రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, ఏప్రిల్ 2020, సోమవారం

930 : సందేహాలు -సమాధానాలు



 Q : ‘జాన్ విక్’ సిరీస్, మరి కొన్ని హిట్ మాన్ టైప్ మూవీస్ లో ప్రొటాగనిస్ట్ క్యారక్టర్ గురించి లెన్తీ ఫ్లాష్ బాక్స్ చూపించకుండానే చిన్న చిన్న డైలాగ్స్ తో, పక్క పాత్రలు మాట్లాడుకునే మాటలు, బిట్ సీన్స్ తోనే ఇంటెన్సిటీ  బిల్డ్ చేసి ప్రస్తుత కథలోకి వస్తారు. మన దగ్గర ఇంకా లెన్తీ ఫ్లాష్ బాక్ లు వస్తూనే ఉన్నాయి. తెలుగు సినిమాకు ఏది కరెక్ట్? ‘జాన్ విక్’ టైప్ క్యారక్టర్ ని బిలీవబుల్ గా చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? బిల్డ్ అప్ సీన్ రాయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించిన సినిమాలను ఉదహరిస్తూ వీలైనంత వివరంగా చెప్పగలరు.
ఎపి, ఏడీ

 
A :  ‘జాన్ విక్’ అనేది రివెంజి సినిమా. యాక్షన్ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఇది రివెంజి కథ అని ఫీలైతే పెప్ వుండదని రివెంజి కోణాన్ని మరుగుపర్చి యాక్షన్ కథ నడిపే విధానమొకటుంది. రివెంజి కోణాన్ని మెల్లగా ఎప్పుడో ప్రేక్షకులు షాక్ తినేలా వెల్లడిస్తారు. ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ (2016) అనే  ‘సెవెన్ సమురాయ్’ రెండో రీమేక్ లో దీన్ని గమనిస్తాం. ఈ విషయం ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ రివ్యూలో రాశాం కూడా. ఇలాటి స్క్రీన్ ప్లే టిప్స్ కాపీ పేస్ట్ చేసుకుని డేటా బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటే, మళ్ళీ డౌట్ వచ్చి అడిగే అవసరం రాదు.

       
ది మాగ్నిఫిషెంట్ సెవెన్లో కౌబాయ్ డెంజిల్ వాషింగ్టన్, ఆ గ్రామానికి బందిపోటు విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి తన గ్రూపుతో వస్తాడు. ఇలా సినిమా సాంతం పోరాడుతూనే  వుంటే పాత్ర నమ్మశక్యంగా అన్పించదు. తనది కాని ఏదో వూరుని కాపాడే అవసరం తనకెందుకని? ఎందుకో చిట్ట చివర్లో వెల్లడిస్తాడు. ఆ బందిపోటు విలన్ని చంపుతూ, ‘రేయ్, నా చిన్నప్పుడు  మా అమ్మనీ, నా ఇద్దరు చెల్లెళ్ళనీ చంపావ్ గుర్తుందా?’ అంటాడు. ఈ ఎండింగ్ స్టేట్ మెంట్ కి మనం కూడా షాకవుతాం విలన్తో పాటు.  విలన్తో అతడికి పాతపగ వుందని మనకి అప్పటివరకూ తెలియకుండా దాచారు. తెలిస్తే రివెంజి కథ అని తెలిసిపోయి ఇంటరెస్టు పోయేది. ఇలా చిట్ట చివరికి వెల్లడించాక, వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా ఎలివేటయ్యే పాత్ర చిత్రణా పరమైన హంగు చేకూరింది. అంటే తనలో ఇంత బాధని దాచుకుని గ్రామం కోసం చేశాడన్న మాట. హీరో అనేవాడి   మొదటి ప్రాధాన్యం పర సుఖమే తప్ప స్వసుఖం కాదు. తన పగదీర్చుకోవడానికే గ్రామంకోసం పోరాడినట్టు అన్పించదు. పగలేకపోతే వచ్చే వాడు కాదని కూడా అన్పించదు. పగ గురించే అయితే విలన్ ఎక్కడున్నాడో అక్కడి కెళ్ళి చంపేసి పోతాడుగా? ఇలా కాకుండా స్వకార్యం, స్వామి కార్యం రెండూ చక్కబెట్టదల్చుకున్నాడు. 


      దీని దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా. డెంజిల్ వాషింగ్టన్ తోనే 2018 లో ‘ఈక్వలైజర్ 2’ తీశాడు. ఈ యాక్షన్ మూవీలో కూడా ముగింపులో వాషింగ్టన్ ని, ఎంత మరపురాని మానవీయ కోణంతో ఎలివేట్ చేశాడంటే, ఇలాటిది మన తెలుగు స్టార్లతో ఇక ముందు కూడా చూడలేనంత. మానవీయ కోణం యూనివర్సల్ నాడి. ఇది డెంజిల్ వాషింగ్టన్ కోసం ఫుఖ్వా పట్టుకున్నాడు.   
      
        రివెంజి కథ రిస్కీ బిజినెస్సే. దీని విషయంలో ప్రేక్షకులు రెండాకులు ఎక్కువే చదివి వుంటారు. దర్శకుడు మూడో నాల్గో ఆకులు ఎక్కువ చదువుకుని  ముందుండక పోతే అడకత్తెరలో పోక అయిపోతాడు. ఫుఖ్వా పదాకులు ఎక్కువే స్టడీ చేశాడు. అందుకే ‘ఈక్వలైజర్ 2’  రొటీన్ రివెంజి కథతో ప్రేక్షకుల మీద పగదీర్చుకో గల్గాడు. ఇంటర్వెల్ కి పది నిమిషాల ముందు హత్య జరుగుతుంది. ఇక వాషింగ్టన్ దీనికి పగ దీర్చుకుంటాడు కదా,  ఇంతే ఈ సినిమా కథా అని తెలిసిపోతుంది. ప్రేక్షకులకి ఇలా తెలిసిపోయాక ఇంకేం కథ నడుపుతామని, ఫుఖ్వా ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకే క్లయిమాక్స్ కి తెరతీశాడు. డెంజిల్ వాషింగ్టన్ మాఫియా కిల్లర్స్ ని పిల్చి, ‘ఇక మీరు చావుకి సిద్ధపడండ్రా’ అని మీట నొక్కడంతో, మొదలయి పోతుంది 40 నిమిషాల ఊపిరి సలపని సుదీర్ఘ యాక్షన్ క్లయిమాక్స్. రివెంజి సినిమా ఫీలింగ్ చెల్లాచెదురై ప్రేక్షకులు స్టన్ అయిపోతారు. 

       
గమనించాల్సిందేమిటంటే, అకిరా కురసావా తీసిన జపనీస్ ‘సెవెన్ సమురాయ్’ (1954) లోనూ, దీని మొదటి హాలీవుడ్ రీమేక్ ది మాగ్నిఫిషెంట్ సెవెన్(1960) లోనూ రివెంజి కోణం లేదు. హీరోకి బ్యాక్ స్టోరీ (ఫ్లాష్ బ్యాక్) ఇవ్వలేదు. రెండో రీమేక్ లో దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా బ్యాక్ స్టోరీ ఇస్తూ రివెంజి కోణాన్ని కల్పించాడు. అది కూడా ‘జాన్ విక్’ లో మీరన్నట్టు సింగిల్  డైలాగు టెక్నిక్ తో. ఈ సింగిల్ డైలాగుకి సపోర్టుగా విజువల్స్ వేయలేదు. మనమైతే వేసేస్తాం. హీరో కుటుంబాన్ని విలన్ తనివిదీరా చంపుతున్న కట్ షాట్స్ మనసుదీరా వేసేసి ఆనందిస్తాం. ఈ ఆనందం వృధాగా పది లక్షల బడ్జెట్ ని మింగేసిందన్న తెలివి లేకుండా. మన తెలివే మనకానందం కనుక.

        ఉద్దేశమేమిటంటే, క్రియేటివ్ యాస్పెక్ట్ లో క్రాఫ్ట్ ని, టెక్నిక్ నీ కాపాడ్డమే. వేస్తే  సింగిల్ డైలాగు ఒక్కటే వెయ్యాలి, ఇంపాక్ట్ వుంటుంది. లేదా విజువల్స్ ఒక్కటే వెయ్యాలి. ఇంపాక్ట్ వుండదు. రెండూ కలిపి వేస్తే ఇంపాక్ట్ అస్సలుండదు. సింగిల్ డైలాగ్ ఈజ్ సుప్రీమ్. మళ్ళీ డైలాగు పొడిగించ కూడదు, విలన్ తో కూడా ఇంకేమీ అన్పించకూడదు. యాక్షన్ తో సీను ఫినిష్ చేసేయాలి. సింగిల్ డైలాగ్ తర్వాత యాక్షనే. ఇంకేమీ వుండకూడదు. 

        ఒక ఇంపాక్ట్ నిచ్చే సింగిల్ డైలాగుతో సూచన ప్రాయంగా ఇచ్చిన హీరో బ్యాక్ స్టోరీ (ఫ్లాష్ బ్యాక్) చాలు. మిగతాదంతా ప్రేక్షకుల ఇమాజినేషన్ కి వదిలెయ్యాలి. విలన్ హీరో కుటుంబాన్ని చంపేశాడా? పాపం ఆ తల్లి ఎలా వుండేదో... చెల్లెళ్ళు ఎలా వుండే వాళ్ళో... బలై పోయారు...అని ఇమాజిన్ చేసుకోవడంలో వుండే బలం, ఫీల్ ఎదురుగా దృశ్యం కనబడితే తేలిపోతాయి. 

        ఈ టెక్నిక్ నే ‘జాన్ విక్’ లో దర్శకుడు చాడ్ స్టహెల్ స్కీ పాటించాడు. అతడి ఇంటర్వూ చూశారా? ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’ లో క్లింట్ ఈస్ట్ వుడ్ హీరో పాత్ర. దీనికి చాలా బ్యాక్ స్టోరీ వుంటుంది. కానీ ఎక్కడా అదేమిటో చెప్పరు. ప్రేక్షకుల ఇమాజినేషన్ కి వదిలేశాడు దర్శకుడు సెర్జియో లియోన్.
We’re big fans of leaving it to your imagination’ అన్నాడు ఈ మూవీతో ఇన్స్పైర్ అయిన చాడ్. ‘జాన్ విక్’ లో కొసరి కొసరి అక్కడక్కడా ఇతర పాత్రల డైలాగుల ద్వారా, వేరే కట్ షాట్స్ ద్వారా బ్యాక్ స్టోరీ వేస్తూ పోయాడు స్టార్ కినూ రీవ్స్ పాత్రకి. 

        ప్రారంభ సీను చూశారా? గాయాల పాలైన కినూ రీవ్స్ పరుగెత్తుకుంటూ వచ్చి, దాక్కుని, సెల్ ఫోన్ తీసి, భార్య వున్న వీడియో చూసుకుంటాడు. ఇదొక్కటి చాలు ఎంతో చెప్పేయడానికి బ్యాక్ స్టోరీ గురించి. ‘ఖైదీ’ లో చూశారా? ప్రారంభ సీనులో  పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో రంగ నాథ్, అనుమానాస్పదంగా కన్పిస్తున్న చిరంజీవిని ఆపి దబాయిస్తున్నప్పుడు, చిరంజీవి దగ్గర కత్తి బయట పడుతుంది. ఇదొక్కటి చాలు బ్యాక్ స్టోరీ గురించి ఎంతో చెప్పేయడానికి. ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నాడు సిడ్ ఫీల్డ్. 

         ‘జాన్ విక్’ టెక్నిక్ సబ్ కాన్షస్ కి కనెక్ట్ చేసే టెక్నిక్ కావచ్చు. హీరో గురించి, ‘వాడెవడో తెల్సా? వాడు కాంట్రాక్ట్ కిల్లర్’ అని ఒక పాత్ర ఇంకో పాత్రకి చెబుతూంటే, హీరో మనకి చాలా గుంభనంగా కన్పిస్తాడు. గుంభనంగా అన్పించేది మన సబ్ కాన్షస్ తో కనెక్ట్ అవుతుంది. ఇక రకరకాలుగా వూహించుకుంటూ (ఇమాజినేషన్) మనముండిపోతాం. పాత్ర బలంగా, అయస్కాంతంలా పట్టేస్తుంది. 

        ఈ టెక్నిక్ తెలుగుకి ఎలా వుంటుందని ఒక దర్శకుడికి ఫోన్ చేశాం. ఈ టెక్నిక్ -  వస్తాడు, ఇక వస్తాడు, వచ్చేస్తున్నాడు...అని చెప్పిస్తూ నాందీ ప్రస్తావనా మాత్రంగా బావుటుందే తప్ప - వచ్చాక పాత కథ వుంటే,  అది పూర్తి ఫ్లాష్ బ్యాక్ వేసి చూపించక పోతే ప్రేక్షకులు అల్లరి చేస్తారన్నారు.

    ఇంకేం చేస్తాం. ప్రేక్షకులు కాలంతో బాటు మారి, కొత్త డిక్లరేషన్ ఇస్తే తప్ప కొత్త టెక్నిక్కులు చెల్లెలా లేవు. ఈ బ్యాక్ స్టోరీనే ‘సర్కిల్ ఆఫ్ బీయింగ్’ అన్నాడు సిడ్ ఫీల్డ్. ఇందుకు కొన్ని మంచి ఉదాహరణ లిచ్చాడు : హౌ టు మేక్ ఏన్ అమెరికన్ క్వల్ట్, థెల్మా అండ్ లూయిస్, డెత్ ఆఫ్ ఏ సేల్స్ మాన్, షాషంక్ రిడెంప్షన్, ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్, ది లాంగ్ కిస్ గుడ్ నైట్...

        నిజానికి బ్యాక్ స్టోరీ స్క్రీన్ ప్లేలో ఏ విభాగం? బిగినింగ్ విభాగమే. ‘జాన్ విక్’ లో ఇమాజినేషన్ టెక్నిక్ తో వున్న బ్యాక్ స్టోరీ బిట్స్ బిగినింగ్ విభాగమే. లీనియర్ నేరేషన్ చేస్తే అక్కడ్నించే కదా ప్రారంభమయ్యేది కథ. ఈ కథ రాయడానికి ఇంకో నాల్గు హాలీవుడ్ సినిమాలు కూడా ఇన్స్పైర్ చేశాయి. అలాగే అలిస్టర్ మెక్లీన్ నవలల్లో వుండే స్టోరీ వరల్డ్, స్టీఫెన్ కింగ్ నవలల్లో వుండే సర్ప్రైజ్ చేసే హీరో క్యారక్టరైజేషన్ తోడయ్యాయి. చాలా స్టడీ చేస్తే గానీ ఈ రివెంజి మాఫియా యాక్షన్ స్క్రీన్ ప్లే తయారు కాలేదు. కాబట్టి దీనికిది బ్యాక్ స్టోరీతో యూనిక్. తెలుగులో ఎవరైనా సాహసం చేస్తే చేసి చూడొచ్చు. ప్రేక్షకులకంటే రెండాకులు ఎక్కువే చదవగల్గితే. 

        ఇక మీరడిగిన
బిల్డ్ అప్ సీన్లు రాయడం గురించి. ఏ జానర్ కైనా క్యారక్టర్ బిల్డప్ సీ ను క్యారక్టర్ చేసే సంఘర్షణని బట్టి మిడిల్ లో వస్తుంది. ఇంట్రడక్షన్ ని బట్టి బిగినింగ్ లో వస్తుంది. క్లయిమాక్స్ ని బట్టి ఎండ్ లో వస్తుంది. క్యారక్టర్ బిల్డప్ సీన్లే కథకి బిల్డప్ సీన్లవుతాయి. filmsite అని వెబ్సైట్ వుంది. ఇందులో ఈ సీన్లన్నీ పురాతన కాలం నుంచీ ఇప్పటిదాకా పొందుపర్చి వుంటాయి.  ఇంకా ఇతర రిఫరెన్సులు చాలా వుంటాయి. ఈ సైట్ ని మీ డైరీలో చేర్చుకోండి. 

Q :  సంచిక డాట్ కాం’ లో మీరు ప్రాంతీయ సినిమాల గురించి చేస్తున్న విశ్లేషణలు ఫాలో అవుతున్నాను. వివిధ భాషల ప్రాంతీయ సినిమాల సమాచారాన్ని శ్రమ తీసుకుని అందిస్తున్నందుకు థాంక్స్. నా ప్రశ్నేమిటంటే, నేను ఇలాటి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు కాదు, మొదటి నుంచీ నా ఆలోచనలు కమర్షియల్ సినిమాలు కాదు, ఆర్ట్ సినిమాలే. అయితే తెలుగులో వీటితో ఎంతవరకు ముందుకు పోగలననే సందేహం వుంది.
ఏఎన్, ఏడీ 

A : తెలుగులో ముందుకు పోవాలంటే వెనక్కి వెళ్ళాలి. కమర్షియల్ సినిమాలు తీయడానికి ఏమీ నేర్చుకోనవసరం లేదేమో గానీ, ఆర్ట్ సినిమాలకి ప్రపంచ సినిమా  శాస్త్రాల, సిద్ధాంతాల పరిచయముండాలి. ఆ భాష మీరు మాట్లాడగల్గాలి. ఇది ఫిలిం ఇనిస్టిట్యూట్స్ నుంచి డిగ్రీ పుచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. ఆర్ట్ సినిమా అంటే ఏదో తెలుగు నేటివిటీ కథ తీసేసి, తెలుగు రాష్ట్రాల్లో నాల్గు చోట్ల విడుదల చేసుకుని, అయ్యిందన్పించుకుంటే ఆ ఒక్క సినిమాతో ఆగిపోతారు. ఇతర ప్రాంతీయ భాషల సినిమాలు చూడండి, అవి అంతర్జాతీయ స్థాయికి వెళతాయి. అలా వెళ్ళగలిగితే తెలుగులో తీయండి, లేకపోతే అవసరం లేదు. ఆయా ప్రాంతీయ దర్శకుల ఇంటర్వ్యూలు చదవండి. వాళ్ళ అవుట్ లుక్, వాళ్ళ విస్తృత నాలెడ్జి తెలుస్తుంది. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది. ఇలా వెనక్కెళ్ళి బోలెడు తెలుసుకున్నాక, ఫిలిం ఫెస్టివల్స్  లో ఇంటరాక్ట్ అయ్యాక, ఆ అనుభవసారంతో తీసే ప్రయత్నం చేయండి. తప్పకుండా తెలుగు సినిమా అంతర్జాతీయ అవార్డులు తీసుకొస్తుంది. ఓ ఐదేళ్ళు పదేళ్ళు టైం తీసుకోండి. 

Q :  మీ బ్లాగులో సినిమా న్యూస్, గాసిప్స్ వంటి లైట్ రీడింగ్ మెటీరియల్ కూడా ఇస్తే నాలాంటి పాఠకులకి బావుంటుంది కదా?
రజనీకాంత్, పాఠకుడు
 
A :  ఈ బ్లాగుకో థీమ్ వుంది. ఆ థీమ్ ప్రకారం పోస్టులుంటాయి. దీనికి పాఠకులున్నారు. దీన్నిలా వుండనిద్దాం. 

Q :  1. ఈ కరోనా తో సినిమా రంగానికి ఎక్కువ ఇబ్బంది అంటున్నారు. భవిష్యత్తు ఏమిటి అన్నది తెలియడం లేదు. ఈ టైంలో భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ లు ఎలా ఉండాలి? ఏం ఆలోచించాలి? అంతా సెట్ అవుతుంది అని కథలు రాసుకుంటూ ఉన్నా కరోనా భయం మనసులో ఏదో మూల వుంటుంది.
        2.
కరోనా ఎఫెక్ట్ వలన భవిష్యత్తు లో సినిమా థియేటర్ లు తగ్గిపోయి అమెజాన్, నెట్ ప్లిక్స్ లాంటి వాటికి ఆదరణ పెరుగుతుందా? దర్శకులు కూడా అటు వైపుగా వెళ్ళడానికి ఆలోచన చేయాలి అంటారా?
        3.
మనం ఇప్పుడు పరిష్కారం లేని సమస్యతో పోరాడుతున్నామని అనిపిస్తుంది. సినిమానే జీవితం అనుకుని ఉన్న వారి కోసం ఏవైనా సలహాలు సూచనలు చెప్పండి.
        4.
అసిస్టెంట్ డైరెక్టర్ లు, రచయితల కోసం రోజూ ఇన్స్పైరింగ్ గా ఏమైనా మీ బ్లాగులో రాయండి. అది చాలా మందికి కొత్త శక్తిని ఇవ్వగలదు. నేను రాస్తే ఏం జరుగుతుంది అనుకోకండి. మీరు రాస్తే ఒక స్నేహితుడు మాకు ధైర్యం చెపుతున్నట్టు అనుకుంటాం.
        5.
ప్రతీ జానర్ లో ఖచ్చితంగా చూడవలసిన సినిమాల లిస్ట్ ఒకటి ఇవ్వండి. కనీసం దాని వల్లయినా ఈ సినిమా లు తప్పకుండా చూడాలి అని ఆ పనిలో ఉంటాం.
        6.
చివరగా కరోనా గురించి పట్టించుకోకుండా వుండడానికి ఏమైనా టిప్స్ లాంటివి ఇవ్వండి(అవి ఫన్నీ గా ఉన్నా సరే).

రవి, ఏడీ 

A : ఇది ప్రపంచంలో అన్ని రంగాల సమస్య. వైరస్ కి మించి ఆర్ధిక సమస్య. రెండు నెలలకో మూడు నెలలకో వైరస్ భయం తీరిపోయిందిక, జనాలు థియేటర్లకి వచ్చేస్తారను కోవడానికి లేదు. ఈలోగా ఆర్ధిక పరిస్థితులు తలకిందులయ్యే అవకాశముంది. కార్మికులు, పేదలు భారీగా ఉపాధి కోల్పోయే పరిస్థితి వుంది. దీంతో మాస్ ప్రేక్షకుల్లో భారీగా కోత పడొచ్చు. అలాగే దేశంలో మధ్య తరగతి 27 శాతం. ఇందులో 14 శాతం వుండే దిగువ మధ్య తరగతి, 10 శాతం వుండే సగటు మధ్యతరగతి భారీగా ఉద్యోగాలు కోల్పోతారు. 3 శాతం వుండే ఎగువ మధ్యతరగతి బయట పడొచ్చు. యువత కూడా కష్టాల్లో పడతారు. సినిమాలకి రావడానికి డబ్బులు కాదుగదా, సినిమాలు చూసే మూడ్ వుంటుందా? రేపు లాక్ డౌన్ ఎత్తేశాక సామాన్యుడి నుంచీ సంపన్నుడి వరకూ వృత్తి వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు పరుగులు పెడతారు, ఇంట్లో కూర్చుని సినిమాలు చూసే అవకాశం వుంటుందా? ఆలోచించుకోవాలి.

        కనుక దేశం ఆర్ధికంగా కోలుకునే దాకా ఏ రంగమూ ఇంతే. రంగాలు కోలుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి 15 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఒక్కో పరిశ్రమకి రెండు వేల రూపాయలు చొప్పున ఏ మూలకి? ఈ రంగం కోలుకుంటుందా? ఈ రంగంలోనే 92 శాతం అసంఘటిత కార్మికులున్నారు. ఒక్క వైరస్ వేటుకి గ్లోబలైజేషన్ చరిత్ర పరిసమాప్తమయ్యేలా వుంది. చెన్నై నుంచి మనకందిన సమాచారం బట్టి అక్కడ సినిమా రంగం కోలుకోవడానికి సంవత్సరం దాకా పడుతుంది. ఎక్కడైనా ఇంతే. 

        ఈ పరిస్థితుల్లో సినిమా కథలు రాస్తూ కూడా కూర్చోలేరు. ఆల్రెడీ ఓకే అయివుంటే ఓకే అనుకుని రాసుకోవచ్చు. కొత్త ప్రయత్నాల కోసం రాయాలనుకోవడం వృధా. రాయనీయదు మనసు కూడా. రాస్తూంటే, ‘రేపేంటో తెలీని పరిస్థితుల్లో రాయడం వేస్టేమోరా ఆలోచించు’ అని ఓవైపు రొద పెడుతుంది మనసు. కనుక ప్రస్తుతానికి వాయిదా వేస్తే మంచిది. 

        థియేటర్లేమీ తగ్గిపోవు. అన్ని దృశ్య మాధ్యమాలకీ మదర్ లాంటిది సినిమా. సినిమా అంతరించిపోదు. సినిమా అంతరించిపోతే కదా థియేటర్లు అంతరించిపోవడానికి. సినిమా అనే మదర్  టెక్నాలజీ ఇంకెన్నో వంశాంకురాల్ని చూస్తుంది, ఇప్పుడు ఓటీటీ సహా. మీకవకాశాలుంటే వెబ్ సిరీస్ వైపు ఎందుకెళ్ళకూడదు? రేపు ఇతర రంగాలు మూతబడితే  పోగొట్టుకున్న ఉద్యోగాలు పొందడం కష్టమే కావచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఈ లాక్ డౌన్ సమయంలోనే ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు. వాళ్ళకి ఇంకో మీడియా సంస్థల్లో అవకాశాల ప్రసక్తే లేని పరిస్థితేర్పడింది.  సినిమా రంగం అలాకాదు. ఇప్పుడు మూత బడ్డ సినిమా రంగం లాక్ డౌన్ తర్వాత నెమ్మది నెమ్మదిగా తెరచుకుంటుంది. ఉపాధి ఎక్కడికీ పోదు. థియేటర్లు పుంజుకోవడానికి సమయం పట్టొచ్చు గానీ, ఈలోగా సినిమాలు తయారవుతూనే వుంటాయి, ఆగిపోయిన సినిమాలు సహా. కాకపోతే ఆర్ధిక మోడల్ మారవచ్చు. కనుక నిశ్చింతగా వుండి, ఇతర విషయాలమీద దృష్టి పెట్టండి.

 
Randy Glasbergen - Glasbergen Cartoon Service 

        ఈ లాక్ డౌన్ పీరియడ్ లో రాయడం కట్టి పెట్టి తెలుసుకోవడం మీద, నేర్చుకోవడం మీద దృష్టి పెట్టండి. అదే పనిగా సినిమాలు చూడకండి. వారానికి రెండు మూడు సెలెక్టివ్ గా చూస్తే చాలు. చూసి వదిలేయకుండా, మీకెలా అన్పించాయో రివ్యూలు రాసుకోండి సాంకేతికాలు సహా. మీ స్కిల్స్ పరీక్షించుకోండి. బాలీవుడ్ దర్శకుడు ఒనిర్ ఈ సమయంలో అసిస్టెంట్లకి టాస్క్ ఇచ్చాడు. ఇండోర్స్ లో రెండు నిమిషాల షార్ట్ మూవీస్ మొబైల్ మీద తీసి పంపమంటున్నాడు. గెలుపొందిన వారికి తన టీములో అవకాశమిస్తానంటున్నాడు. అవకాశం సంగతేమో గానీ, ముందు స్కిల్స్ పరీక్షించుకోవడానికిదో చిన్నపాటి  యాక్టివిటీ కావచ్చు. ఖాళీగా వున్నాం కదాని సోషల్ మీడియాలో అదే పనిగా గడపకండి. రాజకీయ కార్యకర్తలా పోస్టులు పెట్టకండి. ఎగ్రెసివ్ మెంటాలిటీ ప్రదర్శించకండి. రేపు మీ కవకాశమిచ్చే చోట, మీ సోషల్ మీడియా బిహేవియర్ చెక్ చేస్తే, మీకవకాశం కష్టం కావొచ్చు. మీకు సినిమాలు ముఖ్యమా, లేనిపోని హైపర్ యాక్టివిటీ ముఖ్యమా ఆలోచించండి. న్యూట్రల్ గా వుండండి. సినిమా వ్యక్తిగా న్యూట్రల్ గా వుంటేనే సమగ్ర సృష్టి చేయగల్గుతారు. ఒకసారి ప్రముఖ స్టార్లు, దర్శకుల ట్వీట్లు చూడండి. అలా వుండండి. ఇన్ స్టాగ్రాంలో నీతా అంబానీని ఫాలోకండి. సంపన్నులని ఫాలోకండి. రతన్ టాటా, కుమార మంగళం బిర్లా, రాహుల్ బజాజ్, అజీమ్ ప్రేంజీ, ఆనంద్ మహీంద్రా మొదలైన సంపన్నులని ఫాలోకండి. కామెంట్లు పెట్టండి. 
సినిమా స్టార్లనీ ఫాలోకండి. కామెంట్లు పెట్టండి. చాలా పాజిటివ్ నెస్ వస్తుంది. పనికొచ్చే వెబ్సైట్స్, చానెల్స్ చూడండి. ఏవైనా చదవాల్సిన పుస్తకాలుంటే చదివెయ్యండి (చాలా రోజులుగా చదవలేక పోయిన జీఎస్ వరదాచారి గారి ‘ఇలాగేనా రాయడం?’ చదివేశాం మనం). హాస్య రచనలు చదవండి. నెట్ లో బోలెడు వుంటాయి. వైరస్ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. లెక్కల ప్రకారం జూన్ ఫస్టున మన దేశానికి వైరస్ పీక్ దశ వస్తుంది. అక్కడ్నించీ తగ్గు ముఖం పడుతుంది. అదే పనిగా దాని గురించి ఆలోచించి, దాంతో వచ్చే ఆర్ధిక, ఆరోగ్య సమస్యల్ని కూడా బోనస్ గా వూహించుకుని, బుర్ర ఖరాబు చేసుకోకండి. శారీరక దూరతీరాలు పాటిస్తే తర్వాత ప్రాపంచిక సుఖాలు మనవే అవుతాయి. రాత్రి పూట కళ్ళకి బయటి పని అప్పజెప్పకుండా విజువల్ మీడియా కట్టిపెట్టండి. చెవులకి లోపలి పని అప్పజెపుతూ, ఆడియో తక్కువ వాల్యూం పెట్టుకుని మీకిష్టమైన పాటలు వినండి. రాత్రి పూట వినే పాటలుంటాయి. ఇళయరాజా పాటలు వినండి. ఇంకా పాత పాటల మీద ఆసక్తి వుంటే, 1940 - 70 ల మధ్య ముప్ఫయ్యేళ్ళ చరిత్రంతా చెవుల ముందుంది. పడుకునే ముందు చార్లీ చాప్లిన్ చేష్టలు చూడండి. మన లోపలి ప్రశాంతి కోసం ఇన్ని బయటి సాధనాల మీద ఆధారపడుతున్నాం. లాక్ డౌన్ వల్ల ప్రకృతి తేట పడిందని ఆనందిస్తున్నాం. మనం మాత్రం తేట పడక నాటుగానే వుంటున్నాం. లాక్ డౌన్ కి పూర్వమెప్పట్నించో క్రిస్టఫర్ నోలన్ తేట పడి ప్రకృతిలో మమేకమై వున్నాడు. హాలీవుడ్ అగ్రదర్శకుడు క్రిస్టఫర్ నోలన్ చేతి వాచీ, జేబులో సెల్లు, ఇంట్లో టీవీ, ఆఫీసులో కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, మల్టీ మీడియా, గిల్టీ మీడియా అన్నిటికీ లాక్ డౌన్ పెట్టేసి - ప్రకృతి అంత తేట మనసుతో ప్రకృతితో వుంటూ - ఒక్కో హై ఎండ్ టెక్నాలజీ మూవీ దిమ్మదిరిగేలా తీస్తూ పోతూంటాడు... సరే, ఉదయం ఐదున్నరకి లేచి ఎక్సర్ సైజ్, వాకింగ్, జాగింగ్ లాంటివి ముప్పావు గంట చేయండి. ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. మానసికంగా బావుంటే శారీరకంగా బావుంటారు. మునగాకు దొరికితే ఉదయం పూట నీట్లో మరిగించి ఓ గ్లాసుడు పట్టించండి. దరిద్రం వదుల్తుంది. బ్రెయిన్ భేషుగ్గా వుంటుంది. ఇల్లు నీటుగా వుంచుకోండి. బయటి కెళ్ళినప్పుడు ఎవరైనా బాధల్లో కన్పిస్తే సెల్ఫీలు తీసుకోకుండా వంద రూపాయలు ఇచ్చేయండి. మనకూ వుండొచ్చు బాధలు. కానీ ఈ లాక్ డౌన్  తో మనమెవ్వరం వూహించని కొత్త పీడిత వర్గం -నయా దరిద్రనారాయణులు పరిణమించారు. తలతిప్పుకుని వెళ్లిపోలేం. చాయ్ బిస్కెట్లు, మందు సిగరెట్లు, సినిమాల ఖర్చులూ తప్పాయిగా? అందులోంచి కొంత ఇచ్చేయండి. అలాగే వీధి కుక్కలు అల్లాడుతున్నాయి. ఓ బన్ను ముక్క పడెయ్యండి, హుషారుగా వుంటాయి. ఇలా ఎక్కువై పోయిందేమో... ఇక ఆపుదాం. 
        చూడదగ్గ జానర్ వైజ్ సినిమాల లిస్టు కోసం మంగళవారం చూడండి. 

 
సికిందర్


17, ఏప్రిల్ 2020, శుక్రవారం

929 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -6


      1. పోలీస్ డిటెక్టివ్ జానర్లో పోలీస్ స్టేషన్ వుండదు, క్రైం బ్రాంచ్ వుంటుంది.
        2. సీఐ, ఎస్సై లుండరు. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ ఎస్సై లుంటారు.  
        3. ఇవి పోలీస్ ప్రొసీజురల్ మూవీస్. వీటిని ప్రొఫెషనల్ గా రాసి, ప్రొఫెషనల్ గా తీస్తారు.
        4. నేరపరిశోధనల్లో క్రైం బ్రాంచ్ పనితీరుని వాస్తవికంగా, విజ్ఞాన దాయకంగా చూపిస్తారు.
        5. ఫోరెన్సిక్
, అటోప్సీ ఆధారాలు, ఇతర సాక్ష్యాధారాల సేకరణా, సెర్చి వారెంట్లూ ఇంటరాగేషన్, లీగల్ విషయాలూ వగైరా ఈ కథల్లో భాగంగా వుంటాయి. నేరస్థల పరిశీలనా ప్రక్రియకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వుంటుంది. దీని పిడిఎఫ్ ని పరిశీలించుకోవాలి.
        6. హత్యాస్థలంలో హంతకుడికి సంబంధించి వస్తు రూపంలో దొరికే క్లూసే కాకుండా, మెడికల్ ఆధారాలతో కూడా పట్టుకునే ప్రయత్నాలు చూపిస్తే కొత్తదనం వుంటుంది. డీఎన్ఏ, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, వైర్ టాప్స్, రూంబగ్స్, పాలీగ్రాఫ్, అండర్ కవర్ ఆపరేటర్స్, హిప్నాసిస్, సైకలాజికల్ ప్రొఫైలింగ్, కంప్యూటర్ ఎనలైజింగ్, శాటిలైట్ సర్వేలెన్స్, ఎంటమాలజీ మొదలైనవి కూడా అవసరాన్నిబట్టి కథలోకి తీసుకోవాలి.
        7. లాజిక్ అనేది
, అంటే కామన్ సెన్స్ అనేది, ఈ కథల్లో విడదీయలేని స్క్రిప్టింగ్ టూల్.
        8. రియలిస్టిక్ రూపకల్పన తో యూత్ ఓరియెంటెడ్ గా చూపించొచ్చు.
        9. రియలిస్టిక్ గా అన్పించే -జీవితంలో సహజంగా జరిగిపోయే సంఘటనల్ని- యూత్ జీవితాల్లోంచి
, ప్రవర్తనల్లోంచి  తీసుకుంటే ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది. 

        10. ఈ కథల్ని ఎండ్ సస్పెన్స్ తో  కాకుండా, సీన్ టుసీన్ సస్పెన్స్ తో చూపించాలి.
        11. పోలీస్ డిటెక్టివ్ కి నేరస్థుడెవరో (విలన్) తెలిసిపోయి, వాణ్ణి పట్టుకునే యాక్టివ్ - యాక్షన్ ప్రయత్నం వుండాలి.  
        12. అతి హింస కూడదు. యాక్షన్ థ్రిల్లర్ మాస్ మసాలా అయితే, పోలీస్ థ్రిల్లర్ క్లాస్ - మాస్ ఎంటర్ టైనర్.

            13. విలన్ని తెరపైకి తెచ్చి, పోలీస్ డిటెక్టివ్ తో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే ప్రారంభించాలి.
       
14. హత్య చుట్టూ కథ వుండాలి. ప్రధాన హత్యకి అనుబంధంగా మరికొన్ని హత్యలు వుండొచ్చు. 

        15. ఒక హత్య సినిమాకి సరిపోదు. కనీసం ఇంటర్వెల్ ముందు ఇంకో హత్య, సెకండాఫ్ లో ఇంకో హత్యా జరగాలి.
        16. హత్యలు ఆషామాషీగా వుండకూడదు. ప్రధాన హత్య యజమాని హత్యయితే
, అనుబంధ హత్య యజమాని ప్రియురాలిదై వుండాలి. ఇంకో అనుబంధ హత్యగా యజమాని భార్యని చంపెయ్యాలి. ఇలా తీవ్రత పెరగాలి. యజమాని హత్య తర్వాత పని వాణ్ణి, వాచ్ మన్ నీ చంపే తక్కువ స్థాయి హత్యలు కూడదు.
        17.
ఎంత బలమైన కారణమున్నా ఆ కారణంతో చంపుకుంటూ పోకూడదు. మనిషి ప్రాణాలకి విలువివ్వాలి. మనిషి ప్రాణాలెంత విలువైనవో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేయాలి.
        18. ఫ్లాష్ బ్యాకులు ఎక్కువైపోతే (మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్) ఇన్వెస్టిగేషన్ క్రోనాలజీ గజిబిజి అయిపోతుంది.
        19. కాన్ఫ్లిక్ట్ గాభరా పుట్టించేట్టు వుండాలి. హంతకుడి మోటివ్ లేదా ప్లానింగ్ అంత గుబులు పుట్టించాలి.
 
        20. పోలీస్ డిటెక్టివ్ హీరో తోబాటు,  హంతకుడికి, అంటే విలన్ కి కూడా ఓ క్యారక్టరైజేషన్ ఇవ్వాలి. ఈ క్యారక్టరైజేషన్స్ లో వేర్వేరు దృక్పథాల్నివ్వాలి. 
        21. కరుణ
, సానుభూతి, మానసిక చురుకుదనం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తి, నిబద్ధత, సమయానుకూల కాఠిన్యం, ఊహాశక్తి, కమ్యునికేషన్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, కామన్ సెన్స్, బలమైన నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవమూ  మొదలైనవి పోలీస్ డిటెక్టివ్ పాత్ర చిత్రణలో భాగమవ్వాలి.
        22. హంతకుడికీ పోలీస్ డిటెక్టివ్ కీ మధ్య సంఘర్షణ హోరాహోరీని శాస్త్రీయంగా చూపాలనుకుంటే
ది ఆర్ట్ ఆఫ్ వార్గ్రంథాన్ని ని పరిశీలించ వచ్చు.
        23. వాళ్ళ  పోరాటంలో ప్రేక్షకులు సఫరవాలి. ప్రేక్షకుల్ని
  వీలైనంత సఫర్ చేయాలి.
        24. . పాటలతో కామెడీలతో స్క్రీన్ స్పేస్ ని భర్తీ చేసే పని చేయకూడదు. యాక్షన్ తో కూడా భర్తీ చేయకూడదు. కథని కథతోనే నిలబెట్టాలి.
        25. అత్యుత్సాహానికి పోయి లెక్కలేనన్ని క్లూస్ ఇవ్వకూడదు, వాటిని పట్టుకుని కథని ఫాలోఅవడం కష్టమై పోతుంది.

       26. కథని టైం లాక్ తో కాకుండా, ఆప్షన్ లాక్ తో నడిపించాలి.
     
27. ఇన్వెస్టిగేషన్  ఆధారంగానే కేసు సాల్వ్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ మీదే ఫోకస్ చేసి, ఇన్వెస్టిగేషన్ తోనే థ్రిల్ చేసి, ఇన్వెస్టిగేషన్ కే పట్టం గట్టాలి.

        28. పోలీస్ డిటెక్టివ్ పాత్ర పూర్తిగా సీరియస్ గా  వుండనవసరం లేదు. కథలో వినోదాత్మక విలువకి కూడా చోటివ్వాలి. వీలైన చోటల్లా నవ్వించాలి
        29. పోలీస్ డిటెక్టివ్ పాత్ర మాస్ యాక్షన్ సినిమాల్లో రొటీన్ గా పోలీస్ పాత్రలా వుండ కూడదు. హంతకుడు కూడా అలాటి విలన్ కాకూడదు.
  

        30. ఇంటర్వెల్లో పోలీస్ డిటెక్టివ్ దెబ్బతినాలి, క్లయిమాక్స్ లో హంతకుడు దెబ్బ తినాలి.     
        31. హీరోయిన్ పాటల కోసం, ప్రేమల కోసం వుండ కూడదు. ఆమె డిపార్ట్ మెంట్ వ్యక్తి లేదా బాధితురాలు అయితే మంచిది.
       
32. డార్క్ మూవీలా కాకుండా, కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా చిత్రీకరణ జరపాలి.
***

14, ఏప్రిల్ 2020, మంగళవారం

928 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద - 6

     
      క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద వ్యాసాల్లో అక్కడక్కడ ప్రస్తావిస్తున్న జానర్ మర్యాదలు అన్నిటినీ కలిపి ఒక చోట లిస్టుగా ఇస్తే సౌకర్యంగా వుంటుందని కొందరు కోరారు. ఈ వ్యాసం ముగించాక ఆ పని చేద్దాం. ఈ జానర్ ని రియలిస్టిక్ రూపకల్పన కూడా చేసి యూత్ ఓరియెంటెడ్ గా చూపించొచ్చు. హిందీ ‘పింక్’ లో  కొందరు యూత్ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్నప్పుడు, ఒకడు తాప్సీతో మిస్ బిహేవ్ చేస్తే, ఆమె బాటిలెత్తి కొట్టేస్తుంది. ఇది హత్యాయత్నం కేసుకింద నమోదై ఆమె ఇరుక్కుంటుంది. ఇలా రియలిస్టిక్ గా అన్పించే -జీవితంలో సహజంగా జరిగిపోయే సంఘటనల్ని- యూత్ జీవితాల్లోంచి, ప్రవర్తనల్లోంచి  తీసుకుంటే ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది. తమిళ డబ్బింగ్ ‘16 - డి’ ఇలాంటిదే. తెలుగు ‘మత్తు వదలరా’ జానర్ వేరైనా యూత్ ప్రవర్తనే పాయింటు. మరొకటేమిటంటే, నేటి సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్ అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ యాస్పెక్ట్స్ తో కూడా ఈ జానర్ సినిమాలు తీసుకోవచ్చు. ప్రస్తుత కరోనా ముప్పువల్ల ఎకనమిక్స్ తో బాటు రోమాంటిక్స్ కీ పెద్ద సమస్య వచ్చి పడింది. లాక్ డౌన్ వల్ల  బాయ్ ఫ్రెండ్స్ - గర్ల్ ఫ్రెండ్స్ కలుసుకోలేక, షికార్లు తిరగలేక  నానా అవస్థలు పడుతున్నారు. రోమాన్సులు రోకలి బండలయ్యాయి. క్రిమినల్స్ ఆర్ధిక నేరాలు చేయలేక పాపం ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఏటా పోలీస్ స్టేషన్లలో మూడు కోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదవుతాయి. అంటే రోజుకి 80 వేలు. అలాంటిది ఇప్పుడు 80 కూడా నమోదు కావడం లేదు. దేశంలో ప్రతీరోజూ 377  మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక్కరు కూడా మరణించడం లేదు. 

       
క్రైం థ్రిల్లర్ జానర్ అతి హింసని ఒప్పుకోదు. హత్యా పరిశోధనలతో వుండే పోలీస్ క్రైం థ్రిల్లర్ వేరు, మాఫియా లేదా ఇతర క్రిమినల్ చర్యలతో వుండే యాక్షన్ థ్రిల్లర్ వేరు. యాక్షన్ థ్రిల్లర్ లో ఎంతైనా హింస వుండొచ్చు. ఘోరంగా నరుక్కోవచ్చు, కాల్చుకోవచ్చు, పేల్చుకోవచ్చు, చీల్చుకుని చెండాడుకో వచ్చు, రక్తాలు పారిస్తూ అరుపులు అరుచుకోవచ్చు. ఇవన్నీ పక్కనబెట్టి, పోలీస్ క్రైం థ్రిల్లర్ నీటుగా వుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ మాస్ మసాలా అయితే, పోలీస్ థ్రిల్లర్ క్లాస్ - మాస్ ఎంటర్ టైనర్. ఇందులో హింస మితిమీరితే అది ఇన్వెస్టిగేషన్ ని మింగేస్తుంది. అదికూడా యాక్షన్ థ్రిల్లరై పోతుంది తప్ప, క్రైం థ్రిల్లర్ అంటూ ట్రైలర్స్ వేసుకుని ప్రచారం చేసుకోవడానికుండదు. హింస ఎంత ఎక్కువైతే అంత తక్కువ క్రైం థ్రిల్లరవుతుంది. 

        ఈ సందర్భంగా ఒక హాలీవుడ్ రచయిత తను చేపట్టిన క్రైం థ్రిల్లర్ స్క్రిప్టు గురించి చెప్పుకొచ్చాడు...ఇందులో హంతకుడు 10 హత్యలు చేస్తాడు. రచయితగా తను ఈ 10 హత్యల్నీ చిత్రిస్తూ పోతే, కథ హింసాత్మకంగా మారిపోతుంది. అంటే కాస్సేపటికి ఈ చేస్తున్న హత్యలు బోరు కొట్టేస్తాయి కూడా ప్రేక్షకులకి. అందువల్ల తను ఇలా చేశాడు - హంతకుడు ఇప్పుడు కథలో మూడు హత్యలే చేసుకుపోతాడు. పోలీస్ డిటెక్టివ్ కి దర్యాప్తు క్రమంలో ఆ హంతకుడు గతంలో ఇంకో 7 హత్యలు చేశాడని తెలుస్తుంది. ఇలా 7 హత్యల్ని గతంలోకి సమాచార రూపంలో నెట్టేయడం వల్ల, లైవ్ గా చూపించే ప్రమాదం, బోరు తప్పాయి. 

        మర్డర్ తో సస్పెన్స్ వుండదంటాడు. మర్డర్ జరిగేందుకు అవకాశమున్న కిడ్నాప్ తో సస్పెన్స్ వుంటుందంటాడు. ప్రేక్షకుల్ని కథనుంచి ఎమోషనల్ గా దూరం చేయాలనుకుంటే, హత్య తర్వాత హత్య తర్వాత హత్య... హింసాత్మకంగా నింపెయ్యవచ్చంటాడు. ఎమోషన్ తోబాటు టెన్షన్ తో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయాలనుకుంటే, హింస తగ్గించి, జరగబోయే హత్యగురించి ఉత్కంఠ పెంచాలంటాడు. అత్యంత భయపెట్టే సినిమాల్లో అతి తక్కువ హింస వుంటుందని గుర్తు చేస్తాడు. 

       
క్రైం థ్రిల్లర్ లో చంపడానికి
      ఎంత బలమైన కారణమున్నా ఆ కారణంతో చంపుకుంటూ పోకూడదు. మనిషి ప్రాణాలకి విలువివ్వాలి. మనిషి ప్రాణాలెంత విలువైనవో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేయాలి. మనిషి ప్రాణాలే చీప్ అన్నట్టు చంపుకుపోతే, చీప్ అయినదానికి ప్రేక్షకులు ఫీల్ కారు. ఆ చంపడాల్ని కూడా కేర్ చెయ్యరు. మర్డర్ సీన్లు మార్కెట్ యాస్పెక్ట్ లేక వేస్ట్ అయిపోతాయి. ‘ఈక్వలైజర్ 2’ అనే మాఫియా యాక్షన్లో, దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా, హత్యా దృశ్యాల్లో వాణ్ణి చంపవద్దంటూ మనం తల్లడిల్లేంత  ఎమోషన్ని రగిలిస్తాడు.

        ఇక టెక్నికల్ గా చెప్పుకుంటే, క్రైం థ్రిల్లర్ డార్క్ మూవీ కాదు. దీన్ని డార్క్ మూడ్ క్రియేట్ అయ్యేలా బ్లూ లేదా బ్రౌన్ టింట్ ఇస్తూ డార్క్ లైటింగ్ తో చిత్రించడం పొరపాటు. క్రైం థ్రిల్లర్ బీభత్స భయానక రసం కాదు. బీభత్స రసానికి దేవత మహాకాలుడు. మహాకాలుడు ముదురు నీలం. ఈ రంగు హార్రర్ కి, వయొలెంట్ మూవీస్ కి సరిపోతుంది. క్రైం థ్రిల్లర్ అద్భుత రసం. అద్భుత రసానికి దేవత బ్రహ్మ. బ్రహ్మ పసుపు వర్ణం. అద్భుత రసం వర్ణం పసుపు. కాబట్టి క్రైం థ్రిల్లర్ ని కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా చిత్రీకరించాల్సి వుంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలు అద్భుతరసంతో కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా, యూనివర్సల్ ఎంటర్ టైనర్లుగా వుంటున్నవి కాస్తా, ఇటీవల అతి హింసతో పిల్లలు చూడలేని విధంగా వుంటున్నాయని విమర్శలొస్తున్నాయి. ఇదే రసమో అర్ధంకాని వేషమైపోయింది. 


        క్రైం థ్రిల్లర్ అన్నాక ఇన్వెస్టిగేషన్ - ఆధారంగానే కేసు సాల్వ్ అవ్వాలి. ప్రేక్షకులు ఇన్వెస్టిగేషన్ మీదే ఫోకస్ అయి వుండి, ఇన్వెస్టిగేషన్ తోనే థ్రిల్లవుతూ వుండి, ఇన్వెస్టిగేషన్ కే జేజేలు పలికేట్టు చేయడమే మేకర్ ప్రధాన కర్తవ్యం కావాలి. బయటికొచ్చిన ప్రేక్షకుడు - భలే వుంది ఇన్వెస్టిగేషన్ - అని ఛానెల్ మైకులో పబ్లిక్ టాక్ చెప్పేటట్టు వుండాలి. 

       ఇవన్నీ మిడిల్ కథనంలో- 
    పాటించవలసిన సంగతులు... క్రైం థ్రిల్లర్ కథనం సీన్ టు సీన్ సస్పెన్స్ తో వుంటుందని చెప్పుకున్నాం. హంతకుడెవరో ప్రేక్షకులకి ఓపెన్ చేసి, తర్వాత పోలీస్ డిటెక్టివ్ హీరోకి హంతకుణ్ణి ఓపెన్ చేసి - ఇక వాడినెలా పట్టుకుంటాడన్న సస్పెన్స్ తో సీన్లు నడిపించడం. ఈ బాపతు థ్రిల్లర్ కాన్ఫ్లిక్ట్ ఎంత గాభరా పుట్టించేట్టు వుంటే అంత సక్సెస్ అవుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్ లో హంతకుడి మోటివ్ లేదా ప్లానింగ్ అంత గుబులు పుట్టించాలి. ఈ కాన్ఫ్లిక్ట్ తెలిసి ప్రేక్షకులు బిక్కచచ్చిపోయి కుర్చీకి అతుక్కుపోవాలి. ఇందుకే క్రియేటివ్ పార్టు రాయడం అత్యంత కష్టమైన వ్యవహారమని గత వ్యాసంలో చెప్పుకున్నది. హంతకుడనే వాడు పోలీస్ డిటెక్టివ్ హీరోకి కి ముత్తాత అన్పించాలి. తను చేయబోయే మర్డర్ ప్రపంచం దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటుందని హంతక వెధవ అన్నాడనుకుందాం...లేదా - నీ బాడీ పార్టు లాగి నువ్వూహించని ట్విస్టు ఇస్తానని పోలీస్ డిటెక్టివ్ కి వార్నింగ్ ఇచ్చాడనుకుందాం, ఇలాటివి కాన్ఫ్లిక్ట్ ని టైం బాంబుగా మార్చేస్తాయి. 

        పోలీస్ డిటెక్టివ్ హీరోకి ఎలాగూ ఒక క్యారక్టరైజేషన్ ఇస్తారు. హంతకుడికి, అంటే విలన్ కి కూడా ఓ క్యారక్టరైజేషన్ ఇవ్వాలి. ఈ క్యారక్టరైజేషన్స్ లో వేర్వేరు దృక్పథాల్నివ్వాలి. పోలీస్ డిటెక్టివ్ హీరోకి - నేరస్థులు నేరాలతో శాంతిభద్రతల సమస్య కాదు, పారిశుధ్య సమస్య సృష్టిస్తున్నారనీ, నేరాలు చేసి నేరస్థలాన్ని చంఢాలంగా వదిలేసి పోతున్నారనీ, ఆ వెధవల్ని పట్టుకుని ఆ రక్తం, ఆ చెత్త, ఆ కంపు తన్ని క్లీన్ చేయించాలన్న దృక్పథం ఇచ్చామనుకుందాం - అప్పుడు హంతకుణ్ణి అపరిశుభ్రత ఏమాత్రం సహించని, పరమ నీట్ నెస్ ని కోరుకునే నీటుగాడి దృక్పథంతో చూపిస్తే, కాన్ఫ్లిక్ట్ కి ఈ వ్యక్తిత్వాల వైరుధ్యం కూడా జతపడి ఇంకింత ఆసక్తి కల్గిస్తుంది.   

        కథని టైం లాక్ తో కాకుండా, ఆప్షన్ లాక్ తో నడిపిస్తే ఇన్వెస్టిగేషన్ బతుకుతుంది. యాక్షన్ థ్రిల్లర్ ని టైం లాక్ తో చూపించ వచ్చు. లేదా 
 ‘మనసే మందిరం’ లాంటి ఫ్యామిలీ డ్రామాలో చూపించవచ్చు. 60 నిమిషాల్లో ఏదో జరగబోతోందని, ఆలోగా దాన్ని నివారించాలనీ, గడియారం ముల్లు చూపిస్తూ కథనాన్ని టెన్షన్ తో పరుగులు తీయించవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన క్రైం థ్రిల్లర్ లో ఇలా చేస్తే ఇన్వెస్టిగేషన్ కి చోటుండదు, యాక్షన్ ఆక్రమించేస్తుంది. జానర్ మర్యాద చెడుతుంది.

        
కౌంట్ డౌన్లూ, డెడ్ లైన్లూ- 
      అవసరమనుకుంటే ఇన్వెస్టిగేషనంతా పూర్తయ్యాక క్లయిమాక్స్ లో పెట్టుకోవచ్చు. క్లయిమాక్స్ లో హంతకుడితో టైం లాక్ యాక్షన్ నడిపించవచ్చు. అసలు ఈ జానర్ కథకి టైం లాక్ అనేది లేకుండా, కాలపరిమితి లేని ఆప్షన్ లాక్ తో ఫ్రీగా వదిలేస్తేనే హాయి.  

     కరుణ, సానుభూతి, మానసిక చురుకుదనం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తి, నిబద్ధత, సమయానుకూల కాఠిన్యం, ఊహాశక్తి, కమ్యునికేషన్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, కామన్ సెన్స్, బలమైన నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవమూ  మొదలైనవి పోలీస్ డిటెక్టివ్ పాత్ర చిత్రణలో భాగమవ్వాలి.

        ఈ మిడిల్ విభాగంలో జరిగే బిజినెస్ ప్రకారం హంతకుడికీ పోలీస్ డిటెక్టివ్ కీ మధ్య వుండే యాక్షన్ - రియాక్షన్ల (సంఘర్షణ) కథనంలో హోరాహోరీని శాస్త్రీయంగా చూపాలనుకుంటే ఒకపని చెయ్యొచ్చు : 2500 ఏళ్ల క్రితం చైనీస్ సైనిక జనరల్, యుద్ధ వ్యూహ కర్త సుంజీ రాసిన సుప్రసిద్ధ గ్రంథం, ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ ని పరిశీలించ వచ్చు. ఇందులో పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ మధ్య పోరాటంలో కావాల్సిన అనేక టిప్స్ దొరుకుతాయి. పీడీఎఫ్ లింక్ వ్యాసం చివర వుంది. ఆసక్తి వుంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.   హంతకుడితో పోరాటంలో పోలీస్ డిటెక్టివ్ సమయానుకూలంగా పాసివ్ అవచ్చు (“He will win who knows when to fight and when not to fight.అంటాడు సుంజీ, The best way to fight is not to fight at all.అని కూడా అంటాడు. మనం మనకి తోచింది, వూహించి ఏవో అర్ధంలేని పోరాటాలు రాసేకన్నా, అసలు యుద్ధ కళేమిటో తెలుసుకుని చిత్రిస్తే బావుండొచ్చు). 

       స్క్రిప్టు రాయడం రోజుల్లో పూర్తయ్యే పనికాదు. కథలో ఎక్కడ దేనికి ఏది అవసరమో నిత్యం కథని ప్లాన్ చేసేప్పుడు గుర్తిస్తూ, ఆ మేరకు సమాచారం పొంది -రీసెర్చి చేసి, కథలో చిత్రణ చేసుకోవాలి. సినిమాలు చూసి మనకే అంతా తెలుసనీ రాసెయ్యకూడదు. ఆ సినిమాలు అలా తీయడానికి తెరవెనుక ఏం రీసెర్చి చేశారో, ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో ఎవరికి తెలుసు. డిస్కషన్స్ లో తేలిక భావం కన్పిస్తూంటుంది. కారణం ఇవ్వాళా అరచేతిలో ప్రపంచ సినిమాలన్నీ వుండడంతో - ఆ సినిమాల సీన్లు షాట్లు మనసులో ఫిక్స్ అయిపోయి, ఇతరులేంటి చెప్పేదని డిస్కషన్స్ ని బేఖాతరు చేస్తున్న సంస్కృతి కన్పిస్తోంది. చూసిన సినిమాల్లోంచి షాట్లు సీన్లు ఆ పళంగా తెచ్చి పెట్టుకోలేరు. అవి ఏ సందర్భంగా ఏ సన్నివేశానికి ఏ ఉద్దేశంతో సృష్టించారో తెలుసుకోకుండా కాపీ కొట్టుకోలేరు. నీ బిడ్డని నువ్వే పుట్టించగలవ్, ఇతరుల వీర్యదానంతో కాదు. 

        పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ- 
      మధ్య పోరాటంలో ప్రేక్షకులు సఫరవాలి. ప్రేక్షకుల్ని  వీలైనంత సఫర్ చేయాలంటాడు హిచ్ కాక్. ఐతే పోలీస్ డిటెక్టివ్ పూర్తిగా సీరియస్ గా  వుండనవసరం లేదు. కథలో వినోదాత్మక విలువకి కూడా చోటివ్వాలి. వీలైన చోటల్లా నవ్వించాలి. ఫన్నీ పోలీస్ క్యారక్టరైనా ఫర్వాలేదు, ఒక పార్శ్వంలో హంతకుడి చేతిలో అతడి సఫరింగ్ ని చూపిస్తూనే. ఫన్నీ పోలీస్ క్యారక్టర్ కి పీటర్ సెల్లర్స్ నటించిన ‘పింక్ పాంథర్’ సిరీస్ సినిమాలు చూస్తే  ఒక ఐడియా వస్తుంది. ఈ సిరీస్ లో అతను తెలివితక్కువ ఇన్స్ పెక్టర్ జాక్స్ క్లూసో గా ఎంటర్ టైన్ చేస్తాడు. పోలీస్ డిటెక్టివ్ పాత్ర మాస్ యాక్షన్ సినిమాల్లో పోలీస్ పాత్రలా వుండ కూడదని ఎలా అనుకున్నామో, హంతకుడు కూడా అలాటి విలన్ కాకూడదు.  

        కథనంలో డైనమిక్స్ ముఖ్యం. ఒకటనుకుంటే ఇంకోటి జరగడం. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో బాంబుని నిర్వీర్యం చేయడానికి వెళ్ళారనుకుందాం. అప్పుడు బాంబుని నిర్వీర్యం చేస్తూంటే అకస్మాత్తుగా భూకంపం రావడం లాంటిది. అనూహ్య సంఘటనలతో కథనం చేస్తే చైతన్య వంతంగా వుంటుంది కథ.

        క్రైం థ్రిల్లర్ కథ నిర్వహించలేక పాటలతో కామెడీలతో స్క్రీన్ స్పేస్ ని భర్తీ చేసే పని చేయకూడదు. యాక్షన్ తో కూడా భర్తీ చేయకూడదు. యాక్షన్ కూర్చోబెట్టే సస్పెన్స్ కాదు. అది పే ఆఫ్. సస్పెన్స్ సెటప్. ఆయా సీన్లలో సస్పెన్స్ ని సెటప్ చేసినప్పుడు, ఇప్పుడేం జరుగుతుందా అని ఎదురు చూస్తారు ప్రేక్షకులు. ఆ సస్పెన్స్ కి ఇప్పుడేం జరగాలా అని ఆలోచించకుండా, రివర్స్ లో ఇంకేం జరిపించాలా అని ఆలోచించాలి. పైన చెప్పుకున్నట్టు, బాంబు తీసేయబోతే భూకంపం వచ్చినట్టు. 

        బేసిగ్గా చెప్పుకోవాలంటే, కథలనేవి సంఘటనలకి సమాచార రిపోర్టింగులు కావు. కథలనేవి మార్పుని చూపించేటివి. ఒక సిట్యుయేషన్, ఒక పాత్ర, లేదా పాత్రల మధ్య సంబంధాలు ఎలా మార్పుకి లొనయ్యాయో చూపించేవే కథలు. కనుక సస్పెన్స్ కథనం మార్పు ని దృష్టిలో పెట్టుకుని సాగాలి. అప్పుడే కథ డైనమిక్ గా వస్తుంది. 

        మామూలుగా కథనమంటే ఏమిటి - 
    ఒక సీన్లో ఒక ప్రశ్న విసిరి, ఇంకో సీన్లో దానికి జవాబు చెప్పడమేగా? ప్రశ్నలు జవాబులేగా కథనమంటే? ప్రతీ సీనూ ప్రేక్షకులకి చేస్తున్న ఒక వాగ్దానం కావాలి. హీరోయిన్ అందాల్ని తెరనిండా చూపిస్తూంటే, ఇది దేనికో లీడ్ కావాలి తప్ప, కేవలం యూత్ అప్పీల్ కోసమని వృధా చేయకూడదు. ఈ జానర్లో ప్రతీ సీనూ ఆడిటింగ్ జరుగుతుంది. ప్రతీ సీనూ సస్పెన్స్ కి లింకై వుంటుంది. వృధాగా వుండదు. 

        ఇక ఇంటర్వెల్, క్లయిమాక్సులు. ఇంటర్వెల్లో పోలీస్ డిటెక్టివా - హంతకుడా -ఎవరు ట్విస్ట్ ఇవ్వాలి? ఇలాటి జానర్ కథలో పరీక్షకి గురయ్యేది పోలీస్ డిటెక్టివ్, పరీక్షపెట్టేది హంతకుడు. పోలీస్ డిటెక్టివ్ స్కిల్స్ కి పరీక్ష. ఇలాటి కథని పోలీస్ యంత్రాంగపు పనితీరుకి మోడల్ గా చూపిస్తాం. హంతకుల పనితీరుకి మోడల్ గా హంతకులకి చూపించం. అందుకని ప్రేక్షకులు పోలీస్ డిటెక్టివ్ హీరోనే ఫాలో అయ్యేలా పరీక్షలన్నీ అతడికే వుంటాయి. ఇంటర్వెల్లో అతనే పెద్ద దెబ్బ తింటాడు హంతకుడి చేతిలో. క్లయిమాక్స్ లో పోలీస్ డిటెక్టివ్ హీరో దెబ్బకి, హంతకుడు పుంజాలు తెంపుకుని పారిపోతూ వుంటాడు, దట్సాల్.

        ఈ జానర్ సినిమాలు హాలీవుడ్ లోలాగా పెద్ద హీరోలు చెయ్యరు. చిన్న హీరోల మీద ఆధారపడాలి. చిన్న హీరోలతో ఈ జానర్ కి మైలేజీ సంబంధమైన లోటు లుంటాయి. దీన్ని క్రియేటివ్ యాస్పెక్ట్ ని మరికొంత విస్తరించుకుని సరిచేసుకోవాలి. ప్రేక్షకులు సినిమా సాంతం అదే చిన్న హీరో మొహం, అదే హంతకుడి మొహం చూస్తూ కూర్చోలేరన్పిస్తే, క్లయిమాక్స్ లో ఈలలు పడేలా ఇంకో పెద్ద నోటెడ్ విలన్ ఆర్టిస్టుని అదనంగా దిగుమతి చేసుకోవాలి. లేదా ఇతర సీన్లలో బడ్జెట్ మిగుల్చుకుని క్లయిమాక్స్ లో బిగ్ యాక్షన్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇలాటి క్రియేటివ్ యాస్పెక్టులు అన్వేషించుకోవాలి. క్రియేటివ్ స్టేజి అంటే ఒకసారి రాసేసేది కాదు. రాస్తూ రాస్తూ రాస్తూ తిరగ రాస్తూ గీస్తూ పూస్తూ వుండేది. 


   ఈ జానర్ కథ పది నిమిషాల్లో వినిపించడాని కుండదు. పది నిమిషాల్లో ప్రేమ కథనో, యాక్షన్ కథనో విన్పించ వచ్చు. ఇలాటి ఇన్వెస్టిగేషన్ ఆధారిత క్రైం థ్రిల్లర్ విన్పించాలంటే పది నిమిషాల్లో విషయమేమీ వుండదు. కనీసం అరగంటైనా పడుతుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ అని ఏదో పదం వాడేస్తూంటారు కదా, అలాటి స్క్రీ ప్లే బేస్డ్ జాతికి చెందుతుంది ఈ క్రైం థ్రిల్లర్ గొడవ. అంటే కథనం చెప్పుకుంటూ పోతే తప్ప అర్ధమవడం కష్టమన్న మాట. ఈ కథనాన్ని అరగంట లోపు కుదించడం సాధ్యం కాదు. ఒక అసోసియేట్ వున్నాడు. రెండేళ్ళుగా ఇలాటి కథని విన్పించీ విన్పించీ - వెనుక నుంచి ముందుకూ, ముందు నుంచి వెనక్కీ, ఎలాపడితే అలా - ఎప్పుడు పడీ అప్పుడు - ఎంత సేపంటే అంత సేపూ -విన్పించే స్థితి కొచ్చాడు. 

        కథ రాసేశాక క్రాస్ చెకింగ్ చేసుకోకుండా హీరోకో నిర్మాతకో విన్పించ కూడదు. ఒకవేళ అది లోపరహితంగా వుండి ఓకే అయితే ఫర్వాలేదు. లోపాలుంటే మాత్రం ఇరుక్కుని పోతారు. వాళ్ళు ఓకే చేశాక క్రాస్ చెకింగ్ మొదలు పెట్టుకుంటే, అప్పుడు లోపాలు బయట పెడితే, వాటిని మార్చడానికి వాళ్ళు అంగీకరించక పోతే (అవి లోపాలని తెలీక), ఇంకేం చెయ్యడానికి వీలుండదు. కాబట్టి ముందే క్రాస్ చెకింగ్ చేయించుకుని, పూర్తి సంతృప్తి కలిగాకే విన్పించాలి.   

(ఐపోయింది) 
సికిందర్
The Art Of War, pdf

12, ఏప్రిల్ 2020, ఆదివారం

927 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద - 5


     క్రైం థ్రిల్లర్ కథలతో వుండే సౌలభ్యం ఏమిటంటే ఇవి రాయడానికి హత్య చేసి చూడాల్సిన అవసరం లేదు. కనీసం ఒక  హత్యకి గురైన శవం చూసిన అనుభవం వుండాల్సిన అవసరం కూడా లేదు. పోలీసుల్ని తోసుకుంటూ వెళ్లి  మర్డర్ సీన్ ని కళ్ళారా చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమ కథలు రాయాలంటే, కుటుంబ కథలు రాయాలంటే ఎంతో కొంత జీవితానుభవం వుండాలేమో. క్రైం థ్రిల్లర్ కథలు రాయడానికి జీవితానుభవం కోసం ప్రయత్నిస్తే జైల్లో వుంటారు. అక్కడ తోటి కిల్లర్స్ ఆటలు పట్టిస్తారు. కామెడీ అయిపోతుంది కెరీర్. కనుక  ఎంత కొత్త రైటరైనా, మేకరైనా రియల్ లైఫ్ అనుభవం లేకుండా మర్డర్ల సినిమాలు శుభ్రంగా రాసుకోవచ్చు, తీసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతీ క్రైం థ్రిల్లర్ రచయితా / దర్శకుడూ ఈ అనుభవం లేకుండా రాసిన వాడే / తీసిన వాడే. కాబట్టి ఈ జానర్లోకి వచ్చే కొత్త రైటర్లు, మేకర్లు అధైర్య పడాల్సిన పని లేదు. రాయడానికీ తీయడానికీ తమకేం తెలుసని గాకుండా, ఏం రాస్తున్నారో, ఎలా తీస్తున్నారో చెక్ చేసుకుంటే చాలు...

        త వ్యాసం ‘క్రైం థ్రిల్లర్ రాయడమెలా?’ లో (వ్యాసం కింద లింక్ ఇచ్చాం), శాంపిల్ కథలో హత్యతో క్రైం సీన్ ని స్థాపించడం గురించి తెలుసుకున్నాక, ఇప్పుడు దాని తాలూకు ఇన్వెస్టిగేషన్ కథనం ఎలా వుంటుందో చూద్దాం. ఇతర అన్ని జానర్లకి వుండే స్ట్రక్చరే దీనికీ వుంటుంది. బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల్లో అవే బిజినెస్సులుంటాయి. బిగినింగ్ లో కథ తాలూకు సెటప్, మిడిల్లో సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం వుంటాయి. ప్లాట్ పాయింట్ వన్ సమస్యని ఏర్పాటు చేస్తే, ప్లాట్ పాయింట్ టూ ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇప్పుడు శాంపిల్ కథలో హత్యతో వివరించుకున్న క్రైం సీన్ అనేది బిగినింగ్ తాలూకు సెటప్ వల్ల వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ సీను. అంటే సమస్య ఏర్పాటు. అంటే పోలీస్ డిటెక్టివ్ హీరోకి గోల్ ఏర్పాటు. హంతకుణ్ణి పట్టుకోవాల్సిన గోల్ ఏర్పాటు.


      దీంతో మిడిల్ విభాగం మొదలవుతుంది. మిడిల్ విభాగమంటే గోల్ కోసం సంఘర్షణ గనుక, ఆ సంఘర్షణ పోలీస్ డిటెక్టివ్ కి హంతకుడి (విలన్) తో వుంటుంది. ఈ సంఘర్షణ ప్లాట్ పాయింట్ టూ వరకూ కొనసాగి, అంతిమంగా పోలీస్ డిటెక్టివ్ కి అక్కడొక పరిష్కార మార్గం లభించి, ఎండ్ విభాగం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫైనల్ గా హంతకుణ్ణి పట్టుకుంటాడు. ఇంతకి మించి బేస్ స్ట్రక్చర్ ఇంకేమీ లేదు. 

        ఈ బేస్ స్ట్రక్చర్ మీద కథనంతో చేసే క్రియేటివిటీయే కథకి రక్తమాంసాలు సమకూర్చి పెడుతుంది. అంటే ముందుగా బేస్ స్ట్రక్చర్ లో కథని రేఖామాత్రంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఐడియాతో మొదలెట్టాలి. ఇక్కడ చెప్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ రేఖామాత్రమైన బేస్ స్ట్రక్చర్ చేసుకుంటే, ఇంకే అనుమానాలూ వేధించవు. ముందుగా ఐడియా ని వర్కౌట్ చేసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే, పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి, చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు - అని ఒక ఐడియా ఏదో తట్టిందనుకుందాం - ఈ ఐడియాలో స్ట్రక్చర్ వుండేట్టు చూసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే (బిగినింగ్), పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి (మిడిల్), చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు (ఎండ్) - స్ట్రక్చర్ వచ్చేసింది. బిజినెస్ మాన్ హత్య ప్లాట్ పాయింట్ వన్ సీను, చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించడం ప్లాట్ పాయింట్ టూ సీను - స్ట్రక్చర్ వచ్చేసింది. 

       
ఇప్పుడు స్క్రీన్ ప్లేకి రెండు మూలస్థంభాల్లాంటి ఈ రెండు ప్లాట్ పాయింట్ సీన్లని దగ్గర పెట్టుకుని, వీటి మధ్య రేఖామాత్రపు మిడిల్ కథ నల్లుకోవాలి. అల్లుకున్నతర్వాత, ఇక రేఖామాత్రపు మిడిల్ కథకి, క్రియేటివిటీకి పని పెడుతూ పూర్తి స్థాయి ఆర్డర్ (సీన్లు) వేసుకుంటూ పోవాలి. ఆర్డర్ వేసుకున్నాక, ఆర్డర్ లో వున్న సీన్లని విస్తరిస్తూ, క్రియేటివిటీని తారాస్థాయికి తీసికెళ్తూ ట్రీట్ మెంట్ రాసుకుంటూ పోవాలి. ట్రీట్ మెంట్ రాసుకున్నాక క్రియేటివ్ సత్తువ కొద్దీ, డైలాగ్ వెర్షన్ కూడా రాసి స్క్రిప్టు ముగించెయ్యాలి. ఇప్పుడు రక్తమాంసాలతో షూటింగుకి రెడీ. 

        ఇంత సులభమా? కాదు. క్రియేటివ్ దశ కొచ్చేసరికి వుంటుంది అసలు సంగతి. రాత్రింబవళ్ళు మతిచెడే పరిస్థితి. క్రియేటివ్ దశలోనే జానర్ మర్యాదలుంటాయి, క్రియేటివ్ దశలోనే సస్పెన్స్, టెంపో నిర్వహణ వస్తాయి, క్రియేటివ్ దశలోనే అన్నినేర పరిశోధనా పద్ధతుల అమలూ వుంటుంది. క్రియేటివ్ దశలోనే...ఈ కింద చెప్పుకునే చాలా వుంటాయి- 

        ఈ సందర్భంగా రెండు సినాప్సిస్ లు అందాయి. ఈ క్రైం థ్రిల్లర్స్ లో ఏం రాశారంటే, ఒక హత్యతోనే కథంతా రాశారు. ఒక హత్య సినిమాకి సరిపోదు. కనీసం ఇంటర్వెల్ ముందు ఇంకో హత్య, సెకండాఫ్ లో ఇంకో హత్యా జరిగితే గానీ సినిమా అనే రెండు గంటల వ్యవహారం మాట వినదు. ఇలాంటి క్రియేటివిటీలు తెలుసుకోవాలి. పైన ఉదాహరణకి చెప్పుకున్న ఐడియా ఒకే హత్యతో వుందంటే, పాయింటు ఒక హత్యతోనే వుంటుంది. ఐడియాని విస్తరించినప్పుడు కథనంలో మరికొన్ని హత్యలు వస్తాయి. ఆ హత్యలు కూడా ఆషామాషీగా వుండకూడదు. ప్రధాన హత్య యజమాని హత్యయితే, అనుబంధ హత్య యజమాని ప్రియురాలిదై వుండాలి. ఇంకో అనుబంధ హత్యగా చూసి చూసి యజమాని భార్యని చంపెయ్యాలి. ఇలా తీవ్రత పెరగాలి. అంతేగానీ యజమాని హత్య తర్వాత పని వాణ్ణి, వాచ్ మన్ నీ చంపుకుంటూ కూర్చుంటే సినిమా ససేమిరా అంటుంది. 

       
ఇక్కడ అర్ధమవడం కోసం - 
     బిగినింగ్ - మిడిల్ -ఎండ్ వరస క్రమంలో లీనియర్ కథనమే చూస్తున్నాం. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ కథ నాన్ లీనియర్ గానూ వుండొచ్చు. అంటే ఫ్లాష్ బ్యాక్స్ తో వుండొచ్చు. ఫ్లాష్ బ్యాకులు ఎక్కువైపోతే (మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్) ఇన్వెస్టిగేషన్ క్రోనాలజీ గజిబిజి అయిపోతుంది, ప్రేక్షకులు ఫాలో అవడం కష్టమైపోతుంది. ప్రేక్షకులు ఫాలో అవడం కష్టంగా వుందంటే, ఆ కథనం విఫలమైనట్టే. ఆ కథనం జానర్ మర్యాద తప్పినట్టే. క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల్లో ప్రేక్షకుల హర్మోన్ల ప్రేరేపణ కూడా ఒకటి. 


        గత వ్యాసాల్లో పేర్కొన్న క్రైం రచయితల సలహాదారైన మాజీ పోలీస్ డిటెక్టివ్ గేరీ రాడ్జర్స్ ఇంకేమంటున్నాడంటే, స్టోరీ సైన్స్ ని అర్ధం జేసుకోమంటున్నాడు. క్రైం థ్రిల్లర్లు చదివే పాఠకులు ఎందుకు విడువకుండా రాత్రంతా మేల్కొని చదువుతారు? (తెలుగు డిటెక్టివ్ నవలలు గంట రెండు గంటల్లో ఏకబిగిన చదివేసే పాఠకులుండే వాళ్ళు). ఆ రచయితలు  ప్రయోగించే పదాలు అలా వుంటాయి. ఆ పదాలకి మెదడులో ఎండార్ఫిన్లు విడుదలవుతాయంటున్నాడు గేరీ. ఇక ఆ పుస్తకం విడిచిపెట్ట లేరు. అదన్నమాట సంగతి. దీనికి సంబంధించి లీసా క్రాన్ రాసిన పుస్తకాన్ని సిఫార్సు చేశాడు (ఈ పుస్తకం కొనలేం గానీ, ఆవిడ వెబ్సైట్ లింక్ వ్యాసం చివర ఇస్తున్నాం. ఇందులో ఆవిడ స్టోరీ సైన్స్ గురించి విస్తృత సమాచారం పొందుపర్చింది). 

        అంటే మెదడులో ఎండార్ఫిన్లు పిచికారీ కొట్టినట్టు విడుదలవుతూ వుండాలంటే వెండితెర మీద కథనం ముందుకు పరిగెడుతూ వుండాలన్న మాట. ఆ కథనంలో క్షణం క్షణం థ్రిల్లో సస్పెన్సో వుండాలి. అలా ముందుకు పరిగెడుతున్న కథనం ఆగి, వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకులేసుకుందా, ఇక మెదడులో ఎండార్ఫిన్ల స్రావం ఆగిపోతుంది. వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకుల్ని అర్ధం జేసుకోవడానికి మెదడు బిజీ అవడంవల్ల ఎండార్ఫిన్లని విడుదల చేయదు. ముందుకు పరిగెడుతున్న కథనం ఒకసారి ఆగి ఫ్లాష్ బ్యాక్ వచ్చినా, లేదా ముందుకు పరిగెడుతున్న కథనం పదేపదే ఆగుతూ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చినా, ఎండార్ఫిన్లు విడుదల కానే కావు. ఎందుకిలా? ఫ్లాష్ బ్యాకుల్లో వుండేది కథ కాదు. నడుస్తున్న కథకి పూర్వ సమాచారం మాత్రమే. ఫ్లాష్ బ్యాకులతో వుండే సినిమా అంతా కథ కాదు. ఫ్లాష్ బ్యాకులు తీసేస్తే మిగిలుండేదే కథ. ఫ్లాష్ బ్యాకుల వల్ల ఎంత కథ కోల్పోతారో దీన్నిబట్టి అర్ధంజేసుకోవాలి. ఇలా ఫ్లాష్ బ్యాక్ అంటే సమాచారమే గనుక, సమాచారం కథకాదు గనుక, కథ కాని దానికి ఎండార్ఫిన్ల తోడ్పాటు వుండదు. హార్మోన్లు రిలాక్స్ అయిపోతాయి. ఈ సైన్స్ ని అర్ధం జేసుకోవాలి. 

        లీనియర్ స్క్రీన్ ప్లేలని చూస్తే, ఈ సైన్స్ ఆధారంగానే క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ అనే రెండు స్క్రిప్టింగ్ టూల్స్ ఏర్పాటైనట్టు గమనించగలం. ఇవి లీనియర్ స్క్రీన్ ప్లేలకే వుంటాయని సినిమాల్ని చూసి కనుగొన్నారు పండితులు. ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలకి వుండవు. వీటిని బోధించడం కూడా లీనియర్ స్క్రీన్ ప్లేలకే భోదిస్తారు. కథనం ఫ్లాష్ బ్యాకుల వల్ల వెనక్కీ ముందుకూ అవుతునప్పుడు, మనం హీరో క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) గానీ, కథనంలో కాలంతో అనులోమంగా వుండే టెన్షన్ ని గానీ ఫీల్ కాం. ఈ రెండు టూల్స్ ని ఫ్లాష్ బ్యాక్స్ రహిత ఎడతెగని కథనం వున్నప్పుడే ఫీలవుతాం, థ్రిల్లవుతాం.. 

        అసలీ ఫ్లాష్ బ్యాకుల ఫ్యాషనేంటి, లీనియర్ కథనంతో చక్కటి క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్ చూపించకుండా. 84 యాక్షన్ సినిమాలు తీసిన రాం గోపాల్ వర్మ, ఒక్కటి కూడా ఫ్లాష్ బ్యాక్స్ తో తీయలేదు. 

 
       క్రైం థ్రిల్లర్ మిడిల్ కథనం క్రియేటివిటీ గురించి ఇంకా చెప్పుకుంటే - గేరీ రాడ్జర్స్ ఏమని సలహా ఇస్తాడంటే, మూస లోంచి బయటికి రావాలంటాడు. ఇంకా ఈ కాలంలో అవే పోస్ట్ మార్టం, టాక్సికాలజీ, బాలస్టిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ అంటూ అక్కడే ఆగిపోకుండా, వీటితో బాటూ - డీఎన్ఏ, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, వైర్ టాప్స్, రూంబగ్స్, పాలీగ్రాఫ్, అండర్ కవర్ ఆపరేటర్స్, హిప్నాసిస్, సైకలాజికల్ ప్రొఫైలింగ్, కంప్యూటర్ ఎనలైజింగ్, శాటిలైట్ సర్వేలెన్స్, ఎంటమాలజీ మొదలైనవి కూడా అవసరాన్నిబట్టి కథలోకి తీసుకోవాలంటాడు. 

(మిగతా రేపు)

సికిందర్