రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, నవంబర్ 2021, ఆదివారం

1077 : రివ్యూ

కథ- దర్శకత్వం : రోహిత్ శెట్టి
తారాగణం : అక్షయ్ కుమార్
, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, గుల్షన్ గ్రోవర్, కుముద్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, అభిమన్యూ సింగ్, సికిందర్ ఖేర్ తదితరులు
రీసెర్చి : ఎస్ హుసేన్ జైదీ
, స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : ఫర్హాద్ సాంజీ, సంచిత్ బెంద్రే, విధీ ఘోడ్గాడ్కర్
సంగీతం : అమర్ మోహిలే
, ఎస్ తమన్, ఛాయాగ్రహణం : జామన్ జాన్
బ్యానర్స్ : రిలయెన్స్ ఎంటర్ టైన్మెంట్
, రోహిత్ శెట్టి పిక్చర్జ్, ధర్మా ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్
విడుదల : నవంబర్ 5
, 2021

***

      సూర్యవంశీ - వెండి తెరపై కులాసాగా చూడాలని ప్రేక్షకులు ఉవ్వీళ్ళూరిన అక్షయ్ కుమార్ మెగా యాక్షన్ డ్రామా ఓపట్టాన ప్రేక్షకుల ముందుకు రాలేదు. సరీగ్గా రెండేళ్ళ క్రితం నిర్మాణం పూర్తయి, మార్చి 27, 2020 న విడుదల ప్రకటించుకుని సన్నాహాలు చేస్తూంటే, దురదృష్టం కొద్దీ  -24 వ తేదీనే ప్రభుత్వం దేశవ్యాప్త కోవిడ్ లాక్ డౌన్ ప్రకటించడంతో విడుదల ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తేశాక గత దీపావళికి విడుదల తేదీ ప్రకటిస్తే, థియేటర్ల మీద ప్రభుత్వ ఆంక్షలతో మళ్ళీ వాయిదా పడింది. ఇక లాభం లేదని ఏప్రెల్ 2, 2021 న తిరిగి తేదీ నిర్ణయిస్తే, ముంబాయిలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించడంతో అదీ వాయిదా పడింది. సరేలెమ్మని మళ్ళీ ఏప్రెల్ 30 కి విడుదల ప్రకటిస్తే, మళ్ళీ కోవిడ్ వచ్చి పడడంతో మరోసారి లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఇలా ప్రభుత్వ తేదీలతో విడుదల తేదీలు తెమలవని విడుదల మర్చిపోయి కూర్చున్నారు. కూర్చున్నాక పొలిమెరలో ఇక ప్రభుత్వ తేదీలు కనిపించక పోవడంతో, ఈ దీపావళే బిజినెస్ కి సరైన అదును అని విడుదల చేసేశారు!

        విజయవంతమైన కమర్షియల్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి (గోల్ మాల్ సిరీస్, సింగం సిరీస్, సింబా వగైరా) ఈసారి  సూర్యవంశీ తో టెర్రరిజం మీది కెళ్ళాడు. భారీ తారాగణాన్నీ, బడ్జెట్ నీ సమకూర్చుకుని, తన అలవాటైన కొత్త కొత్త గిమ్మిక్కులతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు. అసలు దేశాన్ని అర్ధం జేసుకుంటే టెర్రరిజం అర్ధమవుతుంది, ఎవరితో పోరాడాలో తెలుస్తుంది. ఇవి చేశాడా రోహిత్ శెట్టి చూద్దాం...

కథ

    1992 లో బాబ్రీ మసీదు కూల్చివేతకి ప్రతీకారంగా, 1993 లో ముంబాయిలో జరిగిన వరస బాంబు పేలుళ్ళలో వీర్ సూర్యవంశీ (అక్షయ్ కుమార్) తల్లిదండ్రులు చనిపోతారు. ఈ బాంబు దాడులకి పొరుగు దేశం నుంచి వెయ్యి కిలోల ఆర్డీఎక్స్ దిగుమతి అయింది. ఇందులో 400 కిలోలే దాడులకి ఉపయోగించి మిగతా ఆర్డీఎక్స్ దాచి పెట్టారు. దీన్నుపయోగించుకుని, 26/11 దాడుల తర్వాత  లష్కరే తోయిబా మరిన్ని దాడులు జరిపేందుకు 40 మంది టెర్రరిస్టుల్ని పంపి సరయిన సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ నలభై మంది టెర్రరిస్టులు హిందూ పేర్లు పెట్టుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని  వివిధ నగరాల్లో ప్రజల్లో కలిసిపోయి వుంటున్నారు.  వీళ్ళని పొరుగు దేశం నుంచి బిలాల్ (జాకీ ష్రాఫ్) కంట్రోలు చేస్తున్నాడు. ఈ నలభై మందిలో ఇతడి ఇద్దరు కొడుకులు బిలాల్ అహ్మద్ (కుముద్ మిశ్రా), రియాజ్ హఫీజ్ (అభిమన్యూ సింగ్) కూడా వున్నారు.

          ఈ సమాచారమందుకున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ డిసిపి వీర్ సూర్యవంశీ తన టీముతో రంగంలోకి దిగుతాడు. పూర్వం ఒక ఆపరేషన్ లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చేరినప్పుడు, డాక్టర్ రియా (కత్రినా కైఫ్) చికిత్స చేసి కాపాడింది. దీంతో ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కొడుకు పుట్టాడు. అతడికి కుటుంబం కంటే డ్యూటీ  ముఖ్యం కావడంతో, ఒక దాడిలో కొడుకు గాయపడ్డాడు. దీంతో అతడ్ని తిట్టిపోసి కొడుకుతో దూరంగా వుంటోంది రియా.

          ఈ నేపథ్యంలో ఇప్పుడు సూర్యవంశీ కర్తవ్యం టెర్రరిస్టుల స్లీపర్ సెల్స్ తో బాటు, ఆ దాచిపెట్టిన 600 కిలోల ఆర్డీఎక్స్ ని పట్టుకుని, టెర్రర్ దాడుల్ని నివారించడం, టెర్రరిస్టుల్ని నిర్మూలించడం. ఈ క్రమంలో బిలాల్ అహ్మద్, రియాజ్ హఫీజ్ లతో బాటు వాళ్ళ లీడర్ ఖాదర్ ఉస్మానీ (గుల్షన్ గ్రోవర్) నీ ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

      ఇది యాక్షన్ థ్రిల్లర్ కాకుండా యాక్షన్ డ్రామా కావడంతో సస్పెన్స్ లేకపోవడం, సస్పెన్స్ లేకపోవడంతో టెన్షన్, థ్రిల్ లేకపోవడం జరిగాయి. ఈ కథ డ్రామా ఆధారంగా ఇలా వుండడం సరైనదే. ఇది సామాజిక కథ. సామాజిక కథ డ్రామా కవకాశం లేని సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వుంటే ఎబ్బెట్టుగా వుంటుంది. అందుకని టెర్రరిస్టుల్ని పట్టుకునే వేటలో ఇప్పుడేం జరుగుతుందన్న మలుపులు గానీ, పతాక సన్నివేశాలుగానీ ఎదురు కావు. యాక్షన్ దృశ్యాలు మాత్రం భారీ స్థాయిలో వుంటాయి. డ్రామాలో భాగంగా ఉత్పన్నమయ్యే యాక్షన్ దృశ్యాలు. ఇలా మార్కెట్ యాస్పెక్ట్, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ వరకూ ఈ కథ ఓకే. కాన్సెప్ట్ పరంగానే చెదిరిపోయింది...

        దేశంలో టెర్రరిజం దాదాపూ లేదు, కాశ్మీరు లోయలో తప్ప. కారణ ముంటేనే టెర్రరిజం. ఆ కారణాలు లేక పోవడంతో టెర్రరిజం మీద సినిమాలు తీయడం కూడా మానుకున్నారు. దర్శకుడు రోహిత్ శెట్టి అసహజంగా కొత్త కారణాన్ని పుట్టించ కుండా, 1993 లో జరిగిన పేలుళ్ళ లోంచే ఓ కారణాన్ని సృష్టించాడు. ఆ నాటి దాడుల్లో 600 కిలోల ఆర్డీఎక్స్  మిగిలినట్టు కల్పన చేసి, దాంతో ఈ కథంతా చిత్రీకరించుకుంటూ పోయాడు.

        అయితే 30 ఏళ్ళు గడిచిపోయినా ఆ నాటి ఆర్డీక్స్ ని దాచిపెట్టుకుని, దాడుల కోసం ముసలివాళ్ళయి పోతున్నా ఇంకా కూర్చుని వుంటారా టెర్రరిస్టులనేది ఒక లాజికల్ క్వశ్చన్. ఇంత కాలం వేచి వుండడానికి ఓ చారిత్రక విశేషాన్ని టార్గెట్ చేసి కూర్చుంటే, మంచి ఎమోషనల్ కనెక్ట్ వుండేది ఆడియెన్స్ కి. స్వాతంత్ర్య దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకలు కావచ్చు లేదా, 2024 లో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం కావొచ్చు. ఐడియాని సరీగ్గా నిర్మించుకుని వుంటే హాలీవుడ్ హై కాన్సెప్ట్ మూవీగా ఇది అప్ గ్రేడ్ అయి వుండేది.

        ఇకపోతే  వున్న కాన్సెప్ట్ తో స్పష్టమైన పంథా కూడా వుండదు. పాక్ మూలాలున్న టెర్రరిజం కుట్రతో ఇది ఇండియా వర్సెస్ పాక్ దేశాల కథవుతుంది. ఇలా ఏకసూత్రతతో అడుగడుగునా పాక్ ని టార్గెట్ చేస్తూ కథ నడపాలి. ఇలాకాకుండా ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ ఇండియన్ ముస్లిమ్స్ అన్నట్టు కూడా ఏదో చేసుకుంటూ పోయీ గజిబిజి చేశారు.

        ఇండియన్ ముస్లిమ్స్, పాక్, టెర్రరిజం ఇవన్నీ కలగలిపేసి ఇండియన్ ముస్లిమ్స్ కి ఎక్కువ పాఠాలు చెప్పేశారు. టెర్రరిజానికి పాక్ ని టార్గెట్ చేయాల్సింది పోయి- మధ్యలో జింగోయిజంతో ఇండియన్ ముస్లిములని టార్గెట్ చేసే గందరగోళానికి లోనయ్యారు. ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ పెట్టిన కేసులన్నీ కోర్టులు కొట్టి వేస్తూ ప్రభుత్వాలకి మొట్టి కాయలేస్తున్నాయి ఓ పక్క. ఇండియన్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తూ ఇలా సినిమాలు తీస్తే పాక్ కి సంతోషమే కదా. సురక్షితమే కదా. వాళ్ళకి కావాల్సిందిదే. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుస్తున్నామని గుర్తించక పోతే ఎలా.

        టెర్రరిజానికి మతం లేదన్నప్పుడు మత వర్గాన్ని టార్గెట్ చేసేశారు. మంచి ముస్లిం- చెడ్డ ముస్లిం అంటూ చూపించడం ఇంకో వైపు. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇతర మతాల్లో వుండనట్టు. పొడుగు గడ్డమున్న వాడు ఎక్కువ దైవ భక్తితో టెర్రరిస్టుగా వుంటాడని, చిన్న గడ్డమున్న వాడు అజ్మీరుకి పోయినా భక్తి వుండదని, క్లీన్ షేవ్ చేసుకున్నవాడు సెక్యులర్ గా వుంటాడనీ అర్ధం లేని వర్గీకరణ చేయడ మొకటి. ఈ దేశంలో ముస్లిములే నెగెటివులు, ఇతరులు మంచి మన్నికైన పాజిటివులని చెప్పాలనేమో.

         ముంబాయి పోలీసులు పాస్ పోర్ట్ మీద మతం చూసి కాల్చి చంపరు, క్రిమినల్ రికార్డు చూసి చంపుతారు అంటాడు అక్షయ్ కుమార్. ఇలా మత ప్రసక్తి లేకుండా టెర్రరిస్టుల గురించి మాట్లాడితే సరిపోతుంది. ఇది ఇరు దేశాల మధ్య రావణ కాష్ఠం కథైనప్పుడు, పొరుగు దేశాన్ని తిట్టాల్సింది పోయి, ముస్లిముల్ని తిట్టే సీన్లు నాల్గు పెట్టి, రెండు మెచ్చుకునే సీన్లతో బ్యాలెన్సు చేయడం ఇంకో వైపు. ఇది కూడా అరిగిపోయిన పాత మూస ఫార్ములా టెక్నిక్కే.

        ఈ కథలో ఒక పేటలో గణేష్ ఉత్సవాలకి హిందువులు విగ్రహాన్ని ఎత్తలేక పోతూంటే, ముస్లిములు పరుగెత్తు కొచ్చి వాళ్ళే మోస్తారు. వెనుక మసీదు కన్పిస్తూంటుంది గొప్ప మెలో డ్రామాగా. వెంటనే పాట- పంద్రాగస్టుకీ, రిపబ్లిక్ దినోత్సవానికీ మోగే అరవై ఏళ్ళనాటి ప్రసిద్ధ పాట - ఛోడో కల్కీ బాతేఁ, కల్కీ బాత్ పురానీ, నయే దౌర్ మే లిఖేంగే మిల్కర్ నయీ కహానీ, హమ్ హిందూస్థానీ (గతాన్ని మర్చిపో, గతం గతః, కొత్త యుగపు కథ కలిసి రాసుకుందాం హిందూస్థానీలుగా) అంటూ. యుగాలుగా కలిసే పాడుకుంటున్నారుగా హిందూ ముస్లిములు. కొత్తగా నేర్పాల్సిన పని లేదు. విభజన రాజకీయాలు మానుకుంటే ఇండియా మౌలిక స్వరూపం వెలుగులో కొస్తుంది.

        అసలు ఈ సీనులో టూరిస్టులుగా వచ్చిన పాక్ దేశస్థులు గణేష్ విగ్రహం సాయం పట్టినట్టు చూపిస్తూ ఈ పాట వేసి వుంటే, మెలోడ్రామాతో బాటు పాక్ కి మెసేజి అదిరేది. ఈ కాన్సెప్ట్ ఇండియా వర్సెస్ పాక్ అని ఎప్పటికప్పుడు కావాలని మర్చిపోతూ సినిమా తీస్తే ఇలా గాకుండా ఇంకెలాగో వుంటుంది.

  అసలు ఇండియా పట్ల పాక్ దేశస్థుల అభిప్రాయమేమిటో ఇండియన్లు వెళ్ళి తీసిన వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇండియా పట్ల వాళ్ళ ప్రేమ, బాలీవుడ్ సినిమాలతో బాటు ప్రత్యేకించి తెలుగు సినిమాలంటే అక్కడి అమ్మాయిల క్రేజ్ తెలుస్తాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తెలుస్తారు. ఇంకా చాలా తెలుస్తాయి. రివర్స్ లో ఇలాటి పాక్ క్యారక్టర్స్ తో టెర్రరిస్టులకే, పాక్ ప్రభుత్వాలకే గట్టి మెసేజ్ వెళ్ళేలా చేసి వుంటే రోహిత్ శెట్టి మూసని బద్దలు కొట్టిన మొదటి దర్శకుడయ్యేవాడు. ఇండియన్ ముస్లిమ్స్ ని పరీక్షించే అదే పాత మూస ఇంకెంత కాలం. పాక్ పౌరుల్ని లాక్కొచ్చి కొత్త కథలు చెప్పకుండా.

        ఈ దేశంలో కసబ్ మీద ఎంత ద్వేషముందో కలాం మీద అంత ప్రేమ వుంది అని ఇంకో పాఠం చెప్తాడు అక్షయ్. ఇది పాక్ చెప్పాల్సిన పాఠం. మనకి కాదు. అసలు హిందూ ముస్లిం ప్రసక్తి దేనికి- పౌరులు అనకుండా. పౌరులొక వైపు, టెర్రరిస్టులొక వైపు అనకుండా? టెర్రరిస్టుల భాషే సినిమా కూడా మాట్లాడితే, వాళ్ళకీ సినిమాకీ, సినిమా తీసే వాళ్ళకీ తేడా ఏముంటుంది.   

        కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టి వేస్తుంది అన్న గాంధీజీ సూక్తితో ఈ సినిమా ప్రారంభమవుతుంది. కంటికి కన్నే డౌట్ లేదు అన్నట్టు బిగ్ యాక్షన్ సీన్స్ తో టెర్రరిస్టుల్ని కాల్చి కాల్చి చంపుతున్నప్పుడు ఈ సూక్తి దేనికి. సూక్తిని కూడా కాల్చి చంపేశారు. ఏదో రకంగా గాంధీని చంపాలి. ఇలా మసాలా ఫార్ములా యాక్షన్ సినిమాగా తీయక తప్పదని తెలిసీ ఐడియాలజీల ఉత్సాహం, అరకొర మేధావి తనాలు ప్రదర్శించారు. ఇలా చెప్పాల్సిన కథ ఒకటైతే, చెప్పిన కథ గజిబిజిగా ఇంకోటైంది. అక్షయ్ కుమార్ రాజకీయ నేపథ్యంతో ఇంతేనేమో. జస్ట్ ఏ ప్రాపగండా మూవీ.

        ఐతే ఇంతా చేసి రజనీకాంత్ అన్నాత్తే (పెద్దన్న) ని బీట్ చేయలేక పోయింది సూర్యవంశీ. అన్నాత్తే మొదటి రెండు రోజులు 63 కోట్లు, సూర్యవంశీ 40 కోట్లు. 

నటనలు- సాంకేతికాలు

       రోహిత్ శెట్టి యాక్షన్ హీరో అంటే మన ఫ్యాక్షన్ సినిమాల్లోలాగా గాల్లోకెగిరి ఎగిరి కార్ల పేలుళ్లు, విచ్చలవిడి కాల్పులు, ఇదే గాకుండా ఇప్పుడు అక్షయ్ తో రజనీ కాంత్ స్టయిల్లో ఏక వ్యక్తి సైన్యంగా డేర్ డెవిల్ విన్యాసాలూ... విచ్చల విడిగా 20, 30 వేల రౌండ్ల బుల్లెట్ల వర్షం. నువ్వు చచ్చే బుల్లెట్ మీద మేడిన్ ఇండియా అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది అని అక్షయ్ పవర్ఫుల్ డైలాగు.

        సగటు ప్రేక్షకుడికి కావాల్సిన గిమ్మిక్కులన్నీ వున్నాయి అక్షయ్ తో. బ్యాంకాక్ లో సికిందర్ ఖేర్ (రాజేంద్ర గుప్తా పాత్ర) మోటార్ బోటు మీద దూసుకు పోతూంటే, అక్షయ్ హెలీకాప్టర్ మీద వెంటాడి లిఫ్ట్ చేసి కాపాడే యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్. విడుదలకి ఎన్ని అవాంతరా లొచ్చినా ఓటీటీకి వెళ్ళక పోవడానికి కారణమిదే. సగటు ప్రేక్షకుడికి బిగ్ స్క్రీన్ మీద, జలదరించే శబ్ద ఫలితాలతో చూపించాలని. బ్యాక్ గ్రౌండ్ లో సూర్యవంశీ సూర్యవంశీ అంటూ చెవులు పగిలే ఆడియో లోగో సహా.

     అక్షయ్ పాత్రకి పేర్లు గుర్తుండవు. ఇంత పెద్ద ఆపరేషన్లు చేసే ఆఫీసరుకి పేర్లు గుర్తుండకపోయే క్యారక్టరైజేషన్ కామిక్ రిలీఫ్ కి బాగా తోడ్పడింది. ఎంటర్టైన్మెంట్. అయితే దేశభక్తి గురించి, పౌర బాధ్యతల గురించి, సెక్యులరిజం గురించీ ముస్లిములకే లెక్చర్ లివ్వాలని మాత్రం ఎంతో బాగా గుర్తుంటుంది. రోహిత్ శెట్టి అక్షయ్ పాత్రని కేర్లెస్ గా వుండే, నిబంధనలు పాటించని అధికారిగా కూడా ప్రెజెంట్ చేశాడు. ఈ ప్రవర్తనకి భార్య దూరమైన కారణమేమో తెలీదు.

          భార్య డాక్టర్ రియా పాత్రలో కత్రినా కైఫ్ మోరల్ యాంకర్ గా పనిచేసే పాత్ర. యాంటీ ముస్లిం ధోరణిని బ్యాలెన్స్ చేయడానికన్నట్టు ఈ పాత్ర. తప్పుగా మాట్లాడుతున్నాడని, తప్పుగా ప్రవర్తిస్తున్నాడని భర్త అక్షయ్ కి క్లాసులు పీకే పాత్ర. అవతలింట్లో కాదు, మనింట్లో ఏం జరుగుతోందో చూడమన్నట్టు ఈ క్లాసులు. క్లయిమాక్స్ లో రణవీర్ సింగ్ కి కూడా ఓ క్లాసు పీకి వుండాల్సింది.

        ఇక అసలైన వాళ్ళు వున్నారు. చివరి ఇరవై నిమిషాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్. రోహిత్ శెట్టి తీసిన సింగం సిరీస్ లోని ఇన్స్ పెక్టర్ బాజీరావ్ సింగం (అజయ్ దేవగణ్) పాత్రని, సింబా లోని ఇన్స్ పెక్టర్ సంగ్రామ్ సింబా భలేరావ్ (రణవీర్ సింగ్) పాత్రనీ ప్రవేశపెట్టి, అక్షయ్ కుమార్ తో యాక్షన్ లోకి దింపి, క్లయిమాక్స్ ని బ్లాస్ట్ చేశాడు శెట్టి. అజయ్ సీరియస్ అయితే, రణవీర్ ఫన్. ఈ క్లయిమాక్స్ ముందు వరకూ అక్షయ్ కి యాక్షన్ మూవీని భుజాన మోసే సత్తా వుంది. అయితే ఆడియెన్స్ కి ఇంకా జోష్ కోసం వీళ్ళిద్దరి ఎంట్రీ.

     గత మూవీ సింబా లో సింగంఅజయ్ దేవగణ్ ని దింపి కథని ఊహించని మలుపు తిప్పాడు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇలాటి ఆలోచనలు అతడికే వస్తాయి. పాత మసాలా కమర్షియల్స్ ని కూడా ఏదో గిమ్మిక్కు చేసి ఉలిక్కి పడేలా చేస్తాడు. సింగంఅజయ్ దేవగణ్ వచ్చేసి, సింబా రణవీర్ సింగ్ ని కాపాడే కిక్కిచ్చే మలుపు!

          టెర్రరిస్టుల పాత్రల్లో గుల్షన్ గ్రోవర్, అభిమన్యూ సింగ్, కుముద్ మిశ్రాలు మంచి విలనీతో కన్పిస్తారు. గుల్షన్ గ్రోవర్ మౌల్వీ వేషంలో వుండే టెర్రరిస్టు లీడర్. అభిమన్యూ సింగ్ హిందూ పేరు పెట్టుకుని జైసల్మీర్లో పెళ్ళి చేసుకుని సెటైలైన స్లీపర్ సెల్ టెర్రరిస్టు. ఇతను టెర్రరిస్టు అని ఎంతో కాలానికి తెలుసుకున్న హిందూ భార్య ఏడ్పు వర్ణనాతీతం. ఇతను హిందువు కాదని పెళ్ళయి మొదటి రాత్రే తెలియాలిగా.

        దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రమే అమర్ మోహిలే, తమన్ లందించారు. నాలుగు పాటలు వేరే రెండు బ్యాండ్స్ వాళ్ళు అందించారు. ఈ పాటల్లో పైన చెప్పుకున్న హమ్ హిందూస్థానీ లోని ఛోడో కల్కీ బాతేఁ’, మొహ్రా లోని టిప్ టిప్ బర్సా పానీ  రీమిక్స్ పాటలు.

—సికిందర్ 

 

6, నవంబర్ 2021, శనివారం

 

hursday, March 18, 2021

1027 : సాంకేతికం

     కొన్ని సినిమాల్లో ఓ షాట్ స్ట్రెస్ బస్టర్ లా వెంటపడుతుంది. ఆ షాట్ ని గుర్తు చేసుకుంటే మానసిక వొత్తిళ్ళు దూరమైపోయేంత బలం వాటికుంటుంది. సినిమా మొత్తం మీద ఆ షాటే గుర్తుండిపోతుంది. ఆఫ్ కోర్స్, ఇది చూసే వాళ్ళ దృష్టిని బట్టి వుంటుంది. సినిమా కథలు, స్క్రీన్ ప్లే వెతలూ లోకమైపోయిన వాళ్ళకి షాట్స్ మీద క్రియేటివ్ దృష్టి ఎక్కువ వుంటుంది. ఎందుకంటే సినిమా కథలంటేనే, స్క్రీన్ ప్లేలంటేనే షాట్స్ తో విజువల్ గా ఆలోచించడం. సినిమా కథ ఆలోచించడమంటే మేస్త్రీలా కథలో పడి తిరుగుతూ విజువల్ గా ఆలోచించడమే, మహర్షిలా వ్యాసం రాయడానికి కూర్చుని ఆలోచించినట్టు కాదు. విజువల్ సెన్స్ తో సినిమాలు చూసినప్పుడు ఎక్కడ బడ్జెట్ వృధా అవుతోంది, ఎక్కడ ఆదా అవుతోందీ తెలుస్తుంది. సినిమాలకి స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్ కావాలి. స్టోరీ రైటింగ్ సీన్లు చూస్తుంది, స్టోరీ మేకింగ్ షాట్లు చూస్తుంది. స్టోరీ రైటింగ్ ఒక విషయాన్ని మూడు సీన్లలో చెప్పి బడ్జెట్ ని వృధా చేస్తుంది. స్టోరీ మేకింగ్ మూడు సీన్లతో చెప్పే విషయాన్ని ఒక్క షాట్ తో చెప్పి బడ్జెట్ ని ఆదా చేస్తుంది. దర్శకత్వ మంటే సెట్స్ లో చేసేది కాదు, హిచ్ కాక్ లా పేపర్ మీద చేసేది. హిచ్ కాక్ కి రచయితలతో అంత ఓపికుండేది. వాళ్ళతో కలిసి పేపర్ మీదే పడుండే వాడు. బాలీవుడ్ లో అంత ఓపిక ఇప్పుడూ వుంది. రచయితల తోడ్పాటు లేకుండా షూటింగ్ స్క్రిప్టే పూర్తి చెయ్యరు. ఇందాకా తాజాగా సెల్ టెక్స్ లో హై ఫైగా వున్న ఒక డైలాగ్ వెర్షన్ తో పూర్తయిన స్క్రిప్టుని చూస్తూంటే, అందులో దర్శకత్వం కనిపించడం లేదుఒక చోట ఏక బిగిన అరగంట స్క్రీన్ స్పేస్ వృధా అయ్యే సీన్ల పరంపర వుంది. అరగంట స్క్రీన్ స్పేస్ అంటే బడ్జెట్ లో పావు వంతు. రెండు కోట్ల బడ్జెట్ అనుకుంటే అందులో 50 లక్షలు అనాలోచిత సీన్లతో వృధా వృధా. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బతకడానికే ఇది, సినిమా కాదు. స్టోరీ రైటింగ్ ఫలితం ఇలా వుంటుంది.

        రే, వెంటాడే షాట్స్ రెండు రకాలు : నటనా పరమైనవి, రచనా పరమైనవి. నటనా పరమైనవి ఆర్టిస్టులు చూసుకుంటారు వాళ్ళ భావోద్వేగాల క్లోజప్స్ తో. ఇవి కూడా వెంటాడ వచ్చు. అయితే ఇవి ఆ సీనుతో మాత్రమే సంబంధంతో వుంటాయి. సీను మారిందంటే భావోద్వేగాలు మారతాయి. ఇవి కత్తిరింపులకి గురయినా కథకి నష్టముండదు. ఈయనకి/ ఈవిడకి అంత ఇంపార్టెన్స్ ఎందుకయ్యా, ఆ షాట్ ని కత్తిరించి పారేయ్ - అని ఎడిటింగ్ లో లేపెయ్యొచ్చు. ఆయన/ఆవిడ ఆ షాట్ ఇచ్చి మేఘాలలో నడుచుకుంటూ ఇంటికెళ్ళి పోయాక, తీరా సినిమాలో చూసుకుంటే, బ్లాంక్ గా కన్పించి నేలమీద రాలిపడడమే.

        రచనా పరమైన షాట్స్ ఇలా కాదు, ఇవి కథకి సంబంధించి వుంటాయి. ముందు జరిగిన కథని దృష్టిలో పెట్టుకుని తర్వాత జరగబోయే కథ చెప్తాయి ఆ ఒక్క షాట్ తో. వీటిని కత్తిరించలేరు బామియాన్ తాలిబన్లయితే తప్ప. ఇలాటి రెండు షాట్స్ ఈ మధ్య బాగా పిచ్చెత్తించి నిద్ర పట్టకుండా చేశాయి. ఏమిటీ షాట్స్? వీటిగురించి పిచ్చెత్తి ఎందుకు రాయాల్సి వచ్చిందిప్పుడు పనులాపుకుని తీరిగ్గా? స్టోరీ మేకింగ్ కి ఇవి అందిస్తున్న మైండ్ బ్లాస్టింగ్ టెక్నిక్సే కారణం. ఇలా చేయాలీ స్టోరీ మేకింగ్ అనీ చెబుతూ... ఇటీవల ఓటీటీలో విడుదలైన హాలాహల్ లోని ఒక షాట్, స్క్రీన్ ప్లే సంగతులు రాసిన దే ర్ విల్ బి బ్లడ్ లోని ఇంకో షాట్.

***
       1. పక్క షాట్ చూడండి. దేర్ విల్ బి బ్లడ్ ఎండ్ విభాగంలో చర్చి సీన్. ఈ సీన్లో డానీ ప్రాయశ్చిత్తం చేసుకుని మతంలో చేరాక, భక్తుల అభినందనలు అందుకుంటున్నప్పుడు, మేరీ వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. కొద్ది సెకన్ల పాటే వుండే ఈ షాట్ చెప్పకనే కథ చెప్పేస్తుంది. ఈ షాట్ కి పూర్వ కథలో ప్రార్ధన చేయక తండ్రి చేత దెబ్బలు తింటూ వుంటుంది మేరీ. ఆమెకి నాస్తికుడైన డానీ అండగా వుంటాడు.  తను నాస్తికుడైతే ఆమె కాబోయే నాస్తికురాలని. కొడుకుని దృష్టిలో పెట్టుకుని ఆమెని ఫ్యామిలీగా కూడా ప్రకటించాడు. నాస్తికుడుతో నాస్తికురాలి అనుబంధం ఇక్కడుంది.

        ఈ నేపథ్యంలో ఈ షాట్ ఇప్పుడు చెప్పే కథేమిటంటే- నిశ్శబ్దంగా బేబీ మేరీ ఆలింగనం చేసుకోవడంలో, ఫ్యామిలీలో నీతో పాటే నేనూ అన్న అర్ధమిస్తోంది. అతను మారాడు, తానూ మారింది. ఆడియెన్స్ కి ఇక రిలీఫ్. తానూ మతాన్ని స్వీకరిస్తూ హామీ ఇస్తోంది. ఆడియెన్స్ కి ఆమె మీద నమ్మకం. అప్పుడేమంది తను? చర్చికి బాకీ వున్న 5000 అతను ఇస్తాననడం అతడి గొప్ప మనసు అంది. అతనేమన్నాడు? ఎప్పట్నుంచో ఇవ్వాల్సిన బాకీ అన్నాడు. ఈ సిన్సియారిటీతో ఆడియెన్స్ కి హమ్మయ్యా అని అతడిపట్ల పూర్తి పాజిటివ్ ఫీల్. ఇంతే, దీంతో షాట్ ముగుస్తుంది. ఈ షాట్ కి బిజిఎం వుండదు. వుంటే చెడుతుంది.

        ఇంత క్లుప్తంగా వున్న ఈ షాట్ లో బాకీ గురించిన రెండు మాటలే పని గట్టుకుని ఇంకెందుకున్నాయి? డానీ డానీయే. చచ్చినా మారడు. చర్చికి మాటిచ్చి రేపు బాకీ ఎగ్గొట్టక వుంటాడా? రేపు బాకీ ఎగ్గొడితే ఆడియెన్స్ కి ఈ మాటలే గుర్తుకు రావాలంటే, ఈ మాటలు చెదిరిపోయే ఇంకే మాటలూ ఇక్కడ వుండకూడదు. చాలా డిస్టర్బింగ్ షాట్ ఇది. మేరీ అతడ్ని నమ్మేసి మతంలోకి వచ్చింది. రేపు పెళ్ళయాక తెలుస్తుంది అతడ్ని నమ్మడం ఎంత మోసమో. ఇక్కడ చర్చి సాక్షిగా కొడుకుని స్వీకరించిన ఇతనే, రేపు కొడుక్కుని బాస్టర్డ్ అని వెళ్లగొట్టేసినప్పుడు, కోడలిగా తను అవమానకర పొజిషన్లో పడ్డప్పుడు గానీ అర్ధం గాదు. అయితే ఈ షాట్ లో మేరీ ఫేస్ ఎందుకు చూపించలేదు? ఎందుకంటే దీని తర్వాత ఆమె కథలో కన్పించదని. ఇలా ముందు జరగబోయే వాటికి మందుగుండు అంతా ఈ ఒక్క షాట్ లోనే జొప్పించి వుంది... ఇదీ స్టోరీ మేకింగ్.

***
        2. దీన్ని స్టోరీ రైటింగ్ చేస్తే - చర్చిలో డానీ మతంలో చేరిన సీన్ నెంబర్ వన్ తర్వాత, సీన్ నెంబర్ టూ - డానీ ఇంటికెళ్తాడు. మేరీ పరిగెట్టుకుంటూ వస్తుంది - అంకుల్ అంకుల్ అంకుల్ అని పట్టి వూపేస్తుంది. ఏంటమ్మా ఏంటంత సంతోషం? ప్రభువు చల్లని చేయి తాకిన గొర్రెపిల్లలా చెంగు చెంగు మంటున్నావు?’ - డానీ. నువ్వు చర్చి కెళ్ళావు కదూ? నేనూ చర్చికి వెళ్తా, చర్చికెళ్తా, ప్రార్ధన చేస్తా. నువ్వెలా చేస్తే అలా చేస్తా. సేమ్ టు సేమ్ అంకుల్ - మేరీ. నా బంగారు తల్లి కదే. బుజ్జి తల్లి కదేఎంత ఎదిగావమ్మా నువ్వూ - డానీ. నన్ను చర్చికి తీసికెళ్ళాలి. తీసికెళ్ళాలీ తీసికెళ్ళాలీ.. మేరీ. సీన్ నెంబర్ త్రీ- చర్చికి వెళ్తారు. కలిసి ప్రార్ధన చేస్తారు. అంకుల్ ఇప్పుడెంతో బావుంది. నేను నీతోటే వుంటా నంకుల్, ప్రామీస్ అంకుల్ ప్రామీస్ - మేరీ. నేనెప్పుడు కాదన్నానమ్మా నా మేరమ్మ  తల్లమ్మ తల్లీ, పద ఐస్ క్రీమ్ తిందాం - డానీ. ఈ సీన్లకి పులకింఛిపోయే బిజిఎం కూడా వస్తూంటుంది. ఇలా వుంటుంది... అప్పుడెప్పుడో పాత రాతి యుగపు నాటి నరహంతక సుత్తి కాక ఏమిటిది మూడేసి సీన్లతో? ముందు వెనుక కథతో సంబంధం లేకుండా బడ్జెట్ ని తేరగా ఆరగిస్తూ?

***
     3. ఇక హాలా హల్ ముగింపులోషాట్. క్లయిమాక్స్ లో సచిన్ ఖెడేకర్ కి కౌన్సెలింగ్ చేస్తున్న పద్ధతిలో విలన్ వివరిస్తాడు చాలా స్మూత్ గా మంచి చెడ్డలు. అనవసరంగా మాతో పెట్టుకోక మంచిగా బ్రతక మంటాడు. సీన్ కట్ అవుతుంది. రోహతక్ లో ఆందోళనలో వున్న సచిన్ భార్యా కూతురు, అతణ్ణి వచ్చెయ్యమని అంతకి ముందే కోరి వుంటారు. ఇప్పుడు ఈ షాట్ లో టేబుల్ ముందు కూర్చుని కూతురు స్టడీ చేస్తూంటుంది.  తలెత్తి తలుపు వైపు చూస్తుంది. ఆమె మొహం ఒక్కసారి ప్రసన్నమవుతుంది. షాట్ కట్ అయిపోతుంది. దీనికి బిజిఎం వుండదు. బిజిఎంవుంటే ఫీల్ వుండదు. దీనితర్వాత సీనుండదు.

        ఆమె తలుపు వైపు అలా ఏం చూసి ప్రసన్నమై వుంటుందిసచిన్ వచ్చేసి వుంటాడు. ఇలా సచిన్ ని చూపించకుండానే ఆ అర్ధంలో షాట్ తీశాడు క్రాఫ్ట్ తెలిసిన దర్శకుడు. ఇది కథ చెప్పే మర్చిపోలేని బ్యూటీఫుల్ షాట్. ఈ షాట్ తర్వాత ఇక సీనుండదు. విలన్ తో ఓడిపోయి ఇంటికొచ్చిన సచిన్ మొహం చూడాలన్న తహతహని  ఆడియెన్స్ కి అలాగే మిగిల్చేస్తాడు దర్శకుడు. అర్ధోక్తిలో షాటుని ఆపితే ఎంత బలంగా వెంటాడుతూ వుంటుందో చెప్పనవసరం లేదు. ఇది స్టోరీ మేకింగ్.

***
        4. ఈ ఒక్క షాటునే ముగింపుతో స్టోరీ రైటింగ్ చేస్తే ఎలా వుంటుంది? ఆమె తలుపు వైపు చూసి ప్రసన్నమయేసరికి, తలుపు దగ్గర సచిన్ ని భయంకరంగా చూపించేస్తూ సెంటిమెంటల్ సీను రాసుకుంటూ రాసుకుంటూ పోతారు. పెన్నులన్నీ అయిపోయి పరిగెడతారు. అసలలా సచిన్ ని చూపిస్తే చాలు నాశనం చేయడానికి. అప్పుడు సచిన్ కాల్షీటు కావాలి, మేకప్, కాస్ట్యూమ్స్ ఖర్చులు కావాలి, ఇంకా... అద్దె భవనపు ఖర్చు, యూనిట్ ఖర్చు, ఎడిటింగ్ ఖర్చు, డబ్బింగ్, బిజిఎం ఖర్చు, డీఐ ఖర్చూ.. ఇంకా థియేటర్లకి కరెంటు ఖర్చు, ప్రేక్షకులకి టైమ్ వేస్టూ. ఈయనేంటీ అర్ధమైపోయిన దాన్ని ఇంకా చూపిస్తాడూ - అని లేచెళ్ళి పోవడం....

***

        5. ఈ కింది వీడియో చూడండి. 2010 ప్రాంతంలో ప్రచారంలో వున్న, పాపులరైన  ధూమపాన హెచ్చరిక యాడ్ ఫిలిమ్. ప్రారంభం చూడండి. టేబుల్ ముందు కూర్చుని బొమ్మలేసుకుంటూ వుంటుంది అమ్మాయి. సడెన్ గా తలతిప్పి చూస్తుంది. సిగరెట్ తాగుతూ గుమ్మం లోంచి లోపలికొస్తూ కనిపిస్తాడు తండ్రి. చిరునవ్వుతో చూస్తాడు. తానూ ఆప్యాయంగా చిరునవ్వుతో చూస్తుంది...



        ఈ షాట్స్ ఫిమేల్ టచ్ తో వుండడం వల్ల గుర్తుండి పోతున్నాయా? ఆలోచించాల్సిన విషయం. పై మూడు షాట్స్ లో ఫిమేల్ క్యారెక్టర్సే వున్నాయి. హాలా హల్ షాట్ చూస్తూంటే ఈ యాడ్ ఫిలిమ్ లో షాట్ గుర్తుకొచ్చింది. ఎంత యాక్షన్, వయోలెంట్ మూవీస్ లోనైనా, ఒకటి రెండు కథతో, పాత్రచిత్రణతో కూడిన ఇలాటి ట్రాడిషనల్ ఆడతనపు షాట్స్ వుంటే, లైఫ్ వుంటుందని చెప్పొచ్చు. బ్యూటీ వస్తుంది.

సికిందర్ 

 

5, నవంబర్ 2021, శుక్రవారం

1076 : రివ్యూ


 రచన - దర్శకత్వం : మారుతి
తారాగణం : సంతోష్ శోభ‌న్‌, మెహ్రీన్ పీర్జాదా, అజ‌య్ ఘోష్‌, శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్, రజిత త‌దిత‌రులు
సంగీతం : అనూప్‌ రూబెన్స్ , ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్‌
బ్యానర్స్: వీ సెల్యులాయిడ్‌, ఎస్‌.కె.ఎన్‌.

నిర్మాత : ఎస్‌.కె.ఎన్‌.
విడుదల : నవంబర్ 4, 2021
***

        లాక్ డౌన్ సమయంలో దర్శకుడు మారుతీ ఖాళీగా వుండ కూడదని, ఓ రెండు లొకేషన్స్ లో  లో -బడ్జెట్ ప్లాన్ చేసుకుని తక్కువ రోజుల్లో పూర్తి చేసిన మంచి రోజులొచ్చాయి మంచి సమయం చూసుకుని విడుదలైంది. దీపావళికి పెద్దన్న’, ఎనిమీ అనే రెండు డబ్బింగులు తప్ప తెలుగు సినిమాలు లేక పోవడంతో విడుదల లాభసాటి అవకాశంగా మారింది. 2011 నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్న సంతోష్ శోభన్, 2018 లో పేపర్ బాయ్ తో తిరిగి పరాజయాన్ని చవిచూశాక  వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టాడు. వెబ్ సిరీస్ నుంచి మారుతీ దర్శకత్వంలో సినిమాలో కొచ్చాడు ప్రస్తుతం. ఇప్పుడైనా తనకి మంచి రోజులొస్తాయా లేదా అనేది తేలిపోయే సమయమిది. ఇదేమిటో చూద్దాం...

కథ

    సంతోష్ (సంతోష్ శోభన్), పద్మ (మెహ్రీన్ పీర్జాదా) లు బెంగుళూరులో ఐటీ జాబ్స్ చేస్తూ ప్రేమలో పడతారు. లాక్ డౌన్ ప్రకటించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వచ్చేస్తారు. ఇక్కడ పద్మ తండ్రి గోపాలం (అజయ్ ఘోష్) కి మూర్తి, కోటేశ్వర్రావ్ అనే ఇద్దరు మిత్రులుంటారు. వీళ్ళు ఇద్దరు కూతుళ్ళున్న గోపాలం ఏ చీకూచింతా లేనట్టు ఆనందంగా గడపడాన్ని చూసి ఓర్వలేక పోతారు. కోటేశ్వర్రావ్ కి తన కూతురు ఒకడితో లేచిపోయిన అవమాన భారముంటుంది. దీంతో గోపాలం ఆనందంగా జీవిస్తూంటే మండి పోతూంటాడు. గోపాలం కూతురు పద్మ బెంగుళూరు నుంచి వచ్చెయ్యడంతో, సంతోష్ తో ఆమె వరస కనిపెట్టి, మూర్తీ కోటేశ్వర్రావ్ లు గోపాలంలో అనుమాన బీజాలూ, దాంతో భయాందోళనలూ బలంగా నాటుతారు. నీ కూతురు కూడా లేచిపోయి పరువు తీస్తుందని.

        దీంతో గోపాలం కూతుర్ని అనుమానించడం మొదలెడతాడు. సంతోష్ తో ఆమె ప్రేమకి అడ్డంకులు సృష్టిస్తూంటాడు. తండ్రికి కలుగుతున్న అనవసర భయాలకి సంతోషే కారణమని అతడికి దూరమవుతుంది పద్మ. ఇప్పుడు సంతోష్ ఈ తండ్రీ కూతుళ్ళ సమస్యల్ని ఎలా తొలగించి, వాళ్ళకి దగ్గరయ్యాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    మారుతి ప్రారంభించిన సైకాలజీ సిరీస్ సినిమా కథల్లో ఇది మూడో కథ. భలేభలే మగాడివోయ్’, మహానుభావుడు అనే రెండు ప్రయత్నాలకి రెండు మానసిక సమస్యల్ని తీసుకున్నాడు. మొదటిది మతిమరుపు  సమస్యతో, రెండోది ఓసీడీ సమస్యతో. ఇప్పుడు అతి భయం - ఫియర్ యాంగ్జయిటీని చూపించాడు. మారుతితో వచ్చిన సమస్యేమిటంటే, ఈ మానసిక సమస్యలు అసలేంటో రీసెర్చి చేసి తెలుసుకోకుండా ఇష్టానుసారం తీసేయడం. భలేభలే మగాడివోయ్ లో మతిమరుపుని  పక్కనబెడితే, తర్వాత తీసిన రెండూ అసహజ కథలు. మహానుభావుడు ని ఓసీడీ గురించి తీశానని హైప్ ఇచ్చాడు. తీరా చూస్తే అది ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) కాదు, మామూలు ఎలర్జీ అని సన్నివేశాలే తేల్చేశాయి. 

ఇప్పుడు అతి భయం తీసుకుని కథగా చేస్తే తగిన శాస్త్రీయ మూలాల్లేక, తన కల్పితాలతో సగానికే విషయం లేకుండా తేలిపోయింది కథ. అతిభయం - ఫియర్ యాంగ్జయిటీని పెంచితే ఫోబియాగా మారి, సమస్య మరింత తీవ్రమయ్యేది. కథలేని కొరత తీరుస్తూ విస్తరించుకుంటూ పోయేది. కొత్త పుంతలు తొక్కెది. ఆ ఫోబియాని మాన్పే క్లినికల్ పరిష్కారాల డ్రామాతో ముగింపు అర్ధవంతంగా వుండేది. కథని అసలేమీ ప్లాన్ చేయకపోవడంతో, ఒక జంటకి సగం పెళ్ళి  చేసి వదిలేస్తే ఎలా వుంటుందో అలా తయారైంది కథ. మారుతి తను సైకాలజీ కథల స్పెషలిస్టు అన్పించుకోవాలని నిజంగా అనుకుంటే తత్సంబంధ విషయ సేకరణ వైపూ కాస్త తొంగి చూస్తే బావుంటుంది.

నటనలు- సాంకేతికాలు
     సంతోష్ శోభన్ 2015 లో తను- నేను లో నటించినప్పుడే మంచి ఈజ్ వున్న డైనమిక్ హీరో అవుతాడని భావించాం. అదే డైనమిజం ఇప్పుడూ వుంది. అతనేమీ ఓవరాక్షన్ చేసో, లేదా మసాలా మాస్ యాక్టింగ్ చేసో దృష్టి నాకర్షించే ప్రయత్నం చెయ్యడు. సింపుల్ నటనతోనే ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. ప్రస్తుత మూవీలో లవర్ బాయ్ పాత్ర నటించాడు. ఉన్నది కాసేపే. ఇదే సమస్య. దర్శకుడు మారుతీ ప్రధాన పాత్ర హీరోయిన్ తండ్రిగా వేసిన అజయ్ ఘోష్ అన్నట్టు, అతడి చుట్టే కథ నడిపి, సంతోష్ ని పక్కన పడేశాడు. పేరుకి మాత్రమే సంతోష్ హీరో. కథ మాత్రం అజయ్ ఘోష్ దే. ఇలా కూడా సినిమా తీయొచ్చా అంటే ఏమో. జీవితమే ఒక నాటకరంగం’, సంసారం-సాగరం’, మొరటోడు’, ‘,దేవుడే దిగివస్తే లాంటి సినిమాలు క్యారక్టర్ ఆర్టిస్టు కైకాల సత్యనారాయణ హీరోగా నటించినవి వున్నాయి. ఇవి వేరు.

        సంతోష్ పాత్ర పని కాసేపు అజయ్ ఘోష్ భయాన్ని వదిలించడమైతే, ఈ ప్రయత్నాలు చాలా సిల్లీగా వున్నాయి. హీరోయిన్ మెహ్రీన్ డిటో సంతోష్. ఈమెకి కూడా పాత్ర తక్కువే. చేసేదేమీ వుండదు, స్లిమ్ గా మారి కనువిందు చేయడం తప్ప. అజయ్ ఘోష్ మాత్రం సింహభాగం సినిమా నాక్రమించేశాడు. కూతురి పట్ల ఎంతో ప్రేమ వున్న వాడిగా మొదలై, కూతురిని తల్చుకుని భయపడే వాడుగా మారే పాత్ర ప్రయాణం ఫస్టాఫ్ వరకే ఫర్వా లేదనిపించుకుని వినోద పరుస్తాడు. ఇక్కడితో మారుతీ చేతిలో కథ అయిపోవడంతో, సెకండాఫ్ లో అవే రిపీట్ సీన్లతో, అవే భయాలతో బోరు కొట్టేస్తాడు.

        అతడ్ని భయపెట్టే పాత్రధారులిద్దరూ మూర్తీ, శ్రీనివాసరావులు కూడా కాసేపటికి వాళ్ళ ప్రయత్నాలతో చీకాకు పెట్టేస్తారు. హీరో హీరోయిన్లకి ఫుటేజీ తగ్గి, చాలా మంది కమెడియన్లు స్పేస్ నాక్రమించేశారు. కానీ ఒక్క ప్రవీణ్ తప్ప ఇంకెవరితోనూ కామెడీ పేలకుండా పేలవంగా తయారైంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, వైవా హర్ష  కామెడీ పాత్రలు ఎందుకొస్తాయో, ఎందుకు పోతాయో తెలీదు. ప్రవీణ్ అప్పడాల విజయలక్ష్మి ఆడవేషం కామెడీ చీప్ కామెడీయే అయినా, మొత్తం సినిమా కామెడీ కంటెంట్ లో ఇదే నయం.

        చాలా కాలం తర్వాత అనూప్ రూబెన్స్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. లో - బడ్జెట్  పేరేగానీ ఖర్చు మాత్రం బాగానే పెట్టి విజువల్స్ తీశారు. రెండు లొకేషన్స్ లోనే నిర్మాణం జరిపేశారు.

చివరికేమిటి

    ఫస్టాఫ్ ఇంకా కథలోకి వెళ్ళే సమయం కాబట్టి పాత్రల పరిచయాలతో, కామెడీలతో, అజయ్ భయాలతో సరదాగానే వుంటుంది. కథలోకి వెళ్ళాక మాత్రం కథలేక, సరైన కాన్ఫ్లిక్ట్ లేక, హీరో పాత్రకి స్థానం లేక, అజయ్ చుట్టూ వచ్చిన సీన్లే వస్తూ- సీరియస్ గా మారిపోతుంది కథ. భయం అనే పాయింటుకి ఇచ్చిన మెసేజి కూడా తూతూ మంత్రపు వ్యవహారమే. ఇది చెప్పడానికి రెండు గంటల 20 నిమిషాల సేపు లాగారు. పైగా యూత్ ఫుల్ కథనం లేక, ఓల్డ్ స్కూల్ మేకింగ్ తో లేజీగా వుంటుంది. ట్రెండ్ కి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ కన్పించవు.     

        మరి మంచి రోజులు దేనికొచ్చాయి? మారుతీ ప్రారంభంలో తీసిన ఈరోజుల్లో’, బస్టాప్ టైపు బూతు కామెడీకా? బూతులు మాత్రం ధారాళంగా పారించేశారు. కాన్సెప్ట్ సరిగ్గా వుంటే ఇంత బూతు మీద ఆధారపడే అవసరం రాక పోయేదేమో. తెలుగులో పోటీ లేకుండా విడుదలైన పండగ సినిమా తీరు ఇలా వుంది. పైగా కోవిడ్ మహమ్మారిని కామెడీ చేశారు. కోవిడ్ తో దేశం అల్లకల్లోలమై జనం చస్తే, మారుతీ కిందులో కామెడీ కని పించడం సృజనాత్మకతే అనాలా!

—సికిందర్

4, నవంబర్ 2021, గురువారం

1075 : రివ్యూ


 దర్శకత్వం : శివ

తారాగణం : రజనీ కాంత్, మీనా, ఖుష్బూ, నయన తార, కీర్తీ సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అభిమన్యూ సింగ్, సూరి, సత్యన్, సతీష్, వేలా రామ్మూర్తి, పాండ్యరాజన్ తదితరులు
రచన : శివ -ఆది నారాయణ
, సంగీతం : డి ఇమాన్, ఛాయాగ్రహణం: వెట్రీ
బ్యానర్
; సన్ పిక్చర్స్,
సమర్పణ : కళానిధి మారన్
నిర్మాతలు (తెలుగు డబ్బింగ్) : డి సురేష్ బాబు
, దిల్ రాజు, నారాయణ దాస్ నారంగ్
విడుదల : నవంబర్ 4
, 2021
***

      గ్లోబల్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తలైవర్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా, చెల్లెలి సెంటిమెంటు పెద్దన్న - గత సంవత్సరం దీపావళికి రావాల్సింది ఈ దీపావళికి ముస్తాబైంది కోవిడ్ సౌజన్యంతో. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3 వేల థియేటర్లలో విడుదలైన ఈ మల్టీ స్టారర్ లో ముచ్చటగా ముగ్గురు సీనియర్ హీరోయిన్లతో బాటు ఒక తాజా హీరోయిన్ కొలువుదీరింది. మీనా, ఖుష్బూ, నయనతార ప్లస్ కీర్తీ సురేష్ లతో బోలెడు సంసారపక్ష గ్లామర్ షో. మరో ముగ్గురు విలన్లతో రజనీ యాక్షన్ హంగామా. తెలుగులో శౌర్యం’, శంఖం మొదలైన సినిమాలు తీసిన యాక్షన్ - ఎమోషనల్ డ్రామాల దర్శకుడు శివకి తొలిసారిగా రజనీతో డైరెక్షన్. పెద్ద నిర్మాణ సంస్థ, తెలుగులో పెద్ద పంపిణీదార్లు - హంగూ ఆర్భాటం పండగకి తగ్గట్టు ఆకర్షణీయంగానే వుంది. థియేటర్లోకి వెళ్ళాక ఎలా వుంటుంది? చెల్లెలి సెంటిమెంటుతో, పెద్దన్న మమతాను రాగాలతో పండగని ఫీలవుతామా? రజనీ ఎప్పట్లానే పిల్లాపాపల్ని, యువ కెరటాల్ని, ముసలీ ముతకనీ తన మార్కు వినోద కాలక్షేపంతో రంజింపజేస్తాడా? ఇవీ తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు...    

కథ

   రాజోలులో పెద్దన్న అనే వీరన్న (రజనీకాంత్) పంచాయితీ పెద్ద. ఇతడికి కనకం అనే కనక మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ముద్దుల గారాల చెల్లెలు. ఈమెని కంటూ తల్లి చని పొతే చెల్లె పాపగా ప్రాణంలా పెంచి పెద్ద చేశాడు. చెల్లె పాపకి కూడా పంచ కట్టుకునే అన్నంటే పంచ ప్రాణాలు. ఇలా వుండగా ఓ కేసులో తను చెప్పినట్టు చేసిందని లాయరమ్మని (నయనతార) ప్రేమిస్తాడు పెద్దన్న. ఆమె కూడా న్యాయంగా ప్రేమిస్తుంది.

        ఇంతలో ఇద్దరు పెళ్ళయిన మరదళ్ళు (మీనా, ఖుష్బూ) మమ్మల్ని నువ్వు పెళ్ళి చేసుకోకపోతే చేసుకున్న మొగుళ్ళతో మేమెలా అయ్యామో చూడమని వచ్చేసి గొడవ మొదలెడతారు. వీటన్నిటి మధ్య ఇక పెద్దన్నకి చెల్లెలి పెళ్ళి చేయాలన్పించి సంబంధాలు చూసి, ఓ పెద్దమనిషి (ప్రకాష్ రాజ్) కొడుకుతో పెళ్ళి వేడుకలు ప్రారంభిస్తాడు. తీరా పెళ్ళి  సమయానికి చెల్లెలు కనకం చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి  వెళ్ళి పోతుంది. పెద్దన్న కంగారు పడతాడు. ఎంత వెతికినా కనపడదు కనకం. పెళ్ళి ఆగిపోతుంది. అలా మాయమై పోయిన కనకం కలకత్తాలో ప్రమాదంలో వుందని తెలుస్తుంది.

        కనకం కలకత్తాలో ప్రమాదంలో ఎందుకుంది? ఎవరా ప్రమాదకారులు? ఇక పెద్దన్న కలకత్తా వెళ్ళి చెల్లెల్ని ఎలా కాపాడుకున్నాడు? ఇదీ రజనీ స్టయిల్ మిగతా కథ.

ఎలావుంది కథ

    రజనీ అలసి పోలేదు, రజనీతో కథలు అలసి పోయాయి. అవే కథలు అలాగే తీసి తీసి రజనీని అపహాస్యం పాల్జేస్తున్నారు. రజనీలో సరుకు అయిపోలేదు, రజనీతో తీసే దర్శకుల్లో కొత్త సరుకు లేదు. రజనీ యాక్టింగ్ స్టయిల్ అదే హైరేంజి లో వుంటే, దాన్ని అందుకోవడంలో యువ దర్శకులుగా విఫలమై, లో- రేంజి ముసలి దర్శకత్వాలతో సరిపెడుతున్నారు. రజనీ వయసై పోయిందనే వాళ్ళు, యువ దర్శకుల వయసై పోయిందని భాష మార్చుకోవాల్సి వుంటుంది.

        రజనీ ఎప్పుడో 30, 40 ఏళ్ళ క్రితం నటించేసిన కథల్లోంచి ఓ చెల్లెలి కథ తీసుకుని ఇప్పటి ప్రేక్షకులకి ఆ కాలపు తరహాలోనే ఉన్నదున్నట్టు అంటగట్టాడు దర్శకుడు శివ. భావోద్వేగాలు ఎప్పుడూ అవే వుంటాయి. వాటిని వ్యక్తం చేసే సినిమా నాటకీయత కాలాన్ని బట్టి మారుతుంది. ఇప్పటి ఏ సినిమాల్లో అన్నాచెల్లెలు దర్శకుడు శివ చూపించినట్టు వుంటున్నారు? ఇది కూడా సరి చూసుకోకూడదా?

        పాత కథల్ని సినిమాలుగా తీయకూడదని కాదు. రీబూట్ చేసి, సమకాలీన కథలన్పించేలా తీయడానికి కూడా బద్ధకమైతే ఎలా? ప్రమాదంలో పడ్డ చెల్లెల్ని అన్న కాపాడాల్సిన అవసరం జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఎక్స్ పైరీ డేట్ వుండదు. కాలాన్ని బట్టి తీరు మారుతుంది. ఈ కాలీన స్పృహ కూడా లేకపోతే సినిమాలు తీయడమెందుకు?

        ఈ కథ థీమ్ తో ఇబ్బంది లేదు. తీసిన విధానమే, పురాతన సినిమా చూస్తున్నట్టు వుంది. అన్నా చెల్లెల సెంటిమెంట్లు, వాళ్ళ సీన్లు, మాటలు, పాటలు, ఎడబాటులో కన్నీళ్ళూ  ఏడ్పులూవీటికి తోడు రజనీ పెద్దరికపు గ్రామీణ దృశ్యాలు, కామెడీలు,  గ్రామీణ విలనీ, కలకత్తా విలనీలూ... ఏదీ నేపథ్యాలు మార్చి కొత్తగా చూపించే బదులు 1980 ల, 90 ల నాటి సినిమా చూడమన్నట్టు చూపించేశాడు ఆలిండియా ప్లస్ ఓవర్సీస్ ప్రేక్షకులకి శివ!

నటనలు- సాంకేతికాలు

  రజనీ రహస్యమేమిటంటే ఏ సినిమాలోనూ బరువెక్కకుండా అదే స్లిమ్ బాడీతో యాక్టివ్ గా వుండడం. ఈ సినిమాలో ఎక్కడా కుదురుగా వుండడు. ఏ సీనులో చూసినా స్పీడుగా నడిచి వచ్చేస్తూ డైలాగులు చెప్పేస్తాడు. తను మూవ్ మెంట్ లో వుండని క్షణం లేదు. తన వల్లే సీన్లు మొరాయించకుండా చకచకా పరిగెడుతూంటాయి. కాలం చెల్లిన కథనీ, పాత్రనీ ఓడించేస్తూ తన సమ్మోహనాస్త్రపు ఛత్రఛాయ కిందికి ప్రేక్షకుల్ని లాక్కొచ్చేస్తాడు. విలన్లనీ, వాళ్ళ ముఠాల్నీ తంతున్నప్పుడు మన ఉద్రేకాలు పెరిగేలా చేస్తాడు. తనకి అన్ని విద్యలూ తెలుసు. మందబుద్ధి మేకర్లే అర్ధం జేసుకోరు. ప్రతీ పాటా జనరంజకం చేసి పెట్టాడు. ఈ సినిమా కథని పూర్వజన్మ కర్మ ఫలమని భరిస్తూ ఏదో కాసేపు చూడాలన్పిస్తే - అది రజనీ గురించీ, సంగీత దర్శకుడు ఇమాన్ గురించే!

        కీర్తి సురేష్ చెల్లెలి పాత్రా, నటనా కీర్తి శిఖరాలందుకునే ప్రమాదముంది. దీంతో ఇతర దర్శకులు ఆమెతో ఇలాటి ప్రయోగాలు చేసినా చేస్తారు. బారసాల నుంచి సీమంతం పాట వరకూ తనెక్కడికో వెళ్ళిపోయింది. ఇంత ప్రాచీన జీవితం ఆమెతో మనం చూడాలి. మధ్యలో పాత మోడల్ మరదళ్ళుగా మీనా, ఖుష్బూల విచిత్ర పాత్రలు, గోల కామెడీ నటనలూ సరే. నేటి సినిమా అంటే ఇలా వుండాలని ప్రేక్షకులకి నేర్పుతున్నాడు దర్శకుడు. మీనా, ఖుష్బూ లకి కూడా ఇదే కరెక్ట్ అన్పించి వుంటుంది. లాయర్ పాత్రలో నయనతార ఒక్కరే రజనీ తర్వాత కాస్త చూడదగ్గదిగా వుంటుంది. రజనీ- నయనల మధ్య ముందొక డ్యూయెట్ పెట్టేశాక, ఇంకా రోమాంటిక్ సీన్లు తలపోయలేదు ఎందుకో శివ.  

        విలన్ల గురించి- ఫస్టాఫ్ లో ప్రకాష్ రాజ్, సెకండాఫ్ లో జగపతిబాబు, అభిమన్యూ సింగ్ లు అత్యంత అర్ధం పర్ధం లేని విలన్ పాత్రలేశారు. చివరి ఇద్దరికీ కీర్తీ సురేష్ తో కుట్రకి కూడా సరైన కారణం కన్పించదు. బోలెడు హింసకి పాల్పడ్డమే విలనీ అనుకుంటే అదిక్కడ వర్కౌట్ కాలేదు, కనెక్టూ కాలేదు. 

        ఇక సంగీత దర్శకుడు ఇమాన్ గురించి. విషయపరంగా సినిమా ఎలా వున్నా, ఆరు పాటలు రజనీకి తగ్గట్టు ఇవ్వడంలో హిట్టయ్యాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కేం చేశాడు? ఇవాళ దీపావళి. టపాకాయలు హోరెత్తుతాయి. దీనికి పోటాపోటీగా అన్నట్టు సినిమా సాంతం లౌడ్ మ్యూజిక్ తో శబ్ద కాలుష్యం సృష్టించి పారిపోయేలా చేశాడు. ఈ సినిమా కెళ్తే ఇంటి కొచ్చి బాణసంచా కాల్చనవసరం లేదు. డబ్బులు ఆదా అవుతాయి.

        నిర్మాణపరంగా బడ్జెట్ కి వెనుకాడలేదు. గ్రామీణ దృశ్యాలు, కలకత్తా దృశ్యాలూ హై రేంజిలో చిత్రీకరించారు. అలాగే యాక్షన్ దృశ్యాలూ. ఓ మూడు నాల్గు సీన్లు తప్పిస్తే, ఏ సీన్లోనూ కనిష్టంగా 50, గరిష్టంగా వందల మందికి తక్కువ కాకుండా క్రౌడ్ సీన్లే వుంటాయి. రజనీని కాసేపు ఒంటరిగా చూద్దామంటే కన్పించడు! ఇది సినిమానా, ఎలక్షన్ ర్యాలీనా అన్నట్టు తీశారు బడ్జెట్టంతా ధారబోసి!

చివరికేమిటి

      ఈ రజనీ కొత్త సినిమా విడుదల ముందు అనుకున్నంత బజ్ క్రియేట్ చేయలేదు తమిళనాడులోనూ, మిగతా దేశంలోనూ. సోషల్ మీడియా స్తబ్దుగా వుండి పోయింది. యూత్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక మాస్ మసాలా సినిమాలకి దూరంగా ఆన్ లైన్లో వస్తున్న కొత్త కంటెంట్ కి అలవాటు పడుతున్నారేమో. తెలుగులో కూడా ఈ మధ్య మాస్ సినిమాలకి మాస్ ప్రేక్షకులే కరువయ్యారు. రివ్యూలు రాయడానికి మనం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల్ని చూస్తాం. అక్కడైతే అన్ని తరగతుల ప్రేక్షకుల రియాక్షన్ తెలుస్తూంటుంది. ఈ సినిమా మార్నింగ్ షోకి మాస్ తక్కువే వున్నారు. రజనీ కాబట్టి ఆ మాత్రం వచ్చి వుంటారు. వాళ్ళు ఈ పాత అతి మెలో డ్రామా సీన్లకి గట్టిగా నవ్వకుండా వుండ లేక పోయారు. నిజం కంటే న్యాయం గొప్పదని ఒక డైలాగు వుందిందులో. అరిగిపోయిన పాత చింతకాయ కథ అన్న నిజాన్ని దాచి పెడుతూ న్యాయం చేయాలని తెలుసుకోకుండా - దర్శకుడు రెండు దీపావళులు దివ్యంగా గడిపేశాడు...

—సికిందర్