రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, సెప్టెంబర్ 2021, బుధవారం

 


Tuesday, January 17, 2017

సినిమా కథ రాయడానికి చక్కగా కూర్చుని, కాగితం పై భాగాన రాముడో కృష్ణుడో, ముత్యాలమ్మో మైసమ్మో ఇష్టదైవ నామ స్మరణం చేసుకుని, రాయడం మొదలెట్టినప్పుడు, ఆ స్మరించుకున్న దైవాలు ఎక్కడ్నించో కాదు- ఆ రాసుకున్న కాగితం పై భాగం అక్షరాల్లోంచే తొంగి తొంగి చూస్తూంటారు-  మనోడు ఏం రాస్తున్నాడని కాదు, ఎలా రాస్తున్నాడని. వీణ్ణి ఎలా ఎక్కడ సెట్ చేయవచ్చా అని. ఓం నమఃశ్శివాయ అని శ్రీకారం చుట్టి ఆ దేవుణ్ణి మర్చిపోతే కాదు- దేవుళ్ళకో ప్రోగ్రాం ఇచ్చేశాక వాళ్ళు పని మొదలెట్టేసుకుంటారు. కోటి రూపాయల సినిమాకి వీణ్ణి అడ్జెస్ట్ చేస్తే సరిపోతుందా, చిరంజీవి 151వ రేంజికి  సెట్ చేయాలా అని గమనిస్తూంటారు. కాబట్టి గిల్లుకున్నాక ఈ రాడార్ పర్యవేక్షణ నుంచి తప్పించుకోలేరు. ముందే తాము ఏ తరగతికి చెందుతారో నిర్ణయించుకుని ఆ తర్వాత గిల్లుకుంటే  ఏ ఇలవేల్పులైనా  ఇంప్రెస్ అవుతారు. 

         తరగతులు మూడు-  సెల్ఫ్ స్టార్టర్, కిక్ స్టార్టర్, క్లిక్ స్టార్టర్ అన్నవి. ఏ తరగతికి చెందితే ఆ తరగతికే కట్టుబడి వుండాలి. ఈ తరగతిలోంచి ఆ తరగతి గదిలోకి, ఆ తరగతి లోంచి ఈ తరగతి గదిలోకీ రాకపోకలు సాగిస్తే  అవన్నీ కలిసి ఏ తరగతీ కాకుండా చేస్తాయి.

          ఒక్కో తరగతిని చూద్దాం : 
సెల్ఫ్ స్టార్టర్ – దీనికి పెద్దగా రచనా జ్ఞానం అవసరం లేదు. ఈ విధానంలో కథకి ఓ పాయింటు దొరుకుతుంది గానీ, పూర్తి కథ వుండదు. ఎలా చేసుకోవాలో తెలీదు. ఆ పాయింటుని  పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి సీన్లు రాసుకుంటూ పోతూంటే కథ అదేవస్తుంది. అప్పుడప్పుడు పాయింటు ఆగుతూంటే వేరే సీన్లతో భర్తీ చేసుకోవచ్చు. బారెడు  కామెడీ సీన్లో, లవ్ సీన్లో, ఫైట్సో పెట్టుకోవచ్చు. 

     ఏది ఎలా తోస్తే అలా రాసుకుంటూ పోవడమే ఈ సెల్ఫ్ స్టార్టర్ విధానం. చివరి సీనుకి వచ్చేటప్పటికి పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు. అక్కడ కథని తేల్చి చెప్పామా లేదా అన్నదే స్క్రీన్ ప్లే. End justifies the means అనడం లాంటిదన్న మాట. హైదరాబాదు నుంచి ఒక రూటులో బెజవాడ వెళ్లకపోయినా, డొంక దారులు పట్టుకునైనా బెజవాడ ముంగిట వాలామా లేదా  అని దబాయించడం లాంటిదన్న మాట. పాయింటుకి చేరామా లేదా అన్నదే పాయింటు, ఎలా చేరామన్నది కాదు. ఇందుకు ఉదాహరణ కావాలంటే ‘నందినీ నర్సింగ్ హోం’ లాంటివి కన్పిస్తాయి. 

          ఉపయోగాలు :  కథ లేకుండా కథ రాసుకోచ్చు. ప్లాట్ పాయింట్స్ తో పని లేదు, క్యారక్టర్ డెవలప్ మెంట్ అవసరం లేదు. సొంత ధోరణిలో రాసుకుపోతూ  ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడా ఆలోచలనకి పదును పెట్టుకునే శ్రమ వుండదు. చాలా ఫన్నీగానూ ఈజీగానూ వుంటుంది స్క్రిప్ట్ రైటింగ్. ఎడమ పక్క బ్రెయిన్ మొత్తుకునే లాజిక్ తో, విశ్లేషణలతో  పని లేకుండా,  రైట్ బ్రెయిన్ చెప్పినట్టూ బోలెడు ఫీలింగ్స్ తో సెంటిమెంటల్ గా, సగం బుర్ర వాడుకుని  రాసుకుపోవచ్చు. స్ట్రక్చర్ తో పనిలేకుండా కేవలం క్రియేటివిటీనే  చూపించుకుంటూ రాసుకోవచ్చు.

          మొత్తం రాసేసి చదువుకుంటే అప్పుడు కథేమిటో, ఏం చెప్పాలనుకున్నారో అర్ధమవుతుంది. ఈ విధానంలో ఎన్నెన్నో  ఐడియాలతో ఏవేవో సీన్లు పడిపోతాయి. కథకి పని వచ్చే వరకే వాటిని ఎడిట్ చేసుకుని, మిగిలిన వాటిని డేటా బ్యాంకులో భద్రపర్చు కోవచ్చు  భవిష్యత్ అవసరాల కోసం.

          సమస్యలు : ఈ విధానం సెల్ఫ్ గా రాసుకున్న రచయిత ఆలోచనాధార ( చైతన్య స్రవంతి- స్ట్రీమ్  ఆఫ్ కాన్షస్ నెస్) కాబట్టి చాలా ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఎన్నోసార్లు తిరగరాసుకోవాల్సి వస్తుంది. సంతృప్తి అనేది వుండదు. ఎక్కడో తేడా కొడుతున్నట్టు అన్పిస్తుంది, అదేమిటో తెలీదు. తెలిస్తే అసంతృప్తి తీరిపోయే దిద్దుబాటు చేసుకోవచ్చు. తెలీదు కాబట్టి సెట్లో కూడా అసంతృప్తితో  ఏదో మార్చి మార్చి రాసుకునే పరిస్థితి.

          ఈ విధానంలో కథలో సస్పెన్స్ అనేది వుండదు. ముందు జరగబోయే దాన్ని సూచనాప్రాయంగా చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే రచయితకి ముందు చూపువుండాలి. రాస్తున్నప్పుడు చేతిలో కథే వుండదు కాబట్టి ముందు చూపు వుండే అవకాశం లేదు. అలాగే పాత్ర పాసివ్ గా వస్తుంది.

          కథకి స్ట్రక్చర్ వుండదు. కచ్చితంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే వస్తుంది. కథలో చాలా ఎలిమెంట్స్  మిస్సయి సినిమా కథలా వుండదు. అనుభవమున్న రచయిత సాయం కోరితే సరిదిద్దడం దుస్సాధ్యంగా  మారిపోతుంది. పాయింటుని కూడా సంస్కరించి, మొత్తం సరికొత్తగా రాసుకు రావాల్సి వుంటుంది. ఈ ‘కూల్చు మరల కట్టు’ పద్ధతికి సెల్ఫ్ స్టార్టర్ రచయిత గుండె పగులుతుంది. అది తన రచనా సామర్ధ్యానికే అవమానంగా తోచి ఒప్పుకోకపోవచ్చు.

          చేయకూడనివి:  రచయిత తనని తాను గట్టిగా నమ్ముకుని  సెల్ఫ్ స్టార్టర్ కే బద్ధుడయ్యాక, మరింకో వైపు కన్నెత్తి చూడకూడదు. అంటే అహాన్ని చంపుకుని ఇతర సినిమాల కథలెలా వున్నాయి, వాటి నడక ఎలా వుందీ, ఆ నడకని బట్టి లైన్ ఆర్డర్ వేసుకుందామా, ఆ సీన్లని మార్చి పెట్టుకుందామా- లాంటి చోరకళకి పాల్పడకూడదు. అప్పుడు తన సరుకుతో ఆ సరుకులూ  కలిసిపోయి మొత్తం గజిబిజి అయిపోతుంది.  సెల్ఫ్ స్టార్ట్ కే నమ్మి కట్టుబడ్డాక ఇక వేరే  కిక్ స్టారర్, క్లిక్ స్టార్టర్ తరగతుల్లోకి తొంగి చూడకూడదు. ఆ విధానాలని తెచ్చి కలుపుకోకూడదు. కల్తీ చేసుకోకూడదు.

           ఫలితం :  ‘ఒక మనసు’, లేదా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లాంటిది తెర కెక్కుతుంది.

          కర్తవ్యం :  ఇప్పటి కాలంలో పాపులరవుతున్న ఇండీ (ఇండిపెండెంట్) ఫిలిమ్స్ కిందికి ఈ స్క్రిప్టు  వస్తుంది. సందీప్ కిషన్ నటించిన తమిళ డబ్బింగ్ ‘రన్’  లాగా ఇండీ ఫిలిం అని ముందే చెప్పుకుని నిర్మాతలని ప్రయత్నించాలి. అంతేగానీ  కమర్షియల్ గా కలరిచ్చి మభ్య పెట్ట కూడదు. ఈ సిన్సియారిటీని మెచ్చి, మొదటి పేజీ పైభాగంలో ఆనాడు స్మరించుకున్న దేవుడే ఓకే చేయిస్తాడు. లేదూ కమర్షియల్ అనే మభ్య పెట్టదల్చుకుంటే, స్మరించుకున్న దేవుణ్ణి కొట్టేసి ఇంకో దేవుణ్ణి రాసుకున్నా లాభముండదు. దేవుళ్ళంతా  ఒకే దర్బారులో వుంటారు, తెలిసిపోతుంది. కాబట్టి ఓ డాన్ పేరు రాసుకుంటే సరిపోతుంది. ఎలాటి పనికి అలాటి వాడు. అవసరమైతే నిర్మాతకి డాన్ ఫోన్ చేస్తాడు.

          ఇండీ ఫిలిం అని ముందే  ప్రమోట్ చేసుకోవడంలో జరిగే ఇంకో మేలు ఏమిటంటే, రివ్యూ రైటర్లు దాన్ని ఇండీ ఫిలిం దృష్టితోనే చూసి, ఇక వేరే ఆలోచనలు పెట్టుకోకుండా  ఆ మేరకే  అందమైన రివ్యూలు రాసిచ్చేసే వీలుంటుంది. లేకపోతే కమర్షియల్ ఇలా తీశాడేమిటని ఆ ప్రకారం వేరే రివ్యూలు ఇచ్చేసే ప్రమాదముంది- అప్పుడు బాధపడి, విరుచుకుపడి ప్రయోజనముండదు. 

          ఈ తరగతికి ఎంట్రీ లెవెల్ రచయితలే కాదు, ఎంటరై చక్రం తిప్పుతున్న వాళ్ళూ చెంది వుంటారు. వీళ్ళు 90 కి అటు వైపా, ఇటు వైపా రాయడానికి శ్రీకారం చుట్టే ముందే తేల్చుకోవాలి. 90 అంటే ప్రతీ ఏటా ఇస్తున్న 90 శాతం ఫ్లాపులన్న మాట.
                                                   ***

          కిక్ స్టార్టర్:  దీనికి రచనా సామర్ధ్యం బాగా అవసరమే. ఇదివరకు వచ్చిన సినిమాలే ఈ విధానంలో మార్గదర్శకాలుగా వుంటాయి. భారీ కమర్షియల్స్ ఆదర్శంగా వుంటాయి. వాటిని కిక్ కొట్టి వాటిలోంచే కథల్ని స్టార్ట్ చేయొచ్చు. వాటిని అనుసరించే కథనాలు చేసుకోవచ్చు. ఒకేలాంటి కథలు, ఒకేలా వుండే కథనాలతో సులభంగా రాసెయ్యొచ్చు. స్టార్ వేల్యూతో అవే నడిచిపోతాయి.

          ఉపయోగాలు : సాంప్రదాయంగా, సెంటి మెంటుగా, పాత స్కూలుగా  వస్తున్న ఈ పద్ధతికే ఎక్కువ డిమాండ్ వుంటుంది- ఫ్లాపులే ఎక్కువ ఇచ్చినా సరే, ఆత్మవిమర్శ చేసుకుని పధ్ధతి మార్చుకునే, ఎడ్యుకేట్ అయ్యే పనే వుండదు. ఇది పక్కా కమర్షియల్ – మూస ఫార్ములా విధానం. ఈ విధానంలో స్ట్రక్చర్ తో పనుండదు, ఈ విధానం స్ట్రక్చర్ ని దగ్గరికి రానివ్వదు. కొత్తది నేర్చుకునే శ్రమా వుండదు. అప్డేట్ అయ్యే అవసరముండదు.  స్ట్రక్చర్ కి దూరంగా దేవుడి మీద భారం వేసి  కేవలం క్రియేటివిటీనే నమ్ముకుని రాసుకోవచ్చు. పాసివ్ గా వచ్చిన సినిమాలనే టెంప్లెట్స్ గా పెట్టుకుని రాయల్ గా రాసెయ్యొచ్చు. ఫీలింగ్స్ , ఎమోషన్స్ తో కూడిన కుడి  బ్రెయిన్ ని ధారాళంగా వాడుతూనే, అప్పుడప్పుడు కామన్ సెన్స్ ని, సమయస్ఫూర్తినీ  గుర్తు చేసే ఎడమ  బ్రెయిన్ ని పొదుపుగా వుండీ లేనట్టుగా వాడవచ్చు. అంటే సగం పైచిలుకు బుర్ర ఉపయోగంలోకి వస్తుందన్న మాట.

          సమస్యలు : ఈ కిక్ స్టార్ట్ లో తప్పులున్న సినిమాలనే కిక్ కొట్టి అవే తప్పులతో స్టార్ట్ చేసుకుని రాయడం వల్ల పాసివ్ పాత్రల విడిది  కేంద్రాలుగా వుంటాయి. ప్రతీ యేటా పెద్ద  స్టార్స్ ని  పాసివ్ క్యారక్టర్స్ గా మార్చేసే కార్ఖానాలుగా వుంటాయి. అదృష్టం మీద ఆధారపడి హిట్టవుతూంటాయి. ఈ విధానంలో స్ట్రక్చర్ వుంటుంది గానీ, అది శాస్త్రీయంగా లేక, అంకాలు ఒకదాని మీద ఒకటి స్వారీ చేస్తూంటాయి. అందుకని కథ ఇంటర్వెల్ లోపు మొదలుకాని పరిస్థితి వుంటుంది. శాస్త్రీయత, స్ట్రక్చారాస్యత అనే వాటికి  దూరం కాబట్టి  పాసివ్ పాత్రలతో బాటు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సిండ్రోంలవంటి భారీ తూఫాను గండాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎన్నో వెర్షన్లు రాయిస్తూంటారు. అయినా సమస్యలు అలాగే వుంటాయి. పాత  స్కూలు పథికులు కావడం చేత పైన చెప్పుకున్న సమస్యలతో బాటు ఇంకా ఎన్నో లోపాల్ని కనిపెట్టలేరు.

          చేయకూడనివి:  చిన్న తరహా సెల్ఫ్ స్టార్టర్  విధానం వైపు చూసే స్థాయి కాదు కాబట్టి, అలాగే క్లిక్ స్టార్టర్  విధానం వైపూ చూసేందుకు ఆ  స్ట్రక్చర్ కి బద్ధవ్యతిరేకం కాబట్టీ,  ఈ కిక్ స్టార్టర్ రాయల్ విధానంతో అలాటి పనులు జరగవు. అంటే ఈ విధానం జడమైనది కాబట్టి ఇతర తరగతుల్లోకి తొంగి చూసే పని ఎలాగూ వుండదు. 

          ఫలితం :  ‘సమరసింహా రెడ్డి’ దగ్గర్నుంచీ ‘శతమానం భవతి’ వరకూ హిట్ ఫ్లాప్ భారీ కమర్షియల్స్ అన్నీ.

          కర్తవ్యం :  మభ్య పెట్టడాలు వుండవు- తామే రాజీ పడడాలు వుంటుంది. స్మరించుకున్న దేవుడు కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. క్షమించమని వేడుకోవాల్సి వుంటుంది. నీ ఖర్మలే ఫో- అనేస్తాడు  దేవుడు చేతులు దులుపుకుని. 90 కి అటా ఇటా అని ఆందోళన మొదలవుతుంది.
                                                            
***
క్లిక్ స్టార్టర్  
      ఒక్క క్లిక్ తో స్క్రీన్ ప్లే అంతా  కళ్ళ ముందు పర్చుకుంటుంది  బ్లూ ప్రింట్ లా. ఇది శాస్త్రీయ స్ట్రక్చర్ సహిత విధానం. ఈ తరగతి  రచయిత వేరే తరగతి గదులవైపు, కన్నాల వైపూ చూడడు తస్కరణావకాశాల కోసం - అంత స్వావలంబనతో, ఒరిజినాలిటీతో, వృత్తితత్వంతో వుంటాడు. ఇది పాశ్చాత్య  సిడ్నీ ఆల్విన్  ఫీల్డ్ (సిడ్ ఫీల్డ్), రాబర్ట్ మెక్ కీ, జాన్ ట్రూబీ, క్రిస్ ఓల్గర్ ల వంటి ఆధునిక స్కూలు కమర్షియల్ విధానం. ‘శివ’ రచనా విధానం ఈ స్కూలుకే  చెందుతుంది. కొన్ని వందల సినిమాల్ని పరిశీలించిన అనుభవంతో స్క్రీన్ ప్లే మోడల్ కో స్ట్రక్చర్ ని ఏర్పరచారు. ఈ స్ట్రక్చర్ తో  కథలో ఏది ఎక్కడ ఎలా వుండాలో బ్లూప్రింట్ అంతా  వుంటుంది. అయితే ముందుగా కథని  అన్ని కోణాల్లో, అని విధాలా రీసెర్చి చేసుకోకుండా  ఈ విధానంలో ఒక్క సీను కూడా రాయడం సాధ్యం కాదు. ఒక్కో మెట్టులో ఐడియా, సినాప్సిస్, లైన్ ఆర్డర్ విస్పష్టంగా, నిర్దుష్టంగా వర్కౌట్ చేసుకున్నాక,  వారం  రోజుల్లో  రఫ్ కాపీ రాసెయ్యొచ్చు. 

          
ఉపయోగాలు : అవే కథలు కొత్త భాష్యం చెప్పుకుంటాయి. పైగా పాసివ్ పాత్రలు  సహా ఎలాటి లోపాలూ, బోరూ  ఇందులో చొరబడే అవకాశం వుండదు. ఇందులో స్ట్రక్చర్- క్రియేటివిటీ రెండూ విడదీయరానంతగా కలగలిసిపోయి వుంటాయి. ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్ సమాన నిష్పత్తిలో పనిలోకి వస్తాయి. అంటే  తుప్పు పట్టకుండా పూర్తి బుర్ర మేకిన్ ఇండియాగా అమల్లోకి వస్తుందన్న మాట. ఇలా విమర్శనాత్మక, విశ్లేషణాత్మక, కళాత్మక  దృష్టితో స్క్రీన్ ప్లే తయారవుతుంది కాబట్టి – ఇలా రాసుకున్న కథ ఒకవేళ కాన్సెప్ట్ పరంగా ఎవరికైనా నచ్చకపోయినా,  వీడి దగ్గర విషయముందని గుర్తించే అవకాశం వుంటుంది. 

          సమస్యలు :  ఈ  విధానంలో మొట్ట మొదట ఎదురయ్యే సమస్య, నేను స్ట్రక్చరాస్యుణ్ణని రచయిత పెద్ద ఫోజు పెడితే గేట్లు ధడాల్న పడిపోవడం. కాబట్టి అఆలైనా నేర్చుకున్నట్టు తెలియకుండా మేనేజ్ చేయాలి. పాత స్కూల్లోనే నలుగుతున్నట్టు ఫీలింగ్ నివ్వాలి. ఎప్పుడూ ప్లాట్ పాయింట్, పాసివ్  క్యారక్టర్, త్రీయాక్ట్ స్ట్రక్చర్ అంటూ కొత్త స్కూలు పదాలేవీ వాడకూడదు. ఏ స్క్రీన్ ప్లే పుస్తకాలూ తీసికెళ్ళి చూపించ కూడదు, ఏ స్క్రీన్ ప్లే పండితుణ్ణీ ప్రస్తావించ కూడదు. డిస్కషన్స్ లో ఫస్ట్ టర్నింగ్, సెకండ్ టర్నింగ్, వీక్ క్యారక్టర్, పవర్ఫుల్  క్యారక్టర్ ... ఇలా సాంప్రదాయ పదకోశాన్నే వాడాలి. అవతలి వ్యక్తి  సేమ్ స్కూలైతే ఈ సమస్యలేవీ వుండవు- అదొక హనీమూన్ లా గడిచిపోతుంది. 

     ఈ విధానంలో ఇంకో సమస్య ఏమిటంటే, అంత  కచ్చితమైన కొలత లేసుకుని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుండడంతో,  కథా కథనాలు  కృతకంగా అన్పిస్తాయి. అందుకని  ప్లాట్  పాయింట్స్, పించ్ పాయింట్స్, మిడ్ పాయింట్ - వీటన్నిటినీ క్రియేటివ్ అవుట్ లుక్ తో,  స్ట్రక్చర్ వున్నట్టే అన్పించకుండా పూత పూసేయాలి. స్ట్రక్చర్ అనేది కేవలం కథని నిలబెట్టే ఆస్థి పంజరం మాత్రమే. ఈ ఆస్థి పంజరానికి క్రియేటివిటీ అనే డ్రామాతో రక్తమాంసాలద్దినప్పుడే  స్క్రీన్ ప్లే ఒక రోబోలా అన్పించకుండా, నడిచి వస్తున్న రోమన్ వీరుడులా వుంటుంది. ఉదా : ‘దంగల్’, ‘భజరంగీ భాయిజాన్’. 

          చేయకూడనివి: మూస ఫార్ములా పాత్రలూ కథనాలూ ఇందులో చేయకూడదు. అయితే సెల్ఫ్ స్టార్టర్ , కిక్ స్టార్టర్  తరగతులు  రెండూ క్లిక్ స్టార్టర్  కి ఫ్రెండ్లీ తరగతులే. అన్ని తరగతులూ ఫ్రెండ్లీ తరగతులే ఇన్ స్పైర్ అవడానికి, అప్ డేట్ అవడానికీ. కిక్ స్టార్టర్  కి కాపీ కొట్టే ఖర్మ వుండదు గాబట్టి- ఎడ్యుకేషన్ మాత్రంగా పనికి రావొచ్చు ఇతర తరగతులు. న్యూస్ ఛానెల్స్ లో కొన్ని వార్తా కథనాలు కూడా కథానికి సంబంధించిన టెక్నిక్కుల్ని అందిస్తాయి.  

          ఫలితం :  ‘శివ’, ‘మనం’, ‘క్షణం’ మొదలైనవి...

          కర్తవ్యం:  స్ట్రక్చర్ తో రాజీ పడకూడదు. స్ట్రక్చర్ పైన క్యారక్టర్ ప్లే విషయంలో పాసివ్ పాలబడనంత వరకూ పట్టువిడుపులు తప్పవు. ఇవి కూడా మరీ గాడి తప్పితే తప్పుకోవడానికే సిద్ధపడాలి. దేవుడి విషయానికొస్తే, వీడికి  (శాస్త్రీయ) జ్ఞానం వుండీ దాస్తున్నాడే అనే జాలిపడతాడు. ఇంకో చోట సెట్ చేయడానికి బిజీ అయిపోతాడు. 90 కి ఎటువైపు వుండాలన్న విషయంలో మాత్రం సొంతవ్యక్తిత్వంతో నిశ్చితాభిప్రాయంతో వుంటాడు ఈ టైపు రచయిత.


-సికిందర్

Tuesday, January 17, 2017

13, సెప్టెంబర్ 2021, సోమవారం

1058 : రివ్యూ

దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
తారాగణం: అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిణి తదితరులు
రచన: అవసరాల శ్రీనివాస్,  సంగీతం: శక్తి కాంత్ కార్తిక్, ఛాయాగ్రహణం : రామ్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
విడుదల : 3 సెప్టెంబర్, 2021
***

      నటుడు రచయిత దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరో ప్రేమ కథ రాసి కొత్త దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ కి అప్పగించాడు. బట్టతల గురించి కథ. విషయం చిన్నది, వ్యవసాయం పెద్దదిగా వుండాలి. అలా వుందా? ఇందులో చిలసౌ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్. ఈసారి ఈమెకి చిలసౌలో లాంటి బలమైన పాత్ర దక్కిందా? బట్టతల మీద ఇదివరకే రెండు సినిమాలొచ్చాయి. అవసరాల బట్టతల కథ ఏమైనా భిన్నంగా వుందా? కొత్త దర్శకుడు ఏమైనా కొత్త ముద్ర వేశాడా? ఇవి తెలుసుకోవడానికి విషయంలో కెళ్దాం...

కథ

   జీఎస్సెన్ అనే గొత్తి సూర్య నారాయ‌ణ (అవ‌సరాల శ్రీనివాస్‌) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. తల్లి (రోహిణి) వుంటుంది. వంశపార్యంపరంగా వచ్చిన బట్టతల వుండడంతో అది బయటపడకుండా విగ్గు పెట్టుకుని స్ట్రగుల్ చేస్తూంటాడు. ఇంట్లో వున్నప్పుడు క్యాప్ పెట్టుకుంటాడు. అదే కంపెనీలో అంజలి (రుహానీ శర్మ) కొత్తగా చేరుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. తన బట్టతల ఆమె నుంచి దాస్తూ తప్పు చేస్తు న్నానేమోనని ఫీలవడం మొదలెడతాడు. ఇంతలో అతడి బట్టతల ఆమె చూసేస్తుంది. మడిపడి తెగతెంపులు చేసుకుంటుంది. ఇప్పుడీమె ప్రేమని ఎలా గెలుచుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

            బట్టతలతో ఇన్నోవేట్ చేయని రోమాంటిక్ కామెడీ కథ. ఓ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చి వుంటే ఈ కథని నమ్మొచ్చు. ఇప్పుడు కాదు. ఇప్పుడు బట్ట తల సమస్యే కాదు. ఈ ఇరవై ఏళ్ళ కాలంలో హేర్ ట్రాన్స్ ప్లాంట్ టెక్నాలజీ  వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. హైదారాబాద్ లోనే డజనుకి పైగా క్లినిక్స్ వున్నాయి. రెండు సిటింగ్స్ తో, ఓ యాభై వేల ఖర్చుతో, ఆరు నెలల్లో గర్వ కారణమైన కేశ సంపద పొంద వచ్చు.

        వాస్తవమిలా వుండగా, బట్ట తల సమస్య నెదుర్కొన్న వెనుకటి కాలపు కథ అందించారు. మనమున్నది 2021 లో. 2019 లో విడుదలైన బాలా’, ఉజ్డా చమన్ కూడా ఇలాటివే. వీటికి ముందే ఈ కథ అనుకున్నట్టు అవసరాల వివరణ. ఈ కథ ముందే అనుకుంటే అనుకోవచ్చు గానీ, డీహెచ్ఐ (డైరెక్ట్ హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్) టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని అప్డేట్ చేసుకుని వుంటే, ఆ రెండిటి కాపీ అన్న అపోహ వుండేది కాదు. డీహెచ్ఐ టెక్నాలజీ 43 దేశాల్లో వుంది. లక్షల మంది దీని సేవలు పొందుతున్నారు.

        సరే, పాత కాలపు పరిస్థితితోనే కథ చేయకుండా డీహెచ్ఐ తో కథని ఇన్నోవేట్ చేసివుంటే వచ్చే లాభమేమిటి? ఒకటి, బట్టతల- విగ్గు- విగ్గూడిపోయి బట్టతల బట్టబయలు- చివరికి విధిలేక బట్టతలతో రాజీపడి, అందమే ఆనందం కాదు, ఆనందమే అందమని బలవంతాన నవ్వుతెచ్చుకుని, ముగించే విషయంలేని మూస అయ్యేది కాదు కథ.

        ఇలా సైంటిఫిక్, సైకలాజికల్, మెడికల్ సబ్జెక్టులతో కమిటెడ్ గా వుండలేక, లేదా విషయ సేకరణ పట్ల అలసత్వం వల్ల ఇలాటి కథలు ఫ్లాపవుతున్నాయి. డిస్కో రాజాలో, ‘సవ్యసాచిలో సైంటిఫిక్ పాయింట్స్ ని ఇలా చెడగొట్టుకోవడం వలన భారీగానే ఫ్లాప్స్ నెదుర్కొన్నారు. సైజ్ జీరోలో మెడికల్ పాయింటుతోనూ ఇంతే.  వరల్డ్ ఫేమస్ లవర్లో సైకలాజికల్ పాయింటుతోనూ ఇంతే. ఇవి కొన్ని మాత్రమే ఉదాహరణలు. ఈ సబ్జెక్టులకి వాటివైన జానర్ మర్యాదలుంటాయి. ఇదికూడా లేకుండా మూసగా తయార్రు చేసుకుంటున్నారు కథలు.

నటనలు -సాంకేతికాలు

    హాస్య ప్రధానమైన బట్టతల పాత్రధారి అవసరాల నటన ఫర్వాలేదు. కామిక్ సెన్స్ వుంది, టైమింగ్ వుంది. ముఖ్యంగా హోటల్లో పెళ్ళి సందర్భంగా సృష్టించిన కామెడీ ఎక్కువ నవ్వు తెప్పించేదే. ఇలాటి పంచ్ కామెడీ ఇదొక్కటే కన్పిస్తుంది. హీరోయిన్ తెలుగు రాని హిందీ అమ్మాయి అనుకుని నటించిన సీన్లూ ఓకే. కానీ పాత్రకి కథ లేనప్పుడు ఎంతసేపు ఏ కామెడీతో నడిపిస్తారు. సెకండాఫ్ లో ఈ సమస్య ఎక్కువైపోయింది. పైగా మొదట్నుంచీ పాసివ్ పాత్ర. బట్టతలతో సమస్యైతే వుంది, ఈ సమస్యని పరిష్కరించుకోవాలన్న గోల్ మాత్రం లేదు.

        ఇంటర్వెల్లో హీరోయిన్ కి బట్టతల బయట పడ్డాక, ఇప్పుడామె ప్రేమనెలా పొందాలన్న గోల్ కూడా లేదు. తనకి దూరమైన హీరోయిన్ తానే దగ్గరై కౌన్సెలింగ్ చేసి, సమస్యతో రాజీ పడమని మోటివేట్ చేస్తుంది. అలా సమస్య నుంచి బయటపడతాడు పాపం! సొంత గోల్ లేకుండా ఇంతకంటే సినిమాని ఫ్లాప్ చేసే పాసివ్ ప్రధాన పాత్ర వుంటుందా?

1. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
2. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
3. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
4. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
5. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
6. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.

        ఈ బ్లాగు అంతా ఈ హెచ్చరికలే నిండిపోయాయి. అయినా సినిమాల్లో పదేపదే పాసివ్ పాత్రలే! సిగరెట్ ప్యాక్ హెచ్చరికల్లా కన్పిస్తున్నాయి కాబోలు. మనకి తెలుసు- ఇలా సినిమా కథా శాస్త్రం నల్గురికి తెలియడం కోసం చదవడం, నల్గురి ముందు గొప్ప కోసం చర్చించడం వరకే. తీరా సినిమా చేసేప్పుడు ఇవన్నీ కట్టకట్టి అవతల పెట్టి, సొంత పైత్యాలతో సినిమాల్ని సింగారించుకుని మునిగిపోవడం. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్నట్టు అనుభవించి తీరాల్సిందే!

        ఆ మధ్య  మనియారయిలే అశోకన్ అనే మలయాళం వచ్చింది. ఇందులో పాత్రకి పొట్టి తనమనే సమస్య వుంటుంది గానీ, దీన్నుంచి ఎలా బయటపడాలన్న గోల్ వుండదు. పొట్టి తనం శాపం కాదు, సమస్య కూడా కాదు. తన సైజు అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. ఈ గోల్ పెట్టుకుని అలాటి అమ్మాయి కోసం పాట్లు పడితే సరిపోతుందని ఆలోచించడు.

     పొట్టితనం ఎప్పుడు సమస్య కావచ్చంటే, మై మేరీ పత్నీ ఔర్ వో అనే హిందీ సూపర్ హిట్ లో పొట్టి లెక్చరర్ రాజ్ పల్ యాదవ్, పొడుగు రీతూపర్ణా సేన్ ని పెళ్ళి చేసుకుని, అందరూ నవ్వుతున్నారని గింజికు చావడంలో వుండొచ్చు. పొట్టి రాజ్ పల్ యాదవ్ కి పొడుగు భార్యతో వుండే ఆత్మ న్యూన్యతా భావం, దాంతో సమస్యలు తెచ్చుకుని  పడే బాధా చిత్రించాలంటే దర్శకుడికి సామర్ధ్యం అవసరం. నవ్విస్తూ ఏడ్పించడమనే ద్వంద్వాల పోషణతో ఈ సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు.  

        పాత్ర ఏదో సమస్య పెట్టుకుని లోలోపల కుమిలిపోవడం దాని బాధ, ఆ బాధలోంచి బయటపడేదుకు పాల్పడే చర్యలు ప్రేక్షకులకి హాస్య వినోదం. ఇలాగే  జో సమ్ బడీలో పిరికివాడైన టిమ్ అలెన్, తన కూతురి ముందు ఒక బలవంతుడు తనని కొట్టాడని, తనూ  బలవంతుడై కూతురి ముందే వాణ్ణి కొట్టాలని చేసే ప్రయత్నాలు ఆ పాత్రకి సీరియస్, ప్రేక్షకులకి నవ్వులు. ఇంత సింపుల్ ఎంటర్ టైనర్స్ లో చెప్పకుండానే ఎంత బలమైన సందేశం, నీతీ వుంటాయో చెప్పక్కర్లేదు.

        అవసరాల బట్టతల పాత్రకి ఈ ద్వంద్వాల పోషణ అనే స్క్రిప్టింగ్ టూల్ లోపించడం వల్లే సజీవ పాత్ర కాకుండా అట్ట ముక్కలా వుంది. తనకి లేని జుట్టు ఎదుటి వాడికుందన్న అక్కసు లోలోపల వేధిస్తూంటే ఎదుటి వ్యక్తులతో పాల్పడే చర్యలెలా వుంటాయో సైకలాజికల్ స్టడీ చేసుకుని రూపకల్పన చేసుకోవాల్సిన సందర్భం. పాత్రంటే అదీ, కథంటే అదీ. ఇక పాత్రకి గోల్ విషయం చివర్లో చూద్దాం.

        ఈసారి రుహానీ శర్మ హీరోయిన్ పాత్రకి విషయం లేదు. ఆమెలోని నటిని బయట పెట్టే సన్నివేశాల్లేవు. అవసరాల పాత్రకే కథ లేనట్టు తనకీ లేకపోతే చేసేదేముంది. సాంకేతికంగా కెమెరా వర్క్ రిచ్ గా వుంది. సంగీతం నిరాశ.  

చివరికేమిటి

     ఫస్టాఫ్ హీరోయిన్ కి బట్టతల తెలియకుండా ప్రయత్నాలు. ఇంటర్వెల్లో బట్ట తల తెలియడం. సెకండాఫ్ చూసి చూసి హీరోయినే అర్ధం జేసుకుని దగ్గరై సమస్య నుంచి బయట పడేయడం. బొత్తిగా విషయం లేదు. బట్ట తలతో ఎలా మొదలైందో పరిష్కారం లేకుండా అలాగే బట్ట తలతో ముగుస్తుంది. ఇంటర్వెల్లో హీరోయిన్ కి బట్టతల తెలిసే ప్లాట్ పాయింట్ వన్ మలుపు- కాన్ఫ్లిక్ట్ అత్యంత బలహీనం. ఈ బలహీన కాన్ఫ్లిక్ట్ లో సెకండాఫ్ ని నిలబెట్టే విషయం లేకపోవడంతో కథకి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండం. ఇందుకే మధ్యలో దూరమైన హీరోయిన్ ని దగ్గర చేసి కాన్ఫ్లిక్ట్ ని ముగించేశారు. ఇక హీరోయిన్ తోడ్పాటుతో బట్టతలతో తన మానసిక సమస్య నుంచి ఎలా బయటపడ్డాడో చూపించడం. చివర్లో హడావిడిగా ఓ స్టేజి ప్రసంగంతో నీతి చెప్పి ముగించడం.

        హీరోయిన్ కి వెంట్రుక వాసిలో బట్టతల తెలిసిపోయే ప్రమాదకర ఘట్టం నుంచి బయట పడి, ఇక లాభం లేదు, పెళ్ళి టైములోగా సీక్రెట్ గా జుట్టు మొలిపించుఒకోవడమే మార్గమని గోల్ పెట్టుకుని- క్లినిక్స్ లో ఆ జుట్టు మొలిపించుకునే పాట్లు, అదెంతకీ మొలవక పోవడం, పెళ్ళి టైము ముంచుకు రావడం - ఇలా వాస్తవికంగా, ప్రాక్టికల్ గా థ్రిల్లింగ్ గా - ఇన్నోవేట్ చేసి ఈ కథ చెప్పొచ్చు కదా?

        పోతే, దీనికి వారం క్రితం విడుదలైన ఇచ్చట వాహనములు నిలపరాదు లో ఫస్టాఫ్ లవ్ ట్రాక్ ఎలా వుందో, అదే మళ్ళీ అదే సెటప్ లో చూడాల్సి రావడం సహన పరీక్షే. కాకపోతే అందులో ఆర్కిటెక్చర్ కంపెనీ, ఇందులో రియల్ ఎస్టేట్ కంపెనీ.

        గోల్ లేకపోవడం, కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, పాసివ్ పాత్ర కావడం - దీని తర్వాత మొన్న విడుదలై దెబ్బతిన్న  టక్ జగదీష్ లోనూ చూశాం. తెలుగు సినిమాలు అద్భుత క్రియేటివ్ టాలెంట్ తో ముందడుగేస్తున్నాయి. ఇలాగే మరిన్ని కదం తొక్కుతూ వస్తూంటే తెలుగు సినిమాల కీర్తి దశదిశలా మార్మోగుతుంది. జీవితం పండుగలా వుంటుంది. 
సికిందర్

 

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

1057 : రివ్యూ

రచన - దర్శకత్వం: శివ నిర్వాణ 
తారాగణం: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, నాజర్, రావురమేష్, నరేష్, రఘుబాబు, సీవిఎల్ నరసింహా రావు, శ్రీకాంత్ అయ్యంగార్, మాలా పార్వతి, రోహిణి, దేవదర్శిని, డేనియల్ బాలాజీ, తిరువీర్ తదితరులు 
సంగీతం: తమన్, గోపీ సుందర్, ఛాయాగ్రహణం : ప్రసాద్ మూరెళ్ళ
బ్యానర్ : షైన్ స్క్రీన్స్
నిర్మాతలు : గారపాటి సాహు, పెద్ది హరీష్
విడుదల : 9 సెప్టెంబర్, 2021, అమెజాన్ ప్రైమ్
***

        త సంవత్సరం  విడుదలైన నేచురల్ స్టార్ నాని  వి  లాగే తాజా  టక్ జగదీష్ ఓటీటీలో విడుదలైంది. వి లో నాని నటించింది సీరియల్ కిల్లరో, రివెంజి తీర్చుకునే క్యారక్టరో తేలక ఆ సినిమా ఫలితం అలా తేలింది. మరి టక్ జగదీష్’? లో ఎలా వుంది? ఈ పాత్ర ఎలాటి కథని సృష్టించింది? సత్కథా కాలక్షేపమేనా? పెద్ద సినిమాల్లేని  క్షామంలో బంపర్ హిట్టేనా? అలాగే నిన్ను కోరి’, మజిలీ అనే రెండు లైటర్ వీన్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణా ఈ మూడో ప్రయత్నమెలా వుంది? నాని నుంచి ప్రేక్షకులాశించేది ఇచ్చాడా? లేక శర్వానంద్ కి ఒక  శ్రీకారం లాగా సరిపెట్టేశాడా? ఈ విషయాలు పరిశీలిద్దాం.... 

కథ


    ఆదిశేషు నాయుడు (నాజర్) భూదేవీ పురం భూస్వామి. ఇతడి చనిపోయిన మొదటి భార్య కి బోసుబాబు (జగపతి బాబు), జగదీష్ (నాని) అనే ఇద్దరు కొడుకులు. రెండో భార్య అర్జునమ్మ (మాలా పార్వతి) కి ఇద్దరు కూతుళ్ళు (రోహిణి, దేవదర్శిని), ఒక కొడుకు. మొత్తం ఐదుగురు సంతానం. దేవుడు బాబు (రావు రమేష్), సత్తిబాబు (నరేష్) అనే అల్లుళ్ళు. చంద్రమ్మ (ఐశ్వర్యా రాజేష్) అని మనవరాలు. అంతా కలిసి సుఖపడుతున్న ఉమ్మడి కుటుంబం.      

        గుమ్మడి వరలక్ష్మి (రీతూవర్మ) అని మండలంలో పనిచేసే ఒక వీఆర్వో. ఈమెని జగదీష్ ప్రేమిస్తూంటాడు. జగదీష్ ని చంద్రమ్మ పెళ్లి చేసుకోమని పోరుతూ వూంటుంది. జగదీష్ ఇంకో వూళ్ళో ఏదో చదువుతూ అప్పుడప్పుడూ వస్తూంటాడు. చిన్నప్పుడు తను చూసిన ఒక టక్ చేసుకున్న అధికారి విధి నిర్వహణలో కచ్చితంగా వుండడం ఆకట్టుకుని, తను కూడా అలాటి అధికారిలా ఉద్యోగం చేయాలని అప్పట్నుంచే టక్ చేసుకుని తిరగడం ప్రారంభిస్తాడు. 
   
        వీరేంద్ర నాయుడు (డానియల్ బాలాజీ), అతడి తమ్ముడు తిరుమల నాయుడు (తిరువీర్) వూళ్ళోనే బరితెగించిన దుష్టులు. ఎమ్మార్వోని కలుపుకుని భూములు లాక్కుంటారు. హత్యలు చేస్తారు. ఆదిశేషు నాయుడు ఇతణ్ణి ఎదుర్కొంటూ వుంటాడు. ఈ కక్షలు లేని గ్రామం చూడాలన్న కోరికతో వుంటాడు. ఇంతలో గుండెపోటుతో చనిపోతాడు. చనిపోతూ పెద్ద కొడుకు బోసుబాబుకి ఆస్తి పంపకాలు చెప్పి చనిపోతాడు. ఈ పంపకాలు బోసుబాబుకి నచ్చవు. ఉమ్మడి ఆస్తినంతా చెరబట్టి ఎవరికీ పంచేది లేదని పొమ్మంటాడు. ఇతణ్ణి వీరేంద్ర నాయుడు లోబర్చుకుని చంద్రమ్మని తమ్ముడికిచ్చి పెళ్ళి చేయించుకుని హింసించడం మొదలెడతాడు. వేరే వూళ్ళో వున్న జగదీష్ కి ఈ విషయాలు తెలిసి ఎమ్మార్వోగా తిరిగొచ్చి, పరిస్థితిని చక్కబర్చే కార్యక్రమం  ప్రారంభిస్తాడు...

ఎలావుంది కథ

      శ్రీకారం లో చూపించింది ఉమ్మడి వ్యవసాయపు కథైతే, టక్ జగదీష్ తో ఉమ్మడి కుటుంబపు కథ. శ్రీకారం లో అవాస్తవిక ఉమ్మడి వ్యవసాయం లాగే, టక్ జగదీష్ లో ఇప్పుడు అనుభవంలో లేని కాలగర్భంలో కలిసిపోయిన ఉమ్మడి కుటుంబాల పాత ఫార్ములా కథ. ఈ కాలం చెల్లిన, యూత్ అప్పీల్ వుండని కాన్సెప్ట్ ని పదుల కోట్లతో సినిమాలకి ఇంకా వాడుకోవడం విచిత్రమే.

        ఐతే ఏంటి - బ్రహ్మోత్సవం’, శతమానం భవతి’, అమ్మమ్మ గారిల్లు లాంటివి ఇటీవల రాగా లేనిది - మనం తీస్తే ఫ్యామిలీ, యూత్, మాస్ మసాలా వగైరా బాక్సాఫీసు అప్పీళ్ళన్నిటికీ జవాబిచ్చే స్టార్ మూవీ ఎందుక్కాదని నమ్మి తీసినా ఇంతే. ఎందుకంటే ఫ్యామిలీ, యూత్, మాస్ మసాలా బాక్సాఫీసు - ఇంకా ఏవైతే అప్పీళ్ళు వుంటాయో- అవన్నీఇలాటి కథలు దారితీసే కాలం చెల్లిన క్రియేటివ్ యాస్పెక్ట్ థాటికి హాంఫట్ అయిపోతాయి.  

        చిన్న కొడుకు అనే హీరో ఉమ్మడి కుటుంబంలో దారి తప్పిన అన్నని, చెదిరిన కుటుంబాన్నీ చక్కదిద్దే టెంప్లెట్ ఇంకా సినిమా కథేనా ఇప్పుడు? 54 ఏళ్ళ క్రితం 1967 లో ఎన్టీఆర్ నటించిన ఉమ్మడి కుటుంబం’, 49 ఏళ్ళ క్రితం 1972 లో కృష్ణ నటించిన పండంటి కాపురం’, ఆనాడింకా వున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉనికితో ఐడెంటిఫై అవడంవల్ల అంత హిట్టయ్యాయి. ఇవి కూడా అన్ననో తమ్ముడ్నో చక్కదిద్దే కథలే. అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడాలి కాబట్టి అలాటి చక్కదిద్దే కథలతో సినిమాలొచ్చేవి. ఇప్పుడా వ్యవస్థే లేనప్పుడు చక్కదిద్దే సినిమా లేమిటి?

        ఈ కథలో ఒక ట్విస్టు హిడెన్ ట్రూత్ గా వుంది. దీని ప్రకారం జగదీష్, అతడి అన్న బోసుబాబు ఒక తల్లి పిల్లలు కాదని, ఆదిశేషు నాయుడి మొదటి భార్యకి పుట్టింది జగదీష్ ఒక్కడేననీ, ఒకానొక కీలక ఘట్టంలో బైటపడుతుంది. ఇలా ఆస్తికి ఏకైక వారసుడు జగదీషేననే టర్నింగ్ పాయింటు వచ్చాక- దీన్ని కూడా నీరుగార్చడంతో, ఈ హిడెన్ ట్రూత్ అనే జగదీష్ పాత్రకి అందివచ్చిన అస్త్రం - పాత్ర విలువల్ని ఉదాత్తంగా చిత్రించే అవకాశం లేకుండా చేసింది.

        ఈ ఉమ్మడి కుటుంబం కాన్సెప్టే కాలం చెల్లినదైదే, దీనికి బలహీన కథా కథనాలు తోడయ్యాయి. ఇందులో ఒక డైలాగు కూడా - దారితప్పిన చంటి బిడ్డకి అమ్మ చెప్పే కథ నీది  అని! ఇలాటి కథ అమ్మ చెపితే ఏం చెప్పిందో ఏమర్ధమవుతుందో పిల్లలకి. ఇది నిన్నుకోరి’, మజిలీ తరహా లైటర్ వీన్ గా తీయాల్సిన కథ మాత్రం కాదనేది తెలుసుకోవాల్సిన నీతి. ఏ తరహా మేకర్ ఆ తరహా కథలు తీసుకుంటే సేఫ్ గా వుండొచ్చని టక్ జగదీష్ చెప్తుంది.  

నటనలు సాంకేతికాలు

     పాత్రని బట్టి అది నడిపే కథ, ఆ పాత్ర నడిపే కథని బట్టి నటనా వుంటాయి. పాత్రని పక్కనబెట్టి కథకుడు దాని కథని తనే నడిపితే, ఇలా పాసివ్ నీరస పాత్రతో నీరస కథే, దాంతో నీరస నటనే వస్తుంది. కొన్ని జాతీయ మీడియాలో రివ్యూలు తప్ప, ఓవరాల్ గా రివ్యూలు మెతకగానే రాశారు. సోషల్ మీడియాలో ప్రేక్షకుల కామెంట్స్ మాత్రం అంత మృదువుగా ఏం లేవు. 90% హాహాకారాలే. నానికీ, నాని నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న దానికీ ఇంత ఎడం వుందన్న మాట. పాత్రని, దాని కథనీ జడ్జి చేయడంలో నాని విజ్ఞత ప్రదర్శించలేదు.

        నటన ఎంత బలహీనంగా వుందంటే, మాటలు కూడా డల్ గా, సరిగా విన్పించనంత గొణుక్కోవడం లాగా వున్నాయి. లోలోపల ఏదో సఫర్ అవుతున్నట్టు కన్పిస్తుంది పాత్ర. కాస్త స్టార్ హవా, కాస్త హుషారైన రోమాన్స్, ఇంటినిండా కుటుంబంతో ఫన్, ఎంటర్టయిన్మెంట్ లాంటి హై వైబ్రేషన్స్ తో కూడిన చిత్రీకరణలుంటే నష్టమేమిటి?

        ఫస్టాఫ్ లో పాత్ర ఎంత సీరియస్ మూడ్ తో వుంటుందో, సెకండాఫ్ లో అంత లో- వైబ్రేషన్స్ తో విషాదం తాండవిస్తూ వుంటుంది. అన్నిపాత్రలూ, కథా విషాదచ్ఛాయలలుముకునే వుంటాయి సెకండాఫ్ లో. నాని క్యారక్టరైజేషనే మేకింగ్ కీ, మొత్తం ప్యాకేజీకీ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ లేకుండా చేసింది. బాక్సాఫీసు రెస్పాండ్ అయ్యేది ఈ ఫ్రీక్వెన్సీ కే.  వి లో లాగే ఇందులోనూ పాత్ర చిత్రణ విషయంలో కన్ఫ్యూజనే.   

        ఒక టక్ చేసుకుని స్ట్రిక్టుగా వుండే ఆఫీసరుని చూసి, తానూ అలా ఆఫీసరవ్వాలని చిన్నప్పట్నుంచీ టక్ చేసుకోవడం మొదలెట్టిన జగదీష్ ని చూసి, పాపం ఇంటా బయటా సరదాగా ఎవరూ ఆఫీసర్ గారూ అని పిలవకపోవడమనే లోటు - పాత్ర ప్రజెంటేషన్ని పట్టించుకోక పోవడం వల్ల జరిగింది.

        అలా పిలుస్తూ వుంటే టక్ చేసుకుని వున్న పాత్రతో సస్పెన్సు వుండేది- ఎందుకలా పిలుస్తున్నారని. ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ సస్పెన్సుకి సమాధానం దొరికేది. కథనమంటే ప్రశ్న రేకెత్తించి, తర్వాత జవాబివ్వడమనే డైనమిక్స్ అని అర్ధం జేసుకోకపోతే ఇంతే, మొత్తం డల్ వ్యవహారమైపోతుంది. పాత్రకి ప్రెజెంటేషన్ పరంగా ఈ బ్యాకప్ లోపించడంతో, టక్ చేసుకోవడానికి కారణమైన చిన్ననాటి ఫాంటసీ ప్రేక్షకులు ఆటలు పట్టించే స్థాయికి వెళ్ళింది.

        ఇంత కుటుంబ కథలో హీరోయిన్ రీతూవర్మ వీఆర్వో పాత్రకి హీరో కుటుంబంతో బాండింగ్ లేకపోవడం కొట్టొచ్చే లోపం. బయట హీరోని కలవడం, రెండు డైలాగులు చెప్పడం వరకే పాత్ర.  పై అధికారి రాత్రి గెస్ట్ హౌస్ కి రమ్మన్నప్పుడు అక్కడే లాగి కొట్టకుండా సైలెంట్ గా వుండిపోతే, హీరో పాత సినిమాల్లోలాగా కామెడీ కొట్టుడు కొట్టించి రక్షించడం హీరోయిన్ పాత్రకీ, హీరో హీరోయిజానికీ ఏమైనా మేలు చేసిందేమో కథకుడే చెప్పాలి. టాలెంటెడ్ నటి రీతూవర్మ ఇందులో వృధానే అయింది. 

    చంద్రమ్మగా ఐశ్వర్యా రాజేష్ అత్తింట్లో ఆరళ్ళు ఏనాటివి! హీరో పెళ్ళి కాదన్నాడన్న కోపంతో దుష్టుల ఇంటికి కొడలిగా వెళ్ళిపోయి ఏం సంకేతాలిచ్చింది? తాత ఆశయాలు గుర్తుకు రాలేదా? పైగా స్త్రీ హక్కులు టైపులో అలాటి మొగుడితో ఘర్షణ. స్త్రీ హక్కుల ఉద్యమమా, తెలిసి తెలిసి ఆ పెళ్ళి చేసుకున్న మూర్ఖత్వమా? కుటుంబ కథా పాత్రలు రాయడం అంత ఈజీ కాదేమో.  

        ఇక తల్లి అర్జునమ్మగా 115 సినిమాల మలయాళ నటి మాలా పార్వతి. హీరో తప్ప మిగతా నల్గురూ సొంత పిల్లలే అన్నది హిడెన్ ట్రూత్. ఆప్యాయతలు సమర్ధవంతంగా నటించగలదు. ఉన్నట్టుండి స్వార్ధపరురాలై పోయి పాత్రని దెబ్బతీయడమే సమస్య. పెద్ద కొడుకు బోసుబాబు, అంటే జగపతిబాబు, తన సొంత కొడుకేనన్న రహస్యం ఇప్పుడు కూడా దాచి, మనసు కరిగినప్పుడు అతనే ఆస్తి పంచుతాడని హీరోకి అడ్డు పడుతుంది. తల్లి మాట విన్నందుకు ఒక అక్క కూడా హీరోని దూరం పెడుతుంది. పాత్రలన్నీ ఆస్తికోసం అర్రులు చాచేవే, హీరో సహా.

        విలన్ గా మారే జగపతి బాబు పాత్ర ఒక్కటే పర్ఫెక్ట్ గా వుంటుంది. విలన్ చేసేదే చెడ్డ పనులైనప్పుడు తప్పులేం వెతుకుతాం. విలన్ ఈజ్ ఆల్వెస్ రైట్ వాడి పాత్ర కొద్దీ. జగపతి బాబుకి ఇలాటి పాత్రలు, నటనలు  కొత్త కాదు.

        రావురమేష్, నరేష్, రఘుబాబు, సీవీఎల్ నరసింహా రావు, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, దేవదర్శిని - ఇంకా చాలా మంది నటీ నటులున్నారు గానీ వీళ్ళ పాత్రలు నామ మాత్రమే. డేనియల్ బాలాజీ, తిరువీర్ పాత విలనీని ప్రదర్శిస్తారు. ఈ గ్రామీణ కథలో లొకేషన్స్ బావున్నాయి. ఛాయాగ్రహణం బావుంది. సంగీతం ఓ మోస్తరు. ఒకప్పుడు సినిమా ఎలా వున్నా ఒకదాన్ని మించొకటి ఆరు హిట్ పాటలుండేవి. మధ్యమధ్యలో వచ్చే రొడ్డ కొట్టుడు కథ పట్టించుకోకుండా, పాటలు మాత్రం ఎంజాయ్ చేసి హిట్ చేసే వాళ్ళు. ఈ అదృష్టం కూడా ఇప్పుడు లేదు.  

చివరికేమిటి

      ఇప్పుడు అసలు ప్రశ్న! హీరో నాని ఎమ్మార్వో పాత్ర దేనికి వుందన్న ధర్మ సందేహమొకటి. తను ఎమ్మార్వోగా లేకపోతే వచ్చే నష్టమేమిటన్న ఆత్మఘోష. ఆస్తి మీద అన్న కోర్టు నుంచి స్టే తెచ్చుకుని సమస్య సృష్టించడం కథని మలుపు తిప్పి, నాని పాత్రకి గోల్ ని ఏర్పాటు చేసే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. ఈ గంటా ఇరవై నిమిషాలూ ఫస్టాఫ్ చివర్లో తండ్రి మరణం, అన్న స్టే తెచ్చుకోవడం తప్ప - ఈ సుదీర్ఘమైన బిగినింగ్ విభాగపు బిజినెస్ కొత్తగా ఏమీ వుండదు. కొత్తగా వూహించి చూపించిందేమీ లేదు. చాలా సినిమాల్లో రన్ అయివున్న అవే ఫ్యామిలీ కాపీ సీన్లు టెంప్లెట్స్ గా పడిపోతూంటాయి, గ్రామ కక్షలతో బాటు.

        ప్రశ్న హీరో నానికి ఎమ్మార్వో పాత్ర ఎందుకన్నదే. అన్న స్టే తెచ్చుకోవడంతో కథ ప్రారంభమైనప్పుడు, ఆ కథలో ఎమ్మార్వోగా తానేం చేయలేనప్పుడు దేనికా పాత్ర? అన్న స్టే తెచ్చుకోవడంతో అది కోర్టు పరిధిలో కెళ్ళిపోయిన సమస్య అయిపోయింది. తన చేతిలో ఏమీ లేదు. తన మెజిస్టీరియల్ అధికారాలెందుకూ పనికి రావు. ఇక అన్నకి ఓ తమ్ముడుగా కోర్టు కెళ్ళి సివిల్ కేసు పోరాడుకోవడమే. ఎమ్మార్వోగా అధికార పరిధిలో కాదు. ఇంత లొసుగు వుంది ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటులో. నాని ఎమ్మార్వో పాత్రనే క్యాన్సిల్ చేసే లొసుగు. ఇలా యెలా తయారు చేసుకుంటారు కథ?

        తన ప్రభుత్వాధికారం పనికి రాదు గనుక ఇంట్లో చెప్పి కోర్టులో స్టే వెకేట్ చేసేందుకు సహకరించమంటాడు. ఇది ప్రైవేట్. తర్వాత తల్లి అడ్డుకుని అలా చేస్తే ఒట్టని ఒట్టే యించుకుంకోవడంతో ఆగిపోతాడు. ఇది కూడా ప్రైవేట్. ఆ తర్వాత లాయర్ ఇందాక పైన చెప్పుకున్న హిడెన్ ట్రూత్ వెల్లడించడంతో, ఎవరికీ చెప్పవద్దంటాడు. ఇది కూడా ప్రైవేటే. ఇన్ని చిక్కుల్లో ఎమ్మార్వోగా చేయడానికేమీ లేదు. చివరికి అన్నతో తేల్చుకోవడమూ, విలన్ల అంతు చూడ్డమూ అంతా ప్రైవేటే. మరి ఎమ్మార్వో పాత్ర దేనికి? ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చిన ఐదు నిమిషాలకే, జగపతి బాబు అడ్డం తిరగడంతో ఎమ్మార్వో పాత్ర ఔటై పోయింది! కథకి పనికి రాకుండా పోయింది. హీరో పాత్ర అవసరం లేకుండా చేసే ఇంత బ్లండర్ ఇంకే  సినిమాలోనూ చూడం.

        ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చాక ఒక సీన్లో నేను మెంటల్ రౌడీ ఆఫీసర్ అంటాడు. ఈ మాట ప్లాట్ పాయింట్ వన్ లో అనిపించి పాత్రని మార్చేసి వుంటే పోయేదేమో. జగపతి బాబు స్టే తెచ్చుకోవడం ఎలాటి ఆయుధమో గ్రహించినట్టు లేదు. నువ్వు ఎమ్మార్వోగా వచ్చావా నాయనా? ఐతే నేను స్టే తెచ్చుకున్నాను, ఇప్పుడు ఏ పవర్స్ తో ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని వుంటే, ఒక బలమైన డ్రమేటిక్ క్వశ్చన్ పుట్టేది కథ బలంగా నడవడానికి.

        నానికి నిషా దిగి, ఎమ్మార్వోగా పవర్స్ లేవని అర్ధమై- ఐతే నేను మెంటల్ రౌడీ ఆఫీసర్ని! అని కౌంటర్ ఇస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని దిగిపోతే, అదో రచ్చ చేసే ఎమ్మార్వో క్యారక్టరైనా అయ్యేది, బతికేది.

        హిడెన్ ట్రూత్ సంగతికొస్తే, ఇది వెల్లడించే లాయర్ (సీవీఎల్ నరసింహారావు) సిన్సియర్ లాయర్ అన్పించడు. ఎందుకంటే, ఆదిశేషు నాయుడు చనిపోతున్నప్పుడు తను అక్కడే వుండి, ఆస్తి పంపకం గురించి చెప్పిన మాటలు వింటాడు. కానీ సైలెంట్ అయిపోతాడు. హిడెన్ ట్రూత్ విషయానికొచ్చేసరికి జన్మ రహస్యం నానికి చెప్పేస్తాడు. సరే, నాని ఇప్పుడేం చేయాలి- ఆస్తికి తను వారసుడైనప్పుడు, ఈ నిజం జగపతి బాబుకి చెప్పేసి - నేను ఆస్తికోసం లేను, ఆస్తిని నువ్వు ఇంట్లో అందరికీ పంచేసేయ్- అని వెళ్ళిపోతే పాత్ర ఉదాత్త పాత్రగానైనా మారేది.

        డబ్బు కాదు కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో చెప్పడానికీ సినిమా తీశామన్నా రు. ఇందులో పోట్లాట అంతా డబ్బు కోసమే కదా. హీరో, విలన్ సహా ఇంట్లో ఎవరికి వాళ్ళ తగువులాట ఏమిటి. విలన్ ఆస్తితో పోతే పోయాడు, మనమంతా కలిసి వుందామని ఎందుకనుకోరు. కుటుంబ సినిమాలు తీయాలంటే చాలా మెచ్యూరిటీ అవసరమేమో. ఇలా యాక్టివ్ పాత్ర, సరైన కాన్ఫ్లిక్ట్, గోల్ లాంటి కనీసావసరాల్లేకుండా రాస్తే స్క్రీన్ ప్లే అయిపోతుందా?

సికిందర్