రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, నవంబర్ 2021, మంగళవారం

1086 : ఆర్టికల్

 

      19 వ తేదీ శుక్రవారం 9 సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాల్ని ఉత్పత్తి చేయడంలో టాలీవుడ్ సామర్ధ్యం తక్కువేమీ కాదు, ఈ సామర్ధ్యంతో ప్రేక్షకులే పోటీ పడాలి. పోటీ పడి చూడకపోతే ఓటమి వాళ్ళదే. పెద్ద సినిమాలైతేనే చూస్తాం, చిన్న సినిమాల్ని పట్టించుకోమంటే చిన్న సినిమాలేమైపోవాలి. చిన్న సినిమాల్ని కూడా ప్రోత్సహించాలి. ప్రోత్సహించినప్పుడే చిన్న సినిమాల్ని ఇంకా ఇంకా బాగా తీస్తారు. కొత్త నిర్మాతలు, దర్శకులు, నటులూ, సాంకేతికులూ ఇంకెందరో వస్తారు. ప్రజలు ఎక్కువ తినేది శాఖాహారమే, సినిమాలు ఎక్కువ నిర్మించేది చిన్న సినిమాలే. చిన్న సినిమాలు శాఖాహారం, పెద్ద సినిమాలు నాన్ వెజ్. ఓటీటీల్లో ఎక్కడెక్కడి సినిమాలు చూసి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం కాదు, ఇక్కడి చిన్న చిన్న తెలుగు సినిమాల్ని కూడా థియేటర్లలో చూసి మంచి చెడ్డలు కామెంట్లు పెడితే తెలుగు సినిమాల అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళవుతారు. తెలుగు సినిమాల్ని వదిలేసి ఎక్కడివో సినిమాల్ని పొగడడమేమిటి?

        వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో 9 చిన్న సినిమాలకి అవకాశం చిక్కింది. ఊరికి ఉత్తరాన, మిస్సింగ్, స్ట్రీట్ లైట్, పోస్టర్, మిస్టర్ లోన్లీ, రామ్ అసుర్, రావణ లంక, ఛలో ప్రేమిద్దాం, సావిత్రి వైవ్ ఆఫ్ సత్యమూర్తి ఇవన్నీ విభిన్న జానర్లు. లవ్, సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ. నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లూ అందరూ కొత్త వాళ్ళు. ప్రేక్షకుల ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారు.

***

 

15, నవంబర్ 2021, సోమవారం

1085 : ఆర్టికల్

 

        కోవిడ్ మహమ్మారి కాలంలో వినోద పరిశ్రమలో పాగావేసి పాతుకుపోయిన ఓటీటీ కంపెనీలు వివిధ భాషల సినిమాల్ని కొని సార్వజనీనం చేస్తూంటే, ఇంకా రీమేకులు అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓటీటీల్లో ఒక భాషలో కొన్న సినిమాల్ని సబ్ టైటిల్స్ వేసి ప్రపంచ వ్యాప్తంగా ఇతర భాషల వారికి అందుబాటులో వుంచుతున్నప్పుడు రీమేకులు అవసరం లేదనే అనాలి.

        కానీ రీమేకులు చేయకపోతే బాలీవుడ్ కి మనుగడ లేనట్టు తయారైంది పరిస్తితి. దక్షిణ సినిమాల రీమేకుల మీద భారీగా ఆధారపడ్డ బాలీవుడ్, ఓటీటీ ట్రెండ్ లోనూ రీమేకులకి వెనుకడుగు వెయ్యడం లేదు. జెర్సీ, హిట్, మాస్టర్, సూరరై పొట్రు, విక్రమ్ వేదా, ఖైదీ, రాట్ససన్, అల వైకుంఠ పురంలో, ఎఫ్2, క్రాక్, నాంది, బ్రోచేవారెవరూరా ...ఇవి కొన్ని మాత్రమే హిందీలోకి రీమేక్ చేస్తున్న తెలుగు, తమిళ సినిమాలు. ఇవన్నీ వివిధ ఓటీటీల్లో విడుదలైనవే. హిందీ రీమేకులుగా ఇవి మళ్ళీ ఓటీటీల్లో దర్శమిస్తాయి.

        అలాగే అయ్యప్పనుం కోషియమ్, లూసిఫర్, కప్పెలా, డ్రైవింగ్ లైసెన్స్, హెలెన్ మొదలైన ఓటీటీల్లో విడుదలైన మలయాళ సినిమాలు తెలుగులో రీమేకవుతున్నాయి. ఓటీటీలో విడుదలైన హిందీ అంధాధున్ కూడా తెలుగులోనూ (మాస్టర్), మలయాళంలోనూ రీమేక్ అయింది. తమిళ అసురన్ కూడా తెలుగులో నారప్పగా రీమేక్ అయింది. అయితే నారప్ప లాక్ డౌన్ కాలంలో థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీలో విడుదలైంది. అసురన్ ని విడుదల చేసిన అమెజానే నారప్పని కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసింది.

        ఓటీటీ కంపెనీలు గానీ, రీమేకులు చేసే నిర్మాతలుగానీ రీమేకులు అవసరమా అని ఆలోచించడం లేదు, ప్రేక్షకులే విసిగిపోయి ప్రశ్నిస్తున్నారు. మేం థియేటర్లోనో ఓటీటీల్లోనో చూసేసిన సినిమాల్ని రీమేక్ చేసి మళ్ళీ థియేటర్లలో, ఓటీటీల్లో వేస్తే ఎలా చూడాలని విమర్శిస్తున్నారు. మేం చందాలు కట్టింది ఓటీటీల్లో చూసిన సినిమాల రీమేకులు మళ్ళీ ఓటీటీల్లో చూడ్డానికేనా అని విరుచుకు పడుతున్నారు. ఇవే ప్రశ్నలు వేస్తూ ప్రింట్, వెబ్ మీడియాల్లో ఆర్టికల్స్ కూడా రాస్త్తున్నారు సినిమా జర్నలిస్టులు.

        ఇదేం పట్టించుకోకుండా నిర్మాతలు, ఓటీటీలు తమపని తాము చేసుకుపోతున్నారు. కానీ మలయాళ రంగం దాని ప్రత్యేకతని అది చాటుకుంటోంది, ఎన్నో మలయాళ సినిమాలు ఇతర భాషల్లో రీమేకవుతున్నా, ఏ ఇతర భాషల సినిమాల్నీ మలయాళ రంగం రీమేక్ ఛేయడం లేదు. తమదైన ఒరిజినల్ కంటెంట్ తోనే సినిమాలు తీస్తున్నారు. ఓటీటీలకి, రీమేకులకి అమ్ముకుంటున్నారు. ఇలా మలయాళ పరిశ్రమలోకి బయటి నుంచి డబ్బులు రావడమేగానీ, మలయాళ పరిశ్రమలోంచి డబ్బులు బయటికి పోవడం జరగడం లేదు. ఈ బిజినెస్ మోడల్ని ఇతరులూ అనుసరిస్తే ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు వస్తాయి. క్వాలిటీ కూడా పెరుగుతుంది.  
***

 

14, నవంబర్ 2021, ఆదివారం

1084 : సందేహాలు -సమాధానాలు



 Q : చెప్పొద్దు, చూపించాలి’ సిరీస్ చాలా బాగుంది. రాస్తున్నప్పుడు టెక్నికల్ గా చాలా విషయాలు గుర్తు పెట్టుకునేలా వివరంగా చెప్పినందుకు థాంక్స్. నేను ఒక వెబ్ సిరీస్ కు రాస్తున్నప్పుడు వ్యాన్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కు కొత్తగా పెళ్ళి అయ్యిందనే విషయాన్ని బానెట్ మీద ఒక మల్లె పూల పొట్లం పెట్టి ఎస్టాబ్లిష్  చేసి, అతను త్వరగా ఇంటికి వెళ్ళే తొందరలో  ఉన్నాడని డైలాగ్స్ ద్వారా చెప్పించాను. ఈ  విషయంలో డైరెక్టర్ గారు బాగా అప్రిషియేట్ చేశారు.

        చెప్పొద్దు, చూపించాలి-2 లో మీరు రాసిన కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీనును ఇలా చెప్పొచ్చేమో.. వ్యాను స్తంభానికి గుద్దుకున్న షాట్, పక్కనే డ్రైవర్ రక్తంలో తీవ్ర గాయాలతో పడి ఉండడం..వ్యాన్  నుండి రక్తం ధారగా కారుతూ ఉంటే, బ్యాక్ గ్రౌండ్ లో కోళ్ళ అరుపుల శబ్దం.. వ్యాను మీద కోళ్ళ ఫారం కు సంబంధించిన లోగో...
—జయసింహా, రచయిత

A : చెప్పొద్దు, చూపించాలి సిరీస్ నచ్చినందుకు థాంక్స్. మీరు చెప్పిన వెబ్ సిరీస్ సీనుకి స్టోరీ మేకింగ్ చేసి దర్శకుడి మెప్పు పొందడం మంచి విషయం, అభినందనలు. ఐతే ఒక అనుమానం, కొత్తగా పెళ్ళయితేనే పూలు తీసికెళ్తారా? పాత సంసారానికి తీసికెళ్ళరా? పెళ్ళాం మీద ప్రేమ కొత్తలోనే వుంటుందా? కనుక వ్యాను బానెట్ మీద అలా మల్లె పూల పొట్లం వుంచితే కొత్తగా పెళ్ళయిందనే అర్ధమే వస్తోందా, లేక విపరీత అర్ధాలొస్తున్నాయా ఆలోచించండి. ఆ డ్రైవర్ ది పాపం పాత సంసారమే కావొచ్చు. కొత్త సంసారానికి డ్రైవరు త్వరగా ఇంటికెళ్ళాలను కోవడం వ్యాను యజమాని లేదా ఎవరైతే వాళ్ళకి, కామన్ గానే  అన్పించే విషయం. ఇందులో నీతి లేదు, డ్రైవర్ క్యారక్టర్ ఏమీ లేదు.

        కానీ పాత సంసారానికే త్వరగా వెళ్ళాలను కుంటున్నాడంటే అది గొప్ప విషయం, ఇందుకు గౌరవం పెరుగుతుంది డ్రైవర్ మీద. ఇది నీతి, ఇది క్యారక్టర్. ఈ క్యారక్టర్ యజమానికే ప్రశ్నలా కూడా వుంటుంది- తను ఇలా వుంటున్నాడా అన్న ప్రశ్న. అప్పుడిది కేవలం డ్రైవర్ యాక్షన్ సీనుగా కాకుండా, యజమాని రియాక్షన్ సీనుగా డెప్త్ పెంచుకుంటుంది. ఎప్పుడైతే సీను రియాక్షన్ నిస్తుందో అప్పుడు పాసివ్ సీనుగా వుండదు, యాక్టివ్ సీనుగా మారి ఉత్సాహాన్నిస్తుంది. ప్రేమని కొత్త పెళ్ళి, పాత సంసారమని కాలాల్లో బంధించకండి. దానికి కాలం లేదు, అది నిరంతరం. సినిమా క్వాలిటీని వెబ్ సిరీస్ కివ్వకుండా వుంటే బావుంటుందేమో. ఎందుకంటే వెబ్ సిరీస్ కి మంచి క్వాలిటీ ఇవ్వడానికి అడ్డంకులుండవు.

          ఇక చెప్పొద్దు, చూపించాలి-2 లో కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీను సంగతి. ఇందులోనే వివరించినట్టు, ఈ సీనుని లీ చైల్డ్ నవలల్లో రాసే స్లో యాక్షన్- హైడ్రామా ప్రకారం వుంచాం. దీన్నింకా వివరంగా చెప్పుకుందాం : ఈ ప్రక్రియలో శిల్పం ఏమిటంటే పరిస్థితిని తక్షణం వెల్లడించక పోవడం. ఒక్కొక్కటి విప్పి చూపిస్తూ (అంటే స్లో యాక్షన్), సస్పెన్స్ (అంటే హై డ్రామా) ని పెంచడం.

        అందుకని వ్యాను స్తంభానికి గుద్దుకున్నాక ఏం జరిగిందీ పరిస్థితిని వెంటనే చూపించి సీను తేల్చెయ్యకుండా, సస్పెన్స్ లో వుంచేసి కట్ చేసి, ఓపెన్ చేస్తే - డ్రైవరు మూల్గుతూ రోడ్డు పక్కన కూర్చుని వుంటాడు. ఈ షాట్ లో వ్యాను పరిస్థితి ఏంటనే ప్రశ్న లేదా సస్పెన్స్ వుంటుంది. ఇంతలో క్లీనరు అనుకుందాం, ఇదే షాట్లోకి ఎంటరై, సెల్ ఫోన్లో తీసిన ఫోటోలు చూపిస్తూంటాడు. వ్యాను ముందు భాగం నుజ్జయిన ఫోటోలు. సరే, మరి కోళ్ళు ఏమయ్యాయన్న మరో ప్రశ్న లేదా సస్పెన్స్.  అప్పుడు ఇదే షాట్ లో క్లీనర్ చేతిలో రెండు చచ్చిన కోళ్ళు రివీలవుతాయి...ఇదీ ఈ సీనుకి శిల్పం చెక్కిన విధానం. లో - బడ్జెట్లో తీయడానికి స్లో యాక్షన్ -హై డ్రామా సీను విధానం.

        హై బడ్జెట్ కి మీరు రాసినట్టు వుంటే బాగానే వుంటుంది. వ్యాను స్తంభానికి గుద్దుకున్న షాట్, పక్కనే డ్రైవర్ రక్తంలో తీవ్ర గాయాలతో పడి వుండడం, వ్యాన్  నుంచి రక్తం ధారగా కారుతూ వుంటే, బ్యాక్ గ్రౌండ్ లో కోళ్ళ అరుపుల శబ్దం, ఇంకెంతైనా బీభత్సం. వీటిలో వ్యాను మీద కోళ్ళ ఫారంకి సంబంధించిన లోగో అవసరం లేదు. అది కోళ్ళ వ్యాను అని వస్తున్నప్పుడే తెలిసిపోతుంది.

        అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, sensitivities నిహై బడ్జెట్స్ యాక్షన్ సీన్స్ లో sensitivities కి అంత ప్రాధాన్యం వుండదు. ఒకేసారి బ్యాంగ్ ఇచ్చి మొత్తం బీభత్స దృశ్యమంతా బడ్జెట్ వెదజల్లి ఒకేసారి చూపించెయ్యడం. కానీ సస్పెన్స్  బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఏమంటాడంటే There is no terror in the bang, only in the anticipation of it -అంటాడు.

        అంటే సంఘటనకి ఒకేసారి బ్యాంగ్ ఇచ్చేస్తే టెర్రర్ ఫీలింగ్ వుండదని, ఏదో జరగబోతోందని ముందునుంచీ అన్పిస్తూంటే ఆ బ్యాంగ్ కి మంచి ఇంపాక్ట్ వుంటుందని అంటున్నాడు. ఇందుకే వ్యాను స్తంభనికి గుద్దుకున్న షాట్ తీసి, వ్యాను ముందు భాగం నుజ్జయింది కూడా చూపించకుండా కట్ చేసి, రోడ్డు పక్క డ్రైవర్ మూల్గుటూ కూర్చున్న రెండో షాట్ వేస్తే, అసలేమైందన్న సస్పెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు అంచెలంచెలుగా సంఘటన వివరాల్ని క్లీనర్ చేత రివీల్ చేయిస్తూ - చివరికి చచ్చిన కోళ్ళు చూపిస్తే -ఈ విధంగా డెవలప్ అవుతూ వచ్చిన ముగింపుకి ఇంపాక్ట్ వుంటుంది.

        డ్రైవర్ కి గాయాలూ రక్తాలూ బిగ్ బడ్జెట్స్ వ్యవహారం. డ్రైవర్ కి రక్తాలూ గాయాలకి సంబంధించిన ప్రోస్థెటిక్స్ మేకప్ అవసరం.  లో- బడ్జెట్ అనుకున్నప్పుడు పైన చెప్పుకున్న విధంగా చూపిస్తే ఈ అవసరం తప్పుతుంది. లొకేషన్లో డ్రైవర్ కి ప్రోస్థెటిక్ మేకప్ అంతా చేసి, షాట్ తీసే సమయం, ఖర్చూ తగ్గుతాయి. కేవలం రెండు షాట్స్ లో ఈ సీను క్లుప్తంగా, బలంగా తీయవచ్చు.

        ఇంకోటేమిటంటే, ఈ సంఘటనలో sensitivities ని దృష్టిలో పెట్టుకోవడం అవసరం. ఇక్కడ డ్రైవర్ గాయపడి నందుకు బాధ కలగాలా, లేక కోళ్ళు చచ్చిపోయినందుకు బాధ కలగాలా? ఖచ్చితంగా మూగజీవులు చచ్చిపోయినందుకు బాధ కలగాలి. వ్యానులో కోళ్ళు ఎవరి చేతిలో చికెన్ గా మారి, ఎవరెవరి కడుపుల్లోకి పోతాయన్నది తర్వాతి సంగతి, ముందవి  డ్రైవర్ చేతిలో ప్రాణాలు పెట్టి కూర్చున్నాయి. డ్రైవరేమో యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీశాడు. అందుకని చచ్చిన కోళ్ళని చూసి అయ్యో పాపం అన్పించాలంటే డ్రైవర్ గాయపడ కూడదు. సీనులో వున్న సింపతీ ఫ్యాక్టర్ రెండుగా చీలిపోయి ఇంపాక్ట్ పోతుంది. ఒక షాటులో ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే డీఎన్ఏ కరెక్టుగా వుండి కథకి నిండుదనం వస్తుంది.

        హిచ్ కాక్ బిగ్ బడ్జెట్స్ తీయలేదు. అందుకే స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ కోసం కాగితాల మీద 90 శాతం రాత పని చేసీ చేసీ, 10 శాతం దర్శకత్వం చేసే వాడు. మనం 10 శాతం రాత పని చేసేసి, 90 శాతం దర్శకత్వం చేస్తూ చేస్తూ వుంటాం. రాతలో ఏమీ లేని దానికి. స్మాల్ ఈజ్ హారిబుల్!

Q :  నేను పుష్పక విమానం చూశాను. ఇందులో ఆనంద్ దేవరకొండ క్యారక్టర్ గ్రోత్ కన్పించలేదు నాకు. సినిమాలో ఇతర  లోపాలు ఏమైనా వుంటే సరిచేసినా, క్యారక్టర్ ఇలా గ్రోత్ లేకుండా వుంటే సరిపోతుందా?
—కె. రమేష్, అసోషియేట్

A :   ఆ పాత్ర ప్రభుత్వ లెక్కల టీచర్. కానీ జీవితాన్ని లెక్కించడం తెలీదు. ఇదలా వుంచితే ప్రభుత్వ స్కూల్లో పిల్లలకేం ఉపయోగపడుతున్నాడో ఒక్క సీనూ లేదు. ఓపెన్ గ్రౌండ్ లో చెట్ల కింద టేబుల్ కుర్చీ లేసుకుని, సహ టీచర్లతో కలిసి కూర్చుని, పిల్లల ముందు లంచ్ ని పిక్నిక్ లా ఎంజాయ్ చేయడం తెలుసు. మధ్యాహ్న భోజన పథకాన్ని తామే ఆరగిస్తున్నట్టు. ఇవే సీన్లు రెండు మూడున్నాయి. లోకల్ లీడర్లు వీళ్ళని పట్టుకుని లోపలేయిస్తే సరి.

        ఇదలా వుంచితే, కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్య ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోవడం ఎవరికైనా తెలిస్తే పరువు తక్కువనుకుని, ఈ విషయం దాచి పెట్టడమే ముఖ్యమన్నట్టు భార్య వున్నట్టే నటిస్తూంటాడు. ఇక్కడే లెక్కల మాస్టారికి జీవితాన్ని లెక్కించడం తెలియలేదు. భార్యని పరువు కోసమే ఇంట్లో పెట్టుకుంటాడా? అంతకి మించి తన జీవితంలో ఆమెకి స్థానం లేదా? ఆమె అమెజాన్లో తెప్పించుకున్న ఫోర్ స్టార్, ఫ్రాస్ట్ ఫ్రీ, కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటరా?

       \పాత్రకి స్ట్రగుల్స్ రెండుంటాయి: ఔటర్ స్ట్రగుల్, ఇన్నర్ స్ట్రగుల్. బయట పరిస్థితుల్ని ఎదుర్కొనే ఫిజికల్ యాక్షన్, లోపల మనసులో సంఘర్షించే ఎమోషనల్ యాక్షన్. భార్య లోకానికి భార్యే, కానీ తనకి జీవిత భాగస్వామి. బయట పరువుకోసం ప్రాకులాడ వచ్చు, కానీ ఎప్పటికైనా, బయటి పరిస్థితుల మీద పట్టు సాధించాకైనా, భార్య పట్ల అనురాగాన్ని గుర్తు చేసుకుని, ఆ ఫీల్ తో ఆమె కోసం సంఘర్షించే ఎమోషనల్ యాక్షన్ లేకపోవడం పాత్ర గ్రోత్ లేకుండా నిర్జీవంగా తయారు చేసింది. పాత్ర గ్రోత్ లేకుండా కథ వుండదు.

Q :  షాట్స్ గురించి మారు రాసిన ఆర్టికల్స్ చదివితే నాకు ఒకటి స్ఫురిస్తోంది. షాట్స్ లో గుప్తంగా కూడా కథ చెప్పవచ్చా? ఇలాటి ఉదాహరణ లుంటే ఇస్తారా?
—జేడీ స్వామి, కో డైరెక్టర్

A : అద్భుత కొరియన్ రోమాంటిక్ డ్రామా ది క్లాసిక్ లో టైటిల్స్ లోనే గుప్తంగా కథ చెప్పడం వుంది సింబాలిక్ గా. దీన్ని విశ్లేషిస్తూ గతంలో రాసిన ఆర్టికల్లోని భాగం చూడండి - ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతిఆ తర్వాత ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివరమహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు...

        ఈ చిత్రణ ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు – దేని అస్తమయాన్నిఅక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే. ఇలా ఈ ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. 

        ఒక అస్తమయంతో ఇంకో సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరంఒక ద్వంద్వం ... బావుంది కదూ?

        ఇలాగే కోయెన్ బ్రదర్స్  తీసిన క్లాసిక్ న్యూ నోయర్ జానర్ మూవీ బ్లడ్ సింపుల్ విశ్లేషణా వ్యాసాలు వున్నాయి. సాంతం ఎన్ని సింబాలిజాలతో ఎన్ని గుప్త కథలు ఎలా చెప్పారో మీ అధ్యయనానికి పనికొస్తాయి. బ్లడ్ సింపుల్ అని బ్లాగు సెర్చి బ్లాక్సులో తెలుగులో టైపు చేయండి, ఆర్టికల్స్ డిస్ ప్లే అవుతాయి.

—సికిందర్

 

 

 



13, నవంబర్ 2021, శనివారం

1083 : సాంకేతికం

       సింపుల్ గా ‘చెప్పొద్దు, చూపించాలి’ అంటే ఏమిటి? అంటే పాత్రలు వాటి ఆలోచనల్ని, భావోద్వేగాలని మాటల్లో కాకుండా చేతల ద్వారానో, లేదా సింబాలిజంల ద్వారానో వెల్లడించడం. చెప్పడమంటే పాత్ర భావానికి డైలాగు రాయడం. పాత్రకి నిద్ర వస్తూంటే, అబ్బా నిద్రొస్తోందని డైలాగు రాసి, పాత్రకి నిద్ర వస్తున్నట్టు ప్రేక్షకులకి చెప్పడం. దీన్ని చూపించడమెలా అంటే, పాత్ర ఆవులించినట్టు యాక్షన్ (చేత) లెఫ్ట్ రాయడం. లేదా పక్కన ఖాళీ కప్పులు పడుండి, టీ మీద టీ తాగేస్తున్నట్టు చూపిస్తే, అది ముంచుకొస్తున్ననిద్రకి సింబాలిజం అవుతుంది. డైలాగే రాస్తే అది విజువల్ ఆర్టు అవదు. పైగా ఆ డైలాగు ఎఫెక్టివ్ గా డబ్బింగు చెప్పించడానికి, పది నిమిషాలో పాతిక నిమిషాలో సమయం తీసుకుంటుంది. ఆ మేరకు పడే డబ్బింగు థియేటర్ రెంటు బిల్లు వేస్టు. పాత్ర ముందు నాల్గు ఖాళీ కప్పులు పడేసి, రెండు టీలు పెట్టేస్తే పది రూపాయలతో అయిపోయే పని.

        లాగని సీన్లలో డైలాగులే లేకుండా చేయమని కాదు. సినిమా మొత్తంలో పది పదిహేను చూపించడాలు వుండొచ్చు. ఆ షాట్స్ గుర్తుండి పోవడమే గాకుండా, మంచి అనుభవాన్నిచ్చాడని కూడా మేకర్ ని గుర్తుంచుకుంటారు ప్రేక్షకులు. చూపించడ మంటే అనుభవాన్నివ్వడమే, వీక్షణానుభవం. మనలో ఎంత మందిమి నిద్రవస్తూంటే టీ మీద టీ తాగేసి వుండం? ఇలా మన అనుభవమే తెర మీద మేకర్ చూపిస్తూంటే మనసారా ఎటాచ్ అయిపోతాం ఆ షాటుకి.
        
చూస్తే వుండే ప్రభావం వింటే వుండదు. చూసినప్పుడు అందులో యాక్షన్ కన్పిస్తుంది, అందుకే ప్రభావం చూపిస్తుంది. విన్నప్పుడు యాక్షన్ వుండదు. చూస్తే మెదిలే ప్రశ్నలు వింటే వుండవు. ఎదురుగా ఖాళీ కప్పులు పడున్నాయి. ఇంకో కప్పు టీ తాగడం పూర్తి చేసి మరో కప్పు అందుకుంటున్నాడు... అన్నట్టు యాక్షన్లో ముంచుకొచ్చే నిద్ర చూపిస్తూంటే - నిద్ర కాస్తూ అన్ని కప్పులు తాగాడా, ఇంకా తాగుతున్నాడా - అన్న ప్రశ్నలు మెదులుతాయి. ప్రేక్షకుల్ని ఖాళీగా కూర్చో బెట్టకుండా ఆలోచింప జేస్తుంది చూపించడం. మూకీ సినిమాలు ఇలాగే వర్కౌట్ అయ్యాయి. ఫిలిమ్ ఈజ్ బిహేవియర్ అన్నారు. మాటల కన్నా ప్రవర్తనల ద్వారా, చేతల ద్వారా విషయం బయట పడితే ఉత్తమ దర్శకత్వం.

    ప్రతీ వొక్క షాటునీ విలువైనదిగా ఎంచినప్పుడే బడ్జెట్ వృధాని అరికట్ట వచ్చు. నిద్ర వస్తోందని మాటలతో చెప్పడానికి షాటెందుకు ఖర్చు దండగ. అలాంటప్పుడు సినిమా తీయకుండా రేడియో నాటకంగా ప్రసారం చేసుకోవచ్చు ఎంచక్కా. లేదా వీధి నాటకం వేసుకోవచ్చు. సినిమాకి కళ్ళు మూసుకుని వినడానికి కాకుండా కళ్ళు తెర్చుకుని చూడ్డానికి వెళ్తాం. చూసినప్పుడు డీటెయిల్స్ లేకుండా షాట్స్ వుంటే అవి వీక్షణానందాన్ని ఇవ్వవు. నాల్గైదు ఖాళీ కప్పులు పడుండి ఇంకో కప్పు లాగిస్తున్న డిటెయిల్సే షాటంటే. షాట్ ఈజ్ డిటెయిల్. దీనికి నాటకీయత పెంచాలనుకుంటే అప్పుడు సౌండు హెల్ప్ తీసుకోవచ్చు. నిదుర పోరా తమ్ముడా అని ఎక్కడ్నించో లతా మంగేష్కర్ పాట వస్తున్నట్టు. లేదా పాత్ర నిద్ర పోగొట్టే  తెల్ల చీరకు తగధిమి తపనలు ఇంకో లతా పాట. టీలతో బాటు డబుల్ ధమాకాగా పాట!

2.

         ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘మేఘ సందేశం’, ‘సితార నాల్గూ ఒకే  సామాన్యాంశాన్ని కలిగి వుంటాయి. ఏమిటది? అతి తక్కువ డైలాగులు. ఈ నాల్గు పెద్ద హిట్స్ లో అతి తక్కువ డైలాగులు. షాట్స్ తో విజువల్ గానే ఎక్కువ కథ చెప్పారు. ఇవేం సినిమాలు, అర్ధంకాలేదని ప్రేక్షకులు తిప్పికొట్టలేదు. పెద్ద హిట్స్ చేశారు. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లిపోయాక, 2000 సంవత్సరంలో శ్యామ్ బెనెగల్ అవే కథల్ని బాలీవుడ్ స్టార్స్ తో తీసి కొత్తతరం ప్రేక్షకుల్ని ఆనందపర్చారు. అప్పుడు వీటిని కమర్షియలార్ట్ సినిమాలన్నారు.
        
కానీ చాలా పూర్వమే ఎప్పుడో ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘మేఘ సందేశం’, ‘సితార తెలుగులో కమర్షియలార్ట్ సినిమాలే! కొత్త మేకర్లు వీటిని పాఠాలుగా పెట్టుకుంటే మీడియం, స్మాల్ బడ్జెట్స్ కి కొత్త రూపునిచ్చి గుర్తింపు పొంద గల్గుతారు. మీడియం, స్మాల్ బడ్జెట్స్ కే మేకర్లకి సృజనాత్మక స్వేచ్ఛ వుంటుంది. అలాంటప్పుడు ఇవే కథల్ని కమర్షియలార్టుగా తీస్తే నష్టమేం లేదు. 
 
3.

        షాట్స్ డైలాగుల్ని తగ్గించడమే గాక, రెండు మూడు సీన్సుని కలిపి ఒకటిగా చేసి బడ్జెట్ ని మిగల్చగలవు. సన్నివేశాన్ని బట్టి సౌండ్  కూడా వాడుకుని. మంచి రోజులొచ్చాయి’, రాజ రాజ చోర లలో ఇదెలా చేయవచ్చో గమనించాం. ఇంకా సీను ఫుటేజీ, షూటింగు టైము తగ్గించాలంటే కాంప్లెక్స్ షాట్ వుంది. అంటే సీనులో వున్న అందరు నటుల్నీ మిడ్ షాట్ లో ఒకే ఫ్రేములో వుండేట్టు ప్లేస్ మెంట్స్ ని కంపోజ్ చేసి, మాట్లాడిస్తే, ఒకే షాట్ లో పూర్తవుతుంది.

      వీటన్నిటికీ బీజం ఎక్కడ పడాలి? ట్రీట్మెంట్ నుంచి డైలాగు వెర్షన్ రాస్తున్నపుడే స్టోరీ మేకింగ్ చేస్తూ. వెబ్ సిరీస్ కి కూడా ఇలా స్టోరీ మేకింగే. వెబ్ సిరీస్ కి హిందీలో రైటరే కింగ్. అక్కడ వెబ్ సిరీస్ రైటర్స్ మీడియా. మధ్యలో డైరక్టర్ని తొలగించ వచ్చేమో గానీ, రైటర్నితొలగించలేరు. అయినా రైటర్ మేకర్ లా స్టోరీ మేకింగ్ చేస్తేనే నిలదొక్కుకుంటాడు, స్టోరీ రైటింగ్ చేస్తే కాదు.
        
స్టోరీ రైటింగ్ కథ అల్లడం, స్టోరీ మేకింగ్ కథని నిర్మించడం. సినిమాకి నిర్మించాలి. సినిమాని నిర్మిస్తారు, అల్లరు. నిర్మించడమంటే మెకానిజమే. అందుకే మేకర్ మెకానిక్కు. షూటింగులోనే  కాదు, రైటింగు లోనూ.

(అయిపోయింది)

—సికిందర్

12, నవంబర్ 2021, శుక్రవారం

1082 : రివ్యూ


రచన- దర్శకత్వం : శ్రీ సరిపల్లి
తారాగణం : కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, తనికెళ్ళ భరణి, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : పిసీ మౌళి
నిర్మాత : రామారెడ్డి
విడుదల : నవంబర్ 12, 2021

***

        రెక్స్ - 100 హిట్ హీరో కార్తికేయ గుమ్మకొండ తర్వాత నటించిన చావు కబురు చల్లగా సహా ఐదూ హిట్ కాలేదు. ఇప్పుడు తాజాగా రాజా విక్రమార్క యాక్షన్ కామెడీ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ, శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వారం వారం కొత్త దర్శకులు వస్తూనే వున్నారు. ఒక సినిమాతో మళ్ళీ కన్పించకుండా వెళ్ళి పోతున్నారు. అంటే ఫ్లాపులు తీయడంలో పోటీపడుతున్నారు. ప్రస్తుత కొత్త దర్శకుడు, కార్తికేయ కూడా కలిసి ఫ్లాపు తీయడానికి పోటీ పడ్డారా? ఇది తెలుసుకుందాం...

కథ

    విక్రమ్ (కార్తికేయ) ఎన్ఐఏ ఏజెంట్. బాస్ మహేంద్ర (తనికెళ్ళ భరణి) కింద హైదరాబాద్ లో వుంటాడు. మారణాయుధాలు సరఫరా చేస్తున్న ఒక నైజేరియన్ ని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తాడు. అప్పుడు పొరపాటున తన చేతిలో వున్న తుపాకీ పేలి నైజేరియన్ చచ్చిపోతాడు. చచ్చిపోతూ మాజీ నక్సలైట్ నాయకుడు గురునారాయణ (పశుపతి) గురించి చెప్పి చచ్చిపోతాడు. గురు నారాయణ వల్ల  హోమ్ మంత్రి చక్రధర్ (సాయి కుమార్) కి ప్రాణాపాయముందని తెలుసుకున్న బాస్ మహేంద్ర, విక్రంకి హోమ్ మంత్రి చక్రధర్ సెక్యూరిటీ బాధ్యతలు అప్పగిస్తాడు. చక్రధర్ కి కాంతి (తాన్యా రవిచంద్రన్) అనే అందమైన కూతురుంటుంది. ఈమెతో ప్రేమలో పడతాడు విక్రమ్. ఒకవైపు హోమ్ మంత్రిని రక్షించే బాధ్యత తీసుకున్న విక్రమ్, అతడి కూతురితో ప్రేమలో పడ్డంతో బాధ్యతని నెరవేర్చగలిగాడా లేదా అనేది మిగతా వెండితెర మీది కథ.

ఎలావుంది కథ

  యాక్షన్ కామెడీ జానర్లో పాత రొటీన్ ఫార్ములా కథ. ఇందులో యాక్షన్, కామెడీ, ఫార్ములా కథ ఏవీ సరిగా లేని కథ. కొత్త దర్శకులు కథల దగ్గరే సినిమాల్ని బోల్తా కొట్టిస్తున్నారు వరుసగా. ఇదీ అంతే. అర్ధం పర్ధం లేని కథ. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏజెంట్ హీరో పాత్రతో ఇష్టారాజ్యంగా వుంది కథ. ఎన్ఐఏ అనేది టెర్రరిజం, నక్సలిజం, అక్రమ మానవ రవాణా, నకిలీ నోట్లు, నిషేధిత మారణాయుధాల సరఫరా, సైబర్ టెర్రరిజం వంటి కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ. కేవలం ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో కేసులు నడిపే సంస్థ మాత్రమే. ఒకరికి సెక్యూరిటీ కల్పించడం సంస్థ పని కాదు.  అలాటిది రాష్ట్ర హోమ్ మంత్రి సెక్యూరిటీగా హీరో ఎలా వచ్చాడు? దర్శకుడు తనకి తానే ఫీలై ఇతడ్ని సెక్యూరిటీగా నియమించేస్తే చెల్లిపోతుందా? ఎన్ఐఏ ఏజెంట్లు సెక్యూరిటీ గార్డులా? ఇదెంత హాస్యంగా వుందో సినిమా కూడా అంత హాస్యాస్పదంగా వుంది.


       పేరుకి హోమ్ మంత్రిని రక్షించే డ్యూటీ, కథంతా హీరోయిన్ తో ప్రేమ కామెడీలే. హోమ్ మంత్రిని రక్షించే సీరియస్ డ్యూటీ కూడా కామెడీలే. ప్రేమ ట్రాకే మొత్తం ప్రధాన కథకి అడ్డుపడుతూ నవ్వులాటగా మార్చేసింది. ప్రేక్షకులు ఇంత తెలివి తక్కువగా సినిమాలు చూస్తారనుకున్నట్టుంది. హీరో కార్తికేయ తన ఆరో ఫ్లాప్ కోసం దిగ్విజయంగా ఈ కథ ఒప్పుకున్నట్టుంది. ఇక ఏడో ఫ్లాప్ కోసం ఇంకెలాటి కథ సైన్ చేశాడో, చేస్తాడో చూడాలి. అతను కథల మీద అవగాహన లేక చేతులారా కెరీర్ పాడు చేసుకుంటున్నాడు.

నటనలు- సాంకేతికాలు
      ఎన్ఐఏ ఏజెంట్ గా షేప్, స్టయిల్, పాయిజ్ వగైరా బాగా వర్కౌట్ చేశాడు కార్తికేయ. తన వర్కౌట్ కి తగ్గ కథ దర్శకుడివ్వ లేకపోతే ఏం లాభం. కామెడీలు చేసుకుంటూ వుండిపోవడమే. విక్రమార్క రోమాంటిక్ కామెడీలనుకోవచ్చు టైటిల్. ఈ రోమాంటిక్ సీన్లూ ఒక్కటీ ఎంటర్ టైన్ చేయలేని నిస్సహాయతని దర్శకుడి నుంచి అరువు దెచ్చుకున్నట్టుంది. ఇక యాక్షన్ సీన్స్ కి తగ్గ ఫిజిక్ అంతా వుంది కార్తీకేయకి. యాక్షన్ సీన్స్ కి తగ్గ సిట్యుయేషన్స్ నివ్వాలనే దర్శకుడికి తట్టలేదు. కార్తికేయ ఏం చేసి కనీసం మాస్ ప్రేక్షకుల్ని మెప్పించాలన్నా, వీల్లేకుండా విడివిడి ఖండాలుగా చేసి అన్నీ అందించాడు దర్శకుడు.

        దర్శకుడు చేసిన మెచ్చదగ్గ పని ఒక్కటే. తనికెళ్ళ భరణి చేత పంచ్ డైలాగులు పేల్చడం. సినిమాలో ఇదొక్కటే కాస్త ఎంటర్టయిన్మెంట్. ఇక హీరోయిన్ సహా ఎవరి గురించీ చెప్పుకోవడానికి లేదు. సుధాకర్ కోమాకుల వయసుకి మించిన ఏసీపీ పాత్రలో అతి అన్పి స్తాడు. శత్రువులు టార్గెట్ చేసిన, హీరో సెక్యూరిటీగా వున్న, సాయి కుమార్ కీలక హోమ్ మంత్రి పాత్ర అర్ధాంతరంగా ముగిసిపోవడం ఒక విచిత్రం.

        సాంకేతిక శాఖలు దర్శకత్వంకంటే అద్భుతంగా వుండడం ఒక విశేషం. యాక్షన్ సీన్స్, కెమెరా వర్క్ లాగా దర్శకుడి  దర్శకత్వ సత్తా కూడా వుండుంటే సాంకేతిక విలువలు సార్ధకమయ్యేవి. విచిత్ర మేమిటంటే  పాటలు కూడా కథానుసారం వుండవు. ఏదీ కథానుసారం వుండని అతుకుల బొంత అని కాస్త కఠినంగానే చెప్పక తప్పదు.  

చివరికేమిటి

     కథ లేకుండా నాల్గు రకాల యాక్షన్, కామెడీ, లవ్, సాంగ్స్ ఎలిమెంట్లు బిట్లు బిట్లుగా కలిపి తీసిన సినిమా ఇది. ఇది కూడా ఒక కొత్త ప్రయోగమేనేమో. ఫస్టాఫ్ పసలేని లవ్ ట్రాక్ తో, సాంగ్స్ తో విషయం లేకుండా సాగుతూ వుంటుంది. కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ అని రివీలైనప్పుడు మనకి థ్రిల్ ఏమీ వుండదు ఈ టర్నింగ్ కి. ఎన్ఐఏ ఏజెంట్ అని ముందే పబ్లిసిటీలో చాలా చెప్పేశారు గనుక. పబ్లిసిటీలో సస్పెన్స్ లేదు, సినిమాలోనూ  సస్పెన్స్ లేదు. ఎలాగో ఫస్టాఫ్ అయిందన్పించాక సెకండాఫ్ ఏం చేయాలో అర్ధం గానట్టు సిల్లీ కథా కథనాలు, కామెడీలు. హీరోయిన్ కిడ్నాపులు.

        కొత్త దర్శకుడికి యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ల మీద అవగాహన లేకుండానే ఈ సాహసానికి ఒడిగట్టి నట్టుంది. తనవల్ల కానిది వదిలేసి కామెడీలు తీసుకుంటే సరిపోతుంది.  సగటు ప్రేక్షకులు కూడా ఎలాపడితే అలా సినిమాలు తీస్తే చూసే మూడ్ లో ఇప్పుడు లేరు. జీవన వ్యయం పెరిగిపోయి సినిమా టికెట్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఎంతో బావుందని టాక్ వస్తే తప్ప వాళ్ళ టికెట్లు తెగే పరిస్థితి లేదు. కొత్త దర్శకులు మిడిమిడి జ్ఞానంతో సినిమాలు తీసే కాలం పోయింది. ఇలా చిరంజీవి హిట్ సినిమా టైటిల్ పెట్టినంత మాత్రాన చాలదు. అవతల ఇదే వారం ఇంకో కొత్త దర్శకుడు సింగీతం- కమల్ క్లాసిక్ 'పుష్పక విమానం' టైటిల్ కి తను కూడా తీరని అన్యాయం చేశాడు.  

—సికిందర్  


1081 : రివ్యూ


 

రచన - దర్శకత్వం : దామోదర
తారాగణం : ఆనంద్ దేవరకొండ
, గీత్ సైనీ, శాన్వీ మేఘనా, సునీల్, శరణ్య, నరేష్, అజయ్, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : అమిత్ దాసానీ
, రామ్ మిరియాల, ఛాయాగ్రహణం : హెస్టిన్ జోస్ జోసెఫ్
నిర్మాతలు : గోవర్ధన్ దేవరకొండ
, ప్రదీప్, విజయ్
విడుదల : నవంబర్ 12
, 2021

***

        'కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్లో విజయ్ దేవరకొండ నిర్మాతగా రెండో మూవీ వచ్చేసింది. 2019 లో నిర్మించిన మీకు మాత్రమే చెప్తా తో విజయం సాధించలేక పోయాక, ఇప్పుడు తమ్ముడు ఆనంద్ హీరోగా పుష్పక విమానం నిర్మించాడు. దొరసాని’, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి రెండు సినిమాలతో వెలుగులోకొచ్చిన ఆనంద్ దేవరకొండ, ఈసారి  ఫ్యామిలీ- రోమాంటిక్ మూవీని ప్రయత్నించాడు. పుష్పక విమానం పాత క్లాసిక్ హిట్ టైటిల్ తో కొత్త దర్శకుడు దామోదర పరిచయమవుతున్నాడు. ఇంతకీ ఈ హైప్ కి తగ్గట్టు మూవీ వుందా? ఆనంద్ దేవరకొండ కిది మూడో ఆనందమేనా?

కథ

    సుందర్ (ఆనంద్ దేవరకొండ) కొత్తగా పెళ్ళయిన స్కూల్ టీచర్. పెళ్ళయిన వారానికే భార్య మీనాక్షీ (గీత్ సైనీ) పారిపోతుంది. దీంతో కంగారు పడ్డ సుందర్ విషయం బయట పడకుండా భార్య వున్నట్టే నటిస్తూంటాడు. షార్ట్ ఫిలిమ్ నటి రేఖ (శాన్వీ మేఘన) ని తెచ్చుకుని భార్యలా నటింప జేస్తూంటాడు. భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎందుకెళ్ళి పోయిందో మిత్రుడి సాయంతో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూంటాడు. ఇంతలో ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. పోలీస్ ఇన్స్ పెక్టర్ రంగం (సునీల్) రంగ ప్రవేశం చేస్తాడు. ఇక భార్య అదృశ్య రహస్యం మలుపులు తిరుగుతుంది. ఏమిటా రహస్యం, ఏమిటా మలుపులు? భార్య మీనాక్షీ అదృశ్యంలో సుందర్ ని ఎందుకు అనుమానించాడు ఇన్స్ పెక్టర్ రంగం? సుందర్ అనుమాన నివృత్తి చేసుకుని మీనాక్షిని కనుక్కో గలిగాడా? అసలామె ఎందుకు అతణ్ణి వదిలేసి వెళ్ళి పోయింది? ఇవి తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ
       గత వారం దీపావళికి రజనీ కాంత్ పెద్దన్న విడుదలైంది. ఇందులో రజనీ చెల్లెలు (కీర్తీ సురేశ్) పెళ్ళి తంతులోనే ఇంట్లోంచి మిస్టీరియస్ గా వెళ్ళిపోతుంది. దీని కారణం సెకండాఫ్ విలన్లతో యాక్షన్ స్టోరీలో తెలుస్తుంది. ఈవారం పుష్పక విమానం లో కొత్తగా పెళ్ళయిన భార్య ఇంట్లోంచి మిస్టీరియస్ గా వెళ్ళిపోతుంది. దీని కారణం సెకండాఫ్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. దీపావళికి అదృష్టవశాత్తూ పెద్దన్నతో బాటే పెద్దన్న పాయింటుతో పుష్పక విమానం విడుదల కాలేదు. బతికి పోయింది.

        అయితే పెద్దన్న ఒక ఫార్ములా కథ. ఇది అంతకి మించి మరోలా వుండదు. పుష్పక విమానం ఫార్ములా కథైనా కాకుండా, ఇటు నేటి రిలేషన్ షిప్ కథైనా కాకుండా, ఆషామాషీ కథ చేశాడు కొత్త దర్శకుడు దామోదర. భార్య వెళ్ళిపోయిన కారణం బలంగా లేకపోవడం, కలిసిన విధానం కూడా సిల్లీగా వుండడంతో తేలిపోయింది కథ. పెళ్ళంటే సర్దుకు  పోవడమేనని చప్పగా మెసేజి ఇచ్చేసి ముగించేశాడు.

        నేటి జంటలు కొందరు అపరిపక్వతతో వుండొచ్చు, అలాటి జంటల కథని దర్శకుడు కూడా అపరిపక్వతతో చెప్తే ఎలా, టైమ్ వేస్టు తప్ప? సినిమాలో పాత సినిమాల రికార్డులు అక్కడక్కడా మోగించినట్టు, కోడి రామకృష్ణ తీసిన సినిమాలు కూడా చూసి వుంటే, జంటల కథల్ని ఎలా బలంగా, బాగా చెప్పొచ్చో  తెలుసుకోగల్గే వాడేమో కొత్త దర్శకుడు.  

నటనలు- సాంకేతికాలు

       ఆనంద్ దేవరకొండ ఈసారి కష్టాల్లో పడ్డ కామెడీ పాత్ర చేశాడు. రాజేంద్రప్రసాద్ సినిమాలు గుర్తుకొచ్చి ఆనంద్ ఇంకెంత ట్రైనింగు పొంది, ఎంత బాగా చేయొచ్చో అన్పిస్తుంది. కామెడీని పండించే టైమింగ్ లేకపోవడం, హావభావాలు ఒకేలా వుండడం, కామెడీ కంటే విచారంగాఎక్కువ కన్పించడం, కలర్ఫుల్  టైటిల్ పుష్పక విమానం కి తగ్గట్టు లేవు. యుద్ద విమానమేదో  చక్కర్లు కొడుతున్నట్టు వుంది.  

        భార్య వెళ్ళిపోయిన విషయం దాచిపెడుతూ పడే పాట్లు, దర్శకత్వ లోపం వల్ల కొత్తగా లేకపోవడం కూడా, ఆనంద్ ఎలివేట్ అవక పోవడానికి కారణమైంది. ఇక భార్య గురించి తానే ఇన్వెస్టిగేషన్ చేయడం ఎలాగూ సీరియస్ వ్యవహారమే. ఇది తనకి సరిపోయింది. కానీ ఇది సీరియస్ సినిమా అవాల్సిన అవసరముందా? ఆనంద్ పాత్రని చేతకాని వాడి పాత్రగా ఎస్టాబ్లిష్ చేసి వుంటే, ఆ చేతకాని వాడి చేష్టలు, స్ట్రగుల్, పోరాటాల్లోంచి కామెడీ పుట్టే అవకాశముండేది. ఆనంద్ టాలెంట్ కిది సరిపోయేది. పెళ్ళి ని పుష్పక విమానంతో పోల్చినప్పుడు, ఎలాగైనా మళ్ళీ భార్యతో ఆ పుష్పక విమానం ఎక్కాలన్న ఏకైక గోల్ తో పాత్ర కొనసాగివుంటే – ఆనంద్ లోపాలు కవరై పోయేవి.

        భార్యగా నటించిన గీత్ సైనీకి పెద్దగా పాత్రలేదు, నటన కూడా అంతంత మాత్రం. రెండో హీరోయిన్ శాన్వీ మేఘనా మాత్రం హుషారు తెప్పించే నటనతో, టైటిల్ రోల్ తానే అయినట్టూ, కామిక్ ఎక్స్ ప్రెషన్స్ తో, యాక్టింగ్ తో, ఈ భారమైన  సినిమాకి చాలా రిలీఫ్ గా వుంది.

        సునీల్ వేసిన ఇన్స్ పెక్టర్ పాత్ర, ఇన్వెస్టిగేషన్, సునీల్ బ్రాండ్ ఫన్ లేకుండా, లాజిక్ కూడా లేకుండా నీరసంగా వుంది. స్కూల్లో సహ టీచర్ గా నరేష్, పక్క ఫ్లాట్ లో మ్యూజిషియన్ గా హర్షవర్ధన్ నటించారు. మిగిలిన సహాయ నటుల గురించి చెప్పుకోవడానికేం లేదు. విజువల్స్, ప్రొడక్షన్ విలువలూ బావున్నాయి గానీ పాటలు, నేపథ్య సంగీతం పుష్పక విమానాన్ని ఎగరేయలేదు.

చివరికేమిటి

     ప్రధానంగా కథా కథనాలు టైటిల్ కి పెను భారంగా మారాయి. అరువు దెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావు- కమల్ హాసన్ ల క్లాసిక్ మూవీ టైటిల్ కైనా న్యాయం చేయలేదు. ఫస్టాఫ్ ప్రారంభమే పెళ్ళి చూపించేసి, ఆ వెంటనే భార్య వెళ్ళిపోయిందన్న కథ ప్రారంభించడంతో ఫీల్ లేకుండా డ్రైగా మారింది. పెళ్ళయ్యాక వారం రోజులు భార్య వున్నప్పుడు, ఆమెతో ఆనందాలూ, పుష్పక విమాన యానాలూ వంటి సరదాలూ అవీ చూపించి, హేపీ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేయకుండా, పెళ్ళయిన తర్వాతి సీన్లోనే భార్య కన్పించడం లేదని చెప్పిస్తూ కథ ప్రారంభించడంతో - అలాగే కథ నడపడంతో ఫీల్, ఎమోషన్లు, సానుభూతి  మొదలైనవి ప్రేక్షకులకి కలక్కుండా పోయాయి.

        ఇంటర్వెల్ వరకూ విషయాన్ని కప్పిపుచ్చుతూ చేసిన కామెడీ కూడా ఇందుకే వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్లో భార్య అదృశ్య కథ మలుపు తిరిగి పోలీసులు ఎంటరైనప్పుడు- క్రైమ్, మర్డర్ మిస్టరీగా పేలవంగా మారిపోయింది కథ. సింపుల్ గా చెప్పాలంటే, రోమాంటిక్ డ్రామాగా నమ్మిస్తున్న కథ సడెన్ గా మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ గా మారిపోవడం జానర్ మర్యాదని దెబ్బతీసింది. సెకండాఫ్ సాంతం ఇన్వెస్టిగేషన్ కూడా సిల్లీగా వుంది. క్లయిమాక్స్, ఓ బలహీన మెసేజితో ముగింపు సరే. చాలా బలహీన దర్శకత్వం, వేగంలేని చిత్రీకరణ. 

        ఇది ఓటీటీకి వర్కౌట్ అయ్యే సినిమా. మార్నింగ్ షోకి థియేటర్లో నలభై మంది కూడా లేకపోవడం పబ్లిసిటీ లోపం కాదు. విజయ్ దేవరకొండ బాగానే ప్రమోట్ చేశాడు. టైటిల్ కూడా అద్భుతంగా వుంది. ఆనంద్ దేవరకొండ కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో చాలా ఇంటర్వ్యూ లిచ్చి  గ్లామర్ పెంచాడు. అయినా ఎందుకనో ఎలావుందో చూద్దామని కూడా ఓపెనింగ్స్ కి ప్రేక్షకులు తరలి రాలేదు.

—సికిందర్