రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఏప్రిల్ 2020, ఆదివారం

927 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద - 5


     క్రైం థ్రిల్లర్ కథలతో వుండే సౌలభ్యం ఏమిటంటే ఇవి రాయడానికి హత్య చేసి చూడాల్సిన అవసరం లేదు. కనీసం ఒక  హత్యకి గురైన శవం చూసిన అనుభవం వుండాల్సిన అవసరం కూడా లేదు. పోలీసుల్ని తోసుకుంటూ వెళ్లి  మర్డర్ సీన్ ని కళ్ళారా చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమ కథలు రాయాలంటే, కుటుంబ కథలు రాయాలంటే ఎంతో కొంత జీవితానుభవం వుండాలేమో. క్రైం థ్రిల్లర్ కథలు రాయడానికి జీవితానుభవం కోసం ప్రయత్నిస్తే జైల్లో వుంటారు. అక్కడ తోటి కిల్లర్స్ ఆటలు పట్టిస్తారు. కామెడీ అయిపోతుంది కెరీర్. కనుక  ఎంత కొత్త రైటరైనా, మేకరైనా రియల్ లైఫ్ అనుభవం లేకుండా మర్డర్ల సినిమాలు శుభ్రంగా రాసుకోవచ్చు, తీసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతీ క్రైం థ్రిల్లర్ రచయితా / దర్శకుడూ ఈ అనుభవం లేకుండా రాసిన వాడే / తీసిన వాడే. కాబట్టి ఈ జానర్లోకి వచ్చే కొత్త రైటర్లు, మేకర్లు అధైర్య పడాల్సిన పని లేదు. రాయడానికీ తీయడానికీ తమకేం తెలుసని గాకుండా, ఏం రాస్తున్నారో, ఎలా తీస్తున్నారో చెక్ చేసుకుంటే చాలు...

        త వ్యాసం ‘క్రైం థ్రిల్లర్ రాయడమెలా?’ లో (వ్యాసం కింద లింక్ ఇచ్చాం), శాంపిల్ కథలో హత్యతో క్రైం సీన్ ని స్థాపించడం గురించి తెలుసుకున్నాక, ఇప్పుడు దాని తాలూకు ఇన్వెస్టిగేషన్ కథనం ఎలా వుంటుందో చూద్దాం. ఇతర అన్ని జానర్లకి వుండే స్ట్రక్చరే దీనికీ వుంటుంది. బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల్లో అవే బిజినెస్సులుంటాయి. బిగినింగ్ లో కథ తాలూకు సెటప్, మిడిల్లో సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం వుంటాయి. ప్లాట్ పాయింట్ వన్ సమస్యని ఏర్పాటు చేస్తే, ప్లాట్ పాయింట్ టూ ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇప్పుడు శాంపిల్ కథలో హత్యతో వివరించుకున్న క్రైం సీన్ అనేది బిగినింగ్ తాలూకు సెటప్ వల్ల వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ సీను. అంటే సమస్య ఏర్పాటు. అంటే పోలీస్ డిటెక్టివ్ హీరోకి గోల్ ఏర్పాటు. హంతకుణ్ణి పట్టుకోవాల్సిన గోల్ ఏర్పాటు.


      దీంతో మిడిల్ విభాగం మొదలవుతుంది. మిడిల్ విభాగమంటే గోల్ కోసం సంఘర్షణ గనుక, ఆ సంఘర్షణ పోలీస్ డిటెక్టివ్ కి హంతకుడి (విలన్) తో వుంటుంది. ఈ సంఘర్షణ ప్లాట్ పాయింట్ టూ వరకూ కొనసాగి, అంతిమంగా పోలీస్ డిటెక్టివ్ కి అక్కడొక పరిష్కార మార్గం లభించి, ఎండ్ విభాగం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫైనల్ గా హంతకుణ్ణి పట్టుకుంటాడు. ఇంతకి మించి బేస్ స్ట్రక్చర్ ఇంకేమీ లేదు. 

        ఈ బేస్ స్ట్రక్చర్ మీద కథనంతో చేసే క్రియేటివిటీయే కథకి రక్తమాంసాలు సమకూర్చి పెడుతుంది. అంటే ముందుగా బేస్ స్ట్రక్చర్ లో కథని రేఖామాత్రంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఐడియాతో మొదలెట్టాలి. ఇక్కడ చెప్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ రేఖామాత్రమైన బేస్ స్ట్రక్చర్ చేసుకుంటే, ఇంకే అనుమానాలూ వేధించవు. ముందుగా ఐడియా ని వర్కౌట్ చేసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే, పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి, చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు - అని ఒక ఐడియా ఏదో తట్టిందనుకుందాం - ఈ ఐడియాలో స్ట్రక్చర్ వుండేట్టు చూసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే (బిగినింగ్), పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి (మిడిల్), చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు (ఎండ్) - స్ట్రక్చర్ వచ్చేసింది. బిజినెస్ మాన్ హత్య ప్లాట్ పాయింట్ వన్ సీను, చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించడం ప్లాట్ పాయింట్ టూ సీను - స్ట్రక్చర్ వచ్చేసింది. 

       
ఇప్పుడు స్క్రీన్ ప్లేకి రెండు మూలస్థంభాల్లాంటి ఈ రెండు ప్లాట్ పాయింట్ సీన్లని దగ్గర పెట్టుకుని, వీటి మధ్య రేఖామాత్రపు మిడిల్ కథ నల్లుకోవాలి. అల్లుకున్నతర్వాత, ఇక రేఖామాత్రపు మిడిల్ కథకి, క్రియేటివిటీకి పని పెడుతూ పూర్తి స్థాయి ఆర్డర్ (సీన్లు) వేసుకుంటూ పోవాలి. ఆర్డర్ వేసుకున్నాక, ఆర్డర్ లో వున్న సీన్లని విస్తరిస్తూ, క్రియేటివిటీని తారాస్థాయికి తీసికెళ్తూ ట్రీట్ మెంట్ రాసుకుంటూ పోవాలి. ట్రీట్ మెంట్ రాసుకున్నాక క్రియేటివ్ సత్తువ కొద్దీ, డైలాగ్ వెర్షన్ కూడా రాసి స్క్రిప్టు ముగించెయ్యాలి. ఇప్పుడు రక్తమాంసాలతో షూటింగుకి రెడీ. 

        ఇంత సులభమా? కాదు. క్రియేటివ్ దశ కొచ్చేసరికి వుంటుంది అసలు సంగతి. రాత్రింబవళ్ళు మతిచెడే పరిస్థితి. క్రియేటివ్ దశలోనే జానర్ మర్యాదలుంటాయి, క్రియేటివ్ దశలోనే సస్పెన్స్, టెంపో నిర్వహణ వస్తాయి, క్రియేటివ్ దశలోనే అన్నినేర పరిశోధనా పద్ధతుల అమలూ వుంటుంది. క్రియేటివ్ దశలోనే...ఈ కింద చెప్పుకునే చాలా వుంటాయి- 

        ఈ సందర్భంగా రెండు సినాప్సిస్ లు అందాయి. ఈ క్రైం థ్రిల్లర్స్ లో ఏం రాశారంటే, ఒక హత్యతోనే కథంతా రాశారు. ఒక హత్య సినిమాకి సరిపోదు. కనీసం ఇంటర్వెల్ ముందు ఇంకో హత్య, సెకండాఫ్ లో ఇంకో హత్యా జరిగితే గానీ సినిమా అనే రెండు గంటల వ్యవహారం మాట వినదు. ఇలాంటి క్రియేటివిటీలు తెలుసుకోవాలి. పైన ఉదాహరణకి చెప్పుకున్న ఐడియా ఒకే హత్యతో వుందంటే, పాయింటు ఒక హత్యతోనే వుంటుంది. ఐడియాని విస్తరించినప్పుడు కథనంలో మరికొన్ని హత్యలు వస్తాయి. ఆ హత్యలు కూడా ఆషామాషీగా వుండకూడదు. ప్రధాన హత్య యజమాని హత్యయితే, అనుబంధ హత్య యజమాని ప్రియురాలిదై వుండాలి. ఇంకో అనుబంధ హత్యగా చూసి చూసి యజమాని భార్యని చంపెయ్యాలి. ఇలా తీవ్రత పెరగాలి. అంతేగానీ యజమాని హత్య తర్వాత పని వాణ్ణి, వాచ్ మన్ నీ చంపుకుంటూ కూర్చుంటే సినిమా ససేమిరా అంటుంది. 

       
ఇక్కడ అర్ధమవడం కోసం - 
     బిగినింగ్ - మిడిల్ -ఎండ్ వరస క్రమంలో లీనియర్ కథనమే చూస్తున్నాం. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ కథ నాన్ లీనియర్ గానూ వుండొచ్చు. అంటే ఫ్లాష్ బ్యాక్స్ తో వుండొచ్చు. ఫ్లాష్ బ్యాకులు ఎక్కువైపోతే (మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్) ఇన్వెస్టిగేషన్ క్రోనాలజీ గజిబిజి అయిపోతుంది, ప్రేక్షకులు ఫాలో అవడం కష్టమైపోతుంది. ప్రేక్షకులు ఫాలో అవడం కష్టంగా వుందంటే, ఆ కథనం విఫలమైనట్టే. ఆ కథనం జానర్ మర్యాద తప్పినట్టే. క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల్లో ప్రేక్షకుల హర్మోన్ల ప్రేరేపణ కూడా ఒకటి. 


        గత వ్యాసాల్లో పేర్కొన్న క్రైం రచయితల సలహాదారైన మాజీ పోలీస్ డిటెక్టివ్ గేరీ రాడ్జర్స్ ఇంకేమంటున్నాడంటే, స్టోరీ సైన్స్ ని అర్ధం జేసుకోమంటున్నాడు. క్రైం థ్రిల్లర్లు చదివే పాఠకులు ఎందుకు విడువకుండా రాత్రంతా మేల్కొని చదువుతారు? (తెలుగు డిటెక్టివ్ నవలలు గంట రెండు గంటల్లో ఏకబిగిన చదివేసే పాఠకులుండే వాళ్ళు). ఆ రచయితలు  ప్రయోగించే పదాలు అలా వుంటాయి. ఆ పదాలకి మెదడులో ఎండార్ఫిన్లు విడుదలవుతాయంటున్నాడు గేరీ. ఇక ఆ పుస్తకం విడిచిపెట్ట లేరు. అదన్నమాట సంగతి. దీనికి సంబంధించి లీసా క్రాన్ రాసిన పుస్తకాన్ని సిఫార్సు చేశాడు (ఈ పుస్తకం కొనలేం గానీ, ఆవిడ వెబ్సైట్ లింక్ వ్యాసం చివర ఇస్తున్నాం. ఇందులో ఆవిడ స్టోరీ సైన్స్ గురించి విస్తృత సమాచారం పొందుపర్చింది). 

        అంటే మెదడులో ఎండార్ఫిన్లు పిచికారీ కొట్టినట్టు విడుదలవుతూ వుండాలంటే వెండితెర మీద కథనం ముందుకు పరిగెడుతూ వుండాలన్న మాట. ఆ కథనంలో క్షణం క్షణం థ్రిల్లో సస్పెన్సో వుండాలి. అలా ముందుకు పరిగెడుతున్న కథనం ఆగి, వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకులేసుకుందా, ఇక మెదడులో ఎండార్ఫిన్ల స్రావం ఆగిపోతుంది. వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకుల్ని అర్ధం జేసుకోవడానికి మెదడు బిజీ అవడంవల్ల ఎండార్ఫిన్లని విడుదల చేయదు. ముందుకు పరిగెడుతున్న కథనం ఒకసారి ఆగి ఫ్లాష్ బ్యాక్ వచ్చినా, లేదా ముందుకు పరిగెడుతున్న కథనం పదేపదే ఆగుతూ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చినా, ఎండార్ఫిన్లు విడుదల కానే కావు. ఎందుకిలా? ఫ్లాష్ బ్యాకుల్లో వుండేది కథ కాదు. నడుస్తున్న కథకి పూర్వ సమాచారం మాత్రమే. ఫ్లాష్ బ్యాకులతో వుండే సినిమా అంతా కథ కాదు. ఫ్లాష్ బ్యాకులు తీసేస్తే మిగిలుండేదే కథ. ఫ్లాష్ బ్యాకుల వల్ల ఎంత కథ కోల్పోతారో దీన్నిబట్టి అర్ధంజేసుకోవాలి. ఇలా ఫ్లాష్ బ్యాక్ అంటే సమాచారమే గనుక, సమాచారం కథకాదు గనుక, కథ కాని దానికి ఎండార్ఫిన్ల తోడ్పాటు వుండదు. హార్మోన్లు రిలాక్స్ అయిపోతాయి. ఈ సైన్స్ ని అర్ధం జేసుకోవాలి. 

        లీనియర్ స్క్రీన్ ప్లేలని చూస్తే, ఈ సైన్స్ ఆధారంగానే క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ అనే రెండు స్క్రిప్టింగ్ టూల్స్ ఏర్పాటైనట్టు గమనించగలం. ఇవి లీనియర్ స్క్రీన్ ప్లేలకే వుంటాయని సినిమాల్ని చూసి కనుగొన్నారు పండితులు. ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలకి వుండవు. వీటిని బోధించడం కూడా లీనియర్ స్క్రీన్ ప్లేలకే భోదిస్తారు. కథనం ఫ్లాష్ బ్యాకుల వల్ల వెనక్కీ ముందుకూ అవుతునప్పుడు, మనం హీరో క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) గానీ, కథనంలో కాలంతో అనులోమంగా వుండే టెన్షన్ ని గానీ ఫీల్ కాం. ఈ రెండు టూల్స్ ని ఫ్లాష్ బ్యాక్స్ రహిత ఎడతెగని కథనం వున్నప్పుడే ఫీలవుతాం, థ్రిల్లవుతాం.. 

        అసలీ ఫ్లాష్ బ్యాకుల ఫ్యాషనేంటి, లీనియర్ కథనంతో చక్కటి క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్ చూపించకుండా. 84 యాక్షన్ సినిమాలు తీసిన రాం గోపాల్ వర్మ, ఒక్కటి కూడా ఫ్లాష్ బ్యాక్స్ తో తీయలేదు. 

 
       క్రైం థ్రిల్లర్ మిడిల్ కథనం క్రియేటివిటీ గురించి ఇంకా చెప్పుకుంటే - గేరీ రాడ్జర్స్ ఏమని సలహా ఇస్తాడంటే, మూస లోంచి బయటికి రావాలంటాడు. ఇంకా ఈ కాలంలో అవే పోస్ట్ మార్టం, టాక్సికాలజీ, బాలస్టిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ అంటూ అక్కడే ఆగిపోకుండా, వీటితో బాటూ - డీఎన్ఏ, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, వైర్ టాప్స్, రూంబగ్స్, పాలీగ్రాఫ్, అండర్ కవర్ ఆపరేటర్స్, హిప్నాసిస్, సైకలాజికల్ ప్రొఫైలింగ్, కంప్యూటర్ ఎనలైజింగ్, శాటిలైట్ సర్వేలెన్స్, ఎంటమాలజీ మొదలైనవి కూడా అవసరాన్నిబట్టి కథలోకి తీసుకోవాలంటాడు. 

(మిగతా రేపు)

సికిందర్


10, ఏప్రిల్ 2020, శుక్రవారం

926 : స్పెషల్ ఆర్టికల్


      సామెతలు అబద్ధంగా పుట్టలేదు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు నిజంగానే వుంటాయి బద్ధకం వదిలించుకుని కాస్త వెతికితే. ఊహకందని ఉపాయాలు కూడా బుట్టలో పడతాయి. కరోనా ఐతే ఏంటి, అది కోరల వైరస్ ఐతే ఏంటి- దాని దిమ్మదిరిగే ఐడియాలు సినిమాలు తీయడానికి తన్నుకొస్తూనే వుంటాయి. తైమూర్ బక్మంబెతోవ్ అంటే తమాషా కాదు. షూటింగు ఆపేసి స్టూడియోలోనే లైవ్ వీడియో గేమ్ లో సినిమా తీసేయగలడు. తైమూర్ ఇంకెవరో కాదు, ఎంజలీనా జోలీతో హాలీవుడ్ యాక్షన్ ‘వాంటెడ్’ తీసిన రష్యన్ దర్శకుడే. తిరిగి ఆమెతోనే  రెండో ప్రపంచ యుద్ధ యాక్షన్ ‘వీ2 -ఎస్కేప్ ఫ్రమ్ హెల్’ తీస్తూంటే కరోనా హెచ్చరికలు షూటింగుకి బ్రేకేశాయి. ప్యాకప్ చెప్పేసి వచ్చేసి స్టూడియోలో కూర్చుని తీయడం మొదలెట్టాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటి లైవ్ వీడియో గేమ్ లో తీసిన కమర్షియల్ మూవీ సీనుగా రికార్డు స్థాపించేశాడు.

       
నిజానికి ఈ సీను యుద్ధ విమానాలతో రియల్ లొకేషన్ గగనతలంలో తీయాలని ప్లాన్ చేస్తే కోరల వైరస్ కాదు పొమ్మంది. దీంతో లొకేషన్ లో సోషల్ మిక్సింగ్ ని వీలైంత తగ్గించాలని, అతి తక్కువ మంది యూనిట్ సభ్యుల్ని పిట్స్ బర్గ్ లొకేషన్లో వుంచి, ల్యాండ్ చేసిన యుద్ధ విమానం కాక్ పిట్ లో హీరో పావెల్ ప్రిలచ్నీని కూర్చోబెట్టి, తను 1200 కిమీ దూరంలోని కజాన్ స్టూడియోలో కూర్చుని, రిమోట్ డైరెక్షన్ మొదలెట్టాడు... సీను ఎలా పూర్తి చేశాడన్నది వేరే కథ. ఇంకోసారి చెప్పుకుందాం. పాయింటేమిటంటే, కరోనా కూడా సినిమాల్ని ఆపలేదని. కరోనా ఒక విషమ చారిత్రక ఘట్టం నిజమే, ఐతే దీన్నుంచి ఆర్ధికంగా పుంజుకుంటామనీ, ఇంకా బెటర్ బిజినెస్సులు అభివృద్ధి చెందుతాయనీ, రాజకీయ వ్యవస్థ కూడా రూపాంతీకరణ చెందుతుందనీ, ఇవి కాదని ఇంకేవో నెగెటివ్ వూహాగానాలు చేయడం వొట్టి బుల్ షిట్టనీ... తేల్చేస్తున్నాడు తైమూర్.

        సినిమాలు చాలా తట్టుకున్నాయి. వీడియో కేసెట్స్ ని తట్టుకున్నాయి, టీవీ సీరియల్స్ ని తట్టుకున్నాయి, పైరసీనీ తట్టుకున్నాయి. సినిమాలంటేనే తట్టుకునే క్రియేటివిటీ. అందుకే అమెరికాలో ఒకప్పుడు సీఐఏ సంస్థ దేశానికేదైనా కఠిన సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం హాలీవుడ్ రచయితల్ని సంప్రదించేది. క్రియేటివ్ పరిష్కారాలు చెప్తారని. రాజకీయ పక్షాలు కుయుక్తుల పరిష్కారాలు చెప్తాయి. ఆ రచయితల్నిసంప్రదించే సాంప్రదాయమిక లేదు. ప్రభుత్వాలే అయోమయం సృష్టిస్తాయి. సినిమాలే డీఫాల్టుగా వుండే క్రియేటివిటీతో వాటి దారి అవి చూసుకుని బయటపడాలి. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా కూడా, ఈ సంక్షోభంలోంచి ఇతర రంగాలకంటే తాము వేగంగా బయట పడతామన్నారు. సీఎన్ఎన్ పాత్రికేయుడు అడిగిన డజను కఠిన ప్రశ్నలకి సమాధానమివ్వ లేని అమెరికా అధ్యక్షుడి చేతిలో - దేశంతో బాటు హాలీవుడ్
కరోనా కాటుకి విలవిల్లాడుతున్నాయి. లాక్ డౌన్ విషయంలో ఇక్కడ అనావృస్టి అయితే, మనకి ఇండియాలో అతివృష్టి!

        ప్రణాళిక లేకుండా నాల్గు గంటల గడువిచ్చి రాత్రికి రాత్రి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించేస్తే, తెల్లారేకల్లా తిండి లేక రోడ్డున పడ్డారు జనాలు. జనజీవితం అస్తవ్యస్తమై పోయింది. దీనికి ముందు ఆదివారం ఒక రోజు లాక్ డౌన్ కి రెండు రోజులు గడువు. మూడువారాల దేశవ్యాప్త లాక్ డౌన్ కి మాత్రం నాల్గే నాలుగు గంటలు గడువు! దీని ప్రభావం మామూలుగా లేదు. ఒక అంతర్జాతీయ రిపోర్టు ప్రకారం దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఆర్ధిక పతనం చెందుతారు. మధ్య తరగతి కింది మధ్యతరగతికి, కింది మధ్యతరగతి పేద తరగతికి, పేద తరగతి దారిద్ర్య రేఖ దిగువకీ జారిపోతారు. ఈ రిపోర్టే నిజమైతే రేపు లాక్ డౌన్ ఎత్తేశాక థియేటర్లు తెరిస్తే, ప్రేక్షకులెవరుంటారో చూడాలి. మాస్ ప్రేక్షకుల శాతంలో ఎంత కోత పడుతుందో చూడాలి. ఈ నలభై కోట్ల మందికి కాస్తో కూస్తో డబ్బు చేతిలో పడితే ముందు బతకడానికి కావాలి.

        ఇంతకాలం తిరిగి ప్రేక్షకులు సినిమాలకి రావడానికి కరోనా ఫోబియా కొంత కాలం వెన్నాడుతుందనుకున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా, సినిమాలకెళ్ళి రోగం తెచ్చుకోవాలని ఎవరు కోరుకుంటారన్నారు. పీవీఆర్ గ్రూపు చైర్మన్ తమ మల్టీ ప్లెక్సుల్లో సీటు విడిచి సీటు బుకింగ్ ఇస్తామన్నారు. కానీ షో ప్రారంభమై పోయాక వచ్చే
ఆగంతకుడు, చీకట్లో మన పక్క ఖాళీ సీట్లో ధడాలున కూలబడితేనో? అప్పుడేంటి? ఇలా ఫోబియా బహు కోణాల్లో భయపెడుతోంటే, దీనికి ఆర్ధిక లేమి కూడా తోడైతే, సినిమాలకి రావడానికి ప్రేక్షకులు ఇంకెన్నాళ్ళు పడుతుంది? ప్రస్తుతానికి లాక్ డౌన్ పొడిగింపే వుంటుంది. మరో రెండు వారాలకో ఎప్పుడో లాక్ డౌన్ దశల వారీగా ఎత్తేసినా, సినిమా థియేటర్ల వంతు చివరి దశలో వస్తుంది. ఆర్ధిక లేమి కాసేపు పక్కన బెడితే, అప్పుడైనా  ఫోబియా వుండదా? అసలు అప్పటికైనా థియేటర్లు తెరచుకుంటాయా? అప్పటికి అసలు లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితి వుంటుందా?

        తాజా రిపోర్టు ప్రకారం-
     అమెరికాలో కరోనా మే ఒకటవ తేదీకి పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇండియాలో జూన్ ఒకటిన పతాక స్థాయికి చేరుకుంటుంది. పతాక సన్నివేశం చూడకుండా అది వదిలి పెట్టదని అంటున్నారు. 1918 లో కోట్ల మందిని పొట్టన బెట్టుకున్న స్పానిష్ ఫ్లూతో అనుభవాల్నిబట్టి, ఇప్పటి పతాక సన్నివేశాన్ని వూహిస్తున్నారు. అప్పట్లో ఫిలడెల్ఫియాలో మొదటి ఫ్లూ కేసు ఇలా బయటపడిందో లేదో, అలా శరవేగంగా వ్యాపించి పదిరోజుల్లో నగరంలో 20 వేల మందిని ఆస్పత్రుల పాల్జేసింది. దీంతో న్యూయార్క్ నగరంలో తక్షణ చర్యలు తీసుకుని, లాక్ డౌన్ చేస్తే స్వల్ప మరణాలతో బయటపడ్డారు. అప్పటి ఫ్లూ హెచ్చుతగ్గుల ప్రవర్తనని అధ్యయనం చేసిన మెకిన్సే సంస్థ రిపోర్టు ఇచ్చింది. దీని ప్రకారం, ఒక వ్యాధి గ్రస్తుడి నుంచి ఒకరికి లేదా ఇద్దరికీ, ఆ ఇద్దరి నుంచి నల్గురికి, ఆ నల్గురి నుంచి ఎనమండుగురికీ ...ఇలా వ్యాప్తిస్తూ పోయిందంటే, ఇక విజృంభించి పతాక స్థాయికి వెళ్ళిపోతుంది. వెళ్ళాక అక్కడ్నించీ తగ్గు ముఖం పట్టడం ప్రారంభిస్తుంది. ఎలాగంటే, ప్రజల రోగనిరోధక శక్తి పెరగడమో, లేదా అసంఖ్యాక మరణాలు జరగడమో సంభవించి, కబళించడానికి కరోనాకి ఇక మనుషులు కరువైపోతారు. ఇందుకే దానికి మనుషులు దొరక్కుండా భౌతిక దూరం పాటించాలనేది. బలాదూర్లు తిరక్కుండా ఇంట్లో కూర్చోవాలనేది. ఇలా చేస్తే తక్కువ పాజిటివ్ కేసులతో ఇండియా జూన్ ఒకటికల్లా పీక్కెళ్ళి ఆ తర్వాత వైరస్ పీడా విరగడైపోతుంది. దానికి దొరక్కుండా దాక్కోవడమే మార్గం. వూళ్ళో సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడంటే చప్పున వెళ్లి దాక్కుంటాంగా?

        ఇలాంటప్పుడు జూన్లో కూడా లాక్ డౌన్ తప్పదేమో? ఇప్పుడు కేంద్రం లాక్ డౌన్  ఎగ్జిట్ ప్లాన్ కోసం రాజకీయ పక్షాలతో, ముఖ్యమంత్రులతో, పాత్రికేయులతో సమావేశాలు జరుపుతానంటోంది. రాజకీయ పక్షాలతో పూర్తయింది. ముఖ్యమంత్రులతో ఆన్ లైన్ సమావేశం రేపు 11 న వుంది. లాక్ డౌన్ ప్రకటించే ముందు కూడా ఇలాటి సమావేశాలు జరిపి వుంటే ఒక సమగ్ర ప్రణాళిక ప్రకారం జరిగేది అల్లకల్లోలం లేకుండా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ పొడిగింపుతో బాటు ఒక సవివరమైన ఆర్ధిక ప్రణాళిక మాట్లాడుకుని, ఎలా చక్కదిద్దుతారో యాక్షన్ ప్లాన్ తో ప్రజలకి పూర్తి భరోసా కల్పిస్తే మంచిది. పాత్రికేయుల నుంచి కూడా సలహాలు తీసుకుంటామంటున్నారు కాబట్టి - సీనియర్ పాత్రికేయుడు పుణ్య ప్రసూన్ బాజ్ పేయీ - అన్నిరంగాలూ శరవేగంగా పుంజుకోవడానికి గణాంకాలు సహా-  తెలంగాణా సహా అన్ని రాష్ట్రాల ఎగ్జిట్ ప్లాన్ చెబుతూ మొన్న రాత్రి  యూట్యూబ్ లో ఆలోచనాత్మక వీడియో పోస్ట్ చేశాడు. దీన్ని కూడా పరిశీలించ వచ్చు. 

        భావనా మాలి బాలీవుడ్ లో-
   యంగ్ డాన్సర్. ఎడ్యుకేటెడ్. ఆమె తన లాక్ డౌన్ కష్టాలు ఎబిపి ఛానెల్ కి తేలికగానే చెప్పుకుంది : ఫ్లాట్ అద్దె పదిహేడున్నర వేలు కట్టాలి, ఖర్చులకి ఇంకా చాలా కావాలి. దినభత్యంతో పనిచేసే తను ఏ నెలకా నెల గడుపుకొ స్తోంది. వచ్చేనెల అద్దె ఎలా కట్టాలో తెలీదు. యూనియన్ నుంచి మాటామంతీ లేదు. అసలు షూటింగులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీదు. ప్రారంభమైతే కరోనా ఎఫెక్ట్ తో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుల భవితేమిటో తెలీదు. భౌతిక దూరం అంటున్నారు. క్రౌడ్ సీన్లు వుండక పోవచ్చంటున్నారు...

   తమ్మారెడ్డి భరద్వాజ కూడా క్రౌడ్ సీన్లే కాదు, ఫైటింగ్ సీన్లూ, ఫారిన్ షూట్లూ ఇంకా చాలా కాలం పాటు మర్చిపోవాలన్నారు. సినిమా కథలు కూడా మారిపోతాయన్నారు. తమిళ సినిమాలకి ఫారిన్ షూట్లు ఏర్పాటు చేసే రాంజీ కూడా, ఇప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అసాధ్యమై పోయాయని అంటున్నారు. ఎవ్వరూ విమానాల్లో ప్రయాణించడాని కిష్టపడ్డం లేదనీ, బడ్జెట్లు కూడా అదుపు తప్పుతున్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నిన్న రాత్రి ఇది టైపు కొడుతున్న సమయానికి ఒక దర్శకుడు ఫోన్ చేసి, మాటల సందర్భంగా, రచయితలకీ దర్శకులకీ ఢోకా వుండదన్నారు. ప్రజలు ఇంట్లో కూర్చుని సినిమాలు చూసే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో డిమాండ్ వుంటుందన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి భావనా లాంటి వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఏ నటిగానో వృత్తి మార్చుకోవాలి. మార్చుకుంటానంటోంది. మార్పిళ్లు సర్దుబాట్లు చాలా జరుగుతాయి. ఒక న్యూ నార్మల్ పుట్టు కొస్తుంది. పనిలోపనిగా లిప్ లాకులు కూడా నిన్నటి చరిత్రే ఐపోవచ్చు. 

        స్ట్రగుల్ నిర్మాణ రంగంలోనే కాదు, ప్రదర్శనా రంగంలోనూ వుంది హాలీవుడ్ సహా. కాకపోతే అమెరికాలో ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నట్టు మన దగ్గర జరగడం లేదు. ఇంతే తేడా. అమెరికాలో జాతీయ థియేటర్ యాజమాన్యాల సంఘం, తమ లక్షా 50 వేల సిబ్బందికి బెయిల్ అవుట్ ప్రకటించండి మొర్రో అంటోంది. ఢిల్లీలో థియేటర్లు మూత బడ్డా ఖర్చులు తప్పడం లేదు. విద్యుత్ చార్జీలతో, సిబ్బంది జీతనాతాలతో నెలకి రెండు లక్షలు చేతి చమురు వదిలిస్తున్నాయి మూతబడ్డ థియేటర్లు. తమిళనాడులో తమ ఆదాయాలపై టీడీ ఎస్ ఎత్తేసి, రూరల్ సెంటర్స్ లో వినోదపు పన్ను రద్దు చేయాలంటున్నారు ఎగ్జిబిటర్లు. 

        ఐతే హాలీ వుడ్ రచయితల సంఘం, నటుల సమాఖ్యలతో బాటు; టీవీ, రేడియో ఆర్టిస్టుల సంఘాలు అన్ని స్టోరీ - ఇతర కంటెంట్ సమావేశాలన్నీ రద్దు చేశాయి. టాలీవుడ్ లో కూడా ఇదే జరిగితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కూడా రచయితలూ దర్శకులూ ఇప్పుడప్పుడే బిజీ కాలేకపోవచ్చు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సిఎన్ఎన్ - ఐబిఎన్ ఛానెల్లో రాజీవ్ మసంద్ కిచ్చిన ఇంటర్వ్యూలో, అసలు డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా భౌతిక దూరం సమస్య వుండనే వుందిగా అన్నారు. షూటింగు లెలా చేస్తారు? ఇప్పుడు ఇంట్లో బందీలైన ప్రేక్షకులు డిజిటల్ కి అలవాటు పడుతున్నారనేది నిజమే, కానీ కొత్త కంటెంట్ ఎక్కడ్నించి వస్తుందిప్పుడు?  

        చెన్నైలో కూడా నిత్యం జరిగే 50 టీవీ సీరియల్స్ షూటింగులు ఆగిపోయాయి. ఇక వెబ్ సిరీస్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అమెరికా, చైనాలు అతి పెద్ద సినిమా పరిశ్రమలు. లక్షల మంది ప్రజలు ఇళ్ళకి పరిమితమైపోయాక, అక్కడి నిర్మాతలు తమ కొత్త సినిమాలు ఎలా విడుదల చేయాలా అని తల బద్దలు కొట్టుకుంటున్నారు. అయిష్టంగానే స్ట్రీమింగ్ (డిజిటల్) వైపు చూస్తున్నారు. చైనాలో జనవరి నుంచి 70 వేల థియేటర్లు మూతబడ్డాయి. అక్కడ ఆన్ లైన్లో ఒక బిగ్ బడ్జెట్ సినిమా ‘లాస్ట్ ఇన్ రష్యా’ ని విడుదల చేస్తే 6 కోట్ల మంది చూశారు. అమెరికాలో కరోనా ఎఫెక్ట్ తో టీవీకి 6 శాతం, స్ట్రీమింగ్ కి 13 శాతం ప్రేక్షకులు పెరిగారని నీల్సన్ రిపోర్టు చెబుతోంది. అయితే హాలీవుడ్ కొత్త సినిమాలని స్ట్రీమింగ్ కివ్వడానికి ముందుకు రావడం లేదు. చిన్నచిన్న సినిమాలు వర్కౌటవుతా యేమో గానీ, పెద్ద సినిమాలు కావని భావిస్తున్నారు. విడుదల కావాల్సిన జేమ్స్ బాండ్ కొత్త సినిమా ‘నో టైం టు డై’ ని కూడా నవంబర్ కి వాయిదా వేశారు. చిన్న సినిమాల గ్లోబల్ రీచ్ కి ఈ గ్యాప్ లో స్ట్రీమింగ్ తో మంచి అవకాశాలుంటాయని అంటున్నారు. చిన్న సినిమాల డిజిటల్ రిలీజులు పెట్టుబడుల్ని వెనక్కి తెస్తాయని చెప్తున్నారు. 

        అసలు గ్లోబల్ బాక్సాఫీసుకి -
       చైనాలో జనవరి నుంచి థియేటర్ల మూతతో గట్టి దెబ్బ పడింది. 200 కోట్ల డాలర్ల థియేటర్ వసూళ్లు చైనాలో గాలిలో కలిసిపోయాయి. హాలీవుడ్ అంటే గ్లోబల్ మార్కెట్. ఉత్తర దక్షిణ కొరియాలు, జపాన్, యూరప్ లతో బాటు చైనా బిగ్ మార్కెట్. చైనా నుంచే అధిక రాబడి. అయినా సరే, ఇన్ని మార్కెట్లు మూతబడుతున్నాయి కదాని, పెద్ద సినిమాలని స్ట్రీమింగ్ కిచ్చేసే ఆలోచన చేయడం లేదు. ఇవ్వాళా ఒక పెద్ద సినిమాని ఇంట్లో కూర్చుని చూసిన ప్రేక్షకుడు, ఇంకో పెద్ద సినిమా కోసం ఇంట్లోనే కూర్చుని ఎదురు చూస్తాడు. థియేటర్ కి ఎంత మంది కుటుంబ సభ్యులు వెళ్తే అంత మందికి టికెట్లు కొంటారు. ఇంట్లో ఇలా కుదరదు. స్ట్రీమింగ్ లో 20 డాలర్లు ఒక సినిమాకి ఫీజు పెడితే, ఆ 20 డాలర్లే ఇంట్లోంచి వస్తాయి. వంద మంది చూసి పారేస్తారు...ఇలా లెక్క లేసుకుని వెనుకాడుతున్నారు హాలీవుడ్ నిర్మాతలు.

        డిస్నీసంస్థ మార్చి 27న విడుదలకి సిద్ధం చేసిన చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ములన్’ ని జులై 24 కి వాయిదా వేసింది. ఎట్టి పరిస్థితిలో స్ట్రీమింగ్ కి వెళ్ళల్చుకోలేదు. దీన్ని గనుక తమ డిస్నీ ప్లస్ లోనే విడుదల చేస్తే, ఈ యాక్షన్ వండర్ ని ఇంట్లో కూర్చుని చూసిన ప్రేక్షకులు, ఇలాటివి ఇక స్ట్రీమింగ్ లోనే వస్తాయిలే అనుకునే నెగెటివ్ రిజల్టు వచ్చే ప్రమాదముందని డిస్నీ అధికారులంటున్నారు.

        ఇంకా బ్లాక్ విడో, వండర్ వుమన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, ఏ క్వయిట్ ప్లేస్ 2 సహా 34 పెద్ద సినిమాల విడుదలల్నీ, ఇంకో 24 చిన్న సినిమాల విడుదలల్నీ జులై తర్వాత నుంచి వచ్చే సంవత్సరం దాకా వాయిదా వేసేశారు. పరిస్థితి చక్కబడి థియేటర్లు ప్రారంభమైనా, వెంటనే కొత్త సినిమాలు విడుదల చేయాలనుకోవడం లేదు. ముందుగా కొంతకాలం ప్రేక్షకుల స్పందనని పరీక్షించేందుకు, విడుదల కాని పాత సినిమాల్ని దుమ్ము దులిపి వేద్దామనుకుంటున్నారు. చైనాలో మార్చి చివరి వారంలో ప్రయోగాత్మకంగా 500 థియేటర్లు తెరిచి, ఇలాటి ఫార్ములానే అమలు చేస్తే ప్రేక్షకులు లేరు. ఒక థియేటర్ కి ఇద్దరు మాత్రమే వచ్చి మొహమొహాలు చూసుకున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పాత సినిమాలెవడు చూస్తాడని ఒకడు పోస్టు పెట్టాడు.

           
చైనాలో మార్చి చివరి వారంలో థియేటర్లు తెరవడానికి అనుమతిచ్చిన చైనా ఫిలిం అడ్మినిస్ట్రేషన్, అంతలోనే మూసేయాలని ఆదేశాలిచ్చింది. ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడమే కారణం. థియేటర్ల యాజమాన్యాలు కూడా థియేటర్లు తెరవడానికి సందిగ్ధంలో వున్నారు. ఎవరైనా ప్రేక్షకులు థియేటర్లో కరోనా బారిన పడి కేసువేస్తే నష్టపరిహారం చెల్లించడానికి ఇన్సూరెన్సు కవర్ కూడా లేదంటున్నారు. పైగా ప్రతివొక్క ప్రేక్షకుడికీ మాస్కు, చేతి గ్లవ్స్ ఉచితంగా అందించాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనలకి బెంబేలెత్తు తున్నారు. మన దేశంలో కూడా రేపు ఇదే నిబంధన పెడితే థియేటర్లకి కష్టమే. ఇప్పటికే బయట తిరిగే ప్రతివొక్కరూ మాస్కు ధరించాలని ఉత్తర్వు లిచ్చింది ప్రభుత్వం.         

        ఇండియాలో ప్రస్తుతానికి స్ట్రీమింగ్ ఆలోచన చేయడం లేదు. చిన్న సినిమాలకి స్ట్రీమింగ్ కి పెద్దగా అవకాశాల్లేవు. యూట్యూబ్ ఛానెళ్లని ఆశ్రయించాల్సిందే. తెలుగులో తెలుగుకే ప్రత్యేకమైన ‘ఆహా’ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీస్ లో విడుదల చేసుకోవచ్చు. హిందీలో, కరణ్ జోహార్ విడుదల ఆగిపోయిన ‘సూర్య వంశీ’ ని తిరిగి థియేటర్లలో ఎలా విడుదల చేయాలా అని ఆలోచిస్తున్నారే తప్ప, స్ట్రీమింగ్ ఆలోచన చేయడం లేదు. తమిళంలో విడుదలైన సినిమాల్ని రెండు నుంచి నాల్గు వారాల్లోనే స్ట్రీమింగ్ కిచ్చేయడం పైన ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాల ఆందోళన రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇక కొత్త సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ లోనే విడుదల చేసేస్తే తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు. చిన్న సినిమాలైనా, స్టార్ సినిమాలైనా విడుదలయ్యాక ఎనిమిది వారాల గడువు పెడితే ఓటీటీ విండోకి ఒప్పుకుంటామంటున్నారు. దక్షిణాదిన నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ‘ఆహా’ ఓటీటీతో బాటు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, జీ5, సన్ ఎన్ ఎక్స్ టీలు పనిచేస్తున్నాయి.      

        స్ట్రీమింగ్ బిజినెస్ కూడా-
      ప్రజలు ఎంత కాలం గృహలకి పరిమితమై వుంటారనే దాని మీద,  అలాగే వాళ్ళ వ్యక్తిగత ఆర్ధిక పరిస్థితి మీద కూడా ఆధారపడి వుంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి అమెరికాలో చాలా మంది వర్కర్ల ఆదాయాలు ప్రశ్నార్ధక మవుతున్న సమయంలో, కుటుంబ సమేతంగా ఒక సినిమాకెళ్ళి టికెట్లకి, పాప్ కార్న్ కీ, సోడాకీ 100 డాలర్లు వెచ్చించే కన్నా, 119 డాలర్లు రుసుము చెల్లించి ఏడాది పొడవునా ఇంట్లో సినిమాలు చూసుకోవడం లాభసాటి అన్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ లెక్కలు కూడా మారిపోతాయంటున్నారు. మొన్న మంగళవారం న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో, నగరంలో వైరస్ మే ఒకటిన పతాక స్థాయికి చేరుతుందని చెప్పారనీ, అయితే ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ సమయం తీసుకోవచ్చనీ, దాంతో హాలీవుడ్ సహా ప్రతీ పరిశ్రమా డైలమాలో పడతాయనీ, అప్పుడేం జరగబోతుందో ఎవరూ చెప్పలేరనీ విశ్లేషిస్తున్నారు. ట్రెండ్స్ ని అంచనా వేసి రికార్డు చేయడంలో దిట్ట అయిన నీల్సన్ కి చెందిన కట్ సింగ్రిస్ కూడా, ఈ విషయంలో చేతులెత్తేశారు. మీడియా పరిశ్రమకి దారులు మూసేసింది వైరస్ - అని మాత్రం చెప్పగల్గుతున్నారు. 


        లైట్ షెడ్ కి చెందిన మీడియా ఎనలిస్టు రిచర్డ్ గ్రీన్ ఫీల్డ్ కూడా, సాధారణ పరిస్థితు లెప్పుడు నెలకొంటాయో ఎవ్వరికీ తెలీదంటున్నారు. ఒకవేళ పరిస్థితులన్నీ చక్కబడి థియేటర్లు తెర్చుకున్నప్పుడు, కిటకిట లాడితే అదికూడా నమ్మరాదంటున్నారు. ఇళ్ళల్లో కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్యా వుండీ వుండీ వూపిరాడక బయటపడి సినిమాలకొస్తే, అది పొంగు మాత్రమేనని, అది ఇట్టే చల్లారిపోయి - వాళ్ళు తిరిగి సినిమాలు చూసుకుంటూ ఇళ్ళ దగ్గరా, వాళ్ళు లేక హాళ్ళు తిరిగి వెలవెల బోతూ భయానకంగా వుండక తప్పదనీ  గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు.

        ఇండియాలో ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకి రప్పించాలంటే ఒకటే మార్గమంటున్నారు కొందరు బాలీవుడ్ వ్యక్తులు. అది బిగ్ స్టార్ సినిమాలు తీసి విడుదల చేయడం. అయితే హిందీకైనా, తెలుగుకైనా, తమిళానికైనా ఓవర్సీస్ మార్కెట్ కూడా వుంటుంది. అక్కడ పరిస్థితి అసలే బాగా లేదు. అక్కడ ఆపుకుని ఇండియాలోనే విడుదలలు చేసుకోవాలి. లేదా గ్రీన్ ఫీల్డ్ థియరీని ఎదుర్కోవడానికి తెగించాలి.

        ఇదంతా సరే, అసలు 1918 లో-
      ఏం జరిగింది? అప్పటి స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా మహమ్మారిని సినిమాలెలా ఎదుర్కొన్నాయి? నూరేళ్ళ క్రితం తీసుకున్న చర్యలు ఇప్పుడేమైనా పనికొస్తాయా? ఈ ప్రశ్న మెదిలి వీకీపీడియా చూస్తే అందులో మహమ్మారి గురించి వుంది తప్ప, సినిమాల గురించి లేదు. సర్ఫింగ్ చేస్తూంటే రెండే రెండు చోట్ల సమాచారం. అది కూడా గతవారమే ఇచ్చిన తాజా సమాచారం. టైమ్ మేగజైన్లో ఒకటి, బిబిసి వెబ్సైట్లో ఒకటి. 

    ఈ తాజా కథనాల ప్రకారం, 1918 లో స్పానిష్ ఫ్లూ విజృంభణకి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది రాలిపోయారు. అందులో అమెరికన్లు ఆరులక్షల 75 వేలు. అన్ని దేశాల కంటే అత్యధికంగా మన దేశంలో కోటీ 20 లక్షల మంది చనిపోయారు. ఇది మొదట బొంబాయిని సోకింది. అందువల్ల బాంబే ఫ్లూ అన్నారు. 1918 -20 మధ్య రెండేళ్ళ పాటు గడగడ లాడిం చింది. అమెరికాలో ప్రభుత్వం వెంటనే అన్ని థియేటర్లనీ, పబ్లిక్ స్థలాలనీ మూసేయించింది. హాలీవుడ్ స్టూడియోల యాజమానులు మూడు వారాలపాటు షూటింగులాపుకుని, స్టూడియోలు మూసేశారు. పరిస్థితి చక్కబడ్డాక అతి తక్కువ థియేటర్లు మాత్రమే తెరవగల్గారు. పారమౌంట్ పిక్చర్స్ అధినేత ఆర్ధిక సమస్యలతో మూతబడే వున్న థియేటర్లని కొనేశాడు. అమ్మకపోతే నీ థియేటర్ ముందు థియేటర్ కడతామని అతడి మనుషులు బెదిరించి మరీ లొంగదీసుకున్నారు. స్టూడియోలే థియేటర్లని గుప్పెట్లో వుంచుకునే వ్యవస్థ అప్పట్నుంచీ ప్రారంభమైంది. 1948 లో థియేటర్లపై స్టూడియోల ఈ గుత్తాధిపత్యాన్ని సుప్రీం కోర్టు బద్దలు కొట్టింది.

        ఫ్లూతో ఇంత బీభత్సం జరుగుతున్నా అనేక దేశాల్లో థియేటర్లని మూసివేయనే లేదు. అవి ప్రజలకి పాపులర్ అడ్డాలుగా మారాయి. థియేటర్లలో పడి సినిమాలు చూడడం, ఫ్లూ అంటించుకుని చావడం. సినిమాలు పుట్టిందే అప్పుడప్పుడే. తెరమీద కదిలే బొమ్మలంటేనే మైండ్ బ్లోయింగ్ మేటర్. చూడకుండా ఏ శక్తీ ఆపలేదు. చూపించే వాళ్ళకీ అదే పిచ్చి ఆనందం. బ్రిటిష్ ప్రభుత్వానిది మరీ చోద్యం. ప్రజారోగ్యానికి సినిమా అనేది నిత్యావసర వస్తువు అని తేల్చింది. ప్రజల్ని ఇది బిజీగా, ప్రశాంతంగా వుంచుతుందనీ, ముఖ్యంగా తాగుడికి దూరం చేస్తుందని సిద్ధాంతాలు చేసింది. ఫ్లూ వీరవిహరంలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఒకచోట కాకపోతే ఇంకో చోట సినిమాలు ఆడుతూనే వుండేవి. లండన్ హాళ్ళలో ప్రతీ మూడు గంటల కోసారి, అరగంట పాటు కిటికీలూ తలుపులూ తెరిచి, హాళ్ళని రీఫ్రెష్ చేసేవాళ్ళు. పిల్లల్ని తీసుకుని రానిచ్చే వాళ్ళు కాదు. ఫ్లూ కారణం చూపించి థియేటర్లు మూసేయడం నాన్సెన్స్ అని, సినిమా ట్రేడ్ వ్యక్తులు థియేటర్ ఓనర్లకి ఉత్తరాలు రాసేవాళ్ళు. 

        అమెరికాలో థియేటర్ల మూసివేత రాష్ట్రాలని బట్టి జరిగింది. స్టూడియోలున్న లాస్ ఏంజిలిస్ లో వ్యాధి తీవ్రత అధికంగా వుండడంతో థియేటర్లు పూర్తిగా మూసేశారు. కాలిఫోర్నియాలో కూడా ఏడు వారాల పాటు మూసేశారు. సినిమా నిర్మాణాలు సహా, కొత్త సినిమాల విడుదలలు ఆపేశారు. ఈ పరిణామాల్లో చిన్న నిర్మాణ సంస్థలు తుడిచి పెట్టుకు పోయాయి. పెద్ద సంస్థలు మరింత బలమైన పెద్ద సంస్థలుగా ఎదిగాయి. నిర్మాణ- పంపిణీ – ప్రదర్శనా రంగాలు వాటి చేతిలో కెళ్ళి పోయాయి. అక్కడినుంచీ హాలీవుడ్ మెగా హాలీవుడ్ గా అవతరించి, ప్రపంచాన్ని ఏలుకోవడం మొదలెట్టింది సూపర్ మెగా సినిమాల పరంగా. 

        1918 లో అంత బీభత్సంలోనే నామరూపాల్లేకుండా పోలేదు అప్పుడప్పుడే పుట్టిన సినిమా - అలాంటిది ఇప్పుడేదో అయిపోతుందనుకోవడం భ్రమంటున్నారు. వీడియో కేసెట్ నే ఎదుర్కొని ముందుకు సాగింది, ఇప్పుడు స్ట్రీమింగ్ ఓ లెక్క కాదంటున్నారు. టీవీల్లో, కంప్యూటర్స్ లో సినిమాలు చూసి చూసి విసుగెత్తి, థియేటర్లలో వైడ్ స్క్రీన్ మీదే చూసేందుకు కదులుతారనీ, థియేటర్లో తెరమీద పడే బొమ్మ టెక్నికల్ నాణ్యత, హోం స్క్రీన్ మీద ఎప్పుడూ వుండదనీ, వివరిస్తున్నారు. థియేటర్లో ప్రేక్షక సమూహంలో కూర్చుని సినిమా చూసే కలెక్టివ్ అనుభవానికి, థ్రిల్ కీ మరేదీ సాటి రాదని అంటున్నారు. స్పానిష్ ఫ్లూనే కాదు, దాంతో బాటు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రాపంచ యుద్ధం కూడా చప్పరించి అవతల పారేసింది సినిమా అనీ గుర్తు చేస్తున్నారు.

        ఇప్పుడొక్కటి : తెలుగు సినిమాల విడుదలలు ప్రారంభమైతే, రివ్యూ రైటర్లు పండగ చేసుకోకుండా, వెబ్సైట్ల హిట్ల కోసం తెల్లారే పోటా పోటీగా పరుగులు తీయకుండా, రేటింగుల ప్రతాపం చూపించకుండా, కొన్నాళ్ళు సినిమాలని అలా బతకనియ్యాలి. సినిమాలు ఇప్పుడు బతికితే సినిమా రంగం తిరిగి బతుకుతుంది. ప్రకృతి ఎందుకో న్యూ నార్మల్ ని స్థాపించే దిశగా నెట్టేసింది మనల్ని...ఇది నోట్ చేసుకోవాలి.

సికిందర్

8, ఏప్రిల్ 2020, బుధవారం

925 : సందేహాలు - సమాధానాలు


Q :  లాక్ డౌన్ తర్వాత సినిమాల పరిస్థితి ఎలా వుంటుంది? సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు వస్తారా? వస్తే ఎలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటారు? దీని మీద ఎనాలిసిస్ చేయండి.
రవి, అసోషియేట్
A :  ఎనాలిసిస్ చేసేంత క్లోజప్ షాట్ లేదు గానీ...దీని మీద రీసెర్చి లాంటిది చేస్తున్నాం, రేపు సాయంత్రం లాంగ్ షాట్ చూడగలరు. 

Q :  డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్ జానర్ ఎనాలిస్ అందించినందుకు థాంక్స్. ‘హిట్’ మూవీ స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు.
రామ్, అసోషియేట్
A :  ముందు క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -5 వ్రాయాల్సి వుంది. ఇది రేపు పూర్తయ్యాక, ‘హిట్’ గురించి ఆలోచిద్దాం. 

Q :  ‘లుక్కా ఛుపీ’ స్క్రీన్ ప్లే సంగతులు అందించగలరు. న్యూ వేవ్ రోమాంటిక్ కామెడీలకి ఉపయోగంగా వుంటుందనే ఒక భావనతో అడుగుతున్నాను సర్.
 గోపాల్, అసోషియేట్
A :   
     ఇప్పుడు న్యూ వేవ్ అంటే రియలిస్టిక్ గా తీయడం. కథ మాత్రమే న్యూవేవ్ గా వుండి మూస ఫార్ములాగా తీసే ట్రెండ్ పోయింది. అలాగే బోల్డ్ సబ్జెక్టుల్ని నగర వాతావరణంలో కూడా తీయడం పాతబడింది. నగర సంస్కృతిగా వుంటూ వచ్చిన లివ్ ఇన్ రిలేషన్ షిప్పులు, గే సెక్సులు లాంటి బోల్డ్ సబ్జెక్టుల్ని, ఇంకా నగర వాతావరణంలోనే తీస్తే షాక్ వేల్యూ వుండడం లేదు. అక్కడ వాటి పసతీరింది. బోల్డ్ సబ్జెక్టుల్ని నగర నేపధ్యంలోంచి టౌన్ల పరిధిలోకి తెచ్చి తీస్తే, అక్కడి సమాజానికి అవి షాక్ వేల్యూతో కొత్త ట్రెండ్ ని సృష్టించే కథలవుతున్నాయి. టౌన్లలో అదీ మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాటి బోల్డ్ కథల్ని చిత్రించడం ఇప్పుడు రియలిస్టిక్ న్యూవేవ్ సినిమా కింద నడుస్తున్న ట్రెండ్ హిందీలో. మథురలో తీసిన ‘లుక్కా చుప్పీ’, అమృత్ సర్ లో తీసిన ‘మన్మర్జియా’, బరేలీలో తీసిన ‘బరేలీకీ బర్ఫీ’, అలహాబాద్ లో తీసిన ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’  మొదలైనవి... ఇవి ఆ పట్టణ సంస్కృతిని భాగంగా చేసుకుని, నేటివ్ స్పెసిఫిక్ గా, ఆ వూళ్ళోనే, అక్కడి మనుషుల మధ్యే జరుగుతున్నట్టు రియలిస్టిక్ గా చిత్రీకరిస్తున్నారు. అందుకని ముందు బాలీవుడ్ కనిపెట్టిన ఈ కొత్త జానర్ మర్యాదలేమిటో -మార్కెట్ ఎత్తుగడేమితో - కూడా క్షుణ్ణంగా ఇలాటి హిందీ సినిమాలు చూసి అర్ధం జేసుకుని, ప్రయత్నించగల్గితేనే ‘లుక్కా చుప్పీ’ లాంటి కామెడీలు తెలుగులో ఫ్రెష్ గా వస్తాయి. అంతేగానీ, ‘లుక్కా చుప్పీ’ న్యూవేవ్ గా వుందని, అలాటి కథ మాత్రమే రాసుకుని, తాడేపల్లి గూడెం వెళ్లి పాత చింతకాయలా తీస్తే నవ్విపోతారు. ‘లుక్కా చుప్పీ’ గురించి రాద్దాం.  

Q :  నేను రాస్తున్న క్రైం థ్రిల్లర్ స్టోరీ మీ సజెషన్ కోసం షేర్ చేశాను...
హరీష్ సాఫ్ట్ వేర్, రైటర్
A :  ముందుగా బ్లాగులో ఇచ్చిన క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద వ్యాసాలు చదివి బేసిక్స్ బాగా అర్ధం జేసుకోవాలి. క్రైం థ్రిల్లర్ కి విజువల్ మీడియా బేసిక్స్ వేరే వుంటాయి. మీరు రాసింది ప్రింట్ మీడియా కథ. కాబట్టి ఎండ్ సస్పెన్స్ తో వుంది. ఎండ్ సస్పెన్ టాపిక్ ని కూడా స్టడీ చేసి జాగ్రత్త తీసుకోండి. 

Q :  సినిమాల గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకునే నా లాంటి ఔత్సాహిక సినిమా ప్రేమికులు మీ రివ్యూస్, ఆర్టికల్స్ ద్వారా ఏంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. దానికి మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నా. థాంక్స్ సర్.
నానీ, ఎలక్ట్రానిక్ మీడియా
A :  నానీ, ఇంత వద్దుగానీ కంటెంట్ ఎంజాయ్ చెయ్. 

Q :  I am reading all your past reviews. You have a great sense of humour. If you write a comedy script it will be a master piece but it will be a flop because our guys don't get that humour.
RSC, Director
A :  😃....దీనికేం చెప్పాలి!



సికిందర్ 

7, ఏప్రిల్ 2020, మంగళవారం

924 : సాంకేతికం - షాట్స్ సంగతులు


        (సారీ, కొన్ని పెండింగ్ (రాత) పనుల వల్ల ఈ ఆర్టికల్  ఎక్కువ సమయం తీసుకుంది)
       
కొన్ని సినిమాల్లో వెంటాడే దృశ్యాలుంటాయి. వెంటాడ్డానికి జీవంతో తొణికిస లాడ్డం కారణం. దృశ్యాల్లో తీసే ప్రతీ షాటూ వాటికీ శాశ్వతత్వం కల్పించడం. రైటర్ పని పాత్రని సృష్టించి దాని మానాన వదిలెయ్యడం. పాత్రని పట్టకుని తను కథ నడపడం కాదు. పాత్ర దాని కథ అదే నడుపుకునే ఫస్ట్ హేండ్ డ్రైవ్ అవకాశం కల్పించడం. మేకర్ పని కూడా షాట్స్ ని బయట నుంచి పాత్రల మీద రుద్దడం కాదు, లోపలి నుంచి ఇన్నర్ ఇంజనీరింగ్ జరపడం. అందచందాలు ఫైపైన లేపనాల వల్ల రావు, లోపలికి తీసుకునే పానీయాల వల్ల వస్తాయి. షాట్స్ కూడా లేపనాలు కాకుండా పానీయాలు కావాలి. అప్పుడు జీవం వస్తుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర  వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయి. చాలా సినిమాల్లో ఈ వరస కన్పించదు. అందువల్ల ఆ సీన్లు థియేటర్ లోంచి బయటకి కొస్తే గుర్తుండవు. పాత్రల్లోపలి నుంచి దాని దృక్కోణాన్ని చూస్తూ షాట్స్ ఆలోచించకుండా, బయటి నుంచి మేకర్ తనదేదో దృక్కోణంతో పాత్రమీద షాట్స్ ని రుద్దితే ఏకత్వం చెడి దృశ్యం నిలబడదు. ఆర్ట్ సినిమాల్ని, లేదా మన ప్రాంతీయ సినిమాల్ని చూస్తూంటే ఇదే అర్ధమవుతుంది. ఇందుకే ఇవి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందుతూంటాయి. 

         
ర్ట్ సినిమా మేకింగ్ కమర్షియల్ సినిమాల కెందుకనుకోవచ్చు. ఆర్ట్ సినిమాలే కాలాన్ని బట్టి మారి కొంత కమర్షియాలిటీనీ కూడా కలుపుకుని, ఫ్యూజన్ తో క్రాసోవర్ సినిమాలుగా వస్తూంటే, కమర్షియల్ సినిమాలు ఆర్ట్ సినిమాల్లోంచి వీలైనవి తీసుకోవడం పరువు తక్కువేం కాదు. 

        1977 లో తన ఐదవ సినిమాగా శ్యాం బెనెగళ్ తీసిన ‘భూమిక’  ఇవాళ్టికీ ఇవాళ్టి సినిమాలాగే వుంటుంది కథతో, పాత్రలతో, మేకింగ్ తో. మరాఠీ ప్రేక్షకుల ‘సావిత్రి’ అనదగ్గ  నాటి పాపులర్ హీరోయిన్ హంసా వాడ్కర్ సంక్షుభిత ప్రేమల విషాద కథ ఇది. సంక్లిష్టమైన హంసా పాత్రని స్మితా పాటిల్ నటించింది కేవలం 22 ఏళ్ల వయసులోనే. కథలో సినిమా హీరోగా అనంత్ నాగ్, దర్శకుడుగా నసీరుద్దీన్ షా, ధనికుడుగా అమ్రిష్ పురీ కన్పిస్తారు. ప్రసిద్ధ ఆర్ట్ సినిమాల దర్శకుడు గోవింద్ నిహలానీ ఛాయాగ్రహణం సమాకూర్చాడు. 


        ఇందులో ప్రారంభంలో కుటుంబ దృశ్యం వుంటుంది. ప్రారంభంనుంచీ ఈ దృశ్యం షాట్స్ పరంగా కట్టి పడేస్తూ ముందుకు లాక్కెళ్తుంది. చాలా మతిపోగొట్టే షాట్ కంపోజింగ్, డ్రామా. ఈ దృశ్యం చూడమని ఇద్దరు ముగ్గురు దర్శకులకి క్లిప్పింగ్ పంపిస్తే, చూసి థ్రిల్లయి పోయారు. ఇక దీని గురించి రాయక తప్పని పరిస్థితి...


ఈ సీను నేపథ్యమేమిటంటే ...
       సినిమా హీరోయిన్ స్మితా పాటిల్ కి భర్త అమోల్ పలేకర్, ఓ కూతురూ తల్లీ వుంటారు. పలేకర్ స్మిత మీద ఆధారపడి బతికేస్తూ వుంటాడు. పైగా అనుమానాలు పెట్టుకుని వేధిస్తూ వుంటాడు. ఇతణ్ణి భరించలేక గతంలో ఒకటి రెండు సార్లు వెళ్ళిపోయినా, మళ్ళీ తీసుకొస్తే వచ్చింది. దీంతో మరీ చులకనై పోయింది. అతను తనికిలా బతికే హక్కుందని భావిస్తూంటాడు. ఆమె చిన్నప్పట్నుంచీ ఆర్ధికంగా కుటుంబాన్నితను ఆదుకున్నాడనీ, సినిమాల్లో నటించే అవకాశాలిప్పించి, ఆమె కెరీర్ ని తను మేనేజ్ చేశాడనీ, పైగా దిక్కులేని చిన్న వయసులో ఆమెని పెళ్ళి చేసుకుని, ఇంటిదాని హోదా కల్పించాననీ గుర్తు చేస్తూ వుంటాడు. తన సంపాదన మీద అతను బతకడం ఆమె కభ్యంతరం కాదు. అభ్యంతరమల్లా అనుమానాలు పెట్టుకుని వేధిస్తేనే. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్ నుంచి ఆమె రాక కోసం ఇంటిదగ్గర అసహనంగా వెయిట్ చేస్తూంటాడు. ఇక్కడ్నించీ ఈ సీను ప్రారంభమవుతుంది...ఐతే ముందుగా ఇక్కడ పైన పోస్టు చేసిన ఈ సీను క్లిప్పింగ్ ఒకటికి రెండు సార్లు చూసి డైజెస్ట్ చేసుకోవాలి. 

సీను ఎలా వుందో చూద్దాం : 
         1. బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తూంటాడు పలేకర్. జేబులోంచి అగ్గిపెట్టె తీసి, సిగరెట్ నోట్లో పెట్టుకోబోతూ, కారు శబ్దానికి ఆగి, కిందికి తొంగి చూస్తాడు. కారు ఇంటి ముందాగుతుంది. కార్లోంచి స్మిత, దర్శకుడూ దిగి ఏదో మాట్లాడుకుంటారు. అతను కారెక్కేసి వెళ్ళిపోతాడు. మండిపోతూ పలేకర్ లోపలికొచ్చి, సిగరెట్ పట్టుకుని ఆగిపోతాడు. దీని బుద్ధి మారడం లేదు ఏం చేద్దామా - అన్నట్టు చూసి, ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు. 


           
2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి (కిరణ్ విరాలే) చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది. 

       
3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి (సులభా దేశ్ పాండే) టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం  తిప్పుకుంటుంది.

     4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుంది. ఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి. 


        5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో  ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు. 

        6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు. 

       7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలోతగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది. 

        8. కోపాన్ని అణుచుకుంటూ, ‘నువ్వు మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మం టాడు. 

        9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా.   

        10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళి టాక్సీనాపి ఎక్కేస్తుంది...

ఇక్కడ భూమిక ఆమె పేరు కాదు
డిక్షనరీ అర్ధంలో
‘పాత్ర’
       వివిధ క్లిష్ట దశల్లో తన జీవితమనే నాటకంలో తను - ఉష అలియాస్ ఊర్వశి (స్మిత పాత్ర పేరు) - పోషించాల్సి వచ్చిన విభిన్న పాత్రలు. ఈ కథకి స్క్రీన్ ప్లే సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్, శ్యాం బెనెగళ్ రాశారు (శ్యాం బెనెగళ్ తన పేరు వినమ్రంగా చివర వేసుకున్నారు). సంభాషణలు సత్యదేవ్ దుబే రాశారు. పాత్రల అంతరంగ ప్రగాఢ మథనం కథని, దృశ్యాల్ని కట్టిపడేసేట్టు తీర్చిదిద్దింది. 

         ఇప్పుడు పై దృశ్యపు షాట్ డివిజన్ సంగతుల కెళ్ళే ముందు, ఈ దృశ్యంలో ఏది ఎందుకుందో, ఏ చర్య కర్ధమేంటో చూద్దాం. పై దృశ్యాన్ని 10 భాగాలుగా విభజించాం (దృశ్యాలు రాయడం ఈజీ, విశ్లేషించాలంటే చాట భారతం. ఒక దృశ్యాన్ని విశ్లేషించడానికి పట్టే కాలంలో పది దృశ్యాలు రాయొచ్చు. కాబట్టి విశ్లేషకుల్ని చిన్న చూపు చూడరాదు). పై దృశ్య విభాగాల్లో పాత్రల చర్యలు, చర్యల వల్ల పుట్టే మాటలు, ఎక్కడ ఎలా పడాలో అక్కడ అలా పడడాన్ని గమనించ వచ్చు, అంతే కాదు, ఏ స్క్రీన్ టైముతో ఏ సిట్యుయేషన్లో ఎలా కెమెరాలో రివీలవ్వాలో - అక్కడ అప్పుడు అలా పాత్రలు ప్రత్యక్షమవడాన్ని కూడా సూక్ష్మ దర్శిని పెట్టి చూడొచ్చు. కొన్ని వస్తువుల సమయానుకూల ప్రయోగం కూడా చూడొచ్చు. ఇలా మైక్రో లెవెల్లో ఈ సీన్ని చూసినప్పుడే సీను చెరగని ముద్ర వేస్తుంది. 

        ఒకే షాట్ లో, లేదా కొన్ని షాట్స్ లో నటీనటులందర్నీ ఎలాపడితే అలా కూడేసి, నటింపజేయడం దృశ్య కథన మంటారా? పోనీ డ్రామా అంటారా? అనరు. దృశ్యానికీ దృశ్యం లోపల దాని స్ట్రక్చరుంటుంది. మొత్తం స్క్రీన్ ప్లేకి ఏ స్ట్రక్చరుంటుందో అదే దృశ్యంలోపలా వుంటుంది. అవే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలుంటాయి. ఆ విభాగాల్లో అవే వాటి బిజినెస్సులుంటాయి. ప్రారంభ ముగింపులుంటాయి. స్క్రీన్ ప్లే ఒక హీరో లేదా హీరోయిన్ తో వున్నట్టే, దృశ్యమూ ఆ దృశ్యాన్ని బట్టి హీరో లేదా హీరోయిన్ తో వుంటుంది. ఆ పాత్రకి దృశ్యంలో ఓ ప్రారంభం, ముగింపూ వుంటాయి. 

        పై దృశ్యం స్మితా పాటిల్ ది, అమోల్ పలేకర్ ది కాదు. అందుకని ఆమె కేంద్రంగానే దృశ్య కథనముంది. ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో బయటి నుంచి ఇంట్లోకి వచ్చింది. పలేకర్ తో సంఘర్షించి కన్నీళ్ళతో ఇంట్లోంచి బయటికెళ్ళి  పోయింది. ఇదీ సీనులోకి పాత్ర రాకపోకల - ప్రారంభ ముగింపుల డైనమిక్స్, లేదా ద్వంద్వాలు. ఆరు నిమిషాల్లో జీవితమే మారిపోయింది. 

వరసగా దృశ్య విభాగాలు పరిశీలిద్దాం
      1. బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తూంటాడు పలేకర్. జేబులోంచి అగ్గిపెట్టె తీసి, సిగరెట్ నోట్లో పెట్టుకోబోతూ, కారు శబ్దానికి ఆగి, కిందికి తొంగి చూస్తాడు. కారు ఇంటి ముందాగుతుంది. కార్లోంచి స్మిత, దర్శకుడూ దిగి ఏదో మాట్లాడుకుంటారు. అతను కారెక్కేసి వెళ్ళిపోతాడు. మండిపోతూ పలేకర్ లోపలికొచ్చి, సిగరెట్ పట్టుకుని ఆగిపోతాడు. దీని బుద్ధి మారడం లేదు ఏం చేద్దామా - అన్నట్టు చూసి, ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు.

        వివరణ : పలేకర్ అలా అసహనంగా ఎదురు చూసే మాటేమోగానీ, చేతిలో ఆ సిగరెట్ పెద్ద సస్పన్స్ అయిపోయింది. అదెప్పుడు ముట్టిస్తాడో తెలీదు. లోపలికొచ్చి కూడా ముట్టించడు. దానికి తగ్గ మానసిక స్థితి రావాలి. అదెప్పుడోస్తుందో వస్తుంది. ముట్టించబోతూంటే ఆమె కార్లో డైరెక్టర్ తో రావడం కళ్ళబడ్డాక అదే పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది. ముందామె సంగతి చూసిగానీ...

        ఇటు మెట్ల వైపు తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డప్పుడు - గడప లోపలే నిలబడ్డాడు. ఆ గడప అతడి ఇన్ఫీరియారిటీకి గుర్తు. అది దాటి ఆమె మానసిక ప్రాంగణంలోకొచ్చి మాట్లాడే ధైర్యంలేదు. పైకి ఎంత ధూంధాం చేసినా, లోలోపల ఆమె సొమ్ము తింటున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వుంది. 

        2. ఆమె మెట్లెక్కి పైకొస్తుంది. సిగరెట్ అలాగే పట్టుకుని కోపంతో చూస్తూంటాడు. అతణ్ణి చూసుకుంటూ లోపలి కెళ్లిపోతుంది. హాల్లో చదువుకుంటున్న కూతురి చెంప నిమిరి, ‘సుషూ, నువ్వివ్వాళ్ళ ఇంటిదగ్గరేనా...’ అని పలకరించి, స్వింగ్ డోర్స్ తోసుకుని అటెళ్ళి పోతుంది.

        వివరణ : ఇక్కడ కూడా సిగరెట్ ముట్టించలేదు. స్మిత అతడికేసి చూస్తూ లోపలి కెళ్ళిపోయింది. ఇంతవరకూ ఇంట్లో పలేకర్ ని తప్ప ఇంకెవర్నీ చూపించలేదు. అతడికి కూతురున్న సంగతి మనకింకా తెలీదు. స్మిత వచ్చాకే ఆమెతో ఎటాచ్ చేసి కెమెరాలోకి తెచ్చారు. ఇప్పుడు హాల్లో చదువుకుంటున్న కూతురు రివీలయ్యింది. ప్రధాన పాత్ర ననుసరించి ఒకటొకటే రివీల్ చేస్తూ సీనుని వెల్లడించే విధానం. స్మిత కూతురి చెంప ప్రేమగా నిమిరి- నువ్వివాళ్ళ ఇంటిదగ్గరేనా -అనడం,  స్మిత తెల్లారే ఎప్పుడో షూటింగు కెళ్ళిపోయిందన్న సమాచారం మనకిస్తూ కథని వెల్లడిస్తోంది. 

        ఇక స్వింగ్ డోర్స్. స్వింగ్ డోర్స్ తోసుకుని వెళ్తుంది స్మిత. ఈ స్వింగ్ డోర్స్ ఏమిటి? ఆయారాం గయారాం. ఆమె జీవితం నిలకడగా లేదని అర్ధం. ఎప్పుడు ఈ ఇంట్లో కాపురముంటుందో, ఎప్పుడు ఎటెళ్ళిపోతుందో తెలీదనే పరిస్థితికి - లోపలికీ, బయటికీ తెర్చుకునే ఆ స్వింగ్ డోర్స్ సింబాలిజం.

       
3. ఇంకా మండి పడుతూ గబగబా వచ్చేస్తాడు. కిచెన్లోంచి వస్తున్న స్మిత తల్లి టీ కప్పుతో ఎదురవుతుంది. ఆగిపోయి చేతిలో సిగరెట్ ని చూసుకుని, మొహం తిప్పుకుని, ఛీ అన్నట్టు చేయి విసిరి వెళ్ళిపోతాడు. టీ కప్పుతో ఆమె అలాగే నిలబడిపోయి, హాల్లో మనవరాలి కేసి చూస్తుంది. మనవరాలు ఆమెని చూసి మొహం  తిప్పుకుంటుంది.

        వివరణ : మొదట మనకి కూతురి పాత్ర తెలిసింతర్వాత, స్మిత అలా స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళగానే, రెండో పాత్రగా ఆమె తల్లి పాత్ర మనకి పరిచయమవుతూ కెమెరా లోకొచ్చింది. అంటే ఆమెకి తల్లి కూడా వున్నట్టు ఇప్పుడు మనకి తెలిసింది. స్మిత తన ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకోకుండా, తనతో మాట్లాడకుండా వెళ్ళిపోయే సరికి, అతను ఇంకింత మండిపోయి వచ్చేస్తూంటే -  అత్తగారు టీ కప్పుతో ఎదురయ్యింది. ఆగిపోయి, సిగరెట్ ని చూసుకున్నాడు. ఇప్పుడు కూడా ముట్టించుకోలేదు. టీ అందుకునే మూడ్ లేక, ఛీ అనుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి ఈ ముఖాముఖీ వాళ్ళిద్దరి మధ్య కూడా సత్సంబంధాలు లేవని కథని తెలియజేస్తోంది. ఆమె మనవరాలి కేసి చూసే విధం, మనవరాలు మొహం తిప్పుకుని ఎటో చూసే విధం, వాళ్ళిద్దరూ ఇంట్లో జరిగే తతంగాలకి మౌన ప్రేక్షకులని కథని తెలియ జేస్తుంది. ఇలా రివీలవుతున్న పాత్రలకి పరస్పరం ఎటాచ్ మెంట్ ఇప్పిస్తూ, పూర్తి కుటుంబ వాతావరణాన్ని మన ముందుంచారు. 

        4. స్మిత గబగబా బెడ్ రూంలోకి రావడం లిప్తపాటు కాలం కిటికీ వూచల్లోంచి కన్పిస్తుంది. బెడ్రూంలోకొచ్చి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు చెప్పులు విడుస్తూంటే తలుపు దగ్గర నిలబడి, ‘ఎందుకాలస్యమైంది?’ అంటాడు. మాట్లాడదు. ‘నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడెవడు?’ రెట్టిస్తాడు. ఇటు తిరక్కుండానే ఆమె, ‘పైన నిలబడి చూశావ్ గా?’ అని చీర విప్పుతూంటుంది. ఆమే, అద్దంలో ఆమె ప్రతిబింబమూ రెండూ చూస్తూంటాడు. ‘చూశా, అందుకే అడుగుతున్నా’ అంటాడు ఆమె ప్రశ్నకి జవాబుగా. ఆమె మాట్లాడదు. ‘ఆ ఫిలిం డైరెక్టర్ తో రిపీట్ చేయాలనుకుంటున్నావా?’ అంటాడు తిరిగి. 

        వివరణ : ఇక స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోయిన స్మిత ఇప్పుడు అటు గదిలోంచి వేగంగా వెళ్లి పోవడాన్ని వూచల కిటికీ లోంచి చూస్తాం. ఎందుకిలా? నేరుగా ఆమెని బెడ్రూంలో చూపించ వచ్చు కదా? అలా చూపిస్తే రసోత్పత్తి జరగదు, కథోత్పత్తి కూడా జరగదు. గానుగాడించిన పిప్పి మిగుల్తుంది. ఈ కిటికీ వూచల్లోంచి ఆమెని చూపించడం పంజరంలో వున్నట్టు చూపించడం. ఇప్పుడుంటున్న ఇల్లొక పంజరం, ఇక్కడే కాదు, ఈ సీను తర్వాత కథలో ఇంకా మున్ముందు ఇంకో ముగ్గురితో సంబంధాలు కూడా పంజరాలేనని మనకి తెలుస్తాయి. అయితే ఇక్కడ అలా క్షణకాలంలో వేగంగా వెళ్ళిపోతున్నట్టు చూపించడంలో అర్ధం? ఏ పంజరాన్నీ ఆమె సహించదు. పంజరమని తెలీక సంబంధంలోకి వెళ్తుంది, తెలిసిన వెంటనే తెంచుకుని అవతల పడుతుంది. ఇప్పుడున్న పంజరంలో వుండలేక పోతోంది కాబట్టే మెరుపు వేగంతో ఆ నడక. ఆయారాం గయారాం స్వింగ్ డోర్స్ తర్వాత, దాని కొనసాగింపుగా ఈ పంజరం సింబాలిజం. స్వింగ్ డోర్స్ లోంచి వెళ్ళిపోతే ఆమెకి పంజరాలే. 

        ఇక డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి ఆమె చెప్పులు విడవడం. అదామె దినచర్యలో భాగమే. రోజూలాగే ఇప్పుడూ ఇంటికొచ్చాక ఇంట్లోనే కదా వుంటుంది. అందుకని చెప్పులు విడుస్తోంది. ఇంకొన్ని క్షణాల్లో ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురవుతుందని ఎలా వూహించగలదు. చెప్పులు విడవడమే కాదు, చీర కూడా మార్చుకుంటోంది. అతను డిటోగా మళ్ళీ గడప అవతలే నిలబడ్డాడు. ఇప్పటికీ ఆమె మనో ప్రాంగణంలో కెళ్ళే దమ్ముల్లేవు. ఇక అద్దం ముందు స్మిత, అద్దంలో ఆమె ప్రతిబింబం- అతడి అనుమానపు బుర్రకొద్దీ ఆమెలో అతను చూస్తున్న రెండు రూపాలు. అతడి మానసిక స్థితికి కనెక్ట్ చేసే సింబాలిజం.  

        5. ఆమె విసురుగా ఇటు తిరిగి, ‘ఎన్నిసార్లు చెప్పాలి- ఆ విషయం -ఎత్తొద్దని - నీకు!!’ అని ఫైర్ అయిపోయి, చీర చుట్టి విసిరి కొడుతుంది. ‘డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు’ అంటాడతను. విసుగెత్తి పోయి, సొరుగు లాగి లోపలున్న చీరెల్ని చూస్తూంటే, మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో  ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటాడు. 

       
వివరణ : అతనేం ఆరోపిస్తున్నాడో, దానికామె రియాక్షన్ ఎలా వుందో చూస్తున్నాం. కానీ అంత రియాక్షన్లో కూడా ఆమె వెళ్లి పోవాలన్న ఆవేశంతో సొరుగు లాగలేదు. వొంటిమీద చీర లేదు, చీర కట్టుకుందామనే సొరుగు లాగి చూస్తోంది. అతనే ఫూలిష్ గా రెచ్చగొట్టాడు. మళ్ళీ వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టుకుంటోందేమోనని, ‘అప్పుడేదో ఇంటికి తీసుకొచ్చా, మళ్ళీమళ్ళీ తీసుకు రాను!’ అంటూ. ఈ డైలాగుతో కథ కూడా మనకి తెలియజేయడం. అంటే ఆమె ఇదివరకే వెళ్లి పోయిందనీ, వెళ్తే తీసుకొచ్చాడనీ. అదే సమయంలో, ఎందుకు తీసుకొస్తున్నాడనే ప్రశ్నకూడా తలెత్తి, ఇది కూడా తెలుసుకోవాలన్న ఉత్కంఠ మనకి కలిగిస్తోంది ఈ డైలాగు. ఆమె సొరుగు లాగడమనే చర్యని  ఇన్ని విషయాలు తెలియ జేయడం కోసం వాడారు రచయితలు. 


    6. అసహ్యంగా చూసి, ‘ఐతే అక్కడే ఎందుకు చావనివ్వలేదు నన్ను? ఎందుకు వాపసు తెచ్చావ్?’ అని కసురుతుంది. ‘తప్పు చేశా’ అంటాడు. ‘నా సంపాదన నీకవసరం, అందుకేగా?’ అని మొహం తిప్పుకుంటుంది. ఆమె వైపు నింపాదిగా చూసి, ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని, ముట్టించుకుని పీలుస్తాడు. ఇప్పుడు తలుపు దగ్గర్నుంచి కదిలి బెడ్రూం లోకొస్తాడు. ఆమెని తీక్షణంగా చూస్తూ, ‘నీ పేర సపరేట్ బ్యాంక్ ఎక్కౌంటు తెర్చావట, నిజమేనా?’ అంటాడు. ఆమె పక్క కెళ్ళి పోతుంది. ఆమెవైపు తిరిగి, ‘కొత్త కాంట్రాక్ట్ కూడా సైన్ చేశావట?’ అంటాడు. పనివాడు టీ కప్పుతో లోపలి కొస్తాడు. 

       
వివరణ : ఇక్కడ వెంటనే సమాధానం దొరికింది. అదీ సంగతి. ఆమె సంపాదన మీద ఆధారపడ్డాడు కాబట్టే ఒకసారి వెళ్ళిపోతే తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆమె వున్నదున్నట్టు విషయం మొహం మీద చెప్పేసే సరికి, ఇక లాభంలేదని గట్టి దెబ్బ కొట్టేసేందుకు సిద్ధమైపోయాడు. ఇలా పై చేయి ఆమెది కాకూడదు. తన దగ్గర ఆమె దొంగలా దొరికిపోయే పక్కా ఎవిడెన్స్ వుంది. అందుకని ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి సిగరెట్ వెల్గించాడు! దమ్ము లాగాడు. ఈ పూట ఇంత సేపూ ఈ ఇంట్లో తనేమిటీ అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు తీరిపోయింది. క్లియరై పోయింది. ఈ సీనుకి సీనంతా తనొకే ఎక్స్ ప్రెషన్ తో వున్నాడు. ఎక్కడా ఇంకో ఎక్స్ ప్రెషనివ్వలేదు. ఇప్పుడు తను చేతికి చిక్కందని కూడా విషపు నవ్వు నవ్వలేదు. ఇక ధైర్యంగా ఇప్పుడు గడపదాటి బెడ్ రూమ్ లోకొచ్చేశాడు... డామ్ ష్యూర్ గా ఆమె మైండ్ స్పేస్ లోకి ఎంటరై పోయాడు! ఆమె సపరేట్ బ్యాక్ ఎక్కౌంటు, కొత్త సినిమా సైనింగు క్వశ్చన్ చేసేశాడు! గూడుపుఠాణీకి పక్కా ఎవిడెన్స్.

         మధ్యలో పనివాడు టీ కప్పుతో వచ్చేశాడు. ఇంతసేపూ వీడెక్కడున్నాడు. కిచెన్లో వున్నాడేమో. బాత్రూంలో బట్టలుతుకుతున్నాడేమో లాజిక్కి ఇబ్బందిలేదు. అవతల స్మిత తల్లి టీ కప్పుతో అలాగే వున్నట్టుంది. పనివాడి కిచ్చి పంపింది. ఈ టీ ద్వారా పలేకర్ బలహీనతని బయట పెట్టడం దర్శకుడి ఉద్దేశం. ఇదెలాగో చూద్దాం....

        7. స్మిత చీర కట్టుకుంటూ అతడి వైపు తిరిగి, ‘డబ్బంతా పేకాటలో తగిలేద్దామనా? సుషూ గురించి ఆలోచించొద్దా? అమ్మ గురించి ఆలోచించొద్దా నేనూ?’ అని కసురుతుంది. అతను పనివాడి వైపు తిరిగి, ‘ఎవరు చెప్పారు నీకు చాయ్ తెమ్మని? వెళ్లిక్కడ్నించీ!’ గట్టిగా తిడతాడు. వాడెళ్ళి పోతాడు. హాల్లో కూతురు లేచి, గ్రాంఫోన్ రికార్డు పెడుతుంది. ఆలాపన వస్తూంటుంది. పలేకర్ హర్ట్ అవుతూ స్మితని సమీపించి, ‘పేద్ద నువ్వేదో సంపాదిస్తున్నట్టు అనుకుంటున్నావ్ కదూ? నువ్వు హీరోయిన్ వి అవడానికి హెల్ప్ చేసింది నేను. నీ కెరీర్ ని మేనేజ్ చేసింది నేను. నీ అయ్య చచ్చాక నిన్నూ నీ అమ్మనీ నీ బామ్మనీ సాకింది నేను. కడుపులు మాడి చావాల్సిన వాళ్ళు మీరు. కూడు నేను పెట్టా, నేను!’ అని రెచ్చిపోతూంటాడు. ‘అట్టాగా, ఐతే ఇప్పుడూ నువ్వే పెడుతున్నావా కూడూ?... హుఁ -’ అని కసిగా అనేసి జరిగిపోతుంది. అతను తలుపు వైపు తిరిగి, ‘సుష్మా! సుష్మా! ఆ రికార్డు బంద్ చెయ్!’ అని కప్పెగిరిపోయేలా అరుస్తాడు. ‘ఎందుకు చెయ్యాలి రికార్డు బంద్! నువ్వెవరు చెప్పడానికి దానికి!’ సరి సమానంగా అరుస్తుంది. 

       
వివరణ : అతనలా క్వశ్చన్ చేసేసరికి ఒక్క మాటతో తను తిప్పి కొట్టేసింది. పేకాటకి డబ్బంతా తగలేస్తూంటే గూడుపుఠాణీ చెయ్యకేం చేస్తుంది? అతడి ఎత్తుగడ చిత్తయి పోయింది. దీంతో బుర్ర తిరిగి, పనివాణ్ణి టార్గెట్ చేసి, టీ ఎవరు తెమ్మన్నారని తిట్టి వెళ్ళ గొట్టేశాడు. ఇది అసలుకి స్మితని తానేమీ చేయలేని బలహీనతని  బయటపడేసుకోవడమే. వాతావరణం బాగా వేడెక్కింది. అవతల కూతురు లేచి గ్రాంఫోన్లో ఆలాపన పెట్టింది. వాళ్ళు ఇలా అరుచుకుంటున్నప్పుడు, తను ఇలా నిరసన తెలపడం ఆమె కలవాటయి పోయిందేమో. కూతురి నిరసన కూడా వాళ్లనాపడం లేదు. ఇప్పుడు ఇద్దర్లో ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది కాకుండా, కూతురి ముందు ఇద్దరూ దోషులుగా నిలబడ్డారు. పిల్లల్ని కన్నాక తమ హక్కులు రద్దయి, పోరాటాలు బంద్ అయి, పిల్లల హక్కులూ ఆరాటాలూ తమ ముందుంటాయని తెలుసుకో లేని దివాలాకోరు సంసారం వెలగబెడుతున్నారు. 

        ఇక అతను దండకం ఎత్తుకున్నాడు ఫాల్స్ ఇగో బాగా ప్లాట్ అయిపోయి - పూర్వం ఆమె కుటుంబాన్ని తను ఆదుకోవడం గురించి ఎంత హీనంగా మాట్లాడాలో అంత హీనంగా మాట్లాడాడు. దానికీ ఆమె కొట్టినట్టు జవాబియ్యడంతో మళ్ళీ బుర్ర తిరిగి, ఆమెనేమీ చెయ్యలేక ఈసారి కూతుర్ని టార్గెట్ చేస్తూ బలహీనత బయటపెట్టుకున్నాడు - రికార్డు ఆపమని అరుస్తూ. ఇంతకంటే అతనేం పీకలేడని టీ ద్వారా, గ్రాంఫోన్ రికార్డు ద్వారా చెప్పడం. అదే సమయంలో, స్మిత పూర్వ జీవితం మీద ఆసక్తి కల్గించడం. నిజంగా అతడన్నంత దారుణంగా వుందా పూర్వం ఆమె కుటుంబ పరిస్థితి? రెండోది, గతంలో ఆమె ఎవరితో వెళ్ళిపోయి వుంటుంది? ఈ రెండిటి గురించీ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తామేమోనని మనం ఎదురు చూసేలా చెయ్యడానికి ఈ డైలాగుల ప్లాంటింగ్. ఇక అతను కూతురి మీద అరిచేసరికి, ఆమె అతడి మీద అరిచింది. ఇక టాపిక్ కూతురి మీదికి మళ్ళిపోయింది. కూతురి మీద ఫోకస్ అవుతూ సీను మలుపు తిరిగింది... 

        8. కోపాన్ని అణుచుకుంటూ, ‘మళ్ళీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయే వంకలు వెతుకున్నావా?’ అని సిగరెట్ కింద పడేసి నలిపేసి, ‘వెళ్ళు! ముక్కు నేలకి రాస్తూ వెనక్కొస్తావ్!’ అంటాడు. గబగబా బెడ్ మీద బట్టలు సర్దేస్తూంటుంది. కూతురు గుమ్మం దగ్గరికొచ్చి ఏదో అనబోతే నోర్ముయ్యమంటాడు. ‘ఎప్పుడూ వేసే వేషాలే ఇవి!’ అనేసి వెళ్ళిపోతూ, కూతుర్ని తన గదిలోకి వెళ్లిపొమ్మంటాడు. 

        వివరణ :  ఆ సిగరెట్ నలిపెయ్యడం ఆమెని నలిపేస్తున్నట్టు ఫీలై పోవడమే. సిగరెట్ తో ఇదింకో బలహీన వ్యక్తిత్వ ప్రదర్శన. చివరికి సిగరెట్ కథ ఇలా ముగిసింది. సిగరెట్ ఈ సీనులో సందర్భానుసార డైనమిక్స్ లో మన దృష్టి నాకర్షిస్తూ లైవ్ గా పాలుపంచుకుంది. ఈ సీనులో టీ, గ్రాంఫోన్, సిగరెట్, ఏ వస్తువు వాడినా, అది కథనో, పాత్రల్నోబయట పెట్టడానికే  వ్యూహాత్మకంగా ప్లే చేశారు తప్ప- కథనీ, పాత్రల్నీవదిలేసి అలంకార ప్రాయంగా ప్రయోగించలేదు.

        9. కూతురు ముందుకొచ్చి సూట్ కేసు సర్దుతున్న తల్లినే చూస్తుంది. సూట్ కేసులో బట్టలన్నీ కుక్కి, మూత పెట్టి, బయల్దేర బోతూంటే, ‘అమ్మా, నిజంగానే వెళ్తున్నావా?’ అంటుంది కూతురు. ఆగిపోయి, ఏమనాలో అర్ధంగాక చూస్తుంది. కదిలి అటు చూస్తే, తల్లి చూస్తూంటుంది కిచెన్ దగ్గర్నుంచి. ఇటు చూస్తే, అతను చూస్తూంటాడు హాల్లోంచి. సూట్ కేసు కింద పెట్టి, కూతుర్ని పిలుస్తుంది. వచ్చి తల్లిని పట్టుకుంటుంది కూతురు. ‘దేనికీ?’ అంటాడు అతను. ‘సుషు నాతో వస్తుంది’ అంటుంది. ‘సుష్మా నా కూతురు!’ అంటాడు. ‘నిజంగా?’ అంటుంది వ్యంగ్యంగా. 


      వివరణ :  అతడంత మాటన్నాక ఆమె ఎందుకాగుతుంది. సాధారణంగా చిత్రణ లెలా వుంటాయంటే, ఆమె సూట్ కేసు సర్దుకుని కూతుర్ని బరబరా లాక్కుని వెళ్ళిపోతూ వుంటుంది ... ఇది బయటి నుంచి రచయిత తన డామినేషన్ తో పాత్ర మీద రుద్దే దుశ్చర్య.  ఇందులో పాత్ర ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ ఎక్కడుంది. మానవ సహజ డ్రామా ఎక్కడుంది? ఇంత సేపూ స్మిత తన గురించి, తన జీవితం గురించీ దూకుడుగా ఆలోచిస్తోందని మనకి తెలుస్తూనే వుంది. ఆమెకి కూతురి ధ్యాసే లేదు. కూతురు, ‘అమ్మా, నిజంగా వెళ్తున్నావా?’ అనేసరికి ఈ లోకంలో కొచ్చింది. ఉక్రోషమంతా దిగిపోయి కూతుర్ని గుర్తించింది. ఇప్పుడు తనే కాదు, తనతో కూతురూ అని తెలుసుకుంది. ఆగిపోయి ఆమెని రమ్మంది. ఇప్పుడామె ఎమోషనల్ గ్రాఫ్ /ఆర్క్ కరక్టుగా వచ్చాయి. అతనామె నాపుతూ, సుష్మ తన కూతురన్నాడు. దీనికామె, ‘నిజంగా?’ అంది వ్యంగ్యంగా. ఈ డైలాగు అన్పించడంలో ఉద్దేశం, అతడి పాత్ర చిత్రణలో మిగిలున్న అంశం కూడా పూర్తి చెయ్యడం. అతను భార్యనీ, అత్తనీ మాత్రమే కాదు, కూతుర్ని కూడా కూతుర్లా చూడలేదని. భార్య డబ్బూ, తన సుఖం - ఇంతే అతడి జీవితమని. ఈ డైలాగు పాత్రలోంచి సహజంగా వచ్చింది కాబట్టి రచయిత రాశాడు. 

        కూతురా మాట అనగానే నిలబడి పోయిన స్మిత కి -ఇటు చూస్తే కిచెన్ దగ్గర్నుంచి తననే చూస్తున్న తల్లి కన్పిస్తుంది, అటు చూస్తే తననే చూస్తున్న పలేకర్ కన్పిస్తాడు హాల్లోంచి. వాళ్ళు కూడా ఆమె సమాధానం కోసం చూస్తున్న అర్ధంలో ఫ్రేములోకి రావడం. ఎప్పుడెలా ఎవరు మాత్రమే ఫ్రేములోకి రావాలో, లయ బద్దంగా ఆ ప్రక్రియే కొనసాగుతోంది మొదట్నించీ సీనంతా.

        10. ‘తీసికెళ్ళు మరి! తయారు చెయ్ నీలాగే! చాలా బాగుంటుంది. జీవితాంతం ఇంకొకళ్ళ ఇళ్ళల్లో పడి బతికేస్తుంది...’ అని సవాలు విసురుతాడు. కూతురికి ఏడ్పొచ్చేస్తుంది. ‘ఇలాగా నా మీద గెలుస్తావ్...’ అంటుంది స్మిత నిస్సహాయంగా. వెనుక తల్లి వచ్చి నించుంటుంది. కళ్ళ నీళ్ళతో కూతుర్ని విడిపించుకుంటుంది స్మిత. కూతురు వెళ్లి అమ్మమ్మని చుట్టుకుంటుంది. స్మిత సూట్ కేసు పట్టుకుని బయటి కెళ్ళిపోయి  టాక్సీనాపి ఎక్కేస్తుంది...

        వివరణ : అతడలా సవాలు విసిరేసరికి సమాధానం లేదు ఓటమి తప్ప. ఈ సీనులో ఎక్కడా ఆమె కన్నీళ్లు పెట్టుకోలేదు, ఇక్కడ సీను కూతురి మీద ఫోకస్ అయినప్పుడు తప్ప. అప్పుడంతా రౌద్ర రసంతో వుంది, ఇప్పుడు కరుణ రసానికొచ్చింది. ఆమెకి కన్నీళ్లు రావడం రావడం ముందు ఇంకెప్పుడో గాకుండా, ఇప్పుడు కూతురితో కనెక్ట్ అయి వస్తేనే, హ్యూమన్ ఎలిమెంట్ జతపడి సీను క్లయిమాక్స్ సమగ్రమవుతుంది.

        సత్యదేవ్ దుబే, గిరీష్ కర్నాడ్ లిద్దరూ ప్రసిద్ధ నాటక రచయితలూ కూడా. నాటక రచన ఆర్గానిక్ గా వుంటుంది. పైగా సినిమాల్లో పది సీన్లు వేసి చెప్పే విషయాన్నీ ఒక్క సీన్లో స్థలకాలాల ఐక్యతతో చెప్పేస్తారు. ఇందుకే ఈ సీను ఇలా వచ్చింది - బోలెడు - బోలెడు సమాచారమందిస్తూ, గత వర్తమాన భవిష్యత్ కాలాలకి సంబంధించి.

ఆరు నిమిషాలు - 41 షాట్లు

         ఇప్పుడు ఈ సీనుకి షాట్లు తీసిన విధానం చూద్దాం. షాట్స్ పొందిక వాక్యంలో పదాల పొందికంత అందంగా వుంటేనే అదొక వెండితెర పాఠ్యమవుతుంది. స్మూత్ గా సాగిపోయే విజువల్ లాంగ్వేజి అవుతుంది. ఒక సీనుకి ఆ సీన్లో పాత్ర  వున్నపరిస్థితీ, ఆ పరిస్థితికి పాత్ర ఎలా ఫీలవుతోందో ఆ ఫీల్ - ఇవి మాత్రమే షాట్స్ ని నిర్ణయిస్తాయని ఈ వ్యాసం ప్రారంభం
లో ఇన్నర్ ఇంజనీరింగ్ చెప్పుకున్నాం. ఈ ప్రకారం కొన్ని కీలక షాట్స్ కి అర్ధాలు చూద్దాం.

        1. మిడ్ షాట్ లో బాల్కనీలో స్మిత కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పలేకర్, సిగరెట్ ముట్టుంచుకోవడానికి అగ్గిపెట్టె తీసి ఆగిపోతూ కిందికి చూశాడు. లో- యాంగిల్లో కారు దిగుతున్న స్మిత కన్పించింది. తనని తాను ఆమెకంటే ఉన్నతంగా భావించుకునే రకం కాబట్టి, పైనుంచి కిందికి ఆమెని  చూస్తున్నట్టు ఒకే లో - యాంగిల్ షాట్. కింద సపరేట్ గా వాళ్ళిద్దరి షాట్స్ వేయలేదు. వేస్తే రసభంగం. 

        2. ఆమె మెట్లెక్కి ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా అదే లో- యాంగిల్ షాటే అతను తలుపు దగ్గర్నుంచి చూస్తూంటే. ఆమె సజెషన్ లో అతణ్ణి చూస్తున్నట్టు కింది నుంచి హై యాంగిల్ షాట్ వేయలేదు. తన కంటే ఉన్నతంగా ఆమె అతణ్ణి చూసే ప్రశ్నేలేదు కాబట్టి. 

        3. ఆమె తలుపు దగ్గర అతణ్ణి చూసుకుంటూ లోపలికి వెళ్తున్నప్పుడు, అతడితో సమంగా మీడియం క్లోజప్ లోకి వచ్చింది. ఇప్పుడింకా ఘర్షణ మొదలవని మామూలు స్థితి కాబట్టి, సమంగా మీడియం క్లోజప్ లోకొచ్చింది. తర్వాత ఘర్షణ మొదలయ్యాక ఆమె మామూలు మీడియం క్లోజప్ లో వుండదు. ఫైర్ బ్రాండ్ గా బిగ్ క్లోజప్స్ లో వుంటుంది. 

        4. ఆమె బెడ్ రూమ్ లోకి వస్తున్నప్పుడు పక్క గది కిటికీ వూచల్లోంచి ఆమెని చూపిస్తూ పానింగ్ షాట్. ఈ సినిమాలో ఆమె ప్రతీ రిలేషన్ షిప్ లోనూ పురుషుడితో పంజరంలో వున్నట్టే ఫీలవుతుంది. అందుకని కిటికీ వూచల్లోంచి ఈ షాట్. 

        5. అతను బెడ్ రూమ్ తలుపు దగ్గరికొచ్చి ఆగినప్పుడు, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు వున్న ఆమెకి, అతడికీ మీడియం క్లోజప్సే ఇచ్చారు. వాగ్యుద్ధం ఇప్పుడిప్పుడే తారా స్థాయికి వెళ్ళలేదు కాబట్టి. 

          6. అతను దర్శకుడితో సంబంధాన్ని అంటగట్టి మాటాడినప్పుడు తారా స్థాయికి వెళ్ళింది. ఆమె కోపం పెట్రేగిన ఈ ఉద్రిక్త క్షణాల్లో మామూలు క్లోజప్ కాదు, బిగ్ క్లోజప్ లో కొచ్చేసింది. అతను అదే మీడియం క్లోజప్ లో వుండి పోయాడు. ఇప్పుడిక ఆమె రివోల్ట్ అవుతున్న పతాక దశ ఇదన్నమాట. ఇంతవరకూ ఎక్కడా బిగ్ క్లోజప్ ఆమె మీద వేయకుండా జాగ్రత్త పడ్డారు. 

        7. ఇప్పుడతను కదిలి ఆమెతో బిగ్ క్లోజప్ లోకి వచ్చేశాడు. ఇలా రావడానికి కారణం ఆమెతో సమంగా ఫైర్ అవుతూ, కొత్తగా తీవ్రారోపణ చేస్తున్నాడు. తనకి చెప్పకుండా ఆమె కొత్త బ్యాంక్ ఎక్కౌంట్ తెరిచినట్టూ, ఇంకో కొత్త సినిమా కాంట్రాక్ట్ సైన్ చేసినట్టూ. ఈ నిజంతో ఆమె ఆలోచించుకోవాలన్నట్టు బిగ్ క్లోజప్ లోంచి తప్పుకుంది.  

        8. దానికామె సమాధానం చెప్తున్నప్పుడు తిరిగి ఇద్దరూ మీడియం క్లోజప్ లో. అప్ అండ్ డౌన్స్ ని షాట్స్ ఫాలో అవుతున్నాయి.      
       
9. ఇప్పుడామె గతంతో ఆమె మీద ప్రతాపం చూపిస్తూ అతను బిగ్ క్లోజప్ లోకొస్తే, కెమెరా అతణ్ణి ఫాలో అయి పక్కనున్న ఆమెనీ ఫ్రేములోకి తీసుకుంది. అతడి ప్రతాపం పూర్తయ్యాక, ఆమె ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చి తప్పుకోవడంతో, షాట్ కట్ అయింది.
        10. దీంతో అతను సపరేట్ గా బిగ్ క్లోజప్ వేసుకుని, రికార్డు పెట్టిన కూతురి మీద అరుపులు అరవడం.
        11. వెంటనే ఆమె కూడా బిగ్ క్లోజప్ లోకొచ్చేసి, రికార్డు ఎందుకాపాలని అంతకంటే అరుపులు అరవడం.
        12. దీంతో తలుపు దగ్గరున్న అతను ఠక్కున మీడియం క్లోజప్ లోకొచ్చేశాడు. నువ్వు మళ్ళీ వెళ్ళిపోయే బహానాలు వెతుకుతున్నావా - అంటూ.     

        13. పుల్ బ్యాక్ చేస్తే ఆమే అదే ఫ్రేములో అతడి సమీపంలో వుంది. ఆమె ఇలా ముందు కొస్తున్నట్టు చూపించలేదు. ఆమెని తలుపు దగ్గరే  అతడి ముందుంచి, పుల్ బ్యాక్ చేస్తే, ఆమె ముందుకు కదిలిన అర్ధమే వచ్చింది. అంటే వెళ్ళిపోవడానికి ఇక సిద్ధమని. 

        14. స్మిత సూట్ కేసు పట్టుకుని వెళ్లి పోతున్నప్పుడు, కూతురు అన్న మాటకి ఆగిపోయి,  అటు చూసినప్పుడు, కన్పించిన తల్లి బ్లర్ అవుతుంది. ఆమెకి సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని స్మిత ఫీలవక పోవడం వల్ల. 

        15. స్మిత ఇటు తిరిగి చూసినప్పుడు, పలేకర్ ని కూడా బ్లర్ గానే చూసింది. కేర్ చేయనట్టు. అతను ముందుకొచ్చి కూతురి గురించి సవాలు విసిరినప్పుడు. మీడియం క్లోజప్ లోనే వుంది...ఇక ఆమెకి బిగ్ క్లోజప్స్ లేవు. పరాజితురాలు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించిన తల్లికే కూతుర్ని అప్పగించింది.


     ఈ విధమైన షాట్స్ కలబోతతో సీను తెరకెక్కింది. దర్శకుడు శ్యాం బెనెగళ్ విజన్తో  సీను క్లాసిక్ హోదాకి చేరింది. ఈ సీను స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ సీనే. స్మిత షూటింగ్ ముగించుకుని డైరెక్టర్ తో ఇంటికొచ్చే రెండు సీన్ల తర్వాత, మూడే సీనే ఈ ప్లాట్ పాయింట్ వన్ సీను. ఈ ఒక్క సీనులోనే సాధారణంగా ప్లాట్ పాయింట్ వన్ వరకూ వుండే ఓ ఇరవై సీన్ల విషయమంతా వుంది. గ్రేట్ కదూ? నాటక టెక్నిక్ వల్ల ఇలా కుదిరింది. ఈ వొక్క సీన్లోనే బిగినింగ్ విభాగం ఇరవై సీన్లలో వుండే పాత్రల పరిచయం, కథా నేపథ్యపు ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా, సమస్య ఏర్పాటూ అనే నాల్గు టూల్సూ ప్లే అయ్యాయి. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవడం ప్లాట్ పాయింట్ వన్ మలుపు. ఇప్పుడామె గోల్ ఏమిటో దేవుడెరుగు. ఈ సీను తర్వాత చిన్నప్పట్నుంచీ ఆమె ఫ్లాష్ బ్యాక్.   
  
       ప్రాంతీయ సినిమాల్లో ఇలాటి టెక్నిక్స్ వుంటున్నాయి. కమర్షియల్ సినిమాల్లో అవే టెంప్లెట్స్ తప్ప రాయడానికేమీ వుండడం లేదు...

సికిందర్
        (రేపు :  లాక్ డౌన్ కాలంలో పొదుపుగా అందిన  రెండు  ‘సందేహాలకి  సమాధానాలు’)