రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, ఏప్రిల్ 2022, ఆదివారం

1162 : రైటర్స్ కార్నర్


 

మాట్ చార్మన్ 2015 ఆస్కార్స్ కి నామినేట్ అయిన స్క్రీన్ రైటర్. మౌలికంగా ఒక అవార్డు గెలుచుకున్న బ్రిటీష్ నాటక రచయిత. 2015 లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్  అనే కోల్డ్ వార్ థ్రిల్లర్ కి రచయితగా పనిచేశాడు. ఈ స్క్రీన్ ప్లేని కోయెన్ బ్రదర్స్ తో కలిసి రాశాడు. మదర్ షిప్, పాట్రియాట్స్ డే, సూట్ ఫ్రాంకైజ్ తను రాసిన ఇతర సినిమాలు. ఈ సందర్భంగా రైటర్ గా తన అనుభవాల గురించి, విజయాల గురించీ తెలుసుకుందాం...
***

మీరు స్క్రీన్ రైటింగ్ ఎలా నేర్చుకున్నారు?
        మాట్ చార్మన్: నేను లండన్‌లోని యూనివర్శిటీలో వున్నప్పుడు వెస్ట్ ఎండ్ నాటకాల్లోని సెకండ్ యాక్ట్స్ చూడడానికి దూరిపోయేవాణ్ణి. నాకు టిక్కెట్లు కొనే స్థోమత లేదు కాబట్టి ఇంటర్వెల్ తర్వాత, పొగ త్రాగుతూ బయట వున్న వ్యక్తుల వెనకాల  నక్కినక్కి హాల్లోకి దూరిపోయే  వాణ్ణి. లైట్లు డౌన్ అయ్యే వరకు వేచి వుండి ఖాళీ సీటు వెతుక్కునే వాణ్ణి. ఇది సిగ్గు పడాల్సినంత చెడ్డ అలవాటే అయినా నాకు తప్పలేదు ఆర్ధిక పరిస్థితుల వల్ల.

        ఇలా ఇంటర్వెల్ తర్వాత థియేటర్స్ లో దూరి సెకెండ్ యాక్ట్స్ చూడడం వల్ల, ఇంటికొచ్చాక ఫస్ట్ యాక్ట్ కథ ఏం జరిగివుంటుందాని రాత్రంతా ఆలోచించే వాణ్ణి. ఇది అద్భుతమైన ఎడ్యుకేషన్ లా వుండేది. ఎలాగంటే, సెకండ్ యాక్ట్ చూడడం వల్ల ఫస్ట్ యాక్ట్ ని రాత్రంతా వూహించుకుని, తెల్లారి  యూనివర్శిటీ లైబ్రరీలో ఆ నాటక పుస్తకంలో నా వూహ ఎంతవరకు సరైందో చెక్ చేసుకోవడం అంతా ఎడ్యుకేషన్ కాకపోతే ఏమిటి?  అప్పు డు నాకు తెలీదు గానీ, అప్పట్లో అలా చేసిందంతా తర్వాత రచయితగా నాకు పనికొచ్చింది. అదే నాకు స్క్రిప్టులు రాయడంలో పునాదిని ఏర్పాటు చేసింది.

కథా రచన మొదటి నియమం ఏమిటి?
        డ్రామా ఎక్కడ వేడెక్కిందో అక్కడ దాన్ని పట్టుకుని వుండడం. ప్రేక్షకుల్ని అక్కడికి లాగి నిలకడగా వుంచడం. యాక్షన్ వున్న చోటు వదిలేసి పక్క సీన్లోకి వెళ్ళి పోకూడదు. యాక్షన్ తోనే వుండాలి. అంటే దీనర్ధం బలమైన డ్రామా ప్రశాంతంగా, నిశ్చలంగా వుండదని కాదు. డ్రామాలో మనమేం చూస్తున్నామో, వింటున్నామో అదే ఆ సమయానికి థ్రిల్లింగ్ పార్టు కావాలి.

స్టీవెన్ స్పీల్‌బర్గ్ మీకు రైటింగ్ గురించి, మేకింగ్ గురించి ఏం నేర్పించారు?
        స్టీవెన్ స్పీల్ బర్గ్ మన స్క్రిప్టులో పేజీల్ని తిరగేస్తూ, ప్రతి సీను గురించీ చెప్తూ వుంటే, ఆయనెదురుగా కూర్చుని ఆ వినడమే బెస్ట్ ఫిలిమ్ స్కూల్ ఎడ్యుకేషన్ నా వరకూ. ఆయన దగ్గర చాలా నేర్చు కున్నాను. ముఖ్యంగా పాత్రల షేడ్స్ ని, సంకీర్ణత్వాన్నీ వదలకూడదనే వారు. ఇది రైటర్స్ కి ఆయన గిఫ్టుగా అందించే నోట్. ఇదెంత మంచి గిఫ్టో మీకు తెలీదు. నటీనటులు ఇటువంటి షేడ్స్ వున్న సంకీర్ణ పాత్రల్ని చేయడానికే ఇష్టపడతారు. పాత్రలో మంచి వుండాలి, చెడూ వుండాలి. అప్పుడే అవి కట్టి పడేస్తాయి. ప్రేక్షకులు కూడా ఇలా కట్టి పడేసే పాత్రల్ని చూడ్డానికే ఇష్టపడతారు. స్పీల్ బర్గ్ ఇలాటి పాత్రల్ని సృష్టించే వైపుకే నన్ను పుష్ చేశారు.

బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ చిత్రీకరణలో మీరు ఎంతవరకు పాల్గొన్నారు?
        స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో  పని చేస్తున్నప్పుడు నేను న్యూయార్క్ లో, బెర్లిన్‌లో సెట్స్ లో ఆయన  పక్కనే  కూర్చున్నాను. ఇది నా జీవితంలో అతి పెద్ద థ్రిల్. ఆయన టామ్ హాంక్స్ ని నటింప జేయడం, మార్క్ రైలాన్స్ తో సీన్ని షూట్ చేయడం, లైటింగ్ కరెక్షన్స్ చూసుకోవడం వంటి వాటిని చూడడం నా మనస్సుని కదిలించిందనే చెప్పాలి. ఈ డిటైల్స్ జీవితమంతా గుర్తించుకోవాలని మనసులోనే పదేపదే చెప్పుకున్నాను.

బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ మీకెలా సాధ్యమైంది?
ఇది నా జీవితంలో ఒక అద్భుతం అని నేను భావిస్తున్నాను. నాకు చరిత్ర అంటే బాగా ఇష్టం. ప్రత్యేకించి కోల్డ్ వార్ (ప్రచ్ఛన్న యుద్ధం) గురించీ, కెన్నెడీ పరిపాలన గురించీ. నేనప్పుడు రాబర్ట్ డలెక్క్ రాసిన అద్భుత పుస్తకం ఏన్ అన్ ఫినిష్డ్ లైఫ్ చదువుతున్నాను. అది కెన్నెడీ అధికారంలో వున్న మొదటి 1000 రోజుల గురించి.

        1960 లో బే ఆఫ్ పిగ్స్ దాడి ఘటనలో పట్టుబడిన అమెరికన్ వైమానిక దళ పైలట్ ని విడిపించుకోవడానికి ఫిడెల్ కాస్ట్రోతో చర్చలు జరపడానికి వెళ్ళిన జేమ్స్ డోనోవన్ అనే వ్యక్తి గురించి క్యూబా విభాగంలోని పేజీలో ఫుట్‌నోట్ వుంది. కాస్ట్రోతో చర్చలు జరపడానికి ఈ అమెరికన్ న్యాయవాదిని ఎందుకు పంపించారు, దౌత్య వేత్తని పంపించకుండా?- అన్న సందేహం నాకొచ్చింది. ఏన్ అన్ ఫినిష్డ్ లైఫ్ పుస్తకంలో డోనోవన్ ఫుట్ నోట్ కేపరిమితమయ్యాడు తప్ప అతడిగురించి పుస్తకంలో ఇంకేమీ లేదు.

        ఈ నేపథ్యంలో దౌత్యవేత్తని పంపకుండా న్యాయవాదిని పంపడంలో నాకు పనికొచ్చే కథేమైనా వుందాని తవ్వడం మొదలెట్టాను. తవ్విన  కొద్దీ  అతను కాస్ట్రోతో చర్చలు జరపడంలో నాకు పనికొచ్చే కథ లేనే లేదనీ తేలింది. నా రీసెర్చిలో తేలిందేమంటే, 1960 లో  సోవియెట్ యూనియన్ భూభాగం మీద రష్యన్లు కూల్చేసిన అమెరికన్ వైమానిక దళం గూఢచార విమానంలో పైలట్ గేరీ పవర్స్ రష్యన్లకి చిక్కాడు.

        ఆ సమయంలో రష్యన్ స్పై రుడాల్ఫ్ ఎబెల్ అమెరికాకి చిక్కి బందీగా వున్నాడు. ఇప్పుడీ గూఢచారుల మార్పిడి ఒప్పంద ప్రతిపాదనతో న్యాయవాది డోనోవన్ వెళ్ళాడు. ఇదంతా నాటకీయంగా జరిగింది. న్యాయవాదిగా అతను బెర్లిన్ లో ఓ రష్యన్ గూఢచారిని వెనకేసుకొచ్చి రష్యన్ల దృష్టిలో పడ్డాడు. ఆ రష్యన్ గూఢచారిని మరణ శిక్ష నుంచి తప్పించి రష్యన్లకి చేరువయ్యాడు.

        రష్యన్లు అతణ్ణి చేరుకుని సంప్రదింపులు జరిపారు. గూఢచారుల పరస్పర మార్పిడి ప్రతిపాదనని అంగీకరించారు. అయితే ఇది అమెరికన్ ప్రభుత్వానికి తెలియకుండా వ్యక్తిగతంగా చేయాలని కోరారు. అతను అంగీకరించాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇరుక్కునేది అతనే. రష్యన్లు తమకేం తెలీదని చేతులు దులుపుకోగలరు... అతణ్ణి చంపేసినా ఆశ్చర్యం లేదు. ఇలా ఈ వ్యక్తి గురించి నేను రీసెర్చి చేయడం మొదలెట్టాను. ఈ వ్యక్తి చరిత్ర ప్రపంచానికి తెలియకుండా మరుగున వుండడం ఆశ్చర్య పర్చింది...

నిజమే, మీరు చెప్పే వ్యక్తి గురించి మేమెప్పుడూ వినలేదు. అకస్మాత్తుగా అతడి  గురించి ఏకంగా సినిమానే చూసేశాం...
జేమ్స్ డోనోవన్
మామూలు సినిమా కాదు, టామ్ హాంక్స్ తో స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమా! నేను పరిశోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు, చాలా తెలిశాయి. అతడి కొడుకు, కూతురు అతడ్ని అమితంగా ప్రేమిస్తారు, అతను ఎంత దేశభక్తుడో వాళ్ళకి తెలుసు. అయినా అతని గురించి ప్రపంచానికి తెలియదు. నేను వాళ్ళ  కళ్ళలోకి చూస్తూ, మీ నాన్న చేసిన పనిని లోకానికి తెలియ జెసేందుకు నేను చేయగలిగినంతా చేయబోతున్నానని చెప్పాను. నేనెంత కఠోర నిజాన్ని బయటికి  తీయబోతున్నానో, జేమ్స్ డోనోవన్ ని ఎంత రక్త పిపాసిగా చూపించబోతున్నానో నాకు తెలుసు. వాళ్ళు,  ఎస్ ప్లీజ్, మా నాన్న కథ చెప్పండి అన్నారు.

వాళ్ళు సినిమా చూశారా?
        చూశారు. న్యూయార్క్  ప్రీమియర్‌లో చూశారు. చాలా భావోద్వేగపు సన్నివేశమది. వాళ్ళు నా ముందు వరసలో కూర్చున్నారు. సినిమా పూర్తయిన తర్వాత  నిజంగా అందమైన స్టాండింగ్ ఒవేషన్. వాళ్ళు నన్ను చూసి బిగ్గెస్ట్ హగ్ ఇచ్చారు. ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడంతా గుర్తు చేసుకుంటే తట్టుకోలేను. అప్పటికి ఆ అన్నా చెల్లెళ్ళ వయస్సు 60 కి పైనే, 70 కి దగ్గర్లో. ఆ చెల్లెలు తల్లి కూడా సినిమా చూసేందుకు వీలుగా తల్లి ఫోటో తీసుకొచ్చింది.

అది గొప్ప నివాళి!
        అంతే.  స్పీల్ బెర్గ్ వంటి మహనీయుడి చేతిలో కథ పెట్టినప్పుడు అంతకంటే ఎక్కువే. కథలో ఆయన డోనోవన్ నే చూశారు. కథలో తను చూసిన డోనోవన్ నే ప్రేక్షకులు చూడాలనుకున్నారు. ఇది నేను నేర్చుకున్న ఇంకో గొప్ప విషయం. దర్శకుడు/రచయిత పాత్రలో తానేం చూస్తున్నాడో తెలుసుకోకపోతే ప్రేక్షకులెలా చూస్తారు. ఆయన పాత్రల రెక్కల్ని కత్తిరించరు. ఎంతవరకు ఎగురుతాయో అంతవరకు ఎగరనిస్తారు. పాత్రలకి ఏదీ సులభంగా జరగనివ్వరు. పరిస్థితుల్ని కూడా క్లిష్టంగా సృష్టిస్తారు. ఆ పరిస్థితుల్లోంచి పాత్రని సులభంగా బయటపడనివ్వరు.

మీ స్క్రిప్టు స్పీల్‌ బర్గ్ దగ్గరికెలా చేరింది?
        నేను చేయాల్సినంతా రీసెర్చీ చేసి కథకో సమగ్ర రూపాన్నిచ్చుకున్నాను. అప్పుడు లాస్ ఏంజిలిస్ వెళ్ళి పిచింగ్ చేయడం మొదలెట్టాను. ఆ రోజు ఎనిమిది మీటింగుల్లో ఇరవై నిమిషాలు చొప్పున కథ చెప్పాను. కథలో మొదటి నుంచి  చివరి వరకూ అన్ని ట్విస్టులూ కలిపి చెప్పాను. మొదటి రోజు పిచింగ్ ముగిసే సమయానికి, నా ఏజెంట్ చాలా మంది వ్యక్తులతో కాల్స్ మాట్లాడాడు. వాళ్ళందరూ కథని ఇష్టపడ్డారు. ఈ చారిత్రక కథ ఇంతవరకూ ఇంకెవరూ చెప్పలేదేమని విస్మయం చెందారు. వారం చివర్లో డ్రీమ్‌వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరు  కేఫ్‌లో కథ విని అద్భుతంగా వుందని చెప్పారు. ఆనందంగా ఓ నవ్వు నవ్వి- ఈ కథ స్టీవెన్ కి చెప్తానన్నారు.

        నేను లండన్‌ తిరిగి వెళ్ళిపోయాను. వెళ్ళి పోయాక స్టీవెన్ స్పీల్‌బర్గ్ మీ కథని మీనుంచి నేరుగా వినాలనుకుంటున్నారు- అని మెసేజ్ వచ్చింది. నేను చాలా భయపడ్డాను.  నా శరీరం నుంచి వేడి వేడి ఆవిర్లు బయటికొచ్చాయి. మూవీ గాడ్ తో నేను మాట్లాడడమా! టెల్ మీ ది స్టోరీ అని ఆయన వాయిస్ ఫోన్లో విన్పించింది. నేను సగం చెప్పానో లేదో కథ ఆయన సైలెంట్ అయిపోయారు. అయిపోయింది- ఆయన కాల్ కట్ చేసేశారని బెంబేలెత్తిపోయాను. సర్, ఆర్యూ స్టిల్ దేర్?’ ధైర్యం చేసి అడిగేశాను. ఐయాం ఆబ్సల్యూట్లీ రాప్ట్, జస్ట్ కీప్ గోయింగ్ అన్నారు. హమ్మయ్య అనుకుని మిగిలిన కథ చెప్పేశాను. ఆయన ఎప్పుడు రాసిస్తారు మరి?’ అనడిగేశారు.  

        నేను డూ ఆర్ డై అన్నట్టు ఐదు వారాల్లో రాసేశాను. నేను పంపిన ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయన చదివి నాకు ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసేశారు. గేటు దగ్గర గోల్ఫ్ బగ్గీ నన్ను పికప్ చేసుకుని యూనివర్సల్ స్టూడియో దాకా తీసికెళ్ళింది. రిసెప్షన్లో కూర్చున్నాను. స్వయంగా స్పెల్ బర్గే వచ్చి రాయల్ స్మైలిచ్చి, షెకాండిచ్చారు. తన ఆఫీసులోకి తీసికెళ్ళారు. అలా ప్రపంచంలో బిగ్గెస్ట్ డైరెక్టర్ తో నా డ్రీమ్ - నా జర్నీ ప్రారంభమైంది...

మీరూహించ లేదేమో అంత పెద్ద గురువు లభిస్తాడని.
          నిజం. ఆయన నాకు పంపిన ప్రతీ ఒక్క నోటూ నాకొక పాఠం అయింది. ఇంప్రూవ్ మెంట్ కి టూల్ అయింది. ఆయన నోట్స్ కథని తేలిక చేయడం గురించి వుండవు, క్లిష్టంగా  మార్చడం గురించి వుంటాయి. చాలా టెక్నిక్స్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నవే.

సరే, నా దగ్గర ఒక కథకి ఐడియా వుందనుకోండి. దాన్ని పేపర్ మీద పెట్టాలంటే కష్టంగా వుందనుకోండి. మీరైతే ఏం చేస్తారు?
        ఆ కథని స్నేహితుడికి చెప్పండి. ది మీకు జరిగినట్టుగా, లేదా మీరు ఇప్పుడిప్పుడే విన్నట్టుగా. తర్వాత దాని గురించి మర్చిపోయి ఒక వారం తర్వాత మరో స్నేహితుడికి చెప్పండి. ఆపై ఒక వారం వేచి వుండి, మరొక స్నేహితుడికి చెప్పండి. స్వాభావికంగా మనమందరం ఎంతో కొంత కథలు చెప్పే నేర్పున్న వాళ్ళమే గాబట్టి, మీరలా చెబుతూ చెబుతూ వుంటే దానికదే కథ సాఫీ అయిపోతుంది. అనవసర విషయాలు ఎడిట్ అయిపోతాయి. మీరనుకున్న ఐడియాకి ఒక వరస క్రమంలో కథా రూపం మీ మనసులో ఏర్పడుతుంది.

సినిమా రైటర్ గా నేను స్థిరపడాలంటే ఏం చేయాలి?
        పని చేసుకు పోతూ వుండాలి. దీనికి మించిన మార్గం లేదు. ఎవరైనా రైటర్ ని అడిగి చూడండి- వాళ్ళ హార్డ్ డ్రైవ్ లోనో అలమారలోనో కుప్పలుగా నోట్ బుక్స్, రాసిన స్క్రిప్ట్స్ పడుంటాయి.  అవి నాటకాలైనా కావచ్చు, సినిమాలైనా కావచ్చు, టీవీ పైలట్స్ కావచ్చు- ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు చేస్తూ వచ్చిన శ్రమకి గుర్తులవి. అవేవీ తెరకెక్కి వుండవు. లేదా స్టేజికి వెళ్ళి వుండవు. మీరీ వృత్తిలో స్థిరపడాలంటే ముందు మీరెంతో అనుత్పాదక శ్రమ చేయక తప్పదు. అప్పుడే అవకాశాలు తలుపు తడతాయి.

ఔత్సాహిక రచయితలకి మీరేం చెప్తారు?
        బస్సులోనో మెట్రోలోనో క ఒక మంచి డైలాగు వినబడితే రాసి పెట్టుకోవాలి. క్యారక్టర్ కి మంచి పేరు తట్టిందా రాసుకోవాలి. మంచి ఓపెనింగ్ ఇమేజి తట్టిందా నోట్ చేసుకోవాలి. చాలా మంది రైటర్లు ఇలా రాసుకుంటూ ఖజానా నిపుకుంటారు. తర్వాతెప్పుడైనా అవి ఉపయోగపడతాయని.

—ఏజెన్సీస్

 

23, ఏప్రిల్ 2022, శనివారం

1161 : టిప్స్


 

        అంతిమంగా  తెరమీద సినిమా ఎలా కన్పిస్తుందో నిర్ణయించేది డైలాగ్ వెర్షనే అయినప్పుడు డైలాగ్ వెర్షన్ని తీసుకుని ఇదివరకు దర్శకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు.  నిశ్శబ్ద వాతావరణం లో, మౌన ముద్రలో కెళ్ళి పోయి- మనసు తెర మీద డైలాగ్ వెర్షన్ని రన్ చేసుకుంటూ, దీన్ని శైలీ శిల్పాలతో తెరకెక్కించాలో మనసులో ముద్రించుకుని- శబ్ద ఫలితాలు  సహా తీవ్రమైన  పేపర్ వర్క్ చేసుకుని, సర్వసన్నద్ధులై సెట్స్ కి వెళ్ళేందుకు వచ్చేవాళ్ళని వినికిడి. ఇదేదో బావుంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ధ్యానించడమంటే సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకోవడమే.  ఒకసారి సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకున్నాక ఆ సబ్ కాన్షస్ మైండ్ అద్భుతాలు చేయిస్తుంది.

తే ఒకసారి అజ్ఞాతంలోకంటూ వెళ్ళిపోయాక  బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోకూడదు. సోషల్ మీడియా జోలికి అసలు పోకూడదు. 24x7 తామేం చేస్తున్నారో  ఫేస్ బుక్ లో ప్రపంచానికి చెప్పుకుంటే గానీ కడుపు చల్లబడని చాంచల్యానికి పోకూడదు. మనసు మీద అదుపు లేని వాడు సగటు మనిషే - వాడు మేకర్, క్రియేటర్, ప్రొప్రయిటర్ కాలేడు.  మనమైతే  డైలాగ్  వెర్షన్ పూర్తి చేసుకున్నాక ఈ నియమాలు పాటించాలని చెప్పుకుంటున్నాం గానీ, హాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్ అయితే అసలెప్పుడూ ప్రపంచంతోనే  సంబంధాలు పెట్టుకోడు. ఫోన్ వుండదు, టీవీ వుండదు, కంప్యూటర్ వుండదు, ఈ మెయిల్ వుండదు, సోషల్ మీడియా వుండదు- ఏమీ వుండవు. ఆదిమ కాలంలో మునిలా ఎక్కడో మారు మూల కూర్చుని సినిమాల సృష్టి గావిస్తాడు. సబ్ కాన్షస్ మైండ్ తో అతడి చెలిమి అలాటిది. మునుల తపస్సు కూడా సబ్ కాన్షస్ మైండ్ తోనే. సృష్టి రహస్యమంతా సబ్ కాన్షస్ మైండ్ లోనే వుంది... 

2. స్క్రీన్  ప్లే కి చక్కగా  మూడంకాలు (త్రీ యాక్ట్స్) పెట్టుకుని, బిగినింగ్- మిడిల్ - ఎండ్ అనే మూడంకాలకి రెండు  ప్లాట్ పాయింట్స్ తో రెండు మూలస్థంభాలు పెట్టుకుని, వాటి మధ్య వాటికి దారి తీయించే  ఉత్సుకతని రేపే కథనాన్ని మాత్రమే చేసుకుంటేఆస్వాదించడానికి  సినిమా ఎంత హాయిగా వుంటుందో తెలిపే ఉదాహరణ ఇదే- కొరియన్ మూవీ మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్ స్టర్'

3. వేరే సినిమాల్ని భక్తిభావంతో పరమ పవిత్రంగా కాపీ కొట్టేటప్పుడు, లేదా నీతీ నిజాయితీలతో చట్టబద్ధంగా రుసుము చెల్లించి రీమేక్ చేసేప్పుడు, వాటిని కూలంకషంగా విశ్లేషించుకుని, కథా నిర్మాణం, పాత్రచిత్రణలు, వాటి దృశ్యీకరణల వెనకున్న ఉద్దేశాల్నీ, వ్యూహాల్నీ, అనుసరించిన విధానాల్నీ మదింపు చేసి, వీలయితే అందులోంచి కొంత నేర్చుకుని, మొత్తం సబ్జెక్టునీ ఓన్చేసుకుని ముందుకెళ్తే బాక్సాఫీసు బకాసుర ప్రమాదాలు కచ్ఛితంగా తప్పుతాయి.

4. బయట ప్రపంచం చూస్తే యమ స్పీడందుకుని జోరుగా ముందుకు దూసుకు పోతూంటే, తలుపులు మూసిన చీకటి థియేటర్లో మాత్రం సినిమాలు ఇంకా తీరుబడిగా, పాత  కళా ప్రదర్శన చేస్తూ, కృష్ణా రామా అనుకుంటూ కూర్చోలేవు. జీవించే కళే మారిపోయాక కళా ప్రదర్శనేమిటి? అందుకని 1990 నుంచీ ఇవాళ్టి దాకా హాలీవుడ్ కి కొత్త బైబిల్ సిడ్ ఫీల్డ్ పారడైం మాత్రమే. స్పీడు ఈ పారడైం లక్షణం.

        5. హై కాన్సెప్ట్ కథల పాయింటు ఒకవేళ ఇలాజరిగితే?’ (what if?) అన్న ప్రశ్నతో వుంటుంది. ప్రశ్నే కథకి ఐడియా నిస్తుంది. గ్రహాంతర వాసులు భూమ్మీదికి దండ యాత్ర కొస్తే? (‘ఇండిపెండెన్స్ డేఐడియా). డైనోసారస్ లని మళ్ళీ పుట్టిస్తే? (‘జురాసిక్ పార్క్ఐడియా). సముద్ర గర్భంలో రాజు సప్త సముద్రాల్ని జయించాలనుకుంటే? (‘ఆక్వామాన్ఐడియా). ఇలా చాలా చెప్పుకోవచ్చు. తెలుగులో ఎప్పుడైనా ఇలా ట్రై చేసిన పాపాన పోయారా?

6. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రేక్షకులకైనా సింపుల్ గా అర్థమై పోతాయి హై కాన్సెప్ట్ కథలు. ఒక వేళ ఇలా జరిగితే? - అన్న ప్రశ్నే సాధించాల్సిన సమస్య వీటిలోని ప్రధాన  పాత్రకి. ఈ ప్రశ్నని ఎదుర్కోవడమే యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండే కథ. ప్రశ్నని ఎదుర్కోవడం గోల్,   ప్రశ్నని నిర్వీర్యం చేయడం గోల్ సాధన. సింపుల్  గా అర్ధమైపోతాయి ఈ కథలు మూడు ప్లాట్ పాయింట్ల పారడైంతో. ఇలా ప్రశ్నని పట్టుకుని కథ తక్కువ, తక్కువ కథతో ఎక్కువ యాక్షన్ - ఇదే హై కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమాల యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్) అన్నమాట.

7. అద్భుత కొరియన్ రోమాంటిక్ డ్రామా ది క్లాసిక్ లో టైటిల్స్ లోనే గుప్తంగా కథ చెప్పడం వుంటుంది సింబాలిక్ గా. ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టే వుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతిఆ తర్వాత ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివరమహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు...

8. పై చిత్రణ ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు -  దేని అస్తమయాన్నిఅక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే. ఇలా ఈ ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. ఒక అస్తమయంతో ఒక  సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరంఒక ద్వంద్వం ... ఇలాటి భావుకతని  తెలుగు సినిమాల్లో కూడా సాధిస్తే బావుంటుందేమో? 

9. ప్రేమ సినిమాలెన్ని తీసినా వాటికి ఎప్పటికప్పుడు వయసుకొచ్చిన యువ  ప్రేక్షకులు నున్నగా తిన్నగా తయారై వుంటూనే వుంటారు. అయినా తీస్తున్న ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నాయంటే లేత కుర్రాళ్ళకి కూడా పట్టని ఓల్డ్ సరుకుగా అనిపిస్తున్నాయన్న మాట. సినిమాలు చూసే వయసు కొచ్చిన నేటి లేత కుర్రాళ్ళ ప్రపంచంలోకి మేకర్లు వెళ్ళి నేటివైన ప్రేమ సినిమాల్ని ఆవిష్కరిస్తే తప్ప అద్భుతాలూ జరగవు.

10.
కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ అనే జానరనేది ప్రేమల గురించి కానే కాదు, అవి నేర్చుకోవడం గురించి మాత్రమే. ప్రేమ సినిమాల్ని కాస్త స్టయిలిష్ గా తీస్తే ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ అంటూ రివ్యూ రైటర్లు కూడా రాసి పారేస్తున్నారు. ఇలా వుంటే ఓ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీని తెలుగులో ఎప్పటికి చూడగలం.
11. అప్పుడప్పుడే బయటి ప్రపంచంలో అడుగుపెట్టే 13-19 ఏజి గ్రూపుది టాలెంట్స్ వికసించే వయసు. అవి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. వాటితో ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలి, జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో కూడిన సంఘర్షణ. ఈ సంక్షుభిత ప్రయాణంలో జీవితంలో తెలియనివెన్నో తెలుసుకోవాలని ప్రయత్నించడం, నేర్చుకోవడం వంటివి చేసి, 19 కల్లా పరిపక్వ వ్యక్తిగా/వ్యక్తురాలిగా ఎదగడం. ఇలా కమింగ్ ఆఫ్ ఏజి మూవీస్ టీనేజర్లు నేర్చుకోవడం - ఎదగడం అనే పాయింటు చుట్టూ వుంటాయి. హాలీవుడ్  లో ఏడాదికి 36 క్రమం తప్పకుండా తీస్తూంటారు. తెలుగులో అర్ధం లేని  హై స్కూలు ప్రేమలే  తీస్తారు. ఆ ఏజిలో వికసించే టాలెంట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, స్వభావ విరుద్ధంగా ప్రేమలు కాదు. ఒకసారి మనమీ వయసులో ఏం చేసేవాళ్ళమో గుర్తుచేసుకుంటే తెలుస్తుంది. 

12. తెలుగులో 13-19 ఏజి గ్రూపు టీనేజి ప్రేక్షకులు తమ నిజ జీవితాలు కనిపించని, వాటికి దారి చూపని కథలతో, తమకి సంబంధం లేని  అవే రోమాంటిక్ కామెడీలూ డ్రామాలతో వస్తున్న సినిమాలకి కనెక్ట్ కాలేక, తమ మనసెరిగి సినిమాలు తీసే యంగ్ మేకర్లు లేని లోటుకి - ఒక అసంతృప్త ప్రేక్షక సమూహాలుగా మిగిలిపోతున్నారు. ఈ సెగ్మెంట్ లో ఖాళీగా వున్న మార్కెట్ ని సొమ్ము చేసుకునే స్పృహ ఏ మేకర్లకీ వుండడం లేదు. అవే రోమాంటిక్ కామెడీలు తీస్తూ డ్రై మార్కెట్లో ఒకటే కుమ్మడం, ఫ్లాపవడం. ఈ కుమ్మడంలో చూద్దామన్నా ట్వెంటీ ప్లస్ వాళ్ళకి కూడా పనికొచ్చే రియలిస్టిక్ సరుకు కనిపించదు.

        సరే, ఇక  నెక్స్ట్ స్క్రీన్ ప్లే టిప్స్ విత్ ఫైనాపిల్ జ్యూస్ తో మళ్ళీ కలుద్దాం!

—సికిందర్