రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, డిసెంబర్ 2018, సోమవారం

711 : పాలపిట్ట ఆర్టికల్, విస్మృత సినిమాలు -2

       

    అభినయంతో ఆమె కవిరాసిన పాత్రని ఇట్టే కవిత్వం చేసి పెట్టేయగలదు మరి ఆమె అభినయ కళావిరుపుల మెరుపుల్ని అక్షరాల్లో పట్టగల కవి కుమారుడెవడు కలాలు మొరాయించాల్సిందేగా! కలాల్నే ఓడించే కళా స్వామ్యమామెది! శ్రమలేని జీవితం నేరమైనట్టే, కళ లేని శ్రమా ఘోరమే. జీవితంలో కళనంతా కోల్పోయి, శ్రమలోనే కళని రెండు కళ్ళుగా చేసుకుందామె. తుది యంటూ లేని సుషుప్తావస్థలో తనుంటే, పైలోకాల్లో దేవతలకి స్వాగత సన్నాహాలు పూర్తి చేయడానికి నెలలకి నెలలూ పట్టేసిందని స్వయంగా ఆత్రేయ రాసేశాక, మానవ మాత్రులకి ఎన్నెన్ని జన్మలు కావాలి ఆమెకి సరితూగే నాల్గక్షరాలు ఏర్చి కూర్చడానికి...ఏవో తోచిన నాల్గు విశేషణాలు జోడించుకుని ఆనందించడం మినహా!
             సావిత్రియే ఒక విశేషణం, పర్యాయపదం. ఈమాట ఎవరు చెప్పారు? సాక్షాత్తూ వైజయంతీ మాలే చెప్పింది. అలా  నటనలో అత్యున్నత శిఖరాల అధిరోహణకి ఒక్క ముక్కలో సావిత్రీ అని అభివర్ణిం చెయ్యొచ్చు. గమనిస్తే - ఇంత  సులువు చేసి పోయింది సావిత్రి పెన్ మాస్టర్లకి!

          సినిమా అంటే జీవితమే అని ఆమె నిర్వచనమాయ్యాక, రౌద్ర రసంలో గాజులు పగిలి రక్తం చిందేంత, శోక రసంలో శోష వచ్చి పడిపోయేంత నటనా పటిమే ఆమె జీవితం నిండా చదివించే  పేజీలైపోయాయి. పేజీల్ని ఆబగా తిప్పేస్తూంటే, మూడు చోట్ల చెవులు పట్టి ఆపి చాచి కొడుతుందామె!ముందు మిస్సమ్మచదువుకోవోయ్, తర్వాత మాయాబజార్చూసుకో, ఇంకా తర్వాత చివరకుమిగిలేదితెలుసుకుని ముందుకుపో! ఫో!! అనేసి. 

        మొదటి రెండూ తను అజరామరం చేసిన అమోఘ పాత్రలే. చివరిదే జాతీయంగా గెలిచిన గర్వించే పాత్ర. దేవదాసుగా అక్కినేని ఎక్కడెక్కడి వెండి తెర దేవదాసులందర్నీటోకున జయించేసినట్టే, ‘చివరకు మిగిలేదితో సావిత్రి ఇటు బెంగాలూ అటు బాంబే అభినేత్రులందర్నీ ఓడించి పారేసి, వచ్చి అక్కినేని సరసన నించుంది సగర్వంగా - తెలుగు జాతి బలిమిని చాటుతూ. చిత్ర రాజాన్ని ఒక మాగ్నం ఓపస్ గా చరిత్ర కెక్కించి చేతులు దులిపేసుకుంది!

         
క్లయిమాక్స్ సీనే ముగ్గురు తెలుగు బెంగాలీ హిందీ నటీమణుల టాలెంటు కి గీటురాయి అయింది. క్లైమాక్స్ అంటూ చిత్రీకరిస్తే అది రాత్రి పూటే వుండాలని నిబంధన పెట్టింది సావిత్రి. షాట్ పూర్తయ్యాక తన సమీపంలోకి ఎవరూ రావొద్దని ఆక్షలు విధించింది. రీటేకు లేమాత్రం లేని షాట్స్ తో, మతి చలించిన విధివంచిత పాత్ర ఆక్రందనని గుండె పగుల గొట్టుకుని మరీ ప్రతిష్టించేసి, వెళ్లి మూల కూలబడి వెక్కి వెక్కి ఏడ్వడమే! పాత్ర తాలూకు గుండె కోతంతా వదిలాక,  చక్కాలేచి గుడ్ నైట్ చెప్పేసి సొంత గూటికి వెళ్ళిపోవడమే!

              అమృత తుల్యమైన షాట్సే అటు బెంగాలీ మాతృక దీప్ జలే జాయేలో సుచిత్రా సేన్ నీ, ఇటు మళ్ళీ హిందీ రీమేక్ 'ఖామోషీలో వహీదా రెహమాన్ నీ ఆలౌట్ చేసేశాయి. స్వయంగా ఓటమి ఒప్పేసుకుంది కూడా వహీదా.

          మనసులాట ఇదంతా. వికటించే ఒక వింత ప్రయోగం. అయినా రిటైర్డ్ కల్నల్ డాక్టర్ (డాక్టర్ ప్రభాకర రెడ్డి) కి ప్రయోగమే కావాలి. మానసిక రోగులకి మందులతో గాక, ప్రేమతో వైద్యం చేయాలనే సూత్రీకరణ. విఫల ప్రేమలతో పిచ్చివాళ్ళయిన పెషంట్లకి ప్రేమ నటించి బాగు చేస్తే బావుంటుందని ఆలోచన. అప్పటికి ప్రపంచంలో మొట్ట మొదటిదైన ప్రయోగాన్ని ఎలాగైనా విజయవంతంగా పూర్తిచేసి  పేరు ప్రతిష్టలు గడించాలన్నఆశ.  ఇందుకు సాధనం అదే ఆస్పత్రిలో పనిచేసే పద్మ ( సావిత్రి) అనే అమాయక నర్సు.  

       కేస్ – 1 : భాస్కర్ ( టి.ఎల్. కాంతారావు)అనే పేషంట్ తో, నర్సు పద్మ వలచి ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నిజంగా తనే ప్రేమలో పడిపోయింది. మనసారా అతను కోలుకుని వెళ్తూ, ఆమె చూపించిన ప్రేమ అంతా ప్రయోగంలో భాగంగా ఉత్తి నటనే అని అపార్ధం జేసుకుని వెళ్ళిపోయాడు. కాదూ నిజంగానే ప్రేమించానూ అని అతడికైనా, డాక్టర్ కైనా ఎలా చెప్పుకోవాలామె? ఎలా?

          కేస్ – 2 : ప్రకాష్ (ఎం. బాలయ్య) అనే ఇంకో పేషంట్ ని కూడా ఇలాగే నయం చేసి పంపించాలని డాక్టర్ ఇంకో హుకూం. వల్లకాదంది, తనవల్ల ఇక కాదంటే కాదంది. మనసంతా వెళ్లిపోయిన భాస్కరే నిండి వుంటే, బరితెగించి మళ్ళీ ఇంకోడితో నటనా? ఐనా ఉద్యోగ ధర్మం కొద్దీ ఓర్చుకుని ఎలాగో ప్రకాష్ కి సపర్యలు చేస్తూ, ఇతడి ప్రేమ కథలో మోసగించిన ప్రియురాల్ని తెచ్చి అప్పగించేస్తే, ఛీ కాదు పొమ్మన్నాడు. నువ్వే నా ప్రేయసీ అంటూ గలాభా సృష్టించాడు. మతిపోయి తలుపులు బిడాయిం చుకుని పిచ్చి చూపులు చూసింది. పచ్చిగా పిచ్చిదై తెరలుతెరలుగా నవ్వడం మొదలెట్టింది. అదే ఆస్పత్రిలో అదే పేషంట్లకి నయం చేసిన అదే గదిలో, తనే పేషంటైపోయి ఈసురోమంటూ చీకటిని మిగుల్చుకుని చతికిల బడింది. అప్పుడు మిన్నంటే అక్రందన -

          “నేను అభినయం చేయలేదూ , నిజంగా నేను అభినయం చేయలేదు! నేనెన్నడూ అభినయం చేయలేదు! అభినయించడం నాకు చేత గాదు, నా చేత గాదు, నా చేత గాదూ ..అనేసి!

          “చిగురంటి వయసులో చిక్కని జీవితాన ...చివరకు మిగిలేది చీకటేనా కారు చీకటేనా” –(కృష్ణ శాస్త్రి)...సేవికగా, నటించే నాయికగా, మనసిచ్చిన మానినిగా, భగ్నహృదయిని గా, భయవిహ్వలగా, బలిపశువుగా... పాత్ర నడక (క్యారక్టర్ ఆర్క్) ని అంకురం దగ్గర్నుంచీ చివరాఖరికి విధ్వంసం వరకూ ఒంటి చేత్తో లాక్కెళ్ళేసి, నిటారుగా నింగి నంటించిన సినిమా ప్రపంచపు సామ్రాజ్ఞిని వృత్తి నైపుణ్యాన్ని వర్ణించడానికి భరతముని దిగివచ్చినా బలాదూరే!

         
మతి పోగొట్టుకోవడంలో కళ్ళు తిప్పడం వుందే...అదే  సుచిత్రా వహీదా నటద్వయం చాపకిందికి నీరు తెచ్చేసింది! బేసిగ్గా కళ్ళు తిప్పే టెక్నిక్ ని అఖండ తారామణు లిద్దరూ ఎందుకు విస్మరించారో వాళ్ళకే తెలియాలి. పైపెచ్చు సుచిత్రా సేన్ లో పాత్ర డిమాండ్ చేసే సగటు ఆడదాని అణుకువ కంటే కూడా మోడరన్ గాళ్ పాయిజే పెల్లుబికింది బాగా. వహీదా రెహమాన్ లో సగటు స్త్రీ తొంగి చూసినా, కీలక మతి చాంచల్య ఘట్టంలో ఉల్లాస ఛాయలు దేనికో. మొత్తానికి ఇలా సావిత్రిదే పైచేయై పోయింది!

        1960 లో మంజీరా ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా బెంగాలీ మాతృక, ‘నర్స్ మిత్రఅనే నవలకి తెర రూపం. ఆశుతోష్ ముఖోపాధ్యాయ నవలా రచయిత. అసిత్ సేన్ ని దర్శకుడిగా పెట్టుకుని, అనిల్ చటర్జీ, సుచిత్రాసేన్ లని హీరో హీరోయిన్లుగా తీసుకుని ప్రఖ్యాత సంగీత దర్శుకుడు హేమంత్ కుమార్ సినిమా నిర్మాణం చేపట్టాడు. అది సూపర్ హిట్టయ్యింది. 1969 లో ఇదే దర్శకుడు రాజేష్ ఖన్నా వహీదా రెహమాన్ ధర్మేంద్ర లతో ఖామోషీగా రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాపయ్యింది. 

          బెంగాలీలో హేమంత్ కుమార్ పాడిన అయి రాత్ తుమార్ అమార్’ ( రాత్రి నీదీ నాదీ) అనే హమ్మింగ్ సాంగ్ వుంది. ట్యూన్ నే తెలుగు రీమేక్ చివరకు మిగిలేదిలోనూ వాడుకుంటూ సుధవో సుహాసినీఅని మల్లాదితో  పాట రాయించుకుని, ఘంటసాల చేత పాడించుకున్నాడు సంగీత దర్శకుడు అశ్వత్థామ. వేరే ట్యూన్ తో హిందీ రీమేక్ లో కిషోర్ కుమార్ పాడిన గుల్జార్ రాసిన పాట- వో హ్ షామ్ కుచ్ అజీబ్ థీగుండెల్లో సాయంకాలపు రాగాల్ని నాటుతుంది. ఇకపోతే బెంగాలీ మాతృక, హిందీ రీమేక్ కథనం కథానాయిక దృక్కోణంలో సాగుతుంది. 

          మొదటి కేసులో సాగే ఆమె ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ లో, అది కూడా నీడలా భగ్న ప్రేమికుడ్ని చూపించే టెక్నిక్ తో, డైరీలో ఆమె జ్ఞాపకాల్ని తోడుకునే కథనంతో లీలామాత్రంగా వుంటుంది. తెలుగులో దీన్నిదర్శకుడి దృక్కోణం (పాయింటాఫ్ వ్యూ) కి మార్పు చేశారు. రెండు కేసుల్నీ కేసుని వర్తమానంలో నడిచే కథలుగానే చూపించారు. దీనికి కారణాలేమిటో ఎగ్జిక్యూటివ్ నిర్ణాత ఎం.ఆర్. కొండల రెడ్డి వివరిస్తారు (కింది సెక్షన్లో చూడండి). అలాగే ఏసుప్రభు, పాలగ్లాసు, రేడియో దృశ్యాలతో పాటు; రాజబాబూ రమణా రెడ్డిల మెంటలోళ్ళ కామెడీ ఒరిజినల్ లో లేని చేరికలే. అప్పటి పాపులర్ హీరో హరనాథ్ కూడా ప్రత్యేకపాత్ర పోషించిన సినిమాకి గుత్తా రామినీడు దర్శకుడు. ఈయన అప్పుడప్పుడే మా ఇంటి మహాలక్ష్మిఅనే సినిమాతో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు పొంది వున్నాడు.

చరిత్రలో ఒక పేజీ..
    చివరకు మిగిలేది నిర్మాతలుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యు. పురుషోత్తమ రెడ్డి, ఎం. సత్యనారాయణ లున్నా, పర్యవేక్షణంతా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా డా. ఎం.ఆర్. కొండలరెడ్డి తన భుజానేసుకున్నారు. ఈయన హైదరాబాద్ లో రాజధాని బ్యాంక్ ఉపాధ్యక్షులుగా, సెన్సార్ బోర్డు మాజీ మెంబరుగా వున్నారు.  నీలకంఠ తీసిన షోచిత్రం మీద ఎం.ఫిల్ చేశారు. మృదుభాషి అయిన ఈయన దగ్గర చివరకు మిగిలేదిసమాచారం పుష్కలంగా వుంది!

           1959 లో సినీ అడ్వాన్స్అనే పత్రికలో బెంగాలీ చిత్రం దీప్ జలే జాయేరివ్యూ చదివి ఉత్తేజితుడైన ఈయన( అప్పట్లో ఒక ఆంగ్ల పత్రికలో సినిమా రివ్యూలు రాసేవారీయన) పురుషోత్తమ రెడ్డిని, దర్శకుడు గుత్తా రామినీడునీ వెంట బెట్టుకుని కలకత్తా వెళ్ళిపోయారు. అక్కడ నిర్మాతా సంగీత దర్శకుడూ అయిన హేమంత్ కుమార్ దగ్గర పది వేలకి సినిమా తెలుగు రైట్స్ కొని, మద్రాసు వచ్చేశారు. ముందు జమునని అనుకున్నారు. ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడంతో, సావిత్రిని కలిశారు. సినిమా చేయడానికి సావిత్రి సాహసించక పోవడంతో, అక్కినేని నాగేశ్వర రావుతో చెప్పించారు. అలా ఒప్పుకున్న సావిత్రి అప్పుడే తన పారితోషికం 40 వేలలోంచి పాతిక వేలూ పెట్టి నిర్మాతల దగ్గరే తమిళ డబ్బింగ్ రైట్స్  కొనేశారు. ఐతే తెలుగులో రీమేక్ ఫ్లాప్ కావడంతో సావిత్రి తమిళ డబ్బింగ్ జోలికెళ్ళ లే దు. అది వేరే విషయం.
\
                   సావిత్రి బిజీ కారణంగా నెలకి మూడు రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వడంతో, వీనస్ స్టూడియోలో వేసిన సెట్లో అలాగే ఆరు నెలల  పాటు షూటింగ్ జరిపారు. ప్రఖ్యాత దర్శకుడు కె.వి. రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. మూడు లక్షల బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసి,  1960 అక్టోబర్ లో 12 ప్రింట్లతో విడుదల చేస్తే, వెనువెంటనే తిప్పికొట్టారు తెలుగు ప్రేక్షకులు. పిచ్చి సినిమాలో సావిత్రికి కాదు, ఇలాటి సినిమా తీసిన నిర్మాతలకి పట్టిందని చెడ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. విజయవాడలో ఒకే ఒక్క ఆటకి బాక్సు వెనక్కొచ్చేసింది. కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లలో మాత్రం రెండు వారాలాడింది. మద్రాసులోని సౌత్ ఇండియన్ ఫిలిం క్రిటిక్స్ సంఘం దీనికి మూడు అవార్డులిచ్చింది(ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు). 1990 లో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే క్రిక్కిరిసి చూశారు డెలిగేట్లు. ఇప్పుడీ సినిమా ప్రింట్లు ఎక్కడా లేవు. చివరి ప్రింటు కూడా శిథిలమౌతూంటే, జాగ్రత్త పడి సీడీలు తీసి భద్రపర్చారు. సీడీలే రాస్తున్న ఆర్టికల్ కి మూలాధారం

         
అట్లూరి పిచ్చేశ్వర్రావు చేత మాటలు రాయించారు. తర్వాత కృష్ణశాస్త్రి వీటిని సంస్కరించారు. అయితే కథనంలో పాయింటాఫ్ వ్యూ పరంగా ఒరిజినల్ కీ రీమేకుకీ  వ్యత్యాసాన్ని కొండల రెడ్డి వివరిస్తూ- అలా తెలుగు ప్రేక్షకుల సౌలభ్యం కోసమే  చేశామన్నారు. కాంతారావుతో సావిత్రి ప్రేమాయణాన్ని అలా ప్రత్యక్షంగా చూపించక పో తే తెలుగు ప్రేక్షకులకి నచ్చేది కాదన్నారు. అలాగే సావిత్రి బాలయ్యని డీల్ చేస్తున్నప్పుడు, ఒరిజినల్ లో లాగా తల్లి ప్రేమ యాంగిల్ ని ప్రవేశపెట్టినా కూడా మన ప్రేక్షకులకి రుచించేది కాదన్నారు. సూడో ఫీనియా, ఎక్యూట్ మేనియా, వంటి వైద్య భాషని, బాల్యం నించీ వివిధ దశల్లో పురుషుడి మానసికావస్థ కి సంబంధించిన డిస్కషన్ నీ ఇందుకే పరిహరించామన్నారు. తర్వాత 1964 లో కొండల రెడ్డి తానొక్కడే నిర్మాతగా జగ్గయ్య, కృష్ణ కుమారి లతో వీలునామానిర్మించి విజయం సాధించారు.


 -సికిందర్ 
(‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రిక, నవంబర్ -2018 సంచిక)

30, నవంబర్ 2018, శుక్రవారం

710 : '2.0' ఐడియా ఎనాలిసిస్

   టాలీవుడ్ దర్శకులు ‘సిఎస్’ పంపిన  ‘2.0’ కాన్సెప్ట్ ఎనాలిసిస్ :  Regarding your review of  ‘2.0’  in Telugurajyam.com : That's the point.  Many reviewers  quote it as 'Good vs Evil'.  Who is Good?, who is Evil? If Akshay is Good (in terms of intentions-as per the story) then Rajni is BAD.  That's a fundamental flaw in the plot. Should I empathize with Akshay, a noble man for fighting for a cause (or fought) or with Rajni who wants to Kill the good man! Isn't that confusing! (like u said in the last line..why the hell they kill!). So is it Good (Akshay) vs Bad (Rajni) !!!!


   (Sikander answers : Yes. Even after Rajni gets to know about Akshay's flash back story, which evokes a deep sympathy in the audiences, he  behaves badly with Akshay! And in the end, he preaches what already Akshay has preached! He has no alternate solution to the main problem, whatsoever).


          CS : Audience may connect to corruption issue [brand Shankar], but how can they connect to a topic which talks of 'no mobiles' especially the youth.  It’s anti youth.  If Shankar would have hired me a script consultant, I would have provided a solution to Shankar after doing one minute googling (I just did)... Cell phones emit radio frequency radiation (radio waves) [Google] so the solution is to completely switch to VoIP calls over internet. Jio would have put 90% of budget in the film!

           Just another technical point. If VoiP is used, then the internet received from network may still have some radiation so alternative ways of wifi to be used like we use fibre cable and wifi at home. Anyway the point is, film must propose some alternatives…

      

          2.0 మూవీ కాన్సెప్ట్ :  “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని తన చిట్టి రోబో చేత అంతమొందించి పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్” 

         కాన్సెప్ట్ అన్నా ఐడియా అన్నా ఒకటే. అనుకుంటున్న కథని ఐడియాలో కూర్చినప్పుడే కథ తప్పుగా వుందో ఒప్పుగా వుందో తెలిసిపోయే వీలుంటుంది. రాస్తూ కూర్చునే స్క్రీన్ ప్లే కి స్ట్రక్చర్ ఐడియా దగ్గరే నిర్ణయమవుతుంది. ఈ కామన్ సెన్స్ లేకుండా స్క్రీన్ ప్లే చక్కగా వస్తోందని సింగారించుకుంటూ ఆనందపడిపోతే, అది వెళ్లి మేళ తాళాలతో సింగూరు రిజర్వాయర్ లో సమర్పయామి అవుతుంది. ఐడియా అంటే స్ట్రక్చర్. తట్టిందల్లా ఐడియా ఐపోదు, స్ట్రక్చర్ లో కుదురుకున్నదే ఐడియా. వృక్ష, జంతు, మానవ జాతులు...ఇంకే జాతైనా సరే, పుట్టిన కాణ్ణుంచీ గిట్టే దాకా జీవ క్రియలకి అదే నీరు ఎలా కలిగి వుంటాయో, ఐడియా దగ్గర్నుంచీ సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్, డైలాగ్ వెర్షన్, చివరికి మూవీ దాకా, కథా నిర్వహణకి ఒకే  స్ట్రక్చర్ ని కలిగివుంటాయి. ఈ స్ట్రక్చర్ వెళ్లి ప్రేక్షకుల కథల్ని రిసీవ్ చేసుకునే మానసిక రాడార్ నెట్ వర్క్ తో కనెక్ట్ అవుతుంది. అంటే సినిమా కథల స్ట్రక్చర్, కథల్ని రిసీవ్ చేసుకునేప్పుడు ప్రేక్షకుల మెంటల్ స్ట్రక్చర్ ఒకటేనన్న మాట. ఈ కామన్ సెన్సు లేకపోతే నాన్ సెన్స్, ఇంకా న్యూసెన్సు స్క్రిప్టులు తయారవుతాయి. 

          మొట్ట మొదట ఐడియాకి స్ట్రక్చర్ అంటే, బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో కూడిన మర్యాదైన కథనమని (స్క్రీన్ ప్లే అని) తెలిసిందే. కాబట్టి ఐడియా దగ్గరే సకల మర్యాదలతో స్క్రీన్ ప్లేగా చూడగల్గాలి.
          1) ఐడియాలో తగిన బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలున్నాయో లేవో చూసుకోవాలి.
          2) ఈ విభాగాలు  ఆర్గ్యుమెంట్ సహిత కథని ఏర్పరుస్తున్నాయా, లేక స్టేట్ మెంట్ సమేత గాథగా వున్నాయో చూసుకోవాలి. గాథగా వుంటే ఆర్గ్యుమెంట్ సహిత కథగా మార్చుకోవాలి. అలా వచ్చేదాకా ఐడియాతో కుస్తీ పడుతూనే వుండాలి. అయినా కుదరలేదంటే ఆ ఐడియాని వదిలేయాలి.
          3 ) ఆర్గ్యుమెంట్ లో కూడా a) యూత్ అప్పీల్, b) మార్కెట్ యాస్పెక్ట్ వున్నాయో లేవో చూసుకోవాలి. ఉదాహరణకి సామాజిక సమస్యల్ని ఊహాజనిత సైన్స్ ఫిక్షన్ గా పాసివ్ గా చూపించి పరిష్కారాలు చెప్తే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే స్థితిలో వున్నారా, లేక సామాజిక సమస్యల్ని ప్రేక్షకులకి నిత్యానుభవమయ్యే రాజకీయాలతో లైవ్ గా చూపిస్తే ఎక్కువ ఫీలయ్యే పరిస్థితులున్నాయా విశ్లేషించుకోవాలి. దేవుడో, ప్రకృతో శిక్షిస్తాయంటే లైట్ గా తీసుకుంటారు. అదే చట్టం, రాజ్యాంగం శిక్షిస్తాయంటే సీరియస్ గా తీసుకుంటారు. ఈ రెండోదే మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ అన్పిస్తే, సైన్స్ ఫిక్షన్ జానర్ ని ‘ఆదిత్య 369’ లాంటి ఎంటర్ టైనర్స్ కి పరిమితం చేసేయాలి.
          4) ఐడియాలో సినిమా కథని ఎలా చూడాలి? “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు”  అనేది  ‘టాక్సీవాలా’  ఐడియాగా చెప్పుకోవచ్చు. ఇందులో బిగినింగ్, మిడిల్, ఎండ్ లు ఎక్కడున్నాయి? “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే” – అనడం బిగినింగ్, “అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి” - అనడం మిడిల్. “దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు” -  అనడం ఎండ్. ఇలా ఒక లైనుగా చెప్తే అందులో బిగినింగ్ మిడిల్ ఎండ్ లు అర్ధవంతంగా, పరస్పర సంబంధంతో కన్పించడమే ఐడియా. ఇలా కుదిరేవరకూ ఐడియాతో కుస్తీ పట్టడమే. 

      “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు” 
         
ఇందులో కారులో ఆత్మ వుందని తెలియడం ప్లాట్ పాయింట్ వన్. ఈ ఐడియా ఆడియెన్స్ మెంటల్ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతోందా? ఐడియాలో వున్న సమస్యేమిటి? ఆత్మకి ఒక అన్యాయపు కథ వుందని హీరోకి తెలియడం. దీనికి పరిష్కారమేమిటి? ఆ అన్యాయాన్ని హీరో సరిదిద్దడం. ఇందులో ప్రేక్షకులకెలాటి అభ్యంతరం వుండాల్సిన పని లేదు. ఆడియెన్స్ ఫ్రెండ్లీగానే వుంది. ఇలాకాక, న్యాయం కోసం తపిస్తున్న ఆత్మని హీరో తుదముట్టించి తన సమస్య తీర్చుకుంటేనే తీవ్ర అభ్యంతరం. బాక్సాఫీసుకి తాళాలో, పాతాళమో. 

          సైన్స్ ఫిక్షన్ కంటే హార్రర్ సినిమాలంటే  ప్రేక్షకులకి పునర్జన్మల సినిమాలంత ప్రేమ. ఎందుకంటే ఇది అన్ కాన్షస్ గా తమలో అనుభవించే సబ్ కాన్షస్ వరల్డే. సినిమాలో దెయ్యం సబ్ కాన్షస్ వరల్డ్. మనిషిలో వుండే నెగెటివ్ భావాలకి సింబాలిక్ ప్రెజెంటేషన్. మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్ ప్రకారం, మనిషిగా తనలో మంచితో బాటు చెడు కూడా వుంటుందని తెలుసుకోని మనిషి, ఆ చెడుని విధి రూపంలో బయటి ప్రపంచంలో అనుభవిస్తాడు. మనిషి తన అంతరంగంలో (సబ్ కాన్షస్ లో) మంచీ చెడులతో పడే సంఘర్షణే  వెండితెరమీద కన్పించే ప్లే – స్క్రీన్ ప్లే.

          కొన్ని హర్రర్ సినిమాలు మంచి కోసం మంచి ఆత్మల తపనగా వుంటాయి, కొన్ని హార్రర్ సినిమాలు చెడు కోసం దుష్టాత్మల ప్రకోపంగా వుంటాయి. ‘టాక్సీవాలా’ మంచి ఆత్మ కథ. ‘2.0’ కూడా మంచి ఆత్మ కథ.  

          “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని
తన చిట్టి రోబో చేత అంతమొందించి పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్”
         
పై ‘2.0’ ఐడియాలో స్ట్రక్చర్ ఎలా వుంది?
          బిగినింగ్
ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు   చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని
         
మిడిల్ తన చిట్టి రోబో చేత అంతమొందించి
          ఎండ్ పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్

         
ఈ మూడు విభాగాలూ పరస్పర విరుద్ధంగా వున్నాయని ఇట్టే తెలిసిపోతోంది. పక్షిజాతి కోసం తిరగబడిన శాస్త్రజ్ఞుడి ఆత్మని, చిట్టి చేత అంతమొందించి, అదే శాస్త్రజ్ఞుడి నివారణోపాయాలు సైంటిస్టు వశీకరణ్ వల్లె వేశాడు. ఇది కన్విన్సింగ్ గా వుందా? 

        పక్షిజాతి కోసం శాస్త్రజ్ఞుడి ఆత్మ పోరాడ్డం తప్పని చెప్తున్నట్టా? అలాటి ఆత్మని చంపి  ఆ ఆత్మే ఘోషించిన పాఠాలు చెప్పుకోవడం పాఠాలే చెప్పుకోవడం ఒప్పని అంటున్నట్టా? అలాంటప్పుడు శాస్త్రజ్ఞుడి ఆత్మని ఎందుకు చంపడం? పైగా నువ్వు కొందర్ని చంపావని సాకు చూపించి ఆత్మని దోషిగా నిర్ధారించి దాని మీద యుద్ధం ప్రకటించడం. ‘టాక్సీ వాలా’లో కూడా ఆత్మ ఒకరిద్దర్ని చంపేస్తుంది. దానికి హీరో, నువ్వు చంపావ్ కాబట్టి నిన్ను చంపేస్తానని ఆత్మ మీదికి పోయాడా? తనకి అన్యాయం చేసిన వాళ్ళనే మంచి ఆత్మ చంపేసింది. అలాగే ‘2.0’ లో  సెల్ కంపెనీలతో పక్షులకి అన్యాయం చేస్తున్న డీలర్నీ, నెట్వర్క్ ప్రొవైడర్నీ శాస్త్రజ్ఞుడి మంచి ఆత్మ చంపేసింది. ఇందులో తప్పేముంది? 4 కోట్ల 53 లక్షల రేంజిలో ‘టాక్సీవాలా’ లాగా కూడా, 543 కోట్ల మెగా రేంజిలో ‘2.0’  కన్విన్స్ చేయలేకపోతే ఎలా?

          ఎవరు హీరోనో, ఎవరు విలనో ప్రేక్షకులే తేల్చుకోవాలని వదిలేశారా? రజనీ కాంత్ విలన్లా, అక్షయ్ కుమార్ హీరోలా అనుకున్నా ఫర్వాలేదా? మంచిని చెడు చంపెయ్యాలని ఉద్దేశమా? ఇలాటి సినిమాలున్నాయా? 

          అక్షయ్ కుమార్ ది సామాజిక పోరాటం చేసే పాత్ర. సామాజిక పోరాటం చేసే పాత్ర ప్రేక్షకుల దృష్టిలో విలన్ అవదు. నిజ  ప్రపంచంలో కూడా సామాజిక పోరాటం చేసే నాయకుడు ప్రజలకి విలన్ కాదు, పాలకులకే విలన్. ఈ రియల్ లైఫ్ సెటప్ ని కథలో పెడితే అప్పుడు పాలకవర్గ, కార్పొరేట్ వర్గ ఏజెంటుగా రజనీ కాంత్ పాత్రకి అక్షయ్ పాత్ర విలనే. ఈ సెటప్ లేనప్పుడు రజనీ లాంటి సైంటిస్టు పాత్ర, లోకకళ్యాణం కోరుతున్న సాటి సైంటిస్టుని ఎలా చంపేస్తుంది? పాలక పక్ష ఏజెంటుగా రజనీ కాంత్ చంపినా హీరో అవడు, అక్షయ్ కుమారే హీరో అవుతాడు ప్రేక్షకుల దృష్టిలో. 

          ఐడియాలోనే ఇంత కన్ఫ్యూజన్ వుంటే దీన్ని అందంగా సింగారించుకుంటూ పోయారు. అక్షయ్ ని విలన్ అన్నట్టు చూపిస్తూనే, అతడి చర్యల్ని జస్టిఫై చేసే అందమైన ఫ్లాష్ బ్యాకుని కడు దయనీయంగా చూపించారు పాపం అన్పించేలా. ప్రేక్షకులు అతడి పక్షం వహించేలా. 

      దాదాపు మృతశిశువుగా అక్షయ్ పుట్టి కడుపు శోకం మిగుల్చుతూంటే, కిటికీలోంచి ఒక పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి శిశువు ఛాతీ మీద కూర్చుని పొడుస్తూ వుంటుంది. అత్యంత వండర్ఫుల్ క్రియేషన్ ఇది. కళ్ళప్పగించి చూడ్డమే శంకర్ పోయెటిక్ టచ్ కి. ఆ పిచ్చుక పొడుస్తూ వుంటే శిశువులో చలనం వచ్చి క్యారు మంటుంది!
           అదీ జన్మాంతం పిచ్చుకలతో, మొత్తం పక్షిజాతితో అక్షయ్ అత్మీయబంధానికి, వాటికోసం పోరాటానికీ ఒనగూడిన బలమైన మోటివేషన్. పక్షుల రక్షణ కోసం పోరాడీ పోరాడీ – ఫ్రీక్వెన్సీలు తగ్గించుకోమని చెప్పీ చెప్పీ ఓడి - సెల్ టవర్ కే ఉరేసుకుంటే, పక్షులన్నీ చుట్టూ చేరి ఆత్మాహుతి చేసుకున్నాయి. పక్షుల ఆత్మలన్నీ అతడి ఆత్మలో ఐక్యమై మహా పక్షిగా రూపొందాడతను.  పక్షిరాజాగా సెల్  ఫోన్ల మీద దాడులు మొదలెట్టాడు. సర్వ కమ్యూనికేషన్ వ్యవస్థనీ ధ్వంసం చేశాడు. ఇందులో ఏం తప్పుంది? అతను చెప్పింది కేవలం ఫ్రీక్వెన్సీ తగ్గించుకుని పక్షుల్ని రక్షించమనేగా? మొత్తం టెక్నాలజీని మూసెయ్యమన్లేదుగా? కానీ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించిన ప్రభుత్వమూ సెల్ కంపెనీలూ ఫ్ర్రీక్వెన్సీ తగ్గించుకోక పక్షి జాతికే, పర్యావరణానికే ఎసరు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? 

          విలన్ అనుకున్న పాత్రకి ఇంత ఎలిబీ ఇచ్చేశాక అది హీరో పాత్రే! ఎంత గందరగోళంగా వుందంటే, దీని గురించి ఇంకా రాయాలంటే ఎలా రాయాలో అర్ధంగావడం లేదు! మైండ్ పూర్తిగా  ‘0.0’ ఐపోయేలా వుంది.   

          ఓకే, రజనీ, అక్షయ్ లిద్దర్నీ పాజిటివ్ పాత్రలుగానే వూహిద్దాం. రెండు పాజిటివ్ పాత్రలతో సినిమా కథ వుంటుందా అంటే వుంటుంది. కాకపోతే కథకి హీరో అయిన మొదటి పాత్రకి మొదట వున్న గోల్ తర్వాత వుండదు. మొదట నెగెటివ్ అనుకున్న పాత్రతో పెట్టుకున్న గోల్, తీరా అది పాజిటివేనని తెలుసుకుని, ఇద్దరి ఉమ్మడి గోల్ గా కథ మారిపోతుంది...

        అంటే,  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రజనీకి అక్షయ్ విలన్ గానే కన్పించి పోరాడతాడు. ప్లాట్ పాయింట్ టూలో అక్షయ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నాక అతను హీరోలా కన్పించి చేయి కలుపుతాడు. అతడి గోల్ పూర్తి చేయడానికి అతడితో కలిసి వ్యవస్థతో ఉమ్మడి పోరాటం చేస్తాడు. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఔటర్ గోల్ వుంటుంది. కానీ ప్లాట్ పాయింట్ టూ దగ్గర, ఒక రియలైజేషన్ తో, ఆత్మ విమర్శతో ఔటర్ గోల్ తొలగి, ఇన్నర్ గోల్ పుడుతుంది రజనీకి. నిజం తెలియక మొదలెట్టిన ఔటర్ జర్నీ, నిజం తెలిశాక ఇన్నర్ జర్నీగా, తనలోకి తన ప్రయాణంగా మారుతుంది. ఇప్పుడు విలన్ ఎవరంటే, తను నమ్మి మొదట్లో పోరాటం మొదలెట్టిన వ్యవస్థే. 

          ఇలా హీరో గోల్ మారిపోయే స్టార్ వార్స్, కెప్టెన్ అమెరికా, ది వింటర్ సోల్జర్ వంటి సినిమాలున్నాయి. అంటే, అంతిమంగా అక్షయ్ ఆత్మకి దాని గోల్ ని పూర్తిచేసి, శాంతిని చేకూర్చి, రజనీ వీడ్కోలు చెప్పడమే – ‘ఈటీ’ లో అందమైన ముగింపు లాగా. అప్పుడు కథా ప్రయోజనం, సామాజిక ప్రయోజనం అన్నీ నెరవేరతాయి. మొదట రజనీకి విలన్ గా ప్రేక్షకులకి కన్పిస్తున్న అక్షయ్ పాత్ర,  తర్వాత ఇద్దరి మిలాఖత్ తో  ‘కో – లెడ్’ పాత్రగా మారుతుంది. 

          ఇప్పుడు సుమారుగా ఐడియా ఇలా వుండొచ్చు -  “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మతో
తన చిట్టి రోబోని కలిపి అవినీతి వ్యవస్థని అంతమొందించి  ఆ ఆత్మకి శాంతిని చేకూరుస్తాడు  సైంటిస్టు వశీకరణ్”

          సమస్యకి దర్శకుడు సిఎస్ గారు సూచించిన ప్రత్యాన్మాయాలు కూడా రిజల్యూషన్ గా ఇవ్వొచ్చు. ఈ రోజుల్లో గూగుల్ చేస్తే అర క్షణంలో తెలిసిపోనిదంటూ ఏమీ లేదు. ప్రేక్షకుల్ని మభ్యపెట్టడం కష్టం. 
         (సిఎస్ స్పందన : I read your who is hero article. That's exactly what i thought as a solution to the plot point. Any good script consultant would have told Shankar that...After knowing flash back of Akshay, Rajni joins hands with Akshay and declare a war on techno goons ending with dialogues on  alternative methods. Akshay atma slowly disappearing into clouds with a satisfied smile is the last shot)
         
సికిందర్
         
         

27, నవంబర్ 2018, మంగళవారం

709 : స్క్రీన్ ప్లే సంగతులు


    సినిమాల్ని దెబ్బతీసే ఇతర వినోద సాధనాలెప్పుడూ పుట్టుకొస్తూనే వుంటాయి. 1990 ద్వితీయార్ధంలో టీవీ సీరియల్స్ అనే కొత్త వినోద సాధనం కుటుంబ కథల సినిమాలకి చెల్లు చెప్పింది. తర్వాత కుటుంబ కథలు ఫ్యాక్షన్ యాక్షన్, మాఫియా యాక్షన్లు జోడించుకుని కోలుకున్నా, వీటికీ కాలం తీరి ఒక శూన్యం ఏర్పడింది. ఈ శూన్యంలోంచి ఎన్నారై కుటుంబాల కథలు వచ్చాయి. ఇవి ’80 ల నాటి ఉమ్మడి కుటుంబ కథల టెంప్లెట్ మూసలోనే  పడి ఆచరణ సాధ్యంకాని తిరోగమనాన్ని ప్రకటించాయి. గ్లోబల్ యుగంలో అవకాశాలు పెరిగి వలస వెళ్ళిన కుటుంబ సభ్యులు మళ్ళీ కలిసి వుండాలనే మొండి భా వజలాన్ని ప్రదర్శించాయి. కుటుంబ కథ అనగానే ఇంకా ఉమ్మడి కుటుంబాల్నే ఎత్తుకోవడం, పెళ్లి కథ అనగానే బోలెడు కుటుంబాల్నే చూపించడం –అనే ఆడియెన్స్ కనెక్ట్ లేని, మార్కెట్ యాస్పెక్ట్ లేని, సమకాలీనం కాని పాత టెంప్లెట్లతో కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటి కుటుంబాలకి ప్రతీకగా ఒక చిన్న కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని, నేటి పరిస్థితుల్లో దాని సాధక బాధకాల్ని వాస్తవికంగా చూపించే వైవిధ్యానికి దూరంగా వుండిపోతున్నాయి. కుటుంబ కథలకి హింసాత్మకంగా యాక్షన్ జోడిస్తే తప్ప ప్రేక్షకులు చూడరనే దురభిప్రాయంతో కూడా ఇవి వుంటున్నాయి.

        కానీ ఇవ్వాళ యూట్యూబ్ లో పాత తెలుగు సినిమాలు -  బ్లాక్ అండ్ వైట్ సహా - చూసి యూత్ పెడుతున్నకామెంట్లు చూస్తే, ఇప్పుడొస్తున్న సినిమాల పట్ల వాళ్ళకెంత విరక్తి వుందో తెలిసిపోతుంది. పాత సినిమాల్లోని కథలు, నటనలు, విలువలు, డ్రామా – పాటలు సహా- చూసి వాళ్ళు ఫిదా అయిపోతున్నారు. ఇవన్నీ యూత్ ఇప్పటి సినిమాల్లో  మిస్సవుతున్నారు. ఈ రోజుల్లో బాగా ఎబ్యూజ్ అవుతున్న పదం ఎమోషన్. ఎవరి నోట విన్నాఎమోషన్ అన్న మాటతో ఫ్యాషనబుల్ గా, ట్రెండీగా కన్పించాలన్న ఆదుర్దాయే.  ఏంటా ఎమోషన్? అదెలా పుడుతుంది? నూటికి వంద శాతం సినిమాల్లో ఇంతేసి ఎమోషన్ని ఉత్పత్తి చేస్తూంటే కూడా, 90 శాతానికి పైగా సినిమాలెందుకు అట్టర్ ఫ్లాపవుతున్నాయి? ఈ ఎమోషన్లకి మొహం చాటేసి, యూత్ యూట్యూబ్ లో పాత సినిమాలెందుకు చూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు? ఎమోషన్లంటే ఏమిటి? గురుదత్ ‘ప్యాసా’ లో నటీనటులు ఏం ఎమోషన్స్ ప్రదర్శిస్తారని? దాసరి నారాయణ రావు ‘మేఘ సందేశంలో’? కెవి రెడ్డి  ‘దొంగరాముడు’ లో?  చిత్రీకరణలో ‘మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ శైలి అనేదొకటుంది. ఇందులో సిట్యుయేషన్సే ఎమోషన్స్ పలుకుతాయి, నటీనటులు సున్నిత భావప్రదర్శన చేస్తారు, అంతే. ఒకటి రెండు సెకన్ల సున్నిత భావప్రకటనతో కట్ అయిపోతుంది సీను. ఇది ఉత్తమ దర్శకత్వం. గత రాత్రి ‘పల్టడచో మునిస్’ (వంతెన అవతల మనిషి) అనే కొంకణి వాస్తవిక సినిమా చూస్తే, అది అడవిలో ఒక ఫారెస్ట్ ఉద్యోగికి ఓ పిచ్చిదానితో ప్రేమ కథ. అంతర్జాతీయ అవార్డులు పొందిన ఇందులో వున్నది మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ శైలి చిత్రీకరణే. సిట్యుయేషన్స్ సృష్టిలో కథాపరమైన సరైన భావోద్వేగాలుండాలే గానీ, ఇది వదిలేసి పేలవమైన సన్నివేశాల్లో నటీనటులు ఎమోషన్స్ తో ఎంత ఊదరగొట్టుకున్నా ఒరిగేదేమిటి. 

       సినిమాల్ని దెబ్బతీసే ఇతర వినోద సాధనాలెప్పుడూ పుట్టుకొస్తూనే వుంటాయి. యూత్ ఇక క్వాలిటీ వినోదం కోసం నయా వినోద సాధనం యూట్యూబ్ వైపు మళ్లిపోతే, కుటుంబ సినిమాలే కాదు, యాక్షన్ సినిమాలూ ప్రమాదంలో పడతాయి. యూట్యూబ్ లో పాత సినిమాలు చూస్తున్న  యూత్  ఏమని కామెంట్లు పెడుతున్నారో ఒకసారి చూద్దాం: 

        I am 24 and I love to watch only old films. There is something in them.
        The lines speak. In this generation ru intersted really great nd inspirin. I 2 like 2 watch old -sorry - gold films. By the way i am 24 yrs.”
            జీవితంలో చచ్చిపోతున్నాం ఇప్పుడొచ్చే సినిమాలు చూడలేక. ఏవో ఒకటో రెండో తప్ప.”
            Almost old movies are meaning ful  and we learn new things from those films.”
            “ఇలా వుండాలి సినిమాలు అంటే...అందరి యాక్షన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఒరిజినల్ గా వున్నాయి”
            “అప్పట్లోనే ఆడపిల్లల్ని ఏం తక్కువ కాకుండా చూశారు. ఇప్పుడు అసలు కనడమే బాధ పడుతున్నారు.
            “అప్పట్లోనే బాగా ప్రోగ్రెసివ్ గా వుండేవారు, ఇప్పుడు రిగ్రెసివ్ గా వుంటున్నారు.
             Old is gold - sorry old is diamond.”
           Now a days we are missing soul in movies which is there here, not in present movies.”
           
“By seeing this movie, a person knows what life is.”

          ఇదీ పరిస్థితి. 2000 నుంచి యూత్ సినిమాలంటూ ప్రారంభమైన నయా ట్రెండ్ తో మధ్య వయస్కులు సినిమాలు చూడ్డం మానేశారనీ, సినిమాలకిక యువ ప్రేక్షకులే మిగిలారనీ బ్రాండింగ్ ఒకటి ఏర్పడింది. ఇది అప్పట్లో నిజం కూడా. ఇప్పుడిది మిథ్య అనుకోవాలి. యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఏ సినిమాల్లోనూ ఏమీ వుండడం లేదని యూత్ కే అర్ధమైపోయి  ప్రత్యాన్మాయాలు వెతుక్కుంటున్నారు. యూట్యూబే కాక ఇంకే మాధ్యమాల్లో తమకి కావాల్సిన పాత సినిమాలు వెతుక్కుంటున్నారో. యూట్యూబ్ లో పాత సినిమాలకి లక్షల్లో వ్యూస్ వుంటున్నాయి. ఈ లక్షల మంది యూతే అని కాదు, నడి  వయస్కులు, సీనియర్ సిటిజన్లు అందరూ వుండొచ్చు. కానీ కామెంట్ల వెల్లువ మాత్రం యూత్ దే. ఐదు లక్షల వ్యూస్ తో వున్న ‘మాంగల్య బలం’ కి ఒక యూత్ పది సార్లు చూశానని కామెంట్ పెట్టాడు. ఎందుకిన్ని సార్లు చూస్తున్నాడతను? 

       ఇప్పుడు తీస్తున్న సినిమాలతో సినిమాలంటే ఇవే, ఎమోషన్స్ అంటే ఇవే అని యూత్ ని మభ్య పెట్టడం ఇక కష్టం. ‘దొంగ రాముడు’ చూసిన ఒక యూత్, ఇప్పటి దర్శకులు దీన్ని వంద సార్లు చూసి సినిమాలెలా తీయాలో నేర్చుకోవాలని కామెంట్ పెట్టాడు. ఎందుకిలా అన్నాడు? 

          సినిమాలు తీసి క్యూబ్ ద్వారా విడుదల చేయాలనుకున్నప్పుడు, అవతల యూట్యూబ్ మోగిస్తున్న ప్రమాద ఘంటికలు కూడా వినాలి. లేకపోతే యూట్యూబు గాలితీసిన ట్యూబు చేసేస్తుంది బాక్సాఫీసుల్ని. యూత్ తల్చుకుంటే ఏమైనా చేసి పడెయ్యగలరు.

          తీస్తే కథలే తీయాలి, తీయకపోతే గాథలే తీయాలి. రెండూ కలిపి అదీ ఇదీ కాని ఇంకేదో చేస్తే, దీంతో ఎమోషన్ బాగా వచ్చేసిందనుకుంటే, వీటి బండారం యూట్యూబ్ లో తెలిసిపోయిన యూత్, టెస్ట్ ట్యూబుల్లో పరీక్షించి చూసి -  బీకరులో పడేసి యాసిడ్ పోసే స్తారు.

          కథంటే ఏమిటో తెలియకుండానే సినిమాలు తీసేస్తున్నారు. కనీసం కథని గాథలా తీయకుండా వుండేందుకు గాథంటే ఏమిటో, ఎలా వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పనిలోపనిగా, ఎమోషన్లే గాథల్ని ఎలా నిలబెడతాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపాలి. సినిమాలకి లాజిక్ ఏమిటని అనుకుంటారు. ప్రేక్షకులకి నిత్యానుభవం కాని కథలతో లాజిక్ అవసరం లేకపోవచ్చు. ఒక పోలీస్ అధికారి లాజిక్ లేకుండా అడ్డదిడ్డంగా కేసు పరిశోధించి నమ్మించవచ్చు. వ్యవస్థల పనితీరు తాలూకు పరిజ్ఞానం వుండని ప్రేక్షకులు ఇది చూసేస్తారు. పరిజ్ఞానమున్న ప్రేక్షకులు కొద్ది మందే వున్నా నవ్విపోతారు, నష్టం లేదు. కానీ వ్యక్తిగత జీవితాల్లో నిత్యానుభవమయ్యే మానవ సంబంధాల్ని లాజిక్ లేకుండా చూపిస్తే అందరు ప్రేక్షకులూ ఛీ పొమ్మంటారు. కుటుంబ కథల్లో కుటుంబ సంబంధాల్ని, నిత్య వ్యవహారాల్నిలాజికల్ గా చూపించకపోతే ఒప్పుకోరు. పదహారేళ్ళ కూతుర్ని చదివించకుండా పెళ్లి చేస్తే లాజిక్కే అడ్డొస్తుంది చూసే ప్రేక్షకులకి. ‘24 కిసెస్’ లో 24 ముద్దులు పెట్టుకుంటే ఆ ప్రేమ బలంగా వుండిపోతుందని నమ్మిన హీరోయిన్, మధ్యలో సెక్స్ కి పాల్పడితే, లాజిక్కే లాగి కొడుతుంది ప్రేక్షకులకి. కళా హృదయముంటే దానికి లాజికల్ మెదడు పహారా కూడా అవసరం. మెదడు లేని హృదయం సోది. 

          యూట్యూబ్ లో యువప్రేక్షకులు ఓటేస్తున్న ఈ లాజిక్కులు, ఎమోషన్లు, విలువలూ... వీటిని ఒక గాథగా ‘పెదరాయుడు’ ఎలా మేళవించి విజయం సాధించిందో చూద్దాం...
***
      కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ సోదరులు విడిపోవాల్సి వచ్చినప్పుడు, విధిలేక అన్న మీద కోర్టుకెక్కిన తమ్ముడు అనిల్ అంబానీ,  ఒకచోట ఇలా ఫిలాసఫీ రాసుకున్నాడు –‘నమ్మకం లేకపోతే ఏదీ లేదు. అవసరమొస్తే ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. ఆ త్యాగం మనకి అనుకూలంగా వుండకూడదు. పరోపకారం దృష్టితో నిజమైన పరిత్యాగం కావాలి. రఘుకుల్ కీ రీతీ సదా చలీ ఆయీ... ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే’ అని.  

          కనీసం సినిమాల్లో చూపించే ఫ్యూడల్ వ్యవస్థకో నీతి వుంటుంది. సినిమా దొరలు బయట ఏం తీర్పులు చెప్తారో, తడుముకోకుండా ఇంట్లో అలాటి తీర్పులే చెప్పేస్తారు. “తీర్పులు చెప్పే వాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం” అంటూ ప్రాణం విడుస్తాడు ‘పెదరాయుడు’ లో రజనీ కాంత్. బావ చేతిలో వెన్నుపోటుకి గురైన పెద్ద జమీందారు రజనీకాంత్. ఇదే రజనీ కాంత్ బాధ్యతలు చేపట్టిన కొడుకు మోహన్ బాబు, తమ్ముడి మీద తను చెప్పిన తీర్పు తప్పని తేలడంతో, గుండె ఆగి మరణిస్తాడు. జీవితంలో అనిల్ అంబానీ అయినా, సినిమాలో రజనీకాంత్ అయినా, మోహన్ బాబు అయినా, ఇంటా బయటా తమ సామ్రాజ్యాలలో మాటకు ప్రాణాలిస్తారు. త్యాగంలో పరసుఖం చూస్తారు. 

          ‘పెదరాయుడు’లో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఛాయలు కన్పిస్తాయి. కథాంశాలే వేరు. పాత్రలు అవే, హీరోల ద్విపాత్రాభినయాలూ అవే. అన్నల పొరపాటు తీర్పులు, తమ్ముళ్ళ అన్యాయపు బహిష్కరణలు. అన్నల భార్యల వేదనలు, వాళ్ళ మీదా వెలి వేటు, లేదా హెచ్చరికలు. అన్నల మీద ఎదుటి జమీందార్ల కుట్రలు కుహకాలూ, పూర్వీకుల బలిదానాలూ వైగైరా వగైరా. 

          అన్న మాటకోసం తమ్ముడి త్యాగమే కాదు, తమ్ముడికి తన వల్ల నష్టం జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకుని వెళ్ళిపోవాల్సి వుంటుంది కూడా అన్న. మాట, విలువలు, చేత అనే ముక్కోణాన్ని సృష్టించుకుని అందులో తామే అమరులైపోతారు. 

          తమ్ముడు మోహన్ బాబుకి అన్న మాటే వేదం. అందుకే, “నువ్వే పాపం చేయలేదని అన్నకెందుకు చెప్పవు?” అని భార్య సౌందర్య అడిగినప్పుడు –ఆయన అడగలేదు కాబట్టి చెప్పలేదంటాడు. ఆయన అడగంది ఏదీ తను చెప్పలేదు, ఆయన చెప్పంది ఏదీ తను చేయలేదంటాడు. “ఆ రోజు రాముడు నేను అడవులకెందు కెళ్లాలని ప్రశ్నించి వుంటే, రామాయణం జరిగుండేది కాదు. తండ్రి  మాటని గౌరవించి రాముడు అడవుల కెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన అన్న మాటని గౌరవించి నేనిక్కడి కొచ్చాను” అంటాడు. 

           ‘పెదరాయుడు’ రామాయణమే. చూస్తే  రామాయణంలో రఘు వంశమంతా పాసివ్ పాత్రల మయమే, ఒక్క కైకేయి తప్ప. ఆమె ఒక యాక్టివ్ పాత్రగా లక్ష్య దృష్టితో దశరథుడి మీద కోర్కెల బాణం విసరకపోతే రామాయణమే లేదు. కథనాల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యక పోతే పాసివ్ పాత్రలకి ఇలాటి గాథల్లేవు, ట్రాజడీల్లేవు. గొప్పతనం లేదు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లో కృష్ణంరాజు రెండు పాత్రలకీ లక్ష్యం లేదు, విలన్ రావుగోపాల రావుకే వుంది. ‘పెదరాయుడు’ లోనూ మోహన్ బాబు పాత్రలు రెండూ డిటో. టార్గెట్ వున్న పాత్ర విలన్ అనంత్ రాజే. 

          ఈ అనంత్ రాజ్ మేనమామ రజనీకాంత్ హయాంలో ఓ మానభంగం చేసి, తీరా మానభంగం చేసిన అమ్మాయినే చేసుకోవాల్సి వస్తే, ఇలా తీర్పిచ్చిన మేనమామని ఇతడి తండ్రి చలపతి రావు కాల్చేస్తాడు. చనిపోతూ రజనీకాంత్ ఈ ధిక్కారానికి ఇంకో తీర్పు ఇస్తాడు - ఈ తన బావ చలపతి రావు కుటుంబానికి పద్దెనిమిదేళ్ళూ సాంఘిక  బహిష్కారమని. దీంతో ఆ పద్దెనిమిదేళ్ళూ అతి హీనంగా బతికిన అనంత రాజ్, ఇక రజనీ కాంత్ కొడుకు మోహన్ బాబు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చేస్తాడు. 

     ఈ తమిళ రీమేక్ ని దర్శకుడు రవిరాజా పినిశెట్టి సమర్ధవంతంగా తెరకెక్కించారు. ఎక్కడా క్వాలిటీ స్పృహ కోల్పోకుండా ఉన్నత విలువలతో మనోజ్ఞంగా ప్రెజంట్ చేశారు. రజనీకాంత్, మోహన్ బాబు సహా ఇతర నటీ నటులందరూ వాళ్ళ పాత్రల్లో చాలా ఆత్మీయంగా ఇమిడిపోయారు. అంతే ఆత్మీయంగా ఈ గాథంతా వచ్చేసి రవిరాజా గుప్పెట్లో ఒదిగిపోయింది. సన్నివేశాల కల్పనల్లో కృత్రిమత్వమే లేకపోగా, వాటిలో ఎక్కడ ఏ రస పోషణ జరిగినా, అంతర్వాహినిగా ఒకే నిశ్శబ్ద మెలోడీ అనుభవమవుతుంది. అది కథాత్మ. బలీయమైన అన్నదమ్ముల అనుబంధం వల్ల ఏర్పడిన సోల్. 

          నాటి దర్శకుడు డాన్ లివింగ్ స్టన్, ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, మూవ్ మెంట్ అన్న విభాగంలో ఇలా పేర్కొంటాడు – ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను ప్రేక్షకుల్ని ఎంతో ఈజ్ తో సినిమాలో లీనమయేట్టు చేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సులువుగా అర్ధమయ్యేట్టు చేయగలడు. అంతేకాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి తీసికెళ్ళి కట్టిపడవేయనూ గలడు...’ అని. రవిరాజా సాధించిందిదే. గాథ నడకలో స్లో మూవ్ మెంట్స్ తో ఒక లయని స్థాపించి, కథాత్మని పోషించుకుంటూ వెళ్ళడం. 

          ఈ గాథంతా సౌభాతృత్వం గురించి, కుటుంబం గురించి, కుటుంబంలో అన్ని భావోద్వేగాల గురించీ. దీని స్క్రీన్ ప్లే వివరాల్లోకి రేపట్నుంచి వెళదాం...

సికిందర్