రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, నవంబర్ 2021, శుక్రవారం

1095 : రివ్యూ


 రచన - దర్శకత్వం శ్రీను గవిరెడ్డి
తారాగణం :  రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, నరేన్, పోసాని కృష్ణమురళి, అజయ్, అరియనా తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : గేష్ బనేల్ 
బ్యానర్స్ : : అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్లెల్పీ  
నిర్మాతలు : సుప్రియ, ఆనంద్ రెడ్డి
విడుదల : నవంబర్ 26, 2021
***

రాజ్ తరుణ్ సక్సెస్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. 2013 లో పరిచయమవుతూ నటించిన ఉయ్యాల జంపాల సక్సెస్ తర్వాత, 2015 లో కుమారి 21 ఎఫ్ తప్ప, ఇంత వరకూ సక్సెస్ ఏమీ లేదు. నటించిన 11 సినిమాలూ వరుసగా ఫ్లాపయ్యాయి. తాజాగా ఇప్పుడు అనుభవించు రాజా విడుదలైంది. దీనికి దర్శకుడు తను నటించిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే ఫ్లాప్ తీసిన గవిరెడ్డి శ్రీను! ఫ్లాపు ఫ్లాపూ కలిసి అనుభవించు రాజా అంటూ వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్ అండగా వుంది. మరి ఈసారి ఏం అనుభవించారు- హిట్టా, ఫ్లాపా? తెలుసుకుందాం...

కథ 
పశ్చిమ గోదావరి జిల్లా యండగండి అనే గ్రామం. ఈ గ్రామంలో బంగారం అలియాస్ రాజు (రాజ్ తరుణ్)  తాత బాగా ఆస్తిపరుడు. రాజు ఏ లోటూ లేకుండా పెరుగుతాడు. ఇంతలో యాక్సిడెంట్ జరిగి తల్లిదండ్రులు చనిపోతారు. తాత కూడా చనిపోతూ మాట చెప్తాడు- ఇన్నాళ్ళూ డబ్బు కూడ బెట్టడమే సరిపోయిందనీ, దాన్ని అనుభవించ  లేకపోయాననీ, నూవ్వైనా రాజాలా అనుభవించమనీ చెప్పి చచ్చిపోతాడు. చెప్పకపోయినా ఏకైక వారసుడిగా అనుభవించే వాడే. రాజు పెద్దవాడై అనుకోని ఒక సంఘటనలో జైలుకి పోతాడు. జైల్లోంచి విడుదలై హైదరాబాద్ వెళ్ళిపోతాడు.  ఆక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరతాడు. ఇక్కడ ఇటీ జాబ్ చేస్తున్న శృతి (కాశీష్ ఖాన్) తో ప్రేమలో పడతాడు. రాజు సిస్టమ్స్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడనునుకుని ఆమె కూడా ప్రేమలో పడుతుంది. తీరా ఒట్టి సెక్యూరిటీ గార్డేనని తెలుసుకుని షాకవుతుంది. రాజు వూరు విడిచి వచ్చేయాడానికి కారణమేమై వుంటుంది? అక్కడేం జరిగి వుంటుంది? ఆస్తిని రాజాలా అనుభవించకుండా ఎందుకు వదిలేసి వచ్చాడు? ఇవి తెలుసు కోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

ఆయాచిత ఆస్తిని అనుభవించే పని లేని రాజాగా కామెడీ కథగా చెప్పొచ్చు. దీంట్లో ఏదో గుణపాఠం నేర్పొచ్చు. కానీ కామెడీ అనుకున్నది కాస్తా హంతకులు జొరబడే సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుపోవడంతో ఫస్టాఫ్ వరకే వర్కౌట్ అయింది. సెకండాఫ్ విషయంలేక తేలిపోయింది. ఎత్తుగడ ఆసక్తి కరంగానే వుంది.  టైటిల్స్ కి ముందు ఆ గ్రామంలో రాజ్ తరుణ్ కోటీశ్వరుడి వారసుడిగా పరిచయమై, తర్వాత జైల్లో కనిపిస్తాడు. ఆ తర్వాత హైదారాబాద్ లో ఐటీ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్ గా వుంటాడు. ఇలా క్యారక్టర్ సస్పెన్స్ తో మారిపోతూ వుంటుంది. హీరోయిన్ తో లవ్ ట్రాక్ మొదలవుతుంది. అది రెగ్యులర్ గా సినిమాల్లో బోరు కొడుతున్న సాఫ్ట్ వేర్ ప్రేమల్లో ఒక టెంప్లెట్ ప్రేమగా టైము తినేస్తుంది.      

ఇంటర్వెల్లో ఒక మలుపుతో సెకండాఫ్ లో గ్రామంలో ఫ్లాష్ బ్యాక్ లోకి  పోతుంది కథ. ఇంటర్వెల్ వరకూ సస్పెన్సుతో నిలబడ్డ కథ, సెకండాఫ్ లో విషయం లేక చతికిల బడింది. కామెడీ చేసి నవ్వించే ప్రయ్తత్నాలు కూడా ఫలించలేదు. కోళ్ళ పందాలూ, అవెలా జరుగుతాయన్న వివరాలూ, రాజ్ తరుణ్ ప్రెసిడెంట్ గా పోటీ, హంతకుల హడావిడీ...ఏవీ ఫస్టాఫ్ లో లేవనెత్తిన ప్రశ్నలతో పోటీ పడి నడవలేదు. బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఇంతే. లైటర్ వీన్ సినిమాలు తీస్తే ఒకప్పటి రోమాంటిక్ కామెడీల్లాగే ఫ్లాపావుతాయి. ఈ మూవీ రాజ్ తరుణ్ కి ఫస్టాఫ్ హిట్, సెకండాఫ్ ఫ్లాప్.

నటనలు- సాంకేతికాలు

రాజ్ తరుణ్ ఏ పాత్రయినా చక్కగా నటించగలడు. కథలే కలిసి రావడం లేదు. తనకున్న యూత్ ఫాలోయింగ్ క్రమక్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి వుంది. ఓపెనింగ్స్ కూడా వుండడం లేదు. తనేం చేయాలో ఇక తీవ్రాలోచన చేయాల్సిందే. అన్నపూర్ణ బ్యానర్లో కూడా పరిస్థితి మారకపోతే ఇంకెప్పుడూ మారుతుంది. ఐతే అన్నపూర్ణ నిర్వాహకులు ఈ స్క్రిప్టుని ఎలా అనుకుని జడ్జి చేశారన్నది కూడా పాయింటే.

        రాజ్ తరుణ్ గ్లామర్ కి గోపీసుందర్ సమకూర్చిన పాటలు కూడా సహకరించలేదు. కొత్త హీరోయిన్ కశీష్ ఖాన్ తో రొటీన్ రోమాన్సు వల్ల కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు. అందచందాలున్న కశీష్ కి సరైన పాత్ర కూడా లేదు. ప్రొడక్షన్ విలువలూ, కెమెరామాన్ నగేష్ విజువల్స్ మాత్రం బావున్నాయి.

—సికిందర్

 

1094 : రివ్యూ

రచన- దర్శకత్వం : మిలాప్ జవేరీ
తారాగణం : జాన్ అబ్రహాం
, దివ్యా ఖోస్లా కుమార్, హర్ష్ ఛాయా, జాకీర్ హుస్సేన్, అనూప్ సోనీ, నోరా ఫతేహీ తదితరులు
సంగీతం : సంజయ్ చౌదరి
, ఛాయాగ్రహణం : డడ్లీ
బ్యానర్స్ : టీ సిరీస్ ఫిలిమ్స్
, ఎమ్మే ఎంటర్ టైంమెంట్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్
, కృష్ణ కుమార్, మనీషా అద్వానీ, నిఖిల్ అద్వానీ
విడుదల : నవంబర్ 25
, 2021

***

        జాన్ అబ్రహాం తో సత్యమేవ జయతే (2018) తీసిన దర్శకుడు మిలాప్ జవేరీ దాని సీక్వెల్ సత్యమేవ జయతే 2 తో వచ్చాడు. మాస్ సినిమాలకే చెడ్డ పేరు తెస్తున్నాడని పేరున్న మాస్ డైరెక్టర్ జవేరీ, సీక్వెల్ తో ఇంకెంత చెడ్డ పేరు తెస్తాడోనని భయ సందేహా లేర్పడ్డాయి. పైగా 1980 ల నాటి సినిమాలకి నివాళిగా తీసినట్టు ప్రకటించాడు. నివాళిగా తీస్తే నీటుగానే తీసి వుంటాడని ఒక పక్క నమ్మకమేర్పడింది. జాన్ అబ్రహాం త్రిపాత్రాభినయం చేయడంతో మాస్ యాక్షన్ మస్తుగా వుంటుందని ఫ్యాన్స్ కూడా బుకింగ్స్ కి రెడీ అయ్యారు. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించాలంటే ముందు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడే మాస్ సినిమాలు తీయాలని ప్లాన్ చేసిన జవేరీకి, మొన్న సూర్యవంశీ మాస్ పెద్ద హిట్టవడంతో ధైర్యం వచ్చేసింది. మరి ఇది మాస్ సినిమాలకి మంచి పేరా, చెడ్డ పేరా చూద్దాం...

కథ

ఉత్తర ప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలో సత్య బలరామ్ ఆజాద్ (జాన్ అబ్రహాం) హోం మంత్రి. ఇతడి తండ్రి దాదా సాహెబ్ బలరాం ఆజాద్ (జాన్ అబ్రహాం) వ్యవసాయదారుడు. కవల సోదరుడు జై బలరాం ఆజాద్ (జాన్ అబ్రహాం) ఏసీపీ. సత్య బలరామ్ ఆజాద్ హోమ్ మంత్రిగా అసెంబ్లీలో అవినీతి నిరోధక బిల్లు ప్రవేశ పెడతాడు. దీన్ని కూటమి భాగస్వాములు వ్యతిరేకిస్తారు. దీనికి ఎమ్మెల్యే విద్య (దివ్యా ఖోస్లా కుమార్) కూడా వ్యతిరేకంగా ఓటేస్తుంది. ఈమె సత్య భార్యే, పైగా ముఖ్యమంత్రి చంద్ర ప్రకాష్ కుమార్తె. అసెంబ్లీలో బిల్లుని ఓడించడంతో సత్య ఇక స్వయంగా తనే అవినీతి పని బట్టాలనుకుంటాడు.

        ఓ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సమ్మెకి దిగుతారు. ఈ సమయంలో ప్రమాదానికి గురైన కూతురికి చికిత్స చేయమని ఓ తల్లి వేడుకుంటే, సమ్మెకి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ నిరాకరిస్తాడు. ఆ కూతురు చనిపోతుంది. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న హోమ్ మంత్రి సత్య, డాక్టర్ని చంపేస్తాడు. దీంతో భయపడి సమ్మె విరమిస్తారు. సత్య రాత్రికి రాత్రే హీరో అయిపోతాడు. ఇది సీఎం చంద్ర ప్రకాష్ కి నచ్చక, వాణ్ణి పట్టుకోమని పోలీసుల్ని ఆదేశిస్తాడు. సత్యని పట్టుకోవడానికి కవల సోదరుడు ఏసీపీ జై రంగంలోకి దిగుతాడు.        

మదర్సాలో విషాహారంతో అస్వస్థతకి లోనై ఆస్పత్రిలో చేరిన 40 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోతారు. దీనికి పాడైపోయిన ఆహార ధాన్యాలని సరఫరా చేసిన ఎమ్మెల్యే, ఆక్సిజన్ని సరఫరా చేయని ఎమ్మెల్యే, ఇద్దరూ  కూటమిలో భాగస్వామ్య పార్టీ సభ్యులే బాధ్యులని వాళ్ళిద్దర్నీ చంపేస్తాడు సత్య. ఒక ఫ్లైఓవర్ కూలిపోవడంతో అది నిర్మించిన కాంట్రాక్టర్ అవినీతిపరుడని అతణ్ణి కూడా సత్య చంపేస్తాడని ఏసీపీ జై ఆపడానికి ఉద్యుక్తుడవుతాడు...ఇక అవినీతిపరుల్ని చంపుతున్న సత్యకీ, అతణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించే జైకీ మధ్య తీవ్ర సంఘర్షణ ప్రారంభమవుతుంది...

నివాళి కాదు నిప్పు

1980 ల నాటి యాంగ్రీ యంగ్ మాన్ సినిమాలకి నివాళిగా ఈ సినిమా అందిస్తున్నట్టు చెప్పిన దర్శకుడు మిలాప్ జవేరీ, 1980 ల నాటి సినిమాలంటే నేటి తరం ప్రేక్షకులు భయపడేంత భీకరంగా తీశాడు. 1980 ల నాటి సినిమాలు ఇలా వుండేవా? ఆ నాటి దర్శకులు ఇంత నాటుగా వుండేవాళ్ళా? ఇది నివాళియా, నిప్పంటించడమా? జాన్ అబ్రహాం అవినీతి పరుల్ని నిప్పంటించి జుగుప్సాకరంగా చంపినట్టు - 1980 ల నాటి సినిమాల చరిత్రని ఇలా తుదముట్టించడమే. అప్పటి సినిమాల్లో దేశభక్తి ఇలా వుందా? దేశభక్తి పేరుతో ఇలా చేశారా? మిలాప్ జవేరీ చూపించింది థర్డ్ క్లాస్ దేశభక్తి. చెవులు పగిలి పోయేలా అరుపులు అరిచి వినిపించే దేశభక్తి. చంపినప్పుడల్లా తన్ మన్ ధన్ సే బడ్కర్ జన్ గణ్ మన్ (దేహం, గుండె, డబ్బు కంటే గొప్పది జనగణమన) అని గొంతు చించుకునే నాటు దేశభక్తి. ఏ దేశానికైతే గంగమ్మ తల్లిగా వుందో, అక్కడ రక్తం కూడా త్రివర్ణ పతాకమే - అనే రక్తదాహపు దేశభక్తి. హింసకి పర్యాయ పదంగా అతి దేశభక్తి.

మరిన్ని భీకర అరుపులు- ఒక్కో పాపిష్టోడ్నీ ఎలా చంపుతానంటే...మళ్ళీ జన్మలో వాడు అమ్మ కడుపులోంచి బయటికి రావడానికే కాదు, అయ్య వీర్య కణంలోంచే బయటికి రావడానిక్కూడా భయపడి చస్తాడు!

        నా కుతి తీరేలా నిన్ను కొడతా. నువ్వు పళ్ళు బయటపెట్టి పడీ పడీ నవ్వాల! నవ్వాపావో, మళ్ళీ మళ్ళీ కొడతా!

        చెత్త నాకొడుకుల్ని చంపాలంటే 56 ఇంచుల ఛాతీ కాదు, 56 కిలోల బండ (చెయ్యి) కావాలి!

        నా ఫండమెంటల్ దండి (దండి మార్చ్) కాదు, నా ఫండమెంటల్ దండా (లాఠీ). గాంధీజీకీ ఎప్పుడూ జై, కానీ నా భగత్ సింగ్ కి ఇంకా జై!  


నోట్లు తప్ప ఇంకేం మారలేదు. పేదోడు బరిబత్తెలు గానే వున్నాడు, ఇక ఇప్పుడు అవినీతైనా అంతమవ్వాలి, రక్తాలైనా పారాలి!

        సిగ్నల్ దగ్గర పోలీసుకి వంద రూపాయల మీద ఆశ. నీ పేరు ఖాన్ అయితే నీ ఖాందాన్ (వంశం) మొత్తం టెర్రరిస్టులే. రైతు వాడింట్లో వాడే ఫ్యానుకి వేలాడే నా దేశం మహాన్ హై!

        ఈ హీరోయిజాన్ని చూసి ప్రతీసారీ జనాలు కవితలు అల్లి మరీ జేజేలు పలకడం-హీరోనే ఎంట్రీ మారీ, పబ్లిక్ నే సీటీ మారీ, అబ్ తో షురూ మారామారీ! (హీరోగారు ఎంట్రీ కొట్టారు, జనాలు ఈలలు కొట్టారు, ఇక వీర కొట్టుడు మొదలు) ... కసమ్ సినిమాకీ, అబ్ దిఖాదే బేటీ తూ ధర్తీ మాకీ! (సినిమా మీదొట్టు, నేలతల్లి బిడ్డగా ఇహ నేల మట్టం చెయ్యమ్మా).

దినపత్రిక చదువుతున్నట్టు ఎత్తి రాసి తీసిన ఎన్నో సంఘటనలు. అమరుడైన తండ్రి పెన్షన్ కోసం ఓ యువతి పోతే అవినీతి అధికారి వెళ్ళ గొట్టడం, రాజకీయ నాయకుల అనుచరులు ఓ యువతిని మానభంగం చేస్తే ఆమె బహిరంగంగా కాల్చుకుని చనిపోవడం, రైతుల ఆత్మ హత్యలు, లోక్ పాల్ బిల్లు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, మత సహనం, సామరస్యం... ఇలా ఎన్నెన్నో.

        ప్రభుత్వాఫీసు ముందు ఖురాను, జానీమాజ్ పట్టుకుని నిలబడ్డ ముస్లిం స్త్రీని ప్రశ్నించిన అధికారికి జాన్ అబ్రహాం రాజ్యాంగం గురించి క్లాసు పీకడం. అసలామె అక్కడెందుకు నిలబడిందంటే, జాన్ అబ్రహాం రాజ్యూంగం గురించి కూడా ఓ క్లాసు పీకే సీను వుండాలి కాబట్టి. కానీ రాజ్యూంగ భక్తి లేకుండా దేశభక్తి పూని మనుషుల్ని నిప్పంటించి మరీ చంపడం. జాతీయ పతాకాన్ని కూడా అవమానించడం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపినప్పుడల్లా జాతీయ పతాకాన్ని చూపించడం.

        ముగ్గురు జాన్ అబ్రహాంలు అరుపులు, పెడబొబ్బలు, గాండ్రింపులు! అసలు సినిమాలో ఏ నటులు కూడా మాట్లాడరు, అరుస్తారు. మామూలుగా అరవరు, మ్యూజిక్ డైరెక్టర్ దిక్కులు పిక్కటిల్లేలా కొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పోటీపడి అరుస్తారు. ఈ మూవీ భారీ శబ్దాల హోరు. చెవులు తట్టుకోగల్గాలి.

1980 సినిమాలకే కాదు అప్పటి దర్శకులు మన్మోహన్ సింగ్, ప్రకాష్ మెహ్రా లకి కూడా నివాళీ అన్న దర్శకుడు, చెడగొట్టి చూపించడానికి దేన్నీ వదల్లేదు.  అర్ధం పర్ధం లేని కిచిడీ కథ; నాటు, మోటు, ఘాటు నటనలు, లాజిక్ లేని హాస్యాస్పదమైన ఫైట్లు...హెలికాప్టర్ ఎగరకుండా పట్టి లాగుతాడు అబ్రహాం. మోటారు సైకిలు మీద వున్న వాడితో సహా లేపి గాల్లోకి విసిరేస్తాడు. ఇవన్నీ చూసి మాస్ ప్రేక్షకులు మాత్రం చప్పట్లు కొడితే చాలనుకున్నట్టుంది. ట్రైలర్స్ విడుదల చేసినప్పుడే ట్విట్టర్ నిండా వెటకారాలు చేశారు యూత్.

ఒకందుకు మెచ్చుకోవాలి

జాన్ అబ్రహాం అరుపులు  అరిస్తే అరిచాడు, అతడికా శక్తి వుంది. అరవలేని ఇతర నటులు అరవడం సూట్ కాకపోయినా అరవడమే. ఇది ఇంకో టార్చర్. సిక్స్ ప్యాక్ జాన్ అబ్రహాం తను గౌరవం గల స్టార్ అన్న విషయం మర్చిపోయి, సక్సెస్ కోసం సృష్టించిన బీభత్సం వూర మాస్ ప్రేక్షకులకే నచ్చుతుంది. దేశభక్తితో అన్నితరగతుల ప్రేక్షకుల్ని ఆకట్టుకో లేక పోతే దేశభక్తినే అవమానించినట్టు అవుతుంది. పూర్వం సంగతి పక్కన పెడదాం, కనీసం 1980 నుంచీ నేటి వరకూ ఇంత నేలబారు చీప్ సినిమా ఏ భాషలోనూ రాలేదు. అయితే ఒక విషయంలో దర్శకుణ్ణి మెచ్చుకోవాలి- 1980 ల సినిమాల్లో దేశభక్తి మత ఫీలింగుతో లేదు. దీన్ని కాపాడినందుకు అభినందించాలి.

        ఈ సినిమాకి లేడీస్ కూడా వస్తారనేమో, ఈ బీభత్స కాండలో స్త్రీలు జరుపుకునే కర్వా చౌత్ పండగ పాట హీరోయిన్ దివ్య మీద పెట్టారు. ఇంకో పెళ్ళి పాట నోరా ఫతేహీ మీద పెట్టారు. విచిత్రమేమిటంటే ఈ రెండు పాటలూ బావున్నాయి- ముగ్గురు అబ్రహాంల అబ్బా అనే దెబ్బని మనం తట్టుకోవడానికి!

  సికిందర్

 

 

25, నవంబర్ 2021, గురువారం

1093 : క్విక్ రివ్యూ!

రచన- దర్శకత్వం: జీతూ జోసెఫ్
తారాగణం: వెంకటేష్, మీనా, కృతిక, ఎస్తర్ అనిల్, తనికెళ్ల భరణి, నదియా, నరేష్, సంపత్ రాజ్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : సతీష్ కురుప్
బ్యానర్స్ సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాడ్ సినిమాస్ నిర్మాతలు: డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
విడుద; నవంబర్ 25, 2021 (అమేజాన్ ప్రైమ్)

***

        2014 లో వెంకటేష్ తో హిట్టయిన  దృశ్యం ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సీక్వెల్  దృశ్యం 2 ఈ రోజు విడుదలైంది. దృశ్యం 2 మలయాళం ఒరిజినల్ గత ఫిబ్రవరిలో ఓటీటీలో అమెజాన్లో విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. తెలుగు సీక్వెల్ కూడా ఇప్పుడు అమెజాన్లోనే విడుదలైంది. దీనికి ఒరిజినల్ దృశ్యం’, దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. తెలుగు దృశ్యం శ్రీప్రియ దర్శకత్వం వహించింది. ఇప్పుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెలుగు సీక్వెల్ ఎలా వుందో చూద్దాం.

కథ

   దృశ్యం లో కేబుల్ ఆపరేటర్ అయిన రాంబాబు (వెంకటేష్) ఇప్పుడు థియేటర్ ఓనర్ గా, సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ గా వుంటాడు. భార్య జ్యోతి (మీనా), కూతుళ్ళు అంజూ, అనూ (కృతిక, ఎస్తర్ అనిల్) వుంటారు. రాంబాబు ఓ రచయిత (తనికెళ్ళ భరణి) తో కలిసి సినిమా కథ కూడా రాస్తూంటాడు. ఆరేళ్ళ క్రితం దృశ్యం లో పోలీస్ ఐజీ గీత (నదియా) కొడుకు వరుణ్ అదృశ్యం కేసులో అనుమానితుడైన రాంబాబు కుటుంబాన్ని ఆ కేసు భయం ఇంకా వెన్నాడుతూ వుంటుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వరుణ్ ని చంపి కుటుంబాన్ని కాపాడుకున్నాడు రాంబాబు. శవం దొరక్కుండా చేశాడు. ఇప్పటికీ కోల్డ్ కేసుగా వున్న ఆ కేసుని ఇప్పుడు పోలీసులు తిరగ దోడడం ప్రారంభిస్తారు. దీంతో రాంబాబు కుటుంబం మళ్ళీ సమస్యల్లో పడుతుంది. ఐజీ గౌతమ్ సాహూ (సంపత్ రాజ్) కొత్త ఆధారాలతో రాంబాబుని ట్రాప్ చేస్తాడు. ఇప్పుడు రాం బాబు ఏం చేశాడు? సినిమా కథ అల్లడంలో టాలెంట్ చూపిస్తున్న రాంబాబు ఇప్పుడు ఏ కథల్ని అల్లి పోలీసుల్ని ఓడించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

దృశ్యం కొనసాగింపు కథ దృశ్యం కంటే నీటుగా వుంది. ఫస్టాఫ్ కథనం 40 నిమిషాలు మాత్రం అత్యంత మందకొడిగా సాగుతుంది. ఈ నిడివిని కేసు భయంతో ఇంకా కూతుళ్ళు మానసిక వేదన అనుభవించే దృశ్యాలు, వెంకటేష్ ని మీనా సున్నితంగా సాధించే దృశ్యాలూ, రహస్యంగా పోలీసులు దర్యాప్తు చేసే దృశ్యాలూ ఒక క్రమ పద్ధతిలో వస్తూంటాయి డ్రామాని బిల్డప్ చేస్తూ. చనిపోయిన వరుణ్ తండ్రి నరేష్ కూడా వచ్చి, వరుణ్ అస్థికలైనా ఇప్పించమని వెంకటేష్ ని ప్రాధేయపడే ఎమోషనల్ దృశ్యాన్ని వెంకటేష్ గిల్టీ ఫీలింగ్ ని పెంచే మంచి దృశ్యంగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. ఒక అర్ధవంతంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి వెంకటేష్ డిఫెన్స్ లో పడి, కథలు చెప్పే కాబోయే నిర్మాతగా చెక్ పెట్టే దృశ్యాలూ థ్రిల్ చేస్తాయి. కథనం, దాని చిత్రీకరణ, నేపథ్య సంగీతం మలయాళ దర్శకుడి చేతిలో రెగ్యులర్ తెలుగు సినిమాలకి భిన్నంగా ఒక ఫీల్ తో డిఫరెంట్ అనుభవాన్నిస్తాయి. మలయాళ దర్శకుడు ఈ తెలుగు సినిమా తీసి సహజత్వాన్ని అత్యంత సహజంగా ప్రెజెంట్ చేశాడు. క్లయిమాక్స్, ముగింపూ అసాధారణమైనవే మేధస్సుకి పని పెడుతూ.

నటనలు -సాంకేతికాలు

వెంకటేష్ మళ్ళీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పాత్రలో దృశ్యం అనుభవంతో దివ్యంగా చేసుకుపోయారు. ఫ్యామిలీ మాన్ గా తెలుగు మార్కు హెవీ ఎమోషన్స్ లేకుండా సున్నిత ఫీలింగ్స్ తో సైలెంట్ గా చేసుకుపోయారు. పోలీస్ స్టేషన్ లో నదియా ప్రతాపం చూపించే సన్నివేశంలోనూ డౌన్ ప్లే చేశారు. నదియా సంధించే ప్రశ్నలకి పోలీస్ స్టేషన్ కెక్కిన కుటుంబంతో పడే వేదన, నేరం ఒప్పుకోలేని డైలమా చాలా కాలం తర్వాత వెంకటేష్ లోని నటుడ్ని కొత్త రూపంలో చూపిస్తుంది. హైప్, కమర్షియల్ హంగామా, హీరోయిజమూ లేని ఈ బలమైన ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ తో వెంకటేష్ గుర్తుండి పోతారు.

        మీనా, కృతిక, ఎస్తర్, నదియా, సంపత్ రాజ్ నల్గురూ ఎక్సెలెంట్ గా నటించారు. అరుపులు, కేకలు లేకుండా, హింస, దానికి చెవులు పగిలే బిజిఎం లేకుండా సైలెంట్ గా సాగిపోయే మూవీ అసలు మూవీ చూస్తున్నట్టు భారంగా అన్పించదు. అమెజాన్లో తప్పక చూడాల్సిన తెలుగు మూవీ.

—సికిందర్

1092 : రివ్యూ

రచన - దర్శకత్వం: శ్రీని జోస్యుల
తారాగణం : హర్ష, నికీషా, మీషా, చత్రపతి శేఖర్, సూర్య తదితరులు
సంగీతం: అజయ్, ఛాయాగ్రహణం : జనా
బ్యానర్: జరంగ బలి క్రియేషన్స్
నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు
విడుదల : నవంబర్ 19, 2021
***
      గత శుక్రవారం విడుదలైన కొత్త దర్శకుల 9 తక్కువ బడ్జెట్ సినిమాల్లో ‘మిస్సింగ్’ ఒకటి. శ్రీని జోస్యుల దర్శకుడు. తొలి ప్రయత్నంగా కొత్త నటీనటులతో సస్పెన్స్ థ్రిల్లర్ తలపెట్టాడు. సినిమా తీసి ఓటీటీ మార్కెట్లో కూడా లాభ పడాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ మంచి వస్తువే. కాకపోతే లో - బడ్జెట్ సినిమాలు విభిన్నంగా వుంటేనే ఓటీటీ మార్కెట్లో బిజినెస్ వుంటుంది. ప్రేక్షకులుంటారు. ఇంటర్నెట్ వీడియో మీడియా యూజర్లు క్వాలిటీ కంటెంట్ ని కోరుకుంటారు. కనుక ఓటీటీ అధికారుల సినిమాల ఎంపిక నిబంధనల్ని గట్టెక్కాలంటే, ఎంత ఇన్నోవేటివ్ ఐడియాతో కంటెంట్ వుంటే అంత మంచిది. అదృష్టవశాత్తూ కొత్త దర్శకుడి మిస్సింగ్ లో అలాటి ఇన్నోవేటివ్ ఐడియాయే వుంది. దీనికి తగ్గ కంటెంట్ ఎలా వుందన్నదే ప్రశ్న. వైరల్ ఐడియా వుంటే కంటెంట్ లో వైరల్ మెకానిజం కోసం కూడా కృషి చేయాలి. ఇది జరిగిందా? చూద్దాం...

కథ

    గౌతమ్ (హర్ష), శృతి (నికీషా) ఐటీ ఉద్యోగులు. ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. చేసుకున్నాక ఓ రోజు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అవుతుంది. గౌతమ్ హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూస్తే శృతి వుండదు. ఘటనా స్థలం నుంచి అదృశ్యమైపోతుంది. ఎలా అదృశ్యమైంది? ఎక్కడికెళ్ళింది? గౌతమ్ వెతుకుతూంటే తామిద్దర్నీ ఓ నల్గురు ఫాలో అవుతున్నట్టు ఓ సీసీ టీవీ వీడియో బయట పడుతుంది. వాళ్ళని పట్టుకోబోతే ఒక్కొక్కరూ చచ్చి పోతూంటారు. ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? శృతి నేం చేశారు? పరిస్థితి జటిలమవుతుంది గౌతంకి. ఈ కేసు తేల్చడానికి పోలీసులుతో బాటు ఓ జర్నలిస్టు మీనా (మీషా) రంగంలోకి దిగుతారు. అసలేమిటీ మిస్టరీ అన్నదే మిగతా కథ.

మిస్సయిన వైరల్ మెకానిజం

    ఇందులో వైరల్ అయ్యే అవకాశమున్న ఐడియా ఏమిటంటే, గౌతమ్ తెలియకుండా తనే శృతిని కిడ్నాప్ చేసి, తనే ముగ్గుర్నీ అనుమానించి తెలియకుండా వరుస హత్యలు చేయడం. పూర్వం జరిగిన ఇంకో యాక్సిడెంట్లో జ్ఞాపక శక్తిని కోల్పోయిన కారణంగా స్ప్లిట్ పర్సనాలిటీతో ఇలా చేయడం. ఇంత ఇన్నోవేటివ్ గా వున్న ఈ ఐడియాని కథగా విస్తరించడంలో అనేక గందరగోళాలకి లోనై, గజిబిజి చేసి, అసలేం చూస్తున్నామో అర్ధంగానంత, చూడడం మానెయ్యాలన్నంత కసితో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. వైరల్ ఐడియాతో వైరల్ మెకానిజం లేకుండా పాత ఫార్ములాతో ఈ కాలపు సినిమా చూపించే ప్రయత్నం చేశారు. పాత కాలపు ఫార్ములాలు ఇంకా విన్నింగ్ ఫార్ములాగా వున్నాయా బడ్జెట్ సినిమాలకి ఈ రోజుల్లో? బి గ్రేడ్ సినిమాలు అన్పించుకోవడం తప్ప?

        చివరికి ఆ స్ప్లిట్ పర్సనాలిటీతో కిడ్నాపులు, హత్యలూ చేసిన గౌతమ్ ని కాపాడుతూ, మరికర్ని దోషిని చేసే పాత ఫార్ములా ఇది. ఎంతైనా మన తెలుగు హీరో మంచి వాడే, తెలుగు కాని హీరోయిన్ తో ఇక సుఖంగా కాపురం చేసుకుంటాడని ప్రేక్షకుల్నిసంతోష పెట్టాలనుకునే, ఎవరూ కేర్ చేయని కృత్రిమ కథ. కథని ప్రశ్నార్థకం చేస్తే ప్రేక్షకులు కేర్ చేయడానికి వీలుంటుంది.

        నిఖిల్ నటించిన అర్జున్ సురవరం లో నిఖిల్ తనని నకిలీ సర్టిఫికేట్ల స్కామ్ లో ఇరికించిన విలన్ని పట్టుకుని తను నిర్దోషిగా నిరూపించుకునే కథ. అతను విలన్ని పట్టుకుంటే మనకేంటి? పట్టుకోక పోతే మనకేంటి? విలన్ దోషి అయితే ఎవరిక్కావాలి? కాకపోతే ఎవరిక్కావాలి?

        సీన్ రివర్సల్- ప్రాక్టికల్ కథలు కావాలిప్పుడు. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ లో నిఖిల్ ని ఇరికించలేదనీ, అతనే బుద్ధిపూర్వకంగా నకిలీ సర్టిఫికేట్లు కొన్నాడనీ, సీన్ రివర్స్ చేస్తే కొత్త కథవుతుంది. దీని విష పరిణామాలు చూపిస్తే కథ కొత్త తావులకి విస్తరిస్తుంది. కొత్త విషయాలు చెప్తుంది. కొత్త తీరాలకి తాకుతుంది. కథ వెనుక కథ చెప్తుంది. నకిలీ సర్టిఫికేట్లు కొనే విద్యార్ధుల  నైతిక, సామాజిక స్థితి ఏ గతి పడుతుందో తెలియ జెప్తుంది. కథలకి సముద్రాలే వుంటే ఇంకా చెరువులు చూపించడం ఎంత కాలమని?

        కిడ్నాపులు, హత్యలూ గౌతమే చేశాడు స్ప్లిట్ పర్సనాలిటీటీతో= ఐతే ఇప్పుడేమిటి? ఇతను శిక్షార్హుడా అని ప్రశ్నిస్తే, కఠిన ప్రశ్నవుతుంది న్యాయస్థానం ముందు. గత జనవరిలో విడుదలైన హిందీ నెయిల్ పాలిష్ వుంది. ఇందులో స్ప్లిట్ పర్సనాలిటీ హీరోతో ప్రశ్నార్థకం చేసిన సైకలాజికల్ పాయింటు - నేరం మెదడు చేస్తుంది. ఇలాటి ముద్దాయి మీద కేవలం నేరారోపణ చేయగలరు. అయితే బోనులో నిలబడ్డ ముద్దాయి చేసిన హత్యలతో దోషిగా రుజువవుతూస్ప్లిట్ పర్సనాలిటీ వల్ల నిర్దోషి కూడా అయితే ప్పుడేమిటిదేని ఆధారంగా తీర్పు చెప్తారు ? - అన్నది. దిసీజ్ వైరల్ మెకానిజం. ప్రశ్నార్థకంగా మారిపోయిన కథ. ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తూ ఇంటికి పంపే కథ. ఎన్నికల సభలో నాయకుడు చెప్పిన మాటలకి తర్జనభర్జన జేసుకుంటూ ఇళ్ళకి పోతారు ప్రజలు. ఎన్నికల సభ పాటి విలువ కూడా వుండదా సినిమాకి?

    ప్రశ్న తెగక ఇలా వుంటే వీర్ సింగ్ అనే ముద్దాయిలో వీర్ సింగ్ వుండడుచారు రైనా అనే ఆవిడ వుంటుంది. అతడి స్ప్లిట్ పర్సనాలిటీ క్యారక్టరామె. అతడి మనసులో తప్ప భౌతికంగా లేని చారు రైనా మీద కేసేలా నడుపుతారుముద్దాయి లోంచి వీర్ సింగ్ మాయమై పోయాడు - వీర్ సింగే లేడుకనిపించని చారు రైనా వుంది- కనుక కేసే లేదు! జడ్జికి దిమ్మదిరిగి పోతుంది... న్యాయ వ్యవస్థకే పెద్ద సవాలు ఈ కేసు!

        కోవిడ్ కారణంగా ఓటీటీలో విడుదలైన నెయిల్ పాలిష్ ని రివ్యూలతో జాతీయ మీడియా వైరల్ చేస్తే, ప్రేక్షకులు వ్యూవ్స్ పెంచేశారు. బడ్జెట్ సినిమా వైరల్ కంటెంట్ తోనే గుర్తుంటుంది, మరి దేంతోనూ గుర్తుండదు- ఓ బి లేదా సి గ్రేడ్ గా అంతర్ధానమై పోతుంది.

సెకండాఫ్ సిండ్రోమ్

     ఫస్టాఫ్ ఒక కిడ్నాప్ తో, ఇంకో యాక్సిడెంట్ తో ప్రారంభమవుతుంది. వేరే క్యారక్టర్స్ తో కిడ్నాప్ సెకండాఫ్ లో రివీలయ్యే సస్పెన్స్ గా, శాంపిల్ సీనుగా వుంటుంది. యాక్సిడెంట్ లో మాత్రం గౌతమ్ గాయపడి, భార్య శృతి మాయమవుతుంది. ఇక శృతిని తల్చుకుంటూ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలవడానికి ట్రిగర్ పాయింటేమీ వుండదు. కథకీ, గౌతమ్ కీ, ఒక హుక్ ని ఏర్పాటు చేసి నడిపించే థ్రిల్లింగ్ పాయింటేమీ వుండదు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మూవీకి.

        శృతి గర్భవతై వుండడమో, లేదా ఆమెకి తను చేసిన ఓ ప్రామీజ్ వుండడమో, లేదా జాయింటుగా కొన్న ప్రాపర్టీని అత్యవసరంగా అమ్మాల్సి వుండడమో లాంటి, డైనమిక్స్ ని సృష్టించే, ఎమోషనల్ అర్జెన్సీ ఏదోవొకటి పుట్టకుండానే, ఏదో కాసేపు ఆమెతో గడిపిన క్షణాల్ని తల్చుకోవడమే కథకి అవసరమన్నట్టు, నిస్తేజంగా వుంటాయి ఫ్లాష్ బ్యాక్ సీన్లు. కథ డిమాండ్ చేసే సీన్లకి వ్యతిరేకంగా బడ్జెట్ ని వృధా చేసిన సీన్లివి.  

        పోలీసులు కేసు టేకప్ చేస్తారు. జర్నలిస్టు మీనా కూడా కేసు చేపడుతుంది. ఈ ఇద్దరి ఇన్వెస్టిగేషన్ సీన్లు కథని ముందుకు నడిపించని, సస్పెన్స్ ని సృష్టించని విషయాలతోనే వుంటాయి. గౌతమ్ ఒక మాల్ లో తననీ శృతినీ ఎవరో నల్గురు కనిపెడుతున్నట్టు అన్పించిన విషయాన్ని గుర్తు చేసుకుని, ఆ సీసీ టీవీ ఫుటేజీ చూసి, ఆ నల్గుర్నీ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఒకొక్కరూ చచ్చి పోతూంటారు. 

        ఈ చంపడాలు గౌతమే చేస్తున్నాడని ఆటోమేటిగ్గా మనకి అనుమానం వచ్చేస్తుంది. మళ్ళీ అసలు శృతీ గౌతమ్ లు ఎలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని ఇంకో ఫ్లాష్ బ్యాక్. ఇది ఇంకో కథకి అడ్డుపడే మార్కెట్ యాస్పెక్ట్ లేని, ఆసక్తి కల్గించని  వ్యవహారం. ఇక ముగ్గురు వ్యక్తులు చనిపోయాక, నాల్గో వ్యక్తి తానే అని గౌతమ్ కి రివీలవడం ఇంటర్వెల్.

        ఈ ఇంటర్వెల్ మలుపు బావుంది. శృతిని కిడ్నాప్ చేసిన వాళ్ళని హత్యలు చేస్తున్నది తనేనా? హత్య చేయాల్సిన నాల్గో వ్యక్తి తనేనా? ఎలా? ఎందుకు? శృతిని తనే మాయం చేశాడా? ఈ ఇన్నోవేటివ్ వైరల్  ఐడియా ఇంటర్వెల్లో ఎస్టాబ్లిష్ అయినందుకు సంతోషం.

        దీని తర్వాత ఈ ఐడియాతో ప్రేక్షకుల బుర్రని బ్లాస్ట్ చేసే డైనమిక్స్ తో పేఆఫ్ చేసే దిశగా ఏక త్రాటిపై కథ సాగక, దీన్ని వదిలేసి, ఇంటర్వెల్ తర్వాత ఇంకో ప్రేమ ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ లో గతంలో జర్నలిస్టు మీనాతో ప్రేమ. ప్రేమిస్తూ యూఎస్ కి ఆమె వెళ్ళిపోతే, నాల్గేళ్ళ క్రితం గౌతమ్ కే జరిగిన యాక్సిడెంట్లో మెమరీ  కోల్పోవడం, మీనా గుర్తుకు రాక యాక్సిడెంట్ చేసిన అపరిచితురాలు శృతితో ప్రేమలో పడి ఆమెనే పెళ్ళి చేసుకోవడం. ఇలా ఇగ్నైట్ చేసిన విన్నింగ్ ఐడియాని వదిలేసి -  మరో ప్రేమ ఫ్లాష్  బ్యాకు పెట్టడంతో నడపడానికి కథ లేనట్టు- సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడింది మొత్తం వ్యవహారం.

        ఫ్లాష్ బ్యాకులతో మలుపులు, నడుస్తున్న కథలో మలుపులూ సాగిసాగి, గౌతమ్ స్ప్లిట్ పర్సనాలిటీతో ఇలా చేస్తున్నాడని చెప్పడం. మళ్ళీ అది కాదు ఇదంటూ మలుపుల మీద మలుపులతో  గౌతమ్ ని కాపాడేందుకు, ఇంకెవరో ఇదంతా చేశారని జస్టిఫికేషన్ ఇవ్వడం. మొత్తంగా గజిబిజిగా తయారైంది. స్ప్లిట్ పర్సనాలిటీతో తెలియకుండా హత్యలు చేస్తున్నాడు - ఇప్పుడేమిటి?- అన్న డ్రమెటిక్ క్వశ్చన్ కి సమాధానం చెప్పే కథగా కాకుండా, ఇప్పుడవసరం లేని మూస ఫార్ములాగా ప్రేక్షకుల ముందుంది ఈ మూవీ. కథంటే డ్రమెటిక్ క్వశ్చన్ తో ఆర్గ్యుమెంట్ అని గ్రహించినప్పుడే - దీంతో చిన్న సినిమాలు బాగుపడతాయి. 

—సికిందర్