రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, డిసెంబర్ 2020, ఆదివారం

 

ఛోటా కె. నాయుడు 

సాంకేతిక ఔన్నత్యం ఆత్మిక దాహాన్ని కూడా తీర్చగలిగే సాధనమైనప్పుడు, ఒక ‘అవతార్’ లా, ఇంకో ‘రోబో’ లా కాసుల కుంభవృష్టి కూడా కురుస్తుంది. పౌరాణిక ఛాయలున్న సమకాలీన పాత్రలే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చగల్గుతాయని ఎప్పుడో రుజువైంది. ఇలా ఆత్మిక దాహాన్ని తీర్చిన నాటి ‘మేజర్ చంద్రకాంత్’,  ‘కొండవీటి సింహం’ లాంటివి ఇప్పుడు తీస్తే, ఇంకింత భారీస్థాయిలో అత్యాధునిక సాంకేతిక హంగులన్నీ కలుపుకుని అదరగొట్టేట్టు వుండాలని నవతరపు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

          దీన్ని కరెక్టుగా గుర్తించారు సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు. ఏ వెండితెర మీద దృశ్యం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందో, అదింకా కాస్సేపుంటే బావుండన్పిస్తుందో, ఆ దృశ్యంలోని ప్రతీ అంశం తేటగా కళకళ లాడుతూ వుంటుందో, ఆ దృశ్యకారుడి పేరే  ఛోటా కె. నాయుడు. ఆయన చేతిలో కెమెరా ఓ మంత్ర దండం లాంటిది. ఈ రంగుల మంత్రదండపు మాయాజల్లులో తడిసి తరించని సూపర్ స్టార్ లేరు.  ఆ స్టార్స్ కి దాసోహం కాని ప్రేక్షకులూ లేరు...  ‘అడ్వాన్స్ అయిపోయారు ప్రేక్షకులు!’ అని కామెంట్ చేశారాయన. ‘ ప్రేక్షకుల కోసం ఇప్పుడింకెలా తీస్తే సక్సెస్ అవుతామో సరిగ్గా ఊహించి, రిస్కు చేసి, ఒక ‘అవతార్’ నీ, ఇంకో ‘రోబో’నీ తీశారు ప్రసిద్ధ దర్శకులు జేమ్స్ కామెరూన్, ఎన్. శంకర్ లు. డిస్కవరీ ఛానెళ్ళల్లో, ఇతర మీడియాల్లో ఎన్నోఆశ్చర్య గొలిపే ప్రోగ్రాముల్ని చూస్తున్న ప్రేక్షకులు,  సినిమాల్లోనూ ఆ స్థాయి దృశ్య వైభవాల్నే  కోరుకుంటున్నారు..’ అన్నారాయన.


     సినిమా అనేది ఎంత హైటెక్ హంగుల్ని కలుపుకున్నప్పటికీ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకూదదన్నారు. లేటెస్ట్ ‘బృందావనం’  సక్సెస్ ని మనసారా ఎంజాయ్ చేస్తున్న ఛోటా, ఆ సినిమాలో బ్రహ్మానందం దగ్గర్నుంచీ తారాగణమంతా తమని ఎంతో అందంగా ఛోటా గారు చూపించారని కురిపిస్తున్న ప్రశంసలకి స్పందిస్తూ- ‘అందంగా చూపించక పోతే ఇక నేనెందుకు? కెమెరామాన్ గా అది నా డ్యూటీ. అలా అందంగా చూపించడంతో బాటు, దర్శకులు ఏం కోరుకుంటున్నారో ఆ సన్నివేశ ఫీల్ ని రాబడుతూ పిక్చరైజ్ చేస్తాను’ అన్నారు.


             ఫీల్డులో అత్యధిక పారితోషికం పొందుతున్న ఛాయాగ్రాహకుడెవరైనా వుంటే అది తనే. ఐతే కెమెరామాన్ వేగంగా పనిచేయలేకపోతే నిమిష నిమిషానికీ నిర్మాత డబ్బు కోల్పోవాల్సి వస్తుందన్నారు. 


           ఇప్పుడు సినిమాలు ముడి ఫిలిం నుంచి డిజిటల్ కి మారుతున్న సంధి కాలంలో వున్నాయి. దీన్ని తాను తప్పక ఆహ్వానిస్తానన్నారు. కొంత సమయం తీసుకుని  చిన్న బడ్జెట్ లో డిజిటల్ సినిమా తీస్తానన్నారు. శబ్దాని కెప్పుడో డీటీఎస్ తో డిజిటలీకరణ జరిగిపోయింది, కెమెరాకీ డిజిటల్ తో అలాటి అవసరం లాగా, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీఐ) ప్రక్రియ వచ్చిందన్నారు. ఈ డీఐ తో కూడా వెండి తెర మీద తనదైన ముద్ర ఏమాత్రం దెబ్బతినకుండా, దగ్గరుండి కలర్, లైటింగ్ కరెక్షన్స్ చేయించు కుంటానన్నారు. ఇక డెప్త్ విషయానికొస్తే, దాన్ని కాపాడే కలరిస్టులు మనకున్నారన్నారు. పోతే, మామూలు దృశ్యాల్ని కెమెరాతో చూస్తామనీ, గ్రాఫిక్స్ కయితే మనోనేత్రంతో చూడాల్సి వస్తుందనీ, గ్రాఫిక్స్ మెదడుకి మేత లాంటిదనీ  చమత్కరించారు.


         మరి కెమెరామానే దర్శకుడైతే అన్న ప్రశ్నకి, అప్పుడు తొంభై శాతం ఫెయిల్యూరే అన్నారు. అదెలా? ‘స్వార్ధం! సహజంగా కెమెరా మాన్ కుండే స్వార్ధం కొద్దీ సరౌండింగ్స్ అందంగా రావాలని దాని మీదే దృష్టి పెడతాడు. దర్శకుడైతే మొదటి నుంచీ స్క్రిప్టు మీద అవగాహనతో ఉంటాడు. సినిమా మూడ్, ఫీల్, ఫ్లో ల మీద అతడికి మంచి పట్టు వుంటుంది. కానీ నిత్యం పిక్చరైజేషన్ తోనే తలమునకలయ్యే కెమెరామాన్ ఆ మూడ్, ఫీల్, ఫ్లోలని కూడా పరిగణనలోకి తీసుకోవడంలో కొంత వెనుక బడతాడు. దీనివల్ల తను దర్శకుడిగా రాణించే లేక పోవచ్చు ‘ – అని వివరించారు.



             శ్యాం కె. నాయుడు తో బాటు, మరో ఐదారుగురు తన శిష్యుల్ని కెమెరామాన్లుగా తయారుచేసిన ఛోటా, 1991 లో ‘అమ్మ రాజీనామా’ తో డాక్టర్ దాసరి నారాయణ రావు స్కూల్  నుంచి సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. ముందు విడుదలైన సినిమా ఇదే అయినా, పని చేయడం మొదలెట్టింది అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలోని ‘రగులుతున్న భారతం’ కి. ఇప్పటికి ఆయన చేసిన సినిమాల సంఖ్య 56 కి చేరింది. ప్రస్తుతం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ‘ప్రేమ కావాలి’ కి పని చేస్తున్నారు. ‘భారీ సినిమాల మెగా బడ్జెట్లతో, టెక్నాలజీలతో పని చేసిన అనుభవమున్న మీరు, ఒక సాధారణ  ప్రేమ సినిమాకి ఎలా న్యాయం చేయగలరు? ఇది కూడా అంతేసి బడ్జెట్ భారంతో పాటు టెక్నాలజీ హంగామా కూడా మోయాల్సిందేనా?’ అన్న మరో ప్రశ్నకి, అదేం కాదన్నారు. దీని బడ్జెట్ నీ, పనిదినాలనీ దృష్టిలో పెట్టుకుని, క్వాలిటీతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రీ కరిస్తున్నానన్నారు. రామానాయుడు స్టూడియోలో ‘ప్రేమ కావాలి’ లోని ఓ పాటని చిత్రీకరిస్తూ గ్యాప్ లో ఈ కబుర్లన్నీ చెప్పిన ఛోటా, ఈ సినిమాకి రెగ్యులర్ 435 కెమెరానే వాడుతున్నానన్నారు. అయితే మాస్టర్ ప్రైమ్ లెన్స్ తో షూట్ చేస్తున్నానన్నారు. ఈ లెన్స్ ప్రత్యేకత  మండుటెండల్లో షూట్ చేసినా కూడా దృశ్యాన్ని చెక్కుచెదర నివ్వదన్నారు ఛోటా కె. నాయుడు.



 సికిందర్ 

నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’

11, డిసెంబర్ 2020, శుక్రవారం

 

2018 జులై రెండో వారం నుంచి 2019 జనవరి రెండో వారం వరకూ నోటెడ్ 
సినిమాలు 38 విడుదలయ్యాయి. వీటిలో రోమాంటిక్ కామెడీలు 6, 
రోమాంటిక్ డ్రామాలు 2, బ్రొమాన్స్1, హార్రర్ కామెడీ 1, కామెడీలు 2 
విడుదలయ్యాయి. ఫ్యామిలీలు 4, యాక్షన్ 13, స్పై1, సస్పెన్స్ థ్రిల్లర్ 2, ఫాంటసీలు 2, 
సైన్స్ ఫిక్షన్ 1, రాజకీయం 1, బయోపిక్ 1, రియలిస్టిక్ 1,  విడుదలయ్యాయి. 
ఈ 38 లో 4 హిట్టయ్యాయి, 5 ఏవరేజీలు కాగా, మిగిలిన 29  ఫ్లాపయ్యాయి. 
వీటి జాతకాలు నిర్ణయించిన మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ లెలా వున్నాయో చూద్దాం. ముందుగా  రోమాంటిక్ కామెడీలతో ప్రారంభిద్దాం...

1. నర్తనశాల 
నాగశౌర్య – కశ్మీరా పరదేశీ; శ్రీనివాస్ చక్రవర్తి (కొత్త దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : పాయింటు కొత్తదే, స్టేజి నాటకం చిత్రీకరణ – ఫ్లాప్

క్రియేటివ్ యాస్పెక్ట్  : సెకండాఫ్ సిండ్రోమ్ – ఫ్లాప్  
          గే’ పాత్రలతో రోమాంటిక్ కామెడీ తెలుగులో కొత్త కథే.  తరానికి యూత్ అప్పీల్ వున్నదే. కానీ అయిడియా వరకే కొత్తదాంతో అల్లిన కథంతా పాతావకాయ. సినిమా కథ అనికూడా చెప్పలేకుండా స్టేజి డ్రామాలా తీశారు. ఇప్పటి సినిమా లక్షణాలేవీ కన్పించని అరిగిపోయిన పాత స్కూలు మూస అన్పించారు. ఎత్తుకున్న గే’ అనే పాయింటు వదిలేసి ఏటో వెళ్ళిపోయే దారీ దిక్కూలేని వ్యవహారం. హీరోయిన్ తో రోమాన్స్ గానీ, ‘గే’ రోమాన్స్ గానీకామెడీ గానీ లేకుండా ఏం తీశారోఎవరికోసం తీశారో అర్ధంగాని అయోమయం. 

2. పేపర్ బాయ్
                                        సంతోష్ శోభన్ – రియా సుమన్; వి. జయశంకర్ (కొత్త దర్శకుడు)

                                              మార్కెట్ యాస్పెక్ట్ : గిటార్ ప్రేమ బదులు వీణ ప్రేమ – ఫ్లాప్
  
 
                                        
 క్రియేటివ్ యాస్పెక్ట్: అచ్చులో చదువుకునే కథాకథనాలు - ఫ్లాప్ 

           యూత్ అప్పీల్ కి వాస్తవ దూరమైన పాత ఫార్ములా కథ. తెర మీద చూస్తున్నప్పుడుఇది అచ్చులో లభిస్తే చదువుకోవడానికి బావుంటుందన్పించే కథ. షార్ట్ మూవీగా తీసినా కూడా వర్కౌట్ అవచ్చనే కథ. అచ్చులో కథలో పాత్రల్నిషార్ట్ మూవీస్ లో పాత్రల్నిసినిమాకి మల్చడంలో విఫలమైన కథ. సమకాలీన సినిమాకి దూరంగా పేదింటి అబ్బాయి పెద్దింటి అబ్బాయి కోటలో రాణి – పేటలో రాజా’ టైపు ఎన్నోసార్లు తెలిసితెలిసి – తెలిసిపోయీ వున్న పురాతన కథ. రోమాంటిక్ కామెడీ అవలేదు సరికదావున్న కథతో రోమాంటిక్ డ్రామాగా కూడా లేదు. యూత్ కి కావాల్సింది గిటార్ ప్రేమ సినిమాలేగానీవీణ ప్రేమ సినిమాలు కాదనేది ఒక మార్కెట్ వాస్తవం. దీనికి దూరంగా అమార్కెటీయ మర్కటం’ గా తేలిందీ ప్రయత్నం 

3. 24 కిస్సెస్ 


అదిత్ అరుణ్ – హేబ్బా పటేల్;  అయోధ్య కుమార్ (ఒక సినిమా దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : ముద్దుల అప్పీల్ ని పిల్లల ఆకలి కథ మింగేసింది - ఫ్లాప్ 

క్రియేటివ్ యాస్పెక్ట్ : సెకండాఫ్ సిండ్రోమ్ – ఫ్లాప్ 
              కథలో చెప్పిన 24 ముద్దుల థియరీకి ఆధారాలేమిటోచూపించలేదు. వాత్సాయనుడు కూడా చెప్పివుండడు. ఇది కల్పితమనుకోవాలి. కానీ ఇది నిజమేనుకుని యూత్ ఫాలో అయ్యే అవకాశముంది. అప్పుడు అమ్మాయిలే  ఫినిష్ అయిపోయేలాగా కథ వుంది. ఎలాగంటే, ఈ  కథలో చూపించినట్టుగా ముద్దుల సెక్షన్ కాస్తా శృంగార సెక్షన్ గా మారిపోవచ్చు. అప్పుడు లబోదిబోమనడమే  కథలో లాగా అప్పుడు ఈ కథలోలాగా సినిమాటిక్ ఫార్ములా పరిష్కారాలతో బయటపడలేరు. సుఖాంతం చేసుకోలేరుఅయితే ఒక ‘మంచి ఉద్దేశం’తో ప్రారంభమయ్యే ఈ ముద్దులు పోనుపోను బూతుగా మారిపోయిన విషయం కూడావుంది. ఇంకా  ముద్దుల కథ మధ్యలోగతంలో దర్శకుడు తీసిన మిణుగురులు’ కథని కూడా బోనస్ గా ఇచ్చాడు. దర్శకుడు గతంలో తీసిన  మిణుగురులు’ హేంగోవర్ లోంచి ఇంకా బయటికి రాలేదు. ముద్దుల కథలో అన్నంకోసం తపించే వీధిబాలల ఆక్రందనల కథేమిటో అర్ధం గాదు సెకండాఫ్ లో.


4. పడిపడి లేచె మనసు 

శర్వానంద్- సాయిపల్లవి; హను రాఘవపూడి (3 సినిమాల దర్శకుడు) 

మార్కెట్ యాస్పెక్ట్ : ట్రాజిక్  రోమాన్స్ - ఫ్లాప్. 

క్రియేటివ్ యాస్పెక్ట్ : సెకండాఫ్ సిండ్రోమ్ - ఫ్లాప్
          ఫస్టాఫ్ పాత మూస ఫార్ములా లవ్ ట్రాక్, అది కూడా  హీరోహీరోయిన్ల చిన్నపిల్లల లాంటి సిల్లీ మనస్తత్వాలతో. ఇంటర్వెల్లో ‘మరోచరిత్ర’ పాయింటుతో ట్రాజిక్ లవ్ ప్రారంభం. ఇప్పుడెంత సూపర్ స్టార్లయినా ట్రాజడీ కథలెవరిక్కావాలి. తెలిసిన సమచారాన్నిబట్టి సెకండాఫ్ లో కన్యూజన్ వుందని దర్శకుడు వేరే రచయితని రాయమని అడిగాడు. ఆ రచయిత రాయలేదు. దర్శకుడు అలాగే తీశాడు. అసలే ట్రాజడీని అతుకుల బొంత కథనం మరింత ట్రాజడీగా మార్చింది. 
 5.. హలో గురూ ప్రేమ కోసమే


రామ్ - అనుపమా పరమేశ్వరన్ - ప్రకాష్ రాజ్; త్రినాధ రావు నక్కిన (ఐదు సినిమాల దర్శకుడు)

మార్కెట్ యాస్పెక్ట్ : రోమాంటిక్ కామెడీ ప్రమాదం తప్పింది - ఏవరేజి

క్రియేటివ్ యాస్పెక్ట్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి తగ్గ విటమిన్ల లోపం – ఏవరేజి
          చాలాచాలా సార్లు చూసేసిన పాత కథే. కూర్చోబెట్టే బలమైన పాయింటేమీ లేదుగానీకథనం వేగంగా ఆసక్తికరంగా సాగుతుంది. ఇది  ఫస్టాఫ్ లో. సెకండాఫ్ లో వేగం తగ్గి సెంటిమెంటల్ డ్రామాగా మారుతుంది. ఇచ్చిన మాట కోసం హీరోతో ఫ్రెండ్ గా  మెలగాల్సి వచ్చే హీరోయిన్ తండ్రి కథ ఇది. దీనికి  ముగింపు కూడా రొటీన్ గా ఇచ్చారు. కథనంలో ఎన్నో ట్విస్టులు ఇచ్చి, ముగింపుని సాదాగా వదిలేయడం పెద్ద లోపం. ఈ కథ ప్రేమకథగా హీరోహీరోయిన్ల మధ్యే సాగివుంటే మార్కెట్ కోల్పోయిన అన్ని ప్రేమ సినిమాల్లాగే ఫ్లాపయ్యేది. ప్రేమ పాయింటునే హీరోయిన్ తండ్రికీ, హీరోకీ మధ్య సెంటిమెంటల్ డ్రామాగా నడపడం ఏవరేజీగా నైనా మిగిలింది. వాళ్ళిద్దరి మధ్య సెంటిమెంటల్ డ్రామా కాకుండా, కామెడీ నడిపివుంటే  యూత్ అప్పీల్ తో మరికొంత బాగుపడేది. 

6. చిలసౌ
                   సుశాంత్ -  రుహానీ శర్మ; రాహుల్ రవీంద్రన్ (కొత్త దర్శకుడు) 

                మార్కెట్ యాస్పెక్ట్ : కొత్తగా రియలిస్టిక్ రోమాంటిక్ డ్రామెడీ - ఏవరేజి 

                           క్రియేటివ్ యాస్పెక్ట్ : ప్రయోగాత్మకం - ఏవరేజి
           ‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’ రోమాంటిక్ కామెడీల హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడయ్యాడు. హిట్సు లేని హీరో సుశాంత్ తో రోమాంటిక్ డ్రామెడీ తీశాడు. ప్రేమ సినిమాలంటే హీరో హీరోయిన్లు అపార్ధాలతో విడిపోవడమోప్రేమలో ఎస్ చెప్పడానికి నాన్చడమో చేసే రెండే రెండు టెంప్లెట్స్ తో పదేపదే నిస్సిగ్గుగా వచ్చిపడుతున్న భావదారిద్ర్యపు మాయదారి కాలంలోరవీంద్రన్ ఒక తాజాదనాన్ని మోసుకొచ్చాడు.  తజాదనంలో అతడి తాలూకు తమిళతనం ఎక్కడాలేదు. తెలుగులో అత్యంత అరుదై పోయినకాస్త నిజ జీవితాలు ఉట్టిపడే రియలిస్టిక్ ప్రేమ సినిమాల కొరత తీరుస్తూకథ ఏమీ లేకుండానే ఒకే రాత్రి జరిగే కథతో కథంతా కూర్చోబెట్టి చెప్పాడు.

          
లా 6 రోమాంటిక్ కామెడీల్లో 2  ఏవరేజీలు, 4 ఫ్లాపులు వచ్చాయి. ఇంకా విడుదలైన చిన్నా చితకా రోమాంటిక్ కామెడీలు 50, 60 వుంటాయి. ఇవన్నీ అట్టర్ కంటే అట్టర్నర ఫ్లాపులు. ఇంకా విడుదలయ్యే ఛాన్సే లేకుండా మూలనపడ్డవి వందల్లో వున్నాయి. ఇదో పెద్ద చేపల మార్కెట్. ఏదో  ప్రేమల్లో  పండితుడైనట్టు  రోమాంటిక్కు  రాసుకుని ఈ మార్కెట్ కే పరిగెడతాడు కొత్త దర్శకుడు. అక్కడే నిర్మాత వుంటాడు. పరస్పరం గాలాలేసుకుని పట్టేసుకుంటారు. ఇక గంపల్లో చేపలు, కంపెనీల్లో ఏడ్పులు. 

          రోమాంటిక్ కామెడీలు హిట్టవ్వాలంటే అప్రోచ్ మార్చాలి గురూ, అప్రోచ్ మార్చాలి. ముందు నేటి యూత్ ని స్టడీ చేసి రియలిస్టిక్ అప్రోచ్  నేర్చుకోవాలి. ఇంకా పిల్లకాయ లొట్టపీసు ప్రేమలు తీయడానికి సిగ్గుపడాలి. అసలు రోమాంటిక్ కామెడీల నిర్వచనం, జానర్ మర్యాదలు తెలిస్తే గా.
 ముసలి మైండ్ సెట్ తో ముసలి ప్రేమలు తీసి ముంచడమేగా.

సికిందర్