రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, మార్చి 2022, గురువారం

1149 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : చేతన్ కుమార్
తారాగణం : పునీత్ రాజ్కుమార్, ప్రియా ఆనంద్, శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు
సంగీతం: చరణ్ రాజ్, ఛాయాగ్రహణం : స్వామి జె గౌడ
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
విడుదల : మార్చి 17, 2022
***

        టీవల ఆకస్మికంగా మృతి చెందిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలైంది. కన్నడ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ మూవీ అట్టహాసంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైనట్టు ప్రకటించారు. తెల్లారి నప్పట్నించే ఓవర్సీస్ నుంచి ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరవుతూ సూపర్ సినిమా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు నెమ్మదిగా టికెట్లు కొనుక్కుని తీరుబడిగా ప్రదర్శన శాలలోకి వెళ్తున్నారు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. కాసేపు పునీత్ ని చూస్తూ ఏసీ చల్లదనంలో సేద దీరవచ్చని సీట్లలో ఆసీనులవుతున్నారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం...

        థేమిటంటే... సంతోష్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) ఒక సెక్యూరిటీ సర్వీసెస్  నిర్వహిస్తూంటాడు. ఇందులో భాగంగా విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) కుటుంబ సెక్యూరిటీ భాధ్యతలు తీసుకుంటాడు. విజయ్ గైక్వాడ్ ఒక మాఫియా. ప్రత్యర్థి మాఫియాతో అతడికి ప్రమాదం పొంచి వుంటుంది. అప్పటికే తన తండ్రిని చంపించేశాడు. ఇక చెల్లెలు నిషా (ప్రియా ఆనంద్) ని కూడా చంపించేస్తాడని భయం పట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ బాధ్యతలు తీసుకున్న సంతోష్, ప్రత్యర్ధి వర్గాన్ని అంతమొందించేస్తాడు. దీంతో సంతృప్తి చెందిన గైక్వాడ్, చెల్లెలు నిషాని సంతోష్ కిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఇంతలో  సంతోష్ గురించిన భయంకర నిజం తెలుస్తుంది. ఈ సంతోష్ అసలెవరు? ఎందుకిలా  కావాలని గైక్వాడ్ కి దగ్గరయ్యాడు? జేమ్స్ పేరుతో అతడి గత చరిత్రేమిటీ? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి...

        ఈ సినిమా చూస్తూంటే కొన్ని తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి. అవేమిటనేది సస్పెన్స్. సినిమా చూసి తెలుసుకోవాలి. అలా కలెక్షన్స్ పెరుగుతాయి. దర్శకుడు చేతన్ కుమార్ లో ఒరిజినాలిటీ అనేది లేదు. తెలుగు సినిమాల్ని కలిపి కన్నడ సూపర్ స్టార్ తో తీస్తూ, ఆ కలిపిన కథల్ని ఎలా నడపాలో కూడా తెలుసులేక పోయాడు. పురాతన రజనీకాంత్ బాషా టెంప్లెట్ ని వాడేశాడు. దీంతో నేటి సినిమాలాగా అన్పించడానికి ఈ కథ మొహమాట పడి ఇంటర్వెల్ కే తప్పుకుంది. అయితే సదరు తెలుగు సినిమాల్ని చూసినా చూడకపోయినా కన్నడ ప్రేక్షకులు తమ దివంగత స్టార్ సినిమా కాబట్టి ఆ భావోద్వేగాలతో హిట్ చేసేస్తారు.


        తెలుగు ప్రేక్షకులతో ఈ పాజిటివ్ ఫలితాలుండవు. తెలుగులో చూసిన నాల్గైదు సినిమాలిందులో వున్నాయి కాబట్టి- ఇవి  బాషా నీడన తలదాచుకున్నాయి కాబట్టి, జేమ్స్ గా మారిన బాషా కోసం పోటీలు పడి వచ్చే అవకాశం లేదు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో జేమ్స్ అనే సైనికుడు, అతడి దేశభక్తి, ఆ దేశభక్తితో మాఫియాల్నీ, రౌడీల్నీ కాల్చి చంపే పోరాట శక్తీ చూడాలి. ఎందుకిదంతా అంటే రివెంజీ కథ కోసం. కనుక సైనికుడు, దేశభక్తి, రివెంజీ కలిపితే పాత తరహా మసాలా యాక్షన్ ఫార్ములా జేమ్స్ అయింది.

        దీనికి పునీత్ రాజ్ కుమార్ పాత్ర, నటన ఏమాత్రం సహకరించవు. భావోద్వేగ సన్నివేశాలు అతి బలహీనపడి, చీటికీ మాటికీ యాక్షన్ దృశ్యాలు వచ్చేస్తూంటాయి. మంచి బాడీ వున్న పునీత్ ఫైటింగ్ స్కిల్స్, డాన్సింగ్ స్కిల్స్ ఇవే హైలైట్ గా వుంటాయి. మిగిలిన విషయాలన్నీ అతుకుల బొంతలా వుంటాయి. పునీత్ కీ డూప్ ని వాడి అవసరమైన సీన్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇంత స్టార్ మూవీలో ఫ్యాన్స్ ని నవ్వించడానికో, ఆనంద పర్చడానికో ఎంటర్ టైన్మెంట్ అనేది కూడా లేకుండా సినిమా తీశాడు దర్శకుడు.

        ఇక హీరోయిన్ ప్రియా ఆనంద్ అద్భుత సౌందర్య రాశిలా మెరిసిపోతుంది. కానీ కథలో అదృశ్యమైపోతుంది. చివర్లో ఒక ట్విస్టు కోసం ప్రత్యక్ష మవుతుంది. ఇలా ఆమె ఒక పార్ట్ టైమ్ పాత్ర చేస్తుంది. తెలుగు హీరో శ్రీకాంత్ మాఫియాగా ఫర్వాలేదన్పించుకుంటాడు. పునీత్ సోదరులు శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ లు ఫ్యాన్స్ కి హుషారు తెప్పించడం కోసం దర్శనమిస్తారు. వీళ్ళుగాక ఇంకా అనేకమంది కన్నడ నటులతో ఈ సినిమా కిటకిటలాడుతూ వుంటుంది. ప్రొడక్షన్ విలువల కోసం భారీగా ఖర్చు చేశారు. కానీ చరణ్ రాజ్ సంగీతంలో పాటలు అంతంత మాత్రంగా వున్నాయి.  

        మాఫియాలకో నీతి వుంటుంది. అదేమిటంటే, తమ మధ్య గొడవల్లో కుటుంబాల్ని టార్గెట్ చేసుకో కూడదని. హిందీలో ఈ నీతితోనే  చూపిస్తారు. ఈ కన్నడలో మాఫియా నీతి లేకపోగా, పాత మాఫియా కథ చూపించారు.

—సికిందర్  

 

15, మార్చి 2022, మంగళవారం

1148 - స్క్రీన్ ప్లే సంగతులు 2

బిగినింగ్ గాథ : 1975 లో ప్రభాస్ ఒక పేరున్న పామిస్ట్ (హస్తసాముద్రికుడు). గురువు కృష్ణం రాజు దగ్గర శాస్త్రం నేర్చుకున్నాడు. అత్యున్నత స్థానాల్లో వున్న వాళ్ళు కూడా అతడికి చేయి చూపించుకుంటారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా చేయి చూపించుకుంటుంది. ఆమె చేయి చూసి మీరు ఎమర్జెన్సీ విధిస్తారని చెప్పేస్తాడు. ఇందిరాగాంధి అవాక్కవుతుంది. ఈ సంచలన జోస్యం చెప్పిన తనని మీడియా చుట్టు ముట్టకుండా, పబ్లిసిటీని నివారించడానికీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అజ్ఞాతంలో విదేశాలు తిరుగుతూ ఇటలీలో రోమ్ నగరానికి చేరుకుంటాడు. ఇలా వివిధ దేశాల్లో అమ్మాయిలతో ఫ్లటేషన్షిప్ అని చెప్పి ఎంజాయ్ చేసి వస్తాడు. అతడి జాతకంలో పెళ్ళి యోగం లేనందువల్ల అమ్మాయిల్ని ఎంజాయ్ చేస్తూంటాడు. రోమ్ లో తల్లి భాగ్యశ్రీ, స్నేహితుడు కునాల్ రాయ్ కపూర్ వుంటారు. ఒకరోజు రోమ్ లోనే ట్రైన్లో పూజా హెగ్డేని చూసి ప్రేమలో పడతాడు. ఆమె డాక్టర్. ఆమె పెదనాన్న సచిన్ ఖేడేకర్ నిర్వహిస్తున్న  హాస్పిటల్లో పని చేస్తూంటుంది.  

       లా ట్రైన్లో పూజాతో ప్రభాస్ ప్రేమలో పడ్డ పై సన్నివేశంతో స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ మలుపు వచ్చి బిగినింగ్ విభాగం ముగుస్తుంది. ఈ విభాగంలో ప్రధానంగా ప్రభాస్, పూజా, కృష్ణంరాజు ఆపరేటింగ్ పాత్రల పరిచయం వుంది. ప్రభాస్ ఫేమస్ పామిస్ట్. అతడి జోస్యం తప్పవదు. ఇందిరాగాంధీకి కూడా జోస్యం చెప్పాడు. త్వరలో ఎమర్జెన్సీ విధిస్తారన్నాడు. ఎమర్జెన్సీని ముందే వూహించాడు. అయితే ఇందుకు ఏ మాత్రం ఆందోళన చెందలేదు. నేను ఎమర్జెన్సీ విధించడమేమిటి, ఆ అవసరం ఎందుకొస్తుందని ఇందిర కూడా అడగలేదు. అడగకపోయినా అలాటి  పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అనుకోలేదు. అంటే ఆమె ఎమర్జెన్సీ విధిస్తానని ముందు  తెలిసినా విధించాలనే అనుకుందా? ప్రభాస్ అలా చెప్పాక ఆమె ఏమనుకుంది? ఇది స్పష్టమవక పోతే ఇందిర పాత్ర ఎలా అర్ధమవుతుంది? కేవలం ప్రభాస్ బిల్డప్ సీను కోసమే ఇందిర పాత్రని ఇలా బలిపెట్టారా స్వైరకల్పనలతో? రచనతో కల్పన చేయవచ్చు గానీ స్వైరకల్పనలు చేయకూడదేమో.

       ప్రభాస్ కూడా ఇందిర గురించి అంత జోస్యం చెప్పాక నిజంగా దాన్నుంచి వచ్చే పబ్లిసిటీని  తప్పించుకోవాలనే ఉద్దశంతోనే దేశం విడిచి వెళ్ళిపోయాడా, లేక ఎమర్జెన్సీకి భయపడి పారిపోయాడా? అసలు ప్రభాస్ ఇలా జోస్యం చెప్పాడని మీడియాకి ఎలా తెలుస్తుంది- పబ్లిసిటీతో అతను వీవీఐపీ అయిపోవడానికి? ఇలా లాజిక్ లేని ఫాల్స్ బిల్డప్పులతో పాత్ర నిలబడుతుందా?

       ఎమర్జెన్సీని ముందే వూహించిన ప్రభాస్ అంత ప్రమాదం రాకుండా ఇక్కడే వుంది ఏం చేయాలో ఆలోచించడమా, లేక దేశ ప్రజల్ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి విదేశాలకి పారిపోవడమా? ఏం చేస్తే అతడి హీరో క్యారక్టర్ ఔరా అన్పించుకుంటుంది? ఇలా పైపైన రాసేసి పైపైన తీసేస్తే పానిండియా స్టార్ పాత్ర చిత్రణవుతుందా? గొప్ప పీరియడ్ గాథ కోసం ఎమర్జెన్సీని భాగం చేసి పాత్రని హాస్యాస్పదం చేయడం భావ్యమేనా? క్వాలిటీ మేకింగ్ కి క్వాలిటీ రైటింగ్ లేకుండా బల్క్ రేటింగ్ ఆశిస్తే ఎలా? సినిమా ఫ్లాపైందని ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

పాత్రచిత్రణ ఇంకా...

పెళ్ళి రేఖ లేని ప్రభాస్ ఫ్లటేషన్షిప్ పేరుతో విదేశాల్లో అమ్మాయిల్ని ఎంజాయ్ చేస్తాడు. తను జోస్యం చెప్పిన ఎమర్జెన్సీతో దేశం కల్లోలమైతే హీరో అనే వాడు ఎలా ఎంజాయ్ చేస్తాడు. ఇక ఫ్లటేషన్షిప్ (Flirtationship) నే తీసుకుంటే,  పెళ్ళి యోగం లేని పామిస్టు ఏం చేస్తాడు? పామిస్టుగా తన సమస్యకి పరిష్కారం  చూసుకుని పెళ్ళి చేసుకోలేని వాడు వరల్డ్ ఫేమస్ పామిస్టు ఎలా అవుతాడు (అసలు ఈ మొత్తం గాథలో జోస్యాలే చెప్తాడు, వాటిలో సమస్యలుంటే పరిష్కారాలు చెప్పి సక్సెస్ అయినట్టు ఒక్క సీను కూడా చూపించ లేదు). ఇలా పెళ్ళియోగం లేదనిఅనుకుంటున్న వాడు అమ్మాయిల్ని భ్రమల్లో పెట్టి, కోరికలు తీర్చుకుని, ఏమంటే  ఫ్లటేషన్షిప్ అని అప్పుడు చెప్పి, అమ్మాయిల్ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి వెళ్ళిపోవడం సబబైన క్యారక్టరైజేషనేనా?

       అసలు ఫ్లటింగ్ కి అర్ధం తెలుసో లేదో? ఫ్లట్ అంటే సరసం, సరసాలాడ్డం, చిలిపి ప్రవర్తన మాత్రమే. అదే క్రష్ అయితే ఫీలింగ్స్ వుంటాయి, డేటింగ్ కి దారితీస్తుంది, సెక్స్ వుంటుంది. ఫ్లటింగ్ లో ఫీలింగ్స్ వుండవు, డేటింగ్ వుండదు, సెక్స్ వుండదు. సరదాగా చిలిపిగా సరసాలాడ్డమే వుంటుంది. ఫ్లటింగ్ ఎప్పుడూ శారీరక సంబంధానికి దారి తీయదు. శారీరక సంబంధానికి దారితీస్తే అది డేటింగ్ గా మారుతుంది. డేటింగ్ లో ఏదో ఆశించడం వుంటుంది, ఫ్లటింగ్ కి ఆశించడం వుండదు. ఫ్లటింగ్ సైకాలజీ ఇదైతే ప్రభాస్ చేసింది వేరు. ఇలా క్యారక్టర్ని దిగజార్చి చూపించాలనుకుంటే పాత్రకి కావాల్సింది ఒన్ నైట్ స్టాండే తప్ప ఫ్లటింగ్ కాదు. అప్పుడు కనీసం అమ్మాయిలు వంచనకి గురి కాకుండా వుంటారు. ఇంటలిజెంట్ రైటింగ్ చేస్తే సినిమా ఆడదా? ఎంతో కొంత ఇంటలిజెంట్ రైటింగ్ చేసినవే ఆడుతున్నాయి కదా?

మదర్ బాండింగ్

ఈ గాథలో ప్రభాస్ పాత్రని ఐన్ స్టైన్ ఆఫ్ పామిస్ట్రీ అనీ, నాస్టర్ డామస్ ఆఫ్ ఇండియా అనీ పొగిడారు. అదే జ్యోతిష గురువు కృష్ణం రాజు గారు బ్రహ్మం గారు ఆఫ్ వెస్ట్ అని ఎందుకు పొగడలేదో? ప్రొఫెషనల్ జెలసీయా? దేశభక్తితో, రాష్ట్ర భక్తితో మనకైతే ప్రభాస్ పాత్ర పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగారే. ఐన్ స్టైనెవరో, నాస్టర్ డామసెవరో మనకేమాత్రం తెలీదు.

       ఇలా ప్రభాస్ లోకం చుట్టిన తర్వాత రోమ్ లోని అద్భుత బంగళాలో మదర్ భాగ్యశ్రీని కలుసుకుంటాడు. భాగ్యశ్రీని బాడీ షేమింగ్ చేయడం సరికాదు. కొడుకు కంటే తల్లి యంగ్ గా కన్పిస్తే తప్పేమిటి? ఆ కొడుక్కి గర్వకారణం. భాగ్యశ్రీ ప్రభాస్ కంటే పదేళ్ళు పెద్దదే. ఆమె యూత్ ఫుల్ నెస్ ని కాంప్లిమెంట్ చేయాలి. డిజైనర్ కథా కథనాల్లో డిజైనర్ పాత్రలే వుంటాయి. కాకపోతే భాగ్యశ్రీ మేకప్ బాగాలేదు. డీఐలో ప్రేమ కొద్దీ రుద్దినట్టుంది కలరిస్టు.

       ఇది కాదు విషయం, ఈ మదర్ తో బాండింగ్ ఏమిటనేది. బాండింగ్ కనిపించదు, గాథతో సంబంధం లేని పొడిపొడి సీన్లే వుంటాయి. మదర్ కన్పిస్తే చాలు అదే సెంటిమెంటు అన్నట్టుంది. ఈ మదర్ కి గాథలో, కొడుకు కష్టాల్లో ఏ సంబంధమూ  వుండదు. గీతాంజలి లో ఇలా కాదు-కథలో ఇన్వాల్వ్ చేస్తూ నాగార్జు నకీ, మదర్ (సుమిత్ర) కీ బలమైన బాండింగ్ వుంటుంది. యూట్యూబ్ లో ఈ సినిమా చూసిన హర్షవర్ధన్ అనే యువ ప్రేక్షకుడు ఇలా ఫీలయ్యాడు-When Nagarjuna say "amma annam pedatavaa " dialogue I couldn't controll my tears.

        ఈ రోజుల్లో యువ ప్రేక్షకులకి డ్రామా కదిలించ దనుకోవడం పొరపాటు. డ్రామాకి యూత్ ఎలా కనెక్ట్ అవుతున్నారో యూట్యూబ్ లో పాత సినిమాలకి పెడుతున్న కామెంట్సే చెప్తాయి. రాధేశ్యామ్ లాంటి రోమాంటిక్ ట్రాజిక్ డ్రామాలో ఒక్క కంట తడిపెట్టించే సీనూ లేదు. అలనాటి హాలీవుడ్ స్టార్ ఇంగ్రిడ్ బెర్గ్ మాన్, సినిమాలో అయిదుసార్లు ఏడ్పిస్తే సినిమా హిట్టవుతుందని చెబుతూండేది.
గీతాంజలి కి మరి కొన్ని యువ కామెంట్లు చూద్దాం-  
veerabhadram kastoori
చక్కని ప్లేమకావ్యం ఆయుస్సు తగ్గించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు.
Sagar u
More than 300 times chusa present 2021 Feb. Awesome acting and songs
Anitha anu Anu
From Karnataka.. Superb movie.. Heart melting climax...
Sanjitha Kayyala
Watching this movie for 1st time......sprrrrrr movie...makes me addicted 2 this.
Srinivas challa
Can't describe about this movie. It is a wonderful and heart touching movie magic by Mani Ratnam and Ilairaja Gods.
Prasad kdgamer
కన్నీళ్లు ఆగలేదు, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు.
Unil manohar aravind peteti 
Always in tears while watching this scene. Hats off to Maniratnam sir for his amazing direction and ilairaja for his great tunes and bgm.
Chaitu k
No one can stop tears...my lovely scene
Prati saari edustaanu ee scene chuste...I love this film...

పూజా హెగ్డే పాత్ర

 గీతాంజలి లో డాక్టర్ కూతురైన హీరోయిన్ గిరిజ క్యాన్సర్ పేషంట్ అయినట్టే, పూజా హెగ్డే కూడా క్యాన్సర్ పేషంటే. డాక్టర్ గా ఈమెకి పెదనాన్న సచిన్ ఖెడేకర్ వుంటే, తను కూడా డాక్టరే. ఇలాటి గీతాంజలి పోలికలు చాలా వుంటాయి మున్ముందు కూడా.

        ఈ బిగినింగ్ విభాగంలో రైల్లో పరిచయమై ప్రయాణికుల్ని గాభరా పెట్టే పని చేస్తుంది. కదులుతున్న రైల్లో వింటర్ స్కార్ఫ్ నడుంకి కట్టుకుని, రెండో చివర ప్రయాణికులకిచ్చి, స్కూబా డైవింగ్ చేస్తున్నట్టు ఒక్కసారి డోర్ లోంచి బయటికి వేలాడుతుంది. డేంజరస్ ప్లేని ఎంజాయ్ చేస్తుంది. ఆమె పడిపోకుండా పట్టి వుంచుతూ వాళ్ళు నానా పాట్లు పడతారు. ఇలా మిస్చీవస్ నేచరున్న పాత్రగా పరిచయ మవుతుంది.

        తర్వా త ఇదే అడ్వెంచర్ ప్రభాస్ తో చేస్తుంది. స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ముగుస్తూ, ఇది ఇద్దర్నీ కలిపే కీలక ప్లాట్ పాయింట్ వన్ మలుపు దృశ్యం. క్లాసిక్ లుక్ తో పురాతన ట్రైను, అద్భుత ప్రకృతి దృశ్యం, కింద లోయ పైన ఆకాశం, ఇద్దరూ రైలు బయట వేలాడుతూ టైటానిక్ మార్కు  ఐకానిక్ మూమెంట్. మంచి లిఫ్ట్ ఇరిగేషన్. బట్ వాటెబౌట్ రైటింగ్?

        మళ్ళీ రైటింగ్ దగ్గరే స్క్రీన్ ప్లేకి ఆయువు పట్టు అయిన ఈ పీపీ వన్ మలుపు కూడా తేలిపోయింది. ఈ ఐకానిక్ మూమెంట్ ఈ గాథ హీరో అయిన ప్రభాస్ కే ఎక్స్ క్లూజివ్ గా వుండాలి. ప్రభాస్ కే రిజర్వ్ చేసి అట్టిపెట్టేయాలి. సినిమాకే హైలైట్ అయిన ఈ ఐకానిక్  మూమెంట్ ని- లేదా బిగ్ ఈవెంట్ ని- ముందు వేరే పాత్రలతో చూపించకూడదు. ముందు వేరే పాత్రలతో చూపించేశాక తర్వాత ప్రభాస్ తో చూపిస్తే ఎంగిలి పడుతుంది సీను. హీరోకి ఎంగిలి పడ్డ సీన్లు వుండకూడదు. ఇదే సీనుతో ముందు పూజాతో, ఎవరో ప్రయాణీకులతో అనుభవించిన థ్రిల్, నావెల్టీ, సర్ప్రైజ్ ఎలిమెంట్ వగైరా ప్రభాస్ తో రిపీట్ చేస్తే వుండవు. ఇదే జరిగింది.  

పోనీ ప్రభాస్ తో సెకెండ్ హేండ్ సీనుగా రాజీపడి ఇలా రిపీట్ చేసినప్పుడు, ఇందులో గాథ కి సంబంధించి ఏమైనా విషయం వుందా? డెప్త్ వుందా? డైరెక్షన్ వుందా? డైనమిక్స్ వున్నాయా? చిన్న చిన్న సినిమాల్లో ఎలా వున్నా, బిగ్ మూవీస్ కి ప్లాట్ పాయింట్ వన్ మలుపు సంఘటనతో వుంటుంది. భూమికని మహేష్ బాబు రక్షించుకొచ్చే సంఘటన ఒక్కడు లో వుంది. ప్లాట్ పాయింట్ వన్ ప్రధాన పాత్రకి ఓ సమస్య నిచ్చి, దాన్ని సాధించే గోల్ నేర్పాటు చేసేది. దీంతో ఫస్ట్ యాక్ట్ ముగిసి, సెకండ్ యాక్ట్ తో కథ/గాథ  ప్రారంభమవుతుంది.

        ముందు సీనుకీ ఈ సీనుకీ తేడా ఏమిటంటే, ఈ సీనులో ప్రభాస్ కూడా బయటికి వేలాడుతాడు. ప్రభాస్ తొలిచూపులో ప్రేమ ఎస్టాబ్లిష్ చేసేందుకు మాత్రమే ఈ సీనుంది. ఇంతకి మించి విషయం లేదు. అప్పుడు ఇదో సీనే కాదుగా? ఈ సీను ఇంకెక్కడైనా తీయొచ్చు, రోడ్డుమీదైనా. ట్రైనుమీద ఇంత సాహోసోపేత జర్నీలో పట్టు తప్పి ఆమె పడిపో బోకపోతే, ఇంత ఖర్చు పెట్టి ఇంత బిగ్ ఈవెంట్ దీనికి?

        ప్రేక్షకుల గుండె ఝల్లుమనేట్టు ఆమె పట్టు తప్పడం, గబుక్కున అతను పట్టుకోవడం లాంటి గాథకి- కాన్సెప్ట్ కి - ప్రతీకాత్మకంగా వుండే సన్నివేశ సృష్టి జరగనిది, సంఘటన జరగనిది ఈ పీపీ 1 మలుపుకి సార్ధకత లేదు. నిస్సారం.   

        పీపీ వన్ ఘట్టం సుడిగాలిలా మలుపు తిరిగి వెళ్ళి సెకండ్ యాక్ట్ లో పడేలా వుండాలంటాడు సిడ్ ఫీల్డ్. ప్రమాదవశాత్తూ ఇండియన్ మిసైల్ వెళ్ళి పాకిస్తాన్ లో పడ్డట్టున్నా ఫర్వాలేదు. పీపీ వన్ ఘటన సెకండ్ యాక్ట్ ఇగ్నైట్ అవడాని కుపయోగపడే మిసైల్ లాంటిదనుకోవచ్చు. ఇదేమీ సిడ్  ఫీల్డ్ సొంత కవిత్వం కాదు తీసి పారేయడానికి. అనేక గొప్ప సినిమాల్లో చూసిందే మధించి శాస్త్రం చేశాడు. శాస్త్రాలన్నీ రచయితలు, దర్శకులు సృష్టించిన సినిమాల్లోంచే వచ్చాయి. ఇది గుర్తు పెట్టుకోవాలి. పదార్ధం లేక శాస్త్రం లేదు. పానిండియా సినిమాలకి గొప్ప సినిమాల సశాస్త్రీయ గుణగణాలే కావాలి.

        పై ప్రతీకాత్మక సంఘటన హుక్ వేసి ప్రశ్నల్ని లేవదీస్తుంది. పూజా క్యారక్టరేమిటో ఇంకా పూర్తిగా మనకి తెలీదు. ప్రభాస్ కి పెళ్ళి యోగం లేదు. ఇలాటి వాడు ప్రేమలో పడ్డాడు, లోయలో పడిపోకుండా ఆమెని పట్టుకున్నాడు. ఈ కమిట్ మెంట్- తన జాతకం వీటితో ఎలా పోరాడతాడు? ఆమె లోయలోకి జారిపోకుండా కాపాడడంతో హీరోయిజం ఎలివేట్ అయింది. క్యారక్టర్ కలర్ఫుల్ గా మారింది. ఆడియెన్స్ విజిల్ వేసే మూమెంట్ ( “What is character but the determination of incident? What is incident but the illumination of character?” – Henry James). ఆమె విషయానికొస్తే, ఏదో జరగరానిది జరక్కపోతే ఆమె స్కూబా డైవింగ్ డేర్ డెవిల్రీకి ప్రయోజనం లేదు. కథంటే జరగడం, ఆ జరగడంలోంచి ప్రశ్నలు రేకెత్తడం కథనం. ఇక తర్వాత ఆమె క్యారక్టర్ తో బయటపడే క్యాన్సర్ అనే ప్లాట్ డివైస్ కి ప్రతీకాత్మకమే, ముందస్తు హెచ్చెరికే లోయ అనే మృత్యుముఖంలోకి ఆమె జారిపోబోవడం. ఇంకా ముందుకెళ్తే రేపు లోయలాంటి క్యాన్సర్ అనే మృత్యు ముఖంనుంచి  ఆమెని కాపాడ్డం అతడి బాథ్యతగా ఎస్టాబ్లిష్ అయ్యే  పీపీ వన్ సంఘటన!

కానీ జరిగిందేమిటంటే కథ అనుకుంటూ గాథ చేశారు. ఇందుకే పైన వివరించిన  విధంగా ప్లాట్ పాయింట్ వన్ లేదు. పాత్రల్ని పాసివ్ గా వుంచేసి, నడిపించేశారు. కథంటే ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ కూర్చోబెడుతుంది. గాథంటే స్టేట్ మెంట్. స్టేట్మెంట్ ఏం కూర్చోబెడుతుంది. అయినా గాథల్ని నిలబెట్టే సినిమాలు కూడా వున్నాయి. అవెలా  నిలబడతాయనేది వేరే టాపిక్. ఇప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని, ఇన్ని లోపాలతో  ఈ బిగినింగ్ విభాగం ఎంత బలంగా వుందో అంచనా కట్టు కోవచ్చు. రేపు మిడిల్ చూద్దాం.

—సికిందర్

13, మార్చి 2022, ఆదివారం

1147 : స్క్రీన్ ప్లే సంగతులు

స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే 36 ఏళ్ళు పడుతుందేమోనని, వచ్చే తరాలు చదువుకునే ప్రాచీన గ్రంథ కోశం అవుతుందేమోననీ భయపడాల్సి వచ్చింది. కథ రాయడానికి దర్శకుడికే 18 ఏళ్ళు పట్టినప్పుడు దాన్ని పరామర్శించడానికి 36 ఏళ్ళు పట్టడంలో ఆశ్చర్యం లేదు. కారణం,   స్క్రీన్ ప్లే సంగతులు ఎలా రాయాలో అంతు చిక్కకపోవడం. జాతీయ మీడియాలో వెలువడిన కొన్ని రివ్యూల్లో   సినిమా కథ అర్ధమవడం కష్టమై పోయిందన్నారు. అసలు  రాధేశ్యామ్ టైటిల్ తో కథకేం సంబంధమో తెలియలేదన్నారు. ఇంత ప్రతిష్టాత్మక పానిండియా మూవీకి ప్రముఖ జాతీయ డిజిటల్ మీడియా, పెద్ద పత్రికలూ కలిసి నిర్మొహమాటంగా 1, 1.5 రేటింగ్స్ మాత్రమే ఇచ్చాయంటే షాకింగ్ గానే వుంటుంది. దీనికి దర్శకుణ్ణి ఒక్కణ్ణే బాధ్యుణ్ణి చేయనవసరం లేదు. కథ అంతిమ రూపం తీసుకునే వరకూ ఎందరి జోక్యాలు, జోస్యాలు వుంటాయో తెలియనిది కాదు. ఈ కథతో ప్రధాన సమస్య ఏమిటంటే, ఇది కథ కాకుండా గాథ కావడం! తయారు చేసుకునే కథలన్నీ కథలే అనుకోవడంతో, వాటిలో మాటువేసి వుండే గాథల్ని కథల్లాగే ట్రీట్ చేయడం వల్ల ఇలా మొదటికే మోసం వస్తోంది.  

        దీంతో రాధేశ్యామ్ స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే విషయాన్ని సమూలంగా గాథలా మార్చి రాస్తూ వివరించాల్సిందే. ఇలా చేస్తే చదవడానికి భారమైపోతుంది. కనక సంక్షిప్తంగా ఆపేరేటింగ్ టూల్స్ మాత్రమే చూద్దాం : 1. రోమాన్స్ లో ఇది రోమాంటిక్ కామెడీ కాదు, రోమాంటిక్ డ్రామా జానర్. 2. రోమాంటిక్ డ్రామాల్లో హీరో హీరోయిన్లవి పాసివ్ పాత్రలై వుంటాయి, 3. రోమాంటిక్ డ్రామాలు గాథల తరగతికి చెందుతాయి, 4. గాథ ఐడియా లేదా కాన్సెప్ట్ విషయ గాంభీర్యంతో వుంటుంది, 5. గాథ కూడా త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో వుంటుంది, 6. గాథ ముగింపు విషాదాంత మవచ్చు, లేదా సుఖాంత మవచ్చు.

ముందుగా కాన్సెప్ట్ సంగతి
మన రాత మన చేతుల్లో వుండదని, చేతల్లోనే వుంటుందనీ చెప్పడం కాన్సెప్ట్. ప్రభాస్ ప్రేమించిన పూజా ప్రాణాపాయంలో వుంటుంది. ఇది విధి రాత అనుకుని సరెండర్ అవకుండా, పొరాడి విధిని జయించాలని కాన్సెప్ట్ అనుకుని కథనం చేశారు. ఈ కాన్సెప్ట్ తప్పయితే, దీనికేం చేశారంటే- ఈ కాన్సెప్ట్ కి జ్యోతిషం వర్సెస్ సైన్సు పోరాటమని ఇంకో కాన్సెప్ట్ జోడించారు. ఈ కాన్సెప్ట్ కూడా తప్పే. అసలు రెండు వేర్వేరు కాన్సెప్ట్స్ తో ఒక గాథ ఎలా వుంటుంది. కథ కూడా వుండదు. అలాటిది రెండూ తప్పుడు కాన్సెప్టులే జత కలిస్తే గాథ పరిస్థితేంటి?

        ఈ జ్యోతిషానికీ సైన్సుకీ పోరాటమనే రెండో కాన్సెప్ట్ తో, జ్యోతిష గురువుగా కృష్ణం రాజు వచ్చేసి, ఒరిజినల్ కాన్సెప్ట్ లో జోక్యం చేసుకుంటూ వుండడంతో, అసలేం గాథ చెప్తున్నారో అర్ధంగాని గందరగోళం నెలకొంది.

        ఈ జ్యోతిషం వర్సెస్ సైన్స్ రెండో కాన్సెప్టులో సైన్స్ కంటే జ్యోతిషం గొప్పదని నిరూపించడం ఉద్దేశం. ఇదే పాయింటు కృష్ణం రాజు శిష్యుడైన ప్రభాస్ కూడా లేవదీస్తూ డాక్టర్ తో ఘర్షణకి దిగుతాడు. ఆ డాక్టర్ కూడా అర్ధం లేకుండా వాదిస్తాడు. ఒక పక్క పూజా నయం కాని క్యాన్సర్ తో వుంది, ఇంకో రెండు మూడు నెలల్లో చనిపోతుందని డాక్టర్ అంటాడు. ఇంతకి ముందు ఆమె హస్త రేఖల్లో ప్రభాస్ దీర్ఘాయుష్షు చూశాడు కాబట్టి ఆమె చనిపోదని, బ్రతుకుంటుందనీ వాదిస్తాడు.      

        ప్రభాస్ జోస్యం సంగతెలా వున్నా, వైద్యపరంగా ఆలోచిస్తే ఆమె బ్రతుకుతుందని ప్రభాస్ అనడం పాజిటివ్ విజనేగా? రోగికి నువ్వు బ్రతుకుతావని ఆత్మవిశ్వాసం కల్పించడం నెగెటివ్ విజన్ ఎలా అవుతుంది. కౌన్సెలింగ్ గాక మూఢత్వ మెలా అవుతుంది. ఇక్కడ జ్యోతిషం వచ్చేసి సైన్స్ కెక్కడ అడ్డు పడింది. నీ జ్యోతిషంతో రోగికి మోసం చేస్తున్నావని డాక్టర్ అనడమేమిటి? ప్రభాస్ బ్రతుకుతుందని జోస్యం మాత్రమే చెప్పాడు- చెప్పి, ఈ రోగానికి మందులు అక్కర్లేదనీ, ఉంగరాలూ తాయెత్తులూ కడతాననీ అనలేదే? డాక్టర్ ఎందుకలా రెచ్చిపోవడం.

కాన్ఫ్లిక్ట్ సంగతి

కాబట్టి ఇలా ఈ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెకండాఫ్ గాథని ఇలాగైనా నడిపించగల కాన్ఫ్లిక్ట్ లో కామన్ సెన్స్ లోపించడంతో - జ్యోతిషం వర్సెస్ సైన్స్ రెండో కాన్సెప్ట్ పూర్తిగా విఫలమైంది. మళ్ళీ ప్రభాస్ ఈ కాన్సెప్ట్ మీంచి ఒరిజినల్ కాన్సెప్ట్ కొచ్చి - ఇది విధికీ ప్రేమకూ మధ్య యుద్ధమని ఫైనల్ గా తేలుస్తాడు ఇంటర్వెల్లో! విధికీ ప్రేమకూ యుద్ధం కూడా ఎలా అయింది? పూజా హస్త రేఖలు బాగానే వున్నాయే దీర్ఘాయుష్షుని  సూచిస్తూ? ఆమె జీవిత రేఖ సరిగా లేకుండా, దీనికి అనుగుణంగానే  క్యాన్సర్ వచ్చుంటే, డాక్టర్ చెప్పినట్టు రెండు మూడు నెలలే బ్రతుకుతుందనుకుంటే- అప్పుడు ఈ విధిని ఎదిరించడానికి ప్రేమకూ విధికీ యుద్ధమని అంటే అర్ధముంటుంది గాని!

        అంటే ఆమెకి దీర్ఘాయుష్షు వుందని ప్రభాస్ చెప్పిన జోస్యం తప్పని తేలిందన్న మాట. వెనుక సీన్లో ఆమె చేయిచూసి అద్భుత భవిష్యత్తు వుందని చెప్తున్నప్పుడు, ఆమె ముక్కులోంచి రక్తపు చుక్క  అదే అరచేతిలో రాలి అప్పుడే పడుతుంది క్యాన్సర్ అన్నట్టుగా. ఇలా ఆ క్షణంలోనే అతడి జోస్యం తప్పని తేలిపోలేదా? ఆమె జీవితరేఖని ఆటంకపర్చే ఈ ప్రాణాంతక అనారోగ్యాన్ని చూడకుండా సంపూర్ణ ఆయుష్షని ఎలా అంటాడు?

        దీనికంటే వెనుక సీన్లో- రైల్లో ప్రయాణికులు చేతులు చాపి జాతకాలు చెప్పమన్నప్పుడు, ఆ చేతుల్లోకి చూస్తూ అంత మందికి చెప్పలేక, రైలు దిగి వెళ్ళిపోతాడు. రైలు వెళ్ళిపోతుంది. వెంటనే ప్రమాదం పసిగడతాడు. తను చూసిన హస్త రేఖల్లో వాళ్ళకి మృత్యువే పొంచి వుందని ఇక రైలాపడానికి పరుగు దీస్తాడు. రైలు యాక్సిడెంట్ అయి వాళ్ళంతా చనిపోతారు. ఇలా తన జోస్యం నిజమైంది. మరి ఇదే జ్యోతిష పాండిత్యంతో పూజా చేతి గీతల్లో క్యాన్సర్ ని - మృత్యువుని ఎందుకు చూడలేకపోయాడు.

     కాబట్టి పూజా జాతకరీత్యా విధికీ ప్రేమకూ యుద్ధం కాన్సెప్ట్ కూడా కాలేదిది. అసలు సంగతేమిటంటే, తన చేతిలోనే పెళ్ళి రేఖ లేదని ప్రభాస్ కి తెలుసు. దీంతో ఈ విధినెదిరించాలని ఎప్పుడూ అనుకోలేదు. విధి దాకా ఎందుకు, ఒక ప్రసిద్ధ పామిస్టుగా తన సమస్యని తానే పరిష్కరించుకో లేనప్పుడు ఇతరుల సమస్యల్నేం పరిష్కరిస్తాడు. భవిష్యత్తుని మార్చుకునే అవకాశం వుందని జ్యోతిష శాస్త్రం చెప్పడం లేదా? ఇది తెలియనట్టు కామన్ మాన్ లాగా బిహేవ్ చేయడమేమిటి.

ప్రభాస్ సంగతి

    ఇలా తనకి పెళ్ళి యోగం లేదనుకుంటున్నాడు గనుక, అమ్మాయిల్ని భ్రమల్లో పెట్టి కోరికలు తీర్చుకుని వదిలేస్తూ వుంటాడు. ఇది చాలా బ్యాడ్ క్యారక్టర్ ప్రభాస్ కి. ఇంతకంటే డ్యామేజ్ ఏం కావాలి గాథకి. పూజాని చూశాక ప్రేమలో పడతాడు. ఇప్పుడామెని పెళ్ళి చేసుకోవాలంటే తన పెళ్ళి రేఖే అడ్డు. అటువంటప్పుడు ఇప్పుడైనా ఒక గొప్ప హస్త సాముద్రికుడుగా తన సమస్యని పరిష్కరించుకోక, ఏదో విధి అంటూ పూజాకి ముడిపెట్టి ప్రేమ పోరాటమనడ మేమిటి?

        పూజా అనారోగ్యం విషయమే చూస్తే, స్పిరిచ్యువల్ గురువులే (బ్రహ్మకుమారి శివానీ, జగ్గీ వాసుదేవ్) ఏమంటారు. చాలా అనారోగ్యాలు ఆలోచనా తీరు మార్చుకుంటే నయమవుతా యంటారు. కానీ ప్రాణాంతక రోగాలు ఆలోచనా తీరు మార్చుకుంటేనో, దైవ ప్రార్ధనలు చేస్తేనో నయం కావంటారు. కాబట్టి ఈ ప్రయోగాలు మాని వైద్యం చేయించుకో మంటారు. అందుకని ప్రభాస్ ఆమె క్యాన్సర్ సంగతి డాక్టర్ కి వదిలేయాలి. ఆమెకి విధియే చుట్టుముట్టిందని అనుకుంటే, వైద్య సాయంతోనే ఆ విధితో పోరాడాలి తప్ప మాయలు మంత్రాలతో కాదు. కనుక ఆమెని డాక్టర్ కి వదిలేసి, తన చేతి రాతేంటో దాని సంగతి చూసుకోవాలి.     

            విధి అనే భావజాలం ముసుగేసిన దేవుడి బాక్సాఫీసు ఫార్ములాగా సినిమాలకి బాగానే సక్సెస్ నిస్తోంది. అయితే అసలు విధి అంటే ఏమిటి? మన పాత కర్మలే తిరిగి మన ముందుకొచ్చి సైల్యూట్ కొట్టడం. చేసింది మంచి కర్మలైతే మంచి రోజుల్ని విధి గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. చేసినవి చెడు కర్మలైతే చెప్పుల దండ మెళ్ళో వేసి వెళ్ళి పోతుంది. ఈ పని చేసేది పైన కూర్చుని ఎవరో కాదు. విధి, విధాత మనమే. ఉద్ధరించుకునేదీ, వాటం చూసి  వధించుకునేదీ మనమే. చెడు రోజులొస్తే, చేసిన చెడు కర్మల్ని మించేలా మంచి కర్మలు చేసినప్పుడు-  మంచి రోజులొచ్చేస్తాయి. ఇంతే, ఇంతకంటే రాకెట్ సైన్స్ లేదు. కర్మల బ్యాలెన్సింగే జీవితం.

        మన రాత మన చేతుల్లో వుండదని, చేతల్లోనే వుంటుందనీ చెప్పడమే రాధేశ్యామ్ కాన్సెప్ట్ అయితే, ప్రభాస్ ఎక్కడా తన విషయంలో గానీ, పూజా విషయంలో గానీ చేతల్లోకి దిగడు! ఈ లోగా డాక్టరే ప్రకటిస్తాడు క్యాన్సర్ కి మందు వచ్చిందని! అంటే సైన్సే  గెలిచిందా? ఇంత గందరగోళంగా వుంటే ఎలా!

        ఇలా రెండు లోపభూయిష్ఠ కాన్సెప్టుల్ని కాక్ టైల్ చేస్తూ ఒక ఒరలో ఇమిడ్చినప్పుడు, ఆ ఐడియా దశలోనే ఫ్లాప్ ని పసిగట్టి వుండాలి, ఐడియాని విస్తరించి గాథ చేసుకునే దాకా ఎందుకు. బ్రహ్మోత్సవం చూడలేదా? ఇలాటిదే. ఈ నిర్మాణం లేని ఐడియాతో గాథ చేసిన విధానానిక్కూడా అదృష్ట రేఖల్లేవు. ఇందులోకి వెళ్ళడం ఆపుదాం. ఇప్పటికే హెవీ అయివుంటుంది. ఇక్కడితో ఆపి, రేపు కథా (గాథా) కథనాల స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. అది తేలికగా, సరదాగా వుంటుంది.

—సికిందర్