయిట్, , అభిషేక్ శర్మ తదితరులు
సంగీతం : సాగర్ దేశాయ్, ఛాయాగ్రహణం : రఫీ మహమూద్
బ్యానర్స్ : ఎన్ ఫ్లిక్స్ ప్రై.లి; ప్రియాంశీ ఫిలిమ్స్, మిథ్య టాకీస్
నిర్మాత : రజత్  కపూర్
విడుదల : జులై 22, 2022
నిడివి :  95 ని.
***
        ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత రజత్ కపూర్ కి కూడా సినిమా తీయాలంటే క్రౌడ్ ఫండింగ్ తప్పలేదు. వందలాది మంది విరాళాలిచ్చి ఈ సినిమా నిర్మాణానికి తోడ్పడ్డారు. క్రౌడ్ ఫండింగ్ తో తీసే సినిమాలు తక్కువే. ఇండిపెండెంట్ సినిమాల పేరుతో తీసే ఇవి దాదాపు అడ్రసులేకుండా పోయినవే. ప్రస్తుత సినిమాలో ఒక డైలాగు వుంటుంది- ఇండిపెండెంట్ సినిమాల పేరుతో చెత్త సినిమాలు చూడడానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారని. రజత్ కపూర్ అలాటి ఇంకో చెత్త కాకుండా, క్రౌడ్ ఫండింగ్ తో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ RK / RKAY ని ఒక కళాఖండంలా తీసి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలందుకున్నాడు. అమెరికాలో ఇది గత సంవత్సరమే విడుదలైంది. దీనితో కలిపి 12 సమాంతర సినిమాల దర్శకుడైన రజత్, ఇప్పుడు అపూర్వంగా చేసిన ప్రయోగమేమిటి? 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మెటా కామెడీ ఈ వారాంతం మూడు రోజులూ 5.75 కోట్లు వసూలు చేసింది. ఇందులో నిన్నఆదివారం 3 కోట్లు వసూలు చేసింది. సామాన్య ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయగల విషయం ఏమిటిందులో కొత్తగా వుంది? వివరాల్లోకి వెళ్దాం...

కథ

    ఆర్కే (రజత్ కపూర్) సినిమా దర్శకుడు. భార్యా ఇద్దరు పిల్లలు. 1960 లనాటి సినిమాలకి నీరాజనంగా సినిమా తీయాలనుకుంటాడు. తానే హీరో పాత్ర. హీరోయిన్ పాత్రకి బిజీ నటి నేహా (మల్లికా షెరావత్) ని ఒప్పిస్తాడు. నిర్మాతగా బిల్డర్ గోయెల్ సాబ్ (మనూ రిషీ చద్ధా) కి బడ్జెట్ ఇస్తాడు. షూటింగ్ ప్రారంభమవుతుంది. 1960 లనాటి ఈ కథలో గులాబో పాత్రని ఎంతో ఇష్టపడ్డ నేహా ఆనాటి హీరోయిన్ లా ముద్దులొలుకుతూ నటిస్తుంది. ఆమె ప్రేమికుడు మహెబూబ్ గా దర్శకుడు ఆర్కే క్లాస్ గా నటిస్తాడు. మహెబూబ్ - గులాబో మహోజ్వల ప్రేమ కథలో దృశ్య కావ్యంలా కీలక సన్నివేశం -నా గుండె ఎందుకు అదురుతోంది?’ అంటుంది. నీ ఎదుట నేనున్నందుకు అంటాడు. ఈ క్లాసిక్ సన్నివేశం నటించడానికి చాలా టేకులు తీసుకుంటుంది. యూనిట్ కి పిచ్చెత్తుతుంది. తర్వాత ఇద్దరూ బాస చేసుకునే ఇంకో భావోద్వేగ సన్నివేశం - రాత్రి పదిన్నరకి బాంద్రా స్టేషన్లో కలుసుకుని కలకత్తా వెళ్ళిపోవాలని.

        ఇలా షూటింగ్ సాగుతూ సాగుతూ క్లయిమాక్స్ ముందు సీను వస్తుంది. చెట్ల మధ్య మహెబూబ్ కీ, విలన్ కె ఎన్ సింగ్ (రణవీర్ షోరే) కీ యాక్షన్ సీను. ఈ సీనులో కె ఎన్ సింగ్ కి చెందిన ఐదు లక్షలతో మహెబూబ్ పారిపోతాడు. ఇక ముగింపు సీన్లే మిగిలుంటాయి. ముగింపులో కె ఎన్ సింగ్, మహెబూబ్ ని కాల్చి చంపి ఐదు లక్షలు సొంతం చేసుకునే సీను. ఇలా ముగింపు దృశ్యాలు మిగిలి వుండగా, అంతవరకూ వచ్చిన డిజిటల్ ఫైల్స్ ని ఎడిటర్ ఎడిటింగ్ చేస్తూ కంగారు పడతాడు. సినిమాలో ఎక్కడా మహెబూబ్ కన్పించడు. తీసిన సినిమాలోంచి మహెబూబ్ క్యారక్టర్ పారిపోయాడని ఆర్కేకి కాల్ చేసి చెప్తాడు.

        ఆర్కేకి పిచ్చెత్తుతుంది. తీసిన సినిమాలోంచి క్యారక్టర్ పారిపోవడమేమిటి? షూట్ చేసిన సీన్లలో ఎక్కడా లేకుండా ఎలా పోతాడు? ఇప్పుడేం చేయాలి? ముంబాయిలో వెతకడం మొదలెడతారు. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తారు... ఇంతకీ ఏమయ్యాడు మహెబూబ్? ఎందుకు సినిమా సీన్లలోంచి పారిపోయాడు? ఇప్పుడెలా పట్టుకోవాలి? పట్టుకుని సినిమా పూర్తి చేసి అక్టోబర్ 15 కల్లా ఎలా విడుదల చేయాలి?...

ఎలా వుంది కథ

    ఐడియా చూస్తేనే నవ్వొచ్చే విషయం. మెటా మూవీ జానర్ కథ. దేశీయ తెరమీద తొలి ప్రయత్నం. మెటా అంటే వున్న స్థితిని దాటడం. కథలోని పాత్ర, ఆ కథని దాటి నిజ ప్రపంచంలో విహరించడం. కొంచెం తేడాతో ఫోర్త్ వాల్ టెక్నిక్ అని కూడా వుంటుంది. హిందీలో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ (2019), ఘూమ్ కేతు (2020) సినిమాల్లో ఇది చూశాం. అంటే సినిమాలోని పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథ గురించి, పాత్రల గురించీ కామెంట్లు చేయడం. ఇది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో ప్రధానమంత్రి సలహాదారు అక్షయ్ ఖాన్నాతో బాగా వర్కౌటయ్యింది. కానీ ఘూమ్ కేతు లో రచయిత పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖీతో విఫలమయింది.

        ప్రస్తుత సినిమాలో సినిమాలోని పాత్రలు సినిమాలోంచి తప్పించుకుని నిజ ప్రపంచంలో పడ్డం మెటా మూవీ జానర్ కిందికొస్తుంది. ఈ ప్రయోగం 1985 లోనే హాలీవుడ్ లో వుడీ అలెన్ చేశాడు. ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో అని అప్పట్లో తీసిన మెటా మూవీలో ప్రేమ కథ. మియా ఫారో నటించిన ఈ 82 నిమిషాల ముక్కోణ ప్రేమ కథ పదిహేను లక్షల డాలర్ల బడ్జెట్, కోటిన్నర డాలర్ల బాక్సాఫీసు.

        ఇందులో ఇంట్లో భర్తతో సమస్యలొచ్చి మనశ్శాంతి కోసం సినిమాల కలవాటు పడుతుంది మియా. ఒక సినిమా నచ్చి పదే పదే చూస్తుంది. తనని చూడడానికి ఇన్నిసార్లు  సినిమాకొస్తున్న మియా మీద ప్రేమ పుట్టి వెండితెర లోంచి ఆమె దగ్గరి కొచ్చేస్తాడు హీరో జెఫ్ డేనియెల్స్. ఇక ఇద్దరూ షికార్లు తిరగడం మొదలెడతారు. వీళ్ళ ప్రేమాయణం మధ్యకి మియా భర్త రావడంతో సంక్షోభం మొదలవుతుంది.

        2021 లో అక్షయ్ కుమార్ -సారా అలీఖాన్ -ధనుష్ నటించిన అట్రంగీరే లో సారా ఓ కథలోని మెజీషియన్ పాత్ర (అక్షయ్ కుమార్) నిజంగానే వున్నాడనుకుని ప్రేమిస్తుంది.  ఓ రోజు గుర్రం మీద వచ్చేస్తుంది మెజీషియన్ పాత్ర. ఇది మెటా మూవీ కాదు, సారా కల్పించుకున్న ఫాంటసీ.

        వుడీ అలెన్ తీసిన సినిమా మెటా జానర్లో రోమాంటిక్ కామెడీ. రజత్ సినిమా అబ్సర్డ్ (అసంబద్ధ) కామెడీ. నాన్సెన్స్ హ్యూమర్ అని కూడా అనొచ్చు. మైండ్ లెస్ కామెడీకంటే ఒక మెట్టు పైనుండే క్రియేటివిటీ. ఈ సృజనాత్మకతని రజత్ అనితరసాధ్యంగా సాధించాడు. తెలుగులో బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలంటే అనునిత్యం కొత్త జానర్లతో కథల కోసం రీసెర్చి చేయాల్సిందే- అప్డేట్ అవ్వాల్సిందే. రీసెర్చి లేకుండా రాయడానికి/తీయడానికి గడ్డిపోచ కూడా దొరకదు, మెదడులో వుండే చెత్త తప్ప.

    రజత్ కపూర్ మెటా మూవీ, దర్శకుడికీ- దర్శకుడు సృష్టించిన పాత్రకీ మధ్య సంఘర్షణ. దర్శకుడు తీస్తున్న సినిమా ముగింపులో చావడం ఇష్టం లేని హీరో క్యారక్టర్ మహెబూబ్, తీసిన సినిమాలోంచి పారిపోయి వచ్చి దర్శకుడితో తగువు పెట్టుకుంటాడు. తిరిగి ఇతడ్ని తీసిన సినిమాలోకి ఎలా పంపించాలన్నది దర్శకుడి సమస్య. తీసిన సినిమాలోంచి ఐదు లక్షలతో పారిపోయిన మహెబూబ్ క్యారక్టర్ ని పట్టుకోవడానికి, విలన్ క్యారక్టర్ కె ఎన్ సింగ్ కూడా తీసిన సినిమాలోంచి బయటపడి నిజ ప్రపంచంలో అలజడి సృష్టిస్తాడు. ఇలా తీసిన సినిమాలోంచి హీరో, విలన్ ఇద్దరూ పారిపోయేసరికి ఏం చేయాలో దిక్కు తోచదు ఎడిటర్ కి. తీసిన సినిమాలోంచి విలన్ కూడా పారిపోయాడని ఇంకో పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఇలాటి సినిమాలెందుకు తీస్తారయ్యా, ప్రేమ సినిమాలు తీసుకోక? - అంటాడు పోలీసు అధికారి. ఇక విలన్ పాత్రనీ పట్టుకోవడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. పిచ్చ నవ్వు పుట్టడానికి ఇంతకంటే పిచ్చి కామెడీ లేదు.

        పూర్తి స్థాయి కొత్త తరహా హాస్య కథ ఇది. నవ్వి నవ్వి బయటికొస్తాం. ఈ కథ ఐడియా, దీని పాలనా అనిర్వచనీయమన్న మాట. కల్పన- వాస్తవం రెండిటి కలబోత.దృశ్యకావ్యంలా తీస్తున్నామని దీన్ని ఫిలాసఫికల్ గా మార్చలేదు. దర్శకుడికీ పాత్రకీ మధ్య నడిచే దృశ్యాల్లో ఒకటి రెండు సందర్భాల్లో సృష్టికర్తకీ, ప్రాణికీ మధ్య వుండే సంబంధంతో సంఘర్షణని పైపైన టచ్ చేసి వదిలేస్తాడు- ఈ గంభీర విషయాలనే థీమ్ గా చేయలేదు - నీకు రాసిపెట్టివున్న దానికంటే ఎక్కువ, దాని కాలానికంటే ముందు, నీ కేదీ దక్కదు (దర్శకుడు), నా నొసటి రాత నేను మార్చి పారేస్తా (పాత్ర), సృష్టికి ముందూ తర్వాతా ప్రేమ తప్ప మరేదీ లేదు  (దర్శకుడు)- లాంటి గంభీర చర్చని నామమాత్రం చేశాడు. ప్రొఫెషనల్ సమస్యనే ప్రధానంగా చేసి బాక్సాఫీసు ఫ్రెండ్లీ కథనం నడిపాడు.

     నువ్వు నిజం కాదు, నేను రాశాను కాబట్టే పాత్రగా నువ్వున్నావ్ అంటాడు దర్శకుడు. అక్కడే నువ్వు తప్పులో కాలేశావ్ ఆర్కే సాబ్. నీకు నీ రాత మీద నమ్మకం లేదు గాబట్టే పాత్ర చనిపోవాలనుకుంటున్నావ్ అంటుంది మహెబూబ్ పాత్ర, నేను నిజం కాదని నన్నెందుకు మాటిమాటికీ కించపరుస్తావ్? నీకు నువ్వు మాత్రం నిజం అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?’ అని రెట్టిస్తుంది పాత్ర. ఆర్కే కంట్రోల్లో వుండడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మహెబూబ్ పాత్ర. కథ మీద అదుపు ఎవరికుండాలి- పాత్రకా? రచయితకా? కథ పాత్రదా? రచయితదా?

        తెలుగు సినిమాలకి చాలా అవసరమైన పాయింటు ఇది. గత ఇరవై ఏళ్ళుగా పాత్ర కథని పాత్ర నడుపుకో నివ్వకుండా, జోక్యం చేసుకుని, పాసివ్ పాత్రగా మార్చేస్తూ తాము కథ నడిపి - 90% అట్టర్ ఫ్లాపులు తీస్తున్న కొత్త తరం మేకర్లు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయమిది. ఇరవయ్యేళ్ళకి పూర్వం సీనియర్ రచయితలతో, దర్శకులతో ఇలా వుండేది కాదు.     

        పాత్రకుండే చైతన్యం రచయితకుండదు. పాత్ర దాని కథ అది నడుపుకుంటే చాలా ఆశ్చర్యపరుస్తూ సాగుతుంది. రచయిత కూడా వూహించని ఆశ్చర్యాలు సృష్టిస్తుంది. దీని ప్రాముఖ్యం గురించి సిడ్ ఫీల్డ్ అనేకసార్లు, 19వ శతాబ్దపు సుప్రసిద్ధ రచయిత హెన్రీ జేమ్స్ ని ఉటంకిస్తాడు- What is character but the determination of incident? What is incident but the illustration of character?అని. ఈ మధ్యే ఒక కథ చేస్తూంటే, అనూహ్యంగా పాత్ర వచ్చేసి థ్రిల్లింగ్ ముగింపు ఇచ్చేసరికి బిత్తరపోవాల్సి వచ్చింది.

    విచిత్రమేమిటంటే కథా చర్చల్లో నేను కరెక్ట్ అంటే, కాదు నేను కరెక్ట్ అని సిగపట్లకి దిగుతారు. వీళ్ళని చూసి క్యారక్టర్ నవ్వుకుంటుంది. అసలు నేనేమనుకుంటున్నానో ఇంపార్టెంట్రా బాబూ అంటూ - వినేవారు లేకా విసుక్కుంది నాకేకా - అని పాడుకుంటూ వూళ్ళు పట్టుకుని పోతుంది పాత్ర. ఇక ఇగోలు శాటిస్ఫై చేసుకుని, ఇంకో అట్టర్ ఫ్లాప్ తీయడానికి శ్రీకారం చుడతారు.

        రచయితకి ఇగో కాదు, మెచ్యూర్డ్ ఇగో వుండాలి. పాత్రకి వుంటుంది ఇగో. అనుభవాల క్రమంలో దాని ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మారే స్థాయికి అది ఎదుగుతుంది. ఇదీ కథంటే. కథల్ని విశ్లేషిస్తే యుగాలుగా ఇదే. ఎవరి ఇగో కూడా చావదు. మనుషులు చేయగల్గింది తమ ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని ఎదగడమని కథలు చెప్తాయి. ఈ మూల సూత్రం తోనే కథలుంటాయి. కథంటే సైకో థెరఫీ. కథంటే ఆర్గ్యుమెంట్. అంటే స్టోరీ సిట్టింగ్స్ లో కుమ్ములాట కాదు, కథలోని పాత్రల మధ్య సంఘర్షణ. కథలోని పాత్ర వచ్చి దర్శకుడితో సంఘర్షించే కథనంతో ఈ మెటా పోయెటిక్ ఫన్ ఒక పాఠ్యాంశం.

నటనలు- సాంకేతికాలు 
    చంపడాని కిష్టపడ్డ దర్శకుడిగా, చావడాని కిష్టపడని పాత్రగా రజత్ కపూర్ డీసెంట్ గా ద్విపాత్రాభినయం చేశాడు. ఇద్దరి మధ్య వాళ్ళకి సీరియెస్ సీన్లే, కానీ ప్రేక్షకులకి హాస్యం. పాత్ర దర్శకుడి ఇంట్లోనే బస చేసి, మంచి వంట వాడుగా వండి పెడుతూంటే, వీడికి వంట వచ్చని నేను రాయలేదే - అని దర్శకుడి అంతర్మధనం. భార్య కూడా పాత్ర పక్షమే వహించేసరికి, కత్తితో పాత్ర పీక కోసి చంపెయ్యడానిక్కూడా సిద్ధపడతాడు దర్శకుడు. ఈ ద్విపాత్రాభినయానికి ఏ పాత్ర హావభావాలు ఆ పాత్రకి అతికినట్టుగా అన్వయించి నటించడం రెండు పాత్రల్నీ ఇంట్రెస్టింగ్ గా మార్చింది.

        1960 ల నాటి సినిమా పాత్ర గులాబోగా మల్లికా షెరావత్ రాకుమారి గ్రేస్ తో మెస్మరైజ్ చేస్తుంది చాలా కాలం తర్వాత తెరపైకొచ్చి. ఈమె వున్న దృశ్యాల్ని పోయెటిక్ గా తీర్చిదిద్దాడు రజత్. మహెబూబ్ కోసం కలవరిస్తూ తీసిన సినిమాలోనే వుండిపోయే క్యారక్టర్. ఈమెకి నచ్చజెప్పి కథకి తాననుకున్న ముగింపే ఇవ్వడానికి విఫలయత్నాలు చేస్తాడు దర్శకుడు.  

        విలన్ పాత్రలో రణవీర్ షోరే, అతడి ముగ్గురు అనుచరులూ (సనమ్ కుమార్, ఆదర్ మాలిక్, పీయూష్ రాయ్) ఒక పిచ్చి మేళం. చప్పుడెక్కువ, చేసేది తక్కువ. మహెబూబ్ కోసం తీసిన సినిమాలోంచి పారిపోయిన విలన్ పాత్రగా షోరే, ముంబాయిలో తిరుగుతూ-తన దగ్గరున్న ఫోన్ నెంబరుతో కాల్స్ చేస్తూంటాడు. ఆ నెంబర్ కలవదు. ఈ మహెబూబ్ నంబర్ సినిమాలో సినిమా కోసం రాసిన కల్పిత  నెంబరురా అంటే వినకుండా, పిస్తోలు తీసి పేల్చే సీనులో షోరే నటన టాప్. అలాగే పోలీసులు పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొచ్చినప్పుడు కూడా.

    నిర్మాత గోయెల్ సాబ్ గా మనూ రిషీ చద్దా నుంచి కూడా హాస్యం పొందొచ్చు. హీరోని చంపవద్దని ముందే చెప్తాడు, దర్శకుడు ఆర్కే వినకుండా చంపే కథే తీయడంతో హీరో పారిపోయాడు. బిల్డర్ గా నిర్మాతది ఆర్ధిక సంకటం, దర్శకుడిగా ఆర్కేది కళా లంపటం. చద్దా వున్న సీన్లు కూడా నవ్విస్తాయి.

        మిగిలిన నటీనటులు కూడా సహాయపాత్రల్లో సహజత్వాన్ని చాటారు. సాంకేతికంగా ఇదొక స్థాయిలో అద్భుతమే. సెట్స్, లొకేషన్స్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, వర్తమానంతో బాటు, 1960 ల నాటి పీరియెడ్ లుక్, లైటింగ్ వగైరాలతో విజువల్స్ కి నిజమంటే నిజంగా స్క్రిప్టు న్యాయం చేసింది. తెలుగులో చూస్తూంటాం- ప్రొడక్షన్ విలువలు ఆకాశంలో, స్క్రిప్టు పాతాళంలో!

చివరికేమిటి

    మెటా మూవీ సమాంతర సినిమాయేగా అని తన కోరికల గుర్రాలతో స్క్రిప్టు చేయలేదు రజత్ కపూర్. చక్కగా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో సార్వజనీన - మెయిన్ స్ట్రీమ్ స్క్రీన్ ప్లేనే చేశాడు. అంతర్జాతీయ మీడియా పొగడ్తలతోనే రివ్యూలిచ్చింది- ఒక్క రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ తప్ప. రోజర్ ఎబర్ట్ డాట్ కామ్ రివ్యూలో- ఈ సినిమా వుడీ అలెన్ సినిమా సారాన్ని పట్టుకోలేక పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే పైన చెప్పుకున్న ఫిలాసఫీని.    వుడీ అలెన్ మెటా మూవీ ది పర్పుల్ రోజ్ ఆఫ్ కైరో ముక్కోణ ప్రేమ కథ. భర్తతో బాధాతప్త సంసారం నుంచి ఉపశమనం కోసం సినిమాలకలవాటు పడ్డ మియా ఫారో కోసం,  ప్రదర్శిస్తున్న సినిమాలోంచి హీరో వచ్చేయడం ఆమె మానసిక స్థితి, స్వైరకల్పన. అతడితో ప్రేమాయణం సాగిస్తున్నట్టూ వూహించుకుని ఊరట పొందడం. ఒక రకంగా ఇది అనైతికమే. దీనికి అనుభవిస్తుంది చివరికి.

        ఆమెని ప్రేమిస్తూ హీరో పాత్ర సినిమాలోంచి వెళ్ళి పోయేసరికి, ఆ పాత్ర పోషించిన  నిజ జీవీతంలో హీరోయే రంగంలోకి దిగుతాడు. నేను పోషించిన పాత్రే కావాలా, నిజ వ్యక్తిని నేను కావాలా - అని అడుగుతాడు. నువ్వే కావాలని భర్తకి విడాకులిచ్చేస్తుంది. చేసేదిలేక సినిమా పాత్ర సినిమాలో కెళ్ళి పోతుంది. హీరో కూడా ఆమెకి హేండిచ్చి వెళ్ళిపోతాడు. అతడిక్కావాల్సింది నిర్మాత సినిమాని కాపాడ్డమే తప్ప, ఈమెతో సంసారం చేస్తూ కూర్చోవడం కాదు. రెంటికీ చెడ్డ రేవడి అవుతుందీమె. సమస్య వస్తే ఎదుర్కోవాలే గానీ, పలాయన వాదం ప్రమాదకరమనే నీతీ, ఫిలాసఫీ ఇందులో వున్నాయి.

        రజత్ మూవీలో ఈ సెటప్ లేదు. ఎవరూ వూహించుకోలేదు. తీసిన సినిమాలోంచి పాత్రలే వాటి అవసరాలకోసం పారిపోయాయి. రెండూ దర్శకుడ్ని పట్టుకుని వేధించాయి. ఇది వేరు. ఇందులో ఫిలాసఫీ చెప్తే  సముద్రకని దర్శకత్వంలో వినోదాయ చిత్తం (2021) లా అయ్యేది. విదేశాల్లో ఏమో గానీ, ఇప్పుడు ఇండియాలో సినిమా అంటే ఒక సంఘటన, దాని చుట్టూ పరిణామాలతో పరుగులెట్టే కథ. ఆ సంఘటన ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ గురించి. సంఘటనల్లోనే తీసుకోవాలంటే నీతీ రీతీ అన్నీ వాటికవే వుంటాయి. ప్రత్యేకంగా మెసేజిలివ్వడం కోసం సినిమాలు తీయనవసరం లేదు.

        స్ట్రక్చర్ చూస్తే తీసిన సినిమాలోంచి హీరో పాత్ర పారిపోవడంతో  ప్లాట్ పాయింట్ వన్ సరీగ్గానే 30వ నిమిషంలో వస్తుంది. 70 వ నిమిషంలో తీసిన సినిమాలోంచి విలన్ పాత్ర పారిపోవడంతో ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఈ రెండిటి మధ్య మిడిల్లో వుండే కథ 40 నిమిషాలు సాగుతుంది. ప్లాట్ పాయింట్ టూ తర్వాత ముగింపు 25 నిమిషాలుంటుంది. ముగింపు ఎలా జరిగిందీ, రైటర్ కీ క్యారక్టర్ కీ మధ్య గొడవ ఎలా పరిష్కారమయిందీ సస్పెన్స్ కోసం వుంచేద్దాం.

—సికిందర్

21, జులై 2022, గురువారం

1183 : రివ్యూ!

 

         మధ్య ఓల్డ్ (హాలీవుడ్), ‘డియర్ ఫ్రెండ్ (మాలీవుడ్), ‘గార్గి (కాలీవుడ్)  అనే మూడు సినిమాలు చూస్తే కామన్ గా ఒకటి కన్పిస్తుంది- కథా నాయకత్వం లోపించడం. ఈ మూడూ ఆఫ్ బీట్ సినిమాలు. ఓల్డ్ (జులై 2021) శ్యామలన్ నైట్ తీసిన ఆంగ్ల సినిమా, ‘డియర్ ఫ్రెండ్(జూన్ 2022) టోవిన్ థామస్ నటించిన మలయాళ సినిమా. గార్గి(జులై 2022) సాయి పల్లవి నటించిన తమిళ సినిమా. ఓల్డ్ఒక నవల ఆధారంగా కొత్త ఐడియాతో కూడిన కథ. డియర్ ఫ్రెండ్నల్గురు అర్బన్ ఫ్రెండ్స్ కథ. గార్గి చైల్డ్ రేప్ చుట్టూ కథ. ఈ మూడూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఆఫ్ బీట్ గా చేసిన ప్రయోగాలు. ఆఫ్ బీట్ కి ఇప్పుడు కాలం కలిసొస్తున్నట్టుంది. బాక్సాఫీసు దగ్గర విఫలమయ్యే వీటిని  ఓటీటీ వేదిక ఆదుకుంటోంది. కాబట్టి ఏ మేకర్ ఏ తన సొంత పంథాలో, ప్రేక్షకుల అభీష్టాలతో నిమిత్తం లేకుండా, ఏ కథ ఎలా చెప్పాలనుకున్నా, ఓటీటీని నమ్ముకుని చెప్పేయవచ్చు. పై మూడు ఆఫ్ బీట్ సినిమాలూ బాక్సాఫీసు దగ్గర విఫలమై ఓటీటీ కొస్తున్నవే!

        ల్డ్ ప్రపంచ వ్యాప్తంగా 57 మార్కెట్లలో 90 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ వచ్చేసి 18 మిలియన్ డాలర్లు. హాలీవుడ్ కి అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ వుంది కాబట్టి ఈ ఆఫ్ బీట్ ఈ మాత్రం వసూలు చేయగల్గింది. కానీ శ్యామలన్ తీసిన గత సినిమాలతో పోలిస్తే నిరాశే. ఆఫ్టర్ ఎర్త్ (2013) 251 మిలియన్ డాలర్లు, ‘స్ప్లిట్ (2016) 279 మిలియన్ డాలర్లు, ‘గ్లాస్ (2019) 247 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు ముందు ఓల్డ్బాక్సాఫీసు వసూళ్ళు దిగదుడుపే.

        డియర్ ఫ్రెండ్ మలయాళం 10 కోట్ల బడ్జెట్ కి కేవలం 56 లక్షల బాక్సాఫీసుతో భారీ ఫ్లాపుగా తేలింది. గార్గి 5 కోట్ల బడ్జెట్ తో తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో బాక్సాఫీసు ఇంకా బడ్జెట్ ని రీచ్ కాలేదు. తమిళనాడులో ఆక్యుపెన్సీ రేటు తిరుచ్చిలో గరిష్టంగా 14.67%, కనిష్టంగా సేలంలో 5.00% వుంది. తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా కరీంనగర్లో 24.25%, కనిష్టంగా గుంటూరులో 4.33% వుంది. ఇంత తక్కువ శాతంలో ప్రేక్షకులు  థియేటర్లకి హాజరయ్యారు ఈ ఆఫ్ బీట్ కి. ఆఫ్ బీట్, ఆర్టు, వాస్తవిక సినిమా ఇవన్నీ ఒకటే, పేర్లు వేరు. ఇవి తీస్తే ఓటీటీ కోసమే తీయాలే తప్ప మరో మార్గం లేదు. వీటిని ఎంత తక్కువ బడ్జెట్ తో తీసినా బాక్సాఫీసుని అందుకోలేవు, అవార్డులు అందుకోవచ్చు.

        1970-80 లలో ఆర్ట్ సినిమాల ఉద్యమం కొనసాగినప్పుడు ఆఫ్ బీట్ సినిమాలు నిలబడ్డాయి. తర్వాతి దశాబ్దంలో ఆర్ట్ సినిమాలకాలం చెల్లిపోయాక, 2000 లో ఆర్ట్ సినిమాల ప్రముఖుడు శ్యామ్ బెనెగెలే ఆర్టు నీ, కమర్షియల్ విలువల్నీ కలగలిపి క్రాసోవర్ సినిమాలనే మల్టీప్లెక్స్ సినిమాలకి తెరతీసి కొత్త బాట వేశారు. ఈ బాటలో కొత్త తరం దర్శకులు క్రాసోవర్ సినిమాలు తీస్తూ పోయారు. నేటికీ ఇవి వున్నాయి - కాకపోతే సెమీ రియలిస్టిక్ గా పేరు మారింది. సినిమాల చరిత్ర తెలుసుకోక పోతే సమకాలీన సినిమా అందించలేరు. గార్గి 1970-80 లలో తీయాల్సిన ఆర్ట్ సినిమా.

        మేకర్ తెలియక ఆర్ట్ సినిమాగా తీసినా, ఇంట్లో కూర్చుని వీటిని ఓటీటీల్లో చూసేస్తారు ప్రేక్షకులు- అన్ని సినిమాలకి కలిపి ఒక సంవత్సర చందా తప్ప, సినిమాకో చెల్లింపు వుండదు గనుక. అదే థియేటర్ కెళ్ళి పెద్ద తెర మీద చూడాలంటే మాత్రం థియేటర్ సినిమా వుండాల్సిందే. అంటే కమర్షియల్ సినిమా. అంటే కథా నాయకత్వమున్న సినిమా. అంటే కథని కథలా చూపించే సినిమా.   

        పై మూడూ కథని కథలా చూపించలేదు. కథ అంటేనే చాలా అలుసైపోయిన సరుకై పోయింది ఈ మధ్య. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు తీస్తారు. నిర్మాత నెత్తి మీద గొడ్డలి పెట్టి, నా సినిమా నా ఇష్టమంటాడు మేకర్. ఇతడికేం హక్కుందో తెలీదు. ఈ రోజే విడుదలైన విక్రమ్ కుమార్- అక్కినేని నాగచైతన్య - దిల్ రాజుల ప్రతిష్టాత్మక సినిమా  థాంక్యూ కథగా విఫలమైన డిజాస్టర్ అని తెల్లారే యూఎస్ నుంచి రివ్యూలు వస్తున్నాయి. దీన్ని కథగా కాదు, ‘విరాటపర్వం లాగే గాథగానే  తీశారని తెలిసి పోతోంది. ఇంత అనుభవమున్నా ఇంకా కథకీ, గాథకీ తేడా తెలుసుకోలేని తనం దగ్గరే వుండిపోతున్నారు.

        వార్తని వార్తలా చూపించక పోతే వార్త ఎలా కాదో, కథని కథలా చూపించక పోతేనూ అంతే. మంత్రి గారు శంఖు స్థాపనకి వెళ్ళారు అని వార్త ప్రారంభించి - ఆహ్వానితులతో కలిసి విందారగించారు, ముచ్చటించారూ అంటూ చెప్పుకొస్తూ- అసలు శంఖు స్థాపన చేశాడా లేదా, చేస్తే ఆ సందర్భంగా ఆ పథకం గురించి ఏం వ్రాక్కుచ్చాడో చెప్పకపోతే అది వార్త ఎలా కాదో, కథని కథలా చెప్పేక పోతే అదలా  సినిమా కాకుండా శ్రీలంక అవుతుంది. ప్రేక్షకులు బాక్సాఫీసు మీద తిరగబడే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. ప్రస్తుతం బాక్సాఫీసుతో ఎందుకులే అని సినిమాల జోలికెళ్ళడం లేదు.

         ఓల్డ్ లో ఒక రిసార్ట్స్ లో గడపడాని కెళ్ళిన మూడు  కుటుంబాలు సముద్రపు టొడ్డున విచిత్ర పరిస్థితి నెదుర్కొంటాయి. వాళ్ళ వయస్సు అరగంటకి ఒక ఏడాది చొప్పున పెరిగి పోతూంటుంది. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళయి పోతారు, చిన్న పిల్లలు టీనేజీ కొచ్చేస్తారు. ఈ వింత పరిస్థితి నుంచి ఎలా తప్పించుకున్నారన్నది ఈ కొత్త ఐడియాతో కథ.

        యుగాలు మారినా కథకుండే ప్రజాదరణ మారదు. ఎందుకంటే వాటిలో వుండేది ప్రధాన పాత్ర కథా నాయకత్వం. కథానాయకత్వం లేని కథ కథలా వుండదు, పాలకులు పారిపోయిన శ్రీలంకలా వుంటుంది. ఓల్డ్ లో వుండడానికి గేల్ గార్షియా బెర్నాల్ అనే అతను హీరోగా వుంటాడు గానీ, కథ అతన్తో వుండదు. ఎవరితోనూ వుండదు. అందరితో గంప గుత్తగా, అతుకుల బొంతలా వుంటుంది. హీరో కుటుంబంతో బిగినింగ్ మాత్రం వుంటుంది. సమస్య ప్రారంభమయ్యాక మిడిల్ సంఘర్షణ అతడితో వుండదు. పెరిగిపోయే వయసుతో మూడు కుటుంబాల అనుభవాలే చూపిస్తూ చూపిస్తూ ముగిసిపోతుంది సినిమా. ఒక మంచి కొత్త ఐడియా అద్భుతాలు చేయకుండా ఇలా పాడయి పోయింది.

        2014 లో క్రిస్టఫర్ నోలన్ తీసిన 'ఇంటర్ స్టెల్లార్' లో హీరో మాథ్యీవ్ మెక్ కానే అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఓ గ్రహం మీది కెళ్తాడు. ఆ గ్రహం మీద ఒక గంట భూమ్మీద 7 సంవత్సరాలతో సమానం. అతను తిరిగి భూమ్మీదికి మూడు గంటల్లో చేరుకుంటాడు. చేరుకుని చూస్తే, భూమ్మీద 21 ఏళ్ళు గడిచిపోయి వుంటాయి. తను 21 ఏళ్ళనాటి యువకుడుగానే వుంటాడు. తన కూతురు, కొడుకు తనకంటే పెద్దవాళ్లయిపోయి వుంటారు! అద్భుత కల్పన ఇది. ఇలాటి అద్భుతాన్ని 'ఓల్డ్' తో ప్రేక్షకులకి అందించలేక పోయాడు శ్యామలన్.

        'డియర్ ఫ్రెండ్' మలయాళంలో నల్గురు అర్బన్ ఫ్రెండ్స్ వాళ్ళ షోకులూ సరదాలూ సెంటిమెంట్లతో ఫస్టాఫ్ అంతా గడిపేస్తారు. అంటే ఫస్టాఫ్ లో కథ లేదు. సెకండాఫ్ లో కథేదో ప్రారంభమవుతుంది. టోవిన్ థామస్ కనిపించకుండా పోతాడు. మిగతా ముగ్గురూ వెతకడం మొదలెడతారు. వెతుకుతూ వెతుకుతూవుంటే, ముగింపపులో కన్పిస్తాడు. ఏంట్రా ఏమైపోయావ్ అంటే, దానికేదో కారణం చెప్తాడు, చాలా ఫీలైపోయి కావలించుకుంటారు. అయిపోతుంది సినిమా. కథా నాయకత్వం లేకుండా ఇది అర్బన్ ఫ్రెండ్స్ కథట. బడ్జెట్లో 5 శాతం కలెక్షన్స్ తో. 2005 లో శేఖర్ కమ్ముల తీసిన 'హేపీడేస్' లో కాలేజీ ఫ్రెండ్స్ లో హీరో వరుణ్ సందేశ్ కథానాయకత్వం వహిస్తూ స్క్రీన్ ప్లేకి త్రీయాక్ట్ స్ట్రక్చర్ నేర్పరుస్తాడు.

        ఇక 'గార్గి' విషయం. చైల్డ్ రేప్ కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడే కథ, టీచర్ గా సాయిపల్లవి ఈ తండ్రిని కాపాడుకునేందుకు లాయర్ని ఆశ్రయిస్తుంది. ఇక ఆ లాయర్ కథ నడుపుతాడు. సాయిపల్లవి అతడితో వుంటుంది ఈ కష్టానికి బాధపడుతూ. కథానాయకత్వం వదులుకున్న ఆమె సీన్లన్నీ బాధపడుతూ వుండే సీన్లే- ముగింపులో మాత్రమే ఎవరేమిటో తెలుసుకునే వరకూ. ఇది బాక్సాఫీసుకి భారమై ఓటీటీని ఆశ్రయించే పరిస్థితి.

—సికిందర్ 


16, జులై 2022, శనివారం

1182 : స్క్రీన్ ప్లే సంగతులు

        విక్రమ్ క్లోజింగ్ కలెక్షన్స్ 445 కోట్లు అని తేల్చారు. వలపుల గ్లామర్ పోషణార్ధం స్టారిణిల సపోర్టు లేకుండా కేవలం కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ల వంటి స్టార్స్ నల్గురూ కలిసి నటించి, ఈ డార్క్ జానర్ తమిళ పానిండియాకి సృష్టించి పెట్టిన అద్భుత రికార్డు ఇది. వరుసగా పాత మూస సినిమాలుగా తీసిన తమిళ పానిండియాలు ఫ్లాపవుతూ వచ్చిన సందర్భంలో సూపర్ హిట్ ఖైదీ(2019) దర్శకుడు లోకేష్ కనక రాజ్ తమిళ పానిండియా కేం కావాలో అదిచ్చాడు- మల్టీపుల్ స్టార్ పవర్ తో చెన్నై నుంచి చికాగో దాకా మోగే బాక్సాఫీసు బ్యాంగ్. పుష్ప ఇచ్చిన బ్యాంగ్ కి అదిరిపోయిన బాలీవుడ్, తెప్పరిల్లే లోపే విక్రమ్ ఇస్తున్న బ్యాంగ్ కి బెదిరిపోతోంది. నార్త్ లో సింగిల్ స్క్రీన్ మాస్ సినిమాలు తీయడం మర్చిపోయిన బాలీవుడ్ కి, రూరల్ మాస్ క్యారక్టర్స్ తో సౌత్ సినిమాలిస్తున్న సమాధానానికి రూరల్ సింగిల్ స్క్రీన్ నార్త్ ప్రేక్షకులు కూడా దాసోహమై పోయారు. గ్రామ గ్రామానా రియల్ పానిండియా సినిమాలంటే ఇవే. హై ఎండ్ టెక్నాలజీ మేకింగ్ కి, లో -గ్రేడ్ మాస్ క్యారక్టర్స్ ని జోడించి సరిక్రొత్త బిజినెస్ మోడల్ ని సృష్టించడం. సరిక్రొత్త బిజినెస్ మోడల్ ని సృష్టించిన వాడే బేతాజ్ బాద్షా.

        బిజినెస్ మోడెల్లో ఇంకోటుంది- పై నల్గురు స్టార్స్ లో ఇద్దరు విలన్లుగా నటించడం. సూర్య, విజయ్ సేతుపతిల స్థానంలో విలన్ ఆర్టిస్టులు నటిస్తే- వాళ్ళెంత బాలీవుడ్, హాలీవుడ్ విలన్లయినా ఈ హైప్ రాదు. ఈ కలెక్షన్స్ రావు. ఇంతా చేస్తే నల్గురు స్టార్లు ప్లస్ స్టార్ డైరెక్టర్ పారితోషికాలు కలిపి మొత్తం బడ్జెట్ 120 కోట్లే. ఈ కాలంలో కావాల్సింది ఇలాటి డిజైనర్ స్క్రిప్టులే. ఇంకా  స్టోరీ రైటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఇలాటి కొత్త బిజినెస్ మోడల్స్ క్రియేట్ కావు. స్టోరీ మేకింగ్ తోనే కొన్ని రూల్స్ ని బ్రేక్ చేసే దివ్యాలోచన లొస్తాయి. ఇది రూల్స్ ని బ్రేక్ చేసే కాలం. అయితే రూల్స్ ని బ్రేక్ చేయాలంటే అసలంటూ రూల్సంటే ఏమిటో తెలియాలి.

ఉలగనాయగన్ కమల్ హాసన్ ని తిరిగి టాప్ కి చేర్చిన నేటి విక్రమ్ కి 1986 నాటి విక్రమ్ మూలం. ఆ విక్రమ్ కి ఈ విక్రమ్ స్పిరిచ్యువల్ సీక్వెల్ అన్నమాట. ఆ విక్రమ్ కి రచయిత సుజాత సైంటిఫిక్ స్పై థ్రిల్లర్ కథ ఇచ్చాడు. దీని దర్శకుడు రాజశేఖర్. ఇందులో రాకుమారిగా డింపుల్ కపాడియా, విలన్ గా అంజాద్ ఖాన్ నటించారు. అయినా ఎందుకో దీన్ని హిందీలో డబ్ చేసి విడుదల చేయలేదు. అప్పటికే కమల్ ఏక్ దూజేకే లియే’, ‘సనమ్ తేరీ కసమ్’, ‘జరాసీ జిందగీ’, ‘సద్మా’, ‘సాగర్’  మొదలైన 13 హిందీ సినిమాలు 1981-85 మధ్య కాలంలో నటించినప్పటికీ.  
    
         నాటి విక్రమ్లో కమల్ రా ఏజెంట్ కమాండర్ అరుణ్ కుమార్ విక్రమ్ గా నటించాడు. ఈ పాత్రని మాత్రమే తీసుకుని దీనికి వేరే కథా ప్రపంచంలో కొనసాగింపు నిచ్చాడు ఇప్పుడు దర్శకుడు. హాలీవుడ్ లో మార్వెల్ స్టూడియో తీస్తున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) సినిమాల్లాగా, లోకేష్ కనక రాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్ సీ యూ) ని స్థాపించుకుని, మొదటి సినిమాగా డ్రగ్స్ థీమ్ తో ఖైదీతీశాడు, ఇప్పుడు డ్రగ్స్ థీమ్ కింకో రూపమిచ్చి విక్రమ్ గా యూనివర్స్ లో చేర్చాడు.

        డ్రగ్స్ మీద సినిమాలు అనేకం వచ్చాయి. కానీ డ్రగ్స్ సమస్య పట్ల ఆందోళన అనేది కమల్ హాసన్ మాటలతోనే సమాజంలోకి సూటిగా వెళ్తుంది-  మనం చేసిన ఏ హత్యా హత్య కాదు సర్. ఇట్సే స్టేట్ మెంట్. హత్య చేయాలన్నా ఈ కాలంలో ముసుగేసుకుని చేయాల్సిన పరిస్థితి. ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీలో వాడు (మనవడు) జీవించాలి. అందుకు సంతానంని చంపాలి. ఎలా చంపాలి? నిన్న దేశం కోసం పోరాడిన వాళ్ళ చీకటి గీతం ఈ రోజు జాతీయ గీతమైంది. టుడేస్ టెర్రరిస్ట్ ఈజ్ టుమారోస్ రివల్యూషనరీ. ఇక్కడ నేను  తీవ్రవాదిని. ఎలా తీవ్రవాదిని? డ్రగ్స్ ని తీవ్రంగా ఎదిరించే తీవ్రవాదిని...

        బంగారం స్మగ్లింగ్ సినిమాలు చూశాం, విగ్రహాల స్మగ్లింగ్ సినిమాల్ని చూశాం.  కానీ బంగారం వద్దు, విగ్రహాలు వద్దూ అనలేదీ సినిమాలు- స్మగ్లింగ్ వద్దన్నాయి. డ్రగ్ స్మగ్లింగ్ తో అలా కుదరదు, డ్రగ్స్ నే వద్దనాలి. ఈ డ్రగ్స్ సిండికేట్ కథ నల్గురు స్టార్స్ తో, వెండి తెర మీద జాగా కోసం వాళ్ళ  డిమాండ్స్ తో అతుకులబొంత కాకుండా, ఏకత్రాటిపై వుంచే ఏ స్క్రిప్టింగ్ టూల్ తో ఈ స్క్రీన్ ప్లే తయారయిందో ఇక చూద్దాం. ఇంతేగాక ఫస్టాఫ్ బుర్ర తిరుగుడు, సెకండాఫ్ పొద్దు తిరుగుడుగా ఎందుకున్నాయో కూడా చూద్దాం...

1. చప్పున ముగిసే బిగినింగ్  

ఏసీపీ ప్రభంజన్, స్టీఫెన్ రాజ్ అనే నార్కోటిక్స్ శాఖకి చెందిన ఇద్దరు, భారీ స్థాయిలో డ్రగ్స్ ముడి పదార్థాన్ని పట్టుకుని దాచేస్తారు. రెండు టన్నులు వుండే ఈ డ్రగ్స్ విలువ 2 లక్షల కోట్ల రూపాయలు. ఓ ముసుగు గ్యాంగ్ వీళ్ళిద్దరితో బాటు ప్రభంజన్ దత్తత తీసుకున్న తండ్రి కర్ణన్ (కమల్ హాసన్) ని కూడా చంపేస్తారు. అమర్ (ఫాహద్ ఫాజిల్) అనే అతను  బ్లాక్ ఆప్స్ స్క్వాడ్ కి లీడర్. ఈ స్క్వాడ్ పోలీసులకి హైటెక్ స్లీపర్ సెల్ గా పని చేస్తూంటుంది. పోలీసుల కోసం క్రిమినల్స్ ని చంపిపెట్టే సేవలందిస్తూ వుంటుంది. ఈ స్క్వాడ్ లీడర్ అమర్ కి గాయత్రి (గాయత్రీ శంకర్) తో సమస్య వుంటుంది. తనేం చేస్తూంటాడో చెప్పలేడు కాబట్టి పెళ్ళి చేసుకోలేనంటాడు. తనేం చేస్తూంటాడో తను అడిగిన రోజున తనతో తనుండనని ఆమె అంటుంది. సరేనని పెళ్ళికి సిద్ధమవుతాడు. ఇక పోలీస్ చీఫ్ ఆ ముసుగు గ్యాంగ్ ని  పట్టుకోమని అమర్ ని ఆదేశిస్తాడు.

2. బిగినింగ్ స్ట్రక్చర్ తో పేచీలేదు
పైన చెప్పుకున్న బిగినింగ్ పది నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ బిగినింగ్ లో కథానాయక పాత్ర ఫాజిల్ కి ఈ మొదటి పది నిమిషాల్లోనే ముసుగు గ్యాంగ్ ని  పట్టుకునే గోల్ ఏర్పాటవుతుంది- పోలీస్ చీఫ్ టాస్క్ ఇవ్వడంతో. కథా నేపథ్యం డ్రగ్స్ తో పోరాటమని తెలిసి పోతూండగా; ఫాజిల్ ఎవరో, ఏం చేస్తూంటాడో  పోలీస్ చీఫే స్టాఫ్ కి వివరించడంతో పాత్ర పరిచయం జరిగిపోతుంది. ఫాజిల్ కి పెళ్ళి చేసుకోవాల్సిన గాయత్రి  వుంటుంది. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా, కమల్ తో బాటు మరో ఇద్దరి హత్యలు ముందే జరుగుతాయి. ఈ హత్యలతో సమస్య ఏర్పాటయింది. ఫాజిల్ కి పోలీస్ చీఫ్ టాస్క్ ఇవ్వడంతో, ఫాజిల్ కి గోల్ ఏర్పాటై, బిగినింగ్ పూర్తవుతూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటయ్యింది. బిగినింగ్ బిజినెస్ పూర్తయిది.

        దీని తర్వాత మిడిల్ కథనం అర్ధవంతంగా సాగడానికి వీలుగా ఫాజిల్ గోల్ కుండే ఎలిమెంట్స్ లో- ముసుగు గ్యాంగ్ ని  పట్టుకునే -1. కోరిక, 2. గాయత్రితో  పణం గా  పెట్టిన పెళ్ళి, 3. గాయత్రికే శత్రువులతో ఏమైనా జరగవచ్చనే పరిణామాల హెచ్చరిక వున్నాయి. వీటన్నిటి ఫలితంగా ఫాజిల్ పాత్రలో- 4. ఎమోషన్  అనే నాల్గు గోల్ ఎలిమెంట్స్ కన్పిస్తున్నాయి.

        ఇంతవరకూ బాగానే వుంది - ఇక్కడ్నుంచీ ఇంటర్వెల్ వరకూ మిడిల్ - 1 బిజినెస్ కే వేటు పడింది. ఇదెలాగో ముందు మిడిల్ -1 కథనం చూద్దాం...

3. సమస్యల మిడిల్ -1

ముసుగు గ్యాంగ్ ని పట్టుకునే గోల్ ని తీసుకున్న అమర్  కొకటి అర్ధం గాదు. ప్రభంజన్ ని, స్టీఫెన్ రాజ్ నీ చంపారంటే అర్ధముంది. ఒక సామాన్య వ్యక్తి అయిన ప్రభంజన్ తండ్రి కర్ణన్ ని ఎందుకు చంపారు? కర్ణన్ గురించి తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభిస్తాడు. కర్ణన్ తాగుబోతు, డ్రగ్స్ బానిస, స్త్రీ లోలుడూ అని తెలుసుకుంటున్న కొద్దీ అమర్ కి అయోమయం పెరుగుతుంది. అయితే కర్ణన్ కి మనవడంటే ప్రాణమని తెలుస్తుంది. కోడలు (స్వాతిష్ఠా కృష్ణన్) మనవడ్ని పెట్టుకుని వుంటుంది. ఈమెకి సాయంగా పనిమనిషి వల్లియమ్మాళ్ (వాసంతి) వుంటుంది.  

        అమర్ దర్యాప్తులో మిస్సైన డ్రగ్స్ వ్యవహారం తెలుస్తుంది. ఆ డ్రగ్స్ సంతానం (విజయ్ సేతుపతి) అనే డ్రగ్ సిండికేటుడు కి చెందింది. ఆ డ్రగ్స్ ని ముంబాయికి చెందిన రోలెక్స్ (సూర్య) అనే సూపర్ బడా స్మగ్లర్ కి సప్లయి చేస్తే, రోలెక్స్ సంతానంకి సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు సాయం చేస్తాడని డీల్. సంతానం ఇల్లు ముగ్గురు కితకితలు పెట్టే పెళ్ళాలతో (మహేశ్వరీ చాణక్యన్, మైనా నందిని, శివానీ నారాయణన్), ఇంటినిండా 67 మంది బంధుజనంతో, ముఠా సభ్యులతో కిటకిటలాడుతూ వుంటుంది.

        ఇలావుంటే, వీరపాండ్యన్ అనే అధికారి వేరే గ్యాంగ్ తో మీటింగు పెట్టుకుని డీల్ మాట్లాడతాడు. తనకీ, రుద్ర ప్రతాప్ అనే కాంట్రాక్టర్ కీ డ్రగ్స్ ఎక్కడున్నాయో తెలుసనీ, సంతానంకి తెలియకుండా వాటిని రోలెక్స్ కి చేరవేస్తామనీ చెప్తాడు. ఇక్కడ ముసుగు గ్యాంగ్ వూడిపడి వీరపాండ్యన్ ని చంపేస్తారు. వాళ్ళని అమర్ వెంటాడి వాళ్ళల్లో బిజోయ్ అనే అతడ్ని పట్టుకుంటాడు.

        హిట్ లిస్ట్ లో రుద్రప్రతాప్ కూడా వున్నాడని బిజోయ్ ద్వారా తెలుసుకున్న అమర్, టీముతో రుద్రప్రతాప్ ఇంటికి వెళ్తాడు. అక్కడ రుద్రప్రతాప్ కూతురి పెళ్ళి జరుగుతూంటుంది. ఈ పెళ్ళిలో ప్రాణరక్షణ కోసం రుద్రప్రతాప్ సంతానంని పిలిపించుకుంటాడు. అయినా ముసుగు గ్యాంగ్ రుద్ర ప్రతాప్ ని లాక్కెళ్ళి పోయేసరికి, అమర్ వెంటాడి ముసుగు గ్యాంగ్ లీడర్ ని పట్టుకుంటాడు. అప్పుడు ముసుగు గ్యాంగ్ లీడర్ ముసుగు తీస్తాడు. అతను  కర్ణన్. 

వర్కింగ్ కథా నాయకుడెవరు?

పై మిడిల్ -1  కథనం ఇంటర్వెల్ వరకూ సుమారు గంటన్నర సేపూ సాగుతుంది. తర్వాత సెకండాఫ్ సుమారు ఇంకో గంటన్నర వుంటుంది. మొత్తం కలిపి సుమారు మూడు గంటల సినిమా. ఇంత అవసరం లేదు. ఈ మిడిల్ -1 లో ఎన్నో పాత్రలు, ఎన్నో ఉపకథలు, ఇంకెన్నో సంఘటనలు, ఎంతో హడావిడి వల్ల ఇంత నిడివి. ఇన్నేసి వివరాలతో మిడిల్ -1 కథనం ఫాలో అవడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. పైన క్లుప్తంగా చెప్పుకున్నంత సింపుల్ గా ఏమీ వుండదు మిడిల్-1. ఇంకా వేరే పాత్రల్ని, సంఘటనల్నీ కనెక్ట్ చేసుకుంటూ చాలా మానసిక శ్రమ పడుతూ చూడాలి. ఎక్కడో ట్రాక్ కూడా కోల్పోతాం. ఇంతా చేసి ఇది స్ట్రక్చర్ లో వుండదు. అయినా సినిమా పెద్ద హిట్టయ్యింది- ఎందుకు హిట్టయింది? సెకండాఫ్ సింపుల్ గా, సూటిగా పాయింటుతో వుండడం వల్ల- సెకండాఫ్ లో కమల్ వచ్చేసి కథని చేపట్టడం వల్ల.

        సాధారణంగా సినిమాలు ఫస్టాఫ్ ఎంటర్ టైన్ చేసి, సెకండాఫ్ కథ దగ్గరి కొచ్చేసరికి చేతులెత్తేస్తున్నాయి. విక్రమ్ లో ఇది తారుమారైంది- ఫస్టాఫ్ చేతులెత్తేసి సెకండాఫ్ దారికొచ్చింది. అంటే ఇలా తీసే సినిమాల్ని సెకండాఫులే కాపాడతాయన్న మాట. ఇదో కొత్త నాలెడ్జి.

        మిడిల్-1 కథనం కమల్ హాసన్ (కర్ణన్) పాత్ర మరణం గురించి ఫాహద్ ఫాజిల్ (అమర్) పాత్ర చేసే దర్యాప్తుతో వుందంటే ఈ కథకి ప్రధాన పాత్ర  ఫాజిలే అవుతాడు. అయితే ఇంటర్వెల్లో ఎప్పుడైతే బతికున్న కమల్ ని ముసుగు వ్యక్తిగా పట్టుకుంటాడో, అప్పుడాతర్వాత  సెకండాఫ్ లో కథని కమల్ కప్పగించి తప్పుకుంటాడు ఫాజిల్. ఇప్పుడు ప్రధాన పాత్రగా  కమల్ కథనందుకుంటాడు. వర్కింగ్ కథా నాయకుడవుతాడు. ఒక కథకి రెండు ప్రధాన పాత్రలు ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు లాగా వంతులేసుకుని ఎలా వుంటాయి? కథ పాడవకుండా ఏమిటా కలిపి వుంచే సూత్రం?

హేండాఫ్ క్యారక్టర్. ఈ సూత్రం పాతదే. మనుషులు మారాలి (1969), ‘ఎర్రమందారం (1991) లలో వుంది. హిచ్ కాక్ సైకో (1960) లోనూ వుంది. హిందీ రోమాంటిక్ కామెడీ బరేలీకీ బర్ఫీ(2017) లోనూ వుంది. ఈ ప్రయోగానికి హేండోవర్ క్యారక్టర్ అనే స్క్రిప్టింగ్ టూల్ ఉపయోగపడుతుంది.

        ఎర్రమందారం’, మనుషులు మారాలి లలో హీరోలు చనిపోయి వాళ్ళ భార్యలు ఆశయాలు పూర్తి చేస్తారు. ఎర్రమందారం లో దళిత సర్పంచ్ గా రాజేంద్ర ప్రసాద్ హత్యకి గురయితే, భార్య పాత్రలో యమున కథని అందుకుని పూర్తి చేస్తుంది. మనుషులు మారాలి లో కార్మిక నాయకుడుగా శోభన్ బాబు చనిపోతే, భార్య పాత్రలో శారద కథ నందుకుంటుంది. ఇలా ప్రధాన పాత్ర చనిపోతే ఇంకో పాత్ర కథని అందుకున్నప్పుడు, ఆ నిష్క్రమించే పాత్రని హేండాఫ్ పాత్ర అంటారు. 
        హేండాఫ్ పాత్ర చనిపోవాలనేం లేదు. బరేలీకీ బర్ఫీ లో కృతీ సానన్ నుంచి రాజ్ కుమార్ రావ్ కథనందుకుని తను నడిపిస్తాడు. ఆమె కథని ఆమె నడిపించుకుంటే కథ రాణించని పరిస్థితి కథతో వుంది. ఈ కథ చేతులు మారడం కూడా కన్విన్సింగ్ గా వుంటుంది.

        ఇలా ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన సైకో కథతో ఒక సమస్య వచ్చింది. ప్రధాన పాత్ర తో మొదలైన కథ, ఆ ప్రధాన పాత్ర హత్యకి గురవడంతో దాని కథ అర్దాంతరంగా ముగిసి, సంబంధం లేని ఇంకో ప్రధాన పాత్ర తో వేరే కథ మొదలవుతుంది. ఇది అప్పట్లో రాబర్ట్ బ్లాచ్ అనే రచయిత రాసిన నవల. ఈ కథ తనకి నచ్చడం లేదని హిచ్ కాక్ తో అన్నాడు స్క్రీన్ ప్లే రచయిత జోసెఫ్ స్టెఫానో.  ప్రధాన పాత్ర చనిపోయాక దాంతో ప్రారంభమైన కథే అర్ధాంతరంగా ముగిసిపోవడం ఒకటైతే, అక్కడ్నించీ సంబంధం లేని ఇంకో ప్రధాన పాత్రని తెచ్చి ఇంకో కథ ప్రారంభించడం తనకి మింగుడు పడ్డం లేదన్నాడు (సెకండాఫ్ సిండ్రోమ్ పరిస్థితి ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే వచ్చిందన్న మాట).

అప్పుడు హిచ్ కాక్, ‘ఈ రెండో పాత్ర ఆంథోనీ పెర్కిన్స్ నటిస్తే?’ అన్నాడు. స్టెఫానో స్టన్నయ్యాడు. సమస్య తీరిపోయింది. ఆంథోనీ పెర్కిన్స్ అప్పట్లో స్టార్ డమ్ వున్న నటుడు. అతను గనుక నటిస్తే కథలో ఏర్పడ్డ గండి పూడిపోతుంది. మొదటి ప్రధాన పాత్ర హీరోయిన్ జానెట్ లే తో ఆమె కథగా ప్రారంభమైన సినిమా, ప్లాట్ పాయింట్ వన్ లో హీరో ఆంథోనీ పెర్కిన్స్ కొత్తగా ప్రధాన పాత్రగా వచ్చి, ఆమెని హత్య చేస్తే, ఆమె కథని మర్చిపోయి అతడి సైకో కథలో లీనమైపోతారు ప్రేక్షకులు. ఇలా పాపులర్ స్టార్స్ వల్ల కథతో కొన్ని అక్రమాలు సక్రమమై పోతాయన్న మాట. ఇది స్టోరీ మేకింగ్ కి, డిజైనర్ స్క్రిప్టుకి ఉదాహరణ.

        జానెట్ పాత్రలో తమన్నా వుందనుకుందాం. సినిమా ప్రారంభమై ఓ ఇరవై నిమిషాలు తమన్నా పాత్ర పరిచయం, జీవితం, ఆశయం అన్నీ చూస్తూ సెటిలవుతాం. ఇంతలో ఎక్కడ్నించో కింగ్ నాగార్జున వచ్చేసి తమన్నాని కసక్ మన్పించి, ఆమె కథని చంపి తన కథ మొదలెట్టుకుంటే, ఈ సర్ప్రయిజ్ ఎంట్రీకి తమన్నానీ ఆమెతో ప్రారంభమయిన కథనీ మర్చిపోయి, నాగార్జునతో  కొత్త కథని ఫాలో అవుతామా లేదా? ఇదీ స్టార్స్ తో జరిగే హిచ్ కాక్ మోడల్ మ్యాజిక్ అంటే. ఎవరైనా చేసి చూడొచ్చు. కథతో ప్రయోగాలంటే వూరికే ఫ్లాష్ బ్యాక్స్ వేసి, కథని ముందుకూ వెనక్కీ నడపడం గొప్ప టెక్నిక్ అనుకుంటున్నారింకా. దీనికి రివర్స్ స్క్రీన్ ప్లే అని అర్ధం లేని గొప్ప పేరు. హేండాఫ్ క్యారక్టర్ లాంటి వేరే టెక్నిక్కులు ఇంకా చాలా వున్నాయి.

        పైవన్నీ వున్న ప్రధాన పాత్ర చనిపోతే ఇంకో పాత్ర ప్రధాన పాత్రగా కథనందుకునే సందర్భాలు. విక్రమ్ లో ఇది రివర్స్ అయిందంతే. చనిపోయాడనుకున్న కమల్ బతికొస్తే, అంతవరకూ ప్రధాన పాత్రగా వున్న ఫాజిల్  కథని కమల్ కప్పగించేసి తప్పుకోవడం. ఇక్కడ ఫాజిల్ హేండాఫ్ క్యారక్టర్ అయ్యాడు. ఇలా చేయడం వల్ల కథ తెగడం గానీ, అతకడం గానీ, మారడం గానీ జరగలేదు. నడుస్తున్న ఒకే కథకి సారధులు అర్ధవంతంగా మారారు. అర్ధవంతంగా ఎలాగంటే, కమల్ డెత్ కేసు సాల్వ్ చేశాడు కాబట్టి ఇక తన పని పూర్తయిందంటాడు ఫాజిల్ పోలీస్ చీఫ్ తో.

4. గురి తప్పిన గోల్
పై మిడిల్ -1 కథనంలో ముసుగు గ్యాంగ్ ని  పట్టుకునే గోల్ తో వున్న ఫాజిల్ కి, అదెలా అమలు పర్చాలో  తెలియక పోవడంతో పెద్ద సమస్య వచ్చిపడింది మిడిల్ -1 కి. తన గోల్ కమల్ చరిత్ర తెలుసుకుంటూ కాలక్షేపం చేయడమా, లేక ముసుగు గ్యాంగ్ ని  పట్టుకోవడానికి యాక్షన్లోకి దిగడమా? ఆడియెన్స్ కి ముసుగు గ్యాంగ్ వుందని విజువల్ క్లూ ఆల్రెడీ ఇచ్చినప్పుడు, దీంతోనే జోష్ నిచ్చే హైవోల్టేజ్ కథనమొస్తుంది. మిడిల్ -1 ఒకటే కాదు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే మిడిల్ -2 అంటే కూడా యాక్షన్ ప్రాంగణమే  అయినప్పుడు చరిత్రతో కాలక్షేపమెలా చేస్తాడు. కానీ ఇదే చేయడంతో దీనికి తగ్గట్టు పైన చెప్పుకున్న విధంగా ఏవేవో అనేక పాత్రలు, ఉపకథలు, సంఘటనలూ వచ్చిపడి బుర్ర తిరుగుడుగా తయారయ్యింది మిడిల్-1.

        కమల్ ఎలా గడిపే వాడు, ఎలా తాగేవాడు, ఎలా డ్రగ్స్ తీసుకునేవాడు, ఎలా వేశ్యాగృహాని కెళ్ళేవాడు, మనవడితో ఎలా ఆడుకునే వాడూ వంటి క్యారక్టర్ ఎక్స్ పోజిషన్ సీన్లతో కమల్ చరిత్ర తెలుసుకోవడమే ఫాజిల్ పనైంది. పోలీస్ చీఫ్ నుంచి మూడు హత్యలకి సంబంధించి గోల్ తీసుకున్న ఫాజిల్ ఇంత నిదానంగా వుండకూడదు- వెంటనే ప్రత్యర్ధులతో (ముసుగు గ్యాంగ్ ) యాక్షన్ - రియాక్షన్ల ఇంటర్ ప్లేకి ప్రారంభోత్సవం చేస్తేనే మిడిల్ విభాగపు బిజినెస్ కి న్యాయం చేసిన వాడవుతాడు.

        పూర్వం ఈ స్క్రిప్టు ఎలావుండేదో గానీ, ఉండుండి కమల్ జోక్యం చేసుకోవడంతో ఈ కమల్ పాత్ర చరిత్ర చొరబడినట్టుంది- తనకి కొన్ని సీన్లు పెట్టుకునే ఉద్దేశంతో. ఫస్టాఫ్ లో కమల్ కనిపిస్తూ వుండాలి నిజమే, ఇంటర్వెల్ దాకా ఆపితే బాక్సాఫీసుకి బావుండదు నిజమే, అయితే ఈ కనిపించడమే ప్రధానం చేసి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లుగా మార్చేస్తే మిడిల్ బిజినెస్సే గల్లంతవుతుంది. 

        ఫాజిల్ తన గోల్ ని సెలెక్టివ్ గా ఫిల్టర్ చేసుకున్నాడు. హత్యకి గురైన ముగ్గుర్లో కేవలం సామాన్యుడైన కమల్ ని ఎందుకు హత్య చేయాలి- అని ఆసక్తి రేకెత్తించుకుని కమల్ చుట్టే దర్యాప్తుని కేంద్రీకరించడం కమల్ చరిత్రకి ద్వారాలు తెరవడం కోసమే. మిగిలిన ఇద్దరు హతుల సంగతి వదిలేశాడు. సామాన్యుడైన కమల్ ని ఎందుకు హత్య చేయాలన్నది ప్రశ్నే కాదు. అతను హతుల్లో ఒకడైన ప్రభంజన్ తండ్రి అయినందుకు ఏదో కారణం చేత చంపి వుండొచ్చు. దర్యాప్తు అనేది ముగ్గురు హతులతో కూడిన మొత్తం కేసుతో జరగాలి.

పాత్రల చరిత్ర దర్యాప్తులో భాగంగా తెలుస్తూండాలి గానీ, దర్యాప్తు పక్కన పెట్టేసి, చరిత్ర తెలుసుకుంటూ కూర్చోవడం కాదు కావాల్సింది యాక్షన్ కథకి. దర్యాప్తు కూడా ముసుగు గ్యాంగ్ ని  ని పట్టుకునే డ్రమెటిక్ క్వశ్చన్ తో సాగాలి. ఒక పేరు మోసిన బ్లాక్ ఆప్స్ స్క్వాడ్ తమని పట్టుకోవడానికి రంగంలోకి దిగిందంటే ముసుగు గ్యాంగ్ కౌంటర్ ఎటాక్స్ మొదలు పెట్టకుండా వుండదు. ఒక ఎటాక్, కమల్ చరిత్ర, ఇంకో ఎటాక్, ఇంకాస్తా కమల్ చరిత్ర- ఇలా యాక్షన్, చరిత్ర రెండూ సమాంతరంగా సాగేలా సర్దబాటు చేసి వుంటే రెండు అవసరాలూ తీరేవి.

        క్రియేటివిటీకి రూల్స్ లేవు నిజమే. కానీ క్రియేటివిటీకి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో కుదురుకుని వుండాల్సిన రూలుంది. స్క్రీన్ ప్లేని క్రియేటివిటీ సృష్టించదు, స్ట్రక్చర్ తో కూడిన క్రియేటివిటీ మాత్రమే స్క్రీన్ ప్లేని సృష్టిస్తుంది. ఇంటికి నాలుగు స్తంభాలు, నాలుగు గోడలనే స్ట్రక్చర్ లేకుండా మేస్త్రీ నగిషీలు చెక్కలేడు. ఏ మేస్త్రీ కట్టలేని రెండు స్తంభాలు, రెండు గోడల ఇల్లుకట్టి దాని మీద తాపీతో క్రియేటివిటీ చూపించలేడు. సూట్ కేసులతో పరారైన శ్రీలంక అధ్యక్షుడు, ఎంతో స్ట్రక్చర్ తో క్రియేటివిటీ గల అంతటి అధ్యక్ష భవనం నిర్మించుకున్నాడు గనుకే జనం సత్రంలా చేసి వాడుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టి, పియానో వాయించి, ఆమ్లెట్లు వేసుకు తిని, పడకల మీద పొర్లాడుతూ, వాళ్ళ జీవితంలో ఎన్నడూ చూడని ఇంత సినిమా ఎంజాయ్ చేయ గల్గుతున్నారు.

        ఈ వ్యాసం చదువుతూంటే, హిట్టయిన సినిమా దర్శకుడి క్రియేటివిటీనే ప్రశ్నిస్తాడా వ్యాసకర్త అన్పించవచ్చు. కానీ క్రియేటివిటీ అంటే ఏమిటి? దానికి స్వయం ప్రతిపత్తి అంటూ వుందా? ఏ రూల్స్ వుండని క్రియేటివిటీ, రూల్స్ తో వుండే స్ట్రక్చర్ కి లోబడి వున్నప్పుడే అర్ధవంతమైన క్రియేటివిటీ అన్పించుకుంటుంది. మిడిల్లోకి వచ్చాక మిడిల్ బిజినెస్ వదిలేసి, ఇంకా బిగినింగ్ పిక్నిక్కే మిడిల్లోకి తీసుకురావడం (కమల్ చరిత్ర) క్రియేటివిటీ కాదు. ఈ సినిమా హిట్టయ్యింది నిజమే, కానీ ఫస్టాఫ్ కాదని కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాం.

5. విజువల్ అప్పీల్ స్టార్స్ తో
ఇక మరొకటేమిటంటే- కథలో దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్) అనేది చివరి దాకా (నేరస్థుడు తెలిసే దాకా) ఏకపక్ష పాసివ్ కథనానికి దారి తీస్తుంది. మిడిల్ డైనమిక్స్ ని దెబ్బ తీసి బోరు కొడుతుంది. యాక్షన్ అనేది జోష్ నిస్తుంది. అమెరికన్ సాహిత్యంలో దర్యాప్తులు చేసే షెర్లాక్ డిటెక్టివుల కాలం చెల్లిపోయి, యాక్షన్లోకి దిగే పోలీస్ డిటెక్టివులు వచ్చారు. హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే వస్తున్నాయి ఎప్పట్నించో. దర్యాప్తే చేస్తూ కూర్చోకుండా, కాస్తేదో దర్యాప్తుతో క్రిమినల్ని పట్టుకునే కీలకమైన సాక్ష్యాన్ని కనుగొని, వేట మొదలెట్టేస్తారు. యాక్షన్ మొదలైపోతుంది.

        ఫస్టాఫ్ కి ఫాజిల్ ప్రధాన పాత్రయినప్పుడు, తన క్యారక్టర్ ఆర్క్ పెంచుకోకుండా, ఫస్టాఫ్ కథకి టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ ఏర్పర్చకుండా, ఫ్లాట్ గా సాగిపోలేడు. స్ట్రక్చర్ లేకపోతే పాత్ర చిత్రణ కూడా దెబ్బతింటుంది. ఫాజిల్ కొద్దిపాటి ఇన్వెస్టిగేషనేదో చేసి ముసుగు గ్యాంగ్ ని పట్టుకునే క్లూ దొరికించుకుని, గ్యాంగ్ ని పట్టుకునే యాక్షన్ మొదలెట్టేసి వుంటే, మిడిల్ బిజినెస్ శనివారం సంత అవకుండా వుండేది.

        ఈ ఫస్టాఫ్ కథ ఎవరెవరి మధ్య? ఫాజిల్ కీ, అతను పట్టుకోవా లనుకుంటున్న కమల్ (ముసుగు గ్యాంగ్) కీ మధ్య. ఇదీ మిడిల్ కి త్రెడ్, ప్లాట్ లైన్. ఈ ప్లాట్ లైన్ మీద ఫాజిల్ వర్సెస్ ముసుగులో వున్న కమల్ గా - ఇద్దర్నీ ఎదురెదురు పెట్టి యాక్షన్ బరి లోకి దింపితే మిడిల్ బిజినెస్ కి జరగాల్సిన స్ట్రక్చర్ న్యాయం జరుగుతుంది. ఈ ఫస్టాఫ్ కథలో ఇద్దరు స్టార్లు ఒకరికొకరు యాంటీగా వున్నప్పుడు, వాళ్ళ మధ్య కథకి ఈ కమర్షియల్ సెటప్ లేకుండా ఎలా పోతుంది. ఇక్కడ విరోధులుగా ఏవో రెండు పాత్రల్లేవు, ఆ పాత్రల్లో ఇద్దరు స్టార్లు వున్నారన్న థ్రిల్లింగ్ సంగతి మర్చిపోకూడదు. స్టార్లిద్దరి మధ్య వుండాల్సిన గేమ్ ప్రధానంగా కథనం వుండి వుంటే, విజువల్ అప్పీల్ తో విజృంభించేది మిడిల్-1. సాధారణంగా కథలో ముసుగు క్యారక్టర్ వుంటే, వీడెవడ్రా అని తెలుసుకునేందుకు వాణ్ణి తగులుకుని సాగుతుంది కామన్ సెన్స్ తో కూడిన కథనం.

6. చప్పగా షోడౌన్

'స్వాతిముత్యం' వెబ్ పత్రిక 
ముసుగులో వున్నది కమల్ అని ఇంటర్వెల్ దాకా ప్రేక్షకులకి తెలియకూడదని దర్శకుడి ఎత్తుగడ. అయితే ఈ ముసుగు వీడే ముందు రుద్రప్రతాప్ కూతురి పెళ్ళి సీనులో, ముసుగులో వున్న ఆర్టిస్టు కమలేనని నిలబడ్డ తీరు పట్టించేస్తుంది. అది కమల్ అని తెలిసిపోయాక ఇక సస్పెన్స్ లేక, తర్వాత తనే ముసుగు తీస్తున్నప్పుడు థ్రిల్లూ లేకుండా పోయాయి. పాత సినిమా డ్రామాలాగా తేలిపోయింది.

ఇలా ఇంత పెద్ద సినిమా సీను సిల్లీగా మారకుండా, కమల్ తన ఫిజిక్ ని వర్కౌట్ చేసి వుండాల్సింది. ముసుగులో తిరుగుతున్నప్పుడు స్లిమ్ గా వుండి, బాడీ లాంగ్వేజ్ మార్చుకుని వుంటే, ముసుగు వీరుడు కమలేనని తెలిసిపోయేది కాదు. అయితే ఇందుకు ఇంకొకటి కూడా చెయ్యాలి. కమల్ హత్యకే గురయ్యాడనీ, ఇక లేడనీ, బలంగా నమ్మించాలి.

        ఇక ముసుగు వీరుడితో ఇంకోటి కూడా జరిగితేనే మిడిల్-1 కథనంలో టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ ఏర్పడుతుంది. ముసుగు వీరుడు ఫాజిల్ కి దొరికినట్టే దొరికి తప్పించుకోవడం లాంటిది, ముసుగు వీరుడు ఫాజిల్ మీద హత్యాయత్నం చేయడం లాంటిది, కమల్ చరిత్ర ఫ్లాష్ కట్స్ లో కమల్ బతికే వున్నాడని తెలియడం లాంటిది, కమల్ బతికేవుంటే ముసుగు వీరుడు కమలేనా అన్పించడం లాంటిది, చివరికి ముసుగు వీరుడ్ని పట్టుకుని ఫాజిల్ తను ముసుగు లాగేస్తే, కమల్ బయటపడడం లాంటిది ...వంటి స్టోరీ బీట్స్ వుంటేనే టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య వార్ తో ప్రారంభించిన కథ ప్రారంభించిన కథలా సాగడానికి వీలేర్పడుతుంది. 

    సినిమాలో కమల్ తానే ముసుగు తీసేసుకున్నాడు. దీంతో ఫాజిల్ పాత్రచిత్రణ దెబ్బతినిపోయింది. ఈ ఫస్టాఫ్ కి కథానాయకుడుగా వుంటున్న ఫాజిల్, కమల్ ముసుగు తను లాగేస్తే ఈ షోడౌన్ సీనుకి షాక్ వేల్యూ వుంటుంది. యాక్టివ్ క్యారక్టర్ గా వుంటాడు. తన ముసుగు తానే కమల్ తీసేసుకుంటే, షాక్ వ్యాలూ లేక చప్పగా వుండడమే గాక, ఫాజిల్ పాసివ్ క్యారక్టరై పోతాడు. కథల్ని స్థూల దృష్టితో పైపైన రాసేయలేం, సూక్ష్మ దృష్టితో చూడాల్సిందే. అప్పుడే మంచి కమర్షియల్ విలువలు వస్తాయి. మిడిల్ -1 ఈ విధంగా విషయం వదిలేసి విన్యాసాలు చేశాక, ఇక సెకండాఫ్ మిడిల్ -2 కెళ్దాం...

7. మిడిల్ -2 కథనం

ఇప్పుడు కర్ణన్ (కమల్) విక్రమ్ అని తెలుస్తుంది. ఇతను బ్లాక్ ఆప్స్ స్క్వాడ్ మాజీ కమాండర్ గా వుండే వాడు. 1991 లో తన 11 మంది టీంతో కలిసి చేపట్టిన ఒక ఆపరేషన్ విఫలమవడంతో, స్క్వాడ్ ని టెర్రరిస్టులుగా ప్రకటించింది ప్రభుత్వం. స్క్వాడ్ లో 8 మందిని వేటాడి చంపేసింది. విక్రమ్ తో పాటు ముగ్గురే మిగిలారు. విక్రమ్ సామాన్యుడిలా జీవించడం మొదలెట్టాడు. అతడ్ని ప్రభంజన్ తండ్రిగా దత్తత తీసుకోలేదు, ప్రభంజన్ విక్రమ్ సొంత కొడుకే.

        డ్రగ్స్ ని పట్టుకుని దాచేసిన ఏసీపీ ప్రభంజన్ గురించి సంతానంకి పోలీస్ చీఫ్ చెప్పేస్తే, సంతానం ప్రభంజన్ని పట్టుకుని డ్రగ్స్ కోసం హింసించి చంపేశాడు. దీన్ని కప్పిపుచ్చడానికి పోలీస్ చీఫ్ టెర్రరిస్టులు చంపినట్టుగా ప్రకటించాడు. దీంతో ముసుగు గ్యాంగ్ గా ముగ్గురు టీంతో విక్రమ్ రంగంలోకి దిగాడు, తనని కూడా టెర్రరిస్టులు చంపినట్టు చిత్రించుకుని, ప్రభంజన్ హంతకుల వేట మొదలెట్టాడు. ఇదీ అసలు జరిగింది.

        ఇలా వుండగా, ఇప్పుడు అమర్ సంతానం ఇంటిని పేల్చేస్తాడు. దీంతో నేలమాళిగలో ఏర్పాటు చేసుకున్నసంతానం డ్రగ్స్ లాబ్ సహా మొత్తం నాశనమవుతుంది. సంతానం కుటుంబంతో, గ్యాంగ్ తో తప్పించుకుంటాడు. పోలీస్ చీఫ్ సంతానంకి అమర్ గురించి, విక్రమ్ గురించీ చెప్పేస్తాడు.

        అప్పటికి గాయత్రిని పెళ్ళి చేసుకుని వుంటాడు అమర్. సంతానం గాయత్రినిచంపేస్తాడు. అలాగే విక్రమ్ కొడలినీ, మనవడ్ని చంపబోతూంటే విక్రమ్ వచ్చేసి కాపాడుకుంటాడు. ఈ దాడిలో పని మనిషి వల్లియమ్మాళ్ చనిపోతుంది. ఈ వల్లియమ్మాళ్ నిజానికి కొడలికి రక్షణగా విక్రమ్ వుంచిన ఏజెంట్ టీనా.

        భార్య గాయత్రి మరణంతో విచారంలో మునిగిన అమర్, ఇక సంతానం సిండికేట్ ని ధ్వంసం చేసేందుకు విక్రమ్ టీంలో చేరిపోతాడు. గాయత్రి మరణంలో పోలీస్ చీఫ్ హస్తముందని పోలీస్ చీఫ్ ని చంపేస్తాడు.

        ఇప్పుడు విక్రమ్ తనది కేవలం కొడుకు ప్రభంజన్ హత్యకి ప్రతీకారం మాత్రమే కాదనీ, నగరానికి డ్రగ్స్ పీడా వదిలించడం కూడాననీ టీంకి చెప్తాడు. తన మనవడు డ్రగ్ ఫ్రీ సొసైటీలో జీవించాలనీ అంటాడు. ప్రభంజన్ దాచిన డ్రగ్స్ చెన్నై పోర్టులో వున్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఇది తెలుసుకుని సంతానం వచ్చేసి విక్రమ్ మీద దాడి చేస్తాడు. విక్రమ్ సంతానంని రష్యన్ హెవీ మెషీన్ గన్ తో కాల్చి చంపుతాడు. ఈ దాడిలో విక్రమ్ మనవడ్ని కాపాడుతూ టీం మెంబర్లు చనిపోతారు.

ఇదొక్కటి తప్ప

పై మిడిల్ -2 విభాగంలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేతో మిడిల్ కథనం మర్యాదకరంగా సాగింది. అయితే అమర్ సంతానం ఇంటిని పేల్చడం కథకి మరక అంటించింది. ఇంటర్వెల్లో అతను కథని కమల్ కప్పగించి హేండాఫ్ పాత్రయ్యాక కథలోంచి తప్పుకోవాలి, లేదా కమల్ కి రైట్ హేండ్ గా మారాలి. ఈ సెకండాఫ్ లో కమల్ వర్కింగ్ కథానాయకుడయ్యాక కథని తను నడిపించాలి. సంతానం ఇంటిని తను పేల్చాలి. ఎందుకంటే తన కొడుకు ప్రభంజన్ని చంపింది సంతానమే. కానీ దర్శకుడు అమర్ భార్యని కోల్పోవడం కోసం, తద్వారా అమర్ కమల్ టీంలో చేరడం కోసం, అమర్ చేతే సంతానం ఇంటిని బ్లాస్ట్ చేయించాడు.

        ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో, అమర్ గోల్ లో భాగంగా తీసుకోబోయే చర్యలకి పరిణామాల హెచ్చరికగా, అతను ప్రేమిస్తున్న గాయత్రిని ఎస్టాబ్లిష్ చేసినందుకు, దాని పే ఆఫ్ కోసం అమర్ తో ఇలా చేయించాడు దర్శకుడు కథనాన్ని దెబ్బతీస్తూ. ఇలా చేసి అమర్ ని కమల్ టీంలో చేరేలా చేశాడు. దీంతో అమర్ పాత్రచిత్రణ కూడా దెబ్బతింది. ఇలా చేసి భార్యని పోగొట్టుకున్న విషాదంలో కమల్ టీంలో చేరడం ఔచిత్య భంగమే. స్క్వాడ్ రిటైర్డ్ చీఫ్ కమల్ ఆపరేషన్స్ లో వుండగా అమర్ తను స్వతంత్రంగా ఆపరేషన్ చేపట్టడం ప్రోటోకాల్ అన్పించుకోదు. సంతానం ఇంటిని పేల్చేయడానికి తనకున్న కారణ మేమిటి? తన కొడుకుని చంపాడన్న కారణం కమల్ కెక్కువుంది. కాబట్టి కమల్ కే వదిలేయాలి. తను ముందే కమల్ టీంలో చేరిపోయి, కమల్ తో కలిసి సంతానం ఇంటిని కుప్ప కూల్చి వుంటే, కథతో రెండు అవసరాలు తీరేవి- సంతానం ఇద్దరి మీదా పగబట్టి అమర్ భార్యని చంపి, కమల్ కోడలు మీదికి వెళ్ళడం.

        ఈ మిడిల్-2 లో మిగతా కథనం సూటిగా పాయింటుతో వయోలెంట్ గా వుంది. ఈ వయొలెన్స్ లో కమల్ మనవడితో సెంటి మెంటుని ఫీల్ కోసం వున్న ఒకేవొక్క పరికరంగా వాడుకున్నాడు దర్శకుడు. చివరికి సంతానంని  కమల్ చంపడంతో మిడిల్ -2 ముగిసి, ప్లాట్ పాయింట్ టూ ఏర్పడుతుంది. ఈ ప్లాట్ పాయింట్ టూ లో రోలెక్స్ ఉత్పన్న మవుతాడు. కమల్ కి వీడి కథ ముగించాల్సిన అంతిమ సమస్య. ఈ సమస్యతో ఓపెన్ ఎండెడ్ ముగింపుగా సినిమా పూర్తవుతుంది.

ఓపెన్ ఎండెడ్ ముగింపు  
ముంబాయిలో బడా స్మగ్లర్ రోలెక్స్ (సూర్య) ఓపెనవుతాడు భారీ సంఖ్యలో అనుచరులతో. ఇందులో సంతానం గ్యాంగ్ కూడా వుంటారు. విక్రమ్, అమర్ లు చెన్నైలో డ్రగ్స్ పట్టుకుని, సంతానం సిండికేట్ ని తుదముట్టించారని చెప్తారు. వాళ్ళిద్దర్నీ ఎవరు చంపితే వాళ్ళకి భారీ రివార్డు ఇస్తానని ప్రకటిస్తాడు రోలెక్స్. విక్రమ్ కొడల్ని, మనవడ్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడని చెప్తారు గ్యాంగ్. ఇక్కడే ఈ గుంపులో వుండి ఇదంతా వింటున్న విక్రమ్, విషయం తెలుసుకుని చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోతాడు. తన చావుకి రివార్డు ప్రకటించాడన్న మాట... చూద్దాం అన్నట్టు. దీనికి సీక్వెల్ వుంటుందన్నట్టూ...

ఇలా లోకేష్ కనక రాజ్ సినిమాటిక్ యూనివర్స్ ముగింపు కొస్తుంది. ఈ మొత్తం స్క్రీన్ ప్లే సంగతుల్లో పనికొచ్ఛేమైనా వుంటే తీసుకోవచ్చు. ఇందులో హేండాఫ్ క్యారక్టర్ అనే టెక్నిక్ వుంది, వాడుకుని తెలుగు సినిమాలకి కొత్త రూపు రేఖల్నివ్వొచ్చు.

—సికిందర్