రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఆగస్టు 2019, గురువారం

860 : టిప్స్




        చాలా చాలా కాలం క్రితం రాబిన్ భట్ చేసిన ఒక సూచన ఈ పుస్తకం మీద దృష్టి సారించేలా చేసింది : హంగేరియన్ నాటక రచయిత లాజోస్ ఏగ్రీ 1946 లో రాసిన మాస్టర్ పీస్ ‘దిఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ ... ఈ పుస్తకాన్ని సినిమా రచయితలనదగ్గ వాళ్ళు తప్పకుండా దగ్గరుంచు కోవాలని కోరాడు సీనియర్ సినిమా రచయితైన రాబిన్ భట్ (మహేష్ భట్ సోదరుడు). ఈ పుస్తకం నాటక శాస్త్రమే అయినా, సినిమా రచనతో బాటు నవలా రచనకీ, కథా రచనకీ పనికొచ్చే విజ్ఞాన కోశంలా వుంది. 300 పేజీల ఈ పుస్తకం73 ఏళ్ళుగా, అంటే మూడు తరాలుగా ఇప్పటికీ రీప్రింట్లు అవుతూనే వుంది. ఇక నాల్గో తరం ప్రారంభం కాబోతోంది...ఈ సందర్భంగా ఇందులోని విషయాల్నికొన్నిటిప్స్ గా పరిచయం చేస్తే ఎలా వుంటుందని ఓ శుభోదయాన తోచింది. 
          బాగానే వుంటుంది. బాముకునే దెవరు? ఎవరి సొంత జ్ఞానం వాళ్ళకి పుష్కలంగా  వుంది. వేరే శాస్త్రం గీస్త్రం చల్తానై. దాంతో వద్దన్నా హిట్సే తీస్తున్నారు. ప్రేక్షకులు తట్టుకో లేకపోతున్నారు. నిర్మాతలు నోట్ల కట్టలు మోయలేక పోతున్నారు (ఖర్చు పెడుతూ ఈ నోట్ల కట్ట మళ్ళీ చూస్తానా అన్నాడో నిర్మాత). అందుకని ఈ టిప్స్ ని కాలక్షేపంగా చదివి వదిలెయ్యాలి. ఈ బ్లాగు వున్నదే కాలక్షేపం కోసం, నథింగ్ బట్ కాలక్షేపం.
         పుస్తకంలో థీమ్ మొదలుకొని క్యారక్టర్ స్ట్రక్చర్, కాన్ఫ్లిక్ట్ అనే మూడు చాప్టర్లు ప్రధానంగా రాసుకొస్తూ, జనరల్ చాప్టర్ కింద కొన్ని వ్యావహారిక అంశాల్ని పొందుపర్చాడు ఏగ్రీ. ఈ పుస్తకం నాటకాల గురించి కాబట్టి వాక్యాల్లో ‘నాటకం’ అనే పదం విరివిగా దొర్లింది. దీన్ని’కథ’ గా మార్పు చేసుకుని ముందుగా థీమ్ కి సంబంధించిన టిప్స్ చూద్దాం...
        1. శాస్త్రాన్ని అర్ధం జేసుకోలేని వాళ్ళు  కథ రాయడానికి రూల్స్ లేవంటారు. ఏగ్రీ కథ రాయడానికి రూల్స్ వున్నాయంటాడు. మనం భోజనం చేయడానికి, నడవడానికి, ఊపిరి పీల్చడానికీ రూల్స్ వున్నాయ్....చిత్ర కళకి, సంగీతానికీ, నాట్యానికీ రూల్స్ వున్నాయ్...ఎగరడానికి, వంతెన కట్టడానికీ రూల్స్ వున్నాయ్...జీవితంలో, ప్రకృతిలో ప్రతీదానికీ రూల్స్ వున్నాయ్... రూల్స్ నుంచి రచనల్ని మినహాయించాలని ఎలా అంటారు. అది కుదరదు...అంటాడు. 


          2. కథకి థీమ్ వుండాలి. థీమ్ వుంటే రచయిత తానేం చెప్పదల్చుకున్నాడో ఆ గమ్యానికి కథనికి చేరవేయడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకి, గొప్ప ప్రేమ మరణాన్ని కూడా లక్ష్య పెట్టదని  ‘రోమియో అండ్ జూలియెట్’ థీమ్. గుడ్డి నమ్మకం సర్వ నాశనాన్ని కొనితెస్తుందని ‘కింగ్ లియర్’ థీమ్. అలాగే - మేథస్సు అంధ విశ్వసాల్ని జయిస్తుందని ‘షాడో అండ్ సబ్స్ స్టెన్స్’ థీమ్. థీమ్ నే థీసిస్, సెంట్రల్ ఐడియా, గోల్, లేదా సబ్జెక్ట్ అంటారు (తెలుగులో ఇతివృత్తం).
          3. మంచి కథల్లో ఏకవాక్య థీమ్ వ్యూహాత్మకంగా నిర్మాణమై వుంటుంది. అది శాంపిల్ సినాప్సిస్ లాగా వుంటుంది. ‘గొప్ప ప్రేమ మరణాన్ని కూడా లక్ష్య పెట్టదు’ అన్న ‘రోమియో అండ్ జూలియెట్’  ఏకవాక్య థీమ్ నే తీసుకుంటే, ఇది మూడు భాగాల కలయిక : పాత్రలు, కాన్ఫ్లిక్ట్, ముగింపు. గొప్ప ప్రేమ ఎవరిదీ? రోమియో అండ్ జూలియెట్ పాత్రలది. వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏమిటి? మృత్యువు. వాళ్ళేం  చేశారు? మృత్యువుని కూడా లెక్క చెయ్యకుండా ప్రేమ కోసం సంఘర్షించారు.

          [స్క్రీన్ ప్లేల విషయానికి వస్తే దీన్నే అయిడియా నిర్మాణం అంటున్నాం. ఐడియాలో బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండేట్టు. పై ఏకవాక్య థీమ్ నే తీసుకుంటే ఇవే కన్పిస్తాయి. గొప్ప ప్రేమ (బిగినింగ్), మరణాన్ని(మిడిల్) కూడా లక్ష్య పెట్టదు (ఎండ్)]

         
4. థీమ్ ఆలోచించకపోతే, వచ్చిన ఆలోచనకి మార్పు చేర్పులు చేస్తూ, విస్తరిస్తూ పోతూ, వచ్చిన ఆలోచనే మారిపోయి ఇంకో ఆలోచన మొదలయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కథకోసం తడుముకోవడమే జరుగుతుంది. ఎలాగో బ్రెయిన్ కి పని చెప్పి ముగింపుకి తెచ్చినా, కథ మాత్రం తయారవదు.

          5. ఎమోషన్, లేదా ఎమోషన్ లో వుండే ఎలిమెంట్లు, జీవితంలో మౌలిక అంశాల్ని కలిగి వుంటాయి. ఎమోషన్ అంటే జీవితం, జీవితమంటే ఎమోషన్. అందువల్ల ఎమోషన్ అంటే డ్రామా, డ్రామా అంటే ఎమోషన్ - అన్నాడు మోజెస్ మలేవిన్ స్కీ తను రాసిన ‘ది సైన్స్ ఆఫ్ ప్లే రైటింగ్’ లో. కనుక ఏ పరిస్థితులు ఎమోషన్స్ కి దారితీస్తున్నాయో మనకి తెలియకపోతే, మంచి కథ కుదరడం అసాధ్యం. శునకానికి మొరగడం ఎలాగో కథకి ఎమోషన్ అలాగ.

          6. మలేవిన్ స్కీ ఎమోషన్స్ లో వుండే కొన్ని మౌలిక ఎలిమెంట్స్ ఏమిటో చెప్తాడు : కోరిక, భయం, జాలి, ప్రేమ, ద్వేషం మొదలైనవి. ఈ ఎమోషన్స్ కి కార్యాచరణతో కూడిన గోల్ లేకపోతే కేవలం ఎమోషన్స్ గానే వుండి పోతాయి.

          7. రెండు థీమ్స్ తో ఒక కథ రాయవచ్చా? రాయవచ్చు, అయితే మంచి కథవదు. ఏక కాలంలో రెండు దిశల్లో ప్రయాణం కుదురుతుందా? ఒక థీమ్ తో చెబుతున్న విషయాన్ని రుజువు చేయడంలోనే  రచయితకి సరిపోతుంది, రెండు మూడు థీమ్స్ కి ఎక్కడ వీలవుతుంది? ఒక కథలో ఒకటి కన్నా ఎక్కువ థీమ్స్ వుంటే ఆ కథ తికమకగా వుంటుంది.

          8. దీనికి రెండు ఉదాహరణలున్నాయి : ‘ది ఫిలడెల్ఫియా స్టోరీ’ అనే నాటకమొకటి, ‘స్కై లార్క్’ అనే నాటకమొకటి. మొదటి దాంట్లో రెండు థీమ్స్ ఏమిటంటే, పండంటి కాపురానికి ఇరువైపులా త్యాగాలు అవసరమని ఒకటి,  మనిషి క్యారక్టర్ ని డబ్బుండడం లేకపోవడం నిర్ణయించవని మరొకటి. రెండో నాటకంలో సంపన్నురాలైన స్త్రీకి తోడు అవసరమని ఒకటి, ప్రేమించే భర్త భార్య కోసం త్యాగాలు చేస్తాడని మరొకటి. ఈ రెండు నాటకాల్లో రెండేసి థీమ్స్ చలన రహితంగా వుండడమే కాదు, విషయం చెప్పడం కూడా కుదరలేదు.

          9.  రచయిత పాత్రలతో ఏదో ఒక పక్షం వహించకపోతే థీమ్ విఫలమవుతుంది. ఇగో మిత్రుల్ని దూరం చేస్తుందనే థీమ్ వుందనుకుందాం. ఈ థీమ్ తో పాత్రలు రెండు వర్గాలుగా విడిపోతే, రచయిత ఏదో ఒక వర్గాన్ని సమర్ధించాల్సి వుంటుంది. ఇగో వల్ల మిత్రులు దూరమవుతారో కాదో ఏదో ఒకటి తేల్చాలి. ఇగో వల్లమిత్రులు దూరమవుతారనే దాంతో రచయిత విభేదిస్తే, అందుకు తగిన కారణాలు ఆధారాలతో సహా చూపించాలి. దీంతో ప్రేక్షకులు ఏకీభవించకపోయినా రచయితకి తన జడ్జిమెంట్ తనకుండాలి.
           
సికిందర్

13, ఆగస్టు 2019, మంగళవారం

859 : స్క్రీన్ ప్లే సంగతులు


        న్మథుడు - 2 కథా వస్తువు అటు పాత తరం ప్రేక్షకులకి కాక, ఇటు కొత్త తరం ప్రేక్షకులకీ కాకుండా త్రిశంకు స్వర్గపు మార్కెట్లో వేలాడినట్టుంది. కానీ ఒకప్పుడు అక్కినేని నాగేశ్వర రావుతో అప్పటి పాత తరంతో పాటు కొత్త తరం కూడా ‘ప్రేమ నగర్’ ని ఎంజాయ్ చేశారు. ‘లేలే నా రాజా’ పాట బెడిసి కొట్టలేదు. కానీ ఇప్పుడు నాగార్జునతో అడల్ట్ కంటెంట్ బాగానే బెడిసి కొట్టింది. దీంతో కుటుంబ ప్రేక్షకులు కూడా దూరమైపోయారు. పాతబడిన ఈ రోమాంటిక్ కామెడీ / డ్రామెడీ ఫార్ములా కథ వచ్చేసి, రోమాన్స్ లో ఫార్ములా కథలు ఇక చాలించుకొమ్మనే మెసేజిని కూడా కొత్త తరం ప్రేక్షకుల వైపు నుంచి ఘాటుగా అందిస్తోంది. 2006 నాటి ఫ్రెంచి మూవీని ఇలా రీమేక్ కి తీసుకోవాలనుకున్నప్పుడు, దీనికి పై కారణాల చేత మార్కెట్ యాస్పెక్ట్ లేదని, త్రిశంకు స్వర్గంలో తల కిందులుగా వేలాడ దీయాల్సి వస్తుందని, అక్కడలా  వేలాడుతూ ఏ ప్రేక్షకులూ వుండాల్సిన అగత్యం లేదనీ వెంటనే గుర్తించ వచ్చు. 

        ర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి ఈ మూవీ విడుదలైన రోజునే తను తీసిన క్రితం మూవీ ‘చిలసౌ’ కి గాను జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు రావడం ట్రాజడీలో కామెడీ. ‘చిలసౌ’ లో హీరోహీరోయిన్లే  ఒకరికొకరు ప్రత్యర్ధులు. ‘మన్మథుడు -2’ లో నాగార్జున, లక్ష్మిలు ప్రత్యర్ధులుగా మొదలై మధ్యలో విరమించుకున్నారు. ఇదీ క్రియేటివ్ యాస్పెక్ట్ లో ప్రధాన లోపం. ఒక సినిమాకి మార్కెట్ యాస్పెక్టే కాకుండా, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా లోపించడం సర్వసాధారణమై పోయింది. 

        కథంటే ఆర్గ్యుమెంట్. రెండు పాత్రల మధ్య వాటి వైఖరులతో ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంటే కథకి ఊపిరి. లేదంటే అది కమర్షియల్ సినిమాలకి పనికిరాని గాథ. ఇంకా తేలిక భాషలో చెప్పాలంటే, కథంటే పాయింట్. పెళ్ళే వద్దనే నాగార్జునకి మూడు నెలల్లో చేసుకోవాలని లక్ష్మి షరతు పెట్టడం పాయింట్. చేసుకోనని ఇతను, చేసుకోవాలని ఆమె ఆర్గ్యుమెంట్. ఎవరు నెగ్గుతారన్నది ప్రశ్న. దీంతో నడిచేదే కథ. ఇలా ఒక పాయింటు పుట్టిందంటే దాని కిరువైపులా రెండు పాత్రలున్నట్టే. అవి ప్రత్యర్ధి పాత్రలైనట్టే. ఈ ప్రత్యర్ధి పాత్రల్లో ఒకదాన్ని నిర్వీర్యం చేస్తే అది సజావైన కథవుతుందా? 

           1. పాయింటు పుట్టిందంటే రెండు ప్రత్యర్ధి పాత్రలేర్పడతాయి, 2. రెండు ప్రత్యర్ధి పాత్రలేర్పడ్డాయంటే వాటి మధ్య ఆర్గ్యుమెంట్ పుడుతుంది, 3. ఆర్గ్యుమెంట్ పుట్టిందంటే ఎవరు నెగ్గుతారన్న ప్రశ్న పుడుతుంది,  4. ఎవరు నెగ్గుతారన్న ప్రశ్న పుట్టిందంటే ప్రత్యర్ధి పాత్రలమధ్య సంఘర్షణ పుడుతుంది, 5. ప్రత్యర్ధి పాత్రల మధ్య సంఘర్షణ పుట్టిందంటే, ఇవన్నీ కడుపున మోస్తూ కథ పుడుతుంది. ఇలా ఈ ఐదింటిలో ఏది లోపించినా అవిటి కందుని పడేసి పారిపోతుంది కథ. పాయింటు - ప్రత్యర్ధి పాత్రలు - ఆర్గ్యుమెంట్ - ప్రశ్న- సంఘర్షణ - ఈ అయిదింటి జెనెటిక్ ఇంజనీరింగే కమర్షియల్ సినిమా కథ. వరల్డ్ మూవీస్ కి ఈ  లెక్కలుండవు. అవి గాథలు. యూరోపియన్ ప్రేక్షకులు అలవాటు పడ్డ ఆర్టు సినిమా తరహా గాథలు. 

వరల్డ్ మూవీస్ జ్వరం 
       వరల్డ్ మూవీస్ హాలీవుడ్ మూవీస్ లాగా ప్రపంచమంతా ఆడవు. ఆడేట్టయితే ఇండియాలో ఏ డిస్ట్రిబ్యూటరూ ఆగడు. హైదరాబాద్ పంజాగుట్ట సెంటర్లో కూడా ఆడించుకుంటాడు. వరల్డ్ మూవీస్ అక్కడి యూరోపియన్ ప్రేక్షకుల స్థానిక అభిరుచి. తెలుగువాళ్ళ అభిరుచి కాదు. ఈ వాస్తవాన్ని డిస్ట్రిబ్యూటర్లు గుర్తించినప్పుడు మేకర్లు ఎందుకు తెలుసుకోకుండా వరల్డ్ మూవీస్ ని రీమేకులు చేసి తెలుగు ప్రేక్షకుల మీద పడేస్తున్నారు? ప్రపంచంలో రెండిటికే సార్వజనీన ఆమోదముంది: ఒకటి హాలీవుడ్, రెండు కొరియన్. కాబట్టే కొరియన్ ‘మిస్ గ్రానీ’ ని ‘ఓ బేబీ’ గా  తెలుగులో రీమేక్ చేస్తే హిట్టయ్యింది. కొరియన్ మూవీస్ పక్కా కమర్షియల్స్. కమర్షియల్స్ అంటే స్ట్రక్చర్. అందుకే హాలీవుడ్ తో పోటీ పడుతున్నాయి. సినిమాల్లో స్ట్రక్చర్ ని ఎవరెంత కాదన్నా, ద్వేషించి సొంత క్రియేటివిటీలు చేసుకున్నా (క్రియేటివ్ స్కూల్)  - కమర్షియల్ సినిమాలంటే తిరుగులేకుండా త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వుండే స్క్రీన్ ప్లేనే. వరల్డ్ మూవీస్ కి ఈ స్ట్రక్చర్ వుండదు. అందుకే అవి కథలు కాని గాథలు, ఆర్టు సినిమాలు. అయినా ఇవన్నీ పక్కనపెట్టి, ఇంకా ఇలాగే ఈ  రీమేకులు చేసుకుంటామంటే, నిరభ్యంతరంగా చేసుకుని నష్టపోవచ్చు. ఎవరు కాదంటారు? 

జనరేషన్ గ్యాప్? 
         నిజానికి ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవడానికి ‘విషయం’ లేదు. ముందే చెప్పుకున్నట్టు కాలం చెల్లిన కథ కావడం వల్ల. వయసు ముదిరిన నాగార్జునకి పెళ్లి ఇష్టం లేకపోతే, మదర్ లక్ష్మి పెట్టిన కండిషన్ వల్ల అందుకు ఒప్పుకోవాల్సి వచ్చి, ఆ  పెళ్లిని తప్పించుకోవడానికి రకుల్ ప్రీత్ సింగ్ తో నాటక మాడ్డమనే కథ, 2006 లో ప్రెంచి మూవీ వచ్చిన నాడే  రీమేక్ చేసి వుంటే సరిపోయేదేమో. సుమారు దశాబ్దంన్నర తర్వాత కూడా ఈ ఫార్ములా కథకి చెల్లుబాటు వుంటుందని రిస్కు చేశారు. ఫలితం కనపడింది. ఈ కథావస్తువు సంగతలా వుంచి, అసలు నాగార్జున  వరకూ చూస్తే, ఆయనింకా హీరోగా నటించడం మైనస్ అయ్యిందా అనుకుందామనుకున్నా - విడుదల రోజు మార్నింగ్ షోకి క్లాస్, మాస్ యూతే ‘ఇస్మార్ట్ శంకర్’ కి, ‘రాక్షసుడు’ కీ దండయాత్ర చేసినట్టు చేసి హౌస్ ఫుల్ చేశారు. క్రిక్కిరిసిన ముప్పై రూపాయలు, పది రూపాయలు టికెట్ల క్యూల్లో 15, 16 ఏళ్ల బస్తీ కుర్రాళ్ళు సైతం వీరోచితంగా పోరాడి టికెట్లు సాధించుకున్నారు. అంటే నాగార్జున ఇప్పటికీ కింగే. ఇందులో ఏ మాత్రం డౌటు లేదు. జనరేషన్ గ్యాపుని జయించిన ఆల్ టైం కింగ్. 

         ఈ ప్రేక్షకుల తాకిడి తర్వాతి ఆటలకి ఖాళీ అయింది, ఫ్లాప్ టాక్ రావడంతో. కాబట్టి నేరం కింగ్ ది కాదు, కింగ్ ని మింగిన ఈ సినిమా కహానీది. కహానీ కూడా జనరేషన్ గ్యాపుని జయించి వుంటే కింగ్ కి కిరీటమయ్యేది. పాత కహానీ జనరేషన్ గ్యాపుని జయించే అవకాశం కూడా వుంది. హిందీలో రోహిత్ శెట్టి ఈ పనే చేస్తాడు. ఏం చేస్తాడు? నేటి ప్రేక్షకుల కోసం తిరగ రాస్తాడు. నేటి ప్రేక్షకుల కేం కావాలి? ఎంటర్ టైన్మెంట్ కావాలి. మిగతా బాధలు, దుఃఖాలు, ఏడ్పులు చూసే ఓపిక లేదు. రోహిత్ శెట్టియే గనుక కింగ్ నాగార్జున కోసం ఈ మూవీ చేస్తే చిట్ట చివరి దాకా నవ్వించి గానీ వదలడు. 

ఏం నేర్పుతున్నారు?
       పాత రోజుల్లో తెలుగు రోమాంటిక్ కామెడీలు చివరంటా రోమాంటిక్ కామెడీలు గానే వుండేవి. కాకపోతే రోమాంటిక్ కామెడీలనో, రోమ్ కాంలనో అప్పట్లో పిలవలేదు. కామెడీలనే అనేవాళ్ళు. చివర్లో ఓ ఐదు నిముషాలు కాస్త బాధ పెట్టడం తప్ప; ఫీలో, సెంటి మెంట్లో కాస్త రగిలించడం తప్ప, ప్రధానంగా నవ్వించడమే ధ్యేయంగా వుండేవి. రేలంగి నరసింహారావు, విజయబాపినీడు, జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ...ఇలా ఆ తరం దర్శకుల కామెడీలుండేవి. 

         2000  నుంచి కొత్త తరం వచ్చాక రోమాంటిక్ కామెడీలనో, రోమ్ కాంలనో  ఫ్యాషన్ గా అనడం మొదలెట్టి ఇప్పటికీ చేస్తున్నదేమిటంటే, సగం నవ్వించి సగం ఏడ్పించేస్తున్నారు. పేరుకే రోమాంటిక్ కామెడీలు. ఫస్టాఫ్ వరకే రోమాంటిక్ కామెడీ, సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా. ఫస్టాఫ్ గిటార్ సినిమా, సెకండాఫ్ వీణ సినిమా. రేపు వీణ తీసేసి సన్నాయి సెకండాఫ్ పెట్టినా పెట్టొచ్చు జో కొట్టడానికి. కలియుగం యాక్షన్లో వుంటే ఇంకా ఈ ఫీల్, సెంటి సెంటిమెంట్లు, ఏడ్పులు వంటి పాసివ్ చిత్రణలు. పైన చెప్పుకున్న పూర్వ దర్శకులకి కలియుగం డైనమిక్సు  తెలుసు గనుకే హాస్యాన్ని విషాదం చేయకుండా, చివరి ఐదు నిమిషాలకి విషాదాన్ని పరిమితం చేసేవాళ్ళు. ‘ముత్యాల ముగ్గు’ వంటి మౌలికంగా విషాదం నిండి వున్న కథని కూడా  అద్భుత, హాస్య రసాల మేళవింపుతో వినోదాత్మకం చేశారు బాపూ రమణలు. జీవితాల్లో విషాదం వుండదని కాదు, వుంటుంది. ఆ విషాదాన్ని త్రోసి రాజని జీవించడం నేర్పాలబ్బా సినిమాలు, జీవించడం నేర్పాలి. రోమాంటిక్ కామెడీలు జీవించడం నేర్పుతాయి, రోమాంటిక్ డ్రామాలు ఏడ్వడం నేర్పుతాయి. 

పాంచ్ పటాకా 
         నాగార్జున సినిమాలోని ఈ పాత పాయింటు జానర్ మర్యాద కాపాడుతూ, నేటి ప్రేక్షకుల నిమిత్తం పూర్తి నిడివి రోమాంటిక్ కామెడీగా చేసి వుంటే బొమ్మ ఆడేదా అంటే మరో రోహిత్ శెట్టి చేస్తే ఆడుద్ది. ఇది కాదు విషయం, ఈ కథ మరమ్మత్తుల జోలికి పోకుండా, తస్మాత్ జాగ్రత్త అంటూ దీని కథనం చేస్తున్న హెచ్చరికని దృష్టికి తీసుకు రావడమే ఈ వ్యాసం ఉద్దేశం.  రోమాంటిక్ కామెడీని సగం నుంచీ రోమాంటిక్ డ్రామా చేయడం ఎలా తప్పో శాస్త్రీయంగా మనకి వివరణ దొరికింది. 

          పెళ్లి అనే పాయింటు చుట్టూ నాగార్జునకి మదర్ క్యారక్టర్ లక్ష్మితో, ప్లస్ రకుల్ తో, ఈ రోమాంటిక్ కామెడీ ఫస్టాఫ్ వరకూ రోమాంటిక్ కామెడీయే. ఇంటర్వెల్ నుంచీ ఇది రో మాంటిక్ డ్రామాగా మారిపోయింది. పటాకా ఎప్పుడు పేల్తుంది? పైన చెప్పుకున్న పాయింటు - ప్రత్యర్ధి పాత్రలు - ఆర్గ్యుమెంట్ - ప్రశ్న- సంఘర్షణ - అనేవి పాంచ్ పటాకాగా వున్నప్పుడే. ఫస్టాఫ్ లో నాగార్జున, లక్ష్మిలు ఈ అయిదింటి జెనెటిక్ ఇంజనీరింగ్ లోనే వున్నారు. ఇంటర్వెల్ నుంచి లక్ష్మి ప్రత్యర్ధిత్వం లోంచి తప్పుకోవడంతో పాంచ్ పటాకా కాస్తా చార్ చటాకా అయి తుస్సుమని పేలకుండా కూర్చుంది. లేలే నా రాజా పాట కూడా ఇక లేపే పరిస్థితి లేదు. ఒరేమావా యేసుకోరా సుక్కా అన్నా కూడా ఇంతే. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు... అని రెచ్చగొట్టినా కూడా!

ఆత్మ బలిదానం 
      నువ్వొచ్చి నా గర్ల్ ఫ్రెండ్ గా నటించు, తీరా పెళ్లి సమయంలో పారిపో, దీంతో మళ్ళీ నా పెళ్లి మాటెత్తదు అమ్మ - అని రకుల్ తో నాగార్జున ప్లాను. ఇంటర్వెల్లో రకుల్ ఇలాగే చేసేసరికి స్పృహ తప్పి ఆ తర్వాత కోమాలోకి  వెళ్ళిపోతుంది లక్ష్మి. తర్వాత కోలుకున్నా ఆమె ఇక పాసివ్ పాత్ర. నాగార్జునకి ప్రత్యర్ధి కాదు. నాగార్జునకి అపరాధ భావం పుట్టుకొచ్చి అంతర్ముఖీనుడై పోతాడు. బహిర్ముఖంగా తల్లిని ఎదుర్కొంటున్న వాడు, తల్లిని అనారోగ్యం పాల్జేశానన్న చింతతో తనకి తనే ప్రత్యర్ధి అయి, తనతో తానే అంతర్ముఖీనంగా సంఘర్షించడం మొదలెడతాడు. ఇలాటి పాత్ర వరల్డ్ మూవీస్ లో, ఆర్టు మూవీస్ లో, గాథల్లో వుంటుంది. కమర్షియల్ మూవీస్ లో కాదు. కమర్షియల్ మూవీస్ లో కథ నడవడానికి బహిర్ముఖంగా, భౌతికంగా, విజువల్ గా వున్న ప్రత్యర్ధితో సంఘర్షిస్తుంది పాత్ర. ఇక్కడ బాహిర్ సంఘర్షణతో మొదలైన నాగ పాత్ర. అంతర్ సంఘర్షణతో ప్లేటు ఫిరాయించింది. కథ ఎక్కడైనా ఇలా వుంటుందా? 

         లక్ష్మి ప్రత్యర్ధి హోదా కోల్పోయాక ఇక  సెకండాఫ్ కమర్షియల్ మూవీగా,  పైసలొచ్చే లక్ష్మీగా కాకుండా పోయింది. సెకండాఫ్ లో ఆ లక్ష్మి ఈ లక్ష్మి కూడా లేకుండా వెళ్ళిపోయాక ప్రేక్షకులు కూడా వెళ్ళిపోయారు. లక్ష్మిలో కథకుడు నాగార్జున  కోసం మదర్ ని చూశాడు. అందువల్ల సెంటుమెంటుకి పోయి ఆమెని అయ్యోపాపం అనేలా చేశాడు. కానీ నాగార్జున పాత్రకి ఆమె మదర్ కాదు. ఆమె పెట్టిన సమస్యతో ఆమెని ఎదుర్కోవాల్సిన ప్రత్యర్ధి. తర్వాత్తర్వాత ఎలాగూ ఆమెలో మదర్ ని చూస్తాడు, మనసు మార్చుకుంటాడు, అది చివరి దశ సంగతి. నాగార్జున పాత్ర కోసం కథకుడు ఎందుకు తొందర పడ్డాడు? పాత్ర కోసం తనే కథ ఆలోచిస్తున్నాడు కాబట్టి. పాత్ర తన కథని తనే ఆలోచించుకుంటుందని మరిచాడు కాబట్టి. ఇలా పాంచ్ పటాకాలోంచి ప్రత్యర్ధిని తీసేసి సెకండాఫ్ ని సెంటిమెంటల్ చేద్దామన్న కథా పథకం బెడిసి కొట్టింది. 

          నిజ జీవితాల్లో ప్రత్యర్ధి కళ్ళు తిరిగి పడిపోయి తప్పుకోదా అంటే, కమర్షియల్ సినిమా జీవితంలా వుండదు. జీవితంలో జరగనివి, తమకి అందుబాటులో వుండనివి తెర పైన చూడాలనుకుంటారు కమర్షియల్ సినిమా ప్రేక్షకులు. ఇకపోతే, మొదట ఒక ప్లానుతో మదర్ ని అనారోగ్యం పాల్జేసిన నాగార్జునే మళ్ళీ ఆమెకి ప్రమాదం తలపెడుతూ రెండో ప్లాను అమలు చేయడం ఎలా పాత్రోచితమవుతుందో తెలీదు. ఇది ప్లాట్ పాయింట్ టూ ఘట్టం, ఈసారి ఘోర పరాభవం చేసి వెళ్లి పొమ్మంటాడు రకుల్ తో. మొదటి ప్లానుతోనే కోమాలోకి వెళ్ళిన మదర్ తో మళ్ళీ ఇదేం అన్యాయం? ఆమె మరణాన్ని కోరుకుంటున్నాడా? ఇలా ప్లాట్ పాయింట్ టూ కూడా విఫలమయింది. 

        ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూలు పరస్పరాధార భూతాలు. అంటే పిశాచాలు కాదు. ఆ సమాసం అలా వుంది. ప్లాట్ పాయింట్ వన్ కథలో పుట్టిన సమస్య అయితే, ప్లాట్ పాయింటూ ఆ సమస్యకి పరిష్కారం. ప్లాట్ పాయింట్ వన్లో లక్ష్మి పెళ్లి అనే సమస్య పెడితే, ఈ సమస్యతో ప్లాట్ పాయింట్ టూలో ఇంకా మారని నాగార్జునకి ఎదురు దెబ్బ తగలాలి, తను లక్ష్మిని దెబ్బ తీయడం కాదు. తనే  దెబ్బతిని దారికి రావాలి. 

          వరల్డ్ మూవీస్ కి ఎమోషన్లు తప్ప లాజిక్ వుండదు. కానీ నిత్యజీవితాల్లో కుటుంబ సంబంధాల్లో లాజిక్ ని కూడా చూసి ప్రవర్తించే ప్రేక్షకులు- ఇలా రెండో సారి మదర్ మీద మానసిక దాడిని తప్పకుండా నిరసిస్తారు. 

          నాగార్జున కోసం లక్ష్మిలో మదర్ ని చూసిన కథకుడే చివరికి ప్రత్యర్ధిని చూశాడు, సంతోషం. కానీ ఆమె మీద రెండో దాడి అనేది అసందర్భం, అర్ధరహితం. ప్లాట్ పాయింట్ టూలో దెబ్బ పడాల్సింది ఇంకా మారని నాగార్జున మీద. ప్లాట్ పాయింట్ టూ రగులుతున్న సమస్యకి పరిష్కార ప్రాంగణం. కథ అన్నాక దానికో అనుక్రమణిక వుంటుంది, అప్పుడే అది దివ్యమైన కళ అన్పించుకుంటుంది. 

          మన్మథుడు - 2 అయ్యింది ఫ్లాప్ కాదు, ఆత్మ బలిదానం చేసుకుంది. చేసుకుంటూ దృశ్యాత్మక ఆధారాలు ఇచ్చి పోయింది... రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్ల మీద కథ వుంటే వాళ్ళే ప్రత్యర్ధులు. రోమాంటిక్ కామెడీని ఇంటర్వెల్ నుంచి ఏదో ఫీలైపోతూ రోమాంటిక్ డ్రామాగా మార్చారా, ఇక  పాంచ్ పటాకా పేలదు. ఒక ప్రత్యర్ధి లేకపోయాక ఆ సెకండాఫ్ డిటో లక్ష్మీ విహిత మన్మథుడు టూ అవుతుంది. రోం కాం అంటూ అందులో రోం డ్రాంని తెచ్చి  దూర్చడమెందుకు?  రెండు డ్రాములు పట్టించి ఫుల్ రేంజి రోమ డ్రామా తీస్తే సరి. 

సికిందర్    


2, ఆగస్టు 2019, శుక్రవారం

857 : సందేహాలు - సమాధానాలు


Q:  నేను మీకే కథ విన్పించాలనుకున్నాను. అయితే ఇప్పటికే ఇద్దరు ముగ్గురికి వినిపిస్తే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఆలోచనలో పడ్డాను. నా పాయింటు ఏమిటంటే, సిద్ధంగా వున్న కథమీద తలా ఒక రకంగా మాట్లాడతారు. ఎప్పుడూ కథ రాయని వాళ్ళ జడ్జిమెంట్ ని తీసుకోవచ్చా?
టివిపి, సహకార దర్శకుడు  
A:  కథలు ఎంతమందికి విన్పించి తీసినా అవే తొంభై శాతం ఫ్లాపులు వస్తాయి. యాక్టివ్- పాసివ్ క్యారక్టర్లు, కథ-గాథ తేడాలు, ఎండ్ సస్పెన్సులు,  మిడిల్ మటాషులు, సెకండాఫ్ సిండ్రోములు మొదలైన సినిమా కథల చుట్టూ పొంచి వుండే సవాలక్ష మొసళ్ళ జాతి తెలియకుండా కథలు రాసేవాళ్ళు రాయడం, వినే వాళ్ళు వినడం. ఇది మారదు. ఇక మార్కెట్ యాస్పెక్ట్ నాలెడ్జి సరే.

          నాలెడ్జి వున్న వాడు విన్నాడే అనుకుందాం, వాడు చెప్పిందానికి తలూపి, అవతలికెళ్ళి శుభ్రంగా కడిగేసుకుని రాసుకున్నదే భేషుగ్గా తీసుకోవడం. కథలు చెప్పే వాళ్ళ సైకాలజీ చాలా వరకూ ఎలా వుంటుందంటే, తమ కథని ఇతరులు మెచ్చుకోవాలని ముందే ఫిక్స్ అయిపోయి వుంటారు. నా కథని నల్గురు మెచ్చుకున్నారోచ్, నా కథని ఐదుగురు మెచ్చుకున్నారోచ్ అని సంతోష పడేందుకే విన్పిస్తారు. సంతోషం సూచీ ఎంత పెరిగితే అంత ఆత్మసంతృప్తి.

          కాబట్టి పై రెండు వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని జల్లెడ పట్టుకోండి. జడ్జిమెంటు మీరే తీసుకోండి. సినిమా రాసుకుని తీసుకునేది మీరే కాబట్టి మధ్యంతర జడ్జి మెంటు మీదే అవుతుంది. అంతిమ తీర్పు ఎలాగూ స్టార్లు లేదా హీరోలు చెప్తారు. అక్కడే మీ భవిష్యత్తు వుంటుంది.

Q: మీరేమనుకోకుంటే ఒక ప్రశ్న. సినిమా రివ్యూలు రాయాలంటే అర్హతలేం వుండాలంటారు? రివ్యూ రైటర్ల మీద ఎందుకంత వ్యతిరేకత వుంటుందంటారు?
ఒక దర్శకుడు

A:  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ రైటింగ్ ని గుర్తించి అవార్డులతో సత్కరిస్తున్నాయి సినిమా కళా కారులతో బాటు. ఎందుకు వీళ్ళని గుర్తించకుండా వ్యతిరేకిస్తారో మనకి తెలీదు. మనం అవార్డుల జోలికి పోలేదనుకోండి. సకల దోషాలతో తొంబై శాతం సినిమాలు ఫ్లాప్స్ - అట్టర్ ఫ్లాప్స్ అవుతున్నప్పుడు ఇంకా రివ్యూ రైటర్ల అర్హతలు, ప్రమాణాలు చర్చనీయాంశాలవుతాయా? ఫేస్బుక్ లో ట్విట్టర్ లో  ప్రేక్షకులే రివ్యూలు రాసేస్తున్నప్పుడు వృత్తి రివ్యూ రైటర్ల రివ్యూలకి విలువేముంది?  రివ్యూలు రాసుకునే ప్రేక్షకులు ఇంకొకరి రివ్యూలు చదువుతారా? అందుకని ఇంకా రివ్యూ రైటర్లని అనడం మాని, ఫ్లాపుల శాతం తగ్గించడానికి ఇప్పటికైనా ఏం చేయాలో దాని మీద దృష్టి పెడితే మంచిది.
సికిందర్


29, జులై 2019, సోమవారం

856 : స్క్రీన్ ప్లే సంగతులు

            A TALE exists with no greater sense of its self, no greater purpose beyond a simple rehashing of events...127 Hours isn’t the only one—Taken, Coraline, Battle: LA, True Grit, Inglorious Basterds, 2012, Where the Wild Things Are, The Informant, Public Enemies—all tales with little to say.  All works of fiction that are easily forgotten.
            A STORY  gives audience members an experience they can’t have on their own. This experience is why audience members return to a film over and over again. Star Wars, The Shawshank Redemption, The Lives of Others, The Godfather, The Apartment, The Sound of Music, Toy Story, Toy Story 2 (pretty much anything Pixar), The King’s Speech, The Dark Knight, Good Will Hunting, Chinatown—all stories with much to say. All works of fiction that are not so easy to forget
.
―From Narrative First 



                   విజయ్ దేవరకొండ 2017 లో ఆల్రెడీ ‘ద్వారక’ అనే ఫ్లాపయిన ‘గాథ’ లో నటించాక తిరిగి డియర్ కామ్రేడ్’ అనే ఇంకో ‘గాథ’ లో నటించే పొరపాటు చేశాడు.  గాథతో సినిమా అంటేనే గ్యారంటీగా ఫ్లాప్. కమర్షియల్ సినిమాలు డిమాండ్ చేసేది కథలే గానీ  చప్పిడి గాథలు కాదు. ఒకసారి ఫ్లాపయిన గాథల లిస్టు చూస్తే- మొగుడు, పైసా, ఓకే బంగారం, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా, జక్కన్న, ఉన్నది ఒకటే జిందగీ, రాజుగారి గది -2, అంతరిక్షం, బ్రహ్మోత్సవం, కబాలీ, ద్వారక...ఇలా చాలా వుంది, ఇప్పుడు బాధాకరంగా డియర్ కామ్రేడ్ ని లిస్టులో కలుపుకోవాలి. అసలు కథలు వేరు, గాథలు వేరనీ, గాథలు సినిమాలకి పనికి రావనీ కనిపెట్టిన హాలీవుడ్ లోనే తెలియక కొందరు గాథలతో సినిమాలు తీస్తూంటారు.


          తెలుగులో తెలిసి గాథలు తీస్తున్నారా అంటే అదేం కాదు, కథే తీస్తున్నామనుకుంటారు. తీరా అది గాథగా తేలి బెడిసి కొడుతుంది. కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో తేడా తెలిసి, ఉద్దేశపూర్వకంగానే  గాథలు తీస్తే, పైన చెప్పుకున్న సినిమాల్లా వుండవు. మోహన్ బాబు నటించిన విజయవంతమైన గాథ ‘పెదరాయుడు’ లా వుంటాయి. ఉద్దేశపూర్వకంగా, ప్రామాణికంగా తీసే గాథల్లో ఉదాత్త పాత్ర వుండి, ఉదాత్త కథా కథన నియమాల పాలన వుండి అప్పుడు సక్సెస్ అవుతాయి. ఇది అందరివల్లా కాదు. 

          కథలే తీస్తున్నామనుకుంటూ తెలియక తీస్తున్న గాథలు ఎంత మభ్య పెట్టేవిగా వుంటాయంటే, గాథల పరిజ్ఞానం వున్న వాళ్ళు  సైతం  సినిమా చూస్తూ ఇది గాథ అని వెంటనే కనిపెట్ట లేరు. చూస్తున్నది కథే అనుకుంటూ, ఫస్టాఫ్ లో ఇక ప్లాట్ పాయింట్- 1 వస్తుందని, హీరోకి గోల్ ఏర్పడి కథ ప్రారంభమవుతుందని అరగంట, ముప్పావు గంట, పోనీ ఇంటర్వెల్ వరకూ ఎదురు చూస్తారు. 

          ఇంటర్వెల్ కైనా ఇది జరిగిందా, పోనీలే ఇప్పుడైనా కథ ప్రారంభమైందనుకుంటారు. ఇంటర్వెల్ కి కూడా హీరోకి గోల్ ఏర్పడక, కథ ప్రారంభం కాకపోయిందా, ఇదిక మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుందని డౌట్ వస్తుంది. హీరోకి గోల్ ఏర్పడనంత వరకూ అది స్క్రీన్ ప్లే స్పేస్ లో బిగినింగ్ విభాగమే. గోల్ ఏర్పడితేనే స్క్రీన్ ప్లే మిడిల్లో పడి కథ నందుకుంటుంది.

          కనుక ఇంటర్వెల్లో కూడా గోల్ ఏర్పడలేదంటే, సెకండాఫ్ లో ఇంకా ఈ బిగినింగ్ అన్యాయంగా ఇంకెంత స్పేస్ తీసుకుంటుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. రెండు గంటల సినిమాలో గంటన్నర గడిచిపోయి, చివరి అరగంటకి బిగినింగ్ పూర్తయి, అప్పుడు హీరోకి గోల్ ఏర్పడి, కథ ప్రారంభమై మిడిల్లో పడితే, ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అని తేలిపోతుంది. 

          అంటే ఎప్పుడో ఫస్టాఫ్ లో అరగంటకి రావాల్సిన మిడిల్, పోనీ ఇంటర్వెల్ కైనా రావాల్సిన మిడిల్, ఇంకెప్పుడో సెకండాఫ్ లో చివరి అరగంటలో వచ్చిందంటే,  ఆ మిడిల్ అనేది స్క్రీన్ ప్లేలో మటాష్ అయిపోయినట్టే. రెండు గంటల సినిమాలో యాభై శాతం, అంటే గంట పాటు సుదీర్ఘంగా వుండాల్సిన మిడిల్ విభాగం, చివరి అరగంటకి జరిగిపోయి, అక్కడున్నకొద్ది స్పేస్ లో ఎండ్ విభాగంతో కలిసి పంచుకుందంటే, అది మటాష్ అయినట్టే లెక్క. ఇంకో మాటల్లో చెప్పుకుంటే, ఎప్పుడో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింటు వన్ తర్వాత మొదలవాల్సిన మిడిల్, ఇంకెప్పుడో సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర మొదలవుతుందన్న మాట! 

          స్క్రీన్ ప్లేలో ఆ చివరి అరగంటలో ఎండ్ తో కలిసి స్పేస్ ని పంచుకోవడమంటే మిడిల్ కి మిగిలేది ఓ పావుగంటే. ఈ పావుగంటలోనే ప్లాట్ పాయింట్ -1 వచ్చి, గోల్ ఏర్పడి, కథ ప్రారంభమై చప్పున ముగిసి పోతుందన్న మాట. అంటే స్క్రీన్ ప్లేలో గంటన్నర పాటూ బిగినింగ్ విభాగమే కథ ప్రారంభం కాకుండా, హీరో ఏమీ చేయకుండా గడిచిపోతుందన్న మాట. ఇలా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఈ సినిమాలు 2000 నుంచీ కథ - మాటలు-  స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకునే నయా దర్శకుల ట్రెండ్లో వచ్చినవే, ఇంకా ఇప్పటికీ వస్తున్నవే.

          సరే, ఇంతవరకూ సినిమా చూస్తూ కూర్చుంటే, ఇలా చివర్లోనైనా  ప్లాట్ పాయింట్ వన్ వస్తే, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అనైనా తెలుస్తుంది. ఇప్పటికైనా  ప్లాట్ పాయింట్ వన్ రాకపోతే అప్పుడు తెలుస్తుంది, ఇది మిడిల్ మటాష్ కూడా కాదనీ, ఇంత సేపూ వృథాగా చూస్తూ కూర్చున్నది గాథ అనీ! సినిమా చివరి అరగంట కొస్తే గానీ చూస్తున్నది గాథ అని తెలుసుకోలేమన్నమాట. పరిజ్ఞానం వున్న వాళ్ళని కూడా ఇలా మభ్యపెడతాయి గాథలతో వచ్చే
సినిమాలు.

           ‘డియర్ కామ్రేడ్’ ఇలా మభ్యపెట్టేదే. ఐతే ఈ గాథలో స్పెషాలిటీ ఏమిటంటే, అంతవరకూ ప్రేమగాథగా వున్న దాన్ని చివర్లో హీరోయిన్ మీద లైంగిక వేధింపుల ‘కథ’ గా అతికించి ముగించడం! గాథకి చివర ఓ కథని అతికించడం. విచిత్రం. కథో గాథో చేస్తున్నప్పుడు ఏ నియమాలూ పాటించనవసరం లేదనుకోవడం. మంచిదే, వాళ్ళ పెట్టుబడి వాళ్ళిష్టం. 

          ఇప్పుడేం జరిగిందంటే, ప్రేమ గాథ అకస్మాత్తుగా లైంగిక వేధింపుల కథగా మారడంతో మూవీ టోన్ (స్వరం) మారిపోయి, రసభంగమై, మూడ్ - ఫీల్ అనేవి కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది. జానర్ మర్యాద చెడిపోవడం సరే. 

కామ్రేడ్  మెచ్యూరిటీ 
       విజయ్ దేవరకొండ పాత్ర ఫస్టాఫ్ లో కాలేజీలో కామ్రేడ్ గా వున్నంతవరకూ యాక్టివ్ పాత్రే. కామ్రేడ్ పాత్ర కోసం స్టూడెంట్ యూనియన్లూ, వాళ్ళ మీద ‘శివ’ టైపు రాజకీయ పెత్తనాలూ, ఎలక్షన్లూ అనే ఇప్పుడు లేని ఒక అవాస్తవిక గాథా ప్రపంచాన్ని సృష్టించారు. పూర్వం వామపక్ష నేత అయిన తాత నుంచి స్ఫూర్తి పొంది కామ్రేడ్ గా స్టూడెంట్ లీడర్ అయిన తను, రొటీన్ మాస్ క్యారక్టర్ లా ఆవేశ ప్రకోపితుడై దెబ్బలాటలకి దిగడమే  కన్పిస్తుంది. 

          తర్వాత హీరోయిన్ రస్మికతో ఈ రోమాంటిక్ సీన్స్ పాత్ర స్వభావంలోకి ఇమిడేవి కావు. పేరుకి మాత్రం కామ్రేడ్, మిగతా పాత్ర చిత్రణంతా రొటీన్ లవర్ బాయ్ తరహానే. హీరోయిన్ అక్కకి లవ్ లెటర్ రాసే చిలిపి పని కూడా చేస్తాడు. కామ్రేడ్ అన్నాక, ఒక లీడర్ అన్నాక  మంచి మెచ్యూర్డ్  పాత్రయి వుంటుందని ఆశిస్తాం. ఆ మెచ్యూరిటీ ఏమీ కన్పించదు. కామ్రేడ్స్ అన్నాక శల్య పరీక్షలు చేసి భావజాల సామీప్యమున్నఅమ్మాయిని  ప్రేమిస్తారేమో కానీ, మరోలా బిహేవ్ చేయరు. చాలా వరకూ తమ  వర్గంలో, తమతో కలిసి పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడతారు. ఇక్కడ హీరోయినేమో పెట్టుబడిదారీ వర్గపు ఆట అయిన  క్రికెట్ క్రీడాకారిణి! ఎలా కుదురుతుంది ఈ గాథా నేపథ్యంతో పాత్రల ప్రొజెక్షన్.

          ఈమెతో ప్రేమలో విడిపోయాక సాత్వికుడుగా మారిపోయి హిమాలయాల్లో గడ్డం పెంచుకుని మూడేళ్ళు వుండిపోవడం రెడ్ రెబెల్ కామ్రేడ్ గిరీకి ఇంకో గొడ్డలి పెట్టు. కమ్యూనిస్టు, కేపిటలిస్టుగా, స్పిరిట్యువలిస్టుగా ఎలా పడితే అలా కనపడతాడు. పాత్ర చిత్రణకి ఓ దృక్పథం, స్థిరత్వం కన్పించవు. ‘శంకరాభరణం’ లో శంకర శాస్త్రి సాంప్రదాయవాది  కాదు, అభ్యుదయవాది, సెక్యులరిస్టు. ఈ పాత్ర చిత్రణ ఇలాగే స్థిరంగా కొనసాగుతుంది. 

          విజయ్ కి తాతే సలహా ఇచ్చి హిమాలయాలకి వెళ్ళేలా చేస్తాడు - దూర ప్రయాణం చెయ్, జీవితంలో  నువ్వేం చేయాలో తెలుస్తుందని. చే గువేరా మోటార్ సైకిల్ డైరీస్ ఐడియానేమో. కానీ మెడికల్ స్టూడెంట్ అయిన చే గువేరా లాటిన్ అమెరికా పర్యటించింది సామాజిక స్థితిగతుల్ని తెలుసుకోవడానికి, వాటి పక్షాన తిరుగుబాటు చేయడానికి. అల్లూరి సీతారామరాజు కూడా దేశపరిస్థితిని  ఆకళింపు చేసుకోవడానికి దేశాటన చేసి వచ్చే తుపాకీ చేపట్టాడు. 

          ఆల్రెడీ ఒక స్టూడెంట్ లీడరే అయిన కామ్రేడ్ బాబీకి ఇంకా పర్యటనేమిటి? జగన్ పర్యటన చేసి వచ్చే సీఎం అయ్యాడు. అంటే కామ్రేడ్ బాబీ సమాజం గురించి ఏమీ  తెలుసుకోకుండా కామ్రేడ్ అయిపోయాడా? మెడికల్ స్టూడెంట్ అయిన చే గువేరా పర్యటనతో విప్లవ వీరుడయ్యాడు. ఎర్ర కామ్రేడ్ బాబీ పర్యటనలో ఎర్ర రంగు తుడిపేసుకుని మెడికల్ ఎక్స్ పర్ట్ అయ్యాడు. హిమాలయాల్లో ప్రకృతి ధ్వనుల్ని రికార్డు చేసి ఆ ధ్వనులతో మనుషుల్ని బాగుపర్చే సౌండ్ థెరపిస్టు అయిపోయాడు! మాజీ కామ్రేడ్ అయిపోయాడు.  ఒక పాత్రలో, ఒక గాథలో ఎన్ని పరస్పర విరుద్ధ విషయాలు అడ్డగోలుగా జొప్పించారు...ఏక సూత్రత అనేదే లేదు. 


          కానీ సౌండ్ థెరపీతో తనని తానే బాగుపర్చుకోలేకపోయాడు. ఆ మూడేళ్ళూ ఆమె జ్ఞాపకాలతో రోదించాడు. కలవరించాడు. కునారిల్లి పోయాడు. విచిత్రంగా ఈ సౌండ్ థెరపీతో తర్వాత ఆమెని బాగుపర్చాడు. ఆమె ఎర్ర రంగు తుడిపేసుకో మనలేదు. కొట్లాటలు, హింస మానుకోమని మాత్రమే చెప్పింది. మానుకుని సైద్ధాంతిక పోరాటాలు చేస్తే సరి. కమ్యూనిజాన్నే వదిలించుకోవాలన్నట్టుగా హిమాలయాలకి పోయాడు. ఆ తర్వాత ఈ గాథలో కామ్రేడే కాకుండా పోయాడు. ఇదిగో నేనీ ప్రేమని బలిచ్చే రెబలిజాన్ని వదిలి పారేశా, వస్తున్నా - అని ఒక్క కాల్ ఆమెకి చేయలేకపోయాడు. ఇదీ యాక్టివ్ క్యారక్టర్ పాసివ్ గా మారిపోతూ వచ్చిన గాథా క్రమం.

రెండు పిపి వన్లు
      
            ఇది కథే అనుకుని చూస్తూంటే ఫస్టాఫ్ లో రెండు ప్లాట్ పాయింట్ వన్ లు వస్తాయి విచిత్రంగా. రస్మిక క్రికెట్ ఆడి విజయ్ టీము గెలుపొందేలా చేసిన సందర్భంగా ఇచ్చిన పార్టీలో రాజకీయ కార్యకర్తలతో ఘర్షణ చూసి, రస్మిక చెప్పేస్తుంది - ఇలాటి గొడవలు తన కిష్టముండదని. ఇదొక ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. ఇంటర్వెల్లో మళ్ళీ భీకర గొడవ జరుగుతుంది. ఆ హింస మళ్ళీ చూసి తనకి  గొడవలంటే ఇష్టం లేదని మళ్ళీ అంటుంది. వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఇదింకో ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. 

        బయ్యర్లు కాల్స్ చేసి సినిమా నిడివి ట్రిమ్ చేయమంటున్నారనీ, ఎక్కడ చేయాలో అర్ధం గావడం లేదనీ వార్త వచ్చింది. మొదటి గొడవ తీసేసి, ఇంటర్వెల్ గొడవ వుంచుకుంటే సుదీర్ఘమైన ఫస్టాఫ్ నిడివి గంటన్నర నుంచి గంటంపావుకైనా తగ్గుతుంది. రిపీటీషన్ ని కత్తిరిస్తే ట్రిమ్ ఐపోతుంది సింపుల్. ఇలాటి రిపీటిషన్లు ఇంకా వున్నాయి. ఈ సినిమానే వొక రిపీటీషన్ల పిటిషన్. 

          ఇక ఇంటర్వెల్ కి రెండో సారైనా ప్లాట్ పాయింట్ వన్ వచ్చింది కాబట్టి. ఈ బారుగా సాగిన బిగినింగ్ విభాగం పూర్తయి, విజయ్ కి ఒక గోల్ ఏర్పడుతుందనీ, ఇక కథ ప్రారంభమవుతుందనీ సంతోషిస్తాం. కానీ సెకండాఫ్ ఓపెన్ చేస్తే జరిగేదేమిటంటే, విజయ్ హిమాలయాలకి జంప్. అంటే ఇది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదన్న మాట - అని మనకి ఇప్పుడు అర్ధమవుతుంది. అంటే బిగినింగ్ ఇంకా ముగియలేదన్న మాట. కథే ప్రారంభం కాలేదన్న మాట. ఇక ఈ సెకండాఫ్ ని చాలా
భరించాలన్న మాట. హీరోయే ప్రేమ కథని వదిలేసి సెకండాఫ్ స్పేస్ ని ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోతే, హీరోయిన్ కూడా ఏటో వెళ్ళిపోతే, మనమెందుకు ఆ స్పేస్ లో కూర్చుని వుండడం.  హీరోహీరోయిన్లు కన్పించుట లేదు అని కంప్లెయింట్ చేయడమే. 

          మూడేళ్ళ తర్వాత తను హిమాలయాల్లో చేస్తున్న రీసెర్చికి డిమో కోసం హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కాల్ రావడం, అక్కడికెళ్తే  అక్కడే డిప్రెషన్ పేషంటుగా హీరోయిన్ వుండడం! కథా సౌలభ్యం కోసం పాత్రల్ని కిల్ చేస్తూ ఇలాటి కో ఇన్సిడెన్సులు ఇంకొన్ని  పంటికింద రాయిలా అడ్డుపడతాయి. ఎందుకంటే ఇక్కడ కథకుడు హీరో పాత్రని తన గ్రిప్ లోకి తెచ్చుకుని తన ఇష్టానుసారం కథ నడిపిస్తున్నాడు. యాక్టివ్ పాత్రయితే హీరో పాత్ర తన కథ తనే నడుపుకుంటుంది. కథకుడు జోక్యం చేసుకోడు. సినిమా కథలలోనే కాదు, సాహిత్యంలో కూడా కథకుడు కథలో జోక్యం చేసుకోకూడదన్నజనరల్ రూలుంది. కానీ ఇప్పటి సినిమా కథల్లో ఏం జరుగుతోందంటే, కథకుడు కథలో జోక్యం చేసుకోవడంతో పాసివ్ పాత్రలు పుట్టుకొచ్చి సినిమాల్ని ముంచేస్తున్నాయి. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు ఇంత పనీ చేస్తున్నాయి అజ్ఞానంతో సృష్టించుకుంటున్న పాసివ్ పాత్రలు. 20 - 30 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నపుడు యాక్టివ్, పాసివ్ క్యారక్టర్ లంటే ఏమిటో తెలియకపోవడం తెలుగు సినిమాల విచిత్ర విషాదం. ఈ విషాదం కూడా 2000 నుంచీ నయా దర్శకులతోనే మొదలైంది. నయా దర్శకులకి రచనా సామర్ధ్యం లేదు. వాళ్ళు  సాహిత్య మూలాల్నుంచీ, నాటక మూలాల్నుంచీ వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి. 

      ఇంటర్వెల్లో ప్రేమలో సమస్య దగ్గర్నుంచే కథకుడు పాత్రని హిమాలయాలకి పంపేసి  పాసివ్ గా మార్చడంతో, ఇక కోలుకోలేదు సెకండాఫ్ అంతా విజయ్ దేవరకొండ కామ్రేడ్ పాత్ర. హైదరాబాద్ హాస్పిటల్లో యాక్సిడెంటల్ గా హీరోయిన్ పేషంట్ గా ఎదురయ్యిందే తప్ప, ఆమె ఏమయివుంటుందనే ఆలోచన ఇంతకాలం కామ్రేడ్ కి లేదు. పెళ్లి చేసేసుకుందేమోనన్నవర్రీ కూడా లేదు. అతడి మనోగతం మనకి తెలీకుండా మూసేసి యాంత్రికంగా నడుపుతున్నాడు కథకుడు. ఇక పాత్ర బోరు కొట్టకుండా ఎలా వుంటుంది. 

          ఆమెకి యాక్సిడెంట్ అయి, డిప్రెషన్ లోకి వెళ్లిందని మళ్ళీ గాథ వెనక్కొస్తుంది. రిపిటీషన్. అతనెలా హిమాలయాలకి వెళ్లి తనని తానూ ‘బాగు’ చేసుకున్నాడో. అలా ఆమెని ప్రకృతిలోకి తీసికెళ్ళి బాగు పర్చడం.  గాథయినా ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్ళే ఇంకో రిపీటీషన్ ఏమిటంటే, తను కాకినాడలో ఇంటికెళ్ళడం. మూడేళ్ళూ కన్పించని క్షేమ సమాచారం తల్లి అడగడం. ఈ సమాచారం ప్రేక్షకులకి తెలిసిందే, ఇంకెందుకు? ఇంకో రిపీటీషన్ హీరో ఫ్రెండ్ పెళ్లి అని కల్పించి, మళ్ళీ గాథని వెనక్కి కాకినాడకి షిప్ట్ చేయడం. ఆ పెళ్ళిలో ఆడి పాడడం. ఆల్రెడీ ఈ పెళ్ళిలో ఆటాపాటా ఫస్టాఫ్ లో హీరోయిన్ అక్క పెళ్ళిలో అయ్యిందే. 

          ఈ పెళ్లి పెరంటాల వ్యవహారం ఎలా వుందంటే, ఈ లెఫ్ట్ ఓరియెంటేషన్ కాన్సెప్ట్ జానర్ లో పానకంలో పుడకలా వుంది. కనీసం తన కామ్రేడ్ సిద్ధాంతాల ప్రకారం ఫ్రెండ్  పెళ్లయినా ఆదర్శ దండల మార్పిడి పెళ్లి కాలేదు. ఈ పెళ్ళిళ్ళతో కాన్సెప్ట్ కి వచ్చిన ఉపయోగం కూడా లేదు.  

          ఇది కథైతే హీరోకో గోల్ వుంటుంది. దాంతో  కథ ఏక త్రాటిపై నడుస్తుంది. గాథ అన్నాక, అందులో పాసివ్ పాత్ర అన్నాక, గోల్ వుండదు. అందుకని ఎలా పడితే అలా టైం పాస్ సన్నివేశాలు భర్తీ అవుతూ పోతాయి. కథకి స్ట్రక్చర్ వుంటుంది కాబట్టి  ఈ టైం పాస్ సన్నివేశాలు బిగినింగ్ లోనే వుంటాయి. మిడిల్లో వుండవు. స్ట్రక్చర్ వుండని గాథల్లో మిడిల్ వుండదు. బిగినింగే అంతులేకుండా సాగుతూ వుంటుంది ఇలాటి విషయం  లేని సన్నివేశాలతో. 

మార్కెట్ యాస్పెక్ట్ లేని కథ 
చివరిగా -  ఇక హిమాలయాలనుంచి వచ్చిన  హీరో మారాడని హీరోయిన్ తిరిగి ప్రేమిస్తుంది. ఎన్ని సార్లని  తిరిగి ప్రేమిస్తుంది? ఇంటర్వెల్ కి ముందు ప్రత్యర్థులతో ఘర్షణ పడినప్పుడు మారతానన్నాడు. అప్పుడు నమ్మి తిరిగి ప్రేమించింది. ఇంటర్వెల్లో ఇంకా భీకరంగా ప్రత్యర్ధులతో ఘర్షణ పడ్డాడు. ఇక ఇతణ్ణి నమ్మనని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ రౌడీ కొట్లాటల కారణం చేత హీరోయిన్ విడిపోవడమన్నది చాలా పాత టెంప్లెట్టే, కొత్త పాయింటేమీ లేదు. 

          ఇక సెకండాఫ్ లో హిమాలయాల్లో మారిపోయి వచ్చాడని తిరిగి రెండోసారి ప్రేమిస్తుంది. అంతలోనే తడాఖా చూపిస్తూ ఆమె క్రికెట్ బాస్ ని కొట్టి నానా బీభత్సం చేయడం తో షాక్ తిని, ఛీ నిన్నిక ప్రేమించను పొమ్మంటుంది. ఎన్నిసార్లని ఇలాగే  అంటుంది. ఇలా ఈ ప్రేమ గాథైనా ముందుకే పోదు. మాటిమాటికీ వెనక్కే పోతోంది. హీరోయిన్ కి ఓ స్పష్టత లేదు. పాసివ్ పాత్ర. మూడేళ్ళూ ఇంకా ఎందుకిలా వుండిపోయింది? అతడి కోసం ఎదురు చూస్తోందా? లేక ప్రేమలో దెబ్బ తిన్నది కాబట్టి, ఇక ప్రేమించనే కూడదని, పెళ్ళే చేసుకోకూడదనీ  ఇలా వుండి పోయిందా? ఈమె మానసిక లోకం కూడా అర్థం గాకుండా మూసేశాడు కథకుడు. భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేశాడు. పాత్రలతో తన స్వభావ ప్రకటనా స్వేచ్ఛ మాత్రం ఎలా పడితే అలా మారిపోతూ వుంది. 

          ఆమె యాక్సిడెంట్ కి కారణం ఆమె క్రికెట్ బాస్ ఆమెని నేషనల్ కి సెలెక్ట్ చేయాలంటే సెక్సువల్ ఫేవర్ డిమాండ్ చేయడం, దీని మీద ఆమె తోటి ప్లేయర్ కంప్లెయింట్ చేయడం, దీంతో ఆమెని చంపడానికి యాక్సిడెంట్. ఇదంతా విషయం లేకుండా నడుస్తున్నరెండు గంటల 20 నిమిషాల సుదీర్ఘ గాథకి, ఆకస్మికంగా విషయాన్ని సమకూర్చుకుని, 30 నిమిషాల కథగా - ముగింపుగా అతికింపు. 

          ఈ కథలో హీరోయిన్ పాసివే కాదు, విషాద పాత్ర. ఆమెకి ఈ లైంగిక వేధింపుల మీద పోరాడాలంటే భయం భయం. పరువు బజార్న పడుతుందని. హీరోకి ఏ మాత్రం సహకరించదు, పై పెచ్చు విడిపోతుంది. పాతకాలం టెంప్లెట్ హీరోయిన్ని ఈ కాలంలో  ప్రయోగించారు. 

       హీరోయిన్ పాత్రెలా వుందంటే, లైంగిక వేధింపుల పై అవగాహన ఏ మాత్రంలేదు. ఈ అవగాహన పెంచుకుని బయట యువతులు చుక్కలు చూపిస్తూంటే, ఈమె భయంతో ముడుచుకు కూర్చుంది. నేటి యువతులకి ఆదర్శంగా, సంఘీభావంగా చురుగ్గా వుండాల్సిన తను,  ఈ సినిమా చూసే ప్రేక్షకుల్లో నేటి యువతులకి కనెక్ట్ కాక అసంతృప్తి మిగిల్చే శాల్తీగా వుండిపోయింది. ఇంకా కమర్షియల్ సినిమాల్లో ఇదే వరస. యువతులకి ఒక ఆదర్శప్రాయమైన హీరోయిన్ పాత్రని తెరమీద చూడాలంటే దొరకడం లేదు. ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ కి ఇదొక లోపం. కథకుడి క్రియేటివ్ యాస్పెక్ట్ ఎక్కడా మార్కెట్ యాస్పెక్ట్ తో కలవడం లేదు. 

          ఈ సినిమాలో చెబుతున్న విషయం లైంగిక వేధింపుల గురించని చెప్పడానికి అధైర్య పడి రెండున్నర గంటలసేపు దాట వేయనవసరం లేదు. ‘మన్మర్జియా’ లో టౌన్లో మధ్యతరగతి కుటుంబంలో హీరోయిన్ సహజీవన కథ ఎంత సాఫీగా, ఫన్నీగా చెప్పారు. ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా’ లో సాంప్రదాయ కుటుంబంలో హీరోయిన్ స్వలింగ సంపర్కపు కథ ఎంత ముచ్చటగా చూపించారు. ‘లుకా  చుప్పీ’  లో కూడా మధ్యతరగతి కుటుంబంలో సహజీవన కథని ఎంత వినోదాత్మకంగా చూపించారు. బోల్డ్ కథల్ని ఫ్యామిలీ సినిమాలుగా మార్చి  సక్సెస్ అవడానికి ఎంత ధైర్యం కావాలి. ధైర్యం చేయకపోతే దగాపడడమే. 

          ‘డియర్ కామ్రేడ్’ హీరోయిన్ లైంగిక వేధింపుల కథయినప్పుడు అది మొదట్నుంచీ వుండాలి. హీరోయిన్ ఒక కారణం చెప్తుంది, గొడవలంటే తన కెందుకు ఇష్టం లేదో. తన అన్న కూడా గొడవల్లో చనిపోయాడు కాబట్టని. అలాంటప్పుడు లైంగిక వేధింపుల విషయంలో ఈ కారణంగానే భయపడాలి. ఆమె భయపడ్డానికి పరువు కారణంగా చూపించారు. అంటే అన్న మరణించిన భయం వొట్టిదే నన్న మాట. అందుకని కథలో అతకని అన్న మరణించిన భయం కాకుండా,  ఇంటర్వెల్లో  హీరో మీద ఫైర్ అవుతున్నప్పుడు - నేను నీ గొడవలకి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నానో తెలుసా - నాకు ఇంతకంటే పెద్ద డిస్టర్బెన్స్ వాడితో వుంది – అని క్రికెట్ బాస్ గురించి హీరోయిన్ బరస్ట్ అయివుంటే, ఈ భారమైన గాథ హుషారైన కథగా మారేది.

సికిందర్


855 : టిప్స్


     107. కథలు గాథలై పోతున్నాయి. చూసింది కథో గాథో అర్ధంగాని వింత స్క్రీన్ ప్లేలు తయారవుతున్నాయి. కథో గాథో ఏదో ఒక్కటే తీయాలి. ముందు కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో తెలుసుకుంటే  కథల్నే వాటి లక్షణాలతో తీస్తారేమో. మరి గాథలు పనికిరావా? ఖచ్చితంగా పనికిరావు. ఒకప్పుడు పనికొచ్చేవి. ఎండ్ సస్పన్స్ తో కూడిన కథలెలా ఒకప్పుడు పనికొచ్చేవో గాథలూ పనికొచ్చేవి. వాటి కాలం తీరిపోయింది. కళలు ఏవీ పర్మనెంట్ కావు. ఒకప్పటి నటనలూ సంభాషణలూ ఇప్పుడు లేవు. కాలాన్నిబట్టి మారిపోతూ వచ్చాయి. కాలం కాదని గాథలూ  ఆగిపోయాయి. గత రెండు దశాబ్దాలుగా యాక్టివ్ పాసివ్ పాత్రల తేడాలే తెలీక, పాసివ్ పాత్రల్లో హీరోల్ని పదేపదే చూపిస్తూ తీస్తున్న కథలే అట్టర్ ఫ్లాపవుతున్నాయి, ఇక పాసివ్ పాత్రలే వుండే గాథల్నేం తీసి హిట్ చేస్తారు. 

         
 108.  కథ - గాథ అనే గజిబిజి నుంచి గాథని విడదీసి చూస్తే, కమర్షియల్ సినిమాలకి గాథలూ ఒకప్పుడు ఎందుకు పనికొచ్చేవో తెలుస్తుంది. గాథంటే ఉదాత్త విలువల జీవన సౌందర్యం. ఆత్మికంగా మనుషులు విలువల్ని ప్రేమించేవారే. బయట ఈ విలువలు కానరాక అర్రులు చాచే వారే. ఈ ఆత్మిక దాహాన్ని తీర్చేవే గాథలు. అంతేగానీ ఒక కుటుంబ సినిమా అనో, ఇంకేదో మహోజ్వల చిత్రరాజమనో అర్ధంపర్ధంలేని, రుచీ పచీ లేని  కృత్రిమ అనుబంధాలు, సెంటిమెంట్లు కలిపి కుట్టి చూపిస్తే  గాథలైపోవు. ఆత్మిక దాహాన్ని తీర్చవు సరికదా, ఆత్మల్ని కుళ్ళబొడిచి వదుల్తాయి.

          109. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవచ్చు. విడిపోయి న్యూక్లియర్ కుటుంబాలై పోవచ్చు. వలసపోయి ఎన్నారై కుటుంబాలై పోవచ్చు. కానీ కుటుంబాలనేవి వున్నాయి. వాటి విలువలు
? విలువల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాల నుంచే నేర్చుకోవాలి. కొనసాగించాలి. ఉమ్మడి కుటుంబాలు నాటి జమీందారీలే కావొచ్చు. నేటి పారిశ్రామిక కుటుంబాలే కావొచ్చు. జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మాధవరావు లండన్లో కుటుంబ రాజ్యాంగం రాయించుకొచ్చారు. కుటుంబంలో ఆ రాజ్యాంగమే అమలవుతోంది. కుటుంబాలు కులాంతర, మతాంతర వివాహాలతో సంకరం కావొచ్చు. అయినా కలిసే వుండాలి. ఆ జంటల్ని వెళ్ళ గొడితే, ప్రాణాలు తీసేస్తే కుటుంబాలు పితృ దోషం బారిని పడతాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమంటే వంశంలో ప్రవహించే డీఎన్ఏ ని విచ్ఛిన్నం చేసు కోవడమే. దీని ఫలితాల్ని పిల్లలు సహా అందరూ అనుభవిస్తూ పోతారు. కుటుంబంలో విచ్ఛిన్నమైన డీఎన్ఏ తిరిగి దాని ఐక్యత కోసం తల్లడిల్లుతూ వుంటుంది. ఇదే పితృ దోషం.   ఇలా డీఎన్ఏ విచ్ఛిన్నం కాకూడదనే విలువ ఒక్కటే ఉమ్మడి కుటుంబాలకి ఆధారం. ఈ విలువ కోసం త్యాగాలే చేయాలి తప్ప తెగనరుక్కోవడం కాదు. ‘పెదరాయుడుఈ విలువల్ని ఎత్తి చూపే ఉదాత్త కుటుంబ గాథ. అయింది.

   
 110.బ్రొమాన్స్ లో నైనారోమాంటిక్ కామెడీ లోనైనా పెద్ద వయసు క్యారెక్టర్లు నీతులతో క్లాసులు పీకి యూత్ పోకడల్ని మార్చే చాదస్తాలు వుండవు.కానీ తెలుగులో ప్రతీ రోమాంటిక్ కామెడీ ఇలాగే వుంటూ ఫ్లాపవుతోంది. ఏదో మోరల్ పోలిసింగ్ చేయబోతారు దర్శకులు. అలాటిది ఇలాటి చాదస్తాలు ఏవీ లేని జానర్ స్పెసిఫిక్ కథగా హుషారు’ అనే  బ్రొమాన్స్ కొత్తఊపిరే.తల్లిదండ్రుల పాత్రలున్నా అవి కథని మేనేజ్ చేయకుండా సమస్యల్నీవాటి పరిష్కారాలనీ పిల్లలకే వదిలేస్తాయి. యూత్ వాళ్ళ జీవితాలు వాళ్ళే జీవించడం నేర్చుకునే స్వావలంబనని అలవర్చుకునేలాచేయాలన్నదే  నిజమైన బ్రొమాన్స్రోమాంటిక్  కామెడీల ఉద్దేశంఇది  కథ నేరవేర్చింది.ఇవాళ్టి యూత్ సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్చాలా కాలానికి  కథ ఎకనమిక్స్ తో వచ్చి, రోమాంటిక్ కామెడీలతో ఖాళీ అయిన తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోగల్గింది.
`        


           111. సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  -  ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  - ఆ  పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా చివర పాత్ర కనుక్కునే పరిష్కారంలోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్ర, ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య, పరిష్కారం”  – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్  వ్యవహారమవుతుంది. పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే రచయిత  కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా పాత్ర కనుక్కునే పరిష్కారంఅని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు-  అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటు, వాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు.


          112.  సినిమా కథంటే పైన చెప్పుకున్న బ్రాకెట్లో పొల్లుపోకుండా వుండేదే. ఇలా లేనివి ఏవీ సినిమా కథలు కావు, సినిమాలన్పించుకోవు. కథతో వుంటేనే సినిమా. కాకుండా కథ వుండని గాథ సినిమా అవదు, కథ వుండని ఉపోద్ఘాతం సినిమా అవదు, కథ వుండని ఫ్లాష్ బ్యాక్ సినిమా అవదు, కథ వుండని డాక్యుమెంటరీ సినిమా అవదు, కథ వుండని ఎపిసోడ్లు సినిమా అవదు, కథ వుండని ఆంథాలజీ (కథల సంపుటి) సినిమా అవదు, కథ వుండని ఆర్ట్ సినిమా సినిమా అవదు, కథ వుండని వరల్డ్ మూవీ సినిమా అవదు, కథ వుండని ఇండీ ఫిలిం సినిమా అవదు, కథ వుండని క్రౌడ్ ఫండింగ్ కళాత్మకం సినిమా అవదు, కథ వుండని న్యూస్ బులెటిన్ సినిమా అవదు, కథ వుండని డైరీ సినిమా అవదు, కథ వుండని బయోపిక్  సినిమా అవదు. కెమెరాతో తీసిందల్లా సినిమా అవదు.
          
          113. రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ రోబో- 2తో  మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగిందో,  అదే ఎన్టీఆర్బయోపిక్ మొదటి భాగంతో జరిగింది. రోబో -2లో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన  పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని-  ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవి, క్రోనీ కేపిటలిజంతో బాటు. ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదు, నిత్యజీవితంలో వాళ్ళు చూసే  రాజకీయాలతోనే ఆర్గానిక్ గా, ప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయి, సైన్స్ ఫిక్షన్ తో కాదు.  

      114. మ్యాటరాఫ్ ఫ్యాక్ట్  ( unemotional, practical, sensible, realistic, unsentimental, businesslike etc)  కథనాన్ని  ఏనాడో ప్యాసాలో గురుదత్ ప్రయోగించారు విజయవంతంగా. ఫలానా ఈ సంఘటన ఈ పాత్ర జీవితంలో ఇలా జరిగిందీ- అని ఒక టీవీ జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తున్న చందంగా చూపించి కట్ చేసేస్తారు ఏ సన్నివేశానికా సన్నివేశం దత్. పాత్రల ఏడ్పులూ మెలోడ్రామాలూ నహీచల్తా. దీన్ని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ కథనమన్నారు పండితులు. ఇది మతిపోగొట్టే కథనమే. ఇలాంటిది చాలాకాలం వరకూ మరే దర్శకుడూ ప్రయత్నించలేదు- ఇటీవల కాలంలో బర్ఫీ’ లోనే చూస్తాం. ఇవి ఫ్లాష్ బ్యాక్మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూడిన కథనాలు కావు కాబట్టి చెల్లింది. కానీ చివరంటా మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులే రాజ్యమేలే  ‘కంచె’ లోని జోడు కథలకి చెల్లలేదు. 
 
          115. కొన్ని సినిమాలకి విజయవంతంగా  స్క్రీన్ ప్లే అనేది వుండదు. రాం చరణ్ ‘బ్రూస్ లీ’ కి  ‘ఐస్ స్క్రీమ్ ప్లేఅని కొత్తది కనిపెట్టారు.  దీనితర్వాత లాలిపాప్ ప్లేరావొచ్చు. చూయింగమ్ ప్లేరావొచ్చు. ఆఖరికి ఇంకా కాలం ఇలాగే కలిసివస్తూ వుంటే,   ‘పాన్ మసాలా ప్లే’, ‘మాణిక్ చంద్ గుట్కా ప్లేలు కూడా వచ్చేస్తాయి. బిగ్ బడ్జెట్ సినిమాలకి కావలసిందల్లా అతి బీదతనంతో కూడిన తెల్ల రేషన్ కార్డు  ‘ప్లేమాత్రమే. సబ్సిడీ బియ్యం మాత్రమే. సబ్సిడీ బియ్యంతో బడాయిగా బిర్యానీ వంటకం  మాత్రమే. నాణ్యమైన బాస్మతీ బియ్యంతో ప్రేక్షకులకి మంచి బిర్యానీ  పెట్టలేని పేదరికంతో  వుంది టాలీవుడ్ రైటింగ్ డిపార్ట్ మెంట్. సబ్సిడీ బియ్యం మాత్రమే తెలుగు బిగ్ బడ్జెట్ సినిమాల్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జోకుగా ( స్కామ్ గా కూడా!)  పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టగలదు కాబట్టి ఆ రేషన్ ని వదులుకోరు. టాలీవుడ్ సలీం-  జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్లు ఆల్రెడీ సింగిల్ విండో స్కీము అనబడు జారుడుబల్ల స్క్రీన్ ప్లేని  కనిపెట్టారు. అది సినిమా తర్వాత సినిమాగా ఏకసూత్ర కార్యక్రమంగా అమలవుతూ  ‘పండగ చేస్కోతో పరాకాష్టకి చేరింది. ఈ స్కీము కింద ఏ స్టార్ అయినా, ఎంతటి వాడైనా; ఏ కథైనా, కథే కాకపోయినా, అదే సింగిల్ విండో లోంచి దూకి, అదే జారుడు బల్లమీదుగా రయ్యిన జారుకుంటూ వెళ్లి బాక్సాఫీసులో పడాల్సిందే. అదంతా ఒక సెట్ చేసిన ప్రోగ్రామింగ్, ఒక టెంప్లెట్, ఒక ఆటోమేషన్, అంతే. మీటలు నొక్కడమే పని. స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ లు అంటూ వున్నాయి. ఈ సింగిల్ విండో స్కీము గురించి ప్రపంచానికి తెలిసిపోతే,  వందల కోట్ల డాలర్ల ఆ స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ రంగం మొత్తంగా మూతబడి పోవాల్సిందే. 
           
సికిందర్