రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జనవరి 2020, బుధవారం

909 : రైటర్స్ కార్నర్



                          క్లిఫ్ డార్ఫ్ మాన్ - హాలీవుడ్ హిట్  ‘వారియర్’  స్క్రీన్ ప్లే రచయిత...ఈ మూవీ హిందీలో ‘బ్రదర్స్’ గా అధికారిక రీమేక్ అయింది. ఈ రిమేక్ తో క్లిఫ్ కి రచనాపరంగా ఏ సంబంధం లేకపోయినా, ‘వారియర్’ రచయితగా ఆయన క్రిస్ నిటెల్ కిచ్చిన ఇంటర్వ్యూని ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాం...
వారియర్’ తో మీ అనుభవం చెప్పండి?
          ‘వారియర్’ 2011 లో విడుదలయ్యింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ చేసి చూపించాం. ఈ స్క్రిప్టు పని పూర్తయి షూటింగ్ కూడా పూర్తయ్యాకా విడుదల తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ లోగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె కారణంగా నా మరో స్క్రిప్ట్ అమ్ముడుపోక ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డాను. నా సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. కారూ ఇల్లూ కూడా పోయి పూర్తిగా దివాళా తీశాను. ఇంకో ఆరు నెలలకి గానీ ‘వారియర్’  విడుదల కాలేదు. అది విడుదలయ్యాక తిరిగి నా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడింది.
మీరు రాసిన మొట్టమొదటి కథ?
          నవల. అప్పుడు నాకు పదకొండేళ్ళు. పెన్నుతో కాగితాల మీద రాసుకుని ఆ 50 పేజీలనీ ఫైల్ చేసి పెట్టుకున్నాను. అది తర్వాత చెదలు పట్టిపోయింది.
మీ కళాతృష్ణకి ఎలాటి సినిమాలు, లేదా కథలు మీకు స్ఫూర్తి నిచ్చేవి?
          మొదట్నించీ గ్రీకు పురాణాలంటే ఇష్టం. ఇప్పటికీ వాటికి ప్రభావితుణ్ణి అవుతూనే వుంటాను. ఆ తర్వాత క్లాసిక్ లిటరేచర్ వైపు, క్లాసిక్ సినిమాలవైపూ ఆసక్తి పెరిగింది. నా జీవితంలో నేనేం కావాలో నిర్ణయించుకోవడానికి ఒకే ఒక్క సినిమా చూశాక తెలిసి వచ్చింది. ఆ సినిమా ‘బ్లడ్ సింపుల్’. ఈ సినిమా చూశాక ఇలా రాస్తే సినిమా ఫీల్డులో అగ్ర స్థానానికి చేరుకోవడం సాధ్యమేనని అన్పించింది. ‘ఫౌంటెన్ హెడ్’ నవల చదివినప్పుడు కూడా నాకిలాటి ఫీలింగే కలిగింది.
ఒక అనామక రచయిత తన స్క్రిప్టు  వెలుగు చూడాలంటే ఏం చేయాలంటారు?
          ఇలా చెప్తే సిల్లీగా ఉండొచ్చు- కానీ ఏదైనా బ్రహ్మాండమైన స్క్రిప్టు  రాస్తే అది తప్పకుండా వెలుగు చూస్తుంది. ఎలా వెలుగు చూస్తుందో వివరించలేను గానీ, వెలుగు మాత్రం చూస్తుంది. ఐతే ముందుగా తను ఏ బ్రాండో తెలుసుకోవాలి. ఆ బ్రాండ్ తో తను రాసిన దానికి దగ్గరగా వుండే అలాటి రచయితల్నిగానీ, దర్శకుల్ని గానీ, నిర్మాతల్ని గానీ ఫాలో అవుతూ వుండాలి.  వీళ్ళకి దగ్గరయ్యే  మార్గాలని అన్వేషించాలి. నేటి డిజిటల్ యుగంలో ఇదేం కష్టం కాదు. నేను స్ట్రగుల్ చేస్తున్న కాలంలో ప్రీమియర్ షోలలో చొరబడి సినీ ప్రముఖుల్ని పలకరించే అవకాశం తీసుకునే వాణ్ణి. రైటర్ గా ఇతరులకంటే తనెలా ప్రత్యేకమైన వాడో, ఏ నిర్మాతయినా తన స్క్రిప్టుని ఎందుకు ఓకే చేయాలో చెప్పగలిగి వుండాలి. వాణిజ్య రంగంలో యూ ఎస్ పీ(యూనిక్ సెల్లింగ్ పాయింట్) అని వస్తువులకి వాటిదైన ప్రత్యేకత ఒకటి వుంటుంది. అలాటి యూ ఎస్ పీ తన కేమిటో రైటర్ తెలుసుకోవాలి. అది తనదైన ఒక వాయిస్ అవుతుంది - లేదా శైలి అయి వుంటుంది. సొంత వాయిస్. మరొకరికి అనుకరణ కానిది.
ఏ జీవితానుభవాలు మీ పాత్రలపై ప్రభావం చూపుతాయి?
         
ప్రతీ అనుభవం కూడా. ప్రతీ వ్యక్తితో అనుభవం కూడా. ఒక్కక్షణం అలా కలిసి వెళ్ళిపోయినా సరే, అది కూడా పనికొచ్చే అనుభవమే. నా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బయట ఇతరులతో అన్నీ పనికొచ్చే అనుభవాలే. నేను రాస్తున్నప్పుడు ఏదీ నాకు వ్యర్ధ పదార్ధం కాదు. బహిరంగ ప్రదేశాల్లో కూర్చుని ఇతరులు అనుకునే మాటల్ని వింటాను. అవి ఆసక్తి కరంగా వుంటే రికార్డు చేసుకుంటాను. లేదా నోట్ చేసుకుంటాను. సహజంగా దొర్లే జనం భాష ఇంటలెక్చువల్ గా ఏమీ వుండదు గానీ, ఆ మాటలు లోతుగా ఎక్కడో తాకుతాయి. నేనేం విన్నా, చదివినా నేను రాస్తున్న పాత్రలకి ఎలా అన్వయించాలా అని ఆలోచిస్తాను.
మీ క్యారక్టర్ డెవలప్ మెంట్ ప్రాసెస్ ని వివరించండి?
         
నేనెప్పుడు రాయడానికి కూర్చున్నా దేవుడు నాకు మార్గం చూపించాలని ప్రార్ధిస్తాను. నా అనుభవాల భాండాగారంలో కెళ్ళి క్యారక్టర్స్ ని చూపించమని అడుగుతాను.
.క్యారక్టర్  బయోగ్రఫీలు రాసుకుంటారా?
          రాయను, క్రియేట్ చేసుకుంటాను
మీరు క్రియేట్ చేసే క్యారక్టర్ లతో మీరు ఎమోషనల్ గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు?
          ప్రాసెస్ లో ఇది చాలా కఠినాతి కఠినమైన పని. టార్చర్ కూడా. నేను రాస్తున్నంత కాలమూ ఎన్ని క్యారక్టర్స్ వుంటే వాటన్నిటి  ప్రపంచాల్లో జీవిస్తూ వుండాల్సిందే.


 గొప్ప క్యారక్టర్ ని సృష్టించాలంటే దేన్ని  ప్రాతిపదికగా తీసుకోవాలంటారు?
          జీవితానుభవాన్ని. మనుషుల అసంకల్పిత చర్యల్ని. ఆహారపు టలవాట్లని. ఫిజికల్ బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనమెప్పుడూ చేసే పనుల ద్వారా మన మనసేమిటో బయట పెట్టేస్తూంటాం. ఈ డైకాటమీ- ఆలోచనకీ  చేతకూ మధ్యన వుండే సంబంధాన్ని పరిశీ లిస్తూంటాను- దాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తాను. నేను సృష్టించిన ఒక స్త్రీ పాత్ర ఆందోళనకి గురయినప్పుడు బొటన వేలుని గట్టిగా పట్టుకుని మెలి తిప్పడమనే డైకాటమీని రాశాను.

రాసే ముందు అవుట్ లైన్ వేసుకుంటారా?
          కొన్నిసార్లు వేస్తూంటాను. కానీ అది నా కిష్టముండదు. అయితే కొన్ని రకాల కథలకి అవుట్ లైన్ అవసరమే.

స్ట్రక్చర్ గురించి మీ అభిప్రాయం?
          అది టెక్నికల్. కొంతవరకూ తప్పనిసరిగా అవసరమే. ఐతే దాన్ని ఎగేసే మార్గాలు ఎప్పుడూ వుంటాయి. నా మైండ్ లో కథకి ఓ బిగినింగ్, మిడిల్, ఎండ్ లేమిటో ముద్రపడి పోయాక, ఆకథని నేనెలాగైనా చెప్పగలను. అది వర్కౌట్ అయితే అది చెప్పడానికి నేనేంచుకున్న స్ట్రక్చర్ ప్రధానమే కాదు. ఇందుకే నేను నవలల్ని నేనెక్కువ ఇష్టపడతాను. అవి స్ట్రక్చర్ లో ఇరుక్కుని వుండవు.

మీరు అభిమానించే సినిమాలు ఏ  స్ట్రక్చర్స్ లో ఉన్నాయంటారు?
          దేనికవే ..అయితే ’గుడ్ ఫెల్లాస్’  స్ట్రక్చర్ ని నేనిష్ట పడతాను. థర్డ్ యాక్ట్ ప్రారంభం దగ్గర  లేదా, సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర్నుంచి ఆ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడ్నించీ బయల్దిరిన చోటుకి తిరిగి వస్తుంది. అక్కడి నించీ ఎండ్ వరకూ కంటిన్యూ అవుతుంది. ఎన్నిరకాల స్ట్రక్చర్స్ వున్నా నేను బాగాలవ్ చేసేది  ‘పల్ప్ ఫిక్షన్’  స్ట్రక్చర్ని. అది చాలా బ్రిలియెంట్ స్ట్రక్చర్.

మీ క్యారక్టర్ లు ఎప్పుడైనా వాటి గురించి అవి మాట్లాడుకోవడం జరుగుతుందా?
          అవి తమలో తాము మాట్లాడుకుంటాయి- లేకపోతే వాటికి నేను అన్యాయం చేసినట్టే.
మీకు డైలాగులు ఈజీ గా వచ్చేస్తాయా- లేక బాగా కష్ట పెడతాయా?
          ఏ డైలాగూ అంత ఈజీగా రాదు. బాధాకరమైన ప్రాసెస్ అది.

పాత్రలు వివరణలు ఇచ్చుకోవడాన్ని మీరెలా నివారిస్తారు?
          నివారించలేం. పోలీసులాగా నిఘా పెట్టగలం. పాత్ర ఇచ్చిన ఓ వివరణకి నేను మళ్ళీ మళ్ళీ వెనక్కెళ్ళి చదువుకుంటూ ఆ వివరణ అవసరమా అని ఆలోచిస్తాను. అవసరమే అనుకుంటే, అది మాటల్లో కాకుండా విజువల్ గా - సింబాలిక్ గా చెప్పొచ్చా అని కూడా ఆలోచిస్తాను.

మీ డైలీ రైటింగ్ రొటీన్ గురించి చెప్పండి?
          వ్యాయామం చాలా చేస్తాను. వాటిలో బాక్సింగ్, యోగా వుంటాయి. జిమ్, రన్నింగ్ వుంటాయి.  అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ బాడీకీ  మైండ్ కీ  చాలా హెల్ప్ చేస్తుంది. రాసేటప్పుడు ఫోన్ ని స్విచాఫ్ చేసి వేరే రూమ్ లో పెట్టేస్తాను.

స్క్రీన్ రైటర్ల గురించి వుండే అపోహ లేమిటో చెప్పగలరా?
          ఈ వృత్తిని ఇతరులు ఫన్ అనుకుంటారేమో- నిజమే, చాలా ఫన్. రాసిన సినిమాని తెర కెక్కితే దాన్ని చూసుకోవడం ఫన్నే కదా? దాన్ని మించిన ఫన్ ఏముంటుంది. కానీ అదే చూస్తున్న సినిమాని ముందుగా కాగితాల మీదికి ఎక్కించడానికి వుంటుందే- అది నావరకూ ఒక నరకం.

మీ కెరీర్ లో బాగా హైలైటయిన అంశం ఏమిటి?
          ఏమీ లేదు. హైలైట్స్ గురించి ఆలోచించను..నాకో ఫిలాసఫీ వుంది. కోరుకున్న గమ్యానికి ఎప్పుడూ చేరుకుంటూ వుండాలే గాని చేరుకోకూడదని. చేరుకున్నామంటే ఇక అక్కడ చేయడాని కేమీ వుండదు. అక్కడ్నించి బయల్దేరి  వెనక్కి రావడమే.      

మీ రీ - రైటింగ్ ప్రాసెస్ ని వివరిస్తారా?
          అదెప్పుడూ వుండే ప్రాసెస్సే. స్క్రిప్టు ఏ కొద్ది అమ్ముడుపోవాలన్నా అది చాలా  అవసరం. చాలా  సింపుల్ గా నేను దీన్ని డీల్ చేస్తాను. నేను రాస్తున్న సీన్లలో ఒకదాన్ని బాగా ఇష్టపడి పదేపదే రీరైట్ చేసి మెరుగు పరుస్తున్నా ననుకోండి- అప్పుడు ఓ వైపు నుంచి నా మైండ్ చెప్తూనే వుంటుంది- ఫస్ట్ కట్ చేయాల్సింది ఆ సీన్నే అని. సీన్లమీద మమకారాలే అలాటివి. ఆ మమకారాలు లాజిక్ ని చంపేస్తాయి. ఇలా నన్ను నేను ఎడిట్ చేసుకునే సౌమనస్యం నాకుంటే- అప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి ఏ స్టూడియో నుంచో, ఏ ప్రొడ్యూసర్ నుంచో బెటర్ మెంట్ నోట్స్ నాకందితే, నేను బాధపడే ప్రసక్తే వుండదు.
***

.

13, జనవరి 2020, సోమవారం

908 : రివ్యూ


        (ఈ రివ్యూ రెగ్యులర్ రివ్యూగా ఇవ్వడం లేదు. అంటే హీరో హీరోయిన్లు ఎలా నటించారు, కామెడీ ఎలా వుంది, ఫైట్లు ఎలా వున్నాయి, సంగీతమెలా వుంది, సాంకేతిక విలువలెలా వున్నాయి, దర్శకుడి పనితనమెలా వుందీ  మొదలైన ఉపరితల సంగతులు కాకుండా, వీటి మూలంలో కథా కథనాలెలా వున్నాయి, పాత్ర చిత్రణలు ఎలా వున్నాయన్న సంక్షిప్త సమాచారం మాత్రమే ఈ రివ్యూలో చూడొచ్చు)
       ముంబాయి పోలీస్ కమీషనర్ ఆదిత్యా అరుణా చలం (రజనీ కాంత్) నగరంలో అసాంఘిక శక్తుల్ని ఇష్టారాజ్యంగా ఎన్ కౌంటర్ చేసేస్తూంటాడు. మానవ హక్కుల కమిషన్ అతడి మీద చర్యకి పూనుకుంటుంది. ఈ సందర్భంగా అతను మానసికంగా సరిగాలేడని, అతడి గతం కారణమని తెలుస్తుంది. గతంలో అతడికో కూతురు వల్లి (నివేదా థామస్). ఈమె  రెండేళ్లప్పుడే భార్య చనిపోతే ఏ లోటూ రాకుండా పెంచాడు. ఇప్పుడా వల్లికి తండ్రి పెళ్లి చేసుకుంటే మంచిదని అన్పిస్తుంది. ఒకచోట లిల్లీ (నయన తార) ని చూసి ఈమే తగిన జోడీ అనుకుని తండ్రిని ప్రోత్సహిస్తుంది. తండ్రి ఆదిత్య వచ్చీరాని ప్రేమ సంభాషణలతో వల్లితో పాట్లు పడుతూంటాడు.

        ఇలా వుంటే, ముంబాయి కుర్రకారుని కబళిస్తున్న డ్రగ్స్ జాడ్యం మీద ఆదిత్య దృష్టి పడుతుంది. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ కూతుర్ని డ్రగ్ మాఫియాలు అపహరిస్తారు. ఈ కేసు తీసుకున్న ఆదిత్య మాఫియా రింగ్ ని ఛేదిస్తాడు. మాఫియాలు డ్రగ్స్ సరఫరాయే కాకుండా అమ్మాయిల అక్రమ రవాణాకి కూడా పాల్పడుతూంటారు. వాళ్ళకి విముక్తి కల్గిస్తాడు. మాఫియా లీడర్ అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్) ని పట్టుకుని జైల్లో వేస్తాడు. ఇతను పారిశ్రామిక వేత్త విజయ్ మల్హోత్రా (నవాబ్ షా) కొడుకు. తర్వాత ఆదిత్య జైల్లో వున్న అజయ్ కోసం వెళ్ళినప్పుడు అతను అజయ్ కాదనీ, డూప్లికేట్ అనీ, అసలు అజయ్ థాయిలాండ్ పారిపోయాడనీ తెలుసుకుని షాక్ అవుతాడు. థాయిలాండ్ అధికారులతో మాట్లాడి అసలు అజయ్ ని వెనక్కి రప్పిస్తాడు. ఈలోగా  జైల్లో వున్న డూప్లికేట్ ని చంపేసి అజయ్ చావుని డిక్లేర్ చేసి అజయ్ ని ఇబ్బందుల్లో పడేస్తాడు. ఐతే అజయ్ కూడా ఇంకో సంఘటనలో చనిపోతాడు. అప్పుడు అజయ్ తన కొడుకు కాదని విజయ్ మల్హోత్రా అనుచరులకి అసలు సంగతి చెప్తాడు. అజయ్, హరి చోప్రా (సునీల్ శెట్టి) అనే అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కొడుకు.
        కొడుకు చనిపోయాడని తెలుసుకుని హరి చోప్రా రహస్యంగా ఇండియా వచ్చి, తన కొడుకు చావుకి విజయ్ మల్హోత్రాని బాధ్యుడ్ని చేసి చంపేస్తాడు. పూర్వం ముప్పై ఏళ్ల క్రితం హరి చోప్రా ముంబాయిలో పోలీస్ స్టేషన్ ని తగులబెట్టి, చాలా మంది పోలీసుల్ని ఆహుతి చేసి పారిపోయాడు. పారిపోతూ చిన్న పిల్లాడిగా వున్న కొడుకుని విజయ్ మల్హోత్రాకి అప్పగించాడు. మల్హోత్రా సంరక్షణలో వున్న కొడుకు ఇప్పుడు చనిపోవడంతో, మల్హోత్రాని చంపి పగ దీర్చుకున్నాడు చోప్రా.
        అంతేగాక కొడుకు చావుకి కారకుడైన కమీషనర్ ఆదిత్యా మీద కూడా పగదీర్చుకోవాలని యాక్సిడెంట్ జరిపిస్తాడు చోప్రా. ఆదిత్య గాయపడతాడు. మెదడులో రక్తస్రావంతో కూతురు వల్లి చనిపోతుంది. దీనికి కారకుడు విజయ్ మల్హోత్రాయేనని అతణ్ణి చంపడానికి పోతే అతను చనిపోయాడని తెలుసుకున్న ఆదిత్య పిచ్చెత్తి పోతాడు. మరి వల్లిని చంపిందెవరు? ఇది తెలీక కన్పించిన క్రిమినల్స్ నల్లా కాల్చి చంపడం మొదలెట్టాడు. ఇదీ గతం.
        ఇప్పుడు చనిపోయిన వల్లి ఫోన్లో వున్న సమాచారంతో హంతకుడి వివరాలు తెలుసుకుని వేట మొదలెడతాడు ఆదిత్య. చివరికి అతణ్ణి పట్టుకుని చంపి పగదీర్చుకుంటాడు. ఈ క్రమంలో దొరక్కుండా చోప్రా వేసిన కొన్ని ఎత్తుల్ని చిత్తు చేస్తాడు.
ఇద్దరు విలన్లతో ఆపద

       
సూపర్ స్టార్ రజనీ కాంత్ కోసం దర్శకుడు మురుగ దాస్ చేసిన రొటీన్ కథే. ఈ కథతో వచ్చిన ప్రధాన సమస్యేమిటంటే ఇద్దరు విలన్లు వుండడం. ఇద్దరు విలన్లతో కథలు నిలబడవని కాదు, ఇద్దరూ ఒకటవ కృష్ణుడు, రెండో కృష్ణుడు బాపతుగా ఒకరు పోయాక ఇంకొకరు  వస్తేనే సమస్యంతా. ఇద్దరూ ఒకే గోల్ తో ఒకే సమయంలో ఒకే గ్యాంగ్ గా, సిండికేట్ గా ఆపరేట్ చేస్తే సమస్య రాదు. వాళ్ళు ఉమ్మడి శత్రువులుగా ఒకే టార్గెట్ గా హీరోకి వుంటారు కాబట్టి. ఇలాకాక హీరోని ఒక ఇబ్బంది పెట్టి ఒక విలన్ హీరో ప్రమేయం లేకుండానే చనిపోయి, హీరోని ఇంకో ఇబ్బంది పెడుతూ రెండో విలన్ వస్తే, ఈ విడివిడి రాకలు విడివిడి కథలవుతాయి- మొదటి కథ హీరో ముగించని కథవుతుంది, మొదటి విలన్ తన ప్రమేయం లేకుండా చనిపోయాడు కాబట్టి. అంటే ఒక కథ ముగిసి ఇంకో కథ మొదలవడం. అంటే స్టాప్ అండ్ స్టార్ట్ బాపతు డాక్యుమెంటరీ కథనం, లేదా ఎపిసోడిక్ కథనాలవుతాయి. దీంతో ఎడతెగని ఒకే ధారగా ప్రవహించాల్సిన ఒకే కథ, మధ్యలో ఒక పాయగా విడిపోయి వీగిపోవడమన్న మాట. దీన్ని మల్టిపుల్ విలన్ సిండ్రోం అంటారు.
        ‘సాహో’ లో లెక్కలేనంత మంది విలన్లు. వాళ్ళ లెక్కలేనన్ని విలనిజాలు. ఇలాకాక వాళ్ళందరూ ఒకే కథతో, ఒకే ఎజెండాగా వుండి వుంటే మూకుమ్మడిగా, లేదా వరుసబెట్టి వాళ్ళని ఊచకోత కోసే బలమైన కథతో హీరో రక్తి కట్టించ గల్గే వాడు. హాలీవుడ్ ఫాంటసీ -సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మల్టిపుల్ విలన్స్ వుంటారు. ఇవి ఎక్కువగా కామిక్ బుక్స్ సిరీస్ ఆధారంగా తీసినవై వుంటాయి. ఈ మల్టిపుల్ విలన్స్ ఒక సిండికేట్ గా ఏర్పడి వుంటారు. లేదా ఒక మెయిన్ విలన్ వుంటూ మిగిలిన వాళ్ళు ఆ విలన్ కి ఏజెంట్లుగా వుంటారు. వీళ్ళందరికీ హీరోతో ఒకే సమస్యతో సంబంధం / పోరాటం వుంటుంది.
        ‘అలీటా’ (2019) లో చూడనే చూశాం: ఇందులో చీఫ్ విలన్ గా నోవా పైలోకాల్లో వుంటాడు. భూమ్మీద అతడి ఏజెంటుగా వెక్టర్ వుంటాడు. ఇతడి కింద హంటర్ వారియర్స్ అనే గ్రూపు వుంటుంది. వెక్టర్ ముఖ్య ఏజెంటుగా జపాన్ వుంటాడు. ఇంకా వెక్టర్ అనుచరుడుగా సైబోర్గ్ అనే రాక్షసుడు వుంటాడు. వీళ్ళంతా భూమ్మీద పాపుల్ని ఏరేస్తూంటారు. ఎవరైనా పైలోకాలని దర్శించాలంటే మోటార్ బాల్ అనే మృత్యుక్రీడ గెలవాల్సి వుంటుంది. స్వర్గతుల్యమైన పై లోకాలకి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకే నోవా చేసిన ఏర్పాట్లు ఇవి. ఇప్పుడు అలీటా ఈ అడ్డంకుల్ని దాటుకుని అక్కడికెలా చేరుకుందనేదే కథ.
        ఈ కథలో నోవాకి ఏదో తేడా వచ్చి వెక్టర్ ని చంపేస్తే కథెలా వుండేది? అలీటా అనే యాక్షన్ హీరోయిన్ కథ తెగిపోయేది. తను చేయాల్సిన పని ఇంకొకరు చేస్తే అలీటా పాత్రకూడా పాసివ్ అయ్యేది. రజనీకాంత్  పాత్రతో ఇదే జరిగింది. రజనీకాంత్ పోషించిన కమీషనర్ ఆదిత్య పాత్ర ఎదుర్కొంటున్న విజయ్ మల్హోత్రా అనే విలన్ పాత్రని, రవి చోప్రా అనే ఇంకో విలన్ పాత్ర మధ్యలో వచ్చి చంపేయడంతో, ఆదిత్య ఆటలో అరటి పండు అయిపోయాడు. మల్హోత్రాని ఆదిత్యానే చోప్రాకి చెప్పిమరీ  చంపేసి వుంటే, హీరోయిజం పెరిగి- ఈ ఇంటర్వెల్ సెకండాఫ్ ని నిలబెట్టేది ఇక చోప్రాని చంపే కొనసాగింపు కథతో.
        ఇంటర్వెల్లో ఏం చేస్తున్నామన్నదే చాలా ముఖ్యం. ఇంటర్వెల్లో కథని తెగ్గ్గొడుతున్నా మేమో చూసుకోకపోతే సినిమాని చేతులారా నరికి పోగులు పెట్టుకోవడమే. ఇంటర్వెల్ ప్రమదాలెలా వుంటాయో, ఎన్నుంటాయో ఈ బ్లాగులోనే ఇలాటి సందర్భాలు వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూనే వున్నాం. సెకండాఫ్ సిండ్రోం, మిడిల్ మటాష్, నిట్టని లువునా స్క్రీన్ ప్లే ఫ్రాక్చర్ మొదలైనవి.
        సినిమాలో ఆదిత్య, మల్హోత్రా, చోప్రా పాత్రల బలాబలాల సమీకరణ ఎలా వుందో చెప్పుకుంటే, ఆదిత్య డ్రగ్ దందా మూలాలు వెతుకుతున్నప్పుడు విలన్ గా మల్హోత్రా తెరపైకొచ్చాడు. అతడి కొడుకు అజయ్ దొరికాడు. వాణ్ణి చంపేసి మల్హోత్రాకి షాకిచ్చాడు. ఇప్పుడు చోప్రా అనే ఆదిత్యకి తెలియని కొత్త విలన్ వచ్చి మల్హోత్రాని చంపేశాడు. తర్వాత ఆదిత్య మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆదిత్య కూతురు చనిపోయింది. దీంతో దీనికి కారకుడు మల్హోత్రాయే అనుకుని ఆదిత్య చంపడానికెళ్ళి అప్పటికే చచ్చాడని తెలుసుకున్నాడు. ఎవరు చంపారో తెలీక పిచ్చెత్తిపోయి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు...
        బలాబలాల సమీకరణ ఆదిత్య - మల్హోత్రాల మధ్యనే  వున్నట్టు ప్రేక్షకులు నమ్మేట్టు చేశారు. ఈ సమీకరణలో మల్హోత్రాని కొత్త సమీకరణ ప్రారంభిస్తూ కొత్త విలన్ చోప్రా చంపేయడంతో, ఈ కొత్త సమీకరణ ప్రేక్షకులకి మాత్రమే తెలుస్తోంది, కొత్త విలనెవరో తెలీని ఆదిత్యకి కాదు. దీంతో ఈ సమీకరణలో క్రియాత్మక శూన్యం ఏర్పడింది. ఈ శూన్యమెలాంటి
దంటే, ఫస్టాఫ్ లో ఇంకా విలన్ మల్హోత్రా ఎంట్రీ ఇచ్చే వరకూ వుండే శూన్యం లాంటింది. ఫస్టాఫ్ లో విలన్ ప్రవేశించేవరకూ శూన్యమే వుంటుంది, ఇది సహజం.
        ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో కూడా శూన్యమే ఏర్పడిందంటే ఇది అసహజం. బాక్సాఫీసుకి అసహనం. ఫస్టాఫ్ లో హీరోకి విలన్ ని ఎటాచ్ చేయడానికి ఎలా ఎంత సేపూ కథనం చేసి శూన్యాన్ని భర్తీ చేశామో, సెకండాఫ్ లో హీరోకి కొత్త విలన్ని ఎటాచ్ చేయడానికీ అలా అంత సేపూ కథనం చేయాలన్న మాట. అంటే ఫస్టాఫ్ లో బిగినింగ్ విభాగపు కథనమే మళ్ళీ సెకండాఫ్ లో కూడా ఇలా బిగినింగ్ విభాగపు కథనమే అవుతుందన్న మాట. అంటే మొదటి విలన్ తో మిడిల్లో పడ్డ కథ తెగిపోయి, లేదా ఆగిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి, కొత్త విలన్ తో మళ్ళీ బిగినింగే చెప్పుకునే అగత్యానికి దారి తీయడమన్న మాట. అంటే కథకుడు స్ట్రక్చర్ జ్ఞానం లేకుండా ఎంత సేపూ ఫస్టాఫ్ తర్వాత ఫస్టాఫే  రాసుకుంటూ కూర్చుంటున్నాడన్న మాట. ఇలాటి కథకుణ్ణి ఏమనాలి? మూడో విలన్ అనాలా?
        ఇలా స్క్రీన్ ప్లేల్లో కొత్త కొత్త వింత సమస్యలు తెచ్చి పెడితే వీటిని వివరించాలంటే కొత్త కుస్తీపట్లు పట్టాల్సి వస్తోంది. స్ట్రక్చర్ జ్ఞానం లేని కథకులు మామూలోళ్ళు కాదు, ఏ కథలో ఏ కొత్త చిక్కుముళ్ళు పెట్టి ముప్పు తిప్పలు పెడతారో తెలీదు. కథకుడ్ని పడుకోబెట్టి కోసి చూసినా, ఏం రాతకోతలు చేసి కథనలా తగులబెట్టాడో అంతుబట్టదు. వీటి విశ్లేషణలు రాయాలంటే ఇలాటి కథకుల మీద భారీ పెనాల్టీలు విధించాల్సిందే.
రెండూ ఫస్టాఫులే
      రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ మూవీ ఇన్వెస్టిగేషన్ జానర్ కథగా వుండాలని ఎవరూ కోరుకోరు. యాక్షన్ కథగానే వుండాలనుకుంటారు. కానీ ఈ ‘దర్బార్’ లో ఫస్టాఫ్ యాక్షన్ కథగా వుంటూ, సెకండాఫ్ కొత్త విలన్ చోప్రా ఎవరనే తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ కథనంగా మార్చేశారు. అసలే కథలో కొత్త విలన్ తో సెకండాఫ్ మళ్ళీ బిగినింగ్ కే వచ్చిందనుకుంటే, దీన్నికూడా  యాక్షన్ జానర్లోనే పెట్టక, తీరుబడిగా చేసుకునే ఇన్వెస్టిగేషన్ కథగా చేసి, ఎక్కడేసిన గొంగళి చేశారు కథని.
        ఇంకోటేమిటంటే, ఫస్టాఫ్ లో ప్రారంభమైన ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ఇంకా చివరి అరగంట వరకూ కొనసాగడం. పైగా ఇందులో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడంతో మళ్ళీ ఆదిత్యకి కొత్త విలన్ తో ఎటాచ్ మెంట్ ఇవ్వడానికి ఆ సమయమంతా పట్టడం. ఇలా ఈ కథనం కూడా బిగినింగ్ విభాగపు కథనంలాగే తయారయ్యింది. బిగినింగ్ విభాగంలో వుండేది కథకాదు, మిడిల్లో ప్రారంభమవబోయే కథకి ఉపోద్ఘాతం మాత్రమే.  అందువల్ల ఇక్కడ సెకండాఫ్ లో మళ్ళీ ఉపోద్ఘాతమే మొదలుయ్యింది. దీంతో సెకండాఫ్ విషయం లేక బోరు కొట్టడానికి కారణమైంది. అసలీ సెకండాఫ్ లో వుండాల్సింది ప్రారంభం నుంచీ హీరో విలన్ల మధ్య సంఘర్షణతో కూడిన మిడిల్ విభాగపు బిజినెస్సే.
        విలనెవరో ప్రేక్షకులకి తెలుస్తూ ఇంకా హీరోకి తెలియకపోవడం, హీరో తెలుసుకోవడం ఫస్టాఫ్ లోపు జరిగిపోవడం కథాన్యాయం. అంటే ఫస్టాఫ్ లో జరిగిపోవాల్సిన డైనమిక్స్, సస్పెన్స్, థ్రిల్ ఏదైతే అది. ఇలా ఫస్టాఫ్ కల్లా హీరో విలన్లు ముఖాముఖీ అయిపోవాలి. ఇంకా హీరో విలన్ తో దాపరికాలుండకూడదు. దీన్ని ఎత్తి సెకండాఫ్ లో పెడితే, అప్పటికి విలన్ తో ముఖా ముఖీ యాక్షన్లో వుండాల్సిన హీరో, ప్రేక్షకులకంటే చాలా వెనుకబడిపోయి బోరు కొట్టిస్తాడు.  
        సెకండ్ విలన్ చోప్రాతో తో సెకండాఫ్ లో రివీలయ్యే అతడి పూర్వ కథ కూడా పెట్టారు. ముప్ఫై ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్ తగులబెట్టి పోలీసుల్ని చంపి పారిపోయిన గతం. ఇదిప్పుడెవరికవసరం. ఇప్పుడు ఆదిత్య కూతుర్ని చోప్రా చంపిన కథా కథానాలే అవసరం. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు సింపుల్ లైను కథమీద భారీ యాక్షన్ తో వుంటాయి. ఎందుకలా వుంటాయి? భారీ యాక్షన్ కి, కథ కూడా భారీగా, రకరకాలుగా వుంటే చూసే ప్రేక్షకులు మానసిక అలసటకి గురై ఇటు కథనీ, అటు యాక్షన్నీ దీన్నీసరీగ్గా ఎంజాయ్ చేయలేరు గనుక. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అయినా స్క్రీన్ ప్లే రచనలో ఆడియెన్స్ సైకాలజీ ఒక ముఖ్య భాగమన్న విషయం మనకి పట్టడం లేదు.
        ‘దర్బార్’ కథ సింపుల్ గా చెప్పుకుంటే, చోప్రా మహాశయుడి ముప్పై ఏళ్ల నాటి ఘనకార్యం ఓపెనింగ్ టీజర్ వేసేసి, ఆదిత్యతో ఎన్ కౌంటర్లు చేయిస్తూ, అజయ్ ని చంపి, మల్హోత్రా మీదికిపోయినప్పుడు, చోప్రా వచ్చేసి ఆదిత్యకి తెర వెనుక అసలు విలన్ బయటపడితే, సెకండాఫ్ విలనీ విరిగిపోదు. కథ విరిగి అతికించుకునే పనుండదు. ఇన్వెస్టిగేషన్ అగత్యముండదు. పూర్తి స్థాయి యాక్షన్లోనే వుంటుంది కథ.
        ఈ యాక్షన్లో రెండు బలమైన పిల్లర్ సన్నివేశాలున్నాయి. ఫస్టాఫ్ లో జైల్లో అజయ్ బదులు డూప్లికేట్ వున్నప్పటి డ్రామా, సెకండాఫ్ లో ఆదిత్య కూతురు చనిపోయినప్పటి భావోద్వేగం. ఈ స్క్రీన్ ప్లే బలానికి మురుగ దాస్ ఏవైనా కనిపెడితే ఈ రెండు పిల్లర్లే కనిపెట్టాడు. ప్రమాదంలో ఆదిత్య స్పృహ కోల్పోయి ఐదు గంటలవరకూ కోలుకోని స్థితి, స్పృహలోనే వున్న కూతురు మెదడులో రక్త స్రావంతో రెండు గంటల్లో మరణించే విషాదం. అయితే కూతురి పాత్రచిత్రణ మొదట్నుంచీ అల్లాటప్పాగానే వుంది. ఎప్పుడు చూసినా పనీపాటా లేనట్టు తండ్రితోనే వుంటుంది. తండ్రితోనే తిరుగుతూంటుంది. ఈ మూస ఫార్ములాలోంచి నేటి కెరీర్ వుమన్ గా బయటికి తెచ్చే చిత్రణ చేయలేదు. మురుగదాస్ చేసింది ఎప్పటివో రజనీకాంత్ సినిమాల తీరుతెన్నుల్నే మళ్ళీ తిరగేయడం. పనీపాటా లేకపోయినా కూతురికో ఆశయమంటూ వుంది, తండ్రి పెళ్లి చేయాలని. ఈ ఆశయం తీరకుండానే చనిపోయింది. అయితే చనిపోయేప్పుడు దీని వూసే వుండదు. దీని తాలూకు తపనే వుండదు. తను చనిపోబోయే రెండు గంటల్లోగా లిల్లీని పిలిచి కమిట్ చేయించి చనిపోవచ్చు. ఆమెకి మురుగదాస్ ప్రయోజనంలేని మరణమే ఆమెకి కరెక్ట్ అనుకుని శిక్షించినట్టుంది.
***
         ‘డెత్ విష్’ అనే సంచలనాత్మకంలో ఛార్లెస్ బ్రాన్సన్ కూతురి మీద అఘాయిత్యం చేసిందెవరో తెలీక, రాత్రి పూట సంచరిస్తూ కనపడిన అసాంఘీక శక్తుల నల్లా ట్రాప్ చేసి కాల్చి చంపుతాడు. ‘దర్బార్’ లో రజనీకాంత్ కూతుర్ని చంపిందెవరో తెలీక మానియక్ లా మారి ఎన్ కౌంటర్లు చేస్తూంటాడు. ఈ పోలికలతో  మొదటిది సీక్వెల్స్ కి దారితీసింది. రెండోది వున్న దాంట్లోనే ఎపిసోడ్స్ కి దారితీసింది. ఎపిసోడ్లు సినిమా అవదు, సీక్వెన్సులు సినిమా అవుతాయి. ఒకే కథని అల్లుకుంటూ పోతాయి. స్ట్రక్చర్ ఎన్నో అల్లికల్ని దారిలో పెడుతుంది.
సికిందర్
  

10, జనవరి 2020, శుక్రవారం

907


      దివంగత రివ్యూ రైటర్ రోజర్ ఎబర్ట్ స్కాండినేవియా సినిమాల గురించి రాస్తూ, హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాల ముందు తమ స్థానిక మార్కెట్ నిలుపుకోవాలంటే, తమకున్న బడ్జెట్ పరిమితుల రీత్యా, కథని నమ్ముకుని కథాబలమున్న లోబడ్జెట్ థ్రిల్లర్స్ తీసే కొత్త పంథాననుసరిస్తున్నారని పేర్కొన్నాడు. కథా బలమున్న ఈ లోబడ్జెట్ స్కాండినేవియా థ్రిల్లర్స్ గత కొన్నేళ్లుగా ప్రపంచ దృష్టి నాకర్షిస్తున్నాయి. 2005 లో విడుదలైన ‘అంబులెన్స్’ ఒక చక్కటి ఉదాహరణ. మనం వీటిలోంచి కథలు కాపీ కొట్టాలని కాక, తక్కువ బడ్జెట్ లో విజయవంతమైన రైటింగ్, మేకింగ్ ఎలా వుంటాయో పరిశీలించే దృష్ట్యా వీటిని చూడాలి. ‘అంబులెన్స్’ అనే ఈ థ్రిల్లర్స్ కి మూడే రూల్స్ పాటించారు : 1. పూర్తిగా కథ అంబులెన్స్ అనే ఒకే లొకేషన్ లో జరగాలి, 2. ఆ కథ 80 నిమిషాల రియల్ టైంలో జరగాలి, 3. నాల్గే క్యారక్టర్లు వుండాలి.

      ఇక ఈ కథ చూస్తే సింపుల్ గా వుంటూనే బలంగా వుంటుంది. ఇద్దరు అన్నదమ్ముల కథ. మృత్యు ముఖంలో వున్న వాళ్ళ తల్లి వైద్యానికి అత్యవసరంగా డబ్బు కావాలి. ఆ డబ్బుకోసం దోపిడీ చేస్తారు. ఆ దోపిడీ డబ్బుతో కారులో తప్పించుకునే లోగా పోలీసులు వచ్చేస్తారు. పోలీసులనుంచి తప్పించుకుని పారిపోతూ అంబులెన్స్ ఎక్కేస్తారు. డ్రైవర్ని తోసేసి దూసుకుపోతారు. పోలీసు కారు వెంటాడుతుంది. అంబులెన్స్ లోనే గుండె పేషంటు వుంటాడు. ఇతడ్ని అర్జెంటుగా ఆస్పత్రికి తీసికెళ్ళక పోతే చనిపోతాడని గొడవ పడుతుంది నర్సు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి. పేషంట్ ని ఆస్పత్రికి తీసికెళ్తే తాము పోలీసులకి దొరికిపోయి అవతల తల్లి మరణిస్తుంది. పేషంట్ ని ఆస్పత్రికి తీసికెళ్ళకుండా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతే అవతల తల్లిని బతికించుకోవచ్చు, ఇవతల పేషంట్ చస్తాడు. ఈ తగాదాలో అన్నమీద తమ్ముడు తిరగబడతాడు. ముందు తల్లిని రక్షించుకుని, పేషంట్ ని చంపిన నేరం మీదేసుకోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడేం జరుగుతుందనేది    ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మిగతా కథ!
***

8, జనవరి 2020, బుధవారం

906 : కొత్త డైరెక్టర్ కహానీ


        రోజుల్లో యూత్ కి వీణ కావాలా, గిటార్ కావాలా అంటే గిటారే కావాలంటారు. యూతే కాదు, అన్న ప్రాసన రోజున బుజ్జి బాబు ముందు వీణ ఒక పక్క, గిటార్ ఇంకో పక్కన పెడితే వాడు చిన్ని చేతులతో గిటార్నే యూత్ అప్పీల్ తో వదలకుండా పట్టుకునే రోజులివి. కానీ కొందరు కొత్తగా వచ్చే దర్శకులు కాలం మారలేదని, అస్సలు మారబోదని భీష్మించుకుని,  ఇంకా వీణే వాయిస్తూ తదాత్మ్యం చెందుతున్నారు. చుట్టూ యువప్రేక్షకులు యూతో రామచంద్రా అని అలమటించడాల మంటలు రేపుతున్నా ఫిడేలు కూడా వాయిస్తూ కూర్చుంటున్నారు. వీణ సినిమాలు పోయి గిటార్ సినిమా లొచ్చినట్టు ఆ మార్కెట్టే తెలియడం లేదు. వీణ సినిమాలంటే ఏడ్పించే రోమాంటిక్ డ్రామాలనీ, గిటార్ సినిమాలంటే హుషారెక్కించే రోమాంటిక్ కామెడీలనీ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ బ్లాగులో చెప్పుకుంటూనే వున్నాం. కానీ నిర్మాత దిల్ రాజుకి కూడా వీణ ప్రేమలకే ప్రియమైన మార్కెట్ వుందని గట్టి నమ్మకం. యంగ్ హీరో రాజ్ తరుణ్ కి ‘వీణ లోనా గిటారు లోనా ఎక్కడున్నది నాదము’ అని ఇంకా అయోమయం. ఇక కొత్త దర్శకుడు జీఆర్ కృష్ణకైతే, టర్కిష్ డ్రామాలోనే యూత్ కి కావాల్సిన దమ్మారో దమ్ అంతా వుందని ప్రబల విశ్వాసం. 

        టర్కీ రోమాంటిక్ డ్రామా - ‘ఆస్క్ టెసా ఫ్లీరీ సెవెర్’ (ఇంగ్లీషు టైటిల్ : లవ్ లైక్స్ కోయిన్సిడెన్సెస్) ట్రాజడీ కూడా! ఇందులో చూపించిన కథాకాలం 1977 నుంచి పాతికేళ్ళు అంటే 2002 వరకూ. 1977 లో పుట్టిన హీరోహీరోయిన్లు, పాతికేళ్ళ తర్వాత 2002 లో కలుసుకున్నప్పటి కథ అన్నమాట. దీన్ని నిర్మించి విడుదల చేసింది 2011 లో. పదేళ్ళ తర్వాత తెలుగులో రీమేక్ చేశారు. రీమేక్ నే కాదు, కొత్తగా వస్తున్న డైరెక్టర్ ట్రాజడీని కూడా పక్కనబెట్టాలన్ననీతి కూడా ఇందులో వుంది. ఐతే తెలుగులో ఈ కథాకాలం 1993 నుంచీ డిజిటల్ యుగంలో వుంది. ఒరిజినల్ కథాకాలం ఇంకా డిజిటల్ కాని ఎనలాగ్ యుగంలో వుంది, 2002 లో సెల్ ఫోన్లు మినహాయించి. రిమేక్ కథాకాలంలో ఒరిజినల్లో వున్న ఒక మిస్టీరియస్ క్రియేషన్ ని మిస్ చేసుకుని చిత్రీకరణ తేలిపోయేలా చేసుకున్నారు. ఇదేమిటో తర్వాత చూద్దాం. 


          ఈ ట్రాజడీ రీమేకులో పాయింటునే తీసుకుని కథనాన్ని మార్చినా తెలుగులో న్యాయం చేయగలమా అంటే పాయింటే ముగింపుని ట్రాజడీ చేసే పాయింటు అయింది. ఇటీవల హీరోయిన్ లేకపోయినా, వున్నా ప్రేమ లేకపోయినా రెండు మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి గనుక ట్రాజడీని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనుకోవడానికి ఆ సక్సెస్ అయిన సినిమాలు ప్రేమ సినిమాలు కావు, సస్పెన్స్ థ్రిల్లర్స్. 

        ఈ టర్కీ ట్రాజడీని హక్కులు కొని అధికారికంగా రీమేక్ చేయడానికి ఈ కథలో ముగింపుతో బాటు, కథనంలో కోయిన్సిడెన్సులు ఆకర్షించి వుండాలి. టైటిల్ కూడా ‘లవ్ లైక్స్ కోయిన్సిడెన్సెస్’ అంటూ ప్రమాదాలంటే ప్రేమకి రొంబ ఇష్టమన్నట్టు ఆకర్షించడానికి బలిష్టంగా వుంది. కానీ ముగింపులో వచ్చే కోయిన్సిడెన్సుని కన్విన్స్ చేయడానికే మొదట్నుంచీ కోయిన్సిడెన్సు లతో ప్రేమికులకి యాక్సిడెంట్లు చేయించారని ఒరిజినల్లో కథకుడి ఆంతర్యాన్ని గ్రహించి వుంటే, ఈ రీమేక్ కి బాక్సాఫీసు దగ్గర జరిగే యాక్సిడెంట్ ని నివారించే వాళ్లేమో. ఈ కోయిన్సిడెన్సుల్ని ప్రేమకే ఆపాదిస్తూ టైటిల్ గా పెట్టుకున్నాడు టర్కీ దర్శకుడు. కానీ ఇది రైటర్ కథా సౌలభ్యం కోసం పాల్పడ్డ ‘రైటర్స్ కన్వీనియెన్స్’ అవుతుంది. స్క్రీన్ ప్లే ట్యూటర్ స్కాట్ మేయర్స్ ప్రకారం, కథలో మొదటి సంఘటన కోయిన్సిడెన్సు (విధి) అని సరిపెట్టుకోవచ్చు ప్రేక్షకులు. అలాటిదే రెండో సంఘటనని కోయిన్సిడెన్సుగా సరి పెట్టుకోలేరు ప్రేక్షకులు- కథా సౌలభ్యం కోసం ‘రైటర్స్ కన్వీనియెన్స్’  అనుకుంటారు. మూడోసారి కూడా ఇదే జరిగితే ఇక చెప్పక్కర్లేదు – ప్రమాదాలతో మాటిమాటికీ విధి అంటే చిరాకేస్తుంది. కథనాన్ని విధి మీదికి నేట్టేసే ఈజీ సొల్యూషన్ గా కథ నడపడం రైటర్ కి క్షంతవ్యం కాదంటాడు సిడ్ ఫీల్డ్ కూడా. 

        ఈ టర్కీ ట్రాజడీని దర్శకుడు మూడు కాకుండా, రెండు ప్రమాదాలతో, అదీ ఒకేసారి జరిగేలా -  ‘రోమాంటిక్ సస్పెన్స్’ గా తీసి వుండాల్సింది. ఇది టాలీవుడ్ కి అత్యవసరం. ఎందుకంటే, కథా కథనాల్లో ఏ మాత్రం లోటుపాట్లు ఆలోచించకుండా, కనపడింది కనపడినట్టు రీమేక్ చేసేసే వాళ్ళున్నారు గనుక. వాళ్ళకి కన్వీనియెంట్ గా వుండేందుకు అత్యవసరమే. మరి రెండు ప్రమాదాలు రైటర్స్ కన్వీనియెన్సే కదా, ఎలా? అదెలాగో ‘కాసాబ్లాంకా’ ఉదాహరణగా స్కాట్ మేయర్సే చెప్పాడు. దీని వివరాల్లోకి వ్యాసం ముగింపులో వెళ్దాం. ముందు క్లుప్తంగా కథ చెప్పుకుందాం...

కథ
        1993 లో రెండు కార్లు గుద్దుకుని వాటిలో వున్న ఇద్దరు గర్భిణులు ఒకే ఆస్పత్రిలో ఇద్దర్నికంటారు. పాతికేళ్ళు గడిచిపోతాయి. మహి (రాజ్ తరుణ్) ఫోటోగ్రాఫర్ గా కృషి  చేస్తూంటాడు. వర్ష (పాండే) సినిమా హీరోయిన్ నవ్వాలని ప్రయత్నాలు చేస్తూంటుంది. మహి ఏర్పాటు చేసిన ఓ ఫోటో ఎగ్జిబిషన్ లో ఆమె తన చిన్నప్పటి ఫోటో చూసుకుని మహిని అడుగుతుంది. ఫోటో గ్రాఫరైన తన తండ్రి తీసిన ఫోటో అదని, అప్పట్లో ఊటీలో వుండే వాళ్ళమని చెప్తాడు. ఆ ఫోటోలో వున్నది తానేనని ఆమె చెప్పేసరికి ఆశ్చర్యపోతాడు. అలా చిన్నప్పుడు విడిపోయిన ఇద్దరూ ఒకటై మీటవుతూంటారు. చిన్నప్పుడు పరస్పరం సైకిళ్ళు గుద్దుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడామెకి  రాహుల్ అనే బాయ్ ఫ్రెండ్ వుంటాడు. ఇటు మహికి చిన్నప్పట్నుంచీ గుండె సంబంధమైన సమస్య వుంటుంది. ఆమెకి ఫోటో షూట్ లు చేస్తూ సినిమాకి ఎంపికయ్యేందుకు తోడ్పడతాడు. ఆమె ఊటీ బయల్దేరుతుంది. అతను డాక్టర్ చికిత్సకి రమ్మన్నా వినకుండా ఊటీ వెళ్ళిపోతాడు. ఊటీలో ఆమె అతడితో ప్రేమలో పడుతుంది. అతను ప్రేమించలేక పోతాడు. ఒక రోజు జబ్బు ముదిరి పడిపోతాడు. హాస్పిటల్లో మృత్యు ముఖంలో వుంటాడు. ఇది తెలుసుకుని ఆమె వస్తూ యాక్సిడెంట్ కి గురై బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆమె గుండె అతడికి మార్చి అతణ్ణి బ్రతికిస్తారు డాక్టర్లు. ఆమె లేకపోయినా ఆమె తనలోనే వుందనీ, ఇద్దరి లోకం ఒకటేననీ ముగుస్తుంది సినిమా. 


జబ్బుకి రియాలిస్టిక్ ఫిక్షన్?

        నిన్ను నేను వెతుక్కుంటున్నప్పుడు నన్ను నేను కోల్పోతాను
        నేను నిన్ను కనుగొన్నప్పుడు నాలోంచి నేను తొలగిపోతాను
        ఈ వీడ్కోలు ఒక వింత - నువ్వే నాలో వున్నప్పుడు
        నేనెంత దూరం వెళ్ళినా నాతోనే కదా నువ్వుంటావు...

        ఇలా కవితాత్మకంగా ముగిస్తాడు టర్కీ దర్శకుడు. కథ అర్ధవంతంగా ముగిస్తే కవిత్వం కదిలించ వచ్చు. రెండు పాసివ్ పాత్రల్ని(ట్రాజడీలలో పాసివ్ పాత్రలే వుంటాయి, ఇవి కమర్షియల్ ఉపయోగాలకి సుదూరంగా ఎక్కడో... వుంటాయి) కథకుడే నడిపిస్తే అతడి బుద్ధి కొద్దీ ముగింపు వుంటుంది. ఆ కవిత్వాలు కథ లోంచి, పాత్రల్లోంచి ప్రవహించక తన బుద్ధికి తనే కీర్తి గానాలు చేస్తున్నట్టు వుంటుంది. దీంతో కదిలించే మాటలా వుంచి వికటిస్తుంది.

        జబ్బు ట్రాజడీలు జబ్బులంత పాతవి. క్యాన్సర్ జబ్బులు, గుండె జబ్బులు, ఇవి పాతబడి నోరు తిరగని సైంటిఫిక్ పేర్ల జబ్బులూ, ఇవన్నీ ప్రేమ కథలకి ఒకప్పుడు సక్సెస్ ఫార్ములాలు. ఇప్పుడు కాదు. అయినా ఇప్పటి గ్లోబల్ యూత్ గా కదం తొక్కుతున్న యువ ప్రేక్షకుల కోసం తీయాలంటే చాలా రిస్కు వుంటుంది. చాలా క్రియేటివ్ పవర్స్ కూడా అవసరం. అమెరికన్ సాహిత్యంలో యువ పాఠకుల కోసం ఇప్పుడొస్తున్నవి అవే రొటీన్ ప్రేమ నవలలు కాదు. రియాలిస్టిక్ ఫిక్షన్ అనే కొత్త జానర్ నవలలు. ఈ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ నవలగా వచ్చి సంచలనం సృష్టించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ గురించి తెలిసే వుంటుంది. దీన్ని హాలీవుడ్ మూవీగా తీస్తే చాలా పెద్ద హిట్టయింది. దీన్నే హిందీలో ‘దిల్ బేచారా’ గా తీస్తున్నారు. వచ్చే మే లో విడుదలవుతుంది. ఇది ఇద్దరు టీనేజర్ల ప్రేమ కథ. ఆమెకి థైరాయిడ్ క్యాన్సర్, అతడికి లెగ్ క్యాన్సర్. దీని మార్కెట్ - క్రియేటివ్ యాస్పెక్ట్స్ ఏమిటి? హాస్య రసం, వినోదం, యూత్ లాంగ్వేజ్, బలమైన పాత్రలు, క్యాన్సర్ కి, ప్రేమకి యువ దృష్టితో కొత్త భాష్యం! 

        ఈ లక్షణాలు తెలుగు రీమేక్ కి వున్నాయా? లేవు. రాజ్ తరుణ్ గుండె జబ్బు పాత్ర ఫస్టాఫ్ నుంచీ విషాదమే. టర్కీ దర్శకుణ్ణి ఇప్పటి తెలుగుకి అక్షరాలా ఫాలో అయిపోయారు. యూరప్ భూభాగంతో తో కలిసి వుండే టర్కీ దేశపు సినిమాలు నిజానికి వరల్డ్ మూవీస్ వర్గానికి చెందుతాయి. వరల్డ్ మూవీస్ అంటేనే ఆర్ట్ మూవీస్. వాటి జోలికి పోయి రీమేక్స్ చేయకూడదని చాలా సార్లు చెప్పుకున్నాం. అవి కమర్షియల్ సినిమాల కథలుగా వుండవు, మనకి కమర్షియల్ ప్రదర్శనలకి పనికి రాని, స్ట్రక్చర్ లేని  ‘గాథ’ లుగా వుంటాయని పదేపదే చెప్పుకున్నాం. అయినా వాటిని రీమేకులు చేసి చేతులు కాల్చుకుంటున్నారంటే ఏమనాలి. వరల్డ్ మూవీస్ కమర్షియల్ సినిమాలే ఐతే హాలీవుడ్ సినిమాల్లాగా మనదేశంలో ఎందుకు విడుదల కావడం లేదు? ఈ సింపుల్ లాజిక్ ని అర్ధం జేసుకుంటే చాలు. వరల్డ్ మూవీస్ యూరో మూవీస్, హాలీవుడ్ మూవీస్ డాలర్ మూవీస్. యూరోలు కావాలా, డాలర్లు కావాలా? కాబటి హాలీవుడ్ మూవీల మీద చేయేస్తే మేలు. 

నాల్గు మైనస్ లు 
       కాబట్టి యూరో నుంచి తెలుగు రూపాయల్లోకి రీమేక్ చేసిన ఈ గుండె జబ్బు సినిమా 1. పాసివ్ పాత్రలతో, 2. స్ట్రక్చర్ లేని, 3. గాథ; పైగా 4. ట్రాజడీ. థియేటర్లో ఆడాలనుకునే ఒక తెలుగు సినిమా మీద ఇన్ని రకాల దౌర్జన్యాలా? ఈ నాల్గూ సినిమా విజయాన్ని అడ్డుకుంటూ తిష్ట వేసిన దుష్ట చతుష్టయం. సినిమాలకి సంబంధించినంత వరకూ గాథలనేవి మేడి పండులు, వాటి పొట్ట విప్పి చూస్తే పురుగులుండు. ఇలా ఈ రీమేకులో వొరిజినల్లో లాగా, ఫస్టాఫ్ లోనే గుండె జబ్బు విషయం ఓపెన్ చేయడం వల్ల సాంతం విషాదభరితమై పోయింది. రాజ్ తరుణ్ యువ పాత్రకి యూత్ అప్పీల్ లేక నీరసంగా, భారంగా వుండిపోతాడు. తను ఈ సినిమాని నిలబెట్టాల్సిన కథానాయకుడనే విషయమే మర్చిపోతాడు. 


       
        ఒరిజినల్లో ఒక క్రాఫ్ట్ ని ఒప్పుకోవచ్చు : హీరో హీరోయిన్ల చిన్నప్పటి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల క్రాఫ్ట్. ఈ ఫ్లాష్ బ్యాకులు బాల్యంలా చాలా ఇన్నోసెన్స్ తో వుంటాయి. తెలుగులో ఈ ఫీల్ ని పట్టుకోలేకపోయారు. పైగా బాల్యపు సీన్లని పొడిగించారు. బాల హీరోయిన్ తాతతో రిహార్సల్ చేసే సీను లాంటివి. హద్దులు దాటి ఇదేమీ వర్కౌట్ కాలేదు, పైగా ఇన్నోసెన్స్ కి హానిచేశాయి. డబ్బింగ్ లో ఈ డైలాగులు ఒరిజినల్లో లాగా మంద్రస్థాయిలో లేకుండా గోలగా వున్నాయి - ఈ ఫ్లాష్ బ్యాకులు లేకపోతేనే బావుండేదన్పించేలా. ఒరిజినల్లో వున్న బ్యూటీ ఎలాంటిదంటే, బాల్యపు ఫ్లాష్ బ్యాక్ వస్తోందంటేనే ఆసక్తిగా చూసేలా చేస్తాయి. బాలల  సినిమాలు పెద్దల సినిమాల్లా వుండవు కదా, అలాగే బాలల ఫ్లాష్ బ్యాకులు మిగతా సినిమాలా కలిపేసి వుండకూడదు. 

        ఒరిజినల్లో కనీసం ఫస్టాఫ్ కథనంలో ఆసక్తి వుంది. మొదటి ఇరవై నిమిషాల కథనం ఒక ఎజెండాతో సీక్వెన్స్ గా వుంటుంది. ప్రారంభంలో కారు ప్రమాదాలు జరిగి హీరోహీరోయిన్లు పుట్టాక, వెంటనే టైటిల్స్ డార్క్ రూమ్ లో నెగెటివ్ లు డెవలప్ చేస్తున్న దృశ్యాలు ప్రారంభమవుతాయి. ఇక్కడే పైన ప్రస్తావించిన మిస్టీరియస్ క్రియేషన్ వస్తుంది. టైటిల్స్ పూర్తయ్యేవరకూ డార్క్ రూమ్ లో నెగెటివ్ (ఫోటోల) డెవలప్ మెంట్ ప్రక్రియలే. ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడెందుకు డెవలప్ చేస్తున్నారనే మిస్టరీ. ఈ మిస్టరీతోనే టైటిల్స్ పూర్తయి హీరోయిన్ తెరపైకొస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్నవస్తుంది. నెగెటివ్ డెవలప్ మెంట్స్ కి ఈమెతో సంబంధముందా, ఎలా? సంబంధం లేదనిపిస్తుంది. ఇంతలో హీరో తెరపై కొస్తాడు ఫోటోగ్రాఫర్ గా. ఇప్పుడు గానీ మిస్టరీ వీడిపోదు. ఇతను డిజిటల్ ఫోటోగ్రఫీ లేని ఫిల్ముల కాలంలో 1977 లో పుట్టాడు, పెరిగాడు, ప్రస్తుతకాలం 2002 లో ఫోటోగ్రాఫర్ గా ఫిల్ము లే వాడుతున్నాడు. ఎందుకంటే అప్పటికింకా డిజిటల్ కెమెరాలు రాలేదు. ఇదీ టైటిల్స్ లో కూడా కథ చెబుతూ అతణ్ణి ఫోటోగ్రాఫర్ గా ఎస్టాబ్లిష్ చేసిన విధం.   

          ఇంత మంచి కథ చెప్పే క్రియేటివిటీ తెలుగులో లేదు. ఇక్కడ హీరో 1993 లో పుట్టి పెరిగాడు గనుక డిజిటల్ ఫోటోగ్రఫీతోనే అతడి ఫోటోగ్రఫీ ప్రారంభమవుతుంది. అందువల్ల క్యారక్టర్ నేరుగా కన్పించిపోతాడు. టైటిల్స్ తో సంబంధంలేదు. ఒరిజినల్లో టైటిల్స్ తర్వాత  హీరో హీరోయిన్ల పారలల్ క్యారక్టర్ డెవలప్ మెంట్ చూపిస్తారు. చిన్న చిన్న సీన్లుగా, ఒక సీను హీరోతో - ఇంకో సీను హీరోయిన్ తో - పేకముక్కల్లా పేర్చుకుంటూ పోతాడు క్రియేటివ్ టర్కీ దర్శకుడు. ఇదంతా ఒక సీక్వెన్సుగా ఒక ఎజెండాతో వుంటుంది. ఆ ఎజెండా ఏమిటంటే, ఈ విడివిడి హీరో హీరోయిన్లు ఒకచోట ఎప్పుడు ఎక్కడ క్లాష్ అయి, ఫేస్ టు ఫేస్ అవుతారనే ఆసక్తిని ప్రేక్షకులకి జనింప జేసేలా చేయడం. నిజంగా ఈ పేకముక్కల పేర్పు ఉత్సుకతని  రేకెత్తిస్తుంది. ఈ ఉత్సుకత రేకెత్తాలంటే సీన్లు చప్పున ముగిసిపోతూ వేగంగా సాగిపోతూ వుండాలి. వేగం- సైజు ఈ రెండూ ఈ క్రాఫ్ట్ లో కీలకం. వేగం తగ్గినా, సీన్ల సైజు పెరిగినా పైన చెప్పుకున్న ఉత్సుకత వుండదు వీళ్ళెలా కలుస్తారనే దాని గురించి. ఎజెండా వీగిపోతుంది. 

        ఈ బిట్ సీన్స్ లో పరస్పరం వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ వుంటుంది. ఫోటోగ్రాఫర్ గా అతను ఒక మ్యాగజైన్ తో డీల్ కుదుర్చుకుంటున్న డెవలప్ మెంట్, సినిమా యాక్టర్ గా ఆమె ఆడిషన్స్ వగైరా హాజరవుతున్న క్రమం. మధ్యమధ్యలో పరస్పరం పేరెంట్స్ ని కూడా చూపిస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న దృశ్యాలు. ఈ క్రమంలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఒక బిట్. అసలు హీరో హీరోయిన్లు కలుసుకునే పాయింటాఫ్ ఎటాక్ సీను ఎప్పుడొస్తుందాని చూస్తూంటే, ఏడో నిమిషంలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో యాంటీ సీనుతో ఒక కుదుపు. పన్నెండో నిమిషంలో ఫోటో ఎగ్జిబిషన్ దగ్గర ఆమె తన ఫోటో చూసుకునే మలుపు. పన్నెండో నిమిషంలో రానేవస్తుంది పాయింటాఫ్ ఎటాక్ సీను - హీరోతో మిలాఖత్.

        ఇలా ఈ పన్నెండు నిమిషాల్లో హీరో హీరోయిన్లని, ఇతర పాత్రల్నీచక చకా పరిచయం చేసేశారు. తెలుగులో ఈ ఎజెండాని అర్ధం జేసుకోనట్టుంది. హీరోతో ఒక సీను, హీరోయిన్ తో ఇంకో సీనూ బారెడు సీన్లు గా, నిదానంగా వేసుకుంటూ పోయేసరికి అర్ధం లేకుండా పోయింది. ఇంటర్ కట్స్ లో సీన్లంటనే సముచిత వేగంతో వాటిని  రెంటినీ కలిపి ఒక పతాక సన్నివేశానికి చేర్చడం. ఇది జరగనప్పుడు ఇంటర్ కట్స్ కి అర్ధమే లేకుండా పోతుంది. కథనం మీద ఆసక్తి కూడా పోతుంది. 

చేజార్చుకున్న తురుపు ముక్కలు 

       ఒరిజినల్లోనే కథలో గానీ, పాత్రలో గానీ సస్పెన్స్ అనేదే లేకుండా అంతా విప్పి చూపిస్తూ వెళ్ళిపోయారు. దర్శకుడు గుప్పెట్లో ఏదీ వుంచుకోలేదు తురుపు ముక్కల్లా  ప్రయోగించడానికి. ఫస్టాఫ్ లో పైన చెప్పుకున్న సీక్వెన్స్ తర్వాత, ఇంకేమీ లేదు కథగా చెప్పుకోవడానికి. ఎప్పుడైతే హీరోకి గుండె సమస్య అని ఫస్టాఫ్ లోనే చెప్పేశారో, ఇక సినిమా వినోదాత్మక విలువ నాశనమైంది. పక్కా కమర్షియల్ సినిమాల్లో ఇలాటిది వినోదానికి భంగం కలక్కుండా సమయం చూసి రివీల్ చేస్తారు. కానీ ప్రస్తుత ట్రాజడీ వరల్డ్ మూవీ కథ కాబట్టి స్ట్రక్చర్ వుండదు. ఏది ఎప్పుడెలా తోస్తే అప్పుడలా ప్రేక్షకుల మీద పారేస్తూ పోవడమే. ఇలా వీడికి గుండె ప్రాబ్లమని ఫస్టాఫ్ లోనే చెప్పేసి తాంబూలా లిచ్చేశాం, ఇక తన్నుకు చావండని చెప్పేయడమే. ఇక ఈ సినిమా చూడలేక గిలగిల తన్నుకోవడమే. 

        రాజ్ తరుణ్ తో ఒక రకమైన యాతన కాదు ఈ సినిమా చూడాలంటే. సినిమా సాంతం శాడ్ మూడే. కొత్త మీసాల యూత్ కత్తి ఎలా భరిస్తాడు వంగిపోయిన రాజ్ తరుణ్ ని? ఆగదూ ఆగదూ ఆగితే సాగదని అప్పుడే వంగి పోవడాలా గుండె పట్టుకుని? ఇదిలా వుంటే, ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో కన్పించవు. గాథ కాబట్టి. ముగింపులో చివరి యాక్సిడెంట్ దాకా ఒకే బిగినింగ్. మిడిల్ లేదు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. బిగినింగ్ తర్వాత ఎండ్ వచ్చేస్తుంది మధ్యలో మిడిల్ రాదు. క్యారక్టర్ కి గోల్ లేదు, సంఘర్షణా లేదు. ఇది గాథల లక్షణమే. కథైతే రెండు ప్లాట్ పాయింట్స్, మొదటి ప్లాట్ పాయింట్ దగ్గర గోల్, ఆ తర్వాత సంఘర్షణతో మిడిల్, రెండో ప్లాట్ పాయింట్ దగ్గర పరిష్కారమూ, తర్వాత ముగింపుతో ఒక స్ట్రక్చర్ గా వుంటాయి. కథని నాల్గు డబ్బులొచ్చే సినిమాగా నిలబెడతాయి. ఇలా చెప్పడం కొత్త డైరెక్టర్ ని చిన్నబుచ్చడానికి కాదు, వరల్డ్ మూవీస్ బండారం విప్పడానికే. ఇంకా దర్శకులు ఇది గమనించకుండా వరల్డ్ మూవీసే రీమేక్ చేస్తే, కాపీలు చేస్తే వాళ్ళిష్టం. 

        గుండె జబ్బని మొదటే ఎందుకు చెప్పడం? చివర్లో చెప్పొచ్చుగా? గుండె జబ్బుని దాచుకుని  హీరో పైకి నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చుగా? ‘మిలి’ లో ఆడుతూ పాడుతూ వుండే జయబాధురి పాత్ర నిజానికి క్యాన్సర్ బాధితురాలని చివర్లో షాకిస్తుంది గా? ఈలోగా చక్కబెట్టాల్సిన జీవితాల్ని చక్కబెట్టేస్తుందిగా? బాధని దాచుకుని సకార్యాలు చేసేపాత్ర కథానాయక / నాయిక పాత్రవుతుంది. ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ లో హీరో హీరోయిన్ల క్యాన్సర్ పాత్రలేమిటి? 

        గుండె జబ్బుని తురుపు ముక్కగా వాడుకుని వుంటే, అదే సమయంలో కోయిన్సిడెన్సుల యాక్సిడెంటుల్ని ఇంకో తురుపు ముక్కగా ముగింపులోనే ప్రయోగించి వుంటే, కనీస భద్రత వుండేది ఈ రీమేక్ కి. ఇంకోటేమిటంటే, తెలుగులో ఫస్టాఫ్ లోనే హీరోయిన్ పాత్ర సినిమా హీరోయిన్ అయిపోయినట్టు చూపించే పొరపాటు చేశారు. ఈ విషయంలో రీమేక్ నయం. అందులో క్లయిమాక్స్ లోనే ఆమె స్టేజి నటి అవుతుంది. స్టేజి మీద నటిస్తూండగా హీరో హాస్పిటల్లో వున్నాడని వార్త వస్తుంది. హుటాహుటీన బయల్దేరుతూ యాక్సిడెంట్ పాలవుతుంది. ఇంతలోనే నటి అయి, ఇంతలోనే చనిపోవడం ఎంత బాధాకర అనుభవంగా వుంటుంది ప్రేక్షకులకి. ఇదే తెలుగులో చూపించినట్టు, ఎప్పుడో ఫస్టాఫ్ లో సినిమా హీరోయిన్ అయిన హీరోయిన్, ఇంకెప్పుడో క్లయిమాక్స్ లో యాక్సిడెంట్ అయితే ఈ ఎడం అలాటి బాధాకర అనుభవాన్నిస్తుందా? కొన్ని సెటప్స్ వెంటనే పే ఆఫ్ అయితేనే దాని ఎఫెక్ట్ వుంటుంది. రస పోషణ ఇలాటి డైనమిక్స్ తోనే జరుగుతుంది. 

        హీరోయిన్ ఊటీ బయల్దేరడం, డాక్టర్ అపాయింట్ మెంట్ ని కాదని హీరోకూడా బయల్దేరడం ఇంటర్వెల్. ఇది గాథ కాబట్టి నాన్ కమర్షియల్ ఇంటర్వెల్ ఇంతే.

పరిష్కారమేమిటి?  
      ఈ గాథ సెకండాఫ్ ముగింపు మాత్రం చెప్పుకుందాం. పాత్రకి గోల్ లేకపోతే సెకండాఫ్ లో చెప్పుకోవడానికి విషయ మేముంటుంది. ముగింపులో హీరో జబ్బు పెరిగి హాస్పిటల్లో చేరతాడు. హీరోయిన్ కి ఇది తెలిసి వస్తూంటే కారు యాక్సిడెంట్ అవుతుంది. ఇది మూడో యాక్సిడెంట్. మొదటిది పుట్టడం పుట్టడం కార్లు గుద్దుకుని పుట్టారు. తర్వాత చిన్నప్పుడు సైకిళ్ళు గుద్దుకుని పరిచయమయ్యారు. ఇప్పుడు ఇంకోసారి గుద్దుకుని హీరోయిన్ బ్రెయిన్ డెడ్డే ఐపోయింది!
          ఇవన్నీ కోయిన్సిడెన్సులని చెప్పడం. ఇన్ని కోయిన్సిడెన్సులు చూపించడం. మొదటిసారి విధి అనుకుంటే, రెండోసారి రైటర్స్ కన్వీనియెన్స్ అయితే, మూడోసారి...?? ఇక్కడే స్కాట్ మేయర్స్ ఎంటరవుతాడు. తను నిర్వహించిన ఒక మాస్టర్ క్లాసులో టాప్ డైరెక్టర్ ఆరన్ సార్కిన్ బోధించిన విషయం చెప్తాడు : ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘కాసాబ్లాంకా’ (1942) లో ఒకే ఒక్క కోయిన్సిడెన్సు వుంటుంది. ఆ ఒకటి కూడా బ్యాడ్ కోయిన్సిడెన్సు అయి ఒప్పించేలా అన్పించదు. 

        ఇందులో హీరో (హంప్రీ బోగార్ట్) తనని హీరోయిన్ (ఇంగ్రిడ్ బెర్గ్ మన్) వదిలేసి వెళ్ళిపోయాక, కాసాబ్లాంకాలో నైట్ క్లబ్ నడుపుకుంటూంటాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది - కాకతాళీయంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా కాకతాళీయం అవుతుంది? ఆమె కాసాబ్లాంకాకే ఎందుకు రావాలి, ఇంకో నగరానికి వెళ్ళ కూడదా? వచ్చిందే అనుకుందాం, ఈ నైట్ క్లబ్ కే ఎందుకు రావాలి? ఇంకో నైట్ క్లబ్ కెళ్ళ కూడదా? 

        ఆమె రావాలని హీరో కూడా కోరుకోవడం లేదు. అయితే కోరుకోక పోవడమే ఈ సీనుని పాక్షికంగా జస్టిఫై చేస్తోంది. ఆమెతో తనకున్న గతాన్ని ఎవాయిడ్ చేస్తున్నాడు గనుకే ఆమె రావాలని కోరుకోవడం లేదు. కానీ ఆ గతాన్ని డీల్ చేయాల్సిందే, దాన్నుంచి తప్పించుకోలేడు. . అందువల్ల ఆమె రాక తన కవసరమే. విధి ఇలా పరీక్షిస్తోంటే ఈ విధిలీలని ఆమోదించాల్సిందే. 

        సార్కిన్ ఈ ఆమోదాన్ని పాత్ర స్వగతంలో డైలాగు రూపంలో వ్యక్తం చేయాలంటాడు. అప్పుడు రైటర్స్ కన్వీనియెన్స్ అపవాదు తప్పుతుందంటాడు. ఇంతకి మించి ఇంకేమీ లేదు. అంటే ఒక కోయిన్సిడెన్స్ కే ఇంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముంటే, రెండో కోయిన్సిడెన్స్ కూడా వుంటే? అది అసహజమే. దానికి సహజత్వాన్ని తీసుకు రావడం కుదరదు. మంచి కథా లక్షణం కాదు. మూడోది కూడా వుంటే ఇంకా నాన్సెన్స్. 


        ‘ఇద్దరి లోకం ఒకటే’ లో మూడున్నాయి : కార్లు గుద్దుకుని పుట్టడం, సైకిళ్ళు గుద్దుకుని ఫ్రెండ్స్ అవడం, మళ్ళీ కార్లు గుద్దుకుని బ్రెయిన్ డెడ్ అవడం. ఇలా వుంటే ఇది కామెడీ కూడా అయిపోయే ప్రమాదముంది. ఒక సీరియస్ గా సృష్టించిన కోయిన్సిడెన్స్ కామెడీయే అయింది. సందీప్ కిషన్ నటించిన తమిళ రీమేక్ ‘రన్’ అనే ఇండిపెండెంట్ సినిమా మధ్యలో విలన్ ఆటో గుద్దుకుని ఠపీమని చచ్చిపోతాడు!

        అందుకని కోయిన్సిడెన్స్ ఒక్కటే వుండాలి, అదీ బలంగా వుండాలని స్కాట్ మేయర్స్ అంటాడు. మనకి తోచినంతవరకూ ‘ఇద్దరి లోకం ఒకటే’ పరిష్కారం -
మొదటి రెండు ప్రమాదాలు తీసేసి చివరి ఒక్క ప్రమాదాన్ని వర్కౌట్ చేయాలి. అతడి గుండె జబ్బు విషయం సెకండాఫ్ లోనే  ప్రేక్షకులకి రివీలై, హీరోయిన్ కి రహస్యంగా వుంటుంది. ఇక తప్పనిసరిగా ప్రేమలో కమిటవాల్సి వచ్చేసరికి, కారు యాక్సిడెంట్ చేస్తాడు. అతడి కోసం ఆమె వచ్చేస్తూ యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆమె గుండె అతడికి అమరుస్తారు. చావాలనుకున్న వాడు బతకాల్సి వచ్చింది. ఆమె బతికించింది. మొదటిది అతను కావాలని చేసిన యాక్సిడెంట్, ఎవ్వరూ వూహించని రెండోది విధి లీల. దట్స్ ఐరనీ, ట్విస్ట్ ఎండింగ్. ఓ హెన్రీ స్టయిల్.

-సికిందర్