రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

1154 : రివ్యూ!


రచన - దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి
తారాగణం : వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, నదియా, తమన్నా, జగపతి బాబు, ఉపేంద్ర సునీల్ శెట్టి, నరేష్, తనికెళ్ళ, సత్యా తదితరులు  
సంగీతం : తమన్,  ఛాయాగ్రహణం : జార్జ్ విలియమ్స్, యాక్షన్ :  మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ 
బ్యానర్స్ : రెనసాన్స్ ఫిలిమ్స్, అల్లు బాబీ కంపెనీ
నిర్మాతలు : అల్లు బాబీ, సిద్ధు ముద్దా
విడుదల :  ఏప్రెల్ 8, 2022
***
        మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందు కొచ్చాడు. బాక్సింగ్ పాత్ర కోసం బాడీ బిల్డింగ్, ట్రైనింగ్ వగైరాలకి బుక్కయిపోయి- మధ్య మధ్యలో కోవిడ్ అవాంతరాలతో మేకింగ్ ఆలస్యమై, మళ్ళీ విడుదలకి భారీ సినిమాలతో పోటీ వాతావరణమేర్పడి - మొత్తానికి ఈ వారం 'గని' కి మోక్షం ప్రసాదించాడు. సీనియర్ కోడైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా పరిచయమయ్యాడు. బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించాడు. స్పోర్ట్స్ డ్రామాని కొత్తగా తెరకెక్కించడాని కేముంటుంది. ఏమీ వుండదా? ఎందుకుండదు? వుంటే ఎలావుంటుంది? ఈ విషయం చూద్దాం...

కథ

2004 లో విక్రమాదిత్య (ఉపేంద్ర) బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఓడిపోతాడు. స్టెరాయిడ్స్ అధిక మోతాదులో తీసుకోవడంతో చనిపోతాడు. దీంతో అతడి కొడుకు గని (వరుణ్ తేజ్) ని తోటి పిల్లలు చీటర్ కొడుకువని వేధిస్తారు. తల్లి మాధురి (నదియా) అతణ్ణి తీసుకుని వైజాగ్ వచ్చేస్తుంది. మొక్కల పెంపకం కార్యక్రమం నడుపుతూ గనిని చదివిస్తుంది. గని బాక్సింగ్ వైపు వెళ్ళకూడదని మాట తీసుకుంటుంది. కానీ ఇంజనీరింగ్ చదువుతున్న గని తల్లికి తెలియకుండా కోచ్ (నరేష్) సాయంతో బాక్సింగ్ నేర్చుకుని, పోటీల్లో పాల్గొంటూ వుంటాడు. ఈ క్రమంలో కాలేజీ మేట్ మాయా (సయీ మంజ్రేకర్) అతణ్ణి ప్రేమిస్తుంది. ఇక గని జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటూ విజేంద్ర సిన్హా (సునీల్ శెట్టి) దృష్టిలో పడతాడు. వెంటనే గనిని కలుసుకుని, ఆనాడు ఛాంపియన్ షిప్ లో గని తండ్రికి తానే బాక్సింగ్ ప్రత్యర్ధి నని చెప్పి, గని తండ్రి ఓడిపోవడానికీ, స్టెరాయిడ్స్ వాడి చనిపోవడానికీ అతడి మిత్రుడు ఈశ్వర్ నాథ్ (జగపతి బాబు) కారణమని వెల్లడిస్తాడు సిన్హా.

        ఎవరీ ఈశ్వర్ నాథ్? గని తండ్రి విక్రమాదిత్య మీద ఎందుకు కుట్ర చేసి చంపాడు? ఇప్పుడతను ఇండియన్ బాక్సింగ్ లీగ్ స్థాపించి, అదే సమయంలో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నాడు. బెట్టింగ్ కీ, గని తండ్రిని చంపడానికీ సంబంధముందా? ఇతడి కుట్ర తెలుసుకున్న గని బాక్సింగ్ తోనే ఇతడికెలా బుద్ధి చెప్పాడు? చీటర్ గా తండ్రి మీద పడ్డ మచ్చని ఎలా రూపుమాపి, తల్లి వేదననని తీర్చాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

రెగ్యులర్ స్పోర్ట్స్ జానర్ టెంప్లెట్ కథకి కుటుంబ కథ మేళవించి మూస ఫార్ములా డ్రామా చేశారు. సీనియర్ కో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి 15,20 ఏళ్ళ క్రిందటి తను పనిచేసిన సినిమాల ప్రభావంతో ఈ ఔట్ డేటెడ్ మూవీ తీసినట్టు అర్ధమవుతోంది. తన తప్పేం లేదు. ఈ కథ హీరోకీ నిర్మాతలకీ నచ్చాక, తనని తప్పుబట్టడానికి వీల్లేదు. అయితే కొత్త దర్శకుడుగా దర్శకత్వం మీద ఇంత పట్టు నిరూపించుకున్న తను, బాక్సింగ్ తో కొత్త కథ తీసుకుని వచ్చి వుంటే బావుండేది.

        ఒక వైపు బాక్సింగ్ కి ఆదరణ లేదనీ, ఒలింపిక్స్ లో ఒక్క పతకం కూడా సాధించేలేదనీ పాత్ర ద్వారా చెప్పించినప్పుడు, ఈ మాటల్లోనే కొత్త సినిమా కథ వుంది. బాక్సింగ్ అకాడెమీ ప్రారంభించి యువతని బాక్సర్లుగా తయారు చేయాలన్న హీరో తండ్రి ఆశయం గురించి చెప్పడంలోనే, కొత్త స్పోర్ట్స్ కథ వుంది.

        హీరో తండ్రి ఆశయం కోసం పనిచేస్తూ బాక్సింగ్ వైపు యూత్ ని మళ్ళించే, ఒలింపిక్స్ కి వూరించే, యూత్ అప్పీల్ వున్న కథగా వుంటే- మరో చక్ ఇండియా గా సంచలన ప్రయోజనాత్మక పురస్కార గ్రహీత సినిమా అయ్యేది. హీరో, నిర్మాతలు మార్కెట్ యాస్పెక్ట్ లేని పాత మూస ఫార్ములా డ్రామాలకి పడిపోయి - యూత్ అప్పీలున్న హీరోతో యూత్ కి ఒలింపిక్స్ అంత దూరాన వుండిపోయే ఫార్ములా స్పోర్ట్స్ సినిమా తీసి ఔరా అన్పించారు.

        యూత్ కి క్రీడల పట్ల అనురక్తి కల్గించని, ప్రోత్సాహమివ్వని  స్పోర్ట్స్ సినిమాలు తీసి దండగ! ప్రభుత్వాలు స్పోర్ట్స్ ని ప్రోత్సహించడంలేదని చెబుతూనే స్పోర్ట్స్ సినిమాలు మాత్రం చేస్తున్న పనేంటి. స్పోర్ట్స్ సినిమా చూస్తున్నప్పుడు దీంతో మనమేం చేయగలమన్న యాక్షన్ ఓరియెంటెడ్ కళ్ళతో యూత్ చూసే అవకాశముంది. యూత్ కి ఏం చూపించినా - ఇందులో నాకేంటి? - అన్న దృష్టితో చూస్తారు. కలియుగం యాక్షన్లో వున్నప్పుడు పాసివ్ డ్రామాలతో పని జరగదు. యాక్షన్- యాక్షన్- యూత్ కి ఏం టాస్క్ ఇస్తున్నాం, ఇదే స్కోరు చేస్తుంది స్పోర్ట్స్ కథకి. మిగతాదంతా సోదియే.

నటనలు- సాంకేతికాలు

వరుణ్ తేజ్ టాలెంటెడ్ నటుడని కంచె తోనే నిరూపణ అయింది. గని లో ఇది ప్రూవ్ చేసుకున్నాడు. బాక్సర్ పాత్ర కోసం బాడీ బిల్డింగ్ చేసి బాక్సింగ్ దృశ్యాలు రక్తి కట్టించాడు. ఒక్క క్లయిమాక్స్ లో ప్రత్యర్ధిని ఓడించే బాక్సింగ్ అనుకున్నంత పీక్ కి వెళ్ళకుండానే డ్రాప్ అయి ముగిసిపోవడం తప్ప. వాడు తనని ఆ యెత్తున పంచులిచ్చి రక్తం కళ్ళ జూసినప్పుడు, తను వాడి ఒళ్ళంతా  రక్తం చేసి ప్రేక్షకుల కచ్చి తీర్చకూడదా? కొట్టు ఇంకా కొట్టు అని ప్రేక్షకులు అరవలేదంటే  ఏం కొట్టుడది? ఫారిన్ యాక్షన్ డైరెక్టర్లకి తెలుగు కొట్టుడు గురించి తెలీనట్టుంది.

        వరుణ్ తేజ్ బాక్సర్ పాత్ర నటించడంలో మునిగిపోయి, ఆ పాత్ర కివ్వాల్సిన ఇమేజి బిల్డప్ మర్చిపోయినట్టుంది. ఎటాక్ లో సూపర్ సోల్జర్ గా జాన్ అబ్రహాం పాత్ర నటిస్తూ, కనీసం విలన్ కి కూడా తను సూపర్ సోల్జర్ అని తెలీని పాత్ర చిత్రణ చేసినట్టు. వరుణ్ తేజ్ ఆఖరికి బాక్సర్ గా ఢిల్లీ ఈవెంట్ కెళ్ళినప్పుడైనా, జాతీయస్థాయిలో బాక్సర్ గా కవరేజీ లేకపోతే ఎలా? బరిలో అతడి స్టేటస్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది?

        ఇక వరుణ్ తేజ్ మదర్ నుంచి దాస్తూ బాక్సింగ్ లో ఎదిగే క్రమంలో, మదర్ తో సెంటిమెంటల్ డ్రామా విషయంలో దర్శకుడు, మాటల రచయిత అబ్బూరి రవి ఉత్తీర్ణులయ్యారు. అలాగే విలన్ జగపతి బాబుతో వరుణ్ తేజ్ రివెంజీ తీర్చుకునే క్రమం కూడా కూల్ గా, మెచ్యూర్డ్ గా నటించాడు. వరుణ్ తేజ్ లో సహజ నటుడున్నాడు. నటించాల్సింది ఇలాటి సినిమాలు కాదు. ఫ్యామిలీస్ కోసమని కూడా ఈ స్పోర్ట్స్ వయోలెంట్ యాక్షన్లో ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేశారు గానీ- అసలు యూత్ కోసమే యూత్ ఓరియెంటెడ్ గా స్పోర్ట్స్ మూవీ తీస్తే,  తమ యూత్ నెలా పెంచుకోవాలో చూడ్డానికి ఫ్యామిలీస్ వస్తారు. ఇది యూత్ ఓరియెంటెడ్ ప్రపంచం ఐనందువల్ల.   

        పోతే వరుణ్ కి సయీ మంజ్రేకర్ తో జూనియర్ కాలేజీ అప్పట్నుంచీ ఆ లవ్ ఎందుకో అర్ధంగాదు. దర్శకుడు, అబ్బూరి రవి ఎంత హాస్యాస్పదం చేయాలో అంతా చేశారు. సయీ మంజ్రేకర్ ఫస్టాఫ్ లో రోమియో కి తగ్గ జూలియెట్ గా కన్పించింది కాస్తా, మళ్ళీ సెకండాఫ్ ముగుస్తున్నప్పుడు క్లయిమాక్స్ లోనే కన్పించేది వరుణ్ బాక్సింగ్ ని టీవీలో ఎంజాయ్ చేస్తూ. తను అంత జూలియెట్ అయినప్పుడు వరుణ్ తో ఢిల్లీ ఈవెంట్ కి ఎందుకు వెళ్ళలేదో అర్ధంగాదు.

        టాలెంటెడ్ నదియా కూడా ఫుల్ లెన్త్ కీలక పాత్ర బాగా నటించింది మదర్ గా. సెకండాఫ్ లో ఒక ఉద్విగ్న సన్నివేశంలో తానూ- సునీల్ శెట్టీ పరస్పరం చేతులు జోడించి నమస్కారం పెట్టుకోవడం కదిలించే దృశ్యం. మూవీ మొత్తానికి ఇదే హైలైట్.

        వరుణ్ తండ్రిగా కన్నడ  ఉపేంద్ర సెకండాఫ్ 20 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ లో వస్తాడు. యూత్ ని బాక్సర్స్ గా తీర్చి దిద్దాలన్న ఆశయముండే సాత్విక పాత్ర. నీటుగా నటించాడు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ఉపేంద్ర ప్రత్యర్ధి పాత్రలో, తర్వాత పశ్చాత్తాపంతో వరుణ్ మిత్రుడుగా మారే పాత్రలో హూందాగా నటించాడు. జగపతి బాబు ఉపేంద్ర మిత్రుడుగా వుంటూ, మిత్ర ద్రోహిగా మారే మెయిన్ విలన్ పాత్ర డీసెంట్ గా పోషించాడు. వరుణ్ ప్రత్యర్ధి నవీన్ చంద్ర కూడా మిత్రుడుగా మారిపోతాడు. శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారిపోయే పాత్రలే రిపీటెడ్ గా ఈ మూడూ. పోతే బాక్సింగ్ కోచ్ కి నరేష్ సరిపోలేదు. సత్యా ఒక సీన్లో కామెడీ చేసి, మిగిలిన సీన్లలో ఫ్రేముల్ని ఫిలప్ చేస్తూ నిలబడతాడు. తనికెళ్ళ హీరోయిన్ తండ్రి.

        ఇక క్లయిమాక్స్  ఈవెంట్ లో సడెన్ గా తమన్నా వచ్చి పాట పాడుతుంది. తమన్ సంగీతం టైటిల్స్ దగ్గర్నుంచే ఒకే లెవెల్లో చాలా లౌడ్ గా వుంది. టైటిల్స్ తో ఫీల్ తో ప్రారంభమై, ఆ ఫీల్ ని కొనసాగిస్తూ, క్రమంగా వేగం పెంచుకుంటూ పోతే అదో సౌండ్ డిజైన్ గా వుండేది. ఛాయాగ్రహణం డిమ్ లైటింగ్ వాడారు, రిచ్ గా వుండేలా చూశారు. ప్రొడక్షన్ విలువల కోసం భారీగానే ఖర్చు పెట్టారు. ఫారిన్ యాక్షన్ డైరెక్టర్ లు బాక్సింగ్ కోసం మరీ అంతగా కృషి ఏమీ చేయలేదు. వాళ్ళ ముద్రేమీ కన్పించలేదు.

చివరికేమిటి

తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే ఫ్యామిలీ డ్రామా ఫార్ములాకి స్పోర్ట్స్ జానర్ కథ అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. ఫస్టాఫ్ పూర్తిగా లవ్ ట్రాక్ తో డొల్లగా వుంది. ఈ లవ్ కూడా కథకి ఉపయోగపడలేదు. ఫస్టాఫ్ హీరో ఫ్యామిలీ, లవ్ సీన్లతో గంటా 15 నిమిషాలూ విషయం లేదు. అక్కడక్కడ హీరో లోకల్ ఈవెంట్స్ లో పాల్గొనే దృశ్యాలు. ఇంటర్వెల్లో సునీల్ శెట్టి వచ్చి హీరో తండ్రి గురించి చెప్పినప్పుడు అది సెకండాఫ్ ప్రారంభంలో ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. ఫస్టాఫ్ కథ లేకపోవడంతో స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ లేదు.


        ఏమాట కామాటే చెప్పుకుంటే, ఈ మధ్య చాలా వరసగా వస్తున్న సినిమాలు సెకండాఫ్ కథలేక, వున్నా చేసుకోలేక ఫ్లాపవుతున్నాయి. గని దీనికి రివర్స్ లో ఫస్టాఫ్ లో కథ లేకపోయినా సెకండాఫ్ లో కథ వుంది! ఆ సెకండాఫ్ చెప్పాలనుకున్న రివెంజీ కథని నీటుగా చెప్పారు. అయితే ఎంత నీటుగా చెప్పినా ఈ ప్రతీకార- కుటుంబ బాధల కథ పాత కథే. నటీ నటులందరి చేత మంచి నటనని రాబట్టుకున్నాడు దర్శకుడు కూడా.  అయితే మాత్రం ఈ పాత ఫ్యాషన్ కథ మాత్రం స్పోర్ట్స్ మూవీకి అతకలేదు. దర్శకుడు ఈ పాత లోంచి బయటి కొచ్చి  యూత్ కథల్ని యూత్ దృక్కోణంలో సినిమాలు తీస్తే తప్ప మనుగడ కష్టం. వేరే రెగ్యులర్ మసాలా మాస్ యాక్షన్లు ఎలాగైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

—సికిందర్ 

 

5, ఏప్రిల్ 2022, మంగళవారం

1153 : రివ్యూ & స్క్రీన్ ప్లే సంగతులు


 

రచన- దర్శకత్వం : లక్ష్య రాజ్ ఆనంద్
తారాగణం : జాన్ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ పెర్నాండెజ్, ప్రకాష్ రాజ్, రంజిత్ కపూర్, కిరణ్ కుమార్, ఎల్హమ్ ఎహ్సాస్ తదితరులు
కథ : జాన్ అబ్రహాం, రచన : లక్ష్య రాజ్ ఆనంద్, సుమీత్ భతీజా, విశాల్ కపూర్; సంగీతం : శాశ్వత్ సచ్ దేవ్, ఛాయాగ్రహణం : విల్ హమ్ప్రిస్, పిఎస్ వినోద్, సౌమిక్ ముఖర్జీ
బ్యానర్స్ : ఏకే ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : జయంతీ లాల్ గడా, అజయ్ కపూర్, భౌమిక్ గొండాలియా
విడుదల : ఏప్రెల్ 1, 2022
***

        జాన్ అబ్రహాం యాక్షన్ సినిమాల శ్రేణిలో  ఎటాక్, పార్ట్- 1 కాన్సెప్ట్ పరంగా ఇంకో ముందడుగేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడు లక్ష్య రాజ్ ఆనంద్, జాన్ అబ్రహాం అందించిన ఈ కొత్త కాన్సెప్ట్ ని తెరానువాదం చేసి సగర్వంగా జాన్ అబ్రహాంకి సమర్పించాడు. మనం ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలో నివసిస్తున్నాం. ఇక్కడ ప్రతీదీ తక్షణం జరిగిపోవాలి. కాబట్టి ప్రేక్షకుల సమయం వృధా చేయకుండా డైలాగులని క్లుప్తంగా వుంచాం, దృశ్యాల్ని వేగవంతమైన కట్స్ తో తీర్చిదిద్దాం, ఇవి కథని  వేగంగా చెప్పగలిగేలా చేశాయి. కథని సాధ్యమైనంత ఉత్తమంగా చెప్పడానికి, ప్రేక్షకుల్ని నిమగ్నమయ్యేలా చేయడానికీ  ఈ ప్రయత్నం. నేను ప్రేక్షకుల సమయానికి చాలా విలువిస్తాను. కాబట్టి సినిమా నిడివిని గంటా 45 నిమిషాలకి పరిమితం చేశాం అంటూ ఆశాజనకంగా చెప్పుకొచ్చిన కొత్త దర్శకుడు, ఎంతవరకూ ఈ కొత్త కాన్సెప్ట్ కి న్యాయం చేశాడు? అసలు ఏమిటీ ఈ కొత్త కాన్సెప్ట్? జాన్ అబ్రహాంకి ఇది మరో హిట్టేనా? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...

కథ

ఆర్మీ మేజర్ అర్జున్ షేర్గిల్ (జాన్ అబ్రహాం) తన బృందంతో సరిహద్దులో టెర్రరిస్టుల శిబిరంలోకి చొరబడి, రెహమాన్ గుల్ అనే టెర్రరిస్టుని పట్టుకుంటాడు. అతని టీనేజీ కొడుకు హమీద్ గుల్ ఆత్మాహుతి బాంబు పేల్చుకోబోతే, అర్జున్ ఆ బాంబుని నిర్వీర్యం చేసి, అతడ్ని వెళ్ళి పొమ్మంటాడు. ఇది 2010 లో జరుగుతుంది. ప్రస్తుత కాలానికొస్తే, ఐషా (జాక్విలిన్ ఫెర్నాండెజ్) అనే ఏర్ హోస్టెస్ ని అర్జున్ ప్రేమిస్తాడు. ఈమె టెర్రరిస్టులు ఏర్ పోర్టు మీద చేసిన దాడిలో చనిపోతుంది. ఇదే దాడిలో అర్జున్ తీవ్రంగా గాయపడి పక్షవాతానికి లోనవుతాడు. శరీరంలో చలనం లేక వీల్ చైర్ కి పరిమితమై పోతాడు.

        ఇప్పుడు పెరిగి పెద్దవాడైన హమీద్ గుల్ (ఎల్హామ్ ఎహ్సాస్) తీవ్రవాద దాడులకి పాల్పడుతున్నాడని అర్జున్ గ్రహిస్తాడు. ఈ తీవ్రవాద ముప్పుని ఎదుర్కోవడానికి రక్షణ శాఖ ఉన్నతాధికారి సుబ్రహ్మణ్యం (ప్రకాష్ రాజ్) సూపర్ సోల్జర్ అనే వినూత్న ప్రోగ్రాంని ప్రవేశపెట్టాలని హోమ్ మంత్రి (రంజిత్ కపూర్) ని కోరుతాడు. ఈ ప్రోగ్రాం ప్రకారం, సైనికుడి శరీరంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిప్ అమరుస్తారు. ఆ చిప్ అతడ్ని అజేయ శక్తిగానూ, ఏకవ్యక్తి సైన్యంగానూ మార్చేస్తుంది. ఈ ప్రోగ్రాం రూపకర్త రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థలో పని చేసే డాక్టర్ సబా ఖురేషి (రకుల్ ప్రీత్ సింగ్). ఈమె ప్రయోగ దశలో వున్న ఈ ప్రోగ్రాంని పరీక్షించాలంటే, పక్షవాతానికి గురైన సైనికుడి శరీరం అవసరమని చెప్తుంది.

  ఇక సుబ్రమణ్యం అర్జున్ని సంప్రదిస్తే, అర్జున్ అంగీకరిస్తాడు. అతడి శరీరంలో చిప్ అమరిక సక్సెస్ అయి తిరిగి మామూలు మనిషవుతాడు. దొంగల్ని పట్టుకోవాల్సి వచ్చి పోరాటానికి దిగితే, ఆ పోరాటంలో తానెంత శక్తిమంతుడో తెలుస్తుంది.

     ఇంతలో 2010 లో పట్టుబడి జైల్లో మగ్గుతున్న టెర్రరిస్టు రెహమాన్ గుల్ ని విడిపించుకోవడానికి, అతడి కొడుకు హమీద్ గుల్ పార్లమెంటుని ముట్టడించి ప్రధాని సహా, 300 మంది ఎంపీ లని బంధించేసి బేరం పెడతాడు. ఇక తక్షణం హమీద్ గుల్ ఆట కట్టించడానికి సూపర్ సోల్జర్ గా అర్జున్ రంగంలోకి దూకి ఏం చేశాడన్నది మిగతా కథ...

ఎలావుంది కథ

భారతీయ వెండి తెర మీద సూపర్ సోల్జర్ కాన్సెప్ట్ సరి కొత్తదే. హాలీవుడ్ తెర మీద పాతది. అయినా ఆలస్యంగా నైనా దేశవాళీ తెరపైకి తెచ్చినందుకు కొత్త దర్శకుడు అభినందనీయుడే. హాలీవుడ్ లో సూపర్ సోల్జర్ మూవీస్ తీయడం సర్వసాధారణమై పోయింది. వీటిలో ప్రముఖమైనది మార్వెల్ స్టూడియోస్ కెప్టెన్ అమెరికా (2011).

        సైన్స్ ఫిక్షన్ జానర్ కి చెందిన సూపర్ సోల్జర్ కాన్సెప్ట్ నవలలకి, సినిమాలకి పరిమితమైన కాల్పనిక సాహిత్యం. ఇది వాస్తవ రూపం ధరించలేదు. శాస్త్రవేత్తలు ఆచరణలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు వార్తలు. ఎటాక్ కథకి స్టోరీ ఐడియా జాన్ అబ్రహాం. ఈ సూపర్ సోల్జర్ ఐడియా బాక్సాఫీసుకి కొత్త బిజినెస్ సోర్సే. ఐతే దీనికి చేసిన కథతోనే సమస్య. కాశ్మీర్ లో తప్ప దేశంలో ఇప్పుడు టెర్రరిజం లేదనేది తెలిసిందే. టెర్రరిజంతో సినిమాలు తీయడం కూడా మానేశారు. ఇప్పుడు  ఎటాక్ తీసినప్పుడు కాశ్మీర్నే తీసుకుని అక్కడెందుకు సూపర్ సోల్జర్ తో ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టకూడదన్నది వెంటనే తట్టే ప్రశ్న.

మూడు స్తంభాలాట
ఇక కథకి ఏవైతే మూడు మూల స్తంభాలుగా వున్నాయో అవే అసందర్భంగా వున్నాయి. 1. 2010 లో అర్జున్ టెర్రరిస్టు రెహమాన్ గుల్ ని పట్టుకుని, అక్కడే ఆత్మాహుతి దాడికి సిద్ధపడ్డ కొడుకు హమీద్ గుల్ బాంబుని నిర్వీర్యం చేసి, వెళ్ళిపొమ్మంటూ వాణ్ని వదిలేశాడు. ఎందుకలా? వాడు టీనేజరైనా సరే వాణ్ని కూడా పట్టుకుని తండ్రితో బాటే జైల్లో వేయాలి కదా? ఇలా చేయలేదు. ఇలా చేస్తే కథ వుండదు. పెద్దవాడై హమీద్ గుల్ తిరిగి వచ్చి దాడులు చేసే అవకాశం వుండదు. దాడిలో అర్జున్ ప్రేయసిని చంపి, అర్జున్ ని ఇన్ వాలిడ్ చేసే అవకాశముండదు. తర్వాత పార్లమెంట్ మీద దాడి కూడా చేయలేడు. ఇవన్నీ జరగడానికి ఆనాడు టీనేజర్ హమీద్ గుల్ ని అర్జున్ వదిలేసేలా చేశాడు దర్శకుడు. దర్శకుడు ధర్మకర్త అయితే ఇలాటివెన్నో చేయవచ్చు కథ కోసం ఉదారంగా. దర్శకుడు కార్యకర్త అయితేనే కథ కోసం కాక పాత్ర కోసం చేస్తాడు నిర్ధాక్షిణ్యంగా. పాత్ర కోసం చేస్తే కథ కోసం చేసినట్టే.

అర్జున్ పాత్రతో ఇలా చేయించడం వల్ల ఎలాటి అర్ధం కూడా వస్తోందంటే- హమీద్ గుల్ తిరిగి వచ్చి అర్జున్ ప్రేయసినీ చంపడానికీ, అర్జున్ ఇన్ వాలిడ్ అవడానికీ, చివరికి పార్లమెంట్ మీద దాడి చేయడానికీ అర్జునే కారణమన్న అర్ధం వస్తోంది. ఈ అలసత్వానికి అర్జున్ ని కోర్ట్ మార్షల్ చేసి శిక్షించాల్సిన పరిస్థితి! ఇదంతా ప్రేక్షకులేం ఆలోచిస్తారులే అనుకుంటే ఏమీ అనలేం.

        2. కొడుకు హమీద్ గుల్ కేవలం తండ్రిని విడిపించడానికి పార్లమెంటు మీద దాడి చేసి, ప్రధాని సహా 300 మంది ఎంపీల్ని బందీలుగా పట్టుకుంటాడు. అవసరమా? దేశం నడిబొడ్డున ఇంత పనికి పాల్పడి పద్మవ్యూహంలో ఇరుక్కుని చావడం అవసరమా? ఓ విమానాన్ని హైజాక్ చేసుకుని తీసికెళ్ళి తమ భూభాగంలో కూర్చుని సురక్షిత బేరసారాలు చేసుకోవచ్చు. ఇలా చేస్తే దర్శకుడి కథలో పార్లమెంట్ వుండదు. అందుకని పార్లమెంట్ తో బిగ్ ఈవెంట్ కోసం హమీద్ గుల్ పాత్రని కూడా కిల్ చేశాడు. 1999 లో కాందహార్ హైజాక్ జరిగిందే కదా, మళ్ళీ అలాటిదే చూపించడ మెందుకంటే, 2001 లో పార్లమెంటు మీద దాడి కూడా జరిగిందే కదా, మళ్ళీ చూపించడ మెందుకు? అందుకని కాశ్మీర్ కి పరిమితమైన టెర్రరిజం మీద తాజా కథ చేసుకోకుండా, పాత సంఘటనల టెంప్లెట్ కథ చేసుకోవడంతో ఈ హై కాన్సెప్ట్ మూవీకి లో- కాన్సెప్ట్ డీలా కథగా తేలింది.

        3. పార్లమెంటు మీద దాడి చేసిన కేవలం ఓ పదిమంది టెర్రరిస్టుల్ని చంపడానికి సూపర్ సోల్జర్ అంత భారీ బిల్డప్ అవసరమా? సాధారణ పాత్రగానే జాన్ అబ్రహాం తన ఉక్కు దిమ్మెల్లాంటి హస్తాలతో నాల్గు బాదుళ్ళు బాది  హరీ మన్పించగలడు. పరిస్థితి డిమాండ్ చేయని, అవసరానికి మించి సూపర్ సోల్జర్ హంగామా అంతా అవసరమా? ఇలా కథకి మూలస్తంభాలుగా వున్న మూడు అసందర్భాలు దేశంలో ప్రప్రథమ సూపర్ సోల్జర్ హై కాన్సెప్ట్ కథని హాస్యాస్పదం చేశాయి.

        ఇక ఈ టెర్రరిజం సమస్యని తెరపైకి తెచ్చి చేకూర్చిన కథా ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఎందుకంటే దేశంలో వివిధ నగరాల్లో 2013 తర్వాత నుంచి పాక్ ప్రేరేపిత టెర్రర్ దాడుల్లేవు, కాశ్మీర్లో తప్ప.

ఇదేం ఈక్వెషన్
        పోతే ఆధునిక సైన్స్ తో సూపర్ సోల్జర్ లాంటి సైబోర్గ్ ని సృష్టించినప్పుడు దీనికి యాంటీగా, విలన్ గా మామూలు టెర్రరిస్టు క్యారక్టర్ ని వాడేస్తే ఈక్వెషన్ కుదరదు. విలన్ గా టెర్రరిస్టు పాత్రలో బ్రిటన్ - ఆఫ్ఘన్ నటుడు ఎల్హమ్ ఎహ్సాస్ సైజు సరిపోని పొట్టి నటుడు. రాంగ్ సెలెక్షన్. ఈ పొట్టి వాణ్ణి చంపడానికి మహా సైబోర్గ్ లాంటి సూపర్ సోల్జర్ అవసరం లేదు. ఎలాటి హీరోకి అలాటి విలన్ వుండాల్సిందే. టెర్రరిజం ప్రజల్ని భయపెట్టే ఒక భూతం అనుకుంటే- ఆ భూతాన్ని తలపించే వికృత అసుర మహాకాయుడ్ని చూపించాల్సిందే. ఆల్ డ్రామా ఈజ్ ఆర్ట్. ఇక్కడ ఆధునిక సైన్సు కాన్సెప్ట్. ఆధునిక సైన్సుకీ, రాతి యుగంనాటి టెర్రరిజపు మైండ్ సెట్ కీ పోరాటమనేలా, విస్తృతార్ధంలో సూపర్ సోల్జర్ వర్సెస్ వికృత అసుర మహాకాయుడు అన్పించేలా, పాత్రల్ని తీర్చిదిద్దితేనే కాన్సెప్ట్ ప్రకాశిస్తుంది. బాక్సాఫీసు వైబ్రేషన్స్ హై ఫ్రీక్వెన్సీలో వుంటాయి. హై కాన్సెప్ట్ కథకి  హై రేంజిలో ఆలోచించాల్సి వుంటుంది, లో - కేటగిరీ ఆలోచనలు పని చెయ్యవు.

నటనలు - సాంకేతికాలు

గత దేశభక్తి మూవీ సత్యమేవ జయతే లోలాంటి లౌడ్ మాస్ క్యారక్టర్ మళ్ళీ జాన్ అబ్రహాం చేయక పోవడం ఊరట. జనాలకి దేశం గురించి లేదు, ధరల గురించీ లేదు. మతం వుంటే చాలు. ఇంకా దేశం కోసం మాస్ సినిమా అరుపులు, పెడ బొబ్బలు లేకుండా, సైన్స్ ఫిక్షన్ కుండే జానర్ మర్యాదలని మన్నిస్తూ ప్రొఫెషనల్ సైనికుడి పాత్ర అన్పించాడు. దేనికీ వ్యతిరేకంగా నినాదాలు లేవు, టెర్రరిజం మీద కూడా డైలాగుల్లేవు. ఒక్క చోట మాత్రం, మొహం పగిలేలా జవాబు చెప్పడం కాదు, మొహమే పగుల గొట్టేస్తాం అన్న పంచ్ లైన్ వుంది.  ఒక ఫిలాసఫికల్ డైలాగు - జీవితంలో రెండే  రోజులు చాలా ముఖ్యమైన రోజులు. మనం పుట్టిన రోజు, మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు అని.

        ఐతే జాన్ అబ్రహాం పాత్ర తానెందుకు పుట్టిందో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు బద్దకిస్తూ వుంటుంది. ఇంత లేజీ పాత్ర సినిమాల్లో చూడలేదు. 1999 లో అక్షయ్ కుమార్ నటించిన జాన్వర్ (పశువు) విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్ పాత్ర ఏమీ చేయని పశువులా, పరమ లేజీ పాత్రగా ఏడుస్తూ వుంటుంది. ఇది గుర్తొచ్చేలా జాన్ అబ్రహాం పాత్ర వుంది.

చిప్ గప్ చుప్
        ఎందుకో పుట్టాంలే బద్దకంగా, ఐతే ఏంటట- అన్నట్టు ప్రవరిస్తుంది. కనీసం తాను సూపర్ సోల్జర్ అని కూడా ఫీలవదు. వొంట్లో వున్న చిప్ గుర్తుకు రాదు. జాన్ అబ్రహాం ఒక పక్క పార్లమెంట్ మీద ఎటాక్ జరుగుతూంటే, అంత సూపర్ సోల్జర్ హోదాకి వెహికిల్ లేనట్టు, హెలీకాప్టర్ దొరకనట్టు, మైళ్ళకి మైళ్ళు పరుగెత్తుకుంటూ వస్తూంటాడు. అంతసేపు అతను పరుగెత్తుకు రావడం దర్శకుడికి చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ పార్లమెంటులో టెర్రరిస్టు దాడి సీన్లు పూర్తి చేయాలి, ఎంపీల్ని నిర్బంధించాలి, ప్రధానిని కూడా పట్టుకుని బంధించాలి... ఇన్ని కార్యక్రమాలున్నాయి.

        అందుకని జాన్ అబ్రహాం రోడ్డు మీద పోతున్న ఏ వెహికిల్ నీ ఆపి లాక్కోకుండా (ఏ సినిమాలోనైనా ఇలాంటప్పుడు చిప్ లేని హీరో కూడా ఈ పనే చేస్తాడు), దర్శకుడి ఆర్డర్స్ తుచ తప్పకుండా బద్దకిస్టుగా పాటిస్తూ పరుగెత్తుకుంటూ పరుగెత్తుకుంటూ వచ్చి, దాడి జరుగుతున్న పార్లమెంట్ భవనం ముందు ప్రకాష్ రాజ్ తో కలిసి నిలబడిపోయి, చూస్తూ వుంటాడు. ఏమిటి ఇంకా చూసేదీ? లోపలింకా దర్శకుడు పూర్తి చేయాల్సిన సీన్లు పూర్తి కాలేదు. లోపలే కాదు, బయటకూడా భద్రతా దళాల్ని టెర్రరిస్టులు చంపుతున్నా నిలబడి చూస్తూనే వుంటాడు. ఎందుకు పుట్టాడో ఇంకా తెలుసుకోడు. తను ఏఐ సహిత సూపర్ సోల్జర్ అన్న స్పృహే లేదు. చిప్ ఏమైందో తెలీదు.

బద్దకంగా పాసివ్ ఇంటర్వెల్
        టర్మినేటర్ లో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ లా, కిల్లింగ్ మెషీన్ లా మారిపోయి ఎదురొచ్చిన ప్రతి ఒక్కర్నీ నేలమట్టం చేసేస్తూ తక్షణం, భారీ యాక్షన్ సీన్ని బ్లాస్ట్ చేయకుండా, ఈ ఇంటర్వెల్ సీనుని నీరు గార్చేశాడు. తను ఇంకా బయటే నిలబడి చూస్తూ వుంటాడు, ఇక లోపల ప్రధానిని ఓ గదిలోకి నెట్టేయడంతో ఇంటర్వెల్! ఇది పసలేని పాసివ్ ఇంటర్వెల్.


ఫస్టాఫ్ ఓపెనింగ్ లో టెర్రరిస్టుల శిబిరం మీద ఎటాక్ తర్వాత, సూపర్ సోల్జర్ గా మారేక ఎప్పుడు యాక్షన్లోకి దిగుతాడా అని ఎదురు చూస్తూంటే, ఇంటర్వెల్లో కూడా నిమ్మకు నీరెత్తినట్టు వుంటే ఏమనాలి. ఈ దర్శకుడికి బోయపాటి సినిమాలు చూపించాల్సిన అవసరముందేమో. జాన్ అబ్రహాం బోయపాటితో తీసి వుంటే బాక్సాఫీసు బద్దలయ్యేది. అబ్రహాం సూపర్ సోల్జర్ పాత్ర సెకండాఫ్ లో కూడా క్లయిమాక్స్ మొదలయ్యేవరకూ యాక్షన్లోకి దిగదు! మరెందుకీ సూపర్ సోల్జర్ అంటూ జాన్వర్ సినిమా తీశారో తెలీదు.

        సూపర్ సోల్జర్ ని రూపకల్పన చేసి, అమలుపర్చే డాక్టర్ సబాగా రకుల్ ప్రీత్ సింగ్ గ్రేస్ ఫుల్ గా నటించింది. అబ్రహాం కంటే తను ఎక్కువ యాక్టివ్ గా వుంటుంది. అబ్రహాం ప్రేయసిగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ వెంటనే చనిపోయే పాత్ర. మెట్ల మీద తూలి పడిపోతూంటే, జాన్ అబ్రహాం ముందుకు లాగి పట్టుకోవడంతో, లిప్ లాక్ అయిపోయి లవ్ ట్రాక్ స్టార్ట్ చేసుకుంటుంది. రాధేశ్యామ్ లో ప్రభాస్- పూజా హెగ్డే అంతసేపు రైలుకి వేలాడినా అధరాలు మధువుని గ్రోలలేదు.

        రక్షణ శాఖ అధికారిగా ప్రకాష్ రాజ్, హోమ్ మంత్రి గా రంజిత్ కపూర్ పకడ్బందీగానే నటించారు, అయితే పార్లమెంటు మీద దాడి నేపథ్యంలో వీళ్ళ అభిప్రాయబేధాలతో కూడిన డ్రామా మెయిన్ యాక్షన్ కి అడ్డుపడుతూంటుంది. ఈ డ్రామా బదులు పార్లమెంటులో వుండాల్సిన అసలు డ్రామా వుంటే యాక్షన్ కి తోడయ్యేది. ఇదేమిటో తర్వాత చూద్దాం. ఇక విలన్ గా టెర్రరిస్టు పాత్రలో ఎల్హమ్ ఎహ్సాస్ గురించి పైన చెప్పుకున్నాం.

        ముగ్గురు ఛాయాగ్రాహకుల ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక నిపుణుల సీజీ, సెటింగ్స్, లొకేషన్స్, సంగీతం వగైరా క్వాలిటీతోనే వున్నా, యాక్షన్ కొరియో గ్రఫీ జాన్ అబ్రహాంతో ఒక చిప్ వున్న సూపర్ సోల్జర్ అన్పించేలా లేదు. కథలో అవసరం లేని సూపర్ సోల్జర్ ఎలా వుందో, అలా యాక్షన్లో సూపర్ సోల్జర్ అన్పించని విధంగా వున్నాడు అబ్రహాం.

స్క్రీన్ ప్లే సంగతులు

'ఎటాక్, పార్ట్ -1' 55 కోట్ల బడ్జెట్ కి వారాంతపు మూడు రోజులు ఓవర్సీస్ కలుపుకుని అన్ని ఏరియాల్లో 7 కోట్ల వసూళ్ళ దగ్గరే వుందని ఇండియా టుడే కథనం. ఇందుకు సూపర్ సోల్జర్ గా జాన్ అబ్రహాం పాసివ్ పాత్రే కారణం. ఇక పార్ట్ టూ ఎలా వుంటుందో, తీస్తారో లేదో ఇప్పుడు తాజా పరిస్థితి. ఈ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంలో, సాధారణ  సోల్జర్ గా మూవీ ఓపెనింగ్ లో యాక్షన్ ఎపిసోడ్  చేసిన తర్వాత, జాక్విలిన్ తో లవ్, పాట, పాట తర్వాత టెర్రరిస్టు దాడి, దాడిలో జాక్విలిన్ చనిపోయి, తను పక్షవాతంతో వీల్ ఛైర్లో. ఇలా 30 నిమిషాలూ గడిచిపోతాయి.  

        ఇప్పుడు 30 వ నిమిషంలో బిగినింగ్ విభాగం ముగిసి ప్లాట్ పాయింట్ వన్ గా, ప్రకాష్ రాజ్ సూపర్ సోల్జర్ ప్రోగ్రాంని హోమ్ మంత్రికి ప్రతిపాదించడంతో,  మిడిల్-1 విభాగం ప్రారంభమవుతుంది. ఇందులో జాన్ అబ్రహాం ప్రకాష్ రాజ్ ప్రతిపాదన ఒప్పుకోవడం, అతడి మీద ప్రయోగాలూ వగైరాలతో పక్షవాతం నుంచి కోలుకుని, దొంగలతో ఫైట్ చేసి తిరిగి యాక్షన్లోకి వచ్చేసరికి ఇంకో 15 నిమిషాలు కూడా  గడిచిపోయి- మొత్తం ఈ 45 నిమిషాల వరకూ కథలోకే వెళ్ళదు దర్శకుడు చెప్పిన గంటా 45 నిమిషాల సినిమా.

        సూపర్ సోల్జర్ ప్రోగ్రాంని తీసుకొచ్చిందే ఏర్ పోర్టులో జాన్ - జాక్విలిన్ ల మీద దాడి నేపథ్యంలో, ఇంకా దేశంలో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా టెర్రరిజానికి వ్యతిరేకంగా, అత్యవసరంగా. మరో వైపు జైల్లో బందీగా వున్న తండ్రిని విడిపించుకోవడానికి కొడుకు హమీద్ గుల్ దేశంలో ప్రవేశించాడనీ తెలుసు. ఇలాంటప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో జాన్ ని సూపర్ సోల్జర్ గా మార్చి, వెళ్ళు- వెళ్ళి హమీద్ గుల్ ని ఖతం చెయ్ అని రెచ్చగొట్టి కథ ప్రారంభించాల్సింది ఆ పని చేయలేదు. ప్లాట్ పాయింట్ వన్ అంటేనే కథా ప్రారంభం. ఇక్కడ క్రియేటైన ఈ సిట్యుయేషన్లో కథ ప్రారంభం కాలేదంటే ఇక అంతటా కుంటి నడకే వుంటుంది.

        జాన్ అబ్రహాం కూడా తన ప్రేయసిని చంపి, తనని ఇన్ వాలిడ్ చేసిన హమీద్ గుల్ మీద ప్రతీకార భావంతో రగిలిపోతూ, సూపర్ సోల్జర్ గా విశ్వరూపం చూపిస్తూ యాక్టివేట్ అవకపోతే  కథ ఏం పైకి లేస్తుంది, చప్పట్లు ఏం పడతాయి. పడుకున్న హీరో, పడుకోబెట్టిన కథ, కునుకు దీస్తున్న కలెక్షన్లు.

ఇంటర్వెల్ సన్నాహం సున్నా
        30 వ నిమిషం నుంచీ 45 వ నిమిషం వరకూ సూపర్ సోల్జర్ గా తయారవడానికే 15 నిమిషాలూ వృధా చేసి, అప్పుడు ఎవరో దొంగలతో ఫైట్! స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇక్కడ  45 వ నిమిషమన్నది ఇంటర్వెల్ కి దారితీసే/ప్రేరేపించే పించ్ వన్ పాయింటు అవుతుంది. ఈ పాయింటులో ఎవరో దొంగలతో ఫైటునే అనుమతించదు స్ట్రక్చర్. ఈ పించ్ -1 పాయింటు అనేది ప్రధాన కథని ఇంటర్వెల్ కి చేరేసే కూడలిగా వుంటుంది. అంటే ఇక్కడ్నించే ఇంటర్వెల్ కి సన్నాహం మొదలవుతుంది. ఇదేమీ లేకుండా, ఒక కార్యకారణ (కాజ్ అండ్ ఎఫెక్ట్) సంబంధంతో సీన్లు పడకుండా, ఏ ముక్కకా ముక్కగా సీన్లు పడిపోతూంటాయి. ఇలా 60 వ నిమిషంలో సడెన్ గా పార్లమెంటు మీద ఎటాక్ సీను వచ్చి పడుతుంది.

        ఇలా కాకుండా, ఉదాహరణకి- ఈ పించ్ -1 పాయింటులో హమీద్ గుల్ ఒక డ్రామా క్రియేట్ చేస్తూ, '2001 లో మనవాళ్ళు పార్లమెంట్ మీద ఎటాక్ చేసి లోపలికి వెళ్ళ లేకపోయారు. బయటే అంతమైపోయారు. ఈసారి మనం గ్రాండ్ ప్లానింగ్ తో లోపలికి వెళ్ళబోతున్నాం' అంటే విలనిజం ఓ రేంజిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రమాద తీవ్రత మనం అనుభవిస్తాం. ఇప్పుడేం జరుగుతుందా అని ఉత్కంఠ పెరుగుతుంది. చరిత్రని గుర్తు చేయడంతో కథకి డెప్త్ ఫీలవుతాం. ఆఖరిగా, There is no terror in the bang, only in the anticipation of it’ అన్న ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కొటేషన్ మెదిలి- హిచ్ కాక్ ని ఫాలో అవుతున్నాడ్రా ఈడూ అని మనం సంతృప్తి చెందుతాం. సడెన్ గా పార్లమెంట్ మీద ఎటాక్ జరిగితే ఆ బ్యాంగ్ లో టెర్రర్ వుండదు, ఎటాక్ జరగ బోతోందని ముందస్తు సంకేతాలి
వ్వడంలో నిజమైన టెర్రర్ ఫీలింగ్ వుంటుంది హిచ్ కాక్ ప్రకారం. పిడుగు కూడా నేరుగా ఒక బ్యాంగుతో పడదు. ముందు కళ్ళు చెదిరే మెరుపు మెరుస్తుంది.

ఇదే సమయంలో ఇంకో డ్రామా కూడా క్రియేట్ అవచ్చు. ఉదాహరణకి- ఆ సమయంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంతోనో, లేదా ఒక బిల్లు పాస్ కాకపోతేనో ప్రభుత్వం పడిపోయే పరిస్థితితో కూడిన హై డ్రామా వుండొచ్చు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని  ప్రతిపక్షాలు, నిలబెట్టుకోవాలని అధికారపక్షం. ఈ హోరాహోరీ చర్చోప చర్చలు జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితి. హమీద్ గుల్ డ్రామాకి, పార్లమెంటులో యాంటీ డ్రామా. కథనమంటే పరస్పర విరుద్ధ పరిస్థితుల డైనమిక్సే, సయ్యాటే. ఇప్పుడా ఎటాక్ ఏమవుతుంది, ఇక్కడ ప్రభుత్వమేమౌతుంది- అన్న డబుల్ డైలమా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు, ముందు కొనుక్కున్న హమీద్ గుల్ డ్రామాకి, పార్లమెంటు యాంటీ డ్రామా ఫ్రీగా లభించి ఆడియెన్స్ ఫుల్ ఖుష్. ఈడు మామూలు డైరెక్టరు కాదురా అని ఆనందం. ఏ సీనుకా సీనుగా ఆనందపర్చడమే కమర్షియల్ సినిమా కర్తవ్యం. ఐతే ముందు హీరో ఆనందంగా వుండాలి.   

        సడెన్ గా వచ్చే ఈ ఇంటర్వెల్ పార్లమెంటు మీద దాడి సీన్లో, జాన్ అబ్రహాం పాత్రేమిటో ఇంతకి ముందే చూశాం. పరుగుల రాజు ఉసైన్ బోల్ట్ ఇలా పరుగుదీస్తూ వస్తూంటే ఈలలూ చప్పట్లు పడతాయి గానీ, చిప్ వుంచుకుని కూడా మామూలు సోల్జర్ లా, ఆమ్ ఆద్మీలా జాన్ అబ్రహాం పరుగెత్తు కొస్తూంటే పడతాయా? పార్లమెంట్ లోపలా బయటా హమీద్ గుల్ హంగామా చేస్తూంటే, జాన్ అబ్రహాం ప్రేక్షక పాత్ర వహించి నిలబడి చూస్తూంటే, ఈ బిగినింగ్ -1 విభాగం ఇంటర్వెల్ తో చప్పగా ముగుస్తుంది.

నిజానికి 2001 నాటి సంఘటనలో 100 మంది ఎంపీలు సహా హోమ్ మంత్రి ఎల్ కె అద్వానీ పార్లమెంటు భవనం లోపలున్నప్పుడు ఎటాక్ జరిగింది. టెర్రరిస్టులు లోపలికి జొరబడకుండా భద్రతా దళాలు బయటే కాల్చి చంపి పార్లమెంట్ గౌరవాన్ని కాపాడారు. అమరులయ్యారు. దీనికి విరుద్ధంగా, ఎటాక్ లో టెర్రరిస్టుల్ని లోపలికి జొరబడనిచ్చి అధ్వాన్నం చేశారు. ఇది ఆ నాడు పార్లమెంటుని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన అమర భద్రతా దళాలకే అవమానం. టెర్రరిస్టులతో ఇలాటిది జరగనిచ్చి, దానిమీద విజయం  సాధించి, సినిమా చివర జాతీయ జెండా ఎగరేసి పాట పాడితే దేశభక్తి అయిపోదు. ఇలాటి సినిమాలు తీయాలంటే పరిపక్వత అవసరం.

మిడిల్ -2 మటాష్
        మిడిల్ -2 విభాగం ఇంకా దారుణం. ఇంటర్వెల్లో బయట చూస్తూ నిలబడ్డ అబ్రహాం, ఇంటర్వెల్ తర్వాతైనా యాక్షన్ లోకి దిగడు. ఇంటర్వెల్ తర్వాత మిడిల్ -2 ప్రారంభం టీవీ ఛానెళ్ళ హోరు. ఈ ఛానెళ్ళలో ప్రసారమవుతున్న బయటి పరిస్థితిని పార్లమెంటులో జొరబడ్డ హమీద్ గుల్ సెల్ ఫోన్లో చూసేస్తూంటాడు. 2008 తాజ్ మహల్ హోటల్ ఎటాక్ అప్పుడు ఇలాగే ఛానెళ్ళు  బయటి పరిస్థితిని ప్రసారం చేస్తూంటే, లోపల టెర్రరిస్టులు టీవీల్లో అప్డేట్స్ తెలుసుకుంటూ ఆపరేషన్ చేసుకుంటూ పోయారు. దీంతో ఇలాంటప్పుడు ఛానెళ్ళు ఇలాటి ప్రసారాలు చేయకుండా ఆంక్షలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎటాక్ కథకులకి ఈ ప్రోటోకాల్ వున్నట్టే తెలీదులా వుంది!

        సరే, సెకండాఫ్ మొదలై 10 నిమిషాలకి గానీ యాక్షన్లోకి దిగడు అబ్రహాం. అతడేమిటో పార్లమెంట్ కారిడార్లోకి వచ్చి కూడా ఆలోచిస్తూ నిలబడతాడు. ఈ ఆలోచనలేమిటో మనకర్ధం గాక తల బాదుకోవడమే. ఆ చిప్ మనకే గనుక వుంటే, తెర మీద పడి ఒక్కో టెర్రరిస్టుని ఇవతలికి లాగి, సినిమా హాల్లోనే ఖతం చేసే వాళ్ళం. రివర్స్ లో ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అన్నమాట. Story telling is about two things; it's about character and plot.’ - George Lucas.

        ఈ సెకండాఫ్ 45 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ 45 నిమిషాలూ డల్ మూమెంట్స్ తో సహన పరీక్ష పెట్టేస్తుంది. కొన్నిసార్లు మనం ఆంటోన్ ఫుఖ్వా దర్శకత్వంలో డెంజిల్ వాషింగ్టన్ నటించిన ఈక్వలైజర్ -2 (2018) సెకండాఫ్ మేకింగ్ గురించి చెప్పుకున్నాం. దీని గురించి ఎన్నిసార్లు మన తెలుగు మేకర్లకి చెప్పినా ఏదో భయం, వర్కౌట్ అవదని. ఆంటోన్ ఫుఖ్వా ఏం చేశాడంటే, ఇంటర్వెల్ తర్వాత మిడిల్ -2 లో పది నిమిషాల్లో డెంజిల్ వాషింగ్టన్ మాఫియాలకి విషయం చెప్పేస్తాడు- ఇక చావడానికి సిద్ధపడమని.

దీంతో మిడిల్ 2 ముగిసి, ఇక్కడే ఈ పదవ నిమిషంలో ప్లాట్ పాయింట్ -2 తో వెంటనే క్లయిమాక్స్ మొదలైపోతుంది. మొత్తం స్క్రీన్ ప్లేలో మిడిల్ – 2 విభాగం 10 నిమిషాలే వుంటుంది. ఎందుకంటే, ఇంటర్వెల్ లో తన కొలీగ్ ని చంపింది ఫలానా మాఫియాలని తెలిసిపోతుంది వాషింగ్టన్ కి. ఇక ఇంటర్వెల్ తర్వాత 10 నిమిషాల్లో వాళ్ళని ట్రాప్ చేసి రప్పించి, చావు ప్రకటన చేస్తాడు. ఇంతకంటే కథ లేదు ఇంకో అరగంట మిడిల్ -2 నడపడానికి. దీంతో సెకండాఫ్ 10 నిమిషాల్లోనే మిడిల్ - 2 ముగించేసి క్లయిమాక్స్ కెళ్ళి పోయాడు. ఈ 45 నిమిషాల నాన్ స్టాప్ క్లయిమాక్స్ యాక్షన్ అదిరిపోతుంది, చినిగిపోతుంది, వెండి తెరని చించి పారేస్తుంది. సెకండాఫ్ మొదలైన పది నిమిషాలకి క్లయిమాక్సే! ఇది వినూత్న ప్రయోగం. ఇలాటిది ఎక్కడా చూడలేదు. You gotta be  open-minded. Explore things. Feed your artist. 'Cause movies are human drama, that's it.- Antoine Fuqua

        ఈ సెకండాఫ్ 45 నిమిషాలూ సూపర్ సోల్జర్ గా ప్రజ్వలించే విశ్వ రూపంతో విరుచుకుపడి ఉపద్రవాన్ని ఊడబీకి పారెయ్యకుండా, పరమ పాసివ్ పాత్రగా వ్యవహరిస్తాడు. అతడి ఏ చిప్, అమెజాన్ అలెక్సా లాంటి ఇన్ఫర్మేషన్ అందించే డిజిటల్ అసిస్టెంట్ కి కనెక్ట్ అయి వుంటుంది. ఈ ఇంటలిజెంట్ రోబోటిక్ అసిస్టెంట్ (ఐఆర్ఏ) ని అవసరమున్నప్పుడల్లా సమాచారం అడుగుతాడు. అది ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో ఆ విజువల్స్ చూపిస్తుంది. అయితే ఇది ఆటవస్తువుగా మారిపోయింది. ఈ ఐఆర్ఏ తో సూపర్ టెక్ సోల్జర్ అన్పించాలన్నట్టు సమాచారం మీద సమాచారం అడుగుతూ, ఆ విజువల్స్ మనకి చూపిస్తూ- కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టు- ఐఆర్ఏ విజువల్ వాణితో ఒకటే ఆడుకోవడం. యాక్షన్లోకి దిగేది లేదు, ఏమీ లేదు. 

    హమ్మయ్యా అని మొత్తానికి ఇంకో పది నిమిషాలకి, పార్లమెంటులో హమీద్ గుల్ ఎక్కడున్నాడో ఐఆర్ఏ ప్రియదర్శిని పెట్టె లో చూసి, యాక్షన్ కి తెర తీస్తూ చంపుకుంటూ వెళ్ళి హమీద్ గుల్ ని పట్టుకుంటాడు. ఆనాడు నేను నిన్ను కాపాడాను అంటాడు. ఎవరు కాపాడమన్నారు? టెర్రరిస్టుల్ని పాక్ పెరట్లో పెంచుకుంటున్న పాములు అని అంది కదా హిల్లరీ క్లింటన్. పాముని ఎవరు కాపాడమన్నారు? ఇలా ఈ హమీద్ గుల్ ని పట్టుకోవడంతో బిగినింగ్ -2 విభాగం ముగుస్తూ, ప్లాట్ పాయింట్ -2 తో క్లయిమాక్స్ ప్రారంభమవుతుంది.

ఇంతే క్లయిమాక్స్
        ఈ లోగా హమీద్ గుల్ జైల్లో తండ్రిని విడిపించుకుని, పారిపోయేందుకు విమానం కూడా డిమాండ్ చేసి, ఏర్ స్ట్రిప్ కి ఉడాయించేందుకు సిద్ధమై వుంటాడు. ఇక పారిపోతున్న హమీద్ గుల్ కోసం ఛేజ్. విమానం ఎక్కేసి టేకాఫ్ తీసుకుంటూ వుంటే బైక్ మీద ఛేజ్. ఇది చాలా సినిమాల్లో వచ్చేసిన టెంప్లెట్ క్లయిమాక్సే. ఈ క్లయిమాక్స్ ఐదు నిమిషాల్లో ముగిసిపోతుంది. హమీద్ గుల్ పార్లమెంటులో బాంబులు కూడా పెట్టాడు. ఆ రిమోట్ లాక్కుని ఒక్క దెబ్బతో చంపేస్తాడు అబ్రహాం. విలన్ తో ఈ క్లయిమాక్స్ లో సరైన షో డౌన్ కూడా లేదు. చచ్చి పోతున్న విలన్ హమీద్ గుల్ కి అబ్రహాం సూపర్ సోల్జర్ అని కూడా తెలీదు. ఇలా వుంది కథనం! ఇతడికే కాదు, మీడియాకీ, మరెవరికీ, ప్రపంచానికే తెలీదు సూపర్ సోల్జర్ గురించి. ఇలా వుంది సూపర్ సోల్జర్ అనే ప్రతిష్టాత్మక సంపద కిచ్చిన గుర్తింపు.

ఈ 45 నిమిషాల సెకండాఫ్ లో సూపర్ సోల్జర్ పాసివ్ నేచర్ కి తోడు, హోమ్ మంత్రి- ప్రకాష్ రాజ్ ల మధ్య నిర్ణయాల గురించి వాదోపవాదాలు పదే పదే అడ్డుపడుతూంటాయి. ఉన్న 45 నిమిషాల్లో సూపర్ సోల్జర్ తో సూపర్ ఫాస్ట్ యాక్షన్ తో కథని పరుగులు పెట్టించకుండా తీరుబడిగా, బోరు కొట్టే స్పీడ్ బ్రేకర్స్ వేశాడు. ఏ సీనుతోనూ సస్పెన్స్ లేదు, థ్రిల్ లేదు. క్యారక్టర్ ని దాని కథని అది నడుపుకో నివ్వకుండా, క్యారక్టర్ ఆర్క్ ని క్రియేట్ చేసుకో నివ్వకుండా, సూపర్ సోల్జర్ గా దాని గొప్ప అది చూపించుకో నివ్వకుండా, దర్శకుడు తానుగా కథ నడిపే పొరపాటు చేశాడు. కథని క్యారక్టర్ థాట్సే, ఫీలింగ్సే, వాటితో సమయానుకూల నిర్ణయాలే నడిపిస్తాయని తెలుసుకోక, క్యారక్టర్ ని కీలు బొమ్మని చేసి తన థాట్స్ తో నడిపాడు దర్శకుడు. కథకి దర్శకుడి/కథకుడి థాట్స్ అస్సలు పనికి రావు. వాళ్ళ థాట్స్ కి మించిన స్థాయిలో క్యారక్టర్స్ వుంటాయి. ఏం చేసినా దర్శకుడు/ కథకులు సూపర్ సోల్జర్స్ కాలేరు. అలాంటప్పుడు సూపర్ సోల్జర్ ఆలోచనలెలా వుంటాయో వాళ్ళకేం తెలుసు? ఆ క్యారక్టర్స్ మనో కామనల కోశంలో గర్భస్థ శిశువులా ఒదిగి, హృదయ స్పందనలని వినడమే చేయాల్సిన పని.

విలన్ 

        మనం ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలో వున్నామనీ, ఇక్కడ ప్రతీదీ తక్షణం జరిగిపోవాలనీ, ప్రేక్షకుల సమయం వృధా చేయకుండా డైలాగులని క్లుప్తంగా వుంచామనీ, ఇంకేదో ననీ, కథని సాధ్యమైనంత ఉత్తమంగా చెప్పడానికి, ప్రేక్షకుల్ని నిమగ్నమయ్యేలా చేయడానికీ  ప్రయత్నం చేశామనీ చెప్పుకొచ్చిన దర్శకుడి మాటలు, సినిమాలో ఎక్కడా ప్రూవ్ కావు. పేపర్ మీద చేసిన వర్క్ ఏంటో అదే చెప్తుంది సినిమా ఏంటో. కాబట్టి - ‘Read, read, read, read, read, read, read, read, read, read, read, read, read. If you don’t read, you will never be a filmmaker.’ - Werner Herzog

—సికిందర్

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

1152 : రివ్యూ!


రచన - దర్శకత్వం : స్వరూప్ ఆర్ ఎస్ జె
తారాగణం : తాప్సీ పన్నూ, హర్ష్ రోషన్, భాను ప్రకాశన్, జయతీర్ధ, రిషబ్ శెట్టి, హరీష్ పి, సత్యం రాజేష్ తదితరులు
సంగీతం : మార్క్ జె రాబిన్, ఛాయాగ్రహణం : వై దీపక్
బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, పీఏ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు ; ఎన్ ఎం పాషా, అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
విడుదల : ఏప్రెల్ 1, 2022
***

        తెలుగు సినిమాల నుంచి దూరంగా వెళ్ళి బాలీవుడ్ లో రియలిస్టిక్ సినిమాలతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న తార తాప్సీ పన్నూ, మూడేళ్ళ తర్వాత తెలుగుకి తిరిగి వచ్చి మిషాన్ ఇంపాసిబుల్ నటించింది. 2019 లో నవీన్ పొలిశెట్టితో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే హిట్ తీసిన దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె, మలి ప్రయత్నంగా చైల్డ్ ఆర్టిస్టుల కాంబినేషన్లో మార్కెట్ వేల్యూ కోసం తాప్సీ తో మిషాన్ ఇంపాసిబుల్ తీస్తూ దేశవ్యాప్త దృష్టి నాకర్షించాడు. తాప్సీ కూడా తనకి జన్మనిచ్చిన తెలుగు సినిమాకి తిరిగి రావడం రుణం తీర్చుకోవడమేనని భావావేశానికి లోనైంది. మరి దర్శకుడు ఆమెని తిరిగి తెలుగుకి తీసుకొస్తూ రుణం తీర్చుకునేలా చేశాడా? లేక రుణం తీర్చుకోవడం ఇంపాసిబుల్ అనేలా చేశాడా? ఇది తెలుసుకుందాం...

కథ

    శైలజ (తాప్సీ పన్నూ) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. తన జర్నలిజంతో ఒక రాజకీయ నాయకుడ్ని పదవిలోంచి దింపేసి, బాలల అక్రమ రవాణా మాఫియాని పట్టుకోవడానికి కొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ (రఘుపతి రాఘవ రాజారాం) అనే ముగ్గురు 10-12 ఏళ్ల స్కూలు కుర్రాళ్ళు చదువు పట్ల శ్రద్ధ లేక, ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూంటారు. ఈ ముగ్గురికీ ఒక అయిడియా వస్తుంది. రఘుపతి (హర్ష్ రోషన్), రాఘవ (భాను ప్రకాశన్), రాజారాం (జయతీర్ధ) ముగ్గురూ కలిసి  మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీం ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్పి 50 లక్షల బహుమానం సంపాదించుకోవాలని బయల్దేరతారు. ముగ్గురూ శైలజకి తారసపడతారు. ఈ ముగ్గురూ తన మిషన్ కి ఉపయోగపడతారనుకుని చేరదీస్తుంది. చైల్డ్ ట్రాఫిక్కింగ్  మాఫియా రామ్ శెట్టి (హరీష్ పి) ని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడానికి ఈ ముగ్గురి సాయం తీసుకుంటుంది. ఇందులో సఫలమైందా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    2014 లో పాట్నాలో ముగ్గురు స్కూలు పిల్లలు మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీంని పట్టుకుని అప్పగిస్తే 50 లక్షల బహుమానమన్న ప్రభుత్వ ప్రకటనకి ఉత్తేజితులై బయల్దేరి వెళ్ళి పోలీసులకి దొరికిపోయారు. ఈ సంఘటన దర్శకుణ్ణి ఆకర్షించింది. దీని ఆధారంగా కథ తయారు చేసి, దానికి పిల్లల అక్రమ రవాణా (చైల్డ్ ట్రాఫిక్కింగ్) అంశం జోడిస్తూ, తాప్సీ పన్నూకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్ర రూప కల్పన చేశాడు. జానర్ వచ్చేసి కామిక్ థ్రిల్లర్.

        2014 వార్తా కథనం ప్రకారం ఆ ముగ్గురు స్కూలు పిల్లలు డాన్ దావూద్ మీద తీసిన డీ-డే అన్న బాలీవుడ్ థ్రిల్లర్ చూసి, అందులో దావూద్ ని పట్టుకుంటే 50 లక్షలు అన్న ప్రభుత్వ ప్రకటన నిజమే అనుకుని పట్టుకోవడానికి బయల్దేరారు. ఈ పిల్లలతో కామెడీ ఇంకా వుంది... ఈ పిల్లల్లో ఒకడి అమ్మమ్మ పాకిస్తాన్ లోని కరాచీలో వుంటోంది. దావూద్ కూడా కరాచీలోనే దాక్కున్నాడు. ఇంకేం, అమ్మమ్మ దగ్గరకెళ్ళి పోయి వుంటే, వాణ్ణి పట్టుకోవచ్చని ప్లానేసుకున్నారు. కరాచీ వెళ్ళాలంటే వీసా, పాస్ పోర్టులుండాలని కూడా వాళ్ళకి తెలీదు.

        ఇంటర్నెట్ లో కరాచీలోని దావూద్ ఇంటి ఫోటోని కూడా డౌన్ లోడ్ చేసుకున్నారు. దాని మ్యాపుని స్టడీ చేసి, కాంపౌండ్ లోకి ఎలా ప్రవేశించాలి, ప్రవేశించి దావూద్ మీద పడి ఎలా పట్టుకోవాలీ మొత్తం స్కెచ్ వేసుకున్నారు. తీరా తేలిందేమిటంటే, మ్యాపులో అది దావూద్ ఇల్లు కాదు. పాక్ లోనే అబ్బొటా బాద్ లో అప్పట్లో దాక్కుని అమెరికన్ కమెండోల చేతిలో చచ్చిన బిన్ లాడెన్ ఇల్లు అది! ఉదంతానికి ఇది కొసమెరుపు.

    ఈ పిల్లలు కలకత్తాలో డబ్బులైపోయి తిరుగుముఖం పట్టారనేది వేరే సంగతి. వీళ్ళ  ఉదంతంలో కొట్టొచ్చేట్టు కన్పించేదేమిటంటే, చైల్డ్ స్పిరిట్. ఇలాటి స్పిరిట్ వున్న పిల్లల్ని నిజానికి గ్రూమింగ్ చేస్తే భవిష్యత్తులో ఎక్కడో వుంటారు. వీళ్ళేమీ తప్పుడు పనికి పాల్పడలేదు. దేశానికుపయోగ పడే మంచి పనికే బయల్దేరారు. ఆ వయసులోనే అంత ప్లానింగ్ చేశారు. అది అవుతుందనే నమ్మారు. తెలిస్తే ఏదీ చేయలేరు, తెలియకపోతే ఏదైనా చేసేస్తారు.

        రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చిన్నతనంలో గూఢచార కార్యాలయానికి వెళ్ళిపోయి నన్ను గూఢచారిగా చేర్చుకోండి అనేశాడు. నువ్వింకా పెద్ద వాడివి అవ్వాలి, ట్రైనింగు పొందాలీ అని అక్కడి అధికారి అనేసరికి, పట్టువదలకుండా అవన్నీ చేసి, ఆ కార్యాలయానికే పెద్దవాడై గూఢచారిగా వచ్చాడు. తర్వాత్తర్వాత ఇంకెన్నో మజిలీలు దాటుకుని దేశాధ్యక్షుడయ్యాడు.

        ఛైల్డ్ స్పిరిట్ ని చంపవచ్చా? ఈ పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లిదండ్రులతో, మీ పిల్లలు మళ్ళీ ఇలాటి పనులు  చేయకుండా అదుపులో పెట్టుకోండి అన్నారంటే ఏమనాలి. ఈ సినిమా కథ రాసిన దర్శకుడు కూడా ఈ చైల్డ్ స్పిరిట్ లోని  స్పార్క్ ని, ఇందులో ఇన్ని డైనమిక్స్ నీ  సినిమాకి పట్టుకో లేక పోవడం విచారకరం.

        పిల్లల్ని పాకిస్తాన్ పంపేసి, మ్యాపు ప్రకారం అబ్బొటాబాద్ లోని అదే బిన్ లాడెన్ ఇంటికే పోతే, ఇండియన్ గూఢచారుల కన్నుగప్పడానికి తెలివిగా అక్కడే దాక్కుని దావూద్ ఇబ్రహీమే ఎదురైతే ఏం జరుగుతుంది? - అన్న కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథ చేయకుండా, దావూద్ ఇబ్రహీం అనుకుని మొదలెట్టిన కథని కూడా, తాప్సీతో పిల్లల అక్రమ రవాణాని కథగా చేసి పాత మూస కథలోకి కలిపేయడంతో, చైల్డ్ స్పిరిట్ తో వున్న  కొత్త కథ కిల్ అయిపోయింది. మెయిన్ కథ తలనొప్పిగా తయారయ్యింది.

నటనలు - సాంకేతికాలు

    తాప్సీది పూర్తి నిడివి పాత్ర కాదు. ఓ పెద్ద సైజు అతిధి పాత్ర అనుకోవాలి.  ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రకూడా ఇప్పుడు అసహజ పాత్రే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంతరించి పోయింది. స్టింగ్ ఆపరేషన్లు చేయడం, స్కాములు బయట పెట్టడం ఇవన్నీ ఒకప్పటి మాట. ఇప్పుడు ఫ్రెండ్లీ జర్నలిజం. రోజువారీ నేర వార్తలు రాసే క్రైమ్ రిపోర్టర్లు. కాబట్టి జర్నలిజం గురించి తెలిసిన వాళ్ళకి తాప్సీ పాత్ర అసహజంగా అనిపిస్తుంది. దర్శకుడు రీసెర్చి చేసుకోవాల్సింది.

        ఈ పాత్రలో తాప్సీ చేయడానికి కూడా ఏమీ లేదు. పాత్రకి మోటివ్ వుంటే, ఆ పరమైన పట్టుదల, భావోద్వేగాలూ వుండి, నటించడానికీ మెప్పించడానికీ  అవకాశముండేది. అన్ని బాలీవుడ్ రియలిస్టిక్ సినిమాలు సోలో క్యారక్టర్ గా చేస్తున్న తను ఈ చిన్న విషయం ఎందుకు తెలుసుకోలేదో తెలీదు. చైల్డ్ ట్రాఫిక్కింగ్ ని అడ్డుకోవాలన్న ఆమె మిషన్ కి ఏ డ్రమెటిక్ కారణం లేదు. పోనీ కథలో తనకి పరిచయమైన ఆ ముగ్గురు పిల్లల్ని చైల్డ్ మాఫియా కిడ్నాప్ చేసివుంటే, అప్పుడు ఓ బలమైన మోటివ్ ఏర్పడి వుండేది. ఇది కూడా జరగలేదు.

        పిల్లల సాయంతో చైల్డ్ మాఫియాని పట్టుకోవడానికి ఆమె చేసే ఇన్వెస్టిగేషన్, ప్లానింగ్, యాక్షన్ అన్నీ చైల్డిష్ గా, సిల్లీగా, చిరాకు పెట్టేవిగా వున్నాయి. తెలుగు రుణం తీర్చుకోవాలనుకున్న తాప్సీ రేపు ఉగాదికి కూడా తెలుగు వాళ్ళని ఇలా టార్చర్ పెట్టొచ్చా అన్పించేలా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, దర్శకుడు ఇలా పాత్ర రూప కల్పన చేశాడు. ఇందుకు ఎంతో అభినందనీయుడు.

        ఇక ముగ్గురు పిల్లలు. ఇలాటి బాలల పాత్రలకి ప్రాధాన్యమున్న సినిమాలో తెలుగు బాల నటుల్నైనా ప్రోత్సహిద్దామనే ఆలోచన మేకర్ కి రాలేదు. పరాయి వాళ్ళనే బాగా నటించారు, నవ్వించారు- అని మనం పొగడాలి. బాగానే నటించారు, బాగానే నవ్వించారు కాదనలేం. కామెడీ పేరుతో పిల్ల చేష్టలు మితిమీరి పోయాయి కూడా. కొన్ని చోట్ల నవ్వించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇదంతా ఫస్టాఫ్ 40 నిమిషాల సేపే. కథలోకి ప్రవేశించక  మునుపే. కథలోకి వచ్చాక ఆ కామెడీలు లేవు, ఫన్ లేదు సెకండాఫ్ లో కూడా.

        ఇక రామ్ శెట్టి అనే విలన్ పాత్ర వేసిన హరీష్ పి ఇంకో సిల్లీ పాత్ర. అంత పెద్ద పలుకుబడి గల మహా విలన్, అనుచరులు చేసే చిన్న చిన్న పనులు కూడా వీధిలోకొచ్చి తానే చేస్తూంటాడు. ఎందుకంటే తాప్సీ అతడ్ని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడానికి అనుకూలంగా వుండాలిగా? ఈ సినిమాలో ఏ పాత్రా ఆయా పరిస్థితుల్లో అదెదుర్కొనే  మానసిక స్థితిని బట్టి నడుచుకోదు. పాత్రలకి దర్శకుడే తన మానసిక స్థితినాపాదించి కథ నడిపిస్తూంటాడు. ఇందుకే ఈ కథ ఇలా వుంది. ఈ సినిమాని చూడడం దర్శకుడి మానసిక స్థితిని గ్రహించడమే.

        సంగీత దర్శకుడు మార్క్ రాబిన్ థ్రిల్లర్ జానర్ మ్యూజిక్కిచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఏం దమ్ముందో బాణీలు కూర్చే సంగీత దర్శకులకి ముందే తెలిసి పోతూంటుంది. నిర్జీవ సన్నివేశాలకి స్వరాలతో ప్రాణం పోస్తే లేస్తాయా అన్న ఆశతో లేపడానికి ప్రయత్నిస్తారు. ఆ పైన దేవుడి దయ. ఇందుకే చాలా సినిమాలు సంగీతం గొప్ప, సినిమాలు దిబ్బలా వుంటాయి.

        కెమెరా మాన్ దీపక్ కూడా కళాకాంతులు లేని వ్యవహారాన్ని ఎలా తేజోవంతం చేయాలో అంతా చేశాడు. ఆ పైన దేవుడి దయ. ఇక ఎడిటింగ్ సహా ఇతర విభాగాలు సమయాను కూలంగానే పని చేశాయి. నిడివి రెండు గంటలకి లాక్ చేశారు.

చివరికేమిటి

        సినిమా టైటిల్లో 'మిషన్' బదులు 'మిషాన్' అని ఎందుకంటే, సినిమాలో చూపించిన పల్లెటూళ్ళో 'బార్బర్' బోర్డు 'బార్బార్' అయింది కదాని జస్టిఫికేషన్. సరే,  ఈ మధ్య వరసగా చిన్నా పెద్దా సినిమాలు సెకండాఫ్ కథ చేసుకోలేక ఫ్లాపవుతున్న వైనాన్ని రిపీట్ చేశాడు ఈ దర్శకుడు కూడా.

          ఫస్టాఫ్ కామెడీల కాలక్షేపాలు తీయడంలో అందరూ నిపుణులే. తీరా కథ ప్రారంభిస్తే అదెలా నడపాలో తెలియని అమాయకులైపోతారు. సెకండాఫ్ టార్చర్ పెట్టేస్తారు. ఈ సెకండాఫ్ టార్చర్లు ఇప్పట్లో తప్పేలా లేవు. దీనికి కారణాలు, నివారణలు కనుగొనాలన్న ఆలోచన కూడా చేయడం లేదు.

        చైల్డ్ ఆర్టిస్టుల్ని ఉపయోగించుకుని ఫస్టాఫ్ కామెడీలు లాగేశాక, తాప్సీతో పిల్లల్ని కలుపుతూ కథ ప్రారంభించేసరికి, సెకండాఫ్ ఈ చైల్డ్ మాఫియా కథ అగాథంలో పడిపోయింది. అర్ధం పర్ధం లేని దృశ్యాలతో నిండిపోయింది. చైల్డ్ ట్రాఫిక్కింగ్ తో చాలా సినిమాలొచ్చాయి. ఇంకా దీనికి మార్కెటబిలిటీ వుంటుందా. లేక దావూద్ కథతో కొత్త  మార్కెట్స్ ఇండియా వ్యాప్తంగా ఓపెనవుతాయా అన్న వివేచన లేకుండా సింపుల్ గా ఈ సినిమాని చుట్టేశారు తాప్సీ పేరు నుపయోగించుకుని.

        చివరి అరగంట, దాని తర్వాత ముగింపూ అయితే చెప్పక్కర్లేదు. 'ఏజెంట్ ఆత్రేయ' తీసిన దర్శకుడితో ఇలా ఎవరూ ఆశించరు. ఇప్పటికైనా అసలు కథంటే ఏమిటో పునరాలోచించుకుని సినిమాలు తీస్తే క్షేమం. ఎవరైనా సరే, సినిమాని సినిమాలాగా చూడాలన్న పడికట్టు పదాన్ని వల్లెవేయడం మాని, కథని కథ లాగా చూపించాలని గ్రహిస్తే మంచిది. పెరిగి పోయిన టికెట్ల ధరలకి ఇంకా సిల్లీ సినిమాలు తీస్తామంటే కుదిరే పరిస్థితి లేదు.
—సికిందర్