రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, డిసెంబర్ 2021, శుక్రవారం

1104 : రివ్యూ

రచన- దర్శకత్వం : జె ధీరేంద్ర సంతోష్
తారాగణం : నాగశౌర్య
, కేతికా శర్మ, జగపతి బాబు, సచిన్ ఖెడేకర్, సత్య, రవి ప్రకాష్ తదితరులు
సంగీతం : కాల భైరవ
, ఛాయాగ్రహణం : రామ్
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా సినిమాస్
, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్
, పుష్కర్ రామ మోహన రావు. శరత్ మరార్
విడుదల : డిసెంబర్ 10
, 2021
***


        మొన్న అక్టోబర్ చివర్లోనే తను నటించిన వరుడు కావలెను పరాజయం చూసి ఇక విలుకాడుగా లక్ష్యానికి గురి పెట్టి బాణం విసురుతూ వచ్చేశాడు నాగశౌర్య. టైటిల్ : లక్ష్య’. పూర్తి మేకోవర్ తో ఎయిట్ ప్యాక్ కి అప్డేట్ అయి, అమీతుమీ తేల్చుకోవడానికి వచ్చేశాడు. 2011 నుంచీ ఒకే ఒక్క హిట్ తో, మరో 16 అవసరమే లేని ఫ్లాప్స్ తో ముందుకు పరుగులు తీస్తున్న నాగశౌర్య, ఎయిట్ ప్యాక్ స్పోర్ట్స్ డ్రామాతో బాక్సాఫీసు ఛాంపియన్ షిప్ కి కర్చీఫ్ వేశాడు. దర్శకుడుగా సుబ్రహ్మణ్య పురం తో సక్సెస్ ఇచ్చిన ధీరేంద్ర సంతోష్ ని తీసుకున్నాడు. ప్రముఖ నిర్మాతల బ్యానర్స్ అండదండలతో, తెలుగులో ఆర్చరీ (విలువిద్య) మీద తొలి క్రీడా చలన చిత్ర్రాన్ని పరిచయం చేస్తూ చరిత్ర పుటల్లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. మరి ఇన్ని సమకూర్చుకున్న తను, ఇప్పుడు ఒకటైనా హిట్ కోసం వేసిన బాణాలేమిటి? అవెక్కడెక్కడ తగిలాయి? బాక్సాఫీసుకే తగిలాయా? ఈ సందేహాలు తీర్చుకుందాం...

కథ


  పార్థు (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ బాణా లేయడంలో నేర్పు. ఈ విద్య తండ్రి (రవి ప్రకాష్) కుండేది. అతను చనిపోయాక అతడి కలని తీర్చగల వాడుగా మనవడు పార్ధు కన్పిస్తాడు తాత (సచిన్ ఖెడేకర్) కి. ఇక సర్వస్వం ఒడ్డి విలు విద్యలో మనవడ్ని తీర్చి దిద్దుకుంటూ వస్తాడు. మనవడు పార్ధుకి తాత ప్రోత్సాహంతో బాటు, రీతిక (కేతకీ శర్మ) ప్రేమ కూడా లభించడంతో ఆర్చరీలో రాణించి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ గెలుస్తాడు. ఇక అంతర్జాతీయ పోటీలకి సిద్ధమవుతూంటే గుండెపోటుతో తాత చనిపోతాడు. ఈ బాధ తట్టుకోలేక పార్ధు డ్రగ్స్ మరిగి బహిష్కరణకి గురవుతాడు. ఇప్పుడు ఇతడి క్రీడా జీవితం ఏమయిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

వెండితెర మీద ఆర్చరీతో స్పోర్ట్స్ మూవీ అనేది కాన్సెప్టుగా కొత్తదే. కథ  చూస్తే అదే కొత్త సీసాలో పాత సారా. కాకపోతే సారా బదులు డ్రగ్స్ చూపించారంతే. రొటీన్ టెంప్లెట్ స్పోర్ట్స్ డ్రామా. 1. ఒక గురువు, 2. ఒక శిష్యుడు, 3.శిక్షణ, 4. సమస్యలు, 5. ఒక ప్రత్యర్థి, 6. ప్రత్యర్ధితో ఓటమి, 7. తాజా శిక్షణ, 8. ప్రత్యర్ధి మీద గెలుపు! ...ఈ ఎనిమిది స్టోరీ బీట్స్ ని టెంప్లెట్లో వరుసగా వేసుకుంటూ పోతే స్పోర్ట్స్ మూవీ తయార్. చాలా ఈజీ స్క్రిప్టు తయారీ. ఇంత ఈజీగా దర్శకులు తీసి తీసి విసుగు చెందరేమో గానీ, ప్రేక్షకులకి అంత ఓపిక లేదు. లక్ష్య తో అసలే ఓపిక లేనట్టు ఇంటర్వెల్ కి బయటి కెళ్ళిన ప్రేక్షకులు చాలా మంది వెనక్కి రాక పోవడం ఆందోళన కల్గించే విషయం కాదేమో.

        ఆర్చరీ మీద తొలి సినిమా అన్నాక దీనికి మార్కెట్ యాస్పెక్ట్ పట్టింపు కూడా లేదు. కథా ప్రయోజనం అసలే లేదు. కనీసం కథగా సోల్ కూడా లేని నిర్జీవ నమూనాగా మిగిలింది. వరల్డ్ నంబర్ వన్ ప్రొఫెషనల్ ఆర్చర్ దీపికా కుమారి మీద తీసిన లేడీస్ ఫస్ట్ అనే అద్భుత అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీ తప్ప ఆర్చరీ మీద సినిమా రాలేదు. ఇప్పుడు తెలుగులోనే వచ్చింది. ఆర్చరీ లాంటి ప్రజాకర్షణ లేని పాసివ్ స్పోర్ట్స్ ని ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసే ఒక మంచి అవకాశాన్నీ, ఇంకా మాట్లాడితే జాతీయ అవార్డునీ పొంద వచ్చన్న స్పృహ  గానీ లేకుండా కాన్సెప్ట్ ని వృధా చేశారు.

        ఈ సినిమాకి కావాల్సింది కథ కవసరం లేని నాగశౌర్య ఎయిట్ ప్యాక్ కాదు. ఎయిట్ ప్యాక్ లాంటి ప్యాకేజీ వుండాల్సింది ఈ విలు విద్య కథకి. నాగశౌర్య పాత్రకి పార్ధు అనే పేరు పెట్టి వదిలేస్తే కాదు. పురాణాల్లో విలువిద్యతో పార్ధు (అర్జునుడు) కీ, ఏకలవ్యుడుకీ వున్న సంబంధమేమిటో గుర్తు చేస్తూ- ఆర్చరీ పట్ల భావి క్రీడాకారులకి స్ఫూర్తిని, క్రేజ్ నీ రగిలించే ఒక కథా ప్రయోజనం, ఒక మార్కెట్ యాస్పెక్ట్ అవసరం.

        ఆర్చరీ అనే పాయింటుని ఒక క్యారక్టర్ గా తీర్చిదిద్దే హిస్టరీతో, బాక్సాఫీసు అప్పీలుతో, ఆర్చరీయే దైవమన్న భక్తితో - దాని ఎమోషనల్ కంటెంట్ కోసం, సోల్ కోసం  ప్రయత్నించకుండా - అర్ధం లేని చిత్రణలు నాగశౌర్య పాత్రకి ఆపాదించారు. ఆర్చరీతో నాగశౌర్యకి ఏ ఎటాచ్ మెంటూ కనబడదు. అలాటి ఒక్క సీను కూడా లేదు. తాత తోనే ఎటాచ్ మెంట్, పిల్లలతోనే ఎటాచ్ మెంట్, హీరోయిన్ తోనే ఎటాచ్ మెంట్. తాత చనిపోతే ఆ బాధ మరుపుకి డ్రగ్స్ తో మత్తు బానిసవడం, విలన్ తో హింసఏం చెప్తున్నారు ఈ కథతో? ఆర్చరీ క్రీడ చంఢాలమైనదనీ, దాని జోలికి పోకూడదనా? స్ఫూర్తిమంతంగా, ఉత్సాహజనకంగా వుండాల్సిన కథలో ఈ డ్రగ్స్ తో రిపల్సివ్ మూడేంటి?

నటనలు- సాంకేతికలు
నాగశౌర్యది పూర్తిగా పాసివ్ పాత్ర. తాత ఎదురుగా లేకపోతే బాణం వేయలేని పాసివ్ పాత్ర. తాత చనిపోతే డ్రగ్స్ మరిగి పతనమయ్యే విషాద పాసివ్ పాత్ర. సెకండాఫ్ లో జగపతి బాబు వచ్చి లేపి చెప్తేగానీ లక్ష్యం తెలియని పాసివ్ పాత్ర. ఈ కథ నాగశౌర్య క్యారక్టర్ గ్రాఫ్, క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ స్టడీ గురించైనట్టు. ఈ ప్లాట్ టూల్స్ అన్నీ ప్రధానంగా వుండాల్సింది ఆర్చరీ స్పోర్ట్స్ కి కాదన్నట్టు. ఆర్చరీ కథే కానట్టు, నాగశౌర్య పాత్ర కథే అన్నట్టు! అద్భుత పాత్ర చిత్రణ...

        తాతగా సచిన్ ఖెడేకర్ కూడా కథకుడి చేతిలో కీలుబొమ్మ పాత్ర. నాగశౌర్య పాత్ర డ్రగ్స్ ని మరగాలంటే తాత సడెన్ గా చావాలి. ఈ చావుతో పాపం ఆస్తులమ్మి మనవణ్ణి తీర్చిదిద్దుతున్న తాత మనవణ్ణి వీధిన పడేశాడు. ఈ చావు సానుభూతి నిచ్చేదేనా?

మొదట్లో తండ్రి పాత్ర కూడా, ఆర్చరీ గెలిచొస్తానని తాతకి చెప్పి వెళ్ళే సీను కట్ చేస్తే, నెక్స్ట్ సీన్లో యాక్సిడెంట్లో చనిపోయాడని కబురు! కథ నడపాలంటే సడెన్ చావులు తప్పవన్నమాట!

        ఇక జగపతి బాబు పాత్ర ఎక్కడ్నించి వస్తుందో, ఎందుకొస్తుందో సిల్లీగా వుంటుంది. తను రెండో కృష్ణుడన్నట్టు గురువు నెంబర్ టూ. హీరోయిన్ కేతికా శర్మ పాత్ర కూడా ఎందుకుంటుందో, ఏం చేస్తూంటుందో తెలియదు. గ్యాలరీలో కూర్చుని చప్పట్లు మాత్రం కొడుతుంది. చచ్చిపోతూ తాత హీరోని ఒప్పజెప్పాడని, రెండో కృష్ణుడు వచ్చే వరకూ హీరోకి గార్డియన్ లా వుంటుంది. లేకపోతే వుండదేమో. కానీ హీరో డ్రగ్స్ ఆరగిస్తూంటే తెలియని గార్డుగా సరదాగా వుంటుంది, పారితోషికం ఇస్తున్నందుకు.

        సాంకేతికంగా బలహీనమే. ఆర్చరీ ట్రైనింగు, ఈవెంట్స్, ఆఖరికి వరల్డ్ కాంపిటీషన్ దృశ్యాలూ అపరిపక్వంగా వున్నాయి. కనీసం ఇవైనా ప్రొఫెషనల్ గా వుండి థ్రిల్ చేస్తే ఓ యాక్షన్ మూవీ చూసినట్టయినా వుండేది. హాకీ, ఫుట్ బాల్ ఆటల్లాగా యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండదు బాణాలేసే ఆర్చరీ. ప్రత్యర్ధితో నేరుగా తలబడ్డం వుండదు. ఎదురుగా బోర్డు మీద బుల్స్ ఐని నిలబడి గురిచూసి కొట్టడమే వుంటుంది. కానీ బాణాలతో జలదరింప జేసే పోరాట సినిమా లెన్నో వచ్చాయి. పద్మావత్ చూసినా, ఇందులో సింహళ రాకుమార్తె పద్మావత్ పాత్రలో దీపికా పడుకునే, బాణాలతో జింకని వేటాడే ఓపెనింగ్ విజువల్స్ ని ఎవరు మర్చిపోతారు.

చివరికేమిటి

చిన్నప్పట్నుంచీ కథ చూపించారు. తాత- తండ్రి-మనవడుల జీవితం చూపిస్తూ స్పూన్ ఫీడింగ్ చేశారు. ఇదేదో ఫ్యామిలీ కథైనట్టు జానర్ మర్యాద కలుషితం. ఈ బయోగ్రఫీ అంతా, పరిచయమంతా కూడా, స్పోర్ట్స్ జానర్ మర్యాద కింద, బాక్సాఫీసు అప్పీలు కోసం, ఆర్చరీతో వుండాల్సింది. తాతా, కోచింగ్ కి వెళ్తున్నానంటాడు హీరో. తాత దగ్గుతాడు. ఇక హీరో కోచింగ్ కి వెళ్ళే సీను లేకుండా, తాతతో సెంటిమెంటు -ఎటాచ్ మెంటు సీను వచ్చేస్తుంది. ఇలా ఆర్చరీ సీన్లకి పదేపదే తాతా మనవళ్ళ అనుబంధాల సీన్లు, హీరోయిన్ లవ్ సీన్లు, ఆర్చరీలో ప్రత్యర్ధి (విలన్) తో గొడవల సీన్లూ ఆల్టర్నేట్ గా వచ్చి అడ్డుపడుతూంటాయి. కథకుడికి దేనిమీద మక్కువ వుందో ఇలా తెలిసి పోతూంటే ఇంకేం స్పోర్ట్స్ సినిమా చూస్తాం. పైగా ప్రత్యర్ధిని ముందే చూపించడంతో కథేమిటో ఇక్కడే తెలిసిపోతోంది.

        తాత మరణం, హీరో డ్రగ్స్ సేవనం, మత్తులో వున్న హీరో ఇంటర్వెల్ సీన్లో ఈవెంట్ కెళ్ళకుండా విలన్ గ్యాంగ్ దాడి చేసి అడ్డుకోవడం లాంటి రొటీన్ కి, హీరో గాయాలతో తూలుతూ వచ్చి ఈవెంట్ లో బాణం వేసి గెలిచి పడిపోవడం లాంటి ఇంకో రొటీన్ జీవం లేనివిగా వుంటాయి. ఫస్టాఫ్ ఇలా విఫలమయ్యాక, సెకండాఫ్ కథ వదిలేసి హీరో ఎమోషనల్ డ్రామాలతో మరీ ఎక్కడికో వెళ్ళిపోయింది...ఎయిట్ ప్యాక్ ని  కేవలం ఒక రెస్టారెంట్ లో సిల్లీ గొడవకి షర్టు విప్పి చూపించడం. ఈ మైనర్ ఫైట్ కోసమే ఎయిట్ ప్యాక్. ఇలా మొత్తానికి నాగశౌర్య వేసిన బాణం ఇంకో ఫ్లాప్ ని పెంచడానికే పనికొచ్చింది....

—సికిందర్
 

8, డిసెంబర్ 2021, బుధవారం

1103 : బాక్సాఫీస్

శుక్రవారం 10వ తేదీ ఇంకో 8 సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. గత నెల 19 న కూడా ఒకేసారి  తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు లేని శుక్రవారం చూసుకుని ఛోటా సినిమాలు ఈ సంఖ్యలో విడుదలై పోతున్నాయి. ఈ శుక్రవారం లక్ష్య తప్ప మిగిలినవి చిన్న సినిమాలే. లక్ష్య సహా అన్ని సినిమాలూ కొత్త దర్శకులవే. లక్ష్య లో నాగ శౌర్య హీరో. ఇది మరో స్పోర్ట్స్ డ్రామా. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం. ట్రైలర్ తో ఆసక్తి రేపింది. ఈ మూవీ ట్రైలర్‌ ని గ్లామర్ కోసం విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. పైగా నాగశౌర్య పలకల శరీరం (సిక్స్ ప్యాక్) తో పరిచయమవుతున్నాడు. క్రీడాకారులు సిక్స్ ప్యాక్ తో వుంటారా అన్నది వేరే సంగతి. కేతికా శర్మ మరో సారి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈమె ఇటీవలే పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రోమాంటిక్ లో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ప్యాడింగ్ ఆర్టిస్టులుగా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ల బలం ఈ సినిమాకి వుంది. దీని నిర్మాతల్లో ప్రముఖులు నారాయణ్ దాస్ కే నారంగ్, శరత్ మరార్ వున్నారు.

        మెయిన్ మూవీ శౌర్య తర్వాత చెప్పుకో దగ్గ మూవీ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత కథ నయీమ్ డైరీస్’. ఈ వివాదాస్పద నయీమ్ కథలో చాలా నిజాలు నిజాయితీగా చెప్పాననీ, సినిమా ఎలా రిలీజ్ చేస్తావో చూస్తామని బెదిరింపులు వస్తున్నాయనీ దర్శకుడు దాము బాలాజీ చెప్పడం ఆసక్తిని పెంచింది సినిమా మీద. ఇందులో నయీమ్ పాత్రని వశిష్ట సింహా పోషించాడు. ఇతను కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు. దీని ట్రైలర్ చూస్తూంటే సాంకేతిక బలంతో పవర్ఫుల్ గా కన్పిస్తోంది.

        పోతే, కొత్త దర్శకురాలు సుజనా రావు తీసిన గమనం లో శ్రియ నటించింది. ఇంకో పాత్రలో నిత్యా మీనన్ కన్పిస్తుంది. సుహాస్ కూడా ఓ పాత్రలో కన్పిస్తాడు. హైదారాబాద్, విశాఖల్లో షూటింగ్ చేశారు. ఇళయరాజా సంగీతం వహించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథ ఐదు భాషల్లో విడుదలవుతోంది.

        మిగిలిన అయిదూ కొత్త నటులవే. మడ్, బుల్లెట్ సత్యం, కఠారీ కృష్ణ, ప్రియతమా, మనవూరి పాండవులు. అందరూ కొత్త దర్శకులే తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్న ఈ ఎనిమిదిలో ఎన్ని నిలబడతాయో శుక్రవారం తేలుతుంది. ఈవారం పెద్ద సినిమాలు లేకపోయినా అఖండ సృష్టిస్తున్న మేనియా ఇంకా తగ్గలేదు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో విడుదలైనప్పుడు హైదారాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు విడుదల చేస్తే, పెద్ద సినిమా బుకింగ్స్ ఫుల్ అయిపోతే, కాంపౌండులో చిన్న సినిమా వున్న థియేటర్లో పడే వాళ్ళు పెద్ద సినిమా కొచ్చిన ప్రేక్షకులు. ఇలా బతికిన చిన్న సినిమా లున్నాయి. ఆన్ లైన్ బుకింగ్స్ తో ఇప్పుడా పరిస్థితి లేదు.

***


4, డిసెంబర్ 2021, శనివారం

1102 : రివ్యూ


 

రచన - దర్శకత్వం : విశ్వక్ ఖందేరావు
తారాగణం : నిత్యా మీనన్,
సత్య దేవ్, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం :
ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : జవ్వాది ఆదిత్య
బ్యానర్ :   
బైట్‌ ప్యూచర్స్, నిత్యామీనన్‌ కంపెనీ 
నిర్మాత
లు  : నిత్యా మీనన్, పృథ్వీ పిన్నమరాజు
విడుదల : డిసెంబర్ 4, 2021

***

 

        1979 లో  సంచలనం సృష్టించిన స్కైలాబ్ దుర్ఘటనని పురస్కరించుకుని స్కైలాబ్ అనే ప్రయోగాత్మక తెలంగాణా నేటివిటీ సినిమా తీశాడు కొత్త దర్శకుడు విశ్వక్ ఖందేరావు. దీన్లో నటిస్తూ సహ నిర్మాతగా వ్యవహరించింది పాపులర్ హీరోయిన్ నిత్యా మీనన్. పాపులర్ నటుడు సత్యదేవ్ ఒక పాత్ర వేశాడు. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మూస కథలకి భిన్నంగా వైవిధ్య కాన్సెప్ట్స్ తో ముందుకు వస్తున్న ఇలాటి తెలుగు సినిమాలకి ఆదరణ పెరగాలి. నిత్యా మీనన్ స్వయంగా పూనుకుని సహ నిర్మాతగా ముందుకు వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ ఆమెని అంతగా ఆకర్షించి వుండాలి.  సినిమాలో ఆమె నటించడం మంచి బాక్సాఫీసు ఆకర్షణ కూడా అయింది. పాపులర్ హీరో హీరోయిన్లు ఇలాటి కాన్సెప్ట్స్ లో నటిస్తూ వుంటే ప్రేక్షకుల్లోకి ఎక్కువ వెళ్తాయి. మరి ఈ నిత్యా మీనన్ ఔటింగ్ ఎంతవరకూ దీన్ని సాధించింది? హైలీ ఎడ్యుకేటెడ్ అయిన తను హైక్వాలిటీ ఎంటర్ టైనర్ అందించిందా?  

కథ

1979 లో తెలంగాణాలోని బండ లింగం పల్లి గ్రామం. అక్కడ గౌరి (నిత్యా మీనన్) దొరబిడ్డ. ఈమెకి పత్రికా రిపోర్టర్ అవ్వాలని బలమైన కోరిక. హైదరాబాద్ లో ప్రతిబింబం అనే పత్రికలో ఈమె రాతలు చూసి ఎడిటర్ ఇంటికి పంపించేస్తే వచ్చి ఇంట్లో వుంటోంది. ఎలాగైనా వూళ్ళో వార్తలు రాసి పేరు తెచ్చుకుంటానని తండ్రికి సవాలు చేస్తుంది. తల్లి సహకరిస్తూంటుంది.

        ఆనంద్ (సత్యదేవ్) కూడా హైదారాబాద్ లో డాక్టరుగా సస్పెండ్ అయి వచ్చి వూళ్ళో తాత సదాశివం (తనికెళ్ళ భరణి) దగ్గర వుంటూ, క్లినిక్ పెట్టుకోవడానికి డబ్బులకోసం వేధిస్తూంటాడు. ఇంకో రామారావు (రాహుల్ రామకృష్ణ) అనే సుబేదారుల కొడుకు అప్పులు చేస్తూ తిరుగుతూంటాడు.

        ఇలా ఈ ముగ్గురూ మూడు లక్ష్యాలతో వుంటే, స్కైలాబ్ పడబోతోందని రేడియో వార్త వస్తుంది. దీంతో వూళ్ళో కంగారు పడతారు ప్రజలు. గౌరికి వార్తలు రాయడానికి ఇది మంచి టాపిక్ అయితే, రామారావు దగ్గర అప్పు చేసి క్లినిక్ పెట్టబోయిన ఆనంద్ కి బ్రేకు పడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ముంచుకు వస్తున్న ప్రమాదంతో ఎవరి జీవితాలేమయ్యా యన్నది మిగతా కథ.   

ఎలావుంది కథ

1979 లో 850 టన్నుల అమెరికా అంతరిక్ష ప్రయోగ శాల స్కైలాబ్ ఆకాశంలో పతనమై భూమ్మీద ఢామ్మని పడ్డానికి సిద్ధమైంది. అది తెలంగాణా మీదే పడుతుందని పుకార్లు వ్యాపించాయి. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా మీద. దీంతో చావు తప్పదని ప్రజలు మేకలూ కోళ్ళూ తెగ కోసుకు తినేసి తృప్తిగా చనిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తీరా జులై 19 న స్కైలాబ్ శకలాలు వెళ్ళి హిందూ మహా సముద్రం లోనూ, అటు పశ్చిమ స్ట్రేలియా లోనూ పడ్డాయి.

        ఈ ఉదంతాన్ని స్కైలాబ్ కథగా తీసుకున్నారు. 2011 లో ఫ్రెంచి కామెడీగా లీ  స్కైలాబ్ అనే మూవీ వచ్చింది. గ్రాండ్ మా పుట్టిన రోజు జరుపుకోవడానికి విలేజీలో ఓ బంగాళా కొచ్చిన బంధు మిత్ర పరివారం, ఫ్రాన్స్ మీద స్కై లాబ్ పడుతోందన్న వార్తకి ఎలా స్పందించారన్న కథ. ఇందులో కుటుంబ బంధాలు, టీనేజీ ప్రేమలు వగైరా చర్చించారు.

        తెలుగు స్కైలాబ్ మంచి సోషల్ కామెడీ అయ్యే అవకాశమున్న కథ. అయితే ఈ కథ ఏ జానర్ కిందికి వస్తుందో గుర్తించి ఆ జానర్ మర్యాదలతో కథ చేయకపోవడం వల్ల విఫలమైంది. డిజాస్టర్ జానర్ కథని డిజాస్టర్ జానర్ మూవీ ఎలిమెంట్స్ తో తీయాలి. తెలంగాణా సినిమాలతో సమస్యేమిటంటే, ప్రతీ సినిమాలోనూ తెలంగాణా జీవితం చూపించడానికే పాత్రలుంటాయి. పాత్రలతో తెలంగాణా జీవితమెక్కువ, పాత్రలతో కథ తక్కువ. ఆ కథ కూడా నాన్ కమర్షియల్ కేటగిరీలోకి చేరిపోయే పరిస్థితి.   

 వాస్తవంగా స్కైలాబ్ ప్రమాద వార్త పరిణామాల్లోనే కామెడీ వుంది. చాలా కామెడీగా తాము చచ్చిపోతామనే డిసైడ్ అయ్యారు అప్పటి ప్రజలు. చివరి కోర్కెలు తీర్చుకోవడం ప్రారంభించారు. డిజాస్టర్ జానర్ కథలు రెండు రకాలు. ఒకటి సీరియస్ యాక్షన్, రెండోది కామెడీ. ఇది డిజాస్టర్ కామెడీ కిందికి వస్తుంది. ఈ కథ అనుకున్నప్పుడు జానర్ గురించి  ఆలోచించి రీసెర్చి చేసుకున్నట్టు లేదు. డిజాస్టర్ కామెడీలుగా గత పదేళ్ళ లోనే వచ్చిన దిసీజ్ ది ఎండ్’, ది వరల్డ్స్ ఎండ్’, కూటీస్ మొదలైనవి వున్నాయి. ఇవి చూసి వుంటే స్కైలాబ్ ఎలా తీయాలో తెలిసి వుండేది. ఒక చారిత్రక ఘటనతో అపూర్వ ఐడియా అన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోకూడదు. దాన్ని చెడగొట్టి, బాగా తీయగల్గే వాళ్ళకి అవకాశం లేకుండా చేయకూడదు.

నటనలు -సాంకేతికాలు

నిత్యా మీనన్ నాటి తెలంగాణా పీరియెడ్ పాత్రలో డమ్మీ జర్నలిస్టుగా బాగా కుదిరింది. అమాయకత్వంతో కూడిన సున్నిత హాస్యం చేసింది. క్లయిమాక్స్ లో కదిలించే సన్నివేశంతో రాణించింది. భాష, నటన, హావభావాలు పలికించడంతో ఆమెకి తిరుగులేదు. తల్లిదండ్రులతో ఆమె మొండి తనంతో కూడిన హాస్య దృశ్యాలు నవ్విస్తాయి. తను కని పించినప్పుడల్లా దృష్టి నాకర్షిస్తుంది. అలరిస్తుంది, ఆనందింప జేస్తుంది. ఇదంతా కథలోంచి పాత్రని తీసి వేరుగా చూసినప్పుడు. కథలో పెట్టి పాత్రని చూస్తే, పాత్రకీ కథకీ ఉపయోగపడిందేమీ లేదు.

        కథ అన్నాక ఒక కథానాయకుడో, కథా నాయకురాలో వుంటారు కథని నడిపించడానికి. ఈ కథకి సత్యదేవ్ కథానాయకుడు కాదని సినిమా చూస్తూంటే గానీ బయటపడదు. మరి నిత్యామీనన్ కథా నాయకురాలా అంటే అదీ కాదు. కానీ మార్కెట్ యాస్పెక్ట్ తో చూస్తే తనే కథా నాయకురాలవాలి. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అవ్వాలి. అప్పుడు ఆమె పాత్రకి అర్ధం వుండేది.

        సత్యదేవ్ సహాయ పాత్రలాగా వుంటాడు. ఇలా కూడా చేయడానికేమీ లేదు. ఈ కామెడీలో పాత్రకి వుండాల్సిన హుషారు లేదు. డిటో రాహుల్ రామకృష్ణ. ఇక ఇతర  తెలంగాణా పాత్రల్లో నిత్యా మీనన్ తల్లి పాత్ర నటి, రాహుల్ రామకృష్ణ నానమ్మ పాత్ర నటి బావున్నారు.  

        పాటలకి పెద్దగా ప్రాధాన్యం లేదుగానీ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకి బావుంది. లొకేషన్స్ తో, కాస్ట్యూమ్స్ తో, సెట్ ప్రాపర్టీస్ తో  కళాదర్శకత్వం మాత్రం పకడ్బందీగా వుంది పీరియెడ్ వాతావరణాన్ని సృష్టిస్తూ. కెమెరా వర్క్ సైతం ఉన్నతంగా వుంది. ఇంత మంచి సాంకేతిక సహకారం పొందిన కొత్త దర్శకుడు సినిమాని నిలబెట్టడంలో మాత్రం తగిన కృషి చేయలేకపోయాడు.

చివరికేమిటి

ఉరకలేసే క్రేజీ కామెడీతో, జానర్ డిమాండ్ చేస్తున్న అద్భుత రసపు కథా కథనాలతో, స్కైలాబ్ ఉపద్రవాన్ని ఎదుర్కొనే అడ్వెంచరస్ క్యారక్టర్ గా నిత్యామీనన్ మ్యాజిక్ చేయాల్సింది- ఈ లక్షణాలేవీ లేని డమ్మీ పాత్రగా మిగిలిపోయింది. తన పాపులారిటీతో ఫిమేల్ ఆడియెన్స్ ని కూడా థియేటర్లకి రప్పించే పనికే దూరంగా వుండిపోయింది. ఫస్టాఫ్ అంతా నిత్య, సత్యదేవ్, రామకృష్ణల విడివిడి ఉపకథలు చూపిస్తూ, స్కైలాబ్ కూలుతోందన్న పాయింటు వచ్చేసరికి ఇంటర్వెల్ వచ్చింది.

        ఫస్టాఫ్ లో చూపించిన కామెడీ సున్నిత హాస్యం చేయడంతో, అది నవలా సాహిత్యంలా అనిపిస్తూ సామాన్య ప్రేక్షకులకి దూరంగా వుండిపోయింది. తెరమీద చూ పించడానికి పనికిరాని నవలా కథనం వల్ల ఫస్టాఫే సహన పరీక్షగా మారింది.

        స్కైలాబ్ పాయింటు కొచ్చాక,  ఆ ప్రమాద వార్తకి గట్టి రియాక్షన్స్ చూపించాల్సింది పోయి, హడావిడి మొదలెట్టాల్సింది పోయి- నీరసంగా సాగే సీన్స్ తో మరీ దెబ్బతినిపోయింది సెకండాఫ్. పంచ్ లేదు, పరుగులు లేవు, ఎత్తుగడల్లేవు, బతకడానికి పాట్లు లేవు. ఉపద్రవంలో లీడ్ చేసే మెయిన్ క్యారక్టర్ లేదు. మినిమం కథా లక్షణాలే లేని సినిమా తీసి ఏం ప్రయోజనం. అరుదైన కాన్సెప్టుతో అరుదైన డిజాస్టర్ కామెడీని అందించే బంగరు అవకాశాన్ని కొత్త దర్శకుడు ఇలా కోల్పోవడం విచారకరం.

—సికిందర్

3, డిసెంబర్ 2021, శుక్రవారం

1101 : స్క్రీన్ ప్లే సంగతులు

 

      బోయపాటి అఖండ లో పూర్వ కథ పెద్దగా లేకపోవడం వల్ల సినిమా ప్రారంభంలోనే  ఆ పన్నెండు నిమిషాల పూర్వ కథ ఒకేసారి చెప్పేశారు. దీంతో కథంతా లీనియర్ నేరేషన్లో వుంది. ఇద్దరు బాలకృష్ణల పుట్టుక, దాని పరిణామాలకి సంబంధించి పూర్వ కథ ఎక్కువ లేకపోవడం వల్ల లీనియర్ నేరేషన్లోకి కథ వచ్చేసింది. ఇలా గాకుండా ఒకవేళ పూర్వ కథ అరగంట పాటు వుంటే ఏం చేయాలి? చాలా సినిమాల్లో చూపిస్తున్నట్టు, ఇంటర్వెల్ తర్వాత రొటీన్ గా సెకండాఫ్ అరగంట పాటు ఫ్లాష్ బ్యాక్ వేసేసి ఇంకా నాన్ లీనియర్ కథే చెప్పాలా? ఈ యమ స్పీడు యుగంలో కూడా? నాన్ లీనియర్ కథ చెప్పడమంటే కథని ఓ చోట ఆపేసి, వెనక్కి వెళ్ళి తీరిగ్గా పూర్వ కథని  ఫ్లాష్ బ్యాకుగా చెప్పుకుంటూ కూర్చోవడమే. ఈ యమ స్పీడు యుగంలో ముందు కెళ్తున్న కథని ఆపవచ్చా? కథ సాగుతూనే వుండాలి, పూర్వ కథ సమాంతరంగా చోటు చేసుకుంటూ వుండాలి. మొత్తం కలిపి లీనియర్ నేరేషన్ లా ఉరకలేస్తూ పరిశుభ్రంగా కన్పించాలి. ఈ యమ స్పీడు యుగంలో సోషల్ మీడియా ప్రేక్షకుడికి / ప్రేక్షకురాలికి తప్పించుకునే వంక దొరక్కూడదు. మొబైల్ నొక్కుకుంటూ కూర్చునే అవకాశమివ్వకూడదు. ఇది మార్కెట్ యాస్పెక్ట్.  మార్కెట్ యాస్పెక్ట్ ని బట్టి జాగ్రత్తగా చేసే క్రియేటివ్ యాస్పెక్ట్. ఇదే  షాంగ్ చీ- అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ లో వాడిన ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్...

        షాంగ్ చీ లో ఓ అరగంట పాటు వుండే పూర్వకథ లో మొదటి పది నిమిషాలు తీసుకుని సినిమా ప్రారంభించారు. పది నిమిషాలకి హీరో చిన్నప్పటి పూర్వ కథని  ఓ నాటకీయ ఘట్టంలో కావాలని ఆపేసి, పెద్దయ్యాక ఇప్పటి కథ చెప్పడం ప్రారంభించారు. మిగిలిన పూర్వ కథని చిన్న చిన్న ఫ్లాష్ బ్యాకులుగా, కథలో ఉత్ప్రేరకాలుగా పనిచేసే ట్రిగ్గర్ పాయింట్ల దగ్గర, ప్రయోగించుకుంటూ పోయారు.

        దీని రచయిత డేవిడ్ కాలహాం చైనీస్ అమెరికన్. ఇతను ఎక్స్ పెండబుల్స్ 1, 2, గాడ్జిలా, మోర్టల్ కంబాట్, వండర్ వుమన్- 1984 వంటి 9 సినిమాలకి రాశాడు. షాంగ్ చీ కొత్తగా పరిచయమవుతున్న అమెరికన్ సూపర్ హీరో కథ. సిరీస్ గా వచ్చే కొత్త సూపర్ హీరో అన్నాక పుట్టు పూర్వోత్తరాలు పరిచయం చేసి కథలోకి దింపాలి. షాంగ్ చీ విషయానికొస్తే ఇతడి తల్లిదండ్రు లెవరు, వాళ్ళెలా కలుసుకున్నారు, వాళ్ళ కలయిక తండ్రి జీవితంతో బాటు, షాంగ్ చీ జీవితాన్నీ నాటకీయంగా ఎలా మార్చిందిమొదలైన కథాసరిత్సాగరం చెప్పుకుంటూ కూర్చుంటే అరగంట సినిమా కావాలి.

        అందుకని సాగుతున్న కథలో చిన్నచిన్న భాగాలుగా చేసి పూర్వ కథ చెప్పారు. సినిమా ప్రారంభం మొదటి పది నిమిషాల్లో  హీరో తండ్రి, తన వశమైన టెన్ రింగ్స్ తో ఎలా రాజ్యాల్ని జయిస్తున్నాడో, ఒక శత్రు దాడిలో దారి తప్పి టాలో అనే గ్రామంలో కెలా వచ్చాడో, అక్కడ తల్లితో ఎలా ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడో చూపించి కట్ చేసి, ఇదంతా తల్లి ఐదేళ్ళ కొడుక్కి చెప్తున్నట్టు చూపించి, అతడి మెళ్ళో లాకెట్ వేయడంతో ముగించారు.

2. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, ఈ పది నిమిషాల్లో తండ్రి పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ భాగం కేటాయించి, చిన్నప్పటి హీరోని లాకెట్ మెళ్ళో వేసుకునే ఒకే సీనులో చూపించి ముగించారు. ఎందుకని? ఎందుకంటే, కమర్షియల్ సినిమాకి హీరోని/స్టార్ ని  వీలైననత త్వరగా తెర మీదికి తీసుకు వచ్చే అర్జెన్సీని మార్కెట్ యాస్పెక్ట్ డిమాండ్ చేస్తుంది గనుక. ఈ అర్జెన్సీ గురించి బ్లాగులో కొన్నిసార్లు చెప్పుకున్నాం కూడా.

        కమర్షియల్ సినిమా స్క్రీన్ స్పేస్ అనేది హీరోకి /స్టార్ కి మాత్రమే చెందిన కథా ప్రాంగణం. ఇందులోకి చిన్నప్పటి కథలతో ఏ బాక్సాఫీసు అప్పీలూ వుండని బాల నటులు చొరబడడానికి వీల్లేదు. ప్రేక్షకులకి హీరోని /స్టార్ ని వెంటనే తెరమీద చూడాలని వుంటుంది. వాళ్ళ చిన్నప్పటి రూపాలైన ఎవరో బాల నటుల్ని చూస్తూ కూర్చోవడం కాదు. మన సినిమాల్లో ఇలాగే చూపిస్తున్నారింకా. పోనీ బాల నటులున్నారని బాలలేమైనా సినిమాలకి క్యూలు కడుతున్నారా? ఇదేమీ లేదు, కథకుల చాదస్తమే. సినిమా మొదలెడితే చాలు ఓ అరగంట పాటు బాల నటులతో హీరోల/స్టార్ల పాత్రల చిన్నప్పటి కథలు చూపిస్తే గానీ తృప్తి  తీరని పాత కాలం పద్ధతే వుంది. ఇది ఆ కాలంలో ఈ ప్రేక్షకులతో చెల్లింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రేక్షకులు వేరు. వాళ్ళ క్రేజ్ వేరు, డిమాండ్లు వేరు హీరోలతో/స్టార్లతో.  ఇప్పుడిలా చేస్తే హీరోల/స్టార్ల విలువైన స్క్రీన్ స్పేసే కాదు, బాలనటులతో తీయడానికయ్యే స్టోరీ పార్టు బడ్జెట్ కూడా ఘోరమైన వేస్టు.

        అందుకని షాంగ్ చీ ప్రారంభ పూర్వ కథలో చిన్నప్పటి హీరోతో (బాల నటుడితో) ఒకే సీను వేసి- కట్ చేసి వెంటనే, కథలో ప్రస్తుత కాలంలో షాంగ్ చీ సూపర్ మాన్ హీరోని చూపించేశారు!

        ఇంకోటేమిటంటే, మొత్తం పూర్వ కథంతా ఒకే ఫ్లాష్ బ్యాకుగా వేసి వుంటే, సూపర్ మాన్ తెరమీదికి ఎంట్రీ ఇవ్వడానికి అరగంట పట్టేది! ఇది చాలా నాన్సెన్స్ గా వుండేది.

        పై పూర్వ కథా ఖండికలో తండ్రి పార్టు ఎక్కువ చూపించారని చెప్పుకున్నాం. ఆ తండ్రి హీరోకి ప్రత్యర్ది కాబోతాడు కాబట్టి ఆ బ్యాక్ గ్రౌండ్ అవసరం. ఇదంతా తల్లి క్యారక్టర్ చెప్పుకొస్తున్నట్టు వాయిసోవర్ ట్రాన్సిషన్ లైవ్ డైలాగుగా మారి, సీను చూస్తే తల్లి క్యారక్టర్ తండ్రి గురించి ఇదంతా ఐదేళ్ళ కొడుక్కి  చెప్తున్నట్టు ఓపెనవుతుంది. వెంటనే ఆమె అతడి మెళ్ళో లాకెట్ కట్టడంతో పూర్వ కథ కట్ అయిపోయి - అలారం మోతకి శాన్ ఫ్రాన్సిస్కోలో మన సూపర్ మాన్ హీరోగారు నిద్రలేచే సీను తో కన్పించిపోతారు పండగ చేసుకోమని!

3. ఇక్కడ్నుంచి మున్ముందు కథతో బాటు, నిమిషం -3 నిమిషాల వ్యవధితో చిన్న చిన్న ఫ్లాష్ బ్యాకులు, మిగతా పూర్వ కథకి సంబంధించి అడపాదడపా వస్తూంటాయి. కథాంశంలో చాలా నైపుణ్యంగా అల్లిన ఫ్లాష్ బ్యాకులివి. నడుస్తున్న కథలో ఆయా ఆనంద విషాదాల ఘట్టాల ప్రేరణతో (ట్రిగ్గర్ పాయింట్స్ తో), భావోద్వేగాల్ని ఇనుమడింపజేస్తూ వస్తూంటాయీ సంబంధిత ఫ్లాష్ బ్యాక్స్. ఇలా అంచెలంచెలుగా పూర్వ కథ తెలుస్తూ వుంటుంది.   

        హీరో తల్లి మరణించిందని మనకి తెలుస్తూంటుంది. కానీ ఎలా ఎప్పుడు మరణించిందనేది మిస్టరీగా అనిపిస్తూ వుంటుంది. ఇలా కథలో మిస్టరీ ఎలిమెంట్ కూడా సాగుతూ వుంటుంది. ఈ మిస్టరీ వీడాలంటే నడుస్తున్న కథ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడా ఫ్లాష్ బ్యాక్ తో వీడుతుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇది స్క్రీన్ ప్లేలో ఎండ్ విభాగం (యాక్ట్ త్రీ) లోగానీ రాదు.

        ఇక్కడ హీరో హీరోయిన్ తో చెప్తాడు -టాలో గ్రామానికి తండ్రి చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని : ఇప్పుడు తనేం చేయాలో తనకి తెలుసని. ఏం తెలుసు? ఎలా తెలుసు? ఈ ట్రిగ్గర్ పాయింటు తో పెల్లుబికి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ - తల్లి చనిపోయిన నేపథ్యంలో, ఏడేళ్ళ హీరోని గ్యాంబ్లింగ్ డెన్ కి తీసుకుపోతాడు తండ్రి. అక్కడ కొడుకు కళ్ళ ముందే ఒకడ్ని కాల్చి చంపి, భయపడిపోయిన కొడుకుతో అంటాడు - మీ అమ్మ చావుకు పగదీర్చుకునేందుకు నాతో వుంటావా - అని.  

        ఇదే హీరో జీవితాన్ని తండ్రి పాడు చేసిన ఘట్టం. ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటికి వచ్చి, హీరోయిన్ తో అంటాడు - తన 14 ఏళ్ళ వయస్సులో తండ్రి చెప్పినట్టు చేసి కిల్లింగ్ మెషీన్ ని అయ్యాననీ, తల్లి మరణానికి అతనే కారకుడనీ, తన జీవితాన్ని కూడా నాశనం చేశాడనీ, ఇప్పుడు గ్రామాన్ని నాశనం చేయడానికే  వచ్చేశాడనీ, ఇక ఫైనల్ గా అంతు చూసేస్తాననీ అంటాడు.

        తల్లి ఎలా చనిపోయిందో పూర్వ కథంతా ఒకేసారి చెప్పేయ్యొచ్చు. కిల్లర్ గ్యాంగ్ ఇంటికొచ్చి తల్లిని చంపడం, కొడుకు దాక్కుని చూడడం, తండ్రి వచ్చి తల్లి పక్కన కూర్చుని ఏడుస్తున్న కొడుకుని తీసుకుని డెన్ కెళ్ళి, ఒకడ్ని చంపి, పగదీర్చువడానికి నాతో వుంటావా అనడం వగైరా...

        ఇలా చేయలేదు. ప్రధాన కథలో సస్పెన్స్ లేదు. ఈ యాక్షన్ స్టోరీ ఏం జరుగుతుందో తెలిసి పోతూంటుంది. అందుకని, తల్లి మరణానికి సంబంధించిన ఈ పూర్వ కథా ఖండికని కథకి తురుపు ముక్కలా వాడేందుకు అట్టి పెట్టుకున్నారు. తల్లి ఏమైంది, ఎలా చనిపోయిందన్న సస్పెన్స్ - మిస్టరీ ఎలిమెంట్ ని పోషిస్తూ. దీంతో ప్రధాన కథని నిలబెట్టడానికి పూర్వకథ తాలూకు ఫ్లాష్ బ్యాక్స్ ని వ్యూహాత్మకంగా ప్రయోగించినట్టయ్యింది. పూర్వ కథని ఇలా వాడకపోతే ప్రధాన కథ ఏమయ్యేదో వూహించాల్సిందే. ఇదీ మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్.

        'అఖండ' సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసి పోతున్నప్పుడు, ఇలా  కాపాడే మిస్టరీ ఎలిమెంటేమీ లేకుండా పోయింది. ప్రారంభంలో చూపించిన పన్నెండు నిమిషాల పూర్వ కథలో ఏదో మెలిక పెట్టి వుండాల్సింది. ఆ మిస్టరీ ఎలిమెంట్ ప్రధాన కథకి అంతర్వాహినిగా వుంటూ కాపాడేది. క్రిందటి సంవత్సరం ఒకటి జరిగింది. ఇప్పుడు దాన్ని 'షాంగ్ చీ' ఉదాహరణ బలపర్చేలా వుంది. ఒక బిగ్ మూవీ స్టోరీ ఇలాగే సస్పెన్స్ లేకుండా ఫ్లాట్ యాక్షన్ కథలా వుంది. దాంట్లో కొడుకుని తండ్రి చెడగొట్టిన పూర్వకథని ఇంటర్వెల్ తర్వాత ఒకే ఫ్లాష్ బ్యాకుగా ఓపెన్ చేసెయ్యకుండా, క్లయిమాక్స్ లో చేస్తే మిస్టరీ ఎలిమెంట్ వుంటుందని చెప్తే వినలేదు. ఇప్పుడు 'షాంగ్ చీ' లో ఇదే వుంది.

—సికిందర్ 

 

2, డిసెంబర్ 2021, గురువారం

1100 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను
తారాగణం : నందమూరి బాలకృష్ణ
, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్, సుబ్బరాజు షామ్నా కాసిం తదితరులు
మాటలు : ఎం. రత్నం
, సంగీతం : ఎస్ తమన్, ఛాయాగ్రహణం : సి రామ్ ప్రసాద్
బ్యానర్ : ద్వారకా క్రియేషన్స్
నిర్మాత : మిర్యాల రవీంద్ర రెడ్డి
విడుదల : డిసెంబర్ 2
, 2021


***

        ట సింహం నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను ఇద్దరిదీ బ్లాక్ బస్టర్స్ కాంబినేషన్. 2010 లో సింహా’, 2014 లో లెజెండ్ అనే రెండు బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత 2021 ముగింపులో  అఖండ తో హ్యాట్రిక్ చేద్దామని విచ్చేశారు. 2019 లో కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో రూలర్ బాలకృష్ణకి చేదు అనుభవాన్నిచ్చింది. బోయపాటికి 2016 లో అల్లు అర్జున్ తో సరైనోడు అనే హిట్ తర్వాత, 2017 లో బెల్లంకొండ శ్రీనివాస్ తో  జయ జానకి నాయక’, 2019 లో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ రెండూ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ తమ ఫ్లాపుల నేపథ్యాల నుంచి చేతులు కలిపి, అఖండ తో అఖండ విజయాన్ని సాధించేందుకు విచ్చేశారు. ఇందులో బాలకృష్ణ అఘోరా గెటప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ గెటప్ తో అఖండగా టైటిల్ రోల్లో నటసింహం ని చూసేందుకు బాక్సాఫీసుల్ని కిటకిటలాడించారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. మరి ఈ ప్రతిష్టాత్మక సినిమా అంతా బావుందా? చూద్దాం...

కథ

అనంతపురంలో మురళీ కృష్ణ (బాలకృష్ణ) ప్రకృతిని, సమాజాన్నీ కాపాడాలన్న తపనతో ఫ్యాక్షన్ని రూపుమాపి, పాఠశాలలూ ఆస్పత్రులూ నెలకొల్పి ప్రజాసేవ చేసే రైతుగా వుంటాడు. ఒక పీఠాధిపతిని చంపి ఆ స్థానంలోకి శక్తి స్వరూపానంద అనే దుష్ట స్వామి వస్తాడు. ఇతడితో మైనింగ్ మాఫియా వరదరాజులు (శ్రీకాంత్) కి సంబంధాలుంటాయి.  

       ఇలావుండగా కొత్త కలెక్టర్ గా శరణ్యా బాచుపల్లి (ప్రగ్యా జైస్వాల్) వస్తుంది. మురళీ కృష్ణ చేస్తున్నసామాజిక కార్యక్రమాలు చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అటు వరదరాజులు అక్రమ కాపర్ మైన్స్ లో యురేనియం గనులు బయటపడ్డంతో,  దాంతో అతడి కుట్ర వల్ల అనేక మంది పిల్లలు రోగాల పాలై మురళీ కృష్ణ ఆస్పత్రిలో చేరతారు. మురళీ కృష్ణ కూతురు కూడా ప్రమాదంలో పడుతుంది. వరదరాజులు కుట్రతో ఆస్పత్రి పేలిపోయి, మురళీ కృష్ణ అరెస్టవుతాడు. శరణ్య సస్పెండ్ అవుతుంది. ప్రాణాపాయంలో వున్న కూతుర్ని శరణ్యా బెంగుళూరు తీసుకుపోతూంటే వరదరాజులు దాడి చేయిస్తాడు. ఇలా మురళీకృష్ణ కుటుంబమూ, ప్రజలూ అల్లకల్లోలమైపోతూంటే ఆపద్భాంధవుడుగా దిగుతాడు అఖండ. పుట్టగానే చనిపోయిన ఇతను శివుడి అంశ పోసుకుని బతికాడు. ఉత్తర దేశంలో అఘోరాగా మారాడు. 

        ఇప్పుడు ఎవరీ అఖండ? ఇతడికీ, మురళీ కృష్ణకీ సంబంధమేమిటి? శివోపాసకుడైన అఖండ శక్తి ముందు దుష్టస్వామి, వరదరాజులు ఏమయ్యారు? యురేనియంతో కకావికలమైన ప్రకృతినీ ప్రజల్నీ కాపాడి సమస్థితిని నెలకొల్పాడా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రకృతిని పాడు చేయవద్దన్న నీతితో కథ ప్రారంభించారు. ప్రకృతి మీదా పసివాళ్ళ మీదా చెయ్యేస్తే శివుడూరుకో డన్నారు. ఇందుకు లయకారుడైన శివుడి అంశని అఖండ అనే అఘోరా పాత్రలో ప్రతిష్టించి పోరాటానికి దింపారు. సింపుల్ గా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ హై కాన్సెప్ట్ కథ. ప్రకృతి వినాశక శక్తులు వర్సెస్ అఖండ అనే శైవ సాధువు స్పిరిచ్యువల్ యాక్షన్ జానర్ కథగా ఐడియా బావుంది. ఈ ఐడియాని బోయపాటి తన రెగ్యులర్ ఫ్యాక్షన్ తరహా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గా మార్చేసి ప్రకృతి- దైవం- మనం అన్న సున్నిత బంధాన్ని ఫీల్ కాకుండా చేశారు. భారీ యాక్షన్ హంగామా కింద నలిగి కథ కనిపించకుండా పోయేట్టు చేశారు. పర్యావరణ పరిరక్షణ కథని కాలుష్య భరిత జాతరగా మార్చేశారు.

        కథ పోగా మిగిలింది బాలకృష్ణ అఖండ క్యారక్టర్. ఉత్తర దేశంలో వుండే అఘోరాలని అఖండ పాత్రకి రిఫరెన్సుగా తీసుకున్నారు. నగ్నంగా శ్మశానాల్లో క్షుద్ర తపస్సులు చేసే,  అనాగరిక ఆచారాలతో వుండే, భీతి గొలిపే అఘోరా మోడల్ కి, అఖండ అనే పేరిచ్చి, పుణ్యస్నానాలు- జప తపాలు చేసే నీటైన డిజైనర్ అఘోరాగా మార్చి బాలకృష్ణతో చూపించారు. దీన్ని అభ్యంతర పెట్టాల్సిన పని లేకపోయినా, ఈ క్యారక్టర్ తో అనుకున్న కథే చూపించకుండా మాయం చేయడం అభ్యంతర కరమైనది. స్టార్ సినిమాల్లో వినూత్నంగా ఎత్తుకున్న పాయింటే మర్చిపోయి సినిమా తీసేయడం మామూలే. బద్రినాథ్ లో కూడా దేవాలయాల మీద టెర్రరిస్టుల దాడినుంచి పరిరక్షణ పాయింటుతో కథ ఎత్తుకుని, పారిపోయిన లవర్స్ వర్సెస్ ఫ్యాక్షన్ యాక్షన్ కథ చూపించారు.

నటనలు –సాంకేతికాలు

నట సింహమే, సందేహం లేదు. బాలకృష్ణ తప్ప ఇంత రౌద్ర ప్రతాప పాత్ర ఎవరూ చేయలేరు. సినిమాని కూర్చుని చూడగలమంటే బాలకృష్ణ గురించే చూడాలి. రెండు పాత్రల్లో స్టార్ పవర్ తో సాంతం కమ్మేశారు. అయితే సమస్యేమిటంటే, సరైన విలన్ లేడు. ఈ పాత్రతో బాలకృష్ణ  ముందు అమ్రిష్ పురిని వూహించుకుంటే బ్యాలెన్సింగా వుంటుంది. ఇద్దరి రౌద్రం, అరుపులు మ్యాచ్ అవుతాయి. ఇంకో సమస్యేమిటంటే, పోరాట దృశ్యాలు నిడివి పెరిగి పోయి, దాంతో సినిమా నిడీవీ కూడా భారీగా పెరిగిపోయీ భారంగా మారడం. ఫ్యాన్స్ వరకూ ఓకే. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్షవుతారు.

        రెండు పాత్రల్లోనూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు బలంగా వున్నాయి. ఆస్తి కాదు, ఆలోచనలున్న వాడు గొప్ప వాడు లాంటి డైలాగులు. ప్రగ్యా జైస్వాల్ తో వెకిలి రోమాన్స్ లేకుండా, అసలు రోమాన్సే  లేకుండా- ఆమె పెళ్ళిని ప్రపోజ్ చేయగానే చేసుకోవడంతో నీటుగా కనిపిస్తుంది. రోమాన్స్ ప్రగ్యా జైస్వాల్ ఒక్కతే ఫీలై, కొన్ని చిలిపి చేష్టలు చేసుకుంటుంది.

        అఖండ పాత్రకి సెంటిమెంటల్ కోణాన్ని కల్పించే విషయంలో అశ్రద్ధ చేశారు. బోయపాటి ట్రేడ్ మార్కు యాక్షన్ హంగామాలో చితికి పోయిన సెన్సిటివిటీస్ లో ఇదొకటి. తల్లితో మదర్ సెంటి మెంటు సీను తల్లి ఒక్కతే ఫీలై సీను పొడిపొడిగా వెళ్ళి పోతుంది. బాలకృష్ణ మురళీ కృష్ణ పాత్ర కూతురితో కూడా అఖండగా తన సీన్లు పొడిపొడిగానే వుంటాయి. ప్రకృతి జోలికీ, పసి వాళ్ళ జోలికీ రావద్దన్న మాట ప్రకారమే ఈ పసిపిల్లతో సెంటిమెంటల్ సీన్లు - సెంటిమెంటల్ ట్రావెల్ కథలో వుండాల్సింది - భజరంగీ భాయిజాన్ లోలాగా. స్టార్ సినిమా హార్డ్ కోర్ యాక్షన్ గా మాత్రమే వుండొచ్చా? అయితే కుటుంబ ప్రేక్షకుల్ని ఎలా ఆశిస్తారు? బాల కృష్ణ మీద చిత్రీకరించిన పాటలు - ఒకటి ప్రగ్యాతో గ్రూప్ డాన్సు పాట-  అతి లేకుండా నీటుగా వున్నాయి.

        ప్రగ్యా జైస్వాల్ స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకునే కలెక్టర్ పాత్రలో వుంటుంది. కల్లు సీను కోసం ఆమెని తెలంగాణా వ్యక్తిగా మార్చేశారు. తర్వాత మామూలుగానే మాట్లాడుతుంది. సస్పెండ్ అయ్యాక తల్లి పాత్రలో వుండి పోతుంది. ప్రగ్యా జైస్వాల్ చీరలు తప్ప మరో కాస్ట్యూమ్ లేకుండా హోమ్లీ లుక్ తో ఆడియెన్స్ కి కన్నులపండువ.

        ఇక జగపతి బాబు, శ్రీకాంత్. జగపతి బాబు మంచి సాధువు, శ్రీకాత చెడ్డ మాఫియా. ఇద్దరూ పాత్రలు మార్చుకుని వుంటే బావుండేది. శ్రీకాంత్  కరుడు గట్టిన విలన్ గా పవర్ఫుల్లే. బాలకృష్ణకి సరిపోయేంత కాదు.

        సి. రాంప్రసాద్ మరోసారి విజువల్ క్వాలిటీ చూపించాడు కెమెరా వర్క్ తో. డార్క్ సీన్లు కూడా వ్యూహాత్మక లైటింగుతో డిటెయిల్డ్ గా విజువలైజ్ చేశాడు, బాలకృష్ణ ఆభరణ, ఆయుధ సంపత్తిని  హైలైట్ చేయడంతో బాటు. ఈ మూవీలో కళా దర్శకత్వానికి చాలా పనుంది. ఏఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం విజువల్స్ కి రిచ్ నెస్ ని తీసుకొచ్చింది. అలాగే స్టంట్ విభాగానికీ చాలా పనుంది. రామ్ లక్ష్మణ్ లు, స్టన్ శివ సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ క్లాస్. అయితే తెలుగు టీవీ సీరియల్లాగా ఎంతకీ ముగియకపోవడమే పదే పదే వచ్చే యాక్షన్ దృశ్యాల ప్రత్యేకత. దీని విషయంలో ఎడిటర్లు కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మిరాజులు కూడా చేతులెత్తేశారు.

        బోయపాటి దర్శకత్వ బలానికే లోటూ లేదు. కథా బలం లేదు. రత్నం డైలాగుల బలం చెప్పుకోదగ్గది. ఉన్న కథకి బలమైన, క్వాలిటీ డైలాగులు రాశాడు. బాలకృష్ణ నోటి వెంట ఈ డైలాగులు వినసొంపుగా వుంటాయి. బాలకృష్ణ - బోయపాటిల హిట్ కాంబినేషన్ అఖండ పాత్రకి గుర్తుంటుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదన్నట్టు నడిపించి, ఇంటర్వెల్ ముందు అఖండకి భారీ యాక్షన్ తో ఎంట్రీ ఇప్పించాక- సెకండాఫ్ లో కథని కూడా పట్టించుకోవాల్సింది. లాక్ డౌన్ ఎత్తేశాక విడుదలవుతూన్న సినిమాల్లో వరుసగా సెకండాఫ్ కే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని బాలకృష్ణ మాస్ పవర్ ఎంత వరకు అధిగమిస్తుందో చూడాలి.

—సికిందర్