రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జనవరి 2022, బుధవారం

1123 : స్పెషల్ ఆర్టికల్

    జట్కా బండి వాడు ముస్లిం వ్యక్తిని జట్కా బండిలో తీసికెళ్ళి దింపి, నాల్గు రెట్లు డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. అడిగిన డబ్బు ఇవ్వక పోతే పాకిస్తాన్  వెళ్ళిపొమ్మంటాడు. అందుకా ముస్లిం వ్యక్తి  - ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోవడానికే స్వాతంత్ర్యం వచ్చినట్టుంది అంటాడు. తర్వాత్తర్వాత పరిస్థితులు దుర్భరమై పాకిస్తాన్ వెళ్ళిపోవడానికే ప్రయాణం కడతాడు.

        క ముస్లిం యువకుడు దేశ విభజన జరిగినప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళిపోలేదని తండ్రిని అడుగుతాడు. అందుకా తండ్రి - ఆగ్రా లో మనింటి బయట నువ్వు చెట్టుని చూడలేదా? నేనూ మీ అమ్మ ఆ చెట్టుని అమితంగా ప్రేమించాం అంటాడు.

        ఒకటి 1947 దేశ విభజన జరిగిన సందర్భం. ఇంకొకటి 1992 బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన సందర్భం. ఎం ఎస్ సత్యూ 1973 లో గరం హవా తీసినప్పుడు ముస్లిం చారిత్రికాలతో, నవాబీ సంస్కృతితో, ముస్లిం సోషల్స్ తో, సంగీత విందు వినోదాల కులాసా సినిమాలుగా వున్న ముస్లిం సినిమాల గతిని మార్చేశాడు. నిత్య జీవితంలో సామాన్య ముస్లిముల నిస్సహాయ జీవితాల్ని చిత్రించే వాస్తవిక - న్యూవేవ్ సినిమాల వైపు ముస్లిం సినిమాల్ని మలుపు తిప్పాడు. దీంతో శ్యామ్ బెనెగల్, సయీద్ అఖ్తర్ మీర్జా, ముజఫర్ అలీ వంటి దర్శకులు ముస్లిం న్యూవేవ్ సినిమాలతో తెరపై కొచ్చారు.

         తర్వాత 1995 లో సయీద్ అఖ్తర్ మీర్జా బాబ్రీ కూల్చివేత నేపథ్యంలో నసీమ్ తీసినప్పుడు, అప్పుడున్న ముస్లిం నిస్సహాయ జీవితాల వాస్తవిక సామాజికాల్ని, తిరుగుబాటు టెర్రరిజం సినిమాల దిశగా ప్రయాణం కట్టించాడు. అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, హన్సల్ మెహతా, అపూర్వ లఖియా వంటి దర్శకులు ఇలాటి టెర్రరిజం సినిమాలకి బీజం వేశారు.

       ఇలా ముస్లిం సినిమాలు ఆవిర్భవించిన ఈ 82 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కాలాల్నిబట్టి కథా వస్తువుల్ని మార్చుకుంటూ వచ్చాయి. ముస్లిం సినిమాలేమీ ఇతర భాషల సినిమాల్లాగా 1910, 1920 దశాబ్దాల మూకీల కాలంలో పుట్టుకు రాలేదు. టాకీల కాలంలో 1939 లోనే షోరాబ్ మోడీ దర్శకత్వంలో పుకార్ అంటూ తొలి ముస్లిం సినిమా పుట్టింది. ఇప్పుడు నరేంద్ర మోడీ కాలంలో బేకార్ అంటూ గిట్టింది. పుట్టినప్పుడు కాల్పనిక కథతో పుట్టలేదు. దేశంలో ఏ భాషా చలన చిత్రాలైనా మూకీల కాలంలో పౌరాణికాలతోనే ప్రాణం పోసుకున్నాయి. అప్పట్లో సినిమాల కోసం కథలు రాసేంత నేర్పు లేదు. అందుకని పురాణ కథల్ని, అవి కూడా చిత్రానువాదం చేసినట్టు దృశ్యాలు తీయడానికి అనుకూలంగా వుండే పౌరాణిక నాటకాల్ని వున్నదున్నట్టు తెర కెక్కించే వాళ్ళు. సినిమా పితామహులు దాదా సాహేబ్ ఫాల్కే అయినా, రఘుపతి వెంకయ్య నాయుడైనా మూకీల కాలంలో ఈ పద్ధతినే అనుసరించారు.

        మూకీల నుంచి టాకీలుగా మారేక కూడా సినిమాలకి పౌరాణిక నాటకాలే ఆధారమయ్యాయి, సినిమాల కోసం ప్రత్యేకంగా కథలు సృష్టించి  కాల్పనికాలు తీయడం మొదలు పెట్టింది 1930 తర్వాత నుంచే. ముస్లిం సినిమాలు తీయడానికి పౌరాణికాలు లేవు కాబట్టి - ప్రత్యేకంగా కాల్పనిక కథలు రాసే వాళ్ళూ ఇంకా లేరు కాబట్టి, 1939 లో నిర్మించిన తొలి ముస్లిం సినిమా పుకార్ ని షోరాబ్ మోడీ చారిత్రక కథతో తీశాడు. ఇది మొఘల్ చక్రవర్తి జహాంగీర్ కథ. ఇందులో షోరాబ్ మోడీతో బాటు చంద్రమోహన్, నసీమ్ బాను నటించారు.


     స్వాతంత్ర్య పూర్వం ఈ ప్రారంభం స్వాతంత్ర్య పోరాట కథల్నేమీ ముట్టుకోలేదు.  పుకార్ చారిత్రాత్మకం తర్వాత వెంటనే 1940 లో ఖైదీ విడుదలైంది. ఇది ప్రేమ కథల ముస్లిం కాల్పనిక సోషల్స్ కి ప్రారంభం. దీని దర్శకుడు ఎస్ ఎఫ్ హస్నైన్. మెహతాబ్, మాధురి నటీనటులు. 1943 లోనే మహెబూబ్ ఖాన్ ప్రేమ కథతో కూడిన ముస్లిం సోషల్ నజ్మా ని సామాజిక స్పృహతో తీసి- ఇంకో నాలుగు  దశాబ్దాల పాటు ఇటువంటి సినిమాలు రావడానికి బాట వేశారు. ఇందులో ప్రేమ కథ చుట్టూ ముస్లిముల సమాజంలో విద్య ప్రాధాన్యం గురించీ, వివాహ వ్యవస్థ పరిరక్షణ గురించీ అంశాల్ని జోడించి కథ చెప్పారు. అశోక్ కుమార్, వీణా హీరో హీరోయిన్లు. ఇది యూట్యూబ్ లో వుంది.

        ఇక చౌద్వీ కా చాంద్, మేరే మహెబూబ్, దిల్ హీతో హై, బేనజీర్, బహూ బేగమ్, మేరే హుజూర్, మహేబూబ్ కీ మెహందీ, నిఖా, నూరీ...ఇలా 1980 ల వరకూ పదుల సంఖ్యలో వీటికొక స్వర్ణ యుగం అయింది. గురుదత్, రాజ్ కపూర్, అశోక్ కుమార్, రాజేంద్ర కుమార్, జీతేంద్ర, రాజేష్ ఖన్నా, మీనా కుమారి, వహీదా రెహమాన్, నూతన్, సాధన, లీనా చందా వర్కర్, ప్రాణ్ మొదలైన ప్రసిద్ధ నటీ నటులెందరితోనో ఇవి మెయిన్ స్ట్రీమ్ మ్యూజికల్ కమర్షియల్ హిట్ క్లాసిక్ సినిమాలుగా వుండేవి. ప్రేక్షకుల్లో మత వివక్ష వుండేది కాదు. ఈ సినిమాలతో జాతీయ సమైక్యతలో భాగంగా వుండే వాళ్ళు. ఇప్పటి ప్రేక్షకుల్లా కాకుండా, అప్పటి ప్రేక్షకులకి ఈ సినిమాలతో ముస్లిములంటే ఏమిటో తెలిసేది. వర్గీకరిస్తే ఇవి ముస్లిం సినిమాలు గానీ, లేకపోతే హిందీ సినిమాలే.

వైభవం- వాస్తవికం
        ఇది కేవలం ముస్లిం సోషల్స్ యుగమని చెప్పలేం. ఒక్కో తరహా ముస్లిం సినిమాలకి ఒక్కో కాలమంటూ లేదు. ఈ యుగంలోనే చారిత్రికాలూ, నవాబీ సంస్కృతులూ, తవాయీఫ్ నృత్య గానాల సినిమాలూ అన్నీ కలిసి వచ్చాయి. మొఘలే ఆజమ్, తాజ్ మహల్, అనార్కలీ, జహనారా వంటి చారిత్రికాలు; చౌద్వీ కా చాంద్, షత్రంజ్ కే ఖిలాడీ, పాల్కీ వంటి నవాబుల సంస్కృతి సినిమాలు; పాకీజా, ఉమ్రావ్ జాన్, తవాయిఫ్ వంటి నవాబుల ఖోటాల్లో ఉర్దూ కవిత్వం, ఖవ్వాలీ, గజళ్ళూ, వేశ్య (తవాయిఫ్) ల గానా బజానాలతో కూడిన తవాయిఫ్ సినిమాలూ వచ్చాయి. వీటిలో మీనాకుమారీ, రేఖా వంటి ప్రసిద్ధ నటీమణులు ప్రధాన పాత్రలు పోషించారు.

        ఈ మొత్తం చారిత్రక, సోషల్, నవాబీ, తవాయిఫ్ సినిమాలు సామాన్య ముస్లిముల మనస్సుల్ని కమ్మేసి ఒకలాటి మత్తులో వుంచాయి. ఒక కార్యక్రమంలో జావేద్ అఖ్తర్ ఈ సినిమాల గురించి జోకేశారు - ఈ సినిమాలు చూసి పంక్చర్లు వేసేవాడు మా తాతలు చాలా గొప్పోళ్ళని ఫీలవుతూ హీరోలా తిరిగే వాడని. ఈ జోకుని పొడిగిస్తే ఇప్పుడు తాతలు పోయి రక్తపు మరకలతో తను మిగులుతున్నాడు. గాజులమ్మినా రక్తపు మరకలు.


            ఆ మత్తు లోంచి బయటికి వచ్చేట్టు ఎంఎస్ సత్యూ గరం హవా తీసి - మత్తు నిచ్చే స్వర్ణ యుగాన్ని సమాప్తం చేశాడు. ఇందులో ప్రసిద్ధ నటుడు బాలరాజ్ సహానీ, సలీం మీర్జా అనే బాధిత ముస్లిం వ్యక్తి పాత్ర పోషించాడు. ఇక సయీద్ మీర్జా దర్శకత్వంలో ఆర్ధిక ఇబ్బందులు పడే – సలీం లంగ్డే పే మత్ రో (కుంటి సలీం గురించి ఏడ్వమాక), ముజఫర్ అలీ దర్శకత్వంలో అంజుమన్ (సభ), సాగర్ సర్హదీ దర్శకత్వంలో వేశ్యా వాటిక కథతో బజార్’, శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో మండీ’, సర్దారీ బేగమ్’, మమ్మో... వంటివి వరసబెట్టి వస్తూ, ముస్లిం సినిమాలు వాస్తవిక- రియలిస్టిక్-న్యూవేవ్ -ఆర్ట్ సినిమాల రూపంలోకి మారిపోయాయి.

        నవాబీ వైభవాల తవాయిఫ్ సినిమాలకి ప్రతిగానూ ఒక మలుపు తిప్పే ముస్లిం వాస్తవిక సినిమా వచ్చింది... 1970 లో రాజీందర్ సింగ్ బేడీ దర్శకత్వంలో - సమకాలీన కథతో దస్తక్. ఇందులో సంజీవ్ కుమార్, రెహానా సుల్తాన్ నటించారు. యూ సర్టిఫికేట్ తవాయిఫ్ సినిమాలకి భిన్నంగా ఇది ఏ సర్టిఫికేట్ పెద్దలకి మాత్రమే సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. ఇందులో సల్మా అనే కాల్ గర్ల్ పాత్రలో రెహానా నటిస్తే, ప్రేమికుడు హమీద్ పాత్రలో సంజీవ్ కుమార్ నటించాడు. వేశ్య కథతో ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో రెహానా నటనకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు లభించింది. పూనా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని అయిన తను తర్వాత ఇలాటి పాత్రలకే ముద్రపడి పోయింది. 

        ఇలా ముస్లిం వాస్తవిక సినిమాల ఒరవడిలో నసీరుద్దీన్ షా, ఫరూఖ్ షేక్, మకరంద్ దేశ్ పాండే, షబానా అజ్మీ, స్మితా పాటిల్, సుప్రియా పాఠక్, రోహిణీ హట్టంగడి లాంటి సమాంతర సినిమా కళాకారులూ పరిచయమవడం మొదలెట్టారు.  

ఇక విభజన రేఖ    
        ఐతే పైవాటితో సమాంతరంగా ఇంకోటి జరుగుతూ వచ్చింది. హిందీ కమర్షియల్ సినిమాల్లో హీరో కోసం ప్రాణాలిచ్చే విశ్వాసపాత్రుడైన స్నేహితుడుగా ముస్లిం పాత్ర వుండేది. ఉదాహరణకి జంజీర్ లో అమితాబ్ బచ్చన్ కి షేర్ ఖాన్ ప్రాణ్ లాగా, దీని రీమేక్ నిప్పులాంటి మనిషి లో ఎన్టీఆర్ కి షేర్ ఖాన్ సత్యనారాయణ లాగా. పోను పోనూ ఈ పాజిటివ్ పాత్రల స్థానంలో నేరస్థులుగా, విలన్లుగా ముస్లిం పాత్రల్ని చూపించడం మొదలెట్టారు. బహుశా ఇది స్మగ్లర్ హాజీ మస్తాన్ వల్ల కావొచ్చు. ఇక్కడ్నుంచీ మొదలయ్యింది హిందూముస్లిమ్ భాయ్ భాయ్ కాస్తా హిందూ ముస్లిం నైనై గా విభజన రేఖ గీయడం. ఇది కాస్తా మాఫియా దావూద్ ఇబ్రహీం టైపు పాత్రలతో పరాకాష్ఠకి చేరింది. ఒకవైపు సమాంతర వాస్తవిక సినిమాల్లో నిస్సహాయ బాధిత ముస్లిం పాత్రలుంటే, అశేష ప్రజానీకం చూసే ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాల్లో విభజిస్తూ రౌడీ ముస్లిం పాత్రలు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేతతో వాస్తవిక సినిమాల్లోని నిస్సహాయ బాధిత ముస్లిం పాత్రలు మత హింస నెదుర్కొనే తిరుగుబాటు టెర్రరిస్టు పాత్రలుగా మారిపోయాయి...


        1973 లో ఎంఎస్ సత్యూ దేశ విభజన నేపథ్య కథగా ముస్లిం అస్తిత్వ గరం హవా తీసి ముస్లిం సినిమాల్ని ఒక మలుపు తిప్పితే, 1995 లో సయీద్ అఖ్తర్ మీర్జా బాబ్రీ మసీదు కూల్చివేత హింసతో ఇంకో మలుపు తిప్పాడు. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన మత మారణ కాండతో నసీమ్ తీశాడు. టీవీలో హిందువులు ముస్లిములు చంపుకోవడాల్ని చూసి బెదిరిపోతున్న మనవరాలిని - స్వాతంత్ర్య పూర్వం ఆగ్రాలో తను చూసిన చల్లని హిందూ ముస్లిం సహజీవనం గురించి చెబుతూ ఊరడించే తాత కథ. 

        ఇక్కడ్నుంచి తిరుగుబాటు టెర్రరిస్టు సినిమాలు మొదలయ్యాయి. 2000 లో ఖాలిద్ మహ్మద్ తీసిన ఫిజా’, 2004 లో అనురాగ్ కశ్యప్ తీసిన బ్లాక్ ఫ్రైడే’, 2008 లో రాజ్ కుమార్ గుప్తా తీసిన అమీర్’, 2012 లో హన్సల్ మెహతా తీసిన షాహిద్’, 2014 లో విశాల్ భరద్వాజ్ తీసిన హైదర్ ఈ కోవలో కొన్ని. 2002 గుజరాత్ ఊచకోతతో నందితా దాస్ తీసిన ఫిరాఖ్’, అపర్ణా సేన్ తీసిన మిస్ట ర్ అండ్ మిసెస్ అయ్యర్ కూడా ప్రసిద్ధి చెందాయి. టెర్రరిజంతో ముస్లిం వాస్తవిక సినిమాలు ఆలోచనాత్మకంగా వుంటే, కమర్షియల్ సినిమాలు ముస్లిములని నెగెటివ్ గా చూపించడం మొదలెట్టాయి. ముస్లిం మాఫియా విలన్ కాస్తా టెర్రరిస్టుగా మారిపోయాడు. బాలీవుడ్ లో ఒక వర్గం గత ఆరేడేళ్ళుగా తీస్తున్న హిందీ సినిమాలైతే బాహాటంగా దేశభక్తి ముసుగులో మతభక్తితో విభజన రేఖ కాదు, గట్టి అడ్డుగోడ కట్టేస్తున్నాయి.

           తాజాగా విడుదలైన సూర్యవంశీ అనే టెర్రరిజం సినిమాలో పొడుగు గడ్డం, చిన్న గడ్డం, గడ్డం లేని వాళ్ళుగా ముస్లిములని వర్గీకరిస్తూ వీళ్ళు ఏఏ మనస్తత్వాలతో వుంటారో వర్ణించారు! గుడ్ ముస్లిం-బ్యాడ్ ముస్లిం అంటూ తేడాలు చెప్పారు. పచ్చి టెర్రరిస్టులుగా చూపించారు. గుడ్ హిందూ- బ్యాడ్ హిందూ ఎలా వుంటారో కూడా చెప్పకుండా. పాక్ ని టార్గెట్ చేసే కథా వస్తువులో ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేసేశారు.

        ఇంకో సత్యమేవ జయతే అనే అతి దేశభక్తి సినిమాలో మతభక్తి లేకుండా సామాజిక భక్తితో వీరంగం వేశారు రాజకీయ నాయకుల మీద.  ప్రభుత్వాఫీసు ముందు ఖురానుజానీమాజ్ పట్టుకుని నిలబడ్డ ముస్లిం స్త్రీని ప్రశ్నించిన అధికారికి జాన్ అబ్రహాం రాజ్యాంగం గురించి క్లాసు పీకి నోర్మూయిస్తాడు. ముస్లిములని వెనకేసు కొస్తూ ఇంకో చోట-  సిగ్నల్ దగ్గర పోలీసుకి వంద రూపాయల మీద ఆశ. నీ పేరు ఖాన్ అయితే నీ ఖాందాన్ (వంశం) మొత్తం టెర్రరిస్టులే. రైతు వాడింట్లో వాడే ఫ్యానుకి వేలాడే నా దేశం మహాన్ హై! అని గర్జిస్తాడు.     

ఆశావహ కాలం
        టెర్రరిజం సినిమాల మధ్య బాలీవుడ్ లో, అటు కేరళలో మళ్ళీ ముస్లిం సోషల్స్ వచ్చాయి. బాలీవుడ్ నుంచి 2020 లో బాబా అజ్మీ దర్శకత్వంలో  ‘మీ రఖ్సమ్’ (I Dance) ఒకటి. నాట్యానికి మతం లేదనిమత మౌఢ్యమే సంకెళ్ళనీ ముస్లిములలో మౌఢ్యం గురించి చెప్పాడు.  ‘నీకు (ముస్లిం) సమాజం ఉపాధి నిచ్చిందినువ్వు (ముస్లిం) సమాజానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే (ముస్లిం) సమాజం నీ ఉపాధిని తీసేసుకుంటుంది’ అని ఈ సినిమాలో మత పెద్ద టైలర్ ని హెచ్చరిస్తాడు. స్వార్ధపు మాటలిలాగే వుంటాయి. సమాజం కలిసి వుండడానికి మతమా  ఆధారంవిత్తమావిత్తమే సమాజపుదేశపు మూలాధారంభాండాగారం. పెత్తందార్లు కులమతాలుగా సమాజాన్ని విడగొట్టిఆర్ధిక రంగం నడ్డి విరిచేస్తారు. మత పిచ్చితో ధనలక్ష్మితో రుద్ర తాండవమాడతారు. ఇదే చెప్పదల్చాడు దర్శకుడు.

        ఉపాధినిచ్చే సమాజం ఆత్మహత్యా సదృశంగా ఉపాధిని తీసేసుకోదుతీసేసుకునేలా మత మౌఢ్యం చేస్తుంది. కానీ కడుపాకలి తెలిసిన సమాజం విత్తం కోసం మౌఢ్యం నుంచి భావ స్వాతంత్రాన్ని కోరుకుంటుంది. ఇది పవర్ఫుల్ ఆయుధం. మౌఢ్యం ఉపాధిని తీసేస్తేభావ స్వాతంత్ర్యం ఉపాధిని కల్పిస్తుంది. ఒక ముస్లిం బాలిక భరత నాట్యం నేర్చుకోవాలనుకోవడం ఆమె భావస్వాతంత్ర్యం. మతంతో సంబంధం లేదు. కళలనేవి సాంస్కృతిక వ్యక్తీకరణలు. చివరికి ఆ ముస్లిం బాలిక భరత నాట్యం చేస్తూంటే అవతలి మతం లోంచి కూడా అడ్డుకునే ప్రయత్నం. దీంతో దమ్ అలీ అలీ దమ్ - ఝనక్ ఝనక్ నాచే నటరాజ్ రే’  అనే సూఫీ భక్తి ఫ్యూజన్ పాట సెల్ ఫోన్లో మోగించి నాట్యం చేసేస్తుంది. అంటే మతాల చేతిలోంచి నాట్యం వెళ్ళిపోయి టీనేజర్ల చేతిలో వాళ్ళ దృక్పథంతో ఇలా వైరల్ అయ్యే కాలం వచ్చిందన్న మాట.

            కేరళ నుంచి రెండు మలయాళ ముస్లిం సినిమాలు వచ్చాయి 2020 లో. షానవాజ్ దర్శకత్వంలో  ‘సూఫీయుమ్ సుజాతాయుమ్, జకారియా మహ్మద్ దర్శకత్వంలో హలాల్ లవ్ స్టోరీ. మొదటి దాన్లో మతం ఎక్కువైపోయి సామాజికం తగ్గింది. రెండో దాన్లో సామాజిక దృష్టి వుంది. ఇందులో కేరళలోని మలబార్ ప్రాంతపు సాంప్రదాయ ముస్లిం సమాజం వచ్చేసి సామాజికంగా చొరవ చూపాలకునే కథఅల్లా చుట్టూ తిరిగే సాంప్రదాయ ముస్లింసామాజికంగా బతకడానికి మెయిన్ స్ట్రీమ్ లోకొచ్చిన ఉదారవాద ముస్లిం మధ్య విలువల సున్నితసంయమనంతో కూడినఎడ్యుకేటెడ్ సంఘర్షణ. ఇది కథలో కథ కూడా. అంటే సినిమాలో సినిమా. సాంప్రదాయానికి మత సంస్థనిఅభ్యుదయానికి సినిమా నిర్మాణాన్నీ ముఖాముఖీ చేసిఅభ్యుదయ అభ్యంతరాలకి సాంప్రదాయ ఊరడింపులతోసాంప్రదాయ అభ్యంతరాలకి అభ్యుదయ చిట్కాలతో కార్యం పూర్తి చేసుకునే ప్రణాళిక. ఇందులో దర్శకుడు ఎటువైపు వున్నాడంటేఏ వాదమూ తీసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో వుంటాడు.

        సూఫీయుమ్ సుజాతాయుమ్లో బ్రాహ్మణ యువతీకీ, ముస్లిం సూఫీ సన్యాసికీ మధ్య నిషిద్ధ -విషాద ప్రేమ కథ. ఇందులో ప్రేమ కంటే మతం ఎక్కువైపోయి భక్తి సినిమాలా వుంటుంది. ఇందులో సంగీత స్వరాలూ ఆలాపనలూ సూఫీ సాంప్రదాయంలో వుండవు. సూఫీ సంగీతమంటే ప్రధానంగా ఖవ్వాలీలు. అయితే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఖురాన్ ఉల్లేఖనాల ఆలాపనలు, వాటికి తగిన స్వరాలే తప్ప, ఖవ్వాలీల జాడే వుండదు. చిట్ట చివర్లో ఒక్క ఖవ్వాలీ వస్తుంది. అది కూడా బిట్ సాంగ్.

        ఇక సినిమా సాంతం ప్రేమ కాకుండా ఏకధాటిగా మతమే కన్పించడంతో, మత శ్లోకాలే విన్పించడంతో, ఆ ఆచార వ్యవహారాలే చూపించడంతో, ప్రేమ సినిమా కాక భక్తి సినిమాలా తయారయ్యింది. 2017 లో ఇదే షానవాజ్ తీసిన ‘కిస్మత్’ లవ్ జిహాద్ మీద బలమైన వాస్తవిక కథగా వచ్చిందని రివ్యూలు వచ్చాయి. ఇది ముస్లిం అబ్బాయి - దళిత అమ్మాయి ప్రేమ కథ. 

        2020 లోనే కన్నడలో ఫ్రెంచి బిర్యానీ అనే యాక్షన్ కామెడీ వచ్చింది. దర్శకుడు పన్నాగాభరణ బెంగళూరు స్టాండప్ కమెడియన్లు డానిష్ సేట్, సాల్ యూసుఫ్ లతో తీశాడు. ఇందులో ఆటో డ్రైవర్ అస్ఘర్ అలీగా డానిష్ సేట్ కన్నడ యాసలో ఉర్దూయే మాట్లాడతాడు. అతడింట్లో సీన్లు ఉర్దూలోనే వుంటాయి. ఇలాటి ఉర్దూ సినిమాలు హైదారాబాద్ లో కూడా తీశారు. వీటిని డెక్కనీ కామెడీ లంటారు. ది అంగ్రేజ్, హైదారాబాద్ నవాబ్స్, హంగామా ఇన్ దుబాయ్ లాంటివి. ఇవి హైదరాబాదీ ఉర్దూలో హిట్టయిన కామెడీలు.

        ఎటొచ్చీ ఆ రెండు సినిమాలే చేదు నిజం చెబుతూ కళ్ళు తెరిపిస్తాయి- దేశ విభజన జరిగిన తాజా పరిణామాలతో ఎంఎస్ సత్యూ తీసిన  గరం హవా’ లో - ఓ జట్కా బండి వాడు ముస్లిం వ్యక్తిని జట్కా బండిలో తీసికెళ్ళి దింపినాల్గు రెట్లు డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. అడిగిన డబ్బు ఇవ్వక పోతే పాకిస్తాన్ వెళ్ళిపొమ్మంటాడు. అందుకా ముస్లిం వ్యక్తి సలీం మీర్జా- ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకోవడానికే స్వాతంత్ర్యం వచ్చినట్టుంది అంటాడు. తర్వాత్తర్వాత పరిస్థితులు దుర్భరమై పాకిస్తాన్ వెళ్ళిపోవడానికే ప్రయాణం కడతాడు.        

    ప్రయాణం కడుతూంటే నిరుద్యోగానికీ
అణిచి వేతకీ వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ గుంపు ఎదురవుతుంది. సలీం మీర్జాని ఓ వ్యక్తి ఆపిదేశం విడిచి వెళ్ళిపోకూడదనీదేశం బాగు కోసం దేశం లోనే వుండి అందరం పోరాడాలనీ అనడంతోఆగిపోయి ఆందోళనలో చేరిపోతాడు. ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి రాసిన కథకి కైఫీ అజ్మీషమా జైదీ చిత్రానువాదం చేశారు. దీనికి సెన్సార్ బోర్డు అనుమతి నివ్వలేదు. ప్రధాని ఇందిరాగాంధీ జోక్యంతో విడుదలైంది. దీనికి జాతీయ అవార్డు లభించింది.        

        సయీద్ అఖ్తర్ మీర్జా బాబ్రీ మసీదు కూల్చివేత  హింసతో  తీసిన ‘నసీమ్’ లో- దేశ విభజన జరిగినప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళిపోలేదని తండ్రిని కొడుకు అడుగుతాడు. అందుకా తండ్రి పాత్రలో సుప్రసిద్ధ కవి కైఫీ అజ్మీ తుది శ్వాస విడుస్తూ - ‘ఆగ్రా లో మనింటి బయట నువ్వు చెట్టుని చూడలేదానేనూ మీ అమ్మ ఆ చెట్టుని అమితంగా ప్రేమించాం’ అంటాడు. చెట్టుని కూకటి వేళ్ళతో పెకిలించి వేయడంలోని బాధని ఆ మాటల్లో వ్యక్తం చేస్తాడు. సయీద్ అఖ్తర్ మీర్జాఅశోక్ మిశ్రా కలిసి ఈ కథ రాశారు. దీంతో సయీద్ అఖ్తర్ మీర్జాకి ఉత్తమ దర్శకుడుగా జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ స్క్రీన్ ప్లేకి ఇంకో జాతీయ అవార్డు లభించింది. మాట్లాడితే పాకిస్తాన్ వెళ్ళిపొమ్మనే శక్తులకి ఈ రెండు సినిమాలు సమాధానం.

        ఈ శక్తుల కళ్ళు తెరిపించే ఇంకో సినిమా కూడా వుంది - 1961 లో ప్రసిద్ధ దర్శకుడు యశ్ చోప్రా తీసిన ‘ధరమ్ పుత్ర’ అనే ముస్లిం సినిమా. ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి రాసిన నవలకి అఖ్తరుల్ ఇమాన్ చిత్రాను వాదం. శశి కపూర్మాలా సిన్హా నటించారు. ఇందులో 1947 లో హిందూ జాతీయవాది (శశి కపూర్) ముస్లిముల పట్ల విద్వేషంతో రగిలి పోతూ వుంటాడు. ముస్లిములని దేశం నుంచి వెళ్ళ గొట్టాలని దళంలో చేరతాడు. గృహ దహనాలు చేసి ముస్లిములని చంపుతాడు. చివరికి తను ముస్లిముగా పుట్టానని తెలుసుకుని షాకు తింటాడు. ‘మత మేమైనా మనిషి కన్నాగొప్పదా?’ అంటుంది ముస్లింకి పుట్టిన అతడ్ని దత్తత తీసుకున్న హిందువు తల్లి.   

 —సికిందర్
చమన్ పత్రిక (జనవరి)


 

24, జనవరి 2022, సోమవారం

1122 : ఇరానియన్ మూవీ రివ్యూ!

 రచన-  దర్శకత్వం : అస్ఘర్ ఫర్హదీ
తారాగణం : అమీర్ జదీదీ, సహర్ గుల్దస్త్, మోహ్సేన్ తనబందే, సరీనా ఫర్హదీ తదితరులు
ఛాయాగ్రహణం : అలీ ఘాజీ, కూర్పు : హయదే సఫియారీ
బ్యానర్ : మెమెంటో ఫిలిమ్స్
నిర్మాతలు : అలెగ్జాండర్ మలెట్ గై, అస్ఘర్ ఫర్హదీ
పంపిణీ : అమెజాన్ స్టూడియోస్
విడుదల : జనవరి 21, 2022,  అమెజాన్ ప్రైమ్ వీడియో
***

    క వ్యాపారం కోసం రహీమ్ సుల్తానీ (అమీర్ జదీదీ) ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చాలంటూ ఫైనాన్సర్ బెదిరింపులకి దిగేసరికి, బహ్రామ్ (రచయిత, నటుడు మోహ్సేన్ తనబందే) అనే బంధువు రహీమ్ ని ఆదుకుని అప్పు మొత్తం 150,000 ఇరానీ రియాళ్ళు తను కట్టేస్తాడు. ఇప్పుడు బహ్రామ్ కి బాకీపడిన రహీమ్ ఇది కూడా తీర్చక పోయేసరికి, బహ్రామ్ కేసుపెట్టి రహీంని జైలుకి పంపించేస్తాడు.

    కొంత కాలం తర్వాత రహీమ్ పెరోల్ మీద విడుదలై వస్తాడు. అతను పెళ్ళయి విడాకులు తీసుకున్నాడు. పదేళ్ళ కొడుకు వున్నాడు. అక్కా బావలున్నారు. కొడుకుతో వాళ్ళ దగ్గరే వుంటాడు. బావ హొసేన్ (అలీరెజా జహందీదే) కి చెప్పి బహ్రామ్ తో రాజీ కుదర్చమంటాడు. కొంత కొంత అప్పు తీర్చేస్తానని, జైలు శిక్ష రద్దు చేయించమనీ కోరతాడు. ఈ రాజీ ప్రయత్నానికి బహ్రామ్ ఒప్పుకోక మొత్తం అప్పు తీర్చి తీరాల్సిందేనంటాడు. అతడికి జెరాక్స్ సెంటర్ నడుపుతున్న కూతురు ఫాతిమా (దర్శకుడి కుమార్తె సెరీనా ఫర్హదీ) వుంటుంది. ఆ కూతురి కట్నానికి దాచిన డబ్బు అది. ఆ డబ్బు మొత్తం ఒకేసారి కావాలంటాడు.

    రహీమ్ కి రహస్యంగా కలుస్తున్న గర్ల్ ఫ్రెండ్ ఫర్కొందే (సహర్ గుల్దస్త్) వుంటుంది. ఆమెని పెళ్ళి చేసుకోవాలంటే తన జైలు శిక్ష రద్దు అవాలి. ఆమెని కలవడానికెళ్తే ఆమె ఒక బ్యాగు దొరికిందని చూపిస్తుంది. అందులో 17 బంగారు నాణేలుంటాయి. వాటిని అమ్మి అప్పు తీర్చేద్దామని ప్రయత్నిస్తే, వాటి మీద వచ్చే డబ్బు అప్పు తీర్చడానికి చాలదని తెలుస్తుంది.  

అబద్ధాల కోటలో హీరో

  దీంతో ఒక ఆలోచన చేస్తాడు. ఈ బంగారంతో తన నిజాయితీ నిరూపించుకుంటూ వార్తలకెక్కితే తను హీరో అవుతాడనీ, అన్ని సమస్యలూ ఒక్క దెబ్బతో పరిష్కారమై పోతాయనీ భావిస్తాడు. దీంతో వూరంతా తనకి దొరికిన బ్యాగు గురించి పోస్టర్లు వేసి, అక్క ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఆ బ్యాగు పోగొట్టుకున్న నాజ్నీన్ అనే కష్టాల్లో వున్న యువతి ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వచ్చి, రహీమ్ అక్క దగ్గర్నుంచి బ్యాగు తీసికెళ్ళి పోతుంది.

    ఇది టీవీ ఛానెల్ కి తెలిసి రహీమ్ ని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేస్తారు. అప్పు కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రహీమ్, అంత బంగారం దొరికినా దురాశ పడక, ఆ బంగారంతో అప్పు తీర్చేసి జైల్లోంచి బయటపడే ఆలోచన కూడా చేయకుండా, పరోపకార భావంతో బ్యాగు సొంతదారుకి అప్పగించేసి, హీరోలా ప్రవర్తించాడని వూరూ వాడా అవుతుంది. జైలు అధికారి కూడా రహీమ్ నిజాయితీని మెచ్చుకుంటూ ప్రకటన విడుదల చేస్తాడు.

    ఇదంతా చూసి బహ్రామ్ మండిపడతాడు. ఈ వెధవ హీరో అవడమేమిటి? సోషల్ మీడియాలో కూడా రహీమ్ కొస్తున్న మద్దతు చూసి, ఇప్పుడు కూడా బాకీ విషయంలో సడలింపుల ప్రశ్నే లేదంటాడు. ఇంతలో ఒక ఛారిటీ సంస్థ హీరో అయిన రహీమ్ ని సన్మానిస్తుంది. ఆ సన్మాన సభలో రహీమ్ కొడుకు చేత పథకం ప్రకారం మాట్లాడించి సానుభూతి పొందాలని చూస్తాడు. అప్పు తీర్చడానికి తన తండ్రి పడుతున్న కష్టాలు ఆ పిల్లవాడి నోటి నుంచి విన్న సభికులంతా కదిలిపోయి విరాళాలు కురిపించేస్తారు.

సాలెగూట్లో సుల్తానీ

    ఇక రహీమ్ ప్రభుత్వోద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటాడు. కానీ అధికారి ఈ బ్యాగు వ్యవహారం నిజమేనా అని ప్రశ్నించడం మొదలెడతాడు. బ్యాగు తనకే దొరికిందనీ, దాన్ని ఆ బ్యాగు సొంతదారైన యువతికి అప్పజెప్పామనీ అంటాడు రహీమ్. ఆమె ఫోన్ నంబర్ ఇమ్మంటాడు అధికారి. ఆమె టాక్సీ డ్రైవర్ ఫోన్నుంచే మాట్లాడిందనీ, అందుకని ఆమె ఫోన్ నంబర్ తెలీదనీ అంటాడు  రహీమ్. ఆమె ఎవరో ముందుకొచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప రహీమ్ ఉద్యోగ దరఖాస్తుని పరిశీలించలేమని స్పష్టం చేసేస్తాడు అధికారి.

    రహీమ్ విరాళాలు సేకరించిన ఛారిటీ సంస్థకి వెళ్తే, సంస్థ నిర్వాహకురాలు రద్మెహర్ (రచయిత్రి, నటి, దర్శకురాలు ఫరిష్టే సదర్) మొత్తం రహీమ్ వ్యహారాన్ని అనుమానించి, ఆ సేకరించిన విరాళం మరణ శిక్ష పడ్డ ఓ ఖైదీ విడుదలకి బ్లడ్ మనీ గా చెల్లించేశామని చెప్పేస్తుంది. ఇక్కడ రహీమ్ ఇంకో ఫోజు కొడతాడు- ఆ సభలో కొడుకు చేత తను అలా మాట్లాడించింది నిజానికి ఆ ఖైదీ కోసం అలా విరాళాలు వసూలవ్వాలనే అంటూ - మళ్ళీ ఈ క్రెడిట్ కూడా కొట్టేసి మరింత హీరోనై పోవాలనుకుంటాడు.

    అయితే తను కడుతున్న అబద్ధాల మేడ కూలిపోతోందని కూడా గమనించకుండా, ఇంకో పథకం వేస్తాడు. బ్యాగు సొంతదారు ఈమేనంటూ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసికెళ్ళి అధికారికి చూపించేస్తాడు. దీంతో పూర్తిగా తన అబద్ధాల - పథకాల సాలెగూడులో తనే పీకల దాకా చిక్కుకు పోతాడు రహీమ్ సుల్తానీ ...

ఎలా వుంది కథ

లోపలి మనిషితో ఈ కథ... మనకి ఒక్కటే పరిశుభ్రమైన రంగు వుందనీ, అది తెల్లటి తెలుపు అనీ, దాని మీద ఒక్క మరక కూడా పడే ప్రసక్తే లేదనీ ఫీలవుతూ, ఎంతో నీతిగా జీవిస్తున్నామనుకుని మనతో మనం జాగ్రత్తగా వుంటూ, అవతలి వాళ్ళకి పరమ సత్యవంతుల్లా కన్పించే ప్రయత్నం చేస్తూంటాం. రోడ్డు మీద పడి నాల్గు రూపాయలు కన్పించగానే ఆ నిష్ఠా పరాయణత్వమంతా- నైష్ఠిక ప్రవృత్తి అంతా ఏమవుతుందో, ఎంత ముష్ఠిదో తేలిపోతుంది. రోడ్డు మీద రూపాయలు కన్పించగానే ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూస్తాం. ఎందుకు చూస్తాం? ఎవరూ చూడకపోతే జేబులో వేసుకోవచ్చని, చూస్తే ఈ డబ్బెవరిదీ అని హీరోలా అరవ్వచ్చనీ!

    ఇదే రహీమ్ సుల్తానీ లోపలి క్యారక్టర్. అతను దొరికిన బంగారాన్ని గర్ల్ ఫ్రెండ్ చూపించగానే గబుక్కున ఏం ఫీలయ్యాడో అదే అతడి క్యారక్టరైనా, ఇంకెవరి క్యారక్టరైనా. ఆ దొరికిన బంగారం అమ్ముకుని అప్పుల్లోంచి బయట పడొచ్చని ఫీలవ్వడం ఫీలవ్వడం  అబద్ధాల మీద అబద్ధాలు చెప్పించి పతనం అంచుకి చేర్చింది. అదే తగినంత బంగారం దొరికి వుంటే నిస్సందేహంగా అది అమ్ముకుని అప్పుల్లోంచి బయటపడే వాడు. తగినంత బంగారం దొరక్కపోయేసరికి - నిజాయితీ పరుడన్పించుకుంటూ ఇంకో విధంగా లాభపడాలన్న దుర్బుద్ధితో నాటకాన్ని రచించి హీరో అయ్యాడు.

    ఇక్కడ్నించే దేన్ని ఆధారంగా చేసుకుని పథకం ప్రకారం హీరో అన్పించుకున్నాడో ఆ బంగారం సొంతదారు దగ్గరికే వచ్చి ఆగుతుంది పరిస్థితి. ఆమెని వెతికి తీసుకొస్తే అంతా బాగానే  జరిగేది. అయితే ఖర్మ కొద్దీ ఏం జరిగిందంటే, పోస్టర్ల మీద ఫోన్ నంబర్ చూసి, టాక్సీ అతడి ఫోన్ తీసుకుని రహీమ్ అక్కకి ఫోన్ చేసి వచ్చి కలిసిన నాజ్నిన్, తన బాధంతా చెప్పుకుంటుంది. భర్త పని చేయడు. తనే తివాచీలు కుట్టి కూడబెట్టిన డబ్బుతో కొనుక్కున్న బంగారమది. అది దొరికినందుకు సంతోషంగా వుందని చెప్పి బ్యాగు తీసుకుని వెళ్ళిపోతుంది. రహీమ్ అక్క ఆమె వివరాలేమీ తీసుకోలేదు. అదీ సంగతి.

    ఇక ఆమె దొరక్కపోవడంతో తన గర్ల్ ఫ్రెండ్ నే ఆ యువతిగా ప్రవేశపెట్టి పతనానికి శరవేగంగా బాట వేసుకున్నాడు...ఈ క్రమంలో ఇంకో తప్పుకి పాల్పడతాడు. అప్పిచ్చిన బహ్రామ్ తోనే ఘర్షణ పెట్టుకుని కొడతాడు. అది వీడియో తీసేస్తుంది బహ్రామ్ కూతురు ఫాతిమా. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టేసిందంటే తనకొచ్చిన మంచి పేరంతా పోతుంది!

    చివరికెలా ముగిసింది? రహీమ్ కథ సుఖాంతమా, దుఖాంతమా? అప్పు తీర్చాడా? పెరోల్ గడువులోగా ఏం జరిగింది? తిరిగి జైలుకేనా, ఇంటికా? సింపుల్ కథ. ఇంత కథలా అన్పించని సింపుల్ కథ ఇలా తీస్తే తెలుగులో బావుంటుందా? కానీ నిజజీవితం ఇలాగే వుంటుంది. దీంట్లో కామెడీ గానూ తీయొచ్చు. తీస్తే కొత్తదనమేం వుండదు. ఈ తరహా కథా కథనాలని, మేకింగ్ నీ తెలుగులో చూస్తారా, తిప్పికొడతారా చెప్పడం కష్టం. సాహసించి ఎవరైనా ఇలాటి ప్రయత్నం చేస్తే తెలుగు సినిమా క్వాలిటీ మరో మలుపు తిరుగుతుంది. ఈ అమెజాన్ విడుదల ప్రస్తుతం అమెరికాలో  స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో  స్ట్రీమింగ్ అయినప్పుడు డబ్బింగ్ చేస్తే తెలుగు ప్రేక్షకుల స్పందనేమిటో తెలుస్తుంది.

నటనలు సాంకేతికాలు

రహీమ్ సుల్తానీగా అమీర్ జదీదీ చాలా ఎక్సెలెంట్ గా వుంటాడు. అతడిది స్మైలింగ్ ఫేస్. మనసులో ఆలోచనలని బయటపడనివ్వని స్మైలింగ్ ఫేస్. క్యారక్టర్ కి ఈ స్మైలింగ్ ఫేస్ లక్షణం కల్పించడం అద్భుత ఆలోచనే. అందరితో ఆత్మీయంగా వుంటాడు, ఎవరి ముందూ బయటపడడు. అలాటి వాడు గర్ల్ ఫ్రెండ్ విషయంలో బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ని రహస్యంగా వుంచిన తను ఆమెనే బంగారం సొంతదారుగా అబద్ధపు నాటకంలో ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

    గర్ల్ ఫ్రెండ్ గా సహర్ గుల్దస్త్ కూడా నీటుగా కన్పిస్తుంది. రోమాన్స్ వుండదు. రోమాన్స్ కి చోటులేదు. హీరో సమస్యతో సతమతమయ్యే పాత్రగా వుంటుంది. ఇంకో చెప్పుకోదగ్గ నటుడు బహ్రామ్ గా నటించిన మోహ్సేన్ తనబందే. కూతురి కట్నం కోసం దాచుకున్న డబ్బు తీసుకుని చెలగాట మాడుతున్న హీరోని జైలుకి పంపడం మినహా ఇంకేం ఆలోచించని, గొడవపడని హూందాతనం గుర్తుండి పోయేలా నటించాడు. ఇక ఛారిటీ సంస్థ నిర్వహకురాలిగా సీనియర్ నటి ఫరిష్టే సదర్ ది కూడా గుర్తుండిపోయే నటన. అందరి నటనలూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నటనలే. ఈ స్కిల్స్ వేరు. తెలుగులో తీయాలంటే ఈ స్థాయి స్కిల్స్ కూడా అవసరం.

    విజువల్స్ ఎక్కువగా అద్దాల గదుల్లో ఆఫీసుల్లో ఇళ్ళల్లో షాపుల్లో పారదర్శకంగా చాలా ప్లెజంట్ గా వుంటాయి. ఈ అద్దాల బ్యాక్ డ్రాప్ సింబాలిజం కావచ్చేమో. ఒక అబద్ధాల ప్రహసనం నడుస్తున్న నేపథ్యంలో, మనుషులనే వాళ్ళు అద్దాల్లా పారదర్శకంగా వుడాలని గుర్తు చేయాలనేమో. ప్రారంభంలో హీరో జైల్నుంచీ ఇంటికొస్తూ మధ్యలో బావగారు పనిచేస్తున్న కొండపైకి ఎక్కుతాడు. ఇది కూడా సింబాలిజమే కావచ్చు. అబద్ధాల మెట్లు కట్టుకుని పైకి ఎక్కేయ బోతాడనీ...

    ఇంకోటేమిటంటే బ్యాక్ గ్రౌండ్ స్కోరు వుండదు. ఓ రెండు మూడు డిమాండ్ చేసిన దృశ్యాల్లో మంద్రంగా తప్ప ఎక్కడా సంగీతమే వుండదు. తెలుగులో మేకర్స్ ఈ ఛాలెంజిని స్వీకరించే ధైర్యం చేస్తారా?

చివరికేమిటి

హీరో పాత్రది పూర్తిగా జైల్లోంచి బయటపడాలన్న స్వార్ధమే అనలేం. ఒక విధంగా బహ్రామ్ కి తోడ్పడాలనే. బంధువైన బహ్రామ్ కూతురి కట్నం డబ్బులు తను వాడేశాడు. అది తిరిగిచ్చేసి పెళ్ళి జరిగేలా చూసే నైతిక బాధ్యత ఫీలవ్వకుండా లేడు. అందుకు వేసింది మాత్రం తప్పటడుగులే. అయితే ఒక లాజిక్ ఈ కథ మొత్తాన్నీ సిల్లీ అన్పించేలా చేసేస్తుంది. హీరో ఆ బంగారాన్ని అమ్మాలని చూసి, సరిపోక రెండో ఆలోచనగా పోలీసులకి అప్పగించేస్తే ఈ గొడవంతా వుండదు. న్యాయ మార్గంలో అన్ని రివార్డులూ, విరాళాలూ పొందేవాడు. కథని  ఇలా చేస్తే కథ వుండదని దర్శకుడు ఇలా లాజిక్ ని బలి పెట్టుండొచ్చు.

    ఈ కథలో విడివిడిగా ప్రధాన పాత్రప్రత్యర్ధి పాత్రలనే సూత్రాన్ని కూడా పక్కన పెట్టాడు దర్శకుడు. ఈ కథ రహీమ్ కీ, బహ్రామ్ కీ మధ్య నడిచే కథ. అయినా బహ్రామ్ ప్రత్యర్థి కాడు. అతను మంచి వాడే. రహీమే హీరోనై పోవాలనుకుని విలనై పోయాడు. తన చర్యలతో తానే హీరో, తానే విలనైనప్పుడు ఇంకా వేరే విలనెందుకు కథకి? మన శత్రువులం మనమే, బయట శత్రువులెవరూ లేరు. ఇది లోపలి మనిషి కథ. మన లోపలి మనిషితో మనం జాగ్రత్తగా వుండకపోతే మంగళగిరి జాతరవుతుంది బతుకు.

    దర్శకుడు అస్ఘర్ ఫర్హదీ 2011 లో ఏ సపరేషన్’, 2016 లో ది సేల్స్ మాన్ తీసి రెండిటికీ ఆస్కార్ అవార్డులు పొందాడు. ఇప్పుడు ఏ హీరో వివిధ  అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 24 ఉత్తమ చలన చిత్ర అవార్డులు పొందింది. అంతేగాక  2021 ఆస్కార్ అవార్డులకి ఇరాన్ నుంచి ఎంట్రీగా వెళ్ళింది...

—సికిందర్


22, జనవరి 2022, శనివారం

1121 : బుక్ రివ్యూ!

 

 

        థ రాయడానికి ముందు కథ కోసం అనుకున్న ఐడియా (ప్రారంభ ఆలోచన) ని విశ్లేషించుకోవడం ఎంత ముఖ్యమో చాలా సార్లు చెప్పుకున్నాం. స్క్రీన్ ప్లే పుస్తకాల్లో, స్క్రీన్ ప్లే వెబ్సైట్స్ లో ఎక్కడా స్క్రీన్ ప్లే నేర్చుకోవడం ఐడియా నిర్మాణంతో మొదలు పెట్టుకుని నేర్చుకోవాలని  చెప్పలేదు. ఎందుకో తెలీదు. నేరుగా త్రీయాక్ట్ స్ట్రక్చర్, సీన్ రైటింగ్, క్యారక్టర్ రైటింగ్ వంటి అధ్యాయాలే  పుస్తకాల్లో వుంటున్నాయి. ఒక కథ చేసుకోవాలంటే నేరుగా ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ లలో కథని విభజించుకుని స్ట్రక్చర్ లో రాసుకు పోవాలనే పుస్తకాలు చెప్తాయి. మన దగ్గర వన్ లైన్ ఆర్డర్ తో ప్రారంభిస్తారు. రెండూ తప్పే. దేని గురించి రాస్తున్నామో దాని మినీ రూపం లేకుండా యాక్ట్స్ రూపంలోనో, వన్ లైన్ ఆర్డర్ రూపంలోనో నేరుగా కథా విస్తరణ చేయడం వల్లే తలపెట్టిన కాన్సెప్ట్ ఒకటైతే రాసి తీస్తున్న సినిమాలు ఇంకోటై ఫ్లాపవుతున్నాయి. ఇది గమనించే కథని నేరుగా యాక్ట్స్ గానో, వన్ లైన్ ఆర్డర్ గానో రాయడం దగ్గర్నుంచి కాకుండా, అసలా కథ పుట్టడానికి మూల కారణమైన ఐడియా (కాన్సెప్ట్) దగ్గర్నుంచే నిర్మాణాత్మకంగా రాయడం మొదలవ్వాలని గమనించి, ఎనిమిదేళ్ళ క్రితం తెలుగు సినిమాలకి పనికొచ్చే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రాస్తూ పోయాం. ఇలా ఐడియా నిర్మాణం తర్వాత వెంటనే వన్ లైన్ ఆర్డర్ వేసుకోవడం కూడా కాకుండా, ఈ రెండిటి నడుమ సినాప్సిస్ రాసు కోవాలని కూడా చెప్పుకున్నాం.

        ప్పుడు స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి అధ్యాయాల క్రమం ఇలా ఏర్పడింది : ఐడియా సినాప్సిస్ వన్ లైన్ ఆర్డర్ ట్రీట్ మెంట్ డైలాగ్ వెర్షన్. ఇలా ముందుగా ఐడియాని త్రీ యాక్ట్స్ ప్రకారం నిర్మించుకుంటే దాన్ని విస్తరించి అదే త్రీయాక్ట్స్ లో కథని సినాప్సిస్ గా రాసుకుంటే, ఆ సినాప్సిస్ ఆధారంగా త్రీ యాక్ట్స్ లో వన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ వగైరా పక్కాగా వచ్చేస్తాయి.

        రాస్తున్న కథ స్క్రీన్ ప్లే డీఎన్ఏ అంతా ఐడియాలోనే వుంటుంది స్ట్రక్చర్ రూపంలో. ప్రారంభ ఆలోచన (ఐడియా) ఏ ఏ అంశాలతో కూడి వుంటే అది పటిష్ట కథకి దారితీస్తుందో కూడా మొదటి అధ్యాయంలో వివరించాం. ఈ వ్యాసం కింద లింకుల్ని క్లిక్ చేసి ప్రధాన వ్యాసాన్ని, అనుబంధ వ్యాసాల్నీ చూడొచ్చు. కథకి ఐడియా అనే పునాది నిర్మాణం లేకుండా ఎన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివీ, చదకుండా కథ రాసినా అది వేస్టే.

        ఈ పూర్వరంగంలో గత నెల గుడ్ రీడ్స్ వెబ్సైట్ చూస్తూంటే, ఒక పుస్తకం మీద దృష్టి పడింది. ఆ పేరు తో అలాటి పుస్తకం ఇంత వరకూ మన దృష్టికి రాలేదు. ఇదే మొదటిది. ఆ పుస్తకం పేరు  ది ఐడియా - మన బాపతే!

కథకి ఐడియా నిర్మాణం ఆవశ్యకత గురించి ఇంగ్లీషులో ఒక్క పుస్తకమూ రాలేదు, వ్యాసమూ రాలేదు - స్క్రీన్ ప్లే పుస్తకాలకీ, వెబ్సైట్ వ్యాసాలకీ ఏకైక ప్రాప్తి స్థానమైన హాలీవుడ్ నుంచీ. ఏవైనా వస్తే గిస్తే సినిమా కథకి 50 ఐడియాలు, 100 ఐడియాలూ అంటూ ఐడియాల్ని అమ్మడం గురించే వచ్చాయి, వస్తున్నాయి తప్ప- అసలా ఐడియా నిర్మాణం గురించి కాదు. ఈ నేపథ్యంలో ఇలా ఐడియా నిర్మాణం గురించి ఒక పుస్తకం రావడం అపురూప సన్నివేశమే. ఈయనెవరో మనలాగే ఆలోచించాడు. 2018 లో ఈ పుస్తకం రాశాడు.

        ఎరిక్ బోర్క్ రచయిత, నిర్మాత. ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేత. స్క్రీన్ రైటింగ్ ప్రొఫెసరే కాకుండా కోచ్ కూడా. ఈ అనుభవం ఆయన్నో ప్రాథమిక ఆలోచనకి దారితీయించింది... కథల్ని ఓ ఐడియాతోనే రాస్తారు కదా, మరి అక్కడ్నించే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది మొదలవాలి కదాని. కథా రచనా ప్రక్రియలో మొట్టమొదటి దశ అయిన ఐడియా నిర్మాణమే సినిమా విజయావకాశాలకి కీలకం కదాని. ఈ అవగాహనే ఈ పుస్తకం రాయడానికి పురిగొల్పింది తనని.  

అరవైకి 60 శాతమూ  సినిమా విజయావకాశాలు కథకి విత్తిన ఐడియా పటిష్టతతో సాధ్యమవుతుందనీ, మిగతా 30 శాతం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో తీసుకునే సృజనాత్మక స్వేచ్ఛ, అలాగే ఓ 10 శాతం రాత శైలీ సమకూరుస్తాయనీ చెప్తాడు. ఈ దృష్టితోనే పుస్తకం రాశాడు.   

సినిమాల గురించి వింటూంటాం- అబ్బ భలే టెక్నిక్ రా, వామ్మో భలే స్క్రీన్ ప్లే ఇచ్చాడురా నాయనో, మైండ్ బ్లోయింగ్  - అని జబ్బలు చరుచుకోవడం. తీరా చూస్తే అటక మీద అట్టర్ ఫ్లాప్. ఎందుకు అట్టర్ ఫ్లాప్? సారం లేక. కథకి ఐడియా అయితే వుంటుంది, దాని వ్యూహాత్మక పరిపాలన లేక. రాసే టెక్నిక్కులూ, స్క్రీన్ ప్లే స్టయిలింగులూ అన్నం పెట్టే ఐడియా ప్రాముఖ్యాన్ని గుర్తించక. స్క్రీన్ ప్లే అంటే ఏమిటో కడుపు చించుకున్నా తెలియనట్టే, నోటికి అన్నం పెట్టే ఐడియా అంటే ఏమిటో కూడా ప్రమాణ పూర్వకంగా తెలియక. నిర్మాణాత్మక ఐడియా మాత్రమే అన్నం పెడుతుంది, ఇంకేదీ కాదు.

        ఈ పుస్తకం ఐడియా అంతర్నిర్మాణాన్ని చర్చిస్తుంది. హాలీవుడ్ సామ్రాజ్యం అంతర్జాతీయం. మాస్ కమర్షియల్ సినిమాలు హాలీవుడ్ ప్రధాన వ్యాపారం. అలాటి వ్యాపారాత్మక సినిమా కథల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం వుంటుంది. హాలీవుడ్ లో ప్రొఫెషనల్ రచయితలకి ఐడియా ప్రాముఖ్యం గురించి తెలుసు. నెలలూ  సంవత్సరాలూ స్క్రిప్టు రాస్తూ గడుపుతున్నప్పుడు, సమయాన్నీ కష్టాన్నీ వ్యయం చేస్తున్నప్పుడు, దాని మూలం లో ఐడియా అనే సెల్ ఫోన్ టవర్ ప్రసారం సవ్యంగా లేకపోతే, పౌనః పున్యం మ్యాచ్ కాకపోతే, రాసిందంతా వృధా అయిపోతుందని తెలుసు.

        ఐతే ఐడియా గురించి ఇంకేం తెలుసుకోవాలి? రాముడు సీత కోసం లంక కెళ్ళి ఠపీమని రావణుణ్ణి సంహరించాడు. ఇలా కథకి ఇది ఐడియా అనుకుంటే, దీంట్లో సినిమా పరంగా ఏ ఎలిమెంట్లు (మూల తత్వాలు) చూడాలి? ఏక్తా కపూర్ జోధా అక్బర్ సీరియల్ తీస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్ కి రచయితని పిలిచి- చూడూ ఇలా చెయ్, జోధా బాయిని భూతం ఎత్తుకెళ్ళింది. అప్పుడు అక్బర్ వెళ్ళి ఆ భూతంతో పోరాటం చేసి జోధా బాయిని విడిపించుకుని గుర్రమెక్కించుకుని వచ్చాడని ఎపిసోడ్ రాయ్ అంది.       

అప్పుడా సీనియర్ రచయిత, చరిత్రలో అలా జరిగిందని ఏ మూర్ఖుడూ రాయలేదు, మేడమ్. మనం అలా తీస్తే జనాలు చెప్పులతో కొడతారు మేడమ్ అన్నాడు. అయినా అలాగే తీయించింది ఏక్తా. జోధా అక్బర్ అన్నిఎపిసోడ్ల కంటే దీనికే ఎక్కువ టీఆర్పీ వచ్చింది!    

        ఈ వికృత ఐడియాలో ఏక్తా కపూర్ చూసిన ఎలిమెంట్స్ ఏమిటి? హాలీవుడ్ నిర్మాతలూ అమెరికన్ ప్రేక్షకులూ సినిమాలు  ఎమోషనల్ ఎంటర్టయినర్ లుగా వుండాలని కోరుకుంటారు, ఇంటలెక్చువల్ సినిమాలు కాదు. అయినా తీస్తున్న చాలా ఎమోషనల్ ఎంటర్టయినర్లు అమెరికన్ ప్రేక్షకులకి నచ్చడం లేదు. వాటి ఐడియాల్లో ఎలిమెంట్లు మిస్సవడమే కారణమని రచయిత చెప్తాడు. ఈ ఎలిమెంట్స్ ఏమిటో ది ఐడియా -సెవెన్ ఎలిమెంట్స్ ఆఫ్ వయబుల్ స్టోరీ అన్న ఈ పుస్తకం లో వివరించాడు.

        ఈ సెవెన్ ఎలిమెంట్స్ (అంటే పంచ భూతాలో ఐదు తత్వాల్లాగా) ఐడియాలో కేంద్రకంగా వుండే ప్రాబ్లం తో ముడిపడి వుంటాయి. కథంటే పాత్రల మధ్య పుట్టే ప్రాబ్లం ని పరిష్కరించే టూల్ కాబట్టి- ఆ  ప్రాబ్లమే కథకి కేంద్రకంగా వుంటుంది కాబట్టి- ఐడియాకి  పర్యాయపదం ప్రాబ్లమే. స్థూలంగా ప్రాబ్లంని ఐడియాగా చూస్తామన్న మాట. అందుకని ప్రాబ్లంతో ఎలిమెంట్లు కలిస్తే కథకి బలం వస్తుందన్న మాట. ఆ ఎలిమెంట్స్ ఎలా పని చేస్తాయన్నది పుస్తకంలో ఇచ్చాడు.  

        స్క్రీన్ రైటింగ్ పుస్తకాలు తీసుకున్న ఐడియాకి స్టోరీ డెవలప్ మెంట్ ఎలా చేసుకోవాలో పాఠాలు చెప్తాయే తప్ప, అసలా తీసుకున్న ఐడియాని ఎలా నిర్మించుకోవాలో చెప్పడం లేదు గనుక, పుస్తక రచయిత ఈ లోటుని పూడ్చాడు. 

        అందరూ చేసే పని ఐడియాని కథగా విస్తరించే జోలికి అస్సలు పోకుండా, ప్రాథమికంగా ఎలిమెంట్స్ తో ఐడియాని నిర్మించుకోవడం గురించే పుస్తకం రాశాడు. ఐడియాలో ఆ ఏడు ఎలిమెంట్స్ ఇవీ - punishing, relatable, original, believable, life-altering, entertaining, meaningful అని సూత్రీకరించాడు.       

వీటిని ఒక్కో అధ్యాయంగా వివరించాడు. ఇవి అర్ధమవడానికి ప్రసిద్ధ సినిమాలని ఉదాహరణగా పేర్కొన్నాడు. ఈ ఎలిమెంట్స్ వున్న సినిమాలెలా వున్నాయి, లేనివెలా వున్నాయీ కళ్ళ ముందుంచాడు. జానర్ స్పెషలిజం కోరుకునే వాళ్ళకి వివిధ జానర్లలో ఈ ఎలిమెంట్స్ వినిమయం ఎలా జరుగుతుందో కూడా చెప్పాడు.

సాధారణంగా - ఇది కాదులేమ్మా, ఇంకో ఐడియాతో రమ్మనే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా అనే ముందు ఐడియాతో ముడిపడి వుండే ఐదు ప్రశ్నల్ని గమనం లోకి తీసుకోవాలంటాడు - 1. ఐడియా ఏ పాత్ర కథతో వుంది, ఆ పాత్రతో మనమెందుకు ఐడెంటీఫై అవ్వాలి? 2. ఆ పాత్ర పరిస్థితులతో, ఇతరులతో సంబంధాలతో జీవితంలో ఏం పొందాలని కోరుకుంటోంది? 3. అది పొందడానికి ఎదురవుతున్నఆటంకా లేమిటి? 4. వాటినెలా అధిగమించా లనుకుంటోంది? 5. తాను పొందాలనుకుంటున్నది పొంది తీరాల్సిన అవసరాన్ని పాత్ర ఎందుకు ఫీలవుతోంది, అది మనమెందుకు ఫీలవ్వాలి?

        ఒక ఐడియాతో కథ రాయడానికి కూర్చునే ముందు, క్షుణ్ణంగా ఆ ఐడియాని అధ్యయనం చేసుకోవాలంటాడు. ఏడు ఎలిమెంట్స్ తో రూపొందిన ఐడియాని మూడు వాక్యాల లాగ్ లైన్లో కూర్చాలంటాడు. ఈ లాగ్ లైన్లో పాత్రెవరు, ప్రత్యర్థి ఎవరు, కాన్ఫ్లిక్ట్ ఏమిటనేవి కనబడాలంటాడు. కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడు : చాలా కథలు ప్రాబ్లం (ఐడియా) సరీగ్గా లేక పట్టు సడలి పోతాయని, భారీ కథలకంటే సింపుల్ గా వుండే కథలే ఎక్కువ ఆకట్టుకుంటాయనీ, నిర్మాతలూ ప్రేక్షకులూ కొత్తదనాన్ని కోరుకోరనీ-రచయితలే, విమర్శకులే కొత్తదనాన్ని కోరుకుంటారనీ... ఇలా కొన్ని టిప్స్ ఇచ్చాడు.

        ఇలాటి పుస్తకం ఇదే మొదటిది గనుక సినిమా రచనని సీరియస్ గా తీసుకునే, ఎప్పటి కప్పుడు అప్డేట్ అవ్వాలనుకునే శ్రద్ధాసక్తులున్న వాళ్ళకి వెల కట్టలేని ఆస్తి. అమెజాన్లో అమ్మకానికుంది. లేదంటే పీడీఎఫ్ డౌన్లోడ్ వుంది.

—సికిందర్